ఆవేదన
తల్లితండ్రులు, బిడ్డలు, సోదరుడు వంటి బాంధవులకు ప్రత్యామ్నాయంగా మరొకరిని చూపవచ్చు. కానీ ‘భర్తను కోల్పోయిన ఒక స్త్రీకి ఇంకొకరిని చూపించలేం.’ ఆమె దుఃఖాన్ని కూడా ఎవరూ ఉపశ మింపచేయలేరు. భర్తను కోల్పోయిన మండోదరి పరి స్థితిని ఒక కవి వర్ణిస్తూ, ఆమె రావణుని జ్ఞాపకమే చేసుకోలేదని అన్నాడు. ఎందుకంటే మరచిపోతేనే కదా జ్ఞప్తిలోకి తెచ్చుకోవడానికి! ఆతణ్ణి ఆమె మరవ లేదు, ఎందుకంటే జ్ఞాపకం అనే ఒకటి లేకుండా మరచిపోవడమనే మాటే రాదు కదా! పాతివ్రత్యంతో ఒక స్త్రీ జీవితం ఇలా భర్తతో తాదాత్మ్యం ఏర్పరచుకోవడ మవుతుంది; భర్తను కోల్పోతే వారి జీవితం అస్తమిస్తుంది. ఇలాంటి పరిస్థితిలోనే మాతృదేవి ఉన్నారు. అంతంలేని ఆమె దుఃఖానికి ఒకింత ఉపశమనం కలుగు తుందని భక్తులు ఆమెను తీర్థయాత్రకు పంపాలని తీర్మానించారు. గురుదేవులు కూడా తమ చివరి రోజుల్లో మాతృదేవితో, “నేను చూడని పుణ్యక్షేత్రాల నన్నింటిని నువ్వు దర్శించిరా” అని చెప్పివున్నారు. దీనిని కూడా మనసులో ఉంచుకుని భక్తుల సలహాను మాతృదేవి ఆమోదించారు.
తీర్థయాత్ర
ఎక్కడ ప్రజలు భగవత్సాక్షాత్కారం కోసం దీర్ఘకాలం తపస్సు, ధ్యానం, ప్రార్థన, పూజ మొదలైనవి అనుష్ఠిస్తారో అక్కడ భగవంతుని ఉనికి ఎక్కువగా అనుభూతమవుతుంది. అందువల్ల అక్కడ ఆధ్యాత్మిక జాగృతీ, భగవత్సాక్షాత్కారమూ అలవోకగా లభిస్తాయి. భగవదనుభూతి పొందాలనే ఆలోచనతో ఎంతో కాలంగా ఎందరెందరో సాధు వులు, భక్తులు, మహాత్ములు ఈ స్థలాలకు వేంచేసి తమ కోర్కెలను పరిత్యజించి, హృదయం ద్రవించి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ‘భగవంతుడు సర్వవ్యాపి అయినా, ఆయన ఉనికి తీర్థ స్థలాలలో అధికంగా అభివ్యక్తమవుతుంది. భూమ్మీద ఎక్కడ తవ్వినా నీళ్లు లభిస్తాయి. కానీ బావి, కొలను, నది లాంటి చోట్లలో మరింత సులభంగా లభిస్తుంది కదా! అనేవారు గురుదేవులు. అందువల్ల ఆధ్యా త్మిక సాధకుల జీవితంలో తీర్థయాత్ర ప్రముఖ స్థానం వహిస్తుంది. కానీ గురు దేవులు, మాతృదేవి లాంటి అవతారమూర్తులు కూడా తీర్థయాత్రలను సేవించడం చూస్తున్నాం. వారి లక్ష్యమే వేరు. మాతృదేవి విషయంలో ఈ తీర్థయాత్ర ఆమె మనస్సుకు స్వాంతన కలిగించడానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రగాఢతలో మగ్నులైపోవడానికి కూడా ఉపకరిస్తుంది. ఎందుకంటే అప్పుడు మాతృదేవి మన స్సును గురుదేవుల జ్ఞాపకాలు మాత్రమే పూర్తిగా ఆక్రమించి ఉన్నాయి కనుక. లౌకిక విషయాల పట్ల ఎలాంటి అనురక్తీ లేకపోయింది. అందువల్ల ఆమె జీవి తంలో ఆత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలను ఈ కాలఘట్టంలో మనం చూడ గలుగుతాము.
