అవతార కార్యానికి మాతృదేవి ఆయత్తం
గురుదేవుల మూడు పరిమాణాలనూ, వాటి ఆదర్శ పరిపూర్ణతకై మాతృదేవి జీవితం వారితో ముడిపడడమూ చూశాం. గురుదేవుల ఉదాత్త సహధర్మిణిగా జీవించి, వారి ఆదర్శాలను పుణికిపుచ్చుకొని, గృహ అవతార కార్యానికి మాతృదేవి ఆయత్తం స్థాశ్రమ ఆదర్శాన్ని పాటించి చూపడం మూలంగా ఆయన పరిపూర్ణ మానవ పరిమాణాన్ని పూర్తి చేశారు మాతృదేవి. గురుదేవుల తర్వాతి పరిమాణం గురువర్యులు – ఆదర్శప్రాయులైన గురువు. ఈ పరిమాణాన్ని పూర్తిచేయడానికి మాతృదేవి, గురుదేవిగా మారాలి. ‘జ్ఞానప్రదాయినిగా జన్మించిన’ మాతృదేవి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలి; గురుదేవుల ‘అవతార వరిష్ఠులు’ అనే మరో పరిమాణాన్ని సంపూర్ణం చేయడానికి మాతృదేవి ఆయన కృపాస్వరూపంగా, ‘ప్రపంచావృత మాతృత్వం’ గా నెలకొనాలి. వాటికి తగ్గట్లు ఈ కాలఘట్టంలో, అంటే దక్షిణేశ్వరం రోజుల తుదిన మాతృ దేవిలో మూడు ముఖ్యమయినవి అభివ్యక్తమవడం చూస్తాం. (i) ప్రార్థనామయ జీవితం. (ii) గురువు స్థితి. (iii) మాతృత్వ గుబాళింపు. మాతృదేవి అవతార కార్యానికి బీజంగా అమరిన ఈ మూటినీ విపులీకరించే కొన్ని సంఘటనలను ఇప్పుడు పరికిద్దాం.
ప్రార్థనామయ జీవితం
మాతృదేవి జీవితాన్ని నిరంతర ప్రార్థనగా గాంచింది నివేదిత. గురుదేవుల లాగే మాతృదేవి అన్నిటినీ భగవంతుని సహాయాన్ని యాచించారు. గురుదేవులు అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదించే వారని చూశాం. ఆయన అడిగిన వెంటనే మాతృదేవి తమ అభి ప్రాయం చెప్పేవారు కారు. మాతృదేవి, “కాస్త అవకాశమివ్వండి, కాసేపు తరు వాత చెబుతాను” అనేవారు. అందుకు గురుదేవులు, “అదేమిటి! ఇప్పుడే ఎందుకు చెప్పకూడదు? ఎవరితో కలిసి ఆలోచిస్తావు?” అంటూ అడిగేవారు. అప్పుడు కూడా మాతృదేవి, “క్షమించండి. నేను కాస్త ఆలోచించి, ఆ విషయంగా మీతో మాట్లాడతాను” అనే చెప్పేవారు. తర్వాత తిన్నగా నహబత్తుకు వచ్చి దేవితో, “అమ్మా! నేనేమి చెప్పాలో దయచేసి వెల్లడించు తల్లీ!” అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవారు. ప్రార్థన మూలంగా పొందిన జవాబునే గురుదేవు లతో చెప్పేవారు. భగవంతుడే సత్యం అన్న మాతృదేవి విశ్వాసానికి ఇది తార్కాణం.
