ఉద్బోధన్, జనవరి 1911
ఒక శుక్రవారం ఉదయం శ్రీ క. కలకత్తా సాటల్డంగాలోని మా ఇంటికి వచ్చి, “రేపు మాతృదేవిని దర్శించడానికి వెళుతున్నాం. సిద్ధంగా ఉండండి” అని చెప్పారు. ఆహా! చివరకు మాతృదేవిని దర్శించుకోవడానికి రేపు వెళుతున్నాం! రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా నేను కలకత్తాలోనే వసిస్తూన్నాను. ఇంత కాలానికి మాతృదేవి నన్ను అనుగ్రహిస్తున్నారా? మంచి రోజులు రావడానికి ఇంతకాలం పట్టిందా?
మర్నాడు సాయంత్రం ఒక బండిని బాడుగకు కుదుర్చుకొన్నాం. బ్రహ్మసమాజ బాలికా పాఠశాలకు వెళ్లి సుమతిని కూడా తోడ్కొని మాతృదేవి దర్శనానికి బయలుదేరాం. నా ఆతురతా, ఉత్సుకతా వర్ణనాతీతం.
బాగ్‌బజార్‌లోని మాతృదేవి ఇంటిని చేరుకొన్నప్పుడు ఆమె పూజామందిర ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. ఆమె ఒక పాదం గడప మీద, మరొక పాదం కాళ్లు తుడుచుకొనే పట్టా మీద ఉన్నాయి. తలమీద ముసుగు లేదు. ఎడమ చేతిని పైకెత్తి వాకిలి మీద ఉంచి కుడిచేతిని జారవిడిచి ఎవరి కోసమో ఎదురుచూస్తూన్నట్లు ఆతురతతో నిలబడి ఉన్నారు. నేను మాతృదేవి పాదాలకు నమస్కరించగానే ఆమె నా గురించీ, సుమతి గురించీ అడిగారు. తన అక్కగా నన్ను సుమతి మాతృదేవికి పరిచయం చేసింది. కొంతకాలంగా మాతృదేవిని సుమతి దర్శిస్తూవుంది.
మాతృదేవి నాతో ఇలా అన్నారు: “అమ్మాయీ, ఇలా చూడు! నా తమ్ముడి భార్య, రాధూ అందరికీ జ్వరం. వీరిని ఎవరు చూసుకొంటారు, ఎవరు శుశ్రూష చేస్తారు? నాకు ఏమీ తోచడం లేదు. వీరి కారణంగా నేనెంత ఇబ్బంది పడుతున్నానో కదా! కాస్త కూర్చో, బట్టలు ఉతుక్కుని వస్తాను.” మేం అలాగే వేచివున్నాం. బట్టలు ఉతికిన తర్వాత మాతృదేవి వచ్చారు. చేతుల నిండుగా జిలేబీల ప్రసాదం తీసుకు వచ్చి నా కిస్తూ “అమ్మాయీ, సుమతిక్కూడా ఇవ్వు, నుమ్వా తీసుకో” అన్నారు. బడికి తిరిగి వెళ్లడానికి సుమతికి ఆలస్యం అవుతున్నందు వలన మేం ఎక్కువసేపు అక్కడ గడపలేకపోయాం. అందువలన మాతృదేవికి ప్రణామాలు చేసి సెలవు పుచ్చుకొన్నాం. “మళ్లీ రండి” అంటూ మాతృదేవి మాకు వీడ్కోలిచ్చారు.
ఈ విధంగా ఐదు నిమిషాలే మాతృదేవిని దర్శించడంలో నాకెంతమాత్రం తృప్తి కలుగలేదు. మనస్కరించకుండానే ఇంటికి తిరిగి వచ్చాను.
ఫిబ్రవరి 12, 1911
ఈరోజు నేను ఉద్బోధన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాతృదేవి బలరాంబోసు ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. కొంతసేపు వేచివున్నాను. ఆమె తిరిగి రాగానే నేను నమస్కారం చేశాను. మాతృదేవి చిరునవ్వుతో, “ఎవరితో వచ్చావు?” అని అడిగారు. “నా మేనల్లుడితో” అని బదులు చెప్పాను. తదుపరి మాతృదేవి, “ఎలా ఉన్నావు? నీ సోదరి బావుందా? చాలా రోజుల దాకా నువ్వు రాకపోయేసరికి నీకు ఒంట్లో కులాసాగా లేదేమోనని ఆందోళన పడ్డాను” అని అన్నారు.
నేను ఆశ్చర్యపోయాను. మాతృదేవిని నేను దర్శించింది ఒక్కసారే! అదికూడా కేవలం ఐదు నిమిషాలే! అయినా మాతృదేవి నన్ను జ్ఞాపకం ఉంచుకొన్నారు. నా కళ్లు ఆర్ద్రమైనాయి.
మాతృదేవి ఎంతో వాత్సల్యపూరితంగా, “నువ్వు ఇక్కడ వేచివున్నావు. అందుకే అక్కడ (బలరాంబోసు ఇంట్లో) ఉండలేకపోయాను” అని అన్నారు.
మళ్లీ ఆశ్చర్యపోవడం నా వంతయినది.
మాతృదేవి మేనల్లుడైన (తమ్ముని కుమారుడు) క్షుదిక్కు సుమతి రెండు ఉన్ని టోపీలను నా చేత పంపించింది. వాటిని మాతృదేవికి అందించాను. ఆ చిరుకానుకకు ఆమె ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చింది. ఆమె పరుపు మీద కూర్చుని, “రా, ఇక్కడకు వచ్చి నా వద్ద కూర్చో” అన్నారు. నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను.
ఉట్టిపడే ప్రేమతో మాతృదేవి నాతో, “అమ్మాయీ! నిన్ను ఇంతకు మునుపు ఎన్నోసార్లు చూసినట్లు, ఎంతో కాలం నుండి నీతో నాకు పరిచయం ఉన్నట్లు అని పిస్తోంది” అని అన్నారు. అందుకు బదులుగా నేను, “అదేమో నా కేమీ తెలియదు. నేను ఒక రోజు మాత్రమే, అదీ ఐదు నిమిషాలే ఇక్కడ ఉన్నాను” అని అన్నాను.
మాతృదేవి చిరునవ్వు నవ్వారు.
ఒకరి తరువాత ఒకరుగా భక్తులు రాసాగారు. వారంతా కరుణారసభరితమై, సుందర మందహాస విలసితమై ఒప్పారే మాతృదేవి ముఖారవిందాన్ని రెప్పవాల్చకుండా అమిత ప్రేమతో చూస్తూ ఆనందించసాగారు. ఇటువంటి అద్భుతదృశ్యాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆ పరమానంద సాగరంలో నా మనస్సు ఓల లాడుతుండగా నేను ఇంటికి తిరిగి వెళ్లడానికి బండి సిద్ధంగా ఉందని కబురువచ్చింది.
వెంటనే మాతృదేవి లేచి వెళ్లి నాకు ప్రసాదం ఇచ్చారు. దాన్ని నా నోటి వద్దపెట్టి, “తిను, తిను” అన్నారు. పరుల సమక్షంలో నేనొక్కదాన్నే తినడానికి సిగ్గుపడ్డాను. “ఎందుకు సంశయిస్తావు? తీసుకో” అంటూ మాతృదేవి మళ్లీ అన్నారు.ప్రసాదాన్ని నా చేతుల్లోకి తీసుకొన్నాను. ఆమెకు నమస్కరించి, “వెళ్లొస్తానమ్మా” అని చెప్పి, సెలవు పుచ్చుకొన్నాను. “అమ్మాయ్! మళ్లీ రా! మెట్లు దిగి వెళ్లగలవా?నేను కూడా నీతో రానా?” అంటూ మాతృదేవి మెట్ల వరకు వచ్చారు. “వద్దమ్మా, నేనే వెళ్లగలను. మీరు రావద్దు” అని చెప్పాను. “మళ్ళీ ఒక రోజు ఉదయాన్నే రా” అంటూ మాతృదేవి నాకు సెలవిచ్చారు. నేను సంతుష్టాంతరంగంతో తిరిగి వచ్చాను. ‘ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ’ అనుకొని విస్తుపోయాను.
మే 14, 1911
నేడు నేను వెళ్లి ప్రణామం చేయగానే మాతృదేవి, “వచ్చావా తల్లీ! ఏమైంది?నువ్వెందుకు రాలేదోనని ఆలోచిస్తున్నాను. అవును, ఇన్నాళ్లు నువ్వెందుకు రాలేదు?” అని అడిగారు.
నేను: నేను ఇక్కడ లేను, పుట్టింటికి వెళ్లాను.
మాతృదేవి: సుమతి ఎందుకు రాలేదు? చదువులో మునిగిపోయిందా?
నేను: లేదమ్మా, ఆమె భర్త ఇక్కడ లేడు.
మాతృదేవి: ఓ అలాగా? ఆమె బడికి వెళుతున్నది, మంచిది. వారు గృహస్థధర్మాన్ని పాటిస్తున్నారు కదా?
నేను: అమ్మా! సంసారం, ధర్మం – ఇవన్నీ మాకేం తెలుసు? అదంతా మీకేతెలియాలి.
మాతృదేవి చిరునవ్వు నవ్వారు.
“ఓ, ఎంత వేడిగా వుంది” అంటూ ఒక విసనకర్రను నాకిచ్చి విసరమన్నారు. తరువాత, “నువ్వు హడావిడిగా భోజనం చేసి ఇక్కడకు పరుగెత్తుకొంటూ వచ్చావు. నా ప్రక్కనే కాసేపు పడుకో” అన్నారు.
నేల మీద చాప పరిచివుంది. మాతృదేవి మంచం మీద పడుకోవడానికి నేను తటపటాయించాను. వెంటనే మాతృదేవి, “ఎందుకు సంశయిస్తావు? పడుకో. నేను చెబుతున్నాను, పడుకో” అని చెప్పారు. ఆపైన నేను కాదనలేకపోయాను.
మాతృదేవి కాస్త కునుకు తీశారు. నేను నిశ్శబ్దంగా పడుకొన్నాను. ఇంతలో కొందరు భక్తురాండ్రు, ఇద్దరు సన్న్యాసినులు వచ్చారు. సన్న్యాసినులలో ఒకరు యువతి, మరొకరు మధ్యవయస్కురాలు. మాతృదేవి కళ్లు తెరవకుండానే, “ఎవరమ్మా అది? గౌరీయా?” అని అడిగారు. వెంటనే ఆ బాలసన్న్యాసిని, “ఎలా కనిపెట్టావు అమ్మా?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “నా అంతరాత్మ తెలిపింది” అని అన్నారు.
కాసేపటికి మాతృదేవి లేచి కూర్చున్నారు. అప్పుడు బాలసన్న్యాసిని, “మేం బేలూర్ మఠానికి వెళ్లాం. ప్రేమానంద స్వామి మాకు తృప్తిగా భోజనం పెట్టారు. ఆయన అక్కడ ఉంటే, భోజనం చేయకుండా తిరిగిపోవడం కుదరని పని” అని చెప్పింది.
ఆ గదిలో ఉన్న ఒక స్త్రీ నుదుట కుంకుమ పెట్టుకోనందుకు మాతృదేవి ఆమెను సుతిమెత్తగా మందలించారు.
మాతృదేవి ద్వారా నా గురించి తెలుసుకొన్న గౌరీమా, నన్ను ఒక రోజు తన ఆశ్రమానికి* రమ్మని ఆహ్వానించారు. “అక్కడ యాభై అరవై మంది స్త్రీలకు నేర్పించాలి. నీకు కుట్టుపని తెలుసా?” అని ఆమె అడిగారు. “ఓమోస్తరుగా వచ్చు” అని జవాబిచ్చాను. దానిని ఆ స్త్రీలకు నేర్పించమన్నారు గౌరీమా.
మాతృదేవి అనుమతితో ఒక రోజు గౌరీమా ఆశ్రమానికి వెళ్లాను. ఆమె ఎంతో ఆప్యాయంగా, “రోజూ వచ్చి ఒక గంట సేపు ఈ స్త్రీలకు నేర్పించు” అని అన్నది. “నాకున్న స్వల్పజ్ఞానంతో నేను ఉపాధ్యాయినిగా ఉండడం సబబు కాదు. అంతకంటే వర్ణక్రమం నేర్పమంటే నేర్పుతాను” అన్నాను. కాని గౌరీమా వదలి పెట్టలేదు. చివరకు నేను అంగీకరించక తప్పలేదు.
ఒక రోజు బడి వదలిపెట్టగానే గౌరీమా ఆశ్రమం నుండి మాతృదేవిని దర్శింప వెళ్లాను. అది వేసవికాలం. ఆ రోజు నేను ఎంతో అలసిపోయివున్నాను. అప్పుడు మాతృదేవి తమ గదిలో ఉన్నారు. భక్తురాండ్రు ఆమెను పరివేష్టించి ఉన్నారు. నేను వెళ్లి నమస్కరించగానే ఆమె నా వంక చూశారు. వెంటనే దోమతెర మీద ఉన్న విసనకర్రను పుచ్చుకొని విసరడం మొదలుపెట్టారు. “వెంటనే రవికె విప్పివెయ్యి. ఒంటికి కాస్త గాలి తగులుతుంది” అన్నారు ఆదుర్దాగా. ఎంతటి అవ్యాజ ప్రేమ! ఇంతమంది ముందు నా పట్ల ఇంత ఆప్యాయానురాగాలు ఆమె చూపుతూండడంతో నేనెంతో బిడియపడ్డాను. అందరూ నా వైపే చూడసాగారు. మాతృదేవి ఆతురతను చూసి నేను రవికను తీసివేయాల్సి వచ్చింది. “విసనకర్రను నాకివ్వండి” అని నేనెంత అభ్యర్థించినా మాతృదేవి నా మాట పట్టించుకోకుండా, “ముందు కాస్త సేద తీర్చుకో” అని అన్నారు. ఆ తరువాత తీపిభక్ష్యాలు, మంచినీరు నాకిచ్చాకనే ఆమె కుదుటపడ్డారు. నా కోసం పాఠశాల బండి వేచివుండడంతో నేను ఒకటి రెండు మాటలతో ఆ రోజు సెలవు పుచ్చుకొని వెళ్లిపోవలసి వచ్చింది.
ఆగస్టు 3, 1911
మాతృదేవి నుంచి మంత్రోపదేశం పుచ్చుకోగోరాను. అందుకు కావలసిన సామగ్రిని నాతో తీసుకొని బాగ్బజారుకు వెళ్లాను. ఏ వస్తువులు తీసుకువెళ్లాలో గౌరీమా నాకు తెలిపారు. ఆమె కూడా నాతోపాటు వచ్చారు. నేను వెళ్లేసరికి మాతృదేవి పూజ చేస్తున్నారు. కొంతసేపయ్యాక నన్ను కూర్చోమని సైగ చేశారు. పూజ ముగిశాక నా మంత్రదీక్ష గురించి గౌరీమా, మాతృదేవితో తెలిపారు. నేను కూడా ఈ విషయం గురించి మాతృదేవితో మాట్లాడే ఉన్నాను.
నేను కొన్ని మంచి అరటిపళ్లను తీసుకెళ్లాను. వాటిని చూడగానే మాతృదేవి, “ఓ, అరటిపళ్లు తీసుకువచ్చావా? మంచిది. (ఒక సనాతీజ్యిసి పేరు చెప్పి) ఆయన ఈ పళ్లు కావాలన్నాడు. నువ్వు తేవడం మంచిదైంది” అని అన్నారు.
తరువాత, “అదిగో ఆ ఆసనాన్ని తీసుకొని నా కుడివైపు కూర్చో” అని అన్నారు. “నేనింకా గంగానదిలో స్నానం చేయలేదే” అన్నాను.
మాతృదేవి: ఫరవాలేదు. దుస్తులు మార్చుకొనే వచ్చావు కదా! మాతృదేవి ప్రక్కన కూర్చున్నాను. గుండె దడదడలాడసాగింది. గదిలో ఉన్న అందరినీ బయటకు వెళ్లమని చెప్పి మాతృదేవి నాతో, “కలలో నీకు తెలుపబడిన మంత్రం ఏదో నాకు చెప్పు” అని అన్నారు.
నేను: వ్రాసి చూపించనా? చెప్పనా?
మాతృదేవి: చెప్పు.
నేను కలలో పొందిన మంత్ర అర్థాన్ని మంత్రదీక్ష ముగింపులో మాతృదేవి వివరించారు. “ముందు ఆ మంత్రాన్ని జపించు” అని చెప్పి, పిదప మరొక మంత్రాన్ని ఉపదేశిస్తూ “చివరగా దీన్ని జపించి, ధ్యానించు” అని అన్నారు.
మంత్రార్థాన్ని వివరించి చెప్పడానికి ముందు మాతృదేవి ధ్యానమగ్నురాలై ఉండడం చూశాను. దీక్షా సమయంలో నా శరీరం వణకసాగింది. ఎందుకో తెలి యదు. ఏడవసాగాను. నా నుదుట మాతృదేవి ఎర్రచందనంతో తిలకం దిద్దారు. పిదప గురుదక్షిణగా, నైవేద్యం ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చాను. గోలాప్మాను పిలిచి మాతృదేవి ఆ డబ్బును ఆమెకిచ్చారు.
మంత్రదీక్ష సమయంలో మాతృదేవి ఎంతో గంభీరంగా కనిపించారు. మంత్రదీక్షానంతరం ఆమె తన ఆసనం నుండి లేస్తూ నాతో, “కొంతసేపు జప ధ్యానాలూ, ప్రార్థనా చేయి” అని అన్నారు. నేను అలాగే చేశాను. పిదప మాతృదేవి పాదాలకు నమస్కరించినప్పుడు, “నీకు భక్తి కలుగుగాక!” అని ఆశీర్వదించారు. ‘అమ్మా, మీరు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి, మరచిపోకండి’ అని నేను మనస్సులో అనుకొన్నాను.
మాతృదేవి స్నానం చేయడానికి గోలాప్మాతో గంగానదికి బయలుదేరారు. ఆమె చీర, తువ్వాలు తీసుకొని నేను కూడా వెంట వెళ్లాను. వారు గంగలో దిగినప్పుడు సన్నగా చినుకులు పడసాగాయి. స్నానం ముగించాక మెట్ల మీదవున్న పురోహితుడికి మాతృదేవి ఒక అరటిపండు, ఒక మామిడిపండు, ఒక నాణెం ఇస్తూ “ఈ పళ్లను ఇస్తున్నాను. వాటితోపాటు ఈ దానఫలాన్ని కూడా ఇస్తున్నాను” అని అన్నారు.
ఆహా పురోహితా! నేడు ఎవరి చేతుల మీదుగా దానం పుచ్చుకొన్నావో, ఎంతటి మహత్తరమైన పలుకులు విన్నావో నీకు తెలియదు. కోట్లాది స్వల్పవిషయా పేక్షలతో స్వార్థపరాయణులమై కొట్టుకొంటూన్న అల్పజీవులమైన మేము ఆ దివ్య వచనాల అర్థాన్ని గ్రహించగలిగామా!
మాతృదేవి నా చేతిలోని చీరను ధరించి, తడిగుడ్డను నా చేతికిచ్చి, “రా, వెళదాం” అన్నారు. ముందు గోలాప్మా, వెనుక నేనూ నడుస్తూ వచ్చాం. మా ఇద్దరికీ మధ్య మాతృదేవి నడిచి వచ్చారు. ఒక చిన్న చెంబులో గంగాజలం తీసుకొని ఆమె దారిలో కనబడ్డ ప్తతి మర్రిచెట్టుకూ ఆ నీటిని కొంత పోస్తూవచ్చారు.
గోలాప్మా ఒక చిన్నపాత్రలో గంగాజలం తీసుకువచ్చింది. దాన్ని పూజ గదిలో పెట్టడానికి వెళ్లింది. ఇంటి ముంగిట నీటి కుళాయి ప్రక్కన ఉన్న నీటి తొట్టెకి సమీపంలో ఒక పాత్ర ఉంది. దాన్లోని నీటితో మాతృదేవి పాదాలు అడుగుకొన్నారు. “నీ పాదాలకు బురద అంటుకొంది. నుమ్వా కాళ్లు కడుగుకో” అని నాతో చెప్పారు. నీళ్లకోసం నేను అటూయిటూ చూస్తూంటే, “అదుగో, ఆ పాత్ర లోని నీటితో కడుగుకో” అన్నారు. “మీరు ఉపయోగించిన నీరు కదా?” అన్నాను నేను. “ముందుగా కొంచెం నీటిని తలమీద చల్లుకొని తరువాత వాడుకోవచ్చు. దాన్లో దోషం లేదు” అని చెప్పారు. ఆమె అలా చెప్పినప్పటికీ ఆ నీటిని వాడలేక పోయాను. మరొక పాత్ర తెచ్చి తొట్టెలోని నీటితో పాదాలు కడుగుకొన్నాను.
అప్పటి దాకా మాతృదేవి వేచివున్నారు. పిదప మేం మేడ మీదకు వెళ్లాం. మాతృదేవి రెండు ఆకులలో గురుదేవుల ప్రసాదం తీసుకువచ్చారు. ఒకటి తాము తీసుకొని, మరొకటి నాకు ఇస్తూ, ప్రక్కన కూర్చుని తినమన్నారు.
ప్రసాదం ఆరగించడానికి ముందు మాతృదేవి పాదోదకం కోరాను. అప్పుడు ఆమె, “అలా అయితే ఆ కుండలో నుంచి కొంచెం నీరు పట్రా” అని అన్నారు. నేను తీసుకువచ్చాను. ఆ నీటి పాత్రను నన్ను పట్టుకోమని చెప్పి, ఆమె తమ రెండు పాదాల బొటన వ్రేళ్లను ఆ నీటిలో ముంచి మెల్లని స్వరంలో ఏదో వల్లించసాగారు. ఆమె పెదవులు కదలాడడం చూశానుగాని ఆమె ఏం వల్లించారో అర్థం కాలేదు. కాసేపు తరువాత, “ఇదుగో తీసుకో” అన్నారు. నేనెంతో భాగ్యశాలినని ఎంచి ఆ పాదోదకం పుచ్చుకొన్నాను. తరువాత ప్రసాదం ఆరగించసాగాను. తాము తింటున్న ప్రతి దాన్లోను మాతృదేవి ఒక చిన్నముక్కను నాకిచ్చారు.
ఇంతలో భక్తురాండ్రు పలువురు రాసాగారు. వారంతా నాకు అపరిచితులే. వారందరూ అక్కడే భోజనం చేస్తారని తెలుసుకొన్నాను. నైవేద్యం కాగానే భోజనాలకు కూర్చున్నాం. మాతృదేవి కూడా తమ చోటులో కూర్చున్నారు. మూడు ముద్దలు తిన్న తరువాత నన్ను పిలిచి నా చేతుల్లో కొంచెం ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదం నుండి వచ్చిన ఘుమఘుమ ఇప్పటికీ నేను మరచిపోలేదు, తలచుకొంటేనే ఆశ్చర్యం వేస్తుంది. పిదప మాతృదేవి అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. అందరూ భోజనానికి కూర్చున్న తరువాత గోలాప్మా కూడా కూర్చున్నారు.
ఎంతో మృదువుగా, చిరునవ్వుతో మాట్లాడుతూ మాతృదేవి భోజనం చేశారు. ఆమె ఈ వైఖరి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మంత్రదీక్ష పుచ్చుకొన్నప్పటి నుండి ఇప్పటి దాకా నేను చూసిన మాతృదేవి ఇప్పుడు మరెవరోలా కనిపించారు. ఎంతో గంభీరంగా, అంతర్ముఖంగా, కృపాకటాక్షంతో దారిచూపే దేవిలా అప్పుడు నాకు కనిపించారు. నేనప్పుడు భీతితో వణకిపోతూ కూర్చుండిపోయాను కదా! ఆ తరువాత కూడా మంత్రదీక్ష ఇస్తూవున్న మాతృదేవిని అనేకసార్లు చూశాను. కాని నాకు దీక్ష అనుగ్రహించిన నాటిలా మరెప్పుడూ ఆమెను చూడలేదు. కూర్చునో, నిలబడో, నవ్వుతూ మాట్లాడుతూనో పలువురికి మంత్రదీక్షను ప్రసాదించడం నేను కళ్లారా చూశాను. వారు కూడా సంతృప్తితో తిరిగి వెళ్లేవారు.
ఒకసారి నేను ఒక భక్తురాలితో, “మంత్రదీక్ష సమయంలో మాతృదేవి ఎలా కనిపించారు?” అని అడిగాను. అందుకు ఆమె, “మామూలుగా ఎప్పుడూ ఎలా కనిపించేవారో అలాగే కనిపించారు” అని బదులిచ్చింది.
మరొక భక్తురాలిని అడిగినప్పుడు ఆమె కాస్త వివరంగా చెప్పింది: “నేను అంతకు మునుపే మా కులగురువు వద్ద మంత్రోపదేశం పొందివున్నాను. ఆ తరు వాత మాతృదేవిని గురించి విని ఇక్కడకు వచ్చాను. కులగురువు వద్ద పుచ్చు కొన్న మంత్రాన్ని పదిసార్లు ముందు జపించి తరువాత తాను ఇచ్చిన మంత్రాన్ని మాతృదేవి జపించమన్నారు. గురుదేవులను చూపుతూ, ‘చూడు, ఆయనే నీకు గురువు, (మరొక దైవాన్ని చూపుతూ) ఇది నీ ఇష్టదేవత’ అని చెప్పారు. పిదప, ‘భగవంతుడా! నా పూర్వజన్మ, ఈ జన్మలో చేసిన పాపాలన్నిటిని పరిగ్రహించు’ అంటూ ఎలా ప్రార్థించాలో నేర్పారు. కాని ఒక విషయం. నేను ఎప్పుడు జపం చేయడానికి కూర్చున్నా అరగంటకు పైగా కూర్చోలేకపోతున్నాను. ఎవరో వచ్చి స్థానభ్రంశం చేస్తూన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతూందో నీకు తెలుసా? మీరంతా జపం చేస్తూన్నప్పుడు ఇలా జరుగుతుందా? మాతృదేవితో ఎంతో మాట్లాడాలని అనుకొంటున్నాను కాని ఏదీ చెప్పలేకపోతున్నాను. మీరంతా ఆమెతో చనువుగా మాట్లాడగలుగుతున్నారు. మాతృదేవి నన్ను మోసగించారా ఏమిటి?”
ఈ వివరాలన్ని నేను తెలుసుకోగోరలేదు. ఆమె మధ్యవయస్కురాలు. ఆమె మాట్లాడుతూనే ఉంది. మధ్యలో నేను కలుగచేసుకొని, “మీరు మాతృదేవితో చెప్పదలచుకొన్నది ధైర్యంగా చెప్పండి. అలవాటుపడేకొద్దీ అన్ని సహజమౌతాయి. మేం కూడా ఇలాగే మొదట్లో ఆమెతో మాట్లాడడానికి జంకాం. ఇప్పుడు కూడా కొన్ని సమయాల్లో మాతృదేవి గంభీరంగా కూర్చున్న వైఖరి చూస్తే ఆమె వద్దకు వెళ్లడానిక్కూడా తటపటాయించవలసి వస్తుంది” అని అన్నాను.
సాయంత్రమైంది. భక్తురాండ్రు ఒకరొకరుగా మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకొంటున్నారు. కొందరు దీపారాధన దర్శించి వెళ్లనున్నారు. మాతృదేవి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లారు.
క్రమంగా రాత్రయింది. రాధు, మాకు ప్రభృతులతో జపం చేయమని మాతృదేవి చెప్పారు. వారు జాప్యం చేయడంతో మాతృదేవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “సాయంకాలం కూర్చుని జపం చేసుకోకుండా ఏదో చేసుకొంటున్నారే!” అని అన్నారు. కాసేపటికి వారు వచ్చి కూర్చున్నారు. గోలాప్మా, యోగీన్మా తదితరులు వచ్చి మాతృదేవికి ప్రణామాలు చేశారు. వారిలో కొందరి తలమీద మాతృదేవి తమ చేతులుంచీ, కొందరి చుబుకాలను స్పృశించి బుజ్జగించీ ఆశీర్వ దించారు. పిదప చేతులు జోడించి నమస్కరించారు. ఆ తరువాత గురుదేవులకు ప్రణామం చేసి తాము కూడా జపానికి కూర్చున్నారు. సంధ్య ఆరాత్రికం కోసం ఏర్పాట్లు జరిగాయి. మాతృదేవి జపం ముగించి లేచారు.
నన్ను తోడ్కొని వెళ్లడానికి ఇంటి నుండి ఒక కుర్రవాడు వచ్చాడు. నేను మాతృదేవి వద్ద సెలవు పుచ్చుకొంటూన్నప్పుడు, “అమ్మా, ఈ రోజు నేను సమర్పించిన ఆ చీరను ఇంకా ధరించలేదే?” అని అడిగాను. “అదే కదా! చూడమ్మా, ఎవరూ జ్ఞాపకం చేయలేదు” అని అన్నారు ఆమె.
బడిలో పని ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల దాకా మాతృదేవిని చూడలేకపోయాను. ఈ రోజు వెళ్లి ఆమెకు నమస్కరించినప్పుడు మాతృదేవి ఎంతో ఆనందించారు. భూదేవ్ మహాభారతం చదువుతున్నాడు. అతడు బాలుడు. అందుచేత గబగబా చదవలేకపోతున్నాడు. మాతృదేవికీ చేయాల్సిన పనులు ఎన్నో మిగిలి ఉన్నాయి. అప్పటికే సంధ్యాసమయం కాబోతున్నది. అందువలన ఆమె నన్ను చూపి భూదేవ్తో, “ఆమెకు ఇవ్వు, సులభంగా చదువుతుంది. ఈ అధ్యాయాన్ని ముగించకుండా లేచి వెళ్లలేను కదా!” అని చెప్పారు.
మాతృదేవి కోరిక మేరకు మహాభారతం చదవడం మొదలుపెట్టాను. ఇంతకు మునుపు ఆమె సమక్షంలో నేను ఏదీ చదవలేదు. ముందు కాస్త బిడియపడ్డాను. ఎలాగో ఆ అధ్యాయం చదవడం పూర్తిచేశాను. తరువాత మాతృదేవి చేతులు జోడించి ఆ పుస్తకానికి నమస్కరించి, లేచి నిలబడ్డారు. మేం కూడా ఆరాత్రికం తిలకించడానికి పూజగదిలోకి వెళ్లాం.
ఉచితాసనంలో మాతృదేవి కూర్చుని జపం చేసుకోసాగారు. జపం పూర్తిచేసి, “హరిబోల్, హరిబోల్” అని ఉచ్చరిస్తూ లేచారు. పిదప గురుదేవులకు నమస్కరించి, అందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
తరువాత దైనందిన విధుల గురించిన సంభాషణ మొదలైంది.
మాతృదేవి: సదా పని చేస్తూవుండాలి. పని చేయడం వలన శరీరమూ, మనస్సూ ఆరోగ్యంగా ఉంటాయి. ఆ రోజుల్లో నేను జయరాంబాటిలో ఉండగా రేయింబవళ్లు పనిచేసేదాన్ని. ఎక్కడకూ, ఎవరి ఇంటికీ వెళ్లేదాన్ని కాను. అలా వెళితే, “ఓ, వచ్చేసింది, పిచ్చివాడి భార్య వచ్చేసింది” అనే మాటలే. ఒక సందర్భంలో నేను తీవ్రవ్యాధితో బాధపడ్డాను. ఎంతకూ వ్యాధి నయమవడం లేదు. చివరకు సింహవాహినీదేవి సమక్షంలో ప్రాయోపవేశం* చేయమని మా అమ్మ చెప్పారు. ఆ వ్రతం ఆచరించిన తరువాతే వ్యాధి నయమైంది. సింహవాహిని గొప్ప జాగృద్దేవత. అక్కడి మట్టిని సేకరించి ఒక పాత్రలో పదిలపరచి ఉంచాను. నేను తీసుకొని రాధూకు కూడా రోజూ ఇస్తూవుంటాను.
మాతృదేవి (ఉద్బోధన్) ఇంటి ముందున్న మైదాన ప్రాంతంలో అనేక చోట్లకు చెందినవారు నివసిస్తూన్నారు. వారు ఎంతో కష్టించి పనిపాటలు చేసుకొంటూ ఏదో కాస్త సంపాదించుకొనేవారు. వారిలో ఒక వ్యక్తికి ఒక ఉంపుడుగత్తె ఉంది. ఆమె, అతడి భార్య కలిసే ఉంటున్నారు. ఒక సందర్భంలో ఆ ఉంపుడుగత్తెకు చాలా జబ్బుచేసింది. ఆ విషయం ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు:
“ఎంత శ్రద్ధాసక్తులతో అతడు ఆమెకు శుశ్రూష చేశాడు! అటువంటి సేవా శుశ్రూషలను నేనెన్నడు చూడలేదు. అదే ఆకర్షణ!”
ఇలా చెబుతూ మాతృదేవి అతడి సేవాశుశ్రూషలను గురించి బాగామెచ్చు కొన్నారు. ఉంపుడుకత్తెకు సపరిచర్యలు! ఉంపుడుకత్తె అనే ఆలోచనే మన ముఖంలో నిరసన భావాన్ని వ్యక్తం చేస్తుంది. దాన్లో సందేహం లేదు. కాని చెడు అనే ఆచ్ఛా దన మరుగున ఉన్న మంచిని గుర్తించలేకపోతున్నాం!
మైదానానికి ఆవలి వైపునగల ఒక ఇంటినుండి ఒక పేద స్త్రీ జబ్బుపడిన తన బిడ్డను తీసుకువచ్చి ఆశీర్వదించమని మాతృదేవిని కోరింది. ఆ శిశువు పట్ల మాతృదేవి ఎంత ఆప్యాయత చూపారు! “త్వరలో నయమౌతుంది” అంటూ ఆశీర్వదించారు. రెండు పెద్ద దానిమ్మపళ్లు, కొన్ని ద్రాక్షపళ్లు తెచ్చి, గురుదేవులకు నివేదనం చేసి తెమ్మని నాకిచ్చారు. నేను అలాగే చేశాను. ఆమె వాటిని ఆ స్త్రీకి ఇస్తూ, “అనారోగ్యంగా ఉన్న నీ బిడ్డకు వీటిని ఇవ్వు” అని చెప్పారు. ఆ పేదరాలు ఎంత ఆనందించిందో! మాతృదేవికి పదేపదే ప్రణామం చేసింది.
ఫిబ్రవరి, 1912
పాటల్డంగా ఇంటి నుంచి సాయంత్రం బయలుదేరాను. మాతృదేవి గదిలోకివెళ్లి కూర్చోగానే గోలాప్మా వచ్చి నాతో, “తన గురువు ఋణాన్ని తీర్చడానికిసహాయం అర్థిస్తూ ఒక సన్న్యాసిని వచ్చింది. నువ్వు ఏదైనా ఇవ్వు” అని చెప్పారు. నేను చేయగలిగిన సహాయం సంతోషంగా చేశాను.
మాతృదేవి (నవ్వుతూ): నన్ను వచ్చి పట్టుకొంది. నేనేం చేయగలను? డబ్బుకావాలని ఎవరిని అడగగలనమ్మా? ‘కాస్త ఓపిక పట్టు. ఎలాగో ఏర్పాటు చేస్తాను’ అని చెప్పాను.
గోలాప్మా: అవును, చివరకు మాతృదేవియే ఒక మార్గాంతరం చూపారు.
మాతృదేవి (మెల్లగా నాతో): గోలాప్ మూడు రూపాయలు ఇచ్చింది.
కాసేపటికి ఆ సన్న్యాసిని వచ్చింది. బలరాంబాబు ఇంటికి ఆమె వెళ్లివచ్చింది.అక్కడ కొందరు భక్తులు కూడా ఆమెకు డబ్బు ఇచ్చారు. సన్న్యాస స్వీకారానికిమునుపు ఆమెకు పెద్ద కుటుంబమూ, ఏడుమంది పిల్లలు కూడా. ఇప్పుడు పిల్లలుబాధ్యతలు వహిస్తూన్నందువలన ఆమె సన్న్యాసం పుచ్చుకొంది.
సన్న్యాసిని: గురునింద చేయరాదంటారు. అయినా చెబుతాను. (మాతృదేవికినమస్కరించి) కోర్టులు, వ్యాజ్యాలు మొదలైనవి ఆయనకు (గురువుకు) ఎంతో ఇష్టం. ఇప్పుడు వయస్సు మీరడం వలన అవన్నీ చేతగావడం లేదు. మరో వైపు ఋణాలు ఇచ్చినవారు వకీలు నోటీసులతో వస్తున్నారు. ఈ సమస్య ఆయననుక్రుంగదీస్తోంది. నేనేం చేయను? ఆయనకు డబ్బు సేకరించి ఇవ్వడానికి నలుగురిని అర్థిస్తున్నాను.
ఈ మాటలు విని మాతృదేవి ఒక శ్లోకం చెప్పారు. అది జ్ఞాపకం లేదు.దాని భావం: గురువుకు ఇష్టంలేకపోయినా నిజాన్ని ధైర్యంగా ఆయనతో చెప్పవచ్చు. దాన్లో దోషం లేదు.
మాతృదేవి కొనసాగించారు:
“అయినప్పటికీ గురుభక్తి ఉండాలి. గురువు ఎటువంటి వ్యక్తి అయినా, ఆయన పట్ల భక్తి ఉంటే ముక్తి నిశ్చయం. గురుదేవుల భక్తులది ఎలాంటి భక్తి!ఆయన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆయన వంశంలోని యావన్మందినీ ప్రేమిస్తున్నారు; అంతెందుకు ఆయన పుట్టిన ఊళ్లోని పిల్లినైనాసరే గౌరవిస్తున్నారు.”
ఆ సన్న్యాసిని వేకువజామున మూడు గంటల నుండి ఎనిమిది గంటలదాకా జపధ్యానాలు చేస్తుంది. కూర్చోవడానికి ఒక చక్కని గుడ్డ అడిగింది. గుడ్డను ఒకటి ఇవ్వమని భూదేవ్తో మాతృదేవి చెప్పారు. సన్న్యాసిని నాతో, “నువ్వు రాత్రి ఇక్కడే బసచేస్తావా? అలా అయితే నీకు ఏదైనా ఉపదేశం ఇవ్వవచ్చు” అని అన్నది. ‘మేం మాతృదేవి వద్ద ఉంటున్నాం. మీరు ఉపదేశం ఇవ్వడ మేమిటి?’ అని మనస్సులో అనుకొన్నాను. కాని, “లేదు, నేనిక్కడ బసచేయడం లేదు” అని ఆమెతో చెప్పాను.
నన్ను తోడ్కొని వెళ్లడానికి బండి వచ్చింది. సంధ్యా ఆరాత్రికం ముగిశాక మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను.
ఫిబ్రవరి, 11, 1912
నేను మాతృదేవికి ప్రణామం చేసి కూర్చోగానే ఆమె ఎంతో విచారంతో ఇలా చెప్పారు:
“హా! గిరీష్‌బాబు గతించాడు. నేటికి నాలుగవ రోజు. నాలుగవ దినం కార్యాలకు నన్ను తీసుకుపోవడానికి వచ్చారు. ఆయనే లేరు, ఇకమీదట ఆయన ఇంటికి నేను ఎలా వెళ్లగలను? హో, అశనిపాతం!
“ఆయనకు ఎంతటి భక్తి! ఎంతటి విశ్వాసం! ఇది నీకు తెలుసా? గురుదేవులు తనకు కుమారుడుగా జన్మించాలని గిరీష్ ఆకాంక్షించాడు. కాని గురుదేవులు, ‘నీకు కుమారుడిగా పుట్టడానికి నేనెందుకు ఇష్టపడాలి’ అని బదులు చెప్పారు. కాని భగవంతుని లీలలను ఎవరు అవగతం చేసుకోగలరమ్మా? ఆయన నిర్యాణా నంతరం కొంతకాలానికి గిరీష్‌కు ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు అసాధారణ మైనవాడు. అతడికి నాలుగేళ్లు వచ్చినా ఎవరితోను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైగలతోనే అంతా తెలియచేసేవాడు. తలిత్లండ్రులు అతణ్ణి గురుదేవులుగానే భావించి, లాలించేవారు. దుస్తులు, కంచం, గ్లాసులు అన్నీ ప్రత్యేకంగా ఉంచేవారు. మరెవరూ వాటిని వాడేవారు కారు. ‘గురుదేవులే వచ్చివున్నారు’ అని గిరీష్ చెప్పేవాడు. భక్తుని మాటలు కదా, కాదనగలమా!
“ఒక రోజు ఆ బాలుడు నన్ను చూడాలని ఎంతో ఆతురత చెందాడు. మేడ మీదనుండి నేను ఉంటున్న దిక్కును చూపుతూ, ‘ఊ ఊ’ అంటూ అందరినీ అటు వైపు లాగుకొనివచ్చాడు. పిదప అర్థం చేసుకొని అతణ్ణి నా వద్దకు తీసుకువచ్చారు. నాలుగేళ్ల పిల్లవాడు! వాడు నా పాదాల మీద శిరస్సు నుంచి నమస్కరించాడు. తరువాత క్రిందికి వెళ్లి గిరీష్‌ను కూడా తనతో రమ్మని లాగసాగాడు. గిరీష్ వెక్కి వెక్కి ఏడ్వసాగాడు. ‘నాయనా! నేను మహాపాపిని. మాతృదేవిని చూడడానికి రావ డమా?’ అంటూ సంకోచించాడు. కాని ఆ బాలుడు పట్టుపట్టాడు. ఇక చేసేదిలేక ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని ఆపాదమస్తకం వణికిపోతూ, కన్నీరు కాల్వలై పారుతూంటే మేడ మీదకు వచ్చి, ‘అమ్మా! వీడి మూలంగానే మీ పాదపద్మాలు దర్శించే భాగ్యం కలిగింది’ అంటూ నాకు సాష్టాంగప్రణామం చేశాడు. కాని ఏం చెప్పను, ఆ బాలుడు నాలుగవ ఏటనే మరణించాడు.
