జయరాంబాటి, ఫిబ్రవరి 1, 1907
“మాతృదేవి పిలుస్తున్నారు” అని వరద మామ నాతో చెప్పారు. అప్పుడు ఉదయం ఎనిమిదిన్నర గంటలయివుంటుంది.
నేను లోపలకు వెళ్లాను. మాతృదేవి తమ గది ద్వారం వద్ద నా కోసం నిల బడి ఉన్నారు. నేను ప్రణమిల్లగానే, “నువ్వు ఎక్కణ్ణుంచి వస్తున్నావు?” అని అడిగారు. నా స్వగ్రామం ఉన్న జిల్లా పేరు చెప్పాను.
మాతృదేవి: గురుదేవుల ఉపదేశాలు చదువుతున్నావనుకొంటాను.
నేనేమీ బదులు చెప్పలేదు. చిరకాల పరిచయం ఉన్న వ్యక్తిలా మాతృదేవి నాతో మాట్లాడారు. ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే ఆమె దృక్కులు ఇప్పటికీ నా మదిలో చెక్కుచెదరక కదలాడుతున్నాయి.
మాతృదేవి: నువ్వు కాయస్థుడివా?
నేను: అవును.
మాతృదేవి: ఎందరు సోదరులున్నారు?
నేను: నలుగురు.
మాతృదేవి: కూర్చొని కాస్త ఉపాహారం తిను.
ఇలా అంటూ మాతృదేవే స్వయంగా ఒక ఆసనం పరచి, గత రాత్రి నివే దించిన లూచీ, మిఠాయి ప్రసాదాన్ని నా కిచ్చారు.
నేను నిన్న తారకేశ్వరం నుండి కాలినడకనే వచ్చాను. జయరాంబాటికి వాయవ్య దిశలోని దేశ్రా అనే గ్రామంలో, ఒక యువకుని ఇంట్లో రాత్రి బసవేశాను. ఆ యువకుణ్ణి హరిపాల్ రైలుస్టేషన్లో కలుసుకోవడం తటస్థించింది.
పై వివరాలన్నీ మాతృదేవికి తెలిపాను. అంతా ఆమె విన్నారు. నేను ఉపా హారం తిన్న పిదప, “వెంటనే స్నానం చేయవద్దు. చాలా దూరం నుంచి నడిచి వచ్చావు” అన్నారు. ఆ తరువాత తమలపాకు కిళ్లీ ఇచ్చారు.
పగటి వేళ నైవేద్యం పూర్తయ్యాక మాతృదేవి నన్ను పిలిపించారు. మొదటి పనిగా నన్ను భోజనం చేయమన్నారు. ఆమె గది ముందున్న వసారాలో ఆకువేసి స్వయంగా భోజనం వడ్డించారు. “బాగా తిను, మొహమాట పడవద్దు!” అన్నారు. నేను భోజనం చేశాక తమలపాకు కిళ్లీ ఇచ్చారు.
మధ్యాహ్నం మూడు, నాలుగు గంటలప్పుడు మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడామె మైదాపిండి కలుపుతున్నారు. కాళ్లు చాపుకొని కూర్చుని ఉన్నారు. పక్కనే పొయ్యి ఉంది. రాత్రికి కావలసిన లూచీలు, కూరను ఆ పొయ్యి మీదనే తయారుచేస్తారు. నన్ను చూడగానే, “ఏం కావాలి నాయనా?” అని అడిగారు.
నేను: మీతో మాట్లాడాలి.
మాతృదేవి: దేనిని గురించి మాట్లాడాలి? కూర్చో.
అలా అంటూ నా కోసం ఒక ఆసనం పరిచారు.
నేను: అమ్మా, గురుదేవులు సాక్షాత్తు భగవంతులని అంతా చెబుతున్నారు కదా! మరి మీరేమంటారు?
మాతృదేవి: అవును, ఆయన నాకు భగవంతుడే!
‘నాకు’ అని మాతృదేవి ఒత్తి చెప్పినందున నేను, “ప్రతి స్త్రీకి ఆమె భర్తయే దైవమనే అర్థంలో ఈ ప్రశ్న అడగలేదు” అని చెప్పాను.
మాతృదేవి: అవును, నా భర్తగా ఆయన భగవంతుడే, సామాన్య రీతిలోనూ ఆయన భగవంతుడే.
గురుదేవులు భగవంతుడైతే, మాతృదేవి జగజ్జనని! సీతారాములు, రాధా కృష్ణలలా వీరిద్దరూ అభిన్నులని నాకు తోచింది. ఈ విశ్వాసంతోనే నేను మాతృదేవిని దర్శింప వచ్చాను.
నేను: అలా అయినప్పుడు ఒక సగటు స్త్రీలా ఇలా చపాతీలు చేస్తూ కూర్చున్నారే! ఇది మాయ అనుకొంటాను, కాదా?
మాతృదేవి: మాయ కాకపోతే మరేమిటి? మాయ కాకుంటే నా కెందుకు ఇటువంటి పరిస్థితి? వైకుంఠంలో నారాయణుని చెంత మహాలక్ష్మిగా కూర్చుని ఉండేదానను. కాని భగవంతుడు మానవునిగా లీలలు సలపడానికి ఇష్టపడతాడు కదా! శ్రీకృష్ణుడు గోపాలునిగాను, రాముడు దశరథనందనునిగాను జన్మించారు కదా!
నేను: మీ స్వస్వరూపం మీ కెప్పుడైనా స్ఫురణకు వస్తుందా?
మాతృదేవి: అప్పుడప్పుడు స్ఫురించడం కద్దు. ఆ సమయంలో, ‘నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను?’ అని తలపోస్తూ ఉంటాను. కాని ఆ తరువాత ఇల్లు, వాకిలీ, బిడ్డలూ (ఎదురుగా ఉంటున్న వాటినంతా చూపిస్తూ) అంతా జ్ఞాపకానికి వస్తాయి. నా స్వస్వరూపం మరచిపోతాను.
ప్రతి రోజు మాతృదేవిని చీకటిపడ్డాక ఆమె గదిలో దర్శించుకొనేవాణ్ణి. ఆమెపరుపు మీద పడుకొనే నాతో మాట్లాడేవారు. రాధూ ఆమె పక్కన నిద్రపోతూ ఉండేది. మినుకు మినుకు మంటూ ఒక నూనెదీపం గదిలో వెలుగుతూ ఉండేది.కొన్ని రోజులు పనిమనిషి ఒకామె వచ్చి మాతృదేవి కాళ్లకు (వాతరోగ నివారణార్థం)తైలం రాసి, రుద్ది వెళ్లేది.
మాతృదేవి: ఒక భక్తుని గురించి ఆలోచన నా మనస్సులో జనిస్తే, నామనస్సు అతణ్ణి గురించి వ్యాకులత చెందితే ఆతడు ఇక్కడకు తప్పక వస్తాడు లేదానాకు ఉత్తరమన్నా వ్రాస్తాడు. ఇదుగో నువ్వు వచ్చావు; ఏదో ఒక భావనతో వచ్చివుంటావు. బహుశా నన్ను జగజ్జననిగా భావించి వచ్చివున్నావా?
నేను: మీరు అందరికీ మాతృమూర్తియేనా?
మాతృదేవి: అవును.
నేను: ఇతర జీవజాలానికి కూడానా?
మాతృదేవి: అవును, వాటికి కూడా.
నేను: అలా అయితే అవి ఎందుకు ఇంత బాధ ననుభవిస్తున్నాయి?
మాతృదేవి: వాటికి ఈ జన్మ అంతే.
మాకూ, రాధూ బడికి వెళ్లారు. సాయంత్రానికి ముందే వాళ్లు వచ్చేస్తే మాతృదేవి వారిని భోజనం చేయమంటారు. అలా వాళ్లు తింటున్నప్పుడు నేనువెళ్లి, “ఏం జరుగుతోంది?” అని అడిగాను. నా మాటల్లో తూర్పు వంగదేశ ఉచ్చారణ ఉంటుంది. అది విని మాతృదేవి నవ్వుకుంటూ అచ్చం నాలా మాట్లాడితమాషా చేశారు.
సాయంత్రం మాతృదేవి గదిలో ఆమెతో మాట్లాడాను.
మాతృదేవి: అందరూ వస్తున్నారు. మీ రంతా నా సొంతం కాకపోతే ఎందుకు వస్తారు?
నేను: నేను మీ సొంత మనిషినా?
మాతృదేవి: నాకు చెందిన వాడివి కాకపోతే మరెవరివి? ‘ఎవరు ఎవరికి చెందుతారో, వారు వారికి చెందినవారు. ప్రతి యుగంలోను అవతారం వస్తున్నప్పుడు వెంట వస్తారు….’
కాసేపు మాట్లాడిన తరువాత, “మళ్లీ సూక్ష్మశరీరంలో చూడవచ్చు” అన్నారు. మరణానంతరం చూడవచ్చునని ఆమె చెబుతున్నట్లుగా నేను అర్థం చేసుకొన్నాను.
నేను: ఒకసారి ఇక్కడికి రావడానికి శతథా ప్రయత్నించినా రాలేకపోయాను. రైలులో టికెట్ దొరకలేదు. ఇంట్లో తమ్ముడి అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తాయి.
మాతృదేవి: సముచిత తరుణం ఆసన్నమైనప్పుడే, అన్నీ కలిసివచ్చినప్పుడే చూడగలవు.
నేను: అందరూ మిమ్మల్ని ‘ఆప్‌ని’* అని పిలుస్తున్నారు. కాని నేను అలా పిలువలేకపోతున్నాను. నోట ఆ మాట రావడంలేదు.
మాతృదేవి: మంచిది. అతి సన్నిహిత బాంధవ్యమది.
నేను: అమ్మా, మంత్రదీక్ష ప్రసాదించిన వారి బాధ్యతలను మీరే కదా స్వీకరించారు. అటువంటప్పుడు మేం ఏదైనా కోరితే, ‘గురుదేవులతో చెబుతాను’ అంటా రెందుకు? మా బాధ్యతను మీరు స్వీకరించలేదా?
మాతృదేవి: నీ బాధ్యతను స్వీకరించాను కదా!
నేను: అమ్మా, నాకు మానసిక పావనత్వమూ, భక్తీ కలగాలని దీవించండి. నా కొక మిత్రుడున్నాడు. అతడి పట్ల నాకు గల మమతలో పావుభాగం గురుదేవులపై ఉంచగలిగితే చాలు! అదే నాకు గొప్ప విషయం.
మాతృదేవి: ఆహా, నిజమే. గురుదేవులకు చెబుతాను.
నేను: మళ్లీ ‘గురుదేవులతో చెబుతాను’ అంటున్నారు. మీరూ, ఆయన వేర్వేరా? మీరు ఆశీర్వదిస్తే సకలమూ సిద్ధిస్తుంది.
మాతృదేవి: నాయనా! నా ఆశీస్సులతో నీకు జ్ఞానం ప్రాప్తిస్తే, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. మాయ కబంధహస్తాల నుండి మనిషి తనంతట తానే విడివడగలడా? అందు నిమిత్తమే కదా గురుదేవులు అన్ని సాధనలు అనుష్ఠించారు. ఆ సాధనల ఫలాన్ని మానవాళి శ్రేయస్సుకు అర్పించారు!
నేను: ఆయనను చూడకుండా ఎలా ఆయనను ప్రేమించగలం?
మాతృదేవి: అదేకదా! గాలితో ఎవరైనా సంబంధం పెట్టుకోగలరా?
నేను: అమ్మా, గురుదేవుల దర్శనం నా కెప్పుడు లభిస్తుంది?
మాతృదేవి: చూస్తావు, చూస్తావు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు చూస్తావు.
ఒక రోజు మునిమాపు వేళ. మాతృదేవి పడుకొని ఉన్నారు. పనిమనిషి కామిని మాతృదేవి మోకాళ్లకు తైలం రాచి, రుద్దుతున్నది.
మాతృదేవి (నాతో): శరీరమన్నది ఒకటి, ప్రాణమన్నది మరొకటి. ప్రాణం శరీరం యావత్తు వ్యాపించివుంది. అందుకే కాళ్ల నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ల నుండి మనస్సును ఉపసంహరిస్తే ఇక నొప్పి ఉండదు.
మంత్రదీక్షను గురించి నేను మాట్లాడసాగాను.
నేను: అమ్మా, మంత్రదీక్ష పుచ్చుకోవలసిన అవసరం ఏమిటి? మంత్రం జపించకుండా, ‘అమ్మా కాళీ’, ‘అమ్మా కాళీ’ అని ఉచ్చరిస్తే చాలదా?
మాతృదేవి: మంత్రం ద్వారా శరీరం పరిశుద్ధమవుతుంది. భగవంతుని మంత్రం జపించడంతో మనిషి పావనుడవుతాడు. ఒక రోజు నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. భగవంతునితో కూర్చుని చాలాసేపు ముచ్చటించాడు. నారదుడు సెలవు పుచ్చుకొని వెళ్లిపోయిన తరువాత భగవంతుడు లక్ష్మీదేవితో, ‘ఆ చోటును ఆవుపేడతో శుద్ధిచేయి” అన్నాడు. ‘ఎందుకు స్వామీ? నారదుడు మీ పరమ భక్తుడు కదా! ఎందుకు అలా చెబుతున్నారు?’ అని లక్ష్మీదేవి అడిగింది. అందుకు భగవంతుడు, ‘నారదుడు ఇంకా మంత్రదీక్ష స్వీకరించలేదు. దీక్ష స్వీకరించకపోతే శరీరం పరిశుద్ధం కాదు’ అని జవాబిచ్చాడు. అందువలన శరీరం పావనం కావడానికి కూడా మంత్ర దీక్ష అవసరం ఉంది. వైష్ణవులు మంత్రదీక్ష ప్రసాదించిన తరువాత, ‘ఇక అంతా నీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది’ అని చెబుతారు. అందుకే
మానవ గురువు మంత్రాన్ని చెవులలో ఇస్తాడు
జగద్గురువు మంత్రాన్ని ప్రాణంలో ఇస్తాడు*
అని చెప్పబడింది.
అంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు పవిత్రం కాకపోతే ఏదీ సిద్ధించదు.
గురువు, భగవంతుడు, భక్తుడు ముగ్గురి
అనుగ్రహం లభించింది
కాని ఒక్కదాని అనుగ్రహ లేమితో జీవితం వృథాయైంది.
‘మనస్సే ఆ ఒక్కటి. సొంత మనస్సు సానుకూలంగా ఉండాలి.’
నేను: జపతపాదులు అనుష్ఠించాలనే ఉత్సుకతే నాకు లేదే!
మాతృదేవి: బహుశా పూర్వజన్మలో నువ్వు అవన్నీ అనుష్ఠించి ఉంటావు.
వంగ దేశంలో స్వదేశీ ఉద్యమ ఆందోళనలు తీవ్రంగా సాగుతున్న రోజులవి. అందువలన మాతృదేవిని ఇలా ప్రశ్నించాను.
నేను: అమ్మా, మన దేశ కష్టకాలానికి అంతమే లేదా?
మాతృదేవి: అందునిమిత్తమే కదా గురుదేవుల రాక. గురుదేవుల నిర్యాణానం తరం నేను కూడా వెళ్లిపోవాలనుకొన్నాను. అప్పుడు ఆయన నాకు కనిపించి, ‘వెళ్లకూడదు, నువ్వు ఉండాలి. నిర్వర్తించవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి’ అని చెప్పారు. పిదప చూస్తే, నిజమే కదా! చేయవలసింది ఎంతో ఉంది. ‘కలకత్తా వాసులు పురుగులలా చీకట్లో ప్రాకుతూ పడివున్నారు. నువ్వు వారిని ఉద్ధరించాలి’ అంటూ గురుదేవులు నాకు చెప్పడం కద్దు.
భక్తుల హృదయాలలో తాము వంద సంవత్సరాలు సూక్ష్మదేహంలో ఉంటానని ఆయన అన్నారు. తమకు పాశ్చాత్య భక్తులు అనేకులు రానున్నారని కూడా ఆయన తెలిపారు.
గురుదేవుల నిర్యాణానంతరం మొదట్లో నేను భయపడ్డాను. ఎర్ర అంచుగల చీరను ధరించేదానను. చేతులకు బంగారు గాజులు ఉండేవి. లోకులు ఏమంటారో అని భయం! అప్పుడు కామార్పుకూర్లో ఉంటున్నాను. తదనంతరం గురుదేవుల దర్శనం అప్పుడప్పుడు లభించసాగింది. క్రమేణా భయం కూడా తొలగిపోయింది. ఒక రోజు గురుదేవులు కనిపించి, “కిచ్చూరి చేసి పెట్టు” అని అడిగారు. అప్పుడు నేను కిచ్చూరి చేసి రఘువీరునికి* నైవేద్యం చేశాను. మార్వాడీ* కదా అందుకే కిచ్చూరి అంటే ఇష్టం. ఆ తరువాత మానసికంగా గురుదేవులకు కూడా నివేదిం చాను.
హరీష్ అప్పుడు కామార్పుకూర్లో ఉండేవాడు. అతడొక పిచ్చివాడు. భార్య కారణంగా అతడు ఆ స్థితికి వచ్చాడు.* ఒక రోజు నేను పక్క ఇంటినుండి తిరిగి వస్తున్నాను. వాడు నా వెంటపడ్డాడు. ఇంట్లో అప్పుడు ఎవరూ లేరు. ఏం చేయాలో పాలుబోలేదు. వడ్ల గాదె చుట్టూ పరుగెత్తసాగాను. వాడు కూడా నా వెంటబడి పరుగెత్తసాగాడు. ఏడెనిమిదిసార్లు గాదె చుట్టూ పరుగెత్తాను. ఆ తరువాత నా వల్ల కాలేదు. అప్పుడు నా స్వస్వరూపం బయటపడింది. నేను నా స్వస్వరూపం దాల్చి నిలబడ్డాను.* వాణ్ణి నేలమీదకు పడత్రోసి వాడి ఛాతీమీద నా మోకాలు మోపి, వాడి నాలుకను బయటకు లాగి చెంపలు ఎడాపెడా వాయించసాగాను. వాడు ఆ, ఊ అంటూ అరుస్తూ ఊపిరాడక గిలగిల్లాడాడు. వాడి చెంపలు వాయించడంతో నా చేతి వ్రేళ్లు కందిపోయాయి. పిదప నిరంజన్ వచ్చాడు. అతడితో, ‘వీణ్ణి పంపించివేయి’ అని చెప్పాను.
తరువాత యోగీన్ మహరాజు గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా చెప్పారు:
“యోగీన్లా మరెవరూ నన్ను ప్రేమించలేదు. ఎవరన్నా ఎనిమిది అణాలు ఇస్తే, ‘మాతృదేవి తీర్థయాత్రకు వినియోగమవుతుంది’ అంటూ దాన్ని విడిగా తీసి వుంచేవాడు. నా వద్దే ఉండేవాడు. స్త్రీల వద్దే ఉంటున్నాడని ఇతరులు ఆతణ్ణి ఆట పట్టించేవారు. ‘అమ్మా, నన్ను యోగా అని పిలవండి’ అని నాతో చెప్పేవాడు. చని పోవడానికి ముందు ‘అమ్మా! నన్ను తీసుకువెళ్లడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులూ, గురుదేవులూ అంతా వచ్చారు’ అన్నాడు.”
నేను: గురుదేవుల ఏఏ భక్తులు ఎవరెవరో కాస్త చెప్పండమ్మా?
మాతృదేవి: మరెవరితోను చెప్పవు కదా!
నేను: అలా నేను చెప్పకుండా ఉండేట్లు మీరే నన్ను ఆశీర్వదించండి.
మాతృదేవితో అలా చెప్పాక, ఒకవేళ ఎవరితోనైనా చెప్పేస్తానేమోనని అనిపిం చింది. అందువలన, “చెప్పకండమ్మా” అన్నాను ఆమెతో.
మాతృదేవి: యోగేన్ను అర్జునుడంటారు. నరేంద్రుడు సప్తఋషులలో ఒకడని, అతణ్ణి అక్కడ నుండి తీసుకొని వచ్చారు. పూర్ణుడు ఈశ్వరకోటిలోనివాడు. శరత్ యోగీనులు నా అంతరంగ సేవకులు.
ఈ విధంగానే మరొకరి గురించీ చెప్పారు. పిదప తమను గురించి మాతృదేవి ఇలా అన్నారు:
“మూర్తీభవించిన సహనమనీ, గొప్ప తపస్విని అనీ బలరాంబాబు నా గురించి తరచు చెప్పేవారు.”
మళ్లీ మాతృదేవి అలా అన్నారు: “కారుణ్యరహితుడు మనిషా? వాడొక పశువు. కొన్ని సందర్భాలలో కారుణ్యం కారణంగా నన్ను నేను మరచిపోతాను. నే నెవరో నాకు గుర్తుండదు.”
చివరకు నాతో, “నాయనా! నీతో నేను ఎంతో అరమరికలు లేకుండా మెలగగలుగుతున్నాను. నేను కలకత్తాకు వచ్చినప్పుడు అక్కడికి రా. నాతోపాటు ఉందువుగాని” అని చెప్పారు.
అప్పుడు నేను లౌకిక జీవితం గడుపుతున్నప్పటికీ, సన్న్యాసం పుచ్చుకోవాలనే బలీయమైన కోర్కె నాలో ఉండేది. మాతృదేవి అనుగ్రహంతో సన్న్యాసం స్వీకరించి ఆమె సాన్నిధ్యంలో నివసించే భాగ్యం బహుశా నాకు భవిష్యత్తులో కలుగవచ్చునను కొన్నాను.
మాతృదేవి: ఆశు తెలుసా? కంజిలాల్, కృష్ణలాల్ను ఎరుగుదువా?
నేను: లేదమ్మా, తెలియదు.
నేను జయరాంబాటిలో ఉన్నప్పుడు చిన్నత్త (రాధూ తల్లి) పిచ్చిదానిలా ఉండేది. రాధూ నగలను ఆమె తన పుట్టింటికి తీసుకుపోయింది. ఆ నగలను ఆమె తండ్రి కాజేశాడు. దాంతో ఆమె పిచ్చి ముదిరింది. ఆమె సింహవాహినీ ఆలయానికి వెళ్లి, ‘అమ్మా, నగలను ఇవ్వు. అమ్మా, నగలను ఇవ్వు’ అంటూ దేవి సన్నిధిలో విలపించసాగింది. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఇంట్లో నేను, మాతృదేవి మాత్రమే ఉన్నాం. ఇద్దరమూ మాట్లాడుకొంటున్నాం. హఠాత్తుగా మాతృదేవి, “వస్తున్నా, వస్తున్నా నాయనా, ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు. ఆ పిచ్చిది నగలకోసం దేవి సన్నిధిలో విలపిస్తూవుంది” అన్నారు.
ఇలా అంటూ మాతృదేవి చకాచకా వెళ్లిపోయారు. కాని ఎలాంటి ఏడుపూ నాకు వినరాలేదు. అంత దూరం నుండి వినడం కూడా అసాధ్యమే! అయినా మాతృ దేవి చెవులకు ఆ విలాపం వినిపించింది. సింహవాహినీ దేవాలయానికి వెళ్లి రాధు తల్లిని మాతృదేవి తీసుకువచ్చారు.
కాని రాధు తల్లి మాతృదేవితో, “ఆ, నువ్వే నగలను దాచిపెట్టి ఇవ్వనంటు న్నావు” అని బిగ్గరగా అరవసాగింది. అప్పుడు మాతృదేవి, “ఆ నగలు నావే కనుక అయివుంటే కాకి రెట్టలా ఎంచి ఈ క్షణమే పారేసేదాన్ని” అని చెప్పారు.
రాధు తల్లిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి, “ఆమెను దేవి పిచ్చి నెచ్చలి అనేవాడు గిరీష్” అంటూ నవ్వుతూ చెప్పేవారు.
మాతృదేవిని ‘అమ్మా’ అని సంబోధించడానికి మొదట్లో సంకోచపడేవాణ్ణి. నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. ఒక రోజు ఉదయం ఏదో పనిగా మాతృదేవి నన్ను ఒకరి వద్దకు పంపారు. వెళ్లేటప్పుడు, “ఆతడితో ఏమని చెబు తావు?” అని నన్ను అడిగారు. “ఆమె ఇలా చెప్పమన్నారని చెబుతాను” అని చెప్పాను. “అమ్మ చెప్పారు అని చెప్పు” అన్నారు ‘అమ్మ’ అనే పదాన్ని నొక్కిచెబుతూ.
ఒక రోజు ఉదయం ఎనిమిది గంటలప్పుడు మాతృదేవి ఇంట్లో నుండి బయటకు వెళుతున్నారు. బయట ఒక పిల్లవాడు నిలబడి మాతృదేవినే తదేకంగా చూస్తున్నాడు. మాతృదేవి మెల్లగా ఆ బాలుడి వద్దకెళ్లి అతడి ముఖాన్ని తడవి, “వీడు నా గణపతి” అన్నారు నవ్వుతూ. ఆ బాలుడు మాతృదేవికి సన్నిహిత భక్తు డని గ్రహించాను.
ఒక రోజు ఉదయం మాతృదేవి ఇంటి వసారాలో ‘శ్రీరామకృష్ణ పుంథి’ పారాయణ జరిగింది. నేనే పఠించాను. మాతృదేవితో పాటు మరొకరు కూడా వింటు న్నారు. వివాహ అధ్యాయం వచ్చింది. దాన్లో మాతృదేవిని ఎంతో కీర్తిస్తూ ‘జగన్మాత’ అని రచయిత అభివర్ణించారు. అది కాస్త విని మాతృదేవి లేచి వెళ్లిపోయారు. అంతకు కొన్ని నిమిషాల క్రితం మాతృదేవికి ఉద్బోధన్ పత్రిక చదివి వినిపించాను. ‘మ’ రచించిన ‘శ్రీరామకృష్ణ కథామృతం’ నుండి కొంత భాగం అందులో ప్రచు రించారు. అప్పుడు మేం ఇద్దరం తప్ప మరెవరూ అక్కడ లేరు. క్రింద ఇవ్వబడిన భాగాన్ని మాతృదేవికి చదివి వినిపించాను.
గిరీష్: నా కొక కోర్కె ఉంది.
గురుదేవులు: ఏమిటది?
గిరీష్: భక్తి నిమిత్తమే నేను భగవంతుని పట్ల భక్తి నెరపాలి.
గురుదేవులు: అది ఈశ్వరకోటులకు మాత్రమే సాధ్యం. సామాన్యులకు సాధ్యం
కాదు.
నేను: దీని అర్థం ఏమిటి?
మాతృదేవి: ఈశ్వరకోటులు పూర్ణకాములు (కోర్కెలన్నీ తీరినవారు). అందు వలన వారికది సాధ్యం. కోర్కెలున్నప్పుడు భక్తి కోసమే భక్తి సాధ్యం కాదు.
శిష్యుడు: అమ్మా! మీ సోదరులూ, ఈ విశిష్ట భక్తులూ సమానులేనా?
మాతృదేవి సోదరులుగా జన్మించేటంత అదృష్టవంతులు కనుక వారుకూడా మఠంలోని సన్న్యాసుల మాదిరి మాతృదేవికి ఆంతరంగికులు, ఆధ్యాత్మికంగా గొప్ప వారని అనుకొన్నాను. కాని నా మాటలు విని మాతృదేవి ముఖం చిట్లించి, తిరస్కార ధోరణి వ్యక్తంచేశారు. ‘ఇలాగా పోల్చడం! నా సోదరుడయినంత మాత్రాన ఏం ప్రయోజనం? సన్నిహితులుగా ఉండడమనేది పూర్తిగా వేరే విషయం’ అని ఆమె చెబుతున్నట్లు నాకు తోచింది.
ఒక రోజు ఉదయం. వడ్లు దంచడంలో మాతృదేవి సాయపడుతున్నారు. బహుశా రోజు ఆమె ఈ పని చేస్తారు కాబోలు. “అమ్మా, మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారు?” అని అడిగాను. “నాయనా! ఒక ఆదర్శప్రాయమైన జీవితం గడప డానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగానే నేను చేశాను” అని జవాబిచ్చారు మాతృదేవి.
ఒకనాటి రాత్రి. అందరూ నిద్రిస్తున్నారు. ఆ సమయంలో నళినిని తోడ్కొని వెళ్లడానికి ఆమె భర్త ఒక ఎడ్లబండిలో వచ్చాడు. అత్తవారి ఇంటి నుండి ఆమె వచ్చేసింది. తిరిగి వెళ్లడానికి ఆమెకు ఇష్టంలేదు. భర్త వచ్చాడని తెలియగానే గది లోకి వెళ్లి తలుపులు బిడాయించుకొని, ఆత్మహత్య చేసుకొంటానని భయపెట్టసాగింది. భర్తతోపాటు ఆమె వెళ్లనవసరంలేదని మాతృదేవి మాటయిచ్చిన తరువాత ఆమె తలుపులు తెరిచింది. ఇంట్లో నాటి రాత్రి ఒకటే గందరగోళం! రాత్రంతా మాతృదేవి నళిని గది తలుపు వద్దే కూర్చుండిపోయారు. తెల్లవారిన తరువాత దీపం ఆర్పి, “గంగా, గీతా, గాయత్రీ, భాగవత భక్త భగవాన్, శ్రీరామకృష్ణ, శ్రీరామకృష్ణ” అని ఉచ్చరిస్తూ లేచారు.
ఆ తరువాత నళినిని గురించి ప్రస్తావిస్తూ “నాయనా! ఆమెకు అత్త (అంటే తమ) గాలి సోకింది. అందుకే వెళ్లనని మొరాయిస్తోంది” అని చెప్పారు.
ఒక రోజు ఉదయం మాతృదేవి వృద్ధుడైన ఒక పనిమనిషిని తోడిచ్చి నన్ను పిచ్చి స్త్రీ (తమ మరదలు) తండ్రి వద్దకు పంపించారు. ఆయనతో అనునయంగా మాట్లాడి ఆయనను జయరాంబాటికి తీసుకురావటమో లేకపోతే కుమార్తె నుండికాజేసిన నగలను తిరిగి ఇచ్చివేసేలా చేయడమో నేను చేయవలసిన పని. మేంవెళ్లి ఎంతోసేపు ఆయనతో అనునయంగా మాట్లాడిన తరువాత మర్నాడు ఆయనజయరాంబాటికి వచ్చాడు. కాని నగలు తీసుకురాలేదు. మాతృదేవి ఆయన పాదాలుపుచ్చుకొని, “ఎలాగైనా నన్నీ కష్టం నుండి కాపాడండి” అని ఎంతగానో అర్థించారు. అయినప్పటికీ దురాశాపరుడైన ఆ వృద్ధుడు ఏవో కుంటిసాకులు చెప్పాడేగాని, నగలు మాత్రం తిరిగి ఇవ్వలేదు.
శివరాత్రి ముందురోజు నేను తిరిగి పోదామనుకొన్నాను. బేలూరు మఠంలోజరిగే శ్రీరామకృష్ణుల జయంత్యుత్సవంలో పాల్గొనాలనుకొన్నాను. మాతృదేవితోకూడా ఆ మాటే చెప్పాను.
నేను బయలుదేరుతున్నప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: “గురుదేవుల జన్మస్థలం మీదుగానే కదా వెళ్లాలి. అందువలన కామార్పుకూర్లో ఒక పూటయైనా గడిపిమరీ వెళ్లు.” ఆమె నాకు ఒక పంచ కూడా ఇచ్చారు.
మాతృదేవి: డబ్బు ఉందా? బండి బాడుగ అవీ ఇవ్వాలి కదా! నేను ఇస్తాను.
నేను: వద్దమ్మా. నా వద్ద డబ్బుంది.
మాతృదేవి: ఇంటికి చేరుకొన్న తరువాత ఉత్తరం వ్రాయి. ఆహా, నా బిడ్డకు మంచి భోజనం కూడా పెట్టలేకపోయాను. చేపలు దొరకలేదు.
నేను మాతృదేవికి ప్రణమిల్లి కంట తడిపెట్టుకొని బయలుదేరాను. మమ్మల్నిసాగనంపడానికి చాలా దూరం మాతృదేవి నడిచి వచ్చారు. మేం కనుమరుగయ్యేదాకా చూస్తూనే నిలబడిపోయారు. ఉద్విగ్నత కారణంగా కామార్పుకూర్ చేరుకొనేదాకా నా కళ్లల్లో నీళ్లు స్రవిస్తూనే ఉన్నాయి. మాతృదేవిని మళ్లీ చూడాలనే ఆరాటంనా మనస్సును తొలచివేసింది. ఎలాగో కామార్పుకూర్ చేరుకొని, రాత్రి అక్కడే గడిపాను.
మర్నాడు. లలిత్‌బాబు అనే భక్తుడు జయరాంబాటికి వెళుతూ కామార్పుకూర్కు వచ్చాడు. ఒంటరిగా కలకత్తా వెళ్లకుండా లలిత్బాబుతో కలిసి నేను మళ్లీజయరాంబాటికి వెళ్లి ఆయనతోనే కలకత్తాకు పోవచ్చునని ఒక భక్తుడు సలహాయిచ్చాడు. అదే అవకాశంగా తీసుకొని మళ్లీ జయరాంబాటికి వెళ్లాను. తిన్నగామాతృదేవి వద్దకు వెళ్లి, “అమ్మా, వచ్చేశాను” అన్నాను. నన్ను చూసి మాతృదేవి ఎంతో సంతోషించి, “మంచిది నాయనా! ఆయనతో పాటే నువ్వు కలకత్తాకు వెళ్లవచ్చు” అని చెప్పారు.
శివరాత్రి కోసం కాటాలైకు చెందిన వకీలు రామచంద్ర ముఖోపాధ్యాయ వచ్చాడు. కొందరు భక్తులు ఉపవాసం ఉంటున్నారు. మర్నాటి మధ్యాహ్నం మాతృదేవి అన్నప్రసాదం తినగోరారు వారు. మాతృదేవి కూడా ఒక విస్తరిలో తమ ప్రసాదం పెట్టి రాధూతో పంపించారు. అంతా ప్రసాదం” తింటూవుంటే, “ఏం తింటున్నారు?” అని నేను అడిగాను. “మాతృదేవి ప్రసాదం” అన్నారు వారు. నేను కూడా ప్రసాదం పుచ్చుకొన్నాను. తరువాత మాతృదేవి వద్ద కెళ్లి, “అమ్మా, వీరందరూ మీ ప్రసాదం ఆరగించారు. ఇన్ని రోజులుగా మరి నా కెందుకు పెట్టలేదు?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “నువ్వు అడగలేదు కదా! నేనుగా ఎలా చెప్పగలను” అని జవాబిచ్చారు. ఎంత వినమ్రత!
రాధూ తాతగారి నుండి నగలను తేవడానికి మర్నాడు లలిత్‌బాబు ఒక పల్లకీలో బయలుదేరాడు. కలకత్తాలోని ఒక పోలీసు ఉన్నతాధికారి ఉత్తరంతోపాటు ఒక పెద్ద ప్రభుత్వోద్యోగిలా డాబుగా లలిత్‌బాబు వెళ్లాడు.
లలిత్‌బాబు యువకుడు. ఆ వృద్ధునితో మాట్లాడుతున్నప్పుడు దుందుడుకుగా మాట్లాడి ఆయనను అవమానపరుస్తాడేమోనని లలిత్బాబుతో వెళ్లిరమ్మని మాతృదేవి ‘మ’ ను కోరారు. వారు వెళ్లి రాధూ తాతను నగలతోపాటు తీసుకువచ్చారు.
రాత్రి రెండు గంటలయివుంటుంది. మాతృదేవికి తల తిరగడం వలన నిద్ర లేమితో అవస్థపడుతున్నట్లు తెలిసింది. ‘మ’, నేను మరికొందరం లోపలకు వెళ్లాం. అంతా మందుకోసం వెతకులాడుతూంటే నేను, “అమ్మా, ఎందుకు తిరుగుతూన్నది?” అని అడిగాను. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“నగలు తీసుకురావడానికి వారంతా వెళ్లారు. ఆ వృద్ధుణ్ణి ఎక్కడ అవమానిస్తా రోనని భయపడి మనస్సు కకావికలైపోయింది. ఆ కారణంగా వాతం క్రమ్మటమే దీనికంతటికీ కారణం.”
నేను ‘మ’ తో ఈ విషయం చెప్పాను. ఎవరి మూలంగా ఈ కష్టాలు వాటిల్లాయో ఆ వృద్ధుణ్ణి తలంచుకొని మాతృదేవి ఆవేదనపడుతున్నారు.
మూడవనాటి సాయంత్రం మేం బయలుదేరాం. అప్పుడు మాతృదేవి లలిత్ బాబుతో, “ఇతడు మంచి భక్తుడు. మీతోపాటు ఇతణ్ణికూడా తీసుకువెళ్లండి” అని చెప్పారు. మేం మాతృదేవికి ప్రణమిల్లాం. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ద్వారం దాకా మాతో వచ్చారు. అప్పుడూ మాతృదేవి కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి.
దేష్టా మీదుగా విష్ణుపూర్ చేరాము. ‘మ’, ప్రబోధ్బాబు ప్రభృతులు లాల్పాంథీ లోని మృణ్మయిదేవిని దర్శింప వెళ్లారు. లలిత్‌బాబు, నేను రైలెక్కాము. ప్రబోధ్బాబును పంపించి ‘మ’ మమ్మల్ని ఆహ్వానించారు. “రండి, మృణ్మయిని దర్శించుకొని వద్దా మంటున్నారు ‘మ’” అని చెప్పాడు. చిన్మయిని దర్శించుకొన్నాం కనుక మృణ్మయిని దర్శించే ఉత్సుకత మాలో లేదు. తదనంతరం నేను బేలూరు మఠంలో శ్రీరామకృష్ణుల జయంతి మహోత్సవంలో పాల్గొని, ఇంటికి తిరిగి వెళ్లిపోయాను.
బలరాంబాబు ఇల్లు, 1907
దుర్గాపూజోత్సవాల తరువాత మాతృదేవి దర్శనార్థం కలకత్తాకు వచ్చాను. మాతృదేవి ఒక భక్తునికి, “పూజ ఉత్సవాలలో నేను గిరీష్‌బాబు ఇంటికి వచ్చి ప్రస్తుతం బలరాంబాబు ఇంట్లో ఉంటున్నాను” అని ఒక లేఖ వ్రాశారు. అందువలన నేను ఉదయానే బలరాంబాబు ఇంటికి వెళ్లాను.
మొదట బాబారాం మహరాజ్‌ను చూశాను. ఆయనకు ప్రణమిల్లి, “మాతృదేవి ఎక్కడున్నారు?” అని అడగగానే, ఆయన నా తలమీద చేయివేసి, “నీ నడినెత్తిమీద ఉన్నారు” అన్నారు.
తదనంతరం లోపలకు వెళ్లి మాతృదేవిని దర్శించాను. జయరాంబాటిలో కనబడినట్లు కాక మలేరియా మూలంగా ఎంతో చిక్కిపోయి ఉన్నారు. కాసేపు నాతో మాట్లాడిన తరువాత, “నిన్న శరత్ చక్రవర్తి వచ్చి పాడాడు. ఏం పాట! ఏం భావం! నువ్వు రాలేదే!” అన్నారు.
కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి, “బండి వచ్చింది” అని చెప్పాడు. మాతృదేవి స్నానానికి గంగానదికి వెళ్లనున్నారు.
