గ్రామీణ జీవితం
మాతృదేవి గ్రామీణ జీవితం కష్టంగానే గడిచింది. ఇంటి పనులన్నీ ఆమే చేయాల్సి వచ్చింది. బంధువులు, భక్తులు పలువురు ఆమెతోపాటు ఉండడంవల్ల రోజురోజుకూ పనులు ఎక్కువ కాసాగాయి. కలకత్తాలో ఉంటున్నప్పుడు ఇంత పని ఉండదు. అంతే కాకుండా అక్కడ నిర్ణీత సమయంలో తప్పితే భక్తులెవరికీ ఆమెను దర్శించుకోవడానికి అను మతి ఇచ్చేవారు కారు. అందువల్ల అక్కడ మాతృదేవికి కాస్త విశ్రాంతి లభించేది. కానీ గ్రామంలో ఆమె స్వేచ్ఛగా తిరిగేవారు. ఏ సమయంలో నైనాసరే భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అందువల్ల మాతృదేవితో సన్నిహితంగా ఉండాలని అను కునే భక్తులు, దారి ఎంత కఠినమయిన దయినా, సదుపాయాలులేని గ్రామమైనా జయరాంబాటికే వెళ్లేవారు. కలకత్తాలో ఈ భక్తులు సకల సదుపాయాలతో జీవనం సాగించడం చూసిన మాతృదేవి, గ్రామంలో కూడా అదేలా సదు పాయాలు కల్పించడానికి ఎంతో శ్రమపడేవారు. జయరాంబాటిలో పాలు విరి విగా లభించవు. అందువల్ల మాతృదేవి రోజూ తామే పలువురు ఇళ్లకు వెళ్లి పాలూ, కాయగూరలూ సేకరించేవారు. వంట స్వయంగా తామే చేసేవారు, వడ్డించేవారు కూడా. ఆరోగ్యం బాగా లేని వారి ప్రక్కన ఉండి సేవలు చేసేవారు. తాము రావడంవల్ల మాతృదేవి పడుతున్న శ్రమలను చూసి భక్తులు నొచ్చుకున్న ప్పుడు, ఆమె అలాంటి సేవ చేయడానికి అవకాశం లభించిందని చెప్పి సంతోష పడేవారు.
జయరాంబాటి ప్రశాంతత, స్వేచ్ఛ, గ్రామీణ జీవితానికే చెందిన కొన్ని ఆచార వ్యవహారాలు మాతృదేవికి బాగా నచ్చేవి. అందువల్ల కొన్ని సమయాల్లో ఒక సంవత్సరం పైగా గ్రామంలోనే గడిపేవారు. కానీ గ్రామంలోని కఠినమైన ఇంటి పనులు, వంగదేశ గ్రామాలలో ఆ కాలంలో తాండవించిన మలేరియా వ్యాధి, వైద్యసదుపాయాలకు నోచుకోని పరిస్థితి ఇత్యాదులు మాతృదేవిని ఉద్బోధన్లో ఉండేలా చేశాయి. అక్కడ ఆమె స్వేచ్ఛకు కాస్త భంగం కలిగినా, డబ్బు బాధ్యతో, పని భారమో ఉండదు.
ఉద్బోధన్ ఇల్లు
కలకత్తాలో స్వామి శారదానంద ఉద్బోధన్ గృహం కట్టడం గురించీ, అందులో మాతృదేవి 1909 మే 23 వ తేది గృహ ప్రవేశం చేసిన విషయం గురించీ ఇప్పటికే చూశాం. 1909 డిసెంబర్లో ఈ ఇంటి ప్రక్కన వంద అడుగుల స్థలం కొనుగోలుచేసి, ఆ ఇంటిని ఇంకా విశాలం చేశారు శారదానంద. 1915 లో ఇంకా ఒకటి రెండు గదులు కట్టించారు. మేడమీద ఉత్తరంవైపు వసారా మాతృదేవి గదిగాను, పూజ గదిగాను మార్చారు. ఈ ఇంట్లో మాతృదేవి తమ బంధువులు, సన్న్యాస శిష్యులు, గురుదేవుల శిష్యురాండ్రు, తమ సహాయకురాండ్రయిన భక్తురాండ్రతో నివసించ సాగారు.
మాతృదేవి ఉద్బోధన్ ఇంట నివసించినప్పుడల్లా ఆమె ఖర్చులనన్నిటిని శారదానంద భరించారు. జయరాంబాటిలో నివసిస్తున్నప్పుడు శారదానంద కొంత డబ్బు పంపినా, తమ కుటుంబానికయ్యే ఖర్చులను మాతృదేవే భరించారు. మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు శిష్యులిచ్చే కానుకలు, సన్నిహితులయిన భక్తులు ఇచ్చే కానుకలు మాత్రమే మాతృదేవి కుటుంబానికి రాబడి. మాతృదేవి శిష్యులలో పలువురు విద్యా ర్థులూ, మధ్య తరగతి కుటుంబీకులూ కావడంతో, వారు సమర్పించే కానుకలు అంతంత మాత్రమే. వివేకానంద స్వామి శిష్యురాలయిన మిసెస్ ఓల్బుల్ ప్రతి నెలా అమెరికా నుండి ఇరవై అయిదు రూపాయలు పంపేవారు. కాలాంతరంలో మాతృదేవి నెలకు వంద రూపాయలకు తక్కువ కాకుండా ఖర్చయ్యేది. మాతృ దేవికి అవసరాలు బహు తక్కువే. కానీ కనీసం పది, పదిహేను మంది భక్తు లయినా ఆమెతోపాటు సదా ఉండేవారు. దానికి తోడు మాతృదేవి మీదనే ఆధార పడి జీవించిన రాధూ, ఆమె తల్లి, పట్టించుకునేవారు లేని పలువురు బంధువులు, గ్రామ ప్రజలకోసమూ డబ్బు అధికంగా కావలసివచ్చింది. మాతృదేవి చివరి రోజుల్లో రాధూ తీరని వ్యాధి కారణంగా కూడా ఖర్చులు అధికమయ్యాయి.
కోల్పారా ఆశ్రమం
కోల్పారా ఆశ్రమం గురించి అక్కడక్కడ ప్రస్తావించాం. జయరాంబాటి నుండి విష్ణుపూర్ వెళ్లేటప్పుడు మాతృదేవి ఈ గ్రామంలో బసచేసి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్లేవారు. “నా ఆహ్వాన గది” అంటూ దానిని పేర్కొనేవారు. కాల క్రమంలో అది రామకృష్ణ మఠ శాఖగా రూపొందింది. 1911 వ సం ॥ స్వయంగా మాతృదేవి అక్కడ గురుదేవుల ఛాయాచిత్రాన్నీ, తమ ఛాయాచిత్రాన్నీ ప్రతిష్ఠ చేశారు. మాతృదేవి నివసించడానికంటూ ఆశ్రమంలో ఒక భాగంలో ఒక పర్ణశాల కట్టించారు. రాధూ ఆరోగ్యం కోసం విశ్రాంతి అవసరమయినప్పుడు మాతృదేవి ఆ పర్ణశాలలో ఉండేవారు.
ఈ ఆశ్రమంలో నివసించినవారు, గ్రామంలో మాతృదేవి బసచేసినప్పుడు ఆమెను పరిరక్షించడానికీ, ఆమెకు సేవలు చేయడానికీ తమను సేవకులుగానే పరిగణించుకున్నారు. మాతృదేవి ఇంట ఉత్సవాలో, ఇల్లు మరామ్మత్తు చేయడం లాంటి పనులో, ఏదైనాసరే ఆశ్రమంలోని బ్రహ్మచారులే చేసేవారు. మాతృదేవి ఇంటికి కావలసిన కాయగూరలు తేవడం, ఆమె పిలవగానే రివ్వున రావడానికి వారు సిద్ధంగా ఉండేవారు. మాతృదేవికి ఈ శిష్యుల మీద ప్రత్యేకమైన ప్రేమాను రాగాలు ఉండేవి.
రాధూ పెళ్లి : తర్వాతి ఘటనలు
1911 జూన్ 10 వ తేది రాధూకు వివాహం జరిగింది. పన్నెండేళ్ల రాధూ పదిహేనేళ్ల మన్మథ్ చటర్జీని వివాహం చేసుకుంది. స్వామి శారదానంద ఈ పెళ్లికి చాలా డబ్బు ఖర్చుపెట్టారు. మన్మథ్ ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. కానీ అంత గొప్ప సామర్థ్యశాలి కాడు. అందువల్ల వివాహానంతరం కూడా రాధూ భర్త ఇంటికి వెళ్లలేదు. ఆమె భర్త బహుశా మాతృదేవి ఇంటనే ఉండేవాడు. కాలం గడిచిందే కానీ రాధూ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. మాతృదేవి ఒకసారి తమ శిష్యునితో, “చిన్నతనంలో ఆమె ఫరవాలేదు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. కానీ ఆమె స్వభావంలో ఎలాంటి మార్పూ రాలేదు. దానితోపాటు రకరకాల వ్యాధులు. పిచ్చిదాని కుమార్తె అయిన ఈమె కూడా పిచ్చిదైపోతుందేమోనని భయంగావుంది. హా! నేను ఒక పిచ్చిదాన్నా పెంచుతూవస్తున్నాను?” అంటూ బాధగా అన్నారు.