“అంతకు మునుపు ఒక రోజు సాయంత్రం గిరీష్, అతడి భార్య తమ ఇంటి మేడమీద ఉన్నారు. అప్పుడు బలరాంబాబు ఇంట్లో ఉంటున్న నేను కూడా మేడ మీదకు వెళ్లాను. తన ఇంటి మేడమీద నుండి నన్ను చూడగలడని నేను అనుకోలేదు. గిరీష్ భార్య అతడితో, ‘అదుగో చూడండి. మాతృదేవి ఆ ఇంటి మేడమీద పచార్లు చేస్తున్నారు’ అంటూ నన్ను చూపించిందట. వెంటనే గిరీష్ తన వీపును నా వైపు తిప్పి, ‘వద్దు, వద్దు. ఇలా దొంగతనంగా మాతృదేవిని చూడకూడదు. నావి పాపిష్టి కళ్లు’ అంటూ మెట్లు దిగి క్రిందికి వెళ్లిపోయాడని అతడి భార్య నాతో చెప్పింది.”
జూన్ 15, 1912
నాలుగు గంటలయి ఉంటుంది. పలువురు శిష్యురాండ్రు మాతృదేవిని పరివేష్టించి ఉన్నారు. ‘మ’ భార్య, గౌరీమా, ఆమె పెంపుడు కుమార్తె దుర్గ మొద లగు నాకు పరిచయస్థులైన కొందరు కూడా ఉన్నారు. మాతృదేవి నవ్వుతూ మాట్లాడుతున్నారు. నన్ను చూడగానే “ఓ, రామ్మా, రా! వచ్చి కూర్చో” అన్నారు.
నా కోర్కె మేరకు ‘సోదరి నివేదిత జీవిత చరిత్ర’, వివేకానంద స్వామి, ‘కొలంబో నుండి అల్మోరా ప్రసంగాలు’ పుస్తకాలను గౌరీమా క్రింది కార్యాలయం నుండి తీసుకువచ్చారు. సోదరి నివేదిత జీవిత చరిత్రను వినాలని మాతృదేవి అభిలషించారు. నా చేతిలో పుస్తకాన్ని చూడగానే, “ఏం పుస్తకం అమ్మా అది?” అని అడిగారు. “నివేదిత జీవిత చరిత్ర” అని చెప్పాను. “మంచిది. చదువు, కాస్త వింటాను. నాకు కూడా ఒక ప్రతి ఇచ్చారు. కాని దాన్ని వినే అవకాశం ఇంతదాకా రాలేదు” అన్నారు ఆమె.
అందరి ముందు చదవడానికి కాస్త సిగ్గుపడ్డాను. అయినా సోదరి నివేదిత గురించి సరళబాల చేసిన ఈ అద్భుత రచనను మాతృదేవికి చదివి వినిపించాలనే ఆతురత వలనా, మాతృదేవి కోరినందునా చదవసాగాను. ఆమె కూడా సావధానంగా ఆలకించారు. నివేదిత అద్భుత భక్తిని గురించి చదివేటప్పుడు ఆమె కళ్ల నుండి నీళ్లు స్రవించాయి.
కంట తడిబెట్టుకొని మాతృదేవి ఇలా అన్నారు: “ఆహా! నివేదిత భక్తి ఎంత అద్భుతమైంది. నాకు ఏం చేసినా ఆమె శ్రమ అనుకొనేది కాదు. కొన్ని రోజులలో నన్ను చూడడానికి రాత్రివేళ వచ్చేది. దీపం వెలుగు సూటిగా నా కళ్లపై పడితే నాకు అసౌకర్యంగా ఉంటుందని, దాన్ని ఒక కాగితంతో కప్పి, వెలుగును తగ్గించేది. నాకు నమస్కరించిన తరువాత నా పాదధూళి తీసుకొనేది. కాని చేతిరుమాలుతోనే స్వీకరించేది. ఎందువలనో నా పాదాలను స్పృశించడానికి ఆమె సంశయిస్తున్నట్లు నాకు తోచేది.”
నివేదితను గురించి ఆలోచనలలో మాతృదేవి మునిగిపోయారు. అక్కడున్న వారు నివేదితను గురించిన తమ స్వీయ అనుభవాలను చెప్పసాగారు. “అంత చిన్న వయస్సులోనే నివేదిత మరణించడం మన దేశం చేసుకొన్న దురదృష్టం” అంది దుర్గ. మరొక స్త్రీ, “ఆమె భారతదేశాన్ని తన మాతృదేశంగానే భావించింది. ఆమె పలుమార్లు అలా చెప్పింది. సరస్వతీపూజ సందర్భంలో హోమకుండంలోని పవిత్ర భస్మాన్ని తీసుకొని నుదుట దిద్దుకొని, పాదరక్షలు లేకుండా నడిచేది” అని వ్యాఖ్యానించింది. చదవడం పూర్తయింది. నివేదిత గురించిన తమ భావనలను మాతృదేవి మధ్యమధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు ఆమె, “సజ్జనులను గురించి ఆలోచిస్తున్నప్పుడు అంతరాత్మే కన్నీరుమున్నీరవుతుంది” అని అన్నారు.
మాతృదేవి బట్టలు ఉతుకుకొన్న తరువాత వచ్చారు. సాయంకాల నివేదనకు సమయమైంది. గురుదేవులకు అలంకరించడానికి పుష్పమాలను ఆమె అప్పటికే సిద్ధం చేసి ఉంచారు. నైవేద్యం నిమిత్తం రసగుల్లాలు తెచ్చి పూలమాలకు ప్రక్కన ఉంచాడు బ్రహ్మచారి రాసబిహారి. రసగుల్లాలకు చీమలు పట్టాయి. అది చూసి మాతృదేవి నవ్వుతూ, “చీమలు గురుదేవులను కూడా కుడతాయి కదా! ఓ రాసబిహారీ! నువ్వేమి చేశావో చూడు” అని అన్నారు. పిదప చీమలను దులిపి, పూమాలను గురుదేవులకు అలంకరించారు. ఇతరుల సమక్షంలో తన భర్త పటానికి పుష్పమాల వేయడం చూసి సురబాల (మాతృదేవి మరదలు) నోరుమూసుకొని నవ్వసాగింది. ఆ తరవాత అందరికీ ప్రసాదం పంచిపెట్టమని మాతృదేవి గౌరీమాను పురమాయిం చారు. అందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
ఒక భక్తురాలు: అమ్మా, నాకు ఐదుగురు కుమార్తెలు. వారికి వివాహాలు చేయలేకున్నాను. ఇదే నాకు ఎంతో ఆందోళనగా ఉంది.
మాతృదేవి: వివాహాలు చేయలేకపోతున్నావని ఎందుకు ఇంత బాధపడు తున్నావు? వారిని నివేదిత పాఠశాలకు పంపించు. చదవనూ వ్రాయనూ నేర్చుకొని, బాగుపడతారు.
మరొక భక్తురాలు (మొదటి భక్తురాలితో): మీకు మాతృదేవి పట్ల భక్తిప్రపత్తులు ఉంటే ఆమె చెబుతున్నది చేయండి, మంచి జరుగుతుంది. మాతృదేవియే చెబు తున్నప్పుడు చింత ఎందుకు?
కాని ఐదుగురు కూతుళ్ల తల్లియైన ఆ స్త్రీ చెవుల్లో ఈ ఉపదేశం చొరబడలేదు.
మరొక భక్తురాలు: ఈ రోజుల్లో తగిన వరుడు లభించడం ఎంతో కష్టంగా ఉంది. యువకులు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.
మాతృదేవి: అవును. యువకులలో వివేకం జనిస్తూంది. లౌకిక జీవితం అనిత్యమని వారు గ్రహిస్తున్నారు. అనురక్తి ఎంత తగ్గితే అంత మంచిది.
భక్తురాండ్రు ఒక్కొక్కరుగా మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చు కొంటున్నారు. చీకటి పడసాగింది. యోగీన్మా వచ్చి మాతృదేవికి నమస్కరించి, గురుదేవులకు సంధ్యా ఆరాత్రికం చేయడానికి కూర్చున్నారు. మాతృదేవి వీథి వైపున్న వసారాలో కూర్చుని జపధ్యానాలు అనుష్ఠించారు. ఆమె లేచి వచ్చాక ఇతర భక్తురాండ్రు నమస్కారాలు చేసి సెలవు పుచ్చుకొన్నారు.
అందరూ వెళ్లిపోయారు. మాతృదేవి ఒంటరిగా ఉండడం చూసి నేను ఆమెతో, “అమ్మా! బహిష్టు సమయాల్లో స్త్రీలు గురుదేవులను పూజించవచ్చా?” అని అడిగాను.
మాతృదేవి: పూజించవచ్చు, నీకు ఆయన పట్ల అంత భక్తిప్రపత్తులు ఉంటే. నేను కూడా ఈ విషయం గురించి గురుదేవులను అడిగితే, ఆయన, ‘పూజ చేయలేకపోతే దేన్నో కోల్పోయినట్లు నీ మనస్సు పరితపిస్తే, పూజించవచ్చు. దాన్లో దోషం లేదు. లేకపోతే చేయవద్దు’ అని చెప్పారు. అందువలన కావాలంటే నువ్వు కూడా పూజించు. కాని మనస్సు కించిత్తు చంచలమైనా చేయవద్దు.
మాతృదేవి భక్తురాండ్రందరికీ ఇలాగే చెప్పేవారా, అంటే కాదు. ఎందుకంటే ఒకటి రెండు రోజులకు మునుపు ఒక భక్తురాలు ఇదే ప్రశ్న అడిగినప్పుడు మాతృ దేవి, “ఆ స్థితిలో దైవాన్ని పూజించడమా? కూడదు” అని జవాబిచ్చారు. ఒక్కొక్కరి మానసిక స్థితిని బట్టి మాతృదేవి దారిచూపేవారు.
రాత్రి చాలా ప్రొద్దుపోయింది. నన్ను తోడ్కొని వెళ్లడానికి ఎవరూ రాలేదు. గోలాప్మా ఈ విషయం క్రింద ఉన్న ఎవరితోనో చెబితే, వారు అందుకు, “ఓహో! వారెప్పుడో వచ్చారు. కాని మేం, ‘ఒకవేళ ఆమె గోలాప్మాతో వెళ్లిపోయి ఉండవచ్చు’ అని చెప్పామే!” అని అన్నారు. అది విని నేను, మాతృదేవితో, “ఇక ఎవరూ రాకపోతే ఇక్కడే బసచేసే భాగ్యం లభిస్తుంది” అని అన్నాను.
మాతృదేవి: నువ్వు ఇక్కడ బస చేయడంలో ఎటువంటి ఆక్షేపణా లేదు. కాని ఈ రోజు నెల మొదటి రోజు. బయట బస చేయడం మంచిది కాదు.*
‘ఇక్కడ బస చేయడంలో నాకు ఎలాంటి భయమూ లేదు. అది మంచిదే’ అని అనుకొన్నాను.
రాత్రి నైవేద్యానంతరం అందరూ భోజనాలకు కూర్చున్నారు. సాయంత్రం మాతృదేవి పెట్టిన ప్రసాదం కాస్త ఎక్కువగా తిన్నందున నేను భోజనానికి కూర్చోలేదు. అది చూసి గోలాప్మా, “ఏమిటమ్మా! మా ఇంటికి వచ్చి ఉపవాసం చేయచూస్తు న్నావా?” అని అడిగారు. వెంటనే మాతృదేవి, “వద్దు, వద్దు. ఏమైనా కాస్త పుచ్చుకో” అంటూ నాలుగు లూచీలు, కూర, తీపి భక్ష్యాలు తామే ఇచ్చారు.
రాత్రి పదకొండు గంటలయింది. నన్ను తోడ్కొని వెళ్లడానికి అప్పుడు వినోద్ వచ్చాడు. గౌరీమా ఆశ్రమంలో నాకోసం వెతికి ఇక్కడికి వచ్చారాయన. క్రింద బ్రహ్మచారులూ, సాధువులూ అంతా నిద్రపోతున్నారు. మాతృదేవికి నమస్కరించి నప్పుడు, “బస చేయలేకపోయావే! మరో రోజు వచ్చి బసచేయి” అని ఆమె అన్నారు.
ఎవరికీ నిద్రాభంగం కలుగకుండా ఎంతో జాగ్రత్తగా క్రిందికి దిగాను. అప్పుడు, “వినోద్, ఆమెను జాగ్రత్తగా మెట్లు దిగమను” అని శరత్ మహరాజ్ అన్నారు. ఆయన క్రింద తమ గదిలో పడుకొని వున్నారు.
ఇంటికి తిరిగి వచ్చేసరికి పన్నెండు గంటలయింది.
మరొక రోజు నేను వెళ్లేసరికి మాతృదేవి మధ్యాహ్న భోజనానంతరం విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆమె చెప్పినందున నేను కూడా ఆమె ప్రక్కన పడుకొని విసన కర్రతో విసరసాగాను.
హఠాత్తుగా మాతృదేవి తమలో తామే మాట్లాడుకుంటూ, “సరేనమ్మా, మీరందరూ వస్తున్నారు. కాని ఆయన (గురుదేవులు) ఎక్కడ?” అన్నారు.
నేను: ఈ జన్మలో మేం ఆయనను చూడలేకపోయాం. మరో జన్మలోనైనా చూడగలుగుతామేమో ఎవరికెరుక! కాని మిమ్మల్ని దర్శించుకొంటున్నాం, ఇదే పదివేలు.
మాతృదేవి: అవును, అది నిజమే.
ఇలా మాతృదేవి అంగీకరించడం చూసి నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఎప్పుడూ ఆమె తమను మరుగుపరచుకొనే ఉంటారు కదా!
లోకులు తమ జీవితంలో ఏమీ దాచకుండా మాతృదేవికి చెప్పుకొని ఓదార్పు పొందేవారని నాకు తెలియదు, తెలియడానికి ఆస్కారమూ లేదు. అందుకు కారణం, గత కొన్ని రోజులనుండే నేను ఆమె వద్దకు వచ్చిపోతున్నాను! అందువలన గదిలో ఆమె లేకపోతే, వేచివుండక ఆమెకోసం ఇల్లంతా గాలించేదాన్ని. ఒక సాయంత్రం ఇద్దరు స్త్రీలు మాతృదేవి గదికి ఉత్తరంవైపు వసారాలో ఏకాంతంగా మాట్లాడు తున్నారు. అకస్మాత్తుగా నేను అక్కడకు వెళ్లాను. అప్పుడు మాతృదేవి వారితో, “మీ మనస్సులోని కష్టాలను గురుదేవులకు విన్నవించుకోండి. మనోవ్యాకులతతో విలపిస్తూ ప్రార్థించండి. ఆయన మీ ఒడిని నింపడం చూస్తారు” అంటున్నారు. ఆ స్త్రీలు సంతానానికై ప్రార్థిస్తున్నారని తక్షణం గ్రహించాను. నన్ను చూడడంతో వారు సిగ్గుపడ్డారు. నా పరిస్థితీ అదే!
కాని ఆ రోజు నేనొక గొప్ప గుణపాఠం నేర్చుకొన్నాను. ముందుగా తెలియచేయకుండా మాతృదేవి సమక్షానికి మళ్లీ ఎన్నటికీ వెళ్లకూడదని నిర్ణయించుకొన్నాను. కొన్ని నెలలు గడిచాక ఆ స్త్రీలను మాతృదేవి ఇంట్లో చూశాను. వారిప్రార్థన ఈడేరబోతూన్నట్లు గ్రహించాను.
గౌరీమా వచ్చివున్నారు. మేం బ్రతిమాలినప్పుడు ఆమె గురుదేవుల గురించిచెప్పారు: “ప్రారంభం నుండే నేను గురుదేవుల వద్దకు వచ్చివెళ్లేదాన్ని. ఆ తరువాతేపలువురు రావడం మొదలుపెట్టారు. ఈ నరేన్, కాళీ అందరూ పిన్న వయస్కులప్పటి నుండే నాకు తెలుసు.”
సాయంకాలమైనందున సంభాషణను సత్వరమే ముగించాల్సి వచ్చింది.గౌరీమా మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నారు.
నేను కూడా సెలవు పుచ్చుకొని బయలుదేరాలి. ఆ సమయంలో మాతృదేవినన్ను పిలిచి, ప్రసాదం ఇచ్చి, “వెళ్లిరామ్మా! నా బిడ్డలందరూ వస్తున్నారు. కాని ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు కూడా. ఒక రోజు ఉదయం ఏడు గంటలకు రా. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేయవచ్చు” అని చెప్పారు.
రథయాత్రోత్సవం, సెప్టెంబర్ 1912
ఉదయం ఏడు గంటలకు గౌరీమా ఆశ్రమానికి వెళ్లాను. అక్కడే భోజనంచేయమన్నారు వారు. ఉదయాన్నే మాతృదేవి వద్దకు వెళ్లాలనుకొన్నాను. కానివీలుకాలేదు. ఆశ్రమంలో గురుదేవులకు నైవేద్యం, భక్తుల సేవ అంతా పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయింది. సాయంత్రం దాదాపు నాలుగు గంటలకు గౌరీమాను కూడా తోడ్కొని మాతృదేవి వద్దకు వెళ్లాను.
మేం వెళ్లేసరికి మాతృదేవి గురుదేవుల సాయంకాల నైవేద్యం నిమిత్తంకూర్చుని ఉన్నారు. నైవేద్యం అర్పించాక లేచి వచ్చారు. గౌరీమా ఆమెను ప్రక్కకు తీసుకువెళ్లి ఏదో చెప్పారు. తరువాత నన్ను పిలిచారు. నేను మాతృదేవి కోసం ఒక పట్టుచీర కొని తీసుకువెళ్లాను. ఆ చీరను ఆమె పాదాల వద్ద సమర్పించి, “అమ్మా, మీరు దీనిని ధరించాలి” అని చెప్పాను. మాతృదేవి చిరునవ్వుతో, “ధరిస్తాను, ధరించకుండా ఉండగలనా?” అని అన్నారు.
భక్తులు మాతృదేవికి ప్రణామాలు చేయడానికి వస్తున్నారని తెలియగానే బయటి వసారాలోకి వచ్చాం. ఒక భక్తుడు చక్కగా వికసించిన గులాబీలు, చామంతి పువ్వులు, మల్లెమాలలు, పండ్లు, తీపిభక్ష్యాలు మొదలైనవి తీసుకువచ్చాడు. వాటిని మాతృదేవి పాదపద్మాల వద్ద సమర్పించి పాదపూజ చేయసాగాడు. ఎంతటి అద్భుత దృశ్యం అది! మాతృదేవి చిరునవ్వుతో శిలాప్రతిమలా కూర్చునివున్నారు – మెడలో భక్తుడు తెచ్చిన మల్లెపువ్వుల మాల, పాదపద్మాల వద్ద గులాబీలు, పుష్పగుచ్ఛాలు. పూజ పూర్తికాగానే ఆ భక్తుడు పండ్లు, తీపి భక్ష్యాల నుండి ఒక్కొక్కటి తీసి మాతృ దేవికి ఇస్తూ వాటిని ప్రసాదం చేసి ఇవ్వమన్నాడు. అది విని గౌరీమా, “అమ్మా, మీరు మంచి భక్తుని పాలపడ్డారు, రుచి చూసే తీరాలి” అని చెప్పారు. మాతృదేవి నవ్వుతూ, “అంత వద్దు, కాస్త ఇవ్వు” అంటూ ఒకింత పుచ్చుకొని, ఆ భక్తుని చేతికి అందించారు. ఒక్కొక్కటిగా అతడు తీసుకొని, తలపై ఉంచుకొని ఆనందపార వశ్యంలో మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నాడు. మాతృదేవి తమ మెడలోని పూలమాలను తీసి గౌరీమా మెడలో వేశారు. మాతృదేవి పాదాలకు సమర్పించిన పువ్వులను భక్తులు తీసుకుని వెళ్ళారు.
భూదేవ్ రథం తయారుచేసి. గురుదేవుల చిత్రపటాన్ని దానిలో అమర్చాడు.
ఏదో అత్యవసరమైన పని ఉండడం వలన గౌరీమా త్వరగా వెళ్లిపోయారు. నేను మెట్లదాకా వెళ్లి ఆమెను సాగనంపి వచ్చాను.
గౌరీమా గురించి సంభాషణ మొదలైంది.
మాతృదేవి: ఆ ఆశ్రమంలోని స్త్రీలు ఎంత సేవచేస్తున్నారు. రోగుల మల మూత్రాదులను సైతం వారు తమ చేతులతో తీసి శుభ్రం చేస్తున్నారు. గౌరి, సంసార జీవితంలో ఉంటే ఇటువంటి పనులు చేయలేదు కదా! అందువల్లనే గురుదేవులు వారిచే ఇటువంటి పనులు చేయనిస్తున్నారు. ఇదే ఆమెకు చివరి జన్మ.
ప్రక్క గదిలో గురుదేవులను రథంలో ఆసీనులను చేశారు. మాతృదేవి మంచం మీద కూర్చుని గురుదేవులను తిలకిస్తూ పరమానందభరితురాలైనారు. భూదేవ్, తదితరులు రథా న్ని మెల్లగా లాగుతూ క్రిందికి తీసుకువెళ్లారు. అక్కడినుండే గంగా తీరం వరకు వెళ్లి, సాయంత్రానికి తిరిగి వచ్చారు. తరువాత భక్తురాండ్రు మేడమీద రథా న్ని లాగారు. చివరకు మాతృదేవి, రాధూ, మాకూ, వారితోపాటు నేను కూడా రథాన్ని లాగాను. ఆలస్యంగా వచ్చిన వారికి మాతృదేవి, రథంలాగిన వైనం గురించి వివరించారు. భక్తురాండ్రు ప్రసాదం పుచ్చుకొని ఒక్కొక్కరుగా తిరిగి వెళ్లి పోయారు. రాత్రి నైవేద్యం, ఆరాత్రికం పూర్తయ్యాక మాతృదేవి నాకు ప్రసాదం ఇచ్చారు. ఆ రోజు నేను తిరిగి ఇంటికి వెళ్లేసరికి రాత్రి పదకొండు గంటలయింది.
వీథిలో రథాన్ని లాగుకొని వెళుతూన్నప్పుడు మాతృదేవి, “అందరూ పూరీకి వెళ్లలేరు. ఎవరు ఇక్కడ (రథంలో గురుదేవులను) దర్శించుకొన్నారో వారికి (సద్గతి) లభిస్తుంది” అని అన్నారు.
సెప్టెంబర్ 18, 1912
ప్రస్తుతం గౌరీమా ఆశ్రమ బాలికల పాఠశాల పనులలో ఉంటున్నందున అనుకున్నప్పుడల్లా మాతృదేవిని దర్శించుకోవడానికి నాకు వీలుండేది కాదు. రాధాష్టమి (రాధ జన్మదినం) అయిన నేడు అవకాశం దొరికినందువల్ల మాతృదేవి వద్దకు వెళ్లాను.
అప్పుడు మాతృదేవి స్నానానికై గంగానదికి బయలుదేరనున్నారు. పక్క గదిలో కూర్చుని నూనె రాసుకొంటున్నారు. నూనె రాసుకొంటున్నప్పుడు నమస్కారం చేయరాదంటారు కనుక నేను మాతృదేవికి ప్రణామం చేయలేదు. నన్ను చూడగానే మాతృదేవి “రా తల్లీ, రా! ఉదయమే వచ్చావు! మంచిది. ఈ రోజు రాధాష్టమి, మంచిరోజు. కూర్చో. స్నానం చేసి వస్తాను” అని అన్నారు. నేను కూడా వెంట వస్తాననగానే “సరే” అన్నారు. కాని చినుకులు పడుతూండడం వలన గోలాప్ మా నన్ను వారించారు. మాతృదేవి కూడా ఆమె మాటలను సమర్థిస్తూ, “అవును. నువ్వు ఇక్కడే ఉండు. నేనిప్పుడే వస్తాను” అని అన్నారు. దాంతో నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సాధుస్వభావురాలైన చిన్న బాలికలా మాతృదేవి ప్రవర్తించ డాన్ని మేం పలు సందర్భాలలో గమనించివున్నాం. ఎవరి మనోభీష్టానికీ విరుద్ధంగా తమ అభిప్రాయాన్ని ఆమె వెల్లడించేవారు కారు.
నిజానికి గంగాదర్శనం కంటే మాతృదేవి పావన సాంగత్యాన్నే నేను అధికంగా అభిలషించాను. లెక్కలేనన్ని ఐహిక బాధ్యతలతో ముడిపడివున్న నా వంటి వారికి మాతృదేవి వద్దకు వెళ్లడానికి తీరికే దొరకదు. భాగ్యవశాత్తూ ఎప్పుడో అవకాశం దక్కినప్పుడు ఆమెను ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడానికి మనస్కరించదు. కానీ మాతృదేవి మాటలు విన్న గోలాప్ మా, “ఆమె రాకపోతే ఏమీ నష్టపోదు. మీ పవిత్ర పాదాలు సోకితే చాలు, సమస్తం లభిస్తుంది” అని అన్నారు. నేను కూడా తల ఊపాను. కాని మాతృదేవి, “అలా అనకు. ఆహా! గంగామాత గంగామాతయే కదా!” అని అన్నారు. మాటల్లోగాని, చేతల్లోగాని మాతృదేవి తమ దివ్యోన్నతిని ఎన్నడూ వెల్లడించేవారు కారు. సామాన్యమైన వ్యక్తి అని జనం అనుకొనేలా ఆమె వ్యవహరించేవారు. కానీ ఎంతో అరుదుగా పుణ్యాత్ములైన కొందరు భక్తులపై తమ అవ్యాజ దయామృతాన్ని కురిపించడాన్ని మేం చూసివున్నాం. పైన కూర్చొని, “గంగలో స్నానం చేసివచ్చాను” అని అన్నారు. తమ పాదపద్మాలను అర్చించాలనే కోర్కె నాకున్నదని ఆమె గ్రహించారని నేను తెలుసుకొన్నాను. ‘అమ్మా! నిత్య పావనీ! పావన మవడానికి గంగలో స్నానం చేయడం మీకు అనవసరం’ అని మనస్సులో అనుకొన్నాను. సత్వరమే వెళ్లి పువ్వులతోను, గంధంతోను మాతృదేవి పాదాల వద్ద కూర్చొనేసరికి, “తులసీ దళాలను పాదాల మీద వేయవద్దు” అని చెప్పారు. మాతృదేవి పాదాలను పూజించి, ప్రణామం చేసి, లేచాను.
మాతృదేవి భోజనానికి కూర్చున్నారు. నన్ను కూడా ఆప్యాయంగా తమ పక్కన కూర్చోబెట్టుకొని తాను తింటూన్న ప్రతి పదార్థాన్నీ అమిత ప్రేమతో ప్రసాదంగా కొంత నాకు ఇవ్వసాగారు. మహదానందంతో నేను వాటిని స్వీకరించాను. విస్తరిలో భోజనం చేస్తున్నప్పుడు నాకు ‘దుర్గాచరణ్ నాగ్’ (నాగమహాశయ్) జ్ఞప్తికి వచ్చారు. “ఈ విస్తరి తరచూ నాకు దుర్గాచరణ్ నాగమహాశయ్ను జ్ఞాపకం చేస్తోంది”* అని మాతృదేవికి చెప్పాను.
మాతృదేవి: ఆహా, అతడి భక్తి ఎంత అద్భుతమైంది! ఎండిపోయిన విస్తరాకును ఎవరైనా తినగలుగుతారా? ప్రసాదం అంటుకొన్నదనే ఒకే కారణం వలన ఆ విస్త రాకును కూడా తినేశాడు. భక్తి తీవ్రత అది! హా! ఆయన కళ్లు ప్రేమరసభరితాలు! అవి ఎల్లప్పుడూ కెంపుల మాదిరి ఎర్రబారి బాష్పపూరితాలై ఉండేవి. తీవ్రమైన తపస్సుతో ఆయన దేహం శుష్కించిపోయి ఉండేది. ఆహా! ఆయన నా వద్దకు వచ్చేటప్పుడు భక్తి పారవశ్యంలో మెట్లు ఎక్కలేక తూలుతూ నడిచేవారు. నన్ను చూడ గానే ఆయన శరీరమంతా కంపించిపోయేది. అటువంటి భక్తిని నేను మరెవరిలోనూ చూడలేదు.
ఆహా, ఆయన గురుభక్తి ఎంత ఉత్కృష్టమైనది! పవిత్రత, అపవిత్రతలనే భేదబుద్ధి ఆయనలో లేదు.
నేను: అందరూ గంగాస్నానం చేసే ఒక పర్వదినాన ఆయన కలకత్తా నుండి తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు. కాని ఆ నిర్ణీత పుణ్యముహూర్తంలో ఆయన ఇంటి ముంగిటనే గంగ నీటిధారలా పైకి ఎగజిమ్మి వచ్చిందట.
మాతృదేవి: అవును. ఆయన భక్తి తీవ్రతకు ఇటువంటి అద్భుతాలు జరిగే తీరతాయి. నేనొక వస్త్రాన్ని ఇచ్చాను. దాన్ని తలపాగాలా చుట్టుకొన్నారు. ఆయన భార్య కూడా సజ్జనురాలు, భక్తురాలు. ఈ వేసవి రోజుల్లో కూడా ఆమె ఇక్కడకు వచ్చింది. ఆమె ఇంకా జీవించే ఉంది.
ఆ సమయంలో కొందరు భక్తురాండ్రు రావడంతో సంభాషణ ఆగిపోయింది. మాతృదేవి లేచి వారి వందనాలు స్వీకరించారు. పిదప నన్ను కిళ్లీలు కట్టమన్నారు. నేను రెండు కట్టి ఇచ్చాను. మాతృదేవి ఒకటి తాము వేసుకొని, మరొకటి నాకు ఇచ్చారు. మిగిలిన తమలపాకులను కూడా కిళ్లీలుగా కట్టడానికి నేను లోపలకు వెళ్లాను. కాసేపటికి మాతృదేవి ఇద్దరు భక్తురాండ్రతో అక్కడకు వచ్చి కూర్చున్నారు. ఆ భక్తురాండ్రు కూడా సాయపడినందున పని సత్వరమే పూర్తయింది. మాతృదేవి కొన్ని కిళ్లీలను నైవేద్యం కోసం విడిగా తీసివుంచి, “ఆహా! మా ఇంటి మహాలక్ష్ములు! పనిని ఎంత వేగంగా ముగించారో” అంటూ పరమానందభరితులయ్యారు.
మేడమీద ఉంటున్న గోలాప్ మా గదికి మాతృదేవి వెళ్లారు. కాసేపు తరువాత నేను కూడా అక్కడకు వెళ్లాను. మాతృదేవి గుమ్మం గడప మీద తల ఉంచి పడుకొని ఉన్నారు. గడప దాటి ఎలా నేను లోపలకు వెళ్లగలను? నా తటపటా యింపును గమనించిన మాతృదేవి, “లోపలకు రా, తప్పులేదు” అని అన్నారు. ఆమె ఎప్పుడూ అంతే! పిదప తలను కాస్త పైకి ఎత్తారు. నేను గది లోపలకు వెళ్లి ఆమె పక్కన కూర్చొని విసరసాగాను. మాతృదేవి పడుకొని ఉండగానే గౌరీ మా పాఠశాల, బండి బాడుగ ఇత్యాది అనేక విషయాల గురించి అడిగారు. నేను బదులు చెప్పాను.
అప్పుడు ఆ ఇద్దరు భక్తురాండ్రు అక్కడకు వచ్చారు. వారిలో ఒకామె మాతృదేవికి తల దువ్వింది. ఒకటి రెండు నెరసిన వెంట్రుకలను మాతృదేవి తల నుండి తీసి ఆమె తన చీర కొంగున కట్టుకొని, “వీటిని తాయెత్తులో పదిలపరచు కొంటాను” అంది. మాతృదేవి సిగ్గుపడి సంకోచంతో, “ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకు మునుపు తల వెంట్రుకలనెన్నో పారేశాను” అని అన్నారు.
తరువాత మాతృదేవి ఎండలో కూర్చోవడానికి డాబా మీదికి వెళ్లారు. మేం కూడా ఆమెతో వెళ్లాం. ఒక మూల నిలబడి గంగానదిని తిలకించాం. అప్పుడు గోలాప్ మా క్రింది గది నుండి, “అందరితో కలిసి మాతృదేవి మేడ మీదకు వెళ్లారు. ఎవరు భోజనం చేస్తారో, ఎవరు భోజనం చేయరో నాకెలా తెలుస్తుంది?” అని కేక వేశారు. వెంటనే నేను వారిని సంప్రతించి, “ఆ వితంతువు మాత్రం భోజనం చేయరు” అని బదులు చెప్పాను. ఎండలో బట్టలు ఆరుతున్నాయి. వాటిని తీసుకువెళ్లమని నాకు పురమాయించి నైవేద్యం పెట్టడానికి మాతృదేవి క్రిందకు వెళ్లిపోయారు.
నైవేద్యం పెట్టడం పూర్తయింది. భక్తురాండ్ర భోజనాలకు ఏర్పాటు చేయమని మాతృదేవి నాకు చెప్పారు. అందరమూ భోజనాలకు కూర్చున్నాం. మాతృదేవి ఒకటి రెండు ముద్దలు తిన్నారు. తరువాత మాకు ప్రసాదం ఇచ్చారు. భక్తురాండ్రలో ఒకరు వృద్ధురాలైన సుమంగళి. ఆమె గురుదేవులను దర్శించి ఉంది. ఆమెతోపాటు ఆమె కోడలు కూడా వచ్చింది.
భోజనం చేస్తూ ఆ వృద్ధురాలు ఇలా చెప్పింది: “ఆహా! గురుదేవులు మాకు ఎన్నో విషయాలు చెప్పివున్నారు. వాటిని మేం పాటించగలిగామా ఏమిటి? పాటించి ఉంటే ఇంత కష్టపడేవారమా? కుటుంబం, కుటుంబం, ఈ పని, ఆ పని అంటూ పాకులాడుతూ చస్తున్నామమ్మా!”
మాతృదేవి: పని చేయకుండా మరేం చేయాలి? పని చేస్తూన్నకొద్దీ బంధాలు తొలగిపోతాయి. పిదప అనాసక్త స్థితి కలుగుతుంది. ఒక్క క్షణం కూడా పని లేకుండా ఉండడం మంచిది కాదు.
భోజనానంతరం మాతృదేవి కాసేపు మంచం మీద విశ్రాంతి తీసుకొన్నారు. ఆమెను ఏదోరకంగా సేవించాలని అందరికీ ఆరాటమే! కానీ అందరినీ విశ్రాంతి తీసుకోమన్నారామె. కొంతసేపు గడిచింది. ఇంటి పనులు చేసుకోవడానికి అందరూ వెళ్లిపోయారు. నేను, గురుదేవుల సమకాలీనురాలైన ఒక వృద్ధ వితంతువు మాత్రం మిగిలాం. నేను మాతృదేవి పాదాలను ఒత్తుతున్నాను. వితంతువు, మాతృదేవి పక్కన కూర్చుని తన కష్టసుఖాలు వెళ్లబోసుకొంటూ ఉంది –
“అమ్మా, నా తప్పులన్నిటినీ మీరు క్షమిస్తూంటారు. కానీ నా కుటుంబంలోని వారిలో ఆ సుగుణం కానరాదు.”
నేను: గురుదేవులను మీరు దర్శించి ఉన్నారా?
వితంతువు: ఆహా! చూశానమ్మా! చూసివున్నాను. ఆయన మా ఇంటికి వచ్చేవారు. మాతృదేవి అప్పుడు యువతి.
నేను: గురుదేవులను గురించి ఏమన్నా చెప్పండి, వినాలని ఉంది.
వితంతువు: నేను చెప్పడమా? మాతృదేవిని అడుగు.
మాతృదేవి కళ్లు మూసుకొని ఉన్నారు. అందువలన నేను ఏమీ అడగలేదు. కాసేపటికి ఆమె చెప్పసాగారు:
“పరితప్త హృదయంతో ప్రార్థించే ప్రతి వ్యక్తీ ఆయనను దర్శించగలడు. కొద్దిరోజుల క్రితం తేజచంద్ర మరణించాడు. ఆహా, అతడెంత మంచివాడు! గురుదేవులు అతడి ఇంటికి వెళ్లేవారు. ఎవరో తన వద్ద ఉంచిన రెండు వందల రూపాయలు ట్రామ్‌లో అతడు పోగొట్టుకొన్నాడు. ఇంటికి వచ్చిన తరువాతే అతడికి ఆ విషయం తెలియవచ్చింది. తిరిగి ఇవ్వడానికి అతడి వద్ద డబ్బులేదు.
“దారీతెన్నూ గానక అతడు గంగాతీరానికి పోయి కన్నీరుమున్నీరై వ్యాకులతతో, “ప్రభూ! నాకు ఇలా జరిగిందేమిటి?’ అంటూ విలపించసాగాడు. అప్పుడు గురుదేవులు అతడి ముందు ప్రత్యక్షమై, ‘ఎందుకు విలపిస్తావు? ఇదే గంగాతీరంలో ఒక ఇటుకరాయి కింద ఆ డబ్బు ఉంది. వెళ్లిచూడు’ అని చెప్పారు. పరుగెత్తుకొంటూ పోయి ఇటుకరాయిని పైకెత్తి చూస్తే, నిజంగా ఒక నోట్ల కట్ట ఉంది! అతడు వచ్చి శరత్‌తో జరిగింది యావత్తూ వివరంగా చెప్పాడు. అందుకు శరత్, ‘ఆయనను ఇప్పటికీ మీరు దర్శించుకొంటున్నారు. మాకు ఆ భాగ్యం లేదు’ అని అన్నాడు.
“కానీ వారు (గురుదేవుల శిష్యులు) చూడవలసింది ఇక ఏముంది కనుక? చూడవలసిందంతా చూసి, వినవలసిందంతా విని తరించారు. గురుదేవులను చూడనివారే తీవ్ర మనోవ్యథకు లోనవుతున్నారు.”
“గురుదేవులు దక్షిణేశ్వరంలో నివసించిన రోజులలో రాఖాల్, మిగిలిన అందరూ యువకులు కలసి ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఒక రోజు రాఖాల్ బాగా ఆకలిగా ఉందని గురుదేవులతో చెప్పాడు. వెంటనే ఆయన గంగాతీరానికి వెళ్లి, ‘ఓ గౌరీ, పరుగున రా! నా రాఖాల్కు ఆకలిగా ఉందట’ అని బిగ్గరగా కేక పెట్టారు. ఆ రోజుల్లో దక్షిణేశ్వరంలో హోటళ్లు ఏవీ ఉండేవి కావు. కొంతసేపు గడిచాక గంగలో ఒక పడవ రావడం కనిపించింది. ఆ పడవ దేవాలయం వద్ద ఆగింది. బలరాంబాబు, గౌరీ, మరికొందరు మిత్రులు దాన్లో నుండి దిగారు. వారు రసగుల్లాలు తీసుకువచ్చారు. గురుదేవులు ఎంతో సంతోషంగా రాఖాల్తో, ‘రా! ఇవిగో రసగుల్లాలు. ఆకలిగా ఉందన్నావు కదా! తిను’ అంటూ అతణ్ణి పిలిచారు. రాఖాల్కు కోపం ముంచుకొచ్చింది. ‘నా ఆకలి గురించి ఎందుకు ఇలా చాటింపు వేస్తున్నారు?’ అని అడిగాడు. అందుకు గురుదేవులు, ‘ఇందులో తప్పేముంది నాయనా! నీకు ఆకలిగా ఉంది. దానిని గురించి చెప్పడంలో తప్పేముంది?’ అని అన్నారు. గురుదేవుల నైజం చిన్న పిల్లల వంటిది కదా!”
భూదేవ్ బడి నుండి జ్వరంతో తిరిగివచ్చాడు. అతడికి పడక అమర్చమని మాతృదేవి నన్ను పురమాయించారు. బలరాంబాబు తల్లి నెత్తురు విరేచనాలతో బాధపడుతున్నారని తెలిసి ఆమెను చూసి రావడానికి మాతృదేవి బలరాం ఇంటికి బయలుదేరబోతున్నారు. “ఒకసారి వెళ్లి చూసి తీరాలి. నివేదిత పాఠశాల నుండి బండి వస్తే కాసేపు వేచివుండమను” అంటూ సాయంత్రపు పనులను పూర్తిచేయడంలో నిమగ్నులయ్యారు.
సాయంత్రం నైవేద్యం అర్పించాక నాకు కొంచెం ప్రసాదం ఇచ్చారు. తరువాత తింటానని చెప్పాను. అందుకు మాతృదేవి, “సరే, తరువాత తిను. నళినీ! తరువాత ఈమెకు ప్రసాదం ఇవ్వు” అని చెప్పారు. ఇంతలో బండి వచ్చింది. “నేను తొందర గానే తిరిగివస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను తిరిగి రావడానికి ఆలస్యమైతే నువ్వు భోజనం చేయి” అంటూ నాకు చెప్పి మాతృదేవి బయలుదేరారు. ఆమెతోపాటు గోలాప్ మా కూడా వెళ్లారు.