గురు స్థితి
కాలక్రమంలో పారమార్థిక జిజ్ఞాస కలిగిన పలువురు యువకులు గురుదేవుల వద్దకు రాసాగారు. వారిలో చాలామంది అప్పుడప్పుడు దక్షిణేశ్వరం లోనే ఉండి రాత్రి సమయాల్లో కూడా ధ్యానజపాదులు అనుష్ఠించసాగారు. రాత్రులలో ఎక్కువగా ఆహారం తీసు కోవడం సాధన జీవితానికి అవరోధమని గురుదేవులు వారివారి శక్తికి తగ్గట్లు ఇన్ని చపాతీలే రాత్రులలో తినాలనే నియమం పెట్టారు. ఒక రోజు ఆయన బాబూరాంతో, “నువ్వు రాత్రిపూట ఎన్ని చపాతీలు తింటావు?” అని అడిగారు. “ఐదో, ఆరో” అన్నాడు బాబూరాం. “చాలా ఎక్కువ. ఎందుకు అన్ని తింటావు?” అని మళ్లీ అడిగారు. అందుకు బాబూరాం మాతృదేవి పెట్టింది పెట్టినట్లే తింటు న్నట్లు చెప్పాడు. వెంటనే నహబత్తుకు వెళ్లారు గురుదేవులు. మాతృదేవిని పిలిచి, ఇలా వారందరికీ మితం లేకుండా ఆహారం ఇస్తే, వారి ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం కలుగుతుందని నిలదీశారు. అందుకు మాతృదేవి, “రెండు చపాతీలు ఎక్కువ తిన్నాడని ఎందుకు ఇంతగా కలత చెందుతారు? ఈ విషయానికి మీరు ఇంత ప్రాధాన్య మివ్వకండి. వారందరి బాగోగులు నేను చూసుకుంటాను” అన్నారు గంభీరంగా.
ఇక్కడ జవాబు చెప్పిన వారిని, ప్రశ్న అడిగిన వారిని గురించి కాస్త ఆలో చించి చూడాలి. చెప్పిన వారు మాతృదేవి, గురుదేవులను తమ జీవిత సర్వస్వంగా స్వీకరించినవారు. ఏ మేరకు తమ శక్తినీ, గురువు స్థితినీ ఎరిగివుంటే, ఈశ్వర కోటులుగా గురుదేవులే సూచించిన బాబూరాం లాంటివారి ఆధ్యాత్మిక బాగోగు లను తాను చూసుకుంటానని గురుదేవులతోనే చెప్పగలుగుతారు! ఇక ఆ ప్రశ్న అడిగినవారు! అంటే గురుదేవులు. ఎవరు ఏది చెప్పినా అట్లే స్వీకరించేవారు కారు గురుదేవులు. మాతృదేవి వారి బాగోగులను చూసుకోగలుగుతారని గ్రహించి నందువల్లనే, ఆ మాటలను అలాగే తీసుకొని, మరొక మాట చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు.
మాతృత్వపు శోభ
కాలాంతరంలో భక్తు డొకడు మాతృదేవితో, గురుదేవుల నిర్యాణానంతరం ఆమె ఎలా జీవించ గలిగారని అడిగాడు. అందుకు మాతృదేవి, “సమస్తాన్నీ మాతృస్వరూపంగా గాంచారు గురుదేవులు. ఆ మాతృ త్వాన్ని జగత్తుకు చాటి చెప్పడానికే నన్ను వదలివెళ్లారు” అని అన్నారు. జగత్తునే ఆకట్టుకునే, మంచివాడు – చెడ్డవాడనే భేద భావం లేకుండా అందరినీ ఆదుకునే ఆ మాతృత్వ అభివ్యక్తతను దక్షిణేశ్వర రోజులలోనే మాతృదేవి జీవితంలో మనం చూశాం.
