షోడశీ పూజ
అది 1873 వ సంవత్సరం. మే నెల 25 వ తేదీ. ఫలహారిణీ కాళికాదేవి పూజ నిర్వహింపబడే అమావాస్య రోజు. నాడు దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలు జరుగుతాయి. గురుదేవులు కూడా కాళీమాతను స్వయంగా పూజించడానికి విశేష ఏర్పాట్లు చేయించారు. సాయంకాలమయింది. అమావాస్య కారుచీకట్లు క్రమంగా అంతటా క్రమ్ముకో సాగాయి. ఆలయంలో కాళీమాత పూజ చేయవలసి ఉన్నందున హృదయ్, గురు దేవుల గదిలో పూజా ఏర్పాట్లన్నీ చేసి, వెళ్లిపోయాడు. రాధాకృష్ణ ఆలయంలో రాత్రి వేళ పూజ ముగించి ఆ ఆలయ పూజారియైన దీనూ గురుదేవులకు సహాయపడ డానికి వచ్చాడు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిది గంటలయింది. పూజలో పాల్గొనడానికి శారదకు కబురు పంపారు. గురుదేవుల గదికి ఆమె వచ్చింది. ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దిన పీఠాన్ని దేవికి ఆసనంగా పూజారికి కుడివైపు అమర్చారు. గురుదేవులు తమ ఆసనంలో కూర్చున్నారు. పూజ ప్రారంభ మైంది.
మంత్రపూతంగా పూజాద్రవ్యాలు శుద్ధి చేయబడ్డాయి. ప్రారంభ విధులు పూర్తికాగానే గురుదేవులు శారదను పీఠం మీద కూర్చోమని సైగ చేశారు. పూజను తదేకంగా తిలకిస్తూన్న శారద అప్పటికే బాహ్యస్మృతిని కోల్పోయి పారవశ్య స్థితిలో ఉంది. తాను ఏం చేస్తున్నదో తెలియక, మంత్రముగ్ధలా మెల్లగా లేచి ఆ పీఠం మీద గురుదేవులకు కుడివైపు ఉత్తరాభిముఖంగా కూర్చుంది. శాస్త్ర విధుల ప్రకారం గురుదేవులు తమ ముందున్న కలశం నుండి మంత్రపూతంగా పవిత్రీ కరింపబడిన జలాన్ని శారదపై ప్రోక్షించారు: పిదప పఠింపవలసిన మంత్రాలు ఉచ్చరించి ఆవాహన మంత్రాలను ప్రారంభించారు:
“ఓ బాలా! సర్వశక్త్యాధీశ్వరీ, మాతా, త్రిపుర సుందరీ! నాకై సిద్ధి ద్వారాన్ని తెరువు. ఈమె (శారద) మనశ్శరీరాలను పవిత్రీకరించి, ఈమెలో అభివ్యక్తీకరించి సర్వకళ్యాణ సాధనభూతవుకా!”
ఆవాహనం పూర్తిచేశాక శారద శరీరంలో మంత్రపాఠంతో న్యాసక్రియను ముగించి షోడశోపచారాలతో (అంటే అర్ఘ్యపాద్యాదులనే పదహారు ఉపచారాలతో నిర్వర్తించే పూజ) యథావిధిగా ఆమెను సాక్షాత్తూ జగజ్జననిగా అర్చించారు. తదనంతరం నైవేద్యం అర్పించి, దాన్లో ఒకింత తమ చేత్తో ఆమెకు తినిపించారు. ఈలోపు శారద బాహ్యచైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధిమగ్నురాలైంది. గురు దేవులు కూడా అర్ధబాహ్యస్మృతిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు. సమాధిమగ్నుడైన అర్చకుడు సమాధిస్థితిలో విలీనమైన దేవితో తాదాత్మ్యం చెందాడు.
చాలాసేపు గడచిపోయింది. రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడా కొంత గడిచింది. ఆత్మారాములైన గురుదేవులలో బాహ్యస్మృతి జాడలు ఒకింత కనిపించసాగాయి. మునుపటి అర్ధబాహ్య స్మృతిని పొంది దేవికి ఆత్మనివే దనం చేయసాగారు. తమతోపాటు తమ జపమాలనూ, సమస్త సాధనాఫలాలను శాశ్వతంగా దేవి పాదపద్మాల మ్రోల సమర్పించి, మంత్రాలు ఉచ్చరిస్తూ దేవికి ప్రణమిల్లారు.
ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తుతే ॥
షోడశీపూజ పరిసమాప్తమైంది. మూర్తీభవించిన సకల విద్యారూపిణియైన ఒక నారీమణి శరీరం ద్వారా జగదీశ్వరి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలు చరమావస్థను చేరుకొన్నాయి. సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకొన్నారు.
అవతార పురుషులు–శక్త్యోపాసన
పూజ స్వల్పమైనదే. కానీ అది శారదా శ్రీరామకృష్ణుల జీవితంలోనూ, వారి అవతారకార్యంలోనూ వహించిన స్థానం అత్యంత ప్రధానమైనది. సాధారణంగా అవతార పురుషు లందరి జీవితాలలోనూ శక్త్యోపాసన కానవస్తుంది. దీన్లో ఆశ్చర్యం ఏమీ లేదు. అవతార పురుషులు ఉద్భవించినప్పుడు లోకం పోకడలోనే గొప్ప మలుపు రావడం అనుభవైకవేద్యమే. అందుకు అవసరమైన శక్తిని జగజ్జనని నుండి ఆరాధన మూలంగా వారు సంతరించుకొంటారు. శ్రీరామకృష్ణులు అవతరించిన కాలఘట్టం, అంతకు మునుపు అవతారాలు ఉద్భవించిన కాలఘట్టం కన్నా ఎంతో భిన్నమైనది. యథార్థమైన ఆధ్యాత్మికతకు పందొమ్మిదవ శతాబ్దం కన్నా క్లిష్టమైన సమయం మరొకటి లేదనే చెప్పాలి. ఈ పరిస్థితిని ఎదుర్కొని ఆధ్యాత్మికతను పరిపోషించడం సామాన్యమైన విషయం కాదు. అందుకేనేమో, ఇతర అవతార పురుషులు ప్రత్యేక సమయాలలో ప్రత్యేక విషయాలను ముందుగా మాత్రమే శక్తిని ఉపాసించగా, శ్రీరామకృష్ణులు సమగ్ర శక్త్యోపాసకులయ్యారు.
కానీ కాళీమాత ఉపాసకులైన ఈయన షోడశిని ఎందుకు పూజించాలి? పూజలందుకొనే మూర్తిగా భార్యనే ఎందుకు ఎన్నుకోవాలి? లజ్జా, మార్దవమూ, దృఢత్వమూ మూర్తీభవించిన ఆ భార్య కూడా ఆ పూజను ఎందుకు స్వీకరించాలి? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే షోడశీమూర్తి వైశిష్ట్యాన్ని మనం తెలుసు కోవాలి.
దశ మహావిద్యలు
శక్త్యోపాసనను గురించే విపులీకరించే తంత్రశాస్త్రాలు లోకంలో కార్య నిర్వహణ ఒనరించే మహాశక్తిని పది విభాగాలుగా విభజించాయి. ఈ పది శక్తు లతో సంసర్గం పెంపొందించుకొన్న వ్యక్తి అద్వితీయుడైన భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. ఆ ప్రాప్తించుకోవడానికి నిర్దేశించిన ప్రతి మార్గమూ ఈ దశమహావిద్యలలో ఒకటి. ఈ విద్యలలో ప్రతి ఒక్కటీ ఒక్కో రకం విశిష్టతను కలిగినవి. కానీ అవి సాధకులను చేర్చే గమ్యం మాత్రం ఒక్కటే. ఈ దశమహావిద్యలే కాళి, తారా, షోడశీ, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ఛిన్నమస్తా, ధూమ్రావతి, బగళాముఖీ, మాతంగి, కమలాత్మికా. వీరిలో ప్రతి ఒక్కరి శక్తీ, ఆరాధనా విధానాలూ వేర్వేరు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మన ధ్యేయం కాదు. ఇక్కడ మనం స్థూలంగా తెలుసుకోవలసినది షోడశీ శక్తిని గురించే!
