(1897 సం ॥ నవంబరు 12 వ తేదీ లాహోర్‌లో ఇచ్చిన ఉపన్యాసం)
ఒకటి బాహ్యప్రపంచం, రెండవది ఆంతర ప్రపంచం, అని మనం జీవించే ప్రపంచాలు రెండున్నాయి. రైలు రెండు పట్టాలమీద నడిచేటట్లు, మానవజాతి అభివృద్ధి ప్రాచీనకాలం నుండి, ఈ రెండు ప్రపంచాలలో జరుగుతోంది. అన్వేషణ మొదట బాహ్యంలో ప్రారంభమైంది. గంభీరమైన సమస్యలన్నిటికీ పరిష్కారం బాహ్యప్రకృతినుండే పొందాలని నరుడు మొదట ప్రయత్నించాడు. సుందరం, దివ్యం అయిన దానికోసం, తాను అనుభవించే ఆరాటాన్ని నలువైపుల తన్ను ఆవరించి ఉండే ప్రకృతివల్ల సంతృప్తిపరచుకోదలచాడు. తన స్వస్వరూపాన్ని, తన ఆంతర్యంలో ఉన్న అన్నిటినీ, జడప్రాపంచిక భాషలో ప్రకటించ యత్నించాడు. అతడు పొందిన ప్రతిఫలం మహోత్కృష్టమైందనడం సత్యం. భగవంతుని గూర్చి, వాని నర్చించే విధానాన్ని గూర్చి, అత్యద్భుత సిద్ధాంతాలు, ఎంతో మనోహరమైన సౌందర్యభావాలు అతనికి లభించాయి. బాహ్యప్రపంచంనుండి నిజంగా దివ్యమైన భావాలే లభించాయి. అయినా, ఆ రెండవదైన అభ్యంతర ప్రపంచం కొంత ఆలస్యంగా మానవునికి. ప్రత్యక్షమై దివ్యతరం, సుందరతరం, విశాలతరం అయిన ఒక అనంతవిశ్వాన్ని అతని ఎదుట నిలిపింది. వేదాలలోని కర్మకాండభాగం, అత్యాశ్చర్యకరమైన ఆధ్యాత్మికభావాలను బోధిస్తోంది. సృష్టికర్త, పరిపాలకుడు, లయకారకుడు అయిన సర్వాధినాయకుని గురించిన అద్భుతభావాలు, మన మనస్సును కరిగించే భాషలో అవి మనకు ప్రదర్శిస్తున్నాయి. ఋగ్వేదసంహితలో ప్రళయ వర్ణనను తెలిపే అత్యద్భుత శ్లోకం, మీలో అనేకులకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆహా! ఎన్నడైనా అంతటి భవ్యమైన శ్లోకమొకటి రచించబడిందా అని అనిపిస్తుంది; అయినా, అది బాహ్యగాంభీర్యాన్ని మాత్రమే వర్ణిస్తోందని మనకు తెలుసు. చివరికి అది స్థూలమే; భౌతికతత్త్వం కొంతదానికి అంటుకొనేవుంది. అయినా, అది భౌతికపదార్థానికి సంబంధించిన భాషలో చేయబడిన అఖండతత్త్వం వర్ణన! ఆ భాష ఖండవస్తు సాంప్రదాయకమైంది. అది, స్థూలశరీర పక్షాన అఖండమే అయినా, మానసికంగా, అఖండం కాదు. స్థూలదృష్టిలో అది అనంతమని తోచినా, సంకల్పానికి సంబంధించినది అనంతం కాదు. ఇక రెండవభాగమైన జ్ఞానకాండలో అనుసరించబడిన మార్గం, సంపూర్ణంగా, దీనికి భిన్నంగా ఉంది. మొదటిది, విశ్వం యొక్క రహస్యాలకోసం బాహ్యప్రకృతిలో జిరిగిన అన్వేషణ. అతిగంభీర జీవన సమస్యలకు జడప్రపంచంనుండి పరిష్కారాన్ని తెలిసికొనగోరే ప్రయత్నిమిది. “యస్యైతే, హిమవంతో మహిత్వా” (దాని మహిమను హిమాలయాలు ప్రకటిస్తున్నాయి.) అనే వర్ణనలో ఉదాత్తమైన భావమే ఉంది. అయినా భారతీయునికి అది, అంత ఉదాత్తమైనదిగా తోచలేదు. కాబట్టి భారతీయుని మనస్సు అంతర్ముఖం కావలసివచ్చింది. ఆ అన్వేషణ, బాహ్యంనుండి అంతర్యానికి, జడపదార్థంనుండి, మనస్సుకు, తిరిగి పూర్తిగా వేరొక త్రోవత్రొక్కింది. “నరుడు మరణిస్తున్నాడు కదా? వాడే మవుతున్నాడు?” అనే విచారణ బయలుదేరింది. “ఆస్తీత్యేకే నాయమస్తీతి చైకే” (కొందరు అతడున్నాడంటున్నారు. ఇతరులు అతడు ఉండడంటున్నారు. ఓ యమరాజా! ఇందేది సత్యం?) అనే విచారణ సాగింది. పూర్వవిచారణకు పూర్తిగా భిన్నమైన విధానం మనకిక్కడ గోచరిస్తోంది. బాహ్యప్రపంచంనుండి పొందదగిన దాన్నంతా, భారతీయుని బుద్ధి సంపాదించింది; అతడు దానితో తృప్తిపొందలేదు. అతడు ఇంకా వెదకాలనుకొని తన ఆత్మలోనికే మునుగజూచాడు. అప్పుడు చివరి పరిష్కారం లభించింది.
వేదాలలోని, ఈ భాగానికి ఉపనిషత్తులు లేక వేదాంతం లేక ఆరణ్యకాలు, లేక రహస్యం అని పేరు. ఇక్కడ మతం ఒక్కసారిగా సమస్త బాహ్యప్రమాణాలను వదలివేసింది. ఇక్కడ స్థూలపదార్థ సంబంధమైన భాష పూర్తిగా పరిత్యజించబడి, ఆత్మసంబంధమైన సూక్ష్మాతిసూక్ష్మ భాషలో, ఆధ్యాత్మిక విషయాలు వివరించబడ్డాయి. ఏ విధమైన స్థూలభావం, ఇంక దానిని అంటిరావడం లేదు. ప్రపంచ సంబంధమైన ఎలాటి రాజీ ప్రయత్నాలు, అందులో లేవు. మానవకోటి దర్శించిన వాటిలోకంతా, అత్యుత్తమమైన సత్యాలను, సాటిలేని, ధైర్యసాహసాలతో ప్రకటించిన మహాఋషుల అత్యద్భుత భావనాపటిమ ఉపనిషత్తులలో ప్రకాశిస్తోంది. సోదరులారా! దీన్ని మీకు తెలుపగోరుతున్నాను. వేదాల ఈ జ్ఞానకాండ సైతం, మహాసముద్రంలాగా ఉంది. దానిలో లవలేశం తెలిసికోవడానికైనా అనేక జన్మలు పడుతుంది. ఉపనిషత్తులు వేదాలకు శిరస్సుగాను, ‘శ్రుతులు’ భుజాలు శిరోభూషణంగాను ప్రకాశిస్తున్నాయని శ్రీరామానుజాచార్యులవారు చేసిన వర్ణన సముచితమైన దనడం తథ్యం. ఉపనిషత్తులు నిశ్చయంగా, ఆధునిక భారతదేశానికి బైబిల్ లాంటివి. హిందువులకు వేదాలలోని కర్మకాండ అంటే అత్యంత గౌరవం. అయినా, యుగాంతరాలనుండి ‘శ్రుతి’ అంటే, ఉపనిషత్తులనీ, ఉపనిషత్తులు మాత్రమే అనీ భావించబడుతోంది. మన మహాతత్త్వవేత్తలందరూ వ్యాసులవారుకానీ, పతంజలి మహర్షికానీ, గౌతముడుకానీ, చివరికి సమస్తతత్త్వశాస్త్రాలకు మూలపురుషుడైన కపిల మునీంద్రుడు కానీ – తాము రచించిన గ్రంథాలకు ప్రమాణాలను, ఉపనిషత్తులనుండి మాత్రమే తీసుకొన్నారు. ఇంక ఎందులోనుండీ వారు ప్రమాణాలను గ్రహించలేదు. ఎందుకంటే ఉపనిషత్తులలో మాత్రమే, శాశ్వతంగా నిలిచివుండే సత్యాలున్నాయి.
కొన్ని సత్యాలు, ఒకానొక పక్షముననే, ఒకానొక విధానముననే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే, కొన్ని సమయాల్లో మాత్రమే, సత్యాలై ఉంటాయి. అవి, ఆయా కాలాల్లోవున్న సంప్రదాయాలపై ఆధారపడతాయి. మరికొన్ని సత్యాలు మానవుని, మూలస్వభావం మీదనే ఆధారపడుతూ, నరజాతి ఉండేంతకాలం స్థిరంగా నిలుస్తాయి. విశ్వజనీనంగా ఉండతగినవి, ఈ సత్యాలు మాత్రమే! మనలో ఎన్నిమార్పులు కలిగినా, శ్రుతులలోని ఈ విశ్వజనీన సత్యాలు, ఈ అద్భుత వేదాంతభావాలు, అచలమై, అజేయమై, అమరమై, శాశ్వతమై మన సాంఘిక సంసర్గములలోను, మన వస్త్రధారణ వైఖరులలోను, మన భోజన పద్ధతులలోను, మన పూజావిధానాల్లోను, తమ గాంభీర్యం పెంపున నిలిచివున్నాయి. అయినా ఉపనిషత్తులలో పక్వానికి వచ్చిన సమస్త సిద్ధాంతబీజాలు, కర్మకాండలో ఇదివరకే ఉన్నాయి. అన్ని వేదాంత సంప్రదాయాలవారు, సత్యమని అంగీకరించే సృష్టి సిద్ధాంతం కాని, సమస్త భారతీయ సిద్ధాంతం సంప్రదాయాలకు ఆధారమైన బుద్ధితత్త్వ శాస్త్రంకానీ, ఇదివరకు ఉన్నవే! ఆధ్యాత్మిక భాగమైన వేదాంతాన్నిగూర్చి విచారణ ప్రారంభించడానికి పూర్వం ఈ కర్మకాండనుగూర్చి నాలుగు మాటలు చెప్పవలసివుంది. పైగా వేదాంతం అనే పదాన్ని, నేను ఏ అర్థంలో ప్రయోగిస్తున్నదీ, ముందుగా మీకు వివరంగా తెలుపవలసివుంది.
భారతదేశంలో వేదాంతమనే పదం, అద్వైత సిద్ధాంతానికి మాత్రమే చెల్లుతుందనే పొరపాటు అభిప్రాయం ఈనాడుంది. ప్రస్థానాలు మూడూ, సమాన ప్రాధాన్యం కలవి అని, అన్నిమత సిద్ధాంతాలను పరిశీలించేటప్పుడు, మీరు సదా జ్ఞప్తినుంచుకోవాలి. ప్రథమంగా శ్రుతులున్నాయి. శ్రుతులంటే ఉపనిషత్తులని నా భావం. తరువాత వ్యాససూత్రాలు. తత్త్వజ్ఞులు వీటికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఏలంటే అదివరకున్న అన్ని తత్త్వసిద్ధాంతాల పరిణామఫలాలే ఈ వ్యాససూత్రాలు! ఈ సిద్ధాంతాలు, ఒకదానికొకటి విరుద్ధాలు కావు. పైగా ఒకదానికొకటి ఆధారంగా ఉన్నాయి. ఒకే మహాసిద్ధాంతంయొక్క క్రమవికాసం వ్యాససూత్రంలో చక్కగా గోచరిస్తుంది. అద్భుతమైన వేదాంతసత్యాలు ఇందులో సూత్రీకరించబడినాయి. ఉపనిషత్తులకు, వ్యాససూత్రాలకు మధ్య భగవంతుని వేదాంత వ్యాఖ్యానమైన శ్రీగీత ఉంది.
ఉపనిషత్తులు, వ్యాససూత్రాలు, గీత ఈ మూటిని – ద్వైతాద్వైత విశిష్టాద్వైత ప్రతిపాదకమైన సమస్త సంప్రదాయాలు, శిరసావహించి తీరాలి. కాకపోతే అవి ధర్మ సమ్మతాలుగా ఈ దేశంలో గౌరవించబడవు. ఈ సంప్రదాయాలలో, ప్రతిదానికీ ప్రస్థానక్రమమే ప్రమాణం. ఒక శంకరాచార్యులో, ఒక రామానుజాచార్యులో, ఒక మధ్వాచార్యులో, ఒక వల్లభాచార్యులో, ఒక చైతన్యులో, ఎవరైనా ఒక నూతనసంప్రదాయాన్ని స్థాపించకోరితే, ఈ ప్రస్థానాలను మూడింటిని తీసుకోవాలి. వాటిమీద తమ క్రొత్త వ్యాఖ్యానాన్ని రచించవలసి ఉంటుంది. కాబట్టి, ఉపనిషత్తులనుండి పుట్టిన సిద్ధాంతాలలో ఒకదానికి మాత్రమే వేదాంతమనే పదాన్ని ప్రత్యేకంగా ప్రయోగించటం పొరపాటే అవుతుంది. వేదాంతం అనే మాటలో ఈ ప్రస్థానాలు మూడూ ఇమిడివున్నాయి. అద్వైతి లాగానే, విశిష్టాద్వైతికూడ వేదాంతి అని పిలిపించుకోవడానికై సమానార్హత కలిగివుంటాడు. నేనింకొక అడుగు ముందుకుపోయి, యథార్థానికి హిందువనే మాటవల్ల మనం నిజంగా దేన్ని అర్థం చేసుకొంటున్నామో అదే, నిజంగా వేదాంతి అనే దానికీ అర్థమని చెబుతాను. ఈ మూడు సిద్ధాంతాలు దాదాపుగా స్మృతికి అందని పురాతన కాలంనుండీ ప్రచారంలో ఉన్నవే. శంకరాచార్యులవారు, అద్వైత సిద్ధాంతానికి మూలకర్త అని మీరు తలచకూడదు. ఏది శంకరాచార్యులు పుట్టడానికి పూర్వం యుగాంతరాలనుండి వస్తోందో, దాని తుది ప్రతినిధులలో ఈయన ఒకడు. అట్లే, విశిష్టాద్వైతవాదం. అది రామానుజాచార్యులవారి పుట్టకకు పూర్వం ఎన్నో యుగాలనాడే ఉంది. ఆయన వ్రాసిన వ్యాఖ్యానాలబట్టే, ఈ విషయాన్ని ఇదివరకే తెలిసికొనివున్నాము. ఇట్లే ద్వైతసిద్ధాంతాలు, ఇతర సిద్ధాంతాలతోపాటు, ప్రాచీనకాలంనుండి వస్తూనే ఉన్నాయి. నా కొలదిపాటి జ్ఞానంతో అవి ఒకదానికొకటి విరుద్ధాలుకావనే నిర్ధారణకు వచ్చాను.
సనాతన మహాసూత్రాలు దూరంగా వినవచ్చే మంద మృదుస్వరాలలాగా, ఆరంభమై, క్రమంగా వికసించి, చివరకు అద్వైతవాదమనే, విజయ గంభీర కీర్తనంగా, షడ్దర్శనాలలో పరిణమించాయి. అట్లే, మానవహృదయం క్రమక్రమంగా ఉత్తమోత్తమాదర్శాల వైపునకు, సర్వమూ, ఆ అద్భుత అభిన్నత్వంలో కలిసిపోయేవరకు, అంటే అద్వైతసిద్ధాంతం చేరే వరకు, క్రమగతిని సాగిన వికాసంగా, ఈ మూడు సిద్ధాంతాలను మనం గ్రహించవలసివుంది. ఈ మూడు వాదాలు, పరస్పర విరుద్ధంకావు. అయినా అనేకులు ఈ పొరపాటుపడ్డారు. అద్వైతబోధకుడు, అద్వైతాన్ని ప్రత్యేకంగా బోధించే వాక్యాలను చెక్కుచెదరకుండా నిలిపి, ద్వైత పరములు, విశిష్టాద్వైతపరములు అయిన వాక్యాలను సాగదీసి, వాటిని తన వాదంలోనికి లాక్కొని రావడం మనకు తెలుసు. అట్లే ద్వైతమత బోధకులు, అద్వైత వాక్యాలలోనికి ద్వైతపరమైన తమ అర్థాన్ని చొప్పించ ప్రయత్నించడమూ కనబడుతోంది. మన గురువులు మహానుభావులే! అయినా “గురువుల దోషాలు సైతం చెప్పవలసివస్తుంది” అనే ఒక సామెత ఉంది. వారు ఈ విషయంలో మాత్రం పొరపడ్డారని నా అభిప్రాయం. ఎవరికిగాని, వాక్యాలను తికమకలు చేసేపనికి పూనుకోవలసిన అవసరం లేదు. ఏ విధమైన మతం పేరిటను, కపటవర్తనకు దిగవలసిన అవసరం లేదు. వ్యాకరణాన్ని ఆధారం చేసుకొని, ఏ విధమైన అసంగత, అరుచి ప్రలాపాలకు దిగనక్కర్లేదు. మన స్వంతభావాలను ప్రతివాక్యంలోనికి చొప్పించ ప్రయత్నించేంతటి బాధ మనకు వద్దు. “అధికారాభేదం” అనే అద్భుత సూత్రాన్ని మీరొకసారి గ్రహించారా, మీ పని ఏ చిక్కులులేక సులభంగా సాగిపోగలదు.
“కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి!” (దేన్ని తెలుసుకొంటే అన్నీ తెలుసుకొన్నట్లవుతుందో అది ఏది?) అనే ఏకైక సమస్య ఉపనిషత్తుల ఎదుట ఉన్నది సత్యమే! ఆధునికుల భాషలో చెబితే ఉపనిషత్తుల గమ్యార్థం అన్నిటియొక్క చివరి ఏకత్వాన్ని కనుగొనడం అని చెప్పాలి. జ్ఞానమంటే భిన్నత్వంలోనే ఏకత్వాన్ని కనుగొనడంతప్ప వేరు కాదు. ప్రతిశాస్త్రం, దీనిపైనే ఆధారపడివుంది. నరుని విజ్ఞానమంతా, భిన్నత్వాన్ని కనుగొనడం మీదనే ఆధారపడివుంది. కొలదిపాటి భిన్నసంఘటనల మధ్య ఐక్యం కనుగొనడం ఒక మహాకార్యం. అలాంటప్పుడు విచిత్రంగా భిన్నభిన్నంగా చూపట్టే, ఈ విశ్వంలోని అసంఖ్యాకమైన నామరూప భేదాలతోను, ఆత్మానాత్మపదార్థ భేదాలతోను నిండివున్న ఈ జగత్తులోపలి అద్వితీయ తత్త్వాన్ని తెలుసుకోవడం బ్రహ్మాండ కార్యంగా ఉండక తప్పదు. ప్రతి సంకల్పం, వేరొక సంకల్పానికి భిన్నంగానే ఉంది. ప్రతి ఆకృతీ, మరొక ఆకృతికి భిన్నంగానే ఉంది. ఇలావుండగా అనేక క్షేత్రాలకు, అనంతలోకాలకు సామరస్యాన్ని కలిగించడం, అంతులేని ఈ భిన్నవస్తు జాలమంతటిలో ఏకైక తత్త్వాన్ని కనుగొనడం పరమ గమ్యంగా ఈ ఉపనిషత్తులు పరిగణించాయి. అయినా, అరుంధతీన్యాయమనే ఒక విధానం ఉంది. అరుంధతి అనే చాలా చిన్నచుక్కను, ఒకనికి చూపవలసివచ్చినపుడు దాని దాపున, బాగా మెరుస్తున్న పెద్ద నక్షత్రం మీద వాని దృష్టిని మొదటగా నిలపనుంటారు. ఆ తర్వాత అరుంధతి మీదికి దృష్టిని మరల్చటం చాలా సులభంగా ఉంటుంది. మనం చేయవలసిన కార్యమిలాగే ఉంది. నా అభిప్రాయాన్ని రుజువు చేయడానికి ఉపనిషత్తులను చూపితే చాలు. ఆ తర్వాత మీరే, ఆ విషయాన్ని చూడగలరు. దాదాపుగా ప్రతి అధ్యాయం, ఉపాసనారూపమైన ద్వైతబోధతో ప్రారంభమవుతుంది. ఈ విశ్వానికి సృష్టికర్త, పోషకుడు, ఎవరో చివరికి ఈ సర్వమూ ఎవరిలో లయమైపోతుందో, అలాంటి భగవంతుని మొట్టమొదట బోధిస్తారు. అతన్ని మనం పూజించాలి. అతడు బాహ్యాంతరాలైన ఈ సృష్టికంతకు అధిపతి, నాయకుడు అయినా, అతడు ఈ ప్రకృతికి వెలియై, బాహ్యమున ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తుంది. మరొక్కమెట్టు ముందుకుపోతే, ఈ భగవంతుడు ప్రకృతికి వెలుపల లేడనీ, దానిలోనే అంతర్యామి అయివున్నాడనీ, ఆ గురువే బోధించపూనుకోవడం మనకు తెలుస్తుంది. చివరికి ఈ రెండు అభిప్రాయాలుకూడ, పూర్వపక్షం చేయబడుతాయి. అప్పుడు ఉన్నదంతా యథార్థంగా అతడే. భేదమేదీ లేదు. “తత్త్వమసి శ్వేతకేతో” (శ్వేతకేతూ, ఆ పరమాత్మ నీవే!) ఆ అంతర్యామీ, తుదకు నరుని జీవాత్మలో ఉండేదీ ఒకటే! ఇక్కడ రాజీపడే ప్రశ్న లేదు; సత్యం నిర్భయమైన సత్యం – నిర్భయమైన భాషలో తెలుపబడింది. ఈనాడు ఆ సత్యాన్ని, అలాంటి నిర్భయమైన భాషలో బోధించడానికి మనం జంకవలసిన అవసరం లేదు. ఈశ్వరానుగ్రహంవల్ల అలాంటి సాహస ప్రచారకుడుగా ఉండగల ధైర్యం నాకు కలగాలని ఆశిస్తున్నాను.
