కొట్టార్, ఒరిస్సా, డిసెంబర్ 1910
క్రిస్మస్ సమయం. షిల్లాంగ్ నుండి వచ్చిన కొందరు భక్తులతో మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. అక్కడ ఉన్న సన్న్యాసులు, “మీరు చాలా దూరం నుండి వస్తు న్నారు కాబట్టి అనుమతిస్తున్నాం. ఎక్కువ సేపు మాట్లాడకండి” అని చెప్పారు. అది విని నా స్నేహితులతో, “పోనీలే, మాతృదేవి సంకల్పానుసారం జరుగుతుంది. భయమెందుకు? మాతృదేవిని దర్శించుకొన్నాక మనం ఏదైనా తిందాం” అని చెప్పాను.
మాతృదేవి దర్శనం కోసం గదిలోకి వెళ్లాం. మాతృదేవి అలవాటు ప్రకారం మేలిముసుగుతో ముఖాన్ని కప్పుకొని కూర్చొని ఉన్నారు. మమ్మల్ని చూడగానే గోలాప్ మా, “అమ్మా! ఈ యువకులు – షిల్లాంగ్ ఎక్కడ? కొట్టార్ ఎక్కడ? మీ దర్శనార్థం సప్తసముద్రాలూ, పర్వతాలూ దాటి వచ్చారు” అని చెప్పారు. వెంటనే మాతృదేవి తమ మేలిముసుగును తీసివేశారు. ఆమె ముఖారవిందాన్ని స్పష్టంగా దర్శించుకొనే భాగ్యం దొరికింది. మాతృదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తూ మనస్సులో, ‘మీరే దిక్కు, మీరే దిక్కు’ అని అనుకొన్నాను. మాతృదేవి నా తల మీద చేయివుంచి, “భక్తి కలుగుగాక!” అని దీవించారు.
నేను: అమ్మా! ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండగోరుతున్నాను. కానీ పెద్దమనుషుల ఇల్లు, మిమ్మల్ని దర్శించుకోవడమే ఎంతో కష్టంగా ఉంది.
మాతృదేవి: నేనే మిమ్మల్ని పిలుస్తాను. ప్రస్తుతం భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి.
సాయంత్రం మాతృదేవితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం కలిగింది. ఆమెనూ, గురుదేవులనూ స్వప్నంలో చూసిన ఉదంతం చెప్పాను. అందుకు ఆమె, “నువ్వు చూసింది నిజమే” అని చెప్పారు. నాతో వచ్చిన ఇద్దరిని పిలిచి, “వీరి కోర్కె ఏమిటి?” అని అడిగారు.
నేను: మీ వద్ద మంత్రదీక్ష పుచ్చుకోగోరి వచ్చారు. అంతా మీ ఇష్టమే!
మాతృదేవి: మంచిది. రేపు ఉదయం స్నానం చేసి రమ్మని చెప్పు.
నేను: అమ్మా! గురుదేవులు మీ పాదపద్మాలను పూజించారు. ఆ పాదపద్మా లను మేం కూడా పూజింపగోరుతున్నాం.
మాతృదేవి: అలాగే కానివ్వు.
నేను: పువ్వులు ఎక్కడ లభిస్తాయి?
మాతృదేవి: వీరికి చెబితే ఏర్పాటు చేస్తారు.
మాతృదేవికి ప్రణమిల్లి బయటకు వచ్చేశాం. ‘వీరి కోర్కె ఏమిటి?’ అని మాతృదేవి ఇతరుల గురించి ప్రశ్నించారేగానీ, నా గురించి ఏమీ అడగలేదు. ఈ భావనతో నా మనస్సు కలత చెందింది. అయినప్పటికీ అంతా మాతృదేవి ఇచ్ఛ మేరకే జరుగనీ! నా అంతట నేనుగా ఆమెతో ఏమీ చెప్పకూడదని తీర్మానించుకొన్నాను.