మాతృదేవి తీర్థయాత్రకు మరొక ముఖ్య కారణం కూడా ఉంది. వారి లాంటి మహనీయులు వెళ్లడం వల్ల తీర్థ స్థలాలు పుణ్యం సంతరించుకొంటాయి. తీర్థస్థలాలకు ఆ మహత్వాన్ని కల్పించేది అలాంటి వారే.* భగవంతునిలోనే లయించి జీవించే ఇలాంటి వ్యక్తులు వెళితే ఆ చోట దైవశక్తి కేంద్రీకృతమవు తుంది. అక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించే వారికి సత్వరమే సత్ఫలి తాల నివ్వడానికి దోహదమవుతుంది. సామాన్యంగా మహాత్ములందరి జీవితా ల్లోనూ తీర్థయాత్ర ఒక ప్రథాన అంశంగా నెలకొనడం మనం చూడవచ్చు. ఆహ్లా దంగా వీచే మందమారుతం మనం కోరకుండానే మన శరీరాలను స్పృశించి మనకు నూతనోత్సాహాన్ని కలిగించేటట్లు, ఈ మహాత్ములు తీర్థయాత్ర మూలంగా ఇలా మానవాళికి శ్రేయస్సు కలుగజేస్తున్నారు.
మాతృదేవి బృందావనం వెళ్లేట్లుగా తీర్మానించారు. గురుదేవుల ఎడబాటుతో దుఃఖీస్తున్న మాతృదేవి కృష్ణుని ఎడబాటుతో రాధ తపించిపోయిన ఆ స్థలానికి వెళ్లడం సమంజసమే. గురుదేవుల నిర్యాణం తరువాత పదిహేను రోజులకు, అంటే 1886 ఆగస్టు 30 వ తేది మాతృదేవి బయలుదేరారు. ఆమెతోపాటు గోలాప్ మా, లక్ష్మి, మహేంద్రుని భార్య, యోగిన్, కాళి, లాటూలు వెళ్లారు.
కాశీలో
బృందావనానికి వెళ్లే దారిలో ముందుగా దేవఘర్లో వైద్యనాథ శివుని దర్శించి, తర్వాత సువర్ణమయ క్షేత్రంగా పురాణాలు కీర్తిస్తున్న కాశీక్షేత్రం చేరుకున్నారు. సుమారు పది రోజులు అక్కడ బస చేసి, కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణను ఆరాధించి, ఆనందిం చారు. వేణీ మాధవ ఆలయ గోపురంపై కెక్కి కాళీ మహానగర పూర్తి అందాన్ని చూసి మాతృదేవి శ్లాఘించారు.
తీర్థయాత్ర కాలంలో మాతృదేవిలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితులు జనించాయి. సామాన్యంగా పారవశ్య స్థితులలో ఆమె నెలకొన్నారు. ఒక రోజు కాశీ విశ్వనాథ ఆలయంలో సంధ్యాహారతి దర్శిస్తున్నప్పుడు అత్యున్నత పారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. తిరిగి వచ్చేటప్పుడు మామూలుగా కాకుండా అమిత వేగంగా అడుగులు వేస్తూ నడిచారు. తర్వాత అందుకు కారణం అడిగినప్పుడు, “ఆలయం నుండి నేను తిరిగి వచ్చేటప్పుడు గురుదేవులు నా చేయి పట్టుకుని తీసుకువచ్చారు” అన్నారు ఆమె.
ఒక రోజు కాశీలో వసిస్తున్న మహాత్ముడు భాస్కరానంద స్వామిని అందరూ దర్శించారు. ఈ విషయంగా మాతృదేవి ఇలా చెప్పారు: బృందావనం వెళ్లే దారిలో భాస్కరానంద స్వామిని దర్శించాను. గురుదేవుల నిర్యాణ శోకంతో ఉన్న రోజులవి. నేను చూసినప్పుడు ఆయన దిగంబరులై ఉన్నారు. కానీ అది ఆయ నలో ఎలాంటి శారీరక స్ఫురణనూ కలిగించలేదు. మమ్మల్ని చూడగానే, “ఓ అమ్మలారా! సంకట పడకండి. నేను మీలో ఆ జగజ్జననినే చూస్తున్నాను” అన్నారు. ఆహా! ఎంతటి మహనీయుడు! ప్రాపంచిక జ్ఞాపకాలన్నిటికి అతీత స్థితి ఆయనది. వేసవిలోనూ, చలిలోనూ ఒంటి మీద గుడ్డలు లేకుండా సమస్థితిలోనే జీవించారు.”