మళ్ళీ మొదటి విషయానికి వద్దాం. మనం మొట్టమొదట గమనించవలసిన విషయాలు రెండున్నాయి. ఒకటి, అన్ని వేదాంత సంప్రదాయాలకు, సామాన్యమైన ఆధ్యాత్మికాంశం. రెండోది సృష్టి అంశం. నేను మొదట సృష్టి విషయం ఎత్తుకొంటాను. ఈనాడు ఆధునికశాస్త్రంలో, నూతనంగా కనిపెట్టబడిన విచిత్రాంశాలు, ఆకాశంనుండి పిడుగుల్లాగా మన పైనపడి, మనమెన్నడు కల్లోనైనా తలచివుండని విచిత్రాలను మన కళ్ళకు చూపుతున్నాయి. అయినా, వీటిలో చాలావరకు యుగాంతరాలకు పూర్వమే తెలుసుకొనబడినవైనా, ఇప్పుడు మళ్ళీ నూతనంగా కనిపెట్టబడుతున్నాయి. భిన్నభిన్నమై చూపట్టే శక్తులమధ్య ఏకత్వం ఉందని ఆధునిక శాస్త్రం మొన్నమొన్ననే కనుగొన్నది. ఉష్ణం, కాంతిశక్తి, విద్యుచ్ఛక్తి, ఇత్యాది పేర్లతో పిలువబడే వాటినన్నిటినీ ఒక్క మూలశక్తిలోనికి మార్చవచ్చుననీ, వాటినన్నిటినీ ఇష్టం వచ్చిన ఒక్క పేరుతో, వ్యక్తం చేయవచ్చుననీ నూతన శాస్త్రం మొన్ననే కనుగొన్నది. కానీ, ఆ పని సంహితలోనే జరిగింది. సంహిత, పురాతనంగా, ప్రాచీనంగా కనబడుతున్నా, దానిలో నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్న శక్తిని గూర్చిన ఈ భావమే కనిపిస్తోంది. ఈ శక్తులన్నీ భూమ్యాకర్షణం ఆశ్లేషం లేదా వికర్షణం అని మీరే పేరుపెట్టి పిలిచినా సరే అవి ఉష్ణంగాకానీ, విద్యుచ్ఛక్తిగాకానీ, కాంతశక్తిగాకానీ, ఏ రూపంలో వ్యక్తమైనా సరే, ఆ ఒక్కమూలశక్తి రూపాంతరాలే. నరుని అంతఃకరణంనుండి ఉద్భవించే సంకల్పంగా వ్యక్తమైనా, లేక బాహ్యావయవాలవల్ల జరిగే కార్యంగా వ్యక్తమైనా, ఆ శక్తులన్నీ దేనినుండి కలుగుతాయో, ఆ మూలశక్తికి ‘ప్రాణ’ మని పేరు. ఇక ప్రాణమంటే ఏమి? ప్రాణమంటే స్పందనం లేక అదురుడువంటి చలనం. ఈ విశ్వమంతా దాని ప్రారంభదశకు మరలిపోయినప్పుడు ఈ అనంతశక్తి ఏమవుతుంది? అది శూన్యమైపోతుందని అనుకొంటారా? అలా కాజాలదు కదా? అది నాశనమైపోతుందని, ఆ తర్వాత వచ్చే తరంగానికి కారణంగా ఉండదగిన ఆధారమెక్కడ? ఏలన, ఈ చలనం తరంగరూపంలో లేస్తూ పడుతూ, మళ్ళీ లేస్తూ, మళ్ళీ పడుతూ, సాగిపోతోంది. ఇక్కడ ‘సృష్టి’ అనే పదం జగత్తని అర్థమిస్తోంది. ఆ పదానికి అర్థంగా, “క్రియేషన్” అని చెప్పరాదు. ఆంగ్లంలో మాట్లాడుతున్నా నాకు గత్యంతరం లేదు. సంస్కృత పదాలను నా శక్తికొద్దీ ఆంగ్లంలోనికి మార్చవలసివస్తోంది. సృష్టి అంటే “ప్రొజెక్షన్”, అంటే వ్యక్తం చేయడం లేక వెలికి రావడం అని అర్థం చెప్పవచ్చు. కల్పాంతంలో సమస్తం, సూక్ష్మం నుండి మరింత సూక్ష్మరూపాన్ని పొందుతూ, అది ఎలా ఆరంభమయిందో, అలాటి ప్రారంభదశకు మరలిపోతుంది. కొంతవరకు, నిశ్చలంగా ఆ స్థితిలో నిలిచి మళ్ళీ, బహిర్గతం కావడానికి, అంటే – వెలువడటానికి సిద్ధంగా ఉంటుంది. దీనికే సృష్టి లేక వ్యక్తీకరణం అంటాం. సరే, ఈ శక్తులన్నీ అంటే ప్రాణాలన్నీ ఏమవుతాయి? అవి అన్నీ వాటి మూలరూపమైన ప్రాణంలోనికి మారుతుంది. ఈ ప్రాణం దాదాపుగా నిశ్చలమవుతుంది. కాని పూర్తిగా నిశ్చలం కాదు. వేదంలోని ఒక సూక్తంలో ఇది చక్కగా వర్ణించబడింది. “అనిదవాతం” అంటే, అది స్పందనం లేకుండా స్పందించింది. ఉపనిషత్తులలో చాలా సాంకేతిక వచనాలున్నాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. ఉదాహరణకు “వాతా” అనే శబ్దం తీసుకోండి. చాలాచోట్ల గాలి అని దాని అర్థం. ఇతర తావులలో దానికి చలనం అని అర్థం ఉంది. ప్రజలు తరుచుగా, ఒక అర్థానికి మరొక అర్థాన్ని చెప్పుకొని గందరగోళం పడుతూవుంటారు. ఇట్టి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం జడపదార్థమని పిలిచేది ఏమవుతుంది? శక్తులు, జడపదార్థమంతటా, అంతర్గతమై ఉంటాయి. అవి అన్నీ ఆకాశంలోకి లయమైపోయి, మళ్ళీ దానినుండి వెలువడుతూంటాయి. ఈ ఆకాశమే మూలపదార్థం. మీరు దానిని ఆంగ్లభాషలోనికి “ఈథర్” అని కానీ, ఇంకొకటనిగానీ తర్జుమా చేయవచ్చు. అయినా, ఈ ఆకాశం ద్రవ్యరాశి మూలస్వరూపం అని భావం. ఈ ఆకాశం ప్రాణంయొక్క ప్రేరణచేత స్పందిస్తోంది. తర్వాత సృష్టిపైకి వస్తున్నప్పుడు స్పందనం వేగిరమవుతుంది. అప్పుడు ఈ ఆకాశం – సూర్యులు, చంద్రులు, ఇతర మండలాలు, అని మనం చెప్పుకొనే తరంగ రూపాలలోకి ఎగురగొట్టబడుతుంది.
ఆ స్తోత్రంలో, ఇంకా చాలావుంది – “యదిదం కించజగత్ సర్వం ప్రాణ ఏ జతి నిస్సృతం” (ఈ విశ్వంలోని సర్వమూ, ప్రాణం స్పందించడంవల్ల ఆవిష్కృతమవుతోంది.) ‘ఏజతి’ అనే పదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ‘ఏజ’ అంటే స్పందించడం, “విస్సృతం” అంటే ఆవిష్కృతం; “యదిదంకించ” ఈ విశ్వంలోవున్న దేదైనా.
ఇది సృష్టి విషయకమైన ఒక భాగం. దాని నిర్మాణంలోనికి రాగల సూక్ష్మవస్తువులు చాలావున్నాయి. ఉదాహరణకు చూడండి: సృష్టిక్రమం ఎలాంటిది? మొట్టమొదట ఆకాశమెలా ఏర్పడింది? ఆ ఆకాశంనుండి తక్కినవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి? ఆకాశం స్పందించటం ఎలా ప్రారంభమైంది? దాన్నుండి వాయువెలా వెలిగింది? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉన్నాయి. కాని సూక్ష్మంనుండి స్థూలం కలుగుతూ ఉంటుందనే భావం ఇందులో ఉంది. స్థూలపదార్థం చిట్టచివర ఏర్పడుతోంది. అది, అన్నిటికన్నా బయట ఉంటుంది. ఈ స్థూలపదార్థానికి పూర్వం సూక్ష్మపదార్థం ఉండాలి. అయినా, సర్వమూ రెండు వర్గాలుగా ఏర్పడటం చూశాం. కానీ, ఇంకా తుది అభేదం రావలసివుంది. శక్తి అంతా ఏకమై ప్రాణమవుతోంది. ద్రవ్యమంతా ఏకమై ఆకాశమవుతోంది. ఈ రెండూ, ఇంకా ఏకం కావడం కనిపిస్తుందా? అవి రెండూ ఒకటిగా కరిగిపోతాయా? మన ఆధునిక శాస్త్రాలు ఈ విషయంలో మౌనం వహించివున్నాయి. వాటికిక్కడ ఇంకా మార్గం దొరకలేదు. అలా జరిగితే, అవి ఆ ప్రాతఃకాలపునాటి ప్రాణాన్నే, ఆ పురాణకాలంనాటి ఆకాశాన్నే కనుగొంటూ, నెమ్మది నెమ్మదిగా అదే మార్గాన్ని అనుసరించి రావలసివుంది.
తర్వాత రావలసివున్న ఏకరూపం, సర్వవ్యాపకం, నిర్గుణం అయిన వ్యక్తి. దానికి, ప్రాచీనపురాణాలు బ్రహ్మ లేక చతుర్ముఖబ్రహ్మ అని పేరు పెట్టాయి. ఆధ్యాత్మిక తత్త్వశాస్త్రంలో దాన్నే ‘మహత్’ అని అంటారు. పై రెంటికీ ఐక్యం ఇక్కడ కలుగుతోంది. నీ మనస్సనేది, మెదడు అనే బోనులో చిక్కుకొన్న ఈ ‘మహత్’ యొక్క ఒక రేణువు. అందరి మెదడులలో మొత్తంగా చిక్కుకున్న మనస్సులనన్నిటినీ కలిసి ‘సమష్టి’ అంటున్నారు. ఇది అన్నిటి కూడిక; విశ్వవ్యాప్తమైంది. ఈ వివరణ ఇంకా సాగిపోవాలి. ఇప్పటి కింకా పూర్తికాలేదు. ఇక్కడ మనలో ప్రతివానినీ, ఒక పిండాండ మనవచ్చు. ఈ జగత్తునంతా, సమష్టిగా తీసుకొంటే బ్రహ్మాండమనవచ్చు. ప్రత్యేకసృష్టిలో ఏమి జరుగుతోందో, అట్టిదే వెలుపలకూడ జరుగుతోందని ధారాళంగా, ఊహించవచ్చు. మన మనస్సులను పరిశోధించుకొనే శక్తి మనకుంటే, ఇక్కడ జరిగేదే విశ్వమానసంలో కూడ జరుగుతున్నదని నిరాఘాటంగా ఊహించగలం. ఈ మనస్సనేది ఏమిటో ఇప్పుడు విచారించవలసివుంది. ఆధునికకాలంలో పాశ్చాత్య దేశాలలో, భౌతికద్రవ్యశాస్త్రం త్వరత్వరగా వృద్ధి అవుతున్నకొద్దీ, శరీర నిర్మాణశాస్త్రం క్రమక్రమంగా ప్రాచీనమతాలు నిర్మించుకొనివున్న కోటలను ఒకదాని తర్వాత ఒకటిగా పడగొట్టి వేస్తోంది. దీన్నిచూచి, పాశ్చాత్య ప్రజలు, ఎక్కడ నిలబడటమో తెలియజాలకున్నారు. ఏలంటే ఆధునిక శరీరశాస్త్రం అడుగడగునకు, మనస్సును మెదడుతో ఐక్యం చేస్తోంది. ఇది చూచి వారు దిగులుపడిపోతున్నారు. కానీ భారతదేశంలో మనకు ఇది సదా తెలిసున్న విషయమే! హిందూబాలుడు మొట్టమొదటనే మనస్సనేది జడపదార్థమే అనీ, కానీ ఒకింత సూక్ష్మమైనదనీ నేర్చుకొంటున్నాడు. ఈ శరీరం స్థూలమైంది. దీని వెనుక సూక్ష్మశరీరం అని మనం పేర్కొనేది ఉంది. అదే మనస్సు. ఇదీ జడమైనదే కానీ అతిసూక్ష్మరూపంలో ఉంటుంది. ఇది ఆత్మకాదు.
ఈ పదాన్ని ఆంగ్లంలోకి భాషాంతరీకరణం చేయను. ఏలంటారా? ఈ భావం యూరప్‌లో లేదు. కాబట్టి దీని భాషాంతరీకరణం సాధ్యం కాదు. జర్మనీ దేశపు తత్త్వశాస్త్రజ్ఞులు ‘ఆత్మ’ అనే మాటకు ‘సెల్ఫ్’ అని భాషాంతరీకరణం చేశారు. దాన్ని సర్వత్ర, అందరు అంగీకరిస్తే తప్ప, ఉపయోగించటం సాధ్యంకాదు. కాబట్టి దాన్ని ‘సెల్ఫ్’ అనండి, లేక మరే పేరుతోనైనా పిలవండి. అది మన ఆత్మ. ఈ ఆత్మే ఆంతర్యంలో ఉండే సత్యమైన వ్యక్తి. ఈ ఆత్మే జడమైన మనస్సును తన పనిముట్టుగా ఉపయోగించుకొంటోంది. ఆధ్యాత్మిక తత్త్వశాస్త్రంలో, మనోవిద్యలో ఈ మనస్సుకు అంతఃకరణమని పేరు. ఈ మనస్సు కొన్ని అంతరింద్రియాల సాహాయ్యంతో, మన శరీరంలో దృశ్యాలై కనిపించే అంగాలను ఉపయోగిస్తున్నది. ఈ మనస్సు స్వరూపం ఎలాంటిది? పాశ్చాత్య తత్త్వవేత్తలు నిజంగా చూసే ఇంద్రియాలు, ఈ కన్నులు కావనీ, వాటి వెనుక వేరుగా, సూక్ష్మ ఇంద్రియాలు ఉంటాయనీ, ఇటీవల కనుగొన్నారు. ఈ అంతరింద్రియాలు నాశనమైనప్పుడు మానవునికి ఇంద్రునిలాగా వేయికళ్ళున్నా బాహ్యదృష్టిమాత్రం, అతనికి లభించదు. ఔను, దృష్టి అంటే బాహ్యంలో కనిపించే ఈ దృశ్యం కాదనే ఊహతో, మన తత్త్వశాస్త్రం ప్రారంభమవుతోంది. సత్యమైన దృష్టి, అంతరింద్రియాలకు సంబంధించింది. ఆ కేంద్రాలు మెదడులోపల ఉన్నాయి. మీరు వాటికేమి పేర్లనైనా పెట్టండి. కాని, ఈ కనపడే కళ్ళు, చెవులు, ముక్కు మొదలైనవి నిజమైన ఇంద్రియాలు కావు. ఇంకా ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, మొదలైనవి కలిసి మొత్తంమీద (ఆంగ్లభాషలో) “మైండ్” అని పేర్కొనబడుతున్నాయి. ఆధునిక శరీరశాస్త్రజ్ఞుడు, ఈ మెదడే మనస్సనీ, ఇన్ని ఇంద్రియాలు కలిసి మెదడు ఏర్పడుతోందని చెబుతాడు. అది విని భయపడనక్కర్లేదు. మనకా విషయం ఎప్పుడూ తెలిసిన సంగతే అని వానికి చెప్పండి. మన మతం యొక్క ప్రాథమిక సూత్రాలలో అది ఒకటి.
సరే, మంచిదే. ఇప్పుడు ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొదలైనవాటి అర్థమేమో ఆలోచిద్దాం. మొట్టమొదట చిత్తాన్నిగూర్చి ఆలోచిద్దాం. అది మానసిక పదార్థం. ‘మహత్తు’ లో ఒక భాగం. అది మనస్సుయొక్క వికారాలన్నిటికీ వర్తించే సామాన్యనామం. వసంతకాలంలో ఒకనాటి సాయంకాలం ప్రశాంతంగా అలలేమీలేక ప్రసన్నంగా ఉండే ఒక సరస్సులో, ఒకడు ఒకరాయిని విసిరివేశాడనుకోండి. అప్పుడేమి జరుగుతుంది? మొట్టమొదట ఆ నీటికి దెబ్బ తగలడమనే క్రియ జరుగుతుంది. తర్వాత అక్కడ నీరు పైకిలేచి, ఆ రాతి వెంట ఒక ప్రతిక్రియను కల్పిస్తుంది. ఈ ప్రతిక్రియ ఒక తరంగరూపం ధరిస్తుంది. మొట్టమొదట ఆ నీరు కొద్దిగా స్పందించి, వెంటనే తరంగరూపమైన ఒక ప్రతిక్రియను వెనక్కి పంపుతుంది. చిత్తమును ఈ చెరువుతో పోల్చుదాం. ఈ బాహ్య వస్తువులు దానిలో వేయబడే రాళ్ళవంటివి. ఈ ఇంద్రియాలద్వారా చిత్తం ఈ బాహ్యవస్తువులలో ఒకదానితో, సంపర్కాన్ని పొందగానే, ఒక స్పందన కలుగుతుంది. ఆ స్పందనకే, మనస్సని పేరు. దానికి విస్పష్టమైన రూపమేర్పడలేదు. ఈ బాహ్యవస్తు సంపర్కాన్ని లోపలికి తీసుకొనిపోవడానికి ఇంద్రియాలు అవసరమవుతాయి. మనస్సు ఏర్పడగానే, ఒక ప్రతిక్రియ కలుగుతుంది. దాన్ని నిశ్చయంచేసే సత్తనుబుద్ధి అని అంటారు. ఈ బుద్ధితోపాటు ‘అహం’ అనే భావం, బాహ్యవస్తువుయొక్క భావం, తళుక్కుమంటుంది. నా చేతిమీద ఒక దోమ వ్రాలిందనుకోండి. ఆ స్పర్శానుభవం చిత్తమునకు చేర్చబడుతుంది. అప్పుడు చిత్తం కొంచెం స్పందిస్తుంది. ఈ స్పందననే ఆధ్యాత్మికశాస్త్రంలో “మనస్సు” అంటారు. ఆ తర్వాత ఒక ప్రతిక్రియ ఏర్పడుతుంది. తక్షణమే, నా చేతిమీద ఒక దోమవుంది. దాన్ని త్రోలాలి అనే భావం కలుగుతుంది. ఈ విధంగా ఆ చెరువులో రాళ్ళు పడుతూంటాయి. కానీ, మామూలు చెరువు విషయంలో దానికి కలిగే ప్రతిదెబ్బ, బాహ్యప్రపంచంనుండే వచ్చి తగులుతుంది. మనస్సనే చెరువు సందర్భంలో, ఈ దెబ్బలు, బాహ్య ప్రపంచం నుండి కానీ, అంతర ప్రపంచంనుండి కానీ రావచ్చు. ఈ వరుస అంతటినీ కలిపి ‘అంతఃకరణ’ మంటారు.