ఉద్బోధన్, 1907
ఒక రోజు సాయంత్రం వెళ్లేసరికి డాక్టర్ కంజీలాల్ వసారాలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. ఆయనను మాతృదేవిని గురించి అడిగినప్పుడు, “మాతృదేవికి అమ్మవారు పోసింది. ఆమెకు ఇంకా స్నానం చేయించలేదు. ఇప్పుడు ఫరవాలేదు. రెండు వారాల తరువాత ఆమెను చూడవచ్చు” అని చెప్పారు. నాకు ఈ విషయం తెలియదు. శరత్ మహరాజ్‌ను అడిగినప్పుడు, “రేపు ఉదయంపూట రా! మాతృదేవిని దర్శించవచ్చు. ఇక్కడే ప్రసాదం తీసుకోవచ్చు” అని ఆయన చెప్పారు.
మర్నాడు వెళ్లి మాతృదేవిని దర్శించుకొన్నాను. తమ చేతుల మీద, ముఖం మీద పొక్కుల మచ్చలు చూపించారు. తమ రుగ్మత గురించి అంతా వివరించి, “ఇప్పుడు పొక్కులు అంతగా లేవు” అన్నారు. కొన్ని రోజులలోనే పొక్కులన్నీ మాడి పోయి, మచ్చలుకూడా మాసిపోయాయి.
శరత్ మహరాజ్ ఉపదేశాల వలనా, మాతృదేవి అనుగ్రహం వలనా నేను మఠంలో చేరగలిగాను. ఈ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు ఆమె, “చూడు నాయనా! వీడికి సన్న్యాసం గాలి సోకింది. మంచిది, మంచిది. మఠంలో ఉండు. గురుదేవుల పట్ల నీకు భక్తి కలుగుగాక! హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను” అని చెప్పారు.
కొన్ని సందర్భాలలో బేలూరు మఠం నుండి మాతృదేవికి పాలు తీసుకు వెళ్లే భాగ్యం నాకు దక్కేది. అప్పుడల్లా ఆమెను దర్శించుకొనే అవకాశం కూడా లభించేది.
ఒక రోజు పాలు తీసుకువెళ్లాను. మాతృదేవికి నమస్కరించటానికి వెళ్లినప్పుడు పక్క గదిలో తలపాకు చిలకలు చుడుతూ ఉన్నారు. నళిని ఆ పనిలో మాతృదేవికి సహాయం చేస్తున్నది. నేను వెళ్లగానే ఆమె బయటకు వెళ్లిపోవడానికి లేచింది. కాని మాతృదేవి ఆమెను వారిస్తూ, “ఉండు, వెళ్లకు. ఇతడు చిన్నవాడే, కూర్చో” అన్నారు. నన్ను కూడా కూర్చోమన్నారు.
మాకు అత్తవారింటి గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“వారిని బాగా చూసుకోవాలి. లేకపోతే బుసకొడతారు. కాని మీరు నా బిడ్డలు. మీకు ఏం చెప్పినా, ఏం ఇచ్చినా తృప్తి చెందుతారు. లోటు ఏం జరిగినా మీరు ఏమీ పట్టించుకోరు. కాని వారి సంగతో, ఇచ్చేవన్నీ శ్రేష్ఠమైనవిగా ఉండాలి, చిన్న లోటు జరిగితే చాలు ముఖం ముడుచుకొంటారు.”
కాసేపటి తరువాత నేను మాతృదేవిని, “అమ్మా, మనోపావనత్వమూ, భక్తీ పొందడం ఎలా?” అని అడిగాను.
మాతృదేవి: పొందుతావు, పొందుతావు గురుదేవులను శరణు జొచ్చావు, అంతా సిద్ధిస్తుంది. ఆయనను ప్రార్థించు.
నేను: నాకు సాధ్యం కావడం లేదు. మీరే ఆయనతో చెప్పండి.
మాతృదేవి: ‘భగవంతుడా, ఈ నా బిడ్డ మనస్సును బాగుచేయి, పరిశుద్ధం చేయి’ అని చెబుతూనే ఉన్నాను.
నేను: మీరు చెబితే నాకు సమస్తమూ సిద్ధిస్తుంది.
జయరాంబాటి
కొన్ని నెలల తరువాత ఘాటాల్లో సహాయ సేవాకార్యం చేస్తున్నాను. మూడు రోజులు సెలవు పుచ్చుకొని జయరాంబాటికి వెళ్లాను. అది జగద్ధాత్రి పూజా సందర్భం. మాతృదేవి కొన్ని రోజుల క్రితమే అక్కడకు వచ్చారు. నాతోపాటు అతుల్ కూడా వచ్చాడు. అతడు మాతృదేవిని మొట్టమెదటిసారిగా దర్శింప వచ్చాడు. దారిలో కామార్పుకూర్కు వెళ్లి రఘువీర్ ప్రసాదం పుచ్చుకొన్నాం. జయరాంబాటిలో మాతృదేవి ఇంటికి వెళ్లగానే ఆశు మహరాజ్, “వచ్చేశావా? మంచిపని చేశావు. ‘భక్తు లెవరూ రాలేదే’ అని ఇప్పుడే మాతృదేవి అన్నారు. రా, ప్రసాదం తిందువుగాని” అన్నాడు.
మేం వెళ్లి మాతృదేవికి ప్రణమిల్లగానే, “ఎక్కణ్ణుండి వస్తున్నావు?” అని అడిగారు. “ఘాటాల్ నుండి” అని బదులు చెప్పాను. “కూర్చోండి, భోజనం చేయండి” అన్నారు మాతృదేవి. అందరమూ భోజనానికి కూర్చున్నాం. మాతృదేవి మంచి చేపలు వడ్డించారు.
ఒక రోజు అక్కడ బసవేశాం. మర్నాడు మేం బయలుదేరాలి. తెల్లవారుజాము ఇంట్లోకి వెళ్లినప్పుడు మాతృదేవి తడిబట్టలతో నిలబడి ఉన్నారు. బట్టలు మార్చు కొన్నాక ఆమెకు ప్రణమిల్లి, సెలవు పుచ్చుకొన్నాం. “మళ్లీ వస్తాను” అన్నాను. ఒక పాఠశాల బాలుడిలా అతుల్, “అమ్మా, జ్ఞాపకముంచుకోండి” అన్నాడు.
జయరాంబాటి, డిసెంబర్ 16, 1909
ఘాటాల్ అనే చోట వరద బాధితుల సహాయ సేవాకార్యం పూర్తిచేసి మళ్లీ జయరాంబాటికి బయలుదేరాను. అతుల్ చాలాదూరం నాతోపాటు వచ్చి దారి చూపించాడు. సాయంత్రానికి మాతృదేవి ఇంటికి చేరుకొన్నాను. అప్పుడామె వసా రాలో కూర్చుని కాలు వాతానికి మందు రాచుకొంటున్నారు. నేను ప్రణమిల్లాను.
నేను: ఏం మందు అమ్మా?
మాతృదేవి: ఈ ఆకును నూరి లేపనంగా రాచుకొంటే మంచిదని ఎవరో అన్నారు. అవును, ఈ రోజంతా నువ్వు తినలేదా?
నేను: లేదు.
మాతృదేవి: దారిలో ఏదైనా తినివుండవచ్చు కదా! రామ్ జీవన్‌పూర్‌లో అంగళ్లు ఉన్నాయే!
ఘాటాల్ నుండి మఠానికి వెళ్లే ఖర్చులకై ఉపేన్ మహరాజ్ ఇచ్చిన ఒక్క రూపాయ మాత్రమే నా వద్ద ఉంది. మఠానికి వెళ్ట్లే ప్పుడు అవసరమని దాన్ని ఖర్చు పెట్టలేదు. కాని ఈ విషయం మాతృదేవికి చెప్పలేదు. “కూర్చో, వేడివేడి అన్నం ఉంది, తిను” అన్నారామె.
తరువాత, “ఈ జగత్తు ఎవరిదో ఆయనే దానిని చూసుకొంటాడు. మీరు అందు గురించి కలత చెందకండి” అన్నారు. నేను భోజనం చేయలేదని తెలుసు కొని ఎంతో బాధపడ్డారు. వెంటనే భోజనం వడ్డించి, నా పక్కన కూర్చున్నారు. నేను మాట్లాడసాగాను.
మాతృదేవి: నీ మూలంగా గురుదేవులు అనేక కార్యాలు చేయిస్తారు. చూడు, మీరంతా ఖాటాల్కు సహాయ సేవాకార్యాల కోసం వచ్చారు. ఎంతో మందికి సహాయం చేశారు. పని పూర్తయ్యాక శ్రీ గురుదేవులు తమ ఒళ్లోకి మిమ్మల్ని తీసుకొంటారు.
నేను: గురుదేవులను ఎందువలన చూడలేకపోతున్నాం?
మాతృదేవి: చూడగలవు, చూడగలవు. సముచిత తరుణం ఆసన్నమైనప్పుడు చూడగలుగుతావు. లలిత్ ఇలా మాట్లాడడు. ‘గురుదేవులను ఎందువలన చూడలేక పోతున్నాను?’ అని అతడు ప్రశ్నించడు. ‘ఆయన నా సొంతం. ఎప్పుడు కావలసినా ఆయన నాకు దర్శన మిస్తారు’ అన్నదే అతడి మనోస్థితి.
నేను: అమ్మా, నాకు మేలు జరిగేటట్లు, శుద్ధభక్తి కలిగేటట్లు ఆశీర్వదించండి.
మాతృదేవి: కలుగుతుంది, కలుగుతుంది. శుద్ధభక్తి కలుగుతుంది.
మాతృదేవి నా కొక కంబళి నిచ్చి, “చూడు, దీనిని రాత్రిపూట ఉపయోగించుకో” అన్నారు. “ఇది ఎవరిది?” అని అడిగాను. “నాదే. నేను వాడుకొంటున్నాను” అన్నారామె.
జయరాంబాటి, డిసెంబర్ 18, 1909
మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని తమలపాకు చిలకలు చుడుతున్నారు. అప్పుడు సమయం ఉదయం తొమ్మిదిగంట లయివుంటుంది. తినడానికి నాకు మరమరాలు ఇచ్చారు. పిదప మాట్లాడసాగారు.
నేను: అమ్మా, నేను దీర్ఘకాలం జీవించకుండా ఆశీర్వదించండి.
మాతృదేవి: అలా అయితే నాతో వచ్చెయ్యి. తక్కిన వారు సముచిత సమ యంలో వచ్చి చేరుకొంటారు.
నేను: ఆ విషయం మరచిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి.
మాతృదేవి: అదే కదా చెబుతున్నాను. నేను వచ్చి నిన్ను తీసుకువెళతాను.
నేను: ఈసారి తీసుకువెళ్లిపోండి. తరువాత గురుదేవులు వచ్చినప్పుడు ఆయనతో వస్తాను.
మాతృదేవి (నవ్వుతూ): ఇక నేను రాదలచుకోలేదు.
నేను: మీరు వచ్చినా రాకున్నా, నేను వస్తాను. నాకు రావాలనే ఇచ్ఛ ఉంది.
మాతృదేవి: ఆ సమయంలో బహుశా నువ్వు ఇష్టపడవేమో! ఈ లోకంలో ఏముంది? మంచిగా ఉన్న విషయం ఒక్కటి చెప్పు చూద్దాం! అందుకే కదా గురు దేవులు అన్నం, ఆకుకూర ఇత్యాది అతి నిరాడంబర ఆహారాన్నే కదా ఆరగించేవారు. ఏదైనా తీపిభక్ష్యం ఇచ్చినప్పుడు, ‘దీన్లో ఏం ప్రత్యేకత ఉంది? కేవలం మట్టిలో ఉన్నదే ఈ తీపి భక్ష్యంలోను ఉంది’ అనేవారు.
నేను: గురుదేవులను ఎందుకు ఉదాహరిస్తారు? ఆయనకు సరిసమాను లెవరున్నారు?
మాతృదేవి: అదే కదా! ఆయనకు సరితూగేవా రెవరున్నారు?
ఆ సమయంలో మాతృదేవికి వచ్చిన ఉత్తరాలు చదివి వినిపించడానికి వరదా మామయ్య వచ్చాడు. నా సోదరుడు వ్రాసిన ఉత్తరం కూడా వాటిలో ఉంది. నన్ను తిరిగి ఇంటికి పంపించమని మాతృదేవిని అర్థిస్తూ వ్రాశాడు. ఉత్తరం క్లుప్తంగా ఉన్నప్పటికీ చక్కని శైలిలో సాగింది. “ఆహా! ఎంత బాగా వ్రాశాడు” అన్నారు మాతృ దేవి. ఆ తరువాత నాతో, “నాయనా, ఇంటికి వెళతావా?” అని అడిగారు. నన్ను పరీక్షించడానికే అలా అడిగారు. “అమ్మా, అలా అనకండి” అన్నాను నేను.
మాతృదేవి: పోనీలే. అనేకులు సంసార జీవితం గడుపుతున్నారు. నువ్వు ఒక్కడివి గడపకపోతే కొంప ఏమీ మునిగిపోదు.
నేను విలపించసాగాను.
మాతృదేవి: ఏడవకు నాయనా! మీరంతా దైవాంశసంభూతులు. భగవంతుని కోసం సర్వస్వాన్ని త్యజించడం ఎవరికి సాధ్యం? భగవంతుణ్ణి శరణుజొచ్చినప్పుడు విధివ్రాత మారిపోతుంది – తాను వ్రాసిన వ్రాతను తనంతటతానే చెరపివేస్తుంది. భగవదనుభూతి పొందిన వ్యక్తికి రెండు కొమ్ములు పుట్టుకొస్తాయా? లేదు. అతడికి నిత్యానిత్య వివేకం జనిస్తుంది. దివ్యప్రేరణ కలుగుతుంది. అతడు జనన మరణాలకు అతీతుడు. భగవదనుభూతి పొందగలడు. అలా కాకుండా భగవత్సాక్షాత్కారం ఎలా లభిస్తుంది? ఎవరితో భగవంతుడు మాట్లాడతాడు? అనుభూతితోనే దర్శనమూ, మాట్లాడడమూ! సమస్తమూ అనుభూతితోనే జరుగుతుంది.
నేను: అమ్మా! మరొకటి కూడా ఉంది, ప్రత్యక్ష దర్శనం.
మాతృదేవి: అది నరేంద్రుడు మాత్రమే పొందగలిగాడు. అతడి ముక్తికి తాళంచెవి గురుదేవుల వద్ద ఉంది.
ఇంకేముంది? జపధ్యానాలు అనుష్ఠించడం, గురుదేవులను ప్రార్థించడం. ఇదే కదా అసలు విషయం! ఇక ఆయన ఎవరు? ఆయన సదా మనం సొంతమే కదా!
నేను: అమ్మా, గురుదేవులు సదా మన సొంతమే అన్న యథార్థాన్ని నేను గ్రహించేలా ఆశీర్వదించండి.
మాతృదేవి: ఆ విషయాన్ని పదేపదే చెప్పాలా ఏమిటి? (దృఢంగా) గ్రహించ గలవు, గ్రహించగలవు.
జయరాంబాటి, డిసెంబర్ 19, 1909
రాత్రి మాతృదేవి గదిలో మాట్లాడుతున్నాను. వేదాంతం గురించిన ప్రస్తావన వచ్చింది.
నేను: నామరూపాలు తప్ప మరేదీ లేదు. జడపదార్థం ఉందని నిరూపించ లేము. అందువలననే భగవంతుడు, అదీ ఇదీ అంటూ ఏదీ లేదని అభిప్రాయపడు తున్నారు.
గురుదేవులు, మాతృదేవి మొదలైవన్నీ యథార్థాలు కావనే నా అభిప్రాయం. నా భావనను తక్షణమే గ్రహించిన మాతృదేవి, ఇలా అన్నారు:
“నరేన్ ఒకసారి నాతో, ‘అమ్మా, గురువు పాదపద్మాలను ఉపేక్షించే జ్ఞానం జ్ఞానమే కాదు, అది అజ్ఞానం. గురువు పాదారవిందాలను కాకపోతే ఇక దేనిని జ్ఞానం ఆధారం చేసుకొంటుంది?’ అని అన్నాడు. ఇటువంటి మెట్టవేదాంతాన్ని కట్టి పెట్టు. తర్కంతో భగవంతుని ఎవరు తెలుసుకోగలిగారు? శుకుడు, వ్యాసుడు, అంతెం దుకు సాక్షాత్తు పరమేశ్వరుడు సైతం, మహా అయితే గండు చీమలు* , అంతే!”
నేను: అర్థం చేసుకోగోరతాను. కించిత్తు అర్థం చేసుకొన్నాను కూడా. తర్కించడం మానుకోవడం ఎలా?
మాతృదేవి: పరిపూర్ణ జ్ఞానం సంతరించుకొనేటంత దాకా తర్కం నిష్క్రమించదు.
సృష్టిని గురించి ప్రస్తావన వచ్చింది.
నేను: అమ్మా, అసంఖ్యాకాలైన చిన్నా పెద్దా జీవరాశులన్నీ ఏకకాలంలో సృష్టింపబడ్డాయా?
మాతృదేవి: చిత్రాన్ని గీసేటప్పుడు చిత్రకారుడు కళ్లు, ముఖం, ముక్కు ఇత్యాదులను ఒక్కటొక్కటిగా చిత్రించి తదుపరి చిత్రాన్ని పూర్తిచేస్తాడు. అదే విధంగా భగవంతుడు కూడా ఒక్కటొక్కటిగా సృష్టిస్తాడా ఏమిటి? కానే కాదు. భగవంతునికి విశిష్ట శక్తి ఉంది. ఆయన ‘ఉం’ అంటే అన్నీ సృష్టింపబడతాయి. ఆయన ‘హుం’ అంటే అవన్నీ లయించిపోతాయి. ఉన్నవన్నీ ఏకకాలంలో సృజింపబడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటి కాదు.
తినుబండారాల వాసన కారణంగా గండుచీమలు మాతృదేవి గదిలో అటూ ఇటూ ప్రాకుతున్నాయి. హఠాత్తుగా నేను ఒక చీమను చూపిస్తూ “అలా అయితే ఈ చీమ ఎందుకు వెనుకబడింది? ఇది మనిషిగా రూపొందడానికి సుదీర్ఘకాలం పడుతుందే” అన్నాను. అందుకు మాతృదేవి, “అవును, అది నిజమే” అన్నారు. పిదప సృష్టిని గురించి ప్రస్తావిస్తూ, “ఒక కల్పం పూర్తయ్యాక నిద్రనుండి మేల్కొన్నట్లు అందరూ ప్రభవిస్తారు” అని చెప్పారు.
తరువాత జపతపాదుల గురించి ప్రశ్నించాను. అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చారు:
“జపతపాదుల వంటి ఆధ్యాత్మిక సాధనానుష్ఠానాల వలన కర్మబంధనాలు తెగిపోతాయి. కాని ప్రేమభక్తి లేకుండా భగవత్సాక్షాత్కారం లభించదు. జపతపాదుల ప్రాధాన్యం ఏమిటో తెలుసా? వీటి వలన ఇంద్రియాలను నిగ్రహించవచ్చు.”
మాటల మధ్యలో లలిత్‌బాబు గురించిన ప్రస్తావన వచ్చింది. కొన్ని నెలల నుండి ఆయన తీవ్రవ్యాధిగ్రస్థుడై ఉన్నాడు. పరిస్థితి విషమించింది. మాతృదేవి ఆయనను ఎంతో అభిమానించారు. ఆయన వ్యాధిగ్రస్థుడై ఉండడం పట్ల మాతృదేవి ఎంతో ఆవేదన చెందారు. ఆమె ఇలా అన్నారు:
“లలిత్ నా కెంతో ఆర్థిక సహాయం అందించాడు. తన బండిలో నన్ను త్రిప్పి తీసుకువచ్చేవాడు. దక్షిణేశ్వరంలోను, కామార్పుకూర్లోను పూజాకార్యాల నిమిత్తం ఎంతో ధనం ఇచ్చాడు. నా లలిత్ హృదయం అమూల్యమైనది. సంపన్ను లైనా అనేకులు పిసినారులుగానే ఉంటారు. ధనవంతుడు భగవంతునికీ, భక్తులకూ సేవచేసి, ఆరాధించాలి. పేదవాడు నామజపం చేస్తూ ఆరాధించాలి.”
ప్రేమభక్తిని గురించి ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు:
“బృందావనంలోని గోపబాలురు జపధ్యానాదులు అనుష్ఠించే శ్రీకృష్ణుణ్ణిపొందారా? లేదు. ‘ఓయ్ కృష్ణా, ఇక్కడకు రా! ఇది తిను, ఇది తీసుకో’ అంటూనెచ్చెలిమితోనే ఆయనను పొందగలిగారు.”
నేను: భగవంతుని ప్రేమ అభివ్యక్తతను చూడకుండా ఎలా ఆయన పట్లపరితప్తత కలుగుతుంది?
మాతృదేవి: అవును, అది నిజమే. అది ఆయన అనుగ్రహానికి సంబంధిం చింది.
జయరాంబాటి, డిసెంబర్ 31, 1909
ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలయి ఉంటుంది. నేను మాతృదేవినిచూడడానికి వెళ్లినప్పుడు ఆమె తమలపాకు చిలకలు చుడుతున్నారు. ఆమె ప్రక్కనకూర్చుని మాట్లాడసాగాను.
నేను: అమ్మా, నే నెంతో చూశాను, విన్నాను. కాని మిమ్మల్ని నా సొంతతల్లిగా అవగతం చేసుకోలేకపోతున్నాను.
మాతృదేవి: నాయనా, అలా కాకుంటే నువ్వెందుకు ఇక్కడకు రావాలి? ‘ఎవరికి చెందవలసినవారు వారికే చెందుతారు! ప్రతి యుగంలోను ఏతెంచే అవతారమూర్తులతో వారికి చెందిన వారు కూడా వస్తారు.’ నేను నీ తల్లిననేనిజాన్ని సముచిత సమయంలో గ్రహిస్తావు.
కాసేపయ్యాక నా తల్లితండ్రులు, సోదరుల గురించి మాట్లాడాను.
“తల్లితండ్రులు నన్ను పెంచారు. వారు గతించారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు. నా సోదరులు సద్గుణవంతులుగా ఉండాలని ఆశీర్వదించండి.”
మాతృదేవి: అందరూ భగవంతుని పొందగోరతారా? ఈ ఇంట్లో ఎందరో ఉన్నారు. అందరూ (నన్ను) కోరుకొంటున్నారా?
(కాస్త ఆగి) వివాహం చేసుకోవద్దు. గృహస్థ జీవితంలోకి వెళ్లబోకు. వివాహంచేసుకోకపోతే ఏం? ఎక్కడున్నా స్వతంత్రంగా మసలుకోవచ్చు. వివాహమేదుఃఖాలన్నిటికీ మూలకారణం.
నేను: కాని అమ్మా, నాకు భయంగానే ఉంది.
మాతృదేవి: భయపడకు. అంతా గురుదేవుల సంకల్పానుసారమే జరుగుతుంది.
నేను: మనస్సే సమస్తమూ. మనస్సు మాత్రం పావనంగా ఉంటే ఎక్కడుంటే ఏం? నా మనస్సు సదాసర్వవేళలా పావనంగా ఉండేలా అనుగ్రహించండి.
మాతృదేవి: తథాస్తు!
జనవరి 2, 1910
నేడు మాతృదేవి పుట్టిన రోజు. కొద్ది రోజులకు మునుపు ప్రబోధ్బాబు వచ్చి మాతృదేవి పుట్టిన రోజు విశేష పూజ నిమిత్తం మాతృదేవి సోదరులకు ఐదు రూపాయలు ఇచ్చారు. మాతృదేవి మాతో, “ప్రత్యేకంగా ఏమీ చేయకండి. ఒక కొత్త చీరమాత్రం ధరిస్తాను. గురుదేవులకు నైవేద్యం సమర్పిద్దాం. ఆ తరువాత ప్రసాదం ఆరగిద్దాం. అంతే” అని చెప్పారు.
పూజ పూర్తయ్యాక మాతృదేవి తమ గదిలో మంచం మీద కాళ్లను క్రిందికి వ్రేలాడదీసి కూర్చున్నారు. కొత్త చీర ధరించారు. ప్రబోధ్బాబు మాతృదేవి పాద పద్మాలకు పువ్వులు సమర్పించాడు. పక్కనే నిలబడివున్న నాతో, “నాయనా, నువ్వు పువ్వులు అర్పించవా? ఇదుగో, ఈ పువ్వులు తీసుకో” అని చెప్పారు. నేను కూడా ఆమె పాదపద్మాలకు పువ్వులు సమర్పించాను. మధ్యాహ్నం కమ్మని భోజనం తిన్నాం. పిదప కార్యాలయ పనుల నిమిత్తం ప్రబోధ్బాబు కలకత్తాకు బయలుదేరారు. విరేచనాల కారణంగా నేను వెళ్లలేదు.
జనవరి 5, 1910
మాటల మధ్యలో మాతృదేవి ఇలా అన్నారు:
“భగవంతుని ఎవరైనా బద్ధుణ్ణి చేయగలరా? భగవంతుడు సమ్మతించాడు కాబట్టే యశోద, కృష్ణుణ్ణి బంధించగలిగింది. ఆయన కరుణించాడు కనుకనే గోపికలు ఆయనను పొందగలిగారు.
“కోర్కెలు ఉన్నంత దాకా పుట్టుకలకు అంతం లేదు. పదేపదే శరీర ధారణలు చేయించేది కోర్కెలే! కాస్త పటికబెల్లం తినాలనే కోర్కె ఉన్నా కూడా మళ్లీ పుట్టవల సిందే! అందుకే మఠానికి వివిధ రకాల ఆహార పదార్థాలు తెప్పిస్తున్నారు. కోర్కెను ఒక సూక్ష్మమైన బీజంతో పోల్చవచ్చు – నలుసు వంటి విత్తనం నుండి కాలక్రమేణా బ్రహ్మాండమైన మర్రివృక్షం పెరిగేటట్లు. కోర్కెలున్నంత దాకా పునర్జన్మ అనివార్యం. ఒక దిండుగలీబు నుండి మరొక దిండుగలీబులోకి జీవుని ప్రవేశపెట్టినట్లుగా ఉంటుం దిది. సమూలంగా కోర్కెల నుండి విడివడే వ్యక్తులు ఎంతో అరుదు. కోర్కెల కార ణంగా ఒక వ్యక్తి పునర్జన్మ నెత్తినా పూర్వజన్మలో చేసిన సత్కర్మల ఫలం ఉండివుంటే ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సమూలంగా కోల్పోకుండా ఉంటాడు.
“బృందావనంలోని గోవిందజీ ఆలయ పూజారి ఒకడు దేవునికి నివేదించిన ప్రసాదాన్ని తన ఉంపుడుగత్తెకు ఇచ్చేవాడు. ఈ పాపం కారణంగా అతడు పిశాచమైనాడు. కాని ఆలయంలో పూజలు నిర్వర్తించాడు కదా! ఆ పుణ్యఫలంగా అతడు ఒక రోజు అందరికీ భౌతిక దేహంతో కనిపించాడు. సత్కర్మ ఫలంగా అతడు అలా అందరికీ కనిపించగలిగాడు. తన అధోగతికి కారణాన్ని అందరికీ తెలిపాడు. తరు వాత అతడు అందరితో, ‘భగవంతునికి ఉత్సవం జరిపించి, నామసంకీర్తనం చేయిం చండి. నాకు సద్గతి ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు.”
నేను: ఉత్సవాలు జరిపించడం వలనా, నామసంకీర్తనం చేయించడం వలనా సద్గతి కలుగుతుందా?
మాతృదేవి: అవును. వైష్ణవులు అలాగే చెబుతారు. వారు శ్రాద్ధం ఇత్యాదులు నిర్వహించరు.
పూరీలో ఒకసారి జగన్నాథ దర్శనం చేసుకొన్నాను. వేలాదిమంది భక్తులు అలా దర్శనం చేసుకోవడం చూసి నాకు పరమానందం కలిగింది, ఆనందబాష్పాలు స్రవించాయి. ‘ఆహా! ఆశ్చర్యం! ఇంతమందీ ముక్తులయిపోతారు’ అని అనుకొన్నాను. కాని అలా జరగదు. కోర్కెల నుండి పూర్తిగా విడివడిన ఏ కొద్దిమంది మాత్రమే ముక్తి పొందుతారని అర్థంచేసుకొన్నాను.*
ఒక రోజు మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని మరమరాలు తింటూ మాతృ దేవితో, “అమ్మా, మఠంలో ఉండగోరితే సన్న్యాసం పుచ్చుకోవాలా?” అని అడిగాను.
మాతృదేవి: అవును నాయనా!
నేను: కాని అమ్మా, సన్న్యాసం మితిమీరిన గర్వానికి తావిస్తుందే!
మాతృదేవి: అవును, గర్వమే. ‘నాకు నమస్కరించలేదు, మర్యాద చూపలేదు, ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు’ అంటూ అనుకోవచ్చు. అంతకంటే (తమ తెల్ల చీరను చూపిస్తూ) ఇదే మంచిది. (అంటే ఆంతరిక సన్న్యాసం శ్రేష్ఠం) గౌర్ శిరోమణి* తమ వృద్ధాప్యంలో, ఇంద్రియ శక్తులను కోల్పోయిన తరువాత సన్న్యాసం పుచ్చు కొన్నారు. అందంపట్ల గర్వమూ, సద్గుణాల పట్ల గర్వమూ, చదువు పట్ల గర్వమూ, సన్న్యాసం పట్ల గర్వమూ – ఇవన్నీ సులభంగా తొలగిపోతాయా నాయనా?
సన్న్యాస జీవితానికి సిద్ధంకమ్మని మాతృదేవి నాతో చెప్పారు:
“ఇంటికి వెళ్లి నీ సోదరులతో, ‘నేను పనీగినీ ఏమీ చేయలేను. మన తల్లి కూడా లేదు. అందువలన నేను ఎవరికీ సేవ చేయవలసింది లేదు. అది నా వల్ల కాదు కూడా. మీరు ఇల్లూ వాకిలీ చూసుకొని సంతోషంగా ఉండండి’ అని చెప్పి వెయ్యి.”
సన్న్యాస జీవితంలోని ఇబ్బందుల గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: “మఠంలో బిడ్డలు కష్టపడుతున్నారు. తినడానికీ, కట్టు కోడానికీ ఇతరత్రా ఏమీ లేదు. ఇది నాకు నచ్చలేదు. యోగిన్ ఎంతో కష్టంతో జీవితం గడిపాడు, మరీ చిన్న వయస్సులోనే మరణించాడు.”
రాత్రి మాతృదేవితో మళ్లీ మాట్లాడాను.
నేను: అమ్మా, భగవదనుగ్రహం లభిస్తే సముచిత తరుణం వచ్చేదాకా వేచి వుండవలసింది లేదు కదా!
మాతృదేవి: నిజమే. కాని ఇతర మాసాలలో లభించే మామిడిపండ్లు జ్యేష్ఠ మాసంలో లభించే పండ్లలా తియ్యగా ఉంటాయా? ఋతువుకాని కాలంలో కూడా పండ్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడల్లా ఆశ్వయుజ మాసంలో సైతం పనసపండ్లు, మామిడిపండ్లు లభిస్తున్నాయి. కాని అవి సముచిత ఋతువులో లభించే పండ్లలా రుచిగా ఉండవు. భగవత్సాక్షాత్కార మార్గాల విషయం కూడా ఇంతే. ఈ జన్మలో కొంత జపం, తపస్సు చేయవచ్చు. మరుజన్మలో కొంత ఆత్మ వికాసం పొందవచ్చు. ఆ పై జన్మలో ఇంకా పురోగమించవచ్చు. ఇలాగేకదా, మరేమిటి!
ఆకస్మికంగా భగవదనుభూతి పొందే విషయం గురించి మాతృదేవి ఇలా అన్నారు:
“భగవంతుడు శిశునైజం గలవాడు. ఒకడు కోరుకోకుండానే ఇస్తాడు; మరొకడు కోరుకొన్నప్పటికీ ఇవ్వడు. అంతా ఆయన ఇచ్ఛ.”
మరొక రోజు ఉదయం. మాతృదేవి వసారాలో కూర్చుని తమలపాకు చిల కలు చుడుతున్నారు.
నేను: భవిష్యత్తులో మీ ప్రాప్తంకోసం ఎందరో ఎన్నెన్నో సాధనలు అనుష్ఠించ నున్నారు.
మాతృదేవి (నవ్వి) : ఏమంటున్నావు? ‘మాతృదేవికి వాతరోగం ఉండేది. ఆమె ఇలా కుంటుతూ నడిచేవారు’ అని ప్రతి ఒక్కరు చెప్పనున్నారు.
నేను: కావాలంటే మీరు అలా అనుకోవచ్చు.
మాతృదేవి: కాశీపూర్‌లో వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు గురుదేవులు అందుకే, “ఏదైనా లబ్ధికోరుతూ వచ్చేవారంతా, ‘ఆహా! వీరికి వ్యాధియా? ఈయన ఎలా అవ తారపురుషులై ఉంటారు? అంతా అబద్ధం’ అంటూ వెళ్లిపోయేవారు. కాని నా వారు, నా ఈ వ్యాధిని చూసి ఎంతో కలత చెందుతున్నారు” అనేవారు.
నాకు మంత్రదీక్ష ప్రసాదించిన రోజుకు క్రితం రోజు.
నేను: అమ్మా, మంత్రదీక్ష పుచ్చుకోగోరుతున్నాను.
మాతృదేవి: ఇంకా నువ్వు మంత్రదీక్ష పుచ్చుకోలేదా?
నేను: లేదు.
మాతృదేవి: మంత్రదీక్ష పుచ్చుకొన్నావనే అనుకొన్నాను.
మర్నాడు. మంత్రదీక్ష ప్రసాదించిన పిదప మాతృదేవి, “భగవంతుని పవిత్ర నామజపంతో నీ మనశ్శరీరాలు పరిశుద్ధమౌతాయి గాక!” అంటూ నన్ను ఆశీర్వదించారు.
నేను: వ్రేళ్లతో లెక్కించి జపం చేయాలా? ఊరకే జపిస్తే చాలదా?
మాతృదేవి: భగవంతుడు మనకు వ్రేళ్లను ఇచ్చింది జపం చేసే భాగ్యం పొందాలనే కదా!
సెప్టెంబర్ 25, 1910
ఉదయం మాతృదేవితో మాట్లాడసాగాను.
నేను: అమ్మా, భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే, ఈ లోకంలో ఇంత దుఃఖమూ, ఇన్ని కష్టాలూ ఎందుకు ఉన్నాయి? ఆయన వీటినన్నీ పట్టించుకోరా? వీటిని తొలగించే శక్తి ఆయనకు లేదా?
మాతృదేవి: సుఖదుఃఖాలతో కూడుకొన్నదే సృష్టి. దుఃఖమే లేకుంటే సుఖాను భూతి ఉంటుందా? అందరూ సుఖంగా ఉండడం సాధ్యమా?
ఒకప్పుడు సీత, రామునితో ఇలా అంది: ‘అందరి కష్టాలనూ దుఃఖాలనూ మీరు తీర్చరాదా? మీ రాజ్యంలోని పౌరులందరూ సంతోషంగా ఉండేలా చేయండి. మీరు సంకల్పిస్తే అది సాధ్యమే.’ అందుకు శ్రీరాముడు, ‘ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడమన్నది ఎలా సాధ్యం?’ అని అన్నాడు. కాని సీత, ‘ఎందుకు కాదు. మీరు తలచుకొంటే సాధ్యమే. ఎవరికి ఏం కావాలో వాటిని కోశాగారం నుండి సరఫరా చేసేలా చూడండి” అని అంది.
వెంటనే శ్రీరాముడు, ‘సరే! నీ ఇష్టప్రకారమే జరుగుతుంది’ అని చెప్పి, లక్ష్మణుని పిలిచి, ‘ఎవరికి ఏది కావలసినా వాటిని కోశాగారం నుండి తీసుకోవచ్చు నని ప్రకటించు’ అని ఆజ్ఞ జారీచేశాడు. దాంతో పౌరులు వెంటనే రాజభవనానికి వెళ్లి తమ అవసరాలు తెలియచేశారు. కోశాగారం తెరిచారు. అందరూ సుఖంగా జీవించసాగారు.
అప్పుడు శ్రీరాముని మాయాప్రభావంతో సీతారాములు నివసిస్తున్న భవనం పై కప్పు కారసాగింది. మరమ్మత్తు చేయడానికి మనుషులకై కబురు పంపారు. కాని పని చేయడానికి మనుషు లెక్కడ లభిస్తారు? మరమ్మత్తులు చేయడానికి ఎవరొస్తారు? మనుషులు దొరకక మరమ్మత్తు పనులన్నీ స్తంభించిపోయాయి. ఈ సంగతి పౌరులు శ్రీరామునికి చెప్పి మొరపెట్టుకొన్నారు. ఇక గత్యంతరంలేక సీత, శ్రీరామునితో, ‘ఇలా తడుస్తూ, తడుస్తూ ఇక భరించలేను. అన్నిటిని మునుపు ఉన్నట్లే చేయండి. అప్పుడే పనులకు మనుషులు లభిస్తారు. ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడమనేది అసంభవం’ అన్నది. ‘అలాగే జరుగుగాక’ అన్నాడు రాముడు. అన్నీ మునుపటిలా సర్దుకొన్నాయి. పనికి మనుషులు లభించ సాగారు. అప్పుడు సీత, ‘ప్రభూ! ఈ సృష్టియే మీ అద్భుత లీల!’ అన్నది శ్రీరామునితో.
సదాసర్వవేళలా సంతోషంగా ఉండేవారు ఎవరూ ఉండరు, అలాగే అన్ని జన్మలలోను దుఃఖాన్నే అనుభవించేవారూ ఉండరు. కర్మకు తగ్గట్లే ఫలితం; అందుకు తగ్గట్లే అవకాశాలు లభిస్తాయి.
నేను: అంతా కర్మఫలానుసారమే జరుగుతుందా?
మాతృదేవి: కర్మఫలం కాకపోతే మరేమిటి? నెత్తిన పెంట తొట్టెను మోసుకు పోయే పాకీవాణ్ణి నువ్వు చూడలేదా?
నేను: మంచిపని, చెడుపని అనేవన్నీ ప్రారంభంలో ఎక్కణ్ణుండి వచ్చాయి? ఈ జన్మలోని కార్యాచరణకు పూర్వజన్మ కర్మలే కారణం అంటారు. ఇక ఆ జన్మ అంతకు పూర్వజన్మపై ఆధారపడివుంది. ఇలా పోతూవుంటుంది. అయితే దీనికి ఆది ఏది?
మాతృదేవి: భగవంతుని సంకల్పం లేకుండా ఏదీ జరగదు; ఒక ఆకు కూడా కదలదు. అనుకూల సమయం ఆసన్నమనై ప్పుడు భగవంతుని ధ్యానించాలనే ఆకాంక్ష జనిస్తుంది. కాని ప్రతికూల సమయం ఏతెంచితే దుష్కర్మలు చేయడానికి సదు పాయాలు ఏర్పడతాయి. భగవంతుని సంకల్పం మేరకే నిర్ణీత సమయంలో అన్నీ జరుగుతాయి. మనిషి చేతల ద్వారా భగవంతుడు తన సంకల్పాన్ని వ్యక్తీకరిస్తాడు. నరేంద్రుడు తనంతట తానే వాటినన్నిటిని సాధించాడా? భగవంతుడు అతడి ద్వారా పనిచేశాడు.