తర్వాత అందరూ శ్రీరాముడు జన్మించిన అయోధ్యా నగరం మీదుగా బృందావనానికి బయలుదేరారు. దారిలో హఠాత్తుగా మాతృదేవికి గురుదేవుల దర్శనం కలిగింది. గురుదేవులు నిష్క్రమించడానికి కొన్ని రోజులకు ముందు, ఇష్టదైవ మంత్రం వ్రాయబడిన బంగారు తాయెత్తును మాతృదేవికిచ్చారు. మాతృ దేవి దాన్ని ప్రతి రోజు పూజలో ఉంచి ఆరాధించిన పిదపే తమ చేతికి కట్టుకునే వారు. బృందావనానికి రైలులో వెళ్లేటప్పుడు కిటికీ ప్రక్కన కూర్చొని, తాయెత్తు కట్టుకున్న చేతిని కిటికీ మీద ఉంచి దానిమీద తలవాల్చి నిద్రపోతున్నారు. అప్పుడు గురుదేవులు కనబడి, “నా తాయెత్తు నీ దగ్గర ఉంది. అది తొలగి పోకుండా జాగ్రత్తపడు” అన్నారు. మాతృదేవి వెంటనే మేల్కొని, తాయెత్తును విప్పి, తాము ప్రతిరోజూ పూజించేందుకు తమతో తీసుకొస్తున్న గురుదేవుల ఛాయాచిత్రం ఉంచిన చిన్న పెట్టలో ఉంచుకున్నారు. ఆ తర్వాత తాయెత్తును కట్టుకోలేదు. కాలాంతరంలో ఈ తాయెత్తును బేలూరు మఠానికి ఇచ్చేశారు.
బృందావనంలో
భక్తి పారవశ్యం ఇప్పటికే తరగని ఊటగా పొంగుతూవున్న పావన భూమి బృందావనం. వేలాది సంవత్సరాలు దొర్లిపోయినా, భక్తుల మనస్సులలో ఇప్పటికీ హత్తుకుపోయిన శ్రీకృష్ణుడు తన బాల్యంలో గావించిన దివ్యలీలల ప్రదేశం అది. “ఇలాంటి భక్తిని లోకం కనీవినీ ఎరుగదు (అలాంటి భక్తి కృష్ణుని పట్ల పెంచుకున్న) గోపికలకు నమస్కారం.”* అంటూ కాలాంతరంలో భక్తులు కీర్తించిన గోపికలూ, కృష్ణుడూ లీలలు సలిపిన స్థలమది. గోపికల నాయకురాలూ, భక్తికి పరాకాష్ఠా అయిన రాధ, కృష్ణుని పట్ల ఉన్నతమైన ప్రేమ, కృష్ణుని విరహంతో కన్నీళ్లతోటి భక్తిపారవశ్యంతో నిండిన చోటు ఇది. అందువల్లనే ఏమో, ఇప్పుడూ ఇక్కడ వసిస్తూన్న సాధువులూ, భక్తులూ పరస్పరం కలుసుకున్నప్పుడు కృష్ణుని పేరు చెప్పకుండా ‘రాధే రాధే’ అంటూ పలుకరించుకొంటారు. తపాల మనిషి ‘రాధే రాధే’ అంటూ తలుపులు తడతాడు. రిక్షావాడు ‘రాధే రాధే’ అంటూనే పక్కకు తప్పుకోమంటాడు. గోడల మీదా, దీపస్థంభాల మీదా ‘రాధే రాధే’ అనే వ్రాతలే కనబడతాయి. ఇంతెందుకు? అక్కడి చెట్ల కొమ్మలు గాలికి ఊగేటప్పుడూ, ఆకులు గాలికి ఊగేటప్పుడూ ‘రాధే రాధే’ అంటున్నట్లుగా ఒక సంప్రదాయ కీర్తన చెబుతుంది. పరాయి దండ యాత్రల వల్ల అనేక దేవాలయాలు శిధిలమైనప్పటికీ ఈనాటికీ తన ప్రాచీనతను కోల్పోకుండా భక్తికి ఆలవాలంగా విరాజిల్లుతూవున్నది బృందావనం.