మర్నాటి ఉదయం స్నానం చేసి పువ్వులు తీసుకొని మాతృదేవి వద్దకు వెళ్లాం. ఒక్కరొక్కరిగా రమ్మన్నారామె. నేను ముందు వెళ్లాను. మాతృదేవి పూజ ముగించి కూర్చున్నట్లున్నారు. నేను వెళ్లగానే, “గురుదేవులు నీకు (కలలో) ప్రసా దించిన మంత్రాన్నే జపించు. నేనూ ఇస్తాను” అంటూ మంత్రదీక్ష ఇచ్చారు.
ఆ తరువాత మాతృదేవి పాదపద్మాలను పూజించాను. అప్పుడు ఆమె నిల బడి ఉన్నారు. “అమ్మా, నాకు మంత్రతంత్రాలేవీ తెలియవు” అని చెప్పాను. అందుకామె, “ఫరవాలేదు. పువ్వులు సమర్పించు” అని చెప్పారు. పువ్వులలో ఒక ఉమ్మెత్త పువ్వు కూడా వచ్చింది. అది చూసి మాతృదేవి, “దాన్ని సమర్పించకు. అది శివపూజకు నియుక్తమైనది” అని అన్నారు.
పూజ పరిసమాప్తంలో వస్త్రం, డబ్బు మొదలైనవి సమర్పించాను. “ఇవన్నీ ఎందుకు? నీ రాబడి, ఖర్చులకు బొటాబొటిగా సరిపోతున్నది కదా” అని అన్నారు. నా కుటుంబ స్థితిగతుల గురించిగానీ, ఆర్థిక పరిస్థితి గురించిగానీ మాతృదేవితో ఏమీ చెప్పలేదు. అయినా ఆమెకు అంతా తెలిసినట్లు ఉంది.
నేను: అమ్మా! సాక్షాత్తు కాళీ, ఆద్యాశక్తీ, భగవతీ మీరే అని భక్తులు పేర్కొం టున్నారు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణునితో, ‘నువ్వు సాక్షాత్తూ నారాయణుడ వని అసితుని వంటి ఋషులు వక్కాణిస్తున్నారు. నువ్వు కూడా అలాగే అంటున్నావు’* అని పలికాడు. ఇక్కడ ‘నువ్వు కూడా’ అన్న మాట ఎంతో ప్రాధాన్యత వహిస్తున్నది. అలాగే మీరు కూడా మీ గురించి చెబితే నా సంశయం నివృత్తి అవుతుంది. ఈ భక్తులు చెబుతున్నవన్నీ నిజమేనా?
మాతృదేవి: అవును, నిజమే.
నేను: నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లుగా నా ఇష్టదైవ దర్శనాన్ని అనుగ్రహించండి.
మాతృదేవి: అలాగే జరుగుతుంది.
మర్నాడు బయలుదేరుతున్నప్పుడు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్లాను. మాతృదేవి అప్పుడు ప్రసన్న వదనారవిందయై కూర్చొని ఉన్నారు. గోలాప్మా నాతో, “తిరిగి వెళుతున్నప్పుడు పూరీ జగన్నాథం దర్శించి వెళతావు కదా?” అని అడిగారు. అందుకు నేను, “ఇక దర్శించుకోవడానికి ఏముంది? మాతృదేవి పాదపద్మాలే కోట్లాది తీర్థస్థలాలకు సమానం. నాకు ఇక ఏదీ వద్దు” అని చెప్పాను. అది విని మాతృదేవి, “ఫరవాలేదు. నువ్వు పూరీకి వెళ్లనక్కరలేదు” అన్నారు.
జయరాంబాటి, 1913
మాతృదేవి మేనల్లుడైన (తమ్ముని కుమారుడు) భూదేవ్ వివాహం మూడు నాలుగు రోజులలో జరుగనున్నది. నేను కోల్పోరా మఠం చేరుకొన్నప్పుడు, “తీక్ష్ణమైన ఎండాకాలం! కించిత్తు వాన కూడా కురవని ఈ ఎండల్లో ఎవరూ జయరాంబాటికి వెళ్లకూడదని మాతృదేవి కట్టడి చేశారు” అని కేశవానందస్వామి చెప్పారు. ఇంత దూరం వచ్చి మాతృదేవి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోవడం బాధగా ఉంది. అదే సమయంలో మాతృదేవి ఆనతిని ఉల్లంఘించడానికీ జంకుగా ఉంది. భోజనం చేసి పడుకొన్నాను. కాసేపు గడిచింది. హఠాత్తుగా పెద్ద వాన! ఆ తరువాత ఎలాంటి జంకూ లేకుండా జయరాంబాటికి బయలుదేరాను.
