ఆధ్యాత్మికోన్నతి : అపూర్వ సంబంధం
మాతృదేవి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు, అత్యంత ఉత్కృష్ట మయిన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నారు అని ఆమె జీవితాన్ని ఇంతదాకా పరి కించిన మనకు తెలియవస్తోంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇది కాదు. ఇలాంటి ఉన్నత స్థితిలో నెలకొన్న ఆమె తమ భర్తతో కలిగివున్న సంబంధమే మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి సంబంధానికి ఆమె భర్త కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలోని వారన్నది ఒక కారణమైనా, అదే కారణమని చెప్పలేం. వారు పరస్పరం చక్కగా అవగతం చేసుకున్నారన్నదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. దాంపత్య జీవి తంలో ఇది ఎంతో ముఖ్యం ఎక్కడో పుట్టిన ఇద్దరు కలిసి జీవించేటప్పుడు సమ స్యలు తలెత్తడం సహజం. భర్త జీవితం ఇదని భార్యా, భార్య జీవితం ఇదీ అని భర్తా అర్థం చేసుకుని జీవితం గడిపేటప్పుడు దాంపత్యం సుగమంగా సాగు తుంది. ఇలా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా కావలసింది ఉన్నతాదర్శం. దాంపత్య జీవితంలో కూడూ గుడ్డ లాంటి అవసరాలను తీర్చుకోవడం, వంశవృద్ధి లాంటి మామూలు ఆదర్శాలకు ఉపరితలంగా ఒక ఉన్నతాదర్శం ఉండాలి. అప్పుడు మాత్రమే జీవితం సార్థకమవుతుంది.
అలాంటి ఉన్నత ఆదర్శాన్ని స్వీకరించినప్పుడు దాంపత్య కర్తవ్యాలను సరిగా నెరవేర్చలేకపోతున్నామని అనేకులు చెప్పడం కద్దు. కానీ ఇది ముమ్మాటికీ తప్పు మాత్రమే కాకుండా, ఉన్నత ఆదర్శం ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల సంబంధం ఆదర్శప్రాయంగా ఉంటుందని చూపడానికి వచ్చిందే మాతృదేవి జీవితం. మాతృదేవి, గురుదేవులు డెబ్బై అయిదు అడుగుల దూరంలో జీవనం గడుపుతూ, రెండు నెలలు పర్యంతం పరస్పరం కలుసుకోకుండా కూడా ఉన్నారు. అయినా వారిద్దరి మధ్య నెలకొన్న సంబంధం ఎంత అద్భుతమయినది! ఇద్దరూ చేగొన్న ఉన్నతాదర్శమే వారిని ఇలా ఉన్నత అనుబంధంతో పెనగొనజేసింది.
మాతృదేవి శ్రేయస్సు పట్ల గురుదేవుల అక్కర
గురుదేవులు మాతృదేవుల దివ్యమయమైన సంబంధం గురించి చెప్పి నప్పుడు గౌరీ మా, “మాతృదేవి గురుదేవులు కేవలం 75 అడుగుల దూరంలో జీవించారు. కానీ చాలారోజులు పరస్పరం కలుసు కోవడం కూడా కుదరలేదు. అయినా ఇద్దరి మధ్య ఎంత గాఢమైన సంబంధం నెలకొందో! ఒకసారి మాతృదేవికి తలనొప్పి వచ్చినప్పుడు గురుదేవులు రామ్‌లాల్‌తో చిన్న బిడ్డలాగా, “రామ్‌లాల్! ఆమెకు ఎందువల్ల తలనొప్పి వచ్చింది?” అంటూ ఎంతో ఆవేదనతో అడుగుతూవుండడం నేను చూశాను’ అని పేర్కొన్నారు.
గురుదేవులు సర్వసంగపరిత్యాగియైనా స్త్రీల మనోభావాన్ని బాగా గ్రహిం చినవారు. తన ఆవశ్యకతలను, చిన్న చిన్న ఆకాంక్షలను భర్తే గ్రహించి పూర్తి చేయాలని స్త్రీ ఆశిస్తుంది. అందువల్ల తమ శక్తి మేరకు ఆయన మాతృదేవి కోర్కె లను, అవసరాలను తీర్చారు.