అత్తగారింటికి వెళ్లలేదు కాని రాధూ తన భర్తపట్ల ఎనలేని అనురాగం పెంచుకుంది. మన్మథ్ బయటికి వెళితే ఈమె ఉండలేకపోయేది. ఒక రోజు ఆమె అలా పరితపించడం చూసిన మాతృదేవి, “గురుదేవుల లీలావినోదం చూడు! మా పుట్టిల్లు ఎంత ఉన్నతమైనది! ఇప్పుడు నాతో ఉంటున్న వారిని గురించి ఏమని చెప్పాలి? ఇక రాధూను గురించి చెప్పడానికి ఏముంది? తలుపు దగ్గరే నిలబడి భర్త రాకకోసం ఎదురు చూస్తూవుంటుంది. అదిగో ఆ ఇంట్లో పాట వినబడు తుందే! అక్కడికి ఆతను వెళ్లిపోతాడేమోనని ఆమె భయం! అందువల్ల రాత్రిం బవళ్లు భర్తను కనిపెట్టే ఉంటుంది. ఎలాంటి అనురాగం! ఈమె ఇలా తయారవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు” అన్నారు.
వ్యాధులు, పిచ్చాపాటీ, పట్టుదల వీటితోపాటు, నల్లమందు అలవాటుకు కూడా రాధూ ఎలాగో బానిస అయింది. ఈ దురభ్యాసం మాన్పించడానికి మాతృదేవి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కానీ మాతృదేవి కావాలనే రాధూకు నల్లమందు అలవాటు చేయించి తమ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్నారని సురబాల ఆరోపించేది. మాతృదేవి ఆ ఆరోపణలను అంతగా పట్టించుకోలేదు. ఒకసారి ఎప్పటిలా సురబాల మాతృదేవిని నిందిస్తూవుంది. ఎంతసేపటికీ ఆగకపోయేసరికి మాతృదేవి, “ఇదిగో చూడు! ఇప్పుడే తీసుకెళ్లిపో” అన్నారు. ఈ మాటలు అన్న మరుక్షణం సురబాల కోపం హద్దులు దాటిపోయింది. ఏదేదో తిడుతూ వంట ఇంట్లోకి పరుగుతీసింది. మండుతున్న ఒక కొరవి తీసుకుని మాతృదేవిని కొట్ట బోయింది. దీన్ని ఏ మాత్రం ఎదురుచూడని మాతృదేవి హడలిపోయి, “హా! ఈ పిచ్చామె నన్ను చంపబోతూన్నదే” అంటూ బిగ్గరగా అరిచారు. మాతృదేవి అరుపు విని బ్రహ్మచారి వరద పరుగుతీశాడు. ఒక్క క్షణం ఆలస్యమయివుంటే విపరీతం జరిగిపోయివుండేది. మాతృదేవికి దెబ్బతగలడానికి ముందుగానే ఆతను సురబాల చేత పట్టుకున్న కొరవిని తీసి దూరంగా విసిరేశాడు. ఆమెను కూడా గది బయటికి తరిమివేసి, మాతృదేవి వద్దకు వచ్చాడు. మాతృదేవి అప్పటికీ ఆ దిగ్భ్రాంతి నుండి తేరుకోలేదు, ఆ స్థితిలోనే, “ఓసీ పిచ్చిదానా! ఎంత పనికి ఒడిగట్టావు? నీ చేతులు పడిపోనూ!” అనే మాటలు ఆమెకు తెలియకుండానే నోట నుండి వెలువడ్డాయి. కానీ మరుక్షణమే ఇలాంటి శాపనార్థాలు తన నోటి నుండి రావడం గ్రహించిన మాతృదేవి హడలిపోయారు. “ఓ భగవంతుడా! ఎంతపని చేశాను! ఇప్పటిదాకా ఎవరినీ ఇలా అనని నా నోటి నుండి ఈ రోజు శాపనార్థాలు వచ్చాయే! ఇంకా నేను బ్రతికి ఉండాలా?” అంటూ హృదయం ద్రవించిపోయేలా విలపించారు.*
మాతృదేవి కొత్త ఇల్లు
ఇంతదాకా మాతృదేవి సామాన్యంగా ప్రసన్న ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు. మాతృదేవి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య ఈ కాలఘట్టంలో బాగా పెరిగింది. అందువల్ల మాతృదేవికి ఒక ఇల్లు కట్టించాలని భక్తు లందరూ తీర్మానించారు. మాతృదేవి ఇంటికి సమీపం లోనే ఒక స్థలమూ, దాని ప్రక్కనే పొలాలు, ఒక కొలను కొనుగోలు చేశారు. నాలుగయిదు గదులతో ఒక చిన్న ఇల్లు కట్టారు. 1916, మే 15 వ తేది మాతృ దేవి గృహప్రవేశం చేశారు. తమ శేష జీవితంలో, ఆమె జయరాంబాటిలో ఉంటు న్నప్పుడు మాతృదేవి ఈ ఇంట్లోనే నివసించారు. గృహప్రవేశ సమయంలో శారదా నంద కలకత్తాలో లేరు; బృందావనానికి వెళ్లివున్నారు. అక్కణ్ణుండి తిరిగి రాగానే జయరాంబాటికి వెళ్లారు. అప్పుడు ఇంటిని, పొలాన్ని, స్థలాన్నీ బేలూరు మఠం పేరిట వ్రాయించారు మాతృదేవి.
రాధూ సంతానవతి కావడం
1919 లో రాధూ గర్భవతి అయింది. ఆ రోజులలో ఆమె గర్వం, మొండి పట్టుదల హద్దులు దాటాయి, ఆరోగ్యం కూడా క్షీణించింది. మాతృదేవి అపరిమిత కలతకు లోనైన కాలఘట్టం ఇది. రాధూ ఆరోగ్యమూ, మనోస్థితీ మునుపటికంటే అధ్వాన్నంగా తయారయింది. ఆమె తీరని రుగ్మతలకు వైద్యం చేయించడానికి అయ్యే ఖర్చులకోసం మాతృదేవి డబ్బుకు ఎన్నో అగచాట్లు పడ్డారు. దాంతో మాతృదేవి ఆరోగ్యం కూడా దెబ్బతింది.
కలకత్తా కోలాహలం నుండి దూరంగావుంటే రాధూ పరిస్థితిలో మార్పు వస్తుందని తలచిన మాతృదేవి 1919 జనవరిలో జయరాంబాటికి పయన మయ్యారు. అప్పుడు ఒక శిష్యునితో, “నాయనా ఉవ్వెత్తున పొంగుతున్న సము ద్రాన్ని నాతోపాటు తీసుకెళుతున్నాను. సహాయానికి నా తనయులయిన మిమ్మల్నే నమ్ముకునివున్నాను” అన్నారు. విష్ణుపూర్ దాకా అందరూ రైలులో వెళ్లారు. అక్కడ హస్తసాముద్రికంలో పేరుమోసిన వ్యక్తి ఒకడు రాధూ చేతిని చూసి, ఆమె ప్రసవం అంత సులభంగా ఉండదని చెప్పాడు. దాంతో మాతృదేవికి ఆందోళన ఎక్కు వయింది. అక్కణ్ణుండి అందరూ ఆరు బండ్లలో జయరాంబాటికి బయలుదేరారు. దారిలో విశ్రాంతికై కోల్పారాలో కొన్ని రోజులు బసచేశారు. ఆశ్రమం చుట్టూ దట్టంగా పెరిగిన వనమూ, అక్కడ నెలకొన్న ప్రశాంతతా రాధూను బాగా ఆకర్షిం చాయి. అందువల్ల ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండగోరింది రాధూ. మాతృదేవి సోదరుడు కాశీతో సహా అందరూ రాధూ అక్కడ ఉండడమే మంచిదన్నారు. దాంతో మాతృదేవి జూలై నెల పూర్తయ్యే దాకా అక్కడే ఉండిపోయారు.