ఒక గంట తరువాత మాతృదేవి తిరిగివచ్చారు. ఇంతలో నన్ను తోడ్కొని వెళ్లడానికి మనుషులు వచ్చారు. అయినప్పటికీ నేను మాతృదేవి కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. నన్ను చూడగానే మాతృదేవి, “ఇదిగో, నీ కోసమే త్వరగా వచ్చేశాను. ఏమైనా తిన్నావా?” అని అడిగారు.
నేను: లేదమ్మా!
మాతృదేవి: నళినీ, ఈమె కెందుకు ప్రసాదం ఇవ్వలేదు? నీకు చెప్పి వెళ్లాను కదా!
నళిని: మరిచిపోయాను. ఇప్పుడే తీసుకువస్తాను!
మాతృదేవి: ఆ శ్రమ నీకక్కర్లేదు. నేనే ఇస్తాను. (నాతో) ఏమమ్మా, నువ్వు అడిగి తీసుకోవాలి కదా! ఇది నీ ఇల్లు కాదా!
నేను: అంతగా ఆకలి లేదు. ఆకలిగా ఉంటే అడిగి తీసుకొనేదాన్ని.
తరువాత మాతృదేవి కొంత ప్రసాదం ఇచ్చారు. సంతోషంగా ఆ ప్రసాదాన్ని ఆరగించాను. “ఇదుగో, కిళ్లీ కూడా పుచ్చుకో” అంటూ గదిలోకి వెళ్లబోయారు. “చుట్టిన తమలపాకులు లేవే! దేన్ని ఇస్తారు?” అంది నళిని. కానీ మాతృదేవి లోపలకు వెళ్లి వెతికి ఒక కిళ్లీ తెచ్చి నాకిచ్చారు. నేను మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నాను. “రామ్మా, మళ్లీ రా, దుర్గా! దుర్గా!” అంటూ, “నేను కూడా క్రింద దాకా రానా? ఒంటరిగా దిగి వెళ్లగలవా? రాత్రి అయిందే!” అని ఆప్యాయంగా అడిగారు. “నేను వెళ్లగలనమ్మా! మీరు రాకండి” అన్నాను. అయినా, “దుర్గా, దుర్గా” అంటూ మాతృదేవి దుర్గాదేవి పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ మేడ మెట్లదాకా వచ్చారు. “ఇక మీరు శ్రమపడకండి. నేను వెళ్లగలను” అని చెప్పాను.
మరొక రోజు. ఆనాడు అక్షయ తృతీయ. ఇంతకు మునుపు ప్రస్తావించిన ఆ వితంతువు, ఆమె కోడలు స్నానం చేసి వచ్చి జందెం, ఒకటి రెండు పళ్లు మొదలైనవి తెచ్చి మాతృదేవికి సమర్పించగా, “నాకెందుకు? భూదేవ్కు ఇవ్వండి” అన్నారు. కాసేపయ్యాక మాతో మాతృదేవి ఇలా అన్నారు:
“ఈ పర్వదినాన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీకు ముక్తీ, పరమానందమూ ప్రాప్తించుగాక! జనన మరణాలు దుఃఖహేతువులు. ఆ యాతనలను ఇకపై మీరు అనుభవించరుగాక!”
అక్టోబర్ 1912
దుర్గాపూజ సెలవుల్లో ఒక రోజు మాతృదేవి దర్శనార్థం నేను వెళ్లాను. మాతృదేవి పనుల హడావిడిలో ఉన్నారు. నన్ను కూర్చోమని చెప్పి, రాంచీ నుంచి వచ్చిన భక్తుణ్ణి పిలుచుకుని రమ్మన్నారు. ఆ భక్తుడు అనేక రకాల పళ్లు, పువ్వులు, వస్త్రాలు, నూలు వస్త్రంతో చేసిన ఒక గులాబీ పూలమాల మొదలైన వాటిని తీసుకు వచ్చాడు. ఆ మాల నిజమైన పువ్వుల మాలలాగానే ఉంది. వీటినన్నిటిని తీసుకొని అతడు మేడ మీదకు వచ్చాడు.
ఆ మాలను మెడలో ధరించమని మాతృదేవిని ప్రాథేయపడ్డాడు. ఆమె ఆ మాలను ధరించారు. అప్పుడు అక్కడకు వచ్చిన గోలాప్ మా ఆ భక్తుణ్ణి కోప గించుకొంది. మాలలో ఉన్న ఇనుపతీగ మాతృదేవికి గుచ్చుకొని హాని కలుగవచ్చునని ఆమె భావించారు. కానీ మాతృదేవి మాత్రం శాంతంగా, “లేదు, తీగ గుచ్చుకోవడం లేదు. చీర మీదనే మాల వేసుకొన్నాను” అని చెప్పారు. పిదప మాతృదేవికి ప్రణామం చేసి ఆ భక్తుడు కిందికి వెళ్లిపోయాడు.
ప్రసాదం పుచ్చుకోవడానికి మాతృదేవితోపాటు నేనూ కూర్చున్నాను. మాతృ దేవి కోసం పళ్లు, మిఠాయిలు తెచ్చాను. “వాటిని నివేదన చేసి తీసుకు రా” అని ఆమె చెప్పారు. నైవేద్యం అర్పించిన పిదప మాతృదేవి ఆ ప్రసాదం నుండి ఒక ద్రాక్షపండును నోట్లో వేసుకొని, “ఆహా, ఎంత తియ్యగా ఉంది” అని అన్నారు.
కొన్నాళ్ల క్రితం మాతృదేవికి నేనొక చీర తెచ్చి ఇచ్చాను. దానిని ఇప్పుడు ఆమె ధరించి ఉన్నారు. నన్ను చూడగానే, “చూశావా! నువ్వు ఇచ్చిన చీరను పదే పదే ధరించడంవల్ల అది మాసిపోయింది” అని చెప్పారు. భక్తురాలిగా అర్హతలేని నా పట్ల ఆమె కనబరుస్తూన్న అవ్యాజ ప్రేమానురాగాలు నన్ను ముగ్ధురాలిని చేశాయి. మాతృదేవి తమ విస్తరి నుండి ప్రసాదాన్ని తీసి నాకు ఇస్తున్నప్పుడు ఆమె చెయ్యి నా చేతిని తాకింది. వెంటనే నేను, “అమ్మా! మీ చేయి కడుక్కోండి” అని చెప్పాను. మాతృదేవి తన చేతి మీద కాస్త నీళ్ళు పోసుకొని, “ఇదిగో, కడుక్కొన్నాను” అన్నారు.
ఏదో కారణంగా నళిని అలిగి కూర్చుంది. మాతృదేవి ఆమెను చీవాట్లు పెట్టారు. “స్త్రీలకు ఇంత కోపం పనికిరాదు. సహనం ఉండాలి. బాల్యంలో తల్లి తండ్రులు, యౌవనంలో భర్త రక్షణ స్త్రీలకు ఎంతో అవసరం. సామాన్యంగా స్త్రీలు ఎంతో సున్నిత మనస్కులు. ఒక్క మాట చాలు, బుస్సుమంటూ కోపం రావడానికి. మానవజాతి కదా – పరుషపు మాటలకు కొదవ లేదు. ఏం కష్టం వచ్చినా స్త్రీలు తల్లితండ్రులు, భర్త – వీరికి విధేయులై ఉండాలి.”
ఆ సమయంలో అక్కడికి రాధు మోకాళ్ల పైకి చీరను ఎత్తుకొని వచ్చి కూర్చుంది. మాతృదేవి ఆమెను మందలించారు: “ఇదేమిటమ్మా! స్త్రీలు మోకాళ్లపైకి చీరను ఎత్తి ధరించకూడదు.”
ఇలా అంటూ, ‘మోకాళ్లపైకి బట్టను ధరించడం, వివస్త్ర అవడం ఒకటే కదా!’ అనే అర్థం వచ్చే శ్లోకాన్ని వల్లించారు.
ఇంతలో చంద్రబాబు సోదరి వచ్చింది.
ఆమె (నాతో) : మాతృదేవి భర్త జీవించేవున్నారా? వీరంతా వారి పిల్లలేనా?
నేను: సరేలే! మీరు గురుదేవుల కథామృతం చదవలేదా? ‘కామినీ కాంచన త్యాగమే’ కదా ఆయన ప్రధాన ఉపదేశం!
ఆమె (సిగ్గుతో) : వీరంతా మాతృదేవి కుమార్తెలూ, కోడళ్లూ అనుకొన్నాను.
దుర్గాపూజ సమయం ఆసన్నమవుతోంది. మాతృదేవి తమ తమ్ముళ్ల అల్లుళ్ళ కోసం నూతన వస్త్రాలను విడి విడిగా అమరుస్తున్నారు. వాటిని విడిగా కట్టమని నాకు పురమాయించారు. తరువాత ఒక వస్త్రాన్ని నాకు ఇస్తూ, “దీన్ని ప్రత్యేకంగా ఉంచు, తల్లీ! పూజ రోజులలో మఠానికి వెళ్లేటప్పుడు గణేన్ ధరిస్తాడు” అని చెప్పారు.
మధ్యాహ్నం నైవేద్యం అర్పించాక అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. భోజనా నంతరం మాతృదేవి కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. నేను ఆమె పక్కన కూర్చొని విసనకర్రతో విసిరాను. కొంతసేపయ్యాక ఆమె, “విసిరింది చాలు. అదుగో, అక్కడ నుండి ఒక తలగడ తీసుకొని ఇక్కడ పడుకో” అని చెప్పారు. మాతృదేవి తలగడను నేనెలా ఉపయోగించగలనని సంశయించి రాధూ గదికి వెళ్లి ఒక తలగడ తెచ్చుకొన్నాను. అది చూసి మాతృదేవి, “అమ్మో! అది ఆ పిచ్చిదాని (సురబాల) తలగడ. దాన్ని అక్కడే పెట్టిరా. ఈ తలగడను పెట్టుకో. దీన్లో తప్పేమీ లేదు” అని చెప్పారు. పిదప రాధూను పిలుస్తూ, “రాధూ! నువ్వు కూడా రా! ఈమె దగ్గర పడుకో” అని అన్నారు.
చంద్రబాబు సోదరి గురించి ప్రస్తావన వచ్చింది. “మాతృదేవి భర్త అదుగో ఆ పూజామందిరంలో ఉంటున్నారు. మేమంతా ఆయన పిల్లలమే అని నువ్వు చెప్పివుండవచ్చు కదా!” అన్నారు మాతృదేవి.
నేను: ప్రపంచమంతటా ఆయనకు ఎందరో పిల్లలు!
మాతృదేవి (చిరునవ్వుతో) : ఎన్నెన్ని ఆకాంక్షలతో జనం ఇక్కడకు వస్తూంటారు! గురుదేవుల కోసం ఒక దోసకాయ తీసుకొస్తారు. కానీ దాంతోపాటు వేయికోర్కెలు జతపరుస్తారు. ‘భగవంతుడా! ఇదుగో దీన్ని అర్పిస్తున్నాను. నాకు ఇవన్నీ నెరవేర్చిపెట్టు’ అని ప్రార్థిస్తారు. ఎన్నెన్ని కోర్కెలు!
మాతృదేవి కాస్త ఒత్తిగిలి పడుకొన్నారు. నాకూ కాస్త కునుకు పట్టింది. లేచి చూసేసరికి మాతృదేవి విసురుతున్నారు.
కాసేపటికి మాతృదేవి లేచారు. అంతలో పక్క గదిలోకి కొందరు భక్తురాండ్రు వచ్చారు. వారిలో ఇద్దరు కాషాయవస్త్రాలు ధరించి ఉన్నారు. వారు మాతృదేవికి ప్రణమిల్లారు. వారితో ఇద్దరు పిల్లలు కూడా వచ్చివున్నారు. వారు ప్రణమిల్లాక మాతృదేవి కూడా నమస్కరించారు. నైవేద్యం నిమిత్తం వారు తీపి భక్ష్యాలు తీసుకు వచ్చారు. వాటిని తీసుకోమని నాతో చెప్పి మాతృదేవి కాళ్లు చేతులు కడుగుకొనడానికి లోపలకు వెళ్లారు. వారిద్దరూ కాళీఘాట్‌లోని శివనారాయణ పరమహంస శిష్యు రాండ్రని తెలుసుకొన్నాం. అక్కడ నిర్విరామంగా ఒక పెద్ద యాగం జరిపిస్తున్నారు.
కాసేపటికి మాతృదేవి వచ్చి కూర్చున్నారు.
ఒక సన్న్యాసిని: మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకొంటున్నాం.
మాతృదేవి: అడగండి.
సన్న్యాసిని: సాకార పూజలో ఏదైనా సత్యం ఉందా? ‘సాకారోపాసనలో ఏమీ లేదు. సూర్యుణ్ణి, అగ్నిని పూజించండి’ అంటున్నారు మా గురువు.
మాతృదేవి: మీ గురువుగారు చెప్పిన తరువాత ఆ విషయం గురించి నన్ను అడగడం సమంజసం కాదు. గురువు మాటలలో విశ్వాసం కలిగి ఉండాలి.
సన్న్యాసిని: మీరు అలా అంటే సరిపోదు. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే తీరాలి.
మాతృదేవి అభిప్రాయం వ్యక్తంచేయడానికి నిరాకరించారు. ఆ సన్న్యాసిని పట్టుబట్టడంతో చివరకు ఇలా అన్నారు:
“మీ గురువు పరిపూర్ణ జ్ఞానులై ఉండే పక్షంలో ఇలా చెప్పివుండరాదు. మీరు ఒత్తిడి చేయడం వలన నేను ఇది చెప్పాల్సి వచ్చింది. అనాదిగా ఎందరో సాకారోపాసన చేసి ముక్తి పొందివున్నారు. అవన్నీ కేవలం కట్టుకథలా? మా గురు దేవులకు ఇటువంటి సంకుచిత అభిప్రాయం ఉండేది కాదు. భగవంతుడు సర్వాం తర్యామి. కాని ఒక్క విషయం – మానవాళిని తరింపచేయడానికే సాధువుల రాక! విభిన్న వ్యక్తుల కోసం వారు విభిన్నంగా బోధిస్తారు – దారులు అనేకం. అందువలన వారందరి ఉపదేశాలూ సబబే. ఉదాహరణకు: ఒక చెట్టుమీద తెలుపు, నలుపు ఇత్యాది వేర్వేరు రంగుల పక్షులు వ్రాలతాయి. అవి రకరకాలుగా కూస్తూంటాయి. అవి నానారకాలుగా కూస్తూవున్నప్పటికీ వాటినన్నిటిని పక్షుల కూతగానే పేర్కొంటాం. ఆ కూతల్లో ఏదో ఒక్కటే పక్షికూత అనీ, తక్కినవి కావనీ చెప్పం కదా!”
ఆ సన్న్యాసినులు కాసేపు వాదించి మౌనం వహించారు. తరువాత మళ్లీ మాతృదేవితో మాట్లాడనారంభించారు.
సన్న్యాసిని: మీ ఇల్లు ఎక్కడ?
మాతృదేవి: హూగ్లీ జిల్లాలోని కామార్పుకూర్లో.
సన్న్యాసిని: ఇక్కడి చిరునామా చెప్పండి. మేం అప్పుడప్పుడు వస్తాం.
చిరునామా ఇవ్వమని మాతృదేవి చెప్పారు. అంతకు క్రితం వారు తెచ్చిన తీపి పదార్థాలలో ఒకటి రెండు ఆ పిల్లలకు ఇవ్వమని నాకు చెప్పారు. నేను ఇచ్చాను. కొంతసేపయ్యాక వారు సెలవు పుచ్చుకొని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక మాతృదేవి ఇలా అన్నారు:
“స్త్రీలు వాదానికి దిగడమా! జ్ఞానులు కూడా వాదం మూలంగా భగవంతుణ్ణి పొందలేరు. భగవద్విషయం వాదం వలన తేలుతుందా ఏమిటి?”
కాసేపటికి బండి వచ్చింది. వెంటనే మాతృదేవి, “ఇప్పుడే కదా నువ్వు వచ్చింది, ఇంతలోనే బండి కూడా వచ్చేసింది” అన్నారు. సత్వరమే వెళ్లి గురుదేవులకు సాయంకాల నైవేద్యం అర్పించారు. ప్రసాదం, తీర్థం, రెండు తమలపాకు చిలకలు తెచ్చి వసారా పరదా వద్ద నిలబడి నన్ను పిలిచారు. ఆమె అవ్యాజ ప్రేమను చూసి నా కళ్లు ఆర్ద్రమైనాయి. ‘దసరా తర్వాత మాతృదేవి కాశీకి వెళ్లబోతున్నారు. ఎప్పుడు తిరిగివస్తారో, ఆమెను మళ్లీ ఎప్పుడు దర్శించుకోగలనో’ అంటూ మనస్సు వ్యథకు లోనైంది. “మళ్లీ రా” అని ఉట్టిపడే కరుణతో ఆమె చెప్పారు.
చంద్రబాబు వచ్చి కాస్త కోప్పడే ధోరణిలో, “బండి వచ్చి ఎంతో సేపయింది. బండి వాడు కోపగించుకొంటున్నాడు” అని చెప్పారు. అది విన్న మాతృదేవి, “వాడి కేమిటి! ఇదిగో బయలుదేరింది. రామ్మా” అని చెప్పారు. కన్నీళ్లతో ప్రణామం చేసి నేను సెలవు పుచ్చుకొన్నాను. మనస్సులో ఎంతో బాధ ఉండడం వలన బండిలో ఎవరితోనూ మాట్లాడలేదు. రాత్రంతా నా పరిస్థితి అలాగే ఉండిపోయింది.
జనవరి 31, 1913
మాతృదేవి కాశీ నుండి తిరిగి వచ్చారు. ఒక రోజు ఉదయం మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడు ఆమె పూజలో ఉన్నారు. పూజ పూర్తి కాబోతున్నది. పూజానంతరం ఆమె లేచి, “వచ్చావా అమ్మాయ్! నిన్ను చూడకుండానే వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనుకొన్నాను. త్వరలోనే ఊరికి వెళుతున్నాను” అని చెప్పారు.
నైవేద్యానికి కొంత మిఠాయి తీసుకువెళ్లాను. అది చూసి మాతృదేవి, “ఈ రోజు గురుదేవులకు తీపి పదార్థాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఏం చేయాలో పాలుబోలేదు. ఆయన నైవేద్యానికి ఆయనే ఏర్పాటు చేసుకొన్నారు చూశావా! అందులోనూ ఇంట్లోనే తయారు చేసిన తీపిపదార్థం!” అని అన్నారు.
నైవేద్యం అర్పించాక విస్తర్లలో భక్తుల కోసం ప్రసాదం వడ్డించారు. అది చూసి భూదేవ్, “ఇవన్నీ ఎవరి కోసం?” అని అడిగాడు. మాతృదేవి నవ్వుతూ, “చూడు, ఈ పిల్లవాడి తెలివి! మరెవరికి! భక్తులందరూ కింద ఉన్నారు కదా, వారికే. వెళ్లి ఇచ్చి రా” అన్నారు.
కాసేపయ్యాక ఒక భక్తుడు వచ్చి మాతృదేవికి ప్రణామం చేసి, ఒక పూల మాలను సమర్పించాడు. తరువాత, “ఈ డబ్బు మీకు ఇవ్వమని సురేన్ చెప్పాడు” అంటూ డబ్బును మాతృదేవి పాదాల వద్ద ఉంచాడు.
రాధు క్రైస్తవ పాఠశాలకు వెళ్లడానికి తయారైంది. అప్పుడు గోలాప్ మా అక్కడకొచ్చి, “రాధూ పెద్దమనిషైంది. ఇంకా ఆమెను బడికి పంపాలా?” అని మాతృదేవిని అడుగుతూ, రాధును కూడా ఆపారు. రాధు ఏడుపు లంకించుకొంది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“రాధూకు ఏమంత వయస్సయింది!* ఆమెను బడికి వెళ్లనీ. చదువు, చేతిపనులు నేర్చుకోవడం ఎంతో మంచిది. గ్రామంలో ఉండబోయే ఈమె ఇవన్నీ నేర్చుకొంటే ఆమెకే ప్రయోజనం. ఇతరులకూ ఆమె ద్వారా మంచి జరగడానికి ఆస్కారం ఉంది.”
చివరకు రాధు బడికి వెళ్లడానికి అనుమతి లభించింది. మంత్రదీక్ష కోసం అన్నపూర్ణ తల్లి ఒక బాలికను తోడ్కొని వచ్చింది. ఆమె మాతృదేవితో, “అమ్మా! మీ నుండి మంత్రదీక్ష పుచ్చుకోవాలని ఈమె నన్ను ఎంతగానో వేధిస్తోంది. అందుకే తీసుకొని వచ్చాను” అని చెప్పింది.
మాతృదేవి: ఈ రోజు ఎలా మంత్రదీక్ష ఇవ్వగలను? భోజనం చేసేశానే!
అన్నపూర్ణ తల్లి: కానీ ఈమె ఇంకా భోజనం చేయలేదు. మీరు భోజనం చేసివున్నా పట్టింపు లేదు.
మాతృదేవి: ఈ రోజు మంత్రదీక్ష తీసుకోవాలనే నిర్ణయంతోనే వచ్చిందా?
అన్నపూర్ణ తల్లి: అవునమ్మా. ఆ నిర్ణయంతోనే వచ్చింది.
మంత్రదీక్ష ఇవ్వడానికి మాతృదేవి సమ్మతించారు. దీక్షానంతరం ఆ బాలికను గురించి అన్నపూర్ణ తల్లి ఇలా చెప్పసాగింది: “ఈమె సామాన్యురాలు కాదు. గురుదేవులను గురించి చదవగానే శిరోముండనం చేయించుకొంది. పురుష వేషం ధరించి, తపస్సు చేసుకోవడానికి తిన్నగా వైద్యనాథ్‌కు వెళ్లింది. అక్కడ ఒక అడవిలో నివసించసాగింది. ఈమె తల్లిగారి గురువు ఈమెను గుర్తించి, కొంతకాలం తన సంరక్షణలో ఉంచుకొన్నాడు. పిదప ఈమె తండ్రికి కబురు పంపాడు. ఆ తండ్రి వెళ్లి ఈమెను ఇంటికి తీసుకొని వచ్చాడు.”
మాతృదేవి మౌనంగా అంతా విని, “ఆహా! ఏం భక్తి!” అంటూ వ్యాఖ్యానిం చారు. ఇతరులు, “ఏం ఆశ్చర్యం! ఎంతటి భక్తి ఉత్సాహాలు ఉన్నప్పటికీ ఇంత అందగత్తె అలా ఒంటరిగా వెళ్లవచ్చా?” అన్నారు. “అమ్మో! మా ప్రాంతాల్లో ఇలాంటివి జరిగితే అపవాదు తప్పదు” అంది విభ్రమంగా నళిని.
పై వ్యాఖ్యానాలను ఆ బాలిక, అన్నపూర్ణ తల్లి లేనప్పుడు వెలిబుచ్చారు.
నళిని, నా స్నేహితురాలొకరు తమ భర్తలతో జీవించడం లేదు. వారిని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“భార్య, గోవు, వరిచేను – ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలని గురుదేవులు చెప్పేవారు. ‘మొదట్లో, కంచె వేయకపోతే పశువులు మేసేస్తాయి’ అనేవారాయన.”
మధ్యాహ్న భోజనానంతరం పక్క గదిలో అందరమూ విశ్రాంతి తీసుకొన్నాం. మంత్రదీక్ష పుచ్చుకొన్న ఆ బాలికను కూడా విశ్రాంతి తీసుకోమన్నారు మాతృదేవి. “పగటిపూట నేను పడుకోనమ్మా!” అందామె. నేను ఆమెతో, “మాతృదేవి చెబితే వినాలి” అన్నాను. “అలా అయితే పడుకొంటాను” అని, ఆమె విశ్రాంతి తీసుకొంది. కానీ కొన్ని నిమిషాలలోపే లేచి వసారాలోకి వెళ్లింది. “కాస్త చంచల మనస్కురాలు. అందుకే ఇల్లు వీడి వెళ్లింది” అన్నారు మాతృదేవి.
తరువాత ఆ బాలిక పనిమనిషితో మాతృదేవి, “ఈమె భర్త ఏం చేస్తూంటాడు? అతడు ఎందుకు ఈమెతో కలిసి రాలేదు?” అని అడిగారు. అందుకు ఆమె, “అత డిది స్వల్ప జీతం. ఇంట్లో వేరెవరూ లేరు. ఈమె ఇంట్లో ఒంటరిగా ఉండలేదు కాబట్టి పుట్టింట్లో వదలిపెట్టాడు. శనివారాల్లో వస్తాడు” అని వివరించి చెప్పింది. ఆమె తన భర్తతో, ‘మీరు నా భర్త కారు. జగన్నాథుడైన ఆ భగవంతుడే నా భర్త’ అని చెప్పినట్లుగా అన్నపూర్ణ తల్లి చెప్పింది. ఇదంతా మాతృదేవి మౌనంగా విన్నారు.
పూజ గదికి ఉత్తరం వైపున్న వసారాలో భక్తురాండ్రు బిగ్గరగా మాట్లాడు కొంటున్నారు. అందువలన మాతృదేవి అక్కడ ఉన్న ఒకరితో, “వారిని కాస్త మెల్లగా మాట్లాడుకోమని చెప్పు. శరత్‌కు ఇబ్బంది కలుగుతుంది*” అని చెప్పారు.
గదిలో మరెవరూ లేరు. ఆధ్యాత్మిక సాధనలు, దివ్యదర్శనాల గురించి మాతృదేవిని అడిగితే, ఆమె ఇలా చెప్పారు:
“గురుదేవులకూ, నాకూ మధ్య ఎలాంటి వ్యత్యాసమూ పాటించకు. నీకు ఎప్పుడు ఎలాంటి దర్శనం కలుగుతుందో, అందుకు తగిన రీతిలో ధ్యానం చేయి. ధ్యానంతో పూజ సమాప్తమవుతుంది. ఇక్కడ (హృదయ పద్మంలో) ప్రారంభించి అక్కడ (సహస్రార పద్మంలో) ముగించు. (ఆయా చోట్లను మాతృదేవి సూచించారు.)
“మంత్రం తంత్రం లాంటివి ఏవీ లేవమ్మా! భక్తే ప్రధానం! గురుమా ఆయనే, ఇష్టదైవమూ ఆయనే! ఆయనే సర్వస్వమూ.”
తరువాత గౌరీ మా, దుర్గాదేవుల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ఇద్దరినీ మాతృదేవి ఎంతో శ్లాఘించారు.
“చూడమ్మా! జీవితంలో దెబ్బతిన్న తర్వాత అనేకులు, ‘రామా, రామా’ అని పలువరిస్తారు. కాని బాల్యంలో, మనస్సు తాజాపుష్పంలా ఉన్నప్పుడే దానిని భగ వంతుని పాదపద్మాలకు సమర్పించిన వ్యక్తే భాగ్యశాలి. దుర్గ కొంగ్రొత్త పుష్పంలాంటిది. గౌరీ ఆమెను చక్కగా పెంచింది. ఆమెకు వివాహం చేయడానికి ఆమె సోదరులు శాయశక్తులా ప్రయత్నించారు. గౌరీ ఆమెను ఎక్కడెక్కడో దాచివుంచి చివరకు పూరీకి తోడ్కొని వెళ్లి జగన్నాథునితో పూలమాలను మార్చుకొనేట్లు చేసి, ఆమెకు సన్న్యాసం ఇప్పించింది. ఎంత అదృష్టవంతురాలు ఆమె! చదవనూ, వ్రాయనూ నేర్చుకొంది. సంస్కృత పరీక్షలు వ్రాయడానికి తయారవుతోందని విన్నాను.”
గౌరీ మా యౌవన జీవితం గురించి కూడా అనేక విషయాలు మాతృదేవి చెప్పారు. ఆమె ఎన్నో కష్టనష్టాలు అనుభవించిందని తద్వారా గ్రహించాను.
కాశీని గురించి ప్రస్తావన వచ్చింది. “ఆహా! కాశీలో సంతోషంగా గడిపాను. కానీ నాతోపాటు యదువంశాన్ని* కూడా తీసుకెళ్లాను” అన్నారు మాతృదేవి.
కాసేపటికి నలుగురైదుగురు స్త్రీలు వచ్చారు. వారు కొబ్బరిబోండాలు, పళ్ళు మాతృదేవి పాదపద్మాల వద్ద సమర్పించారు. వారిలో ఒకామె మాతృదేవి పాదాలను స్పృశించాలని ముందుకు వచ్చినప్పుడు మాతృదేవి, “దూరం నుండే నమస్కరించండి” అని చెప్పారు. వాళ్ళు నమస్కరిస్తూన్నప్పుడు కాస్త చిల్లర కూడా మాతృదేవి పాదాల వద్ద సమర్పించబోయారు. కానీ మాతృదేవి వారిని వారించారు. ఏదైనా ఉపదేశం చేయమని వారు ప్రాథేయపడ్డారు. మాతృదేవి చిరునవ్వుతో, “నేనేం ఉపదేశం చేయగలను? గురుదేవుల ఉపదేశాలు పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఆయన ఉపదేశంలో ఒక్కటైనా అవగతం చేసుకుని పాటించగలిగితే సమస్తమూ లభిస్తుంది” అని చెప్పారు. పిదప వారితో మామూలు విషయాలు మాట్లాడారు.
వారు వెళ్ళిపోయిన తరువాత మాతృదేవి, “ఉపదేశాలను అవగతం చేసుకోగల సమర్థత ఉన్నవారు ఎక్కడున్నారు? సమర్థత ఉండాలి, లేకపోతే నిష్ప్రయోజనం” అని అన్నారు.
సంభాషణ కొనసాగింది. గురుదేవుల బంధువైన హృదయ్ తదితరుల ప్రస్తావన వచ్చింది. ఇంతలో అన్నపూర్ణ తల్లి వచ్చి, “అమ్మా! నేనొక కల కన్నాను. అందులో మీరు కనిపించి, ‘నా ప్రసాదం స్వీకరించు. జబ్బు నయమవుతుంది’ అని చెప్పారు. అందుకు నేను, ‘గురుదేవులు నాతో ఎవరు ఆరగించి మిగిల్చిన ప్రసాదాన్నీ తినరాదని నన్ను వారించి ఉన్నారు’ అని చెప్పాను. అయినప్పటికీ మీ ప్రసాదం కొద్దిగా ఇస్తే, నేను సంతోషిస్తాను” అని చెప్పింది. అందుకు మాతృదేవి నిరాకరించారు. కానీ ఆమె పట్టుపట్టింది.
మాతృదేవి: గురుదేవుల మాటను జవదాట గోరుతున్నావా?
అన్నపూర్ణ తల్లి: వారికీ మీకూ మధ్య భేదం చూస్తూన్నంత వరకు మీరన్నది నిజమే. ఇప్పుడు ప్రసాదం ఇవ్వండి.
చివరకు మాతృదేవికి అంగీకరించక తప్పలేదు. కాసేపటి తరువాత ఆమె సెలవు పుచ్చుకొని వెళ్లిపోయింది. గౌరీమా వద్దకు వెళ్లవలసి ఉన్నందున నేను కూడా మరికాసేపటికి సెలవు పుచ్చుకొని బయలుదేరాను.
ఫిబ్రవరి, 1913
శోకహరణ్తో మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. ఉదయకాల పూజ పూర్తయింది. నన్ను చూడగానే, “మంచిది. రామ్మా, నేను జయరాంబాటికి వెళ్లే రోజులో మార్పు వచ్చింది. అవునూ, నువ్వు ఎవరితో వచ్చావు?” అని అడిగారు.
నేను: శోకహరణ్ తీసుకుని వచ్చాడు. చాలా దూరంలో ఉంటున్నానమ్మా! రావడం అంత తేలిక కాదు.
మాతృదేవి: హా! ఎంతో శ్రమపడి తీసుకుని వచ్చాడు! నీ భర్త ఎలా ఉన్నాడు?
నేను: పెద్దగా చెప్పడానికి ఏమీ లేదమ్మా!
కాసేపయ్యాక ఒక ఉత్తరానికి జవాబు వ్రాయమని నాకు చెప్పారు. ఆమె చెబుతూవుంటే నేను వ్రాయసాగాను.
మధ్యాహ్న భోజనానంతరం మాతృదేవి కాసేపు విశ్రాంతి తీసుకొన్నారు. ఇంతలో కొందరు స్త్రీలు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవి విశ్రాంతి తీసుకొంటూనే కుశలప్రశ్నలు వేశారు. వారిలో ఒకామె, “నా వద్ద ఒక మంచి మేక ఉంది. రెండు సేర్ల పాలిస్తున్నది. మూడు పిచ్చికలూ ఉన్నాయి. వీటితోనే నేను రోజులు వెళ్లదీస్తున్నాను. నాకు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది” అని చెప్పింది. ‘ఒక పిల్లిని పెంచేటట్లుగానైనా చేసి మహామాయ మనలను లౌకిక బంధాలలో కూరుకుపోయేలా చేస్తుంది’ అనే గురుదేవుల వచనాలు నాకు జ్ఞప్తికి వచ్చాయి. మాతృదేవి, “అవును, అవును” అంటూ ఆమె మాటలనన్నింటిని ఆలకించారు.
ఆ! మాతృదేవీ! మీరు ఎన్ని కష్టాలను సహించాల్సి వస్తోంది. ఇలా మీ విశ్రాంతి సమయంలో కూడా మీ వద్దకు వచ్చి అనవసరపు మాటలనే కదా మాట్లాడుతున్నాం!
సాయంత్రం సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాను.
సెప్టెంబర్, 1913
ఫిబ్రవరి 26 వ తేదీన మాతృదేవి జయరాంబాటికి వెళ్లారు. దుర్గాపూజకు కాస్త ముందుగా సెప్టెంబర్‌లో కలకత్తాకు తిరిగి వచ్చారు.
ఒక రోజు మధ్యాహ్నం మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడు ఒక స్త్రీ మాతృ దేవి పాదాలపై వ్రాలి తనకు మంత్రదీక్ష అనుగ్రహించమని కన్నీరుమున్నీరై విల పించసాగింది. అప్పుడు మాతృదేవి మంచం మీద కూర్చొని ఉన్నారు. ఆ స్త్రీకి మంత్రదీక్ష ఇవ్వడం మాతృదేవికి సుతరామూ ఇష్టం లేదు. “నిన్ను రావద్దని ఇంతకు మునుపే చెప్పాను. ఇప్పుడు కుదరదు” అని ఆమెతో నిష్కర్షగా మాతృదేవి చెప్పారు. కానీ ఆమెది పట్టిందేపట్టుగా ఉంది. దాంతో మాతృదేవి చికాకుపడి, “మీకేం? మంత్రం పుచ్చుకొని వెళ్లిపోతారు. ఆ తరువాత?” అన్నారు. కానీ ఆమె వదలిపెట్టేటట్లుగా లేదు. మాకే విసుగనిపించింది. చివరకు మాతృదేవి, “తర్వాత రా” అని చెప్పారు. వెంటనే ఆమె, “అలా అయితే మీ బిడ్డలైన సన్న్యాసులలో ఒకరితో చెప్పండి” అన్నది.
మాతృదేవి: వారికి నేను చెప్పింది వినాల్సిన అవసరం లేదు.
ఆ స్త్రీ: ఏమిటమ్మా మీరంటున్నారు? మీ మాటలు వినరా?
మాతృదేవి: ఈ విషయంలో వినక పోవచ్చు.
ఆమె అంత తేలికగా వదిలే మనిషిగా లేదు. చిట్టచివరకు మాతృదేవి, “సరే, ఖోఖాతో చెప్తాను. ఆయన మంత్రదీక్ష ఇస్తాడు” అని చెప్పారు. కానీ మళ్లీ ఆ స్త్రీ పాత పాటే పాడుతూ, “మీ వద్ద మంత్రదీక్ష పుచ్చుకొంటేనే శుభం జరుగు తుంది. మీరు తలచుకొంటే దీక్ష ఇవ్వగలరు” అని అంది. తరువాత ఒక పది రూపాయల నోటు తీసి, “ఈ డబ్బు ఉంచండి. కావలసిన వాటిని కొనుక్కోవచ్చు” అన్నది. ఆమె దుడుకుతనానికి మాకే సిగ్గేసింది. కోపం కూడా వచ్చింది. ఈసారి మాతృదేవి కోపంతో, “ఏమిటి? డబ్బుతో నన్ను ప్రలోభపెట్టాలని చూస్తున్నావా? డబ్బుకు నేను దాసురాలను కాను. వెళ్లు! డబ్బు కూడా పట్టుకుపో” అంటూ గట్టిగా చెప్పి లేచి వెళ్ళిపోయారు. కానీ ఆమె తన పట్టువిడవకుండా మాతృదేవికి మొరపెట్టుకొని, మహాష్టమి నాడు మంత్రదీక్ష ఇవ్వడానికి సమ్మతింపజేసి ఆ తరువాతే సెలవు పుచ్చుకొని వెళ్ళింది.
పిదప మాతృదేవి పక్క గదిలో కూర్చొని నన్ను పిలిచారు. “రామ్మా! ఈ గది లోకి రా! ఇంతదాకా నీతో ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీలుపడలేదు. ఎలా ఉన్నావు?” అని అడిగారు.
సాయంకాలమైంది. దుర్గాపూజ ఉత్సవాలు కావడంతో పలువురు భక్తురాండ్రు చీరలు, మధురభక్ష్యాలు తీసుకువచ్చారు. వారు అడిగిన ప్రశ్నలకు మాతృదేవి చిరు నవ్వుతో బదులు చెప్పారు. మంచి ఎండాకాలం! నేను మాతృదేవికి విసురుతున్నాను. ఒక భక్తురాలు నా నుండి విసనకర్ర పుచ్చుకొని తాను విసరసాగింది. మాతృదేవికి అతిస్వల్ప సేవ చేయడంలో కూడా భక్తురాండ్రకు ఎంత ఆనందమో!
ఆహా! ప్రేమతోను, కరుణతోను మాతృదేవి మమ్మల్ని శాశ్వతమైన అను బంధ్ంతో కట్టివేశారు కదా! సంసార తాపంతో వాడిపోతున్న జనానికి ఉద్బోధన్లో మాతృదేవి నిలయం ఎటువంటి ప్రశాంతనిలయంగా రూపొందిందో మాటల్లో చెప్పడమూ, గ్రహించేలా చేయడమూ శక్యమా!
నేను ఇక బయలుదేరే వేళ అయింది. మాతృదేవికి ప్రణామం చేసి, “అమ్మా, త్వరలో ఒకసారి పుట్టిం టికి వెళ్లాలనుకొంటున్నాను” అని చెప్పాను. మాతృదేవి ఆప్యా యంగా, “మళ్లీ త్వరగా రా! ఉత్తరం రాయి” అన్నారు. మాతృదేవి కోసం ఒక చీర తెచ్చాను. “నువ్వు తెచ్చిన చీరను చూపించి వెళ్లు. దానిని ధరిస్తాను” అన్నారు మాతృదేవి.
నవంబర్, 1913
రెండున్నర నెలల తరువాత మాతృదేవి దర్శనార్థం వెళ్లాను.
మేడమెట్లు ఎక్కి వెళ్లగానే స్నానాల గదిలో వారిని దర్శింప గలిగాను. వారుబట్టలు ఉతుకుతున్నారు. సగం తడిసిన బట్టలతోనే నా వద్దకు వచ్చి, “ఏమమ్మా!చాలా రోజులుగా రాలేదే?” అని అడిగారు. బట్టలు ఉతకడం పూర్తిచేసి వచ్చిమంచం మీద కూర్చున్నారు. మాటవరుసకు ఆ రోజు మంత్రదీక్ష కోసం గొడవచేసిన స్త్రీ గురించి, “అమ్మా! ఆ రోజు ఒకామె దీక్ష పుచ్చుకోవాలని అడిగింది కదా! ఆ తరువాత ఏమైంది?” అని అడిగాను.
మాతృదేవి: నిర్ణయించిన రోజు ఆమె రాలేకపోయింది. ‘నా ఆరోగ్యం కుదుటపడ్డాక పుచ్చుకో’ అని చెప్పాను. మహాష్టమి రోజు ఆమెకే ఒంట్లో బాగాలేనందున ఇక్కడకు రాలేకపోయింది. చాలా రోజులు గడిచాక వచ్చింది. దీక్ష కూడా పుచ్చుకొంది.
నేను: అది సరేనమ్మా! మీరు చెప్పినట్లే జరుగుతుంది. మీ ఇచ్ఛకు మారుగా జరిగితే మేం దుఃఖాలు అనుభవిస్తాం. అనేక సందర్భాలలో మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా కరుణించి మాకు మంత్రదీక్ష అనుగ్రహించారు. అందువలన కష్టాలుకూడా అనుభవిస్తున్నారు.
మాతృదేవి: అవును, గురుదేవులు కూడా అలాగే చెప్పేవారు. లేకుంటే ఈశరీరం ఎందుకు వ్యాధిగ్రస్తమవుతుంది. ఈ మధ్య కలరా లాంటి ఏదో వ్యాధితో బాధపడ్డాను.
నా మరదలు కూడా నాతో వచ్చింది. ఆమెను గురించి మాతృదేవి ఇలా అన్నారు: “ఈమె శాంత స్వభావురాలు. ఒకే కూర; దాన్లో ఉప్పు సరిగా వేయకుంటే అంతా వ్యర్థమే.” అంటే, నాకు ఒకే మరదలు. ఆమె కూడా సజ్జనురాలు కాకపోతే నా జీవితం దుఃఖభరితమైపోతుందని మాతృదేవి మాటలకు అర్థం.