మాతృదేవికి ఆభరణాలు ధరించాలనే కోర్కె ఉండేది. ఆమెకు ఆభరణాలు చేయించాలని సంకల్పించారు గురుదేవులు. ఆలయం నుండి ప్రతి నెల జీతంగా వచ్చే ఏడు రూపాయలను ఒక పెట్టెలో వేసి ఉంచడం రివాజు. ఆ డబ్బుతో మాతృదేవికి ఆభరణాలు చేయాలని అనుకున్నారు ఆయన. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు: “నాకు ఆభరణాలు ధరించాలనే కోర్కె గురించి చెబుతూ గురుదేవులు, ‘ఆమె పేరు శారద. ఆమె సరస్వతీ అవతారం. అందు వల్లనే ఆభరణాలు ధరించాలని ఆకాంక్షిస్తున్నది’ అనేవారు. ఒక రోజు హృదయ్‌తో, “ఆ పెట్టెలో ఎంత డబ్బుందో చూడు! ఆమెకు చక్కని బంగారు ఆభరణం ఏదైనా చేసిపెట్టాలి” అన్నారు. అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగా లేదు. అయినా మూడు వందల రూపాయలు పెట్టి నాకు నగలు చేయించి ఇచ్చారు. ఆయన డబ్బును తాకలేరనే విషయం ఇక్కడ గమనార్హం.’ మాతృదేవి చేతులకు ధరించిన బంగారు గాజులు అప్పుడు గురుదేవులు చేయించినవే, గురుదేవులు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించిన కాలఘట్టంలో పంచవటిలో ఆయనకు సీతాదేవి దర్శనం కలిగింది. సీతాదేవి ధరించిన అనేక రత్నాలతో కూడుకొన్న బంగారు గాజులు ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ దృశ్యంలో చూసిన గాజులలాంటి వాటినే మాతృదేవికి చేయించారు. ‘నేను నగలు చేసి పెట్టేటంత సంబంధం మా మధ్య ఉండేది’ అంటూ గురుదేవులు చమత్కరించేవారు. ఈ ఆభరణాలు మాత్రమే కాకుండా బంగారు అడ్డిగ, గుండ్రని ముక్కపుడక, చెవులకు దుద్దులు, మరిన్ని నగలను కూడా మాతృదేవి ధరించారు. ఇవన్నీ గురుదేవుల సాధన కాలంలో మధురబాబు చేసిపెట్టినవి. లభించిన ప్రతి సందర్భంలోనూ గురుదేవులు మాతృదేవిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు. చమత్కార సంఘటన లకు కూడా కొదవ లేదు. ఒకసారి గురుదేవుల సమక్షంలో ఒక పోటీ జరిగింది. పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనతో పాటు పోటీలో పాల్గొన్నది ఒక భక్తుని అల్లుడు. ఇద్దరూ పసిడిరంగువారే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రంగులో ఉన్నారన్నదే పోటీ. ఈ పోటీకి మధ్యవర్తిగా ఎవరు ఉండాలి? మాతృదేవే! పంచవటి సమీపంలో వీరిద్దరూ మాతృదేవికి కనబడేటట్లు నడవాలి. మాతృదేవి ఇద్దరి రంగునూ దూరం నుంచే చూశారు. మధ్యస్థం తప్పనివారు, చివరకు ఆ భక్తుని అల్లుడు గురుదేవుల కన్నా కించిత్తు ఎక్కువ రంగులో ఉన్నా డనీ, ఆతడే పోటీలో గెలిచినట్లు ప్రకటించారు.
తన సహధర్మిణి భవిష్యత్తుకై డబ్బు కూడా సేకరించి ఉంచారు గురు దేవులు. డబ్బును తాకజాలని ఆ త్యాగీశ్వరుడు చేసిన ఈ కార్యమే వారికి తమ అర్ధాంగి పట్ల గల అవినాభావ సంబంధాన్ని చెప్పక చెబుతుంది. మాతృదేవి ఇలా అనేవారు: “గురుదేవులు త్యాగమనే పదానికి తాత్పర్యంగా నిలిచారు. అయినా నా గురించి బెంగ ఆయనకు ఉండనే వుంది. ఒకరోజు నాతో ‘నీ ఖర్చులకు ఒక నెలకు ఎంత కావాల్సి వస్తుంది?’ అని అడిగారు. ‘ఐదారు రూపాయలు చాలు’ అన్నాను నేను. తర్వాత, ‘సరే! రాత్రుళ్లు ఎన్ని చపాతీలు తింటావు?’ అని అడి గారు. లజ్జతో ముడుచుకుపోయాను. ఈ ప్రశ్నకు ఎలా బదులు చెప్పాలో అంతు బట్టలేదు. కానీ ఆయన మాత్రం ఆ ప్రశ్ననే పదే పదే అడిగారు. ఇక గత్యంతరం లేక, ‘ఐదు లేకపోతే ఆరు’ అని చెప్పాను. మాతృదేవి చెప్పిన విషయాన్ని మనస్సులో ఉంచుకుని గురుదేవులు సుమారు 600 రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో మాతృదేవి ఇబ్బంది పడకుండా జీవనం గడపవచ్చని తేల్చుకొన్నారు. అలాగే ఆ డబ్బును బలరాం బోసు వద్ద జమ చేసి ఉంచారు. ఆతడు ఆ పైకాన్ని తన ఎస్టేటులో వెచ్చించి వడ్డీగా ముఫ్పై రూపాయలను ఆరు నెలల కొకసారి మాతృదేవికి పంపాలని తీర్మానించారు.