కొంత కాలంగా ఒక వృద్ధ స్త్రీ నహబత్తుకు అప్పుడప్పుడూ వచ్చి గంటల పర్యంతం మాతృదేవితో మాట్లాడేది. గతంలో ఆమె అపవిత్ర జీవితం గడిపింది. అందువల్ల ఆ స్త్రీతో కలిసిమెలిసి ఉండడం మంచిది కాదని గురుదేవులు మాతృ దేవిని హెచ్చరించారు. అలాంటి స్త్రీల సాంగత్యం మాతృదేవిపై ఎలాంటి ప్రభా వమూ చూపలేదని గురుదేవులకు తెలుసు; ఇతర భక్తురాండ్రు ఆమెతో సాంగత్యం పెట్టుకోవచ్చనే భావనతో గురుదేవులు ఇలా వారించి ఉండవచ్చు. కానీ అమ్మా అని సంబోధిస్తూ తన వద్దకు వచ్చే ఆ స్త్రీని, రావద్దని చెప్పడానికి ఆమె మాతృ హృదయం తటపటాయించింది. అందువల్ల గురుదేవులు వారించినా ఆ వృద్ధు రాలు వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడి, తినడానికీ, ఇంటికి తీసుకెళ్లడానికీ ఏదో ఇచ్చి పంపేవారు. గురుదేవులు ఇదంతా చూసి, ఆ తర్వాత మాతృదేవితో ఏమీ చెప్పలేదు. భక్తుల చిన్న తప్పిదాన్ని కూడా సహించే వారుకారు గురుదేవులు. అలాంటివారు మాతృదేవి ఈ పనిని చూసి కూడా ఊర కున్నందుకు కారణం మాతృదేవి మనోస్థితి ప్రగాఢతను తెలుసుకోవడమే.
మరొక సంఘటన చూద్దాం. ఒకసారి గురుదేవుల భక్తుల కెవరికీ పరి చయంలేని ఒక కొత్త స్త్రీ గురుదేవులను చూడడానికి అప్పుడప్పుడు రాసాగింది. చూడడానికి పిచ్చిదానిలా కనబడింది. కానీ ఆ తర్వాతే ఆమె మధురభావాన్ని అనుసరించే భక్తురాలని తెలియవచ్చింది. ఒక రోజు ఆమె గురుదేవులు ఏకాం తంగా ఉన్నప్పుడు ఆయనను సమీపించి తన పరిస్థితిని వివరించి ఆయననే తన నాయకునిగా స్వీకరించడానికి అనుమతి కోరింది. అంతే, తమ భార్యతో సహా స్త్రీల నందరినీ జగజ్జననిగా భావించి ఆరాధించే గురుదేవులు ఆ స్త్రీ మాటలతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఆమెను తిట్టుతూ అరవసాగారు.
గురుదేవుల ఈ అరుపులు నహబత్తులో ఉంటున్న మాతృదేవికి వినబడింది. తన సమక్షంలోనే తన కుమార్తెను చిన్నబుచ్చి మాట్లాడితే ఒక తల్లి ఎంత ఆవేదన పడుతుందో, అంత ఆవేదన మాతృదేవి ముఖంలో కనబడింది. ప్రక్కనే ఉన్న గోలాప్ మాతో, “విన్నావా! ఆయన తిట్టుతున్నారు. ఆయన సహించుకోలేనంతగా ఆమె ఏమైనా అనివుంటే కూడా ఇలా చీవాట్లు పెట్టడం మానుకుని నా వద్దకు పంపివుండవచ్చు కదా!” అంటూనే గోలాప్ మాను పంపించి ఆ స్త్రీని తోడ్కొని రమ్మన్నారు. ఆమె రాగానే ఆప్యాయంగా, “అమ్మాయీ! ఆయన నిన్ను చూడలేక చీవాట్లు పెడితే అక్కడ ఎంతమాత్రమూ నిలబడకు! నా వద్దకు వచ్చేయి!” అని అన్నారు.
గృహిణులకు
ఈ రెండు సంఘటనలూ మాతృదేవి మాతృత్వపు అభివ్యక్తీకరణను, ఒక కుటుంబ పెద్దకు ఉండవలసిన, గృహస్థ జీవితానికి ఆవశ్యకమయిన, మూలమైన విలక్షణతను తెలుపుతున్నాయి. అదే – లక్ష్యంలో దృఢత్వం, అదేసమయంలో దాని సాధనలో మృదుత్త్వం. గురుదేవులు మాతృదేవికి భర్త మాత్రమే కాకుండా, గురువు కూడా. అయినప్పటికీ ఆయన చెప్పారు కదా అని దేనినీ మాతృదేవి అట్లే స్వీకరించలేదు. అదేసమ యంలో, తాను ఎందుకు అలా చేశాను అని వివరించడానికి కూడా ప్రయత్నించ లేదు. అయినా మృదుత్త్వమనే ఉపకరణం ద్వారానే తమ స్థితి గురుదేవులకు అర్థమయ్యేలా చేసేవారు.
