1897 సం ॥ డిసెంబరు 20 వ తేదీ ఖేత్రీనగరంలో శిష్యులతో సహా, శ్రీ వివేకానందస్వాములవారు తాముంటున్న మహారాజా వారి భవనంలో వేదాంతమతాన్ని గూర్చి ఉపన్యాసమిచ్చారు. ఆ సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు శ్రీ స్వాములవారిని సభ్యులకు పరిచయం చేశారు. తర్వాత శ్రీ స్వాములవారు గంటన్నరకు పైగా అద్భుతంగా ఉపన్యసించారు. కానీ ఆ ఉపన్యాసం అంతా ఆమూలాగ్రంగా వ్రాయడానికి సంక్షిప్తలేఖరి లేకపోవటం శోచనీయం. అందువల్ల ఆ సమయంలో గుర్తుగా వ్రాసికొన్న ఉపన్యాసాంశాల ఆధారంగా, ఈ క్రింది సారాంశాన్ని మాత్రమే తెలుపగలుగుతున్నాం.
ప్రాచీన జాతులలో గ్రీకుజాతి, ఆర్యజాతి అనే, మహాజాతులు రెండు భిన్నభిన్న వాతావరణాలలో, పరిస్థితులలో వర్దిల్లాయి. సృష్టిలోని సుందరం, మధురం, ఆకర్షవంతం అయిన సర్వమూ గ్రీకుజాతిని ఆవరించి వెలసింది. అక్కడి శీతోష్ణస్థితి బలప్రవర్థకంగా ఉండింది. ఆర్యజాతిని ఆవరించి అన్నివైపులా గంభీరదృశ్యాలు వెలశాయి. శరీర శ్రమకు మిక్కిలి అనుకూలంకాని, శీతోష్ణస్థితిలో, ఈ జాతి పుట్టి పెరిగింది. ఇట్లీ రెండు జాతులు, రెండు విశిష్టములు, భిన్నములు అయిన నాగరికాదర్శాలను పెంపొందించాయి. గ్రీకులు చేసిన పరిశీలన పూర్తిగా వెలుపలి విషయాలను గురించినది. ఆర్యులు చేసిన పరిశీలనం పూర్తిగా అంతర విషయాలకు సంబంధించింది. ఒకరు పిండాండాన్ని పరిశోధించారు; రెండవవారు బ్రహ్మాండాన్ని పరిశోధించారు. ప్రపంచ నాగరికతలలో ప్రతిదానికీ, విశిష్టమైన కర్తవ్యమొకటుంది. ఒక నాగరికత, మరొకదాన్ని అనుకరించరాదు. కానీ, అవి తమ తమ అనుభవాలను పోల్చి చూచుకొంటే పరస్పరలాభం పొందుతాయి. ఆర్యులు స్వభావంచేత విశ్లేషణప్రియులు, వారు గణితశాస్త్రంలోను, వ్యాకరణశాస్త్రంలోను అద్భుత ఫలితాలను సాధించారు. మనస్సును విశ్లేషించడంతో ఈ అన్వేషణ పూర్తి పరిణామం పొందింది. పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో, ఈజిప్షియనులైన నవీన ప్లేటో సిద్ధాంతులు రచించిన గ్రంథాల్లో భారతీయసిద్ధాంతాల జాడలు కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత భారతీయవిద్యల ప్రభావం యూరప్‌లో ఎలా వ్యాపించిందో వివరంగా తెలుపుతూ, ఆయాయుగాల్లో స్పెయిన్, జర్మనీ మొదలైన యూరప్‌దేశాలు ఎలా మహోపకారాలు పొందాయో, స్వామివారు విశదీకరించారు. భారతీయ రాజకుమారుడైన దారాషేకో, ఉపనిషత్తులను పారశీకకభాషాలోని కనువదించాడు. ఆ గ్రంథంయొక్క లాటిన్ భాషానువాదం, స్కోపెన్హారుగారికి లభించింది. వారి తత్త్వసిద్ధాంతం వాటిని అనుసరించింది. దానితర్వాత కాంటు తత్త్వశాస్త్రంలో ఉపనిషద్బోధల జాడలు గోచరిస్తున్నాయి. యూరప్‌లో వివిధ భాషావిజ్ఞానశాస్త్రాలను పరిశీలించి వాటి తారతమ్యం కనుగొనడంలో అక్కడి పండితులకున్న అభిలాషవలన వారు సంస్కృతభాషాభ్యాసానికి పూనుకొన్నారు. కానీ ‘డ్యూసెన్’ లాంటివారు కొందరు తత్త్వశాస్త్రంలో ప్రత్యేకాభిలాషతో సంస్కృతాన్ని పఠించారు.