మాత్రదేవికి ప్రశంన
భర్త చేసే చిన్న చిన్న ప్రశంసలు భార్యకు ఎంతో ఉత్సాహభరితం గాను, ఆనందదాయకంగాను ఉంటాయి. మాతృదేవి మధురంగా పాడతారని మనం విన్నాం. ఒక రాత్రి మాతృదేవి, లక్ష్మి ఇద్దరూ పాడుతున్నారు. పాట భావంలో లీనమై వారు గానం చేయడం శ్రోతలను ఉన్నత స్థితులకు తీసుకువెళ్లేట్లుగా ఉంది. దానితోపాటు సుశ్రావ్య కంఠం కలిసినందువల్ల శ్రోతలకు మధురాను భూతిని కలుగచేసింది. గురుదేవులు ఆ పాటను పూర్తిగా విన్నారు. మర్నాడు మాతృదేవితో, “నిన్నటి రాత్రి ఆ పాటను తన్మయంతో పాడావు. వినడానికి ఎంతో బాగుంది” అన్నారు.
కొన్ని సమయాల్లో మాతృదేవి కాళీమాతకు పూల హారం తయారుచేసి ఇచ్చేవారు. ఒక రోజు మల్లెమొగ్గలను, ఎర్ర గన్నేరు మొగ్గలను దట్టంగాకట్టి పూలహారం తయారుచేశారు. కాసేపు ఆ పూలహారాన్ని నీళ్లలో ఉంచి ఆ మొగ్గలు వికసింపనారంభించినప్పుడు ఆలయానికి పంపించారు. పూజారి ఆ పూలహారాన్ని కాళీమాతకు అలంకరించడమూ, గురుదేవులు అక్కడికి రావడమూ ఒక్కసారీ జరి గాయి. నలుపు చలవరాతి విగ్రహంపై తెలుపు, ఎరుపులతో ఆ పూలహారం ఎంతో అందంగా కనిపించింది. ‘ఆహా! ఏం అద్భుతం! ఎంత ఆకర్షణీయంగా ఉంది!’ అంటూ ప్రశంసించారు గురుదేవులు. ఈ పుష్పమాలను తయారుచేసింది మాతృదేవే అని తెలుసుకున్నప్పుడు, “ఆహా! ఎవరైనా వెళ్లి ఆమెను తీసుకురండి. ఆమె కూడా ఈ అందాన్ని చూడాలి!” అన్నారు. పనిమనిషి బృందతో మాతృదేవి అక్కడికి వచ్చారు. భక్తులు కొందరు అక్కడ ఉండడం చూసి, బృంద వెనుక నక్కి వెనుకవైపుగా వెళ్లి, మెట్లులేని చోట నుండి పైకి రావడానికి ప్రయత్నించారు. అది గమనించిన గురుదేవులు, “అటువైపు ఎక్కకు! ఆ జాలరి స్త్రీ ఆ రోజు అటువైపు ఎక్కి జారి కిందపడి మరణించింది. మెట్లు ఎక్కిరా!” అన్నారు. ఈ మాటలు విని, మాతృదేవి వస్తున్నారని తెలుసుకుని భక్తులు ఒదిగి నిలబడ్డారు. మాతృదేవి ముందున్న మెట్ల మీదుగా వచ్చి, కాళీమాత కంఠంలో తాము కట్టిన పూలమాల శోభిస్తూ ఉండడం చూసి ఉప్పొంగిపోయారు.
మాతృదేవి పట్ల గౌరవం
“నన్ను ‘తుయీ’* అంటూ పిలవని ఒకరిని వివాహం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఒక పువ్వును నా మీదికి విసిరి కూడా నన్ను నొప్పించాలని తలంచని ఉత్తములు ఆయన” అంటూ మాతృదేవి ప్రశంశించేటంతగా గురు దేవులు, మాతృదేవి పట్ల వ్యవహరించారు. ఒకసారి మాతృదేవి గురుదేవులకు ఆహారం తీసుకువచ్చి ఉంచి వెళ్లిపోయారు. వచ్చిన వ్యక్తి లక్ష్మి అనుకుని గురుదేవులు ‘తుయీ’ అనే పదాన్ని వాడి, “తలుపు మూసివెళ్లు” అన్నారు. మాతృదేవి ‘సరి’ అని చెప్పినప్పుడే, వచ్చింది లక్ష్మి కాదని ఆయనకు తెలిసింది. అంతే, తామేదో అమ ర్యాద చేసినట్లు, “ఆహా! నువ్వా! లక్ష్మి అని అనుకున్నాను. అన్యథా భావించవద్దు” అంటూ పదేపదే కలతపడుతూ మాతృదేవితో అన్నారు. దాంతో ఆగారా?మర్నాడు తెల్లవారగానే నహబత్ తలుపు వద్ద నిలబడి, “ఇదిగో చూడు! నేను అలా అనడం తలచుకొని రాత్రంతా నిద్రపోలేకపోయాను” అని అన్నారట. అంత మాత్రమే కాదు, మాతృదేవి ఆయన తైలమర్దనం చేసిన తరువాత, కాళ్లు ఒత్తుతూపరిచర్యలు చేశాక, చేతులు జోడించి ఆమెకు నమస్కరించేవారట!
