గురువు
భగవంతుణ్ణే గురువుగా స్వీకరిస్తుంది హిందూమతం. ఆధ్యాత్మిక జీవితానికి వెలుగూ, మార్గమూ, శక్తీ ఆయన నుండి మాత్రమే పొందగలరు. సామాన్యంగా ఈ శక్తి ఒక వ్యక్తి మూలంగా అభివ్యక్తమవుతుంది. అంటే ఒక వ్యక్తి తపోమయ జీవితం ద్వారానూ, ఆధ్యాత్మిక సాధ నల మూలంగాను తనను అర్హునిగా చేసుకున్నప్పుడు గురు–శక్తి ఆతడిలో అభి వ్యక్తమవుతుంది. ఆతని ఆధ్యాత్మికోన్నతికి తగినట్లుగా ఆ శక్తి ఎక్కువగానో, తక్కువ గానో అభివ్యక్తమవుతుంది. ఇలా ఎవరి నుండి భగవంతుని గురు–శక్తి అభివ్యక్త మవుతుందో ఆతనినే గురువు అని పేర్కొంటారు. అలాంటి వారిని “భగవంతుని అనుజ్ఞ పొందినవారు” గా గురుదేవులు చెప్పేవారు. మానవాళికి ఉపదేశించే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. వీరి మాటలు మాత్రమే ప్రజానీకం ఆమోదిస్తుంది. ఇలాంటి వారు ఎన్నటికీ వేదిక మీదికెళ్లి ప్రసంగాలు చేయడమో, ప్రజలను సమీ కరించి తమను గురువుగా పరిచయం చేసుకోవడమో చేయవలసింది లేదు, చేయరు కూడా. అరణ్యంలో ఎక్కడో ఒక మూల వికసించిన మనోరంజిత సుగంధం నలుమూలలా వ్యాపించి తుమ్మెదలను ఆకర్షించేట్లు నిజమైన గురువు శక్తి కార్యోన్ముఖమవుతుంది. జిజ్ఞాసువులు సహజంగానే వారిపట్ల ఆకర్షితులవు తారు.
మంత్రదీక్ష
మనం భగవంతుని దిశగా వెళ్లేటప్పుడు ఆయన కూడా మన వైపుగా వస్తాడు. దీని అర్థమేమిటంటే, మనలో గర్భితమైవున్న స్వతస్సిద్ధ దివ్యత్వాన్ని చవి చూసినప్పుడల్లా భగవంతుడు తనను వ్యక్తం చేసుకొని కటాక్షిస్తాడు. మన దివ్యత్వాన్ని గ్రహించడానికి గురువు మార్గం చూపిస్తాడు. దీనినే మంత్రదీక్ష అని అంటారు. గురువు శక్తికి, శిష్యుని అర్హతకు తగినట్లు మంత్రదీక్షా విధానం భిన్నంగా ఉంటుంది. చూపు ద్వారా (చక్షు దీక్ష), స్పర్శ మూలంగా (స్పర్శ దీక్ష), కల మూలంగా (స్వప్న దీక్ష) మంత్రదీక్ష ఇవ్వడం గురించి తంత్ర శాస్త్రాలు వచిస్తాయి. కానీ సాధకుని మనోభావానికి తగి నట్లు ఇష్టదైవాన్ని పేర్కొని, జపం చేయడానికి ఒక మంత్రం ఇవ్వడాన్నే సామా న్యంగా మంత్రదీక్షగా పరిగణిస్తారు. “మంత్రం మనశ్శరీరాలను పవిత్రం చేస్తుంది. గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేయడంవల్ల ఒక వ్యక్తి పవిత్రమవు తాడు” అనేవారు మాతృదేవి. మనస్సు పవిత్రమయినప్పుడు అక్కడ దివ్యత్వం భాసిస్తుంది.
మాతృదేవి గురుస్థితి
భగవంతుని గురుశక్తే తమ మూలంగా అభివ్యక్తమవడం మాతృదేవి స్పష్టంగా గ్రహించారు. తమ నుండి మంత్రదీక్ష పుచ్చుకొన్న ఒక స్త్రీని సూచిస్తూ మాతృదేవి, “ఆమె కొన్ని వారాల క్రితం నా వద్ద మంత్ర దీక్ష తీసుకుంది. అంతకు ముందే మరొకరిని గురువుగా స్వీకరించింది. వారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవడం పొరపాటయిందని తర్వాత గ్రహించి నన్ను ఆశ్రయించింది. నేను ఆమెతో, ‘గురువు లందరూ ఒక్కరే; ఒకే భగవంతుని శక్తే వారందరి ద్వారా పనిచేస్తున్నది’ అంటూ ఎంతగానో నచ్చచెప్పి చూశాను. కానీ ఆమె దానిని అర్థం చేసుకోలేకపోయింది” అన్నారు. దక్షిణేశ్వరం రోజులలోనే మాతృదేవిలో గురుస్థితి నెలకొనడం చూశాం. ఇప్పటి నుండి, అంటే మాతృదేవి జీవితంలోని చివరి ఇరవై ఏళ్లు అది పరిపూర్ణ స్థితిలో విరాజిల్లింది. ఈ సమయంలో మాతృదేవి నుండి దీక్ష పొందిన వారు అసంఖ్యాకులు.
మంత్రదీక్ష అనే ఈ మహత్త్వమైన మార్గం మూలంగా ఒక్క వ్యక్తిని కూడా దివ్యత్వానికి అభిముఖంగా తీసుకుపోలేని రోజును వ్యర్థమైనట్లే భావించారు మాతృదేవి. కొత్తభక్తులు ఎవరూ రాని రోజుల్లో మాతృదేవి గురుదేవులతో, “ఈ రోజు వ్యర్థమయిపోయింది, ఒక్క భక్తుడు కూడా రాలేదు, ‘ప్రతిరోజూ ఎవరికైనా కొంత మంచి చేయాలి’ అంటూ నాతో అన్నారు కదా. కానీ ఈ రోజు ఎవ్వరూ రాలేదే!” అంటూ వాపోయేవారు. తర్వాత ఇంటి ముందు ఎవరైనా వస్తున్నారా అంటూ ఆతురతతో చూస్తూ చాలాసేపు నిలబడి ఉండేవారు. మళ్లీ గురుదేవుల వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరై, “ఓ భగవంతుడా! ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు వ్యర్థమయిపోవాల్సిందేనా!” అంటూ ఆవేదనతో అడిగేవారు. ఎవరైనా భక్తులు వస్తే ఎంతో సంతోషించేవారు.
మంత్రదీక్ష విషయంలో మాతృదేవి మరెవరినీ అడ్డురానివ్వరు; ఎవరి మాటా పట్టించుకోరు. అది ఆమె అవతార కార్యం అనడానికంటే, హృదయ స్పందన అనవచ్చు. ఒకసారి జయరాంబాటిలో ఉన్నప్పుడు ఆమెకు మలేరియా జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఎవ్వరినీ మంత్రదీక్ష కోసం మాతృదేవి వద్దకు పంపకూడదని స్వామి శారదానంద గట్టిగా చెప్పారు. అప్పుడు మాతృదేవిని దర్శించడానికి ఎంతో ఆతురతతో ఒక భక్తుడు వచ్చాడు. శిష్యులు ఆతణ్ణి అనుమ తించడానికి నిరాకరించారు. కానీ వచ్చిన భక్తుడు మాతృదేవి దర్శన విషయంలో పట్టుదలగా ఉన్నాడు. శిష్యులు అడ్డుకుంటే, ఆతను లోపలికి వెళ్లడానికి ప్రయ త్నించినప్పుడు అక్కడ చిన్న గడబిడ బయలుదేరింది. అది విని మాతృదేవి లేచి వచ్చి, “ఆతణ్ణి లోపలికి పంపడానికి ఎందుకు అడ్డుపడుతున్నావు?” అని అడి గారు. స్వామి శారదానంద ఆదేశమని తెలిసినా, నిష్కర్షగా, “ఈ పని కోసమే కదా నేను జన్మించింది. వీరిని అడ్డుకోవడానికి శరత్ ఎవరు?” అంటూ. ఆ భక్తు నితో, “అబ్బాయీ! ఏమైనా తిను. రేపు మంత్రదీక్ష ఇస్తాను” అన్నారు అను నయంగా.
దీక్షా పద్ధతి
సూర్యశక్తితో ఈ జగత్తు కొనసాగుతూవుంది. సూర్యుడు లేకపోతే ఈ జగత్తే లేదు అనవచ్చు. కానీ సూర్యుడు ప్రత్యక్షంగా, స్వయంగా ఏ పనినైనా చేపడు తున్నాడా అంటే అదీ లేదు. ఆతనికి చెందినంతవరకు ఎలాంటి వ్యత్యాసమూ పాటించకుండా తన కిరణాలను లోకం మీద సమంగానే ప్రసరిస్తూ ఉన్నాడు. కానీ మనిషి, మృగం, పక్షి, స్థావరం అంటూ జీవరాసులన్నిటిలో ఎన్నెన్ని మార్పులు తీసుకువస్తున్నారు! మాతృదేవి అవతార కార్యం కూడా అలాగే కొనసాగింది. “నేను గురువును, వీరందరికి దారి చూపిస్తాను” అనే భావనతో ఎన్నడూ ఆమె పనిచేయలేదు. ఆమెకు చెందినంత వరకు ఆమె ‘జీవించారు’, తాను శ్రీరామకృష్ణులనే అవతార పురుషుని కృపాశక్తి అనే భావనలో, తమవద్ద సంపూర్ణంగా ఇచ్చి వెళ్లిన ఆధ్యాత్మిక శక్తి గనిగా నెలకొన్నారు. ఆమె నుండి ప్రసరించిన కృపాశక్తి ఎక్కడెక్కడ ఎన్నెన్ని మార్పులు తీసుకురావాలో అన్నీ నిర్వర్తించింది.
అందువల్ల మంత్రదీక్ష ఇవ్వడమన్నది తమ అవతార కార్యం, తమ జీవి తంలో అంతర్భాగమయిపోయిన కార్యమని మాతృదేవి గ్రహించినా, తాముగా ఎవ రినీ ఆహ్వానించలేదు. “నా వద్దకు రాదలచుకున్నవారు ప్రాపంచిక బంధాలను తెంచుకుని తమంతట తామే వస్తారు. నేను వారికి ఆహ్వానం అందించవలసిన పనిలేదు” అన్నారు. ఆమె పరోక్షంగానే జీవించారు. బహుకొద్ది మంది మాత్రమే గురుదేవి ఆమెను ఎరుగుదురు. ఆమెకు చెందినంతవరకు గురుదేవులు మాత్రమే యథార్థ గురువు. తమ పని భక్తులను గురుదేవుల వద్ద చేర్పించడం, అంతే. “గురుదేవులు వారిని పంపిస్తున్నారు. నా వంతు ఇందులో ఏమీలేదు. ఆయనే వీరినందరిని ఆశీర్వదిస్తారు. నేను ఆయన పరికరాన్ని మాత్రమే” అనేవారు మాతృదేవి.
మంత్రదీక్ష ఇచ్చే విషయంలో మాతృదేవి పాత సంప్రదాయాలనూ, పూజలనూ, కర్మాచరణలను అతి తక్కువగా పాటించేవారు. మంత్రదీక్ష ఇవ్వడానికయిన ప్రాథమిక విధులను పాటించేవారు. కానీ తమకంటూ కొన్ని పద్ధతులను ఏర్పరచు కున్నారు. సాధారణంగా కాశీలో ఎవరికీ మంత్రదీక్ష ఇచ్చేవారు కారు. “కాశీ పరమేశ్వరుని చోటు. అక్కడ ఆయన మాత్రమే గురువు” అనేవారు. అదేవిధంగా గురుదేవుల జన్మదినోత్సవం నాడు కూడా ఎవరికీ మంత్రదీక్ష ఇవ్వరు. సామాన్యంగా తమ కుటుంబంలోని వారికి కూడా మంత్రదీక్ష ఇవ్వరు. “వేరే ఏం కావాలి? ఇక్కడ పుట్టిందే చాలు” అనేవారు. కానీ ప్రసన్నుని భార్యయైన సువాసిని ఎంతో ప్రాథేయపడిన తర్వాత మాతృదేవి ఆమెకు మంత్రదీక్ష ప్రసాదించారు. తర్వాత మాకు, భూదేవ్, ఆతడి భార్య, రాధూ, మన్మథ్ ప్రభృతులకు కూడా మంత్రదీక్ష ఇచ్చారు. వీరందరిలోనూ సువాసిని మాతృదేవి పట్ల ఆత్యంత భక్తిభావం ప్రదర్శించింది. ఇలాంటి కొన్ని నిబంధనలను తప్ప ఆమె ఎలాంటి శాసనాన్నీ, సంప్రదాయాలనూ పాటించలేదు. పరిస్థితులకు తగినట్లు, పూజ చేసేటప్పుడూ, మంత్రదీక్ష సమయంలోనూ కర్మాచరణలను తగ్గించుకోవడమో, పూర్తిగా తీసివేయడమో చేసేవారు. మరణ సూతకం (మైల), బహిష్టు రోజులలో కూడా కొందరిని, కొన్ని సందర్భాలలో పూజ చేయడానికి అనుమతించడమూ, మంత్రదీక్ష ప్రసాదించడమూ కూడా చేశారు. పూజకు ముందుగా తేనీరు లాంటి పానీయాలను త్రాగడానికీ, మాంసాహారులను ఎప్పటిలా వాటిని తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఎందుకంటే, “ఆత్మకు, శరీరానికి ఎలాంటి సంబంధమూ లేదు. మైల అనేదంతా ఒట్టి మాటలు” అనేవారు మాతృదేవి.
