గ్రామీణ జీవితం పట్ల మక్కువ
మాతృదేవికి ప్రకృతి సౌందర్యం పట్ల గల ఆసక్తి మనకు తెలిసిందే. చిన్నతనం నుండే జయరాంబాటిలోని విశాలమైన పొలాలలోనూ, నదీ తీరాలలోను పరు గులు తీస్తూ ఆమె విహరించారు. అలాంటి వారికి కల కత్తాలోని కోలాహలంలో ఇరుకైన స్థలాలలో నివసించడం చెరసాలలో ఉన్నట్లే. భక్తులకోసం అప్పుడప్పుడు వెళ్లినా త్వరలో స్వగ్రామానికి వెళ్లిపోయేవారు. సామాన్యంగా గ్రామంలో ఆమె పూర్తిగా తమను వస్త్రంతో మరుగుపరచుకోవడమో, పూర్తిగా దూరంగా ఉండడమో చేయరు. కలకత్తా జీవనం నుండి బొత్తిగా భిన్నమయిన స్త్రీగానే మాతృదేవి గ్రామంలో జీవితం గడిపారు. ఒకసారి భక్తు డొకడు మాతృదేవి కోల్పారా నుండి జయరాంబాటి వెళ్లడానికి పల్లకీ ఏర్పాటు చేశాడు.* అందుకు మాతృదేవి, “ఇదిగో చూడు నాయనా! ఇది గ్రామం. ఇక్కడ నేను స్వేచ్ఛగా జీవించగోరుతున్నాను. కలకత్తా చెరసాల నుండి బయటపడి వచ్చాకే ప్రశాంతంగా ఊపిరి పీల్చు కుంటాను. అక్కడ నేను ఎంతో అప్రమత్తంగా కుంచించుకుపోయి జీవించవల సివుంది. ఇక్కడా మీ ఇష్టానుసారం గడియారం వెంట నేను పరుగెత్తలేను. కావాలంటే నువ్వు శరత్‌కు ఉత్తరం రాయి” అని అన్నారు. గ్రామంలోని నిరాడం బర జీవనం మాతృదేవిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇంతకూ ఆ కాలంలో ఆ ప్రాంతాలలో మలేరియా వ్యాధి శాశ్వతంగా ప్రబలి ఉంది. దాన్నీ మాతృదేవి ఖాతరు చేయలేదు.
మాతృదేవి తమతోపాటు గ్రామంలో వసించడం ప్రజలకు ఒక మధురాను భవం. దానితోపాటు మాతృదేవి దర్శనార్థం భక్తులు రావడం వల్ల పండ్లు, కూరగాయలు, పాలు, చేపలు ఇత్యాదుల వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఇది గ్రామస్థుల పేదరికానికి గుడ్డిలో మెల్లగా అమరింది. కరుణాస్వరూపిణి అయిన మాతృదేవి ఈ కారణం వల్ల కూడా గ్రామంలో జీవించగోరి ఉండవచ్చు.
కర్తవ్య నిష్ఠ
గ్రామం అంటూ మనం సూచించేది జయరాంబాటినే. మాతృదేవి కామార్పుకూర్లో నివసించలేదు. గురుదేవులు అవతరించిన ఆ గ్రామం పట్ల మాతృదేవికి అపార గౌరవం. అక్కడ గురుదేవుల పేరిట ఒక చక్కని ఆలయం నిర్మించాలని మాతృదేవి ఎంతో అభిలషించారు. తమ భర్త స్వగ్రామం కారణంగానూ, వారి సహధర్మిణిగా ఆ గ్రామంలో నివసించిన కారణంగానూ, ఆమె కామార్పుకూర్నే తమ స్వగ్రామంగా భావించారు. ఒకసారి కాశీకి వెళ్లినప్పుడు సంప్రదాయానుసారం మాతృదేవి ఒక క్రతువు చేశారు. అప్పుడు పురోహితులు ఆమె స్వగ్రామం పేరు అడిగినప్పుడు వెంటనే కామార్పుకూర్ అని చెప్పారు. గురుదేవుల వాటా క్రింద తమకు వచ్చిన ఆ చిన్న గుడిసెలో ఎవరి తోడూ లేకుండా తమ సొంత డబ్బుతో దానిని మరమ్మత్తు చేయించి, ప్రతి రోజు గుడిసెను శుభ్రం చేసి, దీపం వెలిగించి, పవిత్రంగా చూసుకొన్నారు.
ఇలావున్నా కూడా ఆమె కామార్పుకూర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసు కోవడానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఆ అదృష్టం జయరాంబాటికే కలి గింది. కామార్పుకూర్లో వారి బంధువులూ, గ్రామ ప్రజలూ ఆధ్యాత్మిక జీవితానికి ప్రతికూలమయిన వాతావరణం కల్పించడమే అందుకు ముఖ్య కారణం. అయినా ఇందుకు మరొక కారణం కూడా ఉంది. అది మాతృదేవి కర్తవ్యతా నిష్ఠ, అవ్యాజ కరుణ. తాము కుటుంబంలో జీవించడాన్నీ, సోదరులతోను బంధువులతోను ఆప్యాయంగా మెలగడాన్నీ ఎవరన్నా తప్పుపడితే, మాతృదేవి వారితో, “వాళ్లు నన్ను ఎలా అర్థం చేసుకోగలుగుతారు? నేను పుట్టి పెరిగిన కుటుంబాన్ని నేను పోషించే తీరాలి. అందుకే తల్లితండ్రులు, సోదరులు, అల్లుళ్లు, కోడళ్లు అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని కూడా గమనించాలి. లేకపోతే వారి ఋణాన్ని నేను ఎలా తీర్చుకోగలుగుతాను? వారిని గురించి అందుకే కలత చెందుతాను. గురుదేవులు కూడా తమ తల్లిని చూసుకొన్నారు కదా! వారి అన్న కుమారుడైన రామ్‌లాల్‌కు దక్షిణేశ్వర ఆలయంలో అర్చక పదవిని కూడా ఇప్పించారు!” అని బదులు చెప్పారు.
మాతృదేవి సంప్రదాయానుసారం సన్న్యాసం తీసుకోలేదు. తమను ఒక సంసారంలోని స్త్రీగానే భావించారు. ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత శిఖరాలను ఆరోహించిన వారైన, తాము ఒక సామాన్య స్త్రీ కాదని ఎరిగివున్నా, ఆమె ఎప్పుడూ తమ కుటుంబ కర్తవ్యాలను విస్మరించలేదు. తాను పుట్టి పెరిగిన ఇంటి వారితో తనను పెనవేసుకుని వారందరి కష్ట సుఖాలలో పాలు పంచుకుని ఒక సాధారణ స్త్రీలాగానే మెలగారు. మాతృదేవి పుట్టింటిని మామూలుగా పరిగ ణించలేదు. ప్రాపంచిక వ్యక్తులలో ఎన్ని రకాల వారున్నారో అన్ని రకాల వారినీ అక్కడ చూడవచ్చు.