నా క్షేమసమాచారాలు విచారించిన పిదప మాతృదేవి, “నాయనా! నిన్న బాగా వాన కురిసి వాతావరణం బాగా చల్లబడింది” అన్నారు. కొన్ని రోజుల క్రితం కోల్పారాలో మరణించిన ఒక భక్తుని గురించి ప్రస్తావిస్తూ ఆమె ఇలా అన్నారు: “ఆయనకు ఒక మంచి సాధువు వంటి మరణం ప్రాప్తించింది. ఆయన రూపం ఇంకా నా కళ్ల ముందే కానవస్తున్నది. కానీ ఆయన వృద్ధుడైన తండ్రి జీవించి ఉన్నాడు. అదే బాధగా ఉంది.” ఇలా అంటున్నప్పుడు మాతృదేవి కళ్లు చెమ్మగిల్లాయి.
ఆ సమయంలో కాశీ నుండి బ్రహ్మచారి దేవేంద్రనాథ్ అక్కడకు వచ్చాడు. తనకు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నట్లు ఆయన తరచూ చెప్పేవాడు. పూర్వజన్మలో నేను ఆయన ఆధ్యాత్మిక గురువునని నాలుగైదు సంవత్సరాల క్రితం నాతో చెప్పి ఉన్నారు. కానీ ఆ విషయాలు ఏవీ నాకు తెలియవు. మేమిద్దరం కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్లినప్పుడు, “మీ రిద్దరూ ఒకే చోట ఉండేవారు. మళ్లీ ఇప్పుడు కలిసి వచ్చారు” అని ఆమె చెప్పారు. అది విని దేవేంద్రనాథ్ నా చెవిలో, “విన్నావా! నేను చెప్పింది యథార్థమే” అన్నాడు. అందుకు నేను, “కావచ్చు. కానీ దానిని గురించి నా కేమీ తెలియదు” అన్నాను.
మాతృదేవిని దర్శించుకొని బయటకు వచ్చాక దేవేంద్రనాథ్ నాతో ఇలా చెప్పాడు: “మాతృదేవి వద్ద సన్న్యాసదీక్ష పుచ్చుకోవాలని వచ్చాను. కాని ఈ సంగతి నువ్వు మాతృదేవికి విన్నవించకుంటే నా ఆకాంక్ష ఈడేరదు. గురుదేవుల అనుగ్రహం వల్లనే ఈ సమయంలో నేను ఇక్కడకు రాగలిగాను. కాశీలో నేను గురుదేవులను, మాతృదేవిని ఒక దివ్యదర్శనంలో చూశాను. మాట్లాడాను కూడా. ఇది ముమ్మాటికీ నిజం.” అందుకు నేను, “నా అంతట నేనుగా మాతృదేవితో ఏమీ చెప్పను. ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాను.
ఏడెనిమిది రోజులు అక్కడ గడిపాను. దేవేంద్ర కాస్త చిరాకు పడుతున్నట్లుగా తోచింది. ఏమైనప్పటికీ ఒక రోజు ఉదయం మాతృదేవి ఏకాంతంగా ఉండడం చూసి, “అమ్మా, మీతో ఒక విషయం చెప్పవచ్చునా?” అని అడిగాను. అందుకు మాతృదేవి నవ్వుతూ, “మంచిది, కాసేపయ్యాక నేను కాయగూరలు తరుగుతున్నప్పుడు వచ్చి చెప్పు” అని చెప్పారు. అలాగే మాతృదేవి కాయగూరలు తరుగుతున్నప్పుడు వెళ్లాను.
మాతృదేవి: ఏం చెప్పాలి? చెప్పు.