మంత్రదీక్ష ఇవ్వడానికి ఇదే తగిన స్థలం అంటూ ప్రత్యేకంగా ఏ స్థలాన్ని ఆమె ఎన్నుకో లేదు. తమ ఇంటి వసారాలో కూడా మంత్రదీక్ష ప్రసాదించారు. యువకుడైన భక్తుడొకడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని, పోలీసుల నిఘాలో ఉన్నందువల్ల ఆతణ్ణి జయరాంబాటిలో తమ ఇంట్లో ఉంచుకోవడానికి వీలుపడ లేదు. కానీ ఆతడి తపనను చూసి మాతృదేవి ఒక మైదానంలో పచ్చిక మీద కూర్చోబెట్టి ఆతడికి మంత్రదీక్ష ప్రసాదించారు. మరొక భక్తునికి రైలు నిలయంలో ప్రాకారపు గోడ ప్రక్కన కూర్చోబెట్టి గొడుగునే పైకప్పుగానూ, వర్షం నీటినే మంత్ర జలంగాను ఉపయోగించి మంత్రదీక్ష ప్రసాదించారు. కొన్ని సమయాలలో అర్హత కలిగిన సాధకులకు అడగక్కుండానే మంత్రదీక్ష ప్రసాదించారు. ఎనిమిది పది సంవత్సరాల పిల్లలు కూడా మంత్రదీక్ష కావాలంటూ ప్రాథేయపడినప్పుడు, గోలాప్ మా ప్రభృతులు వారించినా కూడా వారికి మంత్రదీక్ష ప్రసాదించి, ఆశీర్వదించారు.
ఒక రోజు ఒక వ్యక్తి సాష్టాంగపడి మాతృదేవి పాదాలు పట్టుకుని మంత్ర దీక్ష ప్రసాదించమని మనస్సులో ప్రార్థిస్తూ విలపించసాగాడు. మాతృదేవి అదే చోట నిలబడే ఆతడికి మంత్రదీక్ష ప్రసాదించారు. తమ బాల్య స్నేహితురాలికి పరుపుమీద పడుకునే మంత్రదీక్ష నిచ్చారు. ఇలా మాతృదేవి కరుణకు సంప్రదాయమూ, క్రతువులూ ఎన్నడూ అడ్డుపడలేదు.
సామాన్యంగా ఉదయం పూజ ముగిసిన తర్వాతే మాతృదేవి మంత్రదీక్ష ఇచ్చేవారు. మంత్రదీక్ష పుచ్చుకొనే వారు ముందుగానే అనుమతి పొందివుండాలి. దీక్ష ఇవ్వడానికి అతి తక్కువసేపే పడుతుంది. ఒకసారి శిష్యుడొకడు స్వామి శారదానందతో, “మాతృదేవి మంత్రదీక్ష నివ్వడానికి రెండు మూడు నిమిషాలే పడుతుంది. కానీ మీరు అరగంట కంటే ఎక్కువగా తీసుకుంటా రెందుకు?” అని అడిగాడు. అందుకాయన, “మాతృదేవి విషయమే వేరే. ఆమె ఒక వ్యక్తిని గురు దేవులకు అర్పించడానికి ఆతణ్ణి స్పృశిస్తేనే లేక తలచుకొంటేనే చాలు. నేను గురుదేవులకు నా శిష్యుని అప్పజెప్పడానికీ, ఆయన స్వీకరించింది తెలుసుకోవ డానికీ చాలాసేపు ధ్యానం చేయాల్సి వస్తుంది” అన్నారు. శిష్యునికి తగిన మంత్రం మనస్సులో వెంటనే స్ఫురించడం కూడా మాతృదేవి చప్పున దీక్ష నివ్వడానికి కారణం అయివుండవచ్చు.
కలలో దీక్ష
ఆవశ్యకతకు, అర్హతకు తగ్గట్లు మాతృదేవి కొందరికి కలలో కూడా మంత్ర దీక్ష ప్రసాదించారు, ఉపదేశించారు. ప్రత్యక్షంగానో, ఛాయాచిత్రంలోనో మాతృ దేవిని చూసివుండని కొందరు స్వప్నంలో సాక్షాత్తు జగన్మాతగా చూసివున్నారు. కొందరు స్వప్నంలో ఆమె నుండి పూర్తిగానో, కొన్ని సమయాల్లో పాక్షికంగానో మంత్రం పొందివున్నారు. అంతేకాదు, వారందరూ మాతృదేవిని ప్రత్యక్షంగా దర్శించి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు స్వప్నంలో పొందిన అదే మంత్రాన్నే ఆమె ఇవ్వడం గమనించారు. మాతృదేవి స్వప్నం ద్వారానో ప్రత్యక్షంగానో ఇచ్చిన సలహాలతో కొందరు ఘోరప్రమాదాల నుండి తప్పించుకోవడం కూడా జరిగింది.
కలలోనో లేకపోతే అలాంటి అసాధారణ మార్గాల ద్వారానో తమ నుండి మంత్రదీక్ష తీసుకున్నారని వాటిని మాతృదేవి ప్రధానంగా ఎంచరు. వారందరికీ ప్రత్యక్షంగా మంత్రదీక్ష ఇచ్చే సమయంలో తమ అంతరాంతరాళంలో నుండి వెలువడే మంత్రానికి అనుగుణమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకోమని చెప్పేవారు. అనేక సందర్భాలలో అనుగుణంగా ఉండేవి. కొన్ని సమయాల్లో అనుగుణంగా ఉండవు. అలా అనుగుణంగా లేనప్పుడు స్వప్నంలో పొందిన మంత్రానికి తోడుగా మరొక మంత్రం ప్రసాదించేవారు. లేకపోతే కొద్దిగా మార్పుచేసి ఇచ్చేవారు. దానిని ఉపయోగించవద్దని కొందరిని హెచ్చరించేవారు కూడా. కుసుమకుమారి మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని ఎంతో ఉబలాట పడింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో కారణాల వల్ల ఆమె మాతృదేవి వద్దకు వెళ్లలేకపోయింది. ఈ సమయంలో ఆమె ఒక రోజు స్వప్నంలో మాతృదేవి నుండి ఒక మంత్రం పొందింది. ఆ తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయసాగింది. కానీ ఎందుకో ఆ మంత్ర తనకు సరిపడడం లేదని అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మాతృదేవి వద్దకు వెళ్లి తన స్వప్నం గురించి చెప్పింది. అది విన్నవెంటనే మాతృదేవి, “అమ్మాయీ! ఎవరో నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ముగ్గురు దేవతల పేరుతో (నాలాంటి రూపం మూలంగా) నీకు ఈ మంత్రం కలలో ఇప్పించారు. వీలయినంత త్వరలో నువ్వు ఆ మంత్రాన్ని మరచిపో. నువ్వు ఇక్కడికి వచ్చేశావు, కాబట్టి ఇక భయపడవలసిన పనిలేదు” అన్నారు. తర్వాత కొత్త మంత్రాన్ని ఇస్తూ మంత్రదీక్ష ప్రదానం చేశారు.
గిరీశ్ జీవితంలో
మాతృదేవి స్వప్నంలో మార్గదర్శిగా కటాక్షించారనడానికి గిరీశ్ ఘోష్ జీవితంలో ఒక సంఘటన చక్కని ఉదాహరణమవుతుంది. గిరీశ్ గురుదేవుల గృహస్థ భక్తుడూ, శిష్యుడూ, సుప్రసిద్ధ నాటక ప్రయోక్త, కవి, త్రాగుబోతూ, దుశ్శీలుడూ అయిన ఆతడు గురుదేవుల దివ్యానుగ్రహంతో పావనుడయ్యాడు. అందువల్ల గురుదేవుల పట్ల అతడికి అచంచలమైన విశ్వాసం. మాతృదేవి పవిత్రమయిన వారూ, గురుపత్నీ అని మాత్రమే ఆతనికి మాతృదేవి పట్ల మర్యాదామన్నన ఉండేవి, కానీ మాతృదేవి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి పొందినవారు, గురుదేవుల కృపాశక్తి అనే యథార్థం ఆతడికి తెలియదు.