దీంతోపాటు, ఇకముందు అద్వైతసిద్ధాంతాన్ని గ్రహించటంలో మనకు సహాయపడే ఇంకొక విషయాన్నికూడ మనం తెలుసుకోవాలి. మీరంతా ముత్యాలను చూచివుంటారు. చాలామందికి ఆ ముత్యాలు ఎలా ఏర్పడ్డాయో తెలిసివుంటుంది. ముత్యపుచేప చిప్పలోకి, ఒక ఇసుకరేణువు ప్రవేశిస్తుంది. అంతట, అక్కడ దురద పుడుతుంది. ఆ ముత్యపుచేప యొక్క శరీరంలో ఆ ‘దురద’ కల్గినచోట ప్రతిక్రియ కలుగుతుంది. అంతట, దాని శరీరంనుండి ఒక విధమైన రసంమారి ఇసుకరేణువు చుట్టూ చేరుతుంది. ద్రవం గడ్డకట్టి, ముత్యంగా ఏర్పడుతోంది. మనచేత నిర్మాణంచేయబడే ముత్యమే ఈ జగత్తు. బాహ్యప్రపంచంనుండి మనకు వచ్చేది ఒక దెబ్బ మాత్రమే. ఆ దెబ్బ తగిలిందనే జ్ఞానం కలుగడానికి కూడ మనం ప్రతిక్రియ చేయాలి. మనం ప్రతిక్రియ చేసిన వెంటనే, మన మనస్సులోని ఒక భాగాన్ని, ఆ దెబ్బవైపునకు మనం చాస్తున్నాం. మనం ఆ దెబ్బనుగూర్చి తెలిసికొనప్పుడు, ఆ దెబ్బవల్ల ఆకృతి పొందిన మన మనస్సునే సుమా మనం నిజంగా తెలిసికొన్నది! కాబట్టి బాహ్యంలో ప్రపంచమనేది ఒకటి స్థిరంగా ఉందని విశ్వసించకోరేవారు, శరీరశాస్త్రాన్ని బాగా నేర్చుకొనే ఈ దినాలలో, ఒక విషయాన్ని ఒప్పుకోక తప్పదు. బాహ్యంలో కనిపించే ప్రపంచానికి “క” అనే గుర్తున్నదనుకోండి. అప్పుడు మనం నిజంగా తెలుసుకొనేది ఈ “క” అనే దాన్నీ, దానితో కూడిన మనస్సును! మనస్సనే ఈ తత్త్వం “క” అంతటినీ తనలో ఇముడ్చుకోగలంత పెద్దదిగా ఉంది. కాబట్టి ఈ “క” అనేది ఎప్పుడూ తెలియరాకుండానే, తెలియవీలయ్యేది కాకుండానే ఉంటుంది. అందువల్ల ఒకవేళ బాహ్యప్రపంచం ఉన్నా, అది సదా తెలియబడనిదిగా, తెలియ వీలుకానిదిగా ఉంటుంది. బాహ్యప్రపంచాన్నిగూర్చి మనం తెలిసికొంటున్నామనుకొనేది, మన మనస్సుచేత అచ్చుకొట్టబడి రూపం పొంది, సిద్ధంగా ఉన్నదాన్నే! ఆంతర ప్రపంచం సంగతీ అలాగే ఉంది. ఈ సూత్రమే జీవునికి లేక ‘ఆత్మ’ అనే దానికీ వర్తిస్తుంది. ‘ఆత్మ’ ను మనం తెలిసికోవాలంటే, మనస్సు ద్వారానే చూడవలసివుంటుంది. కాబట్టి ఈ ఆత్మను గురించి మనం తెలిసికొన్న కొంచెం సైతం, మనస్సుతో సమ్మిళితమైవున్న ఆత్మనుగూర్చి మాత్రమే! అంటే, మనస్సుచేత కప్పివేయబడి, అచ్చులో సిద్ధం చేయబడిన కల్పితాకృతియైన ఆత్మను మాత్రమే; అంతకంటె, ఎక్కువ ఏమీ మనం చూడటంలేదు. కొంత సాగిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పుకొన్న దాన్ని బాగా జ్ఞాపకముంచుకోవాలి!
మనం తెలిసికోదగిన తర్వాతి విషయమిది. ఈ శరీరమంటే, ఎడతెగక ప్రవహిస్తున్న ఒక జడద్రవ్య ప్రవాహంయొక్క పేరే కదా, అనే ప్రశ్న బయలుదేరుతోంది. ఒక నది ఎడతెగకుండ ప్రవహిస్తున్నదనుకోండి. పోయిన నీరు పోతూండగా, ఎప్పటికప్పుడు క్రొత్తనీరు వచ్చి దానిలో చేరుతూంటుంది కదా? అట్లే ప్రతిక్షణం మన శరీరం నుండి కొంత ద్రవ్యం బయటికిపోతూండగా మళ్ళీ కొంత ద్రవ్యం ప్రతిక్షణమూ క్రొత్తగా వచ్చి దానిలో చేరుతోంది. అయినప్పటికీ దాన్నంతా కలిపి ఊహచేసికొని, ఆ ఊహనే నది అనో, శరీరమనో అంటున్నాం. సరే, నది అని మనం పిలిచేది దేన్ని? ప్రతి క్షణం, ఆ నీరు మారిపోతోంది; ఆ తీరమూ మారిపోతోంది; ప్రతిక్షణం, పరిసరాలుకూడ, (అంటే దాని సమీపంలో, చుట్టూ ఉండేవి) మారిపోతున్నాయి. ఇంక నది అనేది ఏది? ఈ వికార పరంపరయొక్క, అంటే మార్పులవరుసయొక్క పేరు మాత్రమే ఆ “నది”, మనస్సుకూడ అలాంటిదే. దీన్ని ప్రసిద్ధంగా ‘క్షణిక విజ్ఞానవాద’ మంటారు. దీన్ని గ్రహించటం చాలా కష్టం; అయినా, గట్టిపట్టుదలతో, తర్కబలంచేత బౌద్ధతత్త్వశాస్త్రం దీన్ని బాగా నిరూపించింది. ఇది, భారతదేశంలో కొంత వేదాంత భాగానికి విరుద్ధంగా బయలుదేరింది. దీనికి మనం సమాధానం చెప్పవలసివుంది. అద్వైతంయొక్క సహాయం చేత మాత్రమే దీనికి సమాధానం చెప్పగలం. మరింక దేనివల్లా అలాటి సమాధానం కుదరదు. అద్వైతమతాన్ని గూర్చి ప్రజలకు విపరీతభావాలున్నా, అద్వైతాన్నిగూర్చి ప్రజలు పోరాటాలు సాగించినా, ఈ అద్వైతం ప్రపంచానికి ఎలా తరుణోపాయం కాగలదో, మనం కనుగొందంగాక! అద్వైతంలో మాత్రమే అనేక విషయాలకు, సహేతుకమైన సమాధానాలున్నాయి. ద్వైతమతం, ఇతరమతాలు, ఈశ్వరార్చనకు సాధనాలుగా చాలా మంచివే; మనస్సుకు సంతృప్తినిచ్చేవే. అవి మనస్సును ఉద్ధరించడానికి సాయపడవచ్చు. కానీ, ఎవడైనా మానవుడు సాధకుడుగాను, యుక్తి యుక్తుడుగానుకూడ ఉండదలచితే, ప్రపంచంలో అతనికి ఉపకరించతగింది, అద్వైత సిద్ధాంతమొక్కటే. సరే, ఇప్పుడు ఒక ప్రక్కనుండి నిరంతరం నిలుచుండి, రెండవ ప్రక్క నీటిని వదలివేస్తున్న నదితో పోల్చి, మనస్సునుగూర్చి విచారణచేద్దాం. మనం ఆత్మ అని పిలిచే ఆ ఐక్యం ఎక్కడుంది? శరీరం నిరంతరం మారిపోతున్నా, మనస్సు ఎప్పుడూ మార్పుచెందుతున్నా, మనలోపల మార్పుచెందనిది ఒకానొకటుంది. అదే, ఈ వస్తువులను గూర్చిన మన భావాలకు స్థిరత్వం కల్పిస్తోంది. వేర్వేరు తావుల నుండి వచ్చే కాంతికిరణాలు ఒక తెరమీదనో, ఒక గోడమీదనో కదలక, మారక ఉండే మరొక దేనిమీదనో పడినప్పుడు మాత్రమే ఆ కిరణాలకు ఐక్యం ఏర్పడటం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే అవి పూర్ణస్వరూపంగా కూర్పునందడానికి వీలవుతుంది. నరుని ఇంద్రియాలకు ఐక్యం ఎలా ఏర్పడుతుంది? అతని వేర్వేరు భావాలు ఏకమై, ఒక పూర్ణ స్వరూపం పొందడానికి వీలు ఎలా కలుగుతుంది? మనస్సుకూడ మారిపోతుండేదే కాబట్టి దానిలో ఐక్యం సాధ్యమవుతుందని చెప్పడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదు. కాబట్టి శరీరంకంటె, మనస్సుకంటె, వేరైన ఇంకొకటి ఉండితీరాలి. మన భావాలన్నీ, మన ఇంద్రియానుభవాలన్నీ, దేనిమీద నిలిచి ఐక్యం పొందగలవో, ఒక పూర్ణస్వరూపంగా ఏర్పడగలవో, అలాంటిది ఏదో ఒకటి, మారనిది, శాశ్వతంగా ఉండేది, ఉండితీరాలి. అదే నరునిలోని నిజమైన జీవుడు, లేక ఆత్మ. పంచభూతాలతో ఏర్పడింది ఏదైనా, మీరు దాన్ని సూక్ష్మద్రవ్యమనండి, లేక మనస్సనండి, అది మారిపోతూనే ఉంటుంది. మీరు స్థూలపదార్థమనే ఈ బాహ్య ప్రపంచం కూడ, సూక్ష్మద్రవ్యమైన మనస్సుకంటె, మరింతగా మారిపోతూంది. అందువల్ల పరిణామరహితమైన వస్తువు భౌతికపదార్థం మాత్రం కాజాలదు; అది ఆత్మపదార్థమై ఉండితీరాలి. అంటే, అది జడద్రవ్యం కాజాలదు. అది అవినాశి అయి, నిర్వికారమై, మార్పులేనిదై ఉండి తీరాలి.
ఇప్పుడు, ఇంకో ప్రశ్న బయలుదేరుతోంది. ప్రపంచంలో మాత్రమే జనించే పురాతనవాదాలన్నీ దూరంగా ఉంచుదాం. ఈ బాహ్యప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? జడపదార్థాన్ని కల్పన చేసిందెవరు? నరుని అంతర ప్రకృతినుండి మాత్రమే మనం సత్యం తెలిసికోవాలి. ఆత్మను గురించి, ఈ సందర్భంలో అదే విధమైన ప్రశ్న ఉదయిస్తోంది. మనస్సునుండి వేరైనది, నిర్వికారం అయిన ఆత్మ నరునిలో ఉన్నదని ఒప్పుకొన్నప్పటికీ, జీవులమధ్య భావాల్లోను, అనుభవాల్లోను, సానుభూతుల్లోను, ఐక్యం ఎలా కలుగుతోంది? అనే ప్రశ్న కలుగుతుంది. నా జీవాత్మకు మీ జీవాత్మతోడి సంసర్గం ఎలా కలుగుతోంది? అది అలా పని చేయడానికి ఉపకరించే సాధనమేది? దేనిద్వారా, అది నీ ఆత్మను చేరగలుగుతోంది? ఇతర జీవాత్మ సంసర్గానుభవం నాకెలా కలుగుతోంది? నీ ఆత్మతోను, నా ఆత్మతోను, సంబంధాన్ని కల్పించే మాధ్యమవస్తువేది? కాబట్టి ఇంకొక ఆత్మ కలదని ఒప్పుకోవలసిన తాత్త్వికావసరం ఏర్పడుతోంది. అన్ని జీవాత్మలతోడ, సంపర్కం కలిగి పనిచేయగలదీ, జడపదార్థాల్లోను, వాటి మూలంగాను, పనిచేయగలదీ, ఆత్మే అయి ఉండాలి. ప్రపంచంలో ఉన్న ఈ అసంఖ్యాక జీవాత్మలనన్నిటినీ తనలో ఇముడ్చుకొని, వాటిలో అంతర్యామియై వర్తిస్తూ, అవి అన్నీ తనలోనే, తన మూలంగానే బ్రతుకునట్లు, తనలోనే తన ద్వారానే, ఒక దాంతో ఒకటి, సానుభూతి పొందుతూ ఒక దాన్ని ఒకటి ప్రేమించుకొంటూ, ఒకదాని కొకటి ఉపకారం చేస్తూ, ఉండటానికి వసతిని కల్పించే విశ్వాత్మ ఒకటి ఉండి తీరాలి కదా? ఈ విశ్వాత్మయే పరమాత్మ! అదే జగదీశ్వరుడు. ఆత్మ, భౌతికపదార్థం కాదు కాబట్టీ, అది, ఆత్మమయం కాబట్టీ, జడపదార్థ ధర్మాలకు అది లోబడి ఉండదని తేలుతోంది. జడపదార్థ ధర్మాలను అనుసరించి, దీన్ని పరిశోధించడానికికూడ వీలులేదు. అది అవిజేయం, అజం, అమరం, నిర్వికారం.
“నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతిపావకః,
నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః
నిత్యః సర్వగతః స్థాణు రచలో-యం సనాతనః”
“ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు; అగ్ని కాల్పజాలదు. నీరు తడుపజాలదు; గాలి ఆర్పివేయజాలదు. ఈ ఆత్మ నిర్వికారమైంది. అంతటా వ్యాపించి ఉండేది. కదలనిది, చలనం లేనిది. శాశ్వతమైంది” భగవద్గీత ననుసరించి, వేదాంత శాస్త్రాన్ననుసరించి, ఈ జీవాత్మ విభువు అని మనం గ్రహిస్తున్నాం. కపిలుని సిద్ధాంతాన్ననుసరించి, ఇది సర్వవ్యాపి. ఈ ఆత్మ అణుస్వరూపి అంటే అత్యంత సూక్ష్మపరిణామం కలది అని వాదించే సంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి, నిజమే. అయినా వ్యక్తంకావడంలో అది అణువుగా గోచరిస్తుందనే వారి అభిప్రాయం. దాని యథార్థస్వరూపం విభువు. అంటే సర్వత్ర వ్యాపించి ఉండేది అని అర్థం.
ఇక్కడ ఇంకొక సిద్ధాంతం బయలుదేరుతోంది. అది మిక్కిలి విచిత్రంగా తోచవచ్చు. అది భారతీయుల ప్రత్యేక సిద్ధాంతం. ఇది అన్ని సంప్రదాయాలవారూ, సమానంగా అంగీకరించే సిద్ధాంతం. కాబట్టి, ఈ ఒక్కభావాన్నిగూర్చి శ్రద్ధగావిని జ్ఞప్తినుంచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. భారతదేశంలో ఈ భావం అన్నిటికీ పునాదిగా ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో జర్మను తత్త్వవేత్తలు, ఆంగ్లతత్త్వజ్ఞులు స్థూలపరిణామ సిద్ధాంతాన్ని బోధించడం మీరు వినే ఉంచారు. అన్ని జంతువుల శరీరాలు ఒక్క రీతివే అనేది ఈ సిద్ధాంతం. ఒకే వర్గానికి చెందిన శరీరాలు, భిన్నభిన్నంగా ఆకృతిపొంది, వ్యక్తమవుతున్నందున విభేదాలేర్పడుతున్నాయి. కాబట్టి, అత్యల్పక్రిమి మొదలు, అత్యుత్తమ జీవి అయిన మానవోత్తముని వరకు, శరీరస్వరూపం ఒక్కటే. ఒక్కటే, ఇంకొకటిగా, ఇంకొకటిగా మారుతూ, పైపైకిపోతూ శ్రేష్ఠతరరూపాన్ని ధరిస్తుంది. చివరికి పూర్ణతను పొందుతుంది. మనలోకూడ, ఆ సిద్ధాంతం ఉంది. “జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్” అని పతంజలి యోగి తెలిపే ఉన్నాడు. అన్నీ ఒక్కటే శ్రేణికి చెందివున్నాయి. జాతి అంటే శ్రేణియే, ఒకటి ఇంకొక రకంగా మారుతూ ఉంటుంది. ఇదే పరిణామం. ఒకరకం ఇంకొక రకంగా ఏర్పడటం లాగా, ఒక వస్తువు వేరొక వస్తువుగా మారటానికే పరిణామమని అర్థం. యూరోపియన్లకు, మనకు భేదం ఎక్కడుంది? “ప్రకృత్యపూరాత్” అంటే ‘ప్రకృతి పూర్ణతను పొందడం వల్ల’ అని పతంజలి తెలిపివున్నాడు.
స్పర్థవల్ల, అంటే పోటీపడటంవల్ల, స్వాభావికమైన, స్త్రీపురుషజాతి ఆకర్షణవల్ల, శరీరం రూపాంతరం పొందుతోందని యూరపియన్లు చెబుతున్నారు. పతంజలి సూక్తిలో యూరపియన్ సిద్ధాంతంకన్నా సూక్ష్మతర పృధక్కరణం, గాఢతర పరిశీలనం కనబడుతోంది. ప్రకృతి పూర్ణత పొందడం అంటే ఏమో ఇప్పుడు ఆలోచిద్దాం. అత్యల్ప సూక్ష్మజీవి క్రమక్రమంగా, శ్రేష్ఠతర జీవి అవుతూ, ఒక బుద్ధుడుగా ఏర్పడేవరకు, మారుతూ పోతుందని మనం ఒప్పుకొంటున్నాం. ఒక యంత్రంలో క్రియను, ఏదో ఒక రూపంలో అంతకుముందు మనం ప్రవేశపెట్టి ఉండకపోతే ఆ యంత్రం ఏ ‘క్రియ’ నూ చేయజాలదు. శక్తి ఎన్ని రూపాలతో, వ్యక్తమైనా దాని పరిణామమొక్కటే. దానికి మార్పురాదు. ఒక రూపంలో కొంతశక్తిని మనం పొందకోరితే, అంతశక్తిని వేరొక రూపంలో, వ్యయించి తీరాలి. కాబట్టి ఉన్నశక్తి పరిమాణం ఒక్కటే. ఒక సూక్ష్మజీవి పరిణామం పొంది బుద్ధుడయినట్లనుకోండి. ఆ సూక్ష్మజీవి కూడ నిజానికి బుద్ధుడే. సూక్ష్మజీవే బుద్ధునిగా పరిణమిస్తే, ఆ సూక్ష్మజీవి సంకోచం పొందిన బుద్ధుడే అయివుండాలి. ఈ విశ్వం అనంతశక్తిరాశి వికాసమే అయితే, ఈ జగత్తు, ప్రళయదశలో ఉన్నప్పుడు, సంకోచం పొందిన ఆ అనంతశక్తిరాశియే అయివుండాలి. వేరువిధంగా కావడానికి వీల్లేదు. అందువల్ల ప్రతిజీవాత్మ అఖండమని తేలుతోంది. మన కాలి క్రింద మిలమిలలాడే చిన్నపురుగు మొదలు, మహోన్నతులైన మహా ఋషులవరకు, అందరిలోను, ఈ అఖండశక్తి, అఖండనైర్మల్యం, అఖండసర్వం ఉన్నాయి. భేదమంతా వికాసంలోని తారతమ్యమే! చిన్న పురుగు ఆ శక్తియొక్క అతి స్వల్పాంశాన్ని మాత్రమే ప్రకటిస్తోంది. నువ్వు దాన్నే ఎక్కువగా ప్రకటిస్తున్నావు. ఒక మహాఋషి, దాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటిస్తున్నాడు. ఇంతే భేదం. కానీ, ఆ అఖండశక్తి ఏకరీతిగానే నిలిచివుంది.
“తతఃక్షేత్రకవత్ – కర్షకుడు తన పొలానికి నీరు పెట్టడం వంటిది” అని పతంజలి చెప్పాడు. కర్షకుడు ఎక్కడో ఉన్న చెరువునుండి, ఒక మూల చిన్నగండి ద్వారా, తన పొలానికి నీరు పారించుకొంటాడు. ఆ నీరు ఒక్కసారిగా తన పొలంలోనికి వేగంగా వచ్చిపడకుండా ఆపే నిమిత్తం, దానికొక తలుపునుకూడ అమర్చివుండవచ్చు. అతనికి నీరు కావలసివచ్చినపుడు, ఆ తలుపును తెరిస్తే చాలు. ఆ నీరు తన స్వశక్తి వల్లే వచ్చిపడుతుంది. ఆ శక్తికి ఇతడేమీ కొత్తగా చేర్చవలసిన పనిలేదు. అది, ఆ చెరువులో ఇదివరకే ఉంది. ఈ విధంగా మనలోని ప్రతివానికీ, ప్రతిజీవికీకూడ, మూలాధారంగా అనంతశక్తి, అనంతపావనత్వం, అనంతానందం, అనంతసత్త్వం, కలిగిన ప్రబలమైన ఒక చెరువు ఉన్నదన్నమాటే; కానీ వెల్లువ నరికట్టే తలుపులలాంటి శరీరాలు, ఆ స్వస్వరూపాన్ని సంపూర్ణంగా ప్రకటించకుండా ఆపుతున్నాయి.