మాతృదేవి వేదనామయ ఎడబాటు
మాతృదేవి సెప్టెంబరు నెలలో బృందావనానికి వెళ్లారు. అప్పుడే వర్షాకాలం గడిచింది. చెట్టు చేమలు పచ్చపచ్చగా ఉండి రంగు రంగుల పువ్వులతో కనులకు విందు చేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యంలోని ఒక విచిత్ర మయిన నిజ మేమిటంటే, మనం సంతోషంగా ఉంటే అది మన సంతోషాన్ని ఇనుమడింపచేస్తుంది; మన మన స్సులు ఆవేదనతో బాధపడుతూవుంటే ప్రకృతి అలాంటి ప్రతిస్పందనే మన బాధలను, వేదనలను అధికరింప చేస్తుంది. పసిడి పచ్చిక మైదానాలతో, వికసించిన రంగురంగుల పుష్పాలు, అటూ యిటూ పరుగులు తీస్తున్న భీతహరిణే క్షణలు, తమ పింఛాలను విప్పి నృత్యం చేస్తున్న నెమళ్లు, పచ్చిక మేసిన తర్వాత సాయంత్రం మందలు మందలుగా తిరిగి వస్తున్న గోవులు – ఈ దృశ్యాలన్నీ మాతృదేవి మనస్సులో ఏకైక ఆలోచనను జనింపచేశాయి. ‘గురుదేవులు ఎక్కడ?’ ఎడబాటు ఆమె హృదయంలో ప్రతి అణువునూ స్పందింపచేసి, ఆవేదనకు గురిచేసింది. మరుగుపడివున్న శోకం నూత్నవేగంతో ఆమెను బాధించసాగింది. రాత్రింబవళ్లు గురుదేవుల జ్ఞాపకాలే! సదా ఆయన జ్ఞాపకంతో కన్నీరు మున్నీరై లోలోపల విలపించసాగారు. గురుదేవుల నిర్యాణానికి ముందుగానే బృందా వనానికి వచ్చిన యోగిన్ మాను చూడగానే కట్టలు తెంచుకొన్న ప్రవాహంలా విలపిస్తూ “హా! గోలాప్ మా! నా అమ్మాయీ” అంటూ ఆమెను కౌగలించు కొన్నారు. ప్రేమ, దుఃఖం కలగలసి ఎడబాటును ఉద్ధృతం చేయడంతో మాతృదేవి బాధ అధికమైంది.
ఈ ఆవేదన ఉద్ధృతంలో మైమరచి ఒక చిన్నారిలా మాతృదేవి మాట్లాడ సాగారు. ఒక రోజు మరణించిన ఒక వ్యక్తి భౌతిక కాయాన్ని పువ్వులతో అలంక రించి శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుపోతున్నారు. అది చూసిన మాతృదేవి యోగిన్ మాతో, “యోగిన్! పుణ్యభూమి అయిన ఈ బృందావనంలో ప్రాణాలు వదలడానికి ఆతడు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి! నేను కూడా నా అవ సానాన్ని నిరీక్షిస్తూనే బృందావనానికి వచ్చాను. కానీ కాస్త జ్వరమైనా రావాలి కదా! నాకు ఏమంత వయస్సు అయిపోయిందని! నన్ను చూడు! నే నెంత వయస్సు మళ్లిన దాని నయిపోయానో! “మానాన్న, నా భర్త, పెద్దన్నయ్య అంద రినీ చూశాను కదా!” అన్నారు. ఆ మాటలు విన్న గోలాప్ మా నవ్వును ఆపుకో లేకపోయింది. నవ్వుతూ, “అమ్మా! మీరేమంటున్నారు? ఈ లోకంలో ఎవరు తమ తండ్రులను చూడలేదు?” అంటూ మళ్లీ నవ్వసాగారు.
ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు
కానీ ఇలా ఎన్ని రోజులు? ఇలా ఏకధాటిగా కన్నీటిలో మునిగివుంటే శరీరం ఎలా తట్టుకుంటుంది? మాతృదేవి ఆరోగ్యం దెబ్బతినసాగింది. అప్పుడు ఒక రోజు మాతృదేవికి సాక్షాత్కరించిన గురుదేవులు, “ఎందుకిలా ఏడుస్తూ ఉంటున్నావు? నేను ఎక్కడికి వెళ్లిపోయానని? ఇక్కడే ఉంటున్నాను కదా! ఒక గది నుండి మరొక గదికి వెళ్లాను, అంతే” అన్నారు.