గురుదేవుల నిర్యాణానికి రెండు సంవత్సరాల తరువాత ఆతడికి ఒక కొడుకు పుట్టాడు. ఆతను గురుదేవుల కృపాకటాక్షం వల్లనే పుట్టినట్లు గిరీశ్ నమ్మకం. ఆ అబ్బాయి మాతృదేవిపట్ల ఎంతో అనురాగం కనబరచాడు. మాతృ దేవి కూడా పిల్లవాణ్ణి చూడగానే ఆప్యాయంగా ఆతణ్ణి తన ఒడిలోకి తీసుకునే వారు. 1890 లో మాతృదేవి వరాహ నగరంలో ఒక భక్తుని ఇంట్లో ఉంటున్నారు. గిరీశ్ అప్పుడు తన కుమారుడితో అక్కడికి వెళ్లాడు. మాటలు కూడా రాని మూడేళ్ల ఆ బాలుడు మాతృదేవిని కలుసుకోవడానికి ఎంతో ఆతురత కనబర చాడు. సైగలతోనూ, మూగ మాటలతోను తన ఆరాటాన్ని పలువిధాలుగా వెలి బుచ్చాడు. ఒక భక్తుడు బాలుణ్ణి మేడమీద ఉంటున్న మాతృదేవి వద్దకు తీసు కెళ్లాడు. మాతృదేవిని చూడగానే నేలమీదపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత కిందికి దిగివచ్చి గిరీశ్‌ను మేడ మీదికి రమ్మని ప్రాథేయపడ్డాడు. అందుకు గిరీశ్, “పాపమే మూర్తీభవించిన నేను మాతృదేవిని ఎలా చూడ గలను?” అంటూ తటపటాయించాడు. కానీ ఆ బాలుడు ప్రాథేయపడడంతో ఆతణ్ణి చేతుల్లో ఎత్తుకుని మేడమీదికి వెళ్లాడు. శరీరమంతా వణకుతూవుండగా మాతృదేవి పాదాల మీద పడి, “అమ్మా! ఈ బాలుడి వల్ల ఈ రోజు తమ పాద పద్మాలను దర్శించుకునే భాగ్యం కలిగింది” అంటూ గద్గదస్వరంలో అన్నాడు. అప్పుడు ఆతడు మాతృదేవి ముఖంవైపు చూడలేదు. మాతృదేవి మేలిముసుగు వేసుకున్నారేమో! దురదృష్టవశాత్తు ఆ బాలుడు కొంత కాలానికే చనిపోయాడు. గిరీశ్ శోకసాగరంలో మునిగిపోయాడు. ఆతడి దుఃఖాన్ని చూసిన స్వామి నిరంజనానంద, మాతృదేవిని దర్శించుకోమని సలహా ఇచ్చారు. అందువల్ల స్వామి నిరంజనానంద, కొందరు ఇతర సన్న్యాసులతో కలిసి జయరాంబాటికి మాతృదేవి దర్శనార్థం గిరీశ్ వెళ్లాడు. ఇప్పుడు గిరీశ్ మాతృదేవిని రెండవసారిగా దర్శించుకొంటున్నాడు. మాతృదేవి సమక్షంలో సాష్టాంగపడి నమస్కరించిన గిరీశ్ మాతృదేవి ముఖాన్ని చూడగానే దిగ్భ్రమతో ప్రగాఢ ఆలోచనలో మునిగిపోయి అక్కణ్ణుండి వెంటనే బయటికి వచ్చి ఏకాంతంగా కూర్చున్నాడు. ఆయనతోపాటు వచ్చిన వారందరూ గిరీశ్లో కలిగిన ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయారు. చివరకు స్వామి నిరంజనానంద గిరీశ్‌ను సమీపించి, అందుకు కారణ మడిగారు. చాలాసేపు ప్రశాంతంగా ఉండిపోయిన గిరీశ్ ఆయనతో, “నాకోసం మీరు మాతృదేవిని ఒక విషయం అడిగిరావాలి. నా పంతొమ్మిదవ ఏట నాకు కలలో కానవచ్చింది మాతృదేవియేనా అనే విషయం అడిగి రండి” అన్నాడు. స్వామి నిరంజనానంద వెళ్లి మాతృదేవిని అడిగినప్పుడు ఆమె, “అవును. కనబడింది నేనే” అన్నారు. ఆ తర్వాత గిరీశ్ ఆ విషయం గురించి ఇలా వివరించాడు:
గిరీశ్ తన పంతొమ్మిదవ ఏట ఘోర వ్యాధి పీడితుడయ్యాడు. అప్పుడు ఆతడు పరమ నాస్తికుడు. వైద్యులందరూ పెదవి విరిచినప్పుడు ఒక రోజు ఆత డికి ఒక కల వచ్చింది. అందులో హఠాత్తుగా ఆకాశమంతా దేదీప్యమానమైన తేజస్సుతో నిండిపోయింది. ఆ తేజస్సు మెల్లమెల్లగా ఆతణ్ణి సమీపించి, చివరకు ఒక దేవీరూపం దాల్చింది. ఆ దేవి ఆతడి ప్రక్కన కూర్చొని, “నాయనా! నువ్వు ఆవేదనతో బాధపడుతున్నావు కదా!” అని అడిగింది. తర్వాత కొంత ప్రసాదాన్ని ఆతడికి తినిపించి అంతర్ధానమయింది. ఈ సంఘటన తర్వాత గిరీశ్ క్రమంగా కోలుకున్నాడు. ఆ దేవి ఎవరో తెలుసుకోవడానికి ఆతడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. బహుశా తనకు ఊహ తెలిసేలోపునే చనిపోయిన తన తల్లి అయివుండవచ్చుననుకొని ఆ సంఘటన గురించి ఆలోచించడం మాను కున్నాడు. కాని ఇప్పుడు మాతృదేవిని చూడగానే ఆ దేవి ముఖారవిందం మాతృ దేవి వదనాన్ని పోలివుండడం చూసి విస్మితుడయ్యాడు. మళ్లీ రెండుసార్లు కలలో కనబడింది ఆమేనా అని అడిగినప్పుడు రెండుసార్లూ మాతృదేవి, “అది నేనే” అని చెప్పారు. చివరిసారి చెప్పినప్పుడు, “కలలో కనబడింది నేనే. అంతమాత్రమే కాదు. నిజంగానే నేనే నీ అమ్మను, అమ్మనే. నీ గురువు భార్య అయినందువల్ల, కేవలం వరుసకు కాదు. నిజంగానే నేను నీ తల్లినే” అన్నారు. అప్పటి నుండి మాతృదేవి పట్ల గిరీశ్ భక్తి వర్ణనాతీతం. “నిరంజన్ కృపతో నేను మా అమ్మను కనుగొన్నాను” అనేవాడు గిరీశ్.
మాతృదేవి దర్శనార్థం పలుసార్లు జయరాంబాటికి వెళ్లేవాడు గిరీశ్. ఆతడు వచ్చినప్పుడల్లా స్వయంగా మాతృదేవి ఆతణ్ణి చూసుకునేవారు. గిరీశ్ నిద్ర లేవగానే టీ సేవిస్తాడు. ఇది తెలుసుకొన్న మాతృదేవి పొరుగిళ్లకు వెళ్లి పాలు తెచ్చి టీ తయారుచేసి ఇచ్చేవారు. గిరీశ్‌కు తెలియకుండా ఆతని పరుపుమీద పరచిన దుప్పటిని రోజూ ఉతికి పెట్టేవారు. రుచికరమైన వంటకాలు వండి, ఆతడి పక్కన కూర్చొని వడ్డించేవారు.
మాతృదేవి కలకత్తాలో ఉంటున్నప్పుడు గిరీశ్ అప్పుడప్పుడూ వచ్చి ఆమెను దర్శించుకునేవాడు. ఒకసారి కలకత్తా నుండి జయరాంబాటికి మాతృదేవి బయలుదేరినప్పుడు ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన గిరీశ్, “అమ్మా! నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిడ్డలా అయిపోతున్నాను. నేను మాత్రం యువకుడుగా ఉండివుంటే ఇటూ అటూ పరుగెత్తి మీకు సేవలన్నీ చేసిపెట్టేవాణ్ణి. కానీ నాకు వయస్సు మళ్లింది. మీరు మాకు సేవచేస్తున్నారు, మేము కూడా దానిని స్వీకరిస్తున్నాం. జయరాంబాటి ప్రజలకు సేవ చేయడానికి ఇప్పుడు వెళుతున్నారు. వారికోసం వంట ఇంట్లో నిలబడి వంట చేస్తారు. నేను ఎలా తమకు సేవ చేయగలను? సేవ చేయడమంటే ఏమిటో నాకేం తెలుసు?” అన్నాడు. తర్వాత మాతృదేవి చుట్టూవున్న భక్తులను చూసి ఉద్వేగపూరిత గద్గద స్వరంలో, “భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని మనలాంటివారు నమ్మడం కష్టం. ఒక గ్రామీణ స్త్రీ రూపంలో అండచరాచరాలను శాసించే జగ జ్జనని ఇదిగో మనముందు నిలబడి ఉన్నారు. ఆమె సాన్నిధ్యంలో మనం నిలబడి వున్నామని గ్రహించగలమా? రూపం మాత్రమే గ్రామీణ స్త్రీ; నిజానికి మాతృదేవి ఈ భువనాలకు ఈశ్వరియైన భువనేశ్వరి, మహామాయ, మహాశక్తి. మనుషులు సద్గతి పొందడానికీ, అదే సమయంలో స్త్రీత్వ ఆదర్శాన్ని లోకం గ్రహించడానికి గానూ ఆమె అవతరించి ఉన్నారు” అన్నాడు.
స్వామి రామకృష్ణానంద జీవితంలో
దివ్యదృశ్యం మూలంగా మాతృదేవి కృపాకటాక్షం ప్రసరించడం స్వామి రామకృష్ణానంద జీవితంలో చూస్తాం. మాతృదేవి పాదపద్మాలు దక్షిణదేశంలో మోపడానికి స్వామివారే కారణభూతులయ్యారు. అవిరామ కృషివల్ల యుక్త వయస్సులోనే వ్యాధిగ్రస్థుడై ఉద్బోధన్లో మంచం పట్టారు. అది 1911 ఆగస్టు. చివరి రోజుల్లో ఆయనకు మాతృదేవిని చూడాలనే తపన కలిగింది. అప్పుడు మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. స్వామివారి తపనను ఆమె ఎరిగినప్పటికీ వెంటనే కలకత్తా రాలేకపోయారు. కానీ కరుణా స్వరూపిణి అయిన మాతృదేవి ప్రత్యక్షంగా వచ్చి తీర్చలేని ఆయన తపనను ఒక దివ్యదర్శనం మూలంగా తీర్చారు. స్వామి ఈ భూలోకంలో జీవించిన చిట్టచివరి రాత్రి ఆ దివ్యదర్శనం ఆయనకు లభించింది. తమ అనుభవాన్ని మర్నాడే ఒక మిత్రుని మూలంగా గిరీశ్‌కు తెలియజేస్తూ దానిని ఒక పాటగా రాయించారు. ఆ పాట ఇది:
శోకమయ రాత్రి గడచిపోయింది.
‘నేను’, ‘నాది’ అనే ఘోరమైన
కల కరిగిపోయింది.
జననం, మరణం అనే భ్రమ ఇక లేదు.
జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తున్నాడు.
మాతృదేవి చిరునవ్వు నవ్వుతున్నది.
వరాభయ హస్తాలతో
ఆమె దర్శన మిస్తూన్నది.
దుందుభి మ్రోగగా బిగ్గర అరుస్తూ
జయ జయ ఘోష చేయండి.
మరణాన్ని జయించే ఆమె
దివ్యనామం లోకమంతా నిండివుంది.
కలవరించకు నాయనా,
గురుదేవుల పాదపద్మాలు ఇవిగో చూడు,
వేధింపులన్నీ తొలగిపోతాయి.
ఆవేదనలన్నీ మటుమాయమవుతాయి
అంటూ ప్రేమతో చెబుతుంది ఆమె.
రెండు కళ్లలోను కరుణ ఉప్పొంగుతూ
నా దగ్గర నిలబడింది
మంగళకరమైన ఆమె ప్రజలను
బ్రోచె దేవి కదా!
ఆ రోజు మధ్యాహ్నమే మహాసమాధి పొందారు స్వామి రామకృష్ణానంద. మాతృదేవి ఈ వార్త విని, “నా హృదయమే పగిలిపోయింది” అంటూ విలపించ సాగారు. అనేక రోజులు ఆయన గురించి కన్నీటితో చెప్పేవారు.
నాగమహాశయ్
మాతృదేవి మహత్వాన్ని గుర్తించి ఆరాధించిన వారిలో నాగమహాశయ్ ముఖ్యుడు. ఈయన గురుదేవుల గృహస్థ శిష్యుడు. “ఈయన జన్మించడంతో తూర్పు వంగ దేశమే పవిత్రతను సంతరించుకుంది” అనేవారు స్వామి వివేకానంద. ఈయన అసాధారణమైన భక్తుడు. మాతృదేవిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆయనలో ఒక భక్తి తుపాను చెలరేగేది. మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆమె దర్శనార్థం వచ్చేవారు. అప్పుడు బాహ్యప్రపంచాన్ని మరచిపోయి, మైమరచిన స్థితిలో వచ్చే వాడు. ఆ రోజుల్లో భక్తులు (పురుషులు) మాతృదేవి సమక్షంలో అనుమతింపబడే వారు కారు. వారందరు దిగువ మెట్లమీద తలవంచి ప్రణమిల్లేవారు. ‘ఫలానా వ్యక్తి ప్రణమిల్లుతున్నాడు’ అంటూ అప్పుడు మాతృదేవికి తెలిపేవారు. మాతృదేవి ఆ భక్తునికి చెప్పదలచుకున్న విషయం అలాగే తెలిపేవారు. నాగమహాశయ్ వస్తే మాత్రం తమ దగ్గరికి రప్పించుకొని చేయిపట్టుకుని కూర్చోబెట్టి తామే ప్రసాదం తినిపించేవారు. ఎందుకంటే చేతికిస్తే భక్తి పారవశ్యంలో దానిని తలపై రాసు కుంటాడు; లేకపోతే మాతృదేవి పవిత్రమైన చేతులు స్పృశించాయి అని ప్రసాదం ఉంచిన ఆకును కూడా తినడానికి ప్రయత్నిస్తాడు కనుక. వచ్చినప్పటి నుండి తిరిగి వెళ్లే దాకా మైమరచిన పారవశ్యంలో “అమ్మా, అమ్మా” అని మాత్రం ఉచ్చ రిస్తూవుంటాడు. మాతృదేవి ఆతని వీపును నిమురుతూ లేక చెవిలో గురుదేవుల పవిత్ర నామాన్ని చెబుతూ కొంత బాహ్యస్మృతి వచ్చేలా చేస్తారు. ఒక రోజు ఆయన వెళ్లేటప్పుడు, “తండ్రి కంటే తల్లే పరమ కారుణ్యమూర్తి” అంటూ పదేపదే చెప్పుకుంటూ వెళ్లాడు. మాతృదేవి తమ పడక గది గోడలకు స్వామి వివేకానంద, గిరీశ్, నాగమహాశయ్ల ఛాయాచిత్రాలను తమ నిర్యాణ పర్యంతం వ్రేలాడదీసి ఉంచుకొన్నారు. వాటిని గుడ్డతో తుడిచి, చందనం అలది ఆప్యాయంగా స్పృశించేవారు. ఒక రోజు నాగమహాశయుని ఛాయాచిత్రం ముందు చాలాసేపు నిలబడిపోయి, “ఎందరెందరో భక్తులు వస్తారు. కానీ ఈయన వంటివారు ఎవరూ లేరు” అన్నారు.
