జయరాంబాటి 1908
మాతృదేవిని నేను మొట్టమొదట 1907 లో దర్శించాను. రెండవసారి 1908 వర్షాకాలంలో దర్శించాను. నేను వెళ్లి ఆమెకు ప్రణమిల్లాను.
మాతృదేవి: నువ్వు మాస్టర్ విద్యార్థివా?
నేను: కానమ్మా! కానీ ఆయన వద్దకు వెళుతూ ఉండేవాణ్ణి.
మాతృదేవి: ఆయన ఎలా ఉన్నారు? ఈ మధ్య ఆయనను చూశావా?
నేను: బాగానే ఉన్నారు. ఏడెనిమిది రోజుల క్రితం ఆయనను కలుసుకొన్నాను.
మధ్యాహ్న భోజనానంతరం మాతృదేవి వద్దకు వెళ్లాను.
నేను: అమ్మా! మీరు కలకత్తాకు ఎప్పుడు వస్తారు?
మాతృదేవి: దుర్గాపూజలప్పుడు రావాలనుకొంటున్నాను. అంతా ఆ దేవి ఇచ్ఛ. నీకు వరి పొలం ఉందా?
నేను: ఉందమ్మా!
మాతృదేవి: మంచిది. మా ఊళ్లో మంచి వరి పండదు. మీరు మినుములు పండిస్తారా?
నేను: పండిస్తామమ్మా!
మాతృదేవి: మంచిపని.
రాత్రి భోజనానంతరం సంభాషణ కొనసాగింది.
మాతృదేవి: నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా?
నేను: అవునమ్మా! ఎంతో కష్టం. ఎడతెగకుండా కొన్ని రోజులు జబ్బున పడ్డాను. వివాహం కూడా అయింది.
మాతృదేవి: ఏమిటీ, వివాహం కూడా అయిందా?
నేను: అయిందమ్మా!
మాతృదేవి: వధువు వయసెంత?
నేను: పదమూడేళ్లు ఉంటాయి.
మాతృదేవి: జరిగిందంతా నీ మంచికే. మరేం చేయగలవు?
నేను: వివాహం చేసుకోవద్దని మాస్టర్ చెప్పారు.
మాతృదేవి: అంతేకదా! ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అందుకే వివాహం చేసుకోవద్దన్నారు.
నేను: సంసార జీవితంలో ఎన్నో కష్టాలు. మనిషి మానవత్వాన్నే కోల్పోవాల్సి వస్తుంది.
మాతృదేవి: నిజమే. కేవలం డబ్బు, డబ్బు. డబ్బే కదా అక్కడ సమస్తమూ!
నేను: భరించలేని బాధ.
మాతృదేవి: నువ్వెందుకు బాధపడతావు? గురుదేవులకు ఎందరో గృహస్థ భక్తులు ఉండేవారు కదా!
నేను మౌనంగా ఉండిపోయాను.
మాతృదేవి: నా సోదరులు కూడా వివాహితులే.
నేను: మీ సమ్మతితోనే వివాహం చేసుకొన్నారా?
మాతృదేవి: ఏం చేయగలను? ‘మలంలో జీవించే పురుగులు దాన్లోనే ఆనందం పొందుతాయి. కానీ వాటిని అన్నపు కుండలో ఉంచితే చస్తాయి’ అనేవారు గురుదేవులు. అంతేనా? అత్తమామలకు మేం పరిచర్యలు చేసినట్లు ఇప్పటి కోడళ్లు చేయగలరా?
నేను: కాలగతిలో అన్నీ మారిపోతున్నాయి.
మాతృదేవి: అది నిజమే. నా సంగతే తీసుకో. ఆ కాలంలో నేను ఒకచీమను సైతం చంపింది లేదు. కానీ ఇప్పుడు కొన్ని సమయాల్లో పిల్లినికొడుతున్నాను. ‘దీన్ని చేయి, దాన్ని చేయి’ అనేవారు గురుదేవులు. ‘సకలమూ నువ్వే, సకలమూ నువ్వే’ అనేవారు ఆయన. అయితే లోకులు ఎన్నో కష్టాలు పడిన తరువాతే, ‘సకలమూ నువ్వే’ అంటారు.
అంతా స్వార్థమే! అహంకారం ఉన్నంతవరకు స్వార్థం ఉంటుంది. ఆ తరు వాత అంతా అణిగిపోతుంది.
భయమెందుకు? వివాహం చేసుకొన్నావు. గురుదేవుల కృపాకటాక్షంతో అంతాచక్కబడుతుంది. ఆమె సజ్జనురాలనుకొంటాను. ‘ఆధ్యాత్మికత పట్ల అనురక్తి లేనిస్త్రీ, పురుషుణ్ణి సంసార జీవితంలో బంధించివేస్తుంది’ అనేవారు గురుదేవులు.
