యథాగ్నేర్దాహికాశక్తీ
రామకృష్ణే స్థితా హియా ।
సర్వవిద్యా స్వరూపాం తాం
శారదాం ప్రణమామ్యహమ్ ॥
అగ్నిలో దహనశక్తి నిక్షిప్తమై ఉన్నట్లుగా శ్రీరామకృష్ణులలో విరాజిల్లే వ్యక్తీ, సర్వవిద్యాశక్తీ అయిన శారదామాతకు ప్రణామాలు అర్పిస్తున్నాను.
భారతదేశం – స్త్రీత్వ ఆదర్శ పరిణామం
భారతదేశంలో స్త్రీత్వం ఆరాధింపబడినట్లు మరే దేశంలోను, జాతిలోను ఆరాధింపబడలేదనడం నిర్వివాదాంశం. వేదకాలం నుంచి భారతదేశ చరిత్రను అధ్యయనం చేసిన వారెవరైనా ప్రాచీనకాలంలో స్త్రీలకు ఉండిన స్వాతంత్ర్యాన్నీ, వారు పొందిన ఔన్నత్యాన్నీ ప్రశంసించకుండా ఉండలేరు. ఋగ్వేద మంత్రాలను అందించిన ఋషులలో స్త్రీలు ఇరవైమందికన్నా ఎక్కువే ఉన్నారు. ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు వాటిలో కూడా వివేకవంతులైన, ఆధ్యాత్మిక ఉన్నత స్థితులను అందుకొన్న స్త్రీలు తారసపడతారు. చక్రవర్తుల సభలలోను, పండిత సదస్సుల లోను, చర్చావేదికలలోను వారు పాల్గొన్నట్లు తెలియవస్తుంది. వేదకాలానంతరం వారిలోని రెండు శాఖలను మనం పరికిద్దాం: 1. సద్యోవాహ – వివాహం దాకా విద్యాభ్యాసం చేసినవారు. 2. బ్రహ్మవాదిని – వివాహం చేసుకోకుండా ఉన్నత జీవితం గడిపే నిమిత్తం తమను అర్పించుకొని విద్యాభ్యాసం చేసినవారు. వేద కాలంలో బ్రహ్మవాదినులే ఆదర్శ మహిళలుగా పరిగణింపబడ్డారు. ‘అమృతత్వ స్థితిని ఈ సంపద అందివ్వలేకపోతే, ఇటువంటి సంపద నా కెందుకు? ఆ స్థితిని ప్రసాదించే సంపదను నాకు అనుగ్రహించండి’* అని భర్తను కోరిన మైత్రేయి లాంటి ఆధ్యాత్మిక సాధకురాలూ, ఋషులు అలంకరించిన రాజసభలో అనేకులు వెనుకాడిన తరుణంలో యాజ్ఞవల్క్యుణ్ణి, సాహసంతో ప్రశ్నలడిగిన గార్గి లాంటి బ్రహ్మవాదినులూ* నాటి ఆదర్శ మహిళలై ఒప్పారడం చూడవచ్చు.
బ్రహ్మవాదిని ఆదర్శం
బ్రహ్మవాదిని అంటే, ‘బ్రహ్మాన్ని గురించి చర్చించే స్త్రీ’ అని అర్థం చెప్పు కోవాలి. తక్కిన ఇతర గుణాలకన్నా ఈ గుణమే ఆమెలో ప్రాధాన్యం వహించి ఉంటుంది. బ్రహ్మస్థితిలో తాదాత్మ్యం పొందిన ఒక స్త్రీ, ‘ఆకాశాన్ని నేనే కన్నాను. ఆకాశానికి పైనా క్రిందా నా ఆధిపత్యమే ఉంది. నా దేహం యావత్ప్రపంచమూ వ్యాపించి ఉంది. వాయువుగా వీచి ఈ ప్రపంచాన్ని సృష్టించాను. నా మహ త్వంతో భూమ్యాకాశాలను అతిక్రమించి నిలబడి ఉన్నాను’* అని వచించడాన్ని మనం వేదంలో చూడవచ్చు. ఈ స్థితిని చేరుకోవడానికి కావాల్సిన స్ఫూర్తి వేదకాలం నాటి మహిళ లలో కానవస్తుంది. ఇదే వారి ఆదర్శం.
