మానవత్వం
“ఏమిటిది? నేను రామచంద్రుని కుమార్తెను. నా వయస్కులైన ఎందరో స్త్రీలు జయరాంబాటిలో ఉంటున్నారు. వారికీ నాకూ ఏం వ్యత్యాసంవుంది? నన్ను చూడడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు. వివరాలడిగితే ఒకరు న్యాయమూర్తి, మరొకరు న్యాయ వాది అంటున్నారు. వారందరూ ఎందుకు వస్తున్నారన్నదే తెలియడం లేదు” అనేవారు మాతృదేవి. గురుదేవులు తమాషాగా అన్నట్లు, “బూడిదలో తన రంగును దాచుకునే పిల్లి” లా గ్రామ పరిసరాల్లో తమ దివ్యత్వాన్ని మరుగుపరచుకుని నివ సించారు మాతృదేవి. దివ్యత్త్వం మరుగుపడితే ఏం, మరుగుపడకపోయినా ఏం, ఆమెలో ప్రతిక్షణమూ ఉద్భవించి ప్రకాశించే పరిపూర్ణ మానవత్వపు ఒక్క కిరణాన్ని సంగ్రహించి, మన జీవితాలను ప్రకాశింపచేసుకోగలిగితే అది చాలు కదా! మాతృ దేవిని ఒక మానవస్త్రీగా చూసినప్పుడు మనలను ఆశ్చర్యపరచేసేది ఆమె విస్పష్ట మైన జీవితం. చలనమో, చంచలమో, తడబాటో అందులో లేదు. ఆమె ఆంతరిక జీవితాన్ని భక్తి, జ్ఞానాలు సమపాళ్లలో నింపాయి.
సమున్నత భక్తి
సరళమయిన ఒక భక్తురాలిగా జీవించడంతోనే మాతృదేవి ఆత్మతృప్తి పొందారు. సాధన పద్ధతులలో భక్తిభావాన్ని ఎంతో మెచ్చుకునేవారు. “జ్ఞాన యోగం అత్యంత కఠినమైనది. ప్రాథమిక స్థితిలోని సాధ కులకు ధ్యానమార్గం సులభం కాదు. అందువల్ల జపం చేయండి. అయినా దేనిని ఆచరించినా భక్తిభావంతో చేయాలి” అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరం రోజులలో ఆమెలో అభివ్యక్తమైన ఉన్నత భక్తిని గురించి ఇప్పటికే చూశాం. అలాంటి ఉన్నత భక్తి పర్యవసానంగా సర్వత్రా భగవంతుని గాంచే భాగ్యం పొందారు. మాతృదేవి. తమ అనుభవాన్ని ఇలా చెప్పారు: “అప్పు డప్పుడు నేను ఏం చూసేదాన్నో తెలుసా? భగవంతుడే సమస్తమూ అయి వున్నాడు. ఏ దిశలో చూసినా నేను ఆయననే చూస్తున్నాను. కుంటివాడూ ఆయనే గుడ్డివాడూ ఆయనే. ఆయన తప్ప మరొకటి లేదు. సృష్టి యావత్తు ఆయనే అని గ్రహింపగలుగుతున్నాను. ఆయనే సర్వస్వంగా ఉంటున్నారు. దుఃఖాలను అనుభ వించేది నిజానికి ప్రాణులు కారు, ఆయనే అనుభవిస్తున్నాడు.” ఇలాంటి ఉన్నత మైన అనుభవం ఒక వైపు. దానితోపాటు నిష్క్రమించినా, నిష్క్రమించనివారైన గురుదేవులు ఎప్పుడూ తమతోపాటు జీవిస్తూండడం కొన్ని సంఘటనల ద్వారా మునుపే చూశాం. శిష్యులు ప్రశ్నలు అడిగేటప్పుడు, కొన్ని సందర్భాల్లో మాతృదేవి “గురుదేవుల నడిగి చెబుతాను” అని చెప్పడం “వచనామృతం” లో పలుచోట్ల మనం చూడవచ్చు. అందువల్ల గురుదేవులు సజీవంగా ఉన్నప్పుడు ఆయనకు అనురాగంతో ఎలా సేవలు అందించారో అట్లే ఇప్పుడూ చేస్తున్నారు.
గురుదేవులే సర్వస్వం
మాతృదేవికి గురుదేవులే సర్వస్వం. గురుదేవుల చేతిలోని ఒక పరికరంగా తనను భావించుకున్నారు ఆమె. గురుదేవులలోనే తమను పూర్తిగా ఐక్యం చేసు కున్నారు. తమకు ఇతరులకంటే ఆయన పట్ల ఎక్కువ హక్కు ఉందని ఎన్నడూ ఆమె అనుకోలేదు. “గురు దేవులు అందరికీ సొంతం. ఆయనను పొందడానికి భక్తి ఒక్కటే ఆవశ్యక మయింది” అనేవారు మాతృదేవి. అనేకులతో, “అంతా గురుదేవులే. ఆయనే గురుమా, ఇష్టదైవమూ. సర్వస్వమూ ఆయనే” అనేవారు. గురుదేవులు తమతో పాటు సదా ఉంటున్నారని తమను ఆశ్రయించేవారికి చెప్పేవారు. గురుదేవుల ఆశీస్సులు, రక్షణ వారందరికీ ఉందని రూఢి పరచేవారు. వ్యక్తిగతంగా తమకు ఎలాంటి శక్తి ఉందనీ వ్యక్తం చేసుకోరు.
సురేంద్రనాథ్ అనే వ్యక్తికి గురుదేవులను పురుషునిగా ఆరాధించడం సబ బుగా తోచలేదు. అందువల్ల పూజ ముగించి, పూజాఫలాన్ని గురుదేవుల పాద పద్మాలకు సమర్పించేటప్పుడు ‘ఓ మహేశ్వరీ’ అంటూ సంబోధించేవాడు. ఈ విషయం విన్న మాతృదేవి, “నిజమే. ఆయనే మహేశ్వరుడు, ఆయనే మహేశ్వరి. సకల దేవీదేవతలలోనూ, సకల జీవరాసులలోనూ ఆయనే వెలసివున్నారు. ఆయ నను ఈశ్వరునిగానో, ఈశ్వరిగానో నీ ఇచ్ఛానుసారం పేర్కోవచ్చు” అన్నారు.
మరొక భక్తురాలితో చెబుతున్నప్పుడు, “ఆయనే సర్వస్వం. ఆయనే పురు షుడు, ఆయనే ప్రకృతి. సమస్తం ఆయన నుండే ఉద్భవించింది” అన్నారు. ఆయ నలో సమస్త దేవతలూ వాసం చేస్తున్నారనీ, ఆయన దివ్యనామాన్ని జపించడం ద్వారా, ఆరాధించడం ద్వారా సకల దైవాలనూ పూజింపవచ్చు అనడం కూడా మాతృదేవి ముఖ్య సందేశమై ఒప్పారింది.
ఒకసారి శిష్యు డొకడు, “అమ్మా! మీ ఆశీస్సులవల్లనే నేను బాగుంటు న్నాను” అన్నాడు. అందుకు మాతృదేవి కాస్త కటువుగా, “దీన్లోకి నన్నెందుకు లాగుతున్నావు? గురుదేవుల దివ్య నామాన్ని నువ్వు ఉచ్చరింపలేవా? ఇక్కడ నువ్వు చూస్తున్నవన్నీ ఆయన వల్లనే జరుగుతున్నాయి” అన్నారు.
ఉపదేశమివ్వమని ఎవరైనా మాతృదేవిని ఆశ్రయిస్తే కొన్ని సమయాల్లో “నేనా! ఉపదేశమివ్వడమా? గురుదేవుల ఉపదేశాలు పుస్తకాలుగా వెలువడ్డాయి. వాటి నుండి ఏదైనా ఒక దానిని అర్థం చేసుకుని దాని నీ జీవితంలో ఆచరించా వంటే సకలమూ సిద్ధిస్తుంది” అనేవారు.
ఎవరైనా మాతృదేవిని ప్రశంసిస్తూ, మీరే దైవం అంటే వెంటనే వారిని వారిస్తూ, “సకలమూ ఆయనే. ప్రస్తుతం నేను ఉంటున్న స్థితికి కారణం ఆయన తమ పాదపద్మాల మ్రోల నాకు చోటు ఇచ్చినందువల్లే” అనేవారు. ఇలాంటి విన మ్రత గల భక్తురాలిగా జీవించడాన్నే ఆమె ఆశించారు.
శ్రీరామకృష్ణులకు పూజ
ఇలా తమను ఒక సామాన్య భక్తురాలిగా పరిగణించుకొని గురుదేవులను ఆరాధించడం మాతృదేవి దైనందిన చర్యలో ఒక భాగమైపోయింది. మాతృదేవి ఆచరిస్తున్న పూజను, నైవేద్యం అర్పించడాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి, అవన్నీ కేవలం శాస్త్రోక్తమయిన విధిగా కాక మానవ రూపంలో ఎదురుగా కూర్చొనివున్న గురుదేవులకు ఆచరించే సేవగానూ, ఆయనతో సంభాషిస్తున్నట్లూ అనిపించేది. పూజకు చెందిన విధులను మాతృదేవి అంత ఎక్కువగా పాటించరు. పువ్వులు, చందనం, పండ్లు మొదలైనవి ఆమె లేదా మరెవరో సేకరిస్తారు. వాటిని పరిశుద్ధంగా, శ్రద్ధగా చేయాలనే విష యంలో మాతృదేవి చాలా నిష్కర్షగా ఉండేవారు. సజీవులైన ఒకరిని ఎలా ఆహ్వా నించి ఉపచరిస్తామో అట్లే పూజ జరపాలి అనేవారు మాతృదేవి. భక్తితో పువ్వు లను గురుదేవుల ముందుంచి, కొంతసేపు గాఢంగా ధ్యానం చేయడంతో వారి పూజ పూర్తి అవుతుంది; పూజ అరగంట సేపటిలో పూర్తయ్యేది.
గురుదేవులకు ఆహార నివేదనం చేసే విధం, గురుదేవులు ఆమె ముందు కూర్చొని ఆరగించే భావనను కలుగజేస్తుంది. గురుదేవుల పటం ముందు ఆహా రాన్ని నివేదించిన తర్వాత, “రండి! దయచేసి వచ్చి ఆరగించండి” అంటూ ఉద్వే గంతో ఆహ్వానించేవారు. జయరాంబాటిలో జగద్ధాత్రీ పూజ రోజులలో ఆహారం నివేదించి, “భగవంతుడా! ఈ రోజు చప్పున ఆరగించండి. నేను పూజకు వెళ్లాలి” అని చెప్పడం భక్తులు వినేవున్నారు.
తాము అర్పించే ఆహారాన్ని గురుదేవులు మూడు విధాలుగా స్వీకరిస్తున్నట్లు మాతృదేవి చెప్పేవారు: సజీవంగా గురుదేవులే వచ్చి కూర్చొని ఆరగిస్తారు. లేక పోతే వారి నుదుటి నుండి ఒక కిరణం ప్రసరించి ఆహార పదార్థాలను స్పర్శి స్తుంది, లేకపోతే వాటిని తాకకుండానే తాము ఆరగించినట్లు సంజ్ఞ చేస్తారు. వీటిలో ఏదో ఒక పద్ధతిలో గురుదేవులు ఆరగించే దాకా మాతృదేవి వేచివుండే వారు. గురుదేవులు ఆరగించకపోతే తామూ ఆరగించరు.
