17 మార్చ్, 1898. సెయింట్ పాట్రిక్ జన్మదినోత్సవం. నా జీవితంలో కూడా అది చిరస్మరణీయమైన రోజు. శ్రీరామకృష్ణుల సహధర్మచారిణియైన శ్రీశారదా దేవిని మేం* ప్రప్రథమంగా ఆ రోజే దర్శించాం. ఒకటి రెండు రోజులు క్రితమే మాతృదేవి జయరాంబాటి నుండి తిరిగి వచ్చారు. బాగ్ బజార్లోని 10/2 బోస్పారా వీథిలోని అద్దె ఇంట్లో బసచేసి ఉన్నారు.
ఆమె యాభై ఏళ్లు వయస్సు దాటని హైందవ వితంతువులలా తెల్లచీర ధరించారు. చీరను ముందు లంగాలా నడుముకు చుట్టుకొని, అట్లే పైకి తీసుకువెళ్లి తలమీద కొంగులా వేసుకొన్నారు – అనేకమంది క్రైస్తవ కన్యాస్త్రీలలా. పురుషులు ఎవరైనా వస్తే తలమీద కొంగును బాగా క్రిందికి లాగుకొని ముఖాన్ని పూర్తిగా మరుగుపరచుకొనేవారు. వారితో ప్రత్యక్షంగా మాట్లాడరు. అక్కడ నిలబడివున్న వృద్ధస్త్రీలు ఎవరైనా ఆమె ప్రక్కన నిలబడతారు. వీరితో మాతృదేవి హీనస్వరంలో మాట్లాడతారు. వీరు ఆ మాటలను బిగ్గరగా చెబుతారు. నా గురునాథుడు కూడా* మాతృదేవి ముఖం చూసింది లేదు.
పురుషులు ఆమెకు ప్రణమిల్లడానికి వస్తే సామాన్యంగా గది గుమ్మం వరకే అనుమతింపబడేవారు. కొన్ని సందర్భాలలో వారు లోపలికి రావడమూ కద్దు. స్త్రీలు మాత్రమే ఉన్నప్పుడు మాతృదేవి ఉండే చోటు ఎంతో సందడిగా ఉంటుంది. హఠాత్తుగా ఒక భక్తుడో, సాధువో మాతృదేవికి ప్రణమిల్లడానికి వచ్చారని తెలిస్తే, అంతే! ఆ గదిలో పరిస్థితులే మారిపోతాయి, మాటలు ఆగిపోతాయి. అటూ ఇటూ తిరగడం ఆగిపోతుంది; స్త్రీలందరూ మేలిముసుగు ధరిస్తారు. మొత్తానికి అప్పుడక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. మాతృదేవి గది మధ్యనున్న తలుపుకు ఎదురుగా ముఖం తిప్పుకొని ఒక వైపుగా కూర్చుంటారు. ఇదంతా క్షణంలో జరిగి పోతుంది. గదిలో నిశ్శబ్దం రాజ్యంచేస్తుంది.
వచ్చే భక్తులు కొందరు తలుపు గుమ్మంమీద తలవుంచి ప్రణమిల్లుతారు. కొందరు లోపలికి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, ఆమెతో మాట్లాడతారు. అప్పుడు మాతృదేవి తన ప్రక్కనున్న స్త్రీతో అతిహీనస్వరంలో తాము చెప్పదలచుకొన్నది చెబుతారు. ఆ స్త్రీ కాస్త బిగ్గరగా అవే మాటలు చెబుతుంది. పిదప ఆ భక్తుడు సెలవు పుచ్చుకొంటున్నప్పుడు మాతృదేవి చేతులు జోడిస్తారు. ఆశీర్వదిస్తున్నారని అందుకు అర్థం. వచ్చిన ప్రతి ఒక్కరిపట్లా మాతృదేవి ఇలాగే వ్యవహరిస్తారు.
మాతృదేవికి ముందుచూపు, కార్యాచరణ వివేకం అపారం. శ్రీరామకృష్ణులు కూడా ఒక కార్యం తలపెట్టడానికి మునుపు మాతృదేవిని సంప్రతించేవారు. ఇక శ్రీరామకృష్ణుల శిష్యులయితే, ఆమె సలహా మేరకే వ్యవహరించేవారు.