ఫిబ్రవరి, 1914
ఉదయం మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. తోట నుండి బోలెడన్ని పువ్వులు సేకరించి తీసుకువెళ్లాను. ఆ పువ్వులను ఇచ్చినప్పుడు మాతృదేవి ఎంతో సంతో షించారు. వాటితో గురుదేవుల ఛాయాచిత్రాన్ని అలంకరించసాగారు. వాటిలో కొన్ని నీలం రంగు పువ్వులు ఉన్నాయి. వాటిని చేతుల్లో పుచ్చుకొని ఇలా అన్నారు:
“ఆహా! ఏం రంగో చూడమ్మా. దక్షిణేశ్వరంలో ఆషా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె ఒక రోజు ఆలయ ఉద్యానానికి వచ్చింది. నల్లని ఆకులున్న ఒక చెట్టుకు ఒక ఎర్ర పువ్వు! దాన్ని కోసి చేతిలో ఉంచుకొని, ‘ఆహా! నల్లని ఆకులున్న ఈ చెట్టుకు ఇంతటి ఎర్రని పుష్పమా! భగవంతుడా, నీ సృష్టి ఎంత అద్భుతం!’ అంటూ కన్నీరుమున్నీరు కాసాగింది. అది చూసి గురుదేవులు ఆమెతో, ‘ఏమమ్మా, నీకు ఏమైంది? ఎందుకిలా విలపిస్తున్నావు?’ అని అడిగారు. ఆమె నోట మాటరాలేదు. ఏడుస్తూనే ఉంది. చివరకు గురుదేవులు ఏవేవో చెప్పి ఆమెను ఓదార్చారు. ఆహా! ఈ పువ్వుల నీలి రంగు చూడు. అందమైన పువ్వులే లేకపోతే మనం భగవంతుణ్ణి ఎలా అలంకరించగలం?”
తరువాత చేతుల నిండుగా పువ్వులు తీసుకొని గురుదేవులకు అర్పించారు. దానికి ముందే కొన్ని పువ్వులు మాతృదేవి పాదాల మీద పడ్డాయి. “హా! అర్పించ డానికి ముందే నా పాదాల మీద పడ్డాయే!” అన్నారు. “చాలా మంచిదయింది” అన్నాను నేను. ‘మీకు గురుదేవులే ఉన్నతులై అలరారుతున్నారు. కానీ మాకు మీరిద్దరూ ఒక్కటే’ అని అనుకొన్నాను.
ఇంతలో ఒక వితంతువు వచ్చింది. ఆమెను గురించి మాతృదేవిని అడిగాను. ఆమె ఇలా చెప్పారు:
“కొన్ని నెలల క్రితం ఆమె మంత్రదీక్ష పుచ్చుకొంది. అంతకు మునుపు మరో గురువు వద్ద మంత్రోపదేశం పొందింది. మనస్సులోని మాయను చూడు! మళ్లీ మంత్రదీక్ష కోసం ఇక్కడకు వచ్చింది. గురువులందరూ ఒక్కటే. ఈ విషయం ఆమె గ్రహించలేదు.”
మధ్యాహ్న భోజనానంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కామార్పు కూర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“కడుపు నొప్పి కారణంగా గురుదేవులు కామార్పుకూర్కు వచ్చినప్పుడు నేను బాలికను. ఉదయం లేవగానే ఆయన ఆ రోజు ఫలానాది వండమని నాతో చెప్పేవారు. మేం కూడా ఆ వంటకాలే వండేవారం. ఒక రోజు పోపుకు మసాలా దినుసులు* నిండుకున్నాయి. అప్పుడు అక్కయ్య* , “లేకపోతే పోనీ! అవి లేకుండానే వంట చేద్దాం” అని చెప్పారు. ఆ మాటలు గురుదేవుల చెవినపడ్డాయి. ఆయన నన్ను పిలిచి ఇలా అన్నారు: ‘అదేం వంటమ్మా! ఏ ఏ దినుసులు చేర్చాలో అవి చేర్చకుంటే వంట ఎలా ఉంటుంది? ఒక పైసాకు మసాలా దినుసులు తెమ్మను. ఈ సుగంధ ద్రవ్యాల ఘుమ ఘుమ కోసమే నేను దక్షిణేశ్వరం నుండి ఇక్కడకు వచ్చాను. మీరేమో అవేవీ చేర్చకుండానే వంటచేసే ప్రయత్నంలో ఉన్నారు.’ అక్కయ్య సిగ్గుపడిపోయింది. వెంటనే మనిషిని పంపి మసాలా దినుసులు తెప్పించారు.
“భైరవీ బ్రాహ్మణి కూడా ఆ సమయంలో అక్కడ బసచేసి ఉన్నారు. గురుదేవులు ఆమెను, ‘అమ్మా’ అని సంబోధించేవారు. నేను కూడా ఆమెను సొంత అత్తగారిలానే భావించాను. ఆమెపట్ల నాకు కాస్త జంకు ఉండేది. ఆమె బాగా కారం తినేవారు. ఆమే స్వయంగా వంట చేసుకొనేవారు. నాకూ తినడానికి ఇచ్చేవారు. ఆమె వేసిన కారానికి నా నాలుక భగ్గున మండి, కళ్లలో నీళ్లు వచ్చేవి. ఒక పక్క కన్నీళ్లు తుడుచుకొంటూనే తినేదాన్ని. ‘ఎలా ఉంది?’ అని ఆమె అడిగేవారు. భయంతో, ‘బాగుంది’ అని బదులు చెప్పేదాన్ని. రామ్‌లాల్ తల్లి, ‘అబ్బా! కారం విపరీతం’ అనేవారు. ఆ జవాబు బ్రాహ్మణికి నచ్చేది కాదు. ‘శారదను చూడు. బాగుందని చెప్పింది. నీకు ఏదీ నచ్చదు. ఇకపై నా వంటకాన్ని ఏదీ నీకు ఇవ్వను’ అనేవారు ఆమె.”
ఇలా చెబుతూ మాతృదేవి హాయిగా నవ్వారు.
మళ్లీ పువ్వుల గురించిన ప్రస్తావన రాగా మాతృదేవి ఇలా అన్నారు:
“నేను దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఎర్రని పువ్వులు, మల్లె పువ్వులు కలిపి గుచ్చి ఏడు పేటల పెద్ద దండగా కట్టాను. సాయంకాలం ఆ దండను నీళ్లలో ముంచి ఉంచాను. దండలోని మొగ్గలు చక్కగా విచ్చుకొన్నాయి. దేవికి అలంకరించడానికి ఆ దండను కాళికాలయానికి పంపాను. ఆభరణాలను తీసివేసి, కాళీమాత విగ్రహాన్ని ఆ దండతో అలంకరించారు. అప్పుడు గురుదేవులు దేవీదర్శనార్థం ఆలయానికి వెళ్లారు. దేవిని దర్శించి ఆయన పరవశించిపోతూ, ‘ఆహా! దేవి నల్లని కంఠంలో ఈ పువ్వులహారం ఎంత శోభాయమానంగా ఉంది! ఈ మాలను ఎవరు కట్టారు?” అని అడిగారు. అక్కడున్న ఎవరో దాన్ని నేనే కట్టా నని చెప్పారు. వెంటనే ఆయన, ‘ఆమెను ఒకసారి ఇక్కడకు పిలుచుకు రండి. మాలను అలంకరించుకొని జగజ్జనని ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నదో ఆమె కూడా చూస్తుంది’ అని చెప్పారు. పనిమనిషి బృంద వచ్చి నన్ను తీసుకొని వెళ్లింది.
“ఆలయ సమీపానికి వెళ్లి చూడగా అక్కడ బలరాంబాబు, సురేన్బాబు తదితరులు నిలబడి వున్నారు. ఎక్కడకు వెళ్లి దాక్కోగలను? బృంద చీర కొంగుతో నన్ను కప్పుకొని ఆలయం వెనుక ఉన్న మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాను. అమ్మో! అది కనిపెట్టిన గురుదేవులు నన్ను పిలిచి, ‘ఆ మెట్లు ఎక్కి రావద్దు. గతంలో ఓ రోజు ఒక బెస్త పడుచు ఆ మెట్లెక్కుతూ జారి కిందపడి, చివరకు చనిపోయింది. ముందున్న మెట్లు ఎక్కి రా’ అని చెప్పారు. ఆయన మాటలు వినగానే బలరాంబాబు తదితరులంతా పక్కకు తప్పుకొన్నారు. నేను ఆలయంలోకి వెళ్లేసరికి గురుదేవులు దేవి సన్నిధిలో నిలబడి భావపారవశ్యంతో పాడుతున్నారు.”
అప్పుడు కొందరు భక్తురాండ్రు రావడంతో ఈ సంభాషణ ఆగిపోయింది. నేను సెలవు పుచ్చుకొని వెళ్లే సమయమైంది. బట్టలు ఉతికి వచ్చాక ఒక వస్తువు ఇస్తానని మాతృదేవి చెప్పారు.
ముక్తి గురించి సంభాషణ సాగింది. మాతృదేవి ఇలా అన్నారు: “అసలు విషయం ఏమిటో తెలుసా? అది బిడ్డ చేతిలోని మిఠాయి వంటిది. ‘అది ఇవ్వు’, ‘అది ఇవ్వు’ అని ఎందరో బిడ్డను అడుగుతారు. కానీ ఆ బిడ్డ వారికి ఇవ్వనే ఇవ్వదు. కానీ ఎవరైనా తనకు నచ్చితే వారికి ఠక్కున ఇచ్చేస్తుంది. యావజ్జీవితం ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి సాధనలు చేస్తాడు. అతడికి ఏమీ లభించదు. మరొకడు ఇంట్లో ఊరకే ఉండిపోతాడు. అతడికి లభిస్తుంది. భగవత్కృప కలగటం వలన, వెంటనే అతడు లబ్ధిపొందాడు. భగవత్కృప అనేది అతి ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి.”
ఇలా చెప్పి మాతృదేవి బట్టలు ఉతకడానికి వెళ్లిపోయారు.
సాయంకాల నివేదన పూర్తయింది. నాకు ఇస్తానని చెప్పిన దానిని ఇచ్చారు. మంత్రం లిఖీంచబడిన బిల్వపత్రం అది. నాకు ఇస్తూ, “తాయెత్తు చేయించి ధరించు. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు. తెలిస్తే అందరూ నా ప్రాణాలు తోడేస్తారు” అని చెప్పారు.
బాలీగంజ్‌లోని మా ఇంటికి మాతృదేవి వచ్చే విషయం గురించి ప్రస్తావిం చాను. “అవును, వస్తున్నాను” అని అన్నారు. తరువాత నాతో, “నాకు వెదురు చాప ఒకటి తీసుకురా, వాడుకొంటాను” అని చెప్పారు. అందుకు నేను, “తప్పకుండా తీసుకువస్తానమ్మా, అది నా భాగ్యం” అని అన్నాను. పిదప మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకొన్నాను. “మళ్లీ రా” అన్నారు నాకు వీడ్కోలిస్తూ.
మే, 1914
నేడు మాతృదేవి బాలీగంజ్‌లోని మా ఇంటికి విచ్చేశారు. నిన్నటి నుండే అందుకు ఏర్పాట్లు జరిగాయి. మాతృదేవి కోసం ప్రత్యేకంగా ఆసనం, భోజనం చేయడానికి తెల్ల పింగాణీ పాత్రలు మొదలైనవి కొన్నాం. మాతృదేవి విచ్చేస్తున్నా రనే ఆనందంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మధ్యాహ్నానికి మాతృదేవి వచ్చేట్లు ఏర్పాట్లు చేశాం. ఒక వేళ మాతృదేవి బయలుదేరే సమయంలో మార్పుంటే ఆమెకు అసౌకర్యం కలుగకుండా ఉదయం నుండే బండితో పాటు శోకహరణ్ మాతృదేవి ఇంటి వద్ద వేచివున్నాడు. మేం కూడా ఇంటి పనులన్నింటినీ ఉదయానే పూర్తిచేసి సిద్ధంగా ఉన్నాం. మాతృదేవి కోసం ఆసనం అమర్చి, నాలుగు వైపులా పూలతో అలంకరించాను. ఇల్లంతా గంగాజలాన్ని చిలకరించాను. ఒక పూల దండను కట్టించాను. రెండు పూల చెండ్లు చేసి, మాతృదేవి ఆసనానికి చెరొక వైపు ఉంచాను.
మాతృదేవి రాక కోసం ఎదురుతెన్నులు చూడసాగాను. ఇంతలో ఆ సమయం ఆసన్నమైంది. బండి శబ్దం వినగానే అందరమూ క్రిందికి దిగివచ్చాం. బండి ఆగింది. మాతృదేవి ప్రసన్న వదనంతో, కరుణా పూరిత నయనాలతో మమ్మల్ని చూశారు. ఆమె బండి నుండి దిగగానే అందరమూ వెళ్లి ఆమెకు పాదాభివందనం చేశాం.
మాతృదేవితోపాటు గోలాప్ మా, నళిని, రాధూ, నలుగురైదుగురు సన్న్యాసులు బ్రహ్మచారులు వచ్చారు. మాతృదేవిని మేడ మీదకు తీసుకొని వెళ్లి, ఆసీనురాలను చేసి ప్రణామాలు చేశాం. “భోజనం చేశావా? త్వరగా రావాలని ఎంతో ఆదరాబాద రాగా బయలుదేరాను. అయినప్పటికీ ఇంత ఆలస్యం అయిపోయింది” అంటూ నా చుబుకాన్ని స్పృశించి ఆశీర్వదించారు. వంట అంతా పూర్తయింది. కానీ భోజ నానికి సముచిత ఏర్పాట్లు చేయాలి. ఒక కూర వండాలి. అందువలన ఎక్కువసేపు మాతృదేవి వద్ద గడపలేకపోయాను.
మేడ మీద గ్రామఫోన్ పాడుతోంది. పనులకు మధ్య కాస్త తీరిక చేసుకొని మాతృదేవిని చూడసాగాను. ఒక యంత్రం పాడడం చూసి మాతృదేవి ఎంతో ఆశ్చర్యపోయారు. “ఎంత వింత యంత్రాలను తయారుచేస్తున్నారు” అంటూ ఆమె చిన్న పిల్లలా తెగ మురిసిపోయారు.
అది మంచి ఎండా కాలం. మాతృదేవి వసారాలో వెదురు చాప వేసుకొని పడుకొన్నారు. ఆమె ప్రక్కన భక్తురాండ్రు కూర్చుని ఉన్నారు. ఒక రాతి పాత్రలో చల్లటి నీళ్లున్నాయి. అప్పుడప్పుడు మాతృదేవి ఆ నీటిని త్రాగుతున్నారు. నన్ను చూడగానే, “రామ్మా! కొంచెం ఈ చల్లటి నీళ్లు త్రాగు” అని చెప్పారు. మాతృదేవి ప్రసాదంగా కొంచెం నీరు త్రాగి హడావిడిగా క్రింది వంటగదికి వెళ్లాను. ఎంత వేగంగా పనులు చేస్తున్నప్పటికీ ఈ రోజు అవి పూర్తయ్యేటట్లు లేవు.
సాయంకాలం గడిచాక ప్రక్క గదిలో నైవేద్యానికి ఏర్పాట్లు చేశాం. గోలాప్ మాను నైవేద్యం అర్పించమని మాతృదేవి చెప్పారు. అందుకు ఆమె, “మీరే చేయండి. మీరు ఉండగా నేను నైవేద్యం చేయడమా?” అన్నది. వెంటనే మాతృదేవి నైవేద్యం అర్పించడానికి ఉపక్రమించారు. “ఆహా! ఎంత పొందికగా అన్నీ అమర్చారు” అంటూ ఆమె ప్రశంసించారు.
ఈ విధంగా ప్రతి దానిని మాతృదేవి శ్లాఘించడం చూసిన మా ఆనందానికి అవధులు లేకుండాపోయింది.
నైవేద్యం పెట్టడం పూర్తికాగానే మాతృదేవీ, ఇతరులూ భోజనానికి కూర్చు న్నారు. ముందు మాతృదేవి భోజనం ముగించారు. పిదప వసారాలో వున్న వాలు కుర్చీలో కూర్చుంటూ నన్ను పిలిచి, “నాకొక తమలపాకు చిలక చుట్టి ఇవ్వు” అని అడిగారు. అప్పుడు నేను గోలాప్ మాకు వడ్డిస్తున్నాను. వెంటనే వెళ్లి ఒక తమలపాకు చిలక చుట్టి మాతృదేవికి ఇచ్చాను. ఆమె అడిగి మరీ పుచ్చుకోవాల్సి వచ్చిందని బాధపడ్డాను. అందువలన సుమతితో, “తమలపాకు చిలకలు చుట్టి నువ్వు సిద్ధంగా నిలబడి ఉండవలసింది కదా! నేను లోపల వడ్డిస్తూ ఉండడం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా!” అని అన్నాను.
కాసేపటికి మాతృదేవి కుళాయి వద్దకు వెళ్లారు. దీపం పుచ్చుకొని దారి చూపుతూ నేను వెంటవెళ్లాను. తోటదారిలో రెండు వైపులా క్రోటన్ మొక్కలు పెరిగి ఉన్నాయి. నేను, మాతృదేవి తప్ప మరెవరూ లేరు. “పని ఒత్తిడి వలన కాసేపు కూడా నీతో కూర్చోవడానికి వీలుపడలేదు. అక్కడికి వెళ్లు. మీ అమ్మను తోడ్కొని వెళ్లు” అన్నారామె నాతో. అప్పుడు మా అమ్మ అక్కడకు వచ్చింది. ఆమెకూ మాతృదేవి దర్శన భాగ్యం కలిగింది.
మాతృదేవి బయలుదేరే సమయమైంది. కారులో వెళ్లడానికి సామాన్యంగా మాతృదేవి ఇష్టపడరు. ఒకసారి రథోత్సవానికి కారులో పోతున్నప్పుడు ఆ కారు క్రిందపడి ఒక కుక్కకు దెబ్బ తగలడమే అందుకు కారణం. కానీ ఇక్కడ నుండి మాతృదేవి ఇల్లు చాలా దూరంలో ఉంది. కారులో వెళ్లకపోతే ఎంతో ఆలస్యమవు తుంది, పైగా శ్రమ కూడా. అందరూ కలిసి మాతృదేవిని ప్రార్థించడంతో ఆమె చివరకు అంగీకరించారు. అందరినీ ఆశీర్వదించి ఆమె కారులో ఎక్కారు.
ఒక రోజు రాత్రిపూట మాతృదేవి దర్శనానికి వెళ్లాను. అప్పుడు ఆమె పడు కొని ఉన్నారు. మరొక స్త్రీ ప్రక్కన కూర్చొని ఉంది. నేను ప్రణామం చేస్తానని లేచి కూర్చున్నారు. నేను ప్రణామం చేయగానే క్షేమసమాచారాలు విచారించి మళ్లీ పడుకొన్నారు. కాళ్లు ఒత్తమన్నారు. తరువాత మాతృదేవి ఇలా అన్నారు:
“వినవమ్మా! సృష్టి ప్రారంభంలో సత్వగుణంతోనే బ్రహ్మ అందరినీ సృజించాడు. అందువలన జన్మతః వారికి జ్ఞానం అబ్బింది. ‘సంసారం అనిత్య’ మనే సత్యాన్ని వారు గ్రహించారు. వెంటనే భగవంతుని పావననామాన్ని జపిస్తూ తపస్సు చేయడానికి వెళ్లిపోయారు. ముక్తిని సైతం పొందారు. బ్రహ్మదేవుడు అది చూశాడు. సృష్టి పరమలక్ష్యం ఈడేరకుండా పోయింది, వీరితో సృష్టిలీల కొనసాగించడం సాధ్యం కాదు, కనుక సత్వగుణంతోపాటు రజస్తమో గుణాలను అధికపాళ్లలో మేళవించి మానవులను సృజించసాగాడు. ఈ సృష్టిలీల కొనసాగింది.”
పిదప సృష్టిని గురించి ఒక చక్కని శ్లోకం ఉదాహరించి, మళ్లీ ఇలా అన్నారు:
“మా బాల్యంలో వీథి నాటకాలలో ఇటువంటివి పాడేవారు. మేం చాలా వినివున్నాం. కానీ ప్రస్తుతం ఇవన్నీ అపురూపమైపోయాయి.”
అక్కడ కూర్చున్న స్త్రీ లేచి ప్రక్క గదిలోకి వెళ్లి నళినీ, మాకూలతో కలిసి ఒక పుస్తకాన్ని బిగ్గరగా చదవసాగింది. అది విని మాతృదేవి, “ఎంత బిగ్గరగా చదువుతున్నదో చూడు! క్రింద చాలామంది ఉంటారనే విషయమే విస్మరించారు” అని వ్యాఖ్యానించారు.
ఇంతలో రాధూ తల్లి వచ్చి, “లక్ష్మీమణి వాళ్లు నవద్వీపం వెళుతున్నారు. నేనూ వాళ్లతో వెళ్ళాలనుకొంటున్నాను. నువ్వే వెళ్లనివ్వడం లేదు” అంటూ కోపంగా బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత మాతృదేవి ఇలా అన్నారు: “ఈమెను ఎలా పంపగలను? లక్ష్మి భక్తురాలు. ఇతరులతో పాడుతుంది, నృత్యం చేస్తుంది. కులం పట్టింపు లేకుండా ఇతరులతో సహపంక్తి భోజనం కూడా చేయవచ్చు. కానీ రాధూ తల్లికి ఇవేవీ అర్థంకావు. భక్తులు తమ మధ్య కుల నియమాలను పాటించరని ఈమెకు అవగతం కాదు. తిరిగి వచ్చాక ఇతరుల ముందు లక్ష్మి ప్రవర్తనను వ్యాఖ్యానిస్తుంది. అవునూ, ఇంతకీ నువ్వు లక్ష్మిని చూశావా?
నేను: లేదమ్మా.
మాతృదేవి: ఆమె దక్షిణేశ్వరంలో ఉంటున్నది. ఒకసారి వెళ్లి చూడు. దక్షి ణేశ్వరం వెళ్లివున్నావు కదా!
నేను: అవునమ్మా! చాలాసార్లు వెళ్లివున్నాను. కాని లక్ష్మి అక్కడ నివసిస్తూన్న విషయం నాకు తెలియదు.
మాతృదేవి: దక్షిణేశ్వరంలో నేను నివసించిన నహబత్తును చూశావా?
నేను: అవును, బయట నుండి చూశానమ్మా!
మాతృదేవి: లోపలికి వెళ్లి చూడు. నా ప్రపంచం అంతా ఆ చిన్నగదే! గురుదేవుల కోసం చేపలను మట్టికుండలో అక్కడే ఉంచేదాన్ని.
తొలుత కలకత్తాకు రావడానికి మునుపు నేను నీటి కుళాయిలను చూసింది లేదు. మొట్టమొదటిసారి నీటి కుళాయిని తెరిచాను. అమ్మో! దాన్లోనుండి పాము బుసకొట్టినట్లు బుస్ బుస్ అంటూ శబ్దం వచ్చింది. అంతే, అక్కణ్ణుండి ఒక్క పరుగున బయటకు వచ్చి, ‘త్వరగా రండి, నీటి కొళాయిలో పాము ఉంది. అది బుసకొడుతున్నది. వెంటనే రండి’ అంటూ కేకపెట్టాను. అక్కడున్న స్త్రీలు నవ్వుతూ, ‘వెర్రిదానా! అది పాము కాదు, భయపడవద్దు. నీళ్లు రావడానికి ముందు అలాగే శబ్దం వస్తుంది’ అని చెప్పారు. నేను కూడా కడుపుబ్బ నవ్వాను.
ఇలా చెబుతూ మాతృదేవి ఆహ్లాదంగా నవ్వారు. కల్లాకపటం లేని స్వచ్ఛమైన నవ్వు అది! నేను కూడా నవ్వును ఆపుకోలేక నవ్వసాగాను. ‘నిష్కాపట్యానికి సార్థక నామధేయురాలు మాతృదేవి’ అని అనుకొన్నాను.
మాతృదేవి: బేలూర్ మఠంలో గురుదేవుల జన్మదినోత్సవాలు చూశావా?
నేను: లేదమ్మా! బేలూర్ మఠానికి ఎన్నడూ వెళ్లింది లేదు. అక్కడ సాధువులు మఠంలో స్త్రీలు గుమికూడడాన్ని ఇష్టపడరని విన్నాను. అందువలన అక్కడకు వెళ్లడానికి సంకోచంగా ఉంటుంది.
మాతృదేవి: ఒకసారి వెళ్లిరా! గురుదేవుల జన్మదినోత్సవాలలో పాలు పంచుకో.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. వీథివైపువున్న వసారాలో తమ ఆసనాన్ని పరచమనీ, జపమాల సంచీని పట్టుకురమ్మనీ మాతృదేవి నాతో చెప్పారు. పిదప జపం ప్రారంభించారు. మెల్లగా రాత్రి కాసాగింది.
వీథికి అటువైపు ఉన్న మైదానంలో కొంతమంది కూలీవారు జీవిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి, ఒక స్త్రీని – బహుశా భార్య అయి వుంటుంది – చావబాదు తున్నాడు. దెబ్బలు ఎడాపెడా పడుతున్నాయి. చివరకు ఆమెను ఒక్క ఉదుటున తన్నాడు. ఆ తన్నుకు ఆమె చంటిబిడ్డతో సహా అల్లంత దూరంలో పడింది. అప్పటికీ వదిలిపెట్టకుండా ఆమెను హింసించసాగాడు.
ఆపైన మాతృదేవి సహించలేకపోయింది. జపాన్ని అర్ధంతరంగా ఆపి, లేచారు. లజ్జనే మేలిముసుగుగా ధరించిన వ్యక్తి మాతృదేవి. మేడ క్రింద ఉన్నవారికి సైతం వినబడేటట్లు కూడా బిగ్గరగా మాట్లాడని మాతృదేవి ఇనుపకమ్ములను పుచ్చు కొని బిగ్గరగా, “ఓరీ ధూర్తుడా! ఆమెను ఏకంగా చంపబోతున్నావా? ఇప్పటికే ఆమె ప్రాణాలు పోయివుంటాయేమోనని భయపడుతున్నాను” అని కేకపెట్టారు. అతడు వెనక్కు తిరిగి చూశాడు. అంతే, పాములవాడి ముందు మంత్రముగ్ధమయ్యే పాములా స్తంభించిపోయాడు. కొట్టడం ఆపాడు. మాతృదేవి సానుభూతి చూసి ఆ స్త్రీ బిగ్గరగా విలపించసాగింది. సమయానికి వంట చేయకపోవడమే ఆమె చేసిన ఏకైక పొరపాటు అని తదనంతరం తెలియవచ్చింది. కాసేపటికి అతడు శాంతించి, మామూలు మనిషయ్యాడు. మేం కూడా గదిలోకి వెళ్లిపోయాం.
మరికొంతసేపటికి వీథిలో భిక్షగాడి కంఠం వినిపించింది. “రాధాగోవిందా, రాధే రాధే! గ్రుడ్డివాడి పట్ల దయ చూపండి” అని అతడు అరుస్తున్నాడు. అది విని మాతృదేవి ఇలా అన్నారు:
“ప్రతి రోజూ రాత్రి ఇతడు ఇటువైపే వెళతాడు. మొదట్లో అతడు, ‘ఈ గ్రుడ్డివాడిపై దయ చూపండి’ అంటూ యాచించేవాడు. కానీ గోలాప్ మా ఒక రోజు అతడితో, ‘దానితోపాటు రాధాగోవిందా అనే భగవంతుని పవిత్రనామాన్ని జతచేసి చెప్పు. గృహస్థుల చెవులలో కూడా భగవన్నామం వినిపించనీ. నువ్వు నామజపం చేసినట్లవుతుంది. లేకపోతే గ్రుడ్డివాణ్ణి అనే సదా భావిస్తూ ఉంటావు’ అని చెప్పింది. గోలాప్ మా చెప్పింది మంచిదే అయింది. అప్పటి నుండి అతడు ఇటువైపు వెళుతూన్నప్పుడల్లా, ‘రాధాగోవిందా’ అంటూనే యాచిస్తాడు. గోలాప్ అతడికి ఒక వస్త్రం ఇచ్చింది, డబ్బు కూడా ఇచ్చింది.”
ఒక రోజు సాయంత్రం వేళ మాతృదేవిని చూసే నిమిత్తం వెళ్లాను. అమ్మ అప్పుడు ఇలా చెబుతున్నారు:
“కొత్తగా వచ్చే భక్తులకు పూజామందిరంలో సేవ చేసే అవకాశం కల్పించాలి. కొత్త ఉత్సుకతతో శ్రద్ధగా సేవిస్తారు. పాతవారు సేవ చేసి చేసి అలసిపోయారు. చేసేదంతా సేవ అవుతుందా? సేవలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. కానీ నిజం ఏమిటో తెలుసా? మన అజ్ఞానం భగవంతునికి తెలుసు. ఆయన మనల్ని మన్నిస్తాడు.”
ఒక భక్తురాలు మాతృదేవి పక్కన ఉంది. మాతృదేవి ఆమెను ఉద్దేశించి చెప్పారేమో తెలియదు. మాతృదేవి కొనసాగించారు:
“చందనంలో చందనచెట్టు ఆకులు ఉండకూడదు. పువ్వులు, బిల్వపత్రాలలో పురుగులు, ముళ్లు ఉండకుండా చూసుకోవాలి. పూజ, తత్సంబంధిత పనులు చేసేటప్పుడు శరీరం, వెంట్రుకలు, దుస్తులు వేటినీ చేతులు తాకరాదు. ఎంతో జాగ్రత్తగా ఆ పనులను నిర్వర్తించాలి. నైవేద్యం మొదలైనవి నిర్ణీత సమయంలో జరిపించాలి.”
ఒకరోజు నేను మాతృదేవి వద్దకు వెళ్లేసరికి రాత్రి ఎనిమిది గంటలయి ఉంటుంది. అప్పుడు మాతృదేవి పూజామందిరానికి ఉత్తరం వైపు ఉన్న వసారాలో, చీకటిలో కూర్చొని జపం చేసుకొంటున్నారు. మేం పక్కగదిలో కూర్చున్నాం. కాసే పటికి మాతృదేవి లేచారు. మందహాస వదనంతో వస్తూ, “వచ్చేశావా? రా అమ్మా!” అన్నారు.
నేను: అమ్మా! నాతో నా సోదరిని కూడా తీసుకుని వచ్చాను. ఆరతి అయి పోయిందా?
మాతృదేవి: లేదు. మీరు ఆరాత్రికంలో పాల్గొనండి. నేను వచ్చేస్తాను.
ఆరాత్రికం మొదలైంది. పలువురు స్త్రీలు పూజా మందిరంలో కూర్చొని జపం చేయసాగారు. ఆరాత్రికం పూర్తికాగానే మేం ప్రణామా లర్పించి, మాతృదేవిని కలుసు కోవడానికి ప్రక్క గదిలోకి వెళ్లాం. అక్కడ ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మాతృదేవిని చూడకుండా ఉండడానికి ఇష్టపడం.
కాసేపయ్యాక మాతృదేవి మా పక్కన వచ్చి కూర్చున్నారు. ఒక వృద్ధురాలు మరొక స్త్రీ నుండి ఒక భక్తి గీతాన్ని నేర్చుకొంటున్నది. అది విని మాతృదేవి ఇలా అన్నారు:
“ఈమె ఏం నేర్పుతుంది? ఒక పదం ఉచ్చరిస్తే రెండు పదాలు మింగేస్తుంది. ఆహా! పాట అంటే ఆయన (గురుదేవులు) పాడాలి! ఎంత మధుర కంఠం! పాటతోపాటే ఆయన తేలిపోతూన్నట్లుగా ఉండేది. ఆ పాటలు ఇప్పటికీ నా చెవులలో మారుమ్రోగుతున్నాయి. ఇప్పుడు ఎన్నో పాటలు వింటుంటాను. వినక తప్పదు కనుక వింటాను. అంతే.
“నరేంద్రుని కంఠం కూడా శ్రావ్యంగా ఉండేది. కలకత్తా నుంచి బయలుదేరి వెళ్లడానికి ముందు నా వద్దకు వచ్చి కొన్ని పాటలు పాడాడు. ఆ తరువాత నాతో, ‘అమ్మా! నిజమైన మనిషిగా తిరిగి రాగలిగితే వస్తా! లేకపోతే అంతే!’ అని చెప్పాడు. ‘అవేం మాటలు?’ అన్నాను నేను. అందుకు అతడు, ‘మీ ఆశీర్వాదంతో త్వరలోనే తిరిగి వస్తాను’ అని అన్నాడు. అప్పుడొక రోజు గిరీశ్‌బాబు కూడా పాడారు. ఆయన కూడా బాగా పాడతారు.”
ఇంతలో రాధూ వచ్చి తనతోపాటు పడుకోమని మాతృదేవిని కోరింది. అందుకు ఆమె, “నువ్వు వెళ్లి పడుకో. వీళ్లు చాలా దూరం నుండి వచ్చారు. వీరితో కాసేపు కూర్చోవాలి” అని చెప్పారు. రాధూ ఒప్పుకోలేదు. అది చూసి నేను, “సరేనమ్మా! మీరు ఆ గదిలోకి వెళ్లి, పడుకోండి” అని అన్నాను. అప్పుడామె, “అలా అయితే మీరు కూడా నాతో రండి” అంటూ మమ్మల్ని కూడా రమ్మన్నారు. మాతో పడుకొనే మాట్లాడసాగారు. నేను విసురుతున్నాను. కాసేపయ్యాక, “ఇప్పుడు బాగా చల్లబడింది. ఇక విసరవద్దు” అన్నారామె. వెంటనే నేను ఆమె కాళ్లు ఒత్తసాగాను.
ఒక వృద్ధురాలు మరొకరికి యోగంలో పేర్కొనబడ్డ షట్చక్రాలు, వాటి బీజ మంత్రాల గురించి వివరిస్తున్నది. గోలాప్ మా ఆమెను వారిస్తూ, “బీజ మంత్రాలను అలా చెప్పకూడదు” అని చెప్పారు. కానీ ఆమె ఆపలేదు. అంతా విని మాతృదేవి చిరునవ్వుతో, “గురుదేవులు తమ స్వహస్తాలతో కుండలినీ, షట్చక్రాలూ గీసి నాకు చూపించి ఉన్నారు”, అని నాతో అన్నారు. “ఆ చిత్రం ఎక్కడుంది?” అని నేనడిగాను. అందుకు మాతృదేవి, “ఆహా, మీరంతా వస్తారు, ఇలా జరుగుతుందని ఎవరికెరుక? అదెక్కడో పోయింది, మళ్ళీ దొరకలేదు” అని చెప్పారు.
రాత్రి దాదాపు పదకొండు గంటలయింది. మేం మాతృదేవికి ప్రణామం చేసి, సెలవు పుచ్చుకొన్నాం. మాతృదేవి మమ్మల్ని ఆశీర్వదించి, “దుర్గా, దుర్గా” అంటూ లేచి, కూర్చున్నారు. పిదప మాతో ఏకాంతంలో, “చూడమ్మా! భార్యాభర్తలు ఏకీభావంతో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది” అని చెప్పారు.
అక్టోబర్ / నవంబర్ 1914
మా బాలీగంజ్ ఇంట్లో పువ్వులు కోకొల్లలు. పువ్వులను చూసీచూడగానే మాతృదేవి ఎంతో ఆనందించేవారు. అందువలన ఒక రోజు ఉదయం అనేక పుష్పాలను సేకరించి మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. అప్పుడామె పూజకు ఉపక్ర మించబోతున్నారు. నేను తెచ్చిన పువ్వులను అమర్చగానే ఆమె ఆనందంగా పూజ మొదలుపెట్టారు. ముద్దమల్లెలను చూడగానే, “నువ్వు ఈ పువ్వులు తీసుకురావడం మంచిదే అయింది. ఈ నెల మల్లెలతో పూజించాలి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ పువ్వులు లభించలేదు” అని అన్నారు.
మాతృదేవి పాదపూజకై విడిగా పువ్వులు తీసిపెట్టడం మరచిపోయాను. నాడు ఆమెను పూజించలేనేమోనని వ్యథ చెందాను. కానీ నా అంతరంగంలోని కోర్కెను మాతృదేవి ముందే ఊహించారు. ఎందుకంటే పువ్వుల సజ్జలో కొన్ని పువ్వులను ఆమె విడిగా ఉంచారు. పూజ పూర్తికాగానే ఆమె నాతో, “రామ్మా! నీ కోసం ఈ సజ్జలో పువ్వులు ఉంచాను. తీసుకో” అని చెప్పారు.
అప్పుడు ఒక భక్తుడు చాలారకాల పండ్లు తీసుకొని మాతృదేవి దర్శ నార్థం వచ్చాడు. అతణ్ణి చూసి మాతృదేవి ఎంతో ఆనందించారు. ఆ భక్తుని నుదుట చందనం దిద్ది, అతడి చుబుకాన్ని స్పృశించి, ఆశీర్వదించారు. ఒక భక్తునిపై ఆమె ఇలా అవ్యాజానురాగాన్ని చూపడం నేనెప్పుడూ చూడలేదు. నా కోసం విడిగా తీసి ఉంచిన పువ్వులలో కొన్నింటిని ఆ భక్తునికి ఇవ్వమన్నారు. అతడు ఎంతో వినయంగా వాటిని పుచ్చుకొన్నాడు. భక్తిపారవశ్యంతో అతడి దేహం యావత్తూ పులకరించడం నేను గమనించాను. పరమానందంతో అతడు ఆ పువ్వులను మాతృదేవి పాదపద్మాల వద్ద అర్పించి, పిదప ప్రసాదం పుచ్చుకొని వెళ్లిపోయాడు.
తదనంతరం మాతృదేవి మంచం మీద కూర్చొని ఆప్యాయంగా నన్ను దగ్గ రకు రమ్మని పిలిచారు. నేను ఆమె పాదపద్మాలకు పువ్వులను సమర్పించి, ప్రణామం చేసి లేవగానే నా చుబుకాన్ని స్పృశించి, పిదప నా తలపై తమ చేతులు ఉంచి ఆశీర్వదించారు.
తరువాత మేం తమలపాకు చిలకలు చుట్టడానికి వెళ్లిపోయాం. ఆ పని పూర్తిచేసి మాతృదేవి కోసం వెతగ్గా, ఆమె మేడ మీద కూర్చుని తమ శిరోజాలను ఆరబెట్టుకొంటున్నారు. నన్ను చూడగానే, “రామ్మా! నీ మేలిముసుగును తీసి, శిరో జాలను ఆరబెట్టుకో! శిరోజాలను తడితోనే ముడివేసుకొంటే తలలో నీరు ఇంకి కంటికి హాని చేస్తుంది” అని చెప్పారు. అప్పుడు మరొక భక్తురాలు అక్కడకు వచ్చింది. మేడ మీద బట్టలు ఆరవేసి ఉన్నాయి. వాటిని తీయమని మాతృదేవి నన్ను పురమాయించారు. నేను వాటిని తీసున్త్నప్పుడు గోలాప్ మా వచ్చి మాతృదేవిని క్రిందికి రమ్మని చెప్పారు. నైవేద్యానికి వేళ అయింది. మాతృదేవి దిగి వచ్చారు.
కొంతసేపటికి నేనూ పూజామందిరానికి వెళ్లాను. మాతృదేవి పడుచు భార్యలా బిడియంతో, స్నిగ్ధ స్వరంతో గురుదేవులతో, “నా గోపాలా! భోజనానికి రా” అంటున్నారు. నేను మాతృదేవి వెనుక నిలబడి ఉన్నాను. హఠాత్తుగా నన్ను చూడ గానే, చిరునవ్వుతో, “వీరినందరినీ భోజనానికి పిలుస్తున్నాను” అన్నారు మాతృదేవి. పిదప నైవేద్యం అర్పించి గదిలోకి వెళ్లారు. సకల దేవతలూ మాతృదేవికి నమస్కరించి పోతున్నట్లుగా నాకు తోచింది. నేను విస్తుబోయి స్థాణువునయ్యాను.
నైవేద్యం అర్పించాక మాతృదేవి ప్రక్క గదిలో కూర్చొని భోజనం చేశారు. తదనంతరం మాతృదేవికి ప్రక్క గదిలో ఒక చాప పరిచాను. ఆమె విశ్రమించారు. నేను ప్రక్కనే కూర్చున్నాను. కాసేపు నన్నూ విశ్రమించమన్నారు. ఆమె ఒకింతసేపు విశ్రమించారు. అంతలో బలరాం ఇంటి పనివాడు, “అమ్మా, అమ్మా” అంటూ వచ్చాడు. నివేదనార్థం ఒక బుట్టలో సీతాఫలాలు తెచ్చి పూజామందిరంలో పెట్టి వెళ్లిపోయాడు. తరువాత క్రిందికి వెళ్లి, “బుట్టను ఏం చేయీలి?” అని సన్న్యాసులను అడిగాడు. వీథిలో పారేయమని వారు చెప్పగా, అతడు అలాగే పారేశాడు. వెంటనే మాతృదేవి లేచి వసారా వైపు వెళ్లారు. పారేసిన బుట్టను చూస్తూ, “ఇదుగో చూడూ, ఆ బుట్ట ఎంత బాగుందో! పారవేయమని చెప్పారు. దేనిని గురించీ పట్టించుకోరు. ఒక మామూలు వస్తువు కూడా వృథా అవడం మనం అనుమ తించకూడదు. తరిగిన కూరగాయల పై తొక్కలను ఆ బుట్టలో వేసుకోవచ్చు” అంటూ ఆ బుట్టను తీసుకురమ్మన్నారు. పిదప దాన్ని శుభ్రపరచి ఉంచుకొన్నారు. ఈ సంఘటన నాకు ఒక చక్కని గుణపాఠం నేర్పింది. కానీ సహజ నైజం అంత త్వరగా మారుతుందా ఏమిటి?