ఒకసారి ఒక భక్తుని ఆహ్వానం మేరకు మాతృదేవి ఆతడి ఇంటికి వెళ్లారు. వారు భక్తిపూరితులే కానీ వారి జీవితాలు పరిశుద్ధంగా లేవు. వారు ఎంతో ప్రయాసతో అర్చించినందువల్ల అక్కడ గురుదేవులకు నైవేద్యం చేశారు. తర్వాత తాము కూడా భోజనానికి కూర్చున్నారు. కానీ అక్కడ అర్పించిన దేనినీ గురు దేవులు ఆరగించలేదు. చాలా ప్రాథేయపడిన తర్వాత కాస్త పాయసం తీసు కున్నారు. దీనిని గురించి ఆ తర్వాత, “అక్కడ నేను అర్పించిన ఆహారాన్ని గురు దేవులు ఆరగించనే లేదు. అపరిశుద్ధ వ్యక్తుల నుండి ఆయన ఆహారం ఆరగిం చరు. నేను ఎంతో అభ్యర్థించిన తర్వాత పాయసం నాలుకతో స్పర్శించారు” అన్నారు. అందువల్ల మాతృదేవి కూడా పాయసం తప్ప మరేదీ స్వీకరించలేదు.
దూరప్రయాణాలు చేసేటప్పుడు కూడా గురుదేవులకు ఆహారం నివేదించ కుండా మాతృదేవి ఆరగించరు. సదుపాయం ఉన్న చోట ప్రయాణాన్ని ఆపి, వంట చేసి, గురుదేవులకు సమర్పించి తర్వాత తాము కూడా ఆరగిస్తారు. శాస్త్రం, విధులు, పూజ వీటన్నిటినీ అతిక్రమించిన రీతిలో మాతృదేవి గురుదేవులతో సదా జీవించారనడానికి ఒకసారి ఆమె జయరాంబాటికి వెళ్లినప్పుడు జరిగిన సంఘ టనే నిదర్శనం.
గురుదేవులకు నైవేద్యం చేయడానికి దారిలో ఎప్పటిలా వంట చేశారు. అన్నం కుండను దించుతున్నప్పుడు, అది పట్టుతప్పి కిందపడి పగిలిపోయింది. అన్నం నేలమీద పడి చెల్లా చెదరయింది. కానీ మాతృదేవి అందువల్ల కలత చెందక నేలమీద పడిన ఆహారాన్ని మట్టి తగలకుండా పైపైగా తీసుకున్నారు. దానిని గురుదేవులకు నివేదిస్తూ “భగవంతుడా! ఈ రోజుకు మీరు ఈ ఆహారాన్ని తృప్తిగా ఆరగించాలి” అన్నారు. తాము ఆరాధించేవారు తమతోపాటు సజీవంగా ఉంటున్న భగవంతుడనీ, తమకు అత్యంత సన్నిహితులనీ, శాస్త్ర సంప్రదాయాలకు అతీతులనీ మాతృదేవి చక్కగా గ్రహించారు. అందువల్లనే నేలమీద పడిన ఆహారమయినా జంకక గురుదేవులకు అర్పించారు.
మాతృదేవితో గురుదేవులు సదా ఉంటున్నారని నిరూపించడానికి మరొక సంఘటనను పేర్కొనవచ్చు. ఉద్బోధన్లో గురుదేవులకు ఉదయం సంప్ర దాయానుసారం పూజ చేసేవారు. అప్పుడు ఆయనకు అలంకరించే పుష్పమాల లలో ఒక దానిని మధ్యాహ్నం గురుదేవులను విశ్రమింప చేసినప్పుడు అలంక రిస్తారు. ఒక రోజు అలా గురుదేవులకు అలంకరించిన తర్వాత మాతృదేవి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు గురుదేవులు మంచం నుండి క్రిందకు దిగి నేలమీద పడుకున్నట్లు కలగన్నారు మాతృదేవి. తక్షణం లేచి మంచం దగ్గరికి వెళ్లారు. గురుదేవుల పటాన్ని పూర్తిగా చీమలు ఆవరించి ఉన్నాయి. ఆ చీమలు పూలమాల నుండే వచ్చి ఉంటవని గ్రహించిన మాతృదేవి, ఆ రోజు నుండి గురుదేవులు విశ్రమిస్తున్నప్పుడు పూలమాలతో అలంకరించ వద్దని చెప్పారు.
మహోన్నత విషయాలలో మాత్రమే కాకుండా సామాన్య విషయాలలో కూడా మాతృదేవికి గురుదేవులు సజీవులుగానే కనిపించేవారు. రాధూ వివాహానం తరం ఆమె భర్త ఇంటికి పోతున్నప్పుడు మాతృదేవి ఆమెకు ఒక పెట్టెను ఇచ్చి పంపారు. కానీ అందులోని డబ్బును తీసుకోవడం మరచిపోయారు. అది పెద్ద మొత్తమే. ఆ రాత్రి గురుదేవులు మాతృదేవికి కనిపించి, “ఏమిటి! డబ్బుతో పాటు రాధూకు పంపించేశావా?” అని అడిగారు. మరుసటి రోజే ఒక భక్తుని పంపించి డబ్బును తెప్పించారు మాతృదేవి.
ఇలా ప్రతి క్షణమూ గురుదేవులు మాతృదేవితో ఉంటూన్నందువలననే మాతృదేవి ఎల్లప్పుడూ గురుదేవులు వసించే పూజా మందిరంలోనే నివసించారు. ఉద్బోధన్ ఇంటికి మాతృదేవి మొదటిసారి వెళ్లినప్పుడు పూజ గదికి సమీపంలో మరొక గది మాతృదేవి కోసం కేటాయించారు. కానీ మాతృదేవి, “ఆయనను వదలి నేను ఉండలేను. అలా ఉండడం కూడా సబబు కాదు” అంటూ పూజా మందిరాన్నే తమ నివాసంగా చేసుకున్నారు.
పరిపూర్ణ జ్ఞాని
గురుదేవులు భగవంతుడనీ, సర్వదేవదేవీ స్వరూపులనీ పూజించడంతోనే మాతృదేవి తమ జీవితాన్ని అర్పించినా భక్తురాలు అనే పరిమాణానికి మాతృదేవి జీవితంలో ఒక పూర్తి పుట ఉంది. భగవంతుడు – భక్తురాలు; గురువు – శిష్యురాలు అనే సంబంధం మాత్రం కాకుండా తామూ గురుదేవులూ ఒకే నాణెపు రెండు పక్కలు అనే జ్ఞానం ఆమెకు పరిపూర్ణంగా ఉంది. ఒకసారి స్వామి కేశవానంద, తనకు గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం లేకపోయిందని మాతృదేవితో బాధపడుతూ చెప్పి నప్పుడు మాతృదేవి “ఇదిగో చూడు! గురుదేవులు (తమ దేహాన్ని చూపిస్తూ) ఈ శరీరంలో సూక్ష్మ రూపంలో జీవిస్తూన్నారు. వారే నాతో, ‘నేను నీలో సూక్ష్మ రూపంలో ఉంటున్నాను’ అని చెప్పారు” అని అన్నారు. దీనిని దిగువ సంఘటన స్పష్టం చేస్తుంది.
ఒకసారి ఉద్బోధన్లో ముగ్గురు భక్తులు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవి కొంత ప్రసాదాన్ని మూడు ఆకులలో పెట్టి, వాటి నుండి కొంత తీసు కుని తమ నోట్లో వేసుకుని, తద్ద్వారా దానిని తమ ప్రసాదంగా మార్చి వారి కిచ్చారు. అప్పుడు ఆ భక్తులలో ఒకడు, “అమ్మా! నేను గురుదేవుల ప్రసాదం తప్ప వీరెవరి ప్రసాదమూ తీసుకోను” అన్నాడు. అందుకు మాతృదేవి ప్రశాం తంగా, “అలా అయితే దీనిని తీసుకోవద్దు” అన్నారు. కొంతసేపయిన తర్వాత ఆ భక్తునికి నిజం కొద్దిగా స్పష్టమయింది. వెంటనే మాతృదేవిని సమీపించి, “అమ్మా! నేను నిజాన్ని గ్రహించాను. మీరూ, గురుదేవులూ అభిన్నులు” అన్నాడు. మాతృదేవి మునుపటి లాగే ప్రశాంతంగా, “అలా అయితే ప్రసాదం తీసుకో” అన్నారు.
కొన్ని సమయాల్లో, “గురుదేవులు ఏదో, అదే నేను కూడా” అని కూడా మాతృదేవి చెప్పేవారు.*
సర్వత్రా నేనే
ఇలాంటి పూర్ణజ్ఞానంలో నెలకొన్న మాతృదేవి జ్ఞానపరమైన అనుభవాలు కోకొల్లలు. మనుష్యులకు మాత్రమే కాకుండా, మృగాలు, పక్షులకు కూడా ఆమె ఆశ్రయంగావున్నారు. అనేక ఇళ్ల నుండి కొట్టి తరమబడిన పిల్లులు మాతృదేవి పాదాలను ఆశ్రయించాయి. కానీ బ్రహ్మచారి జ్ఞాన్కు పిల్లులంటే గిట్టదు. ఆతడితో మాతృదేవి, “ఇదిగో చూడు, దొంగలించడం పిల్లుల నైజం. వాటిని ప్రేమగా చూడడానికి ఎవరున్నారు?” అనేవారు. ఒకసారి మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకు వెళ్లేటప్పుడు జ్ఞాన్ను పిలిచి ప్రతి రోజూ ఆ పిల్లులకు ఆహార మిచ్చి చూసుకోమన్నారు. ఎదురుచూచినట్లే జ్ఞాన్ జంకుతూ నిలబడ్డాడు. వెంటనే మాతృదేవి, “నాయనా! పిల్లులను కొట్టకు! ఎందుకంటే వాటిలో కూడా నేనే కదా ఉంటున్నాను” అన్నారు.* అంతే! ఇక వాటి మీద చేయి చేయించుకోగలడా ఆతడు! ఆ రోజు నుండి వాటిని ప్రేమతో పోషించాడు.
అందరూ ఒక్కటే
అంజద్ ఒక పేద మహమ్మదీయుడు. మాతృదేవి ఆతణ్ణి ఒక రోజు భోజ నానికి పిలిచారు. ఆతడు వచ్చి వసారాలో కూర్చున్నాడు. నళిని వడ్డించసాగింది. ఆమెకు ఆచారం పిచ్చి కాబట్టి దూరంగా నిలబడే అంజద్ విస్తరిలో వంటకాలు పడేసింది. అది చూసి నొచ్చుకున్న మాతృదేవి ఆమెతో, “ఇలా వడ్డిస్తే ఎవరు తృప్తిగా భోజనం చేయగలుగుతారు? ఇలా ఇవ్వు, నేను వడ్డిస్తాను” అంటూ వంటకాలను తీసుకున్నారు. తర్వాత ఆతడి పక్కన కూర్చొని తామే ప్రేమగా వడ్డించారు. ఆతడు భోజనం చేశాక ఆ ఎంగిలి విస్తరిని తీసేసి, ఆతడు భోజనం చేసిన చోటును కూడా శుభ్రం చేశారు. ఇదంతా చూసి నళిని, “అత్తా! ఊళ్లోవాళ్లు చూస్తే మమ్మల్ని కులం నుండి వెలివేస్తారు” అంటూ అరిచింది. అందుకు మాతృదేవి సూటిగా, “నోరుముయ్యి! నా కేమిటి కులమేమిటి? శరత్ నాకు ఎలా కుమారుడో, అట్లే ఈ అంజద్ కూడా నా కుమారుడే” అన్నారు.*
మాతృదేవి కరుణను అభివ్యక్తం చేసిన ఈ సంఘటనలకు వారి జ్ఞానానుభవమే ఆధారమని మనం చూసివున్నాం.