షోడశి
“నేను ఎన్నో దేవీ రూపాలను దర్శించాను. కానీ షోడశీదేవి సౌందర్యానికి దీటురావు” అనేవారు శ్రీరామకృష్ణులు. సౌందర్యాధిదేవత ఆమే! కామ మనే మహాశక్తి ఆమె. అఖండ పరబ్రహ్మంలో, నేను అనేక మవు తాను* అంటూ ప్రప్రథమంగా ఉదయించిన కోర్కె స్వరూ పమే ఆమె. దక్షిణదేశంలో ఈమె రాజరాజేశ్వరి, లలితా త్రిపురసుందరిగా ఆరా ధింపబడుతున్నది. ఈమె ఆరాధనా పద్ధతే శ్రీవిద్యగా దక్షిణదేశంలో ఖ్యాతి గాంచింది.
షోడశీపూజ –తత్సందేశాలు
మన ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు చూద్దాం. శ్రీరామకృష్ణులు షోడశిని ఎందుకు పూజించారు? పూజలందుకొనే మూర్తిగా శారదను ఎందుకు ఎంపిక చేశారు. శారద దానిని ఎందుకు స్వీకరించింది? ఈ ప్రశ్నల జవాబులలోనే ఈ పూజ ప్రాధాన్యమూ, అది మనకు తెలిపే సందేశాలు ఇమిడి ఉన్నాయి –
1. శ్రీరామకృష్ణులు శాస్త్రోక్తంగా సన్న్యాసం స్వీకరించిన సన్న్యాసి. ఆయన గురువైన తోతాపురి, ఆదిశంకరుడు ఏర్పరచిన పురి సంప్రదాయానికి చెందిన వాడు. పురి సంప్రదాయపు సన్న్యాసుల దేవి కామాక్షి. అందువల్లనే శ్రీరామకృష్ణులు తపస్సాధనలకు పరిపూర్ణతగా లలితా త్రిపుర సుందరియైన షోడశిని పూజించారు. ఆమెను శారదలో ఆవాహనం చేయడం మూలంగా శారద రామకృష్ణ సంప్ర దాయపు దేవిగా పరిణమించారు.
2. ఈ దశ మహా విద్యలూ పరమేశ్వరునితోపాటే పూజింపబడినా, పర మేశ్వరుని వీడివుండనిదిగా షోడశి అయిన లలితాదేవి మాత్రమే పూజలందు కుంటుంది. అంతేకాకుండా శివశక్తులను ఒకటిగా పూజింపకపోతే శ్రీవిద్య ఫల దాయిని అవ్వదని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. శారదను షోడశిగా పూజించ డంతో తానూ ఆమే అభిన్నులమని చాటారు శ్రీరామకృష్ణులు. ఇదే భవిష్యత్తులో శ్రీరామకృష్ణ సంప్రదాయంలో శారద స్థానాన్ని నిర్ణయించేదిగా ఉండింది. శ్రీరామ కృష్ణులనూ, శారదనూ ఒకటిగానే చూడడం రామకృష్ణ సంప్రదాయం. శారదయే స్వయంగా తర్వాత ఈ విషయం చెప్పడం కద్దు. దీనికి తత్త్వరీతిగా వివరించారు శ్రీ శారదానంద స్వామి–
యథాగ్నే దాహికాశక్తి, రామకృష్ణే స్థితే హి యా ।
సర్వవిద్యా స్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం ॥
అగ్నిలో దాహికాశక్తి నెలకొన్నట్లు, రామకృష్ణులలో నెలకొన్నదియూ, సర్వ విద్యాస్వరూపిణియూ అయిన శారదకు ప్రణమిల్లుతున్నాను.
ఇలా లలితా త్రిపుర సుందరిని ఆరాధించినందువల్ల రామకృష్ణులు–శారద ఇద్దరూ ఒకరే అని నిరూపింపబడింది.