ఎల్లలెరుగని మాధుర్యానికి ఆలవాలం మాతృదేవి. ఎంతటి పావనమైన ప్రేమ! చిన్న బాలికలా కుతూహలం ఉట్టిపడే నవ్వే నవ్వు! ఆ రోజు నేను మాతృ దేవితో మాట్లాడుతున్నప్పుడు, “స్వామీజీ వెంటనే పైకి వచ్చి మమ్మల్ని చూడాలి. లేకపోతే మేం ఇంటికి వెళ్లిపోతాం” అని చెప్పాను. అలా చెప్పడంతో ఆగిపోకుండా బయలుదేరి చెప్పులు ధరించడానికి తయారయ్యాను. స్వామీజీ రావడానికి కాస్త జాప్యం అవుతుందని చెప్పడానికి పైకి వచ్చిన ఒక సాధువు, నేను బయలుదేర డానికి సిద్ధమవడం చూసి స్వామీజీని తీసుకురావడానికి పరుగెత్తాడు. అది చూసి మాతృదేవి ఫక్కున నవ్విన నవ్వు, ఎంత సహజంగా ఉందో కదా!
మృదుత్వానికే మృదుత్వం మాతృదేవి. ‘నా తల్లీ’ అని నన్ను సంబోధించేవారు.
మాతృదేవి ఎంతో సదాచార సంపన్నులు. కాని శ్రీమతి బుల్, కుమారి మెక్లవుడ్ అనే ఇద్దరు పాశ్చాత్య మహిళలను చూసినప్పుడు ఆ ఆచారమంతా మటుమాయమైంది. వారిని సాదరంగా ఆహ్వానించడమే కాకుండా, వారితో కూర్చుని భోజనం చేశారు. ఇతరులు ఈ దృశ్యం చూసి నివ్వెరబోవడాన్ని ఆమె ఖాతరు చేయలేదు. వీటన్నిటిని చూసినప్పుడు మా పట్ల మాకే ఒక ప్రత్యేకమైన గౌరవం జనించింది; భారతదేశంలో నా సేవాకార్యం చక్కగా జరుగుతుందని గట్టి నమ్మకం కుదిరింది. మరేదీ ఇటువంటి నమ్మకాన్ని కలిగించి ఉండదు. ఇది సామాన్యమైన విషయమా ఏమిటి?
ఉన్నత కుటుంబాలకు చెందిన 14 లేక 15 మంది స్త్రీలు సదా మాతృదేవితో ఉండేవారు. వ్యాజ్యాలు, కలహాలు అంటూ ఇతరులకు విసుగు కలిగించే కోవకు చెందుతారు వీరు. అటువంటి వారిని కూడా తమ అద్భుత సామర్థ్యంతోను, సామరస్యంతోను ప్రశాంతంగా తమతోపాటు ఉంచుకోగలుగుతున్నారు. ఆమె నిజమైన మహత్వానికి ఇంతకంటే మరేం నిదర్శనం కావాలి? ఒక్క విషయం: ఆ స్త్రీలను నా పరిశీలన మేరకు మాత్రమే ఇలా చెప్పాను. నిజానికి వారు ఇలాంటి వారా కాదా అని నాకు తెలియదు.
సాధువులు మాతృదేవిపట్ల కనబరచిన మర్యాదమన్ననలను చూసి తీరాలి. సదా ఆమెను ‘అమ్మా’ అని పిలుస్తారు. ‘పావన మాతృదేవి’ అని పేర్కొంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో సైతం వారు ముందుగా తలచుకొనేది మాతృదేవినే! ఒక రిద్దరు ఆమెకు సేవలందిస్తున్నారు. ఆమె ఇష్టాన్నే ఆజ్ఞగా పరిగణించి వ్యవహ రిస్తారు. అద్భుతమైనది ఆ బాంధవ్యం.