వినోదమైన భక్తులు
ఇలాంటి తియ్యదనమూ, మంచితనమూ గల భక్తులు ఒకవైపు ఉండగా, కొందరు భక్తులనే పేరుతో వచ్చి మాతృదేవికి ఎంతో ఆవేదన కలిగించారు. ఒకటి రెండు సంఘటనలు చూద్దాం. ఒక రోజు మాతృదేవి ఉద్బోధన్లో పూజ ముగించుకుని వసారాలో వచ్చి కూర్చున్నారు. ఒక భక్తుడు కొన్ని పుష్పాలు చేత పట్టుకుని లోపలికి వచ్చాడు. కొత్త వ్యక్తిని చూడగా మాతృదేవి లేచి తమ మేలిముసుగును సవరించుకొన్నారు. వాతంవల్ల కాళ్ల నొప్పితో బాధపడుతున్న ఆమె ప్రక్కవున్న మంచంమీద కాళ్లను వేళ్లాడదీసి కూర్చున్నారు. వచ్చిన భక్తుడు ముందుగా తాను తెచ్చిన పుష్పాలను మాతృదేవి పాదాలకు సమర్పించి ప్రణమిల్లాడు. తర్వాత పాదాలవద్ద కూర్చొని గురుదేవి కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూ ప్రాణాయామం మొదలుపెట్టాడు. ఇంట్లోని వారు ఏవో పనుల్లో మునిగివున్నారు. మాతృదేవి వద్ద ఎవ్వరూ లేదు. ఆ భక్తుడు శ్వాసను బిగిస్తూ, వదలుతూ ఏదేదో చేస్తూనేవున్నాడు. మాతృదేవి ఏమీ చేయలేక, ముఖాన్ని పూర్తిగా కప్పుకుని, మంచం మీద బొమ్మలా కూర్చున్నారు. వాతం పట్టిన కాళ్లను వేలాడదీస్తేనే నొప్పి; సమయం గడిచేకొద్దీ కాళ్లు బాగా నొప్పులు పుట్టాయి. భక్తుడు లేచేటట్లు లేడు. ఏకబిగిన ప్రాణాయామం చేస్తూనేవున్నాడు. మాతృదేవికి శరీరమంతా నొప్పులు పుట్టాయి. బాధను భరిస్తూ కూర్చొనేవున్నారు. అప్పుడు లోపలినుంచి వచ్చిన గోలాప్ మా అక్కడ జరుగుతూన్నది చూసి కోపంతో ఆ వ్యక్తిని లేపుతూ, “నీకేమన్నా మతిపోయిందా? మాతృదేవి శిలా విగ్రహమా లేక శిలావిగ్రహానికి ప్రాణాయామం మూలంగా ప్రాణం పోస్తున్నావా? వ్యాధిగ్రస్థురాలయిన మాతృదేవి ఇంతసేపు కూర్చొనేవుండి బాధ పడడం నువ్వు గ్రహించలేదా?” అంటూ ఆ భక్తుణ్ణి అక్కణ్ణుండి లేపి, పంపించివేసింది.
మరొక రోజు భక్తుడొకడు మాతృదేవి పాదాలకు ప్రణమిల్లేటప్పుడు తన తలను ఆమె పాద బొటనవ్రేలుకు తగిలేటట్లుగా గట్టిగా నొక్కాడు. నొప్పిని భరించలేక మాతృదేవి ‘హా’ అని అరిచారు. ప్రక్కన ఉన్నవారు “ఎందుకు ఇలా చేశావు?” అంటూ ఆతణ్ణి చీవాట్లు పెట్టనప్పుడు ఆతడు, “నేను కావాలనే అలా చేశాను. ఆ నొప్పి కారణంగా మాతృదేవికి నేను సదా జ్ఞాపకంలో ఉంటాను కదా!” అన్నాడు.
అట్లే మాతృదేవికి సదా జ్ఞాపకంలో ఉండాలని ఒక భక్తుడు పాదాలకు ప్రణమిల్లేటప్పుడు ఆమె బొటనవ్రేలు కొరికేశాడు. మరొక విచిత్రమయిన భక్తుడు ఆమె పాదాలకు ప్రణమిల్లేటప్పుడు హఠాత్తుగా ఆమె పాదాలను పట్టుకుని లాగి తన ఛాతీ మీద ఉంచుకుని మాతృదేవి పాదపద్మాల స్పర్శతో తాను తరించి పోయినట్లు చెప్పాడు.
ఇలాంటి భక్తుల మూర్ఖ చర్యలను అన్నిటినీ ఓర్చుకుని అందరినీ కటా క్షించారు అంటే, మాతృదేవి సహనమూ, కరుణా అసదృశాలు! ఇలాంటి భక్తుల నుండి మాతృదేవికి లభించింది ఏమీ లేదు! గుంపులు గుంపులుగా ప్రజలు తమకు ఇలా ప్రణమిల్లడంవల్ల తానొక మహనీయురాల నయిపోయాననే భావన ఆమెలో కించిత్తు కూడా ఎన్నడూ కలుగలేదు. అసంఖ్యాక భక్తుల పూజలూ, నమస్కారాలూ, పొగడ్తలూ ఆమె మనస్సులో ఎలాంటి స్పందననూ కలిగించవు. అర్హతానర్హతలను పరిగణించక మానవాళినంతా ప్రేమించే లోకాన్ని ఆవరించిన మాతృత్వం ఒక్కటే మాతృదేవి గురువు స్థితికి ఆలంబనంగా నిలిచింది.
గురు – శిష్య సంబంధం
ఇది మనం అనుకునేలా అంత సులభమయింది కాదు. కరుణ కాదు, మహా కరుణతో పరిపూర్ణులైన వ్యక్తి మాత్రమే ఇలాంటి యథార్థమయిన గురు వుగా మనగలరు. నిజమైన గురు–శిష్య సంబంధ మనేదిసాధారణ లౌకిక సంబంధంలా కేవలం చిలుక పలుకులతో జరిగే పనికాదు. అత్యంత ముఖ్యమయిన మూడు నియమాలను పాటించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి యథార్థమయిన గురువుగా రాణించగలుగుతాడు. అవి:
- మనోపక్వతకు తగినట్టి మార్గం చూపడం.
- ఆధ్యాత్మిక పథంలో వచ్చే అడ్డంకులను తొలగించడం.
- శిష్యుని పాపాలను స్వీకరించడం.
పైన పేర్కొన్న నియమాలను పరిశీలించినప్పుడే గురువు అనే బాధ్యత పరిమాణాన్ని మనం ఊహించుకోవచ్చు. మరొక వ్యక్తి బాధ్యతను స్వీకరించడం సామాన్యమయిన పనా ఏమిటి? గురుదేవులు చెప్పినట్లు, “భగవంతుని ఆదేశాన్ని పొందినవారు” మాత్రమే దానిని చేయగలుగుతారు. ఇందువల్లనే గురు–శిష్య సంబంధాన్ని ఇతర సంబంధాల కంటే ఉన్నతమైనదిగా, పవిత్రమైనదిగా హిందూ మతం పేర్కొంటుంది. ఒకరు కారు, ఇద్దరు కారు, వందలాది వ్యక్తుల బాధ్యత లను స్వీకరించారు మాతృదేవి. ఆమెకు ఇదెలా సాధ్యమయింది? ఆమె గురుస్థితి దివ్యత్వాన్ని సంతరించుకొని ఉండడం వల్లనే, వచ్చిన అందరినీ ఇలా చేతులలో తీసుకుని ఒళ్లో చేర్చుకోవడం సాధ్యమయింది. మాతృప్రేమతో ఆకర్షింపబడి తమను ఆశ్రయించినవారికి గురువుగా వ్యవహరించి, మంత్రదీక్ష ప్రసాదించి తమ దివ్యశక్తితో వారికి ముక్తి మార్గం చూపించారు మాతృదేవి. ఈ దివ్య మాతృత్వం ఆమె విశిష్టత. ఆమె అపరిమిత ప్రేమ పట్ల ఆకర్షింపబడి ఆమెను మానవాళి తల్లిగా తలచిన పలువురితో మాతృదేవి, “అబ్బాయీ! నేను నీకు తల్లినే, అందులో ఏలాంటి సంశయమూ లేదు. కానీ నేను నీ గురువును కూడా అనే విషయం మరచిపోకు” అని చెప్పడం కద్దు.
తమ వద్ద మంత్రదీక్ష తీసుకోవడానికి వచ్చేవారిలో పలువురు అందుకు అర్హులు కాదని మాతృదేవికి తెలుసు. కాని ఆమె మహత్త్వపూర్ణమైన కరుణ వారి లోటుపాట్లను త్రోసిరాజంది. ఈ విషయంగా మాతృదేవి ఒక శిష్యునితో, గురుదేవి “అబ్బాయీ! నా వద్ద మంత్రదీక్షకు వచ్చే వారిలో పలువురు ఎందుకూ పనికిరాని వారని నాకు బాగా తెలుసు. వారు చేయని పాపాలంటూ లేవు. కానీ వారు నన్ను అమ్మా అంటూ పిలవగానే సమస్తం మరచిపోతాను. వారు కూడా తమ అర్హత కంటే ఎక్కువగానే నా నుండి పొందుతారు” అని చెప్పివున్నారు.
ఇలా మాతృదేవి వద్ద మంత్రదీక్ష పొంది ఉన్నతులయినవారు అసంఖ్యా కులు. ఇలా మంత్రదీక్ష పొందిన వారినందరిని గురించో, లేక మాతృదేవి గురు స్థానంలో ఎలా కటాక్షించారో తెలుసుకోవడం మానవ శక్తికి మించిన పని. పైన పేర్కొన్న మూడు నియమాలు మాతృదేవి ఎలా పాటించారో అనే విషయాన్నీ, గురువుస్థానంలో మాతృదేవి ప్రత్యేకతను మాత్రం మనకు సాధ్యమయినంతవరకు ఇక్కడ పరికింప ప్రయత్నిద్దాం.
మనోపక్వతకు తగిన మార్గం చూపడం
ఏ రంగంలోనైనాసరే, “సరైన మార్గాన్ని నిర్దేశం చేసుకొంటే మాత్రం లక్ష్యాన్ని సాధించినట్లే” అనేవారు స్వామి వివేకానంద. మానవులు శరీర అమరి కలో కూడా ఒకరికొకరు భిన్నంగావుంటారు. మనోపక్వ తకు తగినట్లు వారి దారులు భిన్నంగావుంటాయి. తప్పు దారిని ఎన్నుకున్న వ్యక్తి తలక్రిందులుగా నిలిచి సాధనలు చేసినా ఏమీ సాధించలేడు. ఆశ్చర్యకరమైన నిజమేమిటంటే, ఇతరులను గురించి ప్రతి అణుమా తెలుసుకున్న మనకు, మనలను గురించీ, మన మనస్సు అమరి కను గురించీ ఏమీ తెలియదు. ఇక్కడే ఒక గురువు ఆవశ్యకత ఏర్పడుతుంది. యథార్థమయిన గురువు మాత్రమే మనకు సముచిత మార్గం చూపించగలడు. చూసీచూడగానే మాతృదేవి ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేయగలిగేవారు. ముందుగా ఆ వ్యక్తి గృహస్థుడుగా ఉండబోతున్నాడో లేక సన్న్యాస జీవితం స్వీక రిస్తాడోనని తెలుసుకుని అందుకు తగ్గట్లు ఆతనితో వ్యవహరిస్తారు. కొన్ని సమ యాల్లో ఇది ఆశ్చర్యకరంగాను, వింతగానూ ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఘటన చూద్దాం.