ఈ సంఘటనలలో మాతృదేవి మాతృత్వం అభివ్యక్తమైనా ఇక రాబోయే సంఘటనలో మాత్రమే అది పూర్తి పరిమాణంలో వికసించి ప్రకాశించింది.
అమ్మా అని పిలిస్తే!
ఒకసారి మాతృదేవి ఆహారం పట్టుకుని నహబత్తు నుండి గురుదేవుల గదికి వెళుతున్నారు. దారిలో హఠాత్తుగా ఒక స్త్రీ ఆమెకు ఎదురుపడి, “అమ్మా! గురు దేవులకు ఆహారం పట్టుకువెళ్లే భాగ్యాన్ని ఈ ఒక్క రోజుకు నాకు ప్రసాదించండి” అంటూ ఆతురతతో అడిగింది. అమ్మా అనే మాట విన్న మరుక్షణం మాతృదేవి మనస్సు ద్రవించిపోయింది. అంతే, మారు ఆలోచన లేకుండా ఆహార పళ్లెరాన్ని ఆమె చేతికిచ్చి తమతో తీసుకెళ్లారు. ఆ స్త్రీ ఆహార పళ్లెరాన్ని గురుదేవుల గదిలోవుంచి బయటికి వెళ్లిపోగానే, మాతృదేవి గురుదేవులకు ఆహారం వడ్డించి, విసురుతూ ప్రక్కన నిలబడ్డారు.
ఎవరో స్త్రీ ఆహారం తీసుకువచ్చి పెట్టడం గమనించిన గురుదేవులు మాతృదేవితో, “ఆ స్త్రీ యోగ్యురాలు కాదని నీకు తెలియదా? ఆమె తాకిన ఆహారాన్ని నేను ఎలా తీసుకోగలను?” అని అడిగారు. అందుకు మాతృదేవి, “మీ పరిస్థితి నాకు తెలుసు; కానీ నేనేం చేయగలను? దయచేసి ఈ రోజుమాత్రం నా కోసం ఆహారం తినండి” అంటూ బ్రతిమిలాడారు. అందుకు గురుదేవులు, “సరే! కానీ నా కోసం తీసుకువచ్చే ఆహారాన్ని ఎవరంటే వారి చేతికి యివ్వను అని వాగ్దానం చేయి” అన్నారు. గురుదేవులు అలా చెప్పగానే వెంటనే మాతృదేవి తన చేతిలోని విసనకఱ్ఱను కింద వుంచి, రెండు చేతులు జోడించి, “నన్ను క్షమిం చండి. అది మాత్రం నేను చేయలేను. సాధ్యమైనంత దాకా, ఎవరికీ ఇవ్వకుండా నేనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నన్ను అమ్మా అంటూ పిలుస్తూ ఎవ రైనా ఏదైనా అడిగితే నేను కాదనలేను. అంతే కాకుండా మీరు నాకు మాత్రమే కాకుండా, అందరికీ గురుదేవులే కదా!” అని అన్నారు. మాతృదేవి ఈ సమా ధానంలో ఉట్టిపడిన మాతృత్వపు అభివ్యక్తీకరణను గురుదేవులు స్పష్టంగా గుర్తిం చారు. బహుశా ఇదే ఆయన ఎదురుచూచి ఉంటారు! కుపుత్రుడు ఉండవచ్చు కాని కుమాత అసంభవం కదా! మంచివాడు – చెడ్డవాడు అంటూ తారతమ్యం పాటించకుండా కన్నబిడ్డల్లాగా చూడడం ఉన్నతోన్నత స్థితి కదా! మాతృదేవి ఈ మాతృప్రేమ అభివ్యక్తీకరణ నుండి ఒక ముఖ్యమయిన ప్రేమ పరిమాణ అను ష్ఠాన వైశిష్ట్యాన్ని చూడగలుగుతున్నాం.