మాతృదేవి మాటలపై ఎంతో విశ్వాసం ఉండేది గురుదేవులకు. అనేక విషయాలలో మాతృదేవిని సంప్రతించేవారు. ఒకసారి ఎక్కడికో వెళ్లాలనుకొన్నారు.మాతృదేవిని సంప్రతించినప్పుడు వారు వెళ్లవద్దని ఆమె గురుదేవులను వారించారు. ఈ సంఘటనను సూచిస్తూ గురుదేవులు కాలాంతరంలో చమత్కారంగా, “ఆమె వద్దని చెప్పగానే నేను వెళ్లడం మానుకున్నాను. నా పరిస్థితే ఇలా తయారయితే ఇక సామాన్య గృహస్థుల గతి ఎలా ఉంటుందో?” అన్నారు.
మాతృదేవి ఆధ్యాత్మిక ఉన్నతిని గ్రహించిన గురుదేవులు తాము వారికిమర్యాద చూపడమే కాకుండా, ఇతరులు కూడా అలాగే చెయ్యాలనే విషయంలోజాగ్రత్త వహించారు. మాతృదేవిని అగౌరవపరిచేవారు, ఎలాంటి ఘోర పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు.
ఒకసారి గురుదేవుల సమక్షంలోనే హృదయ్ మాతృదేవితో అమర్యాదగామాట్లాడాడు. మాతృదేవి దానిని సహించారు. కానీ హృదయ్ చర్యకైన పర్యవ సానాన్ని ఎరిగిన వారు కాబట్టి గురుదేవులు, “ఇదిగో చూడు! నువ్వు నన్ను ఎంతగానో నిందించావు. కానీ ఆమెతో మాత్రం ఆట్లాడకు! నాలోని శక్తి కోపగించుకున్నా, బహుశా నువ్వు బతికిబయటపడవచ్చు. కానీ ఆమెలోని శక్తి బుసకొడితేబ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దిగి వచ్చినా నిన్ను కాపాడలేరు” అంటూ ఆతనిని హెచ్చరించారు.*
తన వల్ల కూడా మాతృదేవి మనస్సు ఏ విధంగానూ బాధపడకుండా గురుదేవులు జాగ్రత్తపడేవారు. కుటుంబ విషయంలోనైనా, మరే విషయంలోనైనా సరే, తన నిర్ణయమిదే అంటూ మాతృదేవి కచ్చితంగా చెప్పేశారంటే, ఆ నిర్ణ యాన్ని ప్రశ్నించడానికో, అందుకు భిన్నంగా నడుచుకోడానికో ఆయన ప్రయ త్నించరు.
ఆ సమయంలో గురుదేవులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అనేక పండ్లు, తీపి పదార్థాలు తీసుకువచ్చేవారు. మాతృదేవి వాటిలో కొంత గురుదేవు లకు ప్రత్యేకంగా తీసి, మిగిలిన వాటిని అక్కడకు వచ్చే భక్తులకు చుట్టుప్రక్కల ఉండే పిల్లలకూ, ఇతరులకూ పంచిపెట్టేవారు, దేనిని కూడా మిగులబెట్టరు. ఒకసారి మాతృదేవి ఇలా అందరికీ పంచిపెడుతూవుండడం చూసిన గురుదేవులు “ఇలా ఇష్టమొచ్చినట్లు నువ్వు ఖర్చు చేస్తే, కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తావు?” అని ప్రశ్నించారు. సామాన్యంగా మాతృదేవి తన భావనలను బయట పడనీయరు. కానీ గురుదేవులు ఇలా అడిగేసరికి ఆమె ముఖం వాడిపోయింది. ఆకలితో తన వద్దకు వచ్చేవారికి ఆకలి తీర్చడానికి ఏదైనా పెట్టాలనే తన మాతృత్వ భావనలకు ఇలా అడ్డుపడుతూన్నారేనని ఆమె మనస్సు బాధపడింది. అయినా మారు మాట్లా డక నహబత్తుకు వెళ్లిపోయారు.
మాతృదేవి మనఃస్థితిని వెంటనే అర్థం చేసుకున్నారు గురుదేవులు. వెంటనే ప్రక్కనే ఉన్న రామ్‌లాల్‌ను పిలిచి, “ఒరే రామ్‌లాల్! నీ పిన్నమ్మ కోపగించుకుని వెళ్లిపోయింది. పరుగెత్తు! పరుగెత్తు! పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెకు సర్దిచెప్పు లేకపోతే నా అవస్థ అంతే!’ అంటూ మాతృదేవిని అనునయించడానికి రామ్ లాల్‌ను పంపించారు.