పతివ్రతాదర్శం
కానీ ఈ ఆదర్శం నుంచి భారతదేశం అప్పుడప్పుడు వైదొలగిన సందర్భాలు లేకపోలేదు. వేదకాల అంతంలో దీనిని మనం చూడవచ్చు. ఆ కాలఘట్టంలో మహిళలతో వేదాధ్యయనం మాన్పించి, అన్ని రకాలుగా పురుషుల అడుగుజాడలలో మెలగే విధంగా వారిని రూపొం దించారు. పరాయి దేశాల దండయాత్రల ఫలితంగా సమాజంలో ఏర్పడిన మార్పులే ఇందుకు కారణమని చరిత్ర చాటిచెబుతోంది. కానీ సమాజం చేసిన క్షమించరాని తప్పులలో ఇదొకటనడాన్ని మనం కాదనలేం. ఇందుకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం మనం చవిచూస్తున్నాం! అయినా దానిలో ఒక చిన్న ఆశాకిరణం ద్యోతక మవుతోంది. వేదం మాత్రమే మహిళలకు నిషిద్ధమైనది కానీ చదుమా, గొప్ప తనమూ విస్మరింపబడలేదు. ఇతిహాసాలలోను, పురాణాలలోను ఇటువంటి అనేకా నేకులు తారసపడతారు. ఇక్కడ పురుషుడికి, స్త్రీ లోబడినదై ఉన్నా, ఆ లోబడడం మూలంగానే పురుషుడు కూడా ఆరాధించే స్థాయికి ఆమె ఎదగగలదని వక్కాణించ బడింది. వేదకాలంనాటి బ్రహ్మవాదిని ఆదర్శం అదృశ్యమై, ప్రస్తుత కాలంలో పతివ్రతాదర్శం ఆ స్థానాన్ని స్వీకరించింది.
పతివ్రతాదర్శంలో మహిళ అన్నివిధాలా తనను పురుషుడికి లోబడినట్లు తలచే ప్రయత్నం కానవస్తుంది. స్త్రీని చిన్నతనంలో తండ్రీ, యౌవనంలో భర్తా, వృద్ధాప్యంలో కుమారుడూ పరిరక్షించాలి* అని వచిస్తోంది మనుస్మృతి. ఆమె ఏకైక ధర్మమూ, ఏకైక కర్తవ్యమూ, ఏకైక ఆదర్శమూ, ఏకైక దీక్షా – భర్తకు లోబడి, ఆతడినే దైవంగా భావించి జీవించడం. భగవంతుణ్ణి ఆరాధించక భర్తను కొలవడమే ఆమె అత్యున్నత ఆదర్శం.
పైపైన చూస్తే ఇది పురుషుడికి, స్త్రీని లోబరచినట్లుగా కనపడవచ్చు. కానీ ఈ కాలంలోనే స్త్రీకి అత్యంత ఉన్నతస్థానం ఇవ్వబడడం మన పురాణాలలోను, ఇతిహాసాలలోను చూడవచ్చు. పురుషుడికి, స్త్రీ అణగిమణగి మెలగాలని నిర్దే శించిన అదే మనువు, ‘స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనంది స్తారు’* అంటాడు. ‘దేవీమాహాత్మ్యం’ మరోమెట్టు పైకి వెళ్లి స్త్రీలందరూ దేవీ అంశ లని వక్కాణిస్తోంది. ఈ లోకంలో కానవచ్చే స్త్రీలందరూ నా అంశలే.* ప్రతిరోజూ ఉదయం మనం స్మరించే ఏడుగురు మహిళామణులు పతివ్రతాదర్శపు పరా కాష్టను చేరుకొన్నవారే. ‘అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరులను నిత్యం స్మరించేవారి పాపాలు నశిస్తాయి’* అని వచిస్తున్నది సంప్రదాయ శ్లోకం. ఈ ఐదుగురితోపాటు సావిత్రి, అనసూయలను చేర్చుకోవడం పరిపాటి.
ఈ ఏడుగురి జీవితాలు ఒక అద్భుత సత్యాన్ని మనకు వెల్లడిస్తాయి. వారిలో కొందరు పరిపరి విధాలుగా పురుషుల హింసకు గురైనవారు. కానీ అగ్ని పరీక్షల నన్నింటిలో జయప్రదంగా రాణించి పుటం పెట్టిన బంగారంలా జాజ్వల్య మానంగా ప్రకాశిస్తూన్నారు. ఇక్కడే పతివ్రతాదర్శపు తల్లివేరును మనం చూస్తున్నాం. పాతివ్రత్యమే ఆ తల్లివేరు. త్యాగం, సహనం, తపస్సు లాంటి సద్గుణాలన్నీ దాన్లో అంతర్గతమై ఉంటాయి.
