1901 సం ॥ మార్చి 31 వ తేదీ ఢాకాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పై విషయాన్నిగూర్చి శ్రీ స్వాములవారు రెండుగంటల పాటు, ఆంగ్లంలో ఉపన్యసించారు. వంగభాషలో, ఒక శిష్యునిచే వ్రాయబడిన ఆ ఉపన్యాస సారాంశానికిది అనువాదం.
చాలాకాలం క్రిందట మనదేశం ఆధ్యాత్మికంగా, ఎక్కువ పురోభివృద్ధి చెందింది. ఇప్పుడు మనమా ప్రాచీనచరిత్ర నొక్కసారి మనస్సునకు తెచ్చుకుందాం. పూర్వపు ఔన్నత్యంపై దృష్టి నిలుపడంవల్ల ఒక అపాయం కూడ ఉంది. మనం కొత్త విషయాలనుగూర్చి ఆలోచించక, పూర్వుల ఔన్నత్యాన్ని నెమరుకు తెచ్చుకోవడంతో తృప్తిని గర్వాన్ని మాత్రం పొందుతూంటాం. ఈ అపాయానికి మనం దూరంగా ఉండాలి. పూర్వకాలంలో సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొన్న ఋషులు, మహర్షులు ఉన్నారు నిజమే. కానీ, వారిని జ్ఞప్తికి తెచ్చుకోవడం నిజంగా ప్రయోజనకారి అయితే మనం కూడ వారిలాగా, ఋషులుగా తయారుకావాలి. అంతే కాదు చరిత్రవల్ల మనకు తెలుస్తున్న ఋషులకంటె గొప్పవారం కాగలమనే దృఢవిశ్వాసం నాకుంది. పూర్వం మనం సాధించిన కార్యాలు పేర్కొనదగినవే. వాటినిగూర్చి ఆలోచించడం నాకు గర్వకారణంగానే ఉంది. కానీ ప్రస్తుత పతనావస్థను చూచి, నేను నిరుత్సాహపడటంలేదు. భవిష్యత్తును, నా మనోనేత్రం ముందు చిత్రించుకొని, ఉత్సాహపడుతున్నాను. ఎందుచేత? విత్తనం, చెట్టు కావడానికి ముందు, రూపాంతరాన్ని పొందుతుందని, అంతేకాక పూర్తిగా నశించినట్లు అగుపడుతుందని నాకు తెలుసు. ఇదే విధంగా తాత్కాలికమైన ఈ పతనావస్థలో మన మతం యొక్క భావిభాగ్యోదయ శక్తులున్నాయి. ఇవి సమయం వచ్చినప్పుడు విజృంభించి, మన మతాన్ని ఇదివరకుండిన దానికంటే కూడ ఉన్నత దశకు తీసుకొనిపోగలవు.
ఇప్పుడు మనం, మన మతంలో ఏ విషయాలపట్ల ఐక్యత ఉందో పరిశీలిద్దాం. స్థూలంగా చూచినప్పుడు, మన మతంలోని వివిధ శాఖల మధ్య భేదం ఉందనడం నిస్సందేహమే. మన మతంలో కొందరు అద్వైతులు, కొందరు విశిష్టాద్వైతులు, మరికొందరు ద్వైతులు ఉన్నారు. కొందరికి, అవతారాలపట్ల నమ్మకం ఉంది. కొందరు విగ్రహారాధనను నమ్ముతారు. మరికొందరు నిరాకారవాదాన్ని కావిస్తారు. ఆచారాలలో కూడ భిన్నత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మదీయులతోడను, క్రైస్తవులతోడను, వివాహసంబంధాలు చేసినా హిందువులలో, చాతుర్వర్ణాల వారికి కులబహిష్కారం ఉండదు. నిరాటంకంగా వారు హిందూదేవాలయాల్లో ప్రవేశించవచ్చు. పంజాబులోని చాలా గ్రామాలలో పంది మాంసం తినని వానిని హిందువుగానే పరిగణించరు. నేపాల్ దేశంలో, బ్రాహ్మణుడు చాతుర్వర్ణాలలో వివాహం చేసుకోవచ్చు, కానీ వంగదేశంలో బ్రాహ్మణుడు శాఖాంతర వివాహమైన చేసుకోరాదు. ఇలా ఒక్కొక్క చోట, ఒక్కొక్క ఆచారం ఉంది. ఈ భిన్నత్వంలో హిందువులకందరికీ ఏకాభిప్రాయంగల విషయం ఒకటి ఉంది. హిందువగు వాడెవ్వడూ గోమాంసాన్ని తినడనటమే ఆ విషయం. ఇట్లే మన మతంలోని వివిధ శాఖలలో ఏకవాక్యతగల విషయాలు చాలా ఉన్నాయి.
