ఒక రోజు నా సోదరితో కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్లాను. ఆమెకుప్రణమిల్లి, పూజామందిరంలోకి వెళ్లి గురుదేవులకు ప్రణమిల్లాను. పిదప మాతృదేవివద్దకు రాగానే కూర్చోమన్నారామె.
నేను: అమ్మా! మీరే మహామాయ! తల్లి, తండ్రి, భర్త, పిల్లలను మా కిచ్చి మమ్మల్ని భ్రాంతికి లోనుచేస్తున్నారు.
మాతృదేవి: ఎప్పుడూ అలా అనబోకు. నే నేమిటి, మిమ్మల్ని భ్రాంతికిలోనుచేయడ మేమిటి? జనం క్లేశాలను చూసి నేను అనుభవించే దుఃఖంవర్ణనాతీతం. కాని నేనేం చేయగలనమ్మా? ముక్తిని ఎవరూ కోరుకోవడం లేదు.
మరొక రోజు నేనూ, నా సోదరీ మాతృదేవి దర్శనార్థం వెళ్లాం.
నా సోదరి: భగవంతుడు ఎక్కడున్నాడు?
మాతృదేవి: మరెక్కడ, ఆయన భక్తుల వద్ద ఉన్నాడు. నిజమైన భక్తులు సంచరించే చోటికి వెళితే చాలు, లౌకికుల మనస్సులలోని మాలిన్యాలన్నీ తొలగి పోతాయి.
నేను: అమ్మా! గురుదేవుల దివ్యనామ జపం చేయడం ఎలాగో నేర్పించారు. కాని మీ నామాన్ని ఎలా జపించాలి?
మాతృదేవి: ‘రాధ’ దివ్యనామాన్ని జపించు; లేకుంటే నీ మనస్సుకు నచ్చిన మరో నామాన్ని జపించు. అవేవీ సరిపడకపోతే ‘అమ్మా’ అంటే చాలు.
నేను: అమ్మా! అనేక దివ్యదర్శనాలు కలిగినట్లు పలువురు చెప్పుకొంటున్నారు.కాని నాకు అటువంటి అనుభవం ఏదీ కలుగలేదే!
మాతృదేవి: అటువంటి దృశ్యాలు నిమ్నస్థితికి చెందినవి.
ఈ పలుకులు విన్న తరువాత నాలో విశ్వాసమూ, ఉత్సుకత అంకురించాయి.
నేను: నా కేమీ లభించదా?
మాతృదేవి: లభిస్తుంది, తప్పక లభిస్తుంది.
ఒక రోజు మాతృదేవితో, గురుదేవులను అర్చించే విధానం గురించి అడిగాను. అందుకు ఆమె ఇలా జవాబిచ్చారు:
“నువ్వు సంసార జీవితం గడుపుతున్నావు. సాంప్రదాయికంగా నువ్వు పూజ చేయలేవు. వ్యాకులతతో ఆయనను ప్రార్థించు. నీకు అవసరమైనదంతా ఆయనే సమకూరుస్తారు. చందమామ అందరికీ మామయే కదా!”
ఒక రోజు నేనూ, మా అమ్మా మాతృదేవిని దర్శించుకోవడానికి వెళ్లాం. మాతృ దేవికి ప్రణమిల్లి, “అమ్మా, చాలాసేపు బండికోసం వేచివుండవలసి వచ్చింది. అందుకే ఇంత ఆలస్యమైంది” అని చెప్పాను.
మాతృదేవి: భగవంతుని మ్రొక్కడానికి నువ్వు ఇక్కడకు వస్తున్నావు. బండి బాడుగ చెల్లించి వృథాగా ఎందుకు డబ్బు ఖర్చుచేస్తావు? నడిచే రా.
ఒక రోజు మధ్యాహ్నం నేనూ, మా అమ్మా మాతృదేవి దర్శనార్థం వెళ్లాం. అప్పటికే బాగా ఆలస్యమయింది. అందువలన గోలాప్మా అసంతృప్తి వ్యక్తం చేశారు: “మీరు మాతృదేవిని దర్శించుకోవడానికి రాలేదు, ఇబ్బంది పెట్టడానికే వచ్చారు. వంట పని పూర్తయింది. రాగోరితే ఉదయమే తెలిపి ఉండవచ్చు కదా! మీకు పెట్టకుండా ఇతరులు ఎలా భోజనం చేయగలరు?” అన్నదామె. పిదప మాతృదేవితో, “మీ సంగతి తెలిసిందే కదా! ‘అమ్మా’ అంటూ ఎవరు దరిచేరినా సరే, తక్షణమే రెండు చేతులూ చాపి వారిని ఆహ్వానిస్తారు” అన్నది. అందుకు మాతృదేవి, “ఏం చేయగలను గోలాప్! ‘అమ్మా’ అంటూ ఎవరు పిలిచినా వారిని ఉపేక్షించలేను” అన్నారు.
