పూర్వీకులు
హిందూ మతానికి మాత్రమే పరిమితమైన అవతారతత్త్వం ఎంతో అగ్రాహ్య మైనది. ధర్మం క్షీణించినప్పుడు దానిని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పివున్నాడు. దేవీమాహాత్మ్యంలోనూ దేవీభగవతి ఇలాగే తెలిపింది. కానీ ధర్మక్షీణతకు కొలబద్ద ఏది? అది మనవద్ద లేదు. కనుక ఆయన ఎప్పుడు అవతరిస్తాడు, ఎక్కడ అవతరిస్తాడు, ఎలా జీవిస్తాడు అనే విషయాలు మనకు తెలియని, తెలుసుకోలేని, బహుశా తెలియరాని రహస్యాలుగానే ఉండిపోయాయి. “వీథి గాయకులు హఠా త్తుగా వస్తారు. ఆడతారు, పాడతారు. వచ్చినట్లే హఠాత్తుగా నిష్క్రమిస్తారు. వాళ్లు వచ్చినప్పుడూ వారిని ఎవరూ గుర్తించరు, నిష్క్రమిస్తున్నప్పుడూ వారు ఫలానా అని ఎవరికీ తెలియరాదు” అనేవారు శ్రీరామకృష్ణులు. కానీ అలా వారు ఆలపించిన మధుర రాగాలూ, సుశ్రావ్య గీతాలూ మనలో హత్తుకుపోతాయి. కొంతకాలం దాకా అవి మన జీవితాలను తీర్చిదిద్ది, చైతన్యవంతం చేస్తాయి.
మాతృదేవి జీవితం ఇందుకొక నిదర్శనం. ఆవిడ జీవించి ఉన్నప్పుడు ఏ కొద్దిమందో మాతృదేవిని అవగతం చేసుకొన్నారు. చూసినవారు మరీ తక్కువ మంది. ప్రస్తుతం ఆవిడ జీవితం అసంఖ్యాక హృదయాలను అలరింపచేస్తూవుంది. జయరాంబాటి లోను, ఉద్బోధన్లోను నిర్విరామంగా ‘అమ్మా! అమ్మా!’ అంటూ నినదించే జనసమూహాలు ఎన్నో!
కానీ ఒక్క విషయం: వీరెవరూ అవతార పురుషుల ఆగమనాన్ని గుర్తించ లేకపోవచ్చు. కానీ వారి తల్లితండ్రులకు మాత్రం ఈ వాస్తవం తెలియవస్తుంది. అవతార పురుషులుగా అరుదెంచిన అందరి జీవితంలోనూ ఈ యథార్థాన్ని మనం గమనించవచ్చు. కొన్ని దివ్యస్వప్నాల, దివ్యదృశ్యాల, కొన్ని అమానుష సంఘటనల ద్వారా తమ ఆగమనాన్ని భగవంతుడు సూచించేవాడు.
మాతృదేవి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు కానవస్తాయి. ఆవిడ జీవితంలో మహత్తర దివ్య సంఘటనలు కానరావు. ఎందుకంటే ఆవిడస్తున్న ‘లజ్జా పటా వృతాః’ కనుక. లజ్జ అనే ముసుగులోనే ఆవిడ జీవించారు. కానీ ముసుగు తొలగిపోకుండా ఉంటుందా ఏమిటి? ఎప్పుడైనా ముసుగు వైదొలగి నప్పుడు ఒక కాంతి కిరణం, ‘నేను నీకు, ఆయనకు మాత్రమే కాదు లోకం యావత్తుకూ తల్లిని’ అనే సత్యాన్ని స్పష్టంగా చూపుతుంది. ఇలాంటి సంభవాలను మనం ముందుముందు చూడబోతున్నాం.
ప్రస్తుత ప్రశ్న – ఈ సంభవాలు నిజమైనవేనా? అన్నదే.* ఈ ప్రశ్నకు మనం రెండు కోణాల నుండి జవాబు చెప్పవచ్చు. మొదటిది: ఈ సంఘటనలు వేటినీ మనం నమ్మకపోయినా వాటిల్లబోయే నష్టం ఏమీ లేదు. ఈ సంఘటనల నన్నిటినీ తొలగించి చూసినప్పటికీ ఆవిడ మాతృదేవిగానే విరాజిల్లుతారు. ఆవిడ జీవితంలోని ప్రతి క్షణమూ అటువంటి అద్భుత సందేశంగా పరిణమిస్తుంది. “అమ్మా! మీ జీవితం ప్రార్థన యొక్క సుదీర్ఘ ప్రశాంతత!” అని కదా సోదరి నివేదిత పేర్కొన్నది. రెండవది: ఆవిడ జీవితంలో జరగకుండా మరెవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి? అని ఈ జీవిత చరిత్రను చదివే ప్రతి వ్యక్తీ తీర్మానించు కోవడం కద్దు. కనుక ప్రస్తుతానికి నివృత్తికాని సంశయాలను ఒక మూలకు నెట్టి ఆవిడ జీవిత చరిత్రను కొనసాగిద్దాం.