సీత
మూర్తీభవించిన పతివ్రతాదర్శమే సీతగా అలరారుతున్నది. అశోకవనంలో సీతను చూసి వచ్చిన హనుమంతుడు, రామునితో ఇలా చెప్పాడు: “రామా! అక్కడ నేను పాతివ్రత్య దీక్షాకంకణాన్ని ధరించిన సీతను చూడలేదు. సీత మూర్తీభవించిన పాతివ్రత్యమూ, ఎల్లలెరుగని సహనమూ మేళవించిన కులీన సంజాతను చూశాను.” ఆ పతివ్రతా శిరోమణియైన సీతయే భారతదేశానికీ, భారతీయతకూ, భారతీయ సంస్కృతికీ మకుటాయమానమై విరాజిల్లుతోంది.
కాలం చేసిన ఘోరం
మనదేశంలా ఇంతగా పరాయి దురాక్రమణకు తలవొంచి అధోగతి పట్టిన దేశం మరొకటి లేదనే చెప్పాలి. పరాయి దురాక్రమణతో ఒక జాతి మరొక జాతిని బానిసగా చేసుకోవడం వలన పరిణమించే దుర్గతి ఏమిటో మన దేశ చరిత్ర అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికీ అవగతమే! దీనిలో ప్రధానంగా పేర్కొన దగినది సంస్కృతుల మిశ్రమం. ఇది అన్ని విధాలా వినాశనానికే దారితీస్తుందని గీత వచిస్తున్నది.* ఒకటి వెంట ఒకటిగా పైబడ్డ పరాయి దురాక్రమణలతో దిగుమతియైన అనాగరిక సంస్కృతుల ధాటిని అతిక్రమించి నేటికీ మనం హిందువులుగా మనగలుగుతున్నా మంటే, అందుకు కారణం ఆ సీతమ్మతల్లి మన స్త్రీల నరనరాలలో జీర్ణించుకుపోవడమే!
కొన్ని శతాబ్దాలుగా ఈ సంస్కృతుల మిశ్రమం ఫలితంగా స్త్రీత్వం అడు గంటిపోయింది. ఆడది కేవలం భోగవస్తువుగా పరిగణింపబడసాగింది. అయినప్ప టికీ ఆమె గొప్పతనమో, మహత్వమో తరిగిపోలేదు. అప్పుడప్పుడు ఒక పద్మినిగా, అహల్యాబాయిగా, చెన్నమ్మగా, మీరాగా, ఆండాళ్గా, ఝాన్సీరాణిగా ఆ మహత్వం వికసించనే వికసించింది. పురుషుల ఆధిక్యత కాస్త తగ్గిన ప్రస్తుత పరిస్థితిలో అది అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా, స్త్రీ స్వాతంత్ర్యమనే పేరిట అభివ్యక్తం కావడం మొదలయింది
స్త్రీ స్వాతంత్ర్యం
నేడు స్త్రీ స్వాతంత్ర్యం గురించీ, అభివృద్ధి గురించీ ఎంతో వేడిగా వాడిగా చర్చించుకొంటున్నారు, వ్రాస్తున్నారు. దాని గురించి మాట్లాడడమూ, రచించ డమూ, ప్రచురించడమూ ఏదో తప్పదన్నట్లు బహిరంగ సభలూ, పత్రికలూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగాయి. కానీ దీని పర్యవసానాలను పక్షపాతరహితంగా కాస్త యోచించి చూస్తే ఈ ‘స్వాతంత్ర్యం వలనో’, ‘పురోభివృద్ధి వలనో’ నిజంగా సమాజానికి ఎలాంటి శ్రేయస్సూ ఒరగలేదని ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చు. కుటుంబ ఐకమత్యాలు దెబ్బ తింటున్నాయి. బాంధవ్యాలు నలిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగి పోతోంది. పిల్లలు న్యాయస్థానాలకు వెళ్లి, “ఈమె నా తల్లి. ఈమె నా పట్ల వహిం చాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి” అని తల్లికి తెలియజేయవలసిన దారుణ పరిస్థితి నెలకొంటున్నది. ఎందుకు? నిజానికి