ఈ రోజుల్లో రాధూ పరిస్థితి మాతృదేవికి అత్యంత శోచనీయంగా తయా రయింది. అప్పటికే ఆమె బాగా బలహీనంగా ఉంది. గర్భిణీ కావడంతో ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింది. దుర్భరమయిన నరాల బలహీనతతో ఆమె బాధ పడసాగింది. శరీరం కృశించిపోయింది. శరీరంలా మనస్సు కూడా దుర్బలమై పోయింది. ప్రతి చిన్న విషయానికీ విసుక్కోవడం, ఏం చెప్పినా వినేది కాదు. ఒక చిన్న శబ్దమూ, పెద్దగా మాట్లాడినా కూడా ఆమె తట్టుకోలేకపోతున్నది. కాకి అరి చినా, ఎవరైనా పాత్ర క్రిందపెట్టినప్పుడు అయ్యే శబ్దం వింటే చాలు – ‘ఓ’ అని అరిచేది. కొన్ని సమయాల్లో ఆమె అరుపులు ఎక్కువై ఊపిరిపీల్చుకోలేకపోయేది. అంతే కాకుండా శరీరమంతా సదా సహించలేనంత మంటతో బాధపడసాగింది. దీనితోపాటు ఆశ్రమానికి సమీపంలో ఒక ఎలుగుబంటి రాత్రులలో తిరుగుతూ ఉన్నట్లూ, గ్రామంలో ప్రవేశించి గ్రామ రక్షకభటుణ్ణి కరిచి హింసించిందనీ ఒక వార్త ప్రాకింది. ఆశ్రమానికి చేరువనే దట్టమైన అడవి ఉండడంవల్ల ఎలుగుబంటి ఏ వేళలోనైనా ఆశ్రమంలోకి ప్రవేశించవచ్చుననే భయం ఒక వైపు. వీటన్నిటితో రాధూ పరిస్థితి మరింత దిగజారింది. ఇవన్నీ చాలదన్నట్లు ఒక పిచ్చివాడు హఠాత్తుగా రాత్రులలో ఆశ్రమం లోపలికి వచ్చి ‘హా ఊ’ అంటూ గొడవ చేశాడు. ఇది కూడా స్త్రీలను భయభ్రాంతులకు లోను చేసింది. మాతృదేవి ఆ పిచ్చివాణ్ణి ఒకసారి తన దగ్గరికి పిలిచి, ప్రేమగా ఆతణ్ణి పలుకరించి, ఆతనికి తినడానికి అవీ ఇవీ ఇచ్చి ఆశ్రమం లోపలకు వచ్చి గొడవ చెయ్యవద్దని చెప్పి శాంతపర చారు.
ఈ పరిస్థితిలో రాధూ ఆరోగ్యం కోలుకోవడానికి నానారకాల చికిత్సలు జరుగుతున్నాయి. ఏ ఔషధంతోను గుణం కనిపించలేదు. అందుకు భిన్నంగా రోజు రోజుకూ వ్యాధి తీవ్రం కాసాగింది. పలురకాల మందులు వాడిన తర్వాత, తమతో ప్రక్కన ఉన్నవారి సలహా మేరకు మంత్రతంత్రాల లాంటివి కూడా చేయిం చారు.
కోల్పారా నుండి పదిహేడు మైళ్ల దూరంలో డిరోల్ అనే గ్రామంవుంది. ఆ గ్రామానికి అధిష్ఠాన దేవత అయిన “పిచ్చికాళి” అత్యంత శక్తివంతమయిన దైవమనీ, ఆమె చేతులకు వేసిన గాజులను తీసుకువచ్చి రాధూ చేతులకు వేస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందనీ సలహాయిచ్చింది నళిని. మునుపు సుర బాలకు పిచ్చి ముదిరినప్పుడు ఆ గాజులనే ఆమె చేతులకు వేశారు. దాంతో ఆమెకు కాస్త ఉపశమనం కలిగింది. ప్రస్తుతానికి రాధూ కూడా పిచ్చి పట్టే స్థితిలో ఉండడం వల్ల ఆ గాజుల వైద్యం గురించి సలహా ఇచ్చింది నళిని. మాతృదేవి వెంటనే డిరోల్కు మనిషిని పంపి, కాళీదేవికి, సంప్రదాయానుసారం పూజలు చేయించి, అందులో అర్పించిన ఒక గాజు తీసుకురమ్మన్నారు. గాజులు తీసుకు రావడానికి వెళ్లిన వ్యక్తి రాత్రికి తిరిగివచ్చాడు. ఆతడు రాత్రి రావడం వలన ఒక సమస్య తలెత్తింది. ఎందుకంటే ఆ గాజును రాత్రి సమయంలో చేతికి వేయరాదు, పైగా నేలమీద ఉంచకూడదు. అందువల్ల రాత్రంతా దానిని ఒక చెట్టుకు కట్టి వ్రేలాడదీశారు. మర్నాడు రాధూ చేతికి వేశారు. కానీ ఎలాంటి ఫలితమూ కని పించలేదు. అప్పుడు సురబాలకు వచ్చింది కదా కోపం! నళినిని తిట్టిపోసింది. ఇద్దరి మధ్యా చెలరేగిన వాగ్యుద్ధమే ఆ చికిత్సకు లభించిన ఫలం!
కొన్ని రోజులు గడిచాయి. రాధూ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. చక్కని సదుపాయాలున్న కలకత్తాను వదలి రాధూను ప్రసవంకోసం ఒక కుగ్రామా నికి తీసుకువచ్చినందుకు సురబాల, మాతృదేవిని ఆడిపోసుకొంది. “అక్కడే ఉంటే నా కూతురు ఎంతో బాగుండేది. ఇక్కడ చూడు! మండు టెండలు! అందువల్లనే ఆమె అలా అయిపోయింది! ఎక్కణ్ణుంచి అయినా మంచుముక్కను తెచ్చి ఆమె తలపై ఉంచు! అప్పుడే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది” అంటూ అరవసాగింది. మాతృదేవి ఒక వ్యక్తిని పంపి చాలాదూరం నుండి మంచుగడ్డ తెప్పించి రాధూ తలపై ఉంచారు. అది చూసిన కాళి, పిచ్చిదాని మాటలు విని గర్భవతి తలమీద మంచుముక్క పెట్టినందుకు మాతృదేవిపై కోపగించుకొన్నాడు. ఇందువల్ల రాధూకు సన్నిపాతం కూడా రావచ్చు అంటూ ఆ వైద్యాన్ని ఆపించాడు. తర్వాత మాతృదేవితో, “అక్కయ్యా! ఇదొక వ్యాధి కానేకాదు. ఏదో భూతమో, ప్రేతమో ఆమెను ఆవహించివుంటుంది. దాని పనే ఇదంతా! నాకు తెలిసిన ఒక మంత్రవేత్త ఉన్నాడు. ఆతణ్ణి పిలిపించవచ్చు” అన్నాడు. కాళీతో పాటు బ్రహ్మచారి వరద వెళ్లి ఆ మంత్రవేత్తను తోడ్కొనివచ్చాడు. మాతృదేవి ఆతణ్ణి ఆహ్వానించి రాధూ పరిస్థితిని వివరించి, ఆమెను కాపాడమని కోరారు. మంత్రవేత్త అంతా అర్థం చేసుకున్నట్లు వెంటనే అందుకు ఏ వైద్యం చేయాలో చెప్పాడు. దానిని గురించి వినగానే మాతృదేవికి తల గిర్రున తిరిగిపోయింది. ఇతరులకు ఊపిరి ఆగిపోయేంత పనయింది. ఆతడు చెప్పింది విని చలించని ఏకైక వ్యక్తి కాళి మాత్రమే. ఆ మంత్ర వేత్త చెప్పిన వైద్యం ఇది: రోహిత చేప ప్రేగుల నుండి సుమారు ఇరవై కిలోల నూనె తీయాలి. తర్వాత గానుగ నుండి తీసిన నువ్వుల నూనెతో దానిని కలపాలి. దీనితో పలు సుగంధ ద్రవ్యాలను, అరణ్యంలో మనిషి పాదాలు సోకని చోటికి వెళ్లి అక్కడి నుండి పలుమృగాల పేడను మరికొన్ని పదార్థాలను సేకరించి బాగా వేడిచేయాలి. దాని నుండి లభించే ద్రవ్యాన్ని రాధూ ఒంటికి రుద్దాలి. దానితో పాటు ఆతడు మంత్రించి ఇచ్చే తాయెత్తును కూడా ఆమె కట్టుకోవాలి. అడవికి వెళ్లి సేకరింపవలసిన పదార్థాల పెద్ద జాబితా విన్న అందరికీ ఈ మందును తయారుచేయవచ్చని చెప్పడానికి కూడా ధైర్యం చాలకపోయింది. ఒక ప్రేతాన్ని పిలిచి కూడా మందు గురించి అడిగారు. అది చెప్పిన మందుకూడా పనిచేయలేదు.
అదృష్టవశాత్తు మాతృదేవి బృందంలో కాస్త స్పష్టంగా యోచించే వ్యక్తి ఉన్నాడు. ఆతడు మాతృదేవితో, “అమ్మా! ఇలాంటి వైద్యమేమీవద్దు, ఒక మంచి డాక్టరును పిలిపిద్దాం” అన్నాడు. ఇంతవరకు అన్ని వినోదాలనూ చూసిన మాతృ దేవి విరక్తితో, “ఒక సాధారణమైన ప్రసవానికి ఎన్ని అగచాట్లు! అడవిలో ఎవరూ లేని చోట కుక్కలు, నక్కలూ కనడం లేదా?” అంటూ డాక్టరును రప్పించడానికి నిరాకరించారు. అంతలో స్వామి శారదానంద పంపిన ఒక డాక్టరు, ఒక దాది ఆశ్రమానికి వచ్చారు. మే నెల 9 వ తేదీ కష్టపడకుండా రాధూకు సుఖ ప్రసవం జరిగింది. మగబిడ్డ పుట్టాడు. రాధూ సుఖప్రసవంతో మాతృదేవితో సహా అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. ఆ బిడ్డకు వనవిహారి* అని నామకరణం చేశారు.