నేను: అమ్మా! మీకు సమస్తం తెలుసు. కాశీలో దేవేంద్రునికి దర్శనమిచ్చారు. గురుదేవుల దర్శన భాగ్యం కూడా ఆయనకు కలిగింది. సన్న్యాసం పుచ్చుకోగోరు తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన సంసార జీవితం గడపరు. ఆయనకు సన్న్యాస దీక్ష అనుగ్రహించకూడదా?
మాతృదేవి (చిరునవ్వుతో): ఆతడు సన్న్యాసం పుచ్చుకొంటే ఇతరుల కెవరికైనా ఇబ్బందులు కలుగుతాయా?
నేను: ఆయన తల్లితండ్రులు గతించారు. ఒక అన్నగారు ఉన్నారు. ఆయన బ్రహ్మసమాజస్థుడు, డబ్బున్నవాడు. దేవేంద్ర సన్న్యాసం పుచ్చుకొన్నందువల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలుగదనే చెప్పాలి.
మాతృదేవి: అలా అయితే సరే. కోయల్పారా మఠం నుండి కాషాయ రంగు వేసిన క్రొత్త గుడ్డలు తీసుకురా. రేపే సన్న్యాసం ఇవ్వవచ్చు.
మర్నాడు ఉదయం మాతృదేవి, దేవేంద్రునికి సన్న్యాసం ప్రసాదించారు. కాషాయాంబరాలలో ఆతణ్ణి చూసినప్పుడు, “చూడు! ఇప్పుడితడు కొత్త మనిషి. పాత మనిషి కాడు” అని అన్నారు.
భూదేవ్ వివాహ సందర్భంలో పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఒక పెద్ద రాయిని ఛాతీ మీద ఉంచుకొని దానిని బద్దలుకొట్టి ప్రదర్శించి చూపారు. ఆ రాయిని బద్దలుకొట్టేటప్పుడు. మాతృదేవి, “భగవంతుడా, వీరిని కాపాడు, వీరిని కాపాడు” అంటూ ప్రార్థించారు. తదనంతరం నన్ను, “వీరేమైనా మంత్ర తంత్రాలు నేర్చారా?” అని అడిగారు.
నేను: లేదమ్మా! ఇందులో మంత్రతంత్రా లేవీ లేవు. అంతా అభ్యాసమే! క్రమక్రమంగా అభ్యాసం చేసి బలాన్ని, శక్తిని సంతరించుకొంటారు. అమెరికాలో జరిగిన ఒక సంఘటన గురించి విన్నాను. ఒక వ్యక్తి రోజూ ఒక లేగదూడను తన చేతుల్లో ఎత్తుకొని మేతకై దూరంలో ఉన్న పచ్చికబయలుకు తీసుకువెళ్లేవాడట. క్రమంగా లేగదూడ ఎదగసాగింది. రోజు ఆ వ్యక్తి దాన్ని మోసుకుపోవడం మానలేదు. చివరకు దూడ ఎద్దుగా ఎదిగిన తరువాత కూడా ఆతడు సులభంగానే దానిని మోసుకు వెళ్లగలిగాడట! అది చూసి ఆ ఊరు ఊరంతా ఆశ్చర్యపోయింది. చివరకు ఆతడు తన ఈ చర్యను ఒక విన్యాసంగా చూపసాగాడట.
మాతృదేవి: చూడు, అభ్యాసానికి ఎంత శక్తి ఉందో! అదే విధంగా మంత్రాన్ని జపించి జపించి ఒక వ్యక్తి పరిపూర్ణ స్థితిని సంతరించుకొంటాడు. జపంతో సిద్ధి, జపంతో సిద్ధి.
ఆ రోజుల్లో జయరాంబాటికి ఒక సన్న్యాసి వచ్చాడు. ఆయన రామకృష్ణ మఠానికి చెందినవారు కారు. కానీ మాతృదేవికి పరిచితులు. ఒక రోజు ఉదయం భోజనం చేస్తున్నప్పుడు మాతృదేవి నా ప్రక్కన కూర్చుని ఉన్నారు. ఆ సన్న్యాసి కాస్త దూరంలో కూర్చొని ఉన్నారు. అప్పుడు మాతృదేవి నాతో, “కాషాయాంబరాలు ధరించినంత మాత్రాన అంతా అయిపోతుందా? (ఆ సన్న్యాసిని చూపుతూ) ఇదిగో, ఈతడు కూడా కాషాయం ధరించాడు. నీకు ఈ స్థితిలోనే అంతా లభిస్తుంది. కాషాయం ఎందుకు?” అని చెప్పారు.