తమోగుణం, రజోగుణంగా, రజోగుణం సత్వగుణంగా మారుతూండేకొద్దీ, ఈ శరీరాలు అధికాధికంగా సూక్ష్మనిర్మాణం కలవి అవుతూంటాయి. ఈ శక్తి, ఈ నిర్మలత్వం, అధికాధికంగా, ప్రకాశానికి వస్తూంటాయి. ఈ కారణం చేతనే ఆహారపానీయాల విషయంలోను భోజనాదిక విషయంలోను, మన పూర్వులు అత్యంత శ్రద్ధవహించారు. వివాహ విషయంలో లాగానే ఈ విషయంలోను, పూర్వపుటాచారం అభిప్రాయాలు, నేడు అదృశ్యమైపోయి ఉండవచ్చు. ఇప్పుడు, అది ప్రసక్తంకాకున్నా, భారతీయవివాహాన్ని గూర్చి ఒక్క విషయంమాత్రం ముచ్చటిస్తాను. ఇంకొక అవకాశం ఉంటే, ఈ విషయాన్నిగూర్చి విపులంగా ప్రసంగిస్తాను. వివాహ వ్యవస్థనుగూర్చి మనకున్న అభిప్రాయాలు ఉత్తమ నాగరికతకు ప్రాతిపదికలు కాదగిన సిద్ధాంతాలని మాత్రం చెబుతున్నాను. ఇతర సిద్ధాంతాలేవీ నాగరికాలు కావు. ఒక పురుషుడుగాని, ఒక స్త్రీగాని, తనకు నచ్చిన స్త్రీని భార్యగాను, తనకు నచ్చిన పురుషుని భర్తగాను, నిర్ణయించుకొనే స్వాతంత్ర్యం అంగీకరిస్తే, వ్యక్తి సౌఖ్యం, పశువాంఛాతృప్తి, విచ్చలవిడిగా విజృంభించడానికి సంఘంలో అవకాశం కల్పిస్తే, తత్ఫలితంగా అనర్థం వాటిల్లితీరుతుంది; దుష్ట సంతానం పెరుగుతుంది. సంఘం దుర్మార్గమై రాక్షసమయమవుతుంది. చూడండి, ప్రతిదేశంలోను నరుడు ఒకవైపున ఇలాంటి ఘోరసంతానాన్ని వృద్ధిచేస్తున్నాడు. రెండవవైపున ఈ పశువులను అదుపులో ఉంచడానికై పోలీసు బలాన్ని పెంచుతున్నాడు. ఆ విధంగా, అనర్థం ఎలా నాశనం చేయడమా, అన్నది ఒక సమస్య కారాదు. ఈ అనర్థం ఉత్పత్తిని ఎలా ఆపడం? అనేదే మన సమస్యగా ఉండాలి. నువ్వు సంఘంలో ఉండేంత కాలం నీ వివాహఫలాన్ని సంఘంలోని ప్రతివ్యక్తీ తప్పక అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నీవు ఎవర్ని వివాహం చేసుకోవచ్చో, ఎవరిని వివాహం చేసుకో తగదో నిర్ణయించడానికి సంఘానికి అధికారం ఉంది. ఈ దేశంలో ఇటువంటి ఉత్తమభావాలు వివాహ సిద్ధాంతానికి మూలాధారంగా ఉన్నాయి. దీన్నే వధూవరుల జాతకచక్రమంటారు. మనువు అభిప్రాయంలో, కామతృప్తివల్ల పుట్టిన బిడ్డ ఆర్యుడు కాదనే. ఏ బిడ్డయొక్క పిండోత్పత్తి, మరణం, వేదశాస్త్రానుగుణమవుతాయో, అతడే ఆర్యుడు. ప్రతిదేశంలో ఇట్టి ఆర్యసంతానం తగ్గిపోతోంది. తత్ఫలితంగా, అధర్మవృద్ధి అవుతోంది. దాన్నే మనం కలియుగమంటున్నాం. మన మీ ఆదర్శాలనన్నిటినీ పోగొట్టుకొన్నాం. ఈ సిద్ధాంతాలనన్నిటినీ ఈనాడు పూర్తిగా ఆచరణలో పెట్టజాలమనడం కూడా సత్యమే! ఈ సద్భావాలను అపహాస్య రూపానికి తెచ్చామనడమూ సత్యమే! నేటి తల్లులు, తండ్రులు, పూర్వకాలంనాటి తల్లిదండ్రుల వంటివారు కాకుండటం శోచనీయం. తర్వాత సంఘానికి వ్యక్తులపట్ల పూర్వమున్నట్టి ప్రేమకూడ ఇప్పుడు లేదు. కానీ, ఆచరణలో దోషాలున్నా, ధర్మసిద్ధాంతంమాత్రం నిర్దుష్టంగానే ఉంది. అనుష్ఠానంలో లోపముండి ఒక ఆచారం నిరుపయోగమైతే ధర్మసిద్ధాంతాన్ని చేపట్టి ఆచరణను సవరించండి. ధర్మసిద్ధాంతాన్నే ఎందుకు నాశనం చేస్తారు? ఆహార విషయంలోనూ ఇదే స్థితి వాటిల్లింది. అనుష్ఠానాచార వివరాలు చాలా చెడిపోయాయి. బొత్తుగా చెడిపోయాయనడం వాస్తవం. అంతమాత్రంచేత ధర్మసూత్రానికి హానిలేదు. ధర్మం సనాతనమై నిలిచి ఉండవలసిందే! దాన్ని సవ్యమార్గానపెట్టి అనుష్ఠానాన్ని సంస్కరించండి.
భారతదేశంలో ప్రతి సంప్రదాయంవారూ, ఆత్మవిషయంలో విశ్వసించే ఒక గొప్ప సిద్ధాంతమిది. ద్వైతులుమాత్రం దుష్కర్మలచేత ఆత్మ సంకుచిత మవుతుందంటారు. అంటే దాని శక్తులన్నీ దుస్స్వభావం వల్ల ముకుళించుకొంటాయి; మళ్ళీ సత్కర్మలవల్ల వికసిస్తాయి. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆత్మ ఎన్నడూ ముకుళించుకోదు. వికసించడమూ లేదు; కానీ అన్ని శక్తులూ ఆత్మలోనే ఇదివరకే ఉన్నాయి. బయటనుండి ఏమీ దానిలోకి రావడం లేదు. ఆకాశం నుండి దానిలోకి ఏమీ ఊడిపడదు. ఈ భావాన్ని అందరూ ఒప్పుకొంటారు. మన వేదాలు వెలుపలనుండి లోపలికి వచ్చేవి కావనీ, లోనుండి వెలుపలికి వికసించివచ్చేవనీ, అవి ఎక్కడనుండో వచ్చేవికాక, ప్రతి ఆత్మలో శాశ్వతంగా ఉండే ధర్మాలే అనీ గుర్తుంచుకోండి. వేదాలు చీమ ఆత్మలోకూడ ఉన్నాయి. దేవత ఆత్మలోనూ ఉన్నాయి. చీమపరిణామం పొంది, ఋషిశరీరాన్ని పొందాలి. వేదాలు, అప్పుడు వాటంతటవే వెలువడివస్తాయి. ఆ శాశ్వతధర్మాలు వాటంతట అవే ప్రకాశిస్తాయి. మనశక్తి అంతా, ఇదివరకే మనది. మన మోక్షం ఇదివరకే మనలో ఉంది. ఈ మహాసిద్ధాంతాన్ని మనం గ్రహించాలి. మన ఆత్మ సంకుచితమైందే అనుకో; మాయయొక్క ముసుగుతో కప్పబడిందే అనుకో; అది అంతగా పాటించతగిన విషయంకాదు. అధమాధమ నరునిలోకూడ, బుద్ధునిలోవున్న ప్రతిభే ఉందనే సిద్ధాంతం ఇదివరకే ఉంది. మీరు దాన్ని విశ్వసించాలి. ప్రతివాని యోగ్యతను విశ్వసించాలి. ఆత్మను గురించిన పరమసిద్ధాంత మిదే.
ఇప్పుడు గొప్ప పోరాటమొకటి సంభవిస్తోంది. మనలాగే బౌద్ధులూ శరీరాన్ని పరిశోధించి, అది ఒక విధమైన జడప్రవాహమనీ, మనస్సును పరిశోధించి, అది మరొక జడ ప్రవాహమనీ కనుగొన్నారు. ఇక ఆత్మ విషయాన్ని పరిశోధించటం అనవసరమని వారి మతం. కాబట్టి ఆత్మ అనేదొకటి ఉందని ఊహించడమే అనావశ్యకం. “జడపదార్థంతోను, ఆ పదార్థానికి అంటివుండే గుణాలతోను, మనకేం పని? అవి గుణాలు మాత్రమే అని చెప్పుదాం. ఒక్క కారణమే అంతటినీ వివరిస్తూండగా రెండు కారణాలున్నాయని ఊహించటం అవివేక” మని వారంటారు. ఇక పోరాటాలు సాగాయి. ద్రవ్యమునకు సంబంధించిన సిద్ధాంతాలన్నిటినీ బౌద్ధులు నేలకూల్చారు. “నీకొక ఆత్మ ఉంది. నాకొక ఆత్మ ఉంది. ప్రతి వానికీ మనస్సుకు, శరీరానికి భిన్నమైన ఒక ఆత్మ ఉంది. ఇలా ప్రతివానికీ ఒక వ్యక్తిత్వం ఉంది” అనే ద్రవ్యగుణ సిద్ధాంతాన్ని నమ్మేవారంతా చెల్లాచెదురైరి.
మనం చూసినంతవరకు, ద్వైతుల సిద్ధాంతం సరిగానే ఉంది. శరీర మొకటి ఉంది. మనస్సు లేక సూక్ష్మశరీరం ఉంది. ఈ ఆత్మ ఉంది. అన్ని ఆత్మలలోను నిండి, అంతర్యామియై పరమాత్మ ఉన్నాడు. సరే, ఇక్కడ ఒక చిక్కు తటస్థిస్తోంది. ఆత్మ, పరమాత్మలు రెండూ ద్రవ్యాలు. వాటిని మనస్సు, శరీరం ఇంకా ఇతర ద్రవ్యాలు వేర్వేరు గుణాలలాగా అంటుకొని ఉంటాయని అంటారు. ఎవరుగానీ, ఎన్నడుగానీ, ద్రవ్యాన్ని చూచినవారు లేరు. దాన్ని ఊహించగలవారూ లేరు. ఇలాంటి ద్రవ్యాన్ని గూర్చి ఆలోచిస్తే ప్రయోజనమేముంది? క్షణికవాది అయి, “ఉన్నది మానసిక ప్రవాహాల పరంపర మాత్రమే, మరేమీలేదు” అని ఏల అనకూడదు? ఈ ప్రవాహాలు, ఒకదానికొకటి అంటుకొనిపోవు; అవి ఒకటిగా కలిసిపోవు. సముద్రంలోని తరంగాలలాగా, ఒక దాని తర్వాత మరొకటి వస్తూంటాయి. అవి ఎన్నడూ పూర్తికావు. ఎన్నడూ ఒక్కటిగా కలిసిపోవు. ఇలాంటి తరంగాల పరంపరే నరుడు. ఒక తరంగం పోయేటప్పుడు, ఇంకొకదాన్ని కల్పిస్తూంటుంది. ఈ తరంగరూపాలు ఆగిపోవడమే నిర్వాణమనబడుతుంది. ఈ వాదం ఎదుట ద్వైతవాదం, వేదసిద్ధాంతం మౌనం వహించవలసిందే కదా? ఏమని వాదించడానికి సాధ్యంకాదు. ద్వైతుల దేవుడు సైతం ఇక్కడ నిలువజాలడు. సర్వవ్యాపి అయినా, దేవుడు ఒక పురుషుడై, చేతులు లేకుండా సృష్టి చేస్తాడనడం, కాళ్ళు లేకుండా నడుస్తాడనడం మొదలైన భావాలూ, కుమ్మరి కుండలు చేసేలాగ, ఆ దేవుడు ఈ జగత్తును సృష్టిచేస్తున్నాడనే సిద్ధాంతం, అర్థంలేని చిన్నపిల్లల మాటలని బౌద్ధులంటారు. “అలాంటి దేవుడు ఎవడైనా ఉంటే, ఆ దేవునితో నేను పోరాడుతానుగానీ పూజించను” అని బౌద్ధమతస్థుడు నిగ్రహించి పల్కుతాడు. ఈ జగత్తు దుఃఖంతో నిండివుంది. ఇది భగవంతుని పని అయితే అలాటి భగవంతునితో మేము యుద్ధం చేస్తాం. రెండవది, ఇలాంటి భగవంతుడుండటం సహేతుకం కాదు. అసంభవమని మీకందరికీ తెలుసు. సృష్టి రచనా సిద్ధాంతంలోని లోపాలగూర్చి మనం ప్రస్తావించనక్కర్లేదు. మన క్షణికవాదులు వారి బండారాన్ని పూర్తిగా బయటపెట్టారు. ఈ విధంగా సగుణబ్రహ్మం నిరాధారం చేయబడుతోంది.
సత్యం, అనన్యమైన సత్యమే, అద్వైతియొక్క ధర్మసూత్రం. “సత్యమేవ జయతే నానృతం; సత్యేనైవ పంథా వితతో దేవయానః” (సత్యమే జయిస్తుంది. అసత్యం జయించదు; దేవయానమార్గం సత్యంద్వారా పోతోంది.) ప్రతివాడూ ఈ సత్యాన్ని నమ్మే నడుస్తున్నాడు. కానీ, నీకంటే దుర్బలుని వాదాన్ని నీ వాదబలం చేత, నలిపివేయడం కోసమే ద్వైతసిద్ధాంతాన్ని ఉపయోగించుకొంటున్నావు. పాపం, ఏదో ఒక విగ్రహాన్ని పూజచేసుకొనేవానితో, ఊరికే తగవుపెట్టుకొంటున్నావు. నీది, ఒక అద్భుత తర్కవాదమనీ, ఎదుటివానిని సులభంగా కలవరపెట్టగలననీ అనుకొంటావు. కానీ, అతడు ఎదురు తిరిగి నీ సగుణ బ్రహ్మమును తుత్తునియలుచేసి, అది కేవల ఊహాజన్యమైన ఆదర్శమే అని చెబితే, నీకు గతేముంది? నీవు ఏదో ఒక నమ్మకాన్ని ఆధారం చేసుకొని ఇతరులు, నాస్తికులని మొరపెడతావు. అది తాతలనాటి దుర్బలుని మొర అవుతుంది. అతడు, తన్ను ఓడించిన వాడినంతా, నాస్తికుడని అంటాడు. నీవు తర్కాన్ని ఆశ్రయిస్తే, పూర్తిగా తర్కాన్ని అనుసరించి నడుచుకో! లేదా ఇతరులు అంగీకరించాలని నీవు కోరుకొనే నీతులనే ఇతరుల ఎడలకూడా నీవు అంగీకరించు. దేవుడున్నాడని నీవెలా రుజువు చేయగలవు? నిజానికి దేవుని ఉనికికి రుజువే లేదు. పైగా వాని ఉనికికి విరుద్ధంగా ప్రబలములైన వాదాలున్నాయి. నీ దేవుడు, వాని గుణాలు, ద్రవ్యమయములైన అనేక ఆత్మలు, ప్రతి ఆత్మ, ఒక ప్రత్యేకవ్యక్తి – వీటినన్నిటినీ సమర్థించుకొంటూ, నీ దైవాన్నిగూర్చి నీవెలా రుజువుచేస్తావు? నీవొక ప్రత్యేక వ్యక్తివా? ఎలా? నీవు ఒక శరీరం కాదుకదా? ఆ సూర్యునిలో, ఒకప్పుడు నిండివున్న ద్రవ్యం ఇప్పుడు నీలోవున్న ద్రవ్యంగా మారివుండవచ్చు. ఇప్పుడు నీలోవున్న ద్రవ్యం వెలువడిపోయి, ఆ చెట్టులోని ద్రవ్యంగా ఏర్పడవచ్చు. అలాంటి సందర్బాలలో నీ వ్యక్తిత్వం ఎక్కడ? నేను పుల్లయ్యననో, వెంకయ్యననో చెప్పుకొనేది దేన్ని? మనస్సు విషయంలోను ఇలాగే ఉంది. నీ వ్యక్తిత్వం ఎక్కడ? ఈ రాత్రి నీ భావం ఒకరకంగా ఉంది. రేపు మరొక విధంగా ఉంటుంది. నీవు చిన్నప్పుడు భావించినట్లు ఇప్పుడు భావించడం లేదు. ముసలివాళ్ళు పడుచువాళ్ళలాగా ఆలోచించరు. ఇక నీ వ్యక్తిత్వం ఎక్కడుంది? అది ఈ అహంకారంలో ఉందనకు. ఎందుకంటే, అదీ నీ ఉనికిలో ఒక అల్పభాగమే! నేను ఇప్పుడు మీతో మాటలాడుతూంటే నా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. నాకు వాటి ఎరుక లేదు. ఎరుక ఉండటమే వాటి అస్తిత్వానికి ప్రమాణమైతే, అవి నా గుర్తునకు రావడంలేదు. కాబట్టి అవి లేవనే చెప్పవలసి వస్తుంది. ఇక మీరు మీ సగుణదైవత సిద్ధాంతాలు ఎక్కడ నిలువగలవు? అలాంటి దేవుడున్నాడని మీరెలా రుజువు చేయగలరు?
బౌద్ధులు మళ్ళీ ఎదురువచ్చి, అలాంటి భావం సహేతుకం కాదనీ, అది నరుని పిరికి వానినిగాచేసి వెలుపలినుండి వచ్చే సాహాయ్యంకోసం, దేవురింప చేస్తుందనీ, అలాంటి సహాయం అందించేవాడు ఎవ్వడూ లేడనీ, కాబట్టి అలాంటి బోధ నీతిబాహ్యమనీ అంటారు. “ఇదిగో జగత్తు కనిపిస్తోంది. నరుడు దాన్ని నిర్మించాడు. ఇంక ఎవడూ, ఎన్నడూ చూడనట్టి, ఎన్నడూ గుర్తించనట్టి, ఎన్నడూ మనకు సహాయం చేయనట్టి, ఒక వ్యక్తి మనకు బాహ్యంలో ఎక్కడో ఉన్నాడనే ఊహలమీద ఆధారపడి ఉండటమెందుకు? మీరు వ్యర్థంగా పిరికివారై పోనేల? మీ బిడ్డలకు, కుక్కలలాగా, పూర్ణవిశ్వాసంతో ఉండటమే నరునికి ఉత్తమోత్తమ దశ అని చెప్పనేల? కేవలం ఊహచేత, ఒక భూతాన్ని కల్పించుకొని, దాని ఎదుట దీనంగా నిలిచి, “మేము దుర్భలులం, అపవిత్రులం; ఈ జగత్తులో దుష్టత్వమంతా మాలోనే మూర్తీభవించింది” అని చెప్పుకోండని వాళ్ళకెందుకు నేర్పుతారు? “మీరు అబద్ధాలాడుతున్నారు. మీ బిడ్డల నెత్తిమీద మహాదోషాన్ని తెచ్చిపెడుతున్నారు” అని బౌద్ధులు నిందిస్తారు. ఏమంటారా? “ఈ ప్రపంచం భ్రాంతిచేత కలుగుతోంది. మీరు ఎలా భావిస్తే అలా అయిపోతారు. ఎలా సంకల్పిస్తున్నారో అలాగే ఉన్నారు. ఎలా సంకల్పించబోతారో, అలాగే అవుతారు” అనే మాటలే మొట్టమొదట బుద్ధభగవానుని ముఖం నుండి వెలువడ్డాయి. కాబట్టి మేమెందుకూ కొరగామనీ, ఎక్కడో మబ్బుల కావల కూర్చునే ఎవడో సహాయం చేస్తేగానీ ఏమీ చేయజాలమనీ చెప్పుకోకండి. అలా అయితే రోజురోజుకూ, మీరు అధికాధికంగా దుర్భలులై పోవడమే తటస్థిస్తుంది. “స్వామీ! మేము అపవిత్రులము, మమ్మల్ని పవిత్రులనుగా చేయి” అని పలుమారు ప్రార్థనచేయడంవల్ల మీరు భ్రాంతి పడిపోయి, నానావిధాలైన తప్పు పనులను చేస్తారు. ఇలా సగుణ దైవతం ఒకడున్నాడనే భావం వల్లనే, ఇప్పుడు ప్రతి సంఘంలోను కనిపించే దోషాలలో, నూటికి తొంభైవంతులు కలుగుతున్నాయని బౌద్ధులంటారు. ఈ జీవిత పరిణామం యొక్క ముఖ్య గమ్యార్థం, ఈ అద్భుత జీవపరిణామం, నీవొక కుక్కవై పోవడానికే అయితే అది మానవజన్మ ఎత్తిన వానికి తగని ఘోరసంకల్పం అవుతుంది. “వైకుంఠం అనే చోటికి వెళ్ళి, అక్కడ నివసించే దేవుని ఎదుట, సర్వకాలం చేతులు జోడించుకొని, దీనంగా నిలబడి ఉండటమే నీ జీవితగమ్యార్థమైతే ఆత్మహత్య చేసుకొని చావడం మంచిది” అని బౌద్ధులు వైష్ణవునితో వాదిస్తారు. అందువల్లనే తాము ఈ స్థితినుండి తప్పించుకోవడం కోసమే, నిర్వాణమనే శూన్యస్థితిని సృష్టిచేస్తూంటామని వారంటారు. అద్వైతభావాలన్నీ ప్రజలను, నీతిబాహ్యులను చేసేస్తున్నాయని ఈ కాలంలో వాదనలు బయలుదేరటంవల్ల, నేను మాటవరుసకు బౌద్ధునిలాగా ఈ భావాలనన్నిటినీ ఊరికే, మీ ఎదుట పెడుతున్నాను. ఆ ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపడానికి ప్రయత్నిస్తున్నాను. రెండు పక్షాలను ధైర్యసాహసాలతో మనం విమర్శించి చూద్దాం!