మాతృదేవి సూక్ష్మగ్రాహ్యత
మాతృదేవి జీవితాన్ని, అవసరాలనూ గురుదేవులు ఎరిగి వున్నట్లే, గురు దేవుల ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు మాతృదేవికి ఎరుకే! ఒకసారి గురుదేవులు మాతృదేవితో తన పడక గది ఇత్యాదులను శుభ్రం చేయ మని చెప్పి, కాళికాలయానికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చే లోపు తన పనిని ముగించాలని మాతృదేవి ఆదరాబాద రాగా పనిచేయసాగారు. కానీ గురుదేవులు సత్వరమే కాళికాలయం నుండి తిరిగి వచ్చేశారు. వచ్చేటప్పుడు మితిమీరి త్రాగినట్లు కళ్లు ఎర్రబారి, కాళ్లు తడబడగా, తూలుతూ వచ్చారు. వచ్చినవారు వెనుక నుండి హఠాత్తుగా మాతృదేవిని తాకి, నెట్టుకుంటూనే, “అవును శారదా! నేను ఏమన్నా మద్యం త్రాగానా?” అని తడ బడే మాటల్లో అడిగారు. గురుదేవులు తనను సమీపించేవరకు మాతృదేవి గమ నించలేదు. హఠాత్తుగా ఆయన కంఠస్వరం విని హడలిపోయారు. మరుక్షణం తేరుకుని, “ఎందుకు? మీరెందుకు మద్యం సేవించాలి?” అన్నారు. అందుకు గురుదేవులు, “అలా అయితే నే నెందుకు తూలుతూన్నాను? మాటలు ఎందుకు తడబడుతున్నాయి? బహుశా కాస్త త్రాగానేమో?” అన్నారు. “లేదు, లేదు! మీరెం దుకు మద్యం తాగాలి? శ్రీ కాళీమాత ప్రేమామృతాన్ని కదా మీరు గ్రోలి ఉన్నారు!’ అన్నారు మాతృదేవి. ఈ జవాబు గురుదేవులకు పరమ తృప్తి నిచ్చింది. తన యథార్థ పరిస్థితిని మాతృదేవి అర్థం చేసుకున్నారని గ్రహించి పరమానందంతో, “నిజమే. నువ్వు సరిగ్గా చెప్పావు!” అన్నారు.
మరొకసారి గురుదేవులు భక్తులతో పాటు పానీహాటీ అనే ఊళ్లో జరగనున్న సుప్రసిద్ధమైన మహోత్సవానికి వెళ్లాలనుకొన్నారు. పురుషులూ, స్త్రీలూ కలిసి మూడు పడవలలో బయలుదేరడానికి సన్నద్ధులయ్యారు. మాతృదేవి కూడా ఆ ఉత్సవంలో పాల్గొనాలనే కోర్కెను ఒక భక్తురాలి ద్వారా గురుదేవులకు తెలియ జేశారు. అందుకు గురుదేవులు, “ఆమెకు రావాలనిపిస్తే రావచ్చు” అని చెప్పారు. ఈ మాటలను ఆ భక్తురాలు మాతృదేవికి చెప్పింది. గురుదేవుల మాటలను ఆల కించిన మాతృదేవి తమ కోర్కెను మార్చుకుని, “ఓ ఇక్కడ నుండి చాలామంది వెళుతున్నారు, అక్కడా బాగా రద్దీగా ఉంటుంది. ఇంత కోలాహలంలో నేను కూడా వచ్చి ఆ ఉత్సవాన్ని చూడడం కష్టమే. నేను రావడం లేదు” అని ఆ భక్తు రాలితో చెప్పి, తాము వెళ్లకుండా ఉండిపోయారు. తక్కిన వారందరూ వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత గురుదేవులు ఒక భక్తురాలితో, “ఆమె రాకపోవడం మంచిదయింది. ఎంత రద్దీ! నా పారవశ్య స్థితుల కారణంగా అందరి దృష్టీ నామీదే ఉండిపోయింది. ఆమెను నాతోపాటు చూసివుంటే, ‘హంసాలు హంసీ* వచ్చి ఉన్నారు’ అంటూ ఎగతాళి చేసివుండేవారు. ఆమె బాగా ముందుచూపు గలది. అందుకే ఇక్కడే ఉండిపోయింది” అని అన్నారు. ఈ విషయం గురించి అడిగినప్పుడు మాతృదేవి, “నేను వెళ్లడం తమకు ఇష్టం లేదని ఆయన జవాబు నుండే అర్థం చేసుకున్నాను. మనఃస్ఫూర్తిగా నేను రావాలని అనుకొనివుంటే, ‘ధారాళంగా రావచ్చు’ అనేవారు. కానీ ‘ఆమె ఇష్టపడితే రావచ్చు’ అంటూ సందిగ్ధత వెలిబుచ్చడంతో వెళ్లకపోవడమే సముచితమని తీర్మానించాను” అన్నారు.
