శ్రీ స్వాములవారు లాహోర్‌కు వచ్చినప్పుడు ఆర్య సమాజ, సనాతన ధర్మసభల నాయకులు వారికి ఘనస్వాగతం ఇచ్చారు. స్వాములవారు లాహోర్లోవున్న కొద్దికాలంలోనే మూడు ఉపన్యాసాలిచ్చారు. మొదటిది “హిందూమతంలోని సామాన్యసూత్రా” ల గూర్చి; రెండోది: “భక్తి” ని గూర్చి; మూడోది: “వేదాంతం” గురించిన శ్రీవారి ప్రసిద్దోపన్యాసం. మొదటిసారి, వారిలా ప్రసంగించారు.
పావన ఆర్యావర్తంలో సైతం, పరమపవిత్రంగా భావించే ప్రదేశమిదే. ఈ దివ్యభూమిలోనే మొదట ఆత్మాన్వేషణం ప్రారంభమైంది. చరిత్ర నిరూపిస్తున్నట్లు ఇక్కడనుండే ఈ ఆత్మసాధన వెల్లువలైపొర్లి, ప్రపంచాన్నంతా ముంచెత్తవలసి ఉంది. తనలో ప్రవహించే మహాస్రవంతులను పోలి, ఎక్కడ ఆధ్యాత్మిక సాధనలు వెల్లివిరిసి, ప్రపంచమంతటా, ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పునుండి, పడమరకు సంచారంచేసి, మేఘగంభీర ధ్వనితో స్వయంప్రకటన చేసుకొందో, ఆ భూమి ఇదే! భారతదేశంపై వచ్చిపడిన అన్ని దండయాత్రల, దోపిడుల, మొదటి దెబ్బతిని ఓర్చుకోవలసివచ్చింది ఈ ప్రదేశమే! వెలుపలినుండి ఆర్యావర్తంలోనికి చొరబారివచ్చిన అనాగరిక జాతులవారి తాకిడికి ప్రథమంగా రొమ్ము చూపవలసివచ్చిన వీరభూమి ఇదే! ఇన్ని పీడలకు లోనయినా, తన ఔన్నత్యాన్ని, తన బలాన్ని పూర్తిగా పోనాడుకోక, ధీరతతో నిల్చినది ఈ వసుంధరయే! ఆధునిక యుగాన నానక్ సాధువు తన అబ్బురపు విశ్వప్రేమ సిద్ధాంతాన్ని బోధించి, హిందువులను మాత్రమేకాక, మహమ్మదీయులను సైతం, ఇంకా ప్రపంచాన్నంతటినీ తన కౌగిట చేర్చుకోవడానికై బాహువులను దీర్ఘంగా చాచినదీ, తన విశాలహృదయాన్ని తెరిచిందీ ఇక్కడే! మన జాతీయ మహావీరుల్లోకంతా, అత్యంత ప్రఖ్యాతి పొందిన ఉత్తమోత్తమ వీరశ్రేణికి చెందిన గురుగోవిందసింగ్ జన్మించిందిక్కడే! తన రక్తాన్ని, తన సన్నిహిత ప్రియబంధువర్గం రక్తాన్ని ధర్మసంరక్షణార్థం బలి ఇచ్చి, ఆ తర్వాత, ఎవరికోసం తాను రక్తబలిదానం చేశాడో, వారే తన్ను ఏకాకిని చేయగా, దక్షిణ దేశానికి విశ్రాంతికై వెళ్ళి, తన దేశాన్నిగూర్చి పల్లెత్తి ఒక్క దూషణవాక్కునైనా పలుకక ఒక్క నిందోక్తినైనా వెలువరించక, గుండెపోటు తినిన సింగంలాగా ప్రాణాలు వదలిన ఆ మహావీరుడు ఉద్భవించిందిక్కడే!
