శారద మనఃస్థితి
ఆనందపు అద్భుత రుచిని కాస్త చవిచూసి ఆనంద పూర్ణకుంభాన్ని హృదయంలో పదిలపరచుకుని జయరాంబాటికి తిరిగి వచ్చింది శారద. సామాన్యుల దృష్టికి ఏడు నెలలకు మునుపు కామార్పుకూరుకు వెళ్లిన అమ్మాయి లాగే కనిపించింది ఆమె. కానీ ఆమెలో ఎన్నెన్ని మార్పులు! ఆ అద్భుత పురుషుడు, ఆయనతో సంసర్గం, ఆయన మాటలు – ఎంత ఆనందమయమైనవి! కాలంతోపాటు నశించిపోని జ్ఞానానంద జ్యోతిని కదా ఆమెలో వెలిగించారు! జయరాంబాటికి వచ్చిన శారద దేనినీ అక్కడ క్రొత్తగా చూడలేదు! అదే ఇల్లు, అదే పచ్చికబయళ్లు, అదే మనుషులు, అదే ఆప్యాయత, చెలిమి – వాటిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ ఆమెలో కాంతులీనుతూ ప్రకా శిస్తున్న ఆ జ్ఞానజ్యోతి వెలుగు పుంజాలు బాహ్యప్రపంచంలోని సమస్తాన్నీ ప్రకా శింప చేయడం వల్ల ఆమెకు అన్నీ దివ్యమయంగా ద్యోతకమైనాయి. అన్యులనే వారెవరూ లేరు. అందరూ, అంతా తనకు చెందినవే అనే భావన ఆమెలో అంకు రించి, ఈ ప్రపంచాన్నంతటినీ తన ప్రేమతో ఆదుకోవాలంటూ ఆమెను ప్రోత్స హించింది. అప్పటి ఆమె మనఃస్థితిని శ్రీశారదానంద స్వామి ఎంతో అద్భుతంగా అభివర్ణించారు. ఏదో అమూల్య ఆనంద సంపద తనకు లభించిందనే భావన మాత్రం ఆమె హృదయంలో చెక్కుచెదరక నిలిచిపోయింది. హృదయంలోని ఈ పూరింపు వలన ఆమె ప్రవర్తన, మాటలు, పనులు అన్నింటిలో మార్పు వచ్చింది. ఇతరులు ఈ మార్పును పసిగట్టారా లేదా ఇదమిత్థంగా చెప్పలేం. ఈ మార్పు ఆమెలో సంచలనానికి బదులుగా శాంతిని ప్రసాదించింది, ఆర్భాటానికి బదు లుగా గాఢమైన చింతనాసరళిని రేకెత్తించింది, స్వార్థానికి బదులుగా నిస్వార్థ ప్రేమను ప్రకాశింపజేసింది. తనకంటూవున్న కోరికలన్నిటినీ మనస్సులో నుండి నిర్మూలించి, ప్రజల పట్ల కారుణ్యం వహించి వారి దుఃఖాలను తనవిగా భావించి, కరుణాస్వరూపిణిగా ఆమె రూపుదిద్దుకుంది. హృదయంలో పొంగి పొరలుతున్న పరమానందం కారణంగా శారీరక బాధలు ఆమెను ఏ విధంగానూ బాధించలేదు. ఇతరుల పట్ల తాను కనబరిచే ప్రేమ ఆప్యాయతలు వారినుండి తనకు లభించక పోయినా ఆమె బాధపడలేదు. దొరికిన దానితో తృప్తిపడి, ఎల్లప్పుడూ అంతర్ముఖు రాలై తన పుట్టింట వసిస్తూ వచ్చింది శారద.
