అతి చిన్నతనంలోనే మాతృదేవి సాన్నిధ్య భాగ్యం లభించిన ధన్యజీవిని. నా తండ్రి, నాయనమ్మ మొదలైన వారంతా మాతృదేవికి పరిచయస్థులే. జయరాంబాటిలో మాతృదేవి కోసం కట్టిన కొత్త ఇంట్లో మా నాయనమ్మ పనిమనిషిగా ఉండేది. రోజూ ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం వంటి పనులు ఆమె చేసేది. అందువలన రోజూ నాయనమ్మతో మాతృదేవి ఇంటికి వెళ్లే అదృష్టం నాకు కలిగింది. నా పట్ల మాతృదేవి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. రాత్రి గురుదేవులకు నైవేద్యం చేసిన ప్రసాదంలో కొంత స్వయంగా మాతృదేవియే విడిగా తీసి, మర్నాడు నాకు ఇచ్చేవారు. ఆ ప్రసాదం కోసమే నేను రోజూ నాయనమ్మతో వెళ్లేవాణ్ణి.
నా తండ్రి చదువుకోలేదు. కాని మంచి రైతుగా గ్రామంలో పేరుపొందాడు. కాయగూరలు ఏవైనా అవసరమైతే మాతృదేవి తిన్నగా మా ఇంటికి వచ్చి, “నా బిడ్డలు కొందరు వచ్చారు. కాయగూరలు కొని తేగలవా?” అని అడిగేవారు. పిదప అవసరమైన కాయగూరలు కొనమని మా నాయనమ్మతో చెప్పి, “వీటిని నీ మనవడి ద్వారా పంపించు” అనేవారు. నేను కూడా ఎంతో ఆనందంగా వాటిని తీసుకువెళ్లేవాడిని. మా నాన్నకు చదువు లేనందువలన వస్తువుల లెక్కకట్టడం సరిగా తెలియదు. దాంతో అనేక సందర్భాలలో ఆయన మోసపోయేవాడు. అందు వలన మాతృదేవి మా నాయనమ్మతో, “ఇదుగో చూడు, మీ మనవణ్ణి చదివించు. అతడు చదవాలి!” అని చెప్పేవారు. నా తలమీద చేయివుంచి దీవించారు. చదువు లేని తండ్రికి జన్మించి, జయరాంబాటి కుగ్రామం నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను (Post-Graduation) అభ్యసించే భాగ్యం నాకు మాతృదేవి దీవెన చలువ వలన మాత్రమే కలిగిందని నా దృఢవిశ్వాసం.
వాతరోగం మూలంగా మాతృదేవి కాళ్లు మడిచి కూర్చోలేరు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు వసారాలో కంబళి పరచేవారం. కాళ్లు వేలాడదీసుకునే తీరులో ఆమె కూర్చునేవారు. తమ కొత్త ఇంట్లో కూడా మంచం మీద మాతృదేవి ఇలా కాళ్లు వేలాడదీసుకొని కూర్చోవడం, ఆమె పాదపద్మాలను పద్మాలతో శ్రీ శారదానందస్వామి అర్చించడమూ నేను చాలాసార్లు చూశాను. చిన్నవాణ్ణి కదా! అందువలన, ‘ఈమె ఎవరు? సాధుసన్న్యాసులు కూడా ఈమెను ఎందుకు పూజిస్తున్నారు?’ అనుకొనేవాడిని. అప్పట్లో ఈ విషయాలు గ్రహించేశక్తి నాకు లేదు.
ఆ రోజుల్లో గ్రామంలో పాఠశాలలు లేవు. అందుకని చిన్నపిల్లలకు ఒక ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడానికి మాతృదేవి ఏర్పాట్లు చేశారు. ఉపా ధ్యాయుల జీతాలకు కూడా ఆమే ఏర్పాట్లు చేశారు.