కోల్పారా, ఏప్రిల్ 20, 1919
మణీంద్ర, సాతు, నారాయణ అయ్యంగార్ ప్రభృతులు ఉదయం దాదాపుపది గంటలకు మాతృదేవి దర్శనానికి వెళ్లారు. మాతృదేవి నెల రోజులుగా జగదంబ ఆశ్రమంలో బస చేసి ఉన్నారు. పురుషులు కోల్పారా ఆశ్రమంలో బస చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
మాకూ బిడ్డ డిఫ్తీరియా* (Diphtheria) తో బాధపడుతున్నాడు. జయరాంబాటిలో వైకుంఠ మహరాజ్ పర్యవేక్షణలో ఆ బిడ్డ చికిత్స పొందుతున్నాడు. ఆబిడ్డ విషయమై మాతృదేవి ఎంతో ఆందోళనపడుతున్నారు.
నారాయణ అయ్యంగార్: అమ్మా! మీ అనుగ్రహంతో ఆ బిడ్డకు నయమవు తుంది.
మాతృదేవి: (గదిలోని గురుదేవుల ఛాయాచిత్రానికి చేతులు జోడించినమస్కరిస్తూ) ఆయన ఉన్నారు.
సాతు: ఆ బిడ్డ చికిత్సకై ఈయన (నారాయణ అయ్యంగార్) కలకత్తా నుండి సూదిమందు (injection) తెప్పించారు.
మాతృదేవి: ఎలాగో బిడ్డ కోలుకోవాలి! ఈయన లేకుంటే కలకత్తా నుండి మందు తెప్పించడం వీలయ్యేదా?
నారాయణ అయ్యంగార్: నేను యంత్రాన్ని! నడిపించేది గురుదేవులు!! ఒక యంత్రంలా నన్ను పనిచేయిస్తూన్నది ఆయనే.
మాతృదేవి: ధనవంతుడు డబ్బును దానం ఇవ్వడం ద్వారా సేవ చేయాలి, అది లేనివాడు జపతపాదుల ద్వారా సేవ చేయాలి అనేవారు గురుదేవులు.
నారాయణ అయ్యంగార్: జపం చేయడానికి ముందు ఆచమనం ఆవశ్యకమా?
మాతృదేవి: అవును. ఇంట్లో ఉన్నప్పుడు ఆసనమూ, ఆచమనమూ రెండూ అవసరమే? బయటకు వెళ్లినప్పుడు కేవలం నామోచ్చారణ చాలు.
నారాయణ అయ్యంగార్: కేవలం నామోచ్చారణ సరిపోతుందా? మంత్రజపం అవసరం లేదా?
మాతృదేవి: నేను చెప్పింది మంత్రజపం గురించే! కానీ మనస్సును ఏకాగ్రం చేసి ఒకసారి నామోచ్చారణ చేసి ఆయనను ప్రార్థించడం, లక్షసార్లు జపం చేయడానికి సమానం. మనస్సును ఏకాగ్రం చేయకుండా రోజంతా జపం చేసినా ప్రయోజనం ఉండదు. మనస్సు ఏకాగ్రం చెందాలి. అప్పుడే భగవత్కృప సిద్ధిస్తుంది.
నారాయణ అయ్యంగార్: నేను చేస్తూవున్నది చాలునా లేక ఇంకా మరేదైనా చేయాలా?
మాతృదేవి: నువ్వు చేస్తూ ఉన్నది కొనసాగించు. ఇప్పటికే నువ్వు ఆయన అనుగ్రహానికి పాత్రుడవైనావు.
నారాయణ అయ్యంగార్: చిత్తశుద్ధితో రెండు మూడుసార్లు ప్రార్థించిన మాత్రాననే భగవద్దర్శనం లభిస్తుంది. నేను ఇన్ని రోజులుగా ప్రార్థిస్తున్నాను. కానీ నా కెందుకు దర్శనం కాలేదు?
మాతృదేవి: లభిస్తుంది! లభించకుండా ఎక్కడకు పోతుంది? గురుదేవుల మాట శివుని వాక్కు. అది జరగకుండా పోవడానికి ఆస్కారమే లేదు. ‘డబ్బుగల వ్యక్తి దానం ఇవ్వడం ద్వారా సేవ చేయాలి, అది లేని వ్యక్తి జపతపాదుల ద్వారా సేవ చేయాలి’ అని గురుదేవులు సురేంద్రునితో అన్నారు. (అందరినీ చూస్తూ) అది కూడా సాధ్యం కాని పక్షంలో (గురుదేవులను చూపుతూ) ఆయనకు శరణాగతులు కండి. ‘నన్ను కాపాడడానికి ఒకరున్నారు. ఒక తల్లో, తండ్రో ఎవరో ఒకరున్నారు’ అనే భావన మనస్సులో నెలకొని ఉంటే చాలు.