భావికాలంలో అందరు సంస్కృతభాషాభ్యాసంలో ఎక్కువ అభిమానం చూపాలని శ్రీ స్వామివారు ఆశించారు. తర్వాత “హిందూ” అనే శబ్దం పూర్వకాలంలో “సింధునదికి ఆవల నివసించేవారు” అని సూచిస్తూ సార్థకంగా ఉండిందనీ, ఇప్పుడు అది అర్థహీనమైపోయిందనీ, దానివల్ల ఈ జాతిగానీ, దాని మతంకానీ సూచింపబడటంలేదనీ, సింధునదికి ఈవలివైపున భిన్నభిన్న మతాలను అవలంబించే వివిధ జాతులవారు ఎందరో నివసిస్తున్నారనీ తెలిపారు.
శ్రీ స్వాములవారు ఆ తర్వాత వేదాలనుగూర్చి దీర్ఘంగా ఉపన్యసిస్తూ, అవి ఏ నరునిచేత రచించబడినవి కావనీ, అవి క్రమేణ పరిణామం పొందుతూవచ్చి, ఒక గ్రంథరూపం దాల్చిన దివ్యభావాలనీ తెలిపారు. ఇప్పుడా గ్రంథం ప్రమాణ గ్రంథమైంది. అనేక మతాలు పుస్తకాలలో నిరూపించబడినాయనీ, ఆ పుస్తకాల ప్రభావం ఇంతింత అని చెప్పనలవి కాదనీ తెల్పారు. హిందువులకు వేదాలున్నాయి. వారా వేదాలనే అనేక సహస్ర సంవత్సరాలు అనుసరించవలసి ఉంది. ఆ వేదాలగూర్చిన భావాలు మారుతుండవచ్చు. కానీ, శిలామయమైన పునాదుల మీద ఆ భావాలు పునర్నిర్మితమవుతూ ఉండాలి. “వేదము” అంటే పెద్ద గ్రంథరాశి. వాటిలో నూటికి తొంబయిపాళ్ళు ఇప్పుడు లుప్తములయ్యాయి. అవి కొన్ని కుటుంబాల వశంలోవుండి ఆ కుటుంబాల నాశంతో అంతరించి పోయాయి. ఇప్పుడున్నవి సైతం తామున్న ఆ పెద్ద భవనంలో కూడ పట్టేవికావు. అవి పురాతనమైన భాషలో సరళంగా వ్రాయబడివున్నాయి. వానిలోని వ్యాకరణం చాలా అపరిష్కృతంగా ఉంది. కాబట్టి వేదాలలో కొన్ని భాగాలు అర్థమే కావడంలేదు.