ఈ దర్శనం తర్వాత మాతృదేవి జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. గురు దేవుల నిరంతర దర్శనాల వలనా, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాల వలనా ఆమె దుఃఖం తొలగిపోయి, ఆ స్థానే దివ్య పారవశ్యం చోటు చేసుకొన్నది. మాతృదేవి ఆధ్యాత్మిక ఉన్నతోన్నత స్థితులలో సదా నెలకొనసాగారు. కొన్ని సమయాలలో ఆమె ధ్యానం చేయడానికి కూర్చునేటప్పుడు బాహ్యస్మృతి పూర్తిగా కోల్పోయే వారు. ముఖమంతా దోమ కాట్లతో పుళ్లయిపోయేది. స్ఫురణ కూడా లేకుండా ధ్యానంలో లయించి ఉండేవారు. అప్పుడప్పుడు దివ్యపారవశ్య స్థితులలో మగ్నులై, బాహ్య జగత్తునంతా మరచిపోయి యమునా నదీతీరంలో చెప్పరాని ఆనందం తోనూ, వేగంతోనూ నడవడం మొదలుపెట్టేవారు. యోగిన్ మా తదితరులు పరు గెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకుని తమతోపాటు తీసుకురావలసి వచ్చేది.
గురుదేవులతో తాదాత్మ్యం
“ఆమె తనను పూర్తిగా మరచిపోయింది. ఆమె చేష్టలు, నడత అన్నీ శివుణ్ణే జ్ఞాపకం చేశాయి. ఎవరైనా పేరేమని అడిగితే ‘శివుడు’ అంటూ చెప్పేది.” – భర్తకు తమను పూర్తిగా సమర్పించుకున్న ఒక భార్య స్థితిని ఒక మహాత్ముడు ఇలా వర్ణించాడు. భక్తి యొక్క ఈ తాదాత్మ్యం ఉన్నత స్థితిలో భక్తుడు భగవంతునితో లయించిపోయి అద్వైత స్థితికి చేరుకుంటాడు. భగవన్మయంగా అయిపోతాడు.* భక్తుడు, భగ వానుడు భిన్నులు అనే స్థితి అక్కడ మాయమవుతుంది. మాతృదేవి కూడా గురు దేవులతో భిన్నులు కారని ఒక సంఘటన మూలంగా తెలియవస్తూన్నది. ఇలాంటి ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు ఎన్నో కలిగివుంటాయి. కానీ ఆమె వీటిని గురించి ఏమీ చెప్పరు. ఇప్పుడు మనం చూడబోయే సంఘటన శ్రీ యోగానంద స్వామి తెలిపారు.
ఇతరులతోపాటు మాతృదేవి బృందావనంలో యమునా తీరంలో కాలా బాబు స్థలంలో ఒక ఇంట్లో బసచేసి ఉన్నారు. ఒక రోజు మాతృదేవి అక్కడ ప్రగాఢ సమాధి మగ్నులయినారు. చాలాసేపయినప్పటికీ బాహ్యస్మృతి కలుగ లేదు. యోగీన్ మా భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మాతృదేవిని బాహ్యస్మృతిలోకి రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలాసేపటి తర్వాత మాతృదేవికి కాస్త బాహ్య స్మృతి కలిగింది. ఇలాంటి సమయాల్లో, ‘నాకు తినడానికి ఏదైనా కావాలి’ అని అడిగేవారు గురుదేవులు. అచ్చం అదేలా అన్నారు మాతృదేవి. వెంటనే కొన్ని తీపి పదార్థాలు, తమలపాకులు, నీళ్లు ఇత్యాదులు ఆమె ముందుంచారు. గురు దేవులలానే ఆమె అన్నిటినీ కొద్దిగా తీసుకున్నారు. తర్వాత తమలపాకులు తీసు కున్నప్పుడు దాని కాడను గురుదేవులు ఎలా తుంచేవారో, అలాగే తుంచి పారే శారు. ఆ స్థితిలో అడిగిన కొన్ని ప్రశ్నలకు గురుదేవులు బదులు చెప్పినట్లే చెప్పారు. బాహ్యస్మృతి పూర్తిగా కలిగిన తర్వాత పై సంఘటనలను గురించి ఆమెకు చెప్పినప్పుడు తాము అప్పుడు గురుదేవులతో తాదాత్మ్యమైనట్లు చెప్పారు. ఈ ఉన్నత స్థితిలోనే మాతృదేవి రెండు రోజులు నెలకొని ఉన్నట్లు శ్రీ యోగానంద స్వామి తమ స్మృతులలో చెప్పివున్నారు.