నారాయణ అయ్యంగార్: మీరు చెబుతున్నారు. అదే నా విశ్వాసం.
రాధూకు బిడ్డ పుట్టాడు. అప్పటి నుండే రాధూకు జబ్బుగా ఉంది. ఆహారం కూడా ఎవరైనా తినిపించవలసి వస్తోంది. ఆమెకు ఆహారమిచ్చే వేళ అవగానే, “రాధూకు ఆహారమివ్వాలి” అంటూ మాతృదేవి లేచారు.
భక్తులు మాతృదేవికి ప్రణమిల్లారు. నారాయణ అయ్యంగార్ తన తలను మాతృదేవి పాదాలపై ఉంచి ప్రణమిల్లాడు. ఆమె కూడా అతడి తలను స్పృశించి ఆశీర్వదించారు.
మణీంద్ర ప్రణమిల్లినప్పుడు అతడితో మాతృదేవి, “నీ తల్లికి ఎంతటి ప్రగాఢ విశ్వాసం! కాశీకి వెళ్లిరమ్మనప్పుడు ఆమె నాతో, ‘ఇదే నా కాశీ! నేనెక్కడికీ వెళ్లదలచుకోలేదు’ అన్నారు” అని చెప్పారు.
మణీంద్ర తల్లి మాతృదేవితో పాటే ఉంటూ వచ్చింది. ఒక ఏడాది క్రితం ఆమె చనిపోయింది. మాతృదేవికి ఆమె ఎంతో శ్రద్ధాభక్తులతో సేవచేసింది.
సాయంత్రం అయింది. మాకూ బిడ్డ పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా ఉన్నట్లు కబురు వచ్చింది. ఆ కబురు విని మాతృదేవి తీవ్ర ఆందోళనకు గురైనారు. బ్రహ్మచారి వరదతో ఇలా అన్నారు: “పల్లకీని సిద్ధం చెయ్యి. నేటి రాత్రి గడిస్తే, రేపు ఉదయమే నేను వెళ్లి బిడ్డను చూస్తాను. కాని వేకువనే అక్కడి పరిస్థితి గురించి నాకెవరు కబురు తెస్తారు?”
అందుకు మణీంద్ర, “నేనూ, సాతు వేకువనే కబురు తీసుకువస్తాం” అనిచెప్పాడు.
కొంతసేపయ్యాక జయరాంబాటి నుండి వైకుంఠ మహరాజ్ వచ్చారు.ఆయన వచ్చారని చెప్పగానే మాతృదేవి, “బిడ్డ మరణించాడా?” అని అడిగారు.అంతా మౌనంగా ఉండడం చూసి, “ఎప్పుడు పోయాడు?” అని అడిగారు.
వైకుంఠ మహరాజ్: ఐదున్నర గంటలకు.
మాతృదేవి: ఇప్పుడు వెళితే చూడగలనా?
వైకుంఠ మహరాజ్: లేదు, తీసుకువెళ్ళిపోయారు.
మాతృదేవి ఎంతగానో విలపించారు. ఒకింతసేపు ఆగి మళ్లీ విలపించసాగారు. కేశవానంద స్వామి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు, “ఓకేదార్! ఆ పిల్లవాణ్ణి మరచిపోలేకుండా ఉన్నాను” అంటూ పదే పదే విలపించసాగారు.*
రాత్రి చాలాసేపు గడిచిపోయింది. మాతృదేవి హఠాత్తుగా, “అందరూ భోజనంచేశారా?” అని అడిగారు. మాతృదేవి భుజించనందున ఎవరూ తినలేదు. అది తెలిసి ఆమె కాస్త పాలు, రెండు లూచీలు తిన్నారు. తరువాత మిగిలిన వారు కూడా తిన్నారు.
మే / జూన్ 1919
కాశీ నుండి శాంతానంద స్వామి, హరానందస్వామి వచ్చారు. మణీంద్రకూడా వచ్చాడు. భక్తులు కోయల్పారా ఆశ్రమంలో బస చేయగా, మాతృదేవిజగదంబ ఆశ్రమంలో ఉన్నారు. ముగ్గురూ మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్లారు.
స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు ఖైదు చేయబడి, మొన్నటి రోజువిడుదలైన ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. పోలీసుల వేధింపులకు భయపడిభక్తులు వెంటనే అతణ్ణి అక్కడి నుండి పంపివేయాలనుకొన్నారు. ఈ విషయమైమాతృదేవిని అడిగినప్పుడు, “అతణ్ణి ఉండనివ్వండి. ఈ రోజు ఉండి రేపు వెళ్లి పోతాడు” అన్నారామె.