సమాధి అనుభవాలు
బృందావనం రోజులలా మాతృదేవి అప్పుడప్పుడు సమాధి స్థితులను పొందడం కాలాంతరంలో మనం చూడలేదు. అలాంటి స్థితులలో నెలకోవడాన్ని ఆమె గోప్యంగా ఉంచారనే అనుకోవాలి. అయినా ఒకటి రెండు సార్లు ఇలాంటి స్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి ‘కౌరవ పాండవులు’ నాటకం చూడడానికి మాతృదేవి భక్తులతోపాటు మినర్వా థియేటరుకు వెళ్లారు. నాటకంలో ఒక దృశ్యంలో దేవి ప్రత్యక్షమయింది. దీనిని చూడగానే మాతృదేవి సమాధి స్థితులయ్యారు.
మరొకసారి ఉద్బోధన్ సమీపంలోవున్న మరొక ఇంట్లో కృష్ణుడు – గోపికలు గురించి వీథినాటకం జరగనున్నదని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. వింటూ వున్నప్పుడే కొద్దికొద్దిగా బాహ్యస్మృతి కోల్పోసాగారు. సంగీత దర్శకుడు కృష్ణుడు – గోపికలు విడిపోవడంతో నాటకం ముగించాడు. వెంటనే మాతృదేవి ఒక వ్యక్తి మూలంగా ఆ సంగీత దర్శకుణ్ణి రాధాకృష్ణుల సంగమం పాటతో ముగించమని అభ్యర్థించారు. ఆతను కూడా అలాగే ఒక పాట పాడాడు. ఆ పాట పూర్తి అవుతూండగా మాతృదేవి పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయి శిలలా కూర్చుండి పోయారు. మాతృదేవి ఇలాంటి స్థితులకు చిరపరిచితురాలయిన గోలాప్ మా ఆమెను మృదువుగా పైకిలేపి, పట్టుకుని నడిపించుకుంటూ బండి దగ్గరకు తీసుకువచ్చారు. కానీ నడవలేక మాతృదేవి పాదాలు తడబడ్డాయి. గోలాప్ మా అమాంతంగా ఆమెను ఎత్తుకుని బండిలో కూర్చోపెట్టాల్సి వచ్చింది. ఉద్బోధన్లో కూడా ఇద్దరు వ్యక్తుల సహాయంతో మాతృదేవిని మేడమీదికి తీసుకెళ్లారు. అప్పటికీ మాతృదేవికి బాహ్యస్మృతి రాలేదు. కళ్లు తెరిచిన స్థితిలో శిలలా నిలబడి వున్నారు. ఎలాంటి చలనమూ లేదు. “బృందావనంలో ఇలాంటి స్థితుల నెన్నిటినో మాతృదేవిలో చూచివున్నాను. ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాను” అంది గోలాప్ మా. ఎంతసేపయినప్పటికీ మాతృదేవికి బాహ్యస్మృతి కలుగలేదు. మూర్తీభవించిన మాతృత్వమే అయిన ఆమెను ‘అమ్మా’ అనే పిలుపు మాత్రమే బాహ్యస్మృతిని కలుగజేయగలదని తెలుసుకున్న ఒక శిష్యుడు మాతృదేవి చెవులలో ‘అమ్మా, అమ్మా’ అని పిలువసాగాడు. చాలాసేపటి తర్వాత మాతృదేవి దివ్య శరీరం స్పందించింది. తర్వాత మెల్లగా “ఏం నాయనా?” అని అడిగారు. ఆమె సమాధి స్థితి నుండి మామూలు స్థితిలోకి వచ్చారు. వెంటనే ఏమీ జరగనట్లు గురుదేవులకు నైవేద్యం ఇవ్వడానికి వెళ్లిపోయారు. ఈ సంఘటన మాతృదేవి మొట్టమొదటి సారి ఉద్బోధన్కు వెళ్లినప్పుడు అంటే 1907లో జరిగింది.
మాతృదేవిలో నెలకొన్న ఉన్నతమైన భక్తి, పూర్ణజ్ఞానం బాహ్యజీవితంలో కరుణ, సరళత, ఓర్పు మొదలైన సంపూర్ణమయిన మానవ గుణగణాలుగా అభివ్యక్తమైనాయి.
కరుణ, సహనం లాంటి గుణగణాలు మాతృదేవిలో నెలకొనలేదు; అందుకు బదులుగా వాటి అపరావతారమే ఆమె అని చెప్పడం సమంజసం. ఇతరుల కష్టాలను చూసినప్పుడు జాలిపడి, వారికి తమ చేతనయినంత సాయం చేయడం కరుణ అభివ్యక్తీకరణమే. “కరుణారహితుని మనిషాగా పేర్కొనవచ్చా?” అని అంటారు మాతృదేవి. కానీ ఇలా సహాయం చేయడంతో మాత్రం ఆగలేదు మాతృదేవి – మరొక మెట్టు ముందుకు వెళ్లి కష్టపడుతున్న వ్యక్తితో తమను తాదాత్మ్యం చేసుకుని, ఆ కష్టాన్ని తానుకూడా అనుభవించారు. ఇలా చేయడం వలన వారందరి దుఃఖాలను ఉపశమింప చేసేవారు. ఈ కారణం వల్లనే భక్తులు తమ దుఃఖాలను మాతృదేవికి చెప్పుకొంటూ విలపించినప్పుడు, ఆమె కూడా వారందరితోపాటు కలిసి విలపించడం మనం చూస్తున్నాం. ఒకసారి మాతృదేవి వసారాలో ఒంటరిగా కూర్చొనివున్నారు. అప్పుడు ఒక భక్తురాలు వచ్చి మాతృదేవితో తన కుమారుడు చనిపోయిన వైనం చెబుతూ రోదించసాగింది. అది విని మాతృదేవి కూడా భోరున విలపించసాగారు. ఆమె విలాపం విని ఇంట్లో ఉన్నవారంతా హడలిపోయి బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి ఆ భక్తురాలితోపాటు మాతృదేవి కూడా ఏడుస్తూ కనిపించారు. కాసేపటికి ఆ భక్తురాలి మనస్సు కుదుటపడింది. మనస్సులో ప్రశాంతత నెలకొనడం గ్రహించిన ఆ భక్తురాలు మెల్లగా లేచి మాతృదేవికి ప్రణమిల్లి వెళ్లిపోయింది.
మరొక సంఘటన. మాతృదేవి ‘భారవాహకుల’ లో ఒకరైన యోగిన్ చివరి రోజుల్లో వ్యాధిగ్రస్థుడై ఉద్బోధన్లో మంచం పట్టాడు. ఇక మాతృదేవి దుఃఖాన్ని వర్ణింపనలవికాదు. వ్యాధి కారణంగా యోగిన్ బరువు క్రమంగా తగ్గుతూవస్తూంటే, మాతృదేవి ఆరోగ్యం కూడా దెబ్బతిని, ఆమె బరువుకూడా తగ్గసాగింది. ఏదో ఒకరోజు యోగిన్ కాస్త ఆరోగ్యం కనబడితే అప్పుడు మాతృదేవి ఆరోగ్యమూ మెరుగ్గా ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా మాతృదేవే చెప్పారు. కాలాంతరంలో శిష్యు డొకడు మాతృదేవి మొట్టమొదటి ఛాయాచిత్రాన్ని ఆమెకు చూపిస్తూ, “అమ్మా! ఈ ఛాయాచిత్రం అప్పటి మీ రూపాన్ని సరిగ్గా చూపుతున్నదా?” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “అవును నాయనా! సరిగ్గావుంది. కానీ ఆ సమయంలో నేను ఇంకా కాస్త లావుగా ఉండేదాన్ని. ఈ ఛాయాచిత్రం తీసినప్పుడు యోగిన్ వ్యాధిగ్రస్థుడై మంచంపట్టాడు. ఆ కారణంగా నేను కూడా సన్నబడ్డాను. అందువల్ల ఛాయాచిత్రంలో అలా తగ్గిపోయినట్లు కనబడుతున్నాను” అని బదులు చెప్పారు.
ఇది సాధ్యమా? ఒకరి శారీరక వ్యాధిని మరొకరు తీసుకోగలరా? ఒక వ్యక్తి మనోభారాన్ని మరొక వ్యక్తి పంచుకోగలడా? ఇది సాధ్యం మాత్రమే కాదు, అలా పంచుకోవడాన్ని ఉన్నతమైన కరుణ అని పేర్కొంటుంది మనోతత్త్వ శాస్త్రం. ఇలాంటి ఉన్నతమైన కరుణ కారణంగానే భగవంతుడే మానవుడిగా అవతరిస్తున్నాడు అనేది మాతృదేవి భావన. “ఓహో! ఒకడు ఎంత దుఃఖమూ, కష్టమూ అనుభవించాల్సివస్తుంది! జీవులు పడుతున్న ఆవేదనను చూసి భగవం తుని మనస్సు కారుణ్యంతో కరిగిపోతుంది. అందువల్ల ఆయన ఇలలో అవత రిస్తాడు. జీవుల దుఃఖాన్ని, భగవంతుడు తప్ప వీరెవరు బాపగలరు? అందువల్ల ఆయన మానవునిగా అవతరించి, సామాన్యులకన్నా ఎక్కువగా దుఃఖాలను స్వీక రిస్తాడు. తాను వాటిని అనుభవించడం ద్వారా వారందరి ఆవేదనను తొల గిస్తాడు.” మాతృదేవి జీవితంలో ఇలాంటి కరుణ వెల్లువ మనం చూస్తాం.
సహనం
సహనాన్ని తీసుకుంటే, మాతృదేవి తమ కుటుంబం వారితో గడిపిన ప్రతి క్షణమూ ఆమె సహనానికి ఒక సవాలే, కుటుంబం వారు పెట్టే నానా అవస్థలను సహిస్తూ ఆమె జీవించడం హిమాలయ సహనమనే చెప్పాలి. మాతృదేవి కుటుంబ జీవితంలో ఈ అంశాన్ని విపులంగా చూశాం. అందువల్ల మళ్లీ ఇక్కడ ప్రస్తావించ నవసరం లేదు.
సరళత
ఆమె చూడడానికి మాత్రమే కాకుండా, మానసికంగా కూడా ఎంతో సరళ మయిన వారు. ఒక గ్రామీణ స్త్రీ అయినందువల్ల ఆమెలో సరళత స్వభావ సిద్ధంగా ఉంది. అందుతోపాటు నిజమైన జ్ఞాన పర్యవ సానమైన వినమ్రత, సరళతను ఇనుమడింపచేసింది. ఆమె ఎన్నడూ తనను ఉన్నతంగా చూపించుకోలేదు. ఒక వృద్ధురాలు మాతృదేవి ఇంట్లో వంట చేసేది. మాతృదేవి ఆమెను అత్తా అంటూ సంబోధించేవారు. దుర్గాపూజ సమయంలో సంప్రదాయానుసారం మాతృదేవి తమకన్నా పెద్దవా రయిన ఆ అత్త పాదాలకు నమస్కరించడానికి వెళ్లారు. ఆ స్త్రీ హడలిపోతూ, “అయ్యో! ఏం చేస్తున్నారు? అండ చరాచరాలన్నిటికి మీరు తల్లి. అందరూ మీకు నమస్కరిస్తున్నారు. మామూలు స్త్రీనైన నాకు మీరు నమస్కరించడమా?” అంటూ ఆపారు. కానీ మాతృదేవి వీటినన్నిటినీ పట్టించుకోకుండా “అలాంటి దేమీలేదు. మీరు వయస్సులో నాకన్నా పెద్దవారు. నేను నమస్కరించే తీరాలి” అంటూ నమస్కరించారు.