ప్రేమ ఒక అద్భుత పరిమాణం
కామం, ప్రేమ, భగవంతుడు – ఈ మూడూ మానవ జీవితంలో విడదీయ జాలక పెనవేసుకున్నవి. దురదృష్టవశాత్తు వీటిలా తప్పుగా అర్థం చేసుకొన్నవి మరేవీ లేవు. ఈ మూడింటిని వాటివాటికి తగిన స్థానాన్ని ఇచ్చే వ్యక్తి జీవితం తరిస్తుంది. అలా చేయని వ్యక్తి జీవితం రణరంగ మవుతుంది. కామ మంటే ఏమిటో గ్రహించి, దానిని జయించనంత దాకా నిజమైన ప్రేమ అంటే ఏమిటో అవగతం చేసుకోలేం. నిజమైన ప్రేమను అర్థం చేసుకుని దానిని భగవంతుని పట్ల నెరపే దాకా ఆయనను సాక్షాత్కరించుకోవడం అసంభవం.
కులీన జన్మవలనా, సాధనల ఫలితంగా గురుదేవుల సత్సాంగత్యం వలనా, యౌవనంలోనే కామాన్ని జయించారు. అందువల్లనే తమ భర్తా, గురుమా, దైవమూ అయిన గురుదేవుల పట్ల ఆమె పావనమైన ప్రేమను నిలపగలిగారు. ఈ పావన ప్రేమకు ఒక ముఖ్యమైన గుణం నిర్లిప్తత. ఒక వస్తువు మీద ఆసక్తి పెంచుకుంటే దానిని తాను మాత్రమే ఉంచుకోవాలనే భావన కలుగుతుంది, కానీ ప్రేమ అలాంటిది కాదు. మాతృదేవి గురుదేవుల పట్ల ఎలాంటి ప్రత్యేకమైన ఆధిపత్యాన్నీ అభిలషించలేదు. దుశ్శీలయైన స్త్రీకి కూడా తమ మాతృత్వ పరిధిలో స్థానం కల్పించి ఆమెను కూడా గురుదేవుల సాన్నిధ్యానికి తీసుకెళ్లింది మాతృదేవి ప్రేమ. “అమ్మా! నీ ప్రేమ విచిత్రమైనది. ఎల్లలులేని ప్రేమ సాగరాన దోషులను కూడా నీ ఒడిలో చేర్చుకుని పరిరక్షించావు. ఎంత అద్భుతమిది!” అని వ్రాశారు అభేదానందస్వామి.
ఇలా తమ శక్తి అయిన మాతృదేవి అన్ని విధాల అవతార కార్యాన్ని చేపట్ట డానికి తయారుగా ఉండడాన్ని గ్రహించారు గురుదేవులు. ఆ కార్యాన్ని ఆమెకు అప్పజెప్ప నిష్క్రమించడానికి ఆయత్తమయ్యారు.
గురుదేవుల ఆయత్తత
సుఖం వస్తే దుఃఖం కూడా దానిని వెంబడించే వస్తుంది. ఇదే నియమం. ఈ చక్రభ్రమణం నుండి ఎవరూ తప్పించుకోలేరు. అందువల్లనే జ్ఞానులు సుఖ దుఃఖాలు రెండింటినీ త్యజించి వాటికి అతీతమైన స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రజల శ్రేయస్సు కోసం జన్మ స్వీకరించి, ప్రజల మధ్య జీవిస్తూన్న అవతార పురుషులు మానవుల్లా సుఖదుఃఖాలను స్వీకరించవలసి వుంది. 1885 వ సం ॥ శీతకాల ప్రారంభంలో మాతృదేవి జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవేదన తన ఎరుకను చూపించింది. ఏప్రిల్ నెల మధ్యలో గురుదేవులకు గొంతులో నొప్పి మొదలయింది. క్రమంగా ఎక్కువైన ఆ నొప్పి ఎటువంటి చికిత్సలకూ ఉపశమించక తీవ్రం కాసాగింది. సెప్టెంబరు నెల వచ్చేటప్పటికి నొప్పితోపాటు గొంతు నుండి రక్తం కూడా స్రవించసాగింది. అందువల్ల భక్తులు ఆయనను కలకత్తాకు తరలించి చికిత్స చేయించాలని తీర్మానించారు. 1885 సెప్టెంబరులో ఆయనను దక్షిణేశ్వరం నుండి శ్యాంపుకూర్కు తీసుకు వెళ్లారు.