ఆధ్యాత్మిక జాగృతి
ఒక్క మాటలో చెప్పాలంటే శారదకు తాను ఎవరు, తన లక్ష్యమేమిటి అనే విషయాన్ని గురించిన ఆత్మ జాగృతి కలిగింది. తాను కేవలం పుట్టి మరణించే ఒక సామాన్య వ్యక్తి కాదు. తన జన్మ ఒక సాధారణమైన సంఘటన కాదు; అందుకు ఒక సార్థకత ఉందనే విషయం ఆమెకు స్పష్టంగా తెలిసింది. గురుదేవులు ఆమెతో వ్యవహరించిన రీతి, బోధించిన సత్యాలు మొదలైనవన్నీ ఆమెకు ఆ విషయాన్నే గుర్తు చేశాయి. కానీ వివరాలు ఏమీ తెలియరాలేదు. దీనిని అర్థమయ్యేలా చేసి తనకు యుక్తమైన దారిని చూపగలిగేవారు గురుదేవులు మాత్రమేనని ఆమెకు బాగా అవగత మయింది. అందువలన ఆయనను కలుసుకోవాలనే ఉత్సుకత ఆమెకు అప్పు డప్పుడు కలిగేది. ఆయన సాన్నిధ్యంలో గడపిన రోజులూ, ఆ ఆనందానుభవమూ ఆమెలో చెరిగిపోని ముద్రవేశాయి. లౌకికరాహిత్యమైన ఆ పరమానందాన్ని మళ్లీ చవిచూడాలని ఆమె మనస్సు ఉవ్విళ్లూరింది. దాంతో దేహం జయరాంబాటిలో ఉన్నా, ఆమె మనస్సు మాత్రం గురుదేవుల పాదపద్మాల మ్రోలనే వ్రాలి ఉంది. ఆయనను చూడాలి, ఆయన వద్ద కూర్చోవాలి అనే ఆరాటం, తపన ఆమెలో చెలరేగాయి. ఎంతో ప్రయత్నంతో తనను అదుపులో ఉంచుకోగలిగింది. “మొదటి సారి కలుసుకున్నప్పుడు ఇంత ఆప్యాయత చూపి అభిమానించిన ఆయన నన్ను ఎన్నటికీ మరవలేదు. తగిన సమయం వచ్చినప్పుడు నన్ను ఆయన వద్దకు రప్పించుకుంటారు” అంటూ శారద తనను తాను సమాధానపరచుకొనేది. ఇలా రోజులు గడవసాగాయి. ఆమె కూడా విశ్వాసాన్ని సడలించక గురుదేవులు తనను రప్పించుకొనే ఆ శుభదినం కోసం ఆతురతతో ఎదురు చూడసాగింది.
ఆవేదనా ధ్వనులు
ఇలా ఒకటి రెండు రోజులు కాదు, ఒకటి రెండు నెలలు కాదు, నాలుగు సుదీర్ఘ సంవత్సరాలు దొర్లిపోయాయి. శారద ఇప్పుడు పద్ధెనిమిదేళ్ల యువతి. పిలుపుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో ‘శ్రీరామకృష్ణు లకు పిచ్చిపట్టింది’ అనే పిడుగు లాంటి వదంతి వ్యాపిం చింది. వదంతులు గాలి కన్నా వేగంగా వ్యాపిస్తాయి కదా! కుప్పకూలిపోయింది శారద! తనను తాను సంబాళించుకొనే లోపుగానే ఈ విషయం గ్రామమంతా ప్రాకిపోయింది, ‘అదిగో పిచ్చివాడి భార్య’ అంటూ ఎగతాళి చేశారు కొందరు.
‘విన్నావా సంగతి! శారద భర్తకు మతిచెడిందట!’ అంటూ పరోక్షంగా నవ్వుకుంటూ కేరింతలు కొట్టారు కొందరు. ‘అయ్యో! నీకా ఇలాంటి పరిస్థితి’ అంటూ సంతాపం నటిస్తూ కొందరు ఆనందించారు. మొత్తానికి శారద తన ముఖం బయట చూపించలేకపోయింది. రోజంతా ఇంట్లోనే గడపసాగింది. కానీ ఎన్ని రోజులిలా? ఆమె సాంత్వన కోసం వెళ్లే చోటు భానూ అత్త ఇల్లు మాత్రమే. మండుటెండలో చల్లని నీడలా శారదకు లభించింది భాను అత్త. రాత్రి ఎంతటి భయంకరమైనదైనా అది శాశ్వతం కాదు; సూర్యోదయం వచ్చే తీరాలి. అలాగే గ్రామ ప్రజల అవ హేళన శారద జీవితంలో ఏర్పరచిన శోకమయ పరిస్థితి కూడా తప్పకుండా తొలగిపోతుంది, అంటూ ప్రతిసారీ శారద తనను కలసినప్పుడు ఎంతో ఆప్యా యంగా నచ్చజెప్పేది ఆ వృద్ధురాలు. ఆమె ఇంటి వసారాలో శారద గుడ్డ పరచు కొని విశ్రమించేది.