ఆ తర్వాత శ్రీ స్వాములవారు కర్మకాండ, జ్ఞానకాండ అనే వేదాల రెండు భాగాలగూర్చి విపులంగా చెప్పారు. 1. కర్మకాండ, అంటే సంహితలు. 2. బ్రాహ్మణములు. బ్రాహ్మణములు యాగాలనుగూర్చి తెలుపుతున్నాయి. సంహితలు – అనుష్టుప్పు, త్రిష్టుప్పు, జగతి మొదలైన ఛందస్సులలో వ్రాయబడిన గీతాలు. ఇవి సాధారణంగా వరుణుడు, ఇంద్రుడు మొదలైన దేవతలనుగూర్చిన స్తోత్రాలు. ఈ దేవతలెవరు? అనే ప్రశ్న బయలుదేరింది. వారినిగూర్చి ఏవైనా సిద్ధాంతాలు బయలుదేరగానే, వాటిని ఖండించే వేరే సిద్ధాంతాలు బయలుదేరుతూనే ఉన్నాయి.
శ్రీ స్వాములవారు, అంతట పూజలనుగూర్చిన వేర్వేరు భావాలను వివరించి తెలుపసాగారు. ప్రాచీన బాబిలోనియన్లు, జీవుడు శరీరంలో ఆ రూపమే ధరించి నిండి ఉంటాడనీ, వానికి స్వతంత్రరూపం లేదనీ, అతడు శరీరాన్ని విడిచి వేరై ఉండలేడనీ భావించేవారు. ఈ జీవుడు కూడ, ఆకలిదప్పులు అనుభవిస్తాడనీ, పూర్వశరీరానికిగల కామక్రోధాదులవంటి వానినే పొందుతూంటాడనీ వారి నమ్మకం. పూర్వశరీరానికి హాని కలిగితే, ఈ జీవునికీ హాని కలుగుతుంది. మొదటిది నాశనమైనప్పుడు ఇదీ నాశనమవుతుంది. కాబట్టి, వారు మృతశరీరాలను భద్రంగా కాపాడటానికి చాలా ప్రయత్నించేవారు. ఈ రీతిగా, మమ్మీలు, మసీదులు, సమాధులు వెలశాయి. ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు, యూదులు ఈ దేహాత్మ భావనను దాటి దూరంగా పోజాలకపోయారు. వారికి కలిగిన ఆత్మభావన ఇంతే.
ఋగ్వేదంలో పితృదేవతారాధన సూచనగనైనా కనబడదని ఆచార్య మాక్స్ముల్లర్గారు అభిప్రాయపడ్డారు. కఠినమై, మనవంక శూన్యభావంతో చూచే ‘మమ్మీ’ ల బీభత్సదృశ్యం అందులో గోచరించదు. అందు, దేవతలు నరునితో మైత్రి కలిగివున్నారు. పూజితునియొక్క, పూజకునియొక్క సంబంధం నిర్మలంగా ఉండినది. అందులో వెగటు తనం లేదు. సంతోషానికి కొరతలేదు. మందహాసానికిగానీ, కళ్ళతేజానికి గానీ లోపం లేదు. ఈ వేదాలనుగూర్చి ప్రసంగించే సమయంలో, దేవతల నవ్వులు తమకు వినిపిస్తున్నట్లు తోస్తోందని స్వాములవారు సెలవిచ్చారు. వేదఋషులు భాషాసౌకుమార్యం తెలియనివారు కావచ్చు. కాని వారిలో సభ్యత – సౌహార్ద్రాలున్నాయి. వారితో పోల్చినప్పుడు, మనం పశువులమో అన్నట్లు అనిపిస్తుంది. స్వాములవారు తాము చెప్పే దానికి ఉదాహరణలుగా, చాలా మంత్రాలను చదివారు. “వీనిని పితృదేవతలు నివసించే చోటికి, శోకదుఃఖాలులేని ఆ చోటికి తీసుకొనిపో” ఈ విధంగా మృతశరీరం ఎంత త్వరగా దహనమైతే అంతమంచిదనే భావం ఏర్పడింది. క్రమేణ ఒక సూక్ష్మశరీరముందనీ, అది దుఃఖం అనేదిలేక కేవలానందంగల ఒకానొకచోటికి పోవుననీ వారు తెలిసికొనగల్గారు. సెమిటిక్ జాతీయుల మతంలో భయం, దుర్భరబాధ కనిపిస్తాయి. భగవంతుని చూస్తే నరుడు మరణిస్తాడని వారు అనుకొనేవారు. కానీ ఋగ్వేద మతానుసారం నరుడు భగవంతుని ప్రత్యక్షంగా చూచేటప్పుడు వాని సత్యజీవనం ప్రారంభమవుతుంది.