తాము ఏం చేయనున్నారో గురుదేవులు ముందే నిర్ణయించుకొన్నారు. కాని నిజంగా ఎవరైనా తమ బాధ్యతను ఆయనకు అప్పగిస్తే అన్నిటినీ ఆయనే సరిగా అమర్చిపెడతారు.
ప్రతిదీ సహించాలి; ఎందుకంటే ప్రతిదీ కర్మఫలం వలననే నిర్ణయింపబడు తుంది కనుక. ప్రస్తుత కర్మల ద్వారా గత కర్మఫలాలను తుడిచివేయవచ్చు.
నేను: కర్మల ద్వారా కర్మ ఫలాలను రద్దు చేయవచ్చా?
మాతృదేవి: ఎందుకు కాదు? నువ్వొక సత్కర్మ ఒనరిస్తే, అందువలన నీ పాపం తగ్గుతుంది. ధ్యానం, జపం, దైవచింతన మూలంగా పాపాలను తగ్గించుకోవచ్చు.
మీర్జాపూర్ వీథిలో ఒక బాలుణ్ణి ఒక ప్రేతం ఆవహించినట్లు నేను విన్నాను. ఉద్బోధన్ కార్యాలయంలోని కొందరు నిన్న వెళ్లి ఆ బాలుణ్ణి చూసివచ్చారు. ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది.
నేను: ఒక వ్యక్తి ప్రేతంగా ఎంత కాలం జీవించాలి?
మాతృదేవి: ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకొన్నవారు తప్ప తక్కిన అందరూ ఒక సంవత్సర కాలం ప్రేతంగా జీవించాలి. ఆ తరువాత వారికి గయలో పిండ తర్పణం, వారి పేరిట ధర్మకార్యాలు నిర్వర్తిస్తే ప్రేతరూపం నుండి విముక్తులై భగవత్సాన్నిధ్యాన్ని చేరుకొంటారు. లేకపోతే ఇతర లోకాలకు వెళ్లి సుఖాలు అనుభవిస్తారు. తదనంతరం వాసనలకు తగ్గట్లు మరుజన్మ లభిస్తుంది. కొందరు ఆ లోకాలలోనే ముక్తిని పొందడం కూడా కద్దు. ఈ జన్మలో కొంత పుణ్యఫలం సంతరించుకొని ఉంటే ప్రేతరూపంలో ఉన్నప్పుడు సైతం ఆధ్యాత్మిక చైతన్యం పూర్తిగా కోల్పోకుండా ఉండవచ్చు.
నేను: గయలో పిండతర్పణం చేస్తే భగవత్సాన్నిధ్యం చేరుకోవడం నిజమేనా?
మాతృదేవి: అవును, నిజమే.*
నేను: అలా అయితే ఆధ్యాత్మిక సాధనలు ఎందుకు అనుష్ఠించాలి?
మాతృదేవి: ఆ సద్గతి పొందిన తరువాత వారు తమ తమ వాసనలకు తగి నట్లు మళ్లీ ఈ ఇలలో జన్మిస్తారు. కొందరు ఇక్కడ నుండే ముక్తి పొందుతారు. మరికొందరు హీన జన్మలు పొంది తమ కర్మఫలాలను అనుభవిస్తారు. సృష్టి ఒక చక్రభ్రమణం వంటిది. ఏ జన్మలో మనస్సులోని కోర్కెలన్నీ సమూలంగా తొలగి పోతాయో అదే ఆ వ్యక్తి చిట్టచివరి జన్మ.
నేను: మరణించిన వ్యక్తి ఆత్మ భగవత్సాన్నిధ్యం చేరుకొంటుందని అన్నారు కదా! తమంతట తామే వెళతారా లేక ఎవరైనా వారిని తీసుకొని వెళతారా?
మాతృదేవి: లేదు, తమంతట తామే వెళతారు. సూక్ష్మ శరీరం అన్నది వాయునిర్మిత శరీరం వంటిది.
నేను: గయలో పిండతర్పణానికి నోచుకోని వారి గతి ఏమిటి?
మాతృదేవి: వారి వంశంలో పుణ్యపురుషుడెవరైనా జన్మించి గయలో పిండ తర్పణమో లేక అపరకర్మలో నిర్వర్తించే దాకా వారు ప్రేతంగా ఉండవలసిందే!
నేను: దయ్యం, భూతం అని వింటూ ఉంటాం. ఇవన్నీ శివుని భూతగణాలా లేక మరణించిన వారి ఆత్మలా?
మాతృదేవి: మరణించిన వారి ఆత్మలు. శివుని భూతగణాలూ ఉన్నాయి, అవి వేరు.
ఎంతో అప్రమత్తంగా జీవించాలి. ప్రతి కర్మకూ ఫలం ఉంటుంది. పరులకు దుఃఖం కలిగించడమో లేదా వారి పట్ల దురుసుగా వ్యవహరించడమో మంచిది కాదు.
నేను: అమ్మా, వేపచెట్టుకు మామిడిపళ్లు కాయవు; మామిడిచెట్టుకు వేపపళ్లు కాయవు. ఎవరికి ఏం జరగాలో అది జరిగే తీరుతుంది.
మాతృదేవి: బాగా చెప్పావు నాయనా. కాలగతిలో భగవంతుని ఉనికి కూడా కానరాదు. జ్ఞానం సంతరించుకొన్న పిదప దేవీదేవతలన్నీ మాయగా ద్యోతకమవు తాయి. ప్రతిదీ కాలగతిలో జనించి కాలగతిలో కనుమరుగయ్యేవే అని మనిషి గ్రహిస్తాడు.
ఉద్బోధన్, పూజా మందిరం
ఉదయం మాతృదేవితో మాట్లాడుతున్నాను.
మాతృదేవి: గురుదేవుల నిర్యాణానంతరం కామార్పుకూర్లో నివసించసాగాను. ఒంటరిగా ఉన్నప్పుడు, ‘నాకు పిల్లలు లేరు, ఎవరూ లేరు. నా గతి ఏమవుతుంది?’ అని ఆలోచిస్తూవుండేదాన్ని. ఒక రోజు గురుదేవులు దర్శన మిచ్చి, “ఎందుకు కలత చెందుతావు? నువ్వు పిల్లవాణ్ణి కోరావు. నీకు రత్నాలవంటి పిల్లల నెందరినో ఇచ్చాను. కాలక్రమాన ఎందరెందరో ‘అమ్మా, అమ్మా’ అంటూ నిన్ను పిలవడం చూస్తావు” అని చెప్పారు.
నేను రైలులో బృందావనానికి వెళుతున్నప్పుడు కిటికీ గుండా గురుదేవులు నన్ను చూస్తూ, “తాయెత్తును పదిలంగా ఉంచుకో” అని చెప్పారు. అది ఆయనది, నేను ధరించాను. నేను దానిని పూజించడం పరిపాటి. తదనంతరం దానిని మఠానికి ఇచ్చాను. ప్రస్తుతం ఆ తాయెత్తును అక్కడ పూజిస్తున్నారు.
శిష్యుడు: ఈ సంవత్సర శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవ వేడుకలో ఆ తాయెత్తు కనబడకుండాపోయింది. చూసుకోకుండా పువ్వులతోను, బిల్వపత్రాలతోను దానిని గంగానదిలో పారవేశారు. నదిలో పాటువచ్చి నీరు తగ్గినప్పుడు, రాంబాబు కుమా రుడు ఋషి ఆ తాయెత్తును చూసి, దానిని మఠానికి తెచ్చి ఇచ్చాడు.
మాతృదేవి: అది ఆయన తాయెత్తు. జాగ్రత్తగా పదిలపరచాలి.
పిదప బేలూరు మఠం గురించిన ప్రస్తావన వచ్చింది.
మాతృదేవి: అక్కడ గురుదేవులు జీవిస్తూ ఉండడం నేను చూశాను. గంగానదికి ఆవలి తీరంలోని ఆ స్థలం మునుపు ఒక అరటితోటగా ఉండేది. అక్కడ ఆయన జీవిస్తున్నారు. మఠం నిమిత్తం కొత్తగా స్థలం కొనుగోలు చేసిన తరువాత ఒక రోజు నరేన్ అక్కడికి నన్ను తీసికొనివెళ్లాడు. స్థలాన్ని అంతా చూపించి, ‘అమ్మా, ఇది మీ స్థలం. యథేచ్ఛగా మీరిక్కడ పచార్లు చేయవచ్చు’ అని చెప్పాడు.
బుద్ధగయలో పలు మఠాలు చూశాను. వాటికి ఆస్తిపాస్తులు పుష్కలం. దేనికీ కొరతలేదు. అది చూసి నేను విలపిస్తూ గురుదేవులతో, ‘ప్రభూ, నా బిడ్డ లకు నిలువ నీడలేదు, తినడానికి తిండిలేదు. వారు ఇంటింటా తిరిగి భిక్షాటన చేస్తున్నారు. వారికి కూడా ఇటువంటి శాశ్వత స్థలం లభించేటట్లు అనుగ్రహించరా?’ అని ప్రార్థించాను. ఆయన అనుగ్రహం వల్ల ఈ మఠం నెలకొంది.
ఒక రోజు నరేన్ నా వద్దకు వచ్చి, ‘అమ్మా, మఠ నిర్మాణానికి ఒక స్థలం కోసం ఇప్పుడే నేను గురుదేవులకు నూట ఎనిమిది బిల్వ పత్రాలను సమర్పించి వస్తున్నాను. నా ఈ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వకుండా పోదు. ఏదో ఒక రోజు నా ఆకాంక్ష ఈడేరే తీరుతుంది’ అన్నాడు.
రాత్రి భోజనం చేశాక తమలపాకు చిలుకలు తీసుకురావడానికి నేను మేడ మీదకు వెళ్లినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“నరేన్ నాతో, ‘అమ్మా, ప్రస్తుతం నా వద్ద నుండి సమస్తం ఎగిరిపోతూవుంది. అన్నీ మాయమైపోవడం నేను చూస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు నేను వెంటనే, ‘నాయనా, నేను కూడా ఎగిరిపోకుండా చూసుకో!’ అన్నాను. (మాతృదేవి నవ్వుతూ ఇలా చెప్పారు) అందుకు నరేన్, ‘అమ్మా, మిమ్మల్ని ఎగిరిపోనిస్తే నేను ఎవరిని ఆలంబన చేసుకొని జీవించగలను? గురువు పాదపద్మాలను విస్మరించేలా చేసే జ్ఞానం, జ్ఞానం కాదు. అది అజ్ఞానం. ఆ పాదపద్మాలను తీసివేస్తే, ఇక దేనిని ఆలంబన చేసుకొని జీవించడం?’ అన్నాడు.
జ్ఞానం ఉదయిస్తే దేవుడు – గీవుడు మొదలైనవన్నీ ఎగిరిపోతాయి. జనని, జనని – అంతంలో నా జననియే జగత్తు అంతటా పరివ్యాప్తమై ఉన్నట్లు తోస్తుంది. సమస్తమూ ఏకమైపోతుంది. ఇదే నిజం.
ఉద్బోధన్, పూజామందిరం
మాతృదేవి పూజ నిమిత్తం పువ్వులు, బిల్వపత్రాలు సర్దిపెడుతున్నారు. ఇటీవల ముద్రింపబడిన ఆమె ఛాయాచిత్రాన్ని ఒకటి ఆమెకు చూపించాను.
నేను: అమ్మా, ఈ ఛాయాచిత్రం సరిగా ఉందా?
మాతృదేవి: అవును, ఇది బాగుంది. మునుపు కాస్త లావుగా ఉండేదాన్ని. ఈ ఛాయాచిత్రం తీసిన సమయంలో యోగేన్ తీవ్ర వ్యాధిగ్రస్థుడై ఉన్నాడు. అతడి గురించి కలత చెంది చిక్కిపోయాను. యోగేన్కు వ్యాధి తీవ్రమైనప్పుడు విలపించే దాన్ని. కాస్త నెమ్మదించినప్పుడు సంతోషించేదాన్ని. సారాబుల్ ఈ ఛాయాచిత్రాన్ని తీసింది. ముందు నేను ఒప్పుకోలేదు; కానీ ఆమె పట్టుబట్టి, ‘అమ్మా, నేను ఈ ఛాయాచిత్రాన్ని అమెరికాకు తీసుకుపోయి పూజించుకొంటాను’ అని పరిపరి విధాల ప్రాథేయపడింది.
నేను: అమ్మా, మీ వద్ద ఉన్న గురుదేవుల ఛాయాచిత్రం ఎంతో బాగుంది.అది సరియైన ఛాయాచిత్రమేనా?
మాతృదేవి: అవును, అది ఎంతో చక్కని ఛాయాచిత్రం. మొదట్లో అది ఒకబ్రాహ్మణుని వద్ద ఉండేది. ఆ ఛాయాచిత్రం తీయగానే దానికి పలు ప్రతులుతీయించారు. ఆ బ్రాహ్మణునికి ఒక ప్రతి ఇచ్చారు. ఈ ఛాయాచిత్రం మొదట్లో ఎంతోనల్లగా, కాళికాదేవి ప్రతిమలా ఉండేది. అందువలన దానిని ఆతడికి ఇచ్చేశారు. ఆతడు దక్షిణేశ్వరం వదలిపెట్టి పోతున్నప్పుడు ఆ ఛాయాచిత్రాన్ని నాకిచ్చి వెళ్లాడు.నేను దానిని ఇతర దేవుళ్ల పటాలతో కలిపివుంచి పూజిస్తూవచ్చాను. ఆ సమయంలోనేను నహబత్తు కింద అంతస్తులో వసించేదాన్ని.
ఒక రోజు గురుదేవులు అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న తమ ఛాయాచిత్రాన్ని చూసి, ‘ఇదంతా ఏమిటి?’ అని అడిగారు. మేము (మాతృదేవి, బహుశా లక్ష్మికావచ్చు) అప్పుడు మెట్ల కింద వంట చేస్తున్నాం. తరువాత గురుదేవులు పూజార్థం ఉంచిన పువ్వులను, బిల్వదళాలను తమ చేతులలోకి తీసుకొని, ఆ ఛాయాచిత్రానికి అర్పించి, పూజించడం నేను చూశాను. ఆ ఛాయాచిత్రమే ఇది. ఆ బ్రాహ్మణుడుమళ్లీ తిరిగి రాకపోవడంతో ఆ ఛాయాచిత్రం నా వద్దే ఉండిపోయింది.
నేను: అమ్మా, గురుదేవులు సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆయన ముఖం పాలిపోయి ఉండడం, అంటే దుఃఖం అనుభవిస్తూన్నట్లుగా ఉండడం మీరెప్పుడైనా చూశారా?
మాతృదేవి: లేదు, ఎన్నడూ చూడలేదు. సమాధిమగ్నులై ఉన్నప్పుడు ఆయన ముఖంలో నేను సదా చిరునవ్వునే చూశాను.
నేను: భావసమాధి స్థితిలో చిరునవ్వు చిందించవచ్చు. కానీ గురుదేవులు కూర్చున్న భంగిమలో తీసిన ఆ ఛాయాచిత్రం ఎంతో సమున్నత స్థితిలో ఉన్నప్పుడుతీసిన చిత్రమని గురుదేవులే చెప్పారు కదా! ఆ స్థితిలో చిరునవ్వు చిందించడం సాధ్యమేనా?
మాతృదేవి: అన్ని సమాధి స్థితులలోనూ ఆయన చిరునవ్వు చిందిస్తూ ఉండ డాన్నే నేను చూశాను.
నేను: గురుదేవుల మేనిఛాయ ఎటువంటిది?
మాతృదేవి: గురుదేవులది బంగారు మేనిఛాయ. ఆయన ధరించిన బంగారుతాయెత్తులా పసుపుపచ్చ రంగు. గురుదేవులకు నూనె రాసేటప్పుడల్లా ఆయన శరీరం అంతటి నుండి ఒక తేజస్సు వెలువడడం నేను చూసివున్నాను.
ఒకసారి దక్షిణేశ్వర వాస్తవ్యుడైన ఒక యువకుడు వచ్చాడు. అతడిది చక్కని మేనిఛాయ. అప్పుడు గురుదేవులు నాతో, ‘మేమిద్దరమూ పంచవటిలో పక్కపక్కన నడుస్తూ వెళతాం. మా ఇద్దరిలో ఎవరు ఎక్కువ రంగులో ఉన్నారో చూసి చెప్పు’ అని అన్నారు. వారిద్దరూ నడవసాగారు. వారిలో గురుదేవులకంటే ఆ యువకుడే కాస్త ఎక్కువ రంగులో ఉన్నట్లు కనిపించాడు. అతడు పందొమ్మిది లేక ఇరవై ఏళ్ల ప్రాయంవాడు.
దేవాలయంలోని తమ గది నుండి గురుదేవులు బయటకు వస్తే జనం అట్లే నిలబడి కళ్లప్పగించి చూస్తూ తమలో తాము, ‘అదుగో, ఆయన వెళుతున్నారు’ అను కోవడం కద్దు. ఆయన కాస్త లావుగానే ఉండేవారు. మథుర్బాబు ఆయన కూర్చోవ డానికి ఒక పెద్ద ఆసనం తయారుచేయించి ఇచ్చాడు. అది కూడా ఆయనకు కాస్త చిన్నదైంది. భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఆసనం చాలేది కాదు. చిన్న తువ్వాలు చుట్టుకొని ఆయన గంగానదికి స్నానానికి వెళ్లేటప్పుడు జనం ఆశ్చర్యపోతూ కళ్లు ఇంతింత చేసుకొని ఆయనను చూస్తూ ఉండిపోయేవారు.
ఇప్పుడు ఎటు చూసినా భక్తులూ, ఎంతో ఉత్తేజమూ, గోలా! కానీ గురుదేవులు వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు చందాలు వేసుకొని ఖర్చులు భరించారు. ఇరవై రూపాయలు ఇవ్వకుండా తప్పించుకోవాలని ఒక భక్తుడు పరుగు లంకించుకొన్నాడు. ప్రస్తుతం గురుదేవుల సేవకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నిజానికి గురుదేవులకు నివేదించిన ఆహారాన్ని భక్తులే కదా తింటున్నారు. గురుదేవులను కూర్చోపెడితే, కూర్చునే ఉంటారు. పడుకోబెడితే పడుకొనే ఉంటారు. ఏమైనా, ఆయన కేవలం చిత్రపటమే కదా!
ఒక దివ్య దృశ్యంలో బలరాంబాబు తలపాగా చుట్టుకొని చేతులు జోడించు కొని కాళీప్రతిమ ముందు నిలబడి ఉన్నట్లు గురుదేవులు చూశారు. సదా బలరాం అలాగే చేతులు జోడించుకొనే నిలబడతాడు, పాదాలను స్పృశిస్తూ ప్రణమిల్లుతాడు. ఆతడి ఈ మనోభావనను అవగతం చేసుకొన్న గురుదేవులు ఒక రోజు అతడితో, ‘బలరాం, నా కాళ్లు బాగా దురదపెడుతున్నాయి, కాస్త ఒత్తుతావా’ అన్నారు. కానీ బలరాం అక్కడ ఉంటున్న నరేన్, రాఖాల్ ప్రభృతుల నెవరినో పిలిపించి గురుదేవుల కాళ్లను ఒత్తమన్నాడు.
నేను: గురుదేవుల మేనిఛాయను గురించి ఒకసారి బ్రహ్మానంద స్వామిని అడిగినప్పుడు ఆయన, ‘మన రంగులోనే ఉండేవారు’ అని చెప్పారు.
మాతృదేవి: అవును, రాఖాల్ ఆయనను కలుసుకొన్నప్పుడు అలాగే ఉండేవారు. మునుపటి ఆరోగ్యమూ, మేనిఛాయ అప్పుడు ఆయన కోల్పోయారు. నా సంగతే చూడు, మేనిఛాయ ఎలా అయిపోయిందో! శరీరం కూడా ఎలా మారిపోయింది! మునుపు ఇలా ఉండేదానినా ఏమిటి? లేదు. ఎంతో అందంగా ఉండేదానిని. లావుగా ఉండేదాన్ని కాను, ఆ తరువాతే లావయ్యాను.
దక్షిణేశ్వరంలో నేను ఎవరి కంటా పడకుండా ప్రశాంతంగా జీవించాను. ఆలయ కోశాధికారి, ‘ఆమె ఇక్కడ వసిస్తున్నారని తెలుసుగాని చూసింది లేదు’ అనేవాడు. రెండు నెలల కొకసారి కూడా గురుదేవులను చూడని సందర్భాలు ఉన్నవి. అప్పుడల్లా నా మనస్సుకు, ‘ఓ మనసా, ఆయనను నిత్యం దర్శించుకునేటంత అదృష్టం నీకు ఉందా?’ అని చెప్పుకొని, అనునయించేదానను. వసారాలో కట్టి వున్న వెదురు తడిక వెనుక నిలబడి ఆయన గదిలో జరిగే కీర్తనలను వినేదానను. అలా నిరంతరం నిలబడటం వలన నా కాళ్లకు వాతపు నొప్పులు దాపురించాయి. అందువలన ఆయన నాతో, ‘వన్య పక్షిని పంజరంలో బంధించి ఉంచితే వాతం క్రమ్ముకొంటుంది. అప్పుడప్పుడు చుట్టుపక్కలకు తిరిగి రా’ అని చెప్పేవారు.
వేకువజాము నాలుగు గంటలకే స్నానం చేసేదానను. సాయంత్ర వేళల్లో మెట్లకు సమీపంలో కొంత ఎండ పడేది. అప్పుడు శిరోజాలను ఆరబెట్టుకొనేదానను. ఆ రోజుల్లో నాకు పొడవైన జడ ఉండేది నహబత్తు కింద అంతస్తు గది చాలా చిన్నది. పైగా గదినిండా సామాన్లు ఉండేవి. ఇందుకు తోడు పైకప్పు నుండి ఉట్లు వ్రేలాడుతూండేవి. రాత్రి పడుకొని ఉన్నప్పుడు, ఉట్ల నుండి శబ్దం వినవచ్చేది. గురుదేవుల కోసం ఉట్లలో చేపలు ఉంచేదాన్ని కదా! అవి నీళ్లలో కదలాడే సవ్వడే అది. అయినప్పటికీ నే నెన్నడూ ఇబ్బంది పడలేదు. కాలకృత్యాలు తీర్చుకోవడమే కాస్త ఇబ్బందిగా ఉండేది.
పూజకు వేళ అయింది. మాతృదేవియే స్వయంగా పూజ చేస్తారు. నేను కిందికి వచ్చేశాను. పూజ పూర్తయ్యాక ప్రసాదం పుచ్చుకోవడానికి పైకి వెళ్లాను. అప్పుడు మాతృదేవి పూజామందిరంలో కాళ్లు చాపుకొని కూర్చుని ఉన్నారు. చిన్న ఆకులలో ప్రసాదం పెట్టివుంచారు. వెళుతున్నప్పుడు మాతృదేవి పాదాలకు నా మోచేయి తగిలింది. ‘హా’ అంటూ మాతృదేవి చేతులు జోడించి నాకు నమస్కరించారు. నేను వణకిపోతూ, ‘అమ్మా, మీరేం చేస్తున్నారు? మీరు నమస్కరించేటంత ఏం జరి గింది?’ అని అడిగాను. నమస్కరించడంతో తృప్తిచెందక మాతృదేవి నా చుబుకాన్ని స్పృశించి ముద్దుపెట్టుకొని, శాంతపడ్డారు.
ఈ విధంగా మాతృదేవి భక్తులను భగవంతునిగా భావించి నమస్కరించేవారు; అదే సమయంలో వారిని బిడ్డలుగా భావించి దీవించేవారు.
ఉద్బోధన్, అక్టోబర్ 29, 1910
ఉదయం వేళ. మాతృదేవి పడక పక్కన కూర్చున్నాను. గురుదేవుల గురించి మాట్లాడుకోసాగాం.
నేను: నిజంగానే గురుదేవులు ఛాయాచిత్రంలో జీవించివున్నారా?
మాతృదేవి: అవును, కచ్చితంగా. వ్యక్తీ ఆతడి నీడా ఒక్కటే.* ఛాయాచిత్రం ఆయన నీడే కదా!
నేను: అన్ని చిత్తరువులలోను గురుదేవులు జీవించి ఉన్నారా?
మాతృదేవి: అవును. నువ్వు నిరంతరం ప్రార్థించేకొద్దీ ఆయన ఆ ఛాయాచిత్రం ద్వారా అభివ్యక్తమౌతారు. ఆ ఛాయాచిత్రం ఉన్నచోటు ఒక ఆలయంగా మారి పోతుంది. (ఉద్బోధన్కు ఉత్తరం వైపుగా ఉన్న మైదానాన్ని చూపుతూ) అదుగో అక్కడ ఒక వ్యక్తి గురుదేవులను పూజిస్తున్నాడనుకొందాం. ఆ చోటు ఆయన జీవిస్తూవున్న ప్రదేశమైపోతుంది.
నేను: ఈ అన్నిచోట్ల ఆయన గురించిన స్మృతుల కారణంగా అలా అని పిస్తుంది.
మాతృదేవి: అలా కాదు. ఆయనను పూజించే చోట ఆయన దృష్టిని సారిస్తారు.
నేను: అమ్మా, మీరు అర్పించే నైవేద్యాన్ని గురుదేవులు ఆరగిస్తున్నారా?
మాతృదేవి: అవును, ఆరగిస్తారు.
నేను: కానీ అలాంటి గుర్తులేవీ కనబడడం లేదే!
మాతృదేవి: గురుదేవుల కళ్లనుండి ఒక కాంతి వెలువడి సమర్పించిన ఆహార పదార్థాల నన్నిటినీ స్పృశిస్తుంది. ఆయన అమృత స్పర్శతో ఆ ఆహారం పరిపూర్ణమవుతుంది, తరిగిపోదు. ఆయనకు ఆహార ఆవశ్యకత ఉందా ఏమిటి? లేదు. ఆయన భక్తుల తృప్తి కోసం వస్తారు, ఆరగిస్తారు. ప్రసాదం ఆరగిస్తే మనస్సు పావనమవుతుంది. నివేదించని ఆహారం తింటే మనస్సు మలినమవుతుంది.*
నేను: గురుదేవులు నిజంగానే నైవేద్యం ఆరగిస్తారా?
మాతృదేవి: అవును. ఆయన నైవేద్యం ఆరగిస్తున్నారా లేదా అన్న విషయం నేను గమనించకుండా ఉంటానా? గురుదేవులు వచ్చి కూర్చొని, నైవేద్యం ఆరగిస్తారు.
నేను: మీరు నిజంగానే చూశారు?
మాతృదేవి: అవును. కొందరు అర్పించిన నైవేద్యాన్ని ఆరగిస్తారు. కొందరు అర్పించిన వాటిపై దృక్కులను మాత్రం సారిస్తారు. నీ సంగతే తీసుకో! అన్నిటినీ అన్ని వేళల్లోనూ నువ్వు తినడానికి ఇష్టపడతావా? ఎవరిచ్చినా తింటావా? ఇదీ అంతే. మనోస్థితిని బట్టే భక్తి! భక్తే ప్రధానం.
నేను: భక్తి ఎలా జనిస్తుంది? మరొకరి వద్ద పెరిగిన తన సొంత తల్లిని తల్లిగా గుర్తించలేము.
మాతృదేవి: నిజమే. అందుకే కదా భగవంతుని అనుగ్రహం అవసరం. అది పొందడానికి అర్హుణ్ణి చేసుకోవాలి.
నేను: అనుగ్రహం అర్హతను గుర్తిస్తుందా? అనుగ్రహం అందరి మీదా సమానంగా ప్రసరించాలి కదా?
మాతృదేవి: నదీ తీరాన కూర్చొని ప్రార్థించాలి. సముచిత తరుణంలో ఆవలి ఒడ్డుకు చేర్చబడతాడు.
నేను: సముచిత తరుణంలో అంతా జరిగి తీరుతుంది. అప్పుడు అనుగ్రహం ఎక్కడ నుండి వస్తుంది?
మాతృదేవి: చేపల్ని పట్టగోరితే గాలం వేసి నిరీక్షిస్తూ కూర్చొని ఉండాలి కదా!
నేను: భగవంతుడు మన సొంతమైనప్పుడు ఎందుకు వేచి ఉండాలి?
మాతృదేవి: అదీ నిజమే. కొందరి విషయంలో హఠాత్తుగా అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడల్లా ఋతువుగాని ఋతువులో కూడా మామిడి, పనస పండ్లు లభిస్తున్నాయి. శ్రావణ మాసంలో ఎన్ని మామిడిపండ్లు కాస్తాయి?
నేను: మన అర్హత మేరకే భగవంతుడు ప్రసాదిస్తాడా? లేకుంటే మనకు సొంతమైన వారిగా ఆయనను పొందగలమా? భగవంతుడు నాకు సొంతమేనా?
మాతృదేవి: అవును, సొంతమే! అది శాశ్వత బాంధవ్యం. ఆయన అందరికీ సొంతమే. భావన తీవ్రత మేరకు విషయాన్ని గ్రహించవచ్చు.
నేను: భావన ఒక కల్పన కదా, కల లాంటిది కదా! పదేపదే కల్పన చేసు కొని చివరకు కలలో చూస్తాం. అలాగే కదా!
మాతృదేవి: అవును, కల కాక మరేమిటి? ఈ ప్రపంచమే ఒక కల. ఇది (జాగ్రదావస్థ) కూడా ఒక కలే కదా!
నేను: కాదు, ఇది కల కాదు. కలే అయితే క్షణంలో చెదరిపోయివుండాలి. కానీ ఈ స్థితి అనేక జన్మలుగా ఉంటూ వస్తోంది కదా!
మాతృదేవి: కావచ్చు. అయినప్పటికీ అది కలే గాని మరేమీ కాదు. రాత్రి నువ్వు కన్న కల ఇప్పుడు లేదు. (నిజానికి గత రాత్రి నేనొక అద్భుతమైన కల కన్నాను.) తన కుమారుణ్ణి కోల్పోయిన ఒక రైతు తాను ఒక మహారాజు అయినట్లు, ఎనిమిది మంది కుమారులకు తండ్రి అయినట్లు ఒక కల కన్నాడు. కల చెదరిపోగానే అతడు ‘ఆ ఎనిమిది మంది కుమారుల కోసం విలపించాలా? లేక ఈ కుమారుని కోసం విలపించాలా?’ అని తన భార్యను అడిగాడు.
నేను: అమ్మా, ఇప్పుడు మాట్లాడుతున్న విషయాల గురించి నేను నిజంగా తల బద్దలు కొట్టుకోవడం లేదు. నాకు సొంతమంటూ ఒకరు ఉన్నారా అనే విషయం గురించి మాత్రమే నేను తెలుసుకోగోరుతున్నాను.
మాతృదేవి: లేకేం? తప్పక ఉన్నారు.
నేను: నిజంగానా?
మాతృదేవి: నిజంగానే.
నేను: మనకు సొంతమైనప్పుడు ఆయనను చూడడానికి ప్రార్థించవలసిన అగత్య మెందుకు? నాకు సొంతమైన వారు నేను పిలువకపోయినా నా వద్దకు రావాలి కదా! తల్లి తండ్రులు మనలను చూసుకొనేటట్లుగానే భగవంతుడు కూడా చూసుకొంటాడా?
మాతృదేవి: అవును నాయనా! ఆయనే తల్లీ, తండ్రీగా రూపొందారు. ఆయనే తల్లితండ్రుల రూపంలో మనలను పెంచుతారు. ఆయనే మనలను పోషిస్తారు. లేకుంటే నువ్వు ఎక్కడుండేవాడివి, ఎక్కడకు వచ్చావు! నీ తల్లితండ్రులు నిన్ను పెంచారు, తుదకు నువ్వు వారికి సొంతం కాదని గ్రహించారు. కాకి గూట్లో కోకిల పెరగడం లేదా?
నేను: భగవంతుడు నిజంగానే నా సొంతమని నేను గ్రహించగలుగుతానా?
మాతృదేవి: గ్రహిస్తావు, తప్పక గ్రహిస్తావు. సకలమూ నీకు సిద్ధిస్తుంది. నువ్వు కోరినవన్నీ లభిస్తాయి. స్వామీజీకి లభించలేదా? స్వామీజీకి లభించినట్లే నీకు కూడా లభిస్తుంది.
నేను: అమ్మా, మీ పట్ల నాకున్న భయసంకోచాలు తొలగిపోవాలని ఆశీర్వ దించండి.
మాతృదేవి: సంకోచమెందుకు? నేనే కదా చేపను పట్టుకున్నాను.
నేను: మంచిది. అంతా కలసి తిందాము.
మాతృదేవి: అవును, అది నిజం. ఒకరు మూసను తయీరుచేస్తారు. అనేకులు దాని నుండి ప్రతిమలను తయారుచేసుకొంటారు.
నేను: మా విషయంలో మీరు ఏదైనా చేస్తేనే! మీరు మమ్మల్ని వదలిపెట్టలేరు.
మాతృదేవి: అవును నాయనా, నేను చేస్తేనే మీకు అంతా జరుగుతుంది.
జయరాంబాటి
ఉదయం షిల్లాంగు నుండి ఒక భక్తుడు వచ్చాడు. మాతృదేవి ఒక అవతార మన్న విషయంలో సందేహం వచ్చిన ఆ భక్తుడు ఏడుసార్లు మాతృదేవి కలలో కని పిస్తే తప్ప ఆమెను దర్శించుకోనని నిశ్చయించుకొన్నాడు. మాతృదేవి కరుణించి అతడికి ఏడుసార్లు కలలో కనిపించారు. అందువలన అతడు జయరాంబాటికి వచ్చాడు. మధ్యాహ్నం మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకునేందుకు వచ్చినప్పుడు, “అమ్మా, వెళ్లొస్తాను. ఇంకా ఏమైనా ఉందా?” అని అడిగాడు.
మాతృదేవి: అవును నాయనా, నిశ్చయంగా ఉంది. నువ్వు మంత్రదీక్ష పుచ్చుకో.
భక్తుడు: బాగ్‌బజార్‌లో పుచ్చుకొంటాను.
మాతృదేవి: వద్దు నాయనా, ఈ రోజే పుచ్చుకో.
భక్తుడు: కానీ నేను భోజనం చేసేశానే!
మాతృదేవి: దానికేం ఫరవాలేదు.
తదనంతరం అతడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని ఊరికెళ్లిపోయారు.
జయరాంబాటి నుండి తిరిగి వచ్చిన ఆ యువకుని మానసిక స్థితిలో క్రమేణా మార్పు రాసాగింది. గురుదేవుల దర్శనం పొందాలనే తీవ్ర వ్యాకులత ఆతడిలో జనించింది. మాతృదేవి సంకల్పిస్తే గురుదేవుల దర్శనం లభించేటట్లు చేయవచ్చు, కానీ అందుకు ఆమె సుముఖంగా లేరన్న కోపంతో మళ్లీ జయరాంబాటికి వచ్చాడు.
మాతృదేవి వద్దకెళ్లి, “అమ్మా, గురుదేవులను నాకు చూపిస్తారా, లేదా?” అంటూ ఉక్రోషంగా అడిగాడు. అందుకు మాతృదేవి ఎంతో అనునయంగా, “అంతా జరుగుతుంది, ఆందోళన చెందకు” అన్నారు.
కానీ ఆ యువకుడు పూర్తిగా ఓర్పును కోల్పోయి, కోపంగా “నన్ను మోసగించ ప్రయత్నిస్తున్నారా? ఇదుగో మీ జపమాల. నా కేదీ వద్దు” అంటూ జపమాలను మాతృదేవి వైపు విసిరేశాడు. “పోనీలే నాయనా! గురుదేవుల బిడ్డగా ఉండు” అన్నారు మాతృదేవి.
ఆ యువకుడు తక్షణమే అక్కడ నుండి వెళ్లిపోయాడు.
ఆ తరువాత అతడికి పిచ్చిపట్టింది. స్వాముల నందరినీ తిడుతూ ఉత్తరాలు వ్రాయసాగాడు. మాతృదేవికి కూడా అట్లే వ్రాశాడు. ఇలాంటి చర్యల వలన అతడు దెబ్బలు, తన్నులు కూడా తినాల్సి వచ్చింది.
ఒక రోజు ఆ యువకుని గురించి నేను మాతృదేవిని, “అతడు మంత్రాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడా? జపమాలను పారేశాడు. మంత్రాన్ని అలా తిరిగి ఇచ్చి వేయడం సాధ్యమేనా?” అని అడిగాను.
మాతృదేవి: అదెలా సాధ్యం? అది జాగృతి మంత్రం. దానిని తిరిగి ఇచ్చి వేయడం ఎలా సాధ్యం? ఒకసారి ఒకరిని ప్రేమిస్తే ఎప్పటికైనా మారుతుందా? ఏదో ఒక రోజు అతడికి మతిస్థిమితం కలుగుతుంది. అప్పుడు ఆయన పాదాల మ్రోల క్షమాపణ వేడుకొంటాడు.
నేను: అమ్మా, ఎందుకు ఇలా జరగాలి?
మాతృదేవి: కొన్ని సందర్భాలలో ఇలా జరగడం కద్దు. ఒక గురువు అనేకులకు మంత్రోపదేశం చేస్తాడు. వారందరూ సమానులై ఉంటారా? మనస్సును బట్టే కదా ఉన్నతి కలుగుతుంది.
అతడు జయరాంబాటిలో ఉన్నప్పుడు, ‘అమ్మా, నన్ను పిచ్చివాణ్ణి చేసేయండి’ అన్నాడు. అందుకు నేను ‘నాయనా, నువ్వెందుకు పిచ్చివాడివి అవాలి? ఘోరపాపాలు చేయని వాడు పిచ్చివాడవుతాడా?’ అన్నాను. అప్పుడతడు, ‘నా చిన్న తమ్ముడు గురుదేవుల దర్శనం పొందాడు. నాకు కూడా ఆయన దర్శనం కలిగేలా చేయండి’ అన్నాడు. అందుకు నేను, ‘ఈ కళ్లతో ఎవరైనా ఎప్పుడైనా గురుదేవులను దర్శించారా? కళ్లు మూసుకొంటే ఆయనను దర్శించవచ్చు. నీ తమ్ముడు చిన్నవాడు. కళ్లు మూసుకొంటే ఆయన రూపం కనబడుతుంది కదా! దానిని గురుదేవుల దర్శనంగా భావిస్తున్నాడేమో!’ అని అన్నాను. తరువాత, ‘సాధనలు అనుష్ఠించు. గురుదేవులను ప్రార్థించు. నీకు దర్శనం కలుగుతుంది’ అని అతడికి విపులంగా చెప్పాను.
ఎంత వరకు పురోగమించాం, ఎంత జ్ఞానం, జాగృతి పొందివున్నామో ప్రతి వ్యక్తీ తనంతటతానే తెలుసుకొంటాడు. భగవంతునికి ఎంత సన్నిహితులమో ప్రతి వ్యక్తీ మనస్సులో గ్రహిస్తాడు. ఈ స్థూలమైన కళ్లతో ఎవరైనా భగవంతుణ్ణి చూశారా ఏమిటి?