భాను అత్త ఒక అసాధారణ వ్యక్తి అనే చెప్పాలి. సరళ మనస్కురాలైన ఆమెకు శారదా రామకృష్ణులు పార్వతీ పరమేశ్వరులుగానే కనబడ్డారు. గ్రామస్థుల అవహేళనతో విసిగిపోయే శారదకు సాంత్వన నివ్వడంతోపాటు, తన అమ్మాయి స్థితిని చూచి బాధపడుతున్న శ్యామసుందరిని కూడా అనునయించేది. “ఇదిగో చూడండి. మీ అమ్మాయి సామాన్యురాలు కాదు. మీ అల్లుడు కూడా అంతే! పర మేశ్వరుణ్ణి పిచ్చివాడనీ, శ్మశానంలో వసించేవాడని పరిహసించింది లోకం. లేడి లాంటి తన అమ్మాయిని ఆయన కిచ్చి వివాహం చేశానే అంటూ మీ లాగే ఆక్రో శించింది ఉమాదేవి తల్లి. కానీ తర్వాత పరిస్థితి ఎలా మారిపోయింది! పిచ్చి వాడిగా పరిహసింపబడిన వ్యక్తి నిజానికి లోకానికే అధినాయకుడు, ఉమ ప్రపంచా నికే అధినాయకి అని విన్న ఆమె తల్లి ఎంతగా మురిసిపోయిందో! మీ పరిస్థితి కూడా అలాగే కాబోతుంది, చూడండి!” ఇలా శ్యామసుందరితో మాత్రమే కాకుండా గ్రామస్థులతో కూడా చెప్పేది భాను అత్త. కానీ పట్టించుకునే నాథుడెవడు?
కానీ శారద? ఆమె ఇవన్నీ వినే స్థితిలో లేదు. ‘ఈ వార్త నిజమై ఉంటుందా?’ అనే ప్రశ్న ఆమెను వేధించేది. క్రితంసారి ఆయనను కలుసుకున్న ప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా స్మృతిపథంలో మెదలాయి! ఎంత తీయని జ్ఞాపకాలు! ఆయన మాటలూ, వేడుకలు వినోదాలూ, ఆయన అనుగ్రహిం చిన ఆనందపూర్ణ కుంభమూ, వీటన్నిటి కన్నా ముఖ్యంగా ఆయన కనబరచిన ఆ పవిత్రమైన ప్రేమ – ఇవన్నీ అబద్ధమవుతాయా? చేతన స్వరూపుడైన భగవంతుణ్ణి గురించి చింతించి చింతించి చైతన్యమయంగా మారిన ఆయనకు మతిచెడు తుందా? అసాధ్యం, ముమ్మాటికీ అసాధ్యమనే ఆమె మనస్సు చెప్పింది. ‘ఎలాగా, ఆయనకు పిచ్చి అనడం కట్టుకథ. బహుశా ఆయన శరీరారోగ్యం దెబ్బతినివుంటే, అక్కడ ఆయన సాన్నిధ్యంలో ఉండి వారికి పరిచర్యలు చేయడమే భార్యగా నా కర్తవ్యం. అంతే కాకుండా దీన్ని ఒక సాకుగా చేసుకుని ఆయన వద్దకు వెళ్లాలి’ అని తీర్మానించుకుంది శారద. కానీ లజ్జాస్వరూపిణియైన శారద తన భర్త వద్దకు వెళ్లాలనే కోరికను ఎలా వ్యక్తపరచగలదు? ఎవరితో చెప్పగలదు? అందువల్ల తగిన తరుణం కోసం నిరీక్షించసాగింది.
దక్షిణేశ్వరం దిశగా
ఆ తరుణం తొందరగా వచ్చింది. 1872 మార్చి. డోలాపూర్ణిమ పండుగ దగ్గర పడుతోంది. ఆ రోజు గంగా స్నానం చేయడం విశేషం. చాలాదూరం నుండి కూడా ప్రజలు గంగానదికి అభిముఖంగా వెళ తారు. జయరాంబాటి నుండి పలువురు స్త్రీలు కలకత్తాకు వెళ్లనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణేశ్వరం వెళ్లాలని తీర్మానిం చింది శారద. ఈ విషయం ఒక స్త్రీ ద్వారా తండ్రికి తెలియజేసింది. కుమార్తె మనస్సును అర్థం చేసుకొన్న రామచంద్రుడు, “ఎందుకు? నేనే వెళ్లి వదలిపెట్టి వస్తాను” అంటూ తానూ బయలుదేరాడు. నిర్ణయించుకొన్న రోజు తండ్రీ తన యలు ఇతర యాత్రికులతోపాటు బయలుదేరారు. పల్లకీ ఏర్పాటుకు స్తోమత లేనందువల్ల కాలినడకే శరణ్యమయింది.