“ఒకానొక సగుణ దైవతం జగత్తును సృష్టిచేస్తున్నాడు” అనే సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి వీలులేదని మొదటనే మనం తెలిసికొన్నాం. ఈనాడు అలాంటి మాటను పసివాడైనా నమ్ముతాడా? కుమ్మరి కుండలు చేస్తున్నాడు. అలాగే బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టిచేస్తున్నాడు, అని చెప్పడమా? అలాగైతే మీ ఊరి కుమ్మరికూడ ఒక దేవుడే. అతడు తలగాని, చేతులుగాని లేకుండా పనిచేస్తాడని ఎవడైనా చెబితే, వానిని పిచ్చాసుపత్రికి పంపొచ్చు. ఇక ఈ జగత్తునకు సృష్టికర్త అనే నీ సగుణబ్రహ్మ నీ మొరలను, నీవు బ్రతికివుండగా ఎన్నడైనా విని, సహాయంచేశాడా? ఇది, ఆధునికశాస్త్రం చేసే మరొక ఆక్షేపణ. నీకు లభించే సహాయమంతా, నీ స్వంత ప్రయత్నంవల్లే లభించగలదనీ, ఇలా మొరపెట్టుకోవడంవల్ల, నీవు వ్యర్థం చేసుకొనే శక్తిని, అలా దేవురిస్తూ, మొరపెట్టుకోవడంకన్నా గొప్పగా వినియోగించుకోగలవనీ వారు రుజువు చేస్తారు. అంతేకాక, సగుణ దైవతం కలడనే నమ్మకంతోపాటు, అధికారపీడనం, అర్చకుల వ్యాపారం, బయలుదేరుతాయని మనకు తెలుసు. అధికార పీడనం, పూజారుల ప్రభ, ఈ విశ్వాసం ఉన్నచోట్లంతా ప్రబలుతూనే ఉన్నాయి. ఈ భ్రాంతిని నెత్తిమీద మొట్టి అణిచివేస్తే తప్ప ఈ పీడ తొలగదని బౌద్ధులు గట్టిగా వాదిస్తున్నారు. ఒక అలౌకిక పురుషుని ఎదుట, నరుడు వణుకుతూ నిలుచుండవలసిందే, అని తలచేంతకాలం, పాపం ఈ నరులు ఎవరో ఒక పురోహితుని బ్రతిమాలుకొని, తమకు అండగా నిలిచి, భగవంతుని అనుగ్రహం సంపాదించిపెట్టమని కోరుకుంటూనే ఉండాలి. అంతకాలం, నరులు తమ ఎదుట గడగడలాడుతూండవలసిందే అనీ, తమకు గొప్ప అధికారాలు, అర్హతలు ఉన్నాయనీ ఈ పూజారులు చెప్పుకొంటూనే ఉంటారు. మీరు బ్రాహ్మణుని దూరంగా నెట్టివేయవచ్చు. కానీ, నా మాటను నమ్మండి. అలా చేసేవారు, తామే ఆ బ్రాహ్మణుని స్థానం ఆక్రమించి ఇంకా ఎక్కువ పీడాకరులవుతారు. ఏలంటారా? బ్రాహ్మణునిలో కొంత ఉదార స్వభావముంది. కాని హఠాత్తుగా గణ్యతలోకి వచ్చిన ఈ మనుష్యులు అత్యధికంగా పీడించేవారుగా ఉంటారనడం నిజం. ఒక దరిద్రునికి హఠాత్తుగా ధనం చేజిక్కితే, ప్రపంచాన్నంతా గడ్డి పరకలాగా చూడసాగుతాడు. కాబట్టి, సగుణదైవతంలో, మనకు విశ్వాసమున్నంతకాలం, ఈ పూజారులూ ఉండి తీరుతారు. ఇక సంఘంలో ఉదాత్తమైన నీతి ఉండటం అసంభవం. పూజారివృత్తి, పీడనం, ఒకదాన్నంటిపెట్టుకొని ఒకటి ఉండి తీరుతుంది. అలాగైతే ఈ వృత్తి ఎందుకేర్పడింది? ఎందుకంటే పూర్వం కొందరు బలాఢ్యులు ప్రజలను తమ చేతి క్రిందికి తీసుకొని “మేము చెప్పినట్లు మీరు వినండి. లేదా, మిమ్మల్ని నాశనం చేస్తాం” అని భయపెట్టారు. ఇదే జరిగిన కథ. “మహత్ భయం వజ్ర ముద్యతమ్” తనకు లోబడని ప్రతివానిపై పిడుగులాగా పడి నాశనంచేసే రాక్షస భావమది.
బౌద్ధమతస్థుడు “సర్వమూ కర్మసూత్రాన్ని అనుసరించి ఫలిస్తుంది’ అన్నంతవరకు నీ భావం ఎంతో సహేతుకంగానే ఉంది” అంటాడు. అనంతమైన జీవాత్మలు కలవనీ, ఆ జీవాత్మలకు జననమరణాలు లేవనీ మీరు నమ్ముతారు. అసంఖ్యాకాలైన జీవాత్మలు ఉన్నాయనడం, కర్మసూత్ర విశ్వాసం తర్కసమన్విత మనడానికి సందేహం లేదు. ఫలమునీయని కారణమే ఉండజాలదు. ప్రస్తుతదశకు కారణం పూర్వదశలో ఉండి తీరుతుంది. ఈ ప్రస్తుత దశకు ఫలంగా, భావికాలపు దశ ఏర్పడుతుంది. కర్మ, జడమనీ, చైతన్యం కాదనీ కాబట్టి ఈ జడ కర్మను ఫలప్రదం చేయడానికి చైతన్యం అవసరమనీ హిందువు చెబుతున్నాడు. ఇది నిజమేనా? చెట్టును ఫలింపచేయడానికి చైతన్యం అవసరమవుతోందా? నేను, ఒక విత్తనాన్ని భూమిలో నాటి, కొంచెం నీరుపోస్తే చాలు. చైతన్యం అవసరం కావడం లేదే? అక్కడ అధిష్ఠానచైతన్యం కలదని మీరు చెప్పవచ్చుకానీ ఈ జీవాత్మలు ఆ అధిష్ఠానచైతన్యమే కదా? ఇక ఏమీ అవసరం ఉండదు. మానవుల జీవాత్మలకు సైతం అధిష్ఠానచైతన్యం ఉంది కదా? ఇంకా దేవుడొకడు అవసరమనడం ఎందుకు? అని జైనులు వాదిస్తున్నారు. వారు, బౌద్ధులలాగా కాక, జీవాత్మలున్నాయని ఒప్పుకొంటారు. కానీ, భగవంతుడున్నాడని విశ్వసించరు. మీ తర్కమెక్కడ? మీ నీతి ధర్మమెక్కడ? సరే, మీరు అద్వైతమతాన్ని పరిశీలించి, అది అవినీతికి దారితీస్తుందని భయపడితే భారతదేశంలోని ద్వైతసాంప్రదాయులు ఏం చేస్తున్నారో కొంచెం చూడండి. అద్వైతులలో ఇరవైవేలమంది తుంటరులుంటే, ద్వైతులలోనే తుంటరులు ఎక్కువమంది ఉంటారు. ఎందుకంటే, అద్వైతాన్ని గ్రహించడానికి కొంచెం ఎక్కువ బుద్ధిమంతులు అవసరం. అద్వైతులు సామాన్యంగా భయపడి దేనికీ లోబడరు. ఇక హిందువులైన మీకు మిగిలేదేముంది? బౌద్ధుల పిడికిల్లో చిక్కకుండా, మీకు రక్షణ లేదు. మీరు వేదాలను క్రోడీకరించవచ్చు. కానీ బౌద్ధులకు వేదాలలో విశ్వాసంలేదు. ప్రతిగా బౌద్ధులు “త్రిపీఠకములు వేరేవిధంగా చెబుతున్నాయి. అవి ఆద్యంతాలు లేనివి; అవి బుద్ధునిచేత వ్రాయబడినవీ కావు. బుద్ధుడే తాను దానిని ఆవృత్తి సలుపుతూంటినని, వల్లెవేస్తూంటినని చెప్పాడు. ఈ త్రిపీఠకములే సత్యమైన వేదాంతాలు; మీ వేదాలు సరియైనవి కావు; అవి బ్రాహ్మణ పురోహితులచేత కల్పించబడ్డాయి; కాబట్టి వానిని దూరంగా పారేయండి” అని విజృంభించి మాట్లాడుతారు. మీరు తప్పించుకొనే తోవ ఏదీ?
ఆ చిక్కునుండి తప్పించుకొనే తోవ ఇది. ఆధ్యాత్మిక వాదరూపమైన మొదటి ఆక్షేపణను తీసుకోండి. ద్రవ్యం, గుణాలు వేరనికదా వారి వాదన? అవి అలా వేర్వేరు కావని అద్వైతి చెబుతాడు. ద్రవ్యానికి గుణాలకు మధ్య విభేదమేమీ లేదు. పురాతన సాదృశ్యం మీరెరుగుదురు కదా? తాడు కన్పించి, పామనే భ్రాంతిని కల్గించింది. పాము నీకు కనబడేంతవరకు ఆ తాడు నీకు కనబడటంలేదు. ఆ తాడే అదృశ్యమైపోయింది. ఒక వస్తువును ద్రవ్యంగాను, గుణాలుగాను విభాగించడం, తత్త్వవేత్తల మెదళ్ళలోని ఒకానొక ఆధ్యాత్మిక విషయమని చెప్పవచ్చు. ఎందుకంటే అవి యథార్థంగా వెలుపల ఉండేవి కావు. నీవు సాధారణ మానవుడనైతే గుణాలనే చూడగల్గుతావు. నీవు మహాయోగివైతే ద్రవ్యాన్ని చూడగల్గుతావు. అంతేకానీ, ద్రవ్యాన్ని గుణాలను రెంటిని ఒకేకాలంలో నీవెన్నడూ చూడజాలవు. కాబట్టి బౌద్దులారా! ద్రవ్యములని, గుణాలనీ మీరు సాగించే పోరాటమంతా, పెద్ద పొరపాటు. యథార్థ విచారణకు అది నిలువజాలదు. ద్రవ్యం నిర్గుణమంటే, అది ఒక్కటిగా మాత్రమే ఉండగలదు. నీవు ఆత్మనుండి గుణాలు వేరుచేసి ఈ గుణాలు నిజంగా మనస్సులో ఉండేవనీ, అవి ఆత్మమీద ఆరోపణ చేయబడినవనీ చెబితే, ఇక రెండు ఆత్మలుండజాలవు. గుణాలు మాత్రమే ఒక ఆత్మను ఇంకొక ఆత్మ నుండి వేరుచేయగల్గుతాయి. లేకపోతే ఒక ఆత్మ ఇంకొక ఆత్మకంటె వేరు, అని నీవు భేదాన్ని గుర్తించడమే ఎలా జరుగుతుంది? ఏవో కొన్ని భిన్న లక్షణాలను, కొన్ని గుణాలనుబట్టే కదా, భిన్నత్వాన్ని గుర్తింపగలగడం? అలాకాక గుణాలే లేకపోతే, భిన్నత్వం ఎక్కడనుండి వస్తుంది? కాబట్టి రెండు ఆత్మలుండజాలవు. ఉండేది ఒక్కటే. ఇక మీ పరమాత్మ అనవసరం. ఈ ఆత్మే అది. ఆ ఒక్క ఆత్మయే పరమాత్మ అనబడుతోంది. ఆ ఒక్కటే జీవాత్మ అనీ పిలువబడుతోంది. ఇక సాంఖ్యులు మొదలైన ద్వైతులారా! మీరు ఆత్మ, ‘విభు’ అంటే సర్వవ్యాపి అంటారు కదా? అయితే రెండు అనంతవస్తువులు మీకెక్కడినుండి వస్తాయి? అనంతమైవుండగలది ఒక్కటే కదా? ఇంక వేరే ఏముంది? ఈ ఒక్కటే. అఖండాత్మ అయి ఉండగా, తక్కిందంతా దాని వ్యక్తరూపాలే కావాలి! అంతటితో, బౌద్ధమతస్థుడు ఆగిపోతున్నాడు. కానీ వాదన ఇక్కడ ఆగిపోవడం లేదు.
అద్వైత సిద్ధాంతం పరిశోధనకు నిలువని కేవల దుర్బలవాదం కాదు. అద్వైతి ఇతరులను విమర్శించి నెట్టివేసి, తన వాదాన్ని పటిష్టం చేసుకొంటాడు. కానీ, ఆక్షేపణలుచేస్తూ, ఆ ఆక్షేపణలతోను, గ్రంథసాక్ష్యాలతోను, అతడు ఆగిపోడు. ఇదిగో ఇక్కడ నీవున్నావు. ఈ జగత్తును నిరంతర చలనంగల వస్తువుగా, నీవు చెబుతున్నావు. సృష్టిలో అంటే ఖండదశలోని ప్రతిదీ చలిస్తున్నది. నీవు చలిస్తున్నావు. ఈ బల్ల చలిస్తోంది. అంతటా చలనం ఉంది. ఇది సంసారం, అంటే నిరంతర చలనమే. అందువల్లనే దీన్ని జగత్తు అనటం. కాబట్టి ఈ జగత్తులో వ్యక్తిగా ఉండగలది ఏదీ లేదు. వ్యక్తిత్వం అంటే మార్పు లేకుండటమే! సవికారమైన వ్యక్తిత్వం ఉండజాలదు. ఆ మాటే అర్థరహితమైంది. వికారం (మార్పు), వ్యక్తి అనే పదాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి. ఈ మన చిన్నప్రపంచంలో, ఈ జగత్తులో వ్యక్తి అనదగిన వస్తువేదీ లేదు. సంకల్పం అనుభవం, మనస్సు, శరీరం, నరులు, పశువులు, చెట్లు అన్నీ నిరంతర చలనదశలోనే ఉన్నాయి. ఈ జగత్తంతా ఒకే ఒక్క వస్తువుగా నీవు భావిస్తావనుకో; అప్పుడు అది మారగలదా? లేక చలించగలదా? మారజాలదు. చలించజాలదు. తక్కువ చలనంగల వేరొకదానితోగాని, లేక చలనమే లేని వేరొక దానితోగానీ పోల్చిచూచినప్పుడే కదా చలనం అనేదాన్ని గ్రహించడం సాధ్యంకాగలదు? కాబట్టి, విశ్వమంతా కలిసి ఒకటే అయినప్పుడు, అది నిశ్చలంగానే, నిర్వికారంగానే ఉంటుంది. అందువల్ల విశ్వమంతా నీవై “నేను బ్రహ్మాండమునే” అనే సాక్షాత్కారం నీకు కలిగినప్పుడే నీవు వ్యక్తి కాగలవు. అందువల్లే “ద్వైతమున్నంతవరకు, అంటే రెండవది ఉన్నంతవరకు భయం నశించదు” అని వేదాంతులు చెబుతున్నారు. ఒకడు వేరొకడు ఉన్నాడని తలచడం మానినప్పుడే ఇంకొకని ఉనికి వాని అనుభవానికి రానప్పుడే, అంటే అంతా ఒక్కటైనప్పుడే వాని భయం నశిస్తుంది. అప్పుడే మరణం తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే సంసారం అంతరిస్తుంది. కాబట్టి, నరుడు విశ్వమయుడు అయినప్పుడే, ‘వ్యక్తి’ కాగలుగుతాడు కానీ, ప్రత్యేకతతో నిలిచివున్నట్లు భావించడం మూలంగా, వ్యక్తి కాజాలడు అని అద్వైత సిద్ధాంతం తెలుపుతోంది. నీవు సర్వం అయినప్పుడే అమృతుడవవుతావు. నీవు విశ్వం అయినప్పుడే జనన మరణాల భయం లేకుండాపోతుంది. అప్పుడు మాత్రమే, నీచే విశ్వమని పిలువబడేది, నీవు భగవంతుడని పిలిచేదిగాను, “సత్–అస్తిత్వం” అని పేర్కొనేదిగాను, మరి నీవు సర్వము అని చెప్పేదిగాను కాగల్గుతుంది. నీమా, నీవంటి మనస్థితి కలవారంతా, బహుళతత్త్వంతో కూడిన ప్రపంచంగా చూచేది ఆ ఏకైక సద్వస్తువునే! కొంచెం పుణ్యకర్మచేసి ఉత్తమమైన మనఃస్థితిని సంపాదించుకొన్న జనులు, వారు మరణించేటప్పుడు, ఆ ఏకైక సద్వస్తువునే స్వర్గంగా భావించి, అందులో ఇంద్రుడు మొదలైన వారిని చూస్తారు. ఇంకా శ్రేష్ఠతర కర్మచేసి శ్రేష్ఠతర స్థితికి వచ్చినవారు, అదే సద్వస్తువును బ్రహ్మలోకంగా చూస్తారు. ఇక పూర్ణత్వాన్ని పొందినవారు భూలోకాన్నీ చూడరు; దేవతాలోకాన్ని చూడరు; ఏ లోకాన్నీ వారు చూడనే చూడరు; వారికి ఈ విశ్వమంతా అదృశ్యమైపోతుంది. దాని చోట, బ్రహ్మం ఒక్కటే నిలుస్తుంది.