సోదరులు
మాతృదేవి పుట్టి పెరిగిన కుటుంబంలో తల్లియైన శ్యామాసుందరీదేవి, ప్రసన్నకుమార్, ఉమేష్ చంద్ర, కాళీకుమార్, వరద ప్రసాద్, అభయచరణ్ అనే ఐదుగురు తమ్ముళ్లు, చెల్లెలు కాదింబిని ఉండేవారు. ఇందులో కాదంబిని, ఉమేష్ చంద్ర, అభయచరణ్ యువ ప్రాయంలోనే మరణించారు. మాతృదేవియే ఇంటికి పెద్దవారు; సోదరులను ఆమె ఎంత బాగా పోషించిందీ మునుపే చూశాం. అందువల్ల సహజంగానే సోదరు లకు మాతృదేవి పట్ల ఎంతో అనురాగం ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ సోదరు లందరూ ఆధ్యాత్మిక వాసనే లేకుండా కేవలం ప్రాపంచిక వ్యక్తులలా జీవితం గడిపారు. కొన్ని సమయాల్లో ధనాశ, మాత్సర్యం ఆవహించి మాన వత్వాన్ని పూర్తిగా కోల్పోయిన వారిలా కూడా ప్రవర్తించారు. కానీ వారందరూ ఎంతగా ప్రయత్నించినా సకల సదుపాయాలు పొందలేకపోయారు; పేదరికంలోనే మ్రగ్గారు. మాతృదేవి తన సోదరుల యోగక్షేమాలలో ఎంతో అక్కర చూపారు. దీనిని ఎరిగిన వారు కనుక వారందరూ పెరిగి పెద్దవారై పలువురు బిడ్డలకు తండ్రులయిన తర్వాత కూడా ప్రతి విషయయానికీ మాతృదేవి పైనే ఆధారపడ సాగారు. మామూలు ప్రాపంచిక వ్యక్తుల్లా అనురాగం అంటే వారికి డబ్బుతో కూడిందిగా మాత్రమే తోచింది. కాలాంతరంలో తమ బిడ్డలయిన భక్తులూ, శిష్యులూ పంపించే అనేక వస్తువులతోపాటు, డబ్బును అపహరించడంలోనే వారు శ్రద్ధ చూపారు. అందుకోసం పరస్పరం పోట్లాడుకుంటూ మాతృదేవికి అంతులేని ఆవేదన, ఇబ్బంది కలిగించారు.
మరదళ్లు
మాతృదేవి ఎల్లలెరుగని సహనంతో ఈ ఆవేదనల నన్నిటినీ ప్రశాంతంగా భరించారు. వారి జీవితాలు బాగుపడడానికి తమ శక్తిమేరకు డబ్బునూ, వస్తువులనూ ఇచ్చారు. జయరాంబాటిలో నివసిస్తున్న సమయంలో సోదరులందరి కుటుంబ ఖర్చులను తామే భరించారు. వారి ఇంటి పనులనన్నింటిని చేశారు. శ్యామసుందరి వృద్ధురాలు. అందువల్ల మాతృదేవి ఆమెను ఏ పనీ చేయనివ్వలేదు. ఆమె మరదళ్లు చిన్నవారు కాబట్టి సక్రమంగా ఇంటి పనులు చేసుకోవడం వారికి చేతకాలేదు. అందువల్ల ధాన్యం దంపడం మొదలు సోదరుల బిడ్డలకు స్నానాలు చేయించి, అన్నం తినిపించడం దాకా అన్ని పనులనూ మాతృదేవి చేసేవారు.
మరదళ్లు కూడా ఒకరికొకరు తీసిపోలేదు. వారందరిలో ఒక సామాన్యాంశం ఉంది – అది ఓర్వలేనితనం. మాతృదేవి భక్తులూ, శిష్యులూ తీసుకు వచ్చే కానుకలన్నీ తమకే చెందాలని పోటాపోటీలు, కొట్లాటలు. వారందేరిని తృప్తిపరచడానికి మాతృదేవి వహించిన సహనం వర్ణనాతీతం. “భూమి కున్నంత ఓర్పు మనకుండాలి, ఇతరుల దోషాలను సహించాలి, పురుషులు సైతం దీనిని పాటించాలి” అంటూ మాతృదేవి తరచు చెప్పేవారు. ఓర్పు హద్దులు మీరినప్పుడు, “ఒక బురద గుంటలో తామర పుష్పంలా జీవిస్తున్నాను” అనేవారు.
మాతృదేవి మనోపోరాటం
ఇలా అనడం మాత్రమే కాదు, ఈ లోకంలో వీరితో ఎందుకు ఇలా ఆవేదనపడుతూ ఉండాలంటూ నిజంగానే మాతృదేవి మనసులో కొన్ని సమయాల్లో ఒక పోరాటమే చెలరేగడం కద్దు. కామార్పుకూర్ రోజుల్లోనే గురుదేవులు, “నేను చెప్పిన మాటలన్నీ ఆమె వినే పక్షంలో ఇక ఆమె ఈ భూమ్మీద ఉండదు. రెక్కలు విప్పి ఎగిరిపోతుంది” అని చెప్పడం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడో, ఆయన చెప్పింది వినడమే కాకుండా, వాటిని అక్షరాల అనుసరించి సాధనలు చేసి, ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలు పొంది, ఆయన సాధనల ఫలాన్నంతా స్వీకరించి కృపాశక్తిగా నెలకొనివున్న ఈ స్థితిలో మాతృదేవి ఎలా ఈ లోకంలో జీవించగలరు? ‘ఈ లోకం సత్యం, దీనికి మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలు అనే సంబంధం వుంది; ఈ లోకం నుండి మనం కొన్నిటిని పుచ్చుకోవాల్సి వుంది, మనం కూడ కొన్నిటిని ఇవ్వాల్సి వుంది– ఇది అనుభవైకవేద్యం. ఇలా లోకాన్ని అంటిపెట్టుకొనివుంటున్న మనమే కొన్ని సమయాల్లో విరక్తి చెంది, ‘ఇదేం లోకం? ఇక్కడ నుండి వెళ్లిపోవాలి’ అంటూ వాపోతాం. అలా అయినప్పుడు, “ఈ లోకమే ఒక స్వప్నం, మనం జాగ్రదావస్థ అంటాం కదా అది కూడా స్వప్నమే. అమ్మాయీ! ఈ లోకంలో ఏమున్నది? సజావుగా ఉన్నదాన్ని ఒక్కటే ఒక్కదానిని చూపించు చూద్దాం!” అంటూ తమ అనుభవాన్ని అప్పుడప్పుడూ చెబుతున్న ఆత్మజ్ఞాని అయిన మాతృదేవి ఈ లోకంలో ఎలా జీవనం సాగింపగలుగుతారు? ‘నా మనస్సు రేయింబవళ్లు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొన తహతహలాడు తుంది. కానీ వీరందరిపైవున్న కరుణవల్ల మనస్సును బంధించి కింద ఉంచి వున్నాను. ఇందుకు నాకు లభించే ప్రతిఫలం? ఏవగింపులు, అమర్యాదలు మాత్రమే. ఇవన్నీ ఏమిటి? నేనేం చేస్తున్నాను? నా చుట్టూ ఎందుకు ఇలాంటి ఒక లోకాన్ని సృష్టించుకుంటున్నాను?’ అనే ఆలోచన అప్పుడప్పుడు మాతృదేవి మనస్సులో తీవ్రంగా మెదలేది.