మత గ్రంథాల గూర్చి చర్చించేటప్పుడు మనకొక విషయం మొదట స్ఫురిస్తుంది. కొన్ని ప్రమాణ గ్రంథాలపై ఆధారపడిన మతాలు, త్వరగా అభివృద్ధి చెందుతూ వచ్చి ఎన్ని ఆఘాతాలు కలిగినా, నేటికినీ నిలువగలిగాయి. సర్వాంగసుందరమైనా గ్రీకు మతం ప్రమాణ మతగ్రంథం లేకపోవడంతో నశించింది. కాని యూదుల మతం ‘ఓల్డ్టెస్టమెంట్’ ను ప్రమాణంగాకొని, నేటికినీ శక్తిని కోల్పోక నిలిచివుంది. ప్రపంచంలో అతి ప్రాచీనమైన వేదాల ఆధారంగాగల హిందూమతం కూడ ఇలాగే నిలువగలిగింది. వేదాలు కర్మకాండమని, జ్ఞానకాండమని రెండుగా విభజించబడ్డాయి. మేష యజ్ఞాలను దక్షిణంలోని కొందరు బ్రాహ్మణులు అప్పుడప్పుడు చేస్తున్నప్పటికీ, కర్మకాండ మనదేశంలో ఆచరణలో ప్రస్తుతం లేనట్లే. ఇది మన మంచికి కావచ్చు, లేదా చెడ్డకే కావచ్చు. వివాహ శ్రాద్ధాదుల సందర్భంలో చెప్పబడే మంత్రాలలో వైదికక్రియాకాండ చిహ్నాలు మనకు కొంచెం కనిపిస్తున్నాయి. కాని, పూర్వస్థితిని పొందగల అవకాశం ఏమీ లేదు. కుమారిలభట్టు ఒకప్పుడు ప్రయత్నించాడుకానీ, ఆయన ప్రయత్నం ఫలప్రదం కాలేదు.
వేదాలలోని జ్ఞానకాండ వేదాంతమని చెప్పబడే ఉపనిషత్తుల రూపంలో ఉంది. ఆచార్యులు ప్రమాణంగా ఎక్కడైనా, ఒక వాక్యం చెబితే, అది ఉపనిషత్తులలోనిదే అయి ఉంటుంది. వేదాంతమే ప్రస్తుతం హిందువుల మతం. హిందూదేశంలో ఏ తెగకానీ, తమ భావాలను ప్రమాణంగా తీసుకోవాలి. ద్వైతులైనా, అద్వైతులైనా, ఎవరైనా సరే అలా చేయవలసిందే. వైష్ణవులుకూడ తమ సిద్ధాంతాలను నిరూపించుకోవడానికై గోపాలతాపని ఉపనిషత్తు నాశ్రయిస్తారు. ఏ తెగవారైనా, తమ భావాలను బలపరచే ఉపనిషత్తులేదని గ్రహిస్తే, వెంటనే ఒకదాన్ని కల్పించి, అది ప్రాచీన గ్రంథమే అని చెప్పడానికైనా వెనుదీయరు. పూర్వమిలాటి సంఘటనలు ఎన్నో ఉండేవి.