రామచంద్రుని కల
కుటుంబ ఆదాయాన్ని పెంపొందింప ప్రయత్నించాడు రామచంద్ర. పట్ట ణానికి వెళ్లి డబ్బు ఆర్జించాలనే కదా గ్రామస్థులు సదా కలవరిస్తుంటారు. రామ చంద్ర కూడా కలకత్తాకు వెళ్లాలనుకొన్నాడు కానీ గట్టి నిర్ణయానికి రాలేకపోయాడు. ఈ డోలాయమానస్థితిలో ఒక రోజు దానిని గురించే యోచిస్తూ పడుకొని ఉండగా నిద్రపట్టేసింది. అప్పుడు ఒక కల వచ్చింది. ఆయన కంఠాన్ని రెండు చిన్నారి చేతులు పెనవేసుకొన్నాయి. అట్లే కళ్లు తెరచి చూశాడు రామచంద్ర. ఎటువంటి అద్భుత దృశ్యం! తదేకంగా చూస్తూ ఉండిపోవాలనిపించే అందమైన చిన్నారి మోము, మోమున ఉదయించే కాంతిపుంజం, నుదుట తిలకం అన్నీ ఆయనకు కనిపించాయి. అంతటి అద్భుత సౌందర్యం. ఆ చిన్నారికి ఆభరణాలు అందాన్నిస్తున్నాయా లేక ఆభరణాల అందా నికి ఆ చిన్నారి మెరుగులు దిద్దుతూన్నదా అని ఆయన నిశ్చయించుకోలేక పోయాడు. ఆ బంగారు ఆభరణాలు వెలవెలబోయే అద్భుత చిరుదరహాసం చింది స్తున్న దివ్యముఖారవిందం! ‘దరాందోళిత దీర్ఘాక్షీ’ అని లలితాసహస్రనామం పేర్కొన్నట్లున్న అతి సుందర నయనాలు. ఈమె ఎవరు? ఈమె ఎవరు? – రామ చంద్ర తీర్మానించలేకపోయాడు. “అమ్మా! నువ్వెవరివి?” అని ఆమెనే అడిగేశాడు. లీలావినోదినియైన* ఆ బాల ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పక, ఆయన కంఠాన్ని మరింతగా పెనవేసుకొని, “ఇదుగో, నేను నీ వద్దకే వచ్చాను” అంటూ మార్మికంగా మందహాసం చేసింది. అంతే! కల చెదిరిపోయింది. కానీ ఆ స్వప్నానుభవం తరగలేదు. బంగారు రంగు, బంగారు ఆభరణాలు, చంద్రబింబం లాంటి ముఖారవిందం* – ఈమె సువర్ణ తనయ. అవును. సాక్షాత్తూ మహా లక్ష్మియే అనే నిర్ణయానికి వచ్చాడు. తను ధనార్జనకైపోతున్న ప్రయత్నంలో సంప దలకు అధిదేవతయైన శ్రీ మహాలక్ష్మియే అనుమతి ప్రసాదించినట్లుగా ఎంచి రామచంద్ర కలకత్తాకు బయలుదేరాడు.
శ్యామసుందరీ దేవి కాంచిన దృశ్యం
భర్త కలకత్తాకు వెళ్లిన తరువాత శ్యామసుందరీదేవి తన తండ్రితో పుట్టింట సిహోర్లో నివసించసాగింది. ఒకనాటి సాయంత్రం. సమీపంలోని కొలను తీరాన బిల్వవృక్షం కింద ఆమె కూర్చుని ఉంది. హఠాత్తుగా కింకిణీ (చిరుగజ్జెల) నాదం వినవచ్చింది. ఎక్కడ నుంచి ఈ నాదం వస్తున్నదోనని చుట్టూ కలయజూసిందామె. అప్పుడు చెట్టుకొమ్మల నుండి జారుకొంటూ వచ్చింది ఒక అద్భుతమైన పాప. అద్భుతమైన అందం! ఎర్రరంగు పరికిణీ ధరించింది. ఈమె ఎవరై ఉంటుందో నని శ్యామసుందరీదేవి ఆలోచిస్తూన్నంతలోనే మెరుపు వేగంతో వచ్చి ఆమె మెడను తన చేతులతో చుట్టివేసింది ఆ పాప. ఇక్కడా మెడనే చుట్టివేసింది. రామచంద్ర వద్దకొచ్చిన పాప, ఈ పాప వేర్వేరా ఏమిటి? మెడను చుట్టివేసి మధుర స్వరంలో, “నేను నీ ఇంటికి వస్తున్నానమ్మా” అని చెప్పింది. శ్యామ సుందరీదేవి ఆ మాటలు విని మూర్ఛపోయింది. అక్కడ ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు. వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపటికి ఆమె కళ్లు తెరిచింది. ఏమిటో ఆ పాప తన కడుపు లోకి ప్రవేశించిన అనుభూతి ఆమెకు కలిగింది.