ఆ యువకుడు పిదప కొన్ని సందర్భాలలో గంగాతీరంలోను, కొన్ని సమ యాల్లో ఉద్బోధన్ ద్వారం వద్ద ఉండేవాడు. అక్కడే భుజించేవాడు. ఆ తరువాత ఒక రోజు ఆ యువకుణ్ణి మాతృదేవి అనుమతితో ఆమె వద్దకు తోడ్కొని వచ్చారు. మాతృ దేవి నానావిధాల అతణ్ణి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు:
“ ‘నన్ను ప్రార్థించే వారి కడకు అవసాన సమయంలో నేను నిశ్చయంగా వస్తాను’ అని గురుదేవులు చెప్పేవారు. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం. నువ్వు నా బిడ్డవు. భయమెందుకు? ఎందుకు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు? అది గురుదేవుల పేరుకే అవమానం కదా! ‘ఆయన భక్తుడు పిచ్చివాడైపోయా’ డని లోకులు అను కొంటారు కదా! చెడ్డపేరు వచ్చేలా నువ్వు ప్రవర్తించవచ్చా? వెళ్లు, ఇంటికెళ్లి నలు గురిలా మసలుకో! చక్కగా భుజించి హాయిగా నిద్రించి సంతోషంగా ఉండు. నీ అవసాన సమయంలో స్వయంగా గురుదేవులు వచ్చి నిన్ను తమతో తీసుకుపోతారు. గురుదేవులను ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా? చెప్పు. నరేన్ ఒక్కడే అలా చూడ గలిగాడు. అది కూడా అతడు అమెరికాలో తీవ్ర మనోవ్యాకులతతో ఉన్నప్పుడు జరి గింది. గురుదేవులు తన చేతులు పుచ్చుకొన్నట్లు అతడికి అనుభూతి కలిగింది. అది కూడా కొన్ని రోజులకు మాత్రమే. మంచిది, వెళ్లిరా. ఇంటికి వెళ్లి ఉండు. గృహస్థు లకు ఎన్ని కష్టాలు! కొన్ని రోజుల క్రితం రాముని కుమారుడు చనిపోయాడు. మీరైనా కొంతవరకు ప్రశాంతంగా నిద్రించగలుగుతున్నారు.
“ఆ రోజు పూజ చేసుకొంటున్నప్పుడు ఈతడి ముఖం కనబడింది – ఆ గోపాలునిలా జుట్టు జడలుకట్టి ఉంది. ఆ రోజే ఇక్కడకు వచ్చాడు.”
మాతృదేవి అనునయ వచనాల వలనా, ఉపదేశం వలనా ఆ యువకుడు ఒక రకంగా శాంతించాడు. నాడు ఉద్బోధన్లోనే భుజించి ఊరికి తిరిగి వెళ్లి పోయాడు. క్రమేణా మనస్సు కుదుటపడి కోలుకొన్నాడు కూడా!
జయరాంబాటి, మే 26, 1911
రామేశ్వర తీర్థయాత్రకు వెళ్లిన మాతృదేవి తిరిగి కలకత్తాకు వచ్చి, అక్కడ కొద్ది రోజులు ఉండి జయరాంబాటికి వచ్చారు. ఒక రోజు సాయంత్రం మాతృదేవి తమ పాత ఇంటి వసారాలో కూర్చొని ఉన్నారు. ఒక సన్న్యాసి గురించి నన్ను అడిగారు.
మాతృదేవి: అతడేమన్నాడు?
నేను: మూడు నాలుగు నెలలుగా మిమ్మల్ని దర్శించుకోవాలనే వ్యాకులతతో ఉన్నట్లు చెప్పాడు.
మాతృదేవి: ఇదేం చోద్యం! ఒక సన్న్యాసి మాయాబంధాల నన్నిటినీ త్రెంచి వేయాలి. బంగారు గొలుసు సైతం ఇనుప గొలుసులా ఒక సంకెలే! సన్న్యాసి మాయలో పడరాదు. ‘హా! మాతృదేవి ప్రేమ! మాతృదేవి ప్రేమ! ఆ ప్రేమ నాకు లభించలేదే!’ అంటూ సదా ఎందుకు విలపించాలి? ఇవన్నీ ఏమిటి? మగపిల్లలు నిరంతరం నా చుట్టూ తిరగడం నాకు నచ్చదు. మనిషి శరీరమే కదా! భగవంతుడనే భావన రావడం అంత సులభమా? నేను ఇరు కోవల వారినీ ఉంచుకొని ఎంత జాగ్రత్తగా మసలుకోవలసి ఉంది. ఆశు సంగతి కూడా ఇంతే. చందనం తీయాలి అదీ ఇదీ అంటూ ఏదో నెపంతో తరచూ వస్తూవుంటాడు. ఒక రోజు అతణ్ణి హెచ్చ రించాను కూడా.
నేను: వేదాంత ఆదర్శాలను అనుసరించే సన్న్యాసులు నిర్వాణ స్థితిని పొందు తారా?
మాతృదేవి: అవును. మాయా బంధాలను త్రెంచుకొని నిర్వాణ స్థితిని చేరుకొని భగవంతునిలో ఐక్యం చెందుతారు. కోర్కెల పర్యవసానమే ఈ దేహం. కోర్కె కించిత్తు అయినా ఉన్నప్పుడు మాత్రమే దేహం నిలిచివుంటుంది. కోర్కెలు ఆసాంతం నశించినప్పుడు అంతా సమసిపోతుంది.
బిడ్డలు ఇక్కడకు వస్తారు, భుజిస్తారు, సంతోషంగా ఉండి ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు. దీన్లో మాయ ఏముంది? ఒక రోజు హాజ్రా, గురుదేవులతో ఇలా అన్నాడు: ‘నరేంద్రాది యువకులను గురించి ఎందుకు మీరింతగా ఆలోచిస్తూ వుంటారు? వారి మటుకు వారు భుజించి నిద్రపోతూ సంతోషంగానే ఉంటున్నారు. భగవంతుని మీద మనస్సును లగ్నం చేయండి. మీ రెందుకు ఈ మాయలో పడతారు?’ అంతే. గురుదేవులు అతడు చెప్పినట్లే మాయనంతా ఛేదించి వేసి భగ వంతునిలో మనస్సును లగ్నం చేశారు. ఆయన గెడ్డం, శిరోజాలు కదంబ పుష్పాల సూదుల లాంటి రేకుల్లా నిటారుగా నిలిచిపోయాయి. ఎలాంటి వ్యక్తో కదా ఆయన! కాస్త ఆలోచించండి. గురుదేవులు అప్పుడు కాలకృత్యాలు తీర్చుకొంటున్నారు. రాంలాల్ ఆయన పాదాలు కూడా కడగలేకపోయాడు. ఎవరికి కాళ్లు కడగడం? ఆయన శరీరం కొయ్యలా మారిపోయింది. వెంటనే రాంలాల్ పదేపదే, ‘మీరు ఎప్పటిలా ఉండండి, ఎప్పటిలా ఉండండి’ అనసాగాడు. చివరకు ఆయన మనస్సు యథాస్థితికి వచ్చింది. అవ్యాజ కరుణ వహించి ఆయన తన మనస్సును మామూలు స్థితికి తెచ్చుకొన్నారు.
యోగేన్ అవసాన దశలో నిర్వాణ స్థితి పొందగోరాడు. గిరీష్‌బాబు అతడితో, ‘చూడు యోగేన్! నిర్వాణ స్థితిని కోరుకోవద్దు. గురుదేవులు యావత్తు ప్రపంచాన వ్యాపించివున్నారు, సూర్యచంద్రులు ఆయన నేత్రాలుగా రూపొంది ఉన్నాయని ఆలోచించవద్దు. గురుదేవులను ఎలా మనం చూశామో అలాగే తలచుకొంటూ ఆయన వద్దకు వెళ్లిపో” అని చెప్పాడు.
దేవతలే అయినప్పటికీ ఈ ఇలలో తప్పక జన్మిస్తారు. సూక్ష్మశరీరంతో తినడానికి, గుడ్డలు ధరించడానికి, మాట్లాడడానికి కుదరదు కదా! అందువల్ల ఆ స్థితిలో వారు ఎక్కువ కాలం జీవించలేరు.
నేను: తినడమూ, ధరించడమూ, మాట్లాడడమూ లేనప్పుడు వారు కాలం ఎలా గడుపుతారు?
మాతృదేవి: ఉన్న చోటనే కొయ్యబొమ్మలా యుగాల పర్యంతం ఉండిపోతారు. వస్త్రాభరణాలు అలంకరించుకొని నిలబడ్డ రాజుల శిల్పాలను నేను రామేశ్వరంలో చూశాను. వీరూ అలాగే ఉంటారు. భగవంతుడు ఇష్టపడితే వారిని అక్కడ నుండి క్రిందికి తీసుకువస్తాడు. జనలోకం, సత్యలోకం, ధ్రువలోకం లాంటి దేవలోకాలు చాలా ఉన్నాయి కదా! స్వామీజీని సప్త ఋషి మండలం నుండి తీసుకువచ్చినట్లు గురుదేవులు చెప్పేవారు. గురుదేవులది వేదవాక్కు. అది ఎన్నటికీ అసత్యం కాదు.
నేను: అలా అయితే మేం కూడా మట్టిబొమ్మలలా, కొయ్యబొమ్మలలా జీవించవలసిందేనా?
మాతృదేవి: లేదు. మీరు గురుదేవులను సేవిస్తారు. రెండు కోవలకు చెందిన భక్తులున్నారు. ఒక కోవకు చెందినవారు ఈ లోకంలో లాగానే అక్కడ కూడా భగవంతునికి సేవ చేస్తారు. మరొక కోవకు చెందినవారు యుగాల పర్యంతం ధ్యానంలో మగ్నులై ఉంటారు.
నేను: అమ్మా, నిర్వికల్ప సమాధి స్థితిని చేరుకొన్న తరువాత కూడా ఈశ్వర కోటులు తిరిగి రాగలరు. ఇతరులకు అది సాధ్యం కాదని గురుదేవులు చెప్పడంలోని అర్థం ఏమిటి?
మాతృదేవి: నిర్వికల్ప స్థితిని పొందిన తరువాత కూడా ఈశ్వరకోటులు తమ మనస్సులను కూడదీసుకొని మామూలు స్థితికి తీసుకురాగలరు.
నేను: భగవంతునిలో మగ్నమైపోయిన మనస్సును తిరిగి వెనుకకు తీసుకు రావడం సాధ్యమా? ఒక బిందెడు నీటిని చెరువులో పోసిన తరువాత, ఆ చెరువు నీటి నుండి ఆ బిందెడు నీటిని ఎలా విడదీయగలం?
మాతృదేవి: అందరూ అలా చేయలేరు. పరమహంసలు మాత్రమే చేయగలరు. పాలూ నీరూ కలిసివున్నా రాజహంస నీటిని విడదీసి, పాలు మాత్రం త్రాగగలదు.
నేను: కోర్కెల నుండి అందరూ విడివడగలరా?
మాతృదేవి: అందరూ అలా చేయగలిగితే ఇక సృష్టి ఆగిపోతుంది. అలా చేయ లేనందు వల్లనే సృష్టి కొనసాగుతూన్నది. పదేపదే జన్మిస్తూన్నారు.
నేను: గంగానదిలో శరీరాన్ని విసర్జిస్తే ఏమవుతుంది?
మాతృదేవి: కోర్కెలు సమూలంగా నశించినప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. మరి దేని వలనా ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆఖరి జన్మ అయినా కోర్కెలు పూర్తిగా నశించకపోతే ప్రయోజనం ఉండదు.
నేను: అమ్మా, అనంతమైన ఈ సృష్టిలో ఎక్కడేది జరుగుతున్నదో ఎవరికెరుక? అసంఖ్యాకాలైన నక్షత్రాలూ, గ్రహాలూ ఉన్నాయి. వాటిలో దేనిలోనైనా ప్రాణులు నివసిస్తున్నాయో లేదో అని ఎవరు చెప్పగలరు?
మాతృదేవి: ఈ మాయా ప్రపంచంలో భగవంతు డొక్కడే సర్వజ్ఞుడై ఉండ గలుగుతాడు. బహుశా ఆ గ్రహాలలోనూ నక్షత్రాలలోనూ ప్రాణులు ఉండవు.
ఈ ఏడాది వర్షాకాలంలో ఒక రోజు స్వామి శారదానంద, యోగీన్ మా తదితర భక్తులు జయరాంబాటి నుండి కామార్పుకూర్కు వెళ్లారు. అక్కడ యోగీన్ మా జారిపడి, గాయాలయ్యాయి. ఈ సంగతి మాతృదేవికి చెప్పినప్పుడు ఆమె ఎంతో బాధపడి, “బయలుదేరే ముందు, ‘యోగీన్ మనతో వస్తున్నది. వీథిలో ఆమె ఎన్ని సార్లు జారిపడుతుందో చూద్దాం’ అని గోలాప్ చెప్పింది. ఆ మాటలు నిజం చేయ డానికి యోగీన్ కిందపడిందేమో! పవిత్రురాలి వచనాలు కదా అవి! జపతపాదులు అనుష్ఠిస్తూవుంది, ఆమె మాటలు వమ్ము కావు. అందుకే సాధువులు మాట్లాడేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి” అని చెప్పారు.
ఉద్బోధన్, జనవరి 16, 1912
ఉదయం వేళ.
నేను: అమ్మా! చైతన్యదేవులు నారాయణితో, ‘నీకు కృష్ణభక్తి కలుగుగాక!’ అని ఆశీర్వదించారు. మూడు నాలుగేళ్ల ఆ బాలిక, ‘కృష్ణా! కృష్ణా!’ అంటూ నేల మీద దొర్లిందట.
అనుభూతి పొందిన తరువాత నారదునికి ఒక చీమ పట్ల కరుణ జనించింది. ‘ఎన్నో జన్మలలో అనుష్ఠించిన తపస్సు ఫలితంగా నాకు భగవదనుభూతి ప్రాప్తించింది. పాపం ఈ చీమ మానవ జన్మ పొందడానికి సుదీర్ఘకాలం వేచివుండాలి కదా!’ అని అనుకొన్నాడు. కారుణ్యంతో చీమను చూస్తూ, ‘ముక్తి పొందు’ అని ఆశీర్వదిం చాడు. మరుక్షణమే ఆ చీమ, క్రమంగా పక్షులు, మృగాలు, ఆదిగాగల జీవజాలంగా పరిణమించి చివరకు మానవ దేహం పొందింది. తదనంతరం అనేక మానవ జన్మలు ఎత్తి, ఆ జన్మల అనుభవాలను పొందుతూ క్రమంగా తపస్సు చేస్తూ భగ వంతుని ఆరాధించి ముక్తిని సైతం ప్రాప్తించుకొంది. అనేక జన్మ పరంపరలలో జరుగవలసిన ఈ పరిణామాన్ని నారదుడు ఒక్క క్షణంలో చూశాడు. అందువలన మహాత్ముల కృపాకటాక్షంతో మరుక్షణమే ముక్తిని పొందవచ్చు.
మాతృదేవి: అవును, అది నిజమే.
నేను: పరుల పాప భారాన్ని స్వీకరించడం వలన శరీరం నిలిచివుండదని విన్నాను. అనేకుల ముక్తికి సాధనంగా ఉపయోగపడే ఆ శరీరం ఒక పాపి నిమిత్తం సత్వరమే అంతరించిపోతుంది.
మాతృదేవి: అవును, వారి శక్తి తగ్గుతుంది. అనేకుల ముక్తి కోసం వినియోగ మయ్యే తపశ్శక్తి యావత్తూ ఒక్క వ్యక్తి కోసం వ్యయమైపోతుంది. ‘గిరీశ్ ఘోష్ పాపాలు స్వీకరించినందువల్లనే నాకు ఈ భౌతిక రుగ్మతలు దాపురించాయి’ అని గురుదేవులు చెప్పేవారు. కానీ ప్రస్తుతం గిరీష్ కూడా కష్టాలనుభవిస్తున్నాడు.
నేను: అమ్మా, ఒక రోజు నేనొక కలగన్నాను. సంస్కారహీనమైన జుట్టుగల ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చాడు. తన కోసం ఏదైనా చేయమని మిమ్మల్ని పట్టుబట్ట సాగాడు. ఆతడు మీ వద్ద మంత్రోపదేశం పొందాడు. కానీ ఆతడు ఎలాంటి సాధ నలూ అనుష్ఠించడు. ‘ఈతడి కోసం ఏదైనా చేశానంటే ప్రాణాలతో జీవించలేను. నా శరీరం తక్షణమే రాలిపోతుంది’ అని మీరన్నారు. ‘అతడికి మీ రెందుకు సాయపడాలి? అతణ్ణే సాధనలు అనుష్ఠించనివ్వండి’ అన్నాను నేను. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పదేపదే ప్రాథేయపడసాగాడు. చివరకు విసుగుపుట్టి మీరు అతడి ఛాతీని, మెడను స్పృశించి, ‘ఈతడికి సాయపడితే, ప్రాణాలతో జీవించలేను. నా శరీరం రాలిపోతుంది’ అని పదేపదే చెప్పసాగారు. ఇంతలో కల చెదరిపోయింది. అది సరే, అమ్మా! దేహధారణ చేస్తే శక్తి పరిమితమైపోతుందా?
మాతృదేవి: అవును నాయనా! కొందరు పదేపదే ప్రాథేయపడడం వలన విసుగుచెంది అనేక సమయాలలో, ‘ఏదో ఒక రోజు ఈ శరీరం నిశ్చయంగా నశించిపోతుంది. ఈ క్షణంలోనే నశించిపోనీ, వీడికి (ముక్తిని) ఇచ్చివేస్తాను’ అని తలచి, ఇచ్చివేశాను.
నేను: అమ్మా, భగవద్దర్శనం అంటే జ్ఞానం పొందడమేనా లేక మరేదైనానా?
మాతృదేవి: జ్ఞానం పొందడం కాక మరేమిటి? అతడికి రెండు కొమ్ములు మొలుస్తాయా?
నేను: ఇక్కడున్న భక్తులలో కొందరు భగవద్దర్శనమంటే, భగవంతుణ్ణి కళ్లారా చూడడం, ఆయనతో మాట్లాడడం అంటూ ఏదేదో చెబుతున్నారు.
మాతృదేవి: అవును. ‘గురుదేవులను చూపించండి, చూపించండి’ అంటున్నారు వారు. కానీ ఆయన ఎవరికీ గురువు కాదు. గురువు, కర్తా, బాబా (తండ్రి) – ఈ మూడు పదాలు ఆయనను ముళ్లలా గుచ్చాయి. ఎందరో ఋషులు యుగాల పర్యంతం తపస్సు చేసీ సాధించలేకపోయారు. వీరు ఎలాంటి తపస్సూ, సాధనా అనుష్ఠించరు. కానీ వెంటనే భగవంతుణ్ణి చూపించాలి. అవన్నీ నా వల్ల కాదు. ఎవరికన్నా ఆయన అలా దర్శన మిచ్చారా ఏమిటి?
నేను: కొందరు కోరతారు, వారికి లభించదు. కొందరు దానిని గురించి వ్యాకులత చెందనప్పటికీ వారికి లభిస్తుంది. దీని అర్థం ఏమిటి?
మాతృదేవి: భగవంతుడు చిన్నబిడ్డ లాంటి నైజం గలవాడు. కొందరు అర్థి స్తారు కానీ వారికి ఇవ్వడు. కొందరు కోరనప్పటికీ వారికి బలవంతంగా కట్టబెడతాడు. బహుశా వీరు గతజన్మలలో ఎన్నో సత్కర్మలు చేసి ఉంటారు. అందుకే వీరికి భగవ దనుగ్రహం కలిగి ఉంటుంది.
నేను: అలా అయితే భగవదనుగ్రహంలో కూడా పక్షపాతం ఉన్నట్లే కదా?
మాతృదేవి: లేకేం! ఉంది. ప్రారబ్ధ కర్మ ననుసరించే అది ఉంటుంది. కర్మ ఫలం తీరగానే భగవత్సాక్షాత్కారం కలుగుతుంది. అదే ఆ వ్యక్తి ఆఖరి జన్మ.
నేను: అనుభూతి పొందడానికి సాధనలు, కర్మఫలం, సముచిత తరుణం అనేవి అవసరమని నేను అంగీకరిస్తాను. కానీ భగవంతుడు మన సొంతమైనప్పుడు ఆయన ఇష్టపడితే దర్శనం ఇవ్వవచ్చు కదా!
మాతృదేవి: అది సరే. కానీ భగవంతుడు నా ‘సొంత’ మనే ప్రగాఢ విశ్వాసం ఎందరికి ఉంది? ఒకటి కాకపోతే మరొకటి అందరూ చేసే తీరాలి. అందువలన సాధనలు అనుష్ఠిస్తారు. కానీ భగవంతుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది?
నేను: మాతృప్రేమను, ఆమె సంరక్షణను పొందని బిడ్డ సొంత తల్లిని కూడా తల్లిగా గుర్తించలేదని నేనొకసారి మీతో అన్నాను.
మాతృదేవి: అవును. నువ్వు చెప్పింది నిజమే. కళ్లారా చూడని ఒకరిని ప్రేమించడం ఎలా సాధ్యం? ఇదుగో, నన్ను చూస్తున్నావు. నేను నీ తల్లిని, నువ్వు నా బిడ్డవు.
ఉద్బోధన్, ఫిబ్రవరి 1, 1912
మాతృదేవి వద్దకు వెళిన్ల ప్పుడు సమయం రాత్రి తొమ్మిదిన్నర అయివుంటుంది. ఆ రోజంతా ఆమెను చూడనే లేదు.
మాతృదేవి: ఈ రోజంతా ఎక్కడ కెళ్లావు?
నేను: కింద జమాఖర్చుల పద్దులు చూస్తూన్నాను.
మాతృదేవి: అవును ప్రకాశ్ అదే చెప్పాడు. సంసారాన్ని పరిత్యజించిన వ్యక్తికి వీటిలో అభిరుచి ఉంటుందా? ఒకసారి గురుదేవుల జీతం లెక్కలో పొరపాటు జరిగి, జీతం తక్కువ ఇచ్చారు. దాని సంగతి కోశాధికారిని అడగమని నేనన్నాను. అందుకు ఆయన, ‘ఛీ, ఛీ! లెక్క చూడడమా?’ అని అన్నారు. ఒక సందర్భంలో ఆయన నాతో, ‘భగవన్నామాన్ని ఉచ్చరించే వారికి ఎలాంటి కష్టమూ వాటిల్లదు. అలాంటప్పుడు నీ గురించి చెప్పవలసిన అవసరమేముంది?’ అని చెప్పారు. ఇవి ఆయన మాటలు. పరిత్యాగమే ఆయన భూషణం.
ఉద్బోధన్, ఫిబ్రవరి 8, 1912
పూజ గదికి పక్కన ఉత్తరంలోవున్న గదిలో ఒక చాపో, కంబళో పరచి ఉంచడం పరిపాటి. ఉదయం పూట తరచు మాతృదేవి అక్కడ కూర్చుంటారు. కొన్ని సమయాలలో అక్కడ జపం చేసుకోవడం కూడా కద్దు. నేడు కూడా మాతృ దేవి అక్కడ కూర్చొని ఉన్నారు.
నేను: అమ్మా, దక్షిణేశ్వరంలో ఎంత కాలం మీరు నివసించారు?
మాతృదేవి: చాలాకాలం నివసించాను. పదహారేళ్లప్పుడు వచ్చాను. నాటి నుండి దాదాపు అక్కడే నివసించానని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వచ్చేదాన్ని. రాంలాల్ వివాహానికి వెళ్లాను. రెండు మూడేళ్ల కొకసారి వెళ్లివచ్చే దాన్ని.
నేను: ఒంటరిగానే ఉండేవారా?
మాతృదేవి: అవును, అప్పుడప్పుడు. మా అత్తగారు ఉండేవారు. కొన్ని సమ యాలలో గోలాప్, గౌరి ప్రభృతులు నాతో ఉండేవారు. చాలా చిన్నగది. అందులోనే వంట, భోజనం, నివసించడం అన్నీ!
వృద్ధురాలైన యదు తల్లి వచ్చేది. ఆమె యౌవనంలో అవినీతి జీవితం గడిపింది. ఇప్పుడు వృద్ధురాలయింది. హరినామ జపంతో రోజులు వెళ్లదీస్తోంది. ఒంటరిగానే ఉండేది. ఆమె వస్తూవుండడం వలన ఆమెతో మాట్లాడేదాన్ని. అది చూసిగురుదేవులు, “ఆమెను ఎందుకు రానిస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “రావడంలో తప్పేముంది? మంచి విషయాలే మాట్లాడుతూన్నది కదా! సత్కార్యాలేచేస్తూవుంది” అన్నాను. వెంటనే ఆయన, “ఛీ, ఛీ! నువ్వు వెయ్యి చెప్పినా ఆమె నీతిబాహ్యురాలు. ఆమెతో మాట్లాడడమా? రామ రామ!” అన్నారు. ఆమె చెడు సాంగత్యప్రభావం నా మీద పడుతుందేమోనని ఆయన భయపడ్డారు. నా పట్ల ఆయన అంత అక్కరతో ఉండేవారు.
కామార్పుకూర్లో ఒక వ్యక్తి ఆయనను చూడడానికి వచ్చాడు. అతడు దుష్టుడు. అతడు వెళ్లిపోగానే, “ఏయ్, ఎవరక్కడ? ఆ చోటు నుండి గంపెడు మట్టిని త్రవ్విపారేయండి” అని చెప్పారు. ఎవరూ రాకపోయేసరికి స్వయంగా ఆయనే ఒక గునపాన్ని పుచ్చుకొని ఆ వ్యక్తి కూర్చున్న చోట కొంత మట్టిని త్రవ్వి పారేసినతరువాతే శాంతించారు. “అటువంటి వ్యక్తులు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మట్టి కూడా అపవిత్రమైపోతుంది” అని చెప్పారు.
తూర్పు వంగదేశ వాస్తవ్యుడైన దుర్గాచరణ్ వచ్చేవారు. గురుదేవుల పట్ల ఆయన కెంత భక్తిప్రపత్తులు!
ఆ రోజుల్లో ప్రజలు గొప్ప భక్తులుగా ఉండేవారు. ప్రస్తుతం వచ్చేవారందరూ, ‘భగవంతుణ్ణి చూపించండి, భగవంతుణ్ణి చూపించండి’ అనే అడుగుతున్నారు.సాధనలు అనుష్ఠించరు. నిష్ఠ లేదు. జపతపాదులు ఏవీ లేవు. పూర్వజన్మలోగోహత్య, బ్రహ్మహత్య లాంటి ఎన్ని ఘాతుకాలు చేశారో దేవుడికే ఎరుక! ఆప్రారబ్ధమంతా మెల్లమెల్లగా క్షీణించిన తరువాతే కదా ఏదైనా జరుగుతుంది.చంద్రుణ్ణి మేఘాలు కప్పివేశాయనుకొందాం. గాలి వీచి క్రమంగా మేఘాలనుతొలగించివేసినప్పుడే కదా చంద్రుడు కనిపిస్తాడు. కళ్లు మూసి తెరిచేలోపు మేఘాలుమాయమైపోతాయా? ఆధ్యాత్మిక జీవితం సంగతీ అంతే!
కర్మఫలం క్రమక్రమంగానే తగ్గుతుంది. భగవదనుభూతి పొందినప్పుడుభగవంతుడు మనలో చైతన్య ప్రకాశాన్ని కలిగిస్తాడు. దీనిని అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు.
ఫిబ్రవరి 9, 1912
గత రాత్రి గిరీష్‌చంద్ర ఘోష్ పరమపదించాడు. ఆయన గురించి మాట్లాడ సాగాను.
నేను: అమ్మా, స్పృహలేని స్థితిలో మరణించిన వారికి సద్గతి ప్రాప్తిస్తుందా?
మాతృదేవి: స్పృహలేని స్థితి కలగడానికి మునుపు నెలకొనివున్న ఆలోచన మేరకు మరణానంతర గతి ప్రాప్తిస్తుంది.
నేను: అవును. సాయంత్రం ఆరు గంటలు దాటాక గిరీష్ ‘జై రామకృష్ణ’ అన్న తరువాత స్పృహ కోల్పోయారు. అంతకు కాస్త మునుపు పదేపదే, “వెళదాం, వెళదాం* … నాయనా! నన్ను కాస్త పట్టుకో” అన్నారు. అప్పుడు నేను, “వెళదాం రండని మాత్రమే ఎందుకు అంటున్నారు? గురుదేవుల పవిత్ర నామాన్ని ఉచ్చరించండి, అది మీ కెంతో శ్రేయస్కరం” అని చెప్పాను. అందుకు ఆయన “అది నాకు తెలి యదా?” అన్నారు. ‘ఆహా! ఈయనకు స్పృహ తప్పలేదు’ అని అనుకొన్నాను.
మాతృదేవి: స్పృహ తప్పినప్పుడు ఏ ఆలోచన ప్రధానంగా ఉందో దాన్లో మగ్నుడై ఉండాలనిపిస్తుంది. గురుదేవుల నుండే వారు (ఆయన శిష్యులు) వచ్చారు, ఆయన వద్దకే తిరిగి వెళతారు. కొందరు ఆయన చేతుల నుండి, కొందరు ఆయన పాదాల నుండి, కొందరు ఆయన వెంట్రుకల నుండి వచ్చివున్నారు. అందరూ ఆయన అంగాలు, ఆయన అంశలే!
ఉద్బోధన్, ఫిబ్రవరి 12, 1912
ఉదయం ఏడు గంటలయివుంటుంది. మాతృదేవి తమ మంచానికి పక్కన నేల మీద కూర్చొని ఉన్నారు. ద్వారకకు తీర్థయాత్రకు వెళ్లిన స్వామి నిర్భయానంద, గిర్నార్ కొండల మీద వెలసిన దత్తాత్రేయ ఆలయ ప్రసాదాన్ని మాతృదేవికి పంపించారు.
మాతృదేవి: దత్తాత్రేయులు ఎవరు?
నేను: జడభరతాదుల లాంటి ఒక గొప్ప మహర్షి. ఒక ఈశ్వరకోటి.
మాతృదేవి: గురుదేవుల శిష్యులలాంటి వ్యక్తా?
నేను: అవును. కానీ అమ్మా, ఈశ్వరకోటులలో కొందరు భార్య, పిల్లలూ అంటూ సంసారంలో ఎందుకు మునిగి ఉంటారు?
మాతృదేవి: అవును, వాళ్లక్కడ మగ్గిపోతున్నారు. పూర్ణునికి బలవంతంగా వివాహం చేశారు. ‘నువ్వు ఆయన (శ్రీరామకృష్ణుల) వద్దకు వెళితే, ఆయన కలకత్తాకు వస్తున్నప్పుడు ఆయన బండిని రాళ్లురప్పలు రువ్వి ధ్వంసం చేస్తాం’ అంటూ బెదిరించారు.
నేను: సరే, వివాహం చేసివుండవచ్చు. నాగమహాశయులు కూడా వివాహం చేసుకొన్నారు. కానీ బిడ్డాపాపలంటూ సంసారంలో కూరుకుపోవడం…
మాతృదేవి: బహుశా కోర్కె ఉండివుండవచ్చు. అసలు విషయం ఏమిటో తెలుసా? ఈ సృష్టి ఎంతో సంశ్లిష్టతలతో కూడుకొన్నది. ఈతడి మూలంగా ఇది, ఆతడి మూలంగా అది అంటూ భగవంతుడు ఎన్నో చేస్తాడు. హా, ఆయన కార్యకలా పాలు దురవగ్రాహ్యం.
కాసేపటి తరువాత, “వారు సంసారంలో ఉన్నప్పటికీ ఈశ్వరకోటులుగా మనగలగవచ్చు. అందులో తప్పేముంది?” అన్నారు మాతృదేవి.
రాధూకు ఒంట్లో బాగాలేదు, జ్వరం, ఒళ్లు నొప్పులు. దాంతో మాతృదేవి కాస్త కలత చెందారు. “నేను బ్రతికి ఉండగా ఆమెకు నయం కాదు. నేను పోయాక ఆమెను ఎవరు చూసుకొంటారు? ఆమె తట్టుకోగలదా?” అని అన్నారు.
నేను: రోజంతా ఏం భక్త సమూహం! ఒక్క క్షణం కూడా మీకు తీరిక దొరకడం లేదు.
మాతృదేవి: రేయింబవళ్లు నేను గురుదేవులతో, ‘ఈ రద్దీని తగ్గించండి. కాస్త విశ్రాంతి తీసుకొంటాను’ అని చెబుతూనే ఉన్నాను. కానీ ఎక్కడ విశ్రాంతి? నేను ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు గురుదేవుల సందేశం నలువైపులా వ్యాపించింది. అందుకే ఇంత జన సమూహం. బెంగుళూరులో ఏం జనసమూహం! నేను రైలు దిగి వెళుతున్న దారి పొడవునా పుష్పవృష్టి కురిసింది. వీథిలో అంతా పువ్వులు రాశులుగా పడివున్నాయి. గురుదేవుల అవసాన కాలంలో జనం తీర్థప్రజలా వచ్చేవారు. వచ్చిన వారందరితో, ‘మీ కులగురువు వద్ద మంత్రోపదేశం పొందండి. మీ నుంచి వారు ఏదో ఆశిస్తూవుంటారు. నేను ఏదీ ఆశించను’ అని నేను పరిపరి విధాల నచ్చ చెప్పేదానను. కానీ వాళ్లు నన్ను వదలిపెట్టరు. వారు విలపిస్తారు. దాంతో నా హృదయం ద్రవించిపోయేది. సరే, నా రోజులు దగ్గరపడ్డాయి. బ్రతికే ఈ కొద్ది రోజులూ ఈ విధంగానే గడిపివేస్తాను.
నేను: లేదమ్మా! ఎందుకు అలా అంటున్నారు? మీరు ఆరోగ్యంగానే ఉన్నారు. ప్రత్యేకించి ఎలాంటి రుగ్మతా లేదు. ఎందుకు పోవాలనుకొంటున్నారు? మళ్లీ ఎన్నడూ అలా అనకండి.
ఆ కొద్ది రోజులు మాతృదేవి ఎంతో విచారంగానూ, నిర్లిప్తంగానూ ఉన్నట్లు కనిపించారు.
గోలాప్మా క్రింద ఎవరితోనో వాదిస్తూన్నారు. అది విని మాతృదేవి, “అక్కడ ఏ జరుగుతున్నది?” అని అడిగారు.
నేను: గోలాప్ మా ఎవరినో చీవాట్లు పెడుతున్నారు.
మాతృదేవి: అంత బిగ్గరగా అరవడం మంచిది కాదు. ప్రతి దాన్లోనూ సదాలోపాలు చూస్తూండడం కోరి దుఃఖాన్నే తెచ్చుకోవడమే అవుతుంది. ‘నిజమే చెబుతున్నాను, నిజమే చెబుతున్నాను’ అంటూ గోలాప్ సౌజన్యాన్నే కోల్పోతున్నది. ఏంజరిగినా సౌజన్యాన్ని నేను వదలుకోలేను. అప్రియమైన నిజాన్ని సైతం చెప్పరాదంటారు.
మరొక సందర్భంలో కూడా గోలాప్ మా ఎవరితోనో వారి మనస్సు నొచ్చుకొనేలా ఏదో చెప్పారు. ఆమె చెప్పింది నిజమే. అది విని మాతృదేవి, “ఏమిటిదిగోలాప్? నీ స్వభావం ఎందుకిలా మారిపోయింది?” అని వ్యాఖ్యానించారు.
మధ్యాహ్నం ఒక పిచ్చివాడు వచ్చి గందరగోళం చేశాడు. ఆ విషయం ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు: “నా ఉనికిని ఇతరులు ఎరుగకుండా ఉండేలా గురుదేవులు చూసుకొన్నారు. నా పట్ల అమిత శ్రద్ధ వహించారు. కానీ ఇప్పుడల్లా వీథిలోకెళ్లి తప్పెట్లు వాయిస్తూ జనాన్ని సమీకరిస్తూన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికంతటికీ ‘మ’ యే మూలకారణం. ఆయన ‘శ్రీరామకృష్ణ కథామృతాన్ని’ ప్రచురించడమేమో ప్రచురించారు. కానీ చదివే వాళ్లకు తలాతోకా అర్థం కాలేదు. గిరీష్బాబుగురుదేవులను ఎలా బలవంతపెట్టాడో, ఎలా తిట్టేవాడో వాటినన్నీ వీరూ నా పట్లచేయగోరుతున్నారు.
ఇక్కడ మాత్రమే మంత్రదీక్ష పుచ్చుకోవాలా ఏమిటి? బేలూరు మఠంలో నా బిడ్డలున్నారు. వారి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోవచ్చు కదా! వారికి శక్తి లేదా ఏమిటి?ప్రతి ఒక్కరినీ నా వద్దకే పంపిస్తున్నారు. కులగురువును త్రోసిరాజంటే మహాపాపంచుట్టుకొంటుందని ఎంతో చెప్పిచూశాను. అయినా నన్ను వదలిపెట్టడం లేదు.
నేను: మీకు అభిలాష ఉండబట్టే భక్తులకు మంత్రదీక్ష ఇస్తున్నారు.
మాతృదేవి: కారుణ్యంతో ఇస్తున్నాను. వదలిపెట్టరు, పైగా విలపిస్తారు.హృదయం ద్రవించిపోయి, దీక్ష ఇచ్చేస్తాను. లేకుంటే నా కొచ్చే లాభమేమిటి?మంత్రదీక్ష ఇస్తున్నప్పుడు వారి పాపాలను స్వీకరించవలసి వస్తోంది. ‘సరే, ఎలాగూ నశించిపోయే శరీరమే కదా! వారికి మంచి జరుగనీ’ అని అనుకొంటాను.
ఉద్బోధన్, ఏప్రిల్ 24, 1912
మధ్యాహ్నం రెండు గంటలయివుంటుంది. భోజనానంతరం తమలపాకు చిలకలు తీసుకురావడానికి పైకి వెళ్లాను. అప్పుడు మాతృదేవి ఇలా అంటున్నారు:
స్వకీయ భావాన్ని విడనాడడం ఒక వ్యక్తి చేతిలో లేదు
నైజాన్ని వీడి భగవంతుణ్ణి అన్వేషించే వాడెవడో
ఆతడి పాదాలకు నేను నమస్కరిస్తాను.
నేను: అమ్మా! దీనికి అర్థం ఏమిటి?
మాతృదేవి: మనిషి తన నైజాన్ని వదలలేడు. ‘తన స్వభావాన్ని వదలి భగవంతుణ్ణి ఎవరు ఆరాధిస్తారో వారికి నేను నమస్కరిస్తాను’ అని చైతన్యదేవులు వచించారు.
నేను: స్వభావాన్ని మార్చుకోవలసిందేనని నాడు జయరాంబాటిలో మీరన్నారు కదా! ‘కొందరి స్వభావం చూస్తే వారిని ప్రేమించాలని తోస్తుంది. కొందరిని చూస్తే వైదొలగిపోవాలని అనిపిస్తుంది’ అని కూడా మరో సందర్భంలో అన్నారు.
మాతృదేవి: నిజమే నాయనా! గుణాల వల్లనే అన్నీ అమరుతాయి. మరొకటి ఏముంది?
నేను: గోలాప్ మా గురించి శరత్ మహరాజ్, ‘కొబ్బరి బొండాం ఇస్తే కూడా ఇల్లంతా డప్పు కొట్టే ఇస్తారు’ అని అన్నారు.
మాతృదేవి: నిజం. వీరి స్వభావం ఎలా అయిపోయింది! చిన్న విషయాలలో కూడా ఆర్భాటం సృష్టిస్తారు. యోగీన్ తొలుత ప్రశాంతంగా, గంభీర ముద్ర వహించి ఉండేది. ప్రస్తుతం బాగా మారిపోయింది. నాయనా, సహనం ఒక గొప్ప సుగుణం. దీనిని మించిన గుణం మరొకటి లేదు.