3. ఈ పూజ శ్రీరామకృష్ణుల జీవితంలో శారద యొక్క రెండు విధాలైన పాత్రలను సూచిస్తోంది. వివాహానికి తర్వాత శ్రీరామకృష్ణులు ప్రార్థన ద్వారా శారదలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నెలకొనజేయడం చూచాము. దీని పర్యవసానంగా ఆమె మనస్సులో ఆధ్యాత్మిక ప్రేరణ క్రమంగా వృద్ధి కాసాగింది. సాధారణమైన ప్రాపంచిక ఆశల నుండి ఆమె మనస్సు విముఖమై అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుంది. తాము చేపట్టిన సాధనల ఫలాన్ని పూజ ముగింపులో ఆమెకు సమర్పించడం మూలంగా శ్రీరామకృష్ణుల అత్యంత ఉన్నతమైన పారమార్థిక జీవితానికి తోడైన నేస్తంగానూ, అన్నివిధాలా ఆయనకు దీటైన సహధర్మచారిణిగానూ అయింది శారద, ‘శారద గురుదేవులలా ఎందుకు ఘోర మైన తపస్సులు చేయలేదు?’ అని కొన్ని సమయాల్లో అడగడం కద్దు. అవును, ఆమె చేయలేదు. కానీ షోడశీ పూజ ద్వారా సాటిలేని గురుదేవుల సాధనల ఫలాన్ని ఆమె తన సొంతం చేసుకుంది.
ఇక్కడ మనం జ్ఞాపక ముంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. గురు దేవుల నిర్యాణానంతరం ఆమె కూడా పలు కఠోర సాధనలు చేపట్టింది. వాటిని ఆమె మనస్సు పరిశుద్ధమవడానికో, సొంత ఆధ్యాత్మిక ఉన్నతికో చేయలేదు. అవి ప్రధానంగా ఇతరులు అనుసరించడం కోసమూ, శిష్యుల శ్రేయస్సు కోసమూ చేయ బడ్డాయి. అంతమాత్రమే కాదు. ఆమె జీవితం మహిళా లోకానికి ఒక ఆదర్శ జీవి తంగా రూపు దిద్దుకోవాల్సి ఉండింది. మహిళలు పురుషుల బాట ననుసరిస్తూ వారితో పోటీ పడాల్సిన ఆవశ్యకత లేదని మునుపే చెప్పాము. శారద కూడా శ్రీరామకృష్ణులు చేపట్టిన సాధనల లాంటివి కాక స్త్రీల కోసమైన తపస్సులను అనుష్ఠించింది. తద్ద్వారా స్త్రీలకు అనుచితమైన తపోనిష్ఠ ప్రప్రథమంగా నిర్దేశింప బడింది. వీటిని తర్వాత వివరంగా చూడనున్నాం.
మరొక రకంగా కూడా షోడశీపూజ శారద జీవితంలో ప్రాధాన్యం సంతరించుకుంది. అది శ్రీరామకృష్ణుల అవతార కార్యంలో వారసురాలిగా ఆమెను తీర్చిదిద్దడం. తమలో ఎలాంటి దివ్యశక్తి లోకహితం కోసం అభివ్యక్త మైనదో, ఆ అద్భుత శక్తిని ఈ పూజ ద్వారా శారదలో పాదుగొల్పేటట్లు చేశారు శ్రీరామకృష్ణులు. అప్పటి నుంచి ఆమె మనశ్శరీరాలు ఆ అద్భుత శక్తికి ఆలవాల మైనాయి. ఆమె భవిష్యత్తు కార్యాలన్నీ, స్వీయకాంక్షలు తీర్చుకొనే విధంగా కాకుండా శ్రీరామకృష్ణుల ఆదర్శప్రాయ జీవితం మహత్వపూర్ణ కార్యాన్ని నిర్వర్తిం చేలా రూపుదిద్దుకున్నాయి. తద్ద్వారా శారదా శ్రీరామకృష్ణులు కాళికామాతచే నియంత్రింపబడే ఆత్మగా, ఒకే ప్రాణమున్న రెండు శరీరాలుగా పరిణమించారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నంత వరకు ఆయనకు సేవ చేయడం మూలంగా ఆయన అవతార కార్యంలో సహాయకురాలిగా విరాజిల్లింది శారద. ఆయన నిర్యాణానంతరం పూర్తి బాధ్యత ఆమె భుజస్కంధాలపై పడింది. ముప్పై నాలుగేళ్ల సుదీర్ఘకాలం ఈ మహత్కార్య బాధ్యతను చేగొని శ్రీరామకృష్ణుల అవతార ఆదర్శాన్ని లోకంలో పాదుగొల్పేందుకు రాత్రింబవళ్లు ఆమె శ్రమించారు.