నేను: అమ్మా, భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించడం మూలంగా పూర్వజన్మ కర్మలను నశింపచేసుకోవచ్చా?
మాతృదేవి: కర్మ ఫలాన్ని అనుభవించే తీరాలి. కానీ విధివ్రాత ప్రకారం కాలు విరగవలసిన చోట పాదంలో కేవలం ఒక ముల్లు గుచ్చుకోవడంతో అతడు ఆ కర్మఫల తీవ్రతను తప్పించుకోవచ్చు.
నేను: అమ్మా, ఆధ్యాత్మిక సాధనలంటూ దేనినీ నేను అనుష్ఠించలేకపోతున్నాను. ఏనాటికైనా అనుష్ఠించగలనన్న నమ్మకం కూడా లేదు.
మాతృదేవి: ఏం చేస్తున్నావో అది కొనసాగించు. మరేం చేయగలవు? కానీ గురుదేవులు నీకు అండగా ఉన్నారు. నేను కూడా ఉన్నానని మరచిపోవద్దు.
ఒక రోజు రాధూ అనారోగ్య కారణంగా చీకాకుగా ఉండడం మాతృదేవి గమనించి, “ఆమెను కాస్త చూడు నాయనా” అన్నారు నాతో. నాకు నాడి చూడడం కూడా తెలియదు. కాని మాతృదేవి తృప్తి కోసం, రాధూ నాడిని పరీక్షించినట్లుగా చూసి మాతృదేవితో, “పెద్దగా ఏమీ లేదు, కాస్త బలహీనత తప్ప. కాసిని పాలు ఇవ్వండి చాలు” అని చెప్పాను. చిన్నపిల్ల వంటి స్వభావం గల మాతృదేవి, వెంటనే రాధూకు పాలు తెచ్చి ఇచ్చారు.
ఇంతలో సురబాల వచ్చి రాధూ పక్కన కూర్చుంది. సొంతతల్లి అయినా ఆమె తన పక్కన కూర్చోవడం రాధూకు నచ్చదు. అందువలన రాధూ చికాకు ఎక్కువయింది. వెంటనే మాతృదేవి, సురబాలను కాస్త దూరంగా ఉండమన్నారు. అప్పుడు మాతృదేవి చేతులు పొరపాటుగా సురబాల కాళ్లకు తగిలాయి. అంతే! సురబాల తొట్రుపాటుతో, “నా కాళ్లను తాకావు. నాకేం కాబోతోందో!” అంటూ కేకలు పెట్టింది. అది చూసి మాతృదేవి నవ్వు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న రాస్బిహారి మహరాజ్గారు, మాతృదేవిని ఇలా అడిగారు:
“అమ్మా! చూడండి. ఒక వైపు పిచ్చిదానిలా ఉంది, మిమ్మల్ని తిడుతుంది, కొట్టబోతుంది. కానీ మీ చేతులు ఆమె కాళ్లను తాకాయని ఇంతగా భయపడు తుందేమిటి?”
మాతృదేవి: నాయనా! రాముడు సాక్షాత్తు నారాయణుడనీ, సీత ఆదిపరాశక్తి అనీ రావణుడికి తెలియదా ఏమిటి? అయినప్పటికీ తనకంటూ కేటాయించిన భూమికను అతడు పోషించాడు. ఈమెకు కూడా నే నెవరో తెలియదా ఏమిటి? అయినా దీన్ని నిర్వర్తించడానికే ఆమె వచ్చింది.
నేను: భక్తుల పాపాలను స్వీకరించడం వలనే మీకు ఈ వాతరోగం లాంటివి వచ్చినట్లు విన్నాను. నాకోసం మీరు దేనినీ అనుభవించకండి. నా కర్మను నేనే అనుభవించేలా ఆశీర్వదించండి. ఇదే నా హృదయపూర్వక ప్రార్థన.