ఇక వేదాలనుగూర్చి విమర్శిద్దాం. వేదాలు ఎప్పుడో పూర్వం మానవ మాత్రులచే వ్రాయబడినవిగా హిందువులు తలపరు. చిరకాల సముపార్జితమైన అగాధ దివ్యజ్ఞాన నిధులుగా వాటిని భావిస్తారు. ఈ వేదాలు ఒక్కొక్కప్పుడు అభివ్యక్తమవుతూంటాయి. ఇంకొకప్పుడు అభివ్యక్తం కాకుండా ఉంటాయి. సాయనాచార్యులవారు, తమ గ్రంథాలలో ఒకచోట ఇలా చెప్పారు: “యోవేదే భ్యో-ఖలంజగత్ నిర్మమే” (వైదిక జ్ఞానం చేత ఎవడు అఖీలజగత్తును నిర్మించాడో) వేదాలను వ్రాసిన వానిని ఎవరూ చూడలేదు. అలాటివాడు ఒకడున్నాడని ఊహించడమూ కష్టమే. ఋషులు మంత్రాలను కనుగొన్నవారు మాత్రమే. కానీ, అవి ఆదికాలం నుండి ఉన్నాయి. అనంత జ్ఞాననిధులైన ఆ వేదాలను వారు ముఖాముఖీ దర్శింపగల్గారు.
ఆ ఋషులెవరు? వాత్స్యాయనుడు ఇలా చెప్పాడు: “మ్లేచ్ఛుడైనా సరే, ఎవడు సత్ప్రవర్తనచే ధర్మజ్ఞానం పొందుతాడో, బ్రహ్మసాక్షాత్కారం పొందుతాడో, వాడే ఋషి”. ఈ విధంగానే జారపుత్రుడైన వసిష్ఠుడు, మత్స్యగంధి పుత్రుడైన వ్యాసుడు, దాసీపుత్రుడైన నారదుడు, ఇంకా ఇలాంటవారనేకులు ఋషిత్వాన్ని పొందారు. ఇందువల్ల, నిత్యమైన బ్రహ్మమును కనుగొన్నవారిమధ్య జాతిభేదాలు పాటించడం తగదని తేలుతోంది. పైన చెప్పిన వారంతా, ఋషులైనప్పుడు, నేటికాలపు కులీన బ్రాహ్మణులు అంతకంటె గొప్పఋషులు కావచ్చు. కాబట్టి ఆ ఋషిత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి. గమ్యమును చేరేవరకు వెనుదీయకండి. అప్పుడే సర్వప్రపంచం మీకు తల ఒగ్గుతుంది. ఋషులుగా మారిపోండి! అదే శక్తి రహస్యం.
వేదాలు మాత్రమే మనకు ప్రమాణాలు. వాటిని గ్రహించే హక్కు ప్రతివానికీ ఉంది.
“యథేమాం వాచం కల్యాణీమావదాని జనేభ్యః ।
బ్రహ్మరాజన్యభ్యాం శూద్రాచార్యాయచ స్యాయచారణాయః ॥”
అని శుక్లయజుర్వేదం చెబుతోంది. ప్రతివానికీ వేదాలను చదివే హక్కులేదని వేదం నుండి ప్రమాణం నీవు చూపగలవా? పురాణాలు మాత్రం కొన్ని కులాలు వేదాలు చదువరాదనీ, కొన్ని కులాలు మాత్రమే చదవాలనీ, వేదాలలోని కొంతభాగం సత్యయుగానికి వర్తిస్తుందనీ, మరి కొంతభాగం కలియుగానికని చెప్పేమాట నిజమే. కానీ వేదాలుమాత్రం అలా చెప్పడంలేదని గుర్తుంచుకోండి. చెప్పేది పురాణాలే. సేవకుడు యజమానిని ఆజ్ఞాపించగలడా? స్మృతులు, పురాణాలు, తంత్రాలు మొదలైనవి వేదానుసారాలైనంతవరకే గ్రాహ్యములు. వేద విరుద్ధాలైన వానిని అప్రమాణంగా తోసిపుచ్చవచ్చు. కానీ, నేడు మనం వేదాలకంటే, పురాణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. వేదపఠనం, వంగదేశంలో మటుమాయమైంది. ఇలవేల్పయిన సాలగ్రామంతోపాటు వేదాలనుకూడ పూజావేదికపై ఉంచి చిన్న, పెద్ద, ఆడ, మగ అనే భేదం లేకుండా అందరూ వేదపారాయణం చేయగల దినాలకై నేనెంతో ఆశతో ఎదురు చూస్తున్నాను.