నాకు బాగా తలనొప్పిగా ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు మేడ మీదకు వెళ్లి మాతృదేవితో, “అమ్మా, తలనొప్పితో ప్రాణం పోతున్నది” అని చెప్పాను. “వేడి చేసి ఉంటుంది” అంటూ గబగబా లోపలకు వెళ్లారు మాతృదేవి. ఒక ఆకు మీద కాస్త నెయ్యి, కర్పూరం వేసి లేహ్యంలా చేసి నా నుదుటికి సుతిమెత్తగా మర్దించారు. “తలనొప్పిగా ఉన్నప్పుడల్లా గురుదేవులు ఈ మందునే వాడేవారు” అన్నారామె. కొద్ది నిమిషాలలోనే తలనొప్పి కాస్త తగ్గింది. నేను కిందికి వెళ్లిపోయాను. కాసేపటికి తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే మాతృదేవి వద్దకెళ్లి, “తలనొప్పి తగ్గి పోయిందమ్మా” అని చెప్పాను.
పోలెండ్ నుండి ఒక స్త్రీ వేదాంతాధ్యయనం నిమిత్తం భారదేశానికి వచ్చింది. కలకత్తాలో మాతృదేవిని గురించి విని ఆమె దర్శనార్థం వచ్చింది. మాతృదేవితో మాట్లాడుతున్నప్పుడు బహాయ్ మతశాఖ గురించి ప్రస్తాపిస్తూ, “అది కూడా శ్రీరామ కృష్ణుల బోధనల లాంటిదే! ఆ మతశాఖ కూడా సర్వధర్మ సమన్వయాన్ని ప్రచారం చేస్తుంది” అని చెప్పింది. ఆమె మాటలను బట్టి ఆమె ఆ మతశాఖకు చెందివుంటుం దనిపించింది.
ఆమె వెళ్లిపోయిన తరువాత, “అమ్మా, ఆ స్త్రీ ఎటువంటి వ్యక్తి?” అని మాతృదేవిని అడిగాను.
మాతృదేవి: మంచి మనిషి.
నేను: వీరు సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. పోలెండ్ ప్రాంతం రష్యాకు చెందింది. రష్యా, జపాన్ల మధ్య యుద్ధం జరిగింది కదా! ఆ రష్యాయే.
మాతృదేవి: రష్యా ప్రజలు? యుద్ధాన్ని అపేక్షించే జాతి వారిది. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వస్తున్నారు. శ్రీలంకలో కూడా ఈమె మూడు నెలలు ఉండివచ్చిందట.
నేను: ఇప్పుడు సమస్తం నలుదిక్కులా వ్యాపించిపోయింది. పోలెండ్ ఎక్కడ? ఉద్బోధన్ కార్యాలయం ఎక్కడ? మీకు ఇదంతా తెలియదు.
మాతృదేవి: ఒక రోజు గురుదేవులు భావసమాధిలో, ‘కాలాంతరంలో ప్రతి ఇంటా నన్ను ఆరాధిస్తారు. అసంఖ్యాక భక్తులు నన్ను స్వీకరిస్తారు’ అని చెప్పారు. నివేదిత కూడా, ‘అమ్మా, మేం వంగదేశీయులమే. కర్మఫలం కారణంగా మేం పాశ్చాత్య ప్రాంతంలో జన్మించాం. మేము కూడా నూటికి నూరుపాళ్లు వంగదేశీయు లుగా రూపొందడం మీరు చూడనున్నారు’ అని ఒక సందర్భంలో చెప్పింది. ఇదే వారి (నివేదితాదులకు) ఆఖరి జన్మ.
ఉద్బోధన్, 1912
ఉదయం ఏడు గంటలయివుంటుంది. మాతృదేవి పూజామందిరంలో కూర్చుని ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సురేంద్ర చక్రవర్తి, భార్యతో కూడా మాతృ దేవిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆ తరువాత ఒక రోజు ఒంటరిగా వచ్చాడు. అప్పుడు మాతృదేవిని, “అమ్మా! నా భార్యను గురించి ఏమనుకొంటు న్నారు?’ అని అడిగాడు. అందుకు మాతృదేవి, “ఉత్తమురాలే కదా” అని జవాబిచ్చారు.
సురేంద్రబాబు: కానీ నా కేమిటో ఆమె నచ్చలేదు.
మాతృదేవి: ఇలా చెప్పడం మీ కందరికీ ఇప్పుడు అలవాటయిపోయింది.
సురేంద్రబాబు: పోనీలేండమ్మా! మాకు గురుదేవుల దర్శనం లభించలేదే!
మాతృదేవి: లభించకపోదులే! మీ కందరికీ ఇది ఆఖరి జన్మ. ‘అమ్మా, మేం కూడా వంగదేశీయులమే. కర్మఫలం వలన క్రైస్తవులుగా జన్మించాం’ అని నివేదిత చెప్పింది. ఆమెకు కూడా ఇదే చివరి జన్మ.
మాతృదేవి ఈ విధంగా పలువురితో, ‘ఇదే మీ ఆఖరి జన్మ’ అని చెప్పడం కద్దు. ఈ విషయం గురించి మాట్లాడసాగాను.
నేను: అమ్మా, ఆఖరి జన్మ అని మీరంటున్నారు. దానికి అర్థం ఏమిటి?
మాతృదేవి: ఆఖరి జన్మ అంటే ఇక వారికి రాకపోకలుండవు. ఈ జన్మతోనే అది పరిసమాప్తమవుతుంది.
నేను: వీరిలో పలువురికి ఇంకా భార్య బిడ్డలు సంసారం అనే కోర్కెలు ఉండడం చూస్తున్నాం కదా! కోర్కెలు అంతరించనంత దాకా రాకపోకలు ఎలా ముగుస్తాయి?
మాతృదేవి: గురుదేవులు ఎవరి గురించి ఏం చెప్పారో, అది జరిగి తీరుతుంది.అవెన్నటికీ అసత్యం కాబోవు. కోర్కెలు ఉండవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఆయన ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా! చివరకు కోర్కెలన్నీ అడుగంటిపోతాయి. ఆయనకు అది తెలుసు.
నేను: అలా అయితే ఆఖరి జన్మ అనేది నిర్వాణ స్థితా?
మాతృదేవి: అవును. బహుశా మరణ సమయంలో కూడా కోర్కెలన్నీసమసిపోవచ్చు.
నేను: గురుదేవులు అనేకులను, ‘నాకు చెందినవారు’ అని పేర్కొన్నారు. దీని అర్థం ఏమిటి?
మాతృదేవి: కొందరు శరీరం నుండి, మరికొందరు వెంట్రుకల నుండి, కొందరు కాళ్లు చేతుల నుండి ఉద్భవించినట్లూ, వారు తమ అంతరంగ భక్తులనీగురుదేవులు చెప్పేవారు.
ఒక రాజు ఎక్కడికైనా వెళితే పరివారం కూడా ఆయనను అనుసరించి వెళు తుంది కదా! ఇదీ అలాగే. నేను జయరాంబాటికి వెళ్లేటప్పుడు, నా వెంట ఉన్నవారంతా నాతో పాటు రారా ఏమిటి? అలాగే ఆయనకు చెందిన వారు కూడా.ఆయన ప్రతి యుగంలోనూ ఏతెంచేటప్పుడు ఆయనతోపాటు కొందరు వస్తారు. ‘నాకు చెందిన వారు నా ఆవేదనతోపాటు తామూ ఆవేదనను అనుభవిస్తారు’ అనేవారు గురుదేవులు. తమ యువశిష్యులను ఉద్దేశించి, ‘వీరంతా నా ఆనందంలో ఆనందిస్తారు, దుఃఖంలో దుఃఖాన్ని అనుభవిస్తారు, ఆవేదనలో ఆవేదన చెందుతారు’ అనేవారు ఆయన. ఆయన వచ్చినప్పుడు వీళ్లూ హాజరవుతారు, నరేంద్రుణ్ణి సప్తఋషుల నుండి తీసుకువచ్చారు.* దక్షిణేశ్వర కాళికాలయంలో ధ్యానమగ్నులై ఉన్నప్పుడు ఒక దివ్యదర్శనంలో కాళికాదేవి వెనుక నిలబడివున్న శంభుమల్లిక్ను చూశారు. బలరాంబాబును కూడా అచ్చం ఇప్పుడు ఉన్నట్లే చూసివున్నారు; ఆయనను ప్రప్రథమంగా చూడగానే గురుదేవులు, ‘తలపాగాతో మంచి మేనిఛాయతో ఇలాగే చూశాను’ అని అన్నారు. సురేన్ మిత్రాను తమ పోషక బాధ్యతను వహించబోయే వారిలో ఒకడిగా గుర్తించారు.*
ఒక రోజు గురుదేవులు నాతో, ‘వారు కాళీమాతకు నైవేద్యం చేయకుండా ఎందుకు నా ఛాయాచిత్రానికి నైవేద్య మిచ్చారు?’ అని అడిగారు. ఆ మాటలు ఏదైనా అశుభ సూచకమేమోనని భయపడిపోయాం. అప్పుడు గురుదేవులు, ‘కలత చెంద వద్దు. కాలాంతరంలో ప్రతి ఇంటా నన్ను ఆరాధిస్తారు. తల్లి తోడుగా చెబుతున్నాను, తండ్రి తోడుగా చెబుతున్నాను – ఇది సత్యం’ అని చెప్పారు.
ఆయన ఇలా నొక్కివక్కాణించింది ఎవరి కోసం? నాకూ, లక్ష్మికీ మాత్రమా? అప్పుడు మేం చిన్నవారం. మాకు ఇదంతా ఏం అర్థమయివుంటుంది?
ఇప్పుడల్లా ప్రతి వారి చేతిలోను గురుదేవుల ఛాయాచిత్రం ఉంది. ‘మ’ గారు ఏమన్నా తక్కువా? గురుదేవులు చెప్పిన వన్నిటినీ ముద్రించారు. ఏ అవతార పురుషునిదన్నా ఛాయాచిత్రం ఉందా? ఏ అవతారపురుషుని వచనాలన్నీ ఈ రీతిలో నమోదైనాయా?
నేను: తాము పదిలపరచుకొన్న విషయాలనన్నీ ప్రచురిస్తే శ్రీరామకృష్ణ కథా మృతం పది పన్నెండు సంపుటాలు అవుతుందని ‘మ’ గారు చెప్పారు. అవన్నీ ఎప్పుడు ప్రచురణకు నోచుకొంటాయో దేవునికే ఎరుక!
మాతృదేవి: నిజం. ఆయన కూడా పెద్దవారయ్యారు. ఆయన జీవించి ఉండ గానే అన్ని సంపుటాలూ వెలువడతాయో లేదో?
నేను: అమ్మా, గురుదేవులు పాశ్చాత్య దేశంలో ఒకసారి అవతరిస్తారని మీరు చెప్పారు కదా!
మాతృదేవి: లేదు, అలా కాదు. తెల్లవారు అనేకులు ఆయనకు భక్తులవుతారని చెప్పాను. ఇప్పుడే ఎందరో క్రైస్తవులు వస్తున్నారు కదా! వంద సంవత్సరాల తరు వాత తాము మళ్లీ అవతరించనున్నట్లు ఆయన చెప్పడం కద్దు. ఈ నూరు సంవత్స రాలూ ఆయన భక్తుల హృదయాలలో జీవిస్తారు. ఆయన గదిలోని అర్ధచంద్రాకార వసారాలో నిలబడి ఉత్తర దిక్కును చూపుతూ అలా అన్నారు. అప్పుడు నేను, ‘ఇక నేను రాలేను’ అన్నాను. లక్ష్మి కూడా, ‘నన్ను ముక్కలు ముక్కలుగా చేసినా రాను’ అని చెప్పింది. అందుకు గురుదేవులు నవ్వుతూ, ‘రాకుండా ఎక్కడకు వెళతారు? ఆకుపచ్చని పాచి ఉంది కదా! దానిని ఒక వైపుకు తోస్తే చాలు, అంతా కలిసి వచ్చేస్తుంది’ అన్నారు.
ఈ విధంగా ఆయన ఎందుకు చెప్పాలి? ‘మామిడి పండు తినడానికి వచ్చావు. తిని వెళ్లు. ఆకులను లెక్కించడంలో ప్రయోజన మేమిటి?’ అని ఆయన వ్యాఖ్యానించేవారు.
నేను: కానీ, అమ్మా! ప్రత్యక్ష దర్శనానుభూతి పొందకపోతే ప్రయోజనమేమిటి? నేను ఒక మహమ్మదీయ ఫకీర్‌ను, ‘చేపలు పట్టడానికి గాలంతో ఒక చెరువు వద్దో నదీతీరంలోనే కూర్చుంటాం గాని బురదనీటి వద్ద కాదు కదా! ఏదో ఒక సూచన మేరకు మీరు సాధువు అయినారా?’ అని అడిగాను.
మాతృదేవి: అందుకు ఆయన ఏమన్నాడు?
నేను: ఏం చెప్పగలడు?
మాతృదేవి (ఒకింతసేపు యోచించి) : బాగా చెప్పావు. అది నిజం. ఇటువంటి అనుభూతే పొందకుంటే ప్రయోజనం ఏమిటి? కానీ విశ్వాసం వహించి పురోగ మించాలి.
నేను: ‘పక్క గదిలో బంగారు రాశులు ఉన్నాయని తెలిసిన దొంగ ఊరకే ఉండ గలడా? ఆ బంగారాన్ని ఎలా కాజేయాలని రేయింబవళ్లూ ఆలోచిస్తూవుంటాడు. అదే విధంగా భగవంతుడనే వాడు ఒకడున్నాడని కచ్చితంగా గ్రహించిన వ్యక్తి లౌకిక జీవనం సాగిస్తాడా’ అని స్వామీజీ చెప్పినట్లు శరత్ మహరాజ్ ఆ రోజు చెప్పారు.
మాతృదేవి: అవును, నిజమే.
శిష్యుడు: అమ్మా, త్యాగవైరాగ్యాలే కదా ముఖ్యం. అవి మాకు ప్రాప్తిస్తాయా?
మాతృదేవి: ఎందుకు లభించవు? గురుదేవులను శరణుజొచ్చితే అన్నీ లభిస్తాయి. పరిత్యాగమే ఆయన సంపత్తి. ఆయన తమ సర్వస్వాన్ని పరిత్యజించినందు వల్లనే మన మందరమూ ఆయన పేరు చెప్పుకొని ఇలా తింటూ తిరుగుతున్నాం. ఆయన ఎంత పరిపూర్ణ త్యాగి. వీరందరూ అలాగే ఉంటారని ప్రజలందరూ భావిస్తు న్నారు.
ఇంతలో ఒక భక్తుడు మాతృదేవికి ప్రణమిల్లడానికి వచ్చాడు. ప్రణమిల్లి అతడు వెళ్లిపోయిన తరువాత, “హరీశ్ పట్ల ఆప్యాయంగా వ్యవహరించి అనుభవిం చింది చాలు. అందుకే ఇప్పుడు ఎవరితోనూ నా భావనలను వ్యక్తం చేయడం లేదు” అని అన్నారు మాతృదేవి.
ఉద్బోధన్, మే 1, 1912
మాతృదేవికి వచ్చిన ఉత్తరాలు చదివి వినిపించడానికి మేడ మీదికి వెళ్లాను. అప్పుడు మాతృదేవి తమ గదిలో కూర్చుని ఉన్నారు. నేను పూజామందిరం నుండే ఆమెను ఏదో అడిగాను. అందుకు మాతృదేవి, “ఇక్కడకు వచ్చి అడుగు” అన్నారు. నేను వెళ్లి కూర్చున్నాను.
నేను: ఒక భక్తుని కుమార్తె తన అత్తగారి ఇంటి నుండి, తమ దర్శనం కోరుతూ ఉత్తరం వ్రాసింది. తమకు నమస్కారాలు తెలిపింది. తన అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని చూడగోరుతున్నట్లు వ్రాసింది.
మాతృదేవి: అలా అయితే ఆమెకు జవాబు వ్రాయకు. అత్తగారి ఇంట్లో తెలియ కూడదట! ఇటువంటి దాగుడుమూతలు ఏవీ నాకు తెలియవు. జయరాంబాటిలో యోగీంద్రుడనే తపాలా మనిషి నాకు ఉత్తరాలు వ్రాసిపెట్టేవాడు. ‘మా ఉత్తరాలు తపాలా మనిషా చదువుతాడు?’ అని పలువురు ఆక్షేపించేవారు. తమ ఉత్తరా లను వచ్చిపోయేవారు చదవడం వారికి ఇష్టం లేదు. నేనేం చేయను? నాలో కాపట్యం లేదు. నా ఉత్తరాలను ఎవరైనా చూడవచ్చు.
మాతృదేవి జయరాంబాటికి ఎప్పుడు వస్తారని అడుగుతూ ఒక భక్తుడు వ్రాశాడు. “కార్తీక మాసంలో జగద్ధాత్రి పూజాసమయంలో వస్తారని వ్రాయ మంటారా?” అని అడిగాను.
మాతృదేవి: వద్దు, వద్దు. నిశ్చయంగా ఎలా చెప్పగలం? ఎప్పుడు ఎక్కడ ఉంటాననే విషయాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇదిగో ఇప్పుడున్నాడు, రేపు లేకుండా పోతున్నాడు.
నేను: అమ్మా, ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీరు ఉన్నందు వల్లనే అనేకులు వస్తున్నారు, మనశ్శాంతి పొందుతున్నారు.
మాతృదేవి: అవును, అది నిజమే.
నేను: మా కోసం మీరుండాలి.
ఈ మాటలు విని మాతృదేవి ఉద్విగ్నులై సరిగా మాట్లాడలేకపోయారు. కరుణ ఉట్టిపడే స్వరంలో ఇలా అన్నారు:
“ఆహా, వీరంతా నా పట్ల ఎంత ప్రేమాభిమానాలతో ఉంటున్నారు! నేనూ వారిని అలాగే ప్రేమిస్తాను.”
మాతృదేవి కళ్లు ఆర్ద్రమైనాయి. ఆమెకు విసురుతున్నాను. ప్రేమస్వరూపిణియైన మాతృదేవి ఇలా అన్నారు:
“నాయనా! నిన్ను దీవిస్తున్నాను. చల్లగా ఉండు. నీకు భక్తి కలుగుగాక, మనశ్శాంతి లభించుగాక; మనశ్శాంతియే ప్రధానం. కావాల్సింది మనశ్శాంతియే!”
నేను: అమ్మా! గురుదేవులను ఎందుకు చూడలేకపోతున్నాననే ఆలోచన నన్ను సదా తొలచివేస్తూన్నది. ఆయన మన సొంతమే అయితే ఎందుకు రావడంలేదు? ఆయన తలచుకొంటే రాలేరా ఏమిటి?
మాతృదేవి: నిజమే నాయనా! నువ్వు ఇంత ప్రయాసపడుతున్నా ఆయన ఎందువలన రాలేదు? ఎవరికి తెలుసు?
ఒకసారి బలరాం భార్యకు జబ్బు చేసింది. “వెళ్లి ఆమెను పలుకరించి రా” అని గురుదేవులు చెప్పారు. “ఎలా వెళ్లగలను, బండి లేదు కదా!” అన్నాను నేను. వెంటనే ఆయన, “ఏమిటి? నడచి ఎందుకు వెళ్లకూడదు? నడిచి వెళ్లి ఆమెను చూసిరా” అన్నారు. చివరకు ఒక పల్లకీలో దక్షిణేశ్వరం నుండి కలకత్తాకు బయలు దేరాను. రెండుసార్లు ఆమెను చూసి వచ్చాను. మరొక సందర్భంలో రాత్రివేళ కాలి నడకనే వెళ్లాను. ఆ రోజు బలరాంబాబు మనుమడు చనిపోయాడు. కష్టకాలంలో భగవంతుడు చేయూతనివ్వకపోతే, దర్శకమివ్వకపోతే మనిషి ఎక్కడికిపోతాడు?
నేను: దేహంలో జీవించి ఉన్నంత దాకా యాతనలూ, దుఃఖాలూ అనివార్యం. యాతనలను తొలగించమని నేను ఎన్నడూ ప్రార్థించింది లేదు. కానీ దుఃఖంలో మునిగివున్నప్పుడు అనునయించరాదా?
మాతృదేవి: అది నిజమే నాయనా! రాముని ఏకైక కుమారుడు (బలరాంబాబు మనుమడు) చనిపోయాడు. రాముని భార్యా, తల్లీ ఇక్కడకు వచ్చారు. ఏదో ఒకింత మనశ్శాంతి పొందారు.
నాడు వాళ్లు వెళ్లిపోయిన తరువాత మాతృదేవి నాతో, “కడుపు చీల్చుకొని పుట్టే బిడ్డ! రక్తమాంసభూయిష్ఠమైన శరీరం నుండి బయటకు వస్తున్నది. అందువల్లనే ఇంత మాయ! స్త్రీలకు ఎంత కష్టం! మాయ ఎప్పుడు వైదొలగుతుందో!
“వీటినంతా గురుదేవులకు విన్నవిస్తాను. అందుకు ఆయన, ‘నాకు లక్షలాది మంది ఉన్నారు. తోక వైపో, వీపు గుండానో ఎక్కడ కావాల్సివస్తే (గొర్రెను) అక్కడ నరుకుతాను, చంపుతాను’ అంటారు.”
నేను: మన కష్టాలను ఆయన గమనించరా?
మాతృదేవి: నీలాంటి వారు ఆయనకు ఎంతమందో ఉన్నారు. ‘ఇది చైతన్య మయ ఆనంద సాగరం. దీన్లో ఎన్నెన్నో అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి, పడి పోతున్నాయి. దీనికి అంతమే లేదు’ అని ఆయన చెప్పేవారు.
నేను: మామూలు మనిషి సంతోషంగా ఉంటున్నాడు. కానీ ఒకింత చైతన్యం కలిగి భగవత్సాక్షాత్కారం పొందగోరే వారు, ఆయన దర్శనం కాకపోతే ఎంతతల్లడిల్లిపోతారో అనుభవించిన వ్యక్తికే ఎరుక!
మాతృదేవి: ఆహా, నిజమే నాయనా! సామాన్యులు బాగానే ఉంటున్నారు.తింటూ, నిద్రిస్తూ ఆనందంగానే కాలం గడుపుతున్నారు. కష్టమంతా భక్తులకే!
నేను: భక్తుల దుఃఖం మీకు కష్టం కలిగించదా?
మాతృదేవి: నా కెందుకు కష్టం? సృష్టికర్తే అంతా చూసుకొంటాడు.
నేను: భక్తుల నిమిత్తం మీరు రాదలచుకోలేదా?
మాతృదేవి: శరీర ధారణ వలన ఎన్నెన్ని కష్టాలు! ఇక వద్దు, వద్దే వద్దు.ఇక రాకుండా ఉండాలిగాక! గురుదేవులు వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు ఉసిరికాయ తినగోరారు. దుర్గాచరణ్ మూడు రోజులు నిద్రాహారాలు మానుకొని వెతికి వేసారితీసుకువచ్చాడు. గురుదేవులు ఆయనను భోజనం చేయమన్నారు. తాము కాస్త అన్నం తిని, ఆ అన్నాన్ని ప్రసాదంగా మార్చి ఆయన కిచ్చారు. అది చూసి నేను, ‘మీరు అన్నం బాగానే తింటున్నారు. ఎందుకు రవ్వ పాయసం మాత్రం పుచ్చుకొంటున్నారు? కాస్తకాస్తగా అన్నం కూడా తినవచ్చు కదా!’ అన్నాను. అందుకు ఆయన, ‘లేదు, లేదు. ఆఖరి రోజుల్లో ఈ ఆహారమే మంచిది’ అని జవాబిచ్చారు. రవ్వపాయసం తీసుకోవడం కూడా ఆయనకు భరించరాని యాతనగా ఉండేది. కొన్ని సమయాలలో ఆయన పుచ్చుకొన్నది ముక్కు ద్వారానో లేదా నోటి ద్వారానో వెలుపలకు వచ్చేసేది.
తమ వ్యాధిని గురించి గురుదేవులు, “ఎన్నెన్ని బాధలు అనుభవించాలోవాటి నన్నిటినీ భరించాను. మీరెవరూ కష్టపడకూడదు. లోకంలోని యావన్మందినిమిత్తమూ నేను కష్టాలు భరిస్తున్నాను’ అని అన్నారు. గిరీశ్ పాపాలను తాముస్వీకరించడమూ ఆయన వ్యాధికి ఒక కారణం.
అనుభవించవలసిన కష్టాల నన్నిటిని ఈ భూమిలోనే అనుభవించాలి.మరెక్కడికైనా ప్రత్యేకంగా వెళ్లి అనుభవించాలా ఏమిటి? ‘నేను, నేను’ అంటారు.పిదప తన్నులు, దెబ్బలు తిని, ‘నువ్వే, అంతా నువ్వే’ అంటూ గుణపాఠం నేర్చుకొంటారు.
నేను: అమ్మా, (శరీరాన్ని వదలిన) తరువాత కూడా మమ్మల్ని జ్ఞాపకముంచుకొంటారా?
మాతృదేవి: అక్కడి దివ్యానందాన్ని అనుభవిస్తూన్నప్పుడు బహుశా మరచిపోవచ్చు. నాయనా! కాలమే ముఖ్యం. కాలగతిలో ఏం జరుగనున్నదో ఎవరి కెరుక?
నేను: కాల ప్రభావంతోనే అన్నీ జరుగుతున్నాయి. కానీ కాలాతీత వ్యక్తి కూడా ఉన్నాడు కదా!
మాతృదేవి: అవును, అది నిజమే.
నేను: అమ్మా, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది.
అప్పుడు సమయం ఎనిమిది గంటలయింది. “ఎనిమిది గంటలయిపోయిందా! అయేవుంటుంది. వెళతాను నాయనా, పూజ చేసుకోవాలి” అంటూ లేస్తూ మాతృదేవి, “నాయనా! నేను ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించు” అన్నారు.
పూజ పూర్తయ్యాక మాతృదేవికి వచ్చిన ఉత్తరాలు తీసుకొని మేడ మీదికి వెళ్లాను. మాతృదేవి శిష్యులలో ఒకరు కాశీలో మరణించారు. ఆ వార్త విని మాతృ దేవి, “ఏదో ఒక రోజు మరణించే తీరాలి. వాగులోనో వంకలోనో పడి మరణించ కుండా, కాశీలో మరణించే భాగ్యం దక్కింది” అని అన్నారు.
మాతృదేవి సోదరులు తమ కుటుంబ కలహాలను తెలుపుతూ డబ్బు కావాలని ఉత్తరం వ్రాశారు. నేను మాతృదేవితో, “వారికి సమృద్ధిగా డబ్బు లభించేలా చూడండి; గురుదేవులకు విన్నవించండి. బాగా సుఖీంచి తమ కోర్కెల నన్నిటినీ తీర్చుకొంటారు గాక!” అన్నాను.
మాతృదేవి: వారి కోర్కెలు ఎన్నటికైనా తీరుతాయా నాయనా? దేనితోనూ వారు తృప్తిచెందరు, కోట్లు ఇచ్చినా సరిపోదు. లౌకికులు ఎన్నడైనా తృప్తిచెందుతారా? వారెప్పుడూ తమ కష్టాల గురించే చెప్పుకొంటారు. కాళీ (మాతృదేవి సోదరులలో ఒకరు) ‘డబ్బు డబ్బు’ అని అంగలారుస్తూంటాడు. వాణ్ణి చూసి ఇప్పుడు ప్రసన్న (మరో సోదరుడు) మొదలుపెట్టాడు. వరదుడు (మూడవ సోదరుడు) మాత్రం ఎన్నడూ అడగడు. ‘అక్కయ్యకు ఎక్కణ్ణుండి డబ్బు వస్తుంది?’ అంటాడతడు.
నేను: పిచ్చి అత్తయ్య అడుగుతుందా?
మాతృదేవి: మనంగా ఇచ్చినా పుచ్చుకోదు.
నేను: అమ్మా! మీ రెందుకు ఆ కుటుంబంలో జన్మించారు?
మాతృదేవి: ఎందుకు జన్మించకూడదు? నా తల్లితండ్రులు సజ్జనులు. మా నాన్నగారు గొప్ప రామభక్తుడు. తగనివారి నుండి ఏదీ స్వీకరించరు. మా అమ్మ కరుణామూర్తిగా విరాజిల్లింది. వచ్చేవారందరికీ భోజనం పెట్టేది, అవసరమైన వన్నీ చేసి పెట్టేది. ఆమె ఎంతో సరళస్వభావురాలు. తల్లితండ్రులు తపస్సంపన్నులు కాకుంటే (భగవంతుడు) అక్కడకొచ్చి జన్మిస్తాడా ఏమిటి?
ఉద్బోధన్, జూన్ 25, 1912
ఉదయం వేళ. పూజగదికి పక్కనున్న గదిలో మాతృదేవి కూర్చుని ఉన్నారు. మేం మాట్లాడుకోసాగాం.
నేను: శ్రీరామకృష్ణ సంప్రదాయ సాధువులు సేవాశ్రమాలలోను, ఆసుపత్రుల లోను పనిచేయడమూ, పుస్తకాలు విక్రయించడమూ జమాఖర్చు పద్దులు చూడడమూ సబబు కాదంటారు కొందరు. గురుదేవులు ఇటువంటి పనులు ఎన్నడైనా చేశారా? ఆత్మసాక్షాత్కారార్థం మఠంలో చేరేవారికి ఈ రకం పనులు అప్పగించబడుతున్నాయి. పనంటూ ఏదైనా చేయవలసివస్తే పూజ, జపం, ధ్యానం, భజన మొదలైనవి చేయ వచ్చు కదా! తదితరమైన పనులు కోర్కెలలో చిక్కుపడేలా చేసి, భగవంతుని నుండి వైదొలగచేస్తాయంటున్నారు కదా కొందరు.
మాతృదేవి: వారి మాటలేవీ పట్టించుకోకు. పని చేయకుంటే రాత్రింబవళ్లు ఏం చేస్తారట? ఇరవై నాలుగు గంటలూ జపధ్యానాలు అనుష్ఠించడం సాధ్యమా? గురుదేవులను గురించి ప్రస్తావించావు. ఆయన సంగతే వేరు. ఆయన ఆహారాదులన్ని టికీ మథుర్బాబు ఏర్పాటు చేశాడు. మీరు ఏదో పని చేస్తూన్నందు వల్లనే మీకు ఆహారం లభిస్తోంది. లేకపోతే పిడికెడు మెతుకుల కోసం ఇంటింటా భిక్షమెత్తాల్సి వచ్చేది. దాంతో అనారోగ్యం వాతబడేవారు. పైగా ఈ రోజుల్లో సాధువులకు భిక్ష ఇచ్చేవారేరి? అటువంటి మాటలు ఎన్నడూ పట్టించుకోకు. గురుదేవుల నిర్దేశాను సారమే అంతా జరుగుతుంది. రామకృష్ణ మఠాలు ఈ తీరులోనే నిర్వహింప బడతాయి.
ఒక రోజు మణిమల్లిక్ ఒక సాధువును దర్శించి వచ్చి ఆ సంగతి గురుదేవు లతో చెప్పాడు. “మంచిది. ఆ సాధువు ఎలాంటి వ్యక్తి?” అని ఆయన అడిగారు. “ఎలాంటి వ్యక్తి అంటే….” అంటూ నసిగాడు మణిమల్లిక్. “అంటే, ఏమిటి?” అని గురుదేవులు అడిగారు. “అందరికీ డబ్బు కావాలి” అని జవాబిచ్చాడు. అప్పుడు గురుదేవులు, “ఒక సాధువుకు ఎంత డబ్బు కావాలి? మహా అయితే పొగ త్రాగ డానికి ఒక పావలా అడిగి ఉంటాడు, అంతే కదా! మీ అందరికీ కడవలకొద్దీ పాలూ నెయ్యీ, మెత్తని పరుపూ ఇత్యాదులన్నీ కావాలి. పొగత్రాగడానికి ఒక పావలా సాధువు అడక్కూడదు! అంతేనా?” అన్నారు.
నేను: భోగలాలసకు కోర్కే కారణం. ఒక వ్యక్తి నాలుగంతస్తుల మేడలో నివసిస్తున్నాడనుకొందాం. అతడిలో అటువంటి కోర్కె లేకుంటే, అతడికి భోగలాలస ఉండదు. ఒకడు చెట్టు క్రిందే నివసిస్తున్నప్పటికీ ఆతడిలో కోర్కె ఉంటే మాత్రం భోగలాలస వచ్చిపడుతుంది. ‘నా అనే వారు లేని ఒక వ్యక్తికి ఒక పిల్లినిచ్చి దాని పట్ల లౌకిక మమతానురాగాలు పెంపొందించుకొనేలా చేస్తుంది మహామాయ! అటువంటిది ఆమె లీల’ అనేవారు గురుదేవులు.
మాతృదేవి: అవును నాయనా! అది నిజమే. కోర్కె వల్లనే అంతా. కోర్కె లేని వ్యక్తికి బంధమేమిటి? వీటి అన్నింటి మధ్యా నేను జీవిస్తున్నాను; వేటిపట్లా నాకు అనురక్తిలేదు, ముమ్మాటికీ లేదు.
నేను: మీ కేమిటి, కోర్కెలేమిటి? అమ్మా! మా మనస్సులలో ఎన్నెన్ని అల్పమనై కోర్కెలు తలెత్తుతాయి. అవన్నీ ఎలా సమసిపోతాయి?
మాతృదేవి: మీ విషయంలో అవేవీ కోర్కెలే కావు. అవి కేవలం మీ మనస్సు లలో తోచి, మరుగయ్యే కేవల కల్పనలు. అవి ఎంత ఎక్కువగా వచ్చి, పోతాయో నీకే అంత మంచిది.
నేను: ‘భగవంతుడే నన్ను కాపాడకపోతే నా మనస్సుతో నేనెంతకని పోరాడగలుగుతా’ నని నిన్న అనుకొన్నాను. ఒక కోర్కె తొలగిపోయిన మరుక్షణమే మరొకటి మొలకెత్తుతుందే!
మాతృదేవి: ‘నేను’ అనే భావం ఉన్నంతదాకా కోర్కెలు ఉండనే ఉంటాయి. ఆ కోర్కెలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. గురుదేవులు మిమ్మల్ని కాపాడతారు. ఎవరు ఆయన పాదారవిందాలను ఆశ్రయిస్తారో, సర్వస్వమూ త్యజించి ఆయనను శరణు వేడుకొంటారో, ఉన్నతమైన జీవితం గడపగోరతారో, వారిని కాపాడకపోతే, అది ఆయనకే పాపంగా పరిణమిస్తుంది కదా! సర్వస్వమూ ఆయనకు అర్పించి జీవించాలి. ఆయన మంచిది చేయాలనుకొంటే చేయనీ, ముంచివేయాలనుకొంటే అట్లే చేయనీ. కానీ మనం మాత్రం మంచినే చేస్తూవుండాలి. దానిని కూడా ఆయన ప్రసాదించిన శక్తి మేరకు చేయాలి.
నేను: అమ్మా! ఆ మేరకు ఆయనను నేను శరణు వేడుకోవాలా? కొన్ని సమ యాల్లో అలా అనిపిస్తుంది. కానీ మరుక్షణమే ఆ ఆలోచన మాయమైపోతుంది. ఆయనే కనుక కాపాడకపోతే ఇక గత్యంతరమేమిటి? అమ్మా! ఇప్పుడు మీరు ఉన్నారు. ఆపదలొచ్చినా, కష్టాలు పైనబడ్డా పరిగెత్తుకొంటూ వచ్చి మీతో చెప్పు కొంటాం. మీ ప్రసన్న వదనం చూసి అనునయం పొందుతాం. ఆ తరువాత మమ్మల్ని ఎవరు కాపాడతారనిపిస్తూ ఉంటుంది. మీరు అభయం ఇస్తే ఇక భయం ఉండదు.
మాతృదేవి: భయమెందుకు నాయనా? దేన్ని గురించీ నువ్వు భయపడనక్కర లేదు. భార్యా పిల్లలూ కుటుంబమూ అంటూ మీరు జీవితం గడపబోవడం లేదు. ఇవేవీ మీకు లేవు. మీరంతా ఎందుకు భయపడాలి? నే నుండగానే మీ రంతా తయారయిపోతారు.
నేను: భగవంతుని కృపాకటాక్షం మాపై ప్రసరించకపోతే జపతపాదుల ద్వారా మాత్రం ఏం సిద్ధిస్తుంది? ఆయన కాపాడితేనే గతి.
మాతృదేవి: మీరు దేని గురించీ భయపడవద్దు. గురుదేవులు కాపాడతారు. కలత చెందకు నాయనా!
ఉద్బోధన్, జూలై 7, 1912
శిష్యుడు: అమ్మా, రథోత్సవ సందర్భంలో మీరు పూరీ జగన్నాథం వెళ్లేట్లు ఏర్పాటు జరిగింది కదా?
మాతృదేవి: ఆ జనసమూహంలో వెళ్లాలా? కలరా–గిలరా వ్యాపించవచ్చు. అక్కడ పూజారియైన లక్ష్మీకాంతుడు, “ఇప్పటికే ఉన్న గదులన్నీ నమోదయిపోయాయి. ఖాళీ లేదు. చిన్నచిన్న గదులకు కూడా అద్దె పది రూపాయలు వసూలు చేస్తున్నారు. శీతకాలంలో రండి” అని చెప్పేశాడు.
నేను: అక్కడ ఎవరి దివ్యవిగ్రహం వెలసివుంది?
మాతృదేవి: ఏమిటో, అక్కడ వెలసింది పరమేశ్వరుడని కలగన్నాను.
నేను: అలా అయితే మీరక్కడ జగన్నాథస్వామి ప్రతిమను చూడలేదా?
మాతృదేవి: లేదు. పరమేశ్వరుని దివ్యరూపాన్నే, శివలింగాన్నే చూశాను. లక్ష సాలగ్రామాలతో నిర్మితమైన పీఠం మీద జగన్నాథ శివుడు వెలసివున్నాడు. ఏ కారణమూ లేకుండా తండోపతండాలుగా జనం అక్కడకు పోతారా? విమలాదేవి కూడా అక్కడ వెలసివుంది. మహాష్టమి నాడు ఆమెకు బలి ఒసగబడుతుంది. విమలాదేవి దుర్గాదేవియే కదా! అందువలన అక్కడ వెలసింది పరమేశ్వరుడే!
నేను: ఒకప్పుడది ఒక బౌద్ధాలయం. బుద్ధుని ప్రతిమే అక్కడ ప్రతిష్ఠితమై ఉండేది. తదనంతరం ఆదిశంకరులు వేంచేసి బౌద్ధులను పారద్రోలారు. అప్పుడు బుద్ధుని ప్రతిమ శివలింగంగా రూపుదిద్దుకొంది. ఆ తరువాత వైష్ణవుల ప్రాబల్యంలోకి వచ్చినప్పుడు ఆ విగ్రహం జగన్నాథ్ – విష్ణువుగా మార్పుచెందిందని చెప్పుకొంటారు.
మాతృదేవి: ఆ వివరాలన్నీ నాకు తెలియవు నాయనా! నేను అక్కడ చూసింది పరమేశ్వరుణ్ణే! అంతే.