ప్రతి రోజూ సాయంత్రం పోలీసులు కోయల్పారా ఆశ్రమానికి వచ్చి అక్కడికి కొత్తగా వచ్చినవారి పేర్లను నమోదు చేసుకొని వెళ్లేవారు. అందువలన ఆ యువకుణ్ణి మఠంలో కాకుండా సమీపంలో మరెక్కడో ఉండడానికి ఏర్పాటు చేశారు కేశవానంద స్వామి.
మర్నాడు ఉదయం మాతృదేవి, “ఆ యువకు డెక్కడ? వెళ్లిపోయాడా?” అని అడిగారు.
మణీంద్ర: ఉన్నాడమ్మా. భోజనం చేసిన తరువాత వెళ్లిపోతాడు.
మాతృదేవి (శాంతానందతో): రాత్రి ఎక్కడున్నాడు?
శాంతానంద: తెలియదమ్మా! అతడు చెప్పలేదు.
మాతృదేవి: సరేలే! ఇక్కడ వానాకాలమైనప్పుడు కాశీలో కూడా వానాకాలమేనా?
శాంతానంద: కాదమ్మా! అక్కడ శ్రావణంలో వర్షాకాలం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో వైశాఖమాసంలో తుపాన్లు వచ్చి, మామిడి మొదలైన పంటలను నాశనం చేస్తాయి. కాశీలో మరణించాలనే కోర్కెతో వృద్ధురాండ్రు కాశీకి పోతారు. వారి పరిస్థితి శోచనీయం. కొన్ని సమయాల్లో ఇంటి నుండి డబ్బు పంపడం మానేస్తారు. చీకటి గదుల్లో కటిక నేల మీదనే అనేకులు నివసించవలసి వస్తోంది.
మాతృదేవి: అవును. విశ్వనాథ దర్శనం వలన, ఆయనను స్పృశించి పూజిం చడం వలన వారి పాపాలు తగ్గుతాయి. అందువలన ఆయుష్షు అధికరిస్తుంది. బృందావనంలో కూడా ఇంతే. ప్రసాదం ఆరగించడం వలన, శంఖుతీర్థాన్ని దేహంపై ప్రోక్షణం చేసుకోవడం వలన అధికకాలం జీవిస్తారు.
మాతృదేవి, రాధూ గురించి మాట్లాడసాగారు. “ఆమె కాస్త లేచి నిలబడగలిగితే బాగుంటుంది. కాలకృత్యాలు కూడా పడకలోనే తీర్చుకొంటున్నది. గురుదేవులు నన్నిలా ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు! ఆయన ఏం చేస్తారో ఎవరి కెరుక?”
లోకుల కష్టాల గురించి శాంతానందస్వామి చెప్పసాగారు.
శాంతానంద: విష జ్వరంతో అరవై లక్షలమంది చనిపోయినట్లు విన్నాను. ఒక వైపు వడ్లు, బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. లోకుల కష్టాలకు అంతేలేదు.
మాతృదేవి: అది నిజమే నాయనా! జనం తిండిలేక కష్టపడుతున్నారు. ఇంట్లో పిల్లలుంటే మరీ కష్టం. ఇది కేవలం ప్రారంభం. బాగా వానలు కురిసి వడ్లు బాగా పండినప్పుడు మాత్రమే కష్టాలు తీరతాయి. ఎవరో పాశ్చాత్య అధికారి వచ్చి ఒక చోటి నుండి మరొక చోటికి వడ్లు, బియ్యం పంపరాదనే నిషేధాజ్ఞను జారీచేయాలనుకొన్నాడని విన్నాను. అతడు వెళ్లిపోయాడట కదా!
మణీంద్ర: ఆ ప్రయత్నం ఇంకా జరుగుతూనే వుంది.
శాంతానంద: ప్రజల కష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇదేమిటమ్మా, కర్మఫలమా?
మాతృదేవి: ఇందరి కర్మఫలం ఇంత ఘోరంగా ఉంటుందా? మరేదో గందరగోళం అని భావిస్తున్నాను.
శాంతానంద: యుద్ధం* ముగిసింది. అయినా ఎందుకు ధరలు తగ్గలేదు?
మాతృదేవి: కానీ యుద్ధం మళ్లీ మొదలైనట్లు చెబుతున్నారే!
శాంతానంద: కాబూల్‌లో జరిగే యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ యుద్ధం వలన ఎన్నెన్ని కష్టాలు, దుఃఖాలు! ఇదంతా ఏమిటి? నూతన శకానికి నాందా?