మాతృదేవి మాటలలోను, నడతలోను చిన్నపిల్లల నిష్కాపట్యం చోటు చేసు కుంది. కొన్ని సమయాల్లో ఆమె చేష్టలు చూసే వారిని విరగబడి నవ్వేలా చేస్తుంది. ఒక రోజు నీళ్లకోసం కొళాయిని తిప్పారు. దాన్లో నుండి ఉస్ అంటూ శబ్దం వచ్చింది. అంతే, భయపడిపోయి అక్కణ్ణుండి ఒకటే పరుగు! కొళాయిలో ఒక పాము బుసగొడుతూవుందని అందరినీ కొళాయి దగ్గరకు తీసుకెళ్లారు. పడుతూ లేస్తూ వారందరూ పరుగెత్తి కెళ్లి చూస్తే, అది గాలి బయటికి వచ్చిన శబ్దం! మాతృదేవి అమాయకత్వం చూసి అందరూ కడుపుబ్బ నవ్వారు. కాలాం తరంలో ఈ సంఘటన గురించి చెబుతూ తామూ నవ్వేవారు.
మాతృదేవికి సంబంధించినంత వరకూ లాంతరు ఒక పెద్ద యంత్రం. దానిని విప్పి పరిశుభ్రం చేసి మళ్లీ యథాస్థితిలో ఉంచడం చాలా పెద్ద విషయం. ఎవరైనా ఆ పని చేశారంటే వారి సామర్థ్యాన్ని ఎంతగానో ప్రశంసించేవారు మాతృ దేవి. ఒక భక్తురాలిని ఉద్దేశిస్తూ, “ఓ! ఆ ఇంటి అమ్మాయి గడియారానికి ‘కీ’ ఇస్తుంది” అనేవారు. గడియారానికి ‘కీ’ ఇవ్వడాన్ని అంత గొప్పగా చెప్పుకోవడం విని అందరూ ఘొల్లుమని నవ్వేవారు.
కొన్ని సమయాల్లో మాతృదేవి ముక్కోపమూ, ఉక్రోషమూ గల చిన్న బాలి కలా ప్రవర్తించేవారు; బాలికలతో బాలికలా పోట్లాడేవారు. ఒకసారి ఆమే, రాంమ్మయ్ అనే బాలుడు* చపాతీ పిండి సిద్ధం చేస్తున్నారు. మాతృదేవి చపాతీలు చేయడాన్ని తమాషా చేయాలని తలంచిన నళిని, రాంమయ్ చేస్తున్న చపాతీలు గుండ్రంగా, అందంగా ఉంటున్నాయనీ, మాతృదేవి చేస్తున్న చపాతీలు వంకర టింకరలుగా ఉన్నాయనీ చెప్పింది. ఈ మాటలు వినగానే మాతృదేవి చపా తీలు చేయడం మానేసి ఉక్రోషంగా, “నేను చపాతీలు చేసి చేసి ముసలిదాన్నయి పోయాను. ఆ అబ్బాయి నిన్న పుట్టినవాడు. వాడు తాగిన తల్లిపాలు కూడా వాడి గొంతు నుంచి ఇంకా కిందికి దిగివుండదు. అలాంటి అబ్బాయి నాకన్నా బాగా చపాతీలు చేస్తున్నాడని చెబుతున్నావే! నేను ఇక చపాతీలు చేయను, పో” అంటూ మరోవైపు తిరిగి కూర్చొన్నారు. మాతృదేవి అలా కూర్చోగానే రాంమ్మయ్ కూడా, “మాతృదేవి చపాతీలు చేయకపోతే నేను కూడా చేయను” అంటూ కూర్చున్నాడు. తర్వాత వారి మధ్య ఏదో రాజీ కుదిరిన తర్వాతే మాతృదేవి మళ్లీ చపాతీలు చేయడం మొదలుపెట్టారు.
ఉద్బోధన్ ఇంటి ముందు ఒకడు తన ఉంపుడుకత్తెతో జీవిస్తున్నాడు. ఆమె ఒకసారి జబ్బుపడింది. ఆమె తన భార్య కాకపోయినా రాత్రింబవళ్లు ఎంతో శ్రద్ధగా ఆమెకు పరిచర్యలు చేశాడు ఆతడు, ప్రతిదీ దివ్యభావనతో చూసే మాతృ దేవి కళ్లకు ఆతడి సంబంధంలో తప్పు కనబడలేదు. బదులుగా ఆతని పరిచర్య లను ప్రశంసిస్తూ ఒక భక్తురాలితో, “ఎంత ఆప్యాయంగా, శ్రద్ధగా ఆమెను చూసు కొంటున్నాడో చూడు! ఇలా నేను చూడనేలేదు. ఇదే నిజమైన సేవ, నిజమైన ప్రేమ!” అన్నారు. ఈ మాటలు విన్న భక్తురాలు ఆశ్చర్యపోతూ, “అయ్యో! తన ఉంపుడుకత్తెకు కదా ఆతడు సేవ చేశాడు. నేను దీనిని ఆలోచించి కూడా చూడ లేను” అంది.
ఒకసారి రాధూ కోపంతో తన భర్త మన్మథ్ మీద ఒక గుడ్డను విసిరేసింది. అందువల్ల కోపగించుకున్న మన్మథ్ ఆమెను గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. ఈ విషయం తెలిసినప్పుడు మాతృదేవి రాధూకోసం బాధపడ్డారు. కానీ ఆమెతోపాటు ఉన్న యితర స్త్రీలందరూ మన్మథ్ ప్రవర్తనను సమర్థించారు; ఆతడు కొట్టడం సమంజసమేనన్నారు. ఈ మాటలు విన్న మాతృదేవి, “అలాగా! నా భర్తతో నాకు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. ఈ విషయాల్లో నాకు అనుభవం శూన్యం” అన్నారు.
హాస్య భావన
సోదరి నివేదిత, సోదరి క్రిస్టైను వంగ భాష నేర్చుకుంటున్నారు. వారు వంగ భాషలో తాము గడించిన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి, మాతృదేవితో ఒకసారి, “అమ్మా! మీరే మాకు కాళి” అంటూ వంగ భాషలో చెప్పారు. అది విన్న మాతృదేవి, “అయ్యో! నేను కాళిలా ఉండలేను. సదా నాలుకను బయటికి చాపుకుని ఉండడం ఎవరివల్ల అవుతుంది?” అన్నారు.
మరో రోజు ఒక శిష్యుడు మాతృదేవితో, “అమ్మా! నేను మునుపు మిమ్మల్ని కాళిగా భావించేవాణ్ణి. ఇప్పుడు తల్లిగా భావిస్తున్నాను” అన్నాను. వెంటనే మాతృ దేవి, “అబ్బ! ఎంత ఉపశమనం! నాలుక బయటికి చాపుకుని ఉండడం నుంచి నేను తప్పించుకున్నాను” అన్నారు.
మాతృదేవి చివరి రోజుల్లో ఆమె దూరపు బంధువయిన భవాని ఆమెను చూడడానికి వచ్చింది. ఆమె తల్లి అప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇవ్వమని రెండు దానిమ్మ పండ్లను భవానీకి ఇచ్చారు మాతృదేవి. అప్పుడు, మాతృదేవి భక్తుడొకడు పంపిన చక్కని పండ్లతో నిండిన ఒక బుట్ట వచ్చింది. భవానీ చూపు ఆ పండ్లమీదపడింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ ఆమె, “ఏం చేస్తాం! మొదట్లో నన్నే పరమహంస దేవులకు వధువుగా మాట్లాడారు. ఆయన పిచ్చి వారని అనుకుని మా నాన్న అందుకు సమ్మతించలేదు. సమ్మతించివుంటే ఈ పళ్లన్నీ నా ఇంటికే వచ్చివుండేవి కదా!” అంది. అక్కడున్న అందరూ కడుపుబ్బ నవ్వారు. మాతృదేవి చిన్నగా నవ్వుతూ, “అలా అయితే ఇవన్నీ నీకు చెందినవే. నీకు కావలసినన్ని తీసుకో” అన్నారు.
గాంభీర్యం
మాతృదేవి సరళ స్వభావి; హాస్యం తొణకిసలాడే భావంతో మెలగేవారు, ఆప్యాయత కనబరచారు అనడానికి అర్థం ఎవరైనా ఆమె నుండి దేనినైనా సాధించుకోవచ్చని కాదు. ఈ విషయంలో భక్తులు, బంధువులు అనే తేడా లేదు. ఒకసారి భక్తుడొకడు మాతృ దేవితో ఉన్న ఒక శిష్యునితో, “మీరందరూ సదా మాతృదేవి వద్దే ఉంటున్నారు. ఎంత పుణ్యం చేసుకొన్నారో కదా మీరు!” అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు ఒకరు వినమ్రంగా ఆయనతో, “నాకేమో ప్రతి ఒక్కరూ మాతృదేవికి దూరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. కొందరి విషయంలో దూరం ఎక్కువగా ఉండ వచ్చు. కొందరి విషయంలో తక్కువగా ఉండవచ్చు. అంతేకాని దూరం ఉండనే వుంది” అన్నారు. అలాంటి దృఢత్త్వంగల గాంభీర్యం మాతృదేవిలో చోటు చేసు కుంది. పువ్వులాంటి మృదుత్వంతోపాటు వజ్రంలాంటి దృఢత్వం గల మనస్సు అని దక్షిణేశ్వర రోజులలోనే మనం చూశాం. కొన్ని సందర్భాల్లో ఆమెను సమీ పించడానికి కూడా జంకిన సమయాలూ ఉన్నాయి.
పేద యువకుడొకడు మంత్రదీక్ష కోసం రెండు మూడుసార్లు జయరాం బాటికి వచ్చాడు. మాతృదేవి ఆరోగ్యం బాగాలేనందువల్ల మంత్రదీక్ష తీసుకోవడం కుదరలేదు. అందువల్ల ఆతడు మాతృదేవికి ఒక జాబు వ్రాశాడు. అందులో, “అమ్మా! దయచేసి ఇకపై వీలుకాదని చెప్పకండి. ప్రతిసారీ నేను ఎంతో శ్రమ పడి అక్కడికి వస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడయినా నాకు మంత్రదీక్ష ప్రసా దిస్తారా అని తెలుసుకోగోరుతున్నాను” అంటూ వ్రాశాడు. జాబును చదవగా విన్న మాతృదేవి తన శిష్యునితో, “వారెవరయినా నా ఆరోగ్యం బాగాలేని సమయంలో వస్తే తప్పకుండా తిరిగి వెళ్లాల్సిందే, బహుశా ఆరోగ్యంగా ఉన్నాకూడా. వచ్చేవారి కందరికీ మంత్రదీక్ష యిస్తాను అంటూ ఆహ్వానించడమూ జరగదు. దీనికి అను కూల సందర్భాలు వారివారి ప్రారబ్ధానికి తగినట్లు ఉంటాయి. ఒక వ్యక్తి పలు మార్లు రావడం జరిగినా నన్ను దర్శించుకోలేడు; నా ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, లేదా ఇంకేదో ఆటంకం రావచ్చు. అది ఆతడి దురదృష్టం. నేనేం చేయగలను? వారందరూ ఇక్కడికి రావడానికి బాగా డబ్బు ఖర్చవుతుందే, అందరూ డబ్బున్న వాళ్లు కాదుకదా అంటూ మీరు అనవచ్చు. కానీ శిష్యుడు కావాలని అభిలషించే వ్యక్తిని గురువు పలుమార్లు ఇలా త్రిప్పి పంపవచ్చు. గురువు కృపాకటాక్షం గోరేవాడు బిచ్చమెత్తి అయినా ఇక్కడికి వస్తాడు. అసలు విషయం ఇదే! ఈ సంసార సాగరాన్ని దాటాలని పట్టుదల ఉన్నవాడు ఎలాగయినా సంసార బంధా లను తెంచుకొంటాడు. ఎవరూ ఆతణ్ణి ఆపలేదు. డబ్బు లేకపోవడం, జవాబుకు నిరీక్షణలు, మంత్రదీక్ష లభించకుండా తిరిగి వెళ్లలేమోననే భయం – ఇవన్నీ కేవలం సాకులు” అన్నారు.
మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని అభిలషించినా అలా తీసుకో లేకపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి తెలియవస్తున్నది. నవదీప్ చంద్రరాయ్ అనే వ్యక్తి మాతృదేవి అనుమతితో ఇద్దరు యువకులను మంత్రదీక్ష కోసం తోడ్కొని వచ్చాడు. మొదటి యువకునికి మంత్రదీక్ష ఇస్తున్నప్పుడు రెండవ యువకుడు హఠాత్తుగా లేచి ఒక్క పరుగుతో పారిపోయాడు. ఆతడు ఈ సంఘటనను గురించి చెప్పినప్పుడు “చెప్పనలవికాని ఏదో భయం అప్పుడు నన్ను ఆవహిం చింది. అందువల్ల పరుగుతీశాను” అన్నాడు.
మరొక వ్యక్తి ఉద్బోధన్ కార్యాలయంలో పనిచేసిన చంద్రమోహన్. దుకా ణానికి వెళ్లిరావడం లాంటి చిన్న చిన్న పనులు చేసిపెట్టడం వల్ల మాతృదేవితో సహజంగా మెలిగేవాడు. ఒక రోజు వృద్ధ సాధువులలో ఒకరు ఆతనితో, “నువ్వు అనుకున్నప్పుడల్లా మాతృదేవి వద్దకు వెళ్లగలుగుతున్నావు, ప్రసాదం తీసుకుని తింటున్నావు. నువ్వెందుకు ముక్తి కావాలని ఆమెను ప్రార్థించకూడదు?” అని అడిగారు. అందుకు చంద్రమోహన్. “అదేం గొప్ప విషయం! ఇదుగో ఇప్పుడే వెళ్లి అడిగి వస్తాను” అంటూ గొప్పలు చెప్పుకుంటూ మాతృదేవిని వెదుక్కుంటూ వెళ్లాడు. అప్పుడు మాతృదేవి పూజలో ఉన్నారు. చంద్రమోహన్ ఆమె దృష్టిని ఆక ర్షించడానికి గది తలుపు వద్ద నిలబడ్డాడు. కానీ కొంతసేపటికి ఆతడి శరీరం కంపించసాగింది. మాతృదేవి ఆతణ్ణి చూసి ‘ఏం కావాలి?’ అంటూ సైగ చేశారు. ఆతడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. తర్వాత ఇన్ని రోజులుగా అడుగుతున్న అలవాటు ప్రకారం, “నాకు ప్రసాదం కావాలి” అన్నాడు. మాతృదేవి ఏమీ మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోటు చూపారు. ఆతను కూడా ఎప్పటిలా ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చాడు. ఆ వణకు పోవ డానికి ఆతడికి గంటసేపు పట్టింది.
మరొక సంఘటన: అప్పుడు మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. మాతృదేవి అనుమతితో సన్న్యాసం పుచ్చుకోవడానికి గిరీశ్ అక్కడికి వచ్చాడు. కానీ మాతృదేవి అందుకు సమ్మతించలేదు. గిరీశ్ అరగంటకు పైగా మాతృదేవితో వాదన చేశాడు. కానీ మాతృదేవి ఒప్పుకోలేదు. గిరీశ్ ముక్కోపి. హఠాత్తుగా ఆత నికి కోపమూ, ఆవేశమూ వచ్చేస్తాయి. ఎవరూ సాహసించని మాటలను గురు దేవులతోనే మాట్లాడి పోట్లాడినవాడు. అలాంటి మనిషి మొండిపట్టుదల కూడా మాతృదేవి పట్టుదలను సడలింప చేయలేకపోయింది. గిరీశ్ సన్న్యాసం పుచ్చు కోవడానికి చివరి దాకా ఆమె అనుమతించనే లేదు.
మరొక సంఘటన: ఉద్బోధన్ సమీపంలో ఉంటున్న మురికివాడలో ఒకడు ఒక రోజు బాగా త్రాగి వచ్చి తన భార్యను పెడాపెడా బాదుతున్నాడు. ఆ స్త్రీ బాధ తట్టుకోలేక అరవసాగింది. ఆమె అరిచేకొద్దీ ఆతడు ఇంకా తన్నుతూ కొట్ట సాగాడు. అప్పుడు మాతృదేవి ధ్యానంలోవున్నారు, ఆమె అరుపులు విన్న తర్వాత ఆమె ప్రశాంతంగా ఉండలేకపోయారు. వేగంగా లేచి మేడ మీదికి వచ్చారు. అక్కడ నిలబడి బిగ్గరగా, “ఓ మూఢుడా! ఆమెను కొట్టే చంపేస్తావా ఏమిటి?” అన్నారు. మామూలుగా మాతృదేవి బిగ్గరగా మాట్లాడరు, మేడమీద నిలబడి ఇంత బిగ్గరగా అరవడం అందరినీ ఆశ్చర్యపరచింది. మాతృదేవి గంభీర కంఠధ్వని ఒక మంత్రంలా పనిచేసింది.
వెంటనే కొట్టడం మానేశాడు. కోపం తగ్గాక ఆమెను ఓదార్చాడు కూడ!
ధనం పట్ల విరక్తి
ధనానికి చెందినంత వరకు మాతృదేవి పూర్తి విరక్తి భావంతో ఉండేవారు. గురుదేవులు ధనాన్నో లోహాలనో తాకలేకపోయేవారు. ధనమో, నగలో ఏది వచ్చినా వాటిని మాతృదేవి లక్ష్మీస్వరూపంగా ఎంచి తలకు అద్దుకొని నమస్కరించేవారు. ఎవరైనా ఆమె ఈ ప్రవర్తనను గురుదేవుల విధానంతో పోల్చడానికి యత్నిస్తే, “నాయనా! నన్ను గురు దేవులతో పోల్చడమా! ఎంతయినా నేను ఒక స్త్రీని, ఆభరణాలను ధరించవల సిందిగా గురుదేవులే నాతో అన్నారు కదా!” అనేవారు. కానీ మాతృదేవికి ఆభర ణాలపై కోర్కె, అభిలాష ఎప్పుడూ లేదని మునుపే చూశాం. గోలాప్ మా ఏదో అందని ఆభరణాల నన్నిటిని తీసేసిన వ్యక్తి కదా మాతృదేవి!
ధనంపై మాతృదేవికున్న విరాగ భావానికి జయరాంబాటిలో జరిగిన మరొక సంఘటన కూడా చక్కని ఉదాహరణ. ఒక బీద స్త్రీకి ఒక దుప్పటి కొనివ్వ మని మాతృదేవి ఒక శిష్యునికి పది రూపాయలు ఇచ్చారు. రెండున్నర రూపాయ లకు మంచి దుప్పటి కొని తెచ్చిన ఆ శిష్యుడు మిగిలిన ఏడున్నర రూపాయ లను మాతృదేవికి తిరిగి ఇచ్చాడు. కానీ మాతృదేవి శిష్యునికి ఐదు రూపాయలే యిచ్చానని అనుకుని రెండున్నర రూపాయలకు పైగా పుచ్చుకోవడానికి నిరాక రించారు. శిష్యుడు ఎంతగా వివరించి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇదొక పెద్ద సమస్యగా తయారవడంతో భక్తులందరూ గుమిగూడారు. తర్వాత శిష్యుడు మాతృదేవితో, “పెట్టెలో ఎంత డబ్బుందో చూస్తే లెక్క తేల్చవచ్చు” అన్నాడు. అందుకు మాతృదేవి, “పెట్టెలోని డబ్బును నేను లెక్క పెట్టలేదు” అనేశారు. చివ రకు శిష్యుడు మాతృదేవి తనకు పదిరూపాయలు యివ్వకపోయివుంటే మిగతా ఏడున్నర రూపాయలు ఎలా తన చేతికి వచ్చాయని గోలపెట్టాడు. తర్వాత అందరూ చెప్పాకే మాతృదేవి ఆ డబ్బు తీసుకున్నారు.
తొలిరోజుల్లో భక్తుల నుండి, శిష్యుల నుండి తపాలు మూలంగా వచ్చే డబ్బును మాతృదేవి సోదరులే తీసుకుని ఉంచుకొనే వారు. అలా చేసినప్పుడు చాలా డబ్బును వారే కాజేసివుంటారనడంలో సందేహం లేదు. కాని తర్వాతి రోజుల్లో ఒక సన్న్యాస శిష్యుడు ఈ పని చూసుకోసాగాడు. కావలసినప్పుడు ఖర్చు లకు డబ్బును మాతృదేవి ఎవరి ద్వారానైనా తెప్పించుకునేవారు. తదనంతర కాలంలో డబ్బు ధారాళంగా వచ్చింది. వచ్చిన డబ్బునంతా అలాగే ఖర్చు పెట్టే వారు మాతృదేవి.
అనుష్ఠాన భావన, ముందుచూపు
జయరాంబాటిలో మాతృదేవి ఇంటికి గ్రామ పంచాయతీవారు సంవత్సరానికి నాలుగు రూపాయలు పన్ను విధించారు. మాతృదేవి దానిని చెల్లించదలచుకోలేదు. ఎలాగో పోరాడి పన్ను మినహాయింపుపొందారు. నాలుగు రూపాయల కోసం మాతృదేవి ఇంతగా పోరాటం చేశారా అంటే వారు పోరాటం చేసింది డబ్బుకోసం కాదు. కరుణా సముద్రమయిన ఆమె బుద్ధి సూక్ష్మత, ముందుచూపే ఇందుకు కారణం. “ఇప్పుడు నేను ఉంటున్నాను. నేను పన్ను చెల్లించగలుగుతాను. భవిష్యత్తులో ఇక్కడ ఒక బ్రహ్మచారో, సాధువో ఉంటారు. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించవలసినవారు ఎలా పన్ను చెల్లించగలరు?” ఇదే పన్ను మినహాయింపుకు మాతృదేవి పోరాటం సలిపినందుకు కారణం!