నేను: ఎన్నెన్నో దేవాలయాలను, దేవీదేవతల విగ్రహాలను మహమ్మదీయులు ధ్వంసం చేశారు! కొన్నిటికి ముక్కులు లేవు, కొన్నిటికి చెవులు లేవు.
మాతృదేవి: మహమ్మదీయ దండయాత్రలకు భయపడి బృందావనంలోని గోవిందజీ విగ్రహాన్ని జయపూర్‌కు తరలించారు. కానీ పూజారులు ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకురమ్మని ఒత్తిడి చేశారు. చివరకు, ‘విగ్రహాన్ని మాత్రమే కదా తరలిం చారు. నేను వెళ్లలేదు. మరొక విగ్రహాన్ని రూపొందించండి, దాన్లో నేను నెలకొంటాను’ అనే దివ్యవాణి వినవచ్చింది.
నేను: గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంలో ప్రతి రోజూ గంగోత్రీ జలంతో అభిషేకం జరుపుతారు. జనం తమ తల మీద మోసుకొని రోజూ గంగోత్రీ జలం తీసుకువస్తారు. సుల్తాన్ మహమ్మద్ విగ్రహాలను ధ్వంసం చేసి, చందనపు చెక్కలతో తయారైన ఆలయం తలుపులను తరలించుకుపోయాడు. ఇలా ఎందుకు జరిగింది?
మాతృదేవి: దుష్టులను చూస్తే భగవంతుడు కూడా భయపడి పారిపోతాడేమో! మరేం చెప్పాలి? సంకల్పమాత్రాన సమస్తం సాధించగల సర్వశక్తిమంతుడు ఆయన. దీనిని కూడా భగవంతుని లీలలో ఒకటిగా పరిగణించాల్సిందే!
నేను: అమ్మా! కర్మఫలాన్ని రద్దు చేయగలమా? జ్ఞానం సముపార్జించడం ద్వారా సాధ్యమయినా ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలని శాస్త్రాలు వచిస్తున్నాయి.
మాతృదేవి: సుఖదుఃఖాలన్నిటికీ మన చేతలే కారణం. గురుదేవులు కూడా కర్మఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఒకసారి ఆయన పెద్దన్నయ్య సన్నిపాతంలో నీళ్లు త్రాగారు. కాస్త త్రాగగానే గురుదేవులు నీటి గ్లాసును లాక్కున్నారు. తక్షణమే పట్టరాని కోపంతో ఆయన సోదరుడు, “నీరు త్రాగకుండా ఆపేశావు. నాలాగే నువ్వు కూడా బాధపడతావు. నేను అనుభవిస్తున్న యాతనను నువ్వు కూడా గొంతులో అనుభ విస్తావు” అని అన్నారు. అందుకు గురుదేవులు, “అన్నయ్యా! మీకు చెరుపు చేయా లని అలా చేయలేదు. మీకు ఆరోగ్యం బాగా లేదు. ఈ పరిస్థితిలో నీళ్లు త్రాగితే ప్రమాదం. అందుకే నీరు త్రాగనివ్వలేదు. ఈ మాత్రానికే నన్ను శపించారే!” అన్నారు. అప్పుడు ఆయన అన్నగారు విలపిస్తూ, “తమ్ముడూ, నా కేమీ తెలియదు. అప్రయ త్నంగా నోటి వెంట ఆ మాటలు వెలువడ్డాయి. అవి ఫలించే తీరుతాయి” అన్నారు ఆవేదనతో.
గురుదేవులు వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు నాతో, “ఆ శాప కారణంగానే ఇప్పుడు ఈ గొంతువ్యాధి దాపురించింది. మీ రెవరూ కష్టపడనక్కరలేదు. మీ కష్టాలనన్నీ నేను అనుభవించాను” అని చెప్పారు. అప్పుడు నేను, “మీకే ఇలా అయినప్పుడు సామాన్యులు ఎలా జీవించగలరు?” అని అడిగాను. అందుకు ఆయన, “నా సోదరుడు ధార్మికుడు. ఆయన మాటలు అసత్యం కావు. అందరి వాక్కూ ఇలా ఫలి స్తుందా ఏమిటి?” అని అన్నారు.
కర్మఫలం అనివార్యం. కానీ భగవన్నామ జపం చేస్తే దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. నాగలి గుచ్చుకొని శరీరం చీరుకుపోవడానికి మారుగా కేవలం సూదిమాత్రం గుచ్చుకోవచ్చు. జపతపాదులు అనుష్ఠిస్తే కర్మఫలం చాలావరకు తగ్గుతుంది. సురత మహారాజు లక్ష మేకలను బలి ఇచ్చి దేవిని ఆరాధించాడు. తదనంతరం ఆ లక్ష మేకలు ఒకే కత్తివేటుతో ఆతణ్ణి చంపేశాయి. లక్షసార్లు ఆతడు జన్మనెత్తవలసిరాలేదు. దేవిని ఆరాధించాడు కదా! నామజపం వలన కర్మఫల తీవ్రత తగ్గుతుంది.
నేను: అలా అయితే కర్మ సిద్ధాంతమే ఈ లోకాన్ని నియంత్రిస్తున్నప్పుడు భగవంతుని పట్ల ఎందుకు విశ్వాసం కలిగివుండాలి? బౌద్ధులు కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు కానీ భగవంతుణ్ణి అంగీకరించరు.
మాతృదేవి: కాళీ దుర్గా కృష్ణుడు ప్రభృత దైవాలెవరూ లేరనా నువ్వనడం?
నేను: తపజపాదులతో కర్మఫలం నశిస్తుందా?
మాతృదేవి: ఎందుకు నశించదు? మంచిపని చేయడం మంచిది. మంచి చేయడంలో ఆనందం కలుగుతుంది, చెడు చేయడం వలన దుఃఖం వాటిల్లుతుంది.
నేను: అమ్మా, మీరు జయరాంబాటిలో ఉన్నప్పుడు, “సృష్టి ఏకకాలంలో జరిగింది. సృజింపబడినవన్నీ ఏకకాలంలోనే సృజింపబడ్డాయి. ఒక్కటొక్కటిగా సృజింపబడలేదు’ అని చెప్పారు కదా!
మాతృదేవి: భగవంతుడు ఒక్కటొక్కటిగా సృజించాడా ఏమిట? గోధుమలను పిండిచేసే యంత్రం చూస్తున్నావు కదా, అలాగే! యంత్రం అరిగిపోకూడదనిదానిని నడిపే వ్యక్తి శ్రద్ధ వహిస్తాడు. ఒక్కొక్క గోధుమ గింజను వేస్తూ పిండిచేయడంచూశావా? అట్లే భగవంతుడు కూడా తన యంత్రాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు.ఎవరు ఎక్కడ ఏం చేస్తూన్నారనే ప్రతి చిన్న విషయమూ చూసి ఆయన కలత చెందుతాడా ఏమిటి? ఆయన సృష్టి అనంతం! దానిని యావత్తూ క్షణం తీరిక లేకుండాపర్యవేక్షించాలి. చిన్న విషయాలను కూడా గోరంతలు కొండంతలు చేసి చూస్తే ఎలా సాగుతుంది.
ఉద్బోధన్
నేను: అమ్మా! అప్పుడప్పుడు మీరు రామాయణం చదవడం చూశాను. చదవడం ఎప్పుడు నేర్చుకొన్నారు?
మాతృదేవి: చిన్నతనంలోనే. ప్రసన్న రాంనాథ్ ప్రభృతులు బడికి వెళ్లేవారు. వారితో కలిసి నేను కూడా కొన్ని సమయాలలో బడికి వెళ్లేదాన్ని. అప్పుడు కాస్త నేర్చుకొన్నాను. తదనంతరం కామార్పుకూర్లో నేనూ, లక్ష్మీ బాలశిక్ష సాయంతో కొద్దిగా చదవడం నేర్చుకొన్నాం. “స్త్రీలు చదవడం, వ్రాయడం నేర్చుకోవడమా? ఆ తరువాత నవలలూ, నాటకాలూ చదవబోతున్నారు?” అంటూ హృదయ్ నా వద్ద నుండి పుస్తకాన్ని లాగేసుకొన్నాడు. కానీ లక్ష్మి మాత్రం తన పుస్తకాన్ని ఇవ్వ లేదు. ఆమె వాళ్ల ఇంటి పిల్ల కదా! తన వద్దే ఉంచేసుకొంది. ఎవరికీ తెలియకుండా ఒక అణాపెట్టి నేనొక పుస్తకం కొనుక్కొన్నాను. లక్ష్మి బడి నుండి తిరిగి వచ్చాక నాకు నేర్పేది. కానీ నేను బాగా నేర్చుకొన్నది దక్షిణేశ్వరంలోనే! ఆ సమయంలో గురుదేవులు చికిత్స నిమిత్తం శ్యాంపుకూర్లో బసచేసి ఉండబట్టి నేను ఒంటరిగా ఉండేదానిని. భవ ముఖర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ స్నానం చేయడానికి వచ్చేది. కొన్ని సమయాల్లో చాలాసేపు నాతో గడిపేది. అప్పుడు ఆమె నాకు నేర్పించేది. ఆకుకూర, దేవాలయం నుండి నాకు వచ్చే ఆహారపదార్థాలు ఆమెకు ఇచ్చే దానిని.
నేను: గురుదేవుల వద్దకు పలువురు భక్తులు వచ్చే వారు కదా! వారందరూ ఇప్పుడెక్కడున్నారు? ఇప్పుడు ఎవరూ రావడం లేదే!
మాతృదేవి: వారందరూ సంతోషంగా జీవిస్తున్నారు.
నేను: సంతోషంగానా?
మాతృదేవి: నీ సందేహం సబబే. భార్యాపిల్లలతో సంతోషంగా ఉండడం సాధ్యమేనా? కామినీ కాంచనాలలో లోకులు మైమరచిపోయివున్నారు. ఇదంతా చివరకు దుఃఖాల పాలుచేస్తుంది.
నేను: మనస్సో, బయటనే విహరిస్తూంటుంది.
మాతృదేవి: జగదంబయైన కాళికాదేవియే సర్వులకూ తల్లి! మంచీ, చెడూ సమస్తం ఆమె నుండే ఉద్భవించాయి; అన్నిటినీ ఆమే సృజించింది.
జన్మతః సిద్ధుడు, సాధన సిద్ధుడు, కృపాసిద్ధుడు, హఠాత్సిద్ధుడు అంటూ రకరకాల మహాత్ములు ఉన్నారు కదా!
నేను: హఠాత్సిద్ధుడు అంటే ఏమిటి?
మాతృదేవి: మరొకరి ఆస్తి హఠాత్తుగా సంక్రమించి ధనవంతుడవడం లాంటిది అది.
అప్పుడే నళిని స్నానం చేసి వచ్చింది. మరుగుదొడ్డి అశుభ్రంగా ఉండడం చూసి దానిని శుభ్రం చేసింది. అందుకే గంగకు వెళ్లి స్నానం చేసి వచ్చింది. “నళినీ, గంగకు వెళ్లి స్నానం చేసి వచ్చావా?” అని మాతృదేవి అడిగారు. “అవును” అంది నళిని.
నేను: కొళాయి కిందనే స్నానం చేసివుండొచ్చు కదా?
మాతృదేవి: అదేకదా! కొళాయి నీళ్లలో స్నానం చేసి, గంగాజలం చల్లుకొంటే సరిపోయేది.
నళిని: ఎలా సరిపోతుంది? మరుగుదొడ్డి కదా!
మాతృదేవి: అయితే ఏమిటి? నువ్వు అశుద్ధాన్ని తాకలేదు కదా! అలా తాకినా కూడా ఏమైపోతుంది? కడుపులో కూడా ఉంటుంది కదా! “అన్నం, కూర, పప్పు, పులుసు, వెన్నలను ఒక పాత్రలో ఉంచు. రెండు రోజుల్లో దుర్గంధం పుట్టుకొస్తుంది. మలం కూడా అదే కదా!” అని గురుదేవులు చెప్పేవారు. ఆయన ఒకసారి దక్షిణేశ్వరంలో తమ మలాన్నే చవిచూశారు. “అది నీ మలమే కదా!” అన్నారు తోతాపురి. వెంటనే ఇతరుల మలాన్ని కూడా చవి చూశారు.
గ్రామంలో ఎండిపోయిన మలం మీద పలుమార్లు నేను నడవడం జరిగింది. ‘గోవిందా, గోవిందా’ అంటూ భగవన్నామాన్ని రెండుసార్లు ఉచ్చరించి, పరిశుద్ధ మైనాను. అంతా మనస్సుకు సంబంధించిందే కదా! శుద్ధమూ అశుద్ధమూ మనస్సు లోనే కదా ఉంటాయి.
ముందుగా స్వకీయ మనస్సులో లోపం ఉన్నప్పుడే ఇతరుల లోపాలు చూడడం సాధ్యమవుతుంది. ఇతరుల లోపాలు సూచిస్తూ ఉన్నందున ఆ వ్యక్తికి ఏదైనా జరుగబోతుందా ఏమిటి? నువ్వే అధోగతి పాల్పడతావు. నేను ఎవరిలోనూ లోపాలను చూడలేను; చిన్నతనం నుండే నా స్వభావం అటువంటిది. నాకు ఎవ రైనా చిన్న సహాయం చేసినా, ఆ వ్యక్తిని సదా జ్ఞాపకముంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇతరులలో లోపాలు చూడడమా? అలా చూడడానికి ఒక వ్యక్తిలో ఏం లోపా లున్నాయి కనుక? నేను దానిని నేర్చుకోలేదు. క్షమ ఒక తపస్సు.
నేను: ‘ఇంట్లో జొరబడి దొంగ ఏదో దొంగలించుకు పోయాడనుకోండి. మీ మనస్సులో దొంగ అనే ఆలోచన స్ఫురిస్తుంది. ఒక చిన్న పిల్ల మనస్సులో దొంగ తనమనే ఆలోచనే రాదు. అందువలన ఆ చిన్నారి ఎవరినీ దొంగగా చూడదు’ అంటూ స్వామీజీ చెప్పేవారు.
మాతృదేవి: అవును, అది నిజమే. పరిశుద్ధమైన మనస్సున్న వ్యక్తి అంతటినీ పరిశుద్ధంగానే చూస్తాడు. (అప్పుడు గోలాప్ మా వచ్చారు) ఇదుగో, ఈ గోలాప్ మనస్సు శుద్ధమైనది. బృందావనంలో ఉన్నప్పుడు మాధవాలయాన్ని పిల్లలు అశుద్ధం చేశారు. అందరూ, ‘ఛీ, ఛీ, అసహ్యం’ అంటూ చూస్తూ తమ దారిన తాము వెళ్లి పోయారేగాని ఎవరూ శుభ్రపరచడానికి ముందుకు రాలేదు. అది చూసి గోలాప్ తన నూతన వస్త్రాన్ని చింపి ఆ చోటును శుభ్రపరచింది. ఆమె చర్య చూసిన స్త్రీలు, ‘ఈమె శుభ్రపరుస్తూన్నదంటే ఈమె బిడ్డలే అశుద్ధం చేసివుంటారు’ అని అన్నారు. ‘ఓ భగవంతుడా! ఈ స్త్రీలు ఏమంటున్నారో చూడు’ అని నాలో నేనే అనుకొన్నాను. కానీ కొందరు, ‘వీరు సాధువులు. (అప్పుడు స్వామి యోగానంద మాతో ఉన్నాడు) వీరికి పిల్లలెక్కడ? దైవ దర్శనానికి అడ్డంకిగా ఉందని శుభ్రం చేశారు. అంతే’ అన్నారు.
ఇదిగో, ఈ గంగాతీరంలో ఏమైనా అశుభ్రం కనిపిస్తే వెంటనే గోలాప్ శుభ్రపరచివేస్తుంది. నలుగురికీ మంచి జరుగుతుంది కదా! అందుకే గోలాప్కు మంగళం జరుగుతుంది. వారికి ప్రశాంతత లభిస్తే గోలాప్ కూడా ప్రశాంతత పొందుతుంది.
అనేక సాధనలూ, తపస్సూ చేసివుంటే మాత్రమే పూర్వజన్మలో ఎంతో తపో ఫలం ఉండివుంటే మాత్రమే ఈ జన్మలో మనస్సు పరిశుద్ధమైనది కలుగుతుంది.
నేను: అమ్మా, నా మనస్సు జపం చేయ ఇచ్చగించడం లేదు.
మాతృదేవి (నవ్వుతూ): ఎందుకు? కాస్త కూడానా?
నేను: అన్యమనస్కంగా ఏదో చేస్తాను. మరుక్షణమే, ‘ఇలా ఉచ్చరించడం వలన ప్రయోజన మేమిటి? భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు. జపం మాని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను’ అనే ఆలోచన తలెత్తుతుంది.
మాతృదేవి: ధ్యానం చేయగలుగుతున్నావా?
నేను: అసలు లేదు. అదీ సాధ్యం కావడం లేదు. ప్రతిదీ అవగతమవుతున్నది కానీ ఆచరణలో పెట్టలేకున్నాను. దక్షిణేశ్వరానికి వెళ్లడానికి దారి తెలుసు. కానీ కాలినడకన వెళ్లగలమా ఏమిటి?
ఇంతలో లలిత్‌బాబు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లాడు. వారు మాట్లాడుకో సాగారు. నేను కూడా మధ్య మధ్యలో మాట్లాడసాగాను.
మాతృదేవి: కత్తిమొనలా పదునైన దారి అని గురుదేవులు చెప్పేవారు. (కాసేపు మౌనం వహించి) కానీ ఆయన మీ చేయి పుచ్చుకొని ఉన్నారు. ఆయన కాపాడుతూ వస్తున్నారు.
నేను: ఎక్కడ? మాకేమీ అర్థం కావడం లేదే!
మాతృదేవి: అదే కదా అసలు కష్టం.
నేను: అవును.
లలిత్‌బాబు: మరణానంతరం చేతుల్లోకి తీసుకొంటారు. అదేం పెద్ద విషయం? దేహంతో ఉన్నప్పుడే చేస్తే కదా–
మాతృదేవి: ఇప్పుడు కూడా ఆయనే మిమ్మల్ని తమ చేతులతో పట్టుకొని ఉన్నారు. అతి సమీపంలో ఉన్నారు, పట్టుకొని ఉన్నారు.
నేను: నిజంగానే మమ్మల్ని పట్టుకొని ఉన్నారా?
మాతృదేవి: అవును, పట్టుకొనివున్నారు.
నేను: నిజంగానే చెబుతున్నారా?
మాతృదేవి: అవును, నిజమే చెబుతున్నాను. ఆయనే పట్టుకొనివున్నారు.
నేను: నిజంగా!
మాతృదేవి (దృఢంగా) : అవును, నిజంగా!
ఉదయం పూజ పూర్తి కాగానే మాతృదేవి భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. తరువాత తమ గదిని ఊడ్చి చెత్తాచెదారాన్ని తమ రెండు చేతులతో తీస్తున్నప్పుడు గుండుసూది గుచ్చుకొని చిటికెన వ్రేలి నుంచి రక్తం వచ్చింది. నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసి నేను మేడ మీదకు పరుగెత్తాను. సున్నం వేడిచేసి లేపనం వేయ మని ఎవరో అన్నారు. అలా చేసిన తరువాత నొప్పి కాస్త తగ్గింది. అప్పుడు మాతృ దేవి నాతో, “నాయనా, మీ రందరూ నాకు చెందినవారు, నాకు సొంతమైనవారు” అని చెప్పారు.
బేలూరు మఠం, అక్టోబర్ 16, 1912, బుధవారం
నేడు దుర్గాపూజ, బోధన్ దినం. నేటి సాయంత్రం మాతృదేవి మఠానికి వేంచేయనున్నారు. సాయంత్రం కావచ్చింది. కాసేపట్లో గోలాప్ మా, మాతృదేవిని చేతులు పుచ్చుకొని బండి నుండి కిందికి దింపారు. అక్కడి ఏర్పాట్లు చూసి మాతృ దేవి, “ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మేం కూడా ఏదో దుర్గాదేవిలా అలంకరించు కొనివచ్చాం” అని వ్యాఖ్యానించారు.
అష్టమినాడు దాదాపు మూడు వందలకు పైగా భక్తులు మాతృదేవిని దర్శించు కొన్నారు. ముగ్గురు నలుగురు మంత్రదీక్ష కూడా పుచ్చుకొన్నారు.
బోధన్ దినాన గిరీష్‌బాబు సోదరి మరణించింది. ఆమెను గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“మనిషి గురించి ఏం చెప్పను! ఇప్పుడు ఉన్నాడు, మరుక్షణం కనుమరుగై పోతాడు. ఆ వ్యక్తితో పాటు ఏదీ వెళ్లదు. ఆతడు చేసిన ధర్మాధర్మాలు మాత్రమే వెంటవెళతాయి. మరణానంతరం ఆతడి వెంటవెళ్లేది ఆతడి పాపపుణ్యాలే!”
ఒక కుర్రవాడు కలలో మంత్రోపదేశం పొందాడు. గురుదేవులు ఆతణ్ణి తమ ఒళ్లో కూర్చోపెట్టుకొని ఉపదేశం చేసినట్లు కలగన్నాడు. దాని గురించి మాతృదేవి ప్రస్తావించారు.
నేను: మీరు మళ్లీ ఆతడికి మంత్రదీక్ష ప్రసాదించారా?
మాతృదేవి: లేదు. ‘నువ్వు భగవదనుగ్రహం పొందావు. ఆ మంత్రాన్ని జపించి ఉన్నత స్థితిని చేరుకొంటావు’ అని ఆతడితో చెప్పాను. ఆతడికి ప్రసాదించిన మంత్రం గురించి నేనెందుకు అడగాలి. జప విధానాన్ని మాత్రం ఆతడికి వివరించాను.
కాశీ, నవంబర్ 5, 1912
మధ్యాహ్నం సుమారు ఒంటిగంటకు మాతృదేవి అద్వైతాశ్రమానికి విచ్చేశారు. కాసేపు అక్కడ గడిపిన తరువాత కిరణ్‌బాబు కొత్త ఇంటికి (లక్ష్మీనివాస్) వెళ్లారు. ఆ ఇల్లు ఆశ్రమానికి చాలా దగ్గరలో ఉంది. విశాలమైన వసారాను చూడగానే మాతృ దేవి, “భాగ్యవంతుడు కాకుంటే ఇలాంటి ఇల్లు లభించదు. చిన్న చోట నివసిస్తే మనస్సు సంకుచితమైపోతుంది. విశాలమైన చోట నివసిస్తే మనస్సు కూడా విశాల మవుతుంది” అని వ్యాఖ్యానించారు.
మేడ మీద మొదటి గదిలో మాతృదేవి బస చేశారు. గోలాప్ మా, ‘మ’ భార్య మరికొందరు భక్తురాండ్రు మాతృదేవితోపాటు ఉన్నారు. స్వామి ప్రజ్ఞానంద, మేము కింద బసచేశాము.
మర్నాడు ఉదయం మాతృదేవి పల్లకీలో వెళ్లి విశ్వనాథుని, అన్నపూర్ణను దర్శించారు. రెండు రోజుల తరువాత మళ్లీ అద్వైతాశ్రమానికి వెళ్లారు. సేవాశ్రమానికి కూడా వెళ్లారు. రాజా మహరాజ్ (స్వామి బ్రహ్మానంద), హరి మహరాజ్ (స్వామి తురీయానంద), చారు బాబు, డాక్టర్ కంజీలాల్ తదితరులు అప్పుడక్కడ ఉన్నారు. కేదార్బాబు (స్వామి అచలానంద) పల్లకీతో పాటు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న రోగులను మాతృదేవికి చూపించారు. అంతా చూసిన తరువాత మాతృదేవి దక్షిణ వసారాలోకి వెళ్లి కూర్చున్నారు. కేదార్బాబుతో ఆశ్రమ నిర్వహణను ప్రశంసిస్తూ మాట్లాడారు.
“ఇక్కడ గురుదేవులు నెలకొని ఉన్నారు. మహాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహంతో నెలకొని ఉంది. అది సరే, ఈ ఆశ్రమం ఎలా ప్రారంభించబడింది? ఈ ఉద్దేశం తొలుత ఎవరికి వచ్చింది?” అని అడిగారు. చారుబాబు ప్రభృతుల కృషిని శ్లాఘిస్తూ కేదార్బాబు, “ఈ భవన నిర్మాణ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు” అని చెప్పారు. రాజా మహరాజ్, కేదార్బాబు కృషిని కొనియాడారు. అదంతా విని ఆనందించిన మాతృదేవి, “ఈ స్థలం ఎంతో అందంగా ఉంది. కాశీలోనే ఉండిపోవా లనిపిస్తోంది” అని చెప్పారు.
మాతృదేవి ఇంటికి తిరిగి వెళ్లిపోయిన కొంతసేపటికి ఒక భక్తుడు సేవాశ్ర మానికి వచ్చి ఒక పది రూపాయల నోటు ఇచ్చి, “ఈ పది రూపాయలను* మాతృ దేవి సేవాశ్రమానికి విరాళంగా ఇచ్చారు” అని చెప్పాడు.
మరుసటి నెలలో ఒక రోజు మాతృదేవి పల్లకీలో వెళ్లి కాశీలోని ముఖ్యమైన చోట్లను దర్శించారు. కాలభైరవాలయం, వేణీమాధవాలయం, నాగపూర్ రాజా ఆలయం, గ్వాలియర్ రాజా ఆలయం, సంకటమోచన ఘాట్, వీరేశ్వర శివాలయం, మణికర్ణిక లాంటి చోట్లు చూసివచ్చారు. భక్తురాండ్రు బండిలోను, కొందరు కాలి నడకనా వెళ్లారు. తిలభండేశ్వరస్వామిని దర్శించి, “ఇది స్వయంభూ లింగ” మన్నారు.
మరొక రోజు సాయంత్రం కేదరనాథాలయానికి వెళ్లి సంధ్యాహారతి దర్శిం చారు. పిదప ఆమె, “ఈ కేదారనాథుడూ, ఆ కేదారనాథుడూ (హిమాలయంలోని) ఒక్కరే! సంబంధం ఉంది. వీరిని దర్శిస్తే ఆయనను దర్శనం చేసుకొన్నట్లే. జాగృతిమూర్తి ఈయన” అని వ్యాఖ్యానించారు.
ఒక రోజు కొందరు స్త్రీలు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. రాధూ, భూదేవ్ తదితరులతోను, ఇతర పనులతోను మాతృదేవి హడావిడిగా ఉన్నారు. చిరిగిపోయిన తమ చీరను గోలాప్ మాకు ఇచ్చి కుట్టమన్నారు. ఇదంతా చూస్తున్న ఆ స్త్రీలలో ఒకరు, “అమ్మా! మీరు మాయలో పూర్తిగా మునిగిపోయినట్లున్నారే!” అన్నారు. వెంటనే స్పష్టంగా మాతృదేవి, “ఏం చేయనమ్మా! నేనే మాయను” అని జవాబిచ్చారు.
కాశీ, కిరణ్‌బాబు ఇల్లు, నవంబర్ 1912
నేను: అందరూ విశ్వనాథుని స్పృశిస్తారు. అందుకే సాయంత్రం అభిషేకం చేసి, పిదప పూజ చేసి, నైవేద్యం అర్పిస్తున్నారు.
మాతృదేవి: పూజారులు డబ్బుకు ఆశపడి అలా తాకనిస్తున్నారు. వాళ్లు ఎందుకు అలా అనుమతించాలి? దూరం నుండి దర్శించుకొంటే చాలదా? ఎందరి పాపమో దాన్లో పేరుకుపోతున్నది; అవినీతిపరులు కూడా తాకుతున్నారు.
ఇక కొందరున్నారు. వారు తాకగానే శరీరం మంటలెత్తిపోతుంది. అందుకే నేను వెంటనే కాళ్లు చేతులు కడుక్కొంటాను. అదృష్టం కొద్దీ ఇక్కడ కలకత్తాలో కంటే తక్కువ మందే వస్తున్నారు.
నేను: స్వాముల అనుమతి మీదనే ఇక్కడి వారు మిమ్మల్ని దర్శించుకోగలుగు తున్నారు. రద్దీని తగ్గించడానికే ఈ ఏర్పాటు చేశారు.
మాతృదేవి: ఇలా పలుచోట్ల జనం గుమిగూడడం ఎవరికి నచ్చుతుంది?
పిచ్చి అత్తయ్య విసిగించడం ఇక్కడ కూడా కొనసాగింది. ఆ సంగతి ప్రస్తా వనకు వచ్చింది.
మాతృదేవి: ముళ్లతో కూడివున్న బిల్వదళాలతో నేను శివుణ్ణి పూజించాను కాబోలు. అందుకే నాకు ఈ ముల్లు సంప్రాప్తించింది.
నేను: అదెలా? తెలియకుండా పూజిస్తే ఏం చేయగలం?
మాతృదేవి: తప్పు తప్పే కదా! శివపూజ ఎంతో కష్టం. తెలియకుండా తప్పు జరిగినా ఎంతో హాని వాటిల్లుతుంది. నిజమేమిటో తెలుసా? ఎవరికి ఇది ఆఖరి జన్మో వారు తమ కర్మఫలాన్నంతా ఈ జన్మలోనే అనుభవించేయాలి.*
పుట్టిన ఆదిగా నేను ఏ పాపమూ చేసినట్లు జ్ఞాపకం లేదు. ఐదేళ్లప్రాయంలో గురుదేవులను తాకాను. అప్పుడు ఆయనను బహుశా అవగతం చేసుకోలేకపోయా నేమో! కానీ ఆయన నన్ను తాకారు. అటువంటప్పుడు నా కెందుకిన్ని కష్టాలు? ఆయనను స్పృశించినంత మాత్రానే అందరూ మాయ నుండి విడివడుతున్నారు. నన్ను మాత్రం మాయ ఎందుకింత ఆవరించింది? నా మనస్సు రేయింబవళ్లు ఉన్నత స్థితిలో నెలకొని ఉండగోరుతుంది. కారుణ్యం కారణంగా వీరి కోసం ఆ మనస్సును బలవంతంగా క్రిందికి దింపివుంచాను. అయినప్పటికీ ఎన్ని కష్టాలు!
నేను: అమ్మా! తమ ఇష్టమొచ్చినట్లు వారిని చేసుకోమనండి. ఓర్పు వహించండి. తన గురించి ఎరుక ఉన్నంతదాకా మనిషి కోపగించుకోడు.
మాతృదేవి: బాగా చెప్పావు నాయనా! ఓర్పును మించిన సుగుణం ఏదీ లేదు. అసలు విషయం ఏమిటో తెలుసా? నాదీ రక్తమాంసాదులతో కూడుకొన్న దేహమే కదా! కొన్ని సమయాల్లో కోపంతో ఏదో అనేస్తూవుంటాను.
పిదప మాతృదేవి తమతో తామే, “సముచిత తరుణంలో హెచ్చరించే వ్యక్తే నిజమైన స్నేహితుడు. సమయం మించిపోయిన తరువాత, ‘అరెరే!’ అని చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి!” అని చెప్పుకొన్నారు.
డిసెంబర్ 11, 1912
మాతృదేవి కాశీలో బసచేసి ఉన్నప్పుడు కాశీఖండ మనే గ్రంథం చదివించు కొని వినేవారు. ఒక రోజు సాయంత్రం చదవడం ముగించాక, మాతృదేవితో మాట్లాడసాగాను.
నేను: అమ్మా, కాశీలో మరణించే వారందరూ ముక్తిపొందుతారా?
మాతృదేవి: పొందుతారనే శాస్త్రాలు వచిస్తున్నాయి.
నేను: మీ ప్రత్యక్ష అనుభవం ఏమిటి? మరణించిన వారికి సాక్షాత్తూ పరమ శివుడే తారకమంత్రాన్ని ఉపదేశిస్తూన్నట్లు గురుదేవులు దర్శించారు.
మాతృదేవి: నా కేమీ దాని గురించి తెలియదు నాయనా! అలాంటిదేమీ నేను చూడలేదు.
నేను: మీ ముఖతా వినకుంటే నాకు నమ్మకం కుదరదు.
మాతృదేవి: ప్రభూ! ఇతడు నమ్మనంటున్నాడు. కనుక నా కేదైనా చూపించం డని గురుదేవులతో చెబుతాను.
మహమ్మదీయుల పరిపాలనలో భారతదేశంలోని అనేక దేవాలయాలు ధ్వంసం కావడం గురించి ప్రస్తావిస్తూ, “ఆ దురాగతాలను అరికట్టడానికి భగవంతుడు ఏం చేశాడు?” అని అడిగాను.
మాతృదేవి: భగవంతునికి అనంత సహనం ఉంది. రాత్రింబవళ్లు శివలింగం మీద బిందెల కొద్దీ నీళ్లు పోసి జనులు ఆయనను ఆరాధిస్తున్నారు. అది ఆయనను బాధించిందా? వస్త్రంతో కప్పివుంచి పూజలు చేస్తారు. అదేమన్నా ఆయనకు కష్టం కలిగించిందా? ఎల్లలెరుగని సహనం ఆయనది.
మరునాడు ఉదయం ఖగేన్ మహరాజ్, మాతృదేవితో “అమ్మా, కాశీలో గురు దేవులు ఎన్నో దివ్యదర్శనాలు పొందారు. మీరు ఏం చూశారు?” అని అడిగారు. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“నిన్న రాత్రి పరుపు మీద మేల్కొనే పడుకొని ఉన్నాను. హఠాత్తుగా బృందా వనంలోని ‘సేథ్’ ఆలయంలో వెలసివున్న నారాయణుని ప్రతిమ నా పక్కన నిలబడి ఉండడం చూశాను. ఆయన కంఠసీమను అలంకరించిన పువ్వులమాల పాదాలదాకా వేలాడుతూవుంది. ఆయన సమక్షంలో గురుదేవులు చేతులు జోడించుకొని నిలబడి వున్నారు. ‘గురుదేవులు ఇక్కడకు ఎలా వచ్చారు?’ అనుకొన్నాను. తరువాత ‘రాస్ బిహారీ నమ్మనంటున్నాడు’ అని చెప్పాను. అందుకు గురుదేవులు, ‘నమ్మక ఏం చేస్తాడు? ఇదంతా నిజం’ అని చెప్పారు. (అంటే కాశీలో మరణించే వారు ముక్తి పొందడం)
“నారాయణుడు నాకు రెండు విషయాలు చెప్పాడు. అందులో ఒకటి: ‘భగ వంతుణ్ణి తెలుసుకోకుండా వాస్తవాన్ని తెలుసుకోవడం సాధ్యమా?’ రెండవ విషయం మరచిపోయాను.”
ఖగేన్ మహరాజ్: గురుదేవులు నారాయణుని సమక్షంలో ఎందుకు చేతులు జోడించుకొని నిలబడ్డారు?
మాతృదేవి: అది ఆయన నైజం. అందరి ముందూ ఆయన వినమ్రంగా ఉండేవారు.
ఉదయం పూజానంతరం ప్రసాదం తీసుకురావడానికి వెళ్లాను. అప్పుడు మాతృదేవిని, “కాశీలో మరణించే వ్యక్తి ముక్తి పొందుతాడా? మీరు ఏం చూశారు?” అని అడిగాను.
మాతృదేవి: శాస్త్రాలు అలాగే వచిస్తున్నాయి. ఈ నమ్మకంతోనే ఎందరో వస్తున్నారు. భగవంతుణ్ణి శరణు పొందిన వ్యక్తికి ముక్తి కాక మరేం లభిస్తుంది?
నేను: శరణు పొందిన వ్యక్తికి ముక్తి తథ్యం. శరణు పొందని వారికీ, భక్తులు కానివారికీ, ఇతర మతస్థులకీ ముక్తి లభిస్తుందా, లేదా?
మాతృదేవి: వారికీ లభిస్తుంది. కాశీ దివ్యచైతన్యంతో విరాజిల్లే స్థలం. ఇక్కడి క్రిమి కీటకాదులతో సహా సకల ప్రాణికోటి దివ్యచైతన్యవంతమైనవి. భక్తుడు, భక్తుడు కానివాడు, పరాయి మతస్థుడు, క్రిమి కీటకాదులతో సహా ఇక్కడ మరణించే ఎవరి కైనా సరే ముక్తి తథ్యం.
నేను: మీరంటున్నది నిజమేనా?
మాతృదేవి: అవును, నిజమే. లేకుంటే ఈ స్థలానికి వేరే మహత్వం ఏముంది?
ప్రసాదంలోని తీపి వాసన పసిగట్టి ఒక ఈగ నా చేతి మీద వాలింది. ఆ ఈగను చూపిస్తూ, “ఈ ఈగకు కూడానా?” అని మాతృదేవిని అడిగాను.
మాతృదేవి: అవును, ఈ ఈగకు కూడా ముక్తే. ఇక్కడ ఉన్న సకల జీవ రాశులూ చైతన్యమయమైనవి. మేడ మెట్లపై నున్న గూట్లో పట్టుకొన్న రెండు చిన్న పావురాలను భూదేవ్ ఊరికి తీసుకువెళ్లాలనుకొన్నాడు. ‘వద్దు వద్దు. అవి కాశీ వాసులు’ అని చెప్పాను.
తూర్పు వంగదేశం నుండి వచ్చిన స్త్రీలు ఇక్కడ వంగాలీతోలాలో నివసిస్తు న్నారు. వారికి ఇల్లూ వాకిలీ, సొంతం బంధం అనే బంధాలు ఉన్నాయి కదా! కానీ కాశీలో మరణించగోరి వచ్చారు. వివేకవంతులు, విరక్తులు.
నేను: తూర్పు వంగదేశీయులు ఎంత వివేకవంతులో చూశారా?
మాతృదేవి: అవును. మన ఊళ్లో ఉంటున్న వారికి వివేకం లేదు. రాధూ అత్తగారి ఇల్లు చూడు. వారికి కాశీలో సొంత ఇల్లుంది. కానీ కాశీలో నివసించడమనే మాటకే హడలిపోతారు. సొంత ఊళ్లో నివాసముంటే చావు రానేరాదనుకొంటారేమో! కానీ చావు నీడలా వెంటాడుతూంటుంది.
నేను: ఇక్కడ మరణించే వారు ముక్తి పొందుతారని నిజంగానే చెబుతున్నారా?
మాతృదేవి (కాస్త కోపంగా) : నీ కోసం మూడుసార్లు ప్రమాణం చేసి చెప్ప లేను. ఒకసారి ప్రమాణం చేయడమే మంచిది కాదు. ఇక మూడుసార్లా, అదీ కాశీ క్షేత్రంలో!
నేను (నవ్వి) : అమ్మా! నాకు కాశీలో మరణం రాకుండా చూడండి. కాశీలో నేను మరణిస్తే నే నెక్కడ? మీ రెక్కడ? పరస్పరం చూసుకోలేకపోతాం!
మాతృదేవి (నవ్వుతూ) : ఏం చెబుతున్నాడు వీడు – కాశీలో మరణించడానికి ఇష్టపడడట!
నేను: అమ్మా, దర్శనం ఏదైనా కలిగితేనే కదా నమ్మగలను.
మాతృదేవి: మహాత్ముల వచనాల పట్ల విశ్వాసం కలుగకపోతే ఏం చేయగలం? ఋషులు, మునులు బోధించిన, అనుసరించిన మార్గం తప్ప మరో మార్గం ఉందా ఏమిటి?