స్త్రీ పురోగతి పొందివుంటే ఎందుకు ఇలా జరుగుతున్నది? ఆమే కదా గృహ నిర్వహణాధికారి. ఆమె పురోభివృద్ధి ఇంటి ఐకమత్యానికి భంగం కలిగించేదిగా ఉంటే, దానిని పురోభివృద్ధిగా పేర్కొనడం సబబేనా? తాపీగా పర్యాలోచించి దీనికి సమాధానం ఏమిటా అని పరికిస్తే, ‘లేదు’ అనే జవాబే వస్తుంది. అలా అయితే ఎక్కడ పప్పులో కాలువేశాం? నిజమైన అభివృద్ధి ఏదన్న ప్రశ్న తలెత్తుతుంది
వాస్తవిక పరిస్థితి
వేదకాలం నాటి స్త్రీల స్థితిగతులతో, పురాణేతిహాస కాలంనాటి పరిస్థితు లతో పోల్చి చూస్తే నేటి స్త్రీ అందుకు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తుంది. ‘స్త్రీ స్వతంత్రంగా జీవించడానికి అనర్హురాలు’* అనే పరిస్థితి పూర్తిగా మారి, ‘లౌకిక జీవితంలోని సూక్ష్మాలను గ్రహించి అనేక పుస్తకాలను చదవడం’ వారు ప్రారంభించారు. వారు పాల్గొనని రంగమే లేదనడం అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో సవాళ్లను ఆమె ఎదుర్కొనవలసి వస్తోంది. ఇంట్లో కుమార్తెగా, కోడలిగా, భార్యగా, సోదరిగా, ఇంటిని నిర్వహించే వ్యక్తిగా వ్యవహరిస్తున్న అదే సమయంలో సమాజంలో అధికారిగా, మంత్రిగా, పని మనిషిగా, బస్సు కండక్టర్‌గా, పోలీసుగా పనిచేయవలసివుంది. ఈ స్త్రీ ఎవరిని ఉదాహరణగా ఎంచుకొని జీవించగలదు?
అదేమిటి, మన సీత ఆదర్శం ఏమైందని అడగవచ్చు. సీత ఆదర్శం మన నరనరాల్లో జీర్ణించుకొనిపోయింది. ఆమె మన ఆదర్శ మహిళగానే సదా విరాజిల్లుతున్నది. కానీ సీత జీవితం దాదాపు ఒక భార్య అనే స్థానంలో అంత రించిపోతుంది. నేటి స్త్రీ జీవితంలో ఇంకా ఎన్నో పరిణామాలు చోటుచేసు కోవడం మనం చూస్తున్నాం. ఇన్ని మార్పులను ఇముడ్చుకొన్న ఆదర్శం ఏదైనా ఉందా?
స్త్రీల పురోభివృద్ధిలో తప్పు దారి
ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికి ముందు మనం ప్రస్తుత పరిస్థితిని కాస్త విశ్లేషించాలి. నేటి స్త్రీల స్వాతంత్ర్యమూ, పురోభివృద్ధీ పురుషుణ్ణి దృష్టిలో ఉంచుకొనే ఆలోచింపబడుతున్నవి. ‘పురుషుడు కారు నడుపుతున్నాడు – అందువలన నేను కూడా నడుపు తాను; పురుషుడు మంత్రి అవుతున్నాడు – నేను కూడా అవుతాను; పురుషుడు ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నాడు – నేనూ అధిరోహిస్తాను’ – ఇలా ప్రతి విషయంలోను పురుషుడికి స్త్రీ ఏ విధంగానూ తీసిపోదని నిరూ పించడంలోనే స్త్రీల పురోభివృద్ధి ఇమిడివున్నట్లు ప్రస్తుతం విశ్వసిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుదారి. నేటి సమాజంలోని దోషాలన్నిటికీ ముఖ్యకారణం ఈ భావనే! అలా అయితే స్త్రీలు ఇవన్నీ చేయరాదని ఉద్దేశమా? కానే కాదు. కానీ వీటిని ఒక పురోభివృద్ధిగా ఎంచి చేయరాదన్నదే మన అభిమతం. అలా అయినప్పుడు యథార్థమైన పురోభివృద్ధి ఏది?