4. ఈ పూజ ద్వారా శారద ఒక మామూలు వ్యక్తి కాదని లోకానికి చాటి చెప్పారు శ్రీరామకృష్ణులు. కాలాంతరంలో ఒకసారి లక్ష్మి, మాతృదేవితో, “అది సరే! మీరేమో మూర్తీభవించిన లజ్జా స్వరూపిణి. గురుదేవులు మిమ్మల్ని తాకి పూజ చేసినప్పుడు, నుదుట తిలకం దిద్దినప్పుడు, వస్త్రాలు సమర్పించినప్పుడు ఎలా తట్టుకోగలిగారు?” అని అడిగింది. అందుకు మాతృదేవి ముక్తసరిగా, “అప్పుడు నేను నేనుగా లేను” అని జవాబిచ్చారు.
తాను సామాన్య మానవ మాత్రురాలిగా కాకుండా, దేవిగా ఉండడాన్ని ఆమె అలా సూచించి ఉండాలి. శ్రీరామకృష్ణులు కూడా అనేక సందర్భాలలో ఆమె దివ్యత్వాన్ని గురించి, “ఆమె శారద! సరస్వతి. జ్ఞానాన్ని ప్రసాదించడానికే లోకంలో అవతరించింది. కానీ బాహ్యమైన అందాన్ని మరుగుపరచుకొని ఈసారి అవత రించింది. లేకపోతే దుష్టులు ఆమెను తప్పుడు భావంతో చూసి, వినాశం చవి చూసి ఉండేవారు. ఆమె సామాన్యురాలా? ఆమె నా శక్తి!” అంటూ వ్యాఖ్యానించి ఉన్నారు.
‘మన మాతృదేవిని ఎవరు అర్థం చేసుకోగలరు? మహాయోగులకు సైతం ‘ఆమెను అవగతం చేసుకోవడం కష్టం. ఇక సామాన్యుల గురించి చెప్పాలా? అవతార పురుషులైన శ్రీరామకృష్ణులు చేసిన పూజను స్వీకరింపగలిగే శక్తి ఒక మామూలు స్త్రీకి ఉంటుందా?’ అనే ప్రశ్నను లేవదీశారు శ్రీ బ్రహ్మానందస్వామి.
శారదను గురించి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విశేషాలను మున్ముందు మనం చూడనున్నాం. ప్రస్తుతానికి ఆమె మహత్త్వాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని చరిత్రను ముందుకు సాగిద్దాం!
పూజానంతరం శారద పరిస్థితి
శారద మెల్లగా లేచి మానసికంగా గురుదేవులకు ప్రణమిల్లింది. అర్ధబాహ్య స్థితిలోనే నహబత్తుకు తిరిగి పోయింది. షోడశీ పూజ ఆమెలో ఎన్నెన్ని అద్భుత పరిణామాలను కలుగజేసి ఉంటుందో! ఎన్నెన్ని ఉన్నత మైన ఆధ్యాత్మిక స్థితులు ఆమెలో నెలకొల్పిందో! ఈ విషయం గురించి ఆమె ఎవరికైనా ఏమైనా చెప్పిందీ అంటే, లేదు అనేదే సమాధానం. కాలాంతరంలో ఎవరైనా అడిగినా కూడా, “అవును, పూజ జరిగింది, అప్పుడు నాకు పదహారేళ్లు ఉండవచ్చు” అని మాత్రం చెప్పి, మరో విషయం గురించి ప్రస్తావించేవారు. ఆమె అంతరంగాన్ని ఇతరులు గ్రహించలేరు. బాహ్యంగా ఏవైనా మార్పులు కనబడ్డాయా అంటే అలాంటి వేమీ లేదనే చెప్పాలి. పూజానంతరం ఆమెకు ఎదురైన సమస్య ఒక్కటే. పూజ సమ యంలో శ్రీరామకృష్ణులు సమర్పించిన చీర, గాజులు ఇత్యాదులను ఏం చేయాలో ఆమెకు పాలుబోలేదు. ఈ విషయంగా గురుదేవులను అడిగినప్పుడు ఆయన ఒకింతసేపు