యోగమాయ
గురుదేవుల నిర్యాణం తర్వాత కూడా ఇలాంటి మనోభావాన్ని మాతృదేవిలో చూశాం. అదృశ్యంగా తమతోపాటు ఉంటున్న గురుదేవులు అప్పుడు ఆమెకు ఒక దృశ్యం చూపించారు. అందులో ఎర్రటి దుస్తులు ధరించిన సుమారు పన్నెండేళ్ల బాలిక మాతృదేవి సమక్షంలో అటూ ఇటూ తిరగసాగింది. అప్పుడు గురుదేవులు కనబడి, “నువ్వు ఈ లోకంలో జీవించడానికి ఈమెను ఆలంబనంగా చేసుకో, పలువురు బిడ్డలు నిన్ను ఆశ్ర యిస్తారు” అని చెప్పారు. తమ జీవితంలో ఇలాంటి ఒక బాలిక ఈ ప్రాపంచిక జీవితంలో తనను కట్టివేయనున్నది అని ఈ దృశ్యం మాతృదేవికి తెలియజేసింది. కానీ వరుసగా పది సంవత్సరాలు తపోమయ జీవితం గడుపుతూ ఉన్నందువల్ల దీని ఆవశ్యకత మాతృదేవికి కలుగలేదు. ఇప్పుడు అలాంటి ఆవశ్యకత ఏర్పడింది. వెంటనే ఆ దృశ్యం కూడా ఆమె కళ్ల ముందు గోచరించింది.
ఒక వ్యక్తి మనస్సు పని చేయాలంటే అందుకు స్థూలమైన ఆలంబన ఒకటి అవసరం. భగవంతుడు కూడా లోకశ్రేయస్సు కోసం క్రిందికి దిగి వచ్చినప్పుడు అలాంటి ఆలంబన నొకదానిని కల్పించుకొంటాడు. అదే యోగమాయ. “నా మాయ వల్ల నేను అవతరిస్తాను”* అంటూ శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అవతరించేటప్పుడు భగవంతుడు కూడా మాయకు వశుడవుతాడు, మనం కూడా మాయ వశంలోని వారమే. రెండూ ఒకే విధమయిన బంధనమా? కానేకాదు. మన విషయంలో మాయ, అత్యంత శక్తివంతంగావుంటూ మనలను తనని పూర్తిగా వశంలో ఉంచుకొంటుంది. మనం తలచుకున్నా మాయ నుండి విడి వడడం అంత సులభమయిన పనికాదు. భగవంతుని విషయంలో మాయ ఆయన వశంలో ఉంటుంది; ఆయన ఈ లోకంలో ఆచరించవలసిన కార్యాల నన్నిటిని దాని మూలంగా పూర్తిచేసి తర్వాత మాయను వదలుకుంటాడు. అలా మాతృదేవి జీవితంలో వచ్చిన యోగమాయే రాధు.
నన్ను ఆవరించిన మాయ
మాతృదేవి చివరి తమ్ముడు అభయచరణ్ కుమార్తె రాధు. అభయ్ కల కత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్నప్పుడు, 1899 వ సం ॥ లో హఠాత్తుగా కలరా వ్యాధి సోకి మరణించాడు. అప్పుడు ఆతడి భార్య సుర బాల గర్భిణి. మరణశయ్యపై అభయ్ తన భార్యను, పుట్టబోయే బిడ్డను చూసుకోమని మాతృదేవి చేతులు పట్టుకుని విలపిస్తూ అభ్యర్థించాడు. ఇతర సోదరల కన్నా మాతృదేవికి అభయ్‌పై ఎక్కువ ప్రేమ. అందువల్ల తమ్ముని అభ్యర్థనను అంగీకరించారు. కొన్ని గంటలలో అభయ్ మరణించాడు. మాతృదేవి ఎంతో దుఃఖీంచారు. తమ్ముని మరణంతో ఆమె అనుభవించిన ఆవేదన కన్నా, చిన్నతనంలోనే ఒక బిడ్డకు తల్లియై ఆ బిడ్డ పుట్టడానికి మునుపే భర్తను కోల్పోయి వితంతువయిన సురబాలను చూసే ఆమెకు ఆవేదన ఎక్కువయింది. సులబాలకు ఏర్పడిన ఈ విపరీతం చూసి ఆమెను పెంచిన అమ్మమ్మ, అత్త ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. వరుసగా ఇన్ని దుఃఖాలకు గురియైన సురబాల స్థిమితంగా ఉండలేకపోయింది. ఆమెకు మతి చలించింది. ఈ పరిస్థితిలో 1900 ఫిబ్రవరిలో ఆమె ఒక ఆడ శిశువును ప్రసవించింది. ఆమె పేరు రాధారాణి. ముద్దుగా ‘రాధూ’ అని పిలిచేవారు. జీవి తంలో అత్యంత ముఖ్యమయిన సమయంలో భర్తను, తర్వాత తమ అమ్మమ్మను, అత్తను కోల్పోయిన దుఃఖంలో సురబాల దాదాపు పిచ్చిదయిపోయింది. ఇది చాలదన్నట్లు ఒక రాత్రి ఒంటరిగా వంటయింట్లోకి వెళ్లినప్పుడు, అక్కడ నిలబడి వున్న ఒక దొంగను చూసి అత్యంత దిగ్భ్రమ చెందింది. అప్పటికే మతి చలించిన ఆమె, ఈ సంఘటనతో ఇంకా మతిపోయి చివరకు పిచ్చిదయిపోయింది. పిచ్చి దానికి పుట్టిన బిడ్డను ఎవరు పోషిస్తారనేది పెద్ద సమస్య అయింది. మరణ సమయంలో తమ్ముడి కిచ్చిన మాటా, ప్రస్తుతం ఆతని భార్య అనాథగా పిచ్చి దానిగా తిరుగుతూ ఉండడమూ, ఆమెకు పుట్టిన బిడ్డను చూసుకొనేవారు లేకపోవడాన్నీ మాతృదేవి చూశారు. తమపైబడ్డ కొత్త బాధ్యతను గ్రహించారు. కానీ సురబాలనూ ఆమె బిడ్డ రాధూనూ పోషించడానికి కుసుమకుమారి అనే ఆమె ముందుకు వచ్చింది. ఆమెకు బాధ్యతను అప్పజెప్పి మాతృదేవి కలకత్తాకు పయనమయ్యారు.
కలకత్తా వెళ్లారే కానీ, అక్కడ మాతృదేవి ప్రశాంతంగా ఉండలేకపోయారు. చిన్నారి రాధూను కుసుమకుమారి బాగా చూసుకుంటుందో లేదో, పిచ్చిదయిన తల్లి బిడ్డను ఏం చేసేస్తుందో అనే ఆందోళన ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వ లేదు. అప్పుడు ఆమెకు ఒక దృశ్యం కనబడింది. మాతృదేవి ఈ దృశ్యం గురించి కాలాంతరంలో ఇలా చెప్పారు:
“ఒక రోజు సాయంత్రం నేను పూజ చేసుకుంటున్నాను. అప్పుడు నాటక రంగస్థలంలో తెరతీసినట్లు హఠాత్తుగా నా మనస్సు నుండి ఒక తెర తొలగి పోయింది. జయరాంబాటిలో చిన్నారి బిడ్డ అయిన రాధూను చూసుకునేవారు ఎవరూ లేకుండా నిస్సహాయ స్థితిలో ఉంది. ఆమె ఆకలికి కొన్ని బొరుగులు మాత్రమే ఇస్తున్నారు. లాలించేవారు లేకుండా ఆ చిన్నారి ఆ బొరుగులు తింటూ దుమ్ముధూళీలో పడివుంది. ఇక ఆ బిడ్డ తల్లి రకరకాల రంగుల గుడ్డలను చింపి చేతులకు కట్టుకుని తిరుగుతూన్నది. ఇతరుల పాపలు చక్కగా పెరుగుతున్నప్పుడు రాధూ ఈ దయనీయమైన పరిస్థితిని చూసి అప్పుడు నా తలను ఎవరో నీళ్లలో అదిమివుంచినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. నేనే స్వయంగా ఆ బిడ్డ బాధ్యతను తీసు కోకపోతే దాని గతి అంతే అని నాకు తెలిసింది.”