ఈ బ్రహ్మమును మనం తెలిసికోగల్గుతామా? సంహితలోగల అఖండవస్తువుయొక్క వర్ణననుగూర్చి ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఆంతర్యంలోగల అఖండతత్త్వంయొక్క అంటే రెండవపక్షంయొక్క దర్శనం చేద్దాం. మొదటిది అఖండత్వపు భౌతిక వర్ణన. రెండవది భావరూపమైన అఖండత్వమే. మొదట ఆ అఖండతత్త్వాన్ని భావరూపమైన భాషలో వర్ణించే ప్రయత్నం జరిగింది. ఇదిగో, ఈ ప్రపంచం కనిపిస్తోంది. దీన్ని బ్రహ్మమే అని ఒప్పుకొన్నా, దీన్ని మనం గ్రహింపగల్గుతామా? “నేతి! నేతి” (లేదు, లేదు). ఈ విషయాన్ని మీరు విస్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ సందేహం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. ఇది బ్రహ్మం అయితే దీన్ని మనం గ్రహించడమెలా? “విజ్ఞాతారమరే కేన విజానీయాత్” (జ్ఞాత దేనివల్ల తెలిసికోబడగలడు?) తెలిసికొనేవాడు. తెలిసికోబడటమెలా? కన్ను అంతటినీ చూడగల్గుతుంది. అది తన్నుతాను చూచుకోగలదా? మీరీ విషయాన్ని బాగా జ్ఞప్తినుంచుకోవాలి. ఇందొక పెద్దచరిత్ర ఉంది. మీపైని వచ్చిపడుతున్న పాశ్చాత్య వ్యామోహాలన్నీ “ఇంద్రియ జ్ఞానాన్ని మించింది మరేమీ లేదు” – అనే ఏకైకసూత్రం మీద తమ ఆధ్యాత్మిక భావాలను నిర్మిస్తున్నాయి. ప్రాచ్యఖండంలో మన వేదాల్లో, ఈ జ్ఞానం వస్తువుకంటె, తక్కువదే. ఎందుకంటే, అది సర్వదా పరిమితినే సూచిస్తోంది. మీరొక విషయాన్ని తెలిసికోగోరిన తక్షణమే, దానికి మీ మనస్సు హద్దుపెడుతోంది. ముత్యపుచేప ముత్యాన్ని చేసే సాదృశ్యం జ్ఞప్తికి తెచ్చుకొని, జ్ఞానమంటే పరిమితి అనీ, ఒక వస్తువును పోగుచేయడమనీ, దాన్ని మీ ఎరుకలోనికి తెచ్చుకోవడమనీ, అంతేకానీ దాన్నంతా సమగ్రంగా తెలిసికోవడం కాదనీ గ్రహించండని వేదాలు చెబుతున్నాయి. సమస్త జ్ఞాన విషయమునా ఈ మాటే సత్యం. అఖండతత్త్వం విషయంలోమాత్రం దీని సత్యం కొరవడుతుందా? సమస్త జ్ఞానానికి లక్ష్యమైన బ్రహ్మమునకు నీవు పరిమితి పెట్టగలవా? సాక్షి అయిన వానికి ఎవరు లేనిదే జ్ఞానం కలుగదో అటువంటద్రష్టకు, ఎవనికి గుణాలు లేవో అలాంటి పరమాత్మకు, ఈ విశ్వమంతటికీ సాక్షి అయిన వానికి మన ఆత్మలలోని సాక్షికి, ఎలా అవధులు పెట్టగల్గుతావు? నీవు, వానిని తెలిసికోవడమెలా? నీవు వానిని ఎలా బంధించగలుగుతావు? ఈ సమస్తమూ, ఈ బ్రహ్మాండమంతా అలాంటి వెర్రిప్రయత్నంగా ఉంది. ఈ అఖండాత్మ తన ముఖాన్ని చూచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. అత్యల్పజీవులు మొదలు, అత్యుత్తమ దేవతలవరకు ఆ పరమాత్మను ప్రతిబింబింపజేసే అద్దాలలాంటివి. ఆ పరమాత్మ వీటితో తృప్తిపడక మానవదేహంలో చేరి అదికూడ ఖండంలో ఖండమని, అంతా సొంతమే అనీ, ఇలాంటి ఖండ వస్తువులలో అఖండతత్త్వంయొక్క స్వరూపం వ్యక్తం కాజాలదనీ తెలిసికొంటున్నాం. అంతట తిరుగు ప్రయాణం ప్రారంభమవుతోంది. దీన్నే త్యాగం, వైరాగ్యం అంటున్నాం. “ఇంద్రియాలనుండి వెనుకకు మరలండి; వెనక్కి తిరిగిపోండి; ఇంద్రియాల వైపునకు పోవద్దు” అనడమే వైరాగ్యం యొక్క హెచ్చరిక! సర్వ నీతిధర్మాల హెచ్చరిక ఇదే! సర్వక్షేమాన్ని కలిగించే హెచ్చరిక ఇదే. ఏలన మన మతం ప్రకారం, ఈ జగత్తు తపశ్చర్యలో అనగా వైరాగ్యంలో ప్రారంభమవుతోంది. మీరు క్రమంగా మరలిపోయిన కొద్దీ, ఆయా స్వరూపాలు మీ ఎదుట ప్రత్యక్షమవుతూంటాయి. వాటినన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా, నెట్టివేసికొంటూ నీవు నీవై, స్వస్వరూపాన నిలుచువరకు సాగిపోతావు. ఇదే మోక్షం, ముక్తి.
ఇందలి భావాన్ని మనం అర్థం చేసుకోవలసివుంది. “విజ్ఞాతారమరే కేనవిజానీయాత్” (అంటే తెలిసికొనేవానిని తెలిసికోవడం ఎలా?) తెలిసికొనేవాడు తెలియబడజాలడు. ఏలంటారా? తెలిసికొనేవాడు తెలిసికొనబడేలాగయితే, అతడు తెలిసికొనేవాడు కాజాలడు. ఒక అద్ధంలో నీ కళ్ళను నీవు చూసుకొనేట్లయితే, ఆ ప్రతిబింబం నీ కళ్ళు కాజాలదు. అది వేరొకటిగా ఉంటుంది. కేవలం ప్రతిబింబంగానే ఉంటుంది. అలాగైతే ఈ ఆత్మ, ఈ అఖండవిశ్వాత్మ నీ స్వస్వరూపం. కేవలం సాక్షిగావుంటే దానివల్ల లాభమేమి? మనలాగా, అది జీవించజాలదు. ఇటు, అటు తిరుగజాలదు. ప్రపంచాన్ని అనుభవించలేదు. ప్రజలు ఈ సాక్షి ఎలా అనుభూతిని పొందగలదో అర్థం చేసుకోజాలకున్నారు. ఓహో! హిందువులైన మీరు ఈ సిద్ధాంతాన్నిబట్టి సాక్షులుగా ఉన్నామంటే స్థాణువులైపోతారు. ఎందుకూ కొరగాని వారౌతారని ఆక్షేపణ వస్తున్నది. మొట్టమొదట సాక్షే అనుభవించగలవాడని తెలిసికోండి. ముష్టియుద్ధం జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొనేవారా లేక వెలుపలనుండి చూస్తున్నవారా, ఆ యుద్ధంవల్ల ఆనందాన్ని పొందేది? జీవితంలో దేనిపట్లనైనా నీవు సాక్షిగా ఉండేకొద్దీ అంత అధికాధికంగా దాని ఆనందాన్ని పొందగలుగుతావు. ఇదే ఆనందం. కాబట్టి నీవే జగత్తుకు సాక్షివైనప్పుడే అఖండానందం నీది కాగలదు. అప్పుడే నీవు ముక్తపురుషుడవవుతావు. సాక్షిగా ఉండేవాడు మాత్రమే ఏ కోరికాలేక స్వర్గానికి పోవాలనే సంకల్పం సైతం లేక, కీర్తిని గూర్చిన ఆపేక్షలేక అపకీర్తిని గూర్చిన భయంలేక పనిచేయగలడు. సాక్షి ఒక్కడే ఆనందం అనుభవించగలడు. వేరొకడు అలా అనుభవించలేడు.
నైతికపక్షంయొక్క విచారణకు దిగినప్పుడు అద్వైతంలోని ఆధ్యాత్మిక పక్షానికీ, నైతిక పక్షానికీ మధ్య ఒక విచిత్ర విషయం తలచూపుతోంది. అదే మాయాసిద్ధాంతం. అద్వైత సిద్ధాంతంలోని ఈ ఒక్కొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. వివరించి తెలుపడానికి నెలలు పడుతుంది. కాబట్టి నేను వాటిని కొద్దిగా ప్రస్తావించి సాగిపోతే, మీరు క్షమింతురుగాక! అన్ని యుగాల్లోను, ఈ మాయాసిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం చాలాకష్టంగా ఉండింది. అది నిజంగా సిద్ధాంతమే కాదని, నేను మీకు కొద్ది మాటలలో చెబుతాను. అది దేశకాల నిమిత్తములు అంటే స్థలం, సమయం, కారణం అనే మూడు భావాల సమ్మేళనం. ఈ స్థలం, కాలం, కారణం అనేవానినే నామరూపాలుగా మార్చి వ్యవహరిస్తారు. సముద్రంలో ఒక అల లేచిందనుకోండి. ఆ అల దాని ఆకారంలోను, పేరులోను మాత్రమే ఆ సముద్రం నుండి వేరుగా ఉంటుంది. ఆ అల లేనిది ఆ ఆకారంకానీ, ఆ పేరుగాని కలుగజాలవు. అవి తరంగంతో కలిసి మాత్రమే నిలువగలవు. ఆ తరంగం (అల) అణగిపోవచ్చు. అప్పుడు ఆ అలలో ఆరోపించబడిన నామరూపాలు నాశనమైపోతాయి. కాని, అందులోని నీరుమాత్రం నిలిచేవుంటుంది. అదే తీరున నీకూ, నాకూ మధ్య సర్వ జంతువులకు, నరునికీ మధ్య దేవతలకు, మానవులకూ మధ్య భేదాన్ని కల్పించేది ఈ మాయే! నిజమాలోచిస్తే, ఈ ఆత్మను లక్షలకొద్దీ జీవులలో పట్టుపడేలా చేసేది ఈ మాయే! ఈ జీవులను నామరూపాలద్వారా, మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది. ఈ మాయను వదిలేసి, ఈ నామరూపాలను జారవిడిచితివంటే, ఈ భేదమంతా పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు నీవు నీ స్వరూపంతో ఉంటావు. ఇదే మాయ.
ఇది ఒక సిద్ధాంతం కాదని మళ్ళీ చెబుతున్నాను. ఇది యథార్థమే! ఈ బల్ల “ఉన్నది” అని ప్రత్యక్షనాది అన్నప్పుడు ఈ బల్లకు ఒక స్వతంత్రమైన సొంత ఉనికి ఉందనీ, దాని ఉనికి ప్రపంచంలో ఇంక దేని ఉనికి మీదా ఆధారపడివుండదనీ, ఈ విశ్వమంతా నాశనమై శూన్యంలో కలిసిపోయినా, ఈ బల్ల ఇప్పుడు ఉన్నట్లే నిలిచివుండగలదనీ వాని అభిప్రాయం. కొంచెం ఆలోచించి చూస్తే, అది అలావుండటం సాధ్యంకాదని నీకు తెలిసిపోతుంది. ఈ విషయ ప్రపంచంలో ప్రత్యంశం సాధారణమై, పరస్పరాధారం కలిగి, సానుబంధమై పరస్పరానుబంధం కలిగివుంటుంది. ప్రతిదాని ఉనికి మరొక దాని ఉనికిమీద ఆధారపడుతూంటుంది. విషయాలనుగూర్చి మనకు కలిగే జ్ఞానంలోను, మూడుమెట్లు లేక అంశాలున్నాయి. ప్రతివస్తుమా, ప్రత్యేకమై, తక్కిన అన్నిటినుండి వేరై ఉంటుందనుకోవడం మొదటిది. అన్ని అంశాలకు మధ్య సంబంధబాంధవ్యాలు ఉన్నాయని గ్రహించటం రెండవది. మనం అనేకంగా చూసే ఒకే వస్తువు ఉన్నదని గ్రహించటం మూడవది. భగవంతునిగూర్చి, పామరులకు కలిగే మొట్టమొదటి భావం, ఆ భగవంతుడు ఈ జగత్తుకు వెలుపల ఎక్కడనో ఉన్నాడని; అంటే భగవంతుని గూర్చిన భావన కేవలం మానవుని గూర్చిన భావనలాగా ఉంది. మానవుడు చేసేదాన్నే అతడూ చేస్తాడు. కానీ, ఎంతో అతిశయంగా శ్రేష్ఠతరంగా చేస్తాడు. అంతే. ఈ భగవద్భావన ఆసమంజసమనీ, అసంపూర్ణమనీ, ఎలా క్లుప్తంగా రుజువుచేయబడిందో చూశాం. ఒకేశక్తి సర్వత్రా వ్యక్తమవుతూంటుంది అనే భావం మరొకటి ఉంది. ఇది మనకు “చండి” లో కనిపించే సగుణబ్రహ్మం. ఈ సగుణబ్రహ్మం, సమస్త సద్గుణాలకు ఆధారుడని మీరు భావించే భగవంతుడు కాడు. దైవం, దయ్యం అనే ఇద్దరు దేవుళ్ళను మీరు పెట్టుకోరాదు. ఒక్కడిని మాత్రమే పెట్టుకొని అతనికే మంచివాడనీ, చెడ్డవాడనీకూడ చెప్పవలసి ఉంటుంది. ఒక్కని మాత్రమే పెట్టుకొని, అందువల్ల కలిగే కష్టసుఖాలను అనుభవించవలసిందే! తప్పదు. “ప్రతి జీవిలో శాంతిరూపంతో ఒప్పుతున్న ఓ దివ్యజననీ! నీకు నమస్కారం. ఓ మహాజననీ! అన్ని జీవులలోను నిర్మలరూపంతో వెలసిన నీకు వందనాలు” అని “చండి” ని ప్రార్థిస్తాం. భగవంతుని సర్వాకారుడని భావించడంవల్ల కలిగే ఫలాలన్నిటినీ మనం అంగీకరించి తీరాలి. ఇది అంతా ఆనందమయమైవుంది. ఓ గార్గీ! ఎక్కడెక్కడ ఆనందముందో అక్కడంతా పరమాత్మ ఉంటాడు. ఈ పరమాత్మను ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవచ్చు. ఇదిగో ఇక్కడ దీపముంది కదా? దీని సాయంతో నీవు ఒక బీదవానికి నూరు రూపాయలు ఎంచి ఈయవచ్చు. వేరొకడు దొంగసంతకం సృష్టి చేయవచ్చు. ఈ రెండు పనులు జరిగేటప్పుడు దీపం ఒకే రీతిగా ఉంటుంది. ఇది రెండవ దశ. భగవంతుడు సృష్టికి వెలుపలగాని, దాని లోపలగాని ఉండేవాడు కాడు అనడం మూడవదశ. భగవంతుడు ప్రకృతి, ఆత్మ, జగత్తు, అన్న విపర్యాయపదాలే. ఒకే భావం కలవే. నీవెన్నడూ రెండు వస్తువులను చూడటమే లేదు. తత్త్వశాస్త్ర సంబంధమైన శబ్దాలు నీకు భ్రాంతి గొలుపుచున్నాయి. నీవు ఒక శరీరమనీ, నీకొక ఆత్మ ఉందనీ, ఈ రెండును కలిసివుంటాయనీ నీవు మొదటనే భావించుకొంటున్నావు. అది ఎలా సాధ్యమవుతుంది? నీ మనస్సులో వివరంగా ఊహించిచూడు. తాను చైతన్యమని యోగికి తెలుసు. అతనికి శరీర భావన అదృశ్యమైపోతుంది. సామాన్యుడు, తాను ఒక శరీరాన్నని భావిస్తాడు. వానికి ఆత్మభావం స్ఫురించదు. ఏలంటే తత్త్వసిద్ధాంతంలో నరునికి ఒక శరీరం ఒక ఆత్మ, మొదలైన అనేక విషయాలు కలవనే భావం ఉంది. అందువల్ల అవన్నీ ఒకే కాలంలో గోచరించేవే అని నీవు భావిస్తావు. కాని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మాత్రమే గోచరించగలదు. నీకు స్థూలపదార్థం గోచరించేటప్పుడు, భగవంతునిగూర్చి మాటాడకు. నీవు కార్యాన్ని చూచేటప్పుడు, ఆ కార్యం మాత్రమే నీకు గోచరిస్తుంది. దాని కారణం నీకు కనిపించడం లేదు. నీవు కారణాన్ని చూడ్డంతోనే కార్యం అదృశ్యమైపోతుంది. అయితే ఈ జగత్తు ఎక్కడుంది? ఎవరు దీన్ని తొలగించి వేస్తారు?
“సర్వకాలం చైతన్యమై, ఆనందమయమై, సర్వాతీతమై, అసమానమై, సర్వగుణాతీతమై, సత్యయుక్తమై, ఆకాశాన్ని పోలి అపరిమితమై, నిరవయవమై, అవ్యయమై పరిపూర్ణమై వెలిగే బ్రహ్మం. ఓ ఋషీ! ఓ విద్వాంసుడా! సమాధిగతుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు.”
“ఎక్కడ ప్రకృతి వికారాలన్నీ అంతరించిపోయామో, ఎవనిని భావాతీత దశలో భావిస్తారో, అన్నిటితో ఎవడు సమానుడైనా తనకు సమమైనది లేనివాడో, ఎవడు పరిమితులకు అందనివాడో, ఎవడు మనలోని సత్తని చెప్పబడే దానికి సారభూతమైనవాడో, అట్టి పరిపూర్ణుడు అలాంటి బ్రహ్మం, ఓ ఋషీ! ఓ విద్వాంసుడా! సమాధిగతుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు.”
“జననమరణాలకు అతీతుడై ఏ అఖండుడు, అతులితుడు, మహా ప్రళయంలో పైని నీరు, క్రిందను నీరు, అన్ని వైపులను నీరు నిండి ఉండగా, ఆ నీటిమీద ఒక్క తరంగమేనీ, ఒక్క చిన్న అలయుకాన్పించని స్థితిలో నెమ్మదిగా మునిగిపోయే జగత్తులాగా, నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండగా సర్వదృశ్యాలు నాశనమై, దుష్టుల సాధువుల వాగ్వాదాలు, పోరాటాలు యుద్ధాలు తుదముట్టి అణగిపోతాయో, అట్టి బ్రహ్మం, ఓ ఋషీ! ఓ విద్వాంసుడా! సమాధిస్థుడైన జ్ఞాని హృదయంలో ప్రకాశిస్తూంటాడు” అని వేదాలు ప్రకటిస్తున్నాయి.
దీన్ని తెలుసుకునే దశ మీకు రాగలదు. అది వచ్చినప్పుడు ఈ ప్రపంచం అదృశ్యం కాగలదు.
ఈ బ్రహ్మం, ఈ సద్వస్తువు, తెలియబడనిదని తెలియపడజాలదని గ్రహించాం. కానీ ఇది అజ్ఞేయవాదం కాదు. నీవు ఆ బ్రహ్మమే అయివుండటం చేత వానిని వేరువానిగా ఎరుగుట మహాదోషం కదా? బ్రహ్మమంటే ఈ బల్లకాదనీ, అవుననీ తెలుసుకున్నాం. ఆ నామం, రూపం తీసివేయి. ఇక మిగిలే సద్వస్తువు ఆ బ్రహ్మమే. సమస్తంలోనుకల సత్యపదార్థం ఆ బ్రహ్మమే!
“నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే బాలుడవు. నీవే బాలికవు. నీవే ఊతకర్రపై ఊగులాడుతూపోయే వృద్ధుడివి. నీవే ఈ జగత్తు సర్వమూ” అనే ఇలాంటిదే అద్వైతభావన. మరి కొంత వినండి. వస్తువుల మూల తత్త్వాన్ని గురించిన వివరణం ఇందే ఉన్నట్లు తోస్తోంది. ఈ విషయంలోనే తర్కవాదాల శాస్త్ర జ్ఞానముల ధాటిని ఎదిర్చి, స్థిరంగా నిలువగలుగుతామని గ్రహించాం. ఇక్కడే హేతువాదానికి సుస్థిరమైన ఆధారం దొరుకుతుంది. అయినా భారతీయ వేదాంతి, దీనికి పూర్వమున గల దశలను నిరసించేవాడు కాడు.అతడు వెనుదిరిగి చూచి, వాటిని ఆశీర్వదిస్తాడు. అవి సత్యమే అని అతనికి తెలుసు. కాని, వాటిని అపసవ్యంగా చూచి అపసవ్యంగా వర్ణించటం తటస్థించింది. మాయ అనే అద్దంద్వారా చూడటంచేత వికారమై కనిపించినా, అవి అన్నీ ఆ ఒక్క సత్పదార్థమే; అన్నీ సత్యమే. సత్యేతరం కావు. పామరుడు ప్రకృతిబాహ్యునిగా చూసే వానినే, కొంచెం చదువుకున్నవాడు జగత్తులో అంతర్యామియై ఉన్నట్లు చూస్తాడు. ఆ బ్రహ్మమునే ఋషి, తన ఆత్మగా, జగత్స్వరూపంగాను గ్రహిస్తాడు. అంతా ఒకటే; ఒక్క తత్త్వమే. మాయామయమైన అద్దాల ద్వారా, వేర్వేరు దృక్పథాలనుండి భిన్నభిన్నములైన మనస్సులతో చూడటంవల్ల ఈ భేదమంతా కలుగుతోంది. అంతేకాదు. ఒక దృష్టి, మరొక దృష్టికి దారితీయాలి. శాస్త్రజ్ఞానానికి, సామాన్య జ్ఞానానికి మధ్యవున్న భేదమేమి? చీకటిలో ఉన్న నీవు వీథిలో పోతూంటే ఏదైనా, అసాధారణ విషయం జరిగితే, దానికి కారణమేమని ఆ దారినిపోయే ఒకడిని అడుగు. ఆ సంఘటన ఒక దయ్యంవల్ల కలుగుతోందని పదిమందిలో ఒకడైనా తప్పక చెబుతాడు. కారణాలను, కార్యాలకు భిన్నంగా వెలుపల కలవని దేవులాడటం అజ్ఞానుల స్వభావం కాబట్టి, అతడు సదా దయ్యాలను, భూతాలను చూస్తూంటాడు. ఒక రాయి క్రిందపడితే పామరుడు, ఏదైనా దయ్యమై, భూతమో దాన్ని పడవేసిందంటాడు. కాని శాస్త్రజ్ఞానం గల పురుషుడో, అది ప్రకృతి ధర్మంవల్ల, భూమ్యాకర్షణ స్వభావంవల్ల జరిగిందంటాడు.