మాతృదేవి చెప్పిన ‘అబద్ధం’
గురుదేవుల మనఃస్థితి ఒక బాలుని పోలినదిగా ఉండేది. బిడ్డా, భగవం తుడూ ఒక్కటే అని చెబుతారు కదా! అది ఆయన విషయంలో పూర్తిగా నిజం. బిడ్డవంటి వారితో, భార్య అనే స్థితిలో కంటే, తల్లిగానే మాతృదేవి వ్యవహరించారు. తనతోపాటు తన ఏడు తరాలవారు కూడా కలిసి ప్రయత్నించినా కూడా సాధించ లేమని తెలిసినా, బిడ్డను తినేటట్లు చేయడానికి ‘చంద్రుణ్ణి పట్టి ఇస్తాను’ అంటూ వెనుకాడక అబద్ధం చెప్పే ఆ మాతృ హృదయంతోనే గురుదేవులను చూసు కొన్నారు మాతృదేవి. అబద్ధం, అనునయ వచనాలు, నిష్కర్ష అంటూ పలు విధాలుగా గురుదేవుల జీవితాన్ని పరిపుష్టం జేయడమే లక్ష్యంగా మలచుకొన్నారు మాతృదేవి. ఒకటి రెండు సంఘటనలను మాతృదేవే స్వయంగా కాలాంతరంలో వివరించారు.
ఒకసారి గురుదేవుల ఆరోగ్యం దెబ్బతింది. కుమారతోలాలో వసించే గంగా ప్రసాదసేన్ అనే వైద్యుణ్ణి తీసుకువచ్చారు. ఆయన కొన్ని మందులు ఇస్తూ నీళ్లు త్రాగకూడదనే నియమం పెట్టారు. అంతే, గురుదేవులు ప్రతి ఒక్కరితోనూ, ‘నీళ్లే తాగకూడదట కదా! నా వల్ల అది సాధ్యమవుతుందా?’ అని అడగసాగారు. ఐదేళ్ల బిడ్డను కూడా వదలిపెట్టలేదు. ప్రతి ఒక్కరూ, ‘అది మీకు సాధ్యమే’ అనేశారు. తర్వాత నాతో కూడా, “ఇది జరిగేపనేనా?” అని అడిగారు. నేను, ‘మీరు చేయ గలరు, తప్పకుండా మీవల్ల అవుతుంది’ అన్నాను. వెంటనే ఆయన నాతో, ‘దానిమ్మపండు గింజలను కడిగి ఇచ్చేటప్పుడు కూడా ఒక్క చుక్క నీళ్లు లేకుండా తుడిచి ఇవ్వు! అలా చేసి ఇవ్వగలవా?’ అని అడిగారు. “కాళికాదేవి కృపాకటా క్షంతో అంతా సాధ్యమవుతుంది. మనకు సాధ్యమైనంత దాకా ప్రయత్నిద్దాం’ అని నేనన్నాను. ఆ తర్వాత ఔషధ సేవనం పూర్తయ్యేదాకా నీళ్లే త్రాగనని తీర్మానించు కున్నారు. అలాగే ఒక్క చుక్క నీరు కూడా త్రాగలేదు.
‘ప్రతి రోజూ ఆయనకు మూడు నాలుగు లీటర్లు పాలు ఇవ్వడం మామూలు. అంచలంచెలుగా ఐదు లీటర్లు ఇవ్వసాగాను. దేవాలయ ఆవులను పితికే వ్యక్తి నాకు చాలా పాలు ఇచ్చేవాడు. “ఇన్ని పాలను పూజారులకిస్తే, వాళ్లు ఇళ్లకు తీసుకు వెళ్లి ఎవరెవరికో ఇస్తారు, మీకు ఇస్తే గురుదేవులే కదా సేవిస్తారు” అనేవాడు ఆతడు. అతడు సజ్జనుడు, భక్తుడు. నేను అతడికి తీపి పదార్థాలు ఇచ్చేదాన్ని. పాలను బాగా మరగబెట్టి పావు భాగానికి తగ్గించేసేదాన్ని. ‘ఇవెన్ని పాలు?’ అని గురుదేవులు అడిగితే, “అంత ఎక్కువగా ఏమీ లేదు. ఒకటి ఒకటిన్నర లీటరు” అని చెప్పేదాన్ని. బాగా మరగబెట్టినందువల్ల పైన పేరుకొన్న గట్టి మీగడను చూసి, “పాలు కాస్త ఎక్కువ ఉన్నట్లుందే” అనేవారు.