దక్షిణేశ్వరం చేరుకోవడానికి ఇంకా అరవై మైళ్లు ప్రయాణం చేయాలి. ప్రారంభంలో ప్రయాణం ఆనందదాయకంగానే సాగింది. దారికిరువైపులా పచ్చని పచ్చికబయళ్లు, వికసించిన తామరలతో నిండిన చెరువులు, మొదలైనవన్నీ చూసి పరవశిస్తూ యాత్రికులు ముందుకు సాగుతున్నారు. అప్పుడప్పుడు చెట్ల క్రింద విశ్రాంతి తీసుకోసాగారు. ఒకటి రెండు రోజులు గడిచాయి. ఇలా ఇంత సుదూ రపు నడక శారదకు అలవాటు లేనందువలన ఆమె ఎంతో అలసిపోయింది. నిస్స త్తువ ఆమెను ఆవహించింది. అయినా దక్షిణేశ్వరం వెళ్లాలి, గురుదేవులను చూడా లనే తీవ్ర ఆకాంక్షతో ఉన్న ఆమె వీటిని గురించి తండ్రికి చెప్పలేదు. కానీ అది కేవలం అలసట కాదని తెలుసుకున్నప్పుడు ఆమె పడిన ఆవేదన వర్ణనాతీతం. అది మలేరియా జ్వరం! మలేరియా ఆమెకేమీ కొత్త చుట్టం కాదు. సాధారణంగానే ఆమెకు అప్పుడప్పుడు మలేరియా జ్వరం వచ్చేది. కానీ ప్రస్తుతం అలసట వల్ల, బలహీనత వల్ల ఆ జ్వరం ఆమెను బాగా పీడించసాగింది. జ్వర తీవ్రత ఎక్కు వయినప్పుడు ఆమె కుప్పకూలిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. పరిస్థితిని గ్రహించిన రామచంద్రుడు ఒక సత్రంలో విడిది చేశాడు. గురుదేవులను చూడలేకపోతానేమో అనే నిరాశా, వ్యాధి వల్ల కలిగే ఆవేదనా కలగలసి శారద మనఃస్థితి అగమ్యగోచరంగా తయారయింది. కానీ కుప్పకూలిన ఆ స్థితిలో ఆమెకు కలిగిన దివ్య దృశ్యంతో ఆమెలో నూతనోత్సాహం పరవళ్లు త్రొక్కింది.
నేను నీ సోదరిని!
జ్వర తీవ్రతతో అలసిపోయి పడుకొనివుంది శారద. అప్పుడు నల్లటి ఆకృతి గల ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. శారద రెప్పవాల్చకుండా ఆమెనే చూడ సాగింది. ఇంతటి నలుపు రంగును ఆమె ఇంతవరకూ చూసింది లేదు. ఆ నలుపులో కూడా ఇంత అందం ఇమిడి ఉంటుందని ఆమె అనుకోలేదు. ఆమె అంత అందంగా ఉంది! వచ్చిన స్త్రీ శారద తలవైపు కూర్చుంది. తన కోమల హస్తాలతో శారద తలను, దేహాన్ని నిమిరింది. అంతే, శారద అనుభవిస్తున్న అలసట, బాధ తొలగిపోయాయి. ‘ఈమె చేతులకు ఎంతటి అద్భుత శక్తి!’ అనుకొని ఆశ్చర్యపోయిన శారద, “అవును, నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావమ్మా?” అని అడిగింది. “దక్షిణేశ్వరం నుంచి.”
ఈ జవాబు విని శారద ఆశ్చర్యపోయింది.
“ఏమిటి! దక్షిణేశ్వరం నుంచా! నేను కూడా అక్కడికే వెళ్లాలి. ఆయనను చూడాలి! ఆయనకు పరిచర్యలు చేయాలి అనుకున్నాను. అంతలో ఈ దిక్కుమాలిన జ్వరం వాతపడ్డాను. నేను అనుకొన్నదంతా తారుమారైపోతుందేమో!”
“కలత చెందకు! నువ్వు తేరుకుని త్వరలో దక్షిణేశ్వరం వెళతావు. నీ కోసమే ఆయనను నేను అక్కడ ఉంచాను.”
“ఆహా! అలాగా! అలా అయితే నువ్వు మాకు ఎలాంటి బంధువువి?”
“నీ సోదరిని.”
“ఓహో! అందుకే నువ్వు వచ్చావా?” అంటున్న శారద కళ్లు మూతలు పడ్డాయి. అలాగే నిద్రలోకి జారిపోయింది.