ఆ బిడ్డను కూడా మాతృదేవే చూసుకోవలసి వచ్చింది. ఈ అరవై అయిదు ఏళ్ల వయస్సులో కూడా గడ్డురోజులను ఆమె చవిచూడవలసి వచ్చింది. మాతృ దేవి శిష్యుడు ఒకాయన దినచర్య పుస్తకం ఆ గడ్డురోజుల గురించి ఇలా చెబు తుంది:
రాధూ బిడ్డకు అప్పుడు ఆరు మాసాలు. బలహీనత కారణంగా రాధూ లేచి నిలబడలేకపోయేది. ఎక్కడికి వెళ్లినా నేలమీద ప్రాకుకుంటూనే వెళ్లసాగింది. మాతృదేవికి కూడా అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. తరచు జ్వరంతో బాధపడే వారు.
ఒక రోజు ఉదయం మాతృదేవి కూరగాయలు తరుగుతున్నారు. రాధూ మాతృదేవి వద్దకు నల్లమందు కోసం వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసు కొన్న మాతృదేవి ఆమెను చూస్తూ, “రాధీ! అది కావలసినంత నువ్వు ఇప్పటికే తిన్నావు. నువ్వెందుకు లేచి నడవకూడదు? ఇకపై నిన్ను చూసుకోవడం నావల్ల కాదు. నీ గొడవలో నా భక్తినీ, అన్నిటినీ వదలుకున్నాను. నీ కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతోందో తెలుసా? దీని కోసం నేను ఎక్కడికి పోను?” అని అన్నారు. మాతృదేవి ఇలా అనీ అనగానే రాధూ ఉక్రోషంతో అక్కడున్న వంకాయను మాతృదేవి వైపు విసరేసింది. అది వేగంగా వెళ్లి మాతృదేవి ముఖం మీద పడ్డది. బాధను భరించలేక మాతృదేవి విలపిస్తూ ముందుకు ఒరిగిపోయారు. దెబ్బ తగిలిన చోట వాచింది.
నొప్పితో బాధపడుతున్న మాతృదేవి నిటారుగా కూర్చున్నారు. గురుదేవుల చిత్రపటం వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి, “భగవంతుడా! ఆమె తప్పి దాన్ని క్షమించండి. ఆమెకు మతి స్థిమితం లేదు. ఆమెను క్షమించండి” అంటూ ప్రార్థిస్తూ అత్యంత ఆవేదనతో తమ పాదధూళిని తీసి రాధూ తలపై పెట్టి, “రాధీ! గురుదేవులు ఈ శరీరాన్ని చూస్తూ కటువుగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కానీ నువ్వు దానికి ఎంతో బాధ కలిగించావు! నా నిజమైన చోటు ఏదో మీ కందరికీ తెలియదు. నేను మీతో పాటు జీవిస్తూండడం వల్ల నా గురించి మీకేదీ తెలియడం లేదు” అన్నారు. మాతృదేవి మాటలు విని రాధూ విలపించ సాగింది.
కొన్ని రోజులకు మునుపు మాతృదేవి కోల్పారాలో ఉంటున్నప్పుడు బెంగు ళూరు నుండి ఒక భక్తుడు మాతృదేవిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆతడు రాధూ ఖర్చులకంటూ చాలా పెద్ద మొత్తం మాతృదేవికి అందజేశాడు. తిరిగి వెళ్లే టప్పుడు, “అమ్మా! మీకు డబ్బు కావలసివస్తే తటపటాయించక నాకు వ్రాయండి” అని చెప్పి మరీ వెళ్లాడు. జయరాంబాటిలో మాతృదేవికి డబ్బు ఇబ్బంది కలిగింది. శారదానంద కాస్త ఆలస్యంగానే డబ్బు పంపేవారు. అలా పంపించినప్పుడల్లా, ఆలస్యంగా పంపినందుకు క్షమించమని వ్రాసేవారు. జాబును చదివిన శిష్యునితో మాతృదేవి, “మనకు పంపడానికి శరత్ దగ్గర డబ్బు లేదనే అనుకుంటాను. లేకపోతే అతను ఇలా వ్రాయడు. కొన్ని రోజులకు మునుపు ఇక్కడికి వచ్చిన బెంగుళూరు భక్తుడు నాకు అవసరమైతే డబ్బు పంపిస్తానని చెప్పాడు. కానీ డబ్బు కావాలంటూ నేను ఒక వ్యక్తిని ఎలా అడగను? ‘ఎవరినీ యాచించకు’ అంటూ గురుదేవులు తమ అవసానకాలంలో నా కిచ్చిన ఆజ్ఞను పాటించలేకపోతానో ఏమో! ఇదిగో చూడు రాధూ! నీకోసం నేను ఒక్కటొక్కటిగా ప్రతి దానినీ వదలు కుంటున్నాను” అన్నారు. కానీ రాధూ మరీ మరీ మాతృదేవిని హింసపెట్టింది. 1920 ఏప్రెల్లో మాతృదేవి చిట్టచివరి రోజులలో ఒక రోజు. మాతృదేవి పడు కునివున్నారు. ఆ రోజు వంగ సంవత్సరాది. రాధూ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు. డాక్టరు ఇవ్వరాదన్న ఆహారం ఇవ్వడానికి రాధూ ప్రయత్నించింది. దానిని మాతృదేవి వారించారు. వెంటనే ఆమె కోపంతో, “నువ్వు చస్తే బావుణ్ణు కదా! నీ చితికి నిప్పు పెట్టా!” అంటూ అరిచింది. అందుకు మాతృదేవి, “మంచిదే! కానీ నేను వెళ్లిన తర్వాత నీ గతి ఏమవుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో నేను ఏం కోరుకుంటున్నానో తెలుసా? ముందుగా నువ్వు వెళ్లి పోవాలి. తర్వాత నేను కూడా నెమ్మదిగా వెళతాను” అని భరించరాని ఆవేదనతో అన్నారు.* ఆ తర్వాత మూడు నెలలు మాత్రమే మాతృదేవి జీవించారు.
మాతృదేవి -నళిని
నళినీ, మాకూ ఇద్దరూ మాతృదేవితో పాటే ఉంటున్నారు. రాధూ కంటే ముందుగానే వారిద్దరి పెళ్లిళ్లు జరిగిపోయాయి. నళిని తనకు నచ్చని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవలసి వచ్చిందని ముందుగానే తెలిపాం. పైగా అత్తగారింటివారు నిరుపేదలు. ఆమెను వారు ప్రేమతో చూడలేదు. ఇలాంటి అనేక కారణాలవల్ల వారిద్దరి బాధ్యతలను కూడా మాతృదేవే తీసుకోవలసి వచ్చింది. ఒక రాత్రి ఆమెను తీసుకెళ్లడానికి భర్త వచ్చాడు. ఆతణ్ణి చూడగానే నళిని ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొంది. భర్తతో వెళ్లమని పట్టుపడితే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టింది. ఎంతగా చెప్పినా ఆమె బయటికి రాలేదు. ఆమె ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుం దేమోననే భయంతో మాతృదేవి ఒక లాంతరు ఉంచుకుని గది దగ్గరే రాత్రంతా నిద్రపోకుండా గడిపారు. నళిని తలుపులు తెరిచినప్పుడు తెల్లవారిపోయింది. మాతృదేవి లేచి దీపాన్ని ఆర్పివేసి, “గంగా, గీతా, గాయత్రీ; భాగవత, భక్త, భగ వాన్; గురుదేవా గురుదేవా” అంటూ భగవంతుని పవిత్ర నామాలను ఉచ్చరిస్తూ నిత్యకృత్యాలలో మునిగారు. ఆ రోజు ఎవరితోనో ఈ విషయంగా మాట్లాడు తున్నప్పుడు “నళినిలో నా గుణం ఏదో కాస్త అంటుకునివుంది. అందువల్లనే ఆమె భర్తతో వెళ్లనంటోంది” అన్నారు.
ఆచారం, ఆచారం అంటూ నళినికి ఆచారం పిచ్చి ముదిరిపోయింది. ‘దీనిని తాకకు. అక్కడికి వెళ్లకు’ అంటూ అరుస్తూ, గగ్గోలు పెడుతూ, వచ్చిన వారిని నానా అవస్థల పాలు చేసేది. మరుగుదొడ్లు శుభ్రం చేసే పనివారి లాంటివారితో ఈమె ప్రవర్తనను ఇక చెప్పాల్సిన పనిలేదు. “దానిని తాకారు, దీనిని అశుద్ధం చేశారు” అంటూ ఈమె అరవడం చూసి వాళ్లు హడలిపోయే వారు. ప్రతిసారీ మాతృదేవి వచ్చి వారికి సర్దిచెప్పేవారు. హఠాత్తుగా ఆమెకు తాను ఏదో అశుద్ధాన్ని తాకినట్లూ, మైల పడినట్లూ అనిపించేది. రాత్రి పగలంటూ వేళాపాళా లేకుండా వెళ్లి స్నానం చేసేస్తుంది. ఇలా కొన్ని సమయాల్లో ఆమె రాత్రుల్లో స్నానానికంటూ వెళ్లినప్పుడు మాతృదేవి ఆమెను రాజీ చేయాల్సి వచ్చేది. ఒకసారి ఇలాగే వేళకాని వేళలో స్నానానికి బయలుదేరింది. మాతృదేవి కారణ మడిగినప్పుడు “ఒక కాకి నా మీద మూత్ర విసర్జన చేసింది” అంది. మాతృదేవికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు; “నాకు అరవై ఏళ్లు దాటాయి. కాకి మూత్ర విసర్జన చేస్తుందని నేను ఇంతవరకూ వినలేదు. ఇలాంటి వెర్రిమొర్రితనానికి కారణం నీ మనస్సు అపరిశుద్ధంగా ఉండడమే. ఘోరమైన పాపం చేసిన కారణంగానే మనస్సు ఇలా పవిత్రతను కోల్పోతుంది. కృష్ణ బోసు సోదరిది కూడా ఇలాంటి స్వభావమే. గంగానదిలో స్నానం చేసేటప్పుడు, తల నీళ్లలోకి ముని గిందా అని ప్రక్కవారిని అడుగుతుంది. ఇలా ప్రతిదానికి సంశయం కలగడం ఒక జాడ్యం. ఇందువల్ల మనస్సు పావనం కాదు. అపరిశుద్ధమయిన మనస్సును పరిశుద్ధం చేయడం అంత సామాన్యమయిన పనికాదు. ఇలాంటి పనికిరాని ఆచార పిచ్చి నీ జీవితంలో ఒక అవరోధంగా మిగిలిపోతుంది” అన్నారు మాతృదేవి.