యువకు డొకడు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్నాడు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో తీవ్రంగా పాల్గొ న్నాడు. సన్న్యాసం పుచ్చుకోవాలనే ఆలోచనకూడా అప్పుడు అతనికి లేదు. మంత్ర దీక్ష అయిన తర్వాత ఆతను పండ్లు, తీపి పదార్థాలు, వస్త్రం ఇత్యాదులు గురుదక్షి ణగా మాతృదేవికి సమర్పించాడు. కానీ మాతృదేవి వాటిని స్వీకరించకుండా, “సన్న్యాసుల వద్ద నేను కానుకలు పుచ్చుకోను” అన్నారు. ఆ యువకుడు గాబరా పడ్డాడు. నేను సన్న్యాసిని కాను, ఒక మామూలు కళాశాల విద్యార్థిని అంటూ మాతృదేవికి చెప్పాడు. కానీ మాతృదేవి మునుపు చెప్పిన మాటలనే మళ్లీ చెప్పి దక్షిణ తీసుకోనన్నారు. మూడుసార్లు యువకుడు మాతృదేవిని ప్రాధేయపడ్డాడు. మూడుసార్లూ మాతృదేవి అదే సమాధానం చెప్పి గురుదక్షిణ తీసుకోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ యువకుని జీవితంలో ఎదురుచూడని అనేక మార్పులు కలిగి ఆతడు రామకృష్ణ మఠంలో చేరి సన్న్యాసి అయ్యాడు. మాతృదేవి జీవిత చరిత్ర రచయితలలో ఒకరైన శ్రీ నిఖీలానందస్వామే ఆ యువకుడు. సన్న్యాస జీవితానికి అర్హులుగా ఉన్నట్లు తాము చూసిన వారికి సన్న్యాస ఆశ్రమ ఔన్నత్యం గురించి వివరిస్తూ ఉత్సాపరచేవారు. ఎవరు ప్రతిఘటించినా ఖాతరు చేయక వారికి సన్న్యాసం ఇచ్చేవారు.
అట్లే సన్న్యాస జీవితం కోరుకున్న పలువురిని నిరుత్సాహపరచారు కూడా. వారందరితో, “ఎందుకు నాయనా పెళ్లి వద్దంటున్నావు? లోకంలో ఉంటున్నవన్నీ జంటలు జంటలుగానే కదా ఉంటున్నాయి! – కళ్లు రెండు, చేతులు రెండు, కాళ్లు రెండు – అదేలా భార్యాభర్తలు, భయమెందుకు? గురుదేవులకు ఎందరో గృహస్థ భక్తులున్నారు. భయపడకుండా పెళ్లి చేసుకో” అనేవారు. సన్న్యాస జీవితానికి అర్హులు కారని తాము భావించేవారు ఎంతగా ప్రాథేయపడినా వారికి సన్న్యాసం ఇవ్వడమో, సన్న్యాస జీవితాన్ని ప్రోత్సహించడమో ఆమె చేయలేదు.
తర్వాత శిష్యుని ఇష్టదైవాన్ని, మంత్రాన్ని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి శైవుడా, వైష్ణవుడా, శాక్తుడా, ఆతనికి ఏ దైవం మీద భక్తి ఎక్కువ లాంటి విషయాల గురించి ప్రశ్నిస్తారు. కొందరికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదు. వారు మాతృదేవికే బాధ్యతను అప్పగిస్తూ ఆమెనే తమకు తగిన ఇష్టదైవాన్ని, మంత్రాన్ని ఎంపిక చేయవలసిందిగా అభ్యర్థిస్తారు. ఇక వారు చెప్పే సమాధానాలను మాత్రమే విని వారికి మాతృదేవి మంత్రదీక్షను అలాగే ఇచ్చేవారు కారు. వారిని కొన్ని వివరాలు అడిగిన తర్వాత ధ్యానం చేస్తారు. వారు చెప్పిందీ, తమకు స్ఫురించిందీ ఒక్కటేనా అని చూసేవారు. తర్వాతే ఆ వ్యక్తికి యుక్తమైన మంత్రం ఇచ్చేవారు. కొన్ని సమయాల్లో అది ఆ శిష్యుడు అప్పటికే అనుసరిస్తూన్న మార్గా నికి భిన్నంగా కూడా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం.
కాళీకృష్ణుడనే* యువకుడు మంత్రదీక్ష తీసుకోవడానికి మాతృదేవి వద్దకు వచ్చాడు. ఆతడు అప్పటికే ఒక మంత్రాన్ని జపం చేస్తూ, దాని మూలంగా ప్రశాంతతా, ఆనందమూ పొందుతున్నాడు. కానీ మంత్రదీక్ష సమయంలో మాతృ దేవి ఆతనికి మరో మంత్రం ఇచ్చారు. ఇది ఆతనికి దిగ్భ్రాంతి కలిగించింది. మాతృదేవిని ఈ విషయంగా అడిగాడు. అందుకు మాతృదేవి, “ఆ మంత్రం కంటే ఇదే శ్రేష్ఠమయినది, నువ్వు ఈ మంత్రాన్నే జపించు” అన్నారు. మాతృదేవి మాటలు ఆతడిలో ఒక అద్భుతాన్ని రేకెత్తించాయి. కొత్త మంత్రాన్ని సమధికోత్సా హంతో జపించసాగాడు. కొన్ని రోజులలో ఆతని ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తాను మునుపు అనుసరిస్తూ వచ్చిన సాధన పద్ధతి నుండి ఈ పద్ధతి భిన్నంకాదని ఆతడికి అర్థమయింది. నూతనశక్తి, ఆనందం ఆతనిలో పెంపొందాయి. యథార్థమయిన గురువు విలువ ఏమిటో ఆతడికి అవగత మయింది.
మరొక సంఘటన: రసిక్లాల్ రాయ్ అనే వ్యక్తికి మాతృదేవి మంత్రదీక్ష నిచ్చారు. ఆతని కులదైవం ఎవరని తెలుసుకోగోరారు మాతృదేవి. కాని ఆతనికి ఆ విషయం తెలియలేదు. వెంటనే ధ్యానంలో మగ్నులయ్యారు మాతృదేవి. కాసేపటి తర్వాత, “ఇదే నీ కులదైవం” అంటూ ఆ దైవం పేరు చెప్పి అందుకు తగిన మంత్రాన్ని కూడా ఇచ్చి మంత్రదీక్ష ప్రసాదించారు. ఇంటికి తిరిగి వెళ్లిన రసిక్లాల్ ఇంట్లో పెద్దలను అడిగినప్పుడు మాతృదేవి చెప్పింది అక్షరాల నిజమని తెలిసింది. ఇలాంటి సంఘటనలెన్నో భక్తుల జీవితాలలో జరిగాయి.
అప్పటికే మరొక గురువు నుండి మంత్రదీక్ష తీసుకున్నవారు మళ్లీ అందు కోసం కొన్ని సమయాల్లో మాతృదేవి వద్దకు వచ్చేవారు. సామాన్యంగా మాతృదేవి అలాంటి వారికి మంత్రదీక్ష ఇచ్చేవారు కారు. అయినా కొందరు ఎంతో వ్యాకు లతతో కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అలాంటి వారికి మాత్రం మంత్రదీక్ష ఇచ్చేవారు. ఇలాంటి సందర్భాలను గురించి మాతృదేవి ప్రస్తావించేటప్పుడు, “నేను ఎవరి కన్నీటినీ భరించలేను. అందువల్ల అలాంటి వారికి మంత్రదీక్ష నివ్వ డానికి ముందుగా, నేను ఇవ్వబోయే మంత్రం పట్ల వారికి గట్టి విశ్వాసం కలి గించమని గురుదేవులను ప్రార్థిస్తాను. తర్వాత ఆయన ఆదేశానుసారం, అప్పటికే వారు తీసుకున్న మంత్రంతో పాటు మరొక మంత్రాన్ని కలిపి మంత్రదీక్ష ఇస్తాను. ఇలా నేను వారికి అదనంగా ఇచ్చిన మంత్రం వారికి భగవంతుని పట్లా, ఆయన దివ్యనామం పట్లా కొంగ్రొత్త విశ్వాసమూ, శక్తీ ప్రసాదిస్తుంది” అన్నారు.
ఇలా అప్పటికే కులగురువు నుండి మంత్రదీక్ష తీసుకున్న ఒక వ్యక్తి మాతృ దేవి వద్ద మళ్లీ మంత్రదీక్ష తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకొన్న ఆతడి కులగురువు కోపోద్రిక్తుడై ఆ శిష్యుణ్ణి శపించి నాశనం చేస్తానని బెదిరించాడు. శిష్యుడు బాగా కలతచెంది మాతృదేవిని ఆశ్రయించాడు. అందుకు మాతృదేవి, “ఎవరి శాపమూ నిన్ను ఏమీ చేయదు” అంటూ ఆతణ్ణి అనునయించారు. ఆ గురువు చెప్పినట్లు ఏదీ జరగలేదు. కానీ తమనుండి ఇలా మంత్రదీక్ష తీసుకునే వారు తమ కులగురువుకు ప్రతి ఏటా చెల్లించే కానుకలను నిలిపివేయకుండా ఇచ్చేటట్లు మాతృదేవి చూసేవారు.
మాతృదేవికి వంగభాష మాత్రమే తెలుసు. ఆమె దక్షిణదేశంలో పయనించి నప్పుడు భక్తులతో మాట్లాడలేకపోయారు. ఆమె వద్దకు వచ్చేవారు, “అమ్మా మంత్రం’, ‘అమ్మా, దీక్ష’ అనే మాటలు మాత్రమే అనేవారు. వారితో ఎలాంటి సంభాషణా జరపకుండానే, వారికి నచ్చినట్లూ, అదే సమయం వారు అనుసరి స్తున్న సంప్రదాయానికి యుక్తమైన ఇష్టదైవాన్నీ, మంత్రాన్నీ కచ్చితంగా సరి పోయేలా వారికి ప్రసాదించారు. ఇది ఆమె ఎలా చేయగలిగారని అడిగినప్పుడు మాతృదేవి, “కొందరికి నేను మంత్రదీక్ష నివ్వడం ప్రారంభించగానే నా మన స్సులో, ‘దీనిని చెప్పు’ ‘దానిని చెప్పు’ అంటూ స్ఫురించేది. కొందరికి ఉపదేశం చేసేటప్పుడు నాకు అగోచరంగా ఉండేది; మనస్సులో కూడా ఎలాంటి స్పందనా ఉండేది కాదు. నిశ్శబ్దంగా అలాగే కూర్చొని ఉండేదాన్ని. చాలాసేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత, వారికి యుక్తమైన మంత్రం నా మనోనేత్రం ముందు గోచ రించేది. ఉత్తమ సాధకులకు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు తక్షణమే వారికి యుక్తమైన మంత్రం నా మనస్సులో స్ఫురించేది” అని అన్నారు.
మాతృదేవికి మంత్రాల విషయంలో ఎంత ప్రగాఢ జ్ఞానం ఉండేదో దిగువ సంఘటన వివరిస్తుంది. ఒకసారి ఉద్బోధన్లో ఒక భక్తునికి మాతృదేవి శక్తిమంత్ర దీక్ష ప్రసాదించారు; తర్వాత క్రింద స్వామి శారదానంద వద్ద జపం చేసే పద్ధతిని నేర్చుకోమని ఆతనికి చెప్పారు. భక్తుడు వెళ్లి స్వామి శారదానందను అడిగినప్పుడు ఆయన భక్తునికి ఆ పద్ధతిని గురించి వివరంగా చెప్పారు. ఆ భక్తుడు మాట్లా డుతూ తనకు తెలియకుండానే మాతృదేవి తనకిచ్చిన మంత్రాన్ని ఉచ్చరించాడు. మంత్ర శాస్త్రాలలో చక్కని అభినివేశమున్న స్వామి శారదానందకు ఆ భక్తుడు ఉచ్చరించిన మంత్రాన్ని విన్నప్పుడు అందులో ఏదో లోపమున్నట్లు అనిపించింది. అందువల్ల మాతృదేవి వద్ద దానిని స్పష్టం చేసుకురమ్మని పంపారు. మాతృదేవి ఆ మంత్రాన్ని విని అది సరేనని చెప్పి పంపారు. శారదానందకు సంశయం తొలగలేదు. అందువల్ల భక్తుణ్ణి మళ్లీ మాతృదేవి వద్దకు పంపారు. ఈసారి కూడా మాతృదేవి మొదట ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. కానీ శారదానందకు ఆ మంత్రంలో ఏదో లోటువున్నట్లే అనిపించింది. అందువల్ల ఆ భక్తునితో మళ్లీ మాతృదేవి వద్ద చక్కగా ఉచ్చరించి స్పష్టం చేసుకురమ్మని పంపారు. ఈసారీ మాతృదేవి మంత్రాన్ని విని, గంభీరంగా, “ఇది సరైన మంత్రమే, జపం చేసే పద్ధతిని మాత్రం నీకు నేర్పించమని శరత్‌తో చెప్పు” అన్నారు. స్వామి శారదా నంద మౌనం వహించారు. తర్వాత ఒక రోజు స్వామి శారదానంద శక్తిపూజ గురించిన ఒక అపరూపమైన గ్రంథం పఠించడం జరిగింది. అందులో మాతృదేవి ఆ భక్తునకు ఇచ్చిన మంత్రం యథాతథంగా ఉంది. ఆశ్చర్యపోయారు ఆయన. తాను ఎంతో పాండిత్యం సంపాదించివున్నా మాతృదేవి ప్రగాఢ జ్ఞానం ముందు తమ జ్ఞానం తీసికట్టు అని గ్రహించారు స్వామి శారదానంద.