ఇక ఈ దేవతలు చేసేపని ఏమి? అనే సమస్య వచ్చింది. ఒక్కొక్కప్పుడు ఇంద్రుడు వచ్చి నరునకు సాయపడుతూండేవాడు. ఒక్కొక్కప్పుడు ఇంద్రుడు మితిమీరి సోమపానం చేసేవాడు. అప్పుడప్పుడు సర్వ శక్తిమంతుడు, సర్వవ్యాపి, మొదలైన లక్షణాలు పూజకులు అతనికి ఆరోపించేవారు. వరుణుని విషయంలోనూ ఇట్లే జరిగింది. ఇదేవిధంగా ఆ గ్రంథభాగం నడిచింది. ఈ మంత్రాలలో కొన్ని, ఈ దేవతలను అభివర్ణించిన రీతి మహాద్భుతం. ఆ భాష అత్యంత గంభీరం. ఈ సందర్బంలో ప్రళయవర్ణన చేసే నాసదీయసూక్తాన్ని శ్రీ స్వాములవారు చదివి “చీకటి చీకటిని కప్పిపుచ్చింది” అనే భావం అందులో ఉండటం తెలిపి, ఇటువంటి కవన ధోరణిని, ఇలాంటి గంభీర భావాలను అభివర్ణించిన పురుషులు, అనాగరికులు, అజ్ఞానులు అయితే మనలను ఏమని పిలుచుకోవాలి? అని ప్రశ్నించారు. ఆ మహాఋషులను, ఇంద్రవరుణ ఇత్యాదివారి దేవతలను విమర్శించటంగానీ, ఖండించడంకానీ తమ పని కాదన్నారు. ఇది అంతా, ఒక విశ్వరూపదర్శనంలాగా రంగం తర్వాత రంగంగా గోచరానికి వస్తూంది. దీనికన్నిటికి వెనుక ఆధారంగా “ఏకం సద్విప్రాబహుధావదంతి” (ఉన్న బ్రహ్మం ఒక్కటే. దాన్ని ఋషులు అనేక నామాలతో పిలిచారు.) అనే దివ్యభావన స్థిరంగా నిలుచున్నది. ఇదంతా అలౌకికమై, అద్భుతమై, అత్యంత సుందరమై ఒప్పుతోంది. అది ఇప్పటికినీ అసామాన్యమై అందరానిదై తోస్తోంది. ఆ తెర చాలా సూక్ష్మమై స్పర్శమాత్రంచేతనే విచ్చిన్నమై, ఎండమావులలాగా శూన్యంలో కలిసి పోయేదానిలాగా తోస్తోంది.