‘ఒక రోజు గోలాప్ మా నిజాన్ని చెప్పేసింది. అది వినగానే, “హా! నేను రోజూ ఇన్ని పాలు తాగుతున్నానా? అందుకే అజీర్ణం’ అని చెబుతూ, ‘ఎక్కడ! ఆమెను పిలువు! ఆమెను పిలువు!’ అంటూ అరిచారు. ఇది చెవిన పడగానే నేను ఆయన గదికి వెళ్లాను. పాలు విషయంగా గోలాప్ మా చెప్పిన దానిని నాతో చెప్పారు. అందుకు నేను, “ఆమెకు ఏం తెలుసు? పాలు తీసుకునేది నేను ఎంత తీసుకుంటున్నానో, మీకు ఎంత తీసుకొస్తున్నానో ఆమెకు ఎలా తెలుసు? ఆమె వాగింది మీరు కూడా నిజమనుకొన్నారు” అంటూ ఆయనకు సర్ది చెప్పాను.
ఆయన వదల్లేదు. మరో రోజు గోలాప్ను వివరంగా అడిగారు. ఆమె కూడా, ‘ఒక చెంబెడు పాలు ఆలయం నుండి వస్తుంది. పాలు పితికేవాడు ప్రత్యే కంగా ఒక చెంబు ఇస్తున్నాడు?’ అని చెప్పేసింది. వెంటనే నన్ను పిలిపించారు. నేను ఎంత పాలు తీసుకుంటున్నానో కచ్చితంగా చెప్పమన్నారు. అందుకు నేను, “ఇవన్నీ ఎందుకు? ఈ లెక్కలన్నీ ఎవరికి తెలుసు? మీరు పాలు తీసుకోవాలి అని మాత్రం నాకు తెలుసు. కానీ ఈ సేరు, అరసేరు లెక్కలన్నీ నాకు తెలియదు” అన్నాను. నా జవాబు ఆయనకు తృప్తికరంగా లేదు. “ఇన్ని పాలు తాగితే నాకు ఎలా జీర్ణమవుతుంది? నాకు అజీర్ణం చేసి తప్పకుండా ఆరోగ్యం చెడిపోతుంది” అని అన్నారు. ఈ ఆలోచన ఆయన మనస్సులో మెదలగానే, ఆయనకు నిజం గానే అజీర్ణం చేసింది. ఆ రాత్రి కాస్త బార్లీ జావ మాత్రమే తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత గోలాప్ మా నాతో, “అమ్మా! ముందే ఈ విషయం నాతో చెప్పివుండ వచ్చు కదా! నా కారణంగా ఆయన రాత్రి ఆహారం తప్పిపోయిందే!” అంది. “భోజనం విషయంలో చిన్న అబద్ధమాడడం తప్పు కాదు. ఇలా చేసే ఆయనను ఆహారం తీసుకొనేటట్లు చేస్తున్నాను” అన్నాను నేను. ఎలాగో ఆయన వ్యాధి నయమై ఆరోగ్యం కుదుటపడింది.
సన్న్యాసియైన భర్తకు తగిన భార్య
గురుదేవుల మహోన్నత జీవితపు అంతరార్థాన్ని అనేకులు అనేక విధాలుగా గణిస్తున్నారు. కానీ మాతృదేవికి సంబంధించినంతవరకు ఆయన మహోన్నత్ జీవితం సన్యాసాశ్రమ ఉత్కృష్టతను, త్యాగపు మహిమాన్వితాన్నీ చాటడాని కోసమే! ఈ అభిప్రాయాన్ని మాతృదేవి పలుమార్లు వెలిబుచ్చారు. కాలాంతరంలో శిష్యుడొకడు మాతృదేవితో, “గురుదేవులు ఎనలేని సందే శాన్ని లోకానికి అందించివున్నారు! మతాలన్నీ భగవం తుణ్ణి చేరుకోవడానికి మార్గాలే అనే సత్యాన్ని ఎంత అద్భు తంగా చాటి చెప్పారు!” అని అన్నాడు. అందుకు మాతృదేవి, “నాయనా! నువ్వు చెబుతున్న సర్వమత సమన్వయ విషయం నిజమే. కానీ ఈ నిజాన్ని బోధించడం కోసం ఆయన పలు మతసాధనలు అనుష్ఠించారని నాకు అనిపించడం లేదు. రాత్రింబవళ్లు ఆయన భగవత్ స్మరణతో లీనమై, పారవశ్య స్థితులలో నెల కొన్నారు. హిందూమతపు పలు మార్గాల ద్వారానూ, క్రైస్తవ, ఇస్లాం మతాల మూలంగానూ గురుదేవుల ప్రత్యేకత ఆయన సర్వసంగ పరిత్యాగంలోనే ఉందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి ఒక సహజ సన్న్యాసం మరెవరిలోనైనా కని పిస్తుందా? సన్న్యాసమే ఆయన ఆభరణం’ అన్నారు.