మాతృదేవి: నేనెలా చెప్పగలను? భగవంతుని సంకల్పం ఎలా ఉందో నా కెలా తెలుస్తుంది? పాలకుని పాపం దేశాన్ని నాశనం చేస్తుంది. వంచన, మోసం, సజ్జనులను చంపడం మొదలైనవన్నీ పాపాలు. పాలకుడే పాపానికి పాల్పడితే ప్రజలకు బాధలు కలుగుతాయి. ఆ పాపాల పర్యవసానం యుద్ధం, భూకంపం, కరవు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. అన్ని వర్గాలూ కొంత శాంతించినప్పుడే యుద్ధం పరిసమాప్తమవుతుంది….
ఆహా! (విక్టోరియా) మహారాణి పరిపాలన ఎంత చక్కగా ఉండేది! జనం సకల సౌకర్యాలతో ఆనందంగా జీవించారు. ప్రస్తుతం ఐదేళ్ల పిల్లవాడిక్కూడా కష్టమంటే ఏమిటో తెలుసు. తాను ధరించడానికి బట్టలు లేవని ఫిర్యాదు చేస్తాడు. అవునూ, ఇంతదాకా ఎంత బియ్యం శరత్ (పేదలకు) పంచిపెట్టించాడు?
మణీంద్ర: కచ్చితంగా తెలియదు. కానీ ప్రతి వారమూ ముప్పై నాలుగు రూపాయల విలువగల బియ్యం వితరణ చేస్తున్నారు.
మాతృదేవి: ఒక్కొక్కరికి ఎంత లభిస్తున్నది?
మణీంద్ర: సుమారు పావు సేరు.
మాతృదేవి: ఒక కుటుంబానికి ఎంత?
మణీంద్ర: కుటుంబ పరిమాణాన్ని బట్టి ఆరు, ఏడు లేక ఎనిమిది సేర్లు.
మాతృదేవి: ఇంతదాకా ఎంతమందికి అంది ఉంటుంది?
మణీంద్ర: అది కూడా కచ్చితంగా తెలియదు. కానీ మహమ్మదీయ స్త్రీలు ఎక్కువమంది ఉన్నారు.
మాతృదేవి: అవును, ఈ ప్రాంతంలోని మహమ్మదీయులు బీదవారు. సరే, నివారణ ఏర్పాట్లు శరత్ మరెక్కడెక్కడ చేపట్టాడు?
మణీంద్ర: బాంకూరా, ఇంద్పూర్, మాన్భూం. కరవు బాధిత ప్రాంతాలన్నిం ట్లోనూ నివారణ కార్యక్రమాలు సాగుతున్నాయి.
మాతృదేవి: నా బిడ్డలు అక్కడ పనిచేస్తున్నారా?
శాంతానంద: అవునమ్మా! మఠం నుండి వెళుతున్నారు.
మణీంద్ర: సాతు, ఇంద్పూర్కు వెళ్లవలసిఉంది.
మాతృదేవి: సాతు సోదరిని సిహోర్‌లో ఇచ్చారు.
మణీంద్ర: అవునమ్మా! వివాహానికి సాతు వెళ్లలేదని అతడి తల్లితండ్రులు….
మాతృదేవి: అవును, వారు ఎంతో బాధపడ్డారు. బాధ ఉంటుంది కదా! కానీ ఒక సన్న్యాసి వివాహ వేడుకలలో ఎలా పాల్గొనగలడు? మరో సందర్భంలో వెళ్లి చూసి వస్తాడు. ప్రభాకర్ కుమారుడు బాగుపడితే మంచిది. బిడ్డలు కలగడమే పాపం లాగుంది. ‘ఈ జగత్తు మాయాజాలం. కానీ అది మాయాజాలమని మనిషి అర్థం చేసుకోలేకపోవడమే శోచనీయం’ అనేవారు గురుదేవులు.
జూన్ / జూలై 1919
ఒక రోజు సాయంత్రం మణీంద్ర, ప్రభాకర్, శ్యాంబజార్ వాస్తవ్యుడుప్రబోధ్బాబు కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్లారు. వారు ప్రణమిల్లిన వెంటనే ఆమె, ప్రభాకర్‌తో, “నీ కుమారుడికి అనారోగ్యంగా ఉందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగారు.
ప్రభాకర్: ప్రస్తుతం కులాసాగా ఉన్నాడు.
మాతృదేవి: మీరంతా ఎప్పుడొచ్చారు? భోజనం చేశారా?
ప్రభాకర్: చేశామమ్మా! మణీంద్ర, ప్రభాకర్‌లు తమ కుమార్తెలను నివేదిత పాఠశాలలో చేర్పించదలచు కొన్నారు. ఆ విషయం గురించి మాతృదేవితో ప్రస్తావించినప్పుడు, “ఆహా, చాలా మంచిది. శరత్‌కు వ్రాయండి” అన్నారామె.
ప్రబోధ్బాబు: ఆయనకు వ్రాశాం.
అప్పుడు అక్కడున్న భక్తురాండ్రలో ఒకరు, “చిన్న పిల్లలు కదా! ఉండగలుగు తారా?” అని అడిగింది.