ఓ పంచనదీక్షేత్ర వాసులారా! ఇక్కడ, ఈ మన ప్రాచీన క్షేత్రంలో మీ ఎదుట నేను నిలిచింది బోధకుడనుగా కాదు. ఎందుకంటే ఇతరులకు బోధించగల్గినంతటి పరిజ్ఞానం నాకు లేదు. ప్రాచ్యభాగంనుండి, పశ్చిమ భాగంలో నివసించే సోదరులతో, యోగక్షేమాలను, పరస్పరానుభవాలను ముచ్చటించుకోవడానికై వచ్చాను. నేనిక్కడికి రావడం మన మధ్యగల విభేదాలను కనుగొనడంకోసం కాదు. మనకు ఐకమత్యం ఎక్కడ కుదురుతుందో గ్రహించడం కోసమే! ఏ ఆధారాలమీద మనం సదా సోదరులంగా ఉండిపోగలమో, ఏ ఆధారాల ననుసరించి, సనాతనమైన ప్రాచీనవాణి, ఇంకా శక్తిమంతం కాగలదో, తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీతో నిర్మాణ కార్యక్రమాన్నిగూర్చి కొంచెం ముచ్చటించడానికి వచ్చాను కానీ, నిర్మూలన ప్రకరణానికి ఉద్యమించి రాలేదు. ఖండనకు కాలం గడిచిపోయింది. నిర్మాణ కార్యంకోసం, మనమందరం నిరీక్షిస్తున్నాం. దాదాపు నూరు సంవత్సరాలనుండి మన ఈ మాతృదేశమంతటా విమర్శలు వెల్లువలై ప్రవహించాయి. పాశ్చాత్య శాస్త్రజ్ఞానం విచ్చలవిడిగా, మనలో లోపాలున్న తావుల్లో అంతా నాట్యం చేసింది. దాని ఫలితంగా, నేడు సందుగొందులు, కన్నాలు, అన్నిటికంటె స్పష్టంగా కనబడుతున్నాయి. పూర్వం దేశమంతటా మహామనీషావంతులు, ఉత్తములు, మాననీయులు, సత్యపరాయణులై, ధర్మాన్వేషణబుద్ధితో దేశంపట్ల గాఢతరభక్తి ఉన్నవారు ఎందరో జన్నించారు. వీరు, ఈ మహాత్ములు, తీవ్రజిజ్ఞాసువులు కాబట్టి, సాంద్రమైన భక్తిమంతులు కాబట్టే, వారికి తప్పని తోచినదాన్నంతా విమర్శించారు. ఈ ప్రాచీన మహానుభావులకు ధన్యవాదాలు. వారు చాలా మేలే చేశారు. కాని ప్రకృతకాలపు వాణి “విమర్శలిక చాలు” అని హెచ్చరిస్తున్నది. విమర్శనం కావలసినంత జరిగింది. అవసరమైనంత దోషాన్వేషణం జరిగింది. పునరుద్ధరణకూ, పునర్నిర్మాణానికీ సమయం దగ్గరపడింది. చెల్లాచెదరైపోయిన మన శక్తులను ప్రోగుచేసుకొని, వాటిని ఒక కేంద్రంలో సమీకరించి, దాదాపు కొన్ని శతాబ్దాలనుండీ గమనముడిగివున్న మన జాతిని ముందుకు నడుపవలసిన తరుణం వచ్చింది. ఇంటిని శుభ్రపరచడం జరిగింది. తిరిగి గృహప్రవేశం చేయాలి! మార్గం సిద్ధమైంది. ఆర్య సంతానములారా! ముందుకు సాగిపోండి.