అవరోధాలను తొలగించడం
అవరోధాలులేని జీవితమంటూ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో అవి కోకొల్లలు. యథార్థమయిన గురువు మాత్రమే శిష్యునికి ఏర్పడే అవరోధాల పరిమాణాన్ని గ్రహించి ఆతనికి సాయపడగలుగుతాడు. మంత్రదీక్షను ప్రసాదించడం, శిష్యుల సాధనా పద్ధతిలో ఏర్పడే అవరోధాలను తొలగించి వారి దారిని సుగమం చేయడం మాతృదేవి జీవితంలో నిత్యకృత్యాలు. ఒకటి రెండు సంఘటనలు మాత్రం పరికిద్దాం.
మంత్రదీక్ష తీసుకున్న తర్వాత నిర్దిష్ట పద్ధతిలో ప్రయత్నం చేయనందువల్లా, ఇంకా పలుకారణాల వల్లా పలువురు మంత్రాన్ని మరచిపోతారు. మరి కొందరికి తాము మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అనే సంశయం తలెత్తుతుంది. దానిని నివృత్తి చేసుకోవడానికి మాతృదేవి వద్దకు వస్తారు. ఒక స్త్రీ తాను మంత్రదీక్ష తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత ఇలాంటి సంశయంతో మాతృదేవి వద్దకు వచ్చింది. ఆమె సందేహాన్ని వినగానే మాతృదేవి, “అలాగా! నేను నీకు మంత్రదీక్ష ఇచ్చి చాలా రోజులయింది కదా! ఇంకా ఆ మంత్రం నాకు ఎలా జ్ఞాపకముంటుంది? సరే. ఇక్కడే వుండు, మళ్లీ వస్తాను” అంటూ పూజగదికి వెళ్లారు. కాసేపట్లో తిరిగివచ్చి, “అమ్మాయీ! ఈ మంత్రాన్నే కదా నీకు ఇచ్చాను” అంటూ ఆ మంత్రం చెప్పారు. ఆ శిష్యురాలు కూడా ఆ మంత్రమే అని ఒప్పుకొని, తాను దానినే జపిస్తూన్నట్లు చెప్పింది.
తర్వాత మనం చూడబోయే సంఘటన సామాన్యంగా ఇంకా అక్కడక్కడ కనబడుతున్న గందరగోళాన్ని ఆధారంగా చేసుకున్నది. రాజయోగం లాంటి పుస్తకాలను చదవడం, అందులో తెల్పిన సాధనలను చేపట్టాలనే కోరిక కలగడం సహజమే. ఎందుకంటే అందులో చెప్పిన అమానుష దృశ్యాలు, అమానుష ధ్వనులు ఎలాంటి మనస్సునైనా కవ్వింపగలుగుతాయి. కానీ అలాంటి అభ్యాసాలను చేపట్టేవారికి ఉండవలసిన అర్హతలను గురించి ఆ పుస్తకం చేసిన హెచ్చరిక లను మాత్రం మనం పెడచెవిన పెడతాం. ఆ అర్హతలను పొందిన తర్వాతే మనం అభ్యాసం చేపట్టాలనే విషయం మనకు స్ఫురించదు. తక్షణం అనుష్ఠింప పూనుకొంటాం. పర్యవసానం తీరని వ్యాధులు, మతి చెడడం లాంటివే. రంగూన్లో ఉండిన శ్యామాచరణ్ అనే వ్యక్తి స్వామి వివేకానంద రచించిన ‘రాజయోగం’ చదివాడు. తర్వాత రోజుకు దాదాపు మూడు గంటలసేపు ప్రాణాయామం అభ్యసించసాగాడు. ఆ కారణంగా ఆతని చెవుల్లో ‘ఉస్’ అనే శబ్దం గట్టిగా వినబడ సాగింది. ఈ శబ్దం ఆతనికి పెద్ద అవరోధంగా తయారయింది. కార్యాలయ పనులను ఆతడు ఏకాగ్రతతో చేయలేకపోయాడు. ఎందరో వైద్యులను ఆశ్రయించి చికిత్సలు చేయించుకున్నాడు. కానీ ఫలితం శూన్యం. చివరకు సెలవు పెట్టి కలకత్తాకు వచ్చాడు. బేలూరు మఠానికి వెళ్లినప్పుడు మాతృదేవిని గురించి విన్నాడు. వెంటనే జయరాంబాటికి బయలుదేరాడు.
జయరాంబాటిలోని పవిత్రమైన పరిసరాలే ఆతడికి ఎంతో ప్రశాంతత నిచ్చాయి. ఇంత కాలమూ ఆతణ్ణి వేధిస్తున్న ఆ ధ్వని ఆగిపోయింది. తర్వాత మాతృదేవిని దర్శించుకున్న ఆతడు తనకు ప్రాణాయామంలోనూ, ఇతర యోగభ్యాసాలలోను ఉన్న ఆసక్తిని గూర్చి తెలిపాడు. ఈ విషయం విన్న మాతృదేవి ఆతడితో, “ఇలాంటి కఠినమైన అభ్యాసాలను చేపట్టడానికి ఆవశ్యకమయిన శక్తిని నీ శరీరంలోనూ మనస్సులోనూ సంతరించుకొని ఉన్నావా?” అని అడిగారు. అందుకు ఆతడు, “అలా అయితే మరో మార్గమేమిటి?” అని అడిగాడు. అప్పుడు మాతృదేవి, “నువ్వు చేయవలసింది ఏదో నీకు చెబుతాను” అంటూ ఆతనికి మంత్రదీక్షను ప్రసాదించి రోజూ రెండుసార్లు జపం మాత్రం చేయమని చెప్పారు. కానీ కఠోరమైన అభ్యాసాలపట్లే ఆకర్షణ గలిగిన ఆతనికి మాతృదేవి చూపించిన సరళమైన మార్గం రుచించలేదు. రోజుకు మూడుసార్లు జపం చేయాలని ఆశిస్తున్నట్లు చెబుతూ ఇంకా మరేదైనా అభ్యాసాలను నేర్పించమని ప్రాథేయపడ్డాడు. కానీ మాతృదేవి ఆతనితో రోజుకు రెండుసార్లు మాత్రమే జపం చేయాలని నిష్కర్షగా చెబుతూ, “నీ శరీరం, మనస్సు భరించగలిగేది ఇంతవరకే” అంటూ హెచ్చరించారు. తమ శిష్యుల మనస్సును, దాని అర్హతను కనుగొని మాతృదేవి ఎలా వ్యవహరించగలిగారో ఆశ్చర్యం!
ఇక మనం చూడబోయే సంఘటన అవరోధాలను తొలగించడంలో మాతృదేవి అనుపమాన శక్తికి చక్కని ఉదాహరణ. ఇది కూడా కాళీకృష్ణుని జీవితంలో జరిగిందే. కాలాంతరంలో శ్రీ విరజానంద స్వామి పేరిట సన్న్యాసం స్వీకరించి, స్వామీజీ ఆదేశానుసారం సేవాకార్యాలలో నిమగ్నమయ్యాడు. స్వామీజీ 1902 న నిర్యాణం పొందారు. ఆ ఎడబాటును స్వామి విరజానంద భరించలేకపోయారు. అందువల్ల ఆయన ఒకటిన్నర సంవత్సరాలు ఏకాంతంగా మాయావతికి సమీపంలో ఒక పర్ణశాలలో తపోజీవితం గడిపారు. పరిపూర్ణ మౌనవ్రతం పాటిస్తూ, రోజుకు పదిహేను గంటలు జపధ్యానాలలో నిమగ్నులయ్యారు.
ఈ కఠోర తపస్సు ఆయన నాడీమండలాన్ని దెబ్బతీసింది; దేహారోగ్యాన్ని పాడుచేసింది. రోజులు గడిచేకొద్దీ ఆయన మనస్సు ఏ పని చేయడానికీ ఇష్టపడనట్లు ఆయనకు అనిపించింది; మనస్సు శూన్యం అయిపోతూన్నట్లు తోచింది. వెంటనే తీవ్రమైన సాధనలను మానుకుని శాస్త్రాధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. అంతేకాకుండా దేహారోగ్యం కూడా బాగా దెబ్బతింది. అందువల్ల ఆయన బేలూరు మఠానికి తిరిగి వచ్చాడు. ఆయన పరిస్థితిని చూసి ఆశ్చర్యచకితులయిన మఠం వారు ఆయనను ప్రఖ్యాతవైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్ని చికిత్సలు చేసినా ఆరోగ్యం కుదుటపడలేదు.
ఇలా సుమారు ఆరు నెలలు గడిచాయి. ఒక రోజు ఆయనకు మాతృదేవి వద్దకు వెళ్లాలనిపించింది. వెంటనే బయలుదేరి జయరాంబాటి చేరుకున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత ఆయన మాతృదేవిని దర్శించుకుంటున్నారు. బాగా బక్కచిక్కిపోయివచ్చిన స్వామిని చూసి మాతృదేవి హడలిపోయారు. ‘ఎలా బక్కచిక్కి పోయాడు’ అనుకొని ఆ మాతృహృదయం తల్లడిల్లింది. విరజానందుల ప్రస్తుత పరిస్థితికి కారణం శరీరంలోని వ్యాధి కాదని చూడగానే మాతృదేవి గ్రహించారు. వెంటనే ఆయనతో, “నాయనా! నువ్వు నీ మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేస్తున్నావు? శిరస్సులోనా, హృదయంలోనా?”* అని అడిగారు. అందుకు విరజానంద, “శిరస్సులోనేనమ్మా! ఎందుకంటే అక్కడ మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానించడం నాకు పసందుగావుంది, పరమానందాన్ని ఇస్తున్నది” అన్నారు. హడలిపోయారు మాతృదేవి. “నాయనా! నువ్వు ఎంత పనిచేశావు! అది చిట్టచివరన చేయవలసింది కదా! హఠాత్తుగా మనస్సును అంత ఉన్నత స్థితికి తీసుకుపోవడం సాధ్యమా? మొదట శిరస్సులో మనస్సును ఏకాగ్రం చేసి, తర్వాత హృదయానికి తీసుకురావాలి, అక్కడే ఇష్టదైవాన్ని ధ్యానించాలి” అని చెప్పారు.
ఏం ఆశ్చర్యం! ఎన్నెన్నో చికిత్సలూ, మందులూ, ఆహారనియమాలూ సాధించలేని దానిని మాతృదేవి సలహా చక్కబరచింది. మాతృదేవి చెప్పినట్లు ధ్యాన పద్ధతిని మార్చిన వెంటనే విరజానంద మనశ్శరీరాలలో ఆశ్చర్యకరమైన మార్పు ఏర్పడింది. అతి స్వల్పకాలంలోనే ఆయన కోలుకున్నారు. “ఇందుకోసమే పరి పూర్ణులైన గురువు అవసరం ఉంది. మాతృదేవి మాత్రం నాకు దారి చూపకపోయి వుంటే నా జీవితమే నాశమైపోయివుండేది” అంటూ స్వామి విరజానంద కాలాంత రంలో అన్నారు. శరీరం గురించి సమస్తం ఎరిగిన ఆరితేరిన వైద్యుడు మాత్రమే, వ్యాధి ఎలాంటిదయినా తగిన చికిత్స చేయగలుగుతాడు. అట్లే మనస్సు పని తెరగు, అమరిక అన్నిటినీ ఎరిగిన గురువు మాత్రమే శిష్యుని జీవితంలో వచ్చే ఇలాంటి అవరోధాలను ఇట్టే తొలగింపగలడు.