ఇలాంటి అద్భుత సన్న్యాసాన్ని తమ జీవితంలోనూ సహజంగా పాటిం చారు మాతృదేవి. గురుదేవుల పట్ల ఆమె ప్రేమ వర్ణనాతీతం. దీనిని ప్రతి రోజూ ఆమె గురుదేవుల పట్ల చూపించే ఆప్యాయత, వారికి చేసే సేవల మూలంగా మాత్రమే వ్యక్తపరచలేదు. తమ ఆలోచనలను, కోర్కెలను ఆయన జీవితాదర్శంతో ముడివడజేసి అందుకోసం పాటుపడడం ద్వారా కూడా వ్యక్తపరిచారు. ఒక మహాత్ముని అర్ధాంగికి, వారిపట్ల తన కున్న ప్రేమను, మర్యాదను వ్యక్తపరచ డానికి, ఆ మహాత్ముడు ఎంచుకున్న లక్ష్యం నెరవేరడానికి పాటుపడడం తప్ప మరో ఉత్కృష్టమైన మార్గం ఉంటుంది? మాతృదేవి ఈ స్వభావాన్ని వ్యక్తం చేసే ఒకటి రెండు సంఘటనలు పరికిద్దాం.
గురుదేవుల భక్తులలో లక్ష్మీనారాయణ అనే మార్వాడీ ఉండేవాడు. ఒక రోజు గురుదేవుల పరుపు మీద పరచబడిన గుడ్డ మలినంగా ఉండడం చూసి అతడు గురుదేవుల పేరిట పదివేల రూపాయలు బ్యాంకులో నిల్వచేసి తన్మూ లంగా వచ్చే వడ్డీని గురుదేవులు తమ ఖర్చులకు ఉపయోగించుకోవలసిందని ప్రాథేయపడ్డాడు. మూర్తీభవించిన త్యాగమూర్తులైన గురుదేవులు ఈ సలహాకు సుతరామూ అంగీకరించలేదు. పదే పదే ఈ ఏర్పాటు గురించి తన వద్ద ప్రస్తా వించవద్దని గట్టిగా చెప్పేశారు. ఆ భక్తుడు వదలకుండా మరీ ప్రాథేయపడ్డాడు. ఆతడి వేధింపు నుండి తప్పించుకోవడానికి, “నాకు ఆ డబ్బు అక్కరలేదు. బహుశా శారద ఇష్టపడితే తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు” అని అన్నారు. కానీ మాతృదేవి త్యాగంతో మేళవించిన మనస్సు కూడా ఏ విధంగానూ తీసిపోలేదు. ఆమె ఆ పైకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ, “నేను తీసుకున్నా అది ఆయన సేవలకే ఉపయోగపడుతుంది కనుక ఆయన తీసు కున్నట్లే కదా!” అని కచ్చితంగా చెప్పేశారు. మాతృదేవి అలా నిరాకరించడంతో గురుదేవులు ఎంతో సంతోషించారు.
ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు అనే విచక్షణా జ్ఞానాన్ని కొన్నిసార్లు కోల్పోతుంది గోలాప్ మా. ఆమె ఒకసారి మాతృదేవితో ఇలా అన్నది: “అమ్మా! నిన్న ఇక్కడికి వచ్చిన మన్మోహన్ తల్లిగారు నాతో, ‘గురు దేవులు సర్వస్వమూ త్యజించిన సన్న్యాసి కదా! కానీ మాతృదేవి దుద్దులు, గాజులు మొదలైన నగలు ధరించి అలంకరించిన దేవిలా ఉన్నారు. ఇది చూడడానికి బావుందా?’ అని చెప్పింది.” మాతృదేవి వెంటనే ఏమీ మాట్లాడక మౌనం వహిం చారు. మర్నాడు యోగిన్ మా మాతృదేవిని చూడడానికి నహబత్తుకు వెళ్లినప్పుడు ఆమె స్వరూపమే మారిపోయి ఉంది. చేతులకు ధరించిన రెండు గాజులు తప్ప తక్కిన నగలన్నీ మాతృదేవి తీసివేశారు. ఏదో జరిగిందని మాత్రం ఆమె ఊహించుకోగలిగింది. ఆమె ఎంతగానో ప్రాథేయపడిన తర్వాతనే దుద్దులు, ఒకటి రెండు నగలు ధరించారు. కానీ ఆ తరువాత అన్ని నగలనూ ఏకంగా ఆమె ధరిం చింది లేదు. ఎందుకంటే ఈ సంఘటనకు కొద్ది కాలానికే గురుదేవులు నయం కాని వ్యాధితో మంచం పట్టారు, కనుక. ఇలా భర్తకు యుక్తమైన భార్యగా జీవించి తరించారు మాతృదేవి. గురుదేవుల ఆదర్శాలను పుణికిపుచ్చుకొని గార్హస్థ్య ఆద ర్శాన్ని జీవించి చూపించారు. ఇలా గురుదేవుల మూడు పరిమాణాలలో ఒకటైన సంపూర్ణ మానవ పరిమాణాన్ని పరిపూర్తి చేశారు.