ఇందుకు జవాబు తెలుసుకోగోరితే రెండు వాస్తవాలను స్పష్టంగా అవగతం చేసుకోవడం ఎంతో అవసరం. 1. పురాణ కాలంనాటి స్త్రీల జీవితం తెలిపే గుణపాఠం. 2. మనస్తత్వశాస్త్ర వాస్తవాలు.
పురాణకాలంనాటి స్త్రీ జీవితం తెలిపే గుణపాఠం
సప్త ఋషులతోపాటు ఏడుగురు మహాపతివ్రతలను కూడా ఉదయం స్మరించుకొంటారు హిందువులు. సుఖాలను, జీవితాన్ని, దేశాన్ని త్యజించి దీర్ఘ కాలం తపస్సు చేస్తూ మహోన్నతిని పొందిన మహా ఋషులతో సరిసమానంగా ఈ మహాపతివ్రతలు పరిగణింపబడుతున్నారు. వీరిలో ఎవరైనా దేశాన్ని త్యజిం గుణపాఠం చారా? అరణ్యాలలో సంచరించారా? కఠోర తపస్సు చేశారా? ఏదీ లేదు. ఋషులకు దీటుగా మరేదన్నా చేశారా అంటే అదీ లేదు. కానీ జరిగిన దాంట్లో తన నేరం ఏమీ లేకపోయినా భర్త శాపాన్ని కిమ్మనకుండా స్వీకరించింది అహల్య! రావణుని చేష్టలు దుర్మార్గాలని తెలిసీ ఆతణ్ణి దైవంగా ఆరాధించింది మండోదరి! కేవలం లంకను మాత్రమే కాకుండా యావత్ప్రపం చాన్ని సంకల్పమాత్రంతో దగ్ధం చేయగల శక్తి ఉన్నా, అలా చేయకుండా తన భర్త ఖ్యాతిని ఇనుమడించడానికి ప్రాధాన్యం ఇచ్చి నానాకష్టాలు అనుభవించింది సీత.
ఈ పనులు వారిని అధోగతి పట్టించాయా? లేదు కదా! అందుకు మారుగా పురుషులు సైతం ఆరాధించే స్థితికి వారిని ఉన్నతులను చేశాయి. ఎందుకంటే వారి పాతివ్రత్య మహత్వం ఇతర తపస్సుల కన్నా ఉన్నతమైనది కనుక.
పాతివ్రత్యమనే మానసిక తపస్సే స్త్రీల మహోన్నత ఆదర్శం. సహనమూ, పవిత్రతా, తపస్సూ, త్యాగమూ అన్నీ దాన్లోనే ఇమిడివున్నాయి. ఈ మార్గంలోనే మహిళల పురోగతిని గురించి యోచించాలి. మరో ఏ మార్గంలోనైనా మహిళల పురోగతికి ప్రయత్నిస్తే, అది వారికేగాక దేశానికి సైతం కీడుగా పరిణమిస్తుంది. దీనినే స్వామి వివేకానంద, “స్త్రీల పురోగతి అనే పేరిట సీత – ఆదర్శం నుండి వైదొలగచేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్నే చవిచూస్తాయి. దీన్నే కళ్లారా మన మిప్పుడు చూస్తున్నాం. సీత అడుగుజాడలలోనే మన మహిళలు ముందుకు సాగాలి. ఇదొక్కటే మార్గం” అని వ్యాఖ్యానించారు. ఏ దారిలో పయనిస్తే మన మహిళలు సహనమూ, త్యాగమూ ఇత్యాది సుగుణాలన్నిటినీ అలవరచుకొని, పాతివ్రత్య ధర్మంలో సుస్థిరులై పురోగతి పొందగలరో ఆ దారిలో వారిని తోడ్కొని వెళ్లాలి.
స్వామీజీ తెలిపిన దాన్లోని అంశాన్ని మళ్లీ పరికిద్దాం – ‘మహిళలను సీత ఆదర్శం నుంచి వైదొలగచేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్నే చవిచూస్తాయి.’ స్వామీజీ ఎందుకు ఇలా చెప్పాలి? స్త్రీల పురోగతిపట్ల అక్కర లేనివారా ఆయన? కానే కాదు. మహిళల విద్యావశ్యకత పట్ల భారతదేశంలో ప్రప్రథమంగా స్పందిం చింది ఆయనే కదా! అటువంటప్పుడు ఆయన ఎందుకు ఇలా అన్నారు?