దయం నిద్ర లేచి చూచేసరికి జ్వరం బాగా తగ్గింది. నిన్నటి రోజు చూసిన దృశ్యం ఆమెలో నూతనోత్సాహం కలిగించింది. అందువలన ఉల్లాసంగా ప్రయాణం ప్రారంభించింది. అదృష్టవశాత్తూ దారిలో ఒక పల్లకీ కూడా లభిం చింది. మరోసారి కూడా ఆమెకు జ్వరం వచ్చింది. కానీ అది అంత తీవ్రంగా లేదు. అందువలన ఈసారి జ్వరం గురించి తండ్రికి చెప్పలేదు.
ప్రేమపూరిత ఆహ్వానం
సుదీర్ఘ ప్రయాణం ముగిసింది. పడవలో గంగానదిని దాటి దక్షిణేశ్వరం చేరుకున్నప్పుడు రాత్రి తొమ్మిది గంటలయింది. పడవ నుంచి దిగిన శారద మనః స్థితి వర్ణనాతీతం. ‘పిచ్చివాడు’ అన్న గ్రామ ప్రజల హేళన నిజమవుతుందా? లేక పోతే తన హృదయంలో ఆనంద పూర్ణకుంభం నిలిపి వెళ్లిన అదే ప్రేమ పురు షుడిగా ఆయన ఉంటారా? ఇలా పరిపరి విధాల ఆలో చిస్తూ తడబడే హృదయంతో తిన్నగా గురుదేవుల గదిలోకి వెళ్లింది. వెంట వచ్చినవారు నహబత్తుకు వెళ్లిపోయారు.
గదిలో అడుగు పెట్టింది శారద. ఆమెను చూసిన మరుక్షణం, “ఆహా! నువ్వు వచ్చేశావా! మంచిది రా! రా!’ అన్నారు గురుదేవులు. ఆయన కంఠంలో వ్యక్తమైన ప్రేమ, ఆప్యాయత శారదలోని సందేహాలనన్నిటినీ పటాపంచలు చేసి వేశాయి. ఆ రోజు జయరాంబాటిలో చూసిన ప్రేమమూర్తిలో ఎలాంటి మార్పూ లేదు. మతి చెడిపోయిందనే మాటకే ఆస్కారం లేదని శారద గ్రహించింది. అంతలో గురుదేవులు ఎవరితోనో, “ఆమె కూర్చోవడానికి ఒక చాప పరచు” అన్నారు. శారద కూర్చున్న తర్వాత ఇంటి విశేషాలనూ, బంధువుల యోగక్షేమా లనూ విచారించారు. మాటల్లో తనకు జ్వరం వచ్చిన విషయం చెప్పింది శారద. అది విన్న ఆయన ఎంతో ఆందోళనతో, “అయ్యో! ఇప్పుడు నా మథుర్ బ్రతికి ఉంటేనా! మథుర్ మరణంతో నా ఎడమ చేయి పడిపోయినట్లయింది” అన్నారు. శారద హృదయం పులకరించిపోయింది. ఆయన మాటలలోని ఆప్యాయతను చూసి ఆమెకు అమృతం గ్రోలినట్లనిపించింది. సంతోషంగా లేచిన శారద నహ బత్తుకు వెళ్లడానికి ఆయత్తమయింది. ఆమెను వారించిన గురుదేవులు, “వద్దు, వద్దు. నువ్వు ఇక్కడే ఉండు! నహబత్తుకు డాక్టరు వచ్చి పరీక్ష చేయడం కష్టం” అంటూ గదిలోనే ఉండనిచ్చారు. రాత్రి భోజనాలు పూర్తికావడం వలన హృదయ్ అందరికీ మరమరాలు మాత్రం పెట్టాడు. తర్వాత శ్రీరామకృష్ణుల గదిలోనే శారద పడుకుంది. ఆమెకు తోడుగా మరొక స్త్రీ కూడా పడుకొంది. ఉదయం డాక్టరు వచ్చి శారదకు మందు లిచ్చాడు. ఒకటి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గి పోయింది. ఆ తర్వాత ఆమె నహబత్తుకు వెళ్లి ఉండసాగింది. తన కుమార్తె ఆనందమయ జీవితాన్ని చూసిన రామచంద్రుడు తృప్తిగా జయరాంబాటికి బయలుదేరాడు.
అప్పుడప్పుడు జయరాంబాటికి వెళ్లి వచ్చిన రోజులు మినహాయిస్తే సుమారు పదమూడేళ్లు శారద నహబత్తులోనే గడిపిందనవచ్చు. ఆ ఇరుకు గదిలో ముడుచు కొని గురుదేవుల పరిచర్యలలో, అత్తగారికి కావలసిన సహాయాన్ని అందించడంలో పూర్తిగా తనను తాను అర్పించుకుంది శారద.