నేను: ప్రత్యక్షంగా దర్శించిన వారు చెప్పింది వినకుండా నేనేం చేయగలను? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పేదాకా మిమ్మల్ని వదలిపెట్టనమ్మా!
మాతృదేవి: నీకు విశ్వాసం ఉన్నా, లేకున్నా భగవంతునికి ఏం పట్టింది? శుకదేవుడు కూడా మహా అయితే ఆయనకు ఒక చీమ కింద లెక్క. ఆయన అనం తుడు. ఆయన గురించి నువ్వు ఏం అవగతం చేసుకొన్నావు? గురుదేవులు భగ వంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించారు. ఆయన సమస్తమూ చూశారు. ఆయన సర్వజ్ఞులు. ఆయన వాక్కు వేదవాక్కు. ఆయన మాటలు విశ్వసించకపోతే మరేం చేస్తావు?
నేను: శాస్త్రాలు ఏవేవో చెబుతాయి. ఒక శాస్త్రం ‘ఇదే సరైన’ దంటుంది, మరొకటి ‘అదే సరైన’ దంటుంది. దేనిని స్వీకరించడం? అందువల్లనే మిమ్మల్ని అడుగుతున్నాను.
మాతృదేవి: అదేమో నిజం నాయనా! భారీవర్షం కురుస్తుందని పంచాంగంలో వ్రాసి ఉంటుంది. అలా అని పంచాంగాన్ని పిండితే ఒక్క చుక్క నీరు కూడా రాదు. శాస్త్రాలలో నిరుపయోగమైన విషయాలు కూడా అనేకం ఉన్నాయి. పైగా వాటి నియమాలను పాటించడమూ అంత సులభం కాదు. ‘నియమాలకు లోబడిన భక్తి భక్తి కాదు’ అని గురుదేవులు చెప్పేవారు.
ఈ కలియుగంలో సత్యనిష్ఠతో జీవనం గడిపితే చాలు, భగవదనుభూతి పొంద వచ్చు. ‘సత్యనిష్ఠాగరిష్ఠుడు భగవంతుని ఒళ్లో కూర్చుని ఉంటాడు’ అనేవారు గురు దేవులు. దక్షిణేశ్వరంలో వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు ఆయనకు నేను రెండుసేర్ల పాలు మరగకాచి ఇచ్చేదాన్ని. ఒక సేరు పాలే అని మాత్రం ఆయనతో చెప్పేదాన్ని. ఒక రోజు గురుదేవులు ఈ విషయం తెలుసుకొని, ‘ఇదేమిటి? సత్యాన్ని పాటించు. ఇలా చూడు. పాలు ఎక్కువగా పుచ్చుకొన్నందు వలన నాకు అజీర్తి చేసింది’ అని చెప్పారు. ఆ ఆలోచన రాగానే ఆయనకు అజీర్ణం కూడా కలిగింది. ఆయనకు సర్వశక్తులూ ఉన్నాయి, మనకు అలా కాదు కదా!
నేను: నేను మిమ్మల్ని ‘అమ్మా’ అని సంబోధిస్తున్నాను. మీరు నిజంగా మా అమ్మేనా?
మాతృదేవి: మరెవరు? నేను నీ అమ్మనే!
నేను: మీరు అలా అనవచ్చు. కానీ నేను దానిని స్పష్టంగా అవగతం చేసుకో లేదు. నన్ను కన్నతల్లిని సహజంగా తెలుసుకోగలిగేలా మిమ్మల్ని తెలుసుకోలేక పోతున్నాను.
మాతృదేవి: అయ్యో, నువ్వంటున్నది నిజమే!
కొన్ని క్షణాల తరువాత, “నాయనా, భగవంతుడే మన తల్లీ, తండ్రి. ఆయనే మన తల్లిగాను, తండ్రిగాను అయివున్నాడు” అని అన్నారు మాతృదేవి.
డిసెంబర్ 16, 1912
మాతృదేవి తమ గదిలో పడుకొని ఉన్నారు. నేను దివ్యదర్శనాల గురించి ప్రస్తావించాను.
నేను: అమ్మా, దివ్యదర్శనాల గురించి చెప్పుకొంటారే, అవి ఆంతరికంగా కనిపించేవా లేక స్థూలదృష్టికి గోచరిస్తాయా?
మాతృదేవి: అన్నీ ఆంతరికమైనవే. కానీ కామార్పుకూర్లో ఉన్నప్పుడు ఈ నా కళ్లతో చూశాను. సుమారు పదకొండు లేక పన్నెండేళ్ల రాధూ లాంటి ఆడపిల్ల నేను ఎక్కడకు వెళ్లినా అక్కడకు నాతోపాటు వచ్చేది. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల ధరించి, సంస్కారహీనమైన శిరోజాలతో ఉండేది. బేలూర్‌లోని నీలాం బరబాబు ఇంట్లో నేను పంచతపమాచరించాను. యోగీన్ కూడా నాతోపాటు ఆచ రించింది. ఆ సాధనానంతరం ఆ దృశ్యం కనిపించడం ఆగిపోయింది.
నేను: తపస్సు చేయవలసిన అవసరం ఏం వచ్చింది?
మాతృదేవి: తపస్సు ఆవశ్యకమే! యోగీన్ ఇప్పుడు కూడా ఉపవాసం చేస్తూన్నది! ఆమె గొప్ప తపస్విని. గోలాప్ జపసిద్ధి పొందింది. ఒక రోజు నరేంద్రుని తల్లి నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడు నరేన్ ఆమెతో, “మీరు తపస్సు చేసి వుండాలి. అందుకే వివేకానందుని పుత్రునిగా పొందగలిగారు. ఇంకా తపస్సు చేయండి. బహుశా అటువంటి మరో పుత్రుణ్ణి పొందవచ్చు” అని అన్నాడు.
నేను: పంచతపం చేసి ఎందుకు శరీరాన్ని కష్టపెట్టారు?
మాతృదేవి: పరమేశ్వరుని కోసం పార్వతీదేవి తపస్సు చేసింది కదా!
నేను: పరమేశ్వరుడు సైతం తపస్సు చేయనే చేశాడు – సదా ధ్యానంలో మగ్నుడైనాడు.
మాతృదేవి: అవును. ఇవన్నీ లోకకల్యాణార్థం చేయబడతాయి. లేకుంటే, ‘ఏం గొప్ప విషయం! సామాన్యులలా తింటూ, నిద్రిస్తూ జీవిస్తున్నారు’ అని చెప్పుకొంటారు. పంచతపం లాంటివి స్త్రీల కోసమే. స్త్రీలు అనేక వ్రతాలు ఆచరిస్తారు కదా! అలాగే ఇదీను.
నేను: అర్థమయింది. ఇదీ ఒక రకం వ్రతం.
మాతృదేవి: గురుదేవులు అన్ని రకాల సాధనలనూ అనుష్ఠించారు. ‘మూసను తయారుచేశాను. ప్రతిమను పోత పోయండి’ అనేవారు గురుదేవులు.
నేను: ప్రతిమను పోతపోయడమంటే ఏమిటి?
భూదేవ్: గురుదేవులను తలచుకోవడం.
మాతృదేవి: వీడు అర్థం చేసుకొన్నాడు. ప్రతిమను పోతపోయడమంటే గురుదేవులను ధ్యానించడమూ, ఆయనను గురించి చింతనచేయడమూ. ఆయనను తలచు కొంటే ఆధ్యాత్మిక భావనలూ పొందవచ్చు. ‘నన్ను తలచుకొనే వారికి ఆహార కొరత రాదు’ అనేవారాయన.
మాకు: గురుదేవులే స్వయంగా ఇలా అన్నారా?
మాతృదేవి: అవును, అవి ఆయన వచనాలే! ఆయనను తలపోస్తూవుంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఆయన భక్తులందరూ ఎంత హాయిగా ఉన్నారో చూడు! ఆయన భక్తులలాంటి వారిని మరెక్కడా చూడలేము. ఇక్కడ, కాశీలో నేను ఎందరో సాధువులను చూశాను. ఆయన భక్తులలాంటి వారిని ఒక్కరినైనా చూపగలవా?
నేను: అమ్మా! అందుకు కారణం ఉంది. ఇప్పుడిప్పుడే సంత మూసినట్లుగా ఉంది. దాని గుర్తులన్నీ చెక్కుచెదరక అలాగే ఉన్నాయి. జనసంచారమూ అలాగే ఉంది. అంటే గురుదేవుల భక్తులూ, ఆయన అంతరంగ శిష్యులూ జీవించే ఉన్నారు. అందువలన గురుదేవులు మనకు అతిసమీపంలో ఉన్నట్లు భావిస్తున్నాం. మనలను వదలి ఎంతోదూరం వెళ్లిపోలేదు. పిలిస్తే పలుకుతారనిపిస్తోంది.
మాతృదేవి: అవును, అనేకులకు బదులు వినిపిస్తూనేవుంది.
నేను: రాముడు, కృష్ణుడు తదితరులు ఎన్నో యుగాల క్రితం వారు. మన ప్రార్థనలు వినరానంత సుదూరంలో ఉన్నట్లు కానవస్తోంది.
మాతృదేవి: అవును, అది నిజమే.
కాశీపూర్ ఉద్యానం గురించి ప్రస్తావన వచ్చి, మాతృదేవి ఇలా అన్నారు:
“అటువంటి పుణ్యస్థలంలో ప్రస్తుతం ఎవరో ఒక ఆంగ్లేయుడు కదా నివ సిస్తున్నాడు! గురుదేవులు తమ అవసాన కాలాన్ని గడిపిన స్థలం అది. ఎంత తపస్సూ, ధ్యానమూ, సమాధిస్థితులను ఆ స్థలం సంతరించుకొన్నదో కదా! ఆయన మహాసమాధి చెందిన స్థలం, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిన స్థలం. అక్కడ ధ్యానం చేస్తే అను భూతి పొందడం తథ్యం. కాశీపూర్ ఉద్యానగృహ యజమానికి గురుదేవులు కలలో కనిపించి ఆ స్థలాన్ని బేలూరు మఠానికి ఇచ్చి చేయమని ఆదేశిస్తే ఆ స్థలాన్ని పొంద వచ్చు.*
“గురుదేవుల నిర్యాణానంతరం నరేన్ ప్రభృతులు, ‘మూడు రోజులన్నా ఈ ఇల్లు ఉంచుకొందాం. మాతృదేవి అపరిమిత దుఃఖంలో ఉన్నారు. మేం బిచ్చమెత్తి ఆమెకు ఆహారం సమకూర్చుతాం’ అన్నారు. కానీ రామచంద్ర దత్త మొదలైన పెద్దలైన భక్తులు వారి మాటలను పట్టించుకోలేదు; ఇంటిని ఖాళీ చేయమని చెప్పే శారు. ఈ గిరీష్‌బాబు ఇప్పుడు గొప్ప భక్తుడైపోయాడు! బలరాంబాబు మొదలైన వారంతా వచ్చారు, వెళ్లారు, పడి పడి నమస్కారాలు చేశారు, అంతే.
“శరత్ ఉన్నంతదాకా కలకత్తాకు పోయిరావచ్చు. ఆ తరువాత నా బాధ్యతను స్వీకరించేవారు ఎవరూ కనబడడం లేదు. యోగేన్ ఉండేవాడు. కృష్ణలాల్ ఉండేవాడు. అతడు యోగేన్ శిష్యుడు. నెమ్మదస్థుడు, బుద్ధిమంతుడు. కాని అన్నివిధాల తగిన వాడు శరత్ మాత్రమే. శరత్ నా భారవాహకుడు. రాఖాల్, శరత్ దేహస్మృతికి అతీతులైనవారు.”
నేను: రాఖాల్ మహరాజ్ చేయలేరా?
మాతృదేవి: చేయలేడు. ఆతడిది అటువంటి ప్రవృత్తి కాదు. శారీరకపరమైన ప్రయాసలను అతడు ఎదుర్కొనలేడు. ఆతడి స్వభావమే పూర్తిగా వేరు.
నేను: బాబూరాం మహరాజ్?
మాతృదేవి: లేడు, అతడు కూడా చాలడు.
నేను: ఏమిటి? ఆయన బేలూరు మఠ నిర్వహణ చేస్తున్నారు కదా!
మాతృదేవి: కావచ్చు. కానీ స్త్రీల విషయాలను అర్థం చేసుకొని వ్యవహరించడం మామూలు సంగతి కాదు. దూరంగా నిలబడి, ‘ఎలా ఉన్నావు’ అని కుశల ప్రశ్నలు వేయడం లాంటిది కాదది.
రాధూ వివాహ విషయమే చూడు. రాధూ వివాహమా? అది మాతృదేవి సమస్య. ‘నా మాతృదేవి సమస్య’ అని ఎందరు పరిగణిస్తారు! నాకు సొంతం ఎందరున్నారు? ఇద్దరో ముగ్గురో, అంతే! ‘అతిసన్నిహితులని చెప్పుకోవడానికి నా కెందరున్నారు?’ అనేవారు గురుదేవులు.
నేను: వీరు ఎవరు ఎవరిగా ఉండేవారో కాస్త చెప్పండి. ఏదీ అర్థం కావడం లేదమ్మా!
మాతృదేవి: నాకేం తెలుసు నాయనా! కానీ ఎవరు మునుపు ఆయనతోపాటు ఏతెంచారో ఇప్పుడు కూడా వారే వచ్చివున్నారు.
నేను: నాలుగు చేతులు కలిగిన దైవాన్ని దర్శించుకోవడం నా కిష్టంలేదు. ఉన్నది చాలు.
మాతృదేవి: నా విషయం కూడా అంతే. అటువంటి దర్శనాలతో ప్రయోజనం ఏమిటి? మనకు గురుదేవులున్నారు, ఆయనే మనకు సర్వస్వమూ!
ఉద్బోధన్, ఫిబ్రవరి 11, 1913
నేను: అమ్మా! స్వామీజీ అనేకులకు మంత్రదీక్ష ప్రసాదించారు. మీరు కూడా అనేకమందికి మంత్రదీక్ష ఒసగివున్నారు. వారంతా వస్తున్నారు, పోతున్నారు. వారిని గురించి మీరు జ్ఞాపకమే చేసుకోవడం లేదే!
మాతృదేవి: ఎందరో వస్తున్నారు. అందరినీ జ్ఞాపకముంచుకోవడం సాధ్య మేనా? దీపం వెలుగుతూన్నప్పుడు పురుగులు వస్తాయికదా! అదీ అటువంటిదే.
నేను: మంత్రం స్వీకరించడం వలన వారికి ప్రయోజన మేమిటి? మునుపు ఎలా ఉండేవారో ఇప్పుడూ అలాగే ఉన్నారు.
మాతృదేవి: మంత్రం మూలంగా శక్తిని పొందుతారు. గురువు శక్తి శిష్యునికి, శిష్యునిది గురువుకు సంక్రమిస్తాయి. అందుకే కదా దీక్షను ఇవ్వడం వలన పాపాలు పుచ్చుకొని ఇన్ని రోగాలను అనుభవించవలసి వస్తూన్నది. గురువుగా వ్యవహరించడం ఎంతో కష్టం. శిష్యుని పాపాలు గురువు స్వీకరించాలి. శిష్యుడు పాపం చేస్తే అది గురువును కూడా బాధిస్తుంది. శిష్యుడు సజ్జనుడిగా ఉంటే గురువు కూడా లబ్ధి పొందుతాడు. కొందరు సత్వరమే పురోగమిస్తారు, కొందరు మెల్లగా పురోగతి పొందుతారు. అంతా సంస్కారాలను బట్టే ఉంటుంది.
అందువలననే రాఖాల్ దీక్ష నివ్వడానికి సంకోచిస్తాడు. “అమ్మా! మంత్రదీక్ష ఇవ్వగానే నేను పడకబెట్టాల్సి వస్తోంది. మంత్రదీక్ష అనే మాట చెవినపడగానే జ్వరం వచ్చేస్తుంది” అన్నాడు నాతో.
ఒక సన్న్యాసి మంత్రదీక్ష కోసం ఒక యువకుణ్ణి మాతృదేవి వద్దకు పంపిం చాడు. అతడి నుండి వివరాలు తెలుసుకొని, “నీ కులగురువైన గోవింద గోసాయి వద్దే మంత్రదీక్ష పుచ్చుకో” అని చెప్పి, మంత్రోపదేశం ఇవ్వడానికి మాతృదేవి నిరాక రించారు. ఆ తరువాత, “కులధర్మాలను విడనాడడం మంచిది కాదు. సామాజిక ఆచారవ్యవహారాల ప్రకారం ప్రవర్తించాలి” అని చెప్పారు.
రాత్రి భోజనానంతరం తమలపాకు చిలకలను తీసుకురావడానికి వెళ్లాను. పక్క గదిలో మాతృదేవి పిల్లలకు దోమతెర కడుతున్నారు. పిచ్చి అత్తయ్యతో ఆమె అన్న మాటలు స్పష్టంగా నాకు వినిపించాయి:
“నన్ను సామాన్య వ్యక్తిగా పరిగణించకు. నా ఏడు తరాల వారిని నిందించావు. దానిని అపరాధంగా భావించను, ఏదో వాగుతున్నావని వదలిపెడుతున్నాను. నేను దానిని అపరాధంగా పరిగణిస్తే, ఇక నిన్నెవరు కాపాడగలుతారనుకొన్నావు? నేను జీవించి ఉండడం నీకు శ్రేయస్కరం. నీ కుమార్తె నీదే. ఆమె పెరిగి పెద్దదయ్యేదాకా చూసుకొంటాను. అంతే! నా కెందు కీ మాయ? నేను తలచుకొంటే దానిని ఈ క్షణంలోనే నరికివేయగలను. కర్పూరంలా ఎప్పుడో ఒక రోజు కరిగిపోతాను. నా జాడ కూడా నీకు తెలియరాదు.”
పిచ్చి అత్తయ్య: నే నెప్పుడు నిన్ను తిట్టాను. ఏదో వాగాను. ఎవరిని ఇష్టపడితే వారికి ఇచ్చుకో. నాకేం పట్టింది?
మాతృదేవి తమ డబ్బునంతా రాధూకే కేటాయించి ఉంచాలని ఆమె భావిస్తున్నది.
మాతృదేవి: చిన్నపిల్ల వంటి స్వభావం గల దాన్ని. ఈ లెక్కలూ అవీ నా చేతకాదు. ఎవరడిగినా ఇచ్చేస్తాను.
కాశీ నుండి తిరిగి వచ్చాక మాతృదేవి కొన్ని రోజులు కలకత్తాలో బస చేసి, ఆ తరువాత జయరాంబాటికి బయలుదేరారు. ఫిబ్రవరి 25 వ తేదీన కోల్పారా చేరుకొన్నారు. పూజామందిరం ప్రక్కనున్న గదిని ఆమె కోసం ప్రత్యేకంగా కేటాయిం చారు. ఒక రోజు నేను ఒక మర్రి విత్తనం తెచ్చి, “అమ్మా, ఈ విత్తనం చూడండి. బచ్చలికూర విత్తనం కంటే చిన్నది. దీని నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉత్పన్నమవు తుంది. ఏం అద్భుతం!” అని చెప్పాను. అందుకు వెంటనే మాతృదేవి, “ఎందుకు కాదు? బీజమంత్రం ఎంత చిన్నది. దాని నుండి చైతన్యం, భక్తి, ప్రేమ ఇత్యాదులన్నీ సముచిత తరుణంలో జనించడం లేదా?” అన్నారు.
జయరాంబాటి చేరుకొన్న తరువాత రాత్రి భోజనానికి కూర్చున్నాం. మాలో ఎవరో, “అమ్మా, చూశారా! వీరిది (మాతృదేవి సోదరులది) నిర్లక్ష్య వైఖరి. మీరు వస్తున్నారని తెలిసి కూడా, నదిని దాటే చోటికి ఎవరినీ పంపలేదు” అన్నారు.
మాతృదేవి ఈ విషయం తమ పెద్ద తమ్ముడితో (ప్రసన్న) చెబుతూ, “ఎందుకు ఎవరినీ పంపలేదు? బిడ్డలు కూడా నాతో వస్తున్నారు కదా! నుమ్వా రాలేదు, ఎవరినీ పంపనూలేదు” అన్నారు.
ప్రసన్న: అక్కయ్యా! కాళీకి భయపడే నే నెవరినీ పంపలేదు. నిన్ను నా వైపునకు తిప్పుకోవడానికే అలా చేస్తున్నానని అతడంటాడు. నువ్వు ఎవరో, ఈ భక్తు లందరూ ఎవరో నాకు తెలియదా? నా కన్నీ తెలుసు. కానీ నేను నిస్సహాయుణ్ణి. నీకు సేవ చేసే అదృష్టం నాకీ జన్మలో భగవంతుడు ప్రసాదించలేదు. పోనీలే, రానున్న జన్మలలో కూడా నిన్నే నా అక్కయ్యగా పొందాలని నన్ను ఆశీర్వదించు. నాకు మరేమీ వద్దు.
మాతృదేవి: మళ్లీ మీ కుటుంబంలోనా? ఇప్పటికే చాలు చాలనిపించింది. ‘కౌసల్య కడుపున మళ్లీ పుట్టనేకూడ’ దన్నాడట రాముడు. మీ ఇంట్లో మళ్లీనా! మన తండ్రి పరమ భక్తుడూ, పరోపకారీను. మన తల్లి కరుణామయి. అందుకే ఈ కుటుంబంలో జన్మించాను.
ఒక రోజు ప్రసన్న మామయ్య మాతృదేవి వద్దకొచ్చి, “అక్కయ్యా! నువ్వు ఎవరికో కలలో కనిపించి మంత్రోపదేశం చేసినట్లూ, ఆ వ్యక్తి ముక్తి పొందుతాడని ఆశీర్వదించినట్లూ విన్నాను. మమ్మల్ని ఒళ్లో చేరదీసి పెంచావు. మేం సదా ఇలాగే ఉండిపోవాలా?” అని అడిగాడు.
మాతృదేవి: గురుదేవుల ఇచ్ఛ మేరకే అంతా జరుగుతుంది. శ్రీకృష్ణుడు గోప బాలురతో ఆడుకొన్నాడు, నవ్వుతూ తిరుగాడాడు, వారితోపాటు భుజించాడు, ఎంతో సన్నిహితంగా మెలగాడు. కానీ శ్రీకృష్ణు డెవడో వారు గ్రహించగలిగారా?
ఒక రోజు మేమంతా భోజనాలు ముగించి ఆ చోటును శుభ్రపరచబోతున్నాం. వెంటనే మాతృదేవి, “వద్దు వద్దు. అవన్నీ చేయకండి. మీరంతా అమూల్య రత్నాలు” అంటూ వారించారు. భక్తులు పట్టుబట్టినప్పుడు, “పని మనిషి ఉంది కదా! ఆమె చేస్తుంది” అన్నారు.
జయరాంబాటి, మార్చ్ 14, 1913
శ్యాంబజార్ వాస్తవ్యుడైన డాక్టర్ లలిత్‌బాబు, ప్రబోధ్బాబు వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలప్పుడు వారు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, మాట్లాడ సాగారు.
లలిత్‌బాబు: ఆహారం విషయంలో మేం ఎలాంటి నియమాలు పాటించా లమ్మా?
మాతృదేవి: ఆద్య శ్రాద్ధాహారం* తినకూడదు. అది భక్తికి భంగం కలిగిస్తుంది. శ్రాద్ధతంతులో తక్కిన ఆహారం తినవచ్చు. ఆద్య శ్రాద్ధాహారం తినరాదని గురుదేవులు నొక్కివక్కాణించి ఉన్నారు. ఏ ఆహారం పుచ్చుకోగోరినా ముందుగా దానిని భగవ దర్పణం చేసిన తరువాతే, తినాలి. భగవదర్పణం చేయని ఏ ఆహారమూ తినరాదు. ఆహారాన్ని బట్టే రక్తం! పరిశుద్ధ ఆహారాన్ని పుచ్చుకొంటే పరిశుద్ధ రక్తం కలుగుతుంది; మనస్సు పరిశుద్ధ మవుతుంది, శక్తి వస్తుంది. మనోపారిశుద్ధ్యం వలన పావన భక్తి జనిస్తుంది, ప్రేమ కలుగుతుంది.
లలిత్‌బాబు: మేం గృహస్థులం. బంధువుల శ్రాద్ధకర్మలప్పుడు మేం ఏం చేయాలమ్మా?
మాతృదేవి: వారి మనస్సును గాయపరచకూడదు. అందువలన శ్రాద్ధానికి వెళ్లండి. ఉరుకుల పరుగుల మీద పనులు చేసిపెట్టండి. కానీ నాడు భుజించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలా కుదరకపోతే ఆ శ్రాద్ధంలో మహావిష్ణువుకో, ఇతర దేవతలకో అర్పించిన ఆహారం తినండి. భగవంతుని ప్రసాదమయితే ఆద్య శ్రాద్ధాహారాన్ని కూడా భక్తులు పుచ్చుకోవచ్చు.
లలిత్‌బాబు: శ్రాద్ధంలో మిగిలిపోయిన వాటిని తరువాత వాడుకోవచ్చునా?
మాతృదేవి: వాడుకోవచ్చు, దోషం లేదు. గృహస్థుడు మరేం చేయగలడు?
ప్రబోధ్బాబు: అమ్మా! గురుదేవులు పరిత్యాగాన్ని ఎంతగానో అభిలషించేవారు. కానీ అటువంటి పరిత్యాగాన్ని మేం ఏ కించెత్తో కదా పాటిస్తున్నాం.
మాతృదేవి: క్రమంగా పాటించగలుగుతారు. ఈ జన్మలో కొంత, రాబోయే జన్మలో మరికొంత – ఇలా క్రమంగా పాటిస్తారు. తొడుగు మాత్రమే మారుతుంది, ఆత్మ అట్లే ఉంటుంది!
కామినీ కాంచన త్యాగం. “నేను కోరుకొనివుంటే మధుర్బాబుతో చెప్పి కామార్పుకూర్ను స్వర్ణమయం చేసివుందును. కానీ దానివలన ప్రయోజనమేమిటి? అవన్నీ అనిత్యాలే కదా!” అనేవారు గురుదేవులు. కొందరికి ఇది చివరి జన్మ అని చెప్పేవారు. “చూశావా, వాడికి దేనిపట్లా కోర్కె లేదు. ఇది ఆతడి ఆఖరి జన్మ” అనేవారు.
భక్తులు మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నారు.
సాయంత్రం మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని ఆమెతో మాట్లాడసాగాను.
నేను: స్వామీజీ శూద్రులైనందున ఆయనకు సన్న్యాసార్హత లేదని కొందరంటు న్నారు. అందుకు స్వామీజీ, ‘నేను కాయస్థుణ్ణి, అంటే క్షత్రియుణ్ణి. అందువలన సన్న్యాసం పుచ్చుకోవడానికి అర్హత ఉంది’ అని బదులిచ్చారు.
మాతృదేవి: నాయనా, ఆ విషయాలన్నీ నాకు తెలియవు. తెలిసింది ఒకే ఒక్కటి. సప్త ఋషులలో ఒకరు కిందికి దిగివచ్చారు. ఇంతవరకే నాకు తెలుసు.
అంతేగాక గురుదేవుల శిష్యులు జ్ఞాని సన్న్యాసులు. జ్ఞాని, సన్న్యాసం పుచ్చు కోవచ్చు. గౌరీని ఉదాహరణగా తీసుకోవచ్చు. స్త్రీలకు సన్న్యాసం నిషిద్ధం. కాని గౌరీ కేవలం స్త్రీమాత్రురాలేనా? ఆమె పురుషులకేమాత్రం తీసిపోదు. ఆమెలా ఎందరు పురుషులున్నారు? పాఠశాల స్థాపించి, బండ్లు కొనుగోలుచేసి, గుర్రాలూ కొన్నది. అలా ఎన్నో సాధించింది. ‘ఒక స్త్రీ సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత ఆమెను స్త్రీగా పరిగణించరాదు’ అనేవారు గురుదేవులు. ఒక రోజు ఆయన గౌరీతో, ‘నేను నీళ్లు పోస్తాను, నువ్వు మట్టిని తయారుచేయి’ అన్నారు.
జయరాంబాటి, మార్చ్ 28, 1913
ఉదయం వేళ. మాతృదేవి ఇంట్లోకి వెళ్లాను. ఆవిడ అప్పుడు కూరలు తరుగు తున్నారు.
నేను: అమ్మా! ఆకుకూరతోపాటు మరేదో తరుగుతున్నారే! ఏమిటది?
మాతృదేవి: ఇది పుల్పూలన్ ఆకు. శ్రీకృష్ణుని మేనిచాయ ఈ పువ్వు రంగును పోలివుంటుంది.
మధ్యాహ్నమయింది. భోజనానికి కూర్చున్నాం. పిచ్చి అత్తయ్య ఎవరో బంధువు కోసం విస్తరి వేసి, నీళ్లు కూడా పెట్టింది. ఇంతలో ఒక పిల్లి వచ్చి ఆ నీటిలో కొంత తాగేసింది. దాంతో మళ్లీ నీళ్లు తెచ్చి ఉంచింది. పిల్లి మళ్లీ వచ్చి ఆ నీటిని తాగింది. ఇలా మూడవసారి కూడా తాగేసింది. ఇక పిచ్చి అత్తయ్య కోపం అవధులు దాటింది. “ఓ పిల్లీ! నీకు వినాశకాలం దగ్గర పడింది. నిన్ను చంపిన తరువాతే నాకు మరో పని” అంటూ కేకలు వేస్తూ ఆ పిల్లిని తరుముకు వెళ్లింది.
మాతృదేవి ఇదంతా చూస్తూ నిలబడ్డారు. తరువాత పిచ్చి అత్తయ్యతో, “ఇలాచూడు, దాహం వేసిన ప్రాణిని నీళ్లు త్రాగకుండా ఆపకూడదు. ఆ పిల్లి నోరు కూడాపెట్టింది” అన్నారు. ఆ మాటలు విని పిచ్చి అత్తయ్య కోపోద్రేకంతో, “ఇదుగో చూడు!ఈ పిల్లి పట్ల నువ్వు కరుణ చూపాల్సిన పని లేదు. మనుష్యుల పట్ల నువ్వు చూపుతున్న కరుణ చాలు. నీ ప్రేమనంతా వారి వరకే ఉంచేసుకో” అంటూ అరిచింది.
మాతృదేవి గంభీరంగా, “నా కరుణను పొందని వ్యక్తి నిజంగా దురదృష్టవంతుడు. నేను కరుణ చూపని వ్యక్తో, పురుగో, కీటకమో ఏదీ లేదు” అన్నారు.
రాత్రి భోజనాల సమయం. మాతృదేవి బంగాళదుంపల కూర వండారు.దాన్ని వడ్డిస్తూ, “ఎలా ఉందో చెప్పు” అన్నారు. నేను కాస్త తిని, “పథ్యాహారంలా ఉంది. కారం లేదు, ఎవరు వండారు?” అని అడిగాను.
మాతృదేవి: నేనే.
నేను: మీరా?
మాతృదేవి: అవును, నేనే.
నేను: అంత రుచిగా లేదు. మా ఊరి రుచికి దీటుగా లేదు.
మాతృదేవి: పులుసు వేసుకొని కాస్త రుచి చూడు.
నళిని: అత్తయ్యా, మీరు అసలు కారమే వేయడం లేదు. దాన్ని ఎవరు తిన గలరు?
మాతృదేవి (నళినితో): అతడు చెప్పింది వినకు. నువ్వు రుచి చూడు. బాగా ఉండివుంటుంది.
నేను: కొద్ది రోజులుగా మీ వంటకాలను అడిగి మరీ వేసుకొని తిన్నాను.అన్నీ ఒకే రకంగా ఉన్నాయి.
మాతృదేవి: పోనీలే నాయనా! మీ ప్రాంతపు వంటకాలే వండుతాను. నాకునేర్పించు. మిరపకాయలు ఎక్కువగా వేయాలి కదా!
నేను: మరీ ఎక్కువగా వేయరు. కారం కాస్త ఎక్కువ వేయనందువల్ల రుచిలేదని చెప్పలేం.
మాతృదేవి (నళినితో): రేపు పప్పు తీసుకురా. పులుసు చేస్తాను. మునుపు బాగా వంటచేసేదానను. ఇప్పుడు అలవాటు పోయింది. కామార్పుకూర్లో లక్ష్మి తల్లి, నేనూ కలిసి వంట చేసేవారం. లక్ష్మి తల్లి బాగా వంటచేస్తుంది.
జయరాంబాటి, మే 8, 1913
రాధూకు ఒంట్లో బాగాలేదు. పిచ్చి అత్తయ్య, మాతృదేవిని తిట్టడం ప్రారం భించింది. “మందులు ఇచ్చే నా కుమార్తెను చంపేస్తావు” అంటూ మొదలుపెట్టినోటికి వచ్చినట్లు తిట్టసాగింది. చివరకు వరద మామయ్యను పిలిపించారు. ఆయన వచ్చి ఆమెను ఇంట్లో నుండి బయటకు తరిమిగొట్టాడు. మాతృదేవి కూడా సహనం కోల్పోయారు. “ఇదిగో చూడు, నా సహనానికీ ఒక హద్దుంది. నేను పొంగితే ఈ లోకంలో నిన్నెవరూ కాపాడలేరు. పాపపుణ్యాలు సోకని వ్యక్తిని నేను” అన్నారామె.
తరువాత కాసేపటికి, “ ‘తుయి’* అని సైతం నన్ను సంబోధించని ఒకరికి నేను జీవిత భాగస్వామినయ్యాను. కానీ ఈమె నన్ను రేయింబవళ్లూ తిడుతున్నది. ఏ పాపం చేసుకొన్నానో తెలియడంలేదు. బహుశా ముళ్లున్న బిల్వపత్రాలతో శివుణ్ణి అర్చించానేమో! ఆ ముల్లు ఈ ముల్లుగా వచ్చింది కాబోలు” అని చెప్పారు.
మే 12, 1913
రాధూ జ్వరమూ, బాధా తగ్గలేదు. దానిని ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు:
“నా మనస్సు కించిత్తు కూడా రాధూ వైపునకు పోవడం లేదు. ఆమె రోగంతో విసిగిపోయాను. బలవంతంగా మనస్సును ఆమె మీద ఉంచేదాన్ని. ‘భగ వంతుడా! నా మనస్సును కొంతైనా రాధూ వైపునకు మళ్లించండి. లేకపోతే ఆమెను ఎవరు చూసుకొంటారు?’ అని గురుదేవులను ప్రార్థిస్తాను. ఇటువంటి రుగ్మతను నే నెన్నడూ చూడలేదు. బహుశా గత జన్మలో వ్యాధి సోకి ప్రాయశ్చిత్తం చేయకుండానే ఈమె చనిపోయిందేమో!
“నాకు రెండు కోర్కెలున్నాయి. మొదటిది: దివ్యావేశంలో నృత్యం చేయడాన్ని చూడడం. ఎందుకో ఈ కోర్కె తలెత్తింది. రెండవది: చాంద్రాయణవ్రతం* ఆచరిం చడం.
“ఒక వ్యాధి సోకినప్పుడు, అందుకు ప్రాయశ్చిత్తం జరుగకుండానే మరణిస్తే, మరుజన్మలో ఆ వ్యక్తిని అదే వ్యాధి సోకుతుంది. కానీ సాధువులకు ఇది వర్తించదు.”
కేదార్ తల్లి: సాధువు భగవంతుని పావన నామాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాలు వదలుతాడు కనుక వారు భగవంతుని చేరుకొంటారు.
మాతృదేవి: నిజమే. నాడు ఒక యువకుడు కోల్పారాలో మరణించాడు కదా! అతడు మళ్లీ జన్మిస్తాడా ఏమిటి? జన్మించడు.*
కాశీపూర్‌లో గురుదేవులు వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నారు: ‘ఈ వ్యాధి సోకింది. ప్రాయశ్చిత్తం ఏదీ చేయలేదని ఆలయ అధికారులు విమర్శించ వచ్చు. రాంలాల్ ! ఈ పది రూపాయలు పుచ్చుకొని దక్షిణేశ్వరానికి వెళ్లి కాళీమాతను అర్చించు; డబ్బును బ్రాహ్మణులకూ, ఇతరులకూ పంచి ఇవ్వు.’
సాధువులు కర్మలు నిర్వర్తింప నక్కరలేదు. అందుకే డబ్బును తమ ఇష్టదైవానికి అర్పించి, తరువాత దానం చేయమని గురుదేవులు చెప్పారు.
ప్రాచీన కాలంలో మునులు, ఋషులు అరణ్యాలలో నివసించేవారు. చాంద్రా యణం లాంటి వ్రతాలను వారు ఆచరించడం సాధ్యమా? కనుకనే పండ్లు, కంద మూలాలను ఇష్టదేవతకు అర్పించిన తరువాత అందరికీ పంచిపెట్టేవారు. అందు వలన వారికి తగిన ఫలం లభించింది.
పిచ్చి అత్తయ్య: నా అత్తయ్య కూడా ఏదో వ్యాధి కారణంగా మరణించింది. ఆమె అదే వ్యాధితో మళ్లీ పుట్టిందని అంటారా?
మాతృదేవి: నీ అత్తయ్య మళ్లీ పుట్టలేదని నువ్వు అనుకొంటున్నావా? కచ్చి తంగా ఆమె మళ్లీ పుట్టింది. ఆ వ్యాధి కూడా సంక్రమించి ఉంటుంది. కొన్ని సమయాలలో కర్మఫలం కారణంగా పదేపదే అదే కుటుంబంలో జన్మించవలసి వస్తుంది. గయలో పిండప్రదానం చేస్తే సద్గతి కలుగుతుంది.
నేను: రాంచీలోని భక్తుడొకరు గురుదేవులను కలలో దర్శించాడట. ఆయన కాషాయాంబరాలు, కాళ్లకు పావుకోళ్లు ధరించి, చేతిలో పటకారుతో* కనిపించారట. అదేం వేషమమ్మా?
మాతృదేవి: అది సన్న్యాస వేషం. తాము ఒక బావుల్* సన్న్యాసిగా మళ్లీ అవతరించనున్నానని గురుదేవులు చెప్పారు కదా!
నేను: అమ్మా! మా ఊరికి ఎవరూ రాలేదు. మీ రొకసారి రావచ్చు కదా!
మాతృదేవి: మీ ఊరికి ఎలా వెళ్లాలి? రైలులోనా, పడవలోనా, స్టీమర్లోనా? ఒకసారి వెళితే పోతుంది. ఆయన ఇచ్ఛ మేరకు జరుగుతుంది. ఆయన నాతో, ‘నేను వెళ్లని చోట్లకల్లా నువ్వు వెళ్లిరా’ అని చెప్పివున్నారు. కనుకనే ఆయన ఆశీర్వాదాలతో రామేశ్వరం లాంటి తీర్థస్థలాలకు వెళ్లివచ్చాను.
నేను: అమ్మా! దశావతారాల గురించి శాస్త్రాలు చెబుతున్నాయి. చైతన్యులు, రామకృష్ణుల లాంటి వారిని గురించి ఏమీ చెప్పడం లేదే?
మాతృదేవి: వారి చేతలను ఎవరు అర్థం చేసుకోగలరు? అంతా ఒక క్రీడ, లీలావినోదం!
జయరాంబాటి, జూన్ 8, 1913
సు రేంద్రనాథ్ భౌమిక్, డాక్టర్ దుర్గాప్రసాద్ వచ్చి మాతృదేవి ఇంట్లో బసచేసి ఉన్నారు. నేటి మధ్యాహ్నం బయలుదేరతారు. ఉదయం స్నానం చేసివచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు. ఆమె వారి తలలను స్పృశించి ఆశీర్వదించి కూర్చోమన్నారు.