గోలాప్ మా అసమంజస పలుకులు
గురుదేవుల వ్యాధిని గురించి మనస్సులో ఎంతో బాధపడుతూ మాతృదేవి శోకమూర్తిగా దక్షిణేశ్వరంలో ఒంటరిగా ఉండిపోయారు. గోలాప్ మా ఆలోచనా రహితంగా మాట్లాడిన పలుకులు మాతృదేవి శోకాన్ని అధికరింప చేశాయి. గురుదేవులు వ్యాధిగ్రస్థులై దక్షిణేశ్వరం నుండి తరలి వెళ్లడానికి మాతృదేవి పట్లగల కోపమే కారణమయి ఉండవచ్చని ఒక రోజు యోగిన్ మాతో చెప్పింది గోలాప్ మా. కించిత్తు కూడా నిజం లేని ఈ మాటలు మాతృదేవికి తెలియవచ్చాయి. గుండెల్లో గునపం గుచ్చినట్లు ఆమె బాధపడ్డారు. ఈ దుఃఖాన్ని ఆమె భరించలేక పోయారు. వెంటనే ఒక బండిని ఏర్పాటు చేసుకుని శ్యాంపుకూర్కు వెళ్లారు. గోలాప్ మా చెప్పిన విషయాన్ని గురుదేవులతో కన్నీరు మున్నీరైచెబుతూ, “ఇది నిజమేనా? నా మీద మీకు కలిగిన అసహ్యం వలననే మీరు దక్షిణేశ్వరం వదలి వచ్చారా?” అని అడిగారు. హృదయం పగిలిపోయేట్లు విలపిస్తున్న మాతృదేవిని చూసిన గురుదేవులకు గోలాప్ మా మీద పట్టరాని కోపం వచ్చింది. గోలాప్ మా మాటలన్నీ పచ్చి అబద్ధాలనీ పలు విధాలుగా మాతృదేవికి నచ్చజెప్పి ఆమెను అనునయించారు. మాతృదేవి కుదుటపడ్డ తర్వాత ఆమెను దక్షిణేశ్వరం పంపిం చారు. తర్వాత గోలాప్ మాను తీసుకురావలసిందిగా మనిషిని పంపారు. ఆమె రాగానే పచ్చి అబద్ధం మూర్ఖంగా పలికి మాతృదేవి మనస్సును అమితంగా గాయ పరచినందుకు ఆగ్రహించారు. తన తప్పును తెలుసుకొన్న గోలాప్ మా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనను క్షమించమని గురుదేవులను అర్థించింది. మాతృ దేవిని క్షమాపన అడగమని చెప్పి పంపారు గురుదేవులు. గోలాప్ మా విలపిస్తూనే దక్షిణేశ్వరం పరుగెత్తింది. మాతృదేవిని క్షమాపణ యాచించింది. ఎవరి పట్లా ఎన్నడూ కలలో కూడా కోపమూ, పగనూ చూపని మాతృదేవి చిరునవ్వుతో గోలాప్ మా వీపుపై నిమురుతూ ప్రేమగా మాట్లాడారు. దుఃఖపూరితురాలైన గోలాప్ మా మనస్సు తేలికపడింది.