మరొక సంఘటన: ఒక రోజు మాతృదేవి శిష్యుడయిన స్వామి జ్ఞానానంద పాలుతెచ్చే వ్యక్తితో, నీళ్లే కలపని పాలు తీసుకొస్తే రెట్టింపు ధర ఇస్తానని చెప్పాడు. ఈ మాటలు విని మాతృదేవి స్వామిని పిలిచి, “నువ్వు ఎంత పనిచేశావు! ఇక్కడ ఒక పైసాకు సగం లీటరు పాలు లభిస్తుంది. నువ్వు రెట్టింపు వెల ఇచ్చావంటే, అందరూ పాల ధరను పెంచుతారు. ఇందువల్ల పేదలే కదా నానా అవస్థ పడతారు! అంతమాత్రమే కాదు, నువ్వు ఎంత ధర పెంచినా పాలలో నీళ్లు కలిపే బుద్ధి పాలు అమ్ముకొనే వ్యక్తితో మాత్రం పోదు. ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వాడు ఇంకా ఎక్కువగా పాలలో నీళ్లు కలుపుతాడు. అంతే” అన్నారు. ఆ తర్వాత బ్రహ్మచారి ఒకరు ఆ పాలు అమ్మేవాడి నుండి ఒక రోజు పాలు కొనుక్కొని వచ్చాడు. అందులో నీళ్లు కలిపి ఉండడం మాత్రమే కాదు ఒక చేప కూడా ఉంది. పాలమ్మేవాడు నిజానికి ఎలాంటి మనిషో తెలియవచ్చింది. అందరూ పాలను పారపోసేయాలన్నారు. అందుకు మాతృదేవి అంత పాలను వృధా చేయరాదని, దానిని గురుదేవులకు అర్పించక, భక్తులు వాడుకునేట్లు చేశారు.
మరొక సంఘటన: ఒక డాక్టరు భార్య మాతృదేవి భక్తురాలు. ఆమె ఒక రోజు మాతృదేవితో, “అమ్మా! మీ అల్లుడికి మంచి రాబడి రావాలని ఆశీర్వదిం చండి” అని ప్రార్థించింది. అందుకు మాతృదేవి, “హా! అదెలా సాధ్యమమ్మా? నీ భర్తకు మంచి రాబడి రావడానికి నా బిడ్డలు వ్యాధులతో బాధపడాలని నేను చెప్పాలా? అందరూ బాగుండాలన్నదే నా అభిమతం” అని బదులు చెప్పారు.
అతి మామూలు వస్తువులను కూడా వ్యర్థపరచడం చేస్తే మాతృదేవి బాధపడేవారు. ఒకసారి ఒక భక్తుడు మాతృదేవికి బుట్టలో పండ్లు పంపించాడు. పండ్లను తీసుకుని శిష్యుడు ఆ బుట్టను బయటపారేశాడు. అది పనికి వస్తుందని తెలుసుకున్న మాతృదేవి వెంటనే బయట పారేసిన బుట్టను తీసుకురమ్మని చెప్పి దానిని కడిగించి, తర్వాత పనికి వస్తుందని ఇంట్లో పదిలపరచారు.
ఒకసారి శిష్యుడొకడు కిచ్చుడీని బయట పారేయడానికి తీసుకెళ్లాడు. మాతృదేవి ఆతణ్ణి వారించి దానిని తీసివుంచ మనుకొన్నారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన బిచ్చకత్తెకు ఆ కిచ్చుడీని ఇచ్చారు. రుచిగా ఉన్న ఆ కిచ్చుడీని ఆ బిచ్చకత్తె చాలా సంతోషంగా తింది. “అమ్మాయీ! లోకంలో ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంది. ప్రజలకు ఉపయోగపడే దానిని మేకలు గేదెలకు ఇచ్చి వ్యర్థం చేయకూడదు. మేకలకు గేదెలకు ఉపయోగపడేవాటిని కుక్కలకు వేయకూడదు. మేకలు, గేదెలు, కుక్కలకు ఉపయోగపడని వాటిని కొలనులోని చేపలకు వేయాలి. దేనినీ వృథా చేయకూడదు” అనేవారు మాతృదేవి.
రాజకీయాలు
రాజకీయాల గురించి మాతృదేవికి ఏమీ తెలియదనే చెప్పాలి. కాని ఒకటి రెండు రాజకీయపరమైన సంఘటనల గురించి ఆమె అభిప్రాయం ఇప్పటికీ ఆలోచించ దగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపుకు వచ్చిన సమయం. అప్పుడు అమెరికా అధ్యక్షుడైన విల్సన్, ప్రపంచంలో ఇకపై యుద్ధమే జరగకూడదని ప్రపంచ దేశాలతో ఒక శాంతి ఒప్పిందం చేశారు. అందులో పద్నాలుగు నిబంధనలు ఉన్నాయి. వీటిని ఒక రోజు శిష్యు డొకడు మాతృదేవికి చదివి వినిపించాడు. వాటినన్నిటినీ విని మాతృదేవి, “వారి ఈ మాటలన్నీ పెదాల వరకే కాని, హృదయం నుండి వచ్చినట్లు కనబడడం లేదు. ఈ మాటలు నిజంగా హృదయం నుండి వచ్చిన వయివుంటే ఈ లోకం ఎంతో ఉన్నతమైపోయివుండేది.”
1917–18. స్వతంత్ర పోరాటం అక్కడక్కడ చెలరేగుతూ ఉంది. ఆంగ్లేయ ప్రభుత్వం అణగద్రొక్కే విధానాలను ఎడాపెడా అమలు చేస్తూవుంది. బాంకూరా తాలూకాలోని సింధుబాలా అనే ఆమెను ఖైదు చేయడానికి వచ్చిన పోలీసులు అదే పేరుతో ఉన్న ఆమె బంధువును ఖైదు చేశారు. ఆమె ప్రసవానికై పుట్టింటికి వచ్చింది. తర్వాత అసలు సింధుబాలాను కూడా ఖైదు చేశారు. వారిద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. గర్భిణి అనికూడా దయచూపకుండా పోలీసులు చేసిన దారుణ కృత్యాలను విని మాతృదేవి హడలిపోయారు. ఆమె కళ్లు ఎఱ్ఱబడ్డాయి. శరీరమంతా ఉద్రేకంతో కంపించింది. ఆమె పెదవులు కంపిస్తూవుంటే, “అవును, ఇది కంపెనీ* ఆజ్ఞా లేక కట్టుబాట్లు లేని పోలీసులు అరాచకమా? విక్టోరియా మహారాణి పరిపాలనలో ఇలా స్త్రీలను హింసించడం గురించి నేను విన్నదేలేదు. కానీ ఇది మాత్రం కంపెనీ ఆజ్ఞ అయితే, దాని సర్వనాశనం నిశ్చయం! అవును, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పోలీసులను గద్దించి ఆ స్త్రీలను విడిపించడానికి ఒక్క మగాడు కూడా లేకపోయాడా?” అని అడిగారు. మరికొంత సేపటికి వారిని పోలీసులు విడుదల చేశారనే వార్త తెలిసింది. అది విన్న మాతృదేవి, “ఓహ్! ఈ వార్త రాకుండా ఉండివుంటే నాకు రాత్రి నిద్రపట్టేది కాదు” అన్నారు.
మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న రోజులు. మాతృదేవి కోల్పారాలో ఉంటున్నారు. అప్పుడు ఒక భక్తునితో మాతృదేవి, “అవును, యుద్ధం ఎలాంటి స్థితిలోవుంది? ఎంతమంది బలి అయ్యారు? ఒకరి నొకరు చంపుకోవడానికి ఎన్నెన్ని నూతన ఆయుధాలు ఆవిష్కరింపబడ్డాయి! కొత్త యంత్రాలు కూడా ఎన్నెన్నో వచ్చేశాయి! – ఉదాహరణకు తంతి విషయమే తీసుకో! అంత మాత్రమా! రాస్ బిహారీ నిన్నటిరోజు కలకత్తాలో బయలుదేరి ఈ రోజే ఇక్కడికి వచ్చేశాడు. ఆ రోజుల్లో ఇక్కణ్ణుండి బయలుదేరి దక్షిణేశ్వరం చేరుకునే లోపల చాలుచాలనిపించేది” అన్నారు. మాతృదేవి నవీన సాధనాలను ప్రశంసించడం చూసిన ఆ భక్తుడు, “అమ్మా! ఆంగ్లేయ ప్రభుత్వం మనదేశ శ్రేయస్సుకై చక్కగా పని చేస్తున్నది” అంటూ ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణలను ఏకరువుపెట్టాడు. అన్ని టినీ ఎంతో ఓర్పుతో విన్న మాతృదేవి, “కానీ నాయనా! ప్రస్తుతం మన దేశానికి ముఖ్యంగా కావలసింది కూడూ గుడ్డా కదా! వాటికి ఇంత కొరత వచ్చింది కదా! మునుపు ఇలా ఉండేది కాదు కదా!” అన్నారు.
నిజమే. గుడ్డల కొరత కారణంగా స్త్రీలు ఇల్లు వదలి బయటికి రాలేని దారుణమైన పరిస్థితి దాపరించింది. కట్టుకోవడానికి గుడ్డలు లేవని ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు విని మాతృ దేవి తట్టుకోలేకపోయారు. ఆమె కళ్లు ధారలు కట్టాయి. ఎంతో ఆవేదనతో, “ఈ కంపెనీ పాలన ముగింపు ఎప్పుడొస్తుందో!” అని అనసాగారు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత మళ్లీ ఇలా అన్నారు: “ఆ రోజుల్లో ఇళ్లలో రాట్నం ఉండేది. ప్రత్తి పండించేవారు. తమకు కావలసిన బట్టలను ప్రజలు తామే తయారుచేసుకునేవారు. గుడ్డలకు కరువు అని ఎన్నడూ వినలేదు. కానీ కంపెనీ వచ్చి అన్నిటినీ సర్వనాశనం చేసింది. ఒక రూపాయకు నాలుగు గుడ్డలు, బేరం చేస్తే మరొకటి ఎక్కువ అంటూ కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. వాటిని నమ్మి సోమరులు రాట్నాలనన్నిటిని మూల పారేశారు. ఇప్పుడు నానా అవస్థలూ పడు తున్నారు. కొన్ని రాట్నాలను తీసుకువచ్చి నూలు వడకి, గుడ్డలు నేయండి, నాకు కూడా ఒక రాట్నం ఇవ్వండి. నేను కూడా నూలు వడకుతాను. ఏదైనా ప్రయోజన మైనది చేయండి. కేవలం “వందే మాతరం” అని ఘోషించడం వల్ల ఏమి ఒరిగి పోతుంది?”*
స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యువకులు కొందరు మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. వారిలో ఒకరు మాతృదేవితో, “అమ్మా! మనకెప్పుడు స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది!” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “మీరు వారిని తరుమగొట్టగలరని భావిస్తున్నారా? అది అసాధ్యం! వారు తమలో తాము పోట్లాడుకున్నప్పుడు మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది” అన్నారు. మాతృదేవి మాటలను చరిత్ర రూఢిపరచడం మనకు తెలుసు.