అృశ్యాల వాస్తవాన్ని ఇద్దరూ గ్రహించడం
రామచంద్ర తిరిగి రాగానే శ్యామసుందరి తాను గాంచిన దివ్యదృశ్యం గురించి ఆయనకు చెప్పింది. తాను కన్న కలను ఈ దివ్యదృశ్యంతో రామచంద్ర పోల్చి చూశాడు. జగజ్జనని అనుగ్రహం వలన తమ ఈ పూరి గుడిసెలో ఒక దివ్యబాల జన్మించబోతున్నది; ఆ దేవి పాదపద్మాలు జయరాంబాటిలోని తమ పూరి గుడిసెలో నడయాడబోతున్నాయి అనే విషయం వారికి స్పష్టమయింది. ఆ దివ్య బాల రాకకై ఆ దంపతులు నిరీక్షిస్తూ రోజులు గడపసాగారు
శ్యామసుందరి మొట్టమొదటిసారి గర్భవతి అయింది. సామాన్యంగా స్త్రీలు గర్భం ధరించినప్పుడు మరింత అందాన్ని సంతరించుకోవడం కద్దు. యోగులు హృదయకుహరంలో నెలకొల్పుకొన్న దేవిని తన గర్భమనే గుహలో ధరించిన శ్యామసుందరి అందం ఎలా ఉండివుంటుంది! కాలాంతరంలో శ్యామసుందరి, యోగీన్ మాతో, “నేను గర్భవతిగా ఉన్నప్పుడు నా మేను వెలువరించిన అంద చందాలు వర్ణనాతీతం. ఎందరు స్త్రీలు వచ్చి నాకు చీరలు ఇచ్చి వెళ్లారో తెలుసా?” అని చెప్పడం తటస్థించింది.
శారదా జననం
రోజులు గడిచిపోతున్నాయి. ‘మాసాలలో నేను మార్గశిర’* మని శ్రీకృష్ణుడే శ్లాఘించిన మార్గశిర మాసం వచ్చింది. అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే కాల మది. కోతలు పూర్తయి కోతల కాలాన జరుపుకొనే ఉత్స వాలు మొదలయ్యాయి. మన పురాణాల ప్రకారం ఆరు నెలలు నిద్రించే దేవతలు మేల్కొనే కాలమది. దినకరుడు తన దక్షిణాయనాన్ని పూర్తిచేసి ఉత్తరాయనంలోకి ప్రవేశించే కాలం అది. ఆ సమయంలో ఒక గురు వారం. కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం. అప్పుడప్పుడే చీకట్లు క్రమ్ముకొంటున్నాయి. ఉత్తర నక్షత్రం ఉచ్చ స్థితిలోవున్న ఆ సమయంలో చీకటిని, చలిని చీల్చుకొంటూ రామచంద్ర ఇంట్లో నుండి శంఖనాదం వినవచ్చింది. అవును, వారు ఎదురుచూస్తున్న ఆ దివ్యబాల జన్మించింది. అది 1853 వ సం ॥ డిసెంబరు 23వ తేదీ.
జ్యోతిష్కులను రావించి జాతకం గణించారు. సామాన్యంగా వంగదేశంలో ప్రతి ఒక్కరికీ రెండు పేర్లుపెట్టడం ఆనవాయితీ. జాతకం ప్రకారం ఒక పేరు పెడ తారు; అందరూ పిలవడానికి మరొక పేరు పెడతారు. రామచంద్రుని ఇంట జన్మించిన ఈ పాపకు జాతకం ప్రకారం పెట్టిన పేరు ఠాకూర్ మణి.* శ్యామ సుందరి పెట్టుకొన్న ముద్దుపేరు క్షేమంకరి.
కానీ ఏ కారణంగానో ఈ రెండు పేర్లూ కొనసాగలేదు. ఆ రోజు అక్కడికి శ్యామసుందరీదేవి సోదరి రావడం తటస్థించింది. ఆమెకు శారద అనే ఆడపిల్ల ఉండేది. కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది. అందువలన ఆమె, శ్యామ సుందరీ దేవితో, “అక్కయ్యా! నీ పిల్లకు శారద అని నామకరణం చేయి. అప్పుడు నా కుమార్తె నీ ఇంట్లో ఉన్నట్లు భావించుకొని ఓదార్పు పొందుతాను” అని వేడు కొంది. అందుకు శ్యామసుందరీ దేవి సమ్మతించింది. కనుక ఠాకూర్మణిగానూ, క్షేమంకరిగానూ ఉండే ఆ పాప పేరు ఇప్పుడు శారదగా మారింది.
రామచంద్ర – శ్యామసుందరి దంపతులకు శారదయే మొదటి సంతానం. ఆమె తరువాత కాదంబినీ అనే కుమార్తె, ప్రసన్నకుమార్, ఉమేష్చంద్ర, కాళీ కుమార్, వరదప్రసాద్, అభయచరణ్ అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వీరిని గురించీ, వారితో మాతృదేవి అనుబంధం గురించీ ముందు ముందు తెలుసుకొందాం.