వేదాలనుగూర్చి పాశ్చాత్యపండితులు చేసిన సిద్ధాంతాలపై నాకు నమ్మకంలేదు. వారు, నేడు వేదాలు ఏదో ఫలానా కాలానికి చెందినవని నిర్ణయించి, రేపు ఇంకొక వేయి సంవత్సరాలు ముందుకు తెస్తారు. పురాణాలనుగూర్చి వేదమార్గానుసారమైనంతవరకే అవి ప్రమాణాలని, కానిచో, కావనీ నేనిదివరకే చెప్పాను. పురాణాలలో వేదవిరుద్ధములైన చాలా విషయాలున్నాయి. ఉదాహరణకు పురాణాలలో ఎవరో పదివేల సంవత్సరాలు జీవించారనీ, మరి ఒకరు ఇరవై వేల సంవత్సరాలు జీవించారనీ చెప్పబడివుంది. కానీ, వేదాలు ఇలా చెబుతున్నాయి. ‘శతాయుర్వైపురుషః’ – మానవుడు వంద సంవత్సరాలు జీవిస్తాడు. ఈ విషయంలో మనం దేన్ని ప్రమాణంగా గ్రహించాలి? వేదాలనే ఇట్టి కొన్ని విషయాల్లో తప్ప, నేను పురాణాలను నిందించడం లేదు. పురాణాలలో, మహోపదేశాలు, భక్తి, జ్ఞాన కర్మయోగాలనుగూర్చి అమూల్యములైన పలుకులున్నాయి. వీటిని మనం తప్పక గ్రహించవలసిందే! ఇక తంత్రాలనుగూర్చి ఆలోచిద్దాం. తంత్రమనే పదానికి సరైన అర్థం శాస్త్రం. ఉదాహరణకు కాపిల తంత్రం. కానీ తంత్రమనే పదం సంకుచితార్థంలో ఉపయోగింపబడుతోంది. బౌద్ధ మతాన్ని స్వీకరించి, అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం కావించిన రాజుల పాలనలో వైదిక యజ్ఞయాగాదులు అంతరించాయి. రాజభీతిచే ఎవడూ జంతుబలి చేయ సాహసించలేకపోయారు. కానీ తరువాత బౌద్ధులలోనే మొదట హిందూమతం అనుసరిస్తూండిన కొందరు, యజ్ఞయాగాదులకు సంబంధించిన కొన్ని ముఖ్యకర్మలను స్వీకరించి రహస్యంగా చేయనారంభించారు. వీటినుండే తంత్రాలు బయలుదేరాయి. వామాచారాది కొన్ని దోషాలమాట అటుంచి, తంత్రాలు ప్రజలు అనుకున్నంత చెడ్డవికావు. ఉదాత్తములైన కొన్ని వైదికభావాలు అందున్నాయి. చివరికి వేదాలలోని బ్రాహ్మణములనుకూడ సంస్కరించి తంత్రాల తెగలో చేర్చారు. కర్మకాండమునకు సంబంధించిన నేటి పూజ, ఆచారం మొదలైన విధానాలు తంత్రానుసారంగానే ఉన్నాయి.
ఇప్పుడు మన మతసూత్రాలనుగూర్చి కొంత చర్చిద్దాం. భిన్నాభిప్రాయాలకు గురి అయిన విషయాలు వివిధ శాఖలలో ఉన్నా, అందరూ అంగీకరించే కొన్ని సామాన్యవిషయాలు అందులో ఉన్నాయి.
ఈశ్వరుడు, ఆత్మ, జగత్తు, ఈ మూడు విషయాలను అందరూ అంగీకరిస్తారు. సృష్టి, స్థితి, లయకారకుడైన వాడు, ఈశ్వరుడు. సాంఖ్యులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించరు. రెండవది ఆత్మను, ఆత్మపునర్జన్మమును గూర్చినది. అసంఖ్యాకమైన ఆత్మలు ఒక శరీరం తర్వాత మరొక శరీరాన్ని గ్రహిస్తూ తమతమ పురాకృత కర్మమునుబట్టి, జీవన్మరణచక్రంలో పరిభ్రమిస్తూంటాయని ఈ వాదం చెబుతోంది. దీనిని సంసారవాదమనీ, పునర్జన్మవాదమనీ అంటారు. ఇక జగత్తు ఆద్యంతరహితమైంది. ఈ మూడూ ఒక వస్తువుయొక్క రూపాంతరాలని కొందరు, పరస్పర సంబంధరహితమైన విభిన్నరూపాలని కొందరు, ఇలా పలువురు పలురకాలుగా చెబుతూన్నా పై మూడూ ఉన్నాయని అందరూ, అంగీకరిస్తూనే ఉన్నారు.
ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞప్తియందుంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. హిందువులు అతిప్రాచీనకాలంలోనే మనస్సు నుండి ఆత్మ వేరని గుర్తించారు. కానీ పాశ్చాత్యులు మనస్సు కంటె దూరంగా ఆలోచించలేకపోయారు. పాశ్చాత్యులు విశ్వమంతా సుఖమయమని తలచారు. కాబట్టి, వారికీ లోకం సుఖ మనుభవించగల స్థలం మాత్రమే. కానీ, ప్రాచ్యులు ఈ సంసారం – క్షణభంగురమైన ఈ లోకం – దుఃఖమయమని భావించారు. అందువల్ల లోకం అశాశ్వతమైందనీ, అందున్న అనిత్యమైన సుఖాలను, సంపదలను నమ్ముకోవడం తగదని వారి ఉద్దేశం. ఈ కారణం చేతనే అటు పాశ్చాత్యులు కట్టుదిట్టంగా కార్యం చేయడంలో నేర్పరులై ఉండగా, ఇటు ప్రాచ్యులు ఆంతరలోక నిగూఢ విషయాన్వేషణపరులై ఉన్నారు.
ఇక హిందూమత దృక్పథాన్ని తెలిసికోవడానికై ఒకటి రెండు విషయాలను గూర్చి ఆలోచిద్దాం. ఈ మతంలో భగవదవతారాలనుగూర్చిన వాదముంది. వేదాలలో మత్స్యావతారాన్ని గూర్చి మాత్రం ప్రస్తావించబడింది. అందరూ ఈ అవతారవాదాన్ని అంగీకరిస్తారా? లేదా అనడం ప్రస్తుత విషయం కాదు. అవతారవాదంలోని అంతరార్థం మానవారాధనే. మానవునిలో భగవంతుని దర్శించడమే నిజమైన భగవద్దర్శనం. హిందువులు ప్రకృతిరూపాన భగవంతుని దర్శించరు. మానవరూపంలో దర్శిస్తారు.
తరువాత విగ్రహారాధన గూర్చి విమర్శిద్దాం. శుభకార్య సమయాల్లో పూజించాలని శాస్త్రాలు నిర్దేశించిన ఐదుగురు దేవతలు తప్ప మిగిలిన వారంతా వారి దశాంతరాలే. ఈ ఐదుగురు దేవతలుకూడా ఒక్కదేవుని వివిధ పేర్లే తప్ప వేరుకావు. విగ్రహారాధనం పూజావిధానాలన్నిటిలోనూ అధమమైందిగా శాశ్త్రాలలో చెప్పబడింది. అంతమాత్రాన అది చేయడం తప్పుకాదు. విగ్రహారాధనలో నేడు చాలా దోషాలున్నా నేను దానిని నిరసించను. సనాతనాచారపరుడు, విగ్రహారాధకుడు అయిన ఒక బ్రాహ్మణుని పాదధూళియే నాకు సోకకుంటే నేనేమై ఉందునో? విగ్రహారాధనను దూషించే సంస్కర్తలకు నేను చెప్పేదేమంటే, “సోదరులారా! మీరెలాటి బాహ్యసాధన సహాయంలేక దేవుని సూటిగా పూజించగలిగితే అలాగే చెయండి. కానీ అలా చేయలేనివానిని మీరెందుకు దూషిస్తారు? అతి ప్రాచీనకాలానికి స్మారకచిహ్నమైన సుందరభవన మొకటి అజాగ్రత్త వలననో, లేక ఉపయోగంలో లేకపోవడం చేతనో, ధూళిదూసరితమై, శిథిలావస్థలో ఉన్నదనుకోండి. అందులోని కొన్నిభాగాలు నేలలో కూడ కలిసిపోయాయనుకోండి. దాన్ని