ఆర్యులారా! ఈ ఉద్దేశమే నన్నిక్కడికి తీసుకొని వచ్చింది. నేనే పక్షానికి కానీ, సంప్రదాయానికానీ, చెందినవాడిని కానని మొట్టమొదటనే ప్రకటిస్తున్నాను. అవి అన్నీ గొప్పవే! నాకు మాన్యమైనవే! వాటినన్నిటినీ నేను ప్రేమిస్తాను. నా యావజ్జీవం, వాటిలో యోగ్యం, సత్యం అయిన దాన్నంతా కనుగొనడానికే ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మనమందరం, ఏయే విషయాల్లో ఏకీభవిస్తామో, వాటిని మీ ఎదుటపెట్టడం, సాధ్యమయితే మనకు సఖ్యం ఏర్పడే ప్రణాళికను రూపొందించడం, ప్రస్తుతం నా ఉద్దేశం. భగవదనుగ్రహంవల్ల, అలాంటి ప్రణాళిక సాధ్యమైతే మనం దాన్ని ఆచరణలోపెట్టాలి! మనం హిందువులం. ఈ “హిందువు” అనే మాటను ఏ విపరీతార్థంతోను నేను ప్రయోగించడం లేదు. ఈ మాటలో ఏమైనా దూష్యమైన అర్థముందని చెప్పేవారితో నేను ఏకీభవించను. సింధునదికి ఆవలవుండే ప్రజలు అని మాత్రమే ప్రాచీనకాలంలో దీనికి అర్థముండేది. ఈనాడు మనల్ని ద్వేషించేవారిలో, అనేకులు దానిలో విపరీతార్థాన్ని ఆరోపించవచ్చు. అయినా పేరులో ఏముంది? ‘హిందు’ అనే పేరు ప్రభావవంతమైన దాన్నంతటినీ, ఆధ్యాత్మికమైన దాన్నంతటినీ స్ఫురింపజేయడమో లేదా పతితులను, నిర్భాగ్యులను ధర్మభ్రష్టులను తెలిపే అవమానసూచన పదంగా నిలిచిపోవడమో మనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ‘హిందు’ అనే శబ్దం ఏదైనా చెడుగును సూచించినా లక్ష్యపెట్టకండి. ఈ శబ్దమే అన్ని భాషలలోని అన్ని శబ్దాలలో అత్యంత శ్రేష్ఠమైందని, మన క్రియవల్ల రుజువు చేయడానికి సంసిద్ధులమవుదుము గాక! నా పూర్వులనుగూర్చి సిగ్గుపడకుండడం, నా జీవితధర్మాలలో ఒకటిగా భావిస్తున్నాను. నాకున్నంత గర్వం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. కానీ కపటం లేకుండా చెబుతున్నాను. నా గర్వం నన్ను గూర్చి కాదు, నా పూర్వులను గురించి. నేను గతాన్నిగూర్చి విచారించినకొద్దీ, నా దృష్టిని వెనక్కి మరల్చినకొద్దీ, అధికాధికంగా గర్వం కలిగింది. అది నాకు బలాన్నిచ్చింది; దృఢవిశ్వాసపూర్వకమైన సాహసాన్ని కలిగించింది; నేలమీద దుమ్ములో పడివున్న నన్ను లేవనెత్తింది; మహనీయులైన మన పూర్వులు నిర్ణయించిన ఉత్తమప్రణాళిక ననుసరించి, కృషి చేయడానికి నన్ను ప్రోత్సహించింది. ప్రాచీనార్య సంతానములారా! ఈశ్వరానుగ్రహం వల్ల మీకూ అలాంటి గర్వభావం కలగాలి! మీ పూర్వుల విషయమై అలాంటి విశ్వాసం, మీ రక్తంలోనికి ప్రవేశించాలి. అది మీ జీవితాలతో సారూప్యాన్ని పొందాలి! అది ప్రపంచంయొక్క మోక్షానికై ఉపకరించాలి!