సురేంద్ర: అమ్మా! గురుదేవులను పూజిస్తున్నప్పుడు ఒక ఇబ్బంది కలుగుతోంది. ఇష్టదైవమూ, గురుదేవులూ ఒక్కరే అనే విశ్వాసం ఉన్నప్పటికీ, గురుదేవుల ప్రతిమలో దేవిని పూజించి, ‘హే మహేశ్వరీ, నీ అనుగ్రహంతో……’ అని చెప్పేటప్పుడు మనస్సులో గందరగోళం ఏర్పడుతున్నది.
మాతృదేవి (నవ్వుతూ) : నాయనా! ఆయనే మహేశ్వరుడూ, మహేశ్వరీ ఆయనే! ఆయన సకల దైవస్వరూపులు. ఆయన సకల మంత్రస్వరూపులు. ఆయనలో సకల దేవీదేవతలను పూజించవచ్చు. మహేశ్వరా అని ప్రార్థించినా, మహేశ్వరీ అని ప్రార్థించినా సారం ఒక్కటే.
సురేంద్ర: అమ్మా! ధ్యానాదులలో మనస్సు అసలు మగ్నం కావడం లేదే!
మాతృదేవి: అదేం ఫరవాలేదు. గురుదేవుల ఛాయాచిత్రాన్ని చూస్తూవుండు. అది చాలు. కాశీపూర్‌లో గురుదేవులు వ్యాధిగ్రస్థులై ఉన్నప్పుడు యువకులు ఆయనకు సేవచేస్తూ వచ్చారు. వారిలో గోపాల్ కూడా ఉన్నాడు. ఒక రోజు అతడు గురుదేవుల సేవను విస్మరించి ధ్యానం చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ఎంతోసేపు ధ్యానంలో కూర్చున్నాడు. ఇది విన్న గిరీష్‌బాబు, “కళ్లు మూసుకొని గోపాల్ ఎవరిని ధ్యానిస్తూ న్నాడో, ఆయన బాధతో పడుకొనివున్నారు. గోపాల్ ఏం ధ్యానం చేస్తున్నాడో ఏమో!” అని వ్యాఖ్యానించాడు. తరువాత గోపాల్‌ను పిలిపించారు. గురుదేవులు అతణ్ణి తమ కాళ్లు ఒత్తమన్నారు. “కాళ్లు నొప్పిగా ఉన్నాయని ఒత్తమనడం లేదు. నువ్వు చెల్లిం చాల్సిన బాకీ ఉంది, అందుకే!” అని చెప్పారు గురుదేవులు. గురుదేవులను చూస్తూ ఉండు, సకలమూ సిద్ధిస్తుంది.
సురేంద్ర: అమ్మా రోజూ మూడుసార్లు జపం చేయలేకపోతున్నాను.
మాతృదేవి: పోనీలే, గురుదేవులను స్మరించుకో! కుదిరినప్పుడు జపం చేయి. మానసికంగా ఆయనకు ప్రణమిల్ల వచ్చుకదా!
దుర్గాబాబు: అమ్మా! ఆహారం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి?
మాతృదేవి: ఆహారానికి సంబంధించినంత వరకు గురుదేవులు ఒక్క విష యంలో ఎంతో జాగ్రత్త వహించేవారు. ఆద్య శ్రాద్ధాహారం విసర్జించాలని భక్తులకు నొక్కివక్కాణించేవారు. “ఇది భక్తికి ఆటంకం కలిగిస్తుంది” అనేవారు. ఇక తక్కిన ఏ ఆహారాన్ని అయినా ఆయనను తలచుకొని తినవచ్చు.
దుర్గాబాబు: అమ్మా! ఆసుపత్రి పనిలో మధ్య మధ్య దాహంవేసి పలుమార్లు నీళ్లు త్రాగవలసివస్తున్నది. తిండి విషయంలోనూ అంతే! ఏం చేయమంటారు?
మాతృదేవి: ఏం చేయగలవు? పనుల మధ్య వీటిని పుచ్చుకోకుండా ఉండలేవు. గురుదేవులను తలచుకొని పుచ్చుకో! విధి నిర్వహణ కనుక దోషం లేదు. కర్తవ్య పాల నలో నియమాల నన్నిటినీ పాటించడం సాధ్యమా?
సురేంద్ర: అమ్మా, ఇంట్లో పలువురితో కలిసి జీవిస్తున్నాం. వంట పూర్తయ్యే లోగానే ఒక రిద్దరు తినివేయడం జరుగుతోంది. ఆ తరువాత భగవంతునికి నైవేద్యం చేయడానికి సంకోచంగా ఉంది.
మాతృదేవి: కుటుంబంలో అలా జరగడం అనివార్యం. మాకూ అట్టి పరిస్థితి ఎదురవుతూంటుంది. కానీ ఒక్క మాట. ఇంట్లో ఒక రోగి ఉండే పక్షంలో ఆతడి కోసం కొంత ఆహారాన్ని ప్రత్యేకంగా తీసివుంచాలి. కానీ నువ్వు తినేటప్పుడు, గురు దేవులే ఆ ఆహారాన్ని నీకు ప్రసాదించినట్లుగా భావించి, ఆయనను స్మరించుకొంటూ ఆరగించాలి. దాన్లో ఎలాంటి దోషమూ లేదు.
సురేంద్ర: అమ్మా! నా మానసిక స్థితిని ఎలా వర్ణించి చెప్పను? మీరు అంత ర్యామియైన మార్గదర్శి. సర్వం మీకు అర్థమవుతుంది. కొన్ని ఏళ్లుగా నానాకష్టాలు అనుభవిస్తున్నాను. మీ ఆశీస్సులే లేకపోయివుంటే నేను ఇప్పటికే మరణించి ఉండేవాణ్ణి.
మాతృదేవి: అవును నాయనా! సంసార జీవితంలో ఎదుర్కొంటున్న క్లేశాలను గురించి వేరేగా చెప్పాలా? కష్టాలకు అంతే లేదు. మీ విషయంలో అది అనివార్యం. గురుదేవులు నన్ను ఎటువంటి స్థితిలో నిలిపివుంచారో చూడు! ఈమె (రాధూ) వలన నా కెన్ని కష్టాలో తెలుసా?
సురేంద్ర: అవునమ్మా. మీ స్థితిని చూడడం వలన మా కెంతో సాంత్వనమూ, ఆశా కలుగుతున్నాయి. ‘లోకంలోని కష్టాలను మాతృదేవి ప్రత్యక్షంగా చూస్తున్నారు, అందువలన మన పట్ల కారుణ్యం వహించగల’ రనే నమ్మకం కలుగుతోంది.
మాతృదేవి: భయపడవద్దు, నాయనా! గురుదేవులున్నారు. ఇహపరాలలో ఆయన మిమ్మల్ని రక్షిస్తారు.
సురేంద్ర: అమ్మా! కలలు వాస్తవికాలేనా?
మాతృదేవి: అవును, వాస్తవమే. గురుదేవులను గురించిన కలలన్నీ వాస్తవికాలే! వాటిని తమకు సైతం వెల్లడించరాదని ఆయన నిషేధించారు కదా!
సురేంద్ర: అమ్మా, గురుదేవులను మేం చూడలేదు, ఆయనను గురించి మాకు తెలియదు. మాకు మీరే గురుదేవులు.
మాతృదేవి: భీతి చెందకు నాయనా! గురుదేవులే చూసుకొంటారు. ఇహపరా లలో మిమ్మల్ని రక్షిస్తారు. సదా సర్వవేళలా మిమ్మల్ని ఆదుకొంటారు.
భోజనానంతరం ఆ ఇద్దరు భక్తులూ సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు. వరదా మామయ్యకూడా వారితోబాటే వెళ్లాడు. ఆయన కలకత్తాకు పోతున్నాడు. మాతృదేవి కాస్తదూరం వారితోబాటే వెళ్లి, వారు కనుమరుగయ్యే దాకా చూస్తూ నిలబడి వీడ్కొ లిచ్చారు.
బల్లా రతన్గంజ్ పాఠశాలలో సురేంద్ర ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తు న్నాడు. అక్కడి కసాయి వాళ్లు సజీవంగా ఉన్నప్పుడే గోవుల తోలు ఒలిచేస్తున్నారు. ఒక రోజు ఆ ధూర్తులు పాఠశాల ముందే ఆ పని చేశారు. సురేంద్ర, ఇతర ఉపా ధ్యాయులు, విద్యార్థులు, హిందువులు, మహమ్మదీయులు అంతా కలిసి ఆ అకార్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. జనం కొట్లాటకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతా వరణం నెలకొంది. కసాయి వాళ్లు సురేంద్రను బెదిరించారు.
అదే సమయంలో పాఠశాల విద్యార్థులు కొందరు మంత్రోపదేశం కోసం జయరాంబాటికి వెళ్లారు. వారి ద్వారా సురేంద్ర, మాతృదేవికి ఒక ఉత్తరం వ్రాసి పంపాడు. వివరాలు తెలుసుకొని మాతృదేవి దిగ్భ్రాంతురాలై, “ఇటువంటి అకార్యా లను మీరు ప్రతిఘటించకపోతే మరెవరు ప్రతిఘటిస్తారు?” అని వ్యాఖ్యానించారు. సురేంద్రకు ఆదరణ, స్ఫూర్తి అందిస్తూ మాతృదేవి పనుపున ఒక ఉత్తరం పంపించారు. అటువంటి క్రూరమైన పని మళ్లీ జరుగకుండా చూడవలసిందని మాతృదేవి, సురేంద్రకు తెలియచేశారు.
కొద్ది రోజులు గడిచాక మాతృదేవి, “భగవంతుని ఉనికి యథార్థమైతే తప్ప కుండా ఆయన దీనిని నివారిస్తాడు” అని సురేంద్రకు జాబు వ్రాశారు. కొంతకాలానికి న్యాయస్థానంలో దీనిని గురించి ఒక అభియోగం దాఖలు చేశారు; తత్ఫలితంగా అటువంటి క్రూర, నిర్దాక్షిణ్య గోవధ నిలిపివేయబడింది.
జయరాంబాటి, జూన్ 11, 1913
మధ్యాహ్న సమయం. మాతృదేవి ఇంటి వసారాలో నేనూ, మరొకరూ భోజనం చేస్తున్నాం.’
మాతృదేవి: ఈ ఆశ్వయుజ మాసంలో పెద్దగా పోట్లాటలు జరుగుతాయని పంచాంగంలో వ్రాసివున్నట్లు రాధూ చెప్పింది.
నేను: అది ‘పోట్లాటలు’ కాదు, ‘ఘోరమైన అంటువ్యాధులు వ్యాపిస్తా’ యని వ్రాసివుంది.*
మాతృదేవి: గురుదేవుల జన్మానంతరం సత్యయుగం అవతరించింది. తిన్నగా ఆయనతోపాటు వచ్చిన వారిని గురించి ఏమని చెప్పాలి? పుల్లని మామిడి పళ్లు కోకొల్లలు. మంచివి, తియ్యనివి ఎక్కువ లభిస్తాయా? సామాన్యులు ఎందరో పుడతారు, గిడతారు. కాని మహాత్ములైన వారే ఇలా దైవకార్యంలో వారితోపాటు వస్తారు.
నేను: గురుదేవులు జన్మించిన లగాయతు సత్యయుగం ప్రారంభమయిందని స్వామీజీ కూడా చెప్పారు.
మాతృదేవి: అవును, అది నిజమే.
జయరాంబాటి, జూన్ 12, 1913
మధ్యాహ్నం వేళ మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని ఉన్నాను. రాధూకు అన్నం తినిపిస్తున్నారామె. రాధూ తిననని మొరాయిస్తున్నది. “కాస్త తిను, ఇంకా కొద్దిగా తిను” అని చెబుతూ తినిపిస్తున్నారు.
మాతృదేవి: తిండి విషయంలో కించిత్తు అబద్ధం చెప్పి తినిపించడంలో తప్పు లేదు. నేనలా చెబుతూ గురుదేవులను తినేట్లు చేసేదానను.
నేను: అంతా మనస్సుకు సంబంధించిందే!
మాతృదేవి: అవును, సమస్తమూ మనస్సే!
రాత్రి నేను, విభూతి భోజనానికి కూర్చున్నాం.
నేను (విభూతితో): హిస్టీరియా* వ్యాధికి గాను ఒక తాయెత్తును ఎవరివద్ద నుండియైనా పుచ్చుకొని రాధూకు కట్టాలి.
మాతృదేవి: అవును. స్వరూప నారాయణ ధర్ముని ఆలయంలోని పండితులు దీనికి మందు ఇస్తున్నారట. ఆ మందు తెప్పించి రాధూకు ఇవ్వాలనుకొంటున్నాను. ఏదైనా మంత్రం తంత్రం లాంటి చికిత్సలూ చేసి చూడగోరుతున్నాను. ఆ దేవాలయ పుష్పప్రసాదం లభించి మా అమ్మకు కూడా వ్యాధి నయమవడం కద్దు. అప్పటి నుండే ఆ ఆలయం పట్ల నాకు గట్టి విశ్వాసం కుదిరింది.
విభూతి: ధర్మమంటే బుద్ధునికి సంబంధించింది.
మాతృదేవి: మా ప్రాంతంలో కూడా ధర్మానికంటూ ఒక ఆలయం ఉంది.
నేను: ధర్మమంటే బుద్ధునికి సంబంధించినదిగానే అన్నిచోట్ల వ్యవహరింప బడుతుంది.
మాతృదేవి: కానీ ఇక్కడి మూర్తి తాబేలు ఆకారంలో ఉంది. దానిని నారాయణు నిగా వ్యవహరిస్తారు.
విభూతి: చూడడానికి ఒక ఆసనంలా నాలుగు కాళ్లు కలిగివుంటుంది.
మాతృదేవి: అవును, మధ్య భాగం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది.
విభూతి: అది తాబేలు కాదు, బుద్ధుని ఆసనం. ఉన్నదీ లేనిదీ అనే స్థితులకు అతీతమైన సిత్థి కదా బుదున్ధి ది. అందువలన ఆయనకు ఏ రూపమూ ఉండజాలదు. కనుక ఆసనం మాత్రం అమర్చివున్నారు.
మాతృదేవి: కావచ్చు. మా ఊళ్లోని ధర్మరాజు ఆలయంలో బాలురు కూడా పూజిస్తారు. తమకు నచ్చింది నివేదన చేస్తారు. ఎటువంటి నియమాలూ పాటించరు. వీలుంటే రెండు ఎర్రని పువ్వులను అర్పిస్తారు. ఆయన అన్నీ స్వీకరిస్తారు. దేనినీ తప్పుగా పరిగణించరు. లభించిన దానితో సంతోషంగా ఉంటున్నారు.
విభూతి: ఈ మాటలన్నీ ఇప్పుడెందుకు? ఎప్పుడో, ఏ కారణంగానో తండ్రి మరణించాడు. అయితే ఏమిటి?
మాతృదేవి: నిజమే. ఉదాహరణ చూపడం సబబు కాదు. ఉదాహరణ చూపి నందువలన అనుభవించవలసి వస్తుంది. ఎవరు ఎప్పుడు మరణిస్తే ఏమిటి? తండ్రి ఎవరు? తల్లి ఎవరు? సర్వమూ భగవంతుడే!
జూలై 4, 1913
మతృదేవి ఇంటి వసారాలో నేనూ, ముకుందుడూ మధ్యాహ్న భోజనానికి కూర్చున్నాం. పెద్ద మామయ్య ఇంటి వసారాలో తూర్పు వైపు మాతృదేవి కూర్చు న్నారు. అప్పుడు తడి బట్టలతో నళిని వచ్చింది. కాకి తనపై మూత్రవిసర్జన చేసి నందున మళ్లీ స్నానం చేశానని చెప్పింది.
మాతృదేవి: నాకు ఇన్నేళ్లు వచ్చాయి. కాకి మూత్రవిసర్జన వేస్తుందని ఎన్నడూ వినలేదు. మహాపాపమూ, ఘోరపాపమూ చేయకుండా మనస్సు అపవిత్రమవు తుందా? కృష్ణబోసు సోదరి కూడా ఇంతే! గంగలో మునుగుతుంది. ‘తల ముని గిందా?’ అని పక్కవారిని అడుగుతుంది. ఇటువంటి ఆచారాల పిచ్చిగలవారి మనస్సు ఏనాటికీ పావనం కాదు. వారు ఎదిగేకొద్దీ ఆచారాల పిచ్చి కూడా వారితోపాటు పెరుగుతూ వస్తుంది. ఇది అన్నిటి పట్లా నిజం.
నేను: మహాపురుష్ మహరాజ్ కుక్కలతో ఆడుకొనేవారు తరువాత ఆయన పూజ చేయడానికి వెళ్లేవారు. బహుశా ఎవరో ఒకరు ఆయన చేతి మీద నీళ్లు పోస్తారేమో! ఆయన కూడా కాసిని నీళ్లు తల మీద చల్లుకొని పూజకు పోతారు.
మాతృదేవి: వారి విషయమే వేరు. వారి మనస్సులు ఎంత పావనమైనవి! అది సాధువు మనస్సు. గంగాతీరంలో నివసించేవారు దేవతలే! దేవతలు కాకుంటే గంగాతీరంలో నివసించే భాగ్యం కలుగుతుందా? ఆనాటి గంగాస్నానంతోనే ఆనాటి పాపాలు ప్రక్షాళనమైపోతాయి.
నళిని: గోలాప్మా ఒక రోజు ఉద్బోధన్ మరుగుదొడ్డి శుభ్రపరిచారు. తరు వాత బట్టలు మాత్రం మార్చుకొని నైవేద్యం కోసం పండ్లు తరగడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమెతో నేను, “ఏమిటిది? గంగానదిలో స్నానం చేసిరండి” అన్నాను. అందుకు ఆమె, “కావాలంటే నువ్వే స్నానం చేసిరా” అనేశారు.
మాతృదేవి: గోలాప్ మనస్సు ఎంత పరిశుద్ధమైనది! ఎంతటి సమున్నత స్థితిలో నెలకొని ఉంటుంది. అందుకే ఆమె శుద్ధాశుద్ధాలు అంతగా పట్టించుకోదు. ఇదే ఆమె ఆఖరి జన్మ. ఆమెలాంటి మనస్సు పొందడానికి నువ్వు మరో జన్మ ఎత్తాలి.
గంగాతీరం రెండు వైపుల నుండి ఎనిమిది మైళ్లకు పరిశుద్ధమైన వాయువు వీస్తూవుంటుంది. నారాయణుడే వాయువుగా వీస్తున్నాడు. అనేక తపశ్చర్యలు అను ష్ఠించడం వల్లనే మనస్సు పవిత్రతను సంతరించుకొంటుంది. పవిత్రతే మూర్తీ భవించిన భగవంతుణ్ణి తపోధ్యానాదులు ఆచరించకుండా పొందలేం.
భగవదనుభూతి పొందడం వల్ల ఏం జరుగుతుంది? రెండు కొమ్ములు మొలుస్తాయా? లేదు. మనస్సు పావనమౌతుంది. పావన మానసంలో ఆధ్యాత్మిక జాగృతి ఉదయిస్తుంది.
నేను: కొందరు కేవలం భగవంతుని శరణుజొస్తారే కాని జపతసాదులు అను ష్ఠించరు. వారు పురోగమిస్తారా?
మాతృదేవి: భగవంతునితో కలిసి జీవించడమూ, విశ్వాసం కలిగివుండడమూనే సాధన కదా! ఆహా! నరేంద్రుడు ఒకసారి, “లక్ష జన్మలు కలుగుగాక! అందువలన భయమేమిటి?” అన్నాడు. నిజమే కదా! జన్మించడానికి జ్ఞాని భయపడతాడా ఏమిటి? వారికి ఎలాంటి పాపాలూ అంటవు. అజ్ఞాని సదా భయంతో చస్తూవుం టాడు. వాడే బంధంలో చిక్కువడతాడు; పాపాలతో అపవిత్రుడవుతాడు. లక్షలాది జన్మలలో అంతులేని బాధలు అనుభవించి, తదనంతరం భగవంతుని పొందడానికి ప్రయత్నిస్తాడు.
నేను: అనుభవం మూలంగా గుణపాఠం కలుగుతుంది. పిదప జ్ఞానం అబ్బుతుంది.
మాతృదేవి: అవును. ఆవుదూడ హంబా, హంబా (నేను, నేను) అంటుంది. దాని చర్మం, పేగులు మొదలైనవాటి నుండి తప్పెటలు, డోలక్ లాంటి వాద్యాలు తయారుచేస్తారు. అప్పుడు కూడా దెబ్బలు తిని అదే శబ్దం చేస్తుంది. చివరకు దూది ఏకేవాడి చేతిలో పడి తుహూ, తుహూ (నువ్వే, నువ్వే) అని శబ్దం చేస్తుంది.
సెప్టెంబర్ 18, 1913
ఒక భక్తునికి మాతృదేవి ఇలా ఉత్తరం వ్రాయమన్నారు:
“దేహధారణలో సుఖమన్నదే లేదు. ఈ లోకం దుఃఖమయం. సుఖమన్నది నామమాత్రమే. గురుదేవుల అనుగ్రహం పొందినవారు మాత్రమే ఆయనను భగవం తునిగా గ్రహిస్తారు. అదొక్కటే వారికి సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఇది జ్ఞాపకముంచుకో.”
ఒక సన్న్యాస శిష్యుడు జయరాంబాటికి వచ్చి మాతృదేవిని దర్శించుకొని, ఋషీకేశ్కు బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాక ఆయన, మాతృదేవికి ఇలా ఉత్తరం వ్రాశాడు: “అమ్మా! సముచిత తరుణంలో గురుదేవుల దర్శనం కలుగుతుందని చెప్పారు. కానీ ఇంతదాకా లభించలేదు!”
మాతృదేవి: ఆతడికి ఇలా జవాబు వ్రాయి: ‘నువ్వు ఋషీకేశ్కు వెళ్లినందున గురుదేవులు కూడా అక్కడికి వచ్చి ఉండలేరు.’ ఈతడు ఒక సన్న్యాసి. భగవంతుణ్ణి స్మరించడం తప్ప మరేం చేస్తాడు? ఆయన ఇచ్ఛ మేరకు దర్శనమిస్తారు.
ఉద్బోధన్
ఒక యువకుడు మాతృదేవి దర్శనార్థం ఒకటి రెండుసార్లు వచ్చాడు. అతడు పేదవాడు. ఎంతో శ్రమపడితేగాని రాలేడు. కానీ ఆతడి దురదృష్టం. ఆతడు వచ్చి నప్పుడల్లా మాతృదేవికి ఒంట్లో బాగుండేది కాదు. దాంతో ఆమెను దర్శించు కోలేకపోయాడు. కనుక ఒక ఉత్తరం వ్రాశాడు: “ఈసారి వచ్చినప్పుడు నిరాకరించ కండి. ఎంతో ఇబ్బందులుపడి నేను అక్కడకు రాగలుగుతున్నాను. ఈసారి వస్తే మాతృ దేవి దర్శనం కలుగుతుందా?” ఆ ఉత్తరాన్ని మాతృదేవికి చదివి వినిపించారు. అప్పుడామె ఇలా అన్నారు: “ఆతడు వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగుండకపోతే, అతడు తిరిగి వెళ్లవలసిందే! నా ఆరోగ్యం బాగున్నప్పటికీ నేను అందరినీ ఆహ్వానించ లేకున్నాను. వారి పుణ్యాన్నిబట్టీ, కర్మఫలానుసారాన్ని బట్టీ సదవకాశాలూ, సదు పాయాలూ చేకూరుతాయి. ఒక వ్యక్తి అనేకసార్లు రావచ్చు. కానీ నా ఆరోగ్యం బాగా లేనందునో లేక మరేదో కారణంగానో నన్ను చూసే అవకాశం లభించకపోవచ్చు. అది అతడి దురదృష్టం. అందుకు నేనేం చేయగలను? వచ్చిపోవడానికి ఎంతో ఖర్చు కావచ్చు; ప్రతి ఒక్కరికీ డబ్బు ఉండకపోవచ్చు. కానీ గురువు ఎన్నిసార్లు నిరాకరించినప్పటికీ, అనుగ్రహం పొందగోరితే భిక్షమెత్తి అయినా వచ్చితీరాలి. అసలు విషయం ఏమిటంటే: సంసార సాగరాన్ని దాటగోరిన వ్యక్తి ఎలాగో అలా బంధనాలను ఛేదించుకొంటాడు. అతణ్ణి ఎవరూ బద్ధుణ్ణి చేయలేరు. ఆర్థిక ఇబ్బం దులూ, జవాబు కోసం నిరీక్షించడమూ, వెళ్లినా చూడలేకపోతామేమోననే భయమూ – ఇవన్నీ కుంటిసాకులు. పోనీలే, ప్రస్తుతం నా ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంది. ఆతణ్ణి రమ్మని చెప్పు.”
ఒక స్త్రీ, మాతృదేవికి ఇలా ఉత్తరం వ్రాసింది: “అమ్మా! నేను వయస్సులో చిన్నదాన్ని. అత్తమామలు మీ వద్దకు వెళ్లడానికి నన్ను అనుమతించడం లేదు. వారిని వ్యతిరేకించి నేనెలా మీ వద్దకు రాగలను? మీ ఆశీస్సులు పొందగోరు తున్నాను.” తమ శిష్యుణ్ణి, ఆ ఉత్తరానికి ఇలా జవాబు వ్రాయమన్నారు మాతృదేవి: “అమ్మాయీ! నువ్వు ఇక్కడకు రానక్కరలేదు. జగత్తు యావత్తూ వ్యాపించివున్న భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు.”
ఉద్బోధన్, సెప్టెంబర్ 30, 1918
ఉదయం పూజ కోసం మాతృదేవి పండ్లు తరుగుతున్నారు. ఒక భక్తుడు వ్రాసిన ఉత్తరాన్ని మాతృదేవికి చదివి వినిపించాను. ఆ భక్తుడు భగవంతుని పట్ల కాస్త కోపగించుకొన్నట్లున్నాడు. మాతృదేవి ఇలా జవాబిచ్చారు:
“శుకుడు, వ్యాసుడు లాంటి ఋషులు కూడా మహా అయితే పెద్ద చీమలు మాత్రమే అనేవారు గురుదేవులు. భగవంతుడు అపార మహిమాన్వితుడు. నువ్వు ప్రార్థించకపోతే ఆయనకు నష్టమేమిటి? ఆయనను గురించి కనీస ఆలోచన లేకుం డానే అనేకులు కాలం గడిపేస్తున్నారు. అందువలన ఆయనకు ఏం పోతుంది? అది నీ దురదృష్టం. భగవంతుని మాయ అలా ఉంటుంది. మాయకు వశవర్తులై లోకులు అంతా మరచిపోయి జీవిస్తున్నారు. ‘బాగున్నారు, అలాగే ఉంటారుగాక!’ అంటారు ఆయన.”
నేను: వీరు కోరుకోవడం లేదని కాదు. కోర్కే లేకుంటే వారి మనస్సులలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు తలెత్తుతాయి? నిజమైన బంధుత్వమున్న భగవంతుడు తమ నుండి వైదొలగితే తల్లడిల్లిపోతారు. బుద్ధుడు, చైతన్యుల వంటి వారు భక్తుల శ్రేయస్సు కోసం ఎంతో చేశారు కదా!
మాతృదేవి: మన గురుదేవుల వైఖరి కూడా అదే కదా! భక్తుల నందరినీ సదా నేను జ్ఞాపకం ఉంచుకోలేను. నేను గురుదేవులను, ‘భగవంతుడా! సర్వులకూ శ్రేయస్సు అనుగ్రహించండి. అనేకులు అనేకచోట్ల నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ నేను జ్ఞాపకముంచుకోలేను’ అని ప్రార్థించాను. ఆయనే సమస్తమూ చేస్తున్నారు. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు?
నేను: అవును అది నిజమే! కాళీమాతను, దుర్గాదులను అందరూ దేవతలుగా విశ్వసించవచ్చు. కానీ ఒక మానవమాత్రుని భగవంతునిగా పరిగణించడం అంత సులభమా?
మాతృదేవి: అది ఆయన అనుగ్రహం మీద ఆధారపడివుంది.
మరొక రోజు ఒక భక్తుడు వచ్చాను. నేను మాతృదేవితో, “అమ్మా! మీకు ఆ ఉత్తరం వ్రాసిన వ్యక్తి ఇతడే!” అని చెప్పాను. అందుకు మాతృదేవి, “అలాగా! ఇంత మంచివాడా!” అంటూ, ఇలా చెప్పారు:
“నీరు పల్లం వైపు ప్రవహించడం సహజం. కానీ సూర్యకిరణాలు ఆ నీటిని ఆకాశం వైపునకు ఎత్తుతాయి. అదే విధంగా భోగాన్ని ఆశిస్తూ అధోముఖంగా పోవడం మనస్సు స్వభావం. కానీ భగవంతుని అనుగ్రహం దానిని ఊర్ధ్వముఖంగా తీసుకు పోతుంది.”
ఉదయం పదిన్నర గంటలయివుంటుంది. ఒక గృహస్థ భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లాడు.
భక్తుడు: అమ్మా, గురుదేవుల దర్శనం నా కెందుకు లభించడం లేదు?
మాతృదేవి: నిరంతరంగా ప్రార్థిస్తే క్రమేణా సమస్తం లభిస్తుంది. ఋషులు, మునులు యుగాల పర్యంతం తపస్సు చేసి కూడా పొందలేకపోయారు. మీ అంద రికీ ‘మ్’ అనేలోపే అంతర్దర్శనం కలగాలి. ఈ జన్మలో కాకుంటే వచ్చే జన్మలో; వచ్చే జన్మలో కాకపోతే ఆ తరువాత జన్మలో లభిస్తుంది. భగవత్సాక్షాత్కారం అంత సులభమా! కానీ ఈసారి గురుదేవులు సుగమమైన మార్గం చూపించారు. అంతే.
భక్తుడు వెళ్లిపోయిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు: “భోగలాలసలో మునిగి ఉన్నాడు. డజను లెక్కన పిల్లలు! ఇక్కడికి వచ్చి ‘గురుదేవుల దర్శనం ఎందుకు లభించలేదు?’ అంటూ వాగుతున్నాడు.
“గురుదేవుల దర్శనానికి పలువురు స్త్రీలు వచ్చేవారు. ‘మా మనస్సు భగ వంతునిపై ఎందుకు ఏకాగ్రం కావడంలేదు?’ అని అడిగేవారు. అందుకు ఆయన, ‘పడకటింటి వాసన ఇంకా పోలేదు. ముందు ఆ వాసన పోవాలి కదా! అంతలో ఎందుకీ తొందర? క్రమక్రమంగా సమస్తమూ సిద్ధిస్తుంది. ఈ జన్మలో కలుసుకొన్నాం. మరుజన్మలో కూడా కలుసుకొంటాం. అప్పుడు సిద్ధిస్తుంది’ అని చెప్పేవారు.
“శరీరంలో ఉంటూన్నంత దాకా ఒకరిని చూడడం సులభం. ఇదిగో నేను ఉన్నాను. ఇక్కడికి వస్తే నన్ను చూడవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా గురుదేవులను చూడగల మహద్భాగ్యం ఎందరికి ఉంది? విజయగోస్వామి ఢాకాలో చూశారు, దేహాన్ని కూడా స్పృశించి మరీ చూశారట! అది విన్న గురుదేవులు, ‘ఆత్మ ఇలా వెలుపలకు పోవడం మంచిది కాదు. బహుశా ఈ శరీరం ఎక్కువ రోజులు నిలవదేమో!’ అన్నారు.
“అటువంటి అద్భుత దర్శనం ఎవరికి ప్రాప్తించింది? నరేంద్రునికి అలాంటి దర్శనాన్ని ప్రసాదించారు. శుకుడు, వ్యాసుడు, పరమేశ్వరుడు మహా అయితే గండు చీమమాత్రులు. కలలో ఏదో దర్శనం లభించి ఉండవచ్చు. కానీ సూల్థ దృష్టితో ఆయనను దర్శించడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.”
ఉత్తేజపూరితంగా మాతృదేవి ఇలా కొనసాగించారు:
“పావనమైన మనస్సు ఉంటే ధ్యానధారణలు ఎందుకు సిద్ధించవు? దర్శనం ఎందుకు లభించదు? జపం చేయడానికి కూర్చుంటే చాలు, లోపల నుండి మంత్రం దానంతట అదే పెల్లుబికి వస్తుంది – ప్రయత్నపూర్వకంగా కాదు, అప్రయత్నంగా.
“బద్ధకాన్ని వదల్చుకొని, క్రమం తప్పకుండా నియమిత వేళలలో జపధ్యానాదులు అనుష్ఠించాలి. దక్షిణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఒక రోజు ఒంట్లో నలతగా ఉన్నందున కాస్త ఆలస్యంగా నిద్ర లేచాను. ఆ రోజుల్లో వేకువజామున మూడు గంటలకే లేచేదానను. మర్నాడు మరికాస్త ఆలస్యంగా నిద్ర లేచాను. చివరకు చూస్తే వేకువన లేవడానికే మనస్సు సుముఖంగా లేదని తేలింది. ‘ఆహా! బద్ధకానికి అలవాటు పడిపోయాను’ అని గ్రహించాను. ఆ తరువాత బలవంతంగా వేకువనే లేవడానికి ప్రారంభించాను. క్రమంగా పాత అలవాటును పొందగలిగాను. ఇటువంటి విషయీలలో దృఢ సంకల్పం ఉండాలి సుమా!
“తపోసాధనలు అనుష్ఠించడమూ, తీర్థయాత్ర చేయడమూ, డబ్బు సముపార్జించడమూ – వీటినన్నిటినీ ప్రాయంలో ఉన్నప్పుడే చేయాలి. ప్రాయంలో ఉన్నప్పుడు కాలినడకనే కాశీలోనూ, బృందావనంలోనూ అనేక స్థలాలు సందర్శించాను. కానీ ప్రస్తుతం కాస్త దూరం వెళ్లడానికి కూడా పల్లకీ కావాల్సివస్తోంది. ఒకరిని ఆసరా చేసుకోవాల్సి వస్తున్నది. వృద్ధాప్యంలో కఫమూ, జలుబూ లాంటి వ్యాధులు ఒకవైపు పీడిస్తాయి; శరీరం కూడా అలసట చెందుతుంది. మనస్సు ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఇట్టి స్థితిలో ఏదైనా సాధించగలమా? ఇదుగో ఈ యువకులు, యువప్రాయంలోనే భగవంతునికై పరితపిస్తున్నారు. ఇదే సముచిత తరుణం. (నాతో) నాయనా! తపోసాధనలు ఏవైనా ఇప్పుడే, ఈ ప్రాయంలోనే అనుష్ఠించు. తరువాత వీటిని చేయడం సాధ్యమా? కనుక ఈ తరుణంలో చేయగోరినదంతా చేసేయి!”
నేను: ప్రస్తుతం మీ దీవెనలు పొందినవారు ధన్యులు. ఆ తరువాత రానున్న వారి విషయ మేమిటి?
మాతృదేవి: ఏమంటున్నావు? వారికి ఏమీ లభించదనా? భగవంతుడు ప్రతి చోట, సదా సర్వవేళలా ఉండనే ఉంటాడు. గురుదేవులు ఉన్నారు. ఆయన అను గ్రహంతో అంతా సవ్యంగా జరుగుతుంది. పరాయి దేశాలలోని వారికి ఏమీ లభిం చడం లేదా ఏమిటి?
నేను: భగవదనురాగం పొందిన తరువాతనే కదా మనస్సులో వ్యాకులత జనిస్తుంది? మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా?
మాతృదేవి: నేను నిన్ను ప్రేమించడం లేదా? నా కోసం కించిత్తు చేసేవారిని సైతం ప్రేమిస్తాను. నా కోసం నువ్వు ఎంతో చేస్తున్నావు. ఇంట్లో దేనిని తాకినా నువ్వు జ్ఞాపకానికి వస్తావు. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. శరీరం ఉన్నంత దాకా సన్నిహితంగా మెలగగలమా? అది మంచిదా? ఇక్కడున్న అందరినీ ప్రేమిస్తున్నాను. దూరంలో ఉంటున్న వారిని గురించి “ప్రభూ! అనుగ్రహించి వారిని చూసుకోండి. వారిని సదా జ్ఞాపకం ఉంచుకోలేను” అని గురుదేవులను ప్రార్థిస్తాను.
అక్టోబర్, 1918
మాతృదేవి మంచం మీద కూర్చుని ఉన్నారు. కృష్ణలాల్ మహరాజ్ కూడా అక్కడ ఉన్నారు. భక్తుల ఉత్తరాలను చదివి వినిపిస్తున్నాను. ‘మనస్సు ఏకాగ్రం కావడం లేదు’ అని వ్రాస్తున్నారు. అవన్నీ విని మాతృదేవి ఉత్సుకత ఉట్టిపడే స్వరంలో ఇలా అన్నారు:
“ప్రతి రోజు పదిహేను, ఇరవై వేల జపం చేయాలి. చేయగలవా? చేస్తే మనస్సు అదుపులోకి వస్తుంది. కృష్ణలాల్! ఇది స్వకీయ అనుభవం. ముందుగా ఇలా అభ్యాసం చేయాలి. దీన్లో సాఫల్యం పొందకుంటే అడగండి. కానీ మనఃస్ఫూర్తిగా చేయాలి. అలా చేయరు. ‘ఎందుకు సాఫల్యం కలుగలేదు?’ అని మాత్రం అడుగుతారు.”
ఇంతలో ఒక భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, జపధ్యానాల విషయంగా ఏదో అడిగాడు. అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చారు:
“జపమూ, సంఖ్యా, చేతివ్రేళ్లతో లెక్కించడమూ అన్నీ మనస్సును అదుపులోకి తెచ్చుకోవడానికి మాత్రమే. అటూ ఇటూ పరుగెత్తగోరుతుంది మనస్సు. కానీ ఈ పద్ధతుల వలన అది భగవంతుని వైపుగా ఆకర్షించబడుతుంది. జపం చేస్తూ పోగా పోగా, భగవత్సాక్షాత్కారం సిద్ధిస్తుంది; అంటే ధ్యానం సిద్ధించినప్పుడు జపం ఆగి పోతుంది. ధ్యాన సిద్ధితో సమస్తం చేకూరుతుంది.
“చంచలత్వం మనస్సు స్వభావం. అందువలన తొలి దశలో మనస్సును అదుపులో ఉంచుకోవడానికై కొంతమేరకు శ్వాసను నియంత్రించి ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మనస్సు నిలకడ చెందడానికి అది సహకరిస్తుంది. కానీ అతిగా చేయకూడదు. అలా చేస్తే మెదడు వేడెక్కిపోతుంది. భగవత్సాక్షాత్కారమూ, ధ్యానమూ మొదలైనవన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు నిలకడ చెందినప్పుడు అంతా సిద్ధిస్తుంది.
“మనిషి భగవంతుని విస్మరించి జీవిస్తున్నాడు. కనుకనే భగవంతుడు అప్పు డప్పుడు ఈ ఇలలో అవతరించి స్వయంగా సాధనాదులు అనుష్ఠించి మార్గం చూపి స్తాడు. ఈసారి ఆయన పరిత్యాగాన్ని నిర్దేశించారు.”