మాతృదేవి: తప్పకుండా ఉండగలరు. తూర్పు వంగదేశం నుండి వచ్చిన ఆరేడేళ్ల చిన్నపిల్లలు కూడా ఉంటున్నారు. తల్లితండ్రులు వచ్చి రమ్మని పిలిచినా రామంటున్నారు.
ప్రబోధ్బాబు: నేడు గ్రామానికి వెళ్లి వచ్చాను. జనం ఎంతో కష్టపడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. మా ముందుకు వాళ్లు రాలేని స్థితిలో ఉన్నారు. పాకలకు పైకప్పులు కూడా లేవు.
ప్రబోధ్బాబు ఆ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు.
మాతృదేవి: వారికి బియ్యం ఏమైనా ఇచ్చారా?
ప్రబోధ్బాబు: ఇచ్చాం. నిన్న ఆదివారం పంపిణీ చేశాం.
మాతృదేవి: బట్టలు కూడా ఇస్తున్నారా?
ప్రబోధ్బాబు: ఇస్తున్నాం, కానీ కొందరికి మాత్రమే. అమ్మా! మీరొక కల కన్నట్లు విన్నాను. చేతిలో బిందె, చీపురు పుచ్చుకొన్న స్త్రీని చూశారని విన్నాను.
మాతృదేవి: అవును! చేతిలో బిందె, చీపురుతో ఒక స్త్రీ వచ్చి నిలబడింది. ‘నువ్వెవరవమ్మా?’ అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, ‘నేను అంతా చిమ్మివేశాక వెళతాను’ అని చెప్పింది. వెంటనే నేను, ‘ఆ తరువాత ఏమవుతుంది?’ అని అడిగాను. ఆ ప్రశ్నకు ఆమె, ‘అమృత కలశం నుండి అమృతం చిలకరిస్తాను’ అని జవాబిచ్చింది. అదే ప్రస్తుతం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. కరవు దాపురిస్తే మూడేళ్ల దాకా కొనసాగుతుందని మా అమ్మగారు చెప్పేవారు. ఇప్పటికి రెండేళ్లయింది.
మణీంద్ర: యుద్ధం కూడా దీర్ఘకాలంగా సాగుతున్నది.
మాతృదేవి: యుద్ధం నాలుగైదు సంవత్సరాలుగా కొనసాగుతున్నది. దాని సంగతి వేరు. నేనంటున్నది ఈ కాటకం ప్రారంభమై రెండేళ్లు దాటింది కదా అని! రెండేళ్లు గడిచిపోయింది కనుక ఇంకా ఒక ఏడాది కొనసాగుతుంది. అవును, బియ్యం ధర ఎంత?
బియ్యం ధర చెప్పారు.
మాతృదేవి: అంత ధర ఉందా? బట్టలు, నూనె ఇత్యాది వస్తువులన్నిటి ధర కూడా పెరిగే ఉంటుంది కదా! ఇవన్నీ సమృద్ధిగా ఉన్నవారు సైతం ఆందోళన పడవలసిందే! ‘నేను నిన్ను తింటాను, నువ్వు నన్ను తిను’ అన్నట్లుగా ఉంది. భగవంతుడు ప్రసాదించే ఇక్కట్లను, దుఃఖాలను మనఃస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆయన సంకల్పం మేరకే అంతా జరుగుతుంది.
ప్రబోధ్బాబు: అమ్మా! మీరే ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఇక ఇతరులకు గత్యంతరం ఏమిటి?
మాతృదేవి: నన్నేదో బోనులో బంధించినట్లుగా ఉంది. అక్కడికీ ఇక్కడికీకదలలేకపోతున్నాను. ఎక్కడకు వెళ్లడానికీ దారి లేదు.
ప్రబోధ్బాబు: కామార్పుకూర్లో మళ్లీ సమస్యలు తలెత్తాయి.*
మాతృదేవి: సమస్యలను కల్పిస్తున్న దెవరు? మహింబాబా?
ప్రబోధ్బాబు: కాదు, ఫకీర్బాబు, హేంబాబు.
మాతృదేవి: ఈ తగాదాల వలన ప్రయోజనం ఏమిటి? చుట్టూ కంచె వేస్తేసమస్య పరిష్కారం కాదా?
ప్రబోధ్బాబు: మనం కొనుగోలు చేసిన స్థలం నాలుగు మూలలా గుంజలు నాటించాను. మన స్థలం సరిహద్దు ఆ వీథి దాకా పోతుంది. మహింబాబుకు ఈ ఏర్పాటు నచ్చింది. మరింత సామరస్యంతో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించాలి. గుంజలను మరికాస్త దూరంగా నాటించి ఉండాలి. అప్పుడువారు ఆక్షేపణలు లేవదీస్తే, ఆ గుంజలను క్రమంగా వెనక్కు తీసుకువచ్చి, అసలుస్థానంలో నాటాలి. అంటే వారి కోసం మన స్థల విస్తీర్ణాన్ని తగ్గించుకొన్నట్లుచూపించామన్నమాట. సమస్యలను కల్పించేవారిని ఈ రీతిలోనే ఎదుర్కోవాలి.