మనమందరం ఏ అంశంలో ఏకీభవిస్తామో, మన జాతీయజీవనానికి సామాన్య మూలాధారం ఏదో, సరిగా కనుగొనాలని ప్రయత్నించడానికి పూర్వం మనం ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతివానిలో, ఒక వ్యక్తిత్వం ఉండి తీరుతుంది. ప్రతిజాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఒకడు, మరొకనికన్నా కొన్నికొన్ని విశేషాలలోను, తనకు విశిష్టమైన సహజ లక్షణాలలోను, భిన్నంగా ఉన్నట్లు, ఒక జాతి, మరొక జాతినుండి కొన్నికొన్ని విశిష్ట స్వభావాల్లో భిన్నంగా ఉంటుంది. ఈ ప్రకృతి కార్యనిర్వహణంలో ఏదో కొంత పనిని నిర్వహించడం ప్రతివాని కర్తవ్యం. వాని పూర్వకర్మనుబట్టి అతడు అనుసరించవలసిన ఒక ప్రత్యేక కార్యవిధానం ఉంటుంది. జాతుల విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. ప్రతి జాతీ నిర్వర్తించవలసిన ఒక నిర్ణీత కార్యక్రమం ఉంటుంది. ప్రతి జాతి, ప్రకటించవలసిన ఒక ప్రత్యేక సందేశం ఉంటుంది. ప్రతి జాతి, నిర్వహించవలసిన ఒక విశిష్ట ఉద్యమం ఉంటుంది. కాబట్టి ప్రారంభంనుండి మన జాతియొక్క ఉద్యమాన్ని, అది సఫలం చేయవలసిన నిర్ణీత ధర్మాన్ని, వివిధ జాతుల పురోగమనంలో అది ఆక్రమించవలసిన స్థానాన్ని వివిధ జాతుల సామరస్యానికై, అది చేయవలసిన విశిష్ట కృషిని మనం తెలుసుకోవలసివుంది. కొన్ని పాముల నెత్తిమీద మణులుంటాయనీ, ఆ మణులు వాటి తలలపై ఉన్నంతవరకు, వాటినేమి చేసినా సరే, ఆ పాములు చావవనీ, చిన్నతనంలో కథలు విన్నాం. తమ ఆత్మలను చిన్నపక్షులలో దాచివుంచుకొనే రాక్షసులను, పెనుభూతాలను గూర్చి, కథలు వింటూంటాం. ఆ పక్షులు సురక్షితంగా ఉండేంతకాలం ఈ రాక్షసులను చంపేశక్తి లోకంలో ఎవరికీ ఉండదు. ఈ భూతాలను నీవు ముక్కలు ముక్కలుగా నరికినా, వీటిని చంపడానికి నీవేమి చేసినా, అవి మాత్రం చావవు. జాతులూ అలాగే ఉంటాయి. ఒక్కొక్క జాతి యొక్క ప్రాణం కేంద్రీకృతమై ఉండే ప్రత్యేక విషయం ఒకటి ఉంటుంది. ఆ జాతియొక్క జాతీయత దానిలో నెలకొని ఉంటుంది. దాన్ని ధ్వంసం చేసేవరకు, ఆ జాతి చావదు. దీని సాయంతో ప్రపంచ చరిత్రలోని మహాద్భుత సంఘటనను ఒకదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మన పుణ్యభూమి మీదుగా అలలు అలలుగా అనాగరక జాతుల దాడులు దొర్లుతూపోయాయి. వందలకొద్దీ సంవత్సరాలు, “అల్లాహో అగ్బర్” అనే రణధ్వనులు ఆకశాన్ని చీల్చివేశాయి. ఏ హిందువుగానీ తన అంత్యకాలం ఎప్పుడు మూడుతుందో ఎరుగడు. ప్రపంచ చరిత్రలో ఇంతగా కష్టాలు పడిన జాతి, ఇంతగా అణగద్రొక్కబడిన జాతి, మరొకటి లేదు. మనం ఇప్పటికీ, అదే స్థితిలో ఉన్నాం. అవసరమైతే, మళ్ళా మళ్ళా కష్టాలనెదుర్కోవడానికి సిద్ధంగా నిలిచివున్నాం. ఇంతేకాదు; మనం బలం కలవారమనీ, అవసరమైతే దేశాంతరం పోవడానికి సైతం సిద్ధంగా నిలిచివున్నామనీ తెలిపే సూచనలు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయి. వికాసం, చైతన్యానికి లక్షణం కదా!