బాంకూరా నుండి విభూతి ఘోష్ అనే ఉపాధ్యాయుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శనానికి వస్తూండేవాడు. మాతృదేవి ఆయనను ‘నల్ల మణి’ అని ముద్దుగా పిలిచేవారు. పేద రైతులపట్ల మాతృదేవి చూపే సానుభూతి చెప్పనలవి కాదు. “విభూతీ! నువ్వు ఆమోదర్ నదికి ఒక ఆనకట్ట కట్టి, చెరువుకు నీటిని తెప్పించగలిగితే పేద రైతులకు అది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. వర్షాలు కురవక పచ్చికబయళ్లు బీడుపట్టిపోతున్నాయి. నువ్వు ప్రయత్నించి దీని కొక మార్గం కనుగొంటే ఎంతోమంది లబ్ధిపొందుతారు” అనేవారు మాతృదేవి.
ఆ రోజుల్లో పఠాన్ గంజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన ప్రబోధ్ చటో పాధ్యాయ్ ప్రతి శనివారమూ మాతృదేవి దర్శనానికి వచ్చేవారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన మళ్లీ పాఠశాలకు తిరిగి వెళ్లిపోయేవారు. వచ్చేటప్పుడు పలు వురు విద్యార్థులను తమతో తీసుకొనివచ్చేవారు. ఆ విద్యార్థులలో ఒకరే ‘రామ్మయ్’. కాలాంతరంలో వీరే స్వామి గౌరీశ్వరానంద.
బందిపోటు దొంగయైన అంజద్ అప్పుడప్పుడు మాతృదేవిని చూడడానికి వచ్చేవాడు. ఆతణ్ణి చూస్తేనే మా కెంతో భయం వేసేది. కాని మాతృదేవి ఆతణ్ణి ఆప్యాయంగా పలుకరించి, ఇంట్లోకి పిలిచి తినడానికి ఏదైనా పెట్టేవారు. నేను చాలాసార్లు ఇలా జరగడం చూశాను.
ఆ కాలంలో గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేదు. అంతా స్నానం చేసే చెరువు నీటినే త్రాగడానికి కూడా వాడుకునేవారు. శారదానంద స్వామితో చెప్పి ఒక బావి తవ్వించి త్రాగునీటి సౌకర్యం మాతృదేవి కల్పించారు.
ప్రతి ఏటా జగద్ధాత్రీ పూజా సమయంలో మాతృదేవి గ్రామస్థులనందరిని పిలిచి వారందరికీ కడుపార భోజనం పెట్టించేవారు. దీనికయ్యే ఏర్పాట్లను స్వయంగా ఆమే చూసుకొనేవారు. ప్రతి గ్రామస్థుని పట్లా మాతృదేవి కనబరచే ఆప్యాయత వర్ణనాతీతం.
నళినికి కులపట్టింపు ఎక్కువ. మాతృదేవి అందరి పట్ల సమానత్వం వహించి మెలగడం ఆమెకు సుతరామూ ఇష్టంలేదు. ఈ విషయం మాతృదేవితో ప్రస్తావిస్తే, “ఇలా చూడు, నా బిడ్డల పట్ల రెండు రీతుల్లో ప్రవర్తించలేను. నాకు పిల్లలందరూ సమానమే” అని ఆమె చెప్పేవారు.
ఇప్పుడు జీవితపు చివరి మజిలీలో ఉన్నాను. పైనుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని నిరీక్షిస్తున్నాను. ఒక ప్రగాఢ విశ్వాసం మాత్రం నా మనస్సులో చోటుచేసుకొని ఉంది – నేను మాతృదేవిని దర్శించాను. ఆమె పాదపద్మాలను స్పృశించాను. అందువలన నాకు ముక్తి తప్పక లభిస్తుంది. దీనిని ఎవరూ అడ్డుకో లేరు.
నహబత్, గురుదేవుల గది : దక్షిణేశ్వరం