ఆ తర్వాత మాతృదేవి కలకత్తాలో ఉండలేకపోయారు. వెంటనే జయరాం బాటికి వెళ్లారు. అక్కడ ఆమె కళ్లార చూసింది అచ్చం తాను చూసిన దృశ్యమే! ‘తండ్రిని కోల్పోయింది, తల్లి పిచ్చిది, ఈ శోచనీయ స్థితిలోని బిడ్డను నేను తప్ప ఇంకెవరు పోషిస్తారు?’ అని అనుకుంటూ రాధూను తమ రెండు చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు గురుదేవులు కనబడి, “నువ్వు ముందు చూసిన బాలిక ఈమే. ఈమెను నువ్వు ఆధారంగా పట్టుకో. ఈమె యోగమాయ” అని చెప్పి అంతర్ధానమయ్యారు.
ఈ దృశ్యాన్ని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు: “ఆ క్షణంలోనే లోకాన్ని మోహింపచేసే మహామాయ నన్ను ఆవరించివేసింది.” అప్పటనుండి తమ జీవితాంతం వరకు, తామే ఆ మాయను వదలించుకునే దాకా, రాధూపట్ల ఆమె అనురాగం వర్ణనాతీతం. రాధూను వదలి ఉండడం ఆమె వల్ల కాదు. రాధూ వియోగాన్ని కూడా ఆమె భరించలేదు. రాధూ దగ్గర లేకపోతే ఆమె తినరు, నిద్రపోరు. బలమైన సంకెళ్లతో ఈ పిల్లతోనూ, తద్ద్వారా కుటుంబం వారి తోను మాతృదేవి బంధింపబడినవారిలా అయ్యారు.
రాధూ
రాధూ అందగత్తె. కల్లాకపటం లేని ఆమె స్వభావం అందరినీ ఆకట్టు కొనేది. ఆమె మాతృదేవిని ‘అమ్మా’ అంటూ పిలిచేది. సొంత తల్లిని ‘గుండుకొట్టు కొన్న అమ్మ’ అని పిలిచేది. ఎందుకంటే ఆ కాలంలో హిందూ ఆచారం ప్రకారం వితంతువైన సురబాల అప్పు డప్పుడు తల గుండు చేయించుకునేది. భక్తులు తెచ్చే పండ్లు, పదార్థాలు అన్నీ రాధూకే చెందినవని సురబాల భావించేది. వాటిని ఇతరుల కివ్వడం ఆమె కంట పడితే, “అదిగో మళ్లీ ఇచ్చేస్తూవుంది. రాధు భవిష్యత్తు ఏంకాను? రాధీ! వచ్చే సేయి! నీ అత్త ఇతరులకే అన్నీ ఇస్తుంది. నీ కంటూ ఏమీ కేటాయించదు. నువ్వెందుకు ఆమెతోపాటు ఉండాలి? రా! మన ఇంటికి వెళ్లిపోదాం!” అంటూ రాధూను తనవైపు లాగేది. కానీ రాధూకు ఇది నచ్చదు. ఆమె సురబాలను తిడుతూ మాతృదేవి వద్దకు వచ్చేసేది. సాధ్యమయినంతవరకు సులబాలకు దూరంగానే ఉండేది రాధు.
కాలం గడిచింది. రాధూ శరీరకంగా ఎదిగిందేగాని మానసికంగా పెరగ లేదు. లోకాన్ని అర్థం చేసుకోవడం, మంచి చెడ్డలు గ్రహించడం ఆమెకు మించిన పని. చటుక్కున కోపం ఉక్రోషం తెచ్చుకొనేది. విచిత్రమయిన ప్రవర్తన, దారికి రాని స్వభావం ఆమె సంతరించుకొంది. మాతృదేవి కురిపించిన అవ్యాజ ప్రేమ, ఆమె సుఖంకోసం పడిన ఆవేదనలూ కూడా ఆమె స్వభావాన్ని మార్చలేక పోయాయి. ఇది చూసి మాతృదేవి ఎంతగానో నొచ్చుకొన్నారు. ఒక రోజు ఎంతో ఆవేదనతో, “ఈ రాధూతో నేను పడుతున్న ఆవేదనను చూడు! గౌరీ తన అమ్మా యిని ఎంత చక్కగా పెంచింది! నేను కోతిలా పెంచాను!” అన్నారు. రాధూ కూడా మాతృదేవి పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. కానీ ఆమె పరంగా ప్రేమ అంటే మాతృదేవి నుండి సమస్త సదుపాయాలూ, మినహాయింపులూ పొందడం మాత్రమే! అందువల్ల మాతృదేవి పట్ల మర్యాద చూపక పలువురి సమక్షంలో అనుచితంగా ప్రవర్తించేది. ఎలాంటి కారణమూ లేకుండా విరుచుకుపడి శాపనార్థాలు ఏకరువు పెట్టేది. చేతికి ఏది అందితే దానిని తీసుకొని మాతృదేవి మీద విసిరివేయడం, ఆమెను తన్నడం, ఉమ్మడం చేసేది. ఏ వ్యక్తియైనా తన ఓర్పును కోల్పోయే రీతిలో నీచంగా ప్రవర్తించేది.
సురబాల
రాధూ తనకంటే మాతృదేవిని ఎక్కువగా ప్రేమించడం సురబాల భరించ లేకపోయింది. ఈర్ష్యతో కుమిలిపోయిన పిచ్చి మెదడు విచిత్రమైన ఊహలను అందుకు కారణంగా కనిపెట్టింది. ఈ ఊహలతో మాతృ దేవి ఏకాంతంగా ఉన్నప్పుడూ పలువురి సమక్షంలోనూ ఆమెను తిడుతూనే ఉండేది. పుట్టినప్పటి నుండి తరచు రుగ్మతలకు గురయ్యే రాధుకు మాతృదేవి మందు ఇచ్చేవారు. ఇది చూసిన సురబాల, “అయ్యో! నా బిడ్డను చంపడానికి మందులిస్తోంది” అంటూ కేకలుపెట్టేది.
రాధూకు వివాహమయిన పిదప ఒకసారి తన అల్లుడు బావిలో పడి చని పోయినట్లు ఒక ఆలోచన సురబాల మెదడులో దూరింది. “అయ్యో, అయ్యో!” అంటూ వాపోతూ ఇంట్లోని అందరితోనూ బావిలో పడివున్న తన అల్లుణ్ణి కాపాడవలసిందిగా అరుస్తూ నానాహంగామా చేసింది. మాట్లాడ కుండా ఉంటున్న అందరినీ, అందులోనూ ముఖ్యంగా మాతృదేవిని తిట్టేది. చివరకు తన అల్లుడు తన ముందు వచ్చి నిలబడేదాకా ఇంటిని నరకంలా చేసేసింది.