స్వామీజీ మాత్రమే కాదు, హిందూమతం మాత్రమే కాదు, మత గ్రంథాల లోని పుటలను కొద్దిగా తిరగవేస్తే, లోకంలోని మతాలన్నీ ఈ అంశాన్నే వక్కాణిం చడం మనం చూడవచ్చు. చర్చిలలో స్త్రీలు పూజలు చేయడానికి క్రైస్తవ మతం ఇంతవరకు అనుమతించ లేదు. ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలు పురుషులకు సరిసమానులని మహమ్మద్ ప్రవక్త అంగీకరించలేదు. ఎంతో తటపటాయించిన తరువాతే బుద్ధుడు స్త్రీలకు తన సంఘంలో స్థానం కల్పించాడు. మతానికి వ్యతిరిక్తమైన కమ్యూనిజమూ, నాస్తికవాదమూ కూడా స్త్రీలకు అగ్రతాంబూలం కల్పించాయా అంటే, లేదనే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే అలా చేయడానికి వీలులేదు కనుక. పురుషులతో పోటీలు పెరగడం వలన ఎన్నటికీ మహిళల పరిస్థితి పెంపొందదు. ఈ సంగతి అవగతం చేసుకోవడానికి ఒకింత మనస్తత్త్వ శాస్త్రాన్ని ఆశ్రయించాలి.
మనస్తత్త్వశాస్త్రం వెలిబుచ్చే స్త్రీత్వం
‘మాతృత్వం అవగాహనకు అతీతమైన తత్త్వ’ మన్నారు శ్రీరామకృష్ణులు. దానిని అట్లే వక్కాణిస్తూన్నది నేటి మనస్తత్వశాస్త్రం. స్త్రీత్వమనే రహస్య పేటిక తాళంచెవియే మాతృత్వం. మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆమె మనోశరీరాలు నిర్మాణమై ఉన్నాయి. ఒక స్త్రీ పురుషుని దరిచేరడం కూడా తాను మాతృత్వం పొందడానికి ఆతణ్ణి నిమిత్తమాత్రునిగా ఉపయోగించుకోవడానికి మాత్రమే. ఈ విషయంలో ఒక స్త్రీ వైఖరి పురుషుని నుండి పూర్తిగా భిన్నమైనది.* ఈ రీతిలో మౌలికంగానే వేర్పాటు కనబరిచే స్త్రీల ఆదర్శాలూ, ఆకాంక్షలూ పురుషుల వంటివి కావనడం నిజమే కదా!
స్త్రీత్వం మాతృత్వం దిశగా పురోగమిస్తుంది. మాతృత్వమే దాని పరాకాష్ట. మాతృత్వాన్ని పొందలేని స్త్రీ ఆత్మతృప్తి పొందలేదు. ఆత్మతృప్తి లేని స్త్రీ ఇంట్లో మాతృత్వం ఎలా సంతృప్తినీ, ప్రశాంతతనూ పంచి ఇవ్వగలుగు తుంది? ఆ ఇల్లూ, ఆ దేశమూ అధోగతి దిశగా కాకుండా మరే దిశలో పయ నిస్తాయి? కనుక మాతృత్వమనే స్థితి దిశగానే స్త్రీల పురోగమనపథం రూపు దిద్దుకొంది.