బృందావనంలో తక్కిన రోజులు
ఇలా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో సైతం జపం, ధ్యానం, వ్రతాలు మొద లైన వాటిని మాతృదేవి అనుష్ఠించేవారు. దాదాపు ఒక సంవత్సరం మాతృదేవి బృందావనంలో వసించారు. బృందావనం దేవాలయాల నగరం. ఎక్కడ చూసినా దేవాలయాలే! మాతృదేవి అక్కడ వసించిన ఒక సంవత్సర కాలంలో దేవాలయాల నన్నిటిని పలుమార్లు దర్శించారు. రాధారమణుని ఆలయానికి వెళ్లి కన్నీటితో, “ఓ భగవం తుడా! ఇతరులలో తప్పులు చూసే స్వభావాన్ని నా నుండి పూర్తిగా తొలగించి వేయి! నేను ఇతరులలో ఎన్నడూ తప్పులు చూడకూడదని నన్ను ఆశీర్వదించు” అంటూ హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఈ విషయంగా కాలాంతరంలో ఇలా అన్నారు: “ఇతరులలో తప్పులు చూసే స్వభావం నాకు కూడా మునుపు ఉండేది. ఆ స్వభావం తొలగిపోవాలని భగవంతుని ఎంతో ఆర్తితో ప్రార్థించాను. ఆ తర్వాతే ఆ స్వభావం పూర్తిగా తొలగిపోయింది. ఒక వ్యక్తికి మనం వెయ్యి మంచివి చేసివుండవచ్చు. కానీ పొరపాటుగా మనవల్ల ఒకసారి చెడు జరిగితే వెంటనే ఆతడు ఆగ్రహించి ముఖం తిప్పుకుంటాడు. ఇతరులలో తప్పులు మాత్రమే చూడడం మనిషి నైజం. కానీ ఇతరులలోని సుగుణాలను కూడా చూసి మెచ్చుకునే స్వభావాన్ని మనం అలవరచుకోవాలి. మానవ జీవితంలో తప్పులు జరగకుండా ఉండవు. కానీ ఆతడి తప్పులను మాత్రమే ఎప్పుడూ చూస్తూవుండ కూడదు. నిర్విరామంగా ఇతరులలో తప్పులు చూచే వ్యక్తికి ఎక్కడ చూసినా తప్పులే కనిపిస్తాయి.” ఒక రోజు యోగిన్ మాతో, “యోగిన్! నువ్వు ఇతరుల దోషాలనే చూస్తూ వుండిపోవద్దు. అలా చేశావంటే నీ కళ్లు పవిత్రతను చూడలేవు” అని చెప్పారు.
సంప్రదాయానుసారం బృందావన ప్రదక్షిణం కూడా చేశారు మాతృదేవి, శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడివున్న స్థలాలన్నీ పలుమైళ్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ స్థలాలనన్నీ కాలినడకనే ప్రదక్షిణం చేసిరావడం పుణ్య కార్యంగా చెప్పబడుతున్నది. తమ వాత రోగాన్ని కూడా ఖాతరు చేయకుండా మాతృదేవి ఈ ప్రదక్షిణ చేశారు. అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, దారిలో అక్కడక్కడ హఠాత్తుగా కాసేపు నిలబడి, చుట్టూవున్న చోట్లను చాలా నిశితంగా చూశారు. బహుశా కొన్ని పరిసరాలు ఆమెకు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను కలిగించి ఉండవచ్చు; కానీ ఈ విషయంగా భక్తులు అడిగినప్పుడు ముందుకు వెళ్లమని మాత్రం వారికి చెప్పారు.