నళినికీ, సురబాలకూ ఎప్పుడూ పడదు. చిన్నచిన్న విషయాలకు కూడా యుద్ధానికి దిగే వీరిద్దరిని రాజీ చేయడానికి మాతృదేవికి తలప్రాణం తోకకు వచ్చేది. వీరితో తాము ప్రవర్తించిన విధం గురించి మాతృదేవి చెప్పింది కుటుంబ జీవితానికి అత్యంత అవసరమైనది:
“ఇదిగో చూడు. నువ్వు ఏం చేసినా సరే, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ తగిన స్థానం ఇవ్వాలి. వారందరి అభిప్రాయాలు అడగాలి. ఇతరులకు స్వేచ్ఛ నిస్తూ, వారిని కార్యోన్ముఖులను చేసి, మనం కొంత దూరంగా ఉండి తప్పు జరగకుండా చూసుకోవాలి. రాధు అత్తవారి ఇంటికి ఏమైనా పంపవలసి వస్తే నేను నళిని అభిప్రాయం అడుగుతాను. సురబాల, నళిని పాము ముంగిసలా ఒకరి మంచి యింకొకరికి కనబడదు. ఈమె నీడను కూడా ఆమె తాకదు. అంత ఒద్దిక! కానీ నళినికే బాధ్యతను అప్పగిస్తూ, “ఇదిగో చూడు నళినీ, ఈ చీటీలో రాధూ ఇంటికి పంపవలసిన వస్తువుల జాబితావుంది. అందులో ఏవేవి పంపాలో నువ్వే కాస్త చెప్పమ్మా!” అనేదానను. ఆమె ఎంతో సంతోషపడేది. వెంటనే ఆ చీటీని తీసుకుని చూసి, “ఏమిటత్తా మీరు! ఇవి ఎలా సరిపోతాయి? వారందరు మీ పట్ల ఎలా ప్రవర్తించినా సరే! రాధూ పిచ్చిదే! మతి స్థిమితం లేనిది. వారు మీకు ఆందోళన కలిగిస్తున్నారని మీరు పిసినారితనం చూపించాలా? మీ గౌర వానికి తగ్గట్లు ఇవ్వాలి కదా!” అంటూ ఆ చీటీలోని వస్తువులతోపాటు మరిన్ని వస్తువులను చేర్చేది. నాలో నేను నవ్వుకునే దాన్ని. ఆమెకు చూపకుండా నేను ఏదైనా పంపివుంటే, ఆమె సురబాల కలిసి ఒక కురుక్షేత్రమే కల్పించివుండేవారు. ఇతరులకు స్వేచ్ఛనిస్తూ మనం వినమ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం. అహం కారులైన వీరి స్వభావం చక్కగా ఎరిగిన నేను అందుకు తగ్గట్లు జాగ్రత్తగా ప్రవ ర్తిస్తాను. అయినా అప్పుడప్పుడు వారు తమ స్వభావం ప్రదర్శిస్తారు. యుద్ధం ప్రారంభమవుతుంది! నేనేం చేయగలను? ‘ఇది భగవంతుని లోకం ఆయనే దీనిని నడిపిస్తున్నారు’ అని అనుకునేదాన్ని.”
మాకూ – నేడా
నళిని చెల్లెలు మాకూ. ఆమె పెద్ద జమీందారు ఇంటిలో అడుగుపెట్టినా, ఏ కారణం వల్లనో ఆమె కూడా మాతృదేవితోటే ఉంది. ఆమె బాధ్యత కూడా మాతృదేవే వహించారు. మాతృదేవి రాధూతోపాటు ఆమె ప్రసవం కోసం కోల్పారాలో ఉంటున్నప్పుడు మాకూ కూడా గర్భిణి. ఆమెతోపాటు నళిని కూడా అక్కడే ఉంటున్నది. అప్పటికే మాకూకు ఒక కుమారుడున్నాడు. ఆతడి పేరు నేడా. ఆతనికి అప్పుడు రెండు న్నర ఏళ్లు. వయస్సుకు మించిన పరిపక్వం ఆతనిలో కనిపించింది. మాతృదేవిని ‘సీతా అవ్వ’ అంటూ పిలిచేవాడు. పున్నాగ పువ్వులు సేకరించి ప్రతి రోజూ మాతృదేవి పాదాలకు అర్పించి ప్రణమిల్లేవాడు. మాతృదేవి కూడా ఆ పిల్లవాడి పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. విష్ణుపూర్లో రాధూకు హస్తసాముద్రికం చూసిన వ్యక్తే మాకూ చేయి చూసి “ఈమెకు పలువురు బిడ్డలు పుడతారు. కానీ వారు ఒకరినొకరు చూసుకొనే భాగ్యంలేదు” అని చెప్పేశాడు. ఈ మాటలు విన్న రాధూ మాకూ భోరుమని విలపిస్తూ మాతృదేవిని పెనవేసుకున్నారు. మాతృదేవి ఆమెను ఊరడిస్తూ ఆ హస్తసాముద్రికునితో, “నాయనా! నువ్వు యువకుడవు. నీకు లౌక్యం తెలియదు. ఇలాంటి విషయాలను ఇంత సూటిగా ఎవరన్నా చెబు తారా? మాతో రహస్యంగా చెప్పి ఉండవచ్చు కదా! దీని కేదైనా పరిహారం నీ హస్తసాముద్రికం సూచిస్తుందా!” అని అడిగారు. అందుకతడు, “వరుసగా ఆమె మూడు మంగళవారాలు దేవీమాహాత్మ్యం చదవాలి లేకపోతే వినాలి, తర్వాత హోమం ఇత్యాదులు చేయాలి” అన్నాడు. మాతృదేవి ఆతను సూచించింది చేయ డానికి అంగీకరించారు. మాకూకు అవసరమైనవన్నీ మాతృదేవి సమకూర్చి పెట్టినా, ఆమె రాధూను అతిగా చేరదీస్తున్నట్లూ, ఆమెలా గర్భిణిగా ఉన్న మాకూను ఉదాసీనపరుస్తున్నారని ఆరోపించింది నళిని. ఒక రోజు మధ్యాహ్నం మాతృదేవి విశ్రమించివున్నప్పుడు ఆమెతో చెప్పకుండా మాకూను, నేడాను తీసు కుని నళిని జయరాంబాటికి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మాతృదేవి బాధగా బ్రహ్మచారి వరదునితో, “వెళ్లేటప్పుడు నేడాను నా వద్దకు తీసుకొచ్చి నమస్కరింప చేయాలని కూడా ఆమెకు తోచలేదు. నేనేం చేయను? తలవ్రాత ప్రకారమే కదా జరుగుతుంది!” అన్నారు. అయినా ప్రతిరోజూ జయరాంబాటికి బ్రహ్మచారి వరదను పంపించి సంగతులు తెలుసుకొంటూనే ఉన్నారు.
హఠాత్తుగా నేడా జబ్బుపడ్డాడు. ఆతని చికిత్సకోసం ఏర్పాట్లు చేశారు మాతృదేవి. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకుండా మూడు రోజులలో నేడా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని మాతృదేవి భోరున విలపించారు. పది రోజుల తర్వాత కూడా ఆతని జ్ఞాపకాలతో కళ్లు చెమ్మగిలేవి. బాధతో ఒక భక్తు నితో ఇలా అన్నారు: “నేడా పూర్వజన్మలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధకుడై ఉండాలి. ముక్తి లభించడానికి మునుపే మరణించివుంటాడు. బహుశా మహ నీయుడై ఉండివుండవచ్చు. ఏదో కాస్త (కోర్కె) ఋణం ఉండిపోయింది; అది ఇప్పుడు తీరిపోయింది. ఇది ఆతని చిట్టచివరి జన్మ. ఈ వయస్సులో ఇంతటి పరి పక్వత ఏ పిల్లవాడిలోనూ కనబడదు. ప్రతిరోజు పున్నాగ పువ్వులు నా పాదాలపై వుంచి పూజించేవాడు. శరత్ను ‘ఎర్ర మామ’ అని పిలిచేవాడు. రెండున్నర, మూడు ఏళ్లే ఉంటాయి చదవడం, వ్రాయడం తెలియదు. అయినా శరత్ వ్రాయ డానికి కూర్చున్నట్లు వీడూ ఒక విరిగిన కఱ్ఱ పెట్టె ముందు కూర్చొని జాబు వ్రాస్తు న్నట్లు అభినయించేవాడు. “ఏం వ్రాస్తున్నావు?” అని అడిగితే “ఇక్కడి విషయా లను ఎర్రమామకు వ్రాస్తున్నాను” అనేవాడు; ఇలా అంటూ మళ్లీ విలపించ సాగారు. అప్పుడు భక్తుడొకడు, “అమ్మా! బిడ్డలు చనిపోతే ఎంత దుఃఖం! మీకు ఇప్పుడు అది అర్థమవుతుందికదా!” అన్నాడు. అందుకు మాతృదేవి, “నాయనా! అది చెప్పే తెలుసుకోవాలా ఏమిటి? ఆతణ్ణి కోల్పోయిన దుఃఖం నుండి యింకా నేను కోలుకోలేకున్నాను” అన్నారు. ఇలాంటి గడ్డు రోజులు గడిచాక 1919 జూలై మూడవ వారం మాతృదేవి కోల్పారా నుండి జయరాంబాటికి వెళ్లారు.
