(ఢాకా – మార్చి, 1901)
ఢాకాలో శ్రీవారు ఆంగ్లంలో రెండు ఉపన్యాసాలిచ్చారు. అందు, మొదటిది ‘నేనేమి నేర్చాను?’ అనే విషయంగూర్చి. రెండోది, ‘మనం పుట్టి పెరిగిన మతం’ అనే దాన్నిగూర్చి. ఈ విషయాలను, స్వాములవారి శిష్యులొకరు సంగ్రహంగా, వంగభాషలో వ్రాశారు. ఆ శిష్యుని సంగ్రహ రచనకు అనువాదమిది.
నేను, నాగరకమైన అనేక పాశ్చాత్యదేశాలను చూచానుగానీ, ఈ తూర్పువంగ దేశాన్ని చూసేభాగ్యం నాకింతవరకు కలుగలేదు. ఇప్పుడిక్కడికి వచ్చి ఈ ప్రదేశంతో సన్నిహిత పరిచయజ్ఞానం పొందే అవకాశం కలిగినందుకు నాకు కలిగిన సంతోషాన్ని, మొదట వ్యక్తపరచవలసివుంది. అంతేకాదు, నా మాతృభూమి అయిన వంగదేశంలోని ఈ మహానదులు, సారవంతం, విశాలం అయిన మైదానాలు, అందమైన గ్రామాలు, మొదలైన వాటిని చూడడంవల్ల నాకు కలిగిన సంతృప్తినికూడ తెలియచేయవలసి ఉంది. ఇవన్నీ నేనిదివరకు చూసినవి కావు. వంగదేశంలోని భూజల ప్రదేశాల్లోని ప్రత్యణువులోను, ఇంత అందం, ఆహ్లాదకరభావం ఉన్నాయని నాకింతవరకు తెలీదు. ప్రపంచంలోని వివిధ దేశాలు సంచరించటంవల్ల నాకు మేలే కలిగింది. ఏలంటే ఆ దేశాలన్నీ సందర్శించిన తర్వాత నా మాతృదేశ సౌందర్యాన్ని ఎక్కువగా గ్రహించి ఆనందించగలుగుతున్నాను.
మత విషయంలో కూడ ఇంతే. మన జాతీయమతంలో, ఇంత అందం, గొప్పతనం ఉన్నాయని తెలీక, నేను ఇతరజాతుల అభిప్రాయాలను, తమవిగా గ్రహించిన అల్పజాతి ప్రజలను ఆశ్రయించాను. అలా కొన్ని సంవత్సరాలు వ్యర్థం చేసిన తర్వాతనే, నేను ప్రపంచంలోకంతా, హిందూమతంలాంటి సంతృప్తికరమైన మతం ఇంకొకటి లేదని గ్రహించాను. అందువల్ల మతంలో అచంచల విశ్వాసమున్న మన దేశీయులలోనే, కొందరు దానిపట్ల నిర్లక్ష్యభావాన్ని చూపినపుడంతా, నాకు విచారం కలుగుతూ ఉంటుంది. ఇందుకు కారణంకూడ నాకు తెలుసు. ఐరోపీయ భావ విధానం మన మాతృభూమిలో ప్రవేశించడంతో ఏర్పడిన కేవల భౌతికవాద వాతావరణంలో వారు జీవితం గడుపుటచేత ఈ అనర్థం కలుగుతోంది.
ప్రస్తుతం మనలో కొందరు సంస్కర్తలున్నారు. వారు హిందూజాతి పునరుజ్జీవనానికై మన మతాన్ని సంస్కరించడానికి, వీలైతే, తలకిందులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సంస్కర్తలలో ఆలోచనా పరులుకూడ కొందరున్నారు. కానీ తమ లక్ష్యమేమో తెలియక, ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ, అజ్ఞానంలో ప్రవర్తించే వారనేకులు అందున్నారు. ఈ తెగకు చెందిన సంస్కర్తలు విదేశీయ మతభావాలను మన మతంలో చొప్పించడానికి మిక్కిలి కుతూహలపడుతున్నారు. వారు, ‘విగ్రహారాధన’ మనే పదాన్ని పట్టుకొని, విగ్రహారాధనాన్ని ప్రోత్సహించేది కాబట్టి, హిందూమతం సత్యమైంది కాదని వాదిస్తారు. విగ్రహారాధనమంటే ఏమి? దానివల్ల మంచి కలుగుతోందా? చెడు కలుగుతోందా, అని ఆలోచించడానికి ప్రయత్నించరు. ఇతరులు చెప్పే మాటలనే ప్రమాణంగా తీసుకొని హిందూమతం సత్యమైంది కాదని చెబుతారు. ఇంకొక తెగవారు కొందరున్నారు. వారు ప్రతి హిందూ ఆచారానికి, ప్రతి హైందవకర్మకు, నిరాధారాలైన ఆధునిక శాస్త్రీయ వ్యాఖ్యానాలు చేస్తారు. వీరెవరో తెలుసా? ఎప్పుడూ విద్యుచ్చక్తి అయస్కాంతం, వాయుతరంగాలు, మొదలైన వానిని గూర్చి మాటలాడేవారు. వీరెప్పుడో ఒకప్పుడు, దేవుడు విద్యుత్తరంగాలు మూర్తిగొన్న ఒక ముద్ద తప్ప, వేరే కాదని నిరూపించగలరేమో, ఎవరు చెప్పగలరు? వివిధమార్గాల, వివిధ రూపాల, తన కార్యాన్ని సాగిస్తున్న జగన్మాత వారిని ఆశీర్వదించుగాక!