ఇక్కడ ఒక విషయం గమనార్హం! శారీరకంగా తల్లి అయినంత మాత్రాన మాతృత్వ స్థితిని పొందినట్లు కాదు. మానసికంగా అందరినీ తన పిల్లలుగా పొదివిపట్టుకోగల ఉదాత్త గుణాన్నే మాతృత్వంగా వ్యవహరిస్తాం. సోదరి నివేదిత అభిప్రాయం ఈ అంశాన్ని మరింత స్పష్టంగా విశదపరుస్తుంది: ‘మాతృత్వమనే ఉత్కృష్ట ప్రేమ ఉన్నదే, అది స్వాభావికంగా భార్య ప్రేమను కూడా మించిపో తుంది. భార్య ప్రేమలో సుఖం ఉన్నప్పటికీ, కొన్ని సమయాలలో అది ఊగిసలాడు తుంది. కానీ తల్లి ప్రేమ అవసరాలకు అనుగుణంగా మనపట్ల పొంగిపొరలు తుంది. ఘోర నరకంలో సైతం అది మనలను అనుసరిస్తుంది. మాతృత్వం ఎన్నడూ మాసిపోదు; ఆ ఆశీస్సులు సదా సర్వవేళలా మనకు లభిస్తూనే ఉంటాయి. దాని నుంచి మనం వైదొలగలేము. ఆ హృదయంలో మనం సురక్షితమైన లాలనలో జీవించవచ్చు. ప్రగాఢ ప్రీతి, విడదీయలేని బంధం, పవిత్రత – ఇవన్నీ, ఇంకా మరెన్నో కలగలసి రూపొందినదే మాతృత్వం. భారతదేశంలో ‘మాత’ అనే భావన కన్నా మరో ఉన్నతమైన భావన ఏదీ లేదు. ఆ ఉత్కృష్ట ప్రేమ దేనినీ తనకై ఉంచుకోదు; అన్నింటిని పంచిపెట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందుతుంది. అన్నింటినీ పంచిపెట్టినా అందుకు ప్రతిఫలంగా దేనినీ ఆశించదు. ఆ పవిత్ర కాంతిపుంజపు పరిమాణాన్ని అవగతం చేసుకోవడానికి మనం ప్రయత్నించడం లేదు. మన మీదా, మన చుట్టూ చెదరిపోయే ఆ వెలుగు కిరణాలలో చలికాచు కోవడంతోనే తృప్తిపడిపోతాం.”* దీనినే స్వామి వివేకానంద, “భారతీయ మహిళ పరిపూర్ణత్వం మాతృత్వమే. ఆ అద్భుతమైన, సకల దుఃఖాలను భరించే, సదా క్షమించే గుణంగల మాతృత్వమే భారతీయ స్త్రీత్వ ఆదర్శమూ, పరాకాష్ఠా” అని వచించారు. కనుక స్త్రీలు, పురుషులతో పోటీపడడం మానుకొని, సహనమూ, నిదానమూ, త్యాగమూ, పాతివ్రత్యమూ, మాతృత్వమూ – వీటి పరిపూర్ణ దిశగా పయనించడంలోనే తమ యథార్థమైన ఉన్నతి ఉన్నదనే విషయంలో ప్రగాఢ విశ్వాసం వహించాలి.
నవీన ఆదర్శ జీవితావసరం
కానీ విశ్వాసం కేవలం మాటలతో చేకూరదు. నేటి స్త్రీల పరిస్థితిలో పైన చెప్పిన సుగుణాలను మాత్రమే ఆదర్శంగా గైకొని జీవిస్తూ, పురుషులతో పోటీ
లు పడకుండా ఆదర్శాన్ని సాధించుకొని, పురుషులు సైతం ఆరాధించే స్థితికి చేరుకొన్న వారు ఎవరైనా ఉన్నారా? అటువంటి ఆదర్శమహిళ ఒకరు ఉన్నప్పుడు మాత్రమే నేటి మహిళలో విశ్వాసం పెంపొందుతుంది. ఈ మార్గంలో తన జీవితాన్ని మలచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి మహిళ ఒకరు ఉన్నారా?
నేటి మహిళాదర్శపు పరిపూర్ణతయే శ్రీ శారదాదేవి
కాలానుగుణంగా తలెత్తిన ఈ ప్రశ్నకు జవాబు శ్రీ శారదాదేవి జీవితమే! కేవలం డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో, ఈమె మానవస్త్రీయేనా లేక స్వర్గంలోని దేవతయా లేక దేవతలు సైతం ఆరా ధించే దేవీపరాశక్తియా అని దిగ్భ్రాంతులను కలిగించేలా జీవించారు. “భారతీయ స్త్రీత్వ ఆదర్శ పరిపూర్ణతగా శ్రీరామకృష్ణులు విడిచిపెట్టి వెళ్లినట్లు మాతృదేవి నాకు తోస్తున్నారు”* అంటుంది సోదరి నివేదిత.