కాసేపటికి ఒక బిచ్చగాడు వచ్చి యాచించాడు. అది చూసి విసుగెత్తిన సాధువులు, “వెళ్లు, వెళ్లు. చీకాకుపరచకు” అంటూ అతణ్ణి వెళ్లగొట్టారు. అది విని మాతృదేవి ఇలా అన్నారు:
“చూడు, ఆ పేదవాణ్ణి వెళ్లగొట్టేశారు. తమ పనులను ఆపి, వాడికి ఏదైనా ఇవ్వాలి. అది లేదు, ఎంత బద్ధకం! వాడికి కావలసింది ఒక పిడికెడు బియ్యం మాత్రమే! ఎవరికి ఏది అవసరమో దానిని లభించకుండా చేయడం భావ్యమా? ఇదుగో, ఈ తరిగిన కూరగాయల తొక్కలు పశువులకు చెందాలి. వీటిని పశువుల నోళ్ల వద్దకు తీసుకెళ్లి ఇవ్వాలి.”
బాగా చీకట్లు క్రమ్మసాగాయి. నేను సెలవు పుచ్చుకోవలసిన వేళ ఆసన్నమైంది. మాతృదేవికి ప్రణమిల్లి, ప్రసాదం పుచ్చుకొని ఇంటికి బయలుదేరాను.
ఒక రోజు సాయంత్రం వెళ్లాను. మాతృదేవి ఇంటికి సమీపంలో ఉందన్న ఒక్క కారణంగా నేను బాగ్‌బజార్ ఇంట్లో నివసించేదాన్ని. దాదాపుగా నేను ప్రతి రోజూ సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లేదాన్ని. మాతృదేవి ఒంటరిగా ఉండడం చూసి నాకు వచ్చిన కలను గురించి ప్రస్తావించాను.
నేను: అమ్మా! మీరు జయరాంబాటిలో ఉన్నప్పుడు నాకొక కలవచ్చింది. అందులో నేను జయరాంబాటికి వచ్చాను. అక్కడ గురుదేవులను చూసి, “అమ్మ ఎక్కడ?” అని అడిగాను. అందుకు ఆయన, “ఈ వీథి వెంట తిన్నగా వెళ్లు. ఒక పూరింటి వసారాలో కూర్చొని ఉన్నారు” అని చెప్పారు.
పడుకొని ఉన్న మాతృదేవి నా మాటలు విని లేచి కూర్చుని, “ఓహో, అలా చూశావా! సరిగ్గానే చూశావు” అని అన్నారు.
నేను: నిజంగానా అమ్మా! మీ పుట్టింటిని ఇటుకలతో కట్టి, పైకప్పును పెంకులతో కప్పారని ఇన్ని రోజులుగా అనుకొంటున్నాను. అందుకే మట్టి ఇంటిని, గడ్డి పైకప్పును చూసినప్పుడు ఇదేదో నా భ్రమ అనుకొన్నాను.
మాటల సందర్భంలో ‘భగవత్సాక్షాత్కారానికి తపశ్చర్య ఆవశ్యకత’ అనే అంశం గురించి మాతృదేవి ఇలా చెప్పారు:
“ఆహా! గోలాప్, యోగీన్ ఎంతగా జపధ్యానాదులు అనుష్ఠించారో కదా! యోగీన్ పలుమార్లు చాతుర్మాస్య వ్రతం ఆచరించింది. ఒకసారి వ్రతం సమాప్తమయ్యే దాకా కేవలం పాలు పండ్లు మాత్రమే తింటూ గడిపింది. ఇప్పుడు కూడా ఎంతో జపధ్యానాలు చేస్తూవుంది. గోలాప్ మనస్సులో కోరికలేవీ లేవు. మహా అయితే అంగడిలో చేసిన బంగాళాదుంపల కూర తినాలని కోరుకొంటుందేమో! అంతే.”
నేడు మాతృదేవి ఇంట్లో కాళీ కీర్తన జరుగనున్నది. సన్న్యాసులు పాడతారు. రాత్రి దాదాపు ఎనిమిదిన్నరకు కీర్తన మొదలైంది. కీర్తన వినడానికి పలువురు స్త్రీలు కూడా వసారాలోకి వెళ్లారు. నేను మాతృదేవి పాదాలకు నూనె రాస్తున్నాను. అక్కడ నుండి కీర్తన బాగా వినబడుతున్నది. ఆ పాటలు నేను ఎన్నోసార్లు వినివున్నాను. కానీ భక్తులు పాడేటప్పుడు ఆ పాటల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటల్లో భక్తిపారవశ్యం పొంగిపొర్లడం సహజమే. నా కళ్లు ఆర్ద్రమైనాయి.
గురుదేవులు పాడే పాటలను ఒకటి రెండింటిని వారు మధ్య మధ్యలో పాడారు. వాటిని విన్నప్పుడు మాతృదేవి, “ఇదుగో, ఈ పాటను గురుదేవులు పాడేవారు” అని వ్యాఖ్యానించారు. ‘మజలో ఆమార్ మన్ భ్రమర’ అనే పాట మొదలైంది. ఇక మాతృదేవి పడుకోలేకపోయారు. ఆమె కళ్ల నుండి ఆనందాశ్రువులు స్రవించసాగాయి. లేచి కూర్చొని, “రామ్మా, వసారాలోకి వెళ్లి విందాం” అన్నారు. కీర్తన పూర్తయ్యాక మాతృదేవికి ప్రణమిల్లి నేను సెలవు పుచ్చుకొన్నాను.
మే, 1918
గత నెల మాతృదేవి జయరాంబాటి నుండి తిరిగి వచ్చారు. మలేరియా జ్వరంతో పీడింపబడడం వలన ఆమె బాగా కృశించిపోయారు. ఆరోగ్యం పుంజు కునేంత వరకు ఆమె దర్శనానికి ఎవరినీ అనుమతించలేదు. ఈ కారణంగానే నేను ఇంతవరకు ఆమెను చూడలేదు. స్త్రీలను అనుమతిస్తున్నారని నేడు నాకు కబురు అందింది. వెంటనే బయలుదేరాను.
నేను వెళ్లేసరికి మాతృదేవి పడుకొని ఉన్నారు. ఆమె బాగా కృశించిపోయి ఉన్నారు. నన్ను చూడగానే, “రామ్మా, రా! ఇన్ని రోజులుగా ఎందుకు రాలేదు?” అని అడిగారు.
నేను: ఇన్ని రోజులుగా ఎవరినీ అనుమతించలేదు. అందుకే రాలేదు. మిమ్మల్ని తలచుకొని ఎంతో ఆవేదన చెందాను. మీరు కూడా పుట్టింటికి వెళ్లి మమ్మల్నందరినీ మరచిపోయారు కదా! ఎక్కడా మీకు బిడ్డలకు కొదువ లేదు కదా!
మాతృదేవి (నవ్వుతూ): అలా అనకమ్మా! మిమ్మల్ని ఎవరినీ నేను మరచి పోలేదు. అందరినీ తలచుకొన్నాను.
నేను: మీకు అనారోగ్యంగా ఉందని విన్నప్పుడు ఏమైందోనని ఎంతో భయ పడిపోయాం.
మాతృదేవి: మునుపటికంటే ప్రస్తుతం ఎంతో నయంగా ఉంది. చూడు అరచేతుల్లోను, పాదాల్లోను చర్మం ఊడివస్తూనే ఉంది.
మాతృదేవి పాదాల మీద చేయిపెట్టి చూశాను. నిజమే, చర్మం ఊడిపోయి ఉంది.
మాతృదేవి కోసం ఒక చీర తీసుకువెళ్లాను. దానిని ఇవ్వగానే ఆమె, “మంచి చీర తీసుకువచ్చావు. ఈసారి చీరలు తక్కువయ్యాయి. దుర్గాపూజల వేళలో ఇక్కడ ఉండివుంటే బోలెడు చీరలు వచ్చేవి. ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా?” అని అడిగారు.
శోకహరణ్ గురించి అడిగిన తరువాత ఇలా చెప్పారు:
“అతడి సంగతి ఏమైంది? ఇప్పుడు పనీగినీ అంత సులభంగా దొరకదే! ఈ పాపిష్టి యుద్ధం* ఎక్కణ్ణుండి దాపురించిందో! ఇది ఎప్పుడు అంత మౌతుందో! ఎప్పటికి జనం తిని, బట్టకట్టి జీవించగలరో? ఈ యుద్ధం ఎలా ప్రారంభమైందో కాస్త చెప్పు, వింటా.”
పత్రికలలో చదివి నేను తెలుసుకొన్న విషయాలు చెప్పాను.
ఎక్కువసేపు మాట్లాడితే మాతృదేవి బాగా అలసిపోతారని సత్వరమే నేను సెలవు పుచ్చుకొన్నాను.
జూలై 22, 1918
రాత్రి దాదాపు ఏడున్నర గంటలకు మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. ప్రణామంచేయగానే ఆమె, “రామ్మా, రా, కూర్చో! ఈ రోజు వేడి ఎక్కువగా ఉంది. కాస్త విశ్రమించి, అలసట తీర్చుకో. సుమతి తదితరులు తిరిగి వచ్చారా?” అని అడిగారు.
నేను: అవునమ్మా, ఆమె వచ్చాకే నేను బయలుదేరాను.
మాతృదేవి: ఈ విసనకర్రను రాధూకు ఇచ్చిరా! ఈ తైలాన్ని నా వీపుకురాయి. చూడు, కాళ్లు, చేతులు, పొట్ట అంతటా వేడిపొక్కులు వస్తున్నాయి.
నేను నూనె రాస్తున్నప్పుడు సాయంకాల ఆరాత్రికానికి గంట మ్రోగింది.మాతృదేవి లేచి కూర్చొని చేతులు జోడించి గురుదేవులకు ప్రణమిల్లారు. తక్కినవారు ఆరాత్రికం తిలకించడానికి వెళ్లారు.
మాతృదేవి: ఇదిగో చూడు. ‘దుఃఖం, దుఃఖం, సదా దుఃఖమే. భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా దుఃఖాలకు అంతం లేకుంది’ అంటూ ప్రతి ఒక్కరూచెబుతూంటారు. కానీ దుఃఖం అనేది భగవంతుని వరప్రసాదం కదా! ఆయన కరుణకు చిహ్నం కదా!
నాడు నేను మానసిక క్షోభలో ఉన్నాను. ఆ సంగతి గ్రహించే మాతృదేవి ఇలా అంటున్నారా? మాతృదేవి కొనసాగించారు:
“ఈ లోకంలో కష్టాలు అనుభవించని వారెవరున్నారు? కృష్ణుడితో, బృంద ఇలా అంది: ‘నువ్వు కరుణామూర్తివని ఎవరన్నారు? రామావతారంలో సీతను విలపింపజేశావు. కృష్ణావతారంలో కంసుని చెరసాలలో నీ తల్లిదండ్రులు అపరిమిత బాధలు అనుభవిస్తూ, రేయింబవళ్ళు నీ నామస్మరణ చేస్తూ విలపించారు. అయినా నీ నామాన్ని ఎందుకు స్మరణ చేస్తానో తెలుసా? నీ పవిత్ర నామస్మరణ మరణ భయాన్ని తొలగించి వేస్తుంది.’”
సచిన్, దేవవ్రత మహరాజ్‌ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు. మాతృదేవి ఇలా అన్నారు:
“సచిన్ సుప్రసిద్ధుడు. దేవవ్రతుడు మరణించిన రోజు పెద్ద గాలివాన వచ్చింది. ఈ మఠంలో అప్పుడు ఎక్కువమంది లేరు. కానీ సచిన్ చనిపోయింది ఉదయం పూట, మఠం నిండా మనుషులు* . దేవవ్రతుడు ఒక యోగి.”
ఒక స్త్రీని గురించి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి ఇలా అన్నారు:
“అటువంటి ఆకృతి గల వారికి సామాన్యంగా భక్తి ఉండదని గురుదేవులు చెప్పగా విన్నాను.”
నేను: అవునమ్మా! కాపట్యం ఉన్నవారి విషయం కూడా అంతే. గురుదేవుల పుస్తకాలలో చదివివున్నాను.
మాతృదేవి: ఓ! ఆ విషయం చెబుతున్నావా? నారాయణుడి ఇంట్లోనే ఆ విషయం చెప్పారు. ఒక వ్యక్తి ఉంపుడుగత్తె ఒకసారి గురుదేవుల వద్ద ఇలా వాపోయింది: ‘ఆ వ్యక్తి నా జీవితాన్ని నాశనం చేశాడు. నా ధనం, నగలు కాజేశాడు.’ మనసులోని మాట గ్రహించగలవారు గురుదేవులు. అయినా ఆమెతో, ‘అలాగా! కానీ అతడు భక్తిని గురించి గొప్పగా ప్రసంగిస్తూంటాడే’ అని అన్నారు. ఒక శ్లోకం కూడా చెప్పారు. ఎలాగో ఆ స్త్రీ తన పాపాలను ఆయనకు చెప్పుకొని వాటి నుండి విముక్తి పొందింది.
నళిని: అదెలానమ్మా! నోటితో చెప్పినంతమాత్రాన పాపవిమోచనం జరుగు తుందా? ఆ విధంగా పాప ప్రక్షాళన చేసుకోవచ్చా?
మాతృదేవి: ఎందుకు సాధ్యం కాదు? ఆయనొక మహాపురుషులు. ఆయనకు విన్నవించుకొంటే పాపాలు తొలగిపోవా ఏమిటి? ఒక్క విషయం: ఒకరి పాపపుణ్యా లను గురించి ప్రస్తావిస్తే, చెప్పేవారికీ వినేవారికీ కూడా వాటిలో ఏ కొంతైనా అబ్బుతాయి.
నళిని: అదెలానమ్మా?
మాతృదేవి: చెబుతాను. ఒక వ్యక్తి తన పాపపుణ్యాలను గురించి నీకు చెబు తాడు. ఆ తరువాత ఎప్పుడైనా అతణ్ణి నువ్వు తలచుకోవడం జరిగితే అతడి పాప పుణ్య కార్యాలు నీ మనస్సులో మెదలుతాయి. అవి నీ మనస్సులో ముద్రితమై పోతాయి. ఏమిటమ్మా, నేను చెప్పింది సరేనా?
జనం పడే దుఃఖమూ, కష్టాలూ, వారి అశాంత జీవితం గురించి ప్రస్తావన మళ్లీ వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“నా వద్దకు అనేకులు వస్తూవుంటారు. తమ వ్యథలను నాతో వెళ్లబోసు కొంటారు. ‘జీవితంలో ప్రశాంతత లేదు, భగవత్సాక్షాత్కారం కాలేదు. మాకు ఎలా శాంతి లభిస్తుంది?’ అని అడుగుతారు. అప్పుడు వారిని తేరిపార చూసి, ‘వీళ్లు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను మానవాతీతమైన వ్యక్తినా? అశాంతి అంటే ఏమిటో నాకు తెలియదు. ఇక భగవత్సాక్షాత్కారం కరతలామలకం. కాసేపు కూర్చుంటే చాలు, ఆయనను దర్శించగలుగుతాను’ అనే భావన నా మనస్సులో మెదలుతుంది.”
మాతృదేవి ‘బందిపోటు తండ్రి* ’ గురించి పుస్తకాలలో చదివాను. ఈ విషయం ఆమెనే అడిగి తెలుసుకోగోరాను.
నేను: అమ్మా! లక్ష్మి, మరికొందరితో మీరు ఒకసారి దక్షిణేశ్వరానికి కాలినడకన వస్తూండగా మధ్యదారిలో మీరు బాగా వెనుకబడిపోయినప్పుడు ‘బందిపోటు తల్లితండ్రులను’ కలుసుకొన్నట్లు చదివాను.
మాతృదేవి: నేను ఒంటరిగా ఉన్నాననడం సరికాదు. నాతో ఇంకా ఇద్దరు వృద్ధులైన స్త్రీలు ఉన్నారు. మేం ముగ్గురం వెనుకబడిపోయాం. అప్పుడే ఆ బందిపోటుతారసపడ్డాడు. చేతికి వెండి మురుగులు, నల్లటి మేని రంగు, చేత పెద్ద దుడ్డుకర్ర.ఈ అవతారం చూడగానే హడలిపోయాను. ఆ ప్రాంతంలో అనేక దారిదోపిళ్లుజరిగాయి. నా భయాన్ని చూసి అతడు, ‘ఏమిటి? ఎక్కడకు వెళుతున్నావు?’ అని అడిగాడు. అందుకు నేను, ‘తూర్పువైపు’ అని జవాబిచ్చాను. వెంటనే అతడు, ‘అందుకు ఈ వైపు వెళ్లకూడదు. ఆ వైపుగా వెళ్లాలి’ అన్నాడు. అప్పటికీ అడుగులుముందుకు వేయడానికి భయపడ్డాను. అది చూసి అతడు, ‘భయపడకు! నాతోపాటు ఒక స్త్రీ ఉంది. అదుగో, వెనుక వస్తున్నది’ అని చెప్పాడు. అప్పుడు నేను అతణ్ణి ‘నాన్నా’ అంటూ సంబోధించి శరణుజొచ్చాను. ఆ రోజుల్లో ఇలా ఉండేదాన్నానేను? ఎంత బలం ఉండేది! ఏకబిగిన మూడు రోజులు నడిచాను. కాలినడకనబృందావన ప్రదక్షిణ చేసి వచ్చాను. ఆ రోజుల్లో ఇలాంటి వేవీ కలుగలేదు.
దక్షిణేశ్వరంలో నహబత్తు చూశావా? అక్కడే నేను నివసించేదాన్ని. మొదట్లోలోపలకు వెళ్లేటప్పుడు గుమ్మం తలకు తగిలేది. ఒక రోజు పెద్ద గాయం అయింది.ఆ తరువాత గుమ్మం వద్దకు వెళ్లగానే దానంతట అదే తల వంగేది. బాగా లావుగా ఉండే స్త్రీలు నన్ను చూడడానికి కలకత్తా నుండి వచ్చేవారు. వారు ఆ వాకిలి గుండా లోపలకు రాగలిగేవారు కారు. అందువలన ద్వారబంధాన్ని పుచ్చుకొనిలోపలకు తొంగి చూస్తూ, ‘ఆహా! మన పిల్ల ఎంత చిన్న గదిలో ఉంటున్నది.సీతావనవాసంలా ఉంది కదా!’ అని అంటుండేవారు. (నళినీని, రాధూనూ చూస్తూ)ఒక్కరోజైనా మీరు అక్కడ ఉండగలరా?
నళినీ, రాధూలు, “ఉండలేం. అన్ని విషయాలలోను మీరొక విలక్షణ వ్యక్తి, అత్తా!” అని అన్నారు.
నేను: తదనంతరం మీకు తాటాకుల కప్పుతో ఒక ఇల్లు కట్టి ఇచ్చారనీ, ఒక రోజు గురుదేవులు అక్కడికి వచ్చినప్పుడు భారీ వర్షం కారణంగా అక్కడే బసచేశారనీ గురుదాస్ బర్మన్ పుస్తకంలో చదివాను.
మాతృదేవి: ఏమిటీ, ఇల్లా! అది వట్టి పూరిపాక. శరత్ రచించిన పుస్తకంలో* అదంతా యథాతథంగా వ్రాసి వుంది. ‘మ’ రచించిన పుస్తకం* కూడా బాగుంది. గురుదేవుల వచనాలను ఉన్నదున్నట్లుగా నమోదు చేసివున్నారు. ఎంత చక్కని ఉపదేశాలు! ఇలా నాలుగైదు పుస్తకాలు రచించడానికి సరిపడే విషయాంశాలు ఆయన సేకరించివున్నట్లు విన్నాను. కానీ ఇప్పుడాయన వృద్ధుడయ్యాడు; ఇకపై ఆయనకు సాధ్యమవుతుందా ఏమిటి? ఆ పుస్తక ప్రతులను విక్రయించి ఎంతోధనం ఆర్జించినట్లుంది. ఆ ధనాన్నంతా విడిగా ఉంచాడని విన్నాను. జయరాంబాటిలో నా ఇంటి నిర్మాణానికి దాదాపు వేయి రూపాయలు ఇచ్చారు. అంతేగాకప్రతి నెలా నాకు పది రూపాయలు పంపిస్తున్నారు. ఇక్కడ కలకత్తాలో నేను బసచేసి ఉంటే ఇరవై, ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవారు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు ప్రతి నెలా నాకు రెండు రూపాయలు ఇచ్చేవారు.
నేను: మఠానికి గిరీశ్ బాబు పెద్ద మొత్తాన్ని ఇచ్చారట కదా!
మాతృదేవి: ఏమంత పెద్ద మొత్తం ఇచ్చాడు? సురేశ్ నియమానుసారం ఇస్తూ ఉండేవాడు. అయినా గిరీశ్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేవాడు. బేలూర్లోనీలాంబరబాబు ఇంట్లో నేను ఉన్న ఒకటిన్నర సంవత్సరాలు నా ఖర్చులన్నీ భరిం చాడు. రెండువేలో, ఐదువేలో ఇచ్చారనడం భావ్యం కాదు. ఎక్కణ్ణుంచి తెచ్చి ఇవ్వగలడు? ఆయన వద్ద అంత ధనం ఎక్కడుంది? మొదట్లో అతడు దౌర్భాగ్యుడు.దుష్టుల సహవాసంలోను, థియేటర్‌లోను జీవితాన్ని గడిపాడు. కానీ ప్రగాఢవిశ్వాసం ఉన్నవాడు. అందువలననే గురుదేవుల అనుగ్రహం పొందగలిగాడు.ఈసారి గురుదేవులు ఆయనకు సద్గతి ప్రసాదించారు. ప్రతి అవతారంలోను ఇటు వంటి కొందరు దుర్జనులను అనుగ్రహించి ఉన్నారు; చైతన్యుల అవతారంలో జగాయ్, మధాయ్లా, ఈసారి ఈతడు. గిరీశ్ శివాంశ సంభూతుడని గురుదేవులు ఒకసారి చెప్పారు.
ధనంలో ఏముంది? అమ్మాయీ! గురుదేవులు ధనాన్ని కనీసం తాకనైనా తాకలేకపోయేవారు, చేతులు కొంకర్లుపోయేవి. ‘ఇదుగో రామ్‌లాల్! ఈ జగత్తుమిథ్య. ఈ జగత్తు కనుక సత్యమే అయితే, మీ కామార్పుకూర్ను స్వర్ణమయంగావించేవాడిని. కాని జగత్తు మిథ్య అని నాకు తెలుసు. భగవంతుడు ఒక్కడేసత్యం’ అని గురుదేవులు వచించేవారు.
మాకు (బాధతో) : ఒక చోట నిశ్చింతగా నేను ఉండలేకపోతున్నాను.
మాతృదేవి: ఎందుకలా? ఎక్కడున్నా సంతోషంగా ఉండేరీతిలో నీ మనస్సును మలచుకోవాలి. నీ అత్తగారింట్లో ఆనందంగా ఉండగలవని నువ్వు భావిస్తున్నావు.అదెలా సాధ్యం? అంత స్వల్ప జీతంతో జీవనం ఎలా గడుస్తుంది? ఇక్కడ నువ్వు నాతో నీ పుట్టింట్లో ఉన్నట్లే కదా ఉంటున్నావు. వివాహం చేసుకొన్న స్త్రీలు పుట్టింట్లో ఉండడం లేదా? ఈమెను చూడు, కుటుంబం నుండి వైదొలగి ఇక్కడ ఉంటున్నది.మీరు ఈ మాత్రం త్యాగం చేయలేరా? ఈమెను చూడు, ఎంత నిశ్చింతగా ఉందో!
నేను: పోనివ్వండమ్మా! గురుదేవుల గురించి ఇంకా చెప్పండి.
మాతృదేవి: పుస్తకాలలో వ్రాసినంత మాత్రం చేత వాటినన్నీ యథార్థమనుకో రాదు. షోడశీపూజ* గురించి రాం* వ్రాసింది సరికాదు.
తదనంతరం మాతృదేవి షోడశీపూజ గురించి వివరిస్తూ ఇలా అన్నారు: “ఆ పూజ ఇంట్లో జరగలేదు. దక్షిణేశ్వరంలో గురుదేవుల గది ప్రక్కన అర్ధచంద్రాకారపు వసారా ఉంది. దానికి సమీపంలో గంగాజలం నింపిన ఒక కూజా ఉంది చూశావా, అక్కడే ఆ పూజ జరిగింది. అన్ని ఏర్పాట్లూ హృదయ్ చేశాడు.”
అప్పుడు యోగీన్ మా వచ్చి కిటికీ వద్ద నిలబడి మాతృదేవితో ఏదోమాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మాతృదేవి, “లోపలకు రా యోగీన్! ఈమధ్యనువ్వు నల్లపూసవైపోయావు” అని అన్నారు. యోగీన్మా నవ్వుతూ మాతృదేవి వద్దకొచ్చారు. అప్పుడామె కాలు నా మీద పడింది. వెంటనే ఆమె చేతులు జోడించినాకు నమస్కరించారు. అందుకు నేను తొట్రుపడి లేచి ఆమెకు నమస్కరించి, “ఇదేమిటి యోగీన్ మా? మీ పాదధూళి తీసుకొనే అర్హత కూడా నాకు లేదు. మీపాదాలు నా మీద పడ్డాయని నాకు నమస్కరించడమా?” అని అన్నాను.
యోగీన్ మా: ఎందుకు నమస్కరించకూడదు! పెద్దదైనా చిన్నదైనా పాము పామే కదా! మీరందరూ భక్తులు కదా!
నేను దృష్టిని మాతృదేవి వైపు సారించాను. కారుణ్యాన్ని వర్షించే దివ్యదరహాసం ఆమె ముఖారవిందాన విప్పారుతోంది.
జూలై 28, 1918
సాయంత్రం వేళ వెళ్లాను. ఆరాత్రికం ఇంకా ప్రారంభం కాలేదు. వీథివైపు ఉన్న వసారాలో ఆసనంపై కూర్చుని మాతృదేవి జపం చేసుకొంటున్నారు. ఎండలుమండుతున్నాయి. మాతృదేవికి ప్రణామం చేసి ప్రక్కన కూర్చున్నప్పుడు ఆమె ఒకవిసనకర్రను నాకిచ్చి విసరమన్నారు. అప్పుడు వృద్ధ వితంతువు ఒకరు వచ్చిమాతృదేవికి ప్రణామం చేసింది. వెంటనే మాతృదేవి, “ఎవరితో కలిసి వచ్చావు?” అని ఆమెను అడిగారు. అందుకు ఆమె, “ఇంటికి కాపలాకాస్తున్న వారితో వచ్చాను” అంది.
పిదప మాతృదేవికి నేను విసురుతున్న విసనకర్రను ఆమె అడిగింది. ఆమెకూడా మాతృదేవిని సేవించాలని ఆశించింది. నేను వెంటనే ఇచ్చాను. కానీ మాతృదేవికి అది మనస్కరించలేదు.
మాతృదేవి: ఫరవాలేదు, ఆమే విసురుతుంది.
వితంతువు: ఎందుకమ్మా? నా చేత్తో కాస్త విసరకూడదా? వారందరూ ఎప్పుడూ మీకు సేవ చేస్తూనే ఉంటారు కదా!
మాతృదేవికి ఇది అంతగా నచ్చినట్లు లేదు. ఆ వితంతువు కూడా కాసేపు విసిరిన తరువాత, “సరే నమ్మా, నేను వెళ్లివస్తాను. మహరాజ్ వద్దకు వెళ్లాలి” అంటూ మాతృదేవి పాదాలకు తన తలను ఆన్చి ప్రణామం చేసింది. మాతృదేవి విసుగు చెంది, “హా! తలను పాదాలపై ఎందుకు ఉంచావు? ఇప్పటికే నా ఆరోగ్యం బాగా లేదు. ఇలాంటి చర్యలతో అది మరింత దిగజారుతుంది” అన్నారు.
ఆ వితంతువు వెళ్లిపోయిన తరువాత మాతృదేవి తమ పాదాలను కడుగు కొన్నారు. పిదప అనారోగ్యంతో బాధపడుతున్న గోలాప్ మాను చూసి వచ్చి మళ్లీ సెలవు పుచ్చుకోవడానికి ఆమె మాతృదేవి వద్దకొచ్చింది. “మంచిది, వెళ్లిరా” అన్నారు మాతృదేవి. మాతృదేవి ఇలా ఎవరితోనూ విసుగ్గా వ్యవహరించడం నేను చూసింది లేదు.
తదనంతరం మాతృదేవి నాతో, “నా ఆసనాన్ని గదిలో పెట్టు” అని చెప్పారు. నేను పరుపు వేయగానే దానిమీద పడుకొని మోకాళ్లకు తైలం రాయమన్నారు. కాసేపయ్యాక వీపు మీద తైలం మర్దించమన్నారు.
లలితబాబు గురించి ప్రస్తావన వచ్చింది.
నేను: అమ్మా, మీ అనుగ్రహం వల్లనే ఆయన బ్రతికి బట్టకట్టినట్లు విన్నాను.
మాతృదేవి: అతడికి ఎన్నో తీరని కోర్కెలుండేవి. చివరకు అతడి పరిస్థితి విషమించింది. జలోదరం (Dropsy) వ్యాధి! అమ్మో! పొట్టలో నుండి కడవలకొద్దీ నీరు వచ్చేది. జీవిత చరమాంకంలో ఉన్నాడు. అప్పుడు అతడు శోకపూరిత స్వరంలో, ‘అమ్మా! కామార్పుకూర్లోను, జయరాంబాటిలోను దేవాలయాలు, వైద్యశాలలు కట్టించాలని ఆశించాను. ఏదీ నెరవేరకుండా చేశావే తల్లీ!’ అంటూ ఆక్రోశించాడు. ఆహా! గురుదేవులు అతణ్ణి కాపాడారు. అక్కడ ఇటువంటి సేవాకార్యాలు చేయాలనే కోర్కె మరే భక్తునిలోనూ ఇంత ప్రగాఢంగా ఉన్నదిలేదు. బ్రతికి బట్టకట్టాడు. ఇక ఆ సేవా కార్యాలు చేపట్టనీ! అతడు నా కోసం ఒక చెరువు కొనుగోలు చేశాడు.
జూలై 30, 1918
నేటి సాయంత్రం ప్రేమానంద స్వామి పరమపదించారు. రాత్రి నేను మాతృదేవి వద్దకు వెళ్ళాను.
మాతృదేవి: రామ్మా, రా! ఈ రోజు నా బాబూరాం వెళ్లిపోయాడు. ఉదయంనుండి విలపిస్తున్నాను.
ఇలా అంటూ మాతృదేవి మళ్లీ విలపించసాగారు. పిదప ఇలా అన్నారు:
“బాబూరాం నా ప్రాణం! శక్తి, భక్తి, యుక్తియుక్తత – ఇవన్నీ బాబూరాంలోమూర్తీభవించి, గంగాతీరాన్నే ప్రకాశమానం చేస్తూ ఒప్పారాయి. మగ సంతు లేని ఇంట అతడి తల్లి జన్మించింది. అందువలన తన తండ్రి యావదాస్తీ ఆమెకు సంక్రమించింది. ఆ కారణంగా ఆమెకు కాస్త గర్వం ఉండేది. ‘చేతులకు బంగారుగాజులు, నడుముకు ఒడ్డాణం అన్నీ ధరించి ఈ లోకమే నా పాదాక్రాంతం అవుతూన్నట్లుగా అనిపించేది’ అంటూ ఆమే స్వయంగా నాతో చెప్పింది. ఆమెనలుగురు పిల్లలను వదలి కన్నుమూసింది. ఐదవ బిడ్డ మాత్రం ఆమెకంటేముందే చనిపోయాడు.”
కాసేపటి తరువాత చూస్తే, గది మధ్య దక్షిణం వైపు గోడకు తగిలించివున్నచిత్రపటంలోని గురుదేవుల పాదపద్మాలపై తమ శిరస్సు నుంచి హృదయవిదారకస్వరంతో, “భగవంతుడా! తీసుకుపోయావే!” అంటూ విలపించసాగారు. మేంకన్నీళ్లను ఆపుకోలేకపోయాం.
మరోవైపు గోలాప్ మా కూడా రక్తవిరేచనాలతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉంది.
జూలై 31, 1918
అప్పుడు రాత్రి ఏడున్నర అయింది. మాతృదేవి పూజామందిరంలో కూర్చొని ఉన్నారు. నేను వెళ్లి ఆమెకు ప్రణామం చేయగానే, ఆమె ఇలా అన్నారు: “నా ఆసనాన్ని వసారాలో వెయ్యి. మంచం క్రింద నేల మీద పరచిన పరుపును చుట్టి పెట్టు. ఆరాత్రికం సమయంలో అక్కడ కూర్చొని గంట వాయిస్తారు.”
విలాస్ మహరాజ్ ఆరాత్రికానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వసారాలో ఆసనం ఉంచగానే మాతృదేవి, “కమండలంలో గంగాజలం ఉంది, తీసుకురా!” అనినాకు చెప్పారు. గంగాజలంతో ముఖం, చేతులు కడుగుకొని జపం చేయడానికి ఆమె కూర్చున్నారు. విసనకర్ర నా చేతికిచ్చి విసరమన్నారు.
కాసేపటికి ఆరాత్రికం ప్రారంభమైంది. “గురుదేవా, గురుదేవా!” అంటూచేతులు జోడించి మాతృదేవి నమస్కరించారు. జపం పూర్తిచేసి, ఆరాత్రికం తిలకించసాగారు.
ఆరాత్రికం పూర్తికాగానే విలాస్ మహరాజ్, మాతృదేవికి ప్రణామం చేసి, “అమ్మా! ఈ రోజు బాగా వేడిగా ఉంది” అని చెప్పారు.
మాతృదేవి: కాస్త విసురుకొంటావా?
విలాస్ మహరాజ్: నాకు ఎవరు విసురుతారు?
మాతృదేవి: అదేమిటి, ఈమె విసురుతుంది. కాస్త ఈయనకు కూడా విసు రమ్మా!
నేను ఒకటి రెండుసార్లు ఆయనకు కూడా విసిరాను. వెంటనే ఆయన, “వద్దమ్మా! ఆమె మీకు విసురుతున్నది. మీకు సేవ చేయనివ్వండి” అంటూ లేచి బయటకు వెళ్లిపోయారు.
కొంతసేపు గడిచాక మళ్లీ మాతృదేవి ప్రేమానందస్వామి గురించి మాట్లాడ నారంభించారు.
“అమ్మాయీ! చివరకు బాబూరాం దేహం కేవలం అస్థిపంజరమైపోయింది. లోపల మరేమీ లేనట్లు తోచింది.”
ఆ సమయంలో చంద్రబాబు పైకి వచ్చి సంభాషణలో పాల్గొన్నాడు. ప్రేమా నందస్వామి దహనసంస్కారాల నిమిత్తం కొందరు భక్తులు నాలుగైదువందల రూపాయల విలువచేసే చందనపు కట్టెలు, నెయ్యి, సాంబ్రాణి, పువ్వులు మొదలైనవి ఇచ్చారని ఆయన మాతృదేవితో చెప్పాడు.
మాతృదేవి: ఆహా! వారు ధనాన్ని సముచిత రీతిలో వ్యయం చేసి, తరించారు. ఒక భక్తుని కోసం వారు ఖర్చుపెట్టారు. భగవంతుడు వారికి ప్రసాదించాడు, ఇంకా ప్రసాదిస్తాడు.
మాతృదేవికి ప్రణామంచేసి చంద్రబాబు బయటకు వెళ్లిపోయాడు. మాతృదేవి సంభాషణ కొనసాగించారు:
“అమ్మాయీ! ఎంతటి మహాపురుషులైనా దేహం దాల్చి జన్మించిన తరువాత శారీరక అనుభవాలను పొందే తీరాలి. కానీ తారతమ్యం ఇది: సామాన్యుడు పోతున్నప్పుడు ఏడుస్తూ పోతాడు. మహాపురుషులు చిరునవ్వు చిందిస్తారు. వారికి మరణం ఒక ఆట.
“ఆహా! నా బాబూరాం పిన్నవయస్సులోనే వచ్చాడు. గురుదేవులు అతణ్ణి వేళాకోళం పట్టించేవారు. నా నరేన్, బాబూరాం కడుపుబ్బ నవ్వేవారు. కాశీపూర్‌లో ఉంటున్నప్పుడు ఒక రోజు గురుదేవుల కోసం రెండున్నర సేర్ల పాలు కాచి, ఒక పాత్రలో పోసి మేడ మెట్లు ఎక్కాను. అప్పుడు హఠాత్తుగా తల తిరిగి పడిపోయాను. నరేన్, బాబూరాం వచ్చి నన్ను లేవనెత్తారు. పాలు నేలపాలయ్యాయి. మరోవైపు నా మోకాలిచిప్ప పట్టుజారింది. కాసేపట్లో కాలు బాగా వాచింది. గురుదేవులకు ఈ సంగతి తెలిసి, “బాబూరాం! ఇప్పుడు ఏమవుతుంది? నా భోజనానికి మార్గాంతర మేమిటి? ఎవరు నాకు ఆహారం తెస్తారు?” అని అడిగారు. అప్పుడు ఆయన జావ మాత్రమే పుచ్చుకొనేవారు. జావ తయారుచేసి పైకి వెళ్లి నేనే ఆయనకు ఇచ్చివచ్చేదాన్ని. అప్పుడు నేను ముక్కుకు గుండ్రని నత్తును ధరించేదాన్ని. అందువలన గురుదేవులు తమ ముక్కును చేత్తో తాకి, వేలితో చక్రాకారంగా తిప్పి చూపించి బాబూరాంతో, ‘బాబూరాం, ఆమెను ఒక గంపలో ఉంచి తలపైకెత్తుకొని తీసుకురాగలవా?’ అని అడిగారు. అది విని నరేన్, బాబూరాం కడుపుబ్బ నవ్వారు. వారితో ఆయన హాస్యోక్తులాడేవారు. మూడు రోజుల్లో వాపు కాస్త తగ్గడంతో, వారి సాయంతో నేను మేడ మీదకు వెళ్లగలిగాను. కొన్ని రోజులు గోలాప్ మా జావ తయారుచేసేది. నరేన్ దానిని తీసుకెళ్లగా ఆయన త్రాగేవారు.
“బాబూరాం ఒకసారి తన తల్లితో, ‘నువ్వు నన్ను అంతగొప్పగా ప్రేమి స్తున్నావా? గురుదేవులు మమ్మల్ని ప్రేమించినట్లుగా ప్రేమించడం నీకు తెలియదు’ అని చెప్పాడు. అందుకు అతడి తల్లి, ‘ఏం వాగుతున్నావు? నేను తల్లిని, నాకు ప్రేమించడం తెలియదా?’ అని అడిగిందట. గురుదేవుల ప్రేమ అలాంటిది. బాబూరాం తన నాలుగవ ఏటనే, ‘నాకు పెళ్లి వద్దు, పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను’ అనేవాడట.
“అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు గురుదేవులు ఏమీ తినలేకపోయేవారు. అప్పుడాయన, ‘ఈ నోటితో తినకపోతే ఏం? తదనంతరం నేను సూక్ష్మ శరీరంతో జీవించి లక్షలాది నోళ్ల ద్వారా తింటాను’ అనేవారు. అందుకు బాబూరాం, ‘మీ లక్షలాది నోళ్లతో మాకు పనిలేదు. మీరు ఈ నోటితో తినాలి, ఈ నోటిని చూడటమే నాకు కావలసింది’ అని అన్నాడు.
“అధిక సంతానం కలిగినవారెవరినీ గురుదేవులు సమర్థించేవారు కారు. ఇరవై ఐదుమంది పిల్లలను కని పారేస్తాడు. అతగాడు ఒక మనిషా? వాడు ఇంద్రియనిగ్రహం ఏమీ లేని పశువు!”
గోలాప్ మా ఆరోగ్యం కాస్త మెరుగైంది. నరాల ద్వారా ఏదో మందు ఇస్తు న్నట్లు సరళ వచ్చి చెప్పింది. పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలలు పడుతుందని డాక్టర్ బిపిన్ దాస్ చెప్పాడు. మాతృదేవి ఇలా అన్నారు:
“రక్త విరేచనాలు సామాన్యమైన వ్యాధా? నరాల గుండా మందు ఇచ్చే తీరాలి. గురుదేవులు ఈ వ్యాధితో బాధపడేవారు. దక్షిణేశ్వరంలో వానాకాలంలో తరచూ ఆయనకు ఈ వ్యాధి వచ్చేది. నహబత్తు వైపు పొడవైన వసారా ఉంది కదా! అందులోనే ఆయన బయలుకు వెళ్లేవారు. నేను ఉదయం శుభ్రపరచేదాన్ని. సాయంత్రం వాళ్లు చేసేవారు. ఆ రోజుల్లో ఒక స్త్రీ వచ్చేది, కాశీ నుంచి వచ్చినట్లు చెప్పేది. ఆమె చికిత్స చేసిన తరువాత ఆయన వ్యాధి నయమైంది. తదనంతరం ఆమె వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆమె జాడ తెలియలేదు. ఆ తరువాత నే నామెను చూడలేదు. ఆమె నాకు గొప్ప సాయం చేసింది. కాశీకి వెళ్లినప్పుడు ఆమెను గురించి వాకబు చేశాను, కానీ కనిపించలేదు. గురుదేవులకు అవసరం కలిగినప్పుడల్లా కొందరు తమంతటతామే వచ్చి, అవసరం తీరగానే ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయేవారు.