పైన చెప్పినవారికి భిన్నంగా, సనాతనులు ఉన్నారు. వాళ్ళల్లో కొందరు “కాకదంత పరీక్షచేసి, మీ వాదాలు మాకు తెలియవు. తెలిసికొనడానికి, అర్థం చేసుకోవడానికి, ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా లేదు. మీకు కావలసింది దేవుడు, ఆత్మ. ఏది ప్రకృతి కతీతమో, ఎక్కడ సుఖదుఃఖాది ద్వంద్వాలుండవో, నిత్యానందం ఎక్కడ ఉంటుందో, అట్టి పరమాత్మయే మా గమ్యం” అనీ, కొందరు “పూర్ణవిశ్వాసంతో గంగలో మునగడంచేత ముక్తిపొందవచ్చుననే నమ్మకం మాకుంది.” అని కొందరు, “శివ, రామ, విష్ణ్వాదిరూపాలలో ఎవరినైనా, అతడే సర్వాంతర్యామి అయిన దేవుడని నమ్మి, అచంచల భక్తివిశ్వాసాలతో పూజిస్తే, నీకు తప్పక ముక్తి కలుగుతుందనీ” చెబుతారు. వీరి తెగకు చెందినవాడనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను.
ఇంకొక తెగవారుకూడా ఉన్నారు. ప్రపంచం, భగవంతుడు, ఈ రెంటిని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలని వారు చెబుతారు. ప్రాచీన ఋషులు గొంతెత్తి మనకిలా చెప్తున్నారు. “భగవత్సాన్నిధ్యాన్ని పొందాలంటే, కామకాంచనాలను త్యజించాలి. ఈ సంసారం అనిత్యమైంది. నిస్సారమైంది. ఎంత ప్రయత్నించినా, దీన్ని పరిత్యజించక భగవంతుని పొందలేవు. అది చేయలేకపోతే బలహీనుడనని ఒప్పుకో! అంతేకానీ, ఆదర్శాన్ని మాత్రం కించపరచకు. హీనం, నశ్వరం (నశించేది) అయిన దానిపై, ఉదాత్తతను, శాశ్వతత్త్వాన్ని అపాదించడానికి ప్రయత్నించకు.” కాబట్టి వారి దృష్టిలో, ఆధ్యాత్మికతను సాధించాలన్నా, భగవంతుని పొందాలన్నా, మొదట మీ అభిప్రాయాలలోని ఈ దాగుడుమూతలను, అసత్యాన్ని, భావచౌర్యాన్ని పరిత్యజించాలి.
నేను నేర్చిందేమి? ఈ సనాతనులనుండి నేనేమి నేర్చాను? నేను నేర్చిందిది:
“దుర్లభం త్రయమే వైతత్, దైవానుగ్రహ హేతుకమ్ ।
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః ॥”
“మానవజన్మ, మోక్షేచ్ఛ, మహాపురుషులతోడి సహచర్యం – ఈ మూడూ దుర్లభం. ఇవి దైవానుగ్రహం వల్లనే కలుగుతాయి.” మనకు కావలసిన వానిలో మొదటిది మనుష్యత్వం, మానవజన్మం. ఏలంటే మానవజన్మమే మోక్షసాధన కనువైంది. రెండవది ముముక్షుత్వం. శాఖా వ్యక్తి భేదాలనుబట్టి భగవత్సాక్షాత్కారాన్ని పొందేమార్గాలు వేర్వేరు కావచ్చు. అధికార భేదాన్నిబట్టి, వివిధవ్యక్తులు దాన్ని పొందటానికి తమకుగల ప్రత్యేకహక్కులను, సాధనాలనుగూర్చి చెప్పవచ్చు. కాని, ముముక్షుత్వం లేనిదే, భగవత్సాక్షాత్కారం అసాధ్యమని సాధారణంగా, పూర్వపక్షమవుతుందనీ భయంలేకుండా నొక్కి వక్కాణించవచ్చు. ముముక్షుత్వం అంటే ఏమి? మోక్షాన్ని పొందాలనే అకుంఠితమైన ఇచ్ఛయే సుఖదుఃఖాలకు అతీతంగా ఉండాలనే కోరిక, ప్రపంచంపట్ల ఏహ్యభావమే. భగవంతుని చూడాలనే కోర్కె నీలో ఎప్పుడు కలుగుతుందో, అప్పుడు భగవత్సాక్షాత్కారానికి అర్హుడవవుతావు.