నీళ్లలో పడవ–పడవలో నీళ్లు
గృహస్థ జీవితం గురించి గురుదేవులు ఒక సందర్భంలో “నువ్వు సంసారంలో జీవించవచ్చు. కానీ ప్రాపంచికత నీలో ప్రవేశించకూడదు, పడవ నీళ్లలో ఉండవచ్చు. కానీ పడవలో నీరు ప్రవేశించ కూడదు. అలా జరిగితే పడవ మునిగిపోతుంది” అని పడవలో నీళ్లు చెప్పివున్నారు. మాతృదేవి జీవితంలోని తుది ఘట్టంలో ఉన్న మనకు ఒక సందేహం కలుగవచ్చు. మాతృదేవి గృహస్థ జీవితమనే పడవలో లౌకిక జలం ప్రవేశించిందా? లేకపోతే రాధూ పట్లా, ఆమె ద్వారా కుటుంబం పట్లా మాతృదేవికి ఎందుకింత అనురక్తి? వీరి కష్టసుఖాలు పంచుకుని ఎందుకిలా బాధపడాలి? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుని తర్వాత జీవిత చరి త్రను పరికిద్దాం. ఈ సందేహం మనకు మాత్రమే కాదు, మాతృదేవితో జీవించిన కొందరికి కూడా అప్పుడప్పుడు వచ్చింది; ఆమెను గురించి అపనమ్మకమూ, గందరగోళమూ ఏర్పడ్డాయి. ఆమె రాధూ పట్ల పెంచుకున్న అనురక్తి, ఒక సాధా రణ స్త్రీలా కుటుంబం వారితో గడిపిన జీవితం పలువురికి అగమ్యగోచర మయింది. మాతృదేవి అనేక ఆధ్యాత్మిక అనుభూతులు, స్థితులకు సాక్షియైన యోగిన్ మాకు కూడా ఇలాంటి సంశయమే వచ్చిందంటే ఇక ఇతరుల గురించి చెప్పడానికి ఏముంది?
యోగిన్ మా సంశయం
‘ఏమిటిది? గురుదేవులు మూర్తీభవించిన త్యాగంగా జీవించారు. మాతృ దేవి బొత్తిగా ఒక సాధారణ గృహిణిలా అయిపోయారే! రాత్రింబవళ్లు తమ తమ్ముళ్లు మేనగోడళ్లు అంటూ పరుగెత్తుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదే’ అని అనుకుంది యోగిన్ మా. ఇలాంటి సంశయం కలిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఆమె గంగాతీరంలో ధ్యానం చేసుకొంటున్నది. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు ఆమెకు దర్శన సంశయం మిచ్చారు. ఆయన యోగిన్ మాకు గంగానదిని చూపిస్తూ, “అదిగో గంగానదిలో ఏదో తేలుతూవుందే! అదేమిటో చూడు” అన్నారు. యోగిన్ మా దాన్ని చూసింది. అప్పుడే పుట్టి మరణించిన ఒక బిడ్డ మృతదేహం. దాని ప్రేవులు తీగలా చుట్టుకుని, రక్తం మరకలతో గంగానదిలో తేలుతూ పోతూవుంది. ఏం అసహ్యంరా బాబూ అని తలుస్తూ నిలబడిన ఆమెతో గురుదేవులు, “ఈ అశుద్ధం గంగానది పారిశుద్ధ్యాన్ని పాడు చేయగలదా?* ఆమె కూడా అలాగే. ఆమెను గురించి ఎప్పుడూ సందేహించకు, ఆమే ఇదీ (తాను) ఒక్కటే” అని చెపుతూ అంతర్ధానమయ్యారు.
హడలిపోయింది యోగిన్ మా. పరుగెత్తుకుంటూ వెళ్లి మాతృదేవి పాదాల మీద పడింది. “ఏం యోగిన్! ఏమయింది!” అంటూ ఆప్యాయంగా అడిగారు. యోగిన్ మా గద్గదస్వరంతో, “అమ్మా! మీ మీద విశ్వాసం కోల్పోయాను. గురు దేవులే వచ్చి నా సందేహం నివృత్తి చేశారు” అంటూ జరిగింది చెప్పింది. మాతృ దేవి చిరునవ్వుతో, “కలత పడకు! సందేహాలు వస్తాయి, తర్వాత నివృత్తి అవు తాయి. ఈ రీతిలోనే విశ్వాసం ప్రగాఢమవుతుంది. అనేక ప్రయత్నాల తర్వాతే అంచలంచెలుగా గాఢమైన విశ్వాసం కలుగుతుంది” అన్నారు.
మాతృదేవి చెప్పినవి
ఇలాంటి ఆధ్యాత్మిక దృశ్యాలు వ్యక్తిగతమైనవి. యోగిన్ మా గాంచిన దృశ్యం ఆమె సంశయాన్ని నివృత్తి చేసింది. కానీ మనకు చెందినంతవరకు ఇంకా కొన్ని వివరణలు కావలసివున్నాయి. మొదట, మాతృదేవి తమ ఈ జీవితం గురించి చెప్పిన విషయాలను చూద్దాం.
మాతృదేవి దీనిని గురించి అసలు పట్టించుకోనే లేదు. తమ పరిస్థితి ఏమిటి అంటూ ఎవరికన్నా వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. తమను గురించి ఎవరు ఏమనుకుంటారు, ఎవరైనా తమను వదలి వెళ్లిపోతారా అని ఆలోచించి చూసింది కూడా లేదు. ఆమె వరకు, మనం అప్పుడప్పుడు చెబుతూ వచ్చాం కదా, అలా ‘జీవించారు.’ జీవించడం మాత్రమే చేశారు; వివరణలు ఇత్యాదులను ఇతరులకు వదిలేశారు. ఈ విషయంగా ఎవరైనా అడిగితే పెద్దగా ఏమీ బదులు చెప్పింది లేదు. కొన్ని సమయాల్లో వారిచ్చే సమాధానాలు ప్రశ్నించే వారి గందరగోళాన్ని పెంచడం కద్దు.
ఒకసారి భక్తుడొకడు మాతృదేవితో, “అమ్మా! మీరెందుకు రాధూ పట్ల ఇంత అనురక్తితో ఉంటున్నారు? రాత్రింబవళ్లు ‘రాధూ రాధూ’ అంటూ కలవ రిస్తూ ప్రాపంచికతలో మునిగివున్నారే!” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “ఇదిగో చూడు! మేం స్త్రీలం, పిల్లలను ప్రాణంగా ప్రేమించడం మాకు సహజమే కదా!” అంటూ తమకే సొంతమైన ధోరణిలో బదులు చెప్పారు.
మరొకసారి మాతృదేవి ఇలా అన్నారు: “పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపం చేసినట్లు నాకు జ్ఞాపకం లేదు. నా ఐదవ ఏట గురుదేవులను చేపట్టాను. అప్పుడు నేను ఆయనను అర్థం చేసుకోలేక ఉండి వుండవచ్చు. కానీ ఆయన నన్ను తాకారనడంలో సందేహమే లేదు. ఆయనను ఆశ్రయించిన వారు మాయ నుండి ముక్తులయ్యారు. కానీ నేను మాత్రం మరింతగా మాయలో కూరుకు పోతున్నాను; అనురక్తి అనుబంధం అంటూ తపిస్తున్నాను.”
కానీ ఇందులో ఒక ఆశ్చర్యమయిన విషయం ఏమిటంటే మాతృదేవి ఇలాంటి సమాధానాలు చెప్పి తనను ఒక సామాన్య స్త్రీగా చాటుకున్నా, ఈ మాటలు విని ఎవరూ, ‘నిజమే కదా! ఇలా లౌకికంగా ఉంటున్న ఒక స్త్రీ నాకు ఎలా గురువు కాగలదు?’ అని అనుకొని మాతృదేవిని వదలి వెళ్లినట్లు చరిత్రలో ఒక్కరు కూడా మనకు తారస పడలేదు. భక్తులూ, శిష్యులూ మాతృదేవి పడుతున్న అగచాట్లను చూశారు. వారు తనను లోకువచేసి చెప్పుకోవడం విన్నారు. అంత టితో సరి! ఎందుకంటే మాతృదేవి బాహ్య జీవితానికి అతీతంగా ఏదో ఒక శక్తి తమందరిని ఆమెతో బంధించి ఉంచడం ప్రతి ఒక్కరూ అవగతం చేసుకున్నారు. ఆ ‘ఏదో ఒక శక్తి’ అయిన మాతృప్రేమను చవిచూసిన ఎవరైనా దాని ఆకర్షణ నుండి బయటపడగలరా?