మాతృదేవి: అవేం మాటలు నాయనా! అవేం మాటలు! మీరంతా బాగుండాలి. నేనే అనుభవిస్తాను.
ఆహా! ఈ మాటలు అంటున్నప్పుడు మాతృదేవి కృపాసింధువే అయినారు!
బయలుదేరేటప్పుడు మాతృదేవికి ప్రణమిల్లాను. భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఆమె తమ చేత్తో నా తలను స్పృశించి, దీవించారు. ఆ తరువాత, “ఆహా! వీరంతా నా వద్దే ఉండగోరతారు. కానీ ఏం చెయ్యగలం? ఇంట్లో ఎన్నో పనులు కదా!” అని అన్నారు.
పరాయి దేశానికి తన కుమారుణ్ణి సాగనంపే తల్లిలా మాతృదేవి చెమ్మగిల్లిన కళ్లతో నాతో కొంత దూరం నడిచివచ్చి, నేను వెళ్లిపోతూవుంటే అలాగే చూస్తూ నిలబడిపోయారు.
ఒక రోజు నలుగురు మిత్రులతో కలిసి జయరాంబాటికి వెళ్లాను. వారికి మాతృదేవి మంత్రదీక్ష ప్రసాదించారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు గురించి ప్రస్తావించి, ఆయన కూడా అనేకులకు మంత్రదీక్ష ఇస్తున్నట్లు చెప్పాను. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“వీరిలో పలువురికి ధనమే ధ్యేయం. కానీ మరో విషయం, వీరి వలన కూడా మంచి జరుగుతున్నది. ఒక వ్యక్తి తనంతట తానుగా ఏదీ చేయడు. వీరి మాటలు విని అయినా, ఏదో కొంత నామజపమైనా చేస్తాడు.
“హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ఆకాంక్షించే వ్యక్తి చివరికి ఇక్కడికే చేరుకొంటాడు. భగవంతుని పావన నామాలూ, మంత్రాలూ ప్రస్తుతం ఎలా వ్యాప్తి చెందుతున్నాయో చూశావా? కొంచెమైనా సారం ఉన్న వ్యక్తి వాటి ప్రభావంలోకి రాకుండా ఉండలేడు.”
నాడు మంత్రదీక్ష పుచ్చుకొన్న వారిలో ఒకడు బాలుడు. మంత్రదీక్ష పూర్తయ్యాక మాతృదేవి ఆ బాలుడితో, “నూట ఎనిమిది సార్లు జపం చేయి” అని చెప్పారు. కానీ అతడు అంతటితో తృప్తిపడలేదు. వేయి, లక్షసార్లు జపం చేయాలని ఆతడి కోరిక. మాతృదేవి నవ్వుతూ, “మీ కిప్పుడే అలాగే అనిపిస్తుంది. కానీ అలా చేయ లేరు. చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి కదా! ఎక్కువగా చేయగలిగితే మంచిదే” అని చెప్పారు.
ఒక రోజు మాతృదేవికి పాదపూజ చేయడానికి తామరపువ్వులు సేకరించి తెచ్చాను. వాటిని చూసి ఆమె, “కొన్ని పువ్వులను సింహవాహినీదేవికి అర్పించు, తక్కినవి ఇక్కడ ఉంచు” అన్నారు. అప్పుడు మాలో ఒకరు, “పువ్వులన్నింటిని మీ పాదాలకు అర్పించి పూజించడమే మా అభిలాష” అని చెప్పారు. అందుకు మాతృదేవి, “మంచిది, అలాగే చేయండి. కానీ పాదాలను చూడు. వీటినా నువ్వు పూజింప అభిలషిస్తున్నావు?” అని అడిగారు.