ఆలోచించి, “మీ అమ్మకు ఇవ్వు. కానీ ఆమెను ఒక సామాన్య స్త్రీగా కాకుండా, ఆదిపరాశక్తిగా భావించి సమర్పించు” అన్నారు. శారద అలానే చేసింది, దాంతో ఆ సమస్య తీరిపోయింది. అలాంటి మహాసాగరం శారద. సముద్రంలో ఎన్నెన్ని వింతలు ఉంటాయి! దాని ఉపరితలాన్ని మాత్రం చూసే వారు అడుగు భాగం చూడగలుగుతారా! సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున లేచి దాని మహ త్త్వాన్ని చాటుతాయి. కానీ శారదా సాగరంలో అలలో నురుగో లేదు. అలలు లేని గాంభీర్యం ఒక్కటే ఆమెలో నెలకొంది. పూజానంతరం గడచిన ఆమె జీవితంలోనూ గొప్ప సంఘటనలు అంటూ ఏవీ లేవు. కానీ నిశితంగా చూస్తే ఆ సమయంలో మహత్కార్యం కోసం తనను ఆయత్తపరచుకోవడం కానవస్తుంది.
రెండు రకాల అభ్యాసాలు
విజయవంతమైన జీవితం గడపాలంటే మూడు నిజాలను గుర్తుంచుకోవడం అనివార్యం. మనిషి అంటే మానం, ప్రపంచం, భగవంతుడు. ఈ నిజాలనే మన వేదాలు, ఉపనిషత్తులు వక్కాణిస్తాయి. భగవంతునితోను, ప్రపంచంతోను మన బాంధవ్యం ఎలా నెలకొనివుందనే విషయం పైనే మన జీవితం విజయమో, అపజయమో ఆధారపడివుంది. భగవంతునితో బాంధవ్యం కల్పించే మార్గాన్ని గురువు చూపి స్తాడు. ప్రపంచంతోటి మన బంధుత్వాన్ని మామూలుగా ప్రపంచం నుంచే నేర్చుకో వాల్సివుంది. గద్ద లాంటి ఇరవై నాలుగు ప్రాణులను తన గురువుగా ఒక అవ ధూత స్వీకరించాడని భాగవతం చెప్పడమూ; సత్యకామునికీ, ఉపకోశల కామ లాయునికీ ఎద్దు, పక్షి, అగ్ని లాంటివి ఉపదేశించినట్లు ఛాందోగ్యోపనిషత్తు తెలుపడమూ – ప్రపంచంతోటి బాంధవ్య పద్ధతిని నేర్చుకోవడాన్నే తెలియజేస్తు న్నాయి. మనస్సును తెరచి ఉంచితే ప్రపంచం ఒక తెరచిన పుస్తకంగా దాని రహస్యాలను మనకు వెల్లడిస్తుంది. రెండు బాంధవ్య పద్ధతులూ పరస్పరం పెన వేసుకుని వున్నాయి. రెండింటికీ అభ్యాసం అవసరం. సామాన్యంగా పారమార్థిక జీవనమనగానే ప్రపంచాన్ని వర్జించాలి అని అనుకుంటాం. అందువల్లనే అనేకులు పారమార్థిక జీవితం మీద విముఖత చూపిస్తూ జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ శారద జీవితం ఈ రెండు జీవితాల మేళనం కోసం ఏర్పడినట్లుగా అల రారింది. గార్హస్థ్యంలోనే పారమార్థిక జీవితం ఎలా గడపాలో చాటి చూపింది శారద. అందుకోసం పారమార్థిక జీవితంలోనూ, సంసార జీవితంలోనూ ఆమె తర్ఫీదు పొందవలసి ఉంది. ఈ రెండు విధాల అభ్యాసాలనూ ఆమె గురుదేవుల నుంచే గ్రహించింది. సంసార జీవితానికయిన అభ్యాసంలో ఆమె దక్షిణేశ్వర, జయరాంబాటి జీవితాలు సాయపడ్డాయి. ఈ రెండు విధాల అభ్యాసాలనూ విపులంగా పరికిద్దాం.