పాపాలను స్వీకరించడం
ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రకృతి అంతటా కనబడే నియమం. శిష్యుని ఆధ్యాత్మిక జీవితాన్ని వికసింప చేయడానికి గురువు తన శక్తిని ధారపోస్తాడు. అదే సమయంలో ఆతని పాపాలను కూడా గురువు స్వీకరింప వలసివస్తుంది. ఒక వ్యక్తికి నిజంగానే మంచిని చేసే టప్పుడు గురువు శక్తి తగ్గడంతోపాటు ఆతడి పాపాల ఫలాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. తపోశక్తి కలిగిన గురువు మాత్రమే దీనిని చేయగలడు. ఈ కారణంగానే సాధారణమైన గురువు కొద్దిమందికే నిజంగా మంచిని చేయగలుగుతాడు. మాతృదేవి వందలాది మందిని తమ అహే తుక కృపతో కటాక్షించారు. అది ఎంత కఠినమైనదో తెలుసుకోవడానికి మాతృ దేవి ఒక శిష్యునికి మంత్రదీక్ష నిచ్చినప్పుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసు కుంటే చాలు: “గురువు శక్తి ఆతడు ప్రసాదించే మంత్రం మూలంగా శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అదేసమయంలో శిష్యుని పాపాలను గురువు తీసుకొంటాడు. అందుకు ఫలితంగా ఆతడు రుగ్మతలతో బాధపడతాడు. గురువుగా వ్యవహ రించడం ఎంతో కష్టం, పాపాల భారాన్ని ఆతను తీసుకోవాల్సి వస్తుంది. ఇదేలా ఉత్తమ శిష్యుని వల్ల ఆతడు లబ్ధి పొందుతాడు. కొందరు వేగంతో ముందుకు దూసుకు వెళతారు, కొందరి వేగం మందగతిగా ఉంటుంది. ఇది వారి పూర్వజన్మ కర్మఫలానుసారంగా ఏర్పడిన మనోపరిపాకానికి సంబంధించింది. అందువల్లనే రాఖాల్ మంత్రదీక్ష ఇవ్వడానికి వెనకాడేవాడు. ఆతడు నాతో, ‘అమ్మా! మంత్రదీక్ష ఇచ్చిన మరుక్షణమే నా ఆరోగ్యం చెడిపోతుంది. మంత్రదీక్ష అనగానే నా శరీరం దహించడం మొదలవుతుంది’ అని అన్నాడు.”
బహుశా పైన చెప్పిన కారణం వల్లే స్వామి బ్రహ్మానంద అంత సులభంగా ఎవరికీ మంత్రదీక్షను ఇచ్చేవారు కారు. పలువురిని మాతృదేవి వద్దకు పంపించేసే వారు. కానీ మాతృదేవికి చెందినంతవరకు, ఆమె అహేతుక మాతృప్రేమా, కరుణా దీక్షయివ్వడం వల్ల శరీరానికి కలిగే బాధలను మరపింపచేసేవి. అందరికీ ఆమె మంత్రదీక్ష ప్రసాదించారు. మాతృదేవి ఈ మహోన్నత సుగుణాన్ని చూచిన స్వామి ప్రేమానంద, “మేం మింగలేని విషాల నన్నిటిని మాతృదేవి వద్దకు పంపి స్తున్నాం. ఇక వారేమో, అందరికీ ఆశ్రయమిచ్చి, అందరి పాపాలనూ తీసుకొని, వాటిని భరిస్తున్నారు” అనేవారు.
మాతృదేవిని పవిత్రతా స్వరూపిణిగా వర్ణిస్తారు స్వామి అభేదానంద. వారి ఆలోచన, మాటలు, చేతలు అన్నిటిలోనూ పవిత్రత ఉట్టిపడుతుంది. అందువల్ల అపవిత్రమయిన, పాపంతోకూడిన దేనితోనైనా సంసర్గం కలిగినప్పుడు ఆమె దేహం ఆవేదనతో కంపించేది. అపవిత్రమయిన మనస్సు, పాపచింతనలు కలిగిన కొందరు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాంటివారు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఆమె ఎంత ఆవేదనను అనుభ వించారో శిష్యులకు అనుభవైకవేద్యమే.
1916 వ సం ॥ బేలూరు మఠంలో జరిగిన దుర్గాపూజ ఉత్సవంలో మాతృ దేవి పాల్గొన్నారు. అప్పుడు అసంఖ్యాక భక్తులు మాతృదేవి పాదాలను తాకి నమస్కరించారు. కొంతసేపు తర్వాత మాతృదేవి తమ రెండు పాదాలనూ గంగాజలంతో చాలాసేపు కడుగుకొన్నారు. అది చూచిన యోగిన్ మా, “అమ్మా! ఏం చేస్తున్నారు? ఇలా కడుగుతూవుంటే జలుబు చేస్తుంది” అన్నారు. అందుకు మాతృదేవి, “నువ్వు సరిగ్గానే చెప్పావు యోగీన్. అయినా నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు ఎలా వివరించను? కొందరు నా పాదాలను తాకి నమస్కరించే టప్పుడు బాగానే వుంది, కాని మరికొందరు తాకినప్పుడు నిప్పును పాదాలమీద ఉంచినట్లుగా మంటలెత్తుతాయి. తేలు కుట్టినట్లు మండుతుంది. గంగాజలంతో కడిగినప్పుడు మాత్రమే కాస్త ఉపశమనం కలుగుతుంది” అన్నారు.
జయరాంబాటిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మామూలుగా మాతృదేవికి సేవ చేసే శిష్యుడు ఒక రోజు బయటికి వెళ్లాడు. ఆతను తిరిగి వచ్చినప్పుడు మాతృదేవి వసారాలోని ఒక చాపమీద పడుకునివున్నారు, శిష్యుడు రాగానే మాతృదేవి, “ఒక వృద్ధుడు వచ్చాడు. దూరం నుండే ఆతను రావడం చూసి, వెంటనే నా గదికి వెళ్లి పరుపుమీద కూర్చున్నాను. ఆతడు నా పాదాలను తాకి నమస్కరించాలని చాలా ఆతురతపడుతున్నాడు. నేను ఎంత వారించినా వినకుండా నా పాదాలను తాకి ప్రణమిల్లాడు. అప్పటి నుండి కాళ్లనొప్పి, కడుపు నొప్పులతో నేను విపరీతంగా బాధపడుతున్నాను. మూడు నాలుగుసార్లు పాదా లను కడిగినా మంట తగ్గడం లేదు. నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా సైగలతో ఆ వ్యక్తిని గురించి తెలుసుకుని, ఆతను నా పాదాలను తాకకుండా చేసేవాడివి” అన్నారు.
కలకత్తాలో ఇలా పలుమార్లు జరిగింది. కచ్చితంగా ఉత్సవ రోజులలో అందరూ వచ్చి మాతృదేవి పాదాలను తాకి నమస్కరించడం దైనందిన చర్యగా పరిణమించింది. కొన్ని సమయాల్లో తమకు కలిగే ఆవేదనను ఇతరులతో చెప్పి నప్పుడు వెంటనే మాతృదేవి, “ఇవన్నీ శరత్‌తో చెప్పకు. ఆ తర్వాత ప్రజలు ఇక్క డకు రావడాన్నే ఆపేస్తాడు” అని కూడా చెప్పేవారు. మాతృదేవి కారుణ్యం అంత టిది. తాము బాధపడినా తమను నమస్కరించడం వల్ల ప్రజలు పొందే శ్రేయ స్సును ఆపడానికి ఆమె ఇష్టపడేవారు కాదు.
ఒకసారి కోల్పారా ఆశ్రమంలో ఆమె ఉంటున్నప్పుడు శిష్యుడొకడు తాను మాతృదేవి పాదాలను తాకితే తన పాపాల కారణంగా ఆమెకు బాధ కలుగుతుం దేమోనని తటపటాయించాడు. అప్పుడు మాతృదేవి, “నాయనా! దానిని గురించి ఆలోచించి కలత చెందకు! మేం జన్మించింది ఇందుకోసమే. ఇతరుల పాపా గురుదేవిలనూ, కష్టాలనూ స్వీకరించి అనుభవించకపోతే ఇక మరెవరు ఈ పని చేయగలుగుతారు? వారందరి బాధ్యతలను ఎవరు తీసుకోగలుగుతారు?” అన్నారు.
చివరి రోజుల్లో మాతృదేవి స్వయంగా లేవడానికీ, కూర్చోడానికీ వీలుకాని అతి బలహీన స్థితికి వచ్చారు. అప్పుడు శిష్యులు మాతృదేవి ఆవేదనను గురించి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు, “మాతృదేవికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత మంత్రదీక్ష కోసం ఎవరినీ ఆమె వద్దకు అనుమతించకూడదు. అసంఖ్యాకుల పాపాలను స్వీకరించడం వల్లనే కదా ఆమె ఇలా బాధపడు తున్నారు” అని అన్నారు. ఈ విషయం విన్న మాతృదేవి చిన్నగా నవ్వుకుంటూ, “నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కేవలం రసగుల్లాలు తినడానికి మాత్రం గురుదేవులు ఈ లోకానికి వచ్చినట్లు భావిస్తున్నావా?” అన్నారు.
మంత్రదీక్ష ఇవ్వడం వల్ల మాతృదేవి ఎన్నో బాధలకు లోనవుతున్నారని కలవరపడిన భక్తు డొకడు మాతృదేవితో, “అమ్మా! భక్తుల పాపాలను తీసుకోవడం వల్ల మీకు వాతరోగం వచ్చి ఇలా బాధపడుతూవుండడం చూసి దుఃఖీస్తున్నాం. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను: నా కారణంగా మీరు బాధ పడకూడదు. నా కర్మఫలానికైన దుఃఖాన్ని పూర్తిగా నేనే అనుభవించాలని నన్ను ఆశీర్వదించండి” అన్నాడు. ఆతడి మాటలు విని మాతృదేవి ప్రశాంతంగా, “అదెలా సాధ్యం నాయనా! దానిని ఎలా అనుమతించగలను? నువ్వు సుఖంగా ఉండు. నీ కోసం నన్ను దుఃఖాన్ని అనుభవించనివ్వు” అన్నారు.
మాతృదేవి విశిష్టత
ఇంతవరకు మనం చూసిన మూడు గుణాలూ ఒక యథార్థమైన గురువు వద్ద కనబడ దగ్గవి. మామూలు గురువు అతి కొద్దిమందికి మాత్రమే పైన చెప్పినట్లు నిజమైన మార్గం చూపగలుగుతాడు. కానీ మాతృదేవి ఆధ్యాత్మిక శక్తి గనియైనందున ఆమె అసంఖ్యా కులకు దారి చూపగలిగారు. కానీ ఇందులో మాతృదేవి కంటూ ప్రత్యేకత లేదు. ఒక మామూలు గురువు నుండి మాతృదేవి రెండు విషయాలలో భిన్నంగా కనబడ తారు. అవి: 1. ప్రేమ, 2. అభయం. మాతృదేవిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ వీటిని గ్రహించారు. ప్రపంచ వ్యాప్తమయిన మాతృత్వాన్నీ, తాము గురుదేవుల కృపాశక్తి అనే భావన మూలంగానే లోకం ఇంతదాకా కనీవినీ ఎరగని ఇలాంటి ప్రేమను అందరికీ పంచిపెట్టగలిగారు; అందరికీ అభయప్రదానం చేయగలిగారు.
ప్రేమ వెల్లువ
మాతృదేవిని ఆశ్రయించిన అందరికీ ఆమె పవిత్రమైన ప్రేమ తమను ఆవ రించి ప్రశాంతతను ప్రసాదించడం అనుభవైకవేద్యమే. మాతృదేవి ప్రతి ఒక్కరిని ప్రేమించారని కాదు, ఆమె ప్రేమ స్వరూపంగానే రూపొందారు. ఆమె వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరూ దాని మాధు ర్యాన్నీ చవిచూశారు. ప్రేమ ఒక మహత్తరమైన శక్తి. అది అవిభాజ్యమై ఉన్నప్పుడే యథార్థమైన స్థితిలో ఉంటుంది. వారికి, వీరికి అంటూ దానిని విభజించినప్పుడు అది తన పవిత్రతను కోల్పోతుంది. విభజింపబడిన ఆ ప్రేమ దుఃఖాన్నే ఇస్తుంది. దీనినే మాతృదేవి, “మానవుల పట్ల నువ్వు ప్రేమ చూపితే అందువల్ల దుఃఖం రానే వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ చూపితే అది గొప్ప విషయం, అందువల్ల దుఃఖమో కష్టమో కలుగవు” అని అన్నారు. అందువల్లనే ఆమె విడివిడిగా ఎవరి పట్లా ప్రేమ చూపలేదు అని అన్నాం. కానీ ఆమెను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ మాతృదేవి తమపట్ల విశేష ప్రేమను కనబరచినట్లు గ్రహించారు.