“నేను కూడా ఒకసారి రక్తవిరేచనాలతో బాధపడ్డానమ్మా! శరీరం అస్థిపంజరమై పోయింది. కాలూగేడే తీరంలోనే మేం బయలుకు వెళ్లేవారం. పదే పదే వెళ్లడ మెందుకని చెరువు తీరంలోనే పడుకొన్నాను. ఒకసారి చెరువు నీటిలో నా ప్రతిబింబం చూసుకొని, హడలిపోయాను. దేహంలో కేవలం ఎముకలు మాత్రమే మిగిలి వున్నాయి. ‘ఛీ ఛీ! ఇదేమి శరీరం. ఇక ఇది ఎందుకు? ఇది ఇక్కడే పడివుండనీ, దీన్ని వదలివేస్తాను’ అని అనుకొన్నాను. అప్పుడు నిబి అక్కడికి వచ్చి, ‘ఓ భగవంతుడా! అమ్మా! నువ్వెందుకు ఇక్కడ పడి ఉన్నావు? రా, రా! ఇంటికి పోదాం’ అంటూ ఇంటికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం చెరువు తీరంలో అంత ఖాళీ చోటు లేదు. ఎవరెవరో చుట్టూ ఆక్రమించుకొని, పంచుకొన్నారు.”
ఆగస్టు 1, 1918
ఈరోజు మాతృదేవిని దర్శించడానికి వెళ్లినప్పుడు ఆమెతో చాలాసేపు మాట్లాడే అవకాశం దొరికింది. ముఖ్యంగా సంభాషణ మఠ సన్న్యాసుల గురించే సాగింది. ప్రేమానందస్వామి నిర్యాణానంతరం మాతృదేవి తమ సన్న్యాస సంతానం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారేమో మరి!
మాతృదేవి: గురుదేవులు నిశితంగా పరీక్షించిన తరువాతే వారిని స్వీకరిం చారు. బారానగర్ మఠంలో వారు గడిపిన జీవితం, అమ్మో! నిరంజన్– గిరంజన్ అంతా పస్తులతో జపధ్యానాలు చేసుకొంటూ ఎన్నో రోజులు గడిపారు!
బేలూర్ మఠంలో ప్రప్రథమంగా దుర్గాపూజ నిర్వహించినప్పుడు నరేన్ నన్ను తీసుకుని వెళ్లాడు. దక్షిణగా పూజారికి ఇరవై ఐదు రూపాయలు నా చేతుల మీదుగా ఇప్పించాడు. పూజకు వేయి నాలుగు వందల రూపాయలు ఖర్చు అయింది. ఆ రోజు ఇసుకవేస్తే రాలనంత జనం. సన్న్యాసులందరూ ఎంతో శ్రమించి పనిచేశారు. నరేన్ నాతో, ‘అమ్మా! నాకు జ్వరం వచ్చేలా చేయండి’ అని అడిగాడు. భగవంతుడా, అలా అన్నాడో లేదో ఒకింత సేపట్లో తీవ్రజ్వరంతో పడుకొన్నాడు. ‘దేవుడా! ఇలా జరిగిపోయిందే! ఇప్పుడు ఏం చేయాలి!’ అనుకొని తపించిపోయాను. అందుకు అతడు ఇలా చెప్పాడు: ‘అమ్మా! బాధపడకండి. ఈ జ్వరం రావాలని కోరుకోవడానికి కారణం ఇది: అంతా కష్టించి పనిచేస్తున్నారు. కానీ ఏదో చిన్న పొరపాటు జరిగి అది నా కంటపడితే నేను కోపంతో వాళ్లను చీవాట్లు పెడతాను, చెంపలు కూడా వాయిస్తానేమో! అది వారికి బాధాకరం, నాకూ ఆవేదనగా ఉంటుంది. అందుకే కాసేపు జ్వరంతో పడుకొని ఉండడమే ఉత్తమం అనుకొన్నాను.’ పనులన్నీ పూర్తయ్యాక నేను నరేన్ వద్దకు వెళ్లి, ‘నరేన్, అంతా ముగిసింది. లే నాయనా!’ అని చెప్పాను. అతడు కూడా, ‘ఇంకేముంది అమ్మా! లేవాల్సిందే’ అంటూ కులాసాగా లేచి కూర్చున్నాడు.
నరేన్ దుర్గాపూజకు తన తల్లిని కూడా తీసుకు వచ్చాడు. ఆమె తోటలో తిరుగుతూ వంకాయలూ, మిరపకాయలూ కోస్తున్నారు. ‘ఇదంతా నా కుమారుడి వల్లనే’ అనే కించిత్తు గర్వం ఆమెలో కనిపించింది. అప్పుడు నరేన్ ఆమె వద్దకెళ్లి, ‘అమ్మా! ఇక్కడ ఏం చేస్తున్నావు? మాతృదేవి వద్దకు వెళ్లరాదా? మిరపకాయలూ, వంకాయలూ కోస్తూ తిరుగుతున్నావే! ఇవన్నీ నీ కుమారుడే చేశాడని అనుకొంటున్నావేమో! లేదమ్మా, లేదు. ఎవరు చేయాలో, ఆయనే చేశారు. నరేన్‌ది ఏమీ లేదు’ అని చెప్పాడు. గురుదేవులే సమస్తమూ చేస్తున్నారన్నదే నరేన్ అభిప్రాయం. హా! నా బాబూరాం లేడే! ఈసారి ఎవరు పూజ చేస్తారు?
ఆగస్టు 6, 1918
నేడు నేను వెళ్లేసరికి మాతృదేవి ఉత్తరం వైపు వసారాలో కూర్చొని జపం చేసుకొంటున్నారు. కొంతసేపయ్యాక ఐదారుగురు భక్తురాండ్రు వచ్చారు. వారు గురుదేవులకు ప్రణామం చేసి వచ్చి కూర్చొనేసరికి మాతృదేవి జపం ముగించారు. ఎక్కణ్ణుంచి వస్తున్నారని ఆ భక్తురాండ్రను ప్రశ్నించారు. నళిని వారిని మాతృదేవికి పరిచయం చేసింది. వారిలో ఒకామె కడుపులో ఉన్న కణితి (tumour) చికిత్స కోసం వచ్చింది. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. అందువలన ఆమె ఎంతో భయపడుతోంది.
వారిలో ఎవరినీ తమ పాదాలు స్పృశించి ప్రణామం చేయడానికి మాతృదేవి అనుమతించ లేదు. అది ఎందుకో ఎవరికెరుక! కానీ వారు మాత్రం అందుకోసం మరీ మరీ ప్రాథేయపడ్డారు. కానీ మాతృదేవి, “ఆ గుమ్మం నుండి నమస్కారం చేస్తే చాలు” అని నిష్కర్షగా చెప్పేశారు. చివరికి వారు ఆ వ్యాధిగ్రస్తురాలైన స్త్రీని చూపుతూ, “ఈమెకు నయమవాలని ఆశీర్వదించండి. ఈమె మళ్లీ ఇక్కడకు వచ్చి మిమ్మల్ని దర్శించుకొనేట్లు అనుగ్రహించండి” అని ప్రార్థించారు. మాతృదేవి వారికి నమ్మకం జనించేలా, “గురుదేవులను హృదయపూర్వకంగా ప్రార్థించండి. సమస్తమూ ఆయనే” అని చెప్పారు. పిదప వారితో, “మంచిది వెళ్లిరండి, పొద్దుపోతోంది” అని చెప్పారు.
వారు గురుదేవులకు ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్న తరువాత, “గదిని బాగా ఊడ్చి, గంగాజలం చిలకరించండి. నైవేద్యానికి సమయమైంది” అని మాతృదేవి చెప్పారు. అట్లే చేశారు.
తరువాత మాతృదేవి పరుపు మీద పడుకొని, విసనకర్రను నాకు అందించి, ఇలా అన్నారు:
“కాస్త విసురు తల్లీ! ఒళ్లు దహించుకుపోతోంది. మీ కలకత్తాకు ఒక నమస్కారం! అబ్బబ్బ! ‘నాకు ఈ దుఃఖం’ అంటాడు ఒకడు. ‘నాకు ఆ దుఃఖం’ అంటుంది ఒకతె. ఇంతకంటే భరించలేను. కొందరు చేయని పాపం అంటూ ఏదీ ఉండదు. కొందరికో, పిల్లలు ఇరవై ఐదుమంది! వారిలో పదిమంది చనిపోయారని ఏడుపు! వీరు మనుషులేనా! కాదు, కాదు; మృగాలు, వట్టి మృగాలు. నిగ్రహం లేదు, ఏదీ లేదు. అందుకే గురుదేవులు, ‘ఒక సేరు పాలలో ఐదు సేర్ల నీళ్లు కలిపిన చందాన ఉంది వ్యవహారం. అగ్నిని ప్రజ్వలింపచేయడానికి ఊది ఊది కళ్లు మండుతున్నాయి. నా సన్న్యాస శిష్యులెక్కడ? రండి, నా శిష్యులారా రండి! మీతో మాట్లాడి బ్రతికి బయటపడతాను’ అనేవారు. అది ముమ్మాటికీ సత్యం! బాగా విసురు తల్లీ! సాయంత్రం నాలుగు నుండే జనం వస్తున్నారు. ఇంతకుమించి లోకుల దుఃఖాన్ని నేను భరించలేను.
“ఆహా! బలరాం భార్య కూడా ఈ రోజు వచ్చింది. బాబూరాంను తలచుకొని ఆమె ఎంతగానో విలపించింది* . ‘బాబూరాం ఒక సాధారణ సోదరుడా ఏమిటి? అతడు దైవసమానుడు’ అన్నదామె.”
కాసేపయ్యాక ఒంటికి తైలం మర్దించమని మాతృదేవి చెప్పారు. తైలం రాస్తూనే, “అమ్మా! భక్తుల కోసం పప్పుతో చేసిన పులుసు తీసుకువచ్చాను” అని చెప్పాను. అందుకు మాతృదేవి, “మంచి పని చేశావు. రాఖాల్ కూడా రెండు చేపలు పంపించాడు. బాబూరాం నిర్యాణం తదుపరి అతడు కూడా చేపలు తినడం లేదు” అని అన్నారు.
ఇంతకు మునుపు ఒక రోజు రాధూ భర్త మాంసాహారం తినగోరాడు. ఆ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు, “ఇప్పుడది ఎలా కుదురుతుంది? నా బాబూరాం పోయి కొన్ని రోజులు కూడా కాలేదు. అందరూ శోకంలో మునిగి ఉన్నారు. ఇది గురుదేవుల కుటుంబం. అందుకే దైనందిన వ్యవహారాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. లేకుంటే ఇల్లంతా ఏడ్పులతో ప్రతిధ్వనించేది. ఎవరైనా ఈ విషాదం నుండి తప్పించుకోగలరా? కానీ తినాలనే కోర్కె అతడిలో జనించింది, ఇచ్చే తీరాలి. ఎవరైనా వండితే పెట్టవచ్చు” అంటూ నన్ను చూశారు.
నేను: నా వంట ఆయనకు నచ్చితే నేను తీసుకువస్తాను.
మాతృదేవి: ఎందుకు తినడు? బాగానే తింటాడు. వండి పంపించు. కొందరు పిల్లలు కూడా తినగోరుతున్నారు. దేవికి నివేదనం చేసి ప్రసాదంగా ఇస్తే వాళ్లూ తింటారు. అవును, యోగీన్! దీనికంతా ఎంత ఖర్చవుతుంది?
యోగీన్: మూడు నాలుగు రూపాయలకు తగ్గదు.
మాతృదేవి: అలా అయితే కొంత డబ్బు పట్టుకెళ్లు.
నేను: వద్దమ్మా! శోకహరణ్కు కోపం వస్తుంది.
మాతృదేవి (నవ్వుతూ): అలా అయితే వదలిపెట్టు.
మరుసటి ఆదివారం నాడు కాళీఘాట్ కాళికాలయంలో నివేదన చేసిన మాంసం మాతృదేవి ఇంటికి పంపించాను.
ఆగస్టు 12, 1918
నే డు మాతృదేవి దర్శనార్థం వెళ్లాను.
మాతృదేవి: నువ్వు పంపిన మాంసం బాగుంది. అంతా బాగా తిన్నారు. ఎలా వండావు? గురుదేవులు కాశీపూర్‌లో ఉన్నప్పుడు నేను కూడా మాంసం వండేదాన్ని. మాంసంలో నీరు పోసి కరివేపాకు, కాస్త మసాలా కలిపి వండేదాన్ని.
నేను: అది కాస్త పలుచగా ఉన్నట్లు అనిపిస్తుంది.
మాతృదేవి: ఉండొచ్చు. నా నరేన్ రకరకాలుగా మాంసం వండేవాడు. వేపుడు, కూర అంటూ ఎన్నో చేసేవాడు. బంగాళదుంపలు కలిపి కూడా వండేవాడు – దాని పేరేమిటి? ఏదో అంటారే!
నేను: కట్లెట్!
మాతృదేవి: కావచ్చు. అవునూ, ఇవన్నీ వండడం నీకు తెలుసా?
నేను: తెలుసు. రేపు చేసి తీసుకొస్తాను. మీకు తినడానికి ఏదైనా తీసుకు రావాలని శోకహరణ్ ఎంతో ఆశపడుతున్నాడు. ఏదైనా నేను వండి తీసుకొస్తే తింటారా!
మాతృదేవి: ఎందుకు తినను? నువ్వు నా కుమార్తెవు. కానీ ఎక్కువగా తీసుకు రావద్దు. కొద్దిగా తీసుకురా. ఆరోగ్యం బాగాలేదు కదా!
నేను: అలాగేనమ్మా.
మర్నాడు మాతృదేవి కోసం కొద్దిగా వండి తీసుకువెళ్లాను.
ఆగస్టు 14, 1918
నేడు మాతృదేవిని చూడడానికి వెళ్లినప్పుడు ఆమె డాక్టర్ దుర్గాప్రసాద్ సోదరితో మాట్లాడుతున్నారు. మరో ఇద్దరు స్త్రీలు, ఢాకా నుంచి వచ్చిన ఒక స్త్రీ కూడా అక్కడ ఉన్నారు. వీరంతా మాతృదేవి చుట్టూ కూర్చొని ఉన్నారు. మాతృదేవికి ప్రణామం చేసి నేను కూడా కూర్చున్నాను. డాక్టర్గారి సోదరికి చిన్నతనంలోనే వైధవ్యం దాపురించింది. ఆమె భర్త ఆస్తి విషయంలో ఏవో చిక్కులు తలెత్తాయి. వీలునామా ధ్రువపత్రాన్ని ఆమె సంపాదించలేకపోయింది. ఈ విషయాల గురించే ఆమె మాతృదేవితో మాట్లాడుతున్నారు. చివరకు మాతృదేవి ఆమెతో ఇలా అన్నారు:
“ఆస్తిని విక్రయించడానికి నీకు హక్కు లేని పక్షంలో నమ్మకస్థుడైన ఒక మంచి మనిషి అజమాయిషీ కింద దాన్ని వదలిపెట్టు. లౌకికులను ఎలా నమ్మడం? నిజమైన సాధుసన్న్యాసులు మాత్రమే ధన ప్రలోభానికి అతీతులు. అమ్మాయీ! మరీ అంతగా ఆందోళన చెందవద్దు. భగవత్సంకల్పం ప్రకారమే అంతా జరుగుతుంది. నువ్వు ధర్మ మార్గంలోనే నడుచుకొంటున్నావు. గురుదేవులు నిన్ను కష్టాల పాలు జేస్తారా? (బండి వచ్చిందనే సమాచారం విని) సరే, వెళ్లిరా! ఉత్తరం వ్రాయి. మళ్లీ రా!”
ఆమె వెళ్లిపోయాక వైద్యుడు శ్యామాదాస్, గోలాప్ మాను పరీక్షించడానికి వచ్చాడు. అతడి కోసం మాతృదేవి కాసేపు వేచివున్నారు. అతడు వెళ్లిపోయాడని తెలుసుకొని మాతృదేవి పడుకొని, నాతో, “ఇక నీ పని ప్రారంభించవచ్చు” అని చెప్పారు. నేను మాతృదేవికి తైలం రాసి, మర్దించసాగాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు:
“ఆహా! గిరీష్ సోదరికి నేనంటే ఎంతో ప్రీతి. తన ఇంట్లో వండిన పదార్థాలలో నా కోసం కొంత ప్రత్యేకంగా కేటాయించి, ఇక్కడకు పంపించేది. ఎన్నెన్ని వంట కాలు! ఒక బ్రాహ్మణుడు వాటిని తీసుకువచ్చేవాడు. నేను వాటిని తింటున్నప్పుడు ఆమె నా పక్కన కూర్చొనేది. ఒక రోజు ఆమె నాతో, ‘అమ్మా! ఆ వేపిన చేపను తీసుకోండి. మీకేం దోషం!” అన్నది. ‘అదెలానమ్మా!’ అన్నాను నేను. ఆమె ప్రేమ నోటి మాట కాదు. సంపన్నమైన కుటుంబంలో ఆమెకు వివాహమైంది. కానీ ఆస్తినంతా బంధుగణం దుర్వినియోగం చేసింది. అతుల్* ఐదువేల రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించాడు. దీనికి తోడు ఒక ఏడాదిపాటు ఆమె భర్త జబ్బుకు అధిక మొత్తంలో ధనం వ్యయమైంది. తన వీలునామాలో నాకు నూరు రూపాయలు చెందాలని వ్రాసింది. తను బ్రతికి ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని నాకు ఇవ్వడానికి ఆమె సిగ్గుపడి ఉండవచ్చు; నూరు రూపాయలు చాలా చిన్నమొత్తమని ఆమె తలచి ఉండవచ్చు. ఆమె మరణానంతరం ఆమె సోదరుడు ఆ డబ్బును నాకు అందజేశాడు.
“ఆహా! దుర్గాపూజకు ముందు రోజు మధ్యాహ్నం నన్ను చూడడానికి ఆమె వచ్చింది. అదే నాతో ఆమె తుది సమావేశం. ఇక్కడ ఉన్నంతసేపు ఆమె నన్ను ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉండలేదు. దుర్గాపూజ పూర్తవగానే, నేను కాశీకి వెళ్లేట్లు ఏర్పాట్లు చేశారు. అందువలన ఆమె వచ్చిన రోజు పెట్టె, పరుపు ఇత్యాదులు సర్దు కోవడానికి ఈ గదికి ఆ గదికి తిరుగుతున్నాను. చివరకు ఆమె బయలుదేరేటప్పుడు, ‘నేను వెళ్లివస్తానమ్మా!’ అంది. నేను పరధ్యానంలో ఉండి ‘సరే, వెళ్లు’ అని చెప్పాను. ఆమె కూడా చకచకా మెట్లు దిగి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిన తరువాతే నా మాటలోని అర్థం స్ఫురించింది. ‘ఎలాంటి మాట అన్నాను! వెళ్లమన్నానే! ఇంతదాకా ఎవరితోనూ అలా అని ఎరుగనే!’ అనుకొని మనస్సులో ఆందోళన చెందాను. మళ్లీ ఆమె తిరిగి రాలేదు* . నా నోట అటువంటి మాట ఎందుకు వెలువడిందో నాకే తెలియదు.”
దేన్ని గురించో ఆలోచిస్తునట్లు మాతృదేవి ఒకింత ప్రశాంతంగా ఉన్నారు. తరువాత నాతో ఇలా అన్నారు:
“నువ్వు నిన్న రాలేదే! శోకహరణ్ చక్కటి తామర పువ్వులు పంపించాడు. వాటితోనే పూజ చేశాను. గురుదేవులను అందంగా అలంకరించాను. నువ్వు వచ్చి చూస్తావని రాత్రి చాలాసేపటి దాకా అలంకారాన్ని తీసివేయకుండా ఉంచాను.”
ఒక రోజు సాయంత్రం మాతృదేవి వద్దకు వెళ్లాను. అప్పుడు మాతృదేవి పడుకొని ఉన్నారు. రాధూ మరొక చాప మీద మాతృదేవి ప్రక్కన పడుకొని, తనకు కథ చెప్పమని వేధిస్తోంది. నన్ను చూడగానే మాతృదేవి, “నువ్వొక కథ చెప్పు తల్లీ” అని అడిగారు. నాకు ఏం చేయాలో పాలుపోక, అయోమయంలో పడ్డాను. మాతృదేవి సమక్షంలో ఏం కథ చెప్పాలి? ఆ రోజు మీరాబాయి చరిత్ర చదివాను. అందువలన ఆ కథే చెప్పసాగాను. మీరాబాయి పాటలో వచ్చే, ‘ప్రేమ లేనిదే కృష్ణుని పొందలేం* ’ అనే చరణం చెప్పగానే మాతృదేవి తన్మయురాలై, “ఆహా! ఆహా! నిజమే కదా! ప్రేమ భక్తి లేనిదే ఏదీ లభించదు” అని వ్యాఖ్యానించారు. రాధూకు ఆ కథ నచ్చలేదు. తరువాత సరళ వచ్చి రాజు–రాణి కథ చెప్పింది. ఆ కథ ఆమెకు బాగా నచ్చింది.
సరళను మాతృదేవి ఎంతగానో అభిమానించారు. జబ్బుగా ఉన్న గోలాప్ మాకు శుశ్రూష చేస్తున్నందున కాసేపట్లో సరళ వెళ్లిపోయింది.
కాసేపు మాతృదేవి ప్రశాంతంగా ఉన్నారు. తరువాత, “మఠానికి ఇది క్లిష్ట కాలం. నా బాబూరాం, దేవవ్రతుడు, సచిన్ అంతా పోయారు” అన్నారు.
దేవవ్రత మహరాజ్ చనిపోవడానికి కొన్ని రోజుల మునుపు బ్రహ్మానందస్వామి ఉద్బోధన్లో ఒక పిశాచాన్ని చూశారు. ఆ విషయం గురించి మాతృదేవిని అడి గాను. అందుకు ఆమె ఇలా చెప్పారు:
“మెల్లగా మాట్లాడు, లేకుంటే అందరూ భయపడతారు. గురుదేవులు ఇలాంటివి ఎన్నో చూశారు. ఒకసారి ఆయన రాఖాల్తో వేణీపాల్ ఉద్యాన గృహా నికి వెళ్లారు. అక్కడుంటున్న ఒక పిశాచం ఆయన వద్దకు వచ్చి, ‘నువ్వెందుకు ఇక్క డకు వచ్చావు? మేం దహించుకుపోతున్నాం. నువ్వు ఇక్కడ ఉండడం మేం భరించలేకపోతున్నాం. వెళ్లిపో, ఇక్కణ్ణుండి వెళ్లిపో’ అని చెప్పింది. ఆయన పవిత్ర సాన్నిధ్యంలో అవి ఎలా నిలవగలవు? గురుదేవులు ఎవరితోనూ ఏమీ చెప్పకుండా రాఖాల్ను వెంటబెట్టుకొని ఆ రాత్రే తిరిగి వచ్చేశారు. తదనంతరం ఈ సంగతి విన్న రాఖాల్, ‘అమ్మో! అక్కడ ఈ సంగతి నాకు చెప్పకపోవడం మంచిదయింది. చెప్పివుంటే వణికిపోయి నా పళ్లు రాలిపోయి ఉండేవి. ఇప్పుడు వింటూ ఉంటేనే శరీరమంతా వణికిపోతున్నది’ అని అన్నాడు.”
ఇలా చెబుతూ మాతృదేవి నవ్వారు.
నేను: అమ్మా! ఆ పిశాచాలు పరమ మూర్ఖమైనవి. గురుదేవులను ముక్తిని అనుగ్రహించమని కోరి ఉండవచ్చు కదా! అందుకు మారుగా ఆయనను వెళ్లి పొమ్మన్నాయి.
మాతృదేవి: గురుదేవులను దర్శించిన తదుపరి అవి ప్రత్యేకంగా ముక్తిని యాచించాలా? నరేంద్రుడు ఒకసారి మద్రాసులో పిండప్రదానం చేసి పిశాచాలకు ముక్తి కలిగించాడు.
నేను: అమ్మా! నాకొక కల వచ్చింది. ఆ కలలో నా భర్తా, నేనూ ఎక్కడకో పోతున్నాం. తీరాలే తెలియరాని నది ఒకటి ప్రవహిస్తూ ఉంది. చెట్ల నీడగల బాటపై నేను నడుస్తున్నాను. హఠాత్తుగా బంగారు రంగుగల తీగ నన్ను చుట్టివేసింది. ఎంత ప్రయత్నించినా దాని బారి నుండి నేను బయటపడలేకపోయాను. ఇంతలో నా భర్త కూడా ఎటో వెళ్లిపోయాడు. నేను దిగ్భ్రమతో నిలబడిపోయాను. అప్పుడు నల్లని మేని రంగుగల ఒక బాలిక పడవలో వచ్చి నన్ను కాపాడింది. నేను పడవ ఎక్కగానే కల చెదిరిపోయింది.
మాతృదేవి: నల్లని బాలికగా వచ్చింది మహామాయయైన దేవియే. అమ్మాయీ! ఈ లోకంలో భర్త, కుమారుడు, ఈ శరీరం – ఏదీ సత్యం కాదు. ఈ మాయా బంధాలను ఛేదించకపోతే సంసార సాగరాన్ని దాటలేం. చివరకు ఈ మాయను కూడా ఛేదించివేయాలి. అమ్మాయీ! ఏం శరీరం ఇది? ఒక పిడికెడు బూడిదకాక మరేమిటి? దీనికి ఇంత గర్వం ఎందుకు? ఎంత దారుఢ్యమైన శరీరమైనప్పటికీ, కాలిస్తే ఒక పిడికెడు బూడిదే అవుతుంది! దీనిపట్ల ఎంత అనురక్తులై ఉంటున్నాం. హరి, హరి, జై జగదంబ, గోవిందా, రాధేశ్యాం, గురుదేవా, గురుదేవా, గంగా, గంగా!
ఆరోగ్యం పుంజుకోవడానికై ఆరా జిల్లాలోని కైల్వార్ అనే ఊళ్లో ఒకసారి బస చేశాను. గోలాప్, బాబూరాం తల్లి, బలరాం భార్య ప్రభృతులు పలువురు నా వెంట ఉన్నారు. ఆ ప్రాంతంలో లేళ్లు ఎలా పరుగులెత్తేవని! పక్షులు ఎగిరేలా పరుగులు తీసేవి. ‘లేడి బొడ్డున కస్తూరి ఉత్పన్నమవుతుంది. దాని పరిమళానికి ఆకర్షింపబడి నాలుగు వైపులా అవి పరుగులు తీస్తాయి. పాపం ఎక్కణ్ణుంచి ఆ పరిమళం వస్తోందో వాటికి తెలియరాదు’ అనేవారు గురుదేవులు. ఈ విధంగానే భగవంతుడు మనిషి దేహంలో విరాజిల్లుతున్నాడు. ఆయనను తెలుసుకోలేక మనిషి పరిభ్రమిస్తున్నాడు. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కినవన్నీ అసత్యం. అవును కదా అమ్మా!
మాతృదేవి శరీరమంతా వేడి పొక్కులు వచ్చి, తీరని బాధను కలిగిస్తున్నాయి. ఆ బాధ ఇప్పుడు ఎక్కువయ్యింది. ఆమె ఇలా అన్నారు: “మూడు సంవత్సరా లయిందమ్మా! ఈ బాధతో ప్రాణం పోతున్నది. ఎవరి పాపం నాకు చుట్టుకొన్నదో తెలియదు. లేకుంటే ఈ దేహానికి వ్యాధి దాపురిస్తుందా ఏమిటి?”
ఒక రోజు సాయంత్రం వెళ్లాను. అప్పుడు నివేదిత పాఠశాల నుండి ఒకరిద్దరు స్త్రీలు వచ్చివున్నారు. తమిళనాడు నుండి కూడా ఇద్దరు స్త్రీలు వచ్చివున్నారు. మాతృదేవి వారి చదువును గురించి అడుగుతున్నారు. వారికి ఆంగ్లం వచ్చునని తెలుసుకొని మాతృదేవి వారితో, “ ‘మేం ఇప్పుడు ఇంటికి వెళతాం’ – ఈమాటను ఆంగ్లంలో చెప్పండి చూద్దాం” అని అన్నారు. “నువ్వు చెప్పు, నువ్వు చెప్పు” అంటూ వారిద్దరూ పరస్పరం చెప్పుకొన్నారు. తరువాత వారిలో పెద్దావిడ ఆ మాటను ఆంగ్లంలో తర్జుమా చేసి చెప్పింది. మాతృదేవి మళ్లీ, “ ‘ఇంటికి వెళ్లి ఏం తింటావు?’ – ఈ మాటను ఎలా ఆంగ్లంలో చెప్పాలి?” అని అడిగారు. వారు ఆ మాటను కూడా ఆంగ్లంలో తర్జూమా చేసి చెప్పారు. అది విని మాతృదేవి ఎంతో సంతోషించారు, ఆహ్లాదంగా నవ్వారు. చివరకు, “మీకు పాడడం వచ్చా?” అని అడిగారు. వారు వచ్చునని చెప్పగానే, పాడమన్నారు. తమిళ పాటలు పాడారు.ఆ పాటలు విని మాతృదేవి ఎంతో ఆనందించారు.
ఒక రోజు నేను వెళ్లినప్పుడు దుర్గ ఆశ్రమంలోని ఇద్దరు బాలికలతో వచ్చివుంది. వారు ప్రణామం చేసిన తరువాత మాతృదేవి, చిన్న బాలికతో, “నీకుపాడడం తెలుసా?” అని అడిగారు. “తెలుసు” అని ఆ అమ్మాయి చెప్పగానే, “అలా అయితే పాడు” అన్నారు మాతృదేవి.
ఆ అమ్మాయి పాడిన పాటలో ఒకటి రెండు చరణాలే జ్ఞాపకం:
శారదాపతీ నీ పాదపద్మాలు ప్రసాదించు
గతిలేని నిరుపేదలను కటాక్షించు
దీనుడినైన నన్ను అనుగ్రహించి కాపాడు.
గౌరీ మా పాడినట్లే ఉంది. మాతృదేవి అబ్బురపోతూ, “ఏం ఆశ్చర్యం! అచ్చం గౌరీ పాడినట్లే ఉంది. ఆమె బ్రతికే ఉంది. లేకపోతే ఆమె ఆత్మ ఈమెలో ప్రవేశించిందని చెప్పేదాన్ని” అని అన్నారు. తరువాత ఆ చిన్నారి చుబుకాన్ని స్పృశించి, ఆప్యాయంగా ఆశీర్వదించారు. మరో రోజు వచ్చి పాడమన్నారు.
1918
ఒక రోజు సాయంకాలం వెళ్లాను. అప్పుడు మాతృదేవి మంచం ప్రక్కన చాప మీద పడుకొని ఉన్నారు. ఆమెకు ప్రణామంచేసి, సంభాషణ ప్రారంభించాను.
నేను: అమ్మా, ఈ ఇంటికి వచ్చి చాలా రోజులయింది. కాళీఘాట్ ఇంటికి తిరిగి వెళ్లమంటారా?
మాతృదేవి: ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా! అక్కడకు వెళ్లి పోతే ఇక్కడికి తరచూ రాలేవు. నువ్వు ఒక్క రోజు రాకపోతే, ‘ఆమె ఎందుకు రాలేదు?’ అనుకొంటాను. నిన్న నువ్వు రాలేదు. ఒంట్లో కులాసాగా లేదేమో అనుకొన్నాను. ఈ రోజు కూడా నువ్వు రాకుంటే, వంటమనిషిని పంపేదాన్ని. కానీ నీ భర్త మనస్సు కూడా తెలుసుకో. అతడికి అనారోగ్యంగా ఉంటేనో లేక అక్కడికి వెళ్లిపోవాలని అతడు అనుకొంటేనో తక్షణమే బయలుదేరు.
నేను: ఆయన సంతోషంగా ఉన్నా లోకం అంటూ ఒకటి ఉంది కదా! ‘ఇల్లు, పనులు అన్నీ వదలుకొని చెల్లెలి ఇంట్లో తిష్ఠవేసింది. భర్తకు సపర్యలు, ఇంటి పనులు చేయడమే కదా స్త్రీకి అందం’ అంటారు.
మాతృదేవి: ఇంటి పనులు ఇన్ని రోజులుగా చేస్తూనే వచ్చావు. లోకం గురించి పట్టించుకోకు. లోకులు అలాగే మాట్లాడతారు. దుర్గాపూజ సమయంలో నువ్వు ఎలాగైనా వెళ్లే తీరాలి.
నేను: కుటుంబం గురించి ఆలోచనలు నా మనస్సులో ఎన్నడూ మెదలలేదు. మీ వద్దకు ఎప్పుడెప్పుడు వస్తానా అనే ఆలోచన ఒక్కటే నా మనస్సులో చోటుచేసుకొని ఉంటుంది.
మాతృదేవి: ఇంకేం? ఈ నెల ఉండి వెళ్లు.
ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చి మాతృదేవి దర్శనార్థం ఎవరో భక్తురాలు వచ్చిందని చెప్పాడు. మాతృదేవి బాగా అలసిపోయి ఉన్నారు. ఆ మాట వినగానే, “ఇదిగో, మరొకామె హాజరైంది. ఏం కష్టం!” అంటూ లేచి కూర్చున్నారు. ఖరీదైన చీర, నగలు ధరించిన ఒక స్త్రీ వచ్చి మాతృదేవి పాదాలను తన తలతో స్పృశించి ప్రణామం చేసింది. వెంటనే మాతృదేవి, “దూరం నుండే నమస్కరించమ్మా! ఎలా ఉన్నావు?” అని అడిగారు.
భక్తురాలు: మీకు తెలుసు కదా! నా భర్తకు జబ్బుగా ఉంది.
మాతృదేవి: అవును, విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? వ్యాధి ఏమిటి? ఎవరు వైద్యం చేస్తున్నారు?
భక్తురాలు: మధుమేహం! డాక్టర్ మాట ఆయన వినడం లేదు. మీరే ఏమైనా చేయాలి. ఆయనకు నయమవుతుందని మీరు చెప్పండి.
మాతృదేవి: నాకేం తెలుసమ్మా! సమస్తమూ గురుదేవులే! ఆయన నయం చేస్తే నయమవుతుంది. నీ ప్రార్థనను ఆయనకు విన్నవిస్తాను.
భక్తురాలు: అది చాలు! మీ మాటను గురుదేవులు కాదంటారా?
అలా అంటూ ఆమె మాతృదేవి పాదాలపై తల ఉంచి విలపించసాగింది.
మాతృదేవి: గురుదేవులను ప్రార్థించు. సమస్తాన్నీ నడుపుతున్నది ఆయనే!
ఈ విధంగా ఒకటి రెండు మాటలు మాట్లాడిన తరువాత ఆ భక్తురాలు మాతృదేవికి ప్రణామం చేసి, శరత్ మహరాజ్‌ను చూడడానికి క్రిందికి వెళ్లింది.
“అమ్మమ్మా! లోపల దుఃఖానలంతో నా శరీరం దగ్ధమైపోతున్నది” అంటూ మాతృదేవి పడుకొన్నారు. నేను మాతృదేవికి తైలం రాసి మరన్ద చేయబోతున్నప్పుడు, ఆ భక్తురాలితోపాటు వచ్చిన మరొక స్త్రీ మాతృదేవికి ప్రణామం చేయడానికి వచ్చింది. మాతృదేవి మళ్లీ లేవవలసి వచ్చింది. ఆమె వెళ్లిపోయాక మాతృదేవి పడుకొంటూ, “ఇక ఎవరు వచ్చినా సరే, నేను లేవను. ఈ కాళ్ల నొప్పితో ప్రతిసారీ లేవడం ఎంత బాధో తెలుసా? పైగా వేడిపొక్కులు! నడుం నొప్పితో ప్రాణాలు పోతున్నాయి. తైలం బాగా రాసి మర్దించు తల్లీ” అని చెప్పారు.
తైలమర్దన చేస్తూన్నప్పుడు ఆ భక్తురాలి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి ఇలా అన్నారు:
“ఏం మనిషి ఆమె! గురుదేవుల వద్దకు వచ్చింది. మేలిముసుగు వేసుకొని ఎంత వినమ్రంగా రావాలి! అత్తరు అదీ ఇదీ రాసుకొని ఎలా వచ్చిందో చూశావా! దేవాలయాలకు ఈ రీతిలోనా వెళ్లడం? ఆహా! ఆధునికుల నైజం ఇలా ఉంది కదా!”
ఆగస్టు 23, 1918
నేటి సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. గురుదేవులకు ప్రణామా లర్పించి, మాతృదేవికి ప్రణమిల్లాను. అప్పుడు ఒక భక్తురాలిని గురించి ఆమె ఇలా అంటున్నారు:
“ఆమె తన కోడలితో అతి కఠోరంగా ప్రవర్తిస్తుంది. అంత కాఠిన్యం పనికి రాదు. ఒక కంట కాస్త కనిపెట్టి ఉండడం మంచిదే! కానీ స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. కోడలు ఇంకా చిన్నపిల్లే కదా! తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని అభిలాష ఉంటుంది కదా! ఈమె మితిమీరి పెత్తనం చెలాయిస్తే ఆమె ఆత్మహత్యకో, ఇల్లు వీడి పారిపోవడానికో పూనుకొంటే ఏమవుతుంది?”
పిదప నన్ను చూస్తూ ఇలా అన్నారు:
“ఆమె పాదాలకు పారాణి పెట్టుకొంటుంది. అందువలన కొంప ఏం మునిగిపోతుంది? పాపం ఆమె భర్తను చూడడానికి కూడా వీలులేదు. అతడు సన్న్యాసం పుచ్చుకొన్నాడు. నా భర్తను కళ్లారా చూసుకొంటూ ఆయనను సేవించుకొనే భాగ్యం నాకు కలిగింది. వండి వడ్డించగలిగాను. పిలిచినప్పుడల్లా ఆయన సమీపానికి వెళ్లడం సాధ్యమైంది. ఆయన పిలువనంపని వేళల్లో నేను నహబత్తును వదలి బయటకు అసలు వచ్చేదాన్ని కాను. దూరం నుంచే ఆయనకు ప్రణామం చేసేదాన్ని.”
కొంతసేపటికి రాత్రయింది. మాతృదేవికి ప్రణామాలర్పించి సెలవు పుచ్చుకొన్నాను.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. అప్పుడు విలాస్ మహరాజ్ ఆరాత్రికం ముగించి తిరిగి వెళుతున్నారు. ఆయనను చూసిన సురబాల, “అవునూ, ఈయన పేరులో ఎందుకు ‘ఆనంద’* లేదు?” అని అడిగింది. అందుకు మాతృదేవి నవ్వుతూ, “ఎందుకు? ఆనందం లేదని ఎవరన్నారు? అతడి పేరు విశ్వేశ్వరానంద. ఒకని పేరు కపిల్. అతడు వట్టి కపిల్ మాత్రమేనా లేకపోతే ఆనంద చేర్చి కపిలానంద అవుతాడా?” అని అడిగారు.
అప్పుడు సరళ లోపలికి వచ్చింది.
మాతృదేవి: అవునూ, కపిల్ అంటే అర్థం ఏమిటి?
సరళ: ఎవరికి తెలుసు! బహుశా కోతి కావచ్చు.
నేను: అలా ఉంటుందా ఏమిటి? కపి అంటే కోతి. కపిల్‌కు అర్థం అది కాదు.
అందరూ నవ్వారు.
మాతృదేవి: మరొకరి పేరు భూమానంద. దీనికి అర్థం ఏమిటి?
నేను: అవన్నీ మీకే బాగా తెలుసుంటాయి.
మాతృదేవి: లేదు లేదు. మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను.
నేను: భూమా అంటే, ‘ఎల్లలు లేని, సర్వవ్యాపియైన పరమాత్మ’ అని చెప్పగా విన్నాను.
ఇది విని మాతృదేవి ఎంతో సంతోషించారు. నోటిని చేత్తో మూసుకొని నవ్వారు. కొన్ని సమయాల్లో మాతృదేవిని చూస్తే అమాయకురాలైన చిన్నపిల్లలా అనిపిస్తారు. కొన్ని సమయాలలో సూక్ష్మ పారమార్థిక తత్త్వాలను అలవోకగా వివరిస్తారు. పుస్తక జ్ఞానం విడమరచలేని అంశాలను గురించి వివరిస్తున్నప్పుడు సర్వజ్ఞురాలిగా కనిపిస్తారు.
మాతృదేవి: పోనీ, కపిల్ అంటే ఏమిటో చెప్పనే లేదే!
నేను: ఎవరికి తెలుసునమ్మా! సాంఖ్య దర్శనాన్ని ప్రతిపాదించిన ఋషిపేరు కపిలుడు. బూడిద రంగును కపిల వర్ణం అంటాం. కానీ సన్న్యాస నామాన్ని ఏ అర్థంతో నిర్ణయించారో తెలియరాదు. మరేదైనా అర్థం ఉందో ఏమో! నిఘంటువుచూసి రేపు చెబుతాను.