కనుక పాఠక మహాశయులారా! శ్రీ శారదాదేవి జీవితం కేవలం సాధారణ మైన సంఘటన కాదు. కాలపు లోటుపాట్లను భర్తీచేయడానికి కాలాధిపతియైన భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె పావన జీవిత చరితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ధ్యేయం, సోదరి నివేదిత అన్నట్లు, ఆ మాతృత్వ పరిమాణాన్ని కొలవడం కాదు. అది అభివ్యక్తం చేసే విభిన్న వర్ణాలలో (రంగులలో) ఐక్యమైపోవడమే, ఆ వెలుగు కిరణాలలో చలి కాచుకోవడమే!
కాలం నూతనత్వం దిశగా కదలిపోతున్నా మాతృదేవి జీవితం ఆదర్శమయ జీవితంగానే అలరారుతూన్నది. ఆమె ఈ భువిలో అరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించారు. దాన్లో దాదాపు ముప్ఫై ఏడు సంవత్సరాలు తల్లితండ్రులు, బంధువులు, భర్త, కొద్దిమంది భక్తులు తప్ప, బయటి ప్రపంచం తెలియకుండానే జీవించారు. తక్కిన ముప్ఫై సంవత్సరాలలో కూడా ఆమెను తెలిసినవారు కొద్ది వందలమంది శిష్యులు మాత్రమే. కానీ ఆమె మహాసమాధి అనంతరం కొన్ని సంవత్సరాలలోనే ఎంతటి మార్పు! ప్రస్తుతం ఆమె దివ్యజననిగా, మాతృ దేవిగా కోట్లాది జనుల పూజలు అందుకొంటున్నారు. భారతీయ స్త్రీత్వపు ఆదర్శా నికి పరిపూర్ణతగా భాసిల్లుతున్నారు.
యుగాచార్యులైన స్వామి వివేకానంద నేటి మహిళలు ఆదర్శంగా చేసు కోవడానికి మాతృదేవినే వారికి సూచించారు: “శ్రీ శారదాదేవి జీవిత అంత రార్థాన్ని మీరింకా అవగతం చేసుకోలేదు. క్రమేణా గ్రహిస్తారు. శక్తి తప్ప లోకానికి మోక్షం లేదు. అన్ని దేశాల కన్నా మన దేశం ఎందుకు వెనుకబడి ఉంది? ఎందుకు దుర్బలమై ఉంది? అందుకు కారణం మనం శక్తిని గౌరవించక పోవడమే. ఆ అద్భుత శక్తిని మళ్లీ వికసింపజేయడానికి మాతృదేవి అవత రించారు. ఆమెను కేంద్రంగా చేసుకొని గార్గులూ, మైత్రేయిలూ మళ్లీ లోకంలో ఉద్భవిస్తారు. ప్రియమైన సోదరులారా, ప్రస్తుతం మీరు వారిని గురించి అవగతం చేసుకొన్నది బహుస్వల్పం. క్రమంగా మీకు యావత్తూ తెలియవస్తుంది.”
మరొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆదర్శ స్త్రీత్వపు పరిపూర్ణత లేక స్త్రీత్వపు ఆదర్శం అన్నది మాతృదేవి జీవితంలో ఒక అంశం మాత్రమే. ఆమె అవతరించడానికిగల వివిధ కారణాలను ఈ పుస్తకంలో మనం చూడబోతున్నాం.
శ్రీ శారదాదేవి జీవితాన్ని వివేకంతో పరిశోధింపదలచిన వారికి అదొక ప్రహేళిక. కానీ అనురాగాన్ని అన్వేషిస్తూ చరించే వారికి అనుగ్రహ వృష్టిని కురిపించే ఆనంద మేఘం. ఆమె పాదపద్మాలు సజ్జనులు–దుర్జనులు, పేద వారు–ధనికులు, చిన్నవారు–పెద్దవారు, స్త్రీ–పురుషులు లాంటి తారతమ్యం లేకుండా అందరికీ శరణాగతిని ప్రసాదించి, భవసాగరాన్ని దాటించే అద్భుతమైన పడవ.
“అమ్మా! మా దోషాలనన్నిటిని మీ అవ్యాజ కరుణతో సుగుణాలుగా తీర్చి దిద్ది మా మనస్సులను మీ పాదపద్మాలకు కట్టిపడేశారు. ఇదేం విచిత్రం తల్లీ” అంటూన్నది ఆమెను గురించిన ఒక పాట. [ప్రకృతి పరమాం…]
పాఠకులారా! రండి. ఆ అనుగ్రహామృత వాహినిలో అద్భుత స్నానం చేయ డానికి తరలివెళదాం!