శ్యాంపుకూర్లో గురుదేవుల సేవలో
గురుదేవులు శ్యాంపుకూర్కు వెళ్లిన తర్వాత మాతృదేవి ఎక్కువ రోజులు దక్షిణేశ్వరంలో ఉండలేదు. గురుదేవులను కలకత్తాకు తీసుకువెళ్లి చికిత్స ప్రారం భించినప్పుడు ఆయనకు ఆవశ్యకమయిన పథ్యాహారం తయారుచేయడానికీ, వేళకు సరిగ్గా ఆయనకు ఆహారం ఇవ్వడానికీ మాతృదేవి సహాయం ఎంతో అవ సరమయింది. కానీ శ్యాంపుకూర్లో గురుదేవులు బసచేసిన అద్దె ఇంట్లో స్త్రీలు ఉండడానికి ప్రత్యేకంగా గదులేవీ లేవు. ఇంటి నిండా భక్తులు ఎప్పుడూ ఉండే వారు. స్వతహాగా లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవి, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ బస చేయడానికి సమ్మ తిస్తారా అని భక్తులు సందిగ్ధంలో పడ్డారు. ఈ విష యంగా గురుదేవులను సంప్రదించినప్పుడు, “ఆమె ఇక్కడికి వచ్చి ఉండగలుగు తుందా? ఆమెను అడిగి చూడండి. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకొన్న తర్వాత ఆమె ఇక్కడకు వచ్చి ఉండడానికి ఇష్టపడితే రమ్మనండి” అన్నారు. దక్షి ణేశ్వరానికి మాతృదేవి వద్దకు మనిషిని పంపించారు.
‘ఎప్పుడు ఎలాగో అప్పుడు అలా, ఎక్కడ ఎలాగో అక్కడ అలా, ఎవరితో ఎలాగో వారితో అలా’ అనేవారు గురుదేవులు. దేశకాల పరిస్థితులకు అను గుణంగా జీవించడం నేర్చుకోవాలి. అలా జీవించడం సాధ్యపడకపోతే ప్రశాంత తను పొందడమో, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమో అసంభవమవుతుంది. లజ్జ అనే చొరబడలేని తెర వెనుక మాతృదేవి ఎల్లప్పుడూ ఉన్నా, గురుదేవుల ఈ ఉప దేశానుసారం తమ జీవితాన్ని అమర్చుకోగల పాఠాన్ని ఆమె నేర్చుకున్నారు. అందువల్ల తమ ఇబ్బందులను గురించి కాస్త కూడా పట్టించుకోకుండా శ్యాంపు కూర్కు వచ్చి సంతోషంతో ఆ బాధ్యతను స్వీకరించారు.
అపరిచితులైన పురుషులు ఉంటున్న ఇంట్లో అన్ని అసౌకర్యాలనూ సహించుకొంటూ తమ బాధ్యతను నెరవేర్చసాగారు మాతృదేవి. అక్కడ ఒక్కటే స్నానాల గది ఉండేది. అందువల్ల తెల్లవారుజాము మూడు గంటలకు మునుపే ఎప్పుడు లేచి కాలకృత్యాలు తీర్చుకొంటారో, తర్వాత రెండవ అంతస్తులో ఉండే మరుగైన చోటికి ఎప్పుడు వెళతారో ఎవరికీ తెలియదు. పగలంతా అక్కడే ఉండేవారు. గురుదేవులకు ఆవశ్యకమయిన ఆహారం వండేవారు. తర్వాత వృద్ధు డైన పెద్ద గోపాల్ లేక లాటూ ద్వారా కబురు పంపేవారు. గురుదేవుల ప్రక్కన ఉండేవారు వెళ్లిపోయారంటే, ఆమె ఆహారం కిందకు తీసుకువచ్చి ఇచ్చేవారు. లేకపోతే భక్తులు తీసుకువచ్చి ఇచ్చేవారు. తర్వాత మాతృదేవి కూడా ఏదో నాలుగు మెతుకులు తిని అక్కడ విశ్రమించేవారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి సుమారు పదకొండు గంటలకు కిందకి దిగివచ్చి తమకు కేటాయించిన గదిలో రాత్రి రెండు గంటల దాకా నిద్రించేవారు. గురుదేవుల వ్యాధి నయమవ్వా లనే ఏకైక ధ్యేయంతో ఆమె నిత్యం ఇలా గడిపారు. అక్కడికి నిత్యం వచ్చే వారిలో అనేకులకు అలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉంటూ, గురుదేవులకు ముఖ్యమయిన సేవ చేస్తూ ఉండడం తెలియదు.