స్థలం సమస్యకు ఇటువంటి విచిత్ర పరిష్కార మార్గం గురించి విని మాతృదేవి కడుపుబ్బ నవ్వారు.
ప్రబోధ్బాబు: శరత్ మహరాజ్‌కు ఈ విషయం వ్రాశాను. ఆయన సలహాప్రకారం చేస్తాం.
మాతృదేవి: ఆ రోజుల్లో రోజు కూలీ నాలుగు పైసలు. ఇప్పటిలా తపాలాసౌకర్యం లేదు. పెద్ద కాగితాల మీద వ్రాసి మనిషి ద్వారా పంపేవారు. అతడు ఇక్కడ నుండి కలకత్తాకు కాలినడకన వెళ్లడం నాకు బాగా జ్ఞాపకం.
ప్రబోధ్బాబు: ఇప్పుడు తపాలా సౌకర్యాలు బాగున్నాయి.
మాతృదేవి: అవును. నేనన్నది పూర్వపు రోజుల గురించి! ఒక రూపాయికి కోరినంత నూనె లభించేది. ఇప్పుడు రెండు పిడికెళ్ల బియ్యం రూపాయి. మంచిధర లభిస్తూండడంతో అంతా వడ్లు అమ్మేస్తున్నారు. మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని ఎక్కువకాలం నిల్వచేసుకోలేరు. ఎందుకంటే తాము తినడానికి కావలసి వస్తుంది కదా! అదే పెద్ద సమస్య.
ప్రసన్నుడు నాలుగైదు వందల రూపాయలకు వడ్లు అమ్మాడు. మిగిలినధాన్యంలో కొంత అపహరణకు గురైంది. రాజ్ ఘోష్ కూడా వడ్లు అమ్ముకొన్నాడు. అది పోను అతడి వద్ద వడ్లు బాగా నిల్వ ఉన్నాయి. ‘నువ్వు ఇంత మొత్తం ముట్ట చెప్పాలి. లేకపోతే నీ ఇంట్లో దోపిడీ జరుగుతుంది’ అని ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది అతడికి. ఆ ఉత్తరాన్ని పోలీసులకు చూపించాడు. స్థానికంగా ఉన్న ఆక తాయి ఎవడో అలా చేసి ఉంటాడు.
మ ణీంద్ర, ప్రబోధ్బాబు మర్నాడు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్లారు.
ప్రబోధ్బాబు: అమ్మా! బలవంతంగా సంసారంలో జీవించడం సబబేనా?
మాతృదేవి: అనేకులు అదేగా చేస్తున్నారు నాయనా!
ప్రబోధ్బాబు: మహామాయ అనుగ్రహం పొందకుండా ఇష్టానుసారం సంసా రాన్ని త్యజిస్తే ఇక్కట్లు తప్పవు.
మాతృదేవి: అటువంటి వ్యక్తి సంసార జీవితానికి తిరిగి వచ్చేస్తాడు.
జగదంబ ఆశ్రమం
మణీంద్ర: స్వామీజీకి కూడా అనేక కష్టాలు ఎదురైనాయి. కాని వాటినన్నిటిని ఆయన అధిగమించగలిగారు. ఆయన దేహదారుఢ్యం వాటిని ప్రతిఘటించ గలిగింది.
మాతృదేవి: లేదు! అతడు కూడా మధుమేహ వ్యాధితో ఎంతో బాధను అనుభవించవలసి వచ్చింది. శరీరమంతా మంటలు. అయినప్పటికీ రక్తం చిందించి కష్టపడి పనిచేశాడు.
మణీంద్ర: ఏమిటి, రక్తం వచ్చిందా?
మాతృదేవి: రక్తం రాలేదు. తన శక్తికి మించి కష్టపడి పనిచేశాడని చెబుతున్నాను.
ప్రబోధ్బాబు: డార్జిలింగ్‌లో స్వామీజీ, హరిమహరాజ్ను కౌగిలించుకొని, ‘సోదరా! మీరంతా పూర్తిగా తపోమయ జీవితం గడుపుతున్నారు. నేను మాత్రం ప్రాణాలర్పించి పనిచేస్తున్నాను’ అని చెప్పినట్లుగా విన్నాను.