మరొకసారి ఆమె తన నగలను, రాధూ నగలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. డబ్బు పిచ్చి పుట్టిన ఆమె తండ్రి నగలను గుంజుకొని ఆమెను తరిమే శాడు. నగలు పోగొట్టుకున్న సురబాల తిన్నగా సింహవాహిని ఆలయానికి వెళ్లి, “నా నగలను ఇవ్వు” అంటూ దేవిని మొరపెట్టుకుని రోదించసాగింది. అప్పుడు మాతృదేవి ఇంట్లో కూర్చొనివున్నారు. ఆమె ప్రక్కన ఉన్నవారికి వినబడని ఆ విలాపం మాతృదేవికి వినబడింది, “నేను వెళ్లాలి, నేను వెళ్లాలి. ఆ పిచ్చిది సింహ వాహినిని హింస పెడుతూవుంది. పాపం! ఆమెకు నేను తప్ప ఇంకెవరున్నారు?” అంటూ తహతహతో ఆలయానికి పరుగున వెళ్లారు. ఆమెను ఊరడించి ఇంటికి తోడ్కొనివచ్చారు. కానీ సురబాల మాతృదేవినే నిందిస్తూ, “నువ్వే నా నగలను కాజేశావు” అంటూ కేకలు పెట్టసాగింది. అందుకు మాతృదేవి, “అవి చెత్త. అవి నా వద్ద వుండివుంటే ఎప్పుడో పారేసివుండేదానను” అన్నారు. ఎలాగో సురబాల నుండి సంగతి తెలుసుకున్న తర్వాత ఆమె తండ్రిని పిలిపించి నగలను తిరిగి ఇవ్వమని ఎంతగానో బ్రతిమిలాడారు. ఆ వృద్ధుడు ఇచ్చేటట్లుగా కనిపించలేదు. చివరకు కలకత్తా నుండి వచ్చిన మాతృదేవి శిష్యుడొకరు కొందరు పోలీసులతో వెళ్లి నగలను విడిపించుకుని వచ్చాడు.
ప్రతి రోజు ఈ పిచ్చామె వలన కలిగే వేదనను భరించలేక మాతృదేవి, “నేను పరమేశ్వరుని ముళ్లతో కూడిన బిల్వ పత్రాలతో పూజించానేమో! అందుకే వీరందరూ నన్ను ముళ్లుగా గుచ్చుతున్నారు” అనేవారు.
మాతృదేవికి భక్తులు సమర్పించే డబ్బూ, సంపదలూ అన్నీ చివరకు రాధూకే చెందుతాయనే ఆలోచన సురబాల మనస్సులో గాఢంగా పాదుకు పోయింది. అందువల్ల మాతృదేవి పేరిట శ్రీ శారదానంద స్వామి ఇల్లు కట్టి నప్పుడు ఆమె పొందిన ఆనందం వర్ణనాతీతం. అదే సమయంలో మాతృదేవి తమకు వచ్చే డబ్బునో, పండ్లు, గుడ్డలు మొదలైనవి మరెవరికైనా కొద్దిగా ఇస్తే వెంటనే కోపం ముంచుకొచ్చి ఇంటిని రణరంగంగా మార్చివేసేది. ఒకసారి కాశీలో మాతృదేవి దానం ఇవ్వడం చూచిన సురబాల ఆమెతో పోట్లాడింది. అప్పుడు మాతృదేవి ఎంతో ఓరిమితో, “నా స్వభావం చిన్న పాపాయి లాంటిది. లెక్కలు వేయడం నాకు సాధ్యమేనా? ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తాను” అన్నారు.
నీల మాధవుడు
డబ్బునే లక్ష్యంగా చేసుకొన్న సోదరులు, రాధు, సురబాల లాంటి పలు రకాలైన పిచ్చివాళ్లు, వీరితోపాటు తమ పినతండ్రియైన నీలమాధవుని కూడా, ఆయన చివరి రోజుల్లో మాతృదేవే చూసుకొన్నారు. నీలమాధవుడు వివాహం చేసుకోలేదు. ఒక ధనవంతుని ఇంట్లో వంటపని చేస్తూవచ్చిన ఆయనను వృద్ధాప్యంలో చూసుకోవడానికి బంధువు లెవ్వరూ ముందుకు రాలేదు. కాబట్టి మాతృదేవి ఆయనను తమ వద్దకు రప్పించుకొన్నారు. ఆయన అవసరాలన్నీ ఆమే స్వయంగా చూసుకొన్నారు. ఎక్కడి కైనా వెళ్లేటప్పుడు కొన్ని సందర్భాలలో ఆయనను కూడా తమతోపాటు తీసుకెళ్లే వారు. భక్తులు తమకోసం తెచ్చే పండ్లు, తీపి పదార్థాలు మొదలైన వాటిలో చాలా బాగున్నవాటిని ఆయనకు ఇచ్చేవారు. ఎవరైనా వారిస్తే, “ఆయన ఇక జీవించ బోయేది కొంతకాలమే. బాగా అనుభవించి కోర్కెలను తీర్చుకోనివ్వండి. నేను ఇంకా చాలాకాలం ఉండబోతున్నాను. ఇలా ఎన్నో నాకు వస్తూవుంటాయి” అనే వారు.
ఆయన ఉబ్బుస వ్యాధిగ్రస్థుడు. ఎన్ని చికిత్సలు చేయించినా వ్యాధి మాత్రం నయం కాలేదు. ఆయన అంతిమ క్షణాలు సమీపిస్తున్నప్పుడు మాతృదేవి మధ్యాహ్నం భోజనం కూడా మానుకొని ఆయన ప్రక్కన కూర్చున్నారు. భక్తులు వచ్చి వెంటనే అసంభావిత మేదీ జరగబోదని నచ్చజెప్పి ఆమెను భోజనానికి తీసు కెళ్లారు. మాతృదేవి వెళ్లి చప్పున ఏదో కాస్త తిని వచ్చారు. కానీ అంతలోనే అంతా అయిపోయింది. నీలమాధవుని చుట్టూ నిలబడివున్నవారి ముఖాల నుండి ఆ విషయం ఊహించుకున్న మాతృదేవి, “అలా అయితే ఆయన చనిపోయారా?” అని ఆవేదనతో అడిగారు. “భోజనం చేయి, భోజనం చేయి అంటూ నన్ను పంపించివేసి, ఆఖరి క్షణాలలో ఆయన ప్రక్కన ఉండకుండా చేశారే” అంటూ క్షోభిస్తూ, విలపించసాగారు. తర్వాత పూజగదికి వెళ్లి ప్రసాద పుష్పాలను తీసుకొచ్చి ఆయన ఛాతీపై వుంచి, ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించారు. ఈ సంఘటన కలకత్తాలో 1905 వ సం ॥ జరిగింది.