ఇక మహాపురుషులతో సన్నిహిత సాహచర్యం కూడ అత్యవసరమే. దానివల్ల, తమ గమ్యాన్ని పొందిన మహాపురుషుల జీవితాలనుబట్టి, మన జీవితాలను చక్కదిద్దుకోవచ్చు. ప్రపంచంపై వైరాగ్యం, మోక్షేచ్ఛ, ఉన్నంతమాత్రాన చాలదు. గురూపదేశం కూడ అవసరం. ఎందుచేత? దానిచే, తరతరాలుగా ఒక గురువునుండి మరొక గురువుకు ఎడతెగక సంక్రమిస్తూ వచ్చిన ఒక గొప్పశక్తితో నీకు సంబంధం ఏర్పడుతుంది. భక్తుడు అన్వేషించి, ఆధ్యాత్మిక బోధకుడైన గురువును తనకు ఉపదేశకుడుగా, మార్గదర్శిగా, స్నేహితుడుగా స్వీకరించాలి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి గురువు చాలా ముఖ్యమని చెప్పాలి. అయితే, ఎలాంటి వానిని గురువుగా స్వీకరించాలి? “శ్రోత్రియో-వృజినోకామహతో యో బ్రహ్మ విత్తమః” – వేద పారంగతుడు, దోషరహితుడు, నిష్కాముడు, బ్రహ్మజ్ఞాన శ్రేష్ఠుడే గురువుగా ఉండతగినవాడు. శాస్త్ర పాండిత్యం కలిగినవాడు మాత్రమేకాక, సూక్ష్మాతిసూక్ష్మ శాస్త్రరహస్యాలను విప్పి చెప్పగలవాడు, వాటి ప్రాముఖ్యాన్ని అనుభవంచేత గుర్తించినవాడు శ్రోత్రియుడు. “ఊరకశాస్త్రాదులను చదవడం వల్ల చెప్పిన మాటలన్నీ వల్లించే చిలుకలాగా తయారవుతాడుకానీ పండితుడు కాజాలడు. శాస్త్రాలలో ఏ ఒక్క పదాన్నైనా చదవడంతోనైనా, దివ్యమైన ప్రేమను ఎవడు పొందుతాడో, వాడే పండితుడు.” కేవలం, పుస్తకజ్ఞానంగల పండితులవల్ల ప్రయోజనం లేదు. ప్రతి భిక్షుకుడు, లక్షరూపాయలు దానం చేయదలచినట్లు ప్రస్తుతం ప్రతిఒక్కడు గురువు కాదలచుచున్నాడు. గురువగువాడు దోషరహితుడుగా ఉండాలి. నిష్కాముడై ఉండాలి. ఇతరులకు మేలుచేయాలనడం తప్ప వేరు ఉద్దేశం అతనికుండరాదు. అకారణ ప్రేమకు పెన్నిధి అయి ఉండాలి. పేరు ప్రఖ్యాతులకుకానీ, స్వార్థదృష్టితో కానీ, అతడు ఆధ్యాత్మిక బోధ చేయరాదు. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మసాక్షాత్కారం కరతలామలకంగా ఉండాలి. అలాంటివాడే గురువని శ్రుతులు చెబుతున్నాయి. అలాంటి గురువుతో ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడినప్పుడు భగవత్సాక్షాత్కారం – దివ్యజ్ఞానం – సులభ సాధ్యమవుతుంది.
గురూపదేశం పొందిన తర్వాత, సత్యాన్వేషకుడు, తన లక్ష్యంపై ధ్యానముంచి నిర్ణీతమార్గాన, సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి అభ్యాసం చేయాలి. భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాలనే కోరికవున్నా, గురువువున్నా, అభ్యాసం కానిదే, నేర్చుకొన్నదాన్ని ఆచరణలో ఉంచడానికి ప్రయత్నించనిదే, దైవసాక్షాత్కారం కలుగదు. ఇవన్నీ మీలో గాఢంగా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరగల్గుతారు.
కాబట్టి ఆర్య సంతతివారూ, హిందువులూ అయిన మీకు చెప్పేదేమంటే మన మతం యొక్క, హిందువులయొక్క ఉన్నత లక్ష్యాన్ని మరువకండి. ఆ లక్ష్యమేదో తెలుసా? సంసారబంధానికి దూరంగా ఉండటం, ఐహికాముష్మికాలపట్ల వైరాగ్యం కలిగివుండటం, గుణదోషాలకు అతీతంగా ఉండటం. ఇలా ఉండగల్గితే అన్నిటికీ అతీతులై చివరికి సచ్చిదానంద బ్రహ్మమును పొందగలరు.