ప్రకృతిశాస్త్రానికి, మతానికీ, సర్వత్రా కలిగే పోరాటం ఎలాంటిది? మతాలు బాహ్యప్రపంచంనుండి తెచ్చిపెట్టుకొన్న అనేక సమాధానాల బరువుతో క్రుంగిపోతున్నాయి. సూర్యుడు ఒక అధిష్ఠానదేవత వశంలో ఉంటాడు. చంద్రుడు మరొక అధిష్ఠానదేవత వశంలో ఉంటాడు. ఇలా అనంతమైన దైవతాలు ఏర్పడుతున్నారు. ప్రతి వికారం ఒక దేవతవల్ల కలుగుతోంది. ఈ దేవతలంతా ఆయా విషయాలకు వెలుపల ఉండేవారని అందరూ అంగీకరిస్తున్నారు. ఏదైనా విషయంయొక్క కారణంకోసం దాని స్వభావాన్నే పరిశీలించాలని ప్రకృతిశాస్త్రం చెబుతోంది. ఈ ప్రకృతి శాస్త్రం, ఒక్కొక్కమెట్టుగా పైకి ఎక్కిపోతున్న కొద్ది కారణాలను దేవతల, భూతాల చేతులలోనుండి లాగివేస్తున్నది. అద్వైత మతంకూడ, ఆధ్యాత్మికవిషయాల్లో అలాగే చేస్తున్నది. కాబట్టి అది అత్యంత శాస్త్రసమ్మతమైన మతమని చెప్పవచ్చు. ఈ జగత్తు విశ్వాతీతుడైన ఏ బ్రహ్మదేవునిచేత సృష్టించబడలేదు. ఇది బయట ఎక్కడో ఉండే, ఏ పెను భూతంయొక్క సృష్టీ కాదు. ఇది స్వయంగానే సృష్టియై, స్వయంగానే ప్రకాశించి, స్వయంగానే లయంపొందే ఒకే అఖండ సత్పదార్థం. అదే బ్రహ్మం, “తత్త్వమసి శ్వేతకేతో” (ఓ శ్వేతకేతూ! అది నీవే సుమా!) అని బోధించే ఈ అద్వైతమతం మాత్రమే శాస్త్రానుగుణమైన మతమని మనం గ్రహించగలం.
ఈ కాలంలో ఈ నవ్యభారతదేశంలోని మిడిమిడి చదువులు చదివినవారు. హేతువాదమనీ, తర్కమనీ, ఏమేమో ప్రగల్భాలు కొట్టడం రోజూ నేను వింటున్నాను. ప్రకృతిశాస్త్రాన్ని గూర్చి వారి ప్రగల్భాలు ఎలావున్నా మీలో అన్ని సంప్రదాయాలవారూ వచ్చి అద్వైతులైపోవ సాహసిస్తారనీ, బుద్ధభగవానునిలాగా “బహుజన హితాయ, బహుజన సుఖాయ” (అనేకుల క్షేమంకోసం, అనేకుల సుఖంకోసం) అంటూ, ఈ మతాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేస్తారనీ నేను ఆశిస్తున్నాను. మీరు అలా చేయకపోతే, మిమ్మల్ని పిరికివారిగా భావిస్తాను. మీరు మీ పిరికి తనాన్ని పోగొట్టుకోజాలకపోతే, మీరు మీ భయాన్ని సాకుగా చెప్పుకొంటే, అలాంటి సాకునే, ఇతరులపట్ల కూడ అంగీకరించండి. పాపం, విగ్రహారాధకులపై పడకండి. వారిని వెర్రి దైవాలని దూషించకండి. మీతో పూర్తిగా ఏకీభవించని ప్రతివానికీ బుద్ధులు చెప్పడానికి పూనుకోకండి. మీ మట్టుకు మీరే పిరికివారై ఉన్నట్లు మొట్టమొదట తెలిసికోండి. సంఘాన్ని చూసి మీరు భయపడితే, మీ పూర్వమూఢాచారాలగూర్చి మీరే అంతగా భయపడితే, పామరజనులు ఈ మూఢవిశ్వాసాలను గూర్చి ఎంతగా భయపడతారో, అవి వారిని ఎంతగా బంధించి పడవేస్తున్నాయో, విచారించండి. అద్వైతి అభిప్రాయాలిలా ఉంటాయి. అందరినీ ఆదరణతో చూడండి. ప్రపంచమంతా కేవల సిద్ధాంతంలోనే కాక, అనుభవంలోను అద్వైతభావమగుగాక! అని నేను భగవంతుని వేడుకొంటాను. అంతపైకి మనం పోజాలకపోతే, దాని క్రిందమెట్టు వరకైనా పోదాంగాక! పామరులను ఆదరణతో చేయిపట్టుకొని వారు ఒక్కొక్క మెట్టే ఎక్కిపోయేలా సాహాయ్యం చేయుదంగాక! భారతదేశంలోని మతయాత్ర అంతా పురోగమనమే అని బాగా గ్రహించండి; చెడునుండి మంచికి పోతున్నామని గ్రహించండి! మనం అల్ప శుభం నుండి మరింత శుభానికి చేరుతున్నామని తెలుసుకోండి!
నీతి ధర్మాన్నిగూర్చి మరికొంత చెప్పవలసివుంది. మన పిల్లలు ఎవరి నుండి నేర్చుకొంటారో, భగవంతునికే ఎరుక అద్వైత మతం ప్రజలను అవినీతిపరులను చేస్తోందని విని చెలరేగి మాటాడుతున్నారు. మనమందరం బ్రహ్మమే అయితే, నీతితో అసలు పనేముంది? బడితె కర్రతో తప్ప క్రమమాగ్రంలో నడవని పశువు చేయవలసిన వాదమిది. మీరలాటి పశువులు కావడంకంటె, ఎందులోనైనా పడి మరణించడం మేలు. ఎప్పుడూ బడితె కర్రకు లోబడి నడవగోరే మానవులుగా జీవించడంకంటె మరణించడమే ఉచితం. కర్ర తొలగినంతనే మీరు రాక్షసులైపోతారా? అలా అయితే మిమ్మల్ని హతం చేయవలసిందే! గత్యంతరం లేదు. మీరు నిరంతరం బడితె పోటులతోను, మొట్టికాయలతోను, బ్రతుకవలసిన వారయితే మీకు మార్గాంతరం లేదు. మీకెన్నటికీ మోక్షం లేదు.
ఇక రెండవ విషయం. అద్వైతం మాత్రమే నైతిక వివరణను బోధించగలదు. ప్రతిమతం పరోపకారం చేయడం నీతికంతకు సారమని బోధిస్తోంది. “స్వార్థరహితంగా వర్తించండి” అని ప్రతిదినం అంటాడు. “ఎందుకు? నేను ఎందుకు నిస్వార్థాన్ని విడవాలి?” అని ప్రశ్నిస్తే, ఏదో దేవత అలా చెప్పిందంటారు. “ఆ దేవతను నేను సరకు చేయను” అంటావు. అప్పుడు ఏవో కొన్ని శాస్త్రాలు అలా విధిస్తున్నవంటారు. అప్పుడు “శాస్త్రాలలో ఉండుగాక! అవి అలాగే చెప్పుగాక, నేను లెక్కచేయను. అవి ఏమి చెప్పితే నాకేమి?” అంటావు. అంతటితోసరి. ఎవని మార్గం వానిదే. వెనుకపడినవాడు ఇడుమల పాలవుతాడు. ప్రపంచంలోని నీతి అలా ఉంది. కనీసం చాలామంది అలా ఉన్నారు అనవచ్చు. నేనెందుకు నీతిపరుడుగా ఉండాలి? కారణమేమి? అని ప్రశ్న వస్తే, గీతలో చెప్పబడినట్లు నీవు సత్యాన్ని గ్రహిస్తే తప్ప దానికి వివరణ చెప్పజాలవు.
“సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం ।
నహినస్త్యాత్మ నాత్మానం తతోయాతి పరాంగతిమ్ ॥”
(ఆత్మను సర్వత్ర సమంగా చూచే యోగి ఆత్మను ఆత్మచేత హింసించుకోజాలడు. అతడు పరమగతినే పొందగల్గుతాడు.) నీవు ఎవరిని హింసించినా, నిన్ను నీవే హింసించుకొన్నవాడవవుతావు. వారంతా నీవే. అద్వైత బోధవల్ల ఇది తెలుసుకో! నీకు తెలిసినా, తెలియకున్నా, అన్ని చేతులతో నీవు పనులు చేస్తూనేవున్నావు; అన్ని పాదాలతోను నీవు నడుస్తున్నావు. రాజప్రాసాదంలో భోగించే రాజువు నీవే. దీనుడవై వీథులలోని దుమ్ములోపడి దుఃఖీంచే వాడివీ నీవే. నీవు పండితులలో, పామరులలో కూడా ఉన్నావు. బలవంతులలోను, బలహీనులలోనుకూడ ఉన్నావు. దీన్ని గ్రహించి సానుభూతిపరుడివికా. మనం ఇతరులకు ఏల అపకారం చేయకూడదో, ఆ కారణమిదే. అందువల్లే నేను ఆకలితో బాధపడుతున్నప్పటికీ, ‘వేలకొద్దీ నోళ్ళతో తినేవారున్నారు; ఆ నోళ్ళన్నీ నావే అని భావించి నేను నిర్విచారంగా ఉండగలను. కాబట్టి నా గతి ఏమవుతుందా అనిగానీ, నాకున్నది ఏమైపోవునా? అని కానీ నేను ఆతురపడను. ఏలంటే ఈ జగమంతా నాదే. నేను అనంతానందాన్ని అనుభవిస్తున్నాను. నన్నుగానీ, ఈ జగత్తునుగానీ ఎవరు చంపగలరు? నీతి అంతా ఇందులో ఉంది. ఈ అద్వైత సిద్ధాంతం మాత్రమే నీతికి కారణాన్ని ఇలా విశదం చేస్తోంది. ఇతర మతాలూ నీతిని బోధిస్తాయి కాని, కారణాన్ని వివరింపజాలవు. ఇంతవరకు వివరణమేమో తెలుసుకొన్నాం.
సరే, ఇందువల్ల కలిగే లాభమేమి? ఇది బలవర్ధకం. నీవు ప్రపంచం మీద ప్రసరింపజేసిన సమ్మోహనమనే ముసుగును తొలగించు. దుర్బలతను కలుగుచేసే సంకల్పాలనుకానీ, మాటలను కానీ, మానవకోటిలో ప్రవేశపెట్టకు. పాపాలన్నీ, అనర్థాలన్నీ, ‘దుర్బలత’ అనే ఒక్కమాటలో ఇమిడివున్నాయి. అన్ని దోషకార్యాలకు, ప్రేరణశక్తి దుర్బలతే. స్వార్థపరతకంతకు మూలం దుర్బలతే. ఇతరులకు అపకారం చేయడానికి నరులను ప్రేరేపించేది దుర్బలతే. సత్యాన్ని కప్పిపెట్టి కపట వేషాలను ధరించేలా చేసేది దుర్బలతే. తమ స్వస్వరూపాలను అందరూ గ్రహింతురుగాక! అందరు “సో-హం” అంటూ దివారాత్రాలు తమ స్వస్వరూపాన్ని ధ్యానింతురుగాక! ‘అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి’ అంటూ ఈ బలవర్దకమైన భావాన్ని తల్లిపాలతో ప్రతివారు త్రాగుదురుగాక! “శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసి తవ్యః” (మొట్టమొదట దీన్నిగూర్చి వినాలి; తర్వాత దీన్నిగూర్చి మననం చేయాలి.) ఆ విచారణనుండి, అలాంటి హృదయం నుండి ప్రపంచమెన్నడూ కనీవినీ ఉండని మహాకార్యాలు బయలుదేరగలవు. ఓహో! ఈ అద్వైతమతాన్ని కొందరు ఆచరణయోగ్యం కాదంటున్నారు. అంటే స్థూలదృష్టికి ఇది ఇంకా వ్యక్తంకాలేదని అర్థం. కొంత వరకు ఆ మాట సత్యమే!
“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేకాక్షరం పరం ।
ఓమిత్యేకాక్షరం జ్ఞాత్వా యో మదిచ్చతి తస్య తత్ ॥”
(ఓం అనే ఏకాక్షరం బ్రహ్మం, ఓం పరమ సత్యపదార్థం. ఈ ఓం యొక్క తత్త్వం తెలిసినవానికి కోరినదంతా లభిస్తుంది.) ఓహో! అందువల్లనే ఈ ఓం యొక్క రహస్యాన్ని అంటే ఆ ఓంకారం నీవే అనడం మొదటే తెలుసుకో. ఈ ‘తత్త్వమసి’ అనే మహావాక్యంయొక్క భావం గ్రహించు. అప్పుడు నీవేమి కోరితే అది తప్పక నీ కడకు వస్తుంది. నీవు లౌకిక సంపదను మిక్కిలిగా కోరుకొంటే నీవు అలాంటి వాడవని విశ్వసించు. నేను ఒక చిన్ని నీటిబుడగగా ఉండవచ్చు. నీవు పర్వతమంత ఎత్తైన తరంగం కావచ్చు. అయినా మనకిరువురకు ఆధారక్షేత్రంగా ఆ అనంత మహాసముద్రమే కలదని గ్రహించు. అఖండ బ్రహ్మమే మన శక్తికీ, మన బలానికీ ప్రధానమైన అవ్యయ ఖని. అందులోనుండి చిన్న బుడగనైన నేనూ, ఉత్తుంగ పర్వత సమతరంగమయిన నీమా, మన ఇష్టంవచ్చినంత శక్తిని తీసుకొని వినియోగించుకోవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసం కుదుర్చుకోవడం అద్వైతమతంలోని రహస్యం! ఆ తర్వాత నీవు ఎలాంటి నమ్మకమైనా పెట్టుకొందువు గాక! ప్రపంచచరిత్రపై అచంచలమైన ఆత్మవిశ్వాసం కల జాతులు మాత్రమే శక్తివంతాలైన మహాజాతులుగా వృద్ధిపొందాయి. ప్రతి జాతి చరిత్రలోను, ఆత్మవిశ్వాసం పూనిన వ్యక్తులు మాత్రమే, గొప్పవారు, బలాఢ్యులు కాగలరని తెలుసుకోండి! ఇక్కడ భారతదేశానికి ఒక ఆంగ్లేయుడు గుమాస్తాగా వచ్చాడు. డబ్బు లేకపోవడం చేతను, ఇంక ఇతర కారణాలచేత, అతడు తన తలకు గురిపెట్టి రెండుసార్లు తుపాకితో కాల్చుకొన యత్నించాడు. రెండుసార్లు అతని ప్రయత్నం విఫలంకాగా, వానికి ఆత్మవిశ్వాసం కుదిరింది. అతడు తాను మహాకార్యాలు చేయడం కోసం, జన్మించానని నమ్మాడు. ఆ పురుషుడే ఈ సామ్రాజ్య నిర్మాత అయిన క్లైవు. అతడే ఫాదరీల బోధలు నమ్మి, యావజ్జీవం దీనుడై “ఓ ప్రభువా! నేను దుర్బలుడిని. నేను హీనుడిని” అంటూ దేవురింపసాగితే, ఎక్కడుండేవాడు? బహుశా పిచ్చివాండ్ర చికిత్సాలయంలో పడివుండేవాడు. ఇలాంటి పిచ్చిబోధలవల్ల మీరూ వెర్రివారై పోతున్నారు. ఇట్టి దౌర్బల్యంతో కూడిన బోధలు చేయయంవల్ల, మానవజాతిని నాశనం చేసే ఘోరానర్థాలు ప్రపంచం అంతటా వాటిల్లుచుండటం నాకు తెలుసు. ఈ విధంగా మన పిల్లల్ని పెంచుతున్నాం. వీరు సగం పిచ్చివారు కావడంలో ఆశ్చర్యమేముంది?
ఈ బోధ అనుష్ఠానపరుల పక్షాన చేయబడింది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పూనుకొని మీకు లౌకిక సంపద కావాలంటే, దానికోసం పాటుపడండి. అది మీకు లభిస్తుంది. మీరు మహామేధావంతులు కాగోరితే బుద్ధిక్షేత్రంలో పనిచేయండి. అప్పుడు మీరు మహామేధావులు కాగలరు. మీరు మోక్షాన్ని కోరితే, ఆధ్యాత్మికక్షేత్రంలో సాధన సాగించండి. అప్పుడు మీరు ముక్తులై నిర్యాణంలో ప్రవేశించి నిత్యానందం అనుభవిస్తారు. కానీ, ఈ అద్వైతమతంలో, ఒక లోపం సంభవించింది. దాని సాధన ఆధ్యాత్మిక క్షేత్రంలో మాత్రమే సాగించబడి, ఇతర క్షేత్రాలు అశ్రద్ధ చేయబడ్డాయి. ఇప్పుడు మీరు, దాన్ని పూర్ణంగా ఆచరణయోగ్యం చేయవలసిన సమయం వచ్చింది. అది ఇంకా రహస్యంగా ఉండరాదు. అది ఇంకమీదట గుహలలోను, అడవులలోను, హిమాలయాలలోను, సన్యాసుల దగ్గర మాత్రమే నిలిచిపోరాదు. అది ప్రజల అనుదిన జీవిత క్షేత్రానికి దిగిరావాలి. మహా సౌధాల్లో రాజులు దాన్ని అనుష్ఠించాలి. గుహలలోని సన్యాసులు, గుడిసెలలోని పేదలు, వీథులలోని యాచకులు అందరూ సర్వత్ర, సర్వదా దాన్ని ఆచరణలో పెట్టాలి. కాబట్టి నీవు స్త్రీవైనా, శూద్రుడివైనా భయపడవద్దు. ఏలన, ఈ మతాన్ని స్వల్పంగా ఆచరించినాకూడ అత్యధికమైన మేలు చేకూరగలదని శ్రీకృష్ణభగవానుడు చెప్పుతున్నాడు.
కాబట్టి ఆర్యసంతానములారా! సోమరులుగ కూర్చోకండి! లెండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు ఆగకండి! ఈ అద్వైత మతాన్ని అనుష్ఠానంలో పెట్టవలసిన కాలం వచ్చింది. దీన్ని స్వర్గంనుండి భూమికి తీసుకొనివద్దాం! ఇదే నూతనధర్మప్రచారం. అదిగో వినండి. మన పూర్వులు, దీనిని స్వర్గంనుండి భూమికి తీసుకొనిపోండని మనల్ని ఆదేశిస్తున్నారు. మీ బోధలు ప్రపంచమంతటా వ్యాపించుగాక! అవి సంఘశరీరంలో ప్రతినాళంలోకి, చొరబారుగాక! అవి ప్రతివాని సమిష్టి సంపదై ఉండనీ! అవి మన జీవితాలతో ఐక్యానుసంధానం పొందాలి. అవి మన రక్తనాళాలలో ప్రవేశించి ప్రతి రక్తబిందువుతో కలిసి ప్రసరించునుగాక!