శ్యామసుందరి మరణం
మరుసటి సంవత్సరం మాతృదేవి తమ తల్లి శ్యామసుందరీ దేవిని కోల్పో యారు. ఒక పరిపూర్ణ జీవితం ఆమె గడిపింది. తన కుమార్తెను ‘అమ్మా’ అంటూ పిలిచే పిల్లలు లేకుండా పోతారేమో అంటూ ప్రారంభంలో ఆమెలో ఉన్న తపన ఈ రోజుల్లో పూర్తిగా తొలగి పోయింది. మాతృదేవి జయరాంబాటిలో జీవించ నారం భించిన కాలం నుండే భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి, మంత్రదీక్ష పుచ్చుకోవడానికి రాసాగారు. వారందరూ మాతృదేవిని ‘అమ్మా’ అనీ, తనను ‘అమ్మమ్మా’ అని పిలవడం విని శ్యామసుందరి ఎంతగానో మురిసిపోయారు. ‘నా మనవడు’. ‘నా మనవరాలు’ అంటూ ప్రతి ఒక్కరినీ లాలించేది. వారికి కావల సినవి సమకూర్చటంలో ఆమె పరమానందం పొందేది. ఎన్నడూ పనిలేకుండా ఉండేది కాదు. ఆవులను చూసుకోవడం, ఆవుల కొట్టాన్ని శుభ్రం చేయడం, పొలంలో పని చేసేవారికి భోజనం తీసుకెళ్లి ఇవ్వడం, వంట, ధాన్యం దంపడం అంటూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. ఏ పని చేస్తూవున్నా ఆమె ముఖాన చిరుమందహాసం ద్యోతకమయ్యేది. ఆమె దుఃఖంతో ఉండడమో, కోపగించుకోవడమో ఎవరూ చూసింది లేదు. ఎవరైనా ‘అమ్మమ్మా!’ అని పిలిస్తే చాలు ఆమె పరమానందం చెందేది. ఆఖరి రోజు కూడా ధాన్యం దంపారు. దుకాణానికి వెళ్లి కూరగాయలు కొని తెచ్చారు. హఠాత్తుగా వరండాలో ఒళ్లు తూలి కిందపడ్డారు. మాతృదేవి శిష్యుడు ఒకరితో “నాకు తల తిరుగుతూ ఉంది. ఆఖరి క్షణాలు వచ్చేసినట్లున్నాయి” అన్నారు. మాతృదేవీ, ఇతరులూ పరుగెత్తు కొంటూ వెళ్లారు. గుమ్మడికాయ పులుసు తినాలని తన కుమార్తెతో చెప్పారామె. అందుకు మాతృదేవి ఆరోగ్యం బాగుపడ్డాక చేసిపెడతానన్నారు. తర్వాత తాగ డానికి నీళ్లు అడిగారు. మాతృదేవి గంగాజలం ఇచ్చారు. దివ్యురాలైన కుమార్తె చేతుల నుండి పావన గంగాజలం సేవిస్తూ అట్లే కళ్లుమూశారు శ్యామాసుందరి. సామాన్యురాలిలా భోరున విలపించారు మాతృదేవి.
ఆస్తుల పంపకం
1906 వ సం ॥ శ్యామాసుందరి మరణానంతరం మాతృదేవికి ఇంటికి పెద్దగా ప్రతి పనీ చేయవలసిన నిర్బంధ బాధ్యత ఏర్పడింది. అందుకు తోడు సోదరులకు కూడా పిల్లలు పుట్టినందువల్ల ప్రతి ఒక్కరి కుటుంబమూ పెద్దదయింది. సహజంగానే స్వార్థపరులైన వారందరి కోర్కెలూ, స్వార్థమూ పిల్లలు పుట్టిన తర్వాత మరింత అధికరించింది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇవ్వసాగారు. దాంతో మనస్తాపాలు, కలహాలు పెచ్చుపెరిగిపోయాయి. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు కరవయ్యాయి.
తొలుత సామాన్యంగా ఉన్న ఈ గృహకలహాలు రోజులు గడిచేకొద్దీ దైనందిన కార్యకలాపంగా మారిపోయాయి. ప్రతి చిన్న పనికీ మాతృదేవి సోదరులు కొట్లాటకు దిగసాగారు. మాతృదేవి ఎంతగానో నచ్చచెప్పారు. ఇక ఆవేమీ పని చేయకపోయినప్పుడు ఆస్తి పంపకాలు జరిపి, విభక్త కుటుంబాలుగా చేయాలని తీర్మానించారు. అందుకోసం జాబు వ్రాసి కలకత్తా నుండి శ్రీ శారదానంద స్వామిని రావించారు.
స్వామి శారదానంద 1909 మార్చి 23వ తేది జయరాంబాటికి వచ్చారు. ఇలాంటి కుటుంబంలో అంత సులభంగా ఆస్తి పంపకాలు జరుగుతాయా? లోకం పోకడనూ, వ్యక్తుల స్వభావాన్నీ చక్కగా ఎరిగిన స్వామి శారదానంద లాంటి వారే ఎలాంటి సమస్యా లేకుండా ఇటువంటి పని చేయగలుగుతారు. ఈ విషయం తెలిసే మాతృదేవి ఆయనను పిలిపించారు. ఆయన కూడా మాతృదేవి పిలుపును ఆశీస్సులుగా తీసుకున్నారు.
మహాత్ములు ఒక సమస్యను ఎదుర్కొనే తీరే భిన్నంగా ఉంటుంది. జయరాంబాటికి వచ్చి స్వామి శారదానంద వెంటనే ఆస్తుల పంపకం ప్రారం భించలేదు. అందుకు బదులుగా చాలాసేపు మాతృదేవి సోదరులతో గురుదేవులను గురించి మాట్లాడారు; తాను అప్పుడు ప్రచురించనున్న స్వామి వివేకానందుల జ్ఞానయోగం పని కూడా చేయసాగారు. అదే సమయంలో ఆ కుటుంబ వ్యక్తుల ప్రవర్తనను కూడా గమనించారు. విషయం కొంతవరకు తెలుసుకున్న తర్వాత శారదానంద అసలు పని మొదలుపెట్టారు.
ఆ పని మొదలుపెట్టడమే ఆలస్యం, పోట్లాటలు మొదలయ్యాయి. ఒక రోజు ఈ పోట్లాట తారస్థాయికి చేరింది. ఆ స్థలానికి సంబంధించిన దస్తావేజులు కాళీ అధీనంలో ఉన్నాయి. ప్రసన్న ఆ దస్తావేజులపై తనకు కూడా సగం హక్కు ఉందంటూ వాటిని కాళీ చేతుల నుండి లాగుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య పోట్లాట మొదలయింది. వెంటనే స్వామి శారదానంద వారి మధ్య జొరబడి ఇద్దరినీ రాజీ పరచారు. ఇన్ని పొట్లాటలూ, మనస్తాపాలకూ మధ్య అందరూ అంగీకరించేలా ఆయన ఆస్తి పంపకం చేశారు. ఇంత గందరగోళం మధ్య కూడా మాతృదేవి కనబరచిన ప్రశాంతత స్వామి శారదానందను ఎంతగానో అబ్బురపర చింది. ఆయన ఒక బ్రహ్మచారితో, “చూడు, వీరందరి పోట్లాటలతో మనం సహ నాన్ని కోల్పోతాం. మాతృదేవిని చూడు! సోదరులు ఎన్నెన్ని సమస్యలు సృష్టిస్తు న్నారో! కానీ ఆమె ఒకింతైనా ప్రశాంతతను కోల్పోయారా! ఎలాంటి సమతా స్థితి! ఎలాంటి ప్రశాంతత!” అని అన్నారు.
ఆస్తుల పంపకం ముగిసిన తర్వాత మాతృదేవిని, “ఇకమీదట మీరు ఎక్కడ ఉంటారు?” అని అడిగారు. అందుకు మాతృదేవి, “ ‘ఎలుకలు చేసిన కలుగు లలో పాములు వాసం చేస్తాయి’ అనేవారు గురుదేవులు. నా కంటూ ప్రత్యేకంగా ఒక ఇల్లు ఎందుకు? ప్రసన్న ఇంట్లోనో, కాళీ ఇంట్లోనో కాలం గడుపుతాను” అన్నారు. ఆమెకోసమంటూ ప్రత్యేకంగా 1915 వ సం ॥ ఒక ఇల్లు కట్టేదాకా జయరాంబాటికి వచ్చినప్పుడల్లా మాతృదేవి ప్రసన్న ఇంట్లోనో, కాళీ ఇంట్లోనో నివసించేవారు. కానీ ప్రసన్న ఇంట్లో నివసించడాన్నే అలవాటుగా చేసుకున్నారు. ఎందుకంటే నళిని, మాకు అనే ఇద్దరు కుమార్తెలను వదలిపెట్టి ప్రసన్నుని భార్య కళ్లుమూసింది. ప్రసన్న సువాసినిని పునర్వివాహం చేసుకున్నాడు. ఆమె వయ స్సులో బాగా చిన్నదయినందున ఆ ఇద్దరు ఆడపిల్లలను చూసుకోలేకపోయింది. తల్లిని కోల్పోయిన ఆడిపిల్లలను పెంచే బాధ్యతను చేపట్టి మాతృదేవి ప్రసన్న ఇంట్లోనే నివసించసాగారు.