ఆ రోజు మాత్రమే కాదు, మామూలుగా నేనెప్పుడూ ఆలస్యంగానే వెళ్లేదాన్ని. ఇంటి పనులు పూర్తి అయిన తరువాతే నేను బయలుదేరగలిగేదాన్ని. అందుకే అంత ఆలస్యం! అందువలన మాతృదేవి, “వారు మాత్రం ఏం చేయగలరు? ఇంటి పనులు ముగించుకొనే కదా రావాలి!” అన్నారు.
మేం బయలుదేరడానికి ఉద్యుక్తులైనప్పుడు మాతృదేవి, “భోజనం చేయకుండా వెళ్లిపోతారా ఏమిటి? భోజనం చేసి వెళ్లండి” అని చెప్పారు. “ఇంట్లో వంట చేసే వచ్చాం. అక్కడికి వెళ్లి భోజనం చేస్తాం” అన్నాను నేను. మేం అక్కడే భుజించాలని మాతృదేవి అభిలషించారు. చివరకు, “సరే, అలాగే చేయండి. లేకుంటే గోలాప్కు కోపం వస్తుంది. వెళ్లిరండి” అని అన్నారు. పిదప ఒక కొబ్బరి చిప్పలో కొంతప్రసాదం ఇచ్చి మాకు సెలవిచ్చారు.
ఒక రోజు మాతృదేవి పాదపూజకై పువ్వులు, బిల్వపత్రాలు, తులసీదళాలుపట్టుకువెళ్లాను. ఈ సంగతి మాతృదేవికి తెలిపినప్పుడు, అందుకామె సమ్మతిస్తూ, “కాని బిల్వపత్రాలను, తులసిని నా పాదాలపై ఉంచవద్దు” అని చెప్పారు. పాదపూజపూర్తయ్యాక, “అమ్మా! ఈ పువ్వులను ఏం చేయమంటారు?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “ఇంటికి తీసుకెళ్లు” అని చెప్పారు.
ఎర్రంచు చీర మాతృదేవికి సమర్పించాలని నా సోదరి కల కన్నది. అందుకని ఒక ఎర్రంచు చీర కొని, మాతృదేవి దర్శనానికి వెళ్లింది. నేను కూడా ఆమెతోవెళ్లాను. తన కల గురించి చెప్పి చీరను సమర్పించినప్పుడు మాతృదేవి నవ్వుతూదానిని పుచ్చుకొన్నారు. తరువాత, “ఈ చీరను ఎలా ధరించను? ‘పరమహంసభార్య ఎర్రంచు చీర ధరించి నడయాడుతున్నది’ అంటారు లోకులు. పోనీలే, నువ్వు తెచ్చేశావు! స్నానం చేస్తున్నప్పుడు వాడుకొంటాను” అని చెప్పారు. మాతృదేవి ఒరిస్సా ప్రయాణానికి తయారవుతూ ఉండడం వలన ఆ రోజు త్వరగానే సెలవుపుచ్చుకొన్నాం.
ప్రయాణం ముగించుకొని కలకత్తాకు తిరిగి వచ్చాక ఒక రోజు మాతృదేవిదర్శనానికి వెళ్లాం. పూరీ క్షేత్రం గురించి ఆమె ఎంతో గొప్పగా చెప్పారు. “ఆచీరను వాడుకొన్నారా అమ్మా?” అని నా సోదరి మాతృదేవిని ఆతురతతో అడిగింది. అందుకు మాతృదేవి, “అవునమ్మా! ఒకట రెండుసార్లు వాడాను. తరువాత ఎవరికో ఇచ్చేశాను” అని చెప్పారు.
నేను: అమ్మా! మా గతేమిటి?
మాతృదేవి: గురుదేవులను ప్రార్థించండి.
నా సోదరి: కాని మేం గురుదేవులను చూసింది లేదు! మాకు మీరేతెలుసు.
మాతృదేవి: కథలో వచ్చే గురువులా నేను కూడా మునిగి చావాలని అభిలషిస్తున్నారా? ఒక వ్యక్తి ‘జై గురు’ అని ఉచ్చరిస్తూ నీళ్లమీద నడుస్తూ నదినిదాటాడు. అది గమనించిన గురువు, ‘ఆహా! నా పేరు ఇంత మహిమాన్వితమా!నేనూ అట్లే నదిని దాటుతాను’ అనుకొన్నాడు. తదనంతరం, ‘నేను, నేను’ అని ఉచ్చరిస్తూ నీళ్లపై నడుస్తూ నదిని దాట ప్రయత్నించాడు. కాని పాపం బుడుంగుననీళ్లలో మునిగి మరణించాడు.