ఓహో! అనుష్ఠానవేదాంతులుగా, అమెరికనులు మన కన్న గొప్పవారని విని, మీరు ఆశ్చర్యపడవచ్చు. కానీ అది నిజం. నేను న్యూయార్కు నగరంలో సముద్రతీరంలో నిలుచుండి వేర్వేరు దేశాలనుండి వలసవచ్చే ప్రజలను చూస్తూండేవాడిని. అణగద్రొక్కబడి, పీల్చి పిప్పిచేయబడి, నిరాశాహతులై, మోమెత్తి మనుష్యుల వంక చూడటానికి జంకుతూ, చిరిగి పేలికలైన నాలుగు గుడ్డల చిన్నమూటే తమ సర్వస్వంగా అనేకులు ఆ దేశంలో ప్రవేశిస్తారు. పోలీసువాడు కన్పించగానే వారు భయపడి కాలిబాటను విడిచి, రెండవ ప్రక్కకు పరుగిడబోతారు. చూడండి! ఆరు నెలలలో, ఈ పురుషులే సొగసైన దుస్తులు ధరించి, ఠీవిగా నడుస్తూ, ప్రతివాని ముఖంవంక నిర్భయంగా చూస్తూ సంచరిస్తారు! ఈ అద్భుత పరివర్తన ఎలా కలిగింది? ఆర్మేనియాదేశంనుండో, మరెక్కడినుండో, ఒకడు అమెరికాకు వస్తాడనుకోండి. స్వదేశంలో అతడు పోలికే లేకుండా పోయేంతగా అణగత్రొక్కబడి ఉంటాడు. అతడు బానిసగా జన్మించాడని ప్రతివారు వానికి అక్కడ బోధించి ఉంటారు. యావజ్జీవమూ అతడు అలాంటి దీనదశలో ఉండటానికే పుట్టాడని చెప్పివుంటారు. అతడు కదలినా, మెదలినా, కాలరాచివుంటారు. “ఓయి బానిసా! నీవు బానిసవై పుట్టావు. నీవు బానిసగా ఉండవలసిందే! నీవు ఆశాశూన్యుడివై జన్నించావు. నీవు నిరాశాహతుడివిగా ఉండిపోవలసిందే!” అని అక్కడ ప్రతిదీ వాడికి తెలిపివుంటుంది. “నీకు ఆశలులేవు. నిరాశుడవై నీచదాసుడివై ఉండిపోవలసిందే!” అని అక్కడి గాలిసైతం దశదిశలనుండి వాని చెవులలో నూరిపోసివుంటుంది. బలవంతులు వాడిని పీడించి, ప్రాణాల్ని విసిగించి ఉంటారు. కానీ, అతడు న్యూయార్కు నగరవీథులలో అడుగుపెట్టిన వెంటనే మాన్యరీతిని దుస్తుల ధరించిన ధీరపురుషుడొకడు, ఎదురుగా వచ్చి ఆదరణసూచకంగా చేతులు కలిపి గౌరవిస్తాడు. అతడు అందంగా దుస్తులను ధరించివున్నా, ఇతడు పాతపేలికలను ధరించి ఉన్నా, భేదమేమీ చూపడు. ఇతడు ఇంకొక అడుగు సాగిపోయి, ఒక విందుల బసను చూస్తాడు. గొప్పగొప్పవారు బల్లలముందు కూర్చుని ఫలహారాలు తీసుకొంటూవుంటారు. అదే బల్లదగ్గర వీనికికూడ ఒక ఆసనం చూపి, యజమాని ఆహ్వానిస్తాడు. ఇతడు అటుఇటు సంచరించేటప్పుడు, అతనికొక నూతన జీవనం ప్రత్యక్షమవుతుంది. తానుకూడ మనుష్యులలో ఒకడై మెలగగల ప్రదేశం వాని కళ్ళకు కనిపిస్తుంది. అతడు వాషింగ్టన్ నగరానికిపోయి అక్కడ అమెరికన్ ప్రెసిడెంటుతో చేతులు కలుపవచ్చు. అనేక దూరగ్రామాలనుండి వచ్చిన ప్రజలను, కృషీవలులను, చింపిరిగుడ్డలు కట్టిన వారిని అమెరికా అధ్యక్షుడు చేతులు జోడించి గౌరవించడం చూడవచ్చు. ఆ తర్వాత వానిపైగల మాయాపటం జారిపోతుంది. అంతవరకు సమ్మోహంలో చిక్కి బానిసతనంలోను దుర్బలతలోను మ్రగ్గుతున్న అతడు ఇప్పుడు బ్రహ్మమై నిలుస్తాడు. ఒకసారిగా మేల్కొంటాడు. ఇకలేచి మానవలోకంలో తానూ ఒక వ్యక్తినే అని గ్రహిస్తాడు. అయ్యో, ఈ మన దేశంలోనో, ఇది వేదాంతానికి జన్మక్షేత్రమైనా కూడ మన జనసామాన్యం యుగయుగాలనుండి సమ్మోహంలో చిక్కి పడివున్నారు! వారిని తాకితేనే మైల సోకుతుంది; వారితో కలిసి కూర్చుంటేనే అశుచి పైన పడుతుంది. ఇలా, నిరాశాహతులై వారు పుట్టుతున్నారు. ఆశారహితులుగానే జీవితాంతం ఉండిపోతున్నారు. తత్ఫలంగా, వారు ఇంకా పతితులైపోతున్నారు. మానవుడెంత అధోగతిపాలు కాగలుగుతాడో, అంత అధోగతిని పొంది, అధమాధమస్థితికి వచ్చాడు. మానవులై పుట్టి పశువులతో కలిసి నిదురించవలసిన గతి ప్రపంచంలో మరేదేశంలో గోచరిస్తుంది? ఇలాంటి దుస్థితినిచూచి, ఇతరులను దూషించకండి! పామర జనులలాగా పొరపడకండి. ఫలితమా, ఇక్కడే ఉంది. దాని కారణంకూడ ఇక్కడే ఉంది. దోషమంతా మనదే. లేచి నిలుచోండి. ధైర్యంపూనండి! దోషాన్నంతా మీ భుజాలమీదనే వహించండి. ఇతరులను తిడుతూ వారి మీద దుమ్మెత్తిపోస్తూ కాలం గడపకండి! మీకు బాధలు తెచ్చిపెట్టిన దోషాలకన్నిటికీ మీరే కారకులని ఒప్పుకోండి!
లాహోరు యువజనులారా! ఈ విషయాన్ని బాగా గ్రహించండి. పరంపరగా వస్తున్న ఈ జాతీయ మహాదోషం, మన భుజాలపై ఉంది. మనకు ఆశలు కనిపించడం లేదు. మీరు వేలకొద్దీ సమాజాలు పెట్టవచ్చు. ఇరవైవేల రాజకీయ సంఘాలను స్థాపించవచ్చు. ఏభైవేల సంస్థల్ని నెలకొల్పవచ్చు. కానీ సమిష్టిని అందరిని గురించి సంకల్పం చేయగల ఆ సానుభూతి, ఆ ప్రేమ, ఆ విశాల హృదయం, మీలో కొరవడి ఉన్నంత కాలం, వీనివల్ల ప్రయోజనం ఉండదు. బుద్ధుని హృదయం మళ్ళీ భారతదేశంలో ప్రత్యక్షమయ్యేంతవరకు, శ్రీకృష్ణభగవానుని వాక్కులు అనుష్ఠానంలోకి వచ్చేవరకు, మనకు ఆశలేదు. మీరు యూరపియన్లను, వారి వ్యవస్థలను, వారి మహాసభలను ఎన్నేని అనుకరింతురుగాక! కాని నా కళ్ళారా చూచిన ఒక కథ చెబుతాను వినండి. ఇక్కడ యురేషియనులనబడే కొందరు, బర్మీయులను కొందరిని లండన్ నగరానికి తీసుకొనిపోయిరి. వారు లండన్‌లో ఈ బర్మీయులను ప్రదర్శించి బాగా డబ్బు సంపాదించుకొన్నారు. అంతట వీరిని యూరప్ఖండానికి తీసుకొనిపోయి, మీగతి మీరు చూచుకోండని అక్కడ వదలేశారు. పాపం, వీరికి యూరప్ భాషలలో ఒక్కమాటైనా తెలీదు. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ఆంగ్లేయ ప్రతినిధి వీరిని లండన్ నగరానికి పంపాడు. అక్కడ వీరికి తెలిసినవాళ్ళు ఎవరూలేక, ఆ మహానగరంలో నిరాధారులై ఉన్నారు. అంతట, ఒక దొరసాని వీరినిగూర్చి తెలిసికొని, ఈ బర్మాదేశీయులను తన ఇంటికి తీసికొని వెళ్ళింది. తన బట్టలను కట్టుకోవడానికి ఇచ్చింది. తన పడకను, అన్నిటినీ వారికి వాడుకోవడానికిచ్చింది. ఈ విషయాన్నిగూర్చి వార్తాపత్రికలకు వ్రాసింది. చూడండి! మరునాడే, ఆ జాతి అంతా నిద్రనుండి మేల్కొనినట్లయింది. ధనం ప్రవాహంగా వచ్చిపడింది. అంతట వీరికి సహాయం దొరికింది. వీరు బర్మా చేరగలిగారు. ఈ విధమైన సానుభూతిపై వారి రాజకీయవ్యవస్థలు, ఇతర వ్యవస్థలు నిర్మితమై ఉన్నాయి. కనీసం తమ కొరకే అవనీ, అచంచలములైన ప్రేమనిధులు అక్కడ ఉన్నాయి. వారు ప్రపంచాన్నంతటినీ ప్రేమించకపోవచ్చు. బర్మీయులు వారికి శత్రువులే కావచ్చు. కాని ఇంగ్లాండులో మాత్రం స్వజాతీయులపట్ల, సత్యంపట్ల, న్యాయంపట్ల, తమ వాకిటవున్న పరదేశీయుని ఆదరించే ధర్మంపట్ల వారికి గొప్ప అభిమానం ఉంది. పాశ్చాత్య ఖండంలో ప్రతిదేశంలో, ఎంత అద్భుతంగా, ఎలాంటి ఆదరణలో నన్ను మన్నించారో మీకు తెలుపకపోతే నేను కృతఘ్నుడినే అవుతాను. మనలో ఉదారహృదయం ఎక్కడుంది? ఇక్కడ ఒక చిన్న సమిష్టి పరపతి సంఘాన్ని స్థాపించబోతాం. వెంటనే ఒకరినొకరం మోసగించుకొనే ప్రయత్నం. ఇంకేముంది? మరుక్షణమే అంతా నేలకూలుతుంది. ఆంగ్లదేశీయులను అనుకరించడాన్ని గురించీ వారిలాగా, ఒక మహాజాతిని నిర్మాణం కావించటంగూర్చీ, మీరా ప్రసంగించటం? మీకు పునాదులు ఏవి? వట్టి ఇసుక! కాబట్టి ఏ వ్యవస్థ కానీ, ఒక్క నిమిషంలో ముక్కలుముక్కలై నేలకూలుతుంది.
కాబట్టి లాహోరు యువజనులారా! మరల ఒక్కసారి అద్వైత మహాధ్వజాన్ని లేవనెత్తండి. ఏలన, ఆ భగవంతుడు మీకు సర్వత్ర ప్రత్యక్షమయ్యేవరకు, అవసరమైన ఆ గాఢప్రేమ, మరొక సిద్ధాంతంలో మీకు లభించదు. ఆ ప్రేమధ్వజాన్ని విప్పార ఎగురవేయండి! “లెండి! మేల్కొనండి. గమ్యం చేరేవరకు నిలువకండి” లెండి, మరొక్కసారి మేల్కొనండి. వైరాగ్యంలేనిదే ఏమీ కొనసాగదు. మీరు ఇతరులకు సాయపడకోరితే మీ సంకుచితాత్మ తొలగిపోవాలి. క్రైస్తవులు చెప్పేలాగ, మీరు దేవుడిని, ధనాన్ని ఒకే కాలంలో ఆరాధించలేరు. వైరాగ్యాన్ని వహించండి. మీ పూర్వులు మహాకార్యాలను నిర్వహించడంకోసం, సంసారాలను త్యజించారు. తమ ముక్తికోసం, సంసారాలను త్యాగం చేసేవారు ఈనాడూ ఉన్నారు. మీరు అన్నిటినీ త్యాగం చేయండి. మీ ముక్తిని సైతం త్యాగం చేసి ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంకండి! ఔను, మీరు మహాధీర వచనాలను సదా పల్కుతూంటారు. కాని ఇప్పుడు కావలసింది అనుష్ఠానవేదాంతం. లెండి! మీ అల్పజీవితాలను బలి ఇవ్వండి. మీరు తిండిలేక చచ్చినా, అది ఏ పాటిది? మీరూ, నేనూ, మనబోటి వేయిమందీ, మనజాతి సజీవమై ఉండటానికై నలిగి బలి అయితే ఏమి? ఇదిగో, జాతి అధోగతిలో పడిపోతోంది. లక్షలకొద్దీ ప్రజల లెక్కకు మీరిన శాపాలు మన నెత్తిపై పడుతున్నాయి. దాహంతో అల్లాడుతూ నీళ్ళడిగినప్పుడు, దగ్గర్లో నిర్మల జీవనదీ ప్రవాహాలు కనిపిస్తున్నా ఎవరికి మనం మురికిగుంటల నీళ్ళిస్తున్నామో, అష్టెశ్వర్యాలు మనకు కళ్ళ ఎదుట కనిపిస్తూంటే, లక్షలకొద్దీ ఆకలితో చస్తున్నా, ఎవరిని ఉపేక్షిస్తున్నామో, నోటిమాటలతో అద్వైతాన్నిగూర్చి బోధలుచేస్తూ, ఏ అసంఖ్యాక జనుల్ని మన శక్తికొద్దీ ద్వేషిస్తున్నామో, కోట్లకొద్దీ మనుష్యులను హింసించడంకోసం మనం లోకాచారసూత్రాలను కల్పిస్తున్నామో, అన్ని ప్రాణులూ ఒకటే అనీ, అందరం ఒకే భగవానుని అంశంతో జన్మించామని సిద్ధాంతవాక్కులను పల్కుతూ, వీసమైన ఆచరణలేక, ఎవరిని మనం మోసగిస్తున్నామో, అట్టి సోదరుల శాపాలు మన నెత్తిపై పిడుగులలాగా పడుతున్నాయి. స్నేహితులారా! అంతా మీ మనస్సున ఉందంటున్నా, కొంచెమైనా ఆచరణలో లేకుండటమా? ఈ మచ్చను తొలగించుకోండి. లెండి! మేల్కొనండి! ఈ స్వల్పప్రాణం పోయినా లెక్కేమి? ప్రతివాడూ చావవలసిందే కదా? మహాఋషి, మహాపాపి, అత్యంత ధనికుడు, అత్యంత దీనుడు చివరికి మరణించక తప్పదు కదా? ఎలాంటి వారికీ శరీరం శాశ్వతమై నిలువబోదు. లెండి, మేలుకోండి! కపటం వదలి నిలబడండి. మన కపట వర్తనం ఘోరంగా పెరిగిపోయింది. మనకిప్పుడు కావలసింది శీలం. యమునికుండే హఠంతో పూనిన కార్యాన్ని పట్టువిడువకుండా నిర్వహించే దీక్ష, శీలం, మనకు అవసరం.
“ఘనులు దూషించనీ, లేక భూషించనీ! ఈ దినం లక్ష్మిరానీ, లేకపోనీ, మరణం తక్షణమే సంభవించనీ, లేక నూరేళ్ళవరకైనా ఆగనీ, ధర్మమార్గం నుండి ఒక్క అడుగైనా తప్పివేయనివాడే, నిజమైన సాధుపుంగవుడు” కాబట్టి లెండి, మేలుకోండి. కాలం గతించిపోతోంది. మన సామర్థ్యమంతా, వ్యర్థప్రసంగాలతో వృథా అయిపోతోంది. లెండి, మేలుకోండి. క్షుద్రవిషయాలను, అల్పాంశాలను, గూర్చిన వాదులాటలను, స్వల్పసిద్ధాంతాలను గూర్చిన పోట్లాటలను దూరంగా నెట్టివేయండి. మనం నిర్వహించవలసిన మహాకార్యం ఉంది. కోట్లకొద్దీ జనం నశించిపోతున్నారు. మహమ్మదీయులు మొట్టమొదట భారతదేశానికి వచ్చినపుడు, ఇక్కడి హిందువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉండిందో, ఈనాడు వారి సంఖ్య ఎంత తక్కువై పోయిందో గమనించండి. దిన దినానికీ హిందువులు తగ్గిపోతున్నారు. చివరికి పూర్తిగా అదృశ్యమైపోగలరు. వారు అదృశ్యులైపోతే పోవచ్చు. కానీ వారిలో ఎన్ని దోషాలున్నా, వారు ఎన్ని అపార్థకల్పనలు చేస్తున్నా, ఏ మహాద్భుత భావజాలాలకు వారింకా ప్రతి నిధులుగా ఉన్నారో, అవి వారితోనే నశించిపోగలవు. సమస్త ఆధ్యాత్మిక విద్యలకు, శిరోభూషణమైన అద్వైతసిద్ధాంతం, వారితోనే నాశనమైపోగలదు. కాబట్టి ప్రపంచ పారమార్థికతను సంరక్షించడానికై ప్రసారిత బాహువులతో, లెండి, మేలుకోండి! మొట్టమొదటగా మీ మాతృదేశం కోసం దానిని అనుష్ఠించండి. మనకీనాడు కావలసింది కేవలం ఆధ్యాత్మికత కాదు. ఈ వ్యవహారప్రపంచంలోకి అద్వైతాన్ని కొంచెం ప్రవేశపెట్టాలి. ఇది ప్రధానం. మొట్టమొదటిది భుక్తి; ఆ తర్వాతిది ముక్తి; దరిద్రులు తిండిలేక మాడుతూండగా, వారికి మితిమీరిన మతబోధ చేయమంటారే? ఎన్ని సిద్ధాంతాలైనా, ఆకలి బాధను నివారించగలవా? మనకు రెండు దౌర్భాగ్యాలున్నాయి. మొదటిది మన దుర్బలత; రెండోది విద్వేషపూరితమైన శుష్కహృదయం. నీవు లక్షలకొద్దీ సిద్ధాంతాలనుగూర్చి ప్రసంగాలు చేయవచ్చు. కోట్లకొద్దీ సంప్రదాయాలను బయలుదేరదీయవచ్చు. కానీ నీ హృదయంలో ప్రేమ పుట్టేంతవరకూ, అంతా వ్యర్థమే! వేదం బోధించునట్లు వారు నీలో కలిసిపోయి, నీ శరీరాంగాలలో వారూ చేరిపోయేవరకు, నీవు, దరిద్రులు, ధనికులు, పండితులు పామరులు, యోగులు పాపులు, అందరూ నీవు బ్రహ్మమని పేర్కొనే, ఆ అద్వితీయ అఖండ పరమాత్మలో అంశభూతమై ఒప్పేవరకు, వారిపై నీ సానుభూతిని ప్రసరించు!
ఆర్యులారా! ఆ అద్వైత సిద్ధాంతం యొక్క ప్రధానమైన దివ్యాంశలను కొన్నిటిని మీకు తెలుపడానికి ప్రయత్నించాను. ఆ అద్వైతాన్ని ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. దాన్ని ఈ దేశంలోనే కాక, అంతటా, ఆచరణలో పెట్టవలసివుంది. ఆధునిక భౌతికశాస్త్రం తన సమ్మెటపోటులతో, ప్రతిచోట ద్వైతమతపు గాజు పునాదులను పొడిపొడి చేసేస్తున్నది. ద్వైతులు శాస్త్ర వాక్యాలను ఇంకా సాగదీయడానికి వీలుకనిపించేంతవరకు, వానిని పట్టిలాగడం ఇక్కడేకాదు ఈ శాస్త్రవాక్యాలు కేవలం “ఇండియా రబ్బరు” మాత్రమే కాదు కదా? వారు తాము సురక్షితంగా దాక్కోవడానికి సందు గొందులను, మారుమూలలను, వెదకడం ఇక్కడనే కాదు; ఇంతకంటే ఎక్కువగానే యూరప్‌లోను, అమెరికాలోనుకూడ ఉంది. మన భారతదేశం నుండి అక్కడికికూడ, ఈ అద్వైతభావం కొంత వ్యాపించవలసివుంది. అది ఇదివరకే అయిపోయింది. కానీ, అది పెరిగి వృద్ధిపొందవలసి ఉంది. అది వారి నాగరికతలనుకూడ సంరక్షించాలి. పాశ్చాత్యదేశాల్లో పాత విషయాలు కనపడకుండాపోయి, కొత్త కొత్త విషయాలు తలలెత్తుతున్నాయి. స్వర్ణారాధనలు, ధనపూజలు పెచ్చుపెరుగుతున్నాయి. స్పర్థ, ధనార్జన, పోటి అనే నవీన సిద్ధాంతంకంటె అలాంటి పునాదులమీద నిర్మితమైన ఏ జాతీ నిలువజాలదు. అలాంటి పునాదులు కలవన్నీ నశించి, ఊరుపేరు లేకుండా పోయాయని ప్రపంచచరిత్ర బోధిస్తోంది. అలాంటి వెల్లువ ఈ భారతదేశం మీదికి వచ్చిపడకుండ మనం మొట్టమొదటగా ఆపాలి. కాబట్టి ఈ ఆధునిక భౌతికశాస్త్రం వేసే దెబ్బలనుండి మతాన్ని రక్షించుకోవడానికై అందరికీ ఈ అద్వైతాన్ని బోధించండి. అంతేకాదు మీరు ఇతరులకు సహాయం చేయాలి; మీ వేదాంతం అమెరికా యూరప్‌ల చిక్కులు తీర్చగలదు. అన్నిటికంటె ముఖ్యంగా, ఆచరణ రూపమైన పనిచేయవలసిన ఆవశ్యకత ఈ దేశంలో కలదని ఇంకొకసారి మీకు జ్ఞప్తిచేస్తున్నాను. అందు, మీరు పూనవలసిన మొట్టమొదటి అంశగా అధోగతిపాలైపోతున్న కోట్ల కొద్దీ దీనజనుల దగ్గరికి పోవాలి. శ్రీకృష్ణభగవానుని ఈ వాక్యాన్ని మననం చేసుకొంటూ వారిని చేయిపట్టుకుని నడపాలి.
“ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాః”
అంటే బ్రహ్మం, నిర్మలుడు, సర్వసముడు కావడంవల్ల సమత్వభావాన్ని మనసున స్థిరంచేసుకొనే వాళ్ళు ఈ జన్మలోనే సంసారాన్ని జయిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు బ్రహ్మంతోనే జీవిస్తున్నారు.