మత మార్పిడి
ఆ రోజుల్లో ఉన్నత హైందవ సమాజం స్వీకరించడానికి వెనుకాడిన మరొకదానిని కూడా మాతృదేవి ధైర్యంగా చేశారు. మతం మారిన హిందువులు మళ్లీ మన మతానికే తిరిగి రావాలని అభిలషించినప్పుడు మాతృదేవి అందుకు ఆమోదించారు; చేతల్లో చేసి చూపించారు. దక్షిణ భారతావనికి వచ్చే మార్గంలో ఒరిస్సాలోని కోట్టార్ ప్రాంతంలో మాతృదేవి నివసించిన విషయం ముందే చూశాం. అక్కడ తపాల శాఖ అధికారి దేవేంద్రనాథ్ క్రైస్తవ మతం పుచ్చుకొన్నాడు. అతను మళ్లీ హిందూ మతానికి రావాలని మాతృదేవిని ఆశ్రయించినపుడు మాతృదేవి దానిని ఆహ్వా నించారు. సరస్వతీ పూజ దగ్గరలో రావడంతో ఆ రోజు ఒక చిన్న పూజ చేసి గాయత్రీ మంత్రం జపించమని చెప్పారు. మాతృదేవి చెప్పినట్లు బ్రహ్మచారి కృష్ణ లాల్ సహాయంతో వీటిని ఆచరించి మళ్లీ హిందూమతంలోకి వచ్చేశాడు దేవేం ద్రుడు.
మాతృదేవి బడికి వెళ్లి చదువుకోలేదు. చదువు నేర్చుకోవడానికి చిన్న తనంలో ఆమె చేసిన ప్రయత్నాల గురించి మనం చూశాం. అందరికీ చదువు కావాలి అనే విషయంలో, ప్రత్యేకంగా స్త్రీల చదువు విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ చూపించారు. కుట్టుపని మొదలైనవి నేర్చుకున్నారు. ఈ విషయంలో తమ సొంత పనులను తామే చేసుకున్నారు. స్త్రీలు పాఠశాలకు వెళ్లడమో, చదువు నేర్చుకొన డమో ప్రజలు ఒప్పుకోని రోజులవి. అయినా మాకూ, రాధూ అందరినీ చదివిం చారు. రాధూ పెద్దమనిషి అయ్యాక ఆమెను పాఠశాలకు పంపవద్దని గోలాప్ మా నిషేధించినప్పుడు మాతృదేవి అంతగా ఏమీ ఆమె పెరగలేదు, ఆమెను పాఠశా లకు వెళ్లనీ, చదువు నేర్చుకుని, ఏదైన ప్రయోజనమైన చిన్న పనులను నేర్చు కుంటే ఇతరులకు చాలా సహాయం చేయడానికి ఆస్కారముంటుంది. చదువు నేర్చుకొనేవారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మంచిది చేస్తుంది” అని అన్నారు.
స్త్రీల చదువు పట్ల శ్రద్ధ
స్వామి వివేకానంద ఉద్బోధల మేరకు సోదరి నివేదిత కలకత్తాలో స్థాపించిన స్త్రీల పాఠశాలను 1898 నవంబరు 13 –వ తేది మాతృదేవి ప్రారం భించారు. పలుమార్లు ఆ పాఠశాలకు వెళ్లి వారి పనులను ప్రశంసించి ఉత్సాహపరచారు. ఆ పాఠశాల నుండి ఎవ్వరైనా ఆమెను చూడడానికి వచ్చినప్పుడు పాఠశాల వివ రాలు అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఒక భక్తురాలు తనకు పెళ్లికాని ఐదు గురు అమ్మాయిలు ఉన్నారని చెప్పి బాధపడింది. అందుకు మాతృదేవి ఇలా అన్నారు: “వారికి పెళ్లి చేయలేక పోతున్నానని ఎందుకు బాధపడతావు? వారి నందరిని నివేదిత పాఠశాలలో చేర్పించవచ్చు కదా! చదువుతోపాటు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు!”
చదువు మాత్రమే కాదు, ఎలాంటి కళనయినా మాతృదేవి ప్రశంసించే వారు. కలకత్తా వెళ్లినప్పుడు గిరీశ్ నాటకశాలకు వెళ్లి ‘బిల్వమంగళ్’ లాంటి నాటకాలను చూసి పరవశించి, ప్రశంసించారు.
వినమ్రత
ఇలాంటి ఉన్నతమైన గుణాలనన్నిటికీ మహత్త్వాన్ని సంతరింపజేసింది మాతృదేవి వినమ్రత. వందలాది మంది ఆమెను దైవంగా ఆరాధించారు. గురు దేవుల శిష్యులందరూ ఆమెను సాక్షాత్తు దేవిగానే పూజిం చారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని, చదువు సంధ్య లలో ఉత్కృష్ఠులు; మఠం నిర్వహణ, మఠం ఆదర్శాలు మొదలైన విషయాలలో మాతృదేవి అభిప్రాయం తెలుసుకుని ఆ ప్రకారమే వ్యవహరించారు. స్వామి వివే కానంద దాకా అందరూ ఆమె మాటలను వేదవాక్కులుగా తీసుకున్నారు. రామ కృష్ణ సంఘంతో సంబంధంలేని సన్న్యాసులు, పరిచయంలేని ఇంకా పలువురు కూడా మాతృదేవి పట్ల ఎంతో మర్యాదమన్నన చూపారు.
ఒకసారి దండి సన్న్యాసి ఒకాయన మాతృదేవిని దర్శించడానికి వచ్చాడు. సామాన్యంగా దండి సన్న్యాసులు తమ గురువు, తమ సంప్రదాయంలోని ఉన్నతు లైన వారిని తప్ప, తక్కిన వారెవరినీ అంతగా గౌరవించారు. ఇక స్త్రీల విష యంలో చెప్పాల్సిన పనేలేదు. ఈ దండి సన్న్యాసి చాలా దూరం నుండి మాతృ దేవిని దర్శించడానికే కలకత్తా వచ్చాడు. ఉద్బోధన్లో అతడు ఇతరులతో శాస్త్ర వాదన చేశాడు. దాన్నిబట్టి ఆయనకు శాస్త్రాలలో మంచి పాండిత్యం ఉన్నట్లు తెలియవచ్చింది. సంస్కృతంలో చక్కగా మాట్లాడగలిగిన ఆయనకు వేదాంతాదు లలో మంచి అభినివేశం ఉంది. అలాంటి వ్యక్తి మాతృదేవి సమక్షానికి వెళ్లి నప్పుడు మాతృదేవికి సాష్టాంగపడి నమస్కరించాలనుకొన్నాడు. కానీ మాతృదేవి తమకే సొంతమయిన వినమ్రతా భావంతోనూ, సాధువుల పట్లగల మర్యాద కారణంగాను అలా చేయవద్దని అన్నారు. కానీ ఆ సాధువు వాటిని గురించి పట్టించుకోకుండా దేవీ మాహాత్మ్యం శ్లోకాలను వల్లిస్తూ నేలమీద సాష్టాంగపడి మొక్కుతూ తమకు ఈ జన్మలోనూ, ఆ తర్వాతా మాతృదేవి ఆశీస్సులు కావాలని ప్రార్థించాడు. మాతృదేవి తన ప్రక్కన ఉన్న శిష్యునితో కొన్ని మామిడి పండ్లు తీసుకురమ్మన్నారు. అక్కడ మూడు పండ్లే ఉన్నాయి. అవి ఆయనకు ఇచ్చారు. వాటిని భక్తితో తీసుకుని ఆయన క్రిందికి దిగారు. ఎందుకో ఆయనకు ఇంకా పండ్లు కొన్ని ఇవ్వాలని మాతృదేవికి అనిపించింది. కానీ లోపలికి వెళ్లి వెదికిన శిష్యునికి ఒకే ఒక పండు మాత్రమే దొరికింది. మాతృదేవి దానిని కూడా ఆయనకు పంపారు. ఈ నాలుగవ పండు తీసుకున్న ఆ సాధువు ఎంతో సంతోషంతో, “ఆహా! ఈ పండు తీసుకోవడం నాకు పరమానందంగా ఉంది. మొదట్లో మాతృదేవి మూడు పండ్లు ఇచ్చినప్పుడు ధర్మ, అర్థం, కామ మనే మూడు మాత్రమే ప్రసాదించారని అనుకొన్నాను. కానీ ఇప్పుడో, నాలుగవది అయిన మోక్షాన్ని కూడా ప్రసాదించేశారు” అన్నాడు.
ఇంత మర్యాద, ప్రశంసలు, ఆరాధనలు మాతృదేవిలో ఎలాంటి మార్పునూ కల్పించలేదు. అవన్నీ గురుదేవుల మహత్వానికి మరింత మహత్వం చేకూర్చేవి గానే ఆమె భావించారు. అందువల్ల జయరాంబాటి నుండి కలకత్తాకు మొట్ట మొదట వెళ్లినప్పుడు ఎలా సరళమైన స్వభావిగా ఆర్భాటమేలేని గ్రామ సీమల చిన్న బాలికలా ఉన్నారో, అలాగే ఎల్లప్పుడూ ఉండేవారు. ఆమె సద్గుణాలకు వెనుక ‘నేను’ అనే ఆలోచన కించిత్తూ ఉండేది కాదు. సుగంధ ద్రవ్యాలు ఎలా తమవద్ద నున్న సుగంధాన్ని ఎంతో సహజంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా వ్యాపింపచేస్తాయో, వికసించిన పద్మం ఎలా సొంత ప్రయత్నం ఏదీ లేకుండా తానుగా తన అందాన్ని వెదజల్లుతుందో, అదేలా, మాతృదేవి వినమ్రతతో పాటు వారి మహోన్నతమైన గుణాలు అన్నీ తాముగా వికసించి విస్తృతించాయి.
సాధారణ జీవన విధానం
తమ పవిత్రమయిన జీవితాన్నే మానవ జాతికి తమ సందేశంగా చాటిన వ్యక్తి మాతృదేవి. అందువల్ల ఆమె జీవితంలోని ప్రతి సంఘటనా ఆమెలో నెల కొన్న ఒక్కో పరిమాణాన్ని విశదీకరిస్తుంది. ఒక్కొక్కటీ ఎవరో ఒకరికి సందేశంగా అమరవచ్చు. ఇందులో మనం చూసినవి కొన్ని, చూడనివి అనేకం. అయినా, ఇంతదాకా మనం చూసిన చిన్న విభాగంతో సంతృప్తి పొంది మాతృదేవి సాధా రణ జీవనశైలిని చూద్దాం!
మాతృదేవి జయరాంబాటిలోవున్నా, ఉద్బోధన్లోవున్నా లేక మరెక్కడ ఉన్నా దక్షిణేశ్వరం రోజులలా ఉదయం మూడు గంటలకు మేల్కొంటారు. లేవగానే గురుదేవుల ఛాయాచిత్రం చూస్తారు. మాతృదేవి పూజగదిలోనే నిద్రించేవారు. ఎందుకంటే ఒక్క క్షణమైనా గురుదేవులను విడిచి వుండలేదు కనుక. తర్వాత ఇతర పనులు చేయడానికోసం తమను అక్కణ్ణుండి వెళ్లడానికి అనుమతించమని గురుదేవులను ప్రార్థిస్తారు. ఉదయం ఆరు గంటల దాకా పరుపు మీదనే కూర్చొని జపమాలతో జపం చేస్తారు. తరువాత గురుదేవులను పీఠం మీద ఆసీనులను చేసి ఉదయకాల నైవేద్యం నివేదిస్తారు. ఆ తర్వాత జయరాంబాటిలో ఉన్నట్లయితే ఇల్లు శుభ్రం చేస్తారు. వంటకు కావలసిన కాయగూరలు తరుగుతారు. అప్పుడు తమతో ఉన్న వారితో ఉత్సాహంగా సంభాషిస్తారు. దానితోపాటు, ఆరోగ్యం బాగు న్నన్నాళ్లు పాత్రలు తోమడం, కొలను నుండి నీళ్లు తీసుకురావడం, ధాన్యం దంపుడం లాంటి శ్రమతో కూడిన పనులు కూడా చేసేవారు. పూజకు కావలసిన పుష్పాలను సేకరించడమూ, పండ్లను కోయడమూ సామాన్యంగా ఆమే చేస్తారు. కొన్ని సమయాల్లో మేనకోడళ్లు, భక్తులు సాయపడేవారు. ప్రతి రోజూ గురుదేవు లకు నివేదించడానికీ, భక్తులకు పంచిపెట్టడానికీ వందకుపైగా తమలపాకు చిలుకలు చుట్టేవారు.
ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటలలోపు గురుదేవుల పూజ ముగి స్తారు. ఎవరైనా మంత్రదీక్షకు వస్తే వారికి మంత్ర దీక్ష ప్రసాదిస్తారు. ఆ తర్వాత గురుదేవులకు నివేదించవలసిన పండ్లనూ తీపి పదార్థాలనూ భక్తులకూ ఇంట్లోని వారికి పంచిపెడతారు. పది గంటలలో పూజ ముగించాలనే విషయంలో ఆమె చాలా కచ్చితంగా ఉండేవారు. పూజ బాధ్యతలను స్వీకరించిన సన్న్యాస శిష్యులు అంతకన్నా ఎక్కువ ఆలస్యం చేయడం ఆమెకు నచ్చదు. ఎందుకంటే పూజ ముగించి ప్రసాదం తీసుకున్న తర్వాతే అందరూ ఉదయం ఆహారం తినేవారు. అందువల్ల ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించేవారు. ప్రసాదం పంచిపెట్టే టప్పుడు తమకంటూ దేనినీ ఉంచుకోకుండా దాదాపు పూర్తిగా పంచేసేవారు. పూజ తర్వాత కొంత తీపి, లేకపోతే గురుదేవుల ప్రసాదంలో మిగిలిన కొన్ని పండ్లు తీసుకొనేవారు.
తర్వాత వంట గదికి వెళ్లి వంట మనిషిని తినడానికీ, ఆమె సొంత పనులు చూసుకోవడానికీ పంపించివేసి వంటపని మొదలుపెట్టేవారు. ఇంట్లో ఏది వండే వారో దానినే గురుదేవులకు నివేదించేవారు. గురుదేవులకు ఇష్టమయిన కూర గాయలు వండితే ఎంతో సంతోషించేవారు. గురుదేవులకు ప్రత్యేకంగా వండే టప్పుడు వంటలో ఉప్పు, లవంగాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి మిరప కాయలు తక్కువగా వాడతారు. పగలు పదకొండు గంటలకు స్నానం చేసి గురు దేవులకు నైవేద్యం అర్పిస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాదీ కూర్చొని భోజనం చేస్తారు.
ప్రారంభ కాలంలో మాతృదేవి అందరికీ వడ్డించి, వారందరూ భుజించిన తర్వాత చివరగా భోజనానికి కూర్చునేవారు. దాంతో ఆమె భోజనానికి చాలా ఆలస్యమయ్యేది. తదనంతర కాలంలో భక్తులు ఎంతగానో ప్రాథేయపడిన తర్వాత వారి ప్రార్థనను మన్నించి, “అందరూ భోజనానికి కూర్చున్నారా, అందరికీ సక్ర మంగా వడ్డించారా?” అని పర్యవేక్షించిన తర్వాత తాము కూడా కూర్చొనేవారు. భోజనం ముగించిన భక్తులు, మాతృదేవి స్వహస్తాలతో ఇచ్చే ప్రసాదంకోసం వేచి ఉండేవారు. మాతృదేవి తమ విస్తరిలోని పాలన్నమూ, తీపి పదార్థాలూ మొదలై నవి బాగా కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసి వారికి పంపిస్తారు. తర్వాత కాసేపు భక్తులతో మాట్లాడుతూవుంటారు. రెండు గంటలకు ముందుగా కొద్దిగా విశ్ర మిస్తారు. నిత్యం నాలుగుసార్లు పళ్లు తోముకుంటారు. అందుకోసం నారికేళ చెట్టు ఆకులను, పొగాకును దగ్ధం చేసి, ఆ భస్మాన్ని ఉపయోగించేవారు.
మధ్యాహ్నం మూడు గంటల దాకా విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత లేచి పూజ గదికి వెళ్లి గురుదేవులను నాలుగు గంటలకు నిద్రలేపుతారు. పిదప గదిలో కూర్చొని జపమాల లేకుండా జపం చేసుకుంటూనే భక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. సాయంత్రం గది నుండి బయటికి వచ్చి వసారాలో కూర్చుంటారు. కొన్ని సమయాల్లో వంట గదిలో పని ఎక్కువగా వుంటే వెళ్లి వంట మనిషికి సాయపడతారు. సాయంత్రం ఆరాత్రికం తర్వాత గురుదేవులకు నైవేద్యం చేసిన మిఠాయిలో కొంత తీసుకొని, పరుపు మీద కూర్చొని గాఢ ధ్యానంలో లీనమై పోతారు. గురుదేవులకు తొమ్మిది గంటలకు రాత్రి నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిదిన్నరకు భక్తులందరు భోజనం చేస్తారు. లూచీ అనే చిన్న పూరీలు రెండు లేక మూడు, కొద్దిగా కూరగాయలు, కాసిని పాలు పుచ్చుకొంటారు. పదకొండు గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు.
కలకత్తాలో కూడా ఆమె జీవనశైలి అచ్చం ఇలాగే ఉండేది. స్నానం మాత్రం కాస్త ముందుగానే చేసేవారు. రోజు విడిచి రోజు గోలాప్ మాతోపాటు గంగా స్నానం చేసేవారు. గోలాప్ మా, యోగిన్ మా ఇద్దరూ మాతృదేవితో పాటు ఉంటూ ఇంటి పనులన్నీ చూసుకునేవారు. అందువల్ల జయరాంబాటికంటే కల కత్తాలో మాతృదేవికి గృహకృత్యాలు తక్కువ. కాలాంతరంలో మాతృదేవి చేయలేక పోయినప్పుడు, గురుదేవులకు నైవేద్యం అర్పించడం తప్ప మిగిలిన పూజా కార్య క్రమాలన్నీ సన్న్యాస శిష్యులు చూసుకోవడం మొదలుపెట్టారు.
పనుల భారం తక్కువగా ఉన్నా కలకత్తాలో మాతృదేవి జీవితం శ్రమతో కూడిందే. మంత్రదీక్ష కోసమూ, సంసార జీవితంలో ఎదుర్కొనే కష్టనష్టాల గురించి చెప్పుకుని అనునయం పొందడానికీ భక్తులు వస్తూనే ఉంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా సాయంత్రం ఇంటికి వెళ్లిపోవలసిన భక్తులు ఆమె చుట్టూ కూర్చొని ఏదేదో అడుగుతూ ఉంటారు. మాతృదేవి వారితో పడుకునే మాట్లాడే వారు.
సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత భక్తులు (పురుషులు) మాతృదేవిని దర్శించుకోవడానికి వస్తారు. అప్పుడు భక్తురాండ్రు పక్కగదులకు వెళ్లిపోతారు. భక్తులు వచ్చినప్పుడు మాతృదేవి మంచం మీద కూర్చొని, కాళ్లు వేళ్లాడదీసి, శరీర మంతా కప్పుకుని కూర్చొనివుంటారు. భక్తులెవరయినా ఆమె ఆరోగ్యం గురించో, మరేదైనా అడిగితే సైగల మూలంగానో, అతి మెల్లగానో బదులు చెబుతారు. ఏ విషయాన్నైనా వివరంగా చర్చింపదలచినవారు తక్కినవారు వెళ్లిపోయేదాకా వేచి ఉంటారు. ఆ భక్తుడు పరిచితుడైతే ఆతని ప్రశ్నలకు మాతృదేవి సూటిగా బదులు చెబుతారు. లేకపోతే ఆమె మెల్లగా చెప్పిన దానిని శిష్యులు బిగ్గరగా చెబుతారు. మంగళ శనివారాలలో, పండుగ రోజులలో జనం పెద్ద సంఖ్యలో మాతృదేవిని దర్శించుకోవడానికి అనుమతింపబడతారు. అలాంటి రోజులు మాతృదేవికి ఎంతో శ్రమనిస్తాయి. కొన్ని సమయాల్లో ఆమె గంటల కొద్దీ కూడా కూర్చొనివుండవలసి వచ్చేది.
మాతృదేవి తీసుకునే ఆహారం చాలా తక్కువ; తక్కువసేపు నిద్రించేవారు. రాత్రి పదకొండు గంటలకు పడుకుని ఉదయం మూడింటికి లేచేవారు. వెన్నెల రాత్రులలో ఇంకా ముందుగా కూడా మేల్కొనేవారు. రోజుకు మూడుసార్లు తినే వారు. అందులో ఉదయం, రాత్రి బాగా తక్కువ. కీళ్లనొప్పులతో ఒకసారి కొద్దిగా తీసుకొనేవారు. తీపి పదార్థాలనన్నిటినీ ఇష్టపడి తిన్నా, మామిడి పండ్లు, అందు లోనూ కొద్దిగా పుల్లనైనా మామిడి పండ్లంటే ఆమెకు మక్కువ.
మాతృదేవిది నిరాడంబర వస్త్రధారణ. ప్రాచీన వంగ ఆచారం ప్రకారం ఒకే చీరను శరీరమంతా చుట్టుకుని ధరిస్తారు. రవిక, కుట్టుబడిన మరే దుస్తులో, చెప్పులో ధరించరు. గొడుగు కూడా ఉపయోగించరు. వర్షం పడుతూవున్నా, తడుస్తూనే వచ్చి, తర్వాత గుడ్డలు మార్చుకునేవారు. ఒకసారి భక్తుడొకడు అంద మైన అంగీ నొకదానిని మాతృదేవికి ఇచ్చారు. రెండు మూడుసార్లు దానిని వాడిన తర్వాత మూలపెట్టేశారు. దుస్తుల, ఆహార, ఆచార వ్యవహారాదులలో సరళంగా, నిరాడంబరంగా ఉండేవారు.
మాతృదేవి ఆచార వ్యవహారాలలో, ఇతరులకు మర్యాద చూపడంలో పరుల శ్రేయస్సును ఆకాంక్షించడంలో ఎన్నడూ కించిత్తు కూడా తటపటాయించి ఎరుగరు. అలాగని ఆ కాలంగా అనుసరింపబడుతున్న సంప్రదాయ ఆచార వ్యవ హారాలనూ, నమ్మకాలనూ వదలుకున్నారని కాదు. గంగానదిలో స్నానం చేయ డానికి వెళ్లినప్పుడు ఒకసారి గోలాప్ మా శరీరానికి నూనె రాసుకొని స్నానం చేయడం మంచిదని చెప్పింది. అందుకు మాతృదేవి నిరాకరిస్తూ, “నేను ప్రారం భిస్తే నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయడం సబబుకాదు. ఇది సంప్రదాయానికి విరుద్ధం” అని అన్నారు. సాధారణ స్త్రీలలాగే గంగాస్నానం చేసి తిరిగివస్తున్నప్పుడు దారిలోని రావిచెట్టుకు నీళ్లు పోసి నమస్కరించేవారు.
వంగదేశంలో చైత్ర మాసం (మార్చి, ఏప్రిల్) సామాన్యంగా ఎవరూ బయట ఊళ్లకు ప్రయాణాలు చేయరు. మాతృదేవి కూడా ఆ నిషేధాన్ని పాటించారు.