ఆస్తి పంపకం జరిగాక సోదరుల మధ్య మైత్రీభావం పెంపొందిందా అంటే, లేదనే చెప్పాలి. ఎందుకంటే వారందరికీ అత్యంత అమూల్యమైన ఆస్తిగా మాతృదేవి ఉండడమే. ఆమె నుండి ఒకరు ఎక్కువ సహాయం పొందడమో, లేక పోతే అలా సహాయం పొందినట్లు ఊహించుకోవడం వల్లనో పోట్లాటలు కొన సాగుతూనే వచ్చాయి. దాంతో మాతృదేవి పొందిన ఆవేదన ఇంతా అంతా అని చెప్పలేం. అలాంటి సంఘటనలను కొన్నిటిని పరికిద్దాం.
ఒకసారి మాతృదేవి కొందరి శిష్యులతో జయరాంబాటికి వచ్చారు. ఆమోదర్ నది వద్దకు వచ్చి, తమ నందరిని నదిని దాటించి తీసుకురావలసిందని సోదరులకు కబురు పంపారు. కానీ ఎవరూ రాలేదు, ఎవరినీ పంపలేదు కూడా. క్రమంగా చీకటి పడసాగింది. అది చూసిన శిష్యుడొకడు, “అమ్మా! మీ సోదరులను చూశారా! మీరు వస్తున్నారని తెలిసి కూడా ఒక్కరిని కూడా పంపలేదే!” అన్నారు. మాతృదేవి ఇంటికి వెళ్లిన తర్వాత తనను చూడవచ్చిన సోదరులతో, “నేను ఎంత దూరం నుండి వస్తున్నాను! నా బిడ్డలు కూడా నాతో వస్తున్నారు. ఏరు దాటి కదా మేము రావాలి! మీరు రాలేకపోయారు, ఒక మనిషిని పంపి వుండవచ్చు కదా!” అన్నారు. అందుకు ప్రసన్న, “అక్కయ్యా! కాళీకి భయపడే నేను రాలేదు. నేను వస్తే నీ దగ్గర డబ్బు లాక్కొనడానికే ఇలాంటి పనులు చేస్తున్నానని అపోహపడతాడు. నువ్వు ఒక అమూల్యమైన సంపద అని నాకు తెలియదా? అయినా నేను నిస్సహాయుణ్ణి. అక్కయ్యా! ఇక రాబోయే జన్మలలో కూడా నేను నీ సోదరునిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు” అన్నాడు. అందుకు మాతృదేవి, “మళ్లీ మీ కుటుంబంలోనా! అలా కలలు కనకు! ఇప్పుడు జన్మించి నేను పడుతున్న ఆవేదన చాలదా? మళ్లీ మీ సోదరిగా జన్మించడమా! వద్దే వద్దు. నేను మీ కోసమా ఈ కుటుంబంలో జన్మించాను? కానే కాదు. నా తండ్రి గొప్ప రామభక్తుడు. నా తల్లి కరుణాస్వరూపిణి. వారి కోసమే ఈ కుటుంబంలో జన్మించాను” అన్నారు.
ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరులను గురించి మాతృదేవి ఒకసారి, “వీరందరూ ఎలాంటి జన్మలు? సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూంటారు. కాని భక్తి కావాలి. జ్ఞానం కావాలి అనే ఆలోచన కూడా వారికి రాదు!” అంటూ ఎంతో కలవరపడ్డారు. అప్పుడు శిష్యుడొకడు, “అమ్మా! గురుదేవులను ప్రార్థించి వారికి కావలసిన డబ్బు లభించేలా చేయవచ్చు కదా!” అన్నాడు. అందుకు మాతృదేవి, “నాయనా! వారి కోర్కెలు తీరేవేనా? ఇస్తూవుంటే అడుగుతూనేవుంటారు. వారి కోర్కెలకు అంతు లేదు. ప్రాపంచికులకు తృప్తి అనేది ఉందా ఏమిటి?” అన్నారు.
కానీ ఒకసారి ఎలాగో పొరపాటున భక్తి, జ్ఞానం కావాలనే ఆకాంక్ష కాళీకి రానే వచ్చింది. కానీ వచ్చిన వేగంతోనే అది ఎగిరిపోయింది. ఆ సంఘటన ఇలా జరిగింది: మాతృదేవిని దర్శించుకోవడానికి గిరీశ్ జయరాంబాటికి వచ్చాడు. ఆయన కాళీతో, “ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహారాజ్ఞి అయిన మాతృదేవిని సోదరిగా పొందిన తర్వాత కూడా డబ్బు డబ్బు అంటూ ప్రాకులాడడం ఎంతో శోచనీయం” అన్నారు. కాళీకి కూడా వెంటనే ఏదో స్ఫురించింది. వెంటనే వెళ్లి రెండు చేతులూ జోడించి అత్యంత భక్తిభావంతో మాతృదేవికి ప్రణమిల్లాడు. మాతృదేవికి ఆతడి మనోస్థితి బాగా తెలుసు కాబట్టి, “కాళీ! ఏమిటి ఇదంతా? నేను గురువునూ కాను దేవిని కూడా కాను; నీ అక్కయ్యను, అక్కయ్యనే, లే!” అన్నారు. కాళీకి ఈ మాటలు బాగా తృప్తి నిచ్చాయి. ఆ సంఘటనకు తర్వాత ఆతడెప్పుడూ ఆధ్యాత్మికతా అదీ ఇదీ అంటూ ఆలోచించిన పాపాన పోలేదు.
ఒక రోజు ఉదయం దాదాపు పది గంటలు. మాతృదేవి వసారాలో కూర్చొని ఉన్నారు. కాళీ వేసిన ఒక కంచె గురించి వరదునికి, ఆతనికి మధ్య పోట్లాట వచ్చింది. ఇద్దరూ కొట్టుకోసాగారు. మాతృదేవి లేచి వెళ్లి వారిని విడదీశారు. కానీ వాళ్లు ఆగలేదు. మాతృదేవి కోపంతో ఇద్దరినీ చీవాట్లుపెట్టారు. కాని వారు దానిని పెడచెవినిపెట్టి తీవ్రంగా పోట్లాడసాగారు. మాతృదేవి శిష్యుడు ఒకరు, మరికొందరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఆ తరువాత ఇద్దరూ తమ ఇళ్లకు వెళ్లి అక్కడ నుండే పరస్పరం తిట్టుకోసాగారు. మాతృదేవి కూడా ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్లి కూర్చొని బిగ్గరగా నవ్వసాగారు. నవ్వుకుంటూనే, “ఆహా! మహామాయ విచిత్రాన్ని ఏమనాలి? ఎంతో కాలంగా ఈ భూమి వినాశం కాకుండా ఉంది. మరణం వచ్చేటప్పుడు ఒక వ్యక్తి దీన్లో నుండి ఒక్క అణువు కూడా తనతో తీసుకెళ్లలేడు. ఈ సామాన్య సత్యాన్ని కూడా తెలుసుకోకుండా పోట్లాడుకొంటున్నారే! ఏం వింత ఇది!” అంటూ చాలాసేపు పగలబడి నవ్వుతూనే ఉన్నారు. ఆమె నవ్వును ఆపుకోలేకపోయారు.
