మార్చ్ 1914
భ గవాన్ శ్రీరామకృష్ణుల జయంత్యుత్సవం ముగిసి ఒకటి రెండు రోజు లయింది. ఒరిస్సాలోని ఒక భక్తుని పరిచయ పత్రంతో ఉద్బోధన్కు వెళ్లాను. ఆ పత్రాన్ని చూసి రాస్బిహారి మహరాజ్ మాతృదేవిని చూడడానికి లోనికి వెళ్లారు. పిదప వచ్చి మాతృదేవి సందేశాన్ని ఇలా తెలిపారు:
“సరళమైన ఆధ్యాత్మిక సాధనల మూలంగా భగవత్సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడమే మంత్రదిక్ష తిసుకోవండలోని ఉద్దేశం. కాని కులగురువు జీవనానికి మాత్రం భంగం వాటిల్లరాదు. ఇందుకు అతడు అంగీకరిస్తే మంత్రదిక్ష ఇవ్వగలను. అతడు నా పట్ల చూపే భక్తిప్రపత్తులను కులగురువు పట్ల కూడా కనబరచాలి. ప్రతి సంవత్సరం కులగురువుకు సమర్పించుకొనే కట్నకానుకలను తన శక్తిమేరకు అధికంగా ఇస్తూవుండాలి.”
ఈ ప్రతిపాదనలకు నేను సమ్మతించిన తరువాత రాస్బిహారి మహరాజ్ నన్ను మాతృదేవి వద్దకు తీసుకొని వెళ్లారు. రెండు రోజుల తరువాత మాతృదేవి నాకు మంత్రదీక్ష అనుగ్రహించారు. తదనంతరం ఒక వారం రోజుల పాటు వర్ణనా తీతమైన మనోభావ స్థితిలో నేను ఉండిపోయాను.
మంత్రదీక్ష పుచ్చుకొనే సమయంలో మాతృదేవి నన్ను, “నువ్వు శాక్తేయుడవా లేక వైష్ణవుడవా?” అని అడిగారు. నా బదులు విన్న తరువాత ఆమె నాకు మంత్ర దీక్ష ఒసగారు. ఏడెనిమిది ఏళ్ల తరువాత మా అమ్మ నుండి అదే మంత్రం విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా కులదైవం మంత్రం కూడా అదే! మాతృదేవి ఒక బీజాక్షరాన్ని మాత్రమే ఆ మంత్రానికి జోడించారు.
రెండు నెలలు గడిచివుంటాయి. మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోవాలని నా భార్య కోరడంతో, ఆమెను తోడ్కొని మాతృదేవి వద్దకెళ్లారు. నా భార్యను చూడగానే మాతృదేవి ఇలా అడిగారు:
“అమ్మాయీ! నిన్ను చూస్తే నీకు చంటిబిడ్డ ఉన్నట్లు తెలుస్తున్నది. పిల్లాణ్ణి ఎక్కడ వదలి వచ్చావు?”
నా భార్య: చంటిపిల్లవాణ్ణి తీసుకువస్తే ఈ చోటును అశుభ్రం చేస్తాడని భయపడి తీసుకురాలేదు.
ఆ చంటిపిల్లవాడు కేవలం మూడు నెలల పసికందు అని తెలుసుకొని మాతృదేవి ఇలా అన్నారు:
“ఇవేం మాటలు అమ్మాయీ! మూడు నెలల పసికందు మలమూత్రాలు ఈ స్థలాన్ని అశుభ్రం చేస్తాయని నీ కెవరు చెప్పారు? పిల్లలు సాక్షాత్తు నారాయణ స్వరూపులు! అటువంటి భావనతోనే పిల్లలను పరిగణించాలి. వెంటనే ఇంటికి తిరిగివెళ్లు. లేకపోతే పిల్లవాడు పాలకోసం తపించిపోతాడు. నాలుగైదు రోజులు గడిచాక రా! గురుదేవుల సంకల్పం ఉంటే నీకు మంత్రదీక్ష లభిస్తుంది. కాని వచ్చేటప్పుడు చంటిపిల్లవాణ్ణి తీసుకురావడం మరచిపోవద్దు.”