మన భావాలు, మన సంకల్పాలు, ఈ భారతదేశపు హద్దుల్లోనే ఒదిగి ఉండలేదు. ఇతర జాతుల వాఙ్మయంలోకి ప్రాకిపోయాయి. వివిధ జాతులలో తమ అర్హస్థానాన్ని ఆక్రమించుకొని, మనకు ఇష్టమున్నా లేకున్నా, కొన్ని యెడల నాయకత్వాన్ని, నిరంకుశాధికారాన్ని సైతం చేపట్టాయి. మొత్తంమీద ప్రపంచ వికాసానికి, భారతదేశం చేసిన దోహదం, ఆధ్యాత్మిక విద్యా ప్రచారం. మానవుని అంతఃకరణాన్ని ఆక్రమించదగిన విషయాలలో, అత్యున్నతం, అతిగంభీరం, అతిసూక్ష్మం అయిన తత్త్వవిద్య, భారతదేశం నుండి బహిర్గతం కావటంవల్లనే, మన జాతికి ప్రపంచజాతులలో, ఒక విశిష్ట స్థానమేర్పడింది. మన పూర్వులు అనేకమైన ఇతరవిషయాల్లోనూ కృషిచేశారు. ఇతర జాతులలాగే వీరూ, ఇంద్రియగోచరమైన బాహ్యాప్రకృతి యొక్క రహస్యాలను తెలుసుకోవడానికై మొట్టమొదట ప్రయత్నించారు. అద్భుతమైన తమ మహామేధా బలంతో, లోకమంతా, శాశ్వతంగా గర్వపడదగిన గొప్ప అలౌకిక కార్యాలను, ఆ క్షేత్రంలోకూడ సాధించి ఉండేవారు. కాని, అంతకన్న ఉత్తమమైన దానికోసం వారు దీన్ని విడిచిపెట్టారు. వేదపుటల నుండి ఉదాత్తమైన ఒక వాణి ఘోషిస్తూ, వినవస్తోంది – “ఆ నిర్వికార బ్రహ్మమును తెలిపే శాస్త్రమే ఉత్తమోత్తమమైంది” వికారపుంజం, క్షణభంగురం అయిన ప్రకృతియొక్క ఈ మర్త్యప్రపంచంయొక్క, ఈ దుఃఖసంసారంయొక్క ఈ శోకమయలోకం యొక్క శాస్త్రంకూడ గొప్పది కావచ్చు. నిజానికి గొప్పదే. అయినా, ఎక్కడ మాత్రమే శాంతి ఉందో, ఎక్కడ మాత్రమే శాశ్వత జీవనం ఉందో, ఎక్కడ మాత్రమే అఖండత్వం ఉందో, ఎక్కడ మాత్రమే దుఃఖమంతా అంతరిస్తోందో, అలాంటి నిర్వికారబ్రహ్మమును గురించిన ఆ పరమానందమయుని గురించిన శాస్త్రమొక్కటే మన పూర్వుల అభిప్రాయాలన్నింటిలోను, ఉత్తమోత్తమం! ఇంతేల మనకు కూడును, గుడ్డను, తోటిమానవులను వశంచేసుకొనే శక్తిని ఇవ్వగల శాస్త్రాన్నీ, తోటి జీవరాసులను జయించి, వానిపై పెత్తనం చెలాయించడం ఎలాగో తెలిపే శాస్త్రాన్నీ, బలవంతులు, బలహీనులపైని అధికారం చూపే యుక్తిని నేర్పే శాస్త్రాన్నీ, వారు కోరుకొనివుంటే కనుగొన గలిగేవారే! కానీ, ఈశ్వరకృపవల్ల, అంతకన్నా మిక్కిలి ఉత్తమం, ఉన్నతం, అత్యధికానందప్రదం అయిన ఆ అన్యవిషయాన్ని వారు తక్షణం గుర్తించారు. అది, వారి జాతీయ స్వభావమైపోయేవరకు, వేలకొద్దీ సంవత్సరాలనుండీ అనుస్యూతంగా పిత్రార్జిత సంపదగా మనదాకా వచ్చేంతవరకు, అది మనలో సారూప్యాన్ని పొందేవరకు, మన రక్తనాళాలలో ప్రవహించే ప్రతి నెత్తురు చుక్కలోను, అది జలజలలాడేవరకూ అది మన సహజ లక్షణమైపోయేవరకూ “మతం”, “హిందువు” అనే