ఇలాంటి ప్రేమ వెల్లువ కారణంగా నిష్పక్షపాతంగా తమను ఆశ్రయించిన అందరికీ మంత్రదీక్ష ప్రసాదించారు మాతృదేవి. మాతృదేవి ఈ నైజాన్ని గురించి ఆమె శిష్యుడొకడు, “అమ్మా! మీరు అసంఖ్యాకులకు మంత్రదీక్ష ప్రసాదిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం కూడా ఉంచుకోలేరు. వారందరు ఇప్పుడు ఎలావుంటు న్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు అని కూడా మీరు ఆలోచించి చూడరు. కానీ ఒక గురువు తన శిష్యుని ఆధ్యాత్మిక పురోగమనంలో సదా అప్రమత్తంగా వుండాలి. అందువల్ల మీరు ఎంత మందిని జ్ఞాపకం ఉంచుకోగలుగుతారో, అంతమందికి మాత్రమే మంత్రదీక్ష నివ్వండి” అన్నాడు. అందుకు మాతృదేవి, “నాయనా! నేను మంత్రదీక్ష నివ్వడానికి గురుదేవులు ఎన్నడూ ఆక్షేపించలేదు. ఆయన నాకు పలు విషయాలను బోధించివున్నారు. అవసరమైతే ఈ విషయం కూడా నాతో చెప్పేవారు కదా! నేను నా శిష్యుల బాధ్యతలను గురుదేవులకు అప్పగిస్తున్నాను. ప్రతి రోజూ నేను ఆయనతో, ‘భగవంతుడా! ఈ శిష్యులు ఎక్క డున్నా దయతో వారిని కాపాడండి’ అంటూ ప్రార్థిస్తాను. పైగా వారికి ఇవ్వబోయే మంత్రం నేను గురుదేవుల వద్ద నుండే తీసుకుంటున్నాను. తద్ద్వారా వారు పరి పూర్ణ స్థితిని అందుకోవడం తథ్యం” అన్నారు.
ఇక, ప్రార్థనతో మాత్రం మాతృదేవి ఆగిపోలేదు. ప్రతిరోజూ జపం చేశారు. ఆ చేసే జపమంతా తమ శిష్యుల ఉన్నతి కోసమే అంటూ స్వయంగా ఆమే చెప్పే వారు. చివరి రోజుల్లో ధ్యానం చేయడానికి కూడా లేచి కూర్చోలేని పరిస్థితి ఏర్ప గురుదేవి డింది. అప్పుడు కూడా ఆమె రాత్రి రెండు గంటలకు మేల్కొని చాలాసేపు జపం చేసేవారు. అది గమనించిన శిష్యుడొకడు, “అమ్మా! రాత్రి బాగా నిద్రపట్టలేదా?” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “నేను ఎలా నిద్రపోతాను నాయనా! నా బిడ్డలు ఎంతో ఆతురతతో మంత్రదీక్ష కోసం వస్తారు. కానీ అందులో అనే కులు క్రమంగా జపం చేయడం లేదు. కానీ వారి శ్రేయస్సు బాధ్యతను తీసు కున్న నేను కిమ్మని ఎలా ఉండగలను? అందువల్ల వారికోసం గురుదేవులతో, ‘ఓ భగవంతుడా! ఈ లోకంలో ఎక్కడ చూసినా చెప్పనలవికాని ఆవేదన, దుఃఖం నిండివున్నాయి. వాళ్లు మళ్లీ ఈ లోకంలో జన్మించకూడదు. వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగజేయండి! వారికి ముక్తి ప్రసాదించండి’ అని ప్రార్థిస్తాను” అన్నారు.
ఒకసారి భక్తుడొకడు సాధనలు సరిగ్గా చేయలేక తడబడ్డాడు. ఈ విషయం ఆతడు మాతృదేవికి విన్నవించినప్పుడు ఆమె సదా ఆతడికి తోడు నీడగా ఉంటా నని చెప్పి అనునయపరచారు. ఈ మాటలు విన్న భక్తుడు మాతృదేవితో, “అమ్మా! మీ బిడ్డలు ఎక్కడవున్నా మీరు వారి అందరి కోసం సాధన చేస్తారా?” అని అడి గాడు. అందుకు మాతృదేవి, “అవును. అందరి కోసమూ నేను జపధ్యానాలు చేసి తీరాలి” అన్నారు. ఆ భక్తుడు మళ్లీ, “అమ్మా! మీకు శిష్యులు అనేకులు ఉన్నారు. వారినందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారా?” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “నేను ఎంతమందిని జ్ఞాపకపరచుకో గలుగుతానో, వారందరికోసం జపం చేస్తాను. జ్ఞాపకం చేసుకోలేని వారికోసం గురుదేవులతో, ‘భగవంతుడా! నా బిడ్డలు పలుచోట్ల ఉన్నారు. అనేకుల పేర్లు కూడా నాకు జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకంరాని వారినందరినీ మీరే కాపాడాలి. వారిని కటాక్షించి జీవితంలో పురోగమించేలా చూడాలి’ అని ప్రార్థిస్తాను” అన్నారు. శిష్యులు గురువుకు చేయ డానికి బదులుగా శిష్యుల కోసం సాధనలు చేసిన ప్రేమస్వరూపిణి అయిన గురు వును మరెక్కడ చూడగలం?
అభయ ప్రదానం
సాధారణమైన గురువులూ సాధువులూ మంత్ర, తంత్ర, క్రియ అంటూ ఏ మార్గాన్ని అనుసరించి వాళ్లు అనుభూతిని పొందారో ఆ మార్గం ఇతరులకు ఉపదేశింపగలుగుతారు. అంతమాత్రమే. వారందరు తమ పవిత్ర జీవితం ద్వారా ఒక వ్యక్తిని సన్మార్గం వైపుగా ఆకర్షింపగలుగుతారు. ప్రాపంచిక బంధాలలో చిక్కుకునివున్న ఆతడితో, “ఇలా చేయి, అలా చేయి” అంటూ ఉపదేశించవచ్చు. కానీ అసహాయస్థితిలోని ఆతడు, “మీరు చెప్పడమేమో సరేకాని, మీరు ఉపదేశించిన దానిని నేను ఎలా ఆచరిం చడం? అందుకు తగిన శక్తిని ప్రసాదిస్తే ఆచరిస్తాను” అంటూ వారిపైనే ఆధారపడి ఉంటాడు. అలాంటి వారికి సాయం చేయడానికి సాధారణమైన గురు వులు చాలరు. “అవును, నీ దుష్కార్యాల నన్నిటిని నేను తీసుకుంటాను. నీ పనుల నన్నింటి ఫలాన్ని కూడా నేను తీసుకుంటాను” అంటూ ధైర్యంగా ఒక వ్యక్తి మరొకరికి చెప్పడమో, చేయడమే సాధ్యంకాదు. ఆధ్యాత్మిక ఉన్నతి క్షీణించి నప్పుడు కరుణాసముద్రుడయిన భగవంతుడు అవతరిస్తాడు. మనిషి దుష్టకర్మల ఫలాన్ని ఆతడికోసం అనుభవిస్తాడు, బంధపాశాల నుండి ఆతణ్ణి విముక్తుణ్ణి చేస్తాడు. వారు మాత్రమే ఇలా చెప్పవచ్చు. ఆయన చెప్పినప్పుడు మాత్రమే మనిషి ఆయనను విశ్వసిస్తాడు. మాతృదేవిని ఆశ్రయించి ప్రతి ఒక్కరూ ఇలాంటి అభయ ప్రదానాన్ని చవిచూశారు. తమ ఈ లౌకిక జీవితంలో మాత్రమే కాకుండా, పర లోక జీవితంలో కూడా తన్ను కాపాడే శక్తి గలవారు మాతృదేవి అనే ఎఱుక మాతృదేవి శిష్యుల ప్రతి ఒక్కరికీ కలిగింది. “మాతృదేవి నిన్ను ఆశీర్వదించారంటే ఆ క్షణమే నీ తలవ్రాత మార్చి వ్రాయబడినట్లే” అంటూ ఒక భక్తునికి వ్రాశారు స్వామి సుబోధానంద.
మంత్రదీక్ష తీసుకున్న వారిలో పలువురు తాము సక్రమంగా జపం చేయడం సాధ్యపడలేదని మాతృదేవి వద్ద మొరపెట్టుకునేవారు. అప్పుడు మాతృ దేవి వారితో, “భయపడకు! నీ శక్తిమేరకు జపం చేయి. గురుదేవులను ఆశ్ర యించు. నీకు ఒక అమ్మ ఉన్నారని మరచిపోవద్దు” అని చెప్పేవారు. వారందరూ అంత గొప్పగా సాధనలు చేసి ఏమీ సాధింపలేరని వారికి అభయప్రదానం చేసి, వారికోసం జపతపాలు ఆచరించేవారు. మాతృదేవి శిష్యుడొకడు వ్రాసిన స్మృతు లలో ఒక సంభాషణ దీనిని చక్కగా వివరిస్తుంది. అది:
ఆ శిష్యుడు కుటుంబ సమస్యల, మనోవేదనల కారణంగా ఆవేదనా శిఖ రాన్నే చేరుకున్నాడు. ఒక రోజు మాతృదేవిని ఆశ్రయించి తన ఆవేదనల నన్నిటిని కన్నీరుమున్నీరై చెప్పుకున్నాడు. అది విన్న మాతృదేవి కళ్లు కూడా అశ్రుపూరితా లయ్యాయి. అంతా విన్నవించుకున్న తర్వాత ఆతడు మాతృదేవితో, “అమ్మా! నాశ నమై పోవడం ఒక్కటే నాకు మిగిలిన మార్గమా? అదే నా విధా?” అంటూ ఆవే దనతో అడిగాడు.
మాతృదేవి: నువ్వు ఏమంటున్నావు నాయనా? నా బిడ్డయైన నువ్వు నశించి పోగలవా? ఇక్కడికి వచ్చే వారందరికీ, నా బిడ్డలందరికీ ముక్తి సొంతమయి పోతుంది. భగవంతుడు కూడా నా బిడ్డలను ఏమీ చేయలేడు!
శిష్యుడు: అమ్మా! ఇప్పుడు నేనేం చేయాలి?
మాతృదేవి: భారమంతా నా మీద వేసి నువ్వు ప్రశాంతంగావుండు. సము చిత తరుణంలో మిమ్మల్నందరినీ ముక్తి ధామానికి తీసుకువెళ్లగల ఒక వ్యక్తి మీతో సదా ఉంటున్నారని జ్ఞాపకముంచుకో.
శిష్యుడు: ఇక్కడ ఉన్నంతదాకా ఆనందంగా ఉంటుంది. ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ కలవరం, చెడు ఆలోచనలే.
మాతృదేవి: ఇవన్నీ ప్రారబ్ధంవల్ల కలిగేవి. బలవంతంగా వాటిని తరిమి వేయగలమా? సత్సాంగత్యం నెరపు. పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించు. క్రమేణా అంతా సర్దుకొంటుంది. గురుదేవులను ప్రార్థించు. నేను నీతో ఉంటు న్నాను. ఈ జన్మలోనే నువ్వు ముక్తిని సాధించేశావు. ఎందుకు భయపడు తున్నావు? సముచిత సమయంలో ఆయన మీకు అన్నీ సమకూరుస్తారు.
ఇలాంటి అభయ ప్రదానం ఒక సామాన్య వ్యక్తి ఇంకొకరితో చెప్పగలడా? అలా చెప్పినా కూడా ఆ వ్యక్తి విశ్వసిస్తాడా?
ఈ అధ్యాయంలో గురువు స్థితి అనే పరిమాణంలో మాతృదేవి ఒక వ్యక్తికి ఎలా గురువుగా వ్యవహరించారో అనే విషయం మాత్రం చూశాం. ఆమె సన్న్యా సులకు ఎలా మార్గం చూపారు, రామకృష్ణ మిషన్‌ను ఎలా నడిపించారు ఇత్యా దులను ఇక చూడనున్నాం.