కానీ కొన్ని సమయాల్లో ఇలాంటి ప్రశ్నలకు మాతృదేవి నుండి సూటిగా బదులు రావడం కూడా కద్దు. ఒకసారి ఎవరో ఇలాగే అడిగినప్పుడు మాతృదేవి కొంత ఉద్వేగంతో ఇలా అన్నారు: ‘ఇదిగో చూడు! నాలాంటి మరోవ్యక్తి నీకు కనబడతాడా? సాధ్యమయితే ప్రయత్నించి చూడు. భగవంతుణ్ణి గాఢంగా ధ్యానించేవారు అత్యంత సున్నితమయిన, పవిత్రమయిన మనస్సును సంతరించు కొంటారు. అలాంటి మనస్సుతో వారు దేనిని గురించి ఆలోచించినా చాలా గాఢంగా ఆలోచిస్తారు.* ఇది ఇతరుల కంటికి అనురక్తిగా కనిపిస్తుంది. మెరుపు మెరిసేటప్పుడు అది కిటికీ అద్దంలో ప్రతిఫలిస్తుందే కాని చెక్కమీద కాదు.”
మరొక రోజు రాత్రి వేళ. భోజనాల తర్వాత మాతృదేవి పిల్లలకు దోమ తెర కడుతున్నారు. ఎప్పటిలా సురబాల ఏ కారణంగానో మాతృదేవిని నిందిస్తూ వుంది. మాతృదేవి ఆమెతో అన్న మాటలు పక్క గదిలో ఉన్న శిష్యునికి స్పష్టంగా వినబడింది: “ఇదిగో చూడు నన్ను ఒక సామాన్యమయిన మానవ స్త్రీగా భావిం చకు. నీ నోటికి వచ్చినట్లు చీవాట్లు పెడుతున్నావు. నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏదో చప్పుడు వినవస్తూన్నదని వదిలేస్తున్నాను. నేను మాత్రం వాటిని పట్టించుకుంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకో. నేను ప్రాణాలతో ఉండడం నీకు మంచిది. నీ కుమార్తె ఎప్పటికీ నీ కుమార్తే! ఆమె పెరిగి పెద్ద దయ్యే దాకా నేను చూసుకుంటాను. అంతవరకే. ఆమె పట్ల నాకేం అనురక్తి? నేను తలచుకుంటే ఈ క్షణంలో ఈ అనుబంధాన్ని త్రెంచివేసుకోగలను! ఒక రోజు నేను కర్పూరంలా కరిగి కనుమరుగైపోతాను. నా కళేబరం కూడా నువ్వు చూడ లేవు.”
ఎంత లోతైన వచనాలు! కొన్ని సమయాల్లో, “రాధూ పట్ల నేను పెంచు కున్న అనురక్తి నాకు నేను ఏర్పరచుకొన్న మాయ! నా మనస్సు కించిత్తు అయినా ఆమెపై అంటుకోవడానికి నిరాకరిస్తుంది. నేనే బలవంతంగా నా మనస్సును ఆమెపై నిలుపుతున్నాను. రాత్రింబవళ్లు పైపైకి ఎగసిపోవడానికి నా మనస్సు ఉవ్విళ్లూరుతూ వుంది. ప్రజల పట్ల గల కరుణ వల్ల నేను నా మనస్సుకు నచ్చజెప్పి సాధారణ స్థితిలో ఉంచివున్నాను” అనేవారు మాతృదేవి.
మరికొన్ని సమయాల్లో, “ఇదిగో చూడు. నేను రాధూ రాధూ అంటూ ఆమె జ్ఞాపకంలోనే మునిగివున్నట్లూ, ఆమె పట్ల నాకు అత్యంత అనురక్తి ఉన్నట్లూ చెప్పు కుంటున్నారు. కానీ గురుదేవులు తమ కార్యం కోసమే నా మనస్సును ఆమెతో ముడివేసి ఉంచారు. ఆమె నుండి నా మనస్సు వైదొలగినప్పుడు ఈ శరీరం నశి స్తుంది” అని కూడ చెప్పేవారు.
మాతృదేవి ప్రేమకు లౌకిక ప్రేమకు గల తేడా
అందువల్ల మాతృదేవి రాధూ పట్ల, కుటుంబం వారి పట్ల పెంచుకున్న ప్రేమ, లౌకిక ప్రజలు పెంచుకునే సాధారణ అనురక్తో, అనుబంధమో కానే కాదు. స్వామి తపస్యానంద తమ గ్రంథంలో వివరించిన కొన్ని కారణాలనూ, ఇంకా మరి కొన్ని యథార్థాలనూ చూస్తే మనకు అది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది:
1. ఆధ్యాత్మికతను అన్వేషిస్తూ మాతృదేవిని ఆశ్ర యించిన శిష్యులు ఆమె లౌకికతలో మునిగివున్నట్లు చూశారు. ఇందులో సందే హమే లేదు. కానీ వారందరూ మాతృదేవితో మెలగిన కొద్ది రోజులలోనే లౌకిక బంధాలన్నీ తెగిపోయి తమ మనస్సుల్లో ప్రశాంతత నెలకోవడాన్ని ప్రత్యక్షంగా చూశారు. వారిలో పలువురు తమ ఆస్తులను, సుఖాలను త్యజించి సన్న్యాసు లయ్యారు. ఇది ఎలా సాధ్యం? స్వయంగా లౌకికతలో మునిగివున్న ఒక వ్యక్తి ఇతరులలో త్యాగం గురించిన ఆలోచనలను రేకెత్తించడం సాధ్యమా? అది అసం భవం. అందువల్ల మాతృదేవి పెంపొందించుకొన్నది లౌకిక అనురక్తి కానేకాదు.
2. సామాన్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల లేక వస్తువుపట్ల అనురాగం పెంపొందించుకొంటే యితరులపట్ల, యితర వస్తువుల పట్ల అనురాగమూ, అను బంధమూ తగ్గిపోతుంది. ఇది మన నిత్యానుభవం. అంతేకాదు ఇలాంటి అనురక్తి ఒక వ్యక్తిలో అసూయను పెంచుతుంది; ప్రతిఫలం ఎదురుచూస్తుంది. కానీ మాతృదేవికి ఇలాంటి గుణాలు మచ్చుకు కూడా లేవు. దేనినీ ఆకాంక్షించని మనస్సు, తమ వద్ద ఉన్నదంతా ధారాళంగా ఇచ్చేసే గుణం, పసిబిడ్డలాంటి నిష్కళంకమైన మనస్సు గలవారుగానే మాతృదేవి జీవించారు. నిజానికి ఆమె బంధువులు, భవిష్యత్తును గురించి యోచించక వచ్చినదంతా ధారాళంగా ఇచ్చేస్తు న్నట్లు ఆమెను తప్పుపట్టారు, గర్హించారు.
3. మాతృదేవితో మెలగిన ప్రతి ఒక్కరూ, ఆమెను తమ సొంత తల్లిగా భావించి ప్రవర్తించడం ఆమె ‘వచనామృతం’ చదివిన వారందరికీ అర్థమవు తుంది. నిజం ఏమిటంటే ఆమె మనస్సు మహాసాగరంలా విస్తరించి ఉండడమే! సముద్రంలో ఉప్పు గుణం ప్రతి బిందువులోను చొచ్చుకుపోయి ఉంటుంది. కొన్ని చోట్ల కొంత ఎక్కువగా ఉండవచ్చు. ఆ కారణంగా ఇతర చోట్లలో ఉప్పు రుచి తగ్గిపోతుందని అర్థమా ఏమిటి ? సముద్రం అంత విస్తృతంగా వ్యాపించివుండడం వల్ల ఒక చోట ఉప్పు నైజం ఎక్కువగావున్నా అది ఇతర చోట్లను ఏ రకంగాను ఆటంకపరచదు. అదేలా మాతృదేవి ఎల్లలులేని ప్రేమ, శోచనీయమైన పరిస్థితు లలో పుట్టి దుర్భరంగా జీవించిన కొందరికై ఎక్కువగా పొంగిపొరలింది. అంత మాత్రమే.