ఇలా చెబుతూ ఒక విషయం స్పష్టంగా జరిగి ఉండవచ్చన్నారు. అది ఏమంటే ఆర్యులుకూడ, గ్రీకులలాగా తమ సమస్యా పరిష్కారం కోసం, బాహ్యసృష్టిని ఆశ్రయించారు. ఆ ప్రకృతి వారిని బాహ్యమునకు ఆకర్షించి క్రమంగా సుందరం, ప్రయోజనకరం అయిన బాహ్యప్రపంచంలోనికి నడిపింది. కానీ ఈ భారతదేశాన గంభీరతలేని దేనికీ గణ్యతలేదు. మరణ రహస్యాలను తెలిసికోవాలనే అభిలాష గ్రీకులకు కలుగలేదు. కాని ఇక్కడనో, మొట్టమొదటినుండీ “నే నెవడిని? మరణానంతరం నేనేమైపోతాను” అనే ప్రశ్న పదేపదే స్ఫురిస్తోంది. అక్కడ గ్రీకులు నరుడు మృతినొంది స్వర్గానికి పోతాడని భావించారు. ఈ స్వర్గానికి పోవడమంటే ఏమి? ప్రతిదాన్నీ విడిచి వెలువడిపోవడం అని వారి భావన. ఆంతర్యంలో ఏమీలేదు. అంతా వెలుపలే ఉంది. ఇలా తలచి, గ్రీకుదేశీయుడు, తన అన్వేషణాన్ని బాహ్యమునకు తిప్పాడు. ఇంతేల? తాను సైతం తనకు వెలుపలనే ఉన్నట్లు భావించాడనవచ్చు. అతడు ఈ లోకంవంటిదే అయి, దుఃఖం మాత్రంలేని స్థలానికి పోతే, తన ఈప్సితములన్నీ నెరవేరి తృప్తి కలుగుతుందని నమ్మాడు. మతాన్ని గూర్చిన వారి భావాలన్నీ అంతటితో ఆగిపోయాయి. కాని ఇది హిందువు మనస్సుకు తృప్తికరంగా తోచలేదు. వాని పరిశోధనలో ఈ స్వర్గాలన్నీ భౌతిక జగత్తు లోపలే ఇమిడి ఉన్నాయి. “ద్రవ్య సమ్మేళనంచేత ఏర్పడేది, విచ్ఛిన్నమై నశిస్తుందని” హిందువులు భావించారు. నీవు ఆత్మను ఎరుగుదువా? అని బాహ్యప్రకృతిని వారడిగారు. నాకు తెలియదు అని ఆ ప్రకృతి బదులు చెప్పింది. దేవుడున్నాడా? అని అడిగితే, నాకు తెలీదని ఆ ప్రకృతి బదులు చెప్పింది. అంతటవారు ప్రకృతినుండి మరలిపోయారు. ఈ బాహ్యప్రకృతి ఎంత గొప్పదైనా, అది దేశకాలాలలో బంధించబడిందే అని వారు గ్రహించారు. అంతట ఇంకొక వాణి వినవచ్చింది. కొత్తవైన దివ్యభావాలు వారి మనస్సులలో ఉదయించాయి. “నేతి, నేతి” (ఇది కాదు, ఇది కాదు) అని, ఆ వాణి పలికింది. ఆయా దేవతలంతా ఒక్కసారిగా మారిపోయారు. సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు ఇంకేల? బ్రహ్మాండమంతా ఒక్కటైపోయింది. కొత్తదైన ఈ ఆధ్యాత్మికాదర్శంపై మతాన్ని నిర్మించారు.
“న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం ।
నే మా విద్యుతో భాంతి, కుతోఽయమగ్నిః ॥
తమేవ భాంత మనుభాతి సర్వం ।
తస్య భాసా సర్వమిదం విభాతి ॥”
(అక్కడ సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు ప్రకాశించడు. ఇక, ఈ అగ్నినిగూర్చి చెప్పేదేమి? అతని ప్రకాశాన్ననుసరించే సర్వమూ ప్రకాశిస్తోంది. వాని ద్వారా సమస్తమూ ప్రకాశిస్తుంది.) ఇక ఆ పరిమితం, మూఢం అయిన సగుణభావన అక్కడ నిలువలేదు. పుణ్యపాపాల విచారణచేస్తూ కూర్చునే దేవతల అల్పభావన ఇంకా అక్కడ కనిపించదు. వెలుపల సాగిన అన్వేషణ ఇక కట్టుపడింది. అంతటినుండి, ఆ అన్వేషణ అభ్యంతరానికి తిరిగింది. ఈ విధంగా ఉపనిషత్తులు మన దేశానికి బైబిల్‌గా ఏర్పడ్డాయి. ఈ ఉపనిషత్తులు చాలా విస్తృతమైన వాఙ్మయం. భారతదేశంలోని వివిధ సిద్ధాంతాలుగల సంప్రదాయాలన్నీ ఉపనిషత్తులనే పునాదుల మీదనే నిర్మితములయ్యాయి.