ఒక రోజు సాయంత్రం మాతృదేవిని దర్శింప వెళ్లాను. అప్పుడు ఒకసన్న్యాసి వచ్చి మాతృదేవికి ప్రణామం చేశాడు.
సన్న్యాసి (మాతృదేవితో) : అమ్మా! మనస్సు అప్పుడప్పుడు ఎంతో చంచల మవుతూ ఉంటుంది, ఎందుకు? సదా మిమ్మల్ని ధ్యానించ లేకపోతున్నాను. ఎందువల్ల? ఎందుకూ కొరగాని తలపులు ఎందుకు వస్తున్నాయి? అమ్మా! అల్ప వస్తువులన్నీ కోరుకోగానే లభిస్తాయి, లభిస్తున్నాయి కూడా! మిమ్మల్ని మాత్రం పొందలేమా?అమ్మా, నాకెప్పుడు మనశ్శాంతి లభిస్తుంది? మీ కరుణాకటాక్షం నాకు కలగడంకల్లా? ప్రస్తుతం దివ్యదర్శనాలు కూడా నాకు కరవైపోయాయి. పరమార్థాన్ని కాంచకపోతే నేను బ్రతకడంలో ఏం ప్రయోజనముంది? మరణించడమే మేలు!
మాతృదేవి: ఏం మాటలు అంటున్నావు నాయనా! ఇటువంటి తలపులు రావచ్చా? దివ్యదర్శనాలు రోజూ లభిస్తాయా ఏమిట? గాలం వేసి కూర్చుంటే నిత్యం పెద్ద చేపలు పడతాయా? ‘గాలం, ఎర ఇత్యాదులన్నీ సిద్ధం చేసుకొని కాచుకొని కూర్చుంటే ఒక వేళ పెద్దచేప చిక్కవచ్చు, ఎన్నోసార్లు చిక్కక పోవచ్చు. అందుకనికూర్చోవడం మానుకోవద్దు’ అనేవారు గురుదేవులు. జపం తీవ్రతరం చేయి.
యోగీన్ మా: అవును! భగవంతుని దివ్యనామమూ, భగవంతుడూ ఒక్కటే. మొదట్లో మనస్సు ఏకాగ్రం కాకపోయినా చివరకు తప్పక విజయం సిద్ధిస్తుంది.
సన్న్యాసి: మనస్సు ఏకాగ్రం కావడానికి ఎంత జపం చేయాలి?
మాతృదేవి: రోజుకు పదివేలసార్లు. ఎందుకు, ఇరవైవేలసార్లు కూడాచేయవచ్చు. నీ శక్తి మేరకు జపించు.
సన్న్యాసి: అమ్మా! ఒక రోజు పూజామందిరంలో కూర్చొని విలపిస్తున్నాను.హఠాత్తుగా మీరు నా పక్కన నిలబడి ఉండడం చూశాను. ‘నీకేం కావాలి?’ అని అడిగారు. ‘అమ్మా! సురథుని* అనుగ్రహించినట్లు నన్నూ అనుగ్రహించండి’ అనికోరాను. కానీ వెంటనే, ‘వద్దు, అలా వద్దు, అమ్మా! అది దుర్గావతారంలో! నాకు ఆ రూపంలో వద్దు. మీ ఈ రూపంలో అనుగ్రహించండి’ అని చెప్పాను. మీరు చిన్నగా నవ్వి అంతర్ధానమైనారు. అప్పటి నుండి నా మనస్సు మరింత అశాంతికి గురికాసాగింది. ఇప్పుడు నాకు ఎందులోను సంతృప్తిలేదు. ‘మాతృదేవి సాక్షాత్కృతి పొందలేనప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనం?’ అని తరచూ యోచిస్తూం టాను.
మాతృదేవి: నాయనా! నీకు లభించిన ఆ కాస్తా పట్టుకొని జీవించడానికి ప్రయత్నించు. ‘నాకు ఎవరూ లేకపోయినా ఒక అమ్మ ఉంది’ అని సదా జ్ఞాపకం ఉంచుకో. తమను ఆశ్రయించిన వారందరికీ చిట్టచివరి రోజున అయినా సాక్షాత్క రించి, తమ సన్నిధికి తీసుకొని తరింపచేస్తానని గురుదేవులే స్వయంగా చెప్పిన మాటలు నీకు జ్ఞాపకం లేవా?
సన్న్యాసి: ఒక గొప్ప భక్తుడైన గృహస్థు ఇంట్లో నేను ఉంటున్నాను. ఆయన భార్య ఎంతో భాగ్యవంతుల ఇంటి ఆడపడుచు. నా కోసం ఎంతో ఖర్చుపెడుతుంది. చేపలు తినమని పదేపదే చెబుతుంది, కానీ నేను తినలేదు.
మాతృదేవి: చేపలు తిను. దాన్లో తప్పేముంది? చేపలు తింటే మెదడు చల్ల బడుతుంది. వ్యర్థంగా ఖర్చు చేయవద్దని ఆమెతో చెప్పు. భక్తులైన గృహస్థుల వద్ద ధనం ఉంటే సాధువులకు ఎంతో మేలు చేయవచ్చు. వారి ధనం వల్లనే కదా సాధువులు చాతుర్మాస్య వ్రతం లాంటివి అనుష్ఠించగలుగుతున్నారు! ఆ రోజుల్లో భిక్షకు బయటకు పోవడం ఎంతో కష్టం కదా!
తరువాత ఆ సన్న్యాసి మాతృదేవికి ప్రణామం చేసి క్రిందికి వెళ్లాడు.
1918
గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. కాస్త తేరుకొన్నాక ఒక రోజు సాయంత్రం ఆరాత్రికం పూర్తయ్యే సమయంలో మాతృదేవి వద్దకు వెళ్లాను. నన్ను చూడగానే మాతృదేవి, “ఏమిటమ్మా, ఎలా ఉన్నావు? ఆరోగ్యం కుదుట పడిందా?” అని అడిగారు. తరువాత ఇంటి విషయాలు వాకబు చేశారు.
మాతృదేవి: నిన్న సరళ వచ్చి కథామృతం చదివి వినిపించింది. ఎంత చక్కని ఉపదేశాలు! వ్యవహారాలు ఇంత అద్భుత రీతిలో పరిణమిస్తాయని నాడు ఎవరి కెరుక! ఎంతటి మహాత్ముడు అవతరించాడు. ఎంతోమంది వచ్చి చైతన్యం పొంది వెళ్లారు. ఆయన ఎంత ఆనందమయమై ఉండేవారో! రోజంతా వేడుకలు, వినోదం, కథలు, పాటలలోనే మునిగిపోయి ఉండేవారు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన వ్యాకులపడడం నేనెన్నడూ చూడలేదు. చక్కని మాటలతో నాకు హితోపదేశం చేసేవారు. నేను వ్రాయడం నేర్చుకొని ఉంటే ఆ వచనాలను ఒక్కటి కూడా వదిలిపెట్టక వ్రాసి ఉంచుకొనేదాన్ని. అది లేకుండా పోయిందే! పోనీ, సరళా! ఈ రోజు కూడా ఏదైనా చదువు తల్లీ!
కథామృతంలో ఒక అధ్యాయం చదివి వినిపించి, అనారోగ్యంగా ఉన్నగోలాప్ మాకు శుశ్రూష చేయడానికి సరళ వెళ్లిపోయింది.
మాతృదేవి మెల్లగా ఇలా అన్నారు:
“భగవద్విషయాలు తప్ప గురుదేవులు మరేదీ మాట్లాడేవారు కారు. ఒకరోజునాతో, ‘మనిషి దేహం ఎంత అనిత్యమైనది! ఇదిగో ఇప్పుడుంది, మరుక్షణంలేకుండా పోతుంది. లోకంలో జన్మించి దుఃఖానలంలో దగ్ధమవుతుంది. ఇటువంటశరీరాన్ని మళ్లీ ఎందుకు ఉత్పన్నం చేయాలి? భగవంతుడొక్కడే శాశ్వత సత్యం.ఆయనను ప్రార్థించగలిగితే అదే మహద్విషయం. పుట్టడమే దుఃఖం కదా!’ అనిచెప్పారు.
“ఆ రోజు విలాస్ నా వద్దకొచ్చి, ‘అమ్మా! మేం ఎంత అప్రమత్తంగా జీవించాలో తెలుసా? మనస్సు ఎక్కడ దిగజారిపోతుందోనని భయపడుతూనే ఉండాలి’ అని చెప్పాడు.
“నిజమే కదా! సన్న్యాసి చలువ చేసిన తెల్లని వస్త్రం వంటివాడు; గృహస్థునల్లని వస్త్రం లాంటివాడు. నల్లని వస్త్రంలో మరకలు అంతగా కనిపించవు. కానీతెల్లని వస్త్రం మీద సిరా బొట్టు సైతం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ లోకం కామకాంచనాలలో మునిగివుంది. సన్న్యాసులు ఎంతగానో వైరాగ్యం అలవరచుకోవాలి.అందుకే గురుదేవులు, ‘సాధూ! అప్రమత్తుడవై మసలుకో!’ అనేవారు.”
ఇంతలో నైవేద్యం అర్పించడానికి హరిహర మహరాజ్ వచ్చారు. ఆయనను చూడగానే మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదిగో, ఇతడు ఒక సన్న్యాసి. గురుదేవుల పేరిట పరిత్యజించాడు. లౌకికులను చూడు. అదేమిటో, అదే పనిగా బిడ్డలను కంటూ ఉంటారు. ‘ఒకరిద్దరుపిల్లలు పుట్టాక నిగ్రహంతో జీవితం గడపాలి’ అనేవారు గురుదేవులు. ఆస్తిపాస్తులనుబట్టి ఆంగ్లేయులు పిల్లలను కంటారని విన్నాను. ఇంత ఆస్తి ఉంది, ఒక పిల్లవాడు ఉంటేనే, ఉన్న ధనంతో చక్కగా జీవించగలుగుతాడని యోచిస్తారట! అందుకుతగ్గట్లుగా, ఆ తరువాత భార్యాభర్తలిద్దరూ విడిగా ఉండిపోతారట. ఇక మన జనాన్ని చూడు!”
నవ్వుతూ మాతృదేవి కొనసాగించారు:
“నిన్న ఒక యువతి నన్ను చూడడానికి వచ్చింది. చేతిలో, చంకలో, చుట్టూ పిల్లలే. అందరినీ కలిసికట్టుగా సముదాయించలేకపోతున్నది. ఆమె ఏం చెప్పిందో తెలుసా! ‘అమ్మా! ఈ సంసార జీవనం నా కెంత మాత్రమూ సుఖంగా లేదు’ అని చెప్పింది. అందుకు నేను, ‘నువ్వేం చెబుతున్నావమ్మా! ఇందరిని కన్నావు; జీవితంసుఖంగా లేదంటున్నావే!’ అని అన్నాను. అందుకామె, ‘ఇంతేనమ్మా! ఇకపై కనను’ అంది. ‘అది నీకు సాధ్యమైతే ఘనకార్యం చేసినట్లే’ అన్నాను నేను.”
ఇలా అంటూ మాతృదేవి నవ్వనారంభించారు.
నేను: అమ్మా! కుటుంబం ఏర్పడ్డాక స్త్రీకి భర్త ఒక్కడే ఆరాధనీయుడు, గురువు. అతణ్ణి సేవించడం మూలంగానే భగవంతుణ్ణి పొందవచ్చునని శాస్త్రాలువచిస్తున్నాయి. భర్తకు నచ్చకపోయినా స్త్రీ కొంతమేరకు ఆత్మనిగ్రహం పాటిస్తేతప్పా?
మాతృదేవి: ఆ ప్రయత్నం భగవంతుని నిమిత్తం అయితే దాన్లో తప్పు లేదు.ఎలా తప్పవుతుంది? ఆత్మనిగ్రహం ఎంతో అవసరం. వితంతువులకు ఇన్ని కఠోరనియమాలను విధించడం ఆత్మనిగ్రహం కోసమే!
గురుదేవులు ప్రతి పనినీ భగవదారాధన నిమిత్తమే చేశారు. నన్ను షోడశిగా ఆరాధించారు. పూజానంతరం అందుకై ఉపయోగించిన చీర, గాజులు ఇత్యాదులను ఏం చేయాలని ఆయనను అడిగాను. నాకు గురువు అంటూ ఎవరూ లేరు. మా తండ్రి మాత్రం జీవించి ఉన్నారు. గురుదేవులు కాస్త ఆలోచించి, ‘వాటిని మీ అమ్మకు ఇచ్చివెయ్యి. కానీ ఆమెను సాధారణ స్త్రీగా భావించక, జగజ్జననిగాపరిగణించి ఇవ్వు’ అని చెప్పారు. నేనూ అలాగే చేశాను. ఆయన ఉపదేశాల తీరు అలా ఉండేది.
శోకహరణ్ ప్రతి నెలా ఇస్తూన్న ఐదు రూపాయలను మాతృదేవికి ఇచ్చాను.
మాతృదేవి: ఎందుకమ్మా! ప్రస్తుతం అతడికే ఎన్నో కష్టాలు! ఇవ్వకుండానే ఉండవచ్చు కదా!
నేను: అన్ని వైపులా ఎంతో డబ్బు ఖర్చవుతోంది. ఇక్కడ ఇస్తున్నది ఎంతోతక్కువ. మీ సేవార్థం ఇవ్వడంలో మనస్సుకు తృప్తి.
మాతృదేవి: అవును, అది నిజమే. ఇక్కడ ఇస్తే అది సన్న్యాసుల, భక్తులసేవకు వినియోగపడుతుంది.
మిఠాయిలు తీసుకు వెళ్లాను. గురుదేవులకు నైవేద్యంగా అర్పించమని మాతృదేవి చెప్పారు. అప్పుడు రాత్రి పదిన్నర అయింది. నైవేద్యం అర్పించిన పిదప మాతృదేవి ఆరగించారు. ఆ తరువాత ప్రసాదం పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాను.
సెప్టెంబర్ 4, 1918
మాతృదేవి చిత్రాసనం మీద కూర్చొని జపం చేస్తున్నారు. సాయంకాల ఆరాత్రికం ముగిసింది. మాతృదేవికి ప్రణామం చేసి కూర్చున్నాను. నా యోగక్షేమాలు విచారించారు. ఇంతలో మాతృదేవి బంధువు ఒకామె వచ్చి, “నా మనస్సును నిల కడగా ఉండేటట్లు సరిచేయండి. ప్రశాంతతను కోల్పోయి చంచలంగా ఉంది. ఇక బ్రతకాలని కూడా నేను ఆశించడం లేదు. నా ఆస్తినంతా మీ పేరిట వ్రాసి ఇస్తాను. నా మరణానంతరం నా వీలునామాను అమలు పరచండి” అని చెప్పింది.
మాతృదేవి నవ్వుతూ, “బాగానే ఉంది, నువ్వెప్పుడు మరణిస్తున్నావు?” అని అడిగారు. ఆ తరువాత గంభీరంగా ఇలా అన్నారు:
“అలా అయితే తాపీగా నీ ఇంటికి వెళ్లిపో! ఇక్కడ ఉండవద్దు. ఇక్కడ, నా వద్ద… (నా వద్ద అంటూ చెప్పబోయి సగంలో ఆపివేసి) ఈ సన్న్యాసుల, భక్తుల హృదయాలలో గురుదేవులు నెలకొని ఉన్న ఇక్కడ నీకు ప్రశాంతత లభించలేదంటే మరెక్కడ లభిస్తుంది? ఎంతటి హీనజీవితం గడుపుతున్నావు! ఈ జన్మలోనే నువ్వు సమస్తమూ పొందవచ్చు. ఈ చోటు గురించి ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు. (నేను) లేకుండా పోయినప్పుడు అర్థం చేసుకొంటావు. ఇప్పుడు నీకు ఏదీ బోధపడదు. నీ మనస్సులో పాపం చోటుచేసుకొంది. అందుకే నీకు ప్రశాంతత లేదు. ఏ పనీ పాటా చేయకుండా కూర్చుంటే మెదడు వేడెక్కుతుంది. ఒక్క సత్సంకల్పం కూడా నీ మనస్సులో జనించదా? ఎంతటి కల్మష హృదయం!”
ఇలా అంటూ మాతృదేవి మళ్లీ నవ్వారు. తరువాత నన్ను చూస్తూ ఇలా అన్నారు:
“గురుదేవుల లీలను చూశావా అమ్మాయీ! ఎంత గొప్ప బంధువులను నాకు ఇచ్చారో! ఇటువంటి గుంపులో నేను జీవించవలసి వచ్చింది. చూడు! ఈమెకు ఇప్పటికే పిచ్చి. మరొకరికి గూడా ఆ అవస్థే పట్టేట్లు ఉంది. ఇక మూడవ ఆమెను చూడు! ఈమెను పెంచడంలో నేను పడిన శ్రమంతా వ్యర్థమైంది. లేశ మాత్రంగానైనా బుద్ధి కలుగలేదు. అదిగో! వసారాలో చూడు. ఇనుపకమ్మీలను ఆనుకొని తన భర్త రాక కోసం నిరీక్షిస్తోంది. అదిగో చూడు! అక్కణ్ణుంచి సంగీతం వినవస్తూంది, ఆ ఇంటికి పోతాడేమోనని భయం. రేయింబవళ్లు ఆతణ్ణి తన కనుసన్నల్లో ఉంచుకోవాలని ఆమె ప్రయత్నం. అమ్మో, ఏం అనురక్తి! ఈమెకు ఇంత అనురక్తి కలుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.”
ఆ బంధువైన స్త్రీ వేదనతో లేచి వెళ్లి పడుకొంది.
మాతృదేవి: అమ్మాయీ! ఈ మానవజన్మ లభించడం గొప్ప భాగ్యం. తీవ్ర సాధనలు అనుష్ఠించాలి. ఎంతో కృషి చేయాలి. కృషి లేకుండా ఏదైనా జరుగు తుందా? ఇంటిపనుల నడుమ కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. నా సంగతే చూడు. దక్షిణేశ్వరంలో ఉంటున్న రోజుల్లో వేకువజాము మూడు గంటలకే మేల్కొని, జపం చేయడానికి కూర్చొనేదాన్ని. బాహ్యస్మృతే లేకుండా జపంలో లీనమైపోయేదాన్ని.
ఒకనాటి వెన్నెల రాత్రి నేను నహబత్తు మెట్ల వద్ద కూర్చొని జపం చేసుకొంటు న్నాను. చుట్టూ అమిత ప్రశాంతత చోటుచేసుకొని ఉంది. గురుదేవులు సరుగుడు చెట్ల వైపు వెళ్లడం కూడా నేను గమనించలేదు. తక్కిన రోజుల్లో ఆయన పాద రక్షల సవ్వడి వినవచ్చేది. నాడు ప్రగాఢ ధ్యానంలో మునిగివున్నాను. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాను. ఆభరణాలు ధరించి, ఎర్రంచు చీర కట్టుకొని ఉండే దాన్ని. పైట కొంగు గాలికి ఎగిరి శరీరం నుండి జారిపోయింది. కానీ నాకు ఆ ఎరుకే లేదు. గురుదేవులకు నీటి పాత్రను తీసుకుపోతున్న యోగీన్ ఆ స్థితిలో నన్ను చూసివున్నాడు. ఎలాంటి రోజులమ్మా అవి!
పాల వంటి స్వచ్ఛమైన వెన్నెల కాంతిలో కూర్చొని చేతులు జోడించి చంద్రుణ్ణి చూస్తూ, ‘నీ ప్రకాశంలా నా హృదయాన్ని కూడా నిష్కళంకం గావించు’ అంటూ ప్రార్థించేదాన్ని.
జపధ్యానాదులు అనుష్ఠించేకొద్దీ (గురుదేవులను చూపుతూ) ఆయన నీతో మాట్లాడతారు, మనస్సులో తలెత్తే కోర్కెలను ఆ క్షణమే నెరవేర్చుతారు. మనస్సులో ఎంత ప్రశాంతత నెలకొంటుందో కదా! ఆహా! ఆ రోజుల్లో నా మనస్సు ఎలా ఉండేదో కదా! ఒక రోజు పనిమనిషి బృంద చేతుల్లో నుండి ఒక చెంబు జారి పెద్ద శబ్దంతో నా ముందు పడింది. ఆ ధ్వని నా హృదయాన్ని చీల్చివేసింది. (ఆ సమయంలో మాతృదేవి నహబత్తులో ధ్యానమగ్నురాలై ఉన్నారు. ఆ ధ్వని పిడుగుపాటులా వినిపించినందువల్ల తాము హడలిపోయినట్లు మాతృదేవి చెప్పారు.)
సాధనలు చేయగా చేయగా, ‘నాలో నెలకొన్నది ఎవరో వారే నీలోనూ నెలకొని ఉన్నారు; ఒక బెస్తవానిలోను, నిమ్న కులస్థునిలోను విరాజిల్లుతున్నారు’ అని గ్రహిస్తావు. అప్పుడు వినమ్రత జనిస్తుంది.
ఆమెను గురించి (ఇంతకు మునుపు చెప్పిన స్త్రీ) ఏం చెప్పను! చుట్టు కుదురు తయారుచేసి తీసుకొచ్చారు. వారు నిమ్న కులస్థులు. “అక్కడ పెట్టండి” అన్నాను నేను. వారు కూడా సంకోచపడుతూ దాన్ని అక్కడ పెట్టారు. వారు ఇంట్లోకి రావడం ఈమె కంటపడింది. అంతే! ‘ఓహో! వీళ్లు దాన్ని తాకారు, దీన్ని ముట్టుకొన్నారు, వాటన్నింటిని తీసిపారేయండి. ఏ ధైర్యంతో మీరు ఇంట్లోకి వచ్చారు?’ అంటూ గోల గోల చేసింది. పాపం వాళ్లు భయపడిపోయారు. ‘భయపడకండి. ఆమె మిమ్మల్ని ఏమీ చేయదు’ అంటూ నేను వారిని సముదాయించి, మరమరాలు కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చి పంపాను. ఆమె మనస్సు అలాంటిది!
తెల్లవారుజామున మూడు గంటలకే మేల్కొని ఆ ఉత్తరం వైపు వసారాలో కూర్చుని ధ్యానం చేయమను. ఆ తరువాత మనస్సులో ప్రశాంతత ఎలా నెలకొనదో నేను చూస్తాను. కానీ ఆమె అలా చెయ్యదు. ప్రశాంతత లేదు, లేదు అంటూ ఆక్రో శించడంతో సరి! అవునూ, ప్రశాంతత లేదంటారు కదా, అదేమిటి అమ్మాయీ! దాని గురించి ఆ రోజుల్లో నేను అసలు ఎరుగను. కానీ ప్రస్తుతం వీరి కోసం అన్నీ అనుభవిస్తున్నాను. అందులోనూ చిన్న తమ్ముడి భార్య ఇంట్లో అడుగిడిన నాటి నుండి ఇక చెప్పనక్కరలేదు. ఎప్పుడు ఆమె బిడ్డను పెంచడం ప్రారంభించానో అప్పటి నుండి మంటల్లో పడ్డట్లు తల్లడిల్లిపోతున్నాను. వెళ్లిపోనీ, వీళ్లందరినీ వెళ్లి పోనీ! నాకు ఎవ్వరూ వద్దు. ఈ ఆడవాళ్లో, అమ్మో! వీళ్లు ఆడవాళ్లా? చెప్పిన మాట ఒక్కటీ వినరు. వినమ్రతే ఎరుగని ఆడవాళ్లు.
గోలాప్ మా: అందులోనూ వారి సింగారం! అప్పుడే భర్త అనురాగం పొందవచ్చుననుకొంటారు.
మాతృదేవి: ఆహా! గురుదేవులు నన్ను ఎంత బాగా చూసుకొన్నారు! నా మనస్సు నొచ్చుకొనేలా ఎన్నడూ ఒక్క మాట కూడా అనలేదు. నాకు ఏది శ్రేయస్కరమో అదే చేసేవారు. ‘పని చేస్తూండాలి. స్త్రీలు ఎన్నడూ సోమరులుగా ఉండరాదు. పనీపాటా చేయకుండా సోమరులుగా ఉన్నప్పుడే నానారకాల దురాలోచనలూ మనస్సులో తలెత్తుతాయి’ అనేవారాయన.
ఒక రోజు గురుదేవులు నాకు కొంత జనపనార ఇచ్చి, ‘దీనితో ఒక ఉట్టి తయారుచేసి ఇవ్వు. దానిలో మిఠాయిలూ, లూచీలూ వంటివి ఉంచి, భక్తులకు పంచిపెడతాను’ అని చెప్పారు. నేను ఉట్టి చేసి ఇచ్చాను. మిగిలిన జనపనారతో ఒక దిండు కుట్టాను. ఒక గోనె సంచిపై గుడ్డను పరిచి దానిపై ఈ దిండు నుంచి పడు కొనేదాన్ని. వెంటనే నిద్రపట్టేది. ఇప్పుడే ఈ మంచం, పరుపు అన్నీ సమకూరాయి. నాకు ఇప్పుడూ, అప్పుడూ ఒకేలా నిద్రపట్టేది. ఎలాంటి తేడా లేదు.
ఒక రోజు ఆయన, హృదయ్‌తో, ‘హృదూ! ఈమె వచ్చినప్పటి నుండి నాకు ఆందోళనగా ఉంది. ఈమె కుగ్రామంలో పుట్టిపెరిగిన వ్యక్తి. నగరపు అలవాట్లేవీ తెలియవు. అవసరమైనంత మరుగు వసతులు ఏవీ ఇక్కడ లేవు కదా అని ఆలో చిస్తున్నాను. కానీ ఈమె విషయమో! ఇటువంటి వ్యక్తి ఒకరు ఇక్కడ ఉన్నట్లుగా కూడా ఎవరికీ తెలియకుండా జీవిస్తున్నది. స్నానాదికాలకు ఆమె ఎప్పుడు బయటకు వెళుతుందో నేను కూడా చూసింది లేదు’ అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనస్సు తల్లడిల్లింది. ‘ఈయన ఏది కోరినా దేవి నెరవేరుస్తుంది. నేను బయటకు వెళ్లడం చూసింది లేదని ఈయన చెప్పినందున, ఇక నేను ఎప్పుడు బయటకు వెళ్లినా ఈయన కంటపడతానేమో!’ అని ఆందోళన చెందాను. ‘తల్లీ! నా సిగ్గుతెరను రక్షించు’ అంటూ దేవిని హృదయపూర్వకంగా ప్రార్థించాను. నా తల్లి జగజ్జనని తన రెండు హస్తాలలో నన్ను దాచిపెట్టి కాపాడింది. అక్కడ ఉన్నంత కాలం నేను ఎవరి కంటా పడలేదు.
అందరూ నన్ను దేవిగా భావిస్తున్నారు. అది నిజమేనని నాకు కూడా అని పిస్తున్నది. లేకపోతే నా జీవితంలో ఇన్ని అద్భుతాలు ఎందుకు జరగాలి? గోలాప్, యోగీన్లకు వాటి గురించి ఎంతో తెలుసు. ‘ఇది జరగనీ’, ‘అది తింటాను’ అని ఏమనుకొన్నా, భగవంతుడు దాన్ని అట్లే నెరవేరుస్తున్నాడు.
ఆహా! దక్షిణేశ్వరంలో గడిపిన రోజులు ఎంత అద్భుతమైనవి! గురుదేవులు పాడేటప్పుడు నేను నహబత్తు వసారాలో వెదురు తడికె వెనుక గంటల పర్యంతం నిలబడి వింటూ ఆనందించేదాన్ని. చేతులు జోడించి నమస్కరించేదాన్ని. ఎంతటి ఆనందం! రేయింబవళ్లు జనం వచ్చేవారు, భగవంతుని గురించి ప్రసంగించేవారు.
మనస్సు ఒక మదపుటేనుగు లాంటిది అమ్మాయీ! అది వాయువేగంతో పరుగెత్తుతుంది. అందుకే మనం సదా వివేచనతో మెలగాలి. సత్యాసత్యాలను పరీ క్షించి తేల్చుకోవాలి. భగవంతుని పొందడానికి ఎంతో పాటుపడాలి. దక్షిణేశ్వరంలో ఉండేటప్పుడు నా మనస్సు ఎలా ఉండేదో! రాత్రి ఎవరో పిల్లనగ్రోవి వాయించేవారు. ఆ మధురనాదం నన్ను మైమరపింపచేసేది. ఆ భగవంతుడే పిల్లనగ్రోవి వాయిస్తూ న్నట్లు, ఆయన ముఖతః ఆ నాదం వెలువడుతూన్నట్లు నాకు అనిపించేది. భగవత్సాక్షా త్కారం కోసం నా మనస్సు తహతహలాడేది; వెంటనే నేను సమాధిమగ్నురాలనై పోయేదాన్ని.
బేలూరులో కూడా కాలం ఎంత బాగా గడిచిందో! ఎంత ప్రశాంతమైన వాతావరణం! అక్కడ ధ్యానం ఇట్టే చేకూరేది. అందుకే అక్కడ ఒక మఠం నెలకొల్పాలని నరేంద్రుడు ఆశించాడు. అక్కడ కొంత స్థలాన్ని కేదార్ దాస్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ స్థలం వెల బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ స్థలాన్ని మనం కొనుగోలు చేయగలమా? అంతా గురుదేవుల అనుగ్రహం వల్లనే జరిగింది.
ఇంతలో మాకూ తన చంటిబిడ్డను చంకనెత్తుకొని వచ్చి, “అమ్మా! నేనేం చెయ్యను? వీడు నిద్రపోవడం లేదు” అంటూ బిడ్డను కిందికి దింపి వెళ్లిపోయింది. అందుకు మాతృదేవి, “ఈ కుర్రవాడు సత్వగుణ ప్రధానుడు. అందుకే నిద్రపోవడం లేదు” అని బదులు చెప్పారు.
వేడిపొక్కులతో మాతృదేవి చాలా బాధపడుతున్నారు. “హా! ఈ పొక్కులు ప్రాణాలు తోడేస్తున్నాయి. ముఖంపైన, చేతుల మీద, పొట్ట మీద అన్నిచోట్ల వస్తున్నాయి. కాస్త తైలం మర్దించు తల్లీ! ఈ తైలమే నా ప్రాణం, దీన్ని మర్దించినప్పుడే కాస్త నొప్పి తగ్గుతుంది” అన్నారు. ఆమెకు తైలం మర్దిస్తూనే నా అనుభవం ఒకటి చెప్పాను.
నేను: అమ్మా! ఒక రోజు గురుదేవుల ఛాయాచిత్రానికి చెమటలు పోసినట్లు కనిపించింది. నేను తుడిచినా కూడా మళ్లీ అలాగే కనిపించింది. అది నిజమా?
మాతృదేవి: అవునమ్మా! కొన్ని సమయాల్లో అలా కనిపించడం కద్దు. ‘నీడ, శరీరం, కలశం, ఛాయాచిత్రం – ఇవన్నీ ఒక్కటే* ’ అనేవారు గురుదేవులు.
పిదప మాతృదేవి కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. ఇంతలో మా ఇంటి నుండి లక్ష్మణ్ వచ్చాడు. “వెళ్లిరామ్మా” అన్నారు మాతృదేవి. ఆమెకు ప్రణమిల్లి, ప్రసాదం పుచ్చుకొని ఇంటికి తిరిగివెళ్లాను.
ఒక రోజు మాతృదేవి ఉత్తరం వైపు వసారాలో కూర్చొని ఉన్నారు. ఒక యువకుడు ఆమె పాదాలపై తన శిరస్సును మోడ్చి, “అమ్మా! లౌకిక జీవితంలో బాగా దెబ్బతిన్నాను. మీరే నా గురువు, ఇష్టదైవం. మరేదీ నాకు తెలియదు. ఎన్నో దుష్కార్యాలు చేశాను. వాటిని గురించి ప్రస్తావించడానికి కూడా సిగ్గుపడుతున్నాను. మీ కృపాకటాక్షంతో మాత్రమే జీవిస్తున్నాను” అని చెప్పాడు.
అప్పుడు మాతృదేవి ఆప్యాయంగా ఆతడి తలను నిమిరి, “తల్లికి బిడ్డ ఎప్పుడూ బిడ్డడే” అని అన్నారు.
అందుకు అతడు, “అవునమ్మా! ఇంత సులభంగా మీ కృపాకటాక్షం పొంద గలిగాను. అయితే, మీ కృపాకటాక్షం సులభంగా పొందవచ్చుననే అహంకారం నాలో తలెత్తకుండా ఉండాలి” అన్నాడు వినమ్రంగా.
సెప్టెంబర్, 1918
రాత్రి దాదాపు ఎనిమిదిన్నర గంటలై ఉంటుంది. మాతృదేవి మంచానికి ప్రక్కన చాప పరిచివుంది. ఆమె పడుకోబోతున్నారు. నేను వెళ్లగానే, “రా, రా, ప్రక్కన వచ్చి కూర్చో! సరళా! ఈమెకు తినడానికి ఏదైనా తీసుకురా! పగలంతా పనిచేసి, ఇదిగో ఇక్కడికి పరుగెత్తుకొచ్చింది” అన్నారు. ఏమీ వద్దని చెప్పినా విని పించుకోకుండా, “శరీరాన్ని కూడా కాస్త పట్టించుకోవాలి. సుమతికి ముగ్గురు పిల్లలే! అయినా ఇప్పుడే ముసలమ్మలా కనిపిస్తుంది” అని చెప్పారు.
తరువాత తమ వేడిపొక్కుల గురించి ప్రస్తావించారు: “ఏమిటమ్మా ఈ బాధ! ఎందరికో ఇటువంటి పొక్కులు వస్తాయి కానీ వెంటనే నయమవుతాయి. కానీ నాకు వచ్చినవి మాత్రం నన్ను వదలి వెళ్లనంటున్నాయి. ‘రోగం, దుఃఖం, శోకం – వీటితో వచ్చి లోకులు నన్ను స్పృశిస్తారు. వారు చేయని పాపాలంటూ ఉండవు. అవన్నీ ఈ శరీరంలో చోటుచేసుకొంటున్నాయి’ అనేవారు గురుదేవులు. అది నిజమేనమ్మా, ముమ్మాటికీ నిజమే. నాకూ అలాగే అనిపిస్తోంది.
“జీవితంలో ఎన్నో రకాల వ్యక్తులను చూశాను. నాకు ప్రతి నెల ఏడు రూపాయలు ఇచ్చేవారు.* గురుదేవుల నిర్యాణానంతరం ఆలయ కోశాధికారియైన దీనూ, తదితరులూ కలిసి దాన్ని ఆపేశారు. నా బంధువులు కొందరు కూడా దాన్లో పాలుపంచుకొన్నారు. ‘మాతృదేవికి ఇస్తూవున్న ఆ డబ్బును ఆపకండి’ అంటూ నరేన్ ఎంత పోరాడినా లాభం లేకపోయింది. కానీ ఇప్పుడు చూడు! గురుదేవుల అనుగ్రహంతో అటువంటి ఏడు రూపాయలు ఎన్నెన్నో వస్తున్నాయి, పోతున్నాయి. దీనూ గీనూ అంతా ఇప్పుడు ఉండే చోటు కూడా తెలియరాదు. కానీ నాకు ఇంతవరకు ఎటువంటి కష్టమూ వాటిల్లలేదు. ఎందుకు వాటిల్లాలి? ‘నన్ను తలచుకొనే వారికి ఎప్పటికీ తిండికి ఇబ్బంది ఉండదు’ అని గురుదేవులు నాకు చెప్పివున్నారు.”
రాత్రి తొమ్మిది గంటలయింది. మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను.
మరునాడు కూడా మాతృదేవి వద్దకు వెళ్లాను. నన్ను చూడగానే, “రామ్మా, రా” అన్నారు మాతృదేవి.
కాసేపయ్యాక, “రా! గురుదేవుల కథామృతాన్ని కాస్త చదివి వినిపించు. సరళ బాలికల విడిదికి వెళ్లిపోయింది. సాధారణంగా ఆమే చదివి వినిపిస్తుంది” అని అన్నారు.
కథామృతం చదువుతున్నప్పుడు ఆధ్యాత్మిక సాధనల, దివ్యదర్శనాల గురించి ప్రస్తావన వచ్చింది.
మాతృదేవి: గోలాప్, యోగీన్లు ఎంతో జపధ్యానాలు అనుష్ఠించారు. వీటిని గురించి ఆలోచించడం మంచిది. ఇదంతా విన్నప్పుడు ఇతరులకు కూడా సాధనల పట్ల ఆసక్తి కలుగుతుంది.
తరువాత దివ్యదృశ్యాలను గురించి ప్రస్తావన వచ్చింది. మాతృదేవి చాలా విషయాలను గోప్యంగా ఉంచి మాట్లాడుతున్నట్లు అనిపించింది. అందరి ముందూ వాటి గురించి మాట్లాడరాదనుకొన్నారో ఏమో!
నళిని: అత్తా! పలువురు జపధ్యానాదులు అనుష్ఠిస్తున్నట్లు చెబుతారు. దృశ్యాలు – గిశ్యాలు అంటూ ఏవేవో కనిపిస్తున్నట్లు చెబుతారు. కానీ నాకు అటువంటివి ఏవీ కనిపించలేదే! ఎందువల్ల? మీతో కలిసి ఇంతకాలంగా జీవిస్తున్నాను కదా! నాకు ఏమీ కలుగలేదే!
మాతృదేవి: వారికి ఎందుకు లభించదు? తప్పకుండా లభిస్తుంది. వారికి ఎంతటి భక్తివిశ్వాసాలు! విశ్వాసం ఉండాలి, భక్తి కావాలి. అప్పుడే అంతా లభిస్తుంది. మీ వద్ద అవన్నీ ఉన్నాయా ఏమిటి?
నళిని: అందరూ మిమ్మల్ని అంతర్యామి అంటున్నారు. అది నిజమేనా? అలా అయితే నా మనస్సులో ఏముందో నువ్వు చెప్పగలవా?
మాతృదేవి మెల్లగా నవ్వారు. నళిని విడవకుండా అదే ప్రశ్నను అడగసాగింది. చివరకు మాతృదేవి, “వారు భక్తిపారవశ్యంలో అలా అంటున్నారు” అని చెప్పారు.
ఇలా చెప్పి ఆమె కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత గురుదేవులకు చేతులు జోడించి నమస్కరిస్తూ మాతృదేవి ఇలా అన్నారు:
“నేను ఏమీ కాను, సమస్తమూ గురుదేవులే! ‘నేను’ అనే అహంకారం నాలో తలెత్తకూడదని మీరంతా నా కోసం గురుదేవులను ప్రార్థించండి.”
మాతృదేవి మాటలు విని నవ్వు వచ్చింది. మనం అవగతం చేసుకోగల పరిమితికి ఆవల ఆమె ఉన్నారు. ఇక మనమేమో ప్రతి ఒక్కరమూ అహంకార పూరితులం. ఆమె ఉపదేశాన్ని అర్థం చేసుకొనే శక్తి మనకెక్కడిది?
ఒక స్త్రీ: మాతృదేవితో ఏమని చెప్పను? ఆమే జగదంబ, మన మనస్సులలోని సమస్తాన్ని ఆమె ఎరుగునని నా కుమారుడు అంటున్నాడు.
నేను: జగదంబ అని అందరూ అంటున్నారు. కాని ఎవరిలో ఎంత విశ్వాసం ఉందో గురుదేవులకే తెలుసు. విశ్వాసం లేని మనం ఈ మాటలన్నప్పుడు ఏదో ముఖస్తుతి కోసం చెప్పినట్లుగా ఉంటుంది.
ఈ మాటలు విని మాతృదేవి నవ్వి, “అవును, అది నిజమే” అన్నారు.
నేను: తామే జగజ్జనని అనే విషయాన్ని మాతృదేవియే స్వయంగా స్ఫురింప జేయకపోతే మనం గ్రహించగలమా? కానీ ఒక విషయాన్ని బట్టి ఆమెను సాక్షాత్తూ దేవి అని మనం గ్రహించగలం. అది ఆమె నిరహంకారం. వేలాది భక్తులు ఆమె పాదారవిందాలను ఆశ్రయించి, ‘మీరే లక్ష్మి, మీరే జగదంబ’ అంటూ ఆరాధించి, శ్లాఘిస్తున్నారు. ఆమెయే కనుక మామూలు స్త్రీ అయివుంటే అహంకారంతో విర్ర వీగేవారు. ఇంతటి పొగడ్తలను అతి సామాన్యంగా స్వీకరించడం ఒక మామూలు స్త్రీకి సంభవమా?
మాతృదేవి వికసిత వదనంతో ఇదంతా వింటున్నారు. ఒకసారి నా వైపు చూశారు. ఆ సమయంలో ‘అమ్మా! కటాక్షించు! అమ్మా, ఇదంతా చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది’ అని మనస్సులో అనుకొన్నాను.
నేను సెలవు పుచ్చుకొనే వేళ అయింది. మాతృదేవి లేచి ప్రసాదమిచ్చి తమ చేతిని నా హృదయంపై ఉంచి, “ప్రసాదమూ భగవంతుడూ ఒక్కటే అనే ప్రగాఢ విశ్వాసాన్ని సదా మనస్సులో నిలిపివుంచు” అని చెప్పారు.
ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు మాతృదేవి అలా పలుకుతున్నారు? మూడు నెలలుగా దాదాపు ప్రతి రోజూ వస్తున్నాను. రోజూ సెలవు పుచ్చుకొనేటప్పుడు చేతుల నిండా ప్రసాదం ఇస్తున్నారు. ప్రసాదం తక్కువగా ఉన్నప్పుడు కూడా నాకు మాత్రం ఎక్కువగా ఇస్తున్నారు. అలా తీసుకోవడానికి నేను సిగ్గుపడేదాన్ని. ఆ సిగ్గును తొలగించడానికే ఇలా అన్నారా?
సెప్టెంబర్ 28, 1918
ఉదయం నేను వెళ్లినప్పుడు మాతృదేవి పండ్లు ఒలుస్తున్నారు. నన్ను చూడగానే, “రామ్మా, రా! నువ్వు ఇక్కడకు రావడం నా కెంతో ఆనందంగా ఉంది. నేడు బోధన్.* (ఆ విషయాన్ని నేను పూర్తిగా మరిచిపోయాను.) గురుదేవుల పూజ కోసం ఈ పువ్వులను సర్దు. పండ్లున్న పళ్లెరాన్ని ఇటువైపు ఉంచు” అని చెప్పారు. ఆమె చెప్పినట్లే చేశాను. పండ్లు ఒలిచిన పిదప మాతృదేవి ప్రక్క గదిలోకి వెళ్లారు.
మాతృదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. నూనె, దువ్వెన తెచ్చుకొని నా వద్ద కూర్చున్నారు. ఆమె తలను దువ్వుతున్నప్పుడు కొన్ని వెంట్రుకలు రాలాయి. “ఇవిగో వెంట్రుకలు, పదిలపరచుకో” అని నాతో చెప్పారు. ధన్యురాలనైనానని అనుకొన్నాను. నిజానికి మాతృదేవి వెంట్రుక లొకటి రెంటిని పదిలపరచుకోవాలనే కోర్కె నాకు అమితంగా ఉంది.
మాతృదేవి గంగానదికి వెళ్లి స్నానం చేసి వచ్చి పూజ చేశారు. పిదప అందరికీ ప్రసాదం పంచారు. దాంతో చాలాసేపు గడిచిపోయింది.
ఇంతలో వైద్యుడు శ్యాందాసు, రాధూను పరీక్షించడానికి వచ్చాడు. రాధూను పిలవమని మాతృదేవి నన్ను పురమాయించారు. నేను పిలవడానికి వెళ్లాను. కాసేపటి తరువాత రాసబిహారి మహరాజ్, వైద్యుణ్ణి తోడ్కొని వచ్చారు. వైద్యుడు పరీక్షించాక, ఆయనకు నమస్కరించమని మాతృదేవి, రాధూకు చెప్పారు. రాధూ తల వంచి నమస్కరించింది. ఆయన వెళ్లిపోయాక ఎవరో ఒక స్త్రీ, “ఈయన బ్రాహ్మణుడా?” అని అడిగారు.
మాతృదేవి: కాదు, వైద్యుడు.
ప్రశ్నించిన స్త్రీ: అయితే ఎందుకు నమస్కరించమన్నారు?
మాతృదేవి: ఎందుకు చేయరాదు? ఆయన గొప్ప మేధావి. బ్రాహ్మణునితో సమానుడు. ఆయనకు నమస్కరించకుండా మరెవరికి నమస్కరించాలి? ఏమమ్మా, నేనంటున్నది సబబేనా?
సెప్టెంబర్ 30, 1918
నేడు మహాష్టమి. మాతృదేవి రమ్మని చెప్పారు. నా సోదరితో కలిసి ఉదయాన్నే వెళ్లాను. కొందరు భక్తురాండ్రు పువ్వులు తెచ్చారు. మాతృదేవికి పాదపూజ చేసిన తరువాత, స్నానానికై గంగకు వెళ్లారు.
మాతృదేవి నాతో, “ఈ రోజు ఇక్కడే ఉంటావు కదా! నేడు మహాష్టమి” అన్నారు. ఉంటానన్నాను.
కొంతసేపటి తరువాత పూజనీయులైన శరత్ మహారాజ్, మాతృదేవికి ప్రణ మిల్లడానికి వచ్చారు. మేం పక్క గదిలోకి వెళ్లిపోయాం. మాతృదేవి పరుపు మీద కూర్చున్నారు. ఆమె పాదాలు నేలను తాకుతున్నాయి. పలువురు భక్తులు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు.
ఆ తరువాత మాకూ ప్రభృతులతో గంగకు స్నానానికి వెళ్లాను. మాతృదేవి ఇంట్లోనే స్నానం చేశారు. రోజు విడిచి రోజన్నా ఆమె గంగలో స్నానం చేయడం పరిపాటి. కీళ్ళ నొప్పుల కారణంగా మాతృదేవి గంగకు స్నానం చేయడానికి ప్రతి రోజూ వెళ్లడం లేదు. స్నానం చేసి మేం తిరిగివచ్చాక పలువురు భక్తురాండ్రు మాతృదేవిని పూజిస్తూండడం చూశాం. వారిలో కొందరు నూతన వస్త్రాలు తీసుకు వచ్చారు.
కాళీఘాట్‌లోని కాళీమాత విగ్రహాన్ని అలంకరించే రీతిలో ఆ భక్తురాండ్రు నూతన వస్త్రాలను మాతృదేవికి అలంకరింప చేశారు. పిదప మాతృదేవి ఆ వస్త్రాలను ఒకటి తరువాత ఒకటి తీసివేసి ప్రక్కన ఉంచారు. కొందరు భక్తురాండ్రతో, “బట్టలు బాగున్నాయి” అని చెప్పారు.
ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లడానికి భక్తులు వస్తూన్నట్లుగా తెలియచేశాడు. ఏమా మనోహర దృశ్యం! చేతులలో పువ్వులను, వికసిత పద్మాలను, బిల్వదళాలను పుచ్చుకొని భక్తలు ఒకరి వెంట ఒకరుగా వచ్చి మాతృదేవి పాదాలకు వాటిని సమర్పించి, ప్రణమిల్లి ఒక మూలగా నిలబడ్డారు. ఈ విధంగా కొంతసేపు గడిచిపోయింది. బలరాం కుటుంబంవారు కూడా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి వెళ్లారు.
చివరగా నేను వెళ్లి, మాతృదేవిని అర్చించి ఆమెకు ఒక చీర సమర్పించు కొన్నాను. వెంటనే మాతృదేవి, “దీన్ని ధరిస్తాను. ఎలాగూ కొత్తచీర కట్టుకోవాలి కదా!” అని అన్నారు. ఇలా అంటూ ఆ చీరను ధరించారు. అది చూసి నా కళ్లు ఆర్ద్రమైనాయి. అదొక మామూలు చీర. పలువురు ఎన్నో ఖరీదైన చీరలిచ్చారు. నేను మాతృదేవి పేదపుత్రికను కదా! మాతృదేవి ప్రేమకు ముగ్ధురాలనయ్యాను. “ఈ చీర అంచు ఎంత బాగుందో” అంటూ మాతృదేవి ఆనందం వ్యక్తం చేశారు.
కాషాయరంగు చీర ధరించిన ఒక స్త్రీ, మాతృదేవికి ప్రణమిల్లి ఆమె పాదాలవద్ద రెండు రూపాయలు సమర్పించింది. వెంటనే మాతృదేవి, “ఇదేమిటి? కాషాయం ధరించావు, చేత రుద్రాక్షమాల. ఎందుకిలా ప్రవర్తించావు?” అని అడిగారు.
మాతృదేవి: ఎక్కడ దీక్ష పుచ్చుకొన్నావు?
ఆ స్త్రీ: దీక్ష పుచ్చుకోలేదు.
మాతృదేవి: దీక్ష పుచ్చుకోలేదా? పరమార్థానుభూతి ఏమీ లేకుండా కాషాయాన్ని ధరించావు. ఇది తగదు. ఎంతటి పవిత్రమైన వస్త్రాలు! చేతులు జోడించి నమస్కరించాలనుకొన్నాను. ఇలా చేయవద్దు. ముందు సత్యస్వరూప అనుభూతి పొందు. అందరూ నీ పాదాలకు ప్రణామం చేస్తారు. అలాంటి గౌరవాన్ని స్వీకరించగల శక్తిని నువ్వు సముపార్జించాలి.
ఆ స్త్రీ: మీ వద్ద దీక్ష పొందాలని అభిలషిస్తున్నాను.
మాతృదేవి: అదెలా వీలవుతుంది?
ఆ స్త్రీ ఎంతగానో ప్రాథేయపడింది. గోలాప్ మా కూడా ఆమె కోసం బ్రతిమలాడింది. చిట్టచివరకు మాతృదేవి ఒకింత సమ్మతిస్తున్నట్లు కనిపించారు. “తరువాత చూద్దాం” అన్నారు.
తమ ఆశ్రమ బాలికలతో గౌరీ మా వచ్చింది. వారంతా మాతృదేవికి ప్రణమిల్లి, ప్రసాదం పుచ్చుకొని వెళ్లిపోయారు.
విలాస్ మహరాజ్ పూజ ముగించి మాతృదేవి వద్దకు వచ్చి మెల్లగా, “అమ్మా! నేడు గురుదేవులు నైవేద్యం స్వీకరించారో లేదో తెలియదు. గాలిలో కొట్టుకొని వచ్చిన ఎంగిలాకు ఒకటి నైవేద్యం మీద పడింది. ఎందుకు ఇలా జరి గింది? ఎందరో భక్తులు నివేదనకై ఎన్నో పదార్థాలు తీసుకువచ్చారు. ఏం జరి గిందో ఏమిటో?” అని చెప్పారు. “నైవేద్యం మీద గంగాజలం చిలకరించావా?” అని మాతృదేవి అడిగారు. అవునని ఆయన తల ఊపి వెళ్లిపోయాడు. ఇది విని నా మనస్సు సంకట స్థితిలో పడింది.
నేడు మహాష్టమి. మాతృదేవికి పాదపూజ జరిగింది. పువ్వులు, బిల్వదళాలు రాశులుగా ఆమె పాదాల వద్ద ప్రోగయ్యాయి. రాశి తరువాత రాశిని తీసివేస్తూంటే, మరో రాశి, సిద్ధంగా ఉంటోంది.
క్రమంగా మధ్యాహ్న నివేదనకు వేళయింది. అప్పుడు ముగ్గురు స్త్రీలు, ముగ్గురు పురుషులు వచ్చారు. వారు చాలాదూరం నుండి వచ్చినట్లుంది. కట్టు బట్టలతో వచ్చిన నిరుపేదలు. ప్రయాణ ఖర్చులకు సైతం యాచించి వచ్చినట్లుంది. వారిలో ఒక పురుషుడు మాతృదేవితో చాలాసేపు మాట్లాడాడు. నైవేద్యానికి వేళ అయినా సంభాషణ ఆగేటట్లు లేదు. మాతృదేవియే నైవేద్యం అర్పించాలి. ఇతర భక్తలు విసుగు చెందసాగారు. వారిలో ఒకరు నిష్కర్షగా ఆ వ్యక్తితో, “ఇంకా ఏమైనా చెప్పవలసి ఉంటే క్రిందికి వెళ్లి సాధువులతో చెప్పుకోవచ్చు కదా!” అన్నారు.
కానీ మాతృదేవి కాస్త తీవ్ర స్వరంతో, “నైవేద్యానికి వేళ దాటిపోతే ఏమిటి? వారు చెప్పవచ్చింది నేను వినే తీరాలి” అన్నారు కచ్చితంగా. ఎంతో ఓర్పుతో ఆతడు చెబుతూన్న విషయాలు వింటున్నారు. తదనంతరం మెల్లగా ఆతడికి ఏవో ఉపదేశాలిచ్చారు. అతడి భార్యను కూడా పిలిపించారు. వారు కలలో ఏదో అను భూతి పొందివుంటారని మేం ఊహించాం. వారు కలలో మంత్రోపదేశం పొందారని తరువాత తెలియవచ్చింది.
దాదాపు ఒక గంటసేపయ్యాక ప్రసాదం పుచ్చుకొని వారు వెళ్లిపోయారు. “అయ్యో, వారెంత పేదవారు! ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చారు” అంటూ మాతృదేవి వాపోయారు.
మధ్యాహ్నం ఆరాధన ముగిశాక మేం భోజనం చేశాం. మాతృదేవి కాసేపు విశ్రాంతి తీసుకోదలచారు. మేం పక్క గదిలోకి వెళ్లిపోయాం.
సాయంత్రం నాలుగయింది. మాతృదేవి లేచివెళ్ళి, సాయంకాల నైవేద్యం అర్పించారు. అప్పుడు రాసబిహారి మహరాజ్ వచ్చి, “ఒక పాశ్చాత్య వనిత మీ దర్శనార్థం వచ్చింది. ఎంతోసేపటి నుండి క్రింద వేచివుంది” అని చెప్పారు. మాతృదేవి ఆమెను తోడ్కొని రమ్మన్నారు.
ఆమె వచ్చి నమస్కరించగానే, కరచాలనం చేసే రీతిలో మాతృదేవి, ఆమె చేతులు పట్టుకొన్నారు. దేశకాలానుసారంగా మనం ప్రవర్తించాలని తరచూ మాతృ దేవి అనే మాటలు ఇప్పుడు క్రియారూపం దాల్చాయి. తరువాత ఆ పాశ్చాత్య వనిత చుబుకాన్ని స్పృశించి, ఆశీర్వదించారు.
ఆ పాశ్చాత్య వనితకు వంగభాష తెలుసు.
పాశ్చాత్య వనిత: నా రాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదనుకొంటాను. నేను వచ్చి చాలాసేపయింది. నేనిప్పుడు ఎంతో ఆందోళనకర స్థితిలో ఉన్నాను. ఎంతో మంచిదైన నా ఏకైక కుమార్తె ప్రాణాపాయకరమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అందువల్లనే అమ్మా, మీ కృపను, ఆశీర్వాదాన్ని అర్థించ వచ్చాను. ఆమె కోలుకొనేలా దీవించండి. నా కుమార్తె ఎంతో మంచిపిల్ల. మంచిపిల్ల అని పదే పదే ఎందుకు చెబుతున్నానో తెలుసా? మాలో మంచి స్త్రీ కనబడడం ఎంతో అరుదు. మాలో పలువురు స్త్రీలు దుష్టులు, దుర్మార్గులు. ఇది ముమ్మాటికీ నిజం. కానీ నా కుమార్తె అటువంటిది కాదు. ఆమెను కరుణించండి.
మాతృదేవి: మీ కుమార్తె కోసం ప్రార్థిస్తాను, కోలుకొంటుంది.
మాతృదేవి పలుకులతో ఆ పాశ్చాత్య వనిత ఎంతో ఊరట పొందింది. “ఇక ఆందోళన లేదు, కోలుకొంటుందని మీరన్నప్పుడు ఆమెకు తప్పకుండా నయ మవుతుంది. అది నిశ్చయం, నిశ్చయం, నిశ్చయం” అని చెప్పింది. ఆమె మాటల్లో ప్రగాఢ విశ్వాసం ధ్వనించింది.
మాతృదేవి దయాళువై చూస్తూ, “గురుదేవులకు అర్పించిన పువ్వులలో ఒకటతెచ్చి ఈమెకు ఇవ్వు. ఒక తామరపువ్వు తీసుకురా” అని గోలాప్ మాతో చెప్పారు. వెంటనే గోలాప్ మా ఒక తామరపువ్వును, ఒక బిల్వదళాన్ని తెచ్చి మాతృదేవి చేతికిచ్చారు. మాతృదేవి తామరపువ్వును చేతిలో పుచ్చుకొని కొద్దిక్షణాలు కళ్లు మూసుకొని ధ్యానించారు. తరువాత ఆమె గురుదేవుల ప్రతిమ వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, “ఈ పువ్వుతో మీ కుమార్తె తలను స్పృశించండి” అంటూ పువ్వును ఆ పాశ్చాత్య వనితకు ఇచ్చారు. చేతులు జోడించి పుష్పాన్ని పుచ్చుకొన్న ఆమె మాతృదేవికి ప్రణమిల్లి, “ఆ తరువాత ఈ పువ్వును ఏం చేయాలి?” అని అడిగింది.
గోలాప్ మా: పువ్వు ఎండిన తరువాత గంగలో వేసెయ్యండి.
పాశ్చాత్య వనిత: కాదు, కాదు. ఇది భగవంతునికి సొంతమైనది. దీన్ని పారవేయలేను. నూతన వస్త్రంతో ఒక సంచీ కుట్టించి ఆ పువ్వును దానిలో పదిల పరచుకొంటాను. ప్రతి రోజూ దానితో నా కుమార్తె శరీరాన్ని స్పృశిస్తాను.
మాతృదేవి: మంచిది, అలాగే చెయ్యండి.
పాశ్చాత్య వనిత: భగవంతుడు మాత్రమే సత్యం. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్పగోరుతున్నాను. కొన్నాళ్ల కిందట నా బిడ్డకు జ్వరం వచ్చి మంచం పట్టింది. నేను ఆవేదనతో విలపిస్తూ, ‘భగవంతుడా! నువ్వు ఉన్నావన్నది సత్యమని విశ్వసిస్తున్నాను. అయినా వాస్తవిక నిరూపణ కోరుతున్నాను’ అంటూ ప్రార్థించాను. కన్నీరు తుడిచి నా చేతిరుమాలును బల్లమీద ఉంచాను. చాలాసేపయ్యాక ఆ రుమాలు మడతల్లో మూడు పుల్లలు ఉండడం చూసి ఆశ్చర్య పోయాను. ఆ మూడు పుల్లలతో నా బిడ్డ దేహాన్ని సుతిమెత్తగా స్పృశించాను. సత్వరమే జ్వరం తగ్గిపోయింది.
ఈ సంగతి చెబుతున్నప్పుడు ఆమె చెక్కిళ్ల మీద కన్నీటి కాల్వలు ప్రవహిం చాయి. చివరకు ఆమె, మాతృదేవితో, “అమూల్యమైన మీ సమయాన్ని వృథా చేశాను, నన్ను క్షమించండి” అంది. “లేదు లేదు. మీతో మాట్లాడడం నా కెంతో ఆనందంగా ఉంది. మంగళవారం మళ్లీ రండి” అన్నారు మాతృదేవి. తరువాత ఆమె మాతృదేవికి ప్రణమిల్లి, సెలవు పుచ్చుకొని వెళ్లిపోయింది.
అక్టోబర్, 1919
నేడు లక్ష్మీపూజ పర్వదినం. నా సోదరి సుమతితో కలిసి మాతృదేవి దర్శ నార్థం వెళ్లాను. సుమతి పిల్లలు కూడా మాతో వచ్చారు. అప్పుడు మాతృదేవి పూజామందిరంలో కూర్చుని కూరగాయలు తరుగుతున్నారు. మమ్మల్ని చూడ గానే, “ఓహో! అంతా కలిసివస్తున్నారా? ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడి గారు.
నేను: మహాష్టమి నాడు రాత్రి వెళ్లి, నిన్న రాత్రి తిరిగివచ్చాం.
మాతృదేవి: ఉంటారా?
నేను: లేదమ్మా!
మాతృదేవిని చండీదేవిగాను, తాను ఆమెకు ఒక ఎర్రంచు చీరను సమర్పిస్తూన్నట్లు సుమతి కల కన్నది. ఆ సంగతి మాతృదేవితో చెప్పడానికి సిగ్గుపడింది. నేను ఆ సంగతి చెప్పగానే మాతృదేవి నవ్వుతూ, “నువ్వు ఆ కల కనేలా సాక్షాత్తూ ఆ దేవియే చేసివుండాలి. సరేలే, ఆ చీర ఇవ్వు! నేను కట్టుకొంటాను” అన్నారు. ఆ చీరను మాతృదేవి ధరించారు. ఆహా! ఎంత అద్భుతంగా కనిపించారు. విస్మయులమయ్యాం. కళ్ల వెంట అశ్రువులు స్రవించాయి. “కుంకుమ బొట్టు పెట్టి వుంటే ఇంకా బాగుండేది” అన్నది సుమతి.
“బొట్టు పెట్టవచ్చు కదా!” అన్నారు మాతృదేవి. కానీ మాతో కుంకుమ తీసుకురాలేదు. అందువలన మాతృదేవికి బొట్టు పెట్టలేకపోయాం.
సాయంత్రం వెళ్లాను. లక్ష్మీపూజ కనుక నైవేద్యానికి కొబ్బరికాయ, పళ్లు తీసుకువెళ్లాను. “ఏమిటమ్మా, లక్ష్మీపూజ కాబట్టి ఇవన్నీ తెచ్చావా?” అని మాతృదేవి అడిగారు.
క్రమంగా పలువురు భక్తురాండ్రు రాసాగారు. ప్రతి ఒక్కరూ ఏవో తీపి తినుబండారాలు తీసుకువచ్చారు. ఒక ఇంటి నుండి లేత కొబ్బరిబొండాం, చక్కెర కలిపిన అటుకులు తెచ్చారు. ఇదంతా చూసి మాతృదేవి, “ఈ రోజు ఏం నైవేద్యం చేయాలో బాగా గ్రహించేవున్నారు” అని చెప్పారు.
సాయంత్రం ఆరాత్రికం పూర్తయ్యాక నైవేద్యం అర్పించారు. భక్తురాండ్రు ప్రసాదం ఆరగించిన తరువాత భక్తుల కోసం కిందికి పంపారు.
లక్ష్మీపూజకు వినియోగించిన సామగ్రితో ఒక భక్తురాలు మాతృదేవిని పూజించింది. పూజ పూర్తయ్యే తరుణంలో మాతృదేవి పాదపద్మాల వద్ద డబ్బు ఉంచి ఆరాధించింది. మాతృదేవి ఆమెను దీవించారు. ఆమె వెళ్లిపోయిన తరువాత మాతృదేవి, “పాపం, శోకంలో మునిగివుంది.* కడుపేదరాలు” అని మాతో చెప్పారు.
నేను: అమ్మా, మంగళవారం నాడు వచ్చిన ఆ పాశ్చాత్య వనిత మళ్లీ వచ్చిందా?
మాతృదేవి: అవును, వచ్చింది.
ఆ స్త్రీ పట్ల మాతృదేవి ప్రత్యేక ఆప్యాయతను ప్రదర్శించారు. ఆమెకు మంత్ర దీక్ష అనుగ్రహించారు. ఆమె కుమార్తె కూడా రోగం నుండి కోలుకొని స్వస్థురాలైంది.
రాత్రయింది. మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను.
మార్చి 24, 1920
మాతృదేవి జయరాంబాటిలో దాదాపు ఒక ఏడాది కాలం గడిపి వసంత ఋతువులో కలకత్తాకు తిరిగి వచ్చారు. అక్కడ చాలాకాలం ఆమె మలేరియాతో బాధపడ్డారు.
నేను వెళ్లేటప్పటికి ఆమె బట్టలు ఉతకడానికి వెళ్లివున్నారు. కుళాయి వద్ద నుండి వచ్చి నాతో, “కూర్చో! ఇప్పుడే వస్తాను” అంటూ వెళ్లిపోయారు. ఐదు నిమి షాలలో బట్టలను అలానే వదలివేసి దక్షిణం వైపు గదిలోకి వచ్చారు.
నేను ప్రణమిల్లగానే, నా తల మీద చేయివేసి ఆశీర్వదిస్తూ, “కూర్చో! ఎలా ఉన్నావు?” అని అడిగారు. సేవార్థం కొంత కానుక సమర్పించుకొన్నాను. ఆమె స్వీకరించారు. శుష్కించిపోయిన ఆమె దేహాన్ని చూసినప్పుడు నాకు మాట్లాడడానికి ఏం తోచలేదు. ఊరకే ఆమె ముఖాన్ని తదేకంగా చూస్తూ కూర్చుండిపోయాను. ‘అయ్యో! ఎలా ఉన్న దేహం? ఇలా అయిపోయిందే!’ అని అనుకొన్నాను.
నా సోదరి ఇంటి పనిమనిషి కూడా నాతో వచ్చింది. ఆమె మాతృదేవి పాదాలను తాకి ప్రణమిల్లడానికి వెళ్లింది. “అక్కణ్ణుండే ప్రణామం చేయి చాలు” అన్నారామెతో మాతృదేవి. ఆమె వాకిలి వద్ద నుండే ప్రణమిల్లి వెళ్లిపోయింది.
మాతృదేవి ఎంతో నీరసించి ఉన్నారు. ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఆమె శ్రమపడుతున్నట్లుగా నాకు కనిపించారు. నేను నేల మీద కూర్చున్నాను. ఇంతలో రాసబిహారీ మహరాజ్ వచ్చి ఎక్కువగా మాట్లాడవద్దని మాతృదేవిని అర్థించాడు. అయినప్పటికీ మాతృదేవి ఒకటి రెండు విషయాల గురించి నన్ను అడిగారు. వాటికి నేను క్లుప్తంగా జవాబిచ్చాను.
అప్పుడు రాధు తన బిడ్డతో అక్కడ కొచ్చింది. వాడికి ఆరోగ్యం బాగాలేదు. అందుకై కొంత డబ్బు ఇచ్చాను. కానీ రాధూ దానిని స్వీకరించలేదు. అది చూసి మాతృదేవి, “రాధూ, అదేమిటి! ఆమె నీ సోదరియే కదా! ప్రేమతో ఇస్తున్నప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నావు?” అని అడిగారు. ఆ పైకాన్ని స్వయంగా మాతృదేవియే స్వీకరించారు. ఆ బాలుడి ఆహార పానీయాదుల విషయంలో అతడి తల్లి, అమ్మమ్మ అశ్రద్ధ వహించడం వల్లనే వాడు అనారోగ్యంగా ఉంటున్నాడని మాతృదేవి ఎంతో ఆవేదన చెందారు. కానీ రాధూ ఆమె మనస్సు నొచ్చుకొనేలా తన అసమ్మతిని వ్యక్తం చేసింది. “ఈమెకు చెప్పి ప్రయోజనం లేదు” అంటూ మాతృదేవి మౌనంగా ఉండిపోయారు.
కాసేపటికి సరళ, కృష్ణమయి ప్రభృతులు వచ్చారు. పడుకొనే వారితో మాట్లాడసాగారు. కృష్ణమయి మనవరాలి చికిత్సకై సరళ వెళ్లివుండడం గురించి ప్రస్తావన వచ్చింది.
మార్చి 30, 1920
సాయంత్రం ఆరాత్రికం ముగిసింది. మాతృదేవి మంచం మీద పడుకొని ఉన్నారు. నేను వెళ్లగానే ఆమె లేచి కూర్చున్నారు. ప్రణమిల్లగానే నన్ను కూర్చోమన్నారు. గదిలో నళిని, సురబాల, సరళ ఉన్నారు. సురబాల, నళిని జపం చేస్తున్నారు.
నైవేద్యం అర్పించమని విలాస్ మహరాజ్‌కు మాతృదేవి చెప్పారు. అందుకు ఆయన, “అమ్మా! కాసేపయ్యాక నివేదించనా?” అన్నారు. అప్పుడు మాతృదేవి, “వద్దు, వెంటనే నివేదన చెయ్యి” అని చెప్పారు. తరువాత ఆయన నైవేద్యం అర్పిం చారు. ఆయన సిద్ధేశ్వరీ కాళికాలయానికి వెళ్లి వచ్చారు. ఆ ప్రసాదాన్ని మాతృదేవికి అందించి అందరికీ పంచిపెట్టమన్నారు.
మేం ప్రసాదం తిన్నాక మాతృదేవి ఇలా అన్నారు:
“రెండు రోజులుగా జ్వరం రాలేదు, ఆరోగ్యం ఫరవాలేదు. నా కష్టమంతా ఈ రాధూ వల్లనే! దేహం, ధర్మం, కర్మ, సంపద – అన్నీ నన్ను వీడి పోతాయేమోనని పిస్తూంది. కన్నుమిన్ను గానక బిడ్డను బాదుతుంది. ఇప్పుడు సరళ చేతిలో ఉండ డంతో బిడ్డ ఎలాగో బ్రతికాడు. రాధూ చేతుల మీదుగా ఆ బిడ్డ పెరిగితే తాను చికిత్స చేయలేనని డాక్టర్ కంజీలాల్ కచ్చితంగా చెప్పాడు. తనను తాను చూసుకోలేని ఈమెకు గురుదేవులు ఎందుకు బిడ్డను ప్రసాదించారో! ఆయన సంకల్పాన్ని ఎవరు అవగతం చేసుకోగలరు? ఈ మధ్య ఒక కొత్త జాడ్యం ఆమెకు సోకింది. అదేమిటో ఎవరి కెరుక? ఏదైనా జరగనీ! నేను ఇక ఏ మాత్రమూ ఈ భారం మోయలేను.”
రాధూ చెయ్యి ఇనుపకమ్మీలకు కొట్టుకోవడంతో బాగా వాచింది. ఆమె చేతికి డాక్టర్ కట్టుగట్టాడు.
సమయం కాగానే ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు. మాతృదేవి పడుకొని, నన్ను కాళ్లు ఒత్తమన్నారు. కాళ్లు ఒత్తుతూ ఆమెతో మాట్లాడసాగాను.
నేను: అమ్మా! మీతో ఒక విషయం చెప్పాలి, ఇబ్బంది లేదు కదా?
మాతృదేవి: లేదు, లేదు. తప్పకుండా చెప్పు.
నేను చెప్పాను. అది విని ఆమె ఇలా అన్నారు: “ఆహా! ఆ ఆనందం రోజూ దక్కుతుందా అమ్మాయీ! సమస్తం నిజమే, సమస్తం నిజమే. ఏదీ అబద్ధం కాదు. అమ్మాయీ! సమస్తమూ గురుదేవులే! ఆయనే ప్రకృతి, ఆయనే భగవంతుడు! ఆయన వల్లనే నీకు సర్వం లభిస్తుంది.”
నేను: అమ్మా! ఒక రోజు తీవ్ర ఏకాగ్రతతో జపం చేస్తున్నాను. తరువాత చూస్తే ఎంతో సమయం గడిచిపోయింది. అందువలన మీరు ఉపదేశించిన ఆధ్యా త్మిక సాధనలన్నింటిని అనుష్ఠించలేకపోయాను. ఇంటి పనులు చూసుకోవడానికి లేచాను. అలా చేయడం తప్పా అమ్మా?
మాతృదేవి: లేదు, లేదు. అందులో తప్పు లేదు.
నేను: అర్ధరాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు తానొక నాదం వింటున్నట్లు ఒకరు నాతో చెప్పారు. సాధారణంగా కుడివైపు నుండి ఈ నాదం వస్తూన్నట్లు, ఒక్కొక్కప్పుడు (మనస్సు నిమ్నస్థాయిలో ఉన్నప్పుడు) ఎడమ వైపు నుండి వస్తూన్నట్లు ఆ వ్యక్తి అనుభవం.
మాతృదేవి (కాసేపు యోచించి) : అవును, కుడి వైపు నుండే వస్తుంది. శరీరస్మృతి ఉన్నప్పుడే అది ఎడమ వైపు నుండి వస్తుంది. కుండలినీశక్తి జాగృతమైతే ఇటువంటి అనుభవాలు కలుగుతాయి. కుడి వైపు నుండి వచ్చేదే నిజమైన నాదం. క్రమంగా మనస్సే గురువవుతుంది. ఏకాగ్రచిత్తంతో రెండు నిమిషాలు సాధన చేసినా గొప్ప విషయమే.
మాతృదేవి ఆరోగ్యం బాగా లేనందున ‘శరీరస్మృతి’ అంటే ఏమిటో అడగడానికి నాకు మనస్కరించలేదు.
ఇంతలో ఒక స్త్రీ దోమతెర కట్టడానికి వచ్చింది. నేను సెలవు పుచ్చుకోదలచాను. వెంటనే మాతృదేవి దిండుపై నుండి తల పైకెత్తి, “ఇదిగో తల పైకెత్తుతున్నాను” అన్నారు. పడుకొని ఉన్నవారికి ప్రణమిల్ల కూడదు కదా!
నేను ప్రణమిల్లగానే, “వెళ్లి రామ్మా! మళ్లీ రా! కాస్త త్వరగా రా! పనులు కాస్త ముందుగానే ముగించి రాలేవా? మంచిది, వెళ్లిరా! దుర్గా! దుర్గా! వెళ్లి రామ్మా!” అని చెప్పారు. ఈలోపు దోమ తెర కట్టారు. అయినా తలను దోమతెర బయట ఉంచి చూస్తూ నాకు వీడ్కోలిచ్చారు. బయటి వసారాలోకి వచ్చాక కూడా మాతృదేవి దయార్ద్రస్వరంతో ‘దుర్గా, దుర్గా’ అంటూ ఉచ్చరిస్తూండడం వినపడింది. ఎంతటి ఆప్యాయత! మాతృదేవి సాన్నిధ్యంలో ఉన్నంతసేపు సంసారంలోని ఇబ్బందులు, కష్టాలు పూర్తిగా మరచిపోతాం.
మాతృదేవి వ్యాధి తగ్గుముఖం పట్టే సూచన లేవీ కనిపించలేదు. నానాటికీ ఆమె శరీరం బలహీనం కాసాగింది. ఒక రోజు మధ్యాహ్నం ఆమెను చూడడానికి వెళ్లాను. అప్పుడు స్నానాల గదికి వెళ్లడానికి లేచారు మాతృదేవి. “నీ చెయ్యి అందించమ్మా! పట్టుకొని లేస్తాను. అప్పుడప్పుడు జ్వరం వస్తూన్నది. శరీరంలో శక్తి బాగా సన్నగిల్లిపోయింది” అన్నారు నాతో. ఎంతో శ్రమకోర్చి లేచి కూర్చున్నారు. పిదప నాతో ఇలా అన్నారు: “ఇదిగో చూడమ్మా! ఎవరో తమ చేతికర్రను ఇక్కడ వదలిపెట్టి వెళ్లిపోయారు. ఒక చేతికర్ర ఉంటే బాగుంటుందని చాలా రోజులుగా అనుకొంటున్నాను. అందుకే గురుదేవులు ఈ ఏర్పాటు చేశారేమో!” ఇలా అని ఆ చేతికర్రను నాకు చూపారు. తరువాత నవ్వుతూ, “దీన్ని వదలిపెట్టి వెళ్లింది ఎవ రని అందరినీ అడిగాను. ఎవరికీ తెలియలేదు” అని చెప్పారు.
మరొక రోజు వెళ్లాను. మాతృదేవి అనుభవిస్తున్న బాధను చూసి ఆమె సన్న్యాస సంతానం ఆమెతో, “అమ్మా! ఈసారి నయమయ్యాక మీరు దీక్షనివ్వడానికి అంగీకరించం. ఎందరివో పాపాలను మీరు స్వీకరించడం వలన మీరింత వ్యథ ననుభవిస్తున్నారు” అని చెప్పారు. అందుకు మాతృదేవి నవ్వుతూ, “ఈసారి గురు దేవులు కేవలం రసగుల్లాలు ఆరగించడానికే వచ్చారా ఏమిటీ?” అని అన్నారు. అందుకు ఎవరి నుండీ జవాబు రాలేదు.
అమ్మా! కరుణార్ద్రపూరితమైన ఈ పలుకులలో ఎన్ని విషయాలు తేట తెల్లపరిచారు. మూర్ఖులమైన మేం గురుదేవుల గురించి ఏం అవగతం చేసుకొన్నాం?
ఇక్కడ నాకు మరో సంఘటన గుర్తుకువస్తోంది. కులీన కుటుంబానికి చెందిన ఒక స్త్రీ విధివశాత్తూ అడ్డదారులు త్రొక్కి నీతిబాహ్యమైన జీవితం గడప వలసి వచ్చింది. చివరకు మాతృదేవిని గురించి తెలిసి, అక్కడకు వచ్చింది. పూజా మందిరంలోకి వెళ్లడానికి సంకోచిస్తూ వెలుపలే నిలబడి మాతృదేవితో, “అమ్మా! మీ పావనమైన సన్నిధిలోకి రావడానికి నేను అనర్హురాలను. నాకు దారి చూపండి” అంటూ ప్రార్థించింది. అప్పుడు మాతృదేవి లేచి తామే తలుపు వద్ద కెళ్లి ఆమె భుజంపై చేతులుంచి కౌగిలించుకొని లోపలకు తీసుకొని వెళ్లారు. “రామ్మా, రా! పాపం ఏదో తెలుసుకొన్నావు, అందుకై బాధపడుతున్నావు కదా! అదే చాలు! నేను నీకు మంత్రదీక్ష ఇస్తాను. గురుదేవుల పాదారవిందాల వద్ద సమస్తం సమర్పించు. భయం ఎందుకు?” అని అన్నారు ఆమెతో.
మనుష్యుల పాపం, దుఃఖం, వ్యాధి, వ్యథ – ఈ భారాన్నంతా తమ భుజ స్కంధాల మీద వేసుకొని, అడ్డదారులు పట్టిన వారికి చేతులందించి, సహాయం చేసి సరైన దారి చూపి కాపాడే కారుణ్య వారధియైన మాతృదేవి మాత్రమే చిరు నవ్వుతో, “ఈసారి గురుదేవులు కేవలం రసగుల్లాలు ఆరగించడానికి మాత్రమే అవతరించారా?” అని ప్రశ్నించగలరు!
ఏప్రిల్ 14, 1920
సంధ్య ఆరాత్రికం ముగిసింది. మాతృదేవికి జ్వరం. మాతృదేవి చేతులను రాసబిహారి మహరాజ్, పాదాలను బ్రహ్మచారి వరద ఒత్తుతున్నారు. జ్వరమానినితో జ్వరం చూస్తున్నారు. మాతృదేవి కళ్లు మూసుకొని పడుకొని ఉన్నారు.
నేను ఒక మూలగా నిలబడ్డాను. నేను నిలబడి ఉండడం గమనించి, “ఎవరు?” అని మాతృదేవి అడిగారు. రాసబిహారి మహరాజ్ మెల్లగా సమాధాన మిచ్చారు, “జ్వరం 100.1 0 ఫారెన్ హీట్ ఉంది.”
నేడు వంగ సంవత్సరాది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని నివేదిత పాఠ శాల బాలికలకు సోదరి సుధీర విందు భోజనం ఏర్పాటు చేసింది. అందుకని సరళ నాలుగు గంటలకు అక్కడకు వెళ్లింది. సరళను తోడ్కొని రమ్మని మాతృదేవి బ్రహ్మచారి వరదతో చెప్పారు. ఆమె వచ్చి రాధూ బిడ్డకు అన్నం పెట్టాలి. ఇంకా సమయం కాలేదు. అయినా ఆ బిడ్డ ఏడుస్తూ ఉండడం వలన అప్పుడే అన్నం పెట్టాలని రాధూ అనుకొన్నది. వద్దంటూ వారించారు మాతృదేవి. దాంతో రాధూ అమిత కోపంతో మాతృదేవిని తిట్టడం ప్రారంభించింది. “నువ్వు చచ్చిపో! నీ కాష్ఠానికి నేనే కొరివిపెడతాను” అంటూ నానారీతుల దుర్భాషలాడసాగింది. ఇదంతా వినడానికి మాకు ఎంతో బాధ కలిగింది. మాతృదేవి అనారోగ్యంతో అప్పటికే ఎంతో బాధ ననుభవిస్తున్నారు. ఈ సమయంలో అలా తిట్టిపోయడమా! రాధూ ఇంకా తిడుతూనే ఉంది. ఇలా అప్పుడప్పుడు జరగడం కద్దు. మాతృదేవి సహనానికి హద్దుల్లేవు. అన్నింటినీ సహిస్తూ ప్రశాంతంగా ఉండేవారు. కానీ దీర్ఘకాల వ్యాధి ప్రకోపంతో ఈ రోజు మాతృదేవి కూడా కాస్త కోపంతో, “అవును. నేను పోయాక నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో! ఎన్ని తన్నులు, చీపురుకట్ట దెబ్బలు నీ కోసం రాసిపెట్టి ఉన్నాయో తెలియదు” అన్నారు. ఇది విన్న రాధూ అవధులు లేని కోపంతో తిట్టిన తిట్లను వ్రాయడం సభ్యత కాదు.
కొంతసేపటికి సరళ వచ్చి ఆ బిడ్డకు అన్నం పెట్టసాగింది.
ఆ రోజు నా మనస్సు ఎంతో దిగులు పడింది. అప్పుడు మాతృదేవి ఆదు ర్దాతో, “కాస్త విసురు తల్లీ! ఆమె విసిరిన నిప్పుకణికలతో నా నరనరాలూ దహించుకు పోతున్నాయి” అన్నారు. కాసేపు విసిరిన తరువాత, పాదాలను ఒత్తమన్నారు. అప్పుడు రాసబిహారీ మహరాజ్ గదిలోకి వచ్చి దోమతెర కట్టసాగారు. వెంటనే నేను, “అమ్మా! ఇక నేను వెళ్లివస్తాను” అని చెప్పాను. “వెళ్లి రామ్మా” అన్నారామె. ఇదే ఆమె దివ్యవాణి నుండి నేను విన్న చిట్టచివరి మాట!
నేను కాళీఘాట్‌కు వెళ్లవలసి వచ్చింది. తదనంతరం ఇంట్లో వాళ్లకు జబ్బు ఇత్యాది కారణాలవల్ల మాతృదేవి దర్శనార్థం వెళ్లలేకపోయాను. మాతృదేవి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందని విన్నాను. చిట్టచివరకు ఒక రోజు వెళ్లినప్పుడు అంతా అయిపోయేలా అనిపించింది. కానీ ఏ మూలో ఒక నమ్మకం!
మాతృదేవి క్రొత్త గృహం, జయరాంబాటి