4. సామాన్యంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఉంచిన అనురక్తి పెరుగుతూ పోతుంది. అనురక్తిని పెంపొందించుకొనేవారు దుర్బలు లవుతారు. ఆ అనురక్తి వారికి ఎనలేని ఆవేదనను కలిగించినా, వారు దాని కబంధ హస్తాల నుండి బయటపడజాలరు. ఒక్క మాటలో చెప్పాలంటే అనురక్తి అన్నది ఒకరిలోని త్యాగబుద్ధిని కొద్దికొద్దిగా నశింపచేస్తుంది. కానీ మహాత్ములలో ఇందుకు భిన్నంగా అనురక్తి, త్యాగం సమపాళ్లలో ఉండడం చూడవచ్చు. వారు ఏదైనా ఒక పనిని చేయడం ప్రారంభిస్తే దానిని ఎంతో అనురక్తితో నిర్విర్తిస్తారు. కానీ ఆ పనిని వదలుకోవాల్సి వస్తే రవ్వంత కూడా కలత చెందక వదలుకుంటారు. తర్వాత దానిని గురించి అసలు ఆలోచించరు కూడా. ఆశ్చర్యపోయేటంత నిర్లిప్తతా, త్యాగమూ మాతృదేవిలో చోటుచేసుకున్నాయి.
బంధువులో, భక్తులో, శిష్యులో చనిపోయారని తెలియగానే మిన్ను విరిగి మీద పడినట్లు విలపించేవారు. కానీ పూజా సమయంలాంటివి వచ్చేస్తే కన్నీళ్లు తుడుచుకొని, ఏమీ జరగనట్లు పూజ, నైవేద్యం ఇత్యాదుల్లో మునిగిపోయేవారు. ఇలా సంకల్పమాత్రాన, అవధులులేని దుఃఖం నుండి ప్రశాంతమైన స్థితిలోకి రావడం సామాన్యులకు అసాధ్యం. అనురక్తి పెంపొందించుకొనేటట్లు దానిని సంకల్పమాత్రాన వదలుకోగల శక్తి కూడా మాతృదేవికి కరతలామలకం.
5. సామాన్యంగా అవసాన కాలంలో, అందునా ప్రాణాలు పోయే సమయంలో లౌకిక వస్తువుల మీద, బంధుబాంధవుల మీద, అనురక్తి, అనుబంధం ఎక్కువవుతాయి. తాము కోరుకున్న వారందరూ తమ వద్దే ఉండాలని వాంఛిస్తారు. కానీ మాతృదేవి స్థితి లౌకికుల ఈ సాధారణ స్థితికి పూర్తిగా భిన్నం. చివరి రోజుల్లో రాధూ పట్ల ఆమెకున్న అనురక్తీ, అనుబంధమూ పూర్తిగా తొలగి పోయాయి.*
యోగమాయ –మహామాయ
చివరి రోజుల్లో ఎందుకు, అంతకు మునుపే మాతృదేవి రాధూ అయినా సరే బంధువులు ఎవరయినా సరే, వారిని వారికి తగ్గ స్థానాలలోనే ఉంచారు. పరి స్థితులను తమ అదుపులో ఉంచుకున్నారేకాని, తాను పరి స్థితులకు లొంగిపోలేదు. తమను గురించీ, తాము చేయ వలసిన కార్యం గురించీ ఆమెకు స్పష్టంగా తెలుసు. రాధూ పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు తగిన వరుణ్ణి వెదకమని ఎవరైనా భక్తులకు చెప్పమని మాతృదేవితో ఒక వ్యక్తి చెప్పాడు. అందుకు మాతృదేవి, “వరుడు వచ్చినప్పుడు వస్తాడులే! ఎవరినీ వివాహమనే బంధంలో పడవేయడం నాకు నచ్చదు. అది నా పని కూడా కాదు” అంటూ నిష్కర్షగా చెప్పేశారు.
అంతేకాదు, 1918 ఏప్రిల్లో కోల్పారాలో ఉంటున్నప్పుడు మాతృదేవి మలేరియాతో బాధపడ్డారు. జ్వరం 103 డిగ్రీల దాకా వచ్చింది, మంచంపట్టారు. ఆ సమయంలో రాధూ పట్టుబట్టి భర్త ఇంటికి వెళ్లిపోయింది. అందుకు మాతృ దేవి ఎంతో నొచ్చుకున్నారు. అదే సమయంలో రాధూ స్వయంగా తానే నిర్ణ యాలు తీసుకోవడం మొదలుపెట్టడం చూసిన మాతృదేవి, ఇక ఆమెకు తన సహాయం అవసరం లేదని గ్రహించారు. అప్పటి నుండి ఆమెకు తమ మనస్సులో కేటాయించిన ప్రత్యేక స్థానాన్ని తొలగించివేశారనే చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు సురబాలతో అన్నట్లు, “ఆమె పెరిగి పెద్దదయ్యే దాకా” రాధూను చూసు కున్నారు కనుక. అంతే ఆ తర్వాత రాధూ రావడం వెళ్లడంగానే సాగింది. ఆమె ఉన్నప్పుడు ఎప్పటిలా ఆప్యాయంగా ఉండేవారు. కానీ భర్త ఇంటికి వెళ్లే టప్పుడు మాతృదేవి ఎడబాటును తట్టుకోలేక రాధూ మాత్రమే మరీమరీ విలపిం చింది కాని మాతృదేవిలో ఎలాంటి చలనమూ ఉండేది కాదు. ఇతరులకు వీడ్కోలిచ్చినట్లే ఈమెకూ ఆప్యాయంగా వీడ్కోలు చెప్పేవారు.
తమ బంధువులలో ఎవరైనా తమను చీవాట్లుపెట్టినా, అమర్యాదగా చూసినా మాతృదేవి లెక్కపెట్టేవారు కాదు. కానీ వారిలో ఎవరైనా సరే, అది రాధూ అయినాసరే, తమ శిష్యులనో, సన్న్యాసులనో దూషిస్తే ఆమె సహించరు. అలా ఏదైనా జరిగితే వెంటనే వారిని క్షమాపణ కోరుకోమంటారు. ఇలాంటి సంఘటనలను ఎన్నో మనం చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రాధూ యోగమాయ అనడం నిజం, ఆమె మాతృదేవిని లోకంతో ముడివేసి ఉంచింది అనేది కూడా నిజం. కానీ ఆమెను కూడా తన అదుపులో ఉంచుకున్న మహామాయగా విరాజిల్లారు మాతృదేవి.
ముఖ్యమయిన సందేశాలలో ఒకటి
అక్షర సత్యమయిన ఒక విషయం ఏమిటంటే, మాతృదేవి జీవితంలోని ముఖ్య సందేశాలలో ఒక్కదాని మూలం చోటు చేసుకొన్న విభాగమిదే. ఇలా ఉవ్వెత్తున లేచిపడే తరంగమయమైన భీకర సముద్రం లాంటి కుటుంబ పరిస్థితులలో కూడా ఆమె గృహస్థులకు సన్న్యాసులకు దారి చూపగల గురుదేవిగా జీవించగలి గారు. ఈ క్షణం కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు మరుక్షణం పారమార్థిక ఉన్నత శిఖరాలకు చేరుకుని ఇతరులకు మంత్రదీక్ష ఇవ్వగలిగారు. ప్రతి ఒక్కరికీ మాతృదేవి అదే క్షణంలో విభిన్నమయిన వ్యక్తిగా కనబడినట్లు మనం ‘వచనామృతం’ లో చూడగలం. మంత్రదీక్ష పొందిన క్షణమే తాము ఆధ్యాత్మిక అనుభవాలు పొందినట్లు పలువురు శిష్యులు చెప్పివున్నారు. మాతృదేవి గురుదేవిగా ఉండడం ప్రధానమయితే, కుటుంబ పెద్దగా, కుటుంబ పరిస్థితుల్లో కొట్టు మిట్టాడడం అంతకంటే ముఖ్యమని గ్రహించాలి. మనం మునుపే పేర్కొన్నట్లు మాతృదేవి ఆధ్యాత్మికత అనే జ్యోతి ప్రకాశించడానికి అనువైన చీకటి నేపథ్యంగా నెలకొన్నది ఆమె కుటుంబ జీవితం. ఇలాంటి కుటుంబ పరిస్థితిలో ఆమె జీవించి ఉండకపోతే, “అవునవును! వారికేం! ఎలాంటి చింతా లేదు! భక్తులు, శిష్యులు అంటూ పరమానందంగా జీవించారు. మనం అలాగే, తెల్లవారడం నుండి రాత్రి పడుకొనే దాకా కుటుంబ సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నాం కదా!” అంటూ ఆమెను మన జీవితం నుండి వైదొలగజేస్తాం. కానీ అందుకు చోటివ్వడం లేదు మాతృదేవి. కాల ఆవశ్యకతను పూర్తిచేయడానికి కదా ఆమె రాక! అందువల్ల అందరూ ప్రత్యేకించి స్త్రీలందరూ తమ జీవిత ఆదర్శంగా చేసుకోవడానికి తగిన స్థితిలో తమ జీవితాన్ని మలచుకున్నారు.
మాతృదేవి అద్భుతమయిన మహోన్నత జీవితంలో ఇక ఆమె ఇహలోకంలో జీవించిన అంతిమ దినాలను గురించి మాత్రమే చెప్పవలసివుంది. ఆ ఘట్టాన్ని తీసుకోవడానికి ముందుగా, చూడడానికి సరళంగానూ, అదే సమయంలో ప్రగాఢ ఆలోచనలతో జీవించి మానవజాతికంటూ కొన్ని శాశ్వత ముద్రలను విడిచివెళ్లిన ఆ యుగావతార మహిళారత్నం పరిమాణాలను కొన్నిటిని పరికిద్దాం!