మేరీ కన్య భగవంతుని స్తుతిస్తూ గానం చేసిన పాటను మాతృదేవి సమక్షంలో ఒక సాధువు వంగభాషలో పాడాడు. ఆ పాటను ఆమె ఎంత ఇష్టపడి విన్నారో! నిజానికి ఎంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన మహిళారత్నం ఆమె! కాని ఎంతో సామాన్యంగా, ఎవరూ గ్రహించలేని రీతిలో ఆమె జీవిస్తున్నారు.
భారతీయ మహిళకు పరిపూర్ణ ఆదర్శంగా మాతృదేవిని శ్రీరామకృష్ణులు గాంచారనే నాకు అనిపిస్తున్నది. పరిపూర్ణ ఆదర్శమంటే ఆమె పాత తరానికి ముగింపా? లేకపోతే కొత్త తరానికి నాందియా? అతిసామాన్యమైన ఒక స్త్రీ పొందదగిన జ్ఞానమూ, మాధుర్యమూ ఆమెలో మేళనమై ఉండడం చూడవచ్చు. ఆమె ఒక పావనమైన మహిళారత్నం. ఆ పావనత్వంలాగానే ఆమె ఇతరులతో మెలగే తీరూ, ఆమె మనోవైశాల్యం అద్భుతమైనవి. అతి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఠక్కున ఆమె నుండి విశదమైన జవాబు రావడం చూడవచ్చు. ప్రగాఢ ప్రశాంతత యొక్క ఒక అద్భుత ప్రార్థన మాతృదేవి జీవితం.
మాతృదేవికి చదవడం తెలుసు. ఆమె రామాయణం పఠించడం కద్దు. ఆమె వ్రాయలేరు. అందువలన ఆమెను నిరక్షరాస్యయని పరిగణించలేం. సంసార జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెంటిలోను ఆమెకు పండిన అనుభవం ఉంది. అంతేకాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలను ఆమె సందర్శించివున్నారు, అనేక తీర్థ స్థలాలను సందర్శించి ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయం మరువరాదు. ఆమె శ్రీరామకృష్ణుల సహధర్మచారిణి. తమను ఉన్నతపరచుకోవడానికి ఇంతకంటే సదవకాశం లభిస్తుందా? ఆయన జీవితపు ప్రతి క్షణంలోను మాతృదేవి పాలుపంచు కొన్నారు. తమకు తెలియకుండానే ఆయన ప్రభావాన్ని పొందివున్నారు.
కొత్త విషయాలను స్వీకరించడం మాతృదేవి ఉన్నత సంస్కారాన్ని చెప్పక చెబుతుంది. ఒక ఈసర్ట్ పండుగ రోజు దీన్ని కళ్లారా చూడగలిగాను. సామాన్యంగా నేను మాతృదేవితో ఉన్నప్పుడు అన్నిటిని పరిశీలించి చూస్తాను. నిజంగా ఆమె ఎవరు? ఆమె దేనిని అభివ్యక్తం చేస్తున్నారని శోధిస్తూనే ఉంటాను. ఆ రోజు మాతృదేవి మా ఇంటికి వచ్చారు. ఇంటిని పూర్తిగా పరికించారు. పిదప మా పూజ గదిలో కూర్చుని ఈస్టర్ గురించిన వివరాలు తెలుసుకోగోరారు.
చిన్న ఫ్రెంచ్ ఆరన్గ్ ఒకటి మా వద్ద ఉండేది. దాన్ని వాయిస్తూ ఈసర్ట్ గీతాలు పాడాము. ఏసుక్రీస్తు పునర్జీవించి రావడం గురించిన ఆ పాటలను మాతృదేవి స్వీక రించిన తీరు ఎంతో అద్భుతం. ఈ పాటలు ఆమెకు బొత్తిగా కొత్తవి, ఆమె ఎరుగ నివి. అయినా ఎటువంటి తొట్రుబాటు లేకుండా వాటిని స్వీకరించి, వాటిలో లీనమై నారు. నిజానికి మాతృదేవి ఆధ్యాత్మిక ప్రగాఢతను ఈ విషయం నుండి గ్రహించ గలిగాం. శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొందిన అందరి స్త్రీలలోను ఈ సంస్కారం ఉన్నప్పటికీ మాతృదేవిలో అది ఎంతో అధికంగా, సంపూర్ణ శక్తితో అభివ్యక్తమైవుంది.