మంత్రదీక్ష
ఇలాంటి అత్యున్నతమయిన ఆధ్యాత్మిక స్థితులలో నెలకొనివున్న రోజుల కంటే, మాతృదేవి గురువుగా తమ బాధ్యతను స్వీకరించడానికి సముచిత సమయం మరొకటి ఉండగలదా? అందువల్ల గురు దేవులు ఒక రోజు మాతృదేవికి కనిపించి యోగీన్కు మంత్రదీక్ష ఇవ్వమని చెప్పారు.* “ఒక రోజు గురుదేవులు నాకు కనిపించి యోగీన్కు మంత్రదీక్ష ఇవ్వవలసిందని చెప్పారు. నేను భయపడ్డాను, సంకో చించాను. ‘ఇదేమిటి! ఇంతలోనే మాతృదేవి శిష్యులను సేకరించడం ప్రారంభిం చేశారు’ అనే కదా యితరులు అనుకుంటారు అనే సిగ్గు ఒక ప్రక్క. కనుక నేను దీక్ష నివ్వలేదు. కానీ గురుదేవులు మూడు రోజులు వరుసగా కనిపించి, “నేను యోగీన్కు మంత్రదీక్ష ఇవ్వలేదు. ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చు” అంటూ మరీ మరీ చెప్పారు. దానితోపాటు ఆతని కివ్వాల్సిన మంత్రం కూడా ఏమిటో చెప్పారు. అంతవరకు నేను యోగీన్తో మాట్లాడింది కూడా లేదు! కనుక యోగీన్ (యోగీన్మా) సహాయంతో మంత్రదీక్ష ఇవ్వమని కూడా చెప్పారు. నేను ఈ విషయం ఆమెతో చెప్పాను. ఆమె యోగీన్ను అడిగినప్పుడు, గురుదేవులు తనకు మంత్రదీక్ష ఇవ్వలేదని చెప్పాడు. అంతే కాదు. ఆయన ఈ మధ్య ఆతడికి కనిపించి నా వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పినట్లూ, ఈ విషయం ఎలా నాతో చెప్పాలా అని తటపటాయిస్తూన్నట్లూ చెప్పాడు. ఇలా మా ఇద్దరికీ గురుదేవుల ఆదేశం లభించినందున నేను ఆతనికి మంత్రదీక్షను ఇచ్చాను.
మంత్రదీక్ష రోజు మాతృదేవి తమ గదిలో పూజ చేశారు. తర్వాత యోగీన్కు రమ్మని కబురు పంపారు. ఆతడు వచ్చినప్పుడు ప్రక్కన కూర్చో మన్నారు. పూజ చేస్తున్నప్పుడు సమాధి స్థితిలోనికి వెళ్లిపోయారు. ఆ స్థితిలోనే మంత్రదీక్ష ప్రసాదించారు. ఆమె మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరించినందువల్ల పక్క గదిలోని యోగీన్ మాకు కూడా ఆ మంత్రం వినబడిందట.
ఇలా మాతృదేవి అవతార కార్యంలో ఒకటైన మంత్రదీక్ష భక్తికి నిలయ మయిన బృందావనంలో ప్రారంభమైనది.
కొనసాగిన యాత్ర
బృందావనంలో ఒక సంవత్సరం ఉన్న తరువాత, ఇతరులతోపాటు మాతృ దేవి హరిద్వార్ వెళ్లారు. అక్కడ పవిత్ర తీర్థమయిన బ్రహ్మకుండంలో మాతృదేవి, గురుదేవుల అస్తులలో ఒక భాగాన్ని కలిపారు. కొండ మీదున్న చండి ఆలయాన్ని కూడా దర్శించారు. తర్వాత జైపూర్, పుష్కరం దర్శించి తిరిగివచ్చారు. దారిలో పవిత్రమైన గంగా యమునలు సంగమమయ్యే అలహాబాదులో బసచేసి, త్రివేణీ సంగమంలో గురుదేవుల శిరోజాలను సమర్పించారు. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు: “త్రివేణీ సంగమానికి నేను వెళ్లినప్పుడు నది ప్రశాంతంగా ప్రవహిస్తూవుంది. సంగమంలో కలపడానికి నేను గురుదేవుల శిరోజాలను చేతిలో తీసుకున్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద అల ఉవ్వెత్తున లేచి నా చేతులోవున్న శిరోజాలను లాక్కొని వెళ్లిపోయింది. ఆ తీర్థం గురుదేవుల శిరోజాలతో మరింత పావనమవడానికి ఇలా ఉరుకుతూ వచ్చినట్లు అనిపించింది.”
వితంతువయిన లక్ష్మి అక్కడ సంప్రదాయానుసారం శిరోముండనం చేయించుకొంది. మాతృదేవి అలా చేసుకోలేదు. తమ భర్త మరణాతీతులూ, పరిణామరహితులూ అయినప్పుడు ఆమె ఎలా వితంతువవుతారు? ఆమె నిత్య సుమంగళి కదా! 1887 లో మాతృదేవి కలకత్తాకు తిరిగివచ్చారు.