మీరేం చేస్తారు? తగిన మరమ్మత్తులు చేసి పూర్వపుస్థితికి తేవడానికి ప్రయత్నిస్తారా? లేక పూర్తిగా పడగొట్టి ఆ స్థలంలో అస్థిరమైన నూతన విధానంతో వేరొక భవనం నిర్మించదలచు కొంటారా? పూర్తిగా నేలమట్టంచేసే ప్రయత్నం చేయక, శుభ్రంచేసి అవసరమైన మరమ్మత్తు చేసే ప్రయత్నానికే పూనుకోవాలి! అంతటితో దాని సంస్కారం పూర్తవుతుంది. పునరుద్దరించిన తర్వాత దానికింకేమి అవసరముంది? మీరు చేయగలిగితే ఆ పని చేయండి. లేకుంటే ఊరికే ఉండండి.” మనదేశంలో కొందరు సంస్కర్తలు ఒక కొత్తమతాన్ని స్థాపించదలచుకున్నారు. ఎట్లయినా వారు మంచిపనే చేశారు. భగవంతుడు వారిని ఆశీర్వదించుగాక! కానీ హిందువులైన మీరు సర్వసామాన్యమైన మతానికి దూరంగా ఏల పోదలచుకున్నారు? మీ సర్వస్వమైన హిందూమతానికి చెందినవారమని చెప్పుకోవడానికి మీరేల సిగ్గుపడతారు? ఓ నా దేశీయులారా! ఈ మన భారతనౌక (మన మతం) యుగయుగాలుగా మన నాగరికతను మోసికొనిపోతూ, అందలి ధనంచే ప్రపంచాన్నంతా సంపన్నంచేస్తోంది. ఎన్నో శతాబ్దాలనుండి, ఈ నౌక అనేక ఆత్మలను మోసికొని జీవనసముద్రంలో చలిస్తూపోయి దుఃఖానికి దూరంగా, ఆవలి ఒడ్డును చేర్చింది. మీ అపరాధాలచే ఏమి, ఇతర కారణాలచే ఏమి ఆ నౌక ఒకింత చెడింది. అందులోవున్న మీరు ఇప్పుడేం చేస్తారు? దాన్ని నిందిస్తూ మీలో మీరు కలహిస్తారా? మీరంతా ఏకమై దాన్ని ఆపదనుండి రక్షించరా? అందుకు మీరు మీ హృదయరక్తాన్ని ధారపోయండి. ఈ ప్రయత్నంలో విఫలులమయ్యామా, శాపదృష్టితోకాక, ఆశీస్సులతో అందరం ఒక్కటిగా మునిగి మరణిద్దాం.
బ్రాహ్మణులకు నేను చెప్పేదేమంటే, “మీ వంశాన్నిగూర్చి, మీ పూర్వులనుగూర్చి మీరు గర్విస్తున్నారు. గర్వాన్ని పరిత్యజించండి. మ్లేచ్ఛ రాజులు కింద మీరు చాలాకాలం జీవించడంచేత శాస్త్రోక్తమైన బ్రాహ్మణత్వం మీకులేదు. మీ పూర్వుల మాటల్లో మీకు నమ్మకముంటే బౌద్ధులను ఓడించడానికై ఒకానొక బౌద్ధాచార్యునికి శిష్యుడై, వారిని వాదంలో ఓడించి చాలామంది మరణానికి కారకుడై, తర్వాత పాపపరిహారార్థం తుషానలంలో ప్రవేశించి దేహత్యాగం చేసిన కుమారిలభట్టులాగా, తక్షణమే మీరూ తుషాగ్నిలో ప్రవేశించి దేహం వదలండి! అలా చేయటానికి ధైర్యంలేకపోతే, మీ బలహీనతను ఒప్పుకొని విజ్ఞాన కవాటాలను అందరికి తెరచివుంచి. పతితులైవున్నవారికి చేయూతనొసగి, వారికి న్యాయంగా చేకూరవలసిన హక్కులను, అధికారాలను ఇవ్వండి.”