నేను కింద కూర్చునివున్నప్పుడు, ‘మాతృదేవి తాము ఆరగిస్తున్న ఆహారంలో ఒకింత నాకు ప్రసాదంగా ఇస్తే, ఆమె నిజంగానే నా పట్ల ఎంతో అభిమానం కలిగి వున్నారని రూఢి అవుతుంది’ అనే ఆలోచన నాలో మెదలింది. అరగంట సేపయ్యాక మాతృదేవికి ప్రణమిల్లడానికి మేడమీదికి వెళ్లాను. అప్పుడు మాతృదేవి ఒక మిఠాయి తింటున్నారు. నన్ను చూడగానే, “నాయనా, దీన్లో కాస్త తిని, ఆ తరువాత నమస్క రించు” అని చెప్పారు. మనస్సులో జనించిన ఆనందోద్వేగంలో ప్రసాదం తీసుకొని, మాతృదేవికి ప్రణమిల్లడం మరచిపోయాను. కాసేపు అట్లే చేష్టలుదక్కి నిలబడ్డ నన్ను చూసి మాతృదేవి, “నాయనా! నమస్కరించి, నీ భార్యను తీసుకొని వెళ్లిరా” అని చెప్పారు.
నాలుగు రోజుల తరువాత మంత్రదీక్ష పుచ్చుకోవచ్చునన్న మాతృదేవి మాట నన్ను బాధకు లోనుచేసింది. కాని ఇంటికి తిరిగి వచ్చాక నా భార్య ఆరోగ్య పరిస్థితి గమనించినప్పుడు మాతృదేవి ముందుచూపుకు ఆశ్చర్యపోయాను.
సొంత ఊరుకు బయలుదేరడానికి ముందు మాతృదేవిని దర్శించి, ఆమెకు ప్రణమిల్లాం. “జాగ్రత్తగా వెళ్లిరండి. దారిలో ఎదురయ్యే అన్ని ఆపదలనుండి గురు దేవులు మిమ్మల్ని రక్షిస్తారు” అంటూ మాతృదేవి మమ్మల్ని దీవించారు. తిరిగి పోతున్నప్పుడు ఒక తుపానులో చిక్కుకొన్నాం. కాని ఎటువంటి అపాయమూ లేకుండా సురక్షితంగా బయటపడ్డాం. మాతృదేవి కృప వల్లనే మేం మళ్లీ క్షేమంగా ఇల్లు చేరుకోగలిగామని గ్రహించాం.
ఒక సంవత్సరం తరువాత మళ్లీ మాతృదేవిని ఏప్రిల్/ మే నెలలో జయరాంబాటిలో దర్శించుకొనే భాగ్యం కలిగింది. ఇక్కడే మాతృదేవితో సన్నిహితంగా మెలగే అవకాశం చిక్కింది. నా ముందు కూర్చుని ఆప్యాయంగా నాకు అన్నం కూడా కలిపి పెట్టారు; ఆనందంతో మైమరచిపోయాను.
మాతృదేవి వద్ద కూర్చుని జపధ్యానాదులు అనుష్ఠిస్తే ఫలం అధికంగా ఉంటుందని భావించి చాలాసేపు జపధ్యానాలలో గడపసాగాను. ఆ రోజు మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు, “నువ్వు మీ అమ్మ వద్దకొచ్చావు. ఇక్కడ గొప్పగా సాధనలు చేయాల్సిన అగత్యం లేదు. మీ కోసం అన్నీ నేనే చేస్తున్నానుగా! ఇక్కడ సుష్టుగా భోజనంచేసి, సంతోషంగా నిశ్చింతగా ఉండు” అని చెప్పారు.