జయరాంబాటిలో ఒక రోజు మాతృదేవి నాతో ఇలా అన్నారు:
“నాయనా! రోజంతా కుస్తీ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఒక భక్తుడొచ్చి వెళ్లే లోపుగా మరో భక్తుడు వస్తున్నాడు. దీనికి అంతమే లేకున్నట్లుంది. ఈ దేహం ఇంతకంటే ఎక్కువ భరిస్తుందని తోచడం లేదు. గురుదేవులను ప్రార్థిస్తూ, ‘రాధూ, రాధూ’ అని చెప్పుకొంటూ మనస్సును దిగువకు లాగి పట్టుకొని ఉన్నాను.”
ఈ మాటలు వినగానే గురుదేవుల జీవితంలోని ఒక సంఘటన స్ఫురణకు వచ్చింది. ‘నీళ్లు తాగాలి, పొగ తాగాలి’ అనుకొంటూ మనస్సును బాహ్యజగత్తులో నిలిపేవారట. మాతృదేవి కూడా అలాగే చేస్తున్నారా? పరులకు మంచి చేయాలనే ఏకైక ఉద్దేశంతో తాము ఇన్ని ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారా?
సెలవు పుచ్చుకొంటున్నప్పుడు మాతృదేవితో, “అమ్మా! నా వంటి పిల్లలు మీకు ఎందరో ఉన్నారు. కానీ మీ వంటి తల్లి నాకు లేరు” అని చెప్పాను. అది విని మాతృదేవి కళ్లు చెమ్మగిల్లాయి. ఎంతో ఆప్యాయంగా నా చుబుకం స్పృశించి, దీవించారు.
ఒక రోజు రాజేంద్రునితో కలిసి మాతృదేవి దర్శనార్థం ఉద్బోధన్కు వెళ్లాను. మేం ప్రణమిల్లగానే, “ప్రభూ! వీరి కోర్కెలన్నింటినీ ఈడేర్చండి” అంటూ చేతులు జోడించి గురుదేవులను ప్రార్థించారు.
నేను: అది ఎలానమ్మా? అన్ని కోర్కెలూ ఈడేరితే ఏమవుతుంది? మనస్సులో ఎన్నో విపరీత కోర్కెలు కూడా జనిస్తాయి కదా!
మాతృదేవి (నవ్వుతూ) : దాని గురించి మీరు కలత చెందనవసరం లేదు. మీకు అవసరమైనవేవో, మీకు శ్రేయస్కరమైన వేవో వాటిని మాత్రమే గురుదేవులు మంజూరు చేస్తారు. మీరు అనుష్ఠిస్తూన్న దానిని అట్లే కొనసాగించండి. భయ మెందుకు? మేం ఉన్నాం కదా!
జయరాంబాటిలో ఒకనాటి ఉదయం. ఒక లేగదూడ హృదయ విదారంగా అరుస్తోంది. పాలు పితకడానికి దానిని తల్లి ఆవుకు కాస్త దూరంగా తీసుకెళ్లి కట్టారు. దాని అరుపులు విన్న మాతృదేవి, “వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇదిగో నీ కట్లు విప్పుతాను, నీ కట్లు విప్పుతాను” అంటూ త్వరత్వరగా వెళ్లి ఆ దూడ కట్లను విప్పారు. అది చూసి నేను నివ్వెరపోయాను. సమస్త జీవరాశుల పట్లా కారుణ్యాన్ని వెదజల్లే జగజ్జననిని అవ్యాజ కరుణామూర్తియైన మాతృదేవి రూపంలో దర్శించాను. ఆహా! ఆ లేగదూడలా మనం ఆర్తితో పిలవగలిగినప్పుడే కదా మన బంధనాలు కూడా విడివడతాయి!
మాతృదేవి అనురాగం, అవ్యాజ కరుణ, అవధులులేని ఆప్యాయతలన్నీ వర్ణనాతీతాలు! మేం ఆమెను దర్శించాం. ఆమె పాదపద్మాలను స్పృశించగలిగాం. ఆమె అనుపమాన అనుగ్రహాన్ని పొందగలిగాం. స్పర్శించిన దానిని బంగారంగా రూపొందించే పరసువేదిలా శరణుజొచ్చిన వారినందరినీ బ్రోచేవి కదా మాతృదేవి పాదాలు!