సోదరులందరూ డబ్బుకోసం మాతృదేవిని పీల్చి పిప్పి చేశారు. ఇందులో కాళీ వల్ల కలిగిన ఆవేదనలే ఎక్కువ. మంచి శరీరదార్యంతో, చూసేవారు జంకే లాంటి రూపం గలవాడు కాళీ. ఆతనికి కోపం వచ్చిందంటే కళ్లు ఎర్రబారు తాయి. హా హూ అంటూ భయంకరంగా అరుస్తాడు. కుటుంబంలో అందరూ ఆతణ్ణి చూసి భయపడతారు. ఆతనికి ధనాశ కూడా విపరీతం. జగద్ధాత్రీ పూజ, గురుదేవులు లేక మాతృదేవి జన్మదినం లాంటి పండుగలలో ఏది జరిగినా బాధ్యతలన్నీ ఆతనికే అప్పగించాలి. ఎందుకంటే ఖరీదు చేసే ప్రతి వస్తువు నుండీ కొంత వెనుకవేసుకొంటాడు; అందు మూలంగా మంచి రాబడి. ఎవరైనా ఆతనికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఇక అంతే. అన్నిటిని చెల్లాచెదరు చేసి, ఉత్సవమే జరగ కుండా చేసేస్తాడు. లేకపోతే మాతృదేవి మనస్సు నొచ్చుకొనేలా ఏదైనా చేస్తాడు. ఒకసారి ఒక ఉత్సవంలో ఇలాగే ప్రవర్తించాడు. పైగా ఆ రోజంతా ఏమీ తినలేదు. దాంతో మాతృదేవి కూడా ఉపవాసం చేయాల్సి వచ్చింది. ఇలాంటి గందరగోళం జరగకుండా ఉండడానికి, ఉత్సవం అంటూ వస్తే దాని బాధ్యతను కాళీకి అప్పగించేస్తారు మాతృదేవి. ఆతడు చేసేదాన్లో ఇతరులు తప్పులు పట్టకుండా జాగ్రత్తపడేవారు.
ఇంటికి సమీపంలో ముగ్గురు సోదరులకూ చెందిన ఒక స్థలం ఉంది. మాతృదేవి అక్కడే జన్మించారు. మాతృదేవి పుట్టిన ఆ స్థలంలో ఒక గుర్తుగా ఒక రాయిని నాటాలనుకొన్నారు కొందరు భక్తులు. అందుకోసం రాళ్లను చదునుచేసి తీసుకొచ్చారు. కానీ సోదరులందరూ ఆ స్థలంపై తమకున్న హక్కును వదలుకోవ డానికి ఇష్టపడలేదు. అందువల్ల ఆ భక్తులు ఆశించింది జరగలేదు. వాళ్లు తీసు కొచ్చిన రాళ్లు కూడా అలాగే పడివున్నాయి. అప్పుడు జయరాంబాటికి వచ్చిన నారాయణ అయ్యంగార్ ఆ చోట మాతృదేవి సౌకర్యం కోసం ఒక బావిని త్రవ్వా లని అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాళీకుమార్ ఆ స్థలంలో తనకు వచ్చే చిన్న వాటాకు చాలాడబ్బు కాజేయాలని పన్నాగం పన్నాడు. కానీ అది జరగ లేదు. తర్వాత ఆ చోటును శ్రీ శారదానంద స్వామి మాతృదేవి సోదరులకు పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. తర్వాత ఆ చోట ఒక బావిని త్రవ్వారు.
రాత్రింబవళ్లు సోదరుల కుటుంబాలకు ఇలా మాతృదేవి పనులు చేయడం చూసిన గిరీశ్ ఒకసారి, “మన మందరమూ మాతృదేవిని జగన్మాతగా ఆరా ధిస్తాం. కానీ ఆ దేవి తమ సోదరులకు ఉదయం నుండి రాత్రి వరకు నిర్విరా మంగా పని చేయడం చూస్తూవుంటే పూర్వజన్మలలో వీరందరు మాతృదేవి కోసం కుటుంబ పెద్ద ఎన్ని కఠోరమైన తపస్సులు చేశారో అనిపిస్తుంది. అందుకే ఇలాంటి మాతృదేవిని తమ సోదరిగా పొందారు” అని వ్యాఖ్యానించాడు.
మాతృదేవి పడిన కష్టాలు ఇంతటితో ఆగిపోయాయా అంటే లేదు. ప్రసన్న కుమార్ ఇద్దరు కుమార్తెలు నళినీ, మాకూ తమ వంతుగా మాతృదేవికి శక్తి మేరకు కష్టాలు కల్పించారు. వీరు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వారు. అందువల్ల వీరి బాధ్యతలను కూడా మాతృదేవి తీసుకొన్నారు. నళిని ప్రతి విష యానికీ ఆచారం ఆచారం అంటూ తనను హింసించుకుంటూ మాతృదేవిని కూడా హింసించసాగింది. అందుతోపాటు తనకు పూర్తిగా నచ్చని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే నిర్బంధానికి లోనయింది. తనను పోషించలేని ఒక పేదవానికి భార్య అయింది మాకూ! అందువల్ల వీరిద్దరూ వివాహానంతరం తర్వాత కూడా మాతృదేవి దయను ఎదురుచూస్తూనే జీవనం గడపాల్సి వచ్చింది. తక్కిన మువ్వురు సోదరుల పిల్లలు కూడా మాతృదేవి చూపించిన అవ్యాజప్రేమకు ముగ్ధులై తమ పితరులను మరచిపోయి మాతృదేవి చెంతనే ఉండసాగారు. వీరు జయరాంబాటిలో మాత్రమే కాకుండా మాతృదేవి కలకత్తాకు వెళ్లినప్పుడూ ఆమె వెంట వెళ్లేవారు. సోదరుల ధనాశ, స్వార్థం, సోదరుల పిల్లలు ఒకరిపట్ల ఒకరు పెంచుకున్న ఈర్ష్య, ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలనే నళిని ఆచార పిచ్చీ, రాధు పెట్టే సణుగుడు, సురబాల పిచ్చి – ఇవన్నీ కలిసి మాతృదేవికి ఎనలేని ఆవేదన లను కలిగించాయి. సహింపజాలని ఇలాంటి పరిస్థితులలో కూడా మాతృదేవి మనస్సులో కలవరమో, వెగటో చెందక అత్యంత ఓర్పుతోనూ, కరుణతోనూ అన్ని దుఃఖాలనూ భరించారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రశాంతమయిన జీవితం గడపడం సాధ్యమా అనేది ప్రశ్నార్థకమయినప్పుడు, అలాంటి జీవితం చేపట్టి చూపించడం మాత్రమే కాకుండా, తమను ఆశ్రయించిన వేలాది భక్తులకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక పరమానందాన్ని ధారపోశారు మాతృదేవి. కుటుంబ పెద్దగా మసలుతూ, ఆమె గృహస్థులకూ, సన్న్యాసులకూ గురుదేవిగా వ్యవహరిస్తూ, వారిని పురోగమింప చేయడాన్ని ఇప్పుడు చూద్దాం.