శబ్దాలు అభిన్నమై ఒప్పేవరకూ, వారు దాన్ని పట్టుకొని సాధించారు. అది మన జాతీయ విశిష్టలక్షణం. దాన్ని ఎవరూ తాకలేరు. ఖడ్గాన్ని, అగ్నిని, చేతపెట్టుకొని వచ్చిన క్రూరజాతులలో, క్రూర దుష్టాచారాలను వెంటబెట్టుకొని వచ్చిన, అనాగరక జాతులలో ఒక్కరైనా మన ఆయువుపట్టును తాకజాలకపోయారు. ఆ “జీవమణి” ని ఒక్కడూ స్పృశింపజాలకపోయాడు. మన జాతీయాత్మ నెలకొనివున్న ఆ “పక్షి” ని చంపేశక్తి ఒక్కనికైనా లేకపోయింది. కాబట్టి మతమనేది ఈ జాతి ఆయువుపట్టు. అది సురక్షితంగా ఉండేంతకాలం, ఈ జాతిని ధ్వంసం చేయగలశక్తి, ఈ జగత్తులో ఎక్కడా ఉండదు. మన పిత్రార్జిత సంపదలన్నిటిలోను, శ్రేష్ఠతమమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం అవలంబించి ఉండేంతకాలం, అన్ని బాధలు లౌకికములైన అన్ని దుఃఖాలు, మనకు ఏ హాని కలుగజేయకుండానే దాటిపోతాయి. మనం ప్రహ్లాదునిలాగా, ఆ అగ్నిజ్వాలలనుండి సురక్షితంగా జయటపడగలం. ఏ హిందువైనా, ఆధ్యాత్మికపరాయణుడు కాకపోతే, వానిని నేను హిందువనే పిలువను. ఇతరదేశాల్లో ప్రతివానికీ, మున్ముందుగా రాజకీయ విషయం ముఖ్యం; తర్వాతనే కొంచెం మతం. కాని, ఇక్కడ భారతదేశంలోనో మన జీవితాల్లో మొట్టమొదటిదీ, ప్రధానమైందీ అయిన ధర్మం ఆధ్యాత్మికం! ఆ తర్వాత సమయముంటే ఇతర విషయాలు వస్తాయి. దీన్ని మనస్సులో పెట్టుకొని మన జాతీయ శ్రేయస్సుకోసం, ప్రాచీనకాలంలో జరిగినట్లే, ఇకముందుకూడ ఎప్పుడూ పాటుపడాలి! ప్రస్తుతం, మన జాతి ఆధ్యాత్మిక శక్తులనన్నిటినీ మున్ముందుగా తెలుసుకోవలసివుంది. భారతదేశంలో జాతీయైక్యత అంటే, అక్కడక్కడ చెదరివున్న, ఆధ్యాత్మికశక్తుల నన్నిటినీ, పోగుచేయడమే! భారతదేశంలో, ఒక జాతి అంటే ఒకే ఆధ్యాత్మిక సంకీర్తనకు అనుగుణంగా తాళంవేసే హృదయస్పందనగల ప్రజారాశి అనే అర్థం.
ఈ దేశంలో ప్రజాసమాజంలో పెక్కుశాఖలుండేవి. ఇప్పుడూ చాలా ఉన్నాయి. ఇకముందూ ఎక్కువగా ఉండగలవు. ఎందుకంటే మన మతం భావమూలక సిద్ధాంతాల్లో సంపూర్ణ స్వాతంత్ర్యం ఇస్తోంది. ఇది మన మతానికి ప్రత్యేక లక్షణం! ఈ సిద్ధాంతాల ననుసరించే, అతిస్వల్పాంశాల వివరణం జరుగుతుంది. మన తలలపై ఉండే ఆకాశమంత విశాలం, సాక్షాత్తు మూలప్రకృతంత శాశ్వతమూ అయిన ధర్మసూత్రాలనుండి, ఈ స్వల్ప వివరాలన్నీ నిర్మితాలవుతూ ఉంటాయి. కాబట్టి, సహజంగా సంప్రదాయభేదాలు మన దేశంలో ఉండి తీరవలసినవే. కాని ఉండతగనివి ఏవి? ఈ సాంప్రదాయకాలైన కోట్లాటలు మాత్రమే! సమాజశాఖలు ఉండి తీరవలసినవే అయినా, సాంప్రదాయక దురభిమానం ఉండనవసరం