మర్నాడు. మాతృదేవి పాదపద్మాలకు పువ్వులు, చందనం అర్పించి, పూజించా లని అనుకున్నాను. వాటికోసం నేను ఎక్కడకు వెళ్లను? ఇలా అనుకొంటున్నప్పుడు ఒక చిన్నపిల్లతో మాతృదేవి పువ్వులు, చందనం పంపుతూ, “అతడికి ఇష్టమైతే ఇప్పుడే వచ్చి నమస్కరించమను” అని కబురు పంపారు.
మూడవ రోజు. ఉదయం పది గంటలయివుంటుంది. మాతృదేవి కాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. కొద్దిగా జ్వరం కూడా ఉంది. ఆ సంగతి తెలియక ఒక భక్తుడు వచ్చి ఆమెకు ప్రణమిల్లాడు. అప్పుడు మాతృదేవి, “నా కాళ్లు బాగా నొప్పిగా ఉన్నాయి. పాదాలు తాకకుండా నమస్కరించు. గురుదేవులు తప్పకుండా నిన్ను దీవిస్తారు” అని చెప్పారు.
అప్పుడు అక్కడే ఉన్న విలాస్ మహరాజ్, “అమ్మా వ్యాధిగ్రస్థులకు, పడుకొని ఉన్నవారికి నమస్కరించడం శాస్త్రనిషిద్ధమని విన్నాను. అలా నమస్కరిస్తే ఏం జరుగుతుంది?” అని అడిగారు. వెంటనే మాతృదేవి, “నాయనా, అలా నమస్కరిస్తే ఆ వ్యక్తిని పీడిస్తున్న వ్యాధి ఆతడివద్దే నిలకడగా ఉండిపోతుంది. అందుకే వ్యాధి గ్రస్థులకు నమస్కరించకూడదు” అని వివరించి చెప్పారు.
దాదాపు మూడు సంవత్సరాల తరువాత క్రిస్మస్ సెలవులలో మాతృదేవిని ఆఖరిసారిగా దర్శించాను. ఆ రోజు మాతృదేవి పుట్టిన రోజు. నాడు ఉదయం నన్ను, కోయల్పారాలో ఉంటున్న ఒక సాధువును పిలిచి, “మీరు కామార్పుకూర్కు వెళ్లి శిబును* కలుసుకోండి. చెంబునిండా పాలు, కొన్ని పువ్వులు మీకు ఇస్తాడు. వెంటనే వాటిని తీసుకురండి” అని చెప్పారు. అప్పుడు పక్కనే ఉన్న విలాస్ మహరాజ్, “ఆలస్యంగా భోజనం చేస్తే మాతృదేవికి పడదు. అందువలన తొమ్మిది గంటల లోపుగా వచ్చేయండి. ఆలస్యమయితే మాతృదేవికి పువ్వులు అర్పించి, ప్రణమిల్లే అవకాశం ఉండదు” అన్నారు.
కాని మేం తిరిగి వచ్చేసరికి పదకొండున్నర గంటలయింది. మాతృదేవికి ప్రణామాలర్పించ లేకపోయామే అని ఎంతో బాధపడ్డాను. మమ్మల్ని చూడగానే ఆలస్యంగా వచ్చినందుకు విలాస్ మహరాజ్ కోపగించుకొన్నారు. తరువాత, “మీ కోసం మాతృదేవి వేచివున్నారు” అని చెప్పారు. అంతలో మాతృదేవియే అక్కడకు వచ్చారు. నా చేతిలోవున్న పువ్వుల బుట్టను తీసుకొని, “ఆహా, ఎంత బాగున్నాయి పువ్వులు! వీటితో ముందుగా గురుదేవులను పూజించాలి. త్వరగా స్నానం చేసిరండి” అన్నారు. స్నానం చేసి వచ్చాక చూస్తే, మాతృదేవి పాదపద్మాలకు అర్పించడానికి కొన్ని పువ్వులు విడిగా తీసివుంచడం కంటబడింది. మాతృదేవి అవ్యాజ అనురాగానికి ముగ్ధులమైపోయాం.