అంతట శ్రీ స్వాములవారు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలను తీసుకొని, ఇవి క్రమంగా పైకి తీసుకొనిపోగల సోపానాల వంటివని చెప్పి, వాటికి సమన్వయం కూర్చారు. చివరికి అద్వైతదశను చేరటమే సహజమైన ఫలితమనీ, “తత్త్వమసి” అనేది కట్టకడపటి మెట్టు అనీ తెలిపారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలైన భాష్యకారులు సైతం పొరపాట్లు చేశారు. వీరంతా ఏకైక ప్రమాణంగా భగవద్గీతలను విశ్వసించారు. కాని, అవి ఒకే విషయాన్ని ఒకే మార్గాన్ని బోధిస్తాయనుకొన్నారు. అలా, శంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంతమనే ఒకే విషయాన్ని ఉపనిషత్తులన్నీ బోధిస్తాయనీ, ఇతరము నేమాత్రం బోధించడం లేదనీ ఊహించటంలో పొరబడ్డారు. కాబట్టి ఎక్కడెక్కడ స్పష్టంగా ద్వైతపరమైన వాక్యం కనిపించినా, ఆయన తన సిద్ధాంతాన్ని బలపరిచే అర్థం వచ్చేలా దాన్ని తికమకలు చేశారు. స్పష్టంగా అద్వైతపరమైన వాక్యాలు వచ్చినప్పుడు రామానుజాచార్యులవారు మధ్వాచార్యులవారు అలాగే చేశారు. ఉపనిషత్తులు ఒకే విషయాన్ని బోధిస్తాయనడం సత్యమే. కానీ ఒక మెట్టునుండి మరొక మెట్టునకు ఎక్కిపోయేలా విషయాన్ని క్రమపరిణతంగా అవి నిరూపిస్తున్నాయి. ఆధునిక భారతదేశాన ఆధ్యాత్మికభావం అంతరించిపోయి, బాహ్యకర్మలు మాత్రమే నిలిచివుండటం విచారకర విషయమని స్వామివారన్నారు. నేటి ప్రజలు హిందువులు కారు; వేదాంతులూ కారు; వారు “నన్ను ముట్టకు” అనే సంప్రదాయం వారయిపోయారు. వారికి వంటఇల్లే దేవాలయం; కూటికుండలే దేవతలు. ఇలాంటి దుర్దశ అంతరించాలి. దాన్ని మనం ఎంత త్వరలో త్యజిస్తే, మన మతానికి అంత మేలు, ఉపనిషత్తులను, వాని స్వకీయ తేజస్సుతో ప్రకాశించనివ్వండి. వేర్వేరు సంప్రదాయాలమధ్య పోట్లాటలను అంతరింపచేయండి.
శ్రీవారు అస్వస్థులై ఉండటంవల్ల ఇంతవరకు మాటాడేసరికి అలసిపోయారు. కాబట్టి వారు ఒక అరగంటసేపు విశ్రాంతి తీసికొన్నారు. అంతసేపూ, సభ్యులు ఉపన్యాసపు మిగతా భాగాన్ని వినడానికై చాలా ఓపికతో వేచివున్నారు. తర్వాత శ్రీవారు వెలుపలికివచ్చి ఒక అరగంటసేపు మరల మట్లాడారు. జ్ఞానమంటే భిన్నత్వంలో ఏకత్వం కనుగొనటమే అన్నారు. ప్రతిశాస్త్ర పరమావధి సర్వావిధ భిన్నత్వానికి వెనుకవుండే ఈ ఏకత్వాన్ని కనుగొనడమే. ఈ అంశం భౌతికశాస్త్రంలో ఎలాగో, ఆధ్యాత్మిక శాస్త్రంలోనూ అలాగే పరమసత్యమని చెప్పారు.