మాతృదేవి: అవును, నాయనా! అతడు ఇతరుల కోసం రక్తం చిందించాడు. పాశ్చాత్య దేశాల నుండి తిరిగివచ్చి అతడే కదే ఇదంతా చేశాడు. అందువలననే ఈ యువకులకు ఒక ఆశ్రయం లభించింది. వారిలో నలుగురు అమెరికాలో ప్రచారం చేస్తున్నారు కదా!
ప్రబోధ్బాబు: అవును. వారు అభేదానందస్వామి, ప్రకాశానంద స్వామి, పరమానంద స్వామి, బోధానందస్వామి.
మాతృదేవి: కాళీ పేరేమిటి?
మణీంద్ర: అభేదానంద స్వామి.
మాతృదేవి: వసంత్ (పరమానంద స్వామి) ఇక్కడికి ఉత్తరాలు వ్రాస్తాడు, డబ్బు పంపుతాడు. అక్కడ అతడు ఉపన్యాసాలిస్తాడు. యోగీన్ కఠోర తపోమయ జీవితం గడిపాడు. తీర్థస్థలాలలో బసచేసేవాడు. ఎండిపోయిన చపాతీలు తిని, దోసిళ్లతో నీరు త్రాగేవాడు. అందుకే అతడికి తీవ్రమైన ఉదర సంబంధమైన రుగ్మత దాపురించి, అకాల మరణం చెందాడు… లౌకిక జీవితంలో ఏమైనా సుఖం ఉందా? ఇప్పుడు ఉంది, మరుక్షణం లేదు. లౌకిక జీవితం ఒక విషవృక్షం, విష పూరితం. కానీ గృహస్థ జీవితం గడుపుతున్న వారు ఏం చేయగలుగుతారు? యథార్థం గ్రహించగలిగినా ఏమీ చేయలేదు.
పిదప భక్తులు మాతృదేవికి ప్రణమిల్లి కోయల్పారా మఠానికి వెళ్లిపోయారు.
మణీంద్ర, ప్రబోధ్బాబు సాయంత్రం మాతృదేవి వద్ద కెళ్లారు.
ప్రబోధ్బాబు ఉత్తరం చదివాడు. మిగతా విషయాలతో పాటు దాన్లో ఇలా ఉంది: ‘నేను సమ్మతించి ఏం ప్రయోజనం? వీణను (ప్రబోధ్బాబు కుమార్తె) ఇక్కడ (నివేదిత పాఠశాలలో) చదివించడంలో గురుదేవుల సంకల్పం మరో విధంగా ఉంది.’
మాతృదేవి: ఏమిటి ఇలా వ్రాశాడే! విషయాన్ని పుటుక్కున తేల్చివేశాడే! ఈమెను అక్కడ చేర్చుకోవడానికి సుధీర ఇష్టపడనట్లుంది. ఆమె నాతో, ‘అమ్మా! ఇక నా వల్ల కాదు. ఎంతో కష్టంగా ఉంది’ అని చెప్పిఉంది. మహిళాభ్యుదయానికి ఆమె ఎంత కృషి చేస్తున్నది! ఖర్చులకు డబ్బు కొరత ఏర్పడ్డప్పుడు సంపన్నుల ఇంటి ఆడపిల్లలకు సంగీతం నేర్పి నెలకు యాభై అరవై రూపాయలు ఆర్జించి ఆ డబ్బును ఖర్చుచేసేది. కుట్లు, అల్లిక వంటి పనులు స్త్రీలకు నేర్పిస్తుంది. గత ఏడాది పాఠశాలకు మూడు వందల రూపాయల ఆదాయం వచ్చింది. దుర్గాపూజ రోజుల్లో స్త్రీలు అక్కడికీ ఇక్కడికీ వెళ్లి రావడానికి ఈ డబ్బు వినియోగపడింది. సుధీర, దేవవ్రతుని (ప్రజ్ఞానానంద) సోదరి. రైల్వే స్టేషన్లో టికెట్ కొనడం, ఎవరి తోడ్పాటు లేకుండా రైలులో వెళ్లడం వంటివి అతడే ఆమెకు నేర్పాడు.
మద్రాసు (చెన్నై) నుండి 20, 22 ఏళ్ల వయస్సులోని అవివాహితులైన స్త్రీలు ఇద్దరు నివేదిత పాఠశాలలో ఉంటున్నారు. ఆహా! వీరు ఎన్నో పనులు చక్కగా చేయడం నేర్చుకొన్నారు. ఈ దౌర్భాగ్య ప్రాంతంలో ఆడపిల్లకు ఎనిమిదేళ్లు వస్తే చాలు, ‘ఒక అయ్య చేతిలో పెట్టివెయ్యాలి’ అంటూ తల్లడిల్లిపోతారు. ఆహా! వివాహం జరగకుండా ఉండివుంటే రాధూకు కూడా ఇట్టి పరిస్థితి దాపురించేది కాదు కదా!