లేదు. సాంప్రదాయక దురభిమానంవల్ల, ప్రపంచమెన్నడూ బాగూపడదు. అయినా వేర్వేరు సంప్రదాయాలు, సమాజ శాఖలు లేకపోతే ప్రపంచం నడవజాలదు. ఒక చిన్న మానవబృందం ప్రతికార్యాన్నీ నిర్వహించజాలదు. ఈ జగత్తులో ఉన్న అనంతమైన శక్తిరాశినంతా కొద్దిమంది పురుషులు పరిపాలించజాలరు. కాబట్టి, పరిశ్రమ బలాత్కారంగానైనా, విభజించబడవలసిందే. అందువల్లే అనేక సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మిక శక్తుల వికాసార్థం సంప్రదాయ భేదాలుండవచ్చుగాక! కాని, అందువల్ల మనం పోరాటాలకు తలపడవలసిన అవసరం ఉందా? మన ప్రాచీన గ్రంథాలు ఈ విభేదం మిధ్య అనీ, అన్ని విభేదాలున్నా వీని అన్నింటా ఒక ఐకమత్యం, ఒక అందమైన సామరస్యం, ఉందని ఘోషించడం లేదా? “ఏకం సత్ విప్రా బహుధావదన్తి” – (ఉండే సత్తా ఒక్కడే. జ్ఞానులు దాన్ని అనేక నామాలతో పిలుస్తారు) అని మన ప్రాచీన గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. కాబట్టి, ఈ సంప్రదాయాలమధ్య తగవులు కలిగితే, ఈ వేర్వేరు సంప్రదాయాలు, కోట్లాటలకు దిగితే భారతదేశంలో ఉన్న ఆయా సంప్రదాయాలమధ్య, అసూయాద్వేషాలు ఏర్పడితే, సర్వసంప్రదాయాలు, సర్వకాలం గౌరవించబడుతూ వచ్చిన ఈ దేశంలో ఆ వంశపురుషుల సంతానమని చెప్పుకొనడానికైనా, మనకు యోగ్యత ఉండదు కదా! అది ఎంతటి శోచనీయస్థితో ఆలోచించండి.
మన దేశంలో వైష్ణవులుకానీ, శైవులుకానీ, శాక్తేయులుకానీ, గాణాపత్యులుకానీ, ప్రాచీన వేదాంతపద్ధతులకు చెందినవారుకానీ, నూతన మతాలకు చెందినవారుకానీ, పూర్వాచార సంప్రదాయాలకు చెందినవారుకానీ, నవీన సంస్కార సంఘాలకు చెందినవారుకానీ, కొన్ని మహాధర్మసూత్రాల విషయంలో ఏకీభవిస్తున్నారని నా అభిప్రాయం. హిందువునని చెప్పుకొనే ప్రతిమనుష్యుడు, ఈ ధర్మసూత్రాలను విశ్వసిస్తున్నాడు. అయినా, ఈ ధర్మసూత్రాలకు అర్థం చెప్పడంలో, వాటికి వివరణలను కూర్చడంలో సహజంగా భిన్నత్వం ఉండి తీరవలసిందే. దాన్ని అందరూ ఆమోదించవలసిందే! ఎందుకంటే ప్రతి మానవుని బలాత్కారంగా మనస్థితిలోనే నొక్కిపెట్టడం మన సిద్ధాంతం కాదు. మన వ్యాఖ్యానాన్ని అనుసరించే వర్తించమనీ, మన విధానాన్నే అనుసరించి జీవించమనీ, ప్రతిమానవుని బలాత్కరించడం పాతకం. వేదాలు మత రహస్యాలను బోధించే సనాతన గ్రంథాలని ఇక్కడవున్న వారంతా, బహుశ విశ్వసిస్తారనుకొంటాను. ఈ పావన వాఙ్మయం ఆదిలేక, అంతమూ లేక, ఆద్యంతాలులేని ప్రకృతితో సమాన ప్రతిపత్తి కలిగివున్నదని మనమంతా నమ్ముతాం. ఆ పవిత్ర గ్రంథం ఎదుట నిలుచునప్పుడు, మత సంబంధాలైన మన విభేదాలు, మత విషయకాలైన తగవులాటలు, అన్నీ అంతరించవలసి ఉంటుందనీ, ఆధ్యాత్మిక సంబంధమైన మత విభేదాలనన్నిటినీ తీర్చుకోవడానికి వేదమే ఉత్తమ న్యాయస్థానమనీ, మనమందరం అంగీకరిస్తాం. ఆ వేదాలు ఎలాంటివి అనే నిర్ణయాన్నిగూర్చి, మనకు వేర్వేరు దృకృధాలుండవచ్చు. ఒకభాగం, మరొక భాగంకన్న అధిక పవిత్రత కలదని భావించే ఒక సంప్రదాయం ఉండొచ్చుగాక! కానీ, మనమందరం ఈ వేదాల విషయంలో సోదరులమనీ, పూజనీయం, సనాతనం, ఆశ్చర్యజనకం అయిన సర్వమూ లభించిందనీ మనం గ్రహించినంతకాలం, ఆ విషయం అంతగా పాటింపతగింది కాదు. కాబట్టి మీరు వేదప్రామాణ్యాన్ని విశ్వసించేలా అయితే, మొట్టమొదటగా ఈ సూత్రాన్ని దేశమంతటా బాహాటంగా పూర్ణప్రచారం చేయండి. వేదాలకు అర్హమైన ప్రాధాన్యాన్నివ్వండి. సరే, వేదాల తర్వాత మనమందరం విశ్వసించే రెండవ అంశమేది? ఈ జగత్తునంతా సృష్టించి, రక్షించే మూలశక్తి అయివుండే వాడెవడో, జగత్తనే ఈ విచిత్ర సృష్టికాలక్రమాన్ననుసరించి ఎవనినుండి వ్యక్తమై వెలువడుతూ మరల ఎవనిలోనికి పోతూంటుందో, అలాంటి భగవంతుడొకడున్నాడనడం. ఈ భగవంతునిగూర్చి మన భావనలు భిన్నంగా ఉండవచ్చు. ఒకనికి పూర్ణంగా, సగుణుడైన భగవంతునిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనికి సగుణుడైనా, మానవ స్వరూపుడు కానట్టి భగవంతునిలో నమ్మకం ఉండవచ్చు. వేరొకడు పూర్ణంగా నిర్గుణుడైన భగవంతునిలో నమ్మకం పెట్టుకోవచ్చు. ఈ అందరికీ వేదాల్లో ప్రమాణాలు దొరుకుతాయి. మనమంతా భగవంతునిలో నమ్మకం కలవాళ్ళమే! దేన్నుండి ఈ సమస్తమూ పుడుతోందో, దేనిలో ఈ సమస్తమూ జీవిస్తోందో, దేనిలోకి చివరికి ఈ సమస్తమూ మరలుతోందో, అలాంటి విచిత్రాఖండశక్తిని నమ్మనివాడు హిందువునని చెప్పుకోవడానికి అర్హుడు కాడని దీని అర్థం. అలా అయితే, ఈ సిద్ధాంతాన్నికూడ దేశంలో అంతటా ప్రచారంచేద్దాం. నీకెలాంటి భావనవుందో, అలాంటి దాన్నే ప్రచారం చేయి; దాన్నే బోధించు. భేదం లేదు; మనం దాన్నిగూర్చి పోట్లాడబోవడం లేదు. భగవంతునిగూర్చి మాత్రం ప్రచారం చేయి. మనకు కావలసిందంతా అదే. ఒక భావన వేరొకదానికన్న శ్రేష్ఠతరంగా ఉండవచ్చు. కానీ, వాటిలో ఏదీ దూష్యంకాదని నీవు జ్ఞాపకముంచుకోవాలి. ఒకటి శ్రేష్ఠమైంది. మరొకటి శ్రేష్ఠతరమైంది; ఇంకొకటి శ్రేష్టతమమైంది; అంతేకానీ చెడ్డది అనేమాట మన పరిభాషలోకి రాతగదు. కాబట్టి తమకు ఇష్టమైన విధాన భగవంతుని నామాన్ని ప్రచారం చేసే వారందర్నీ భగవంతుడు ఆశీర్వదించునుగాక! భగవంతునిగూర్చి ఎంతెంత ప్రచారం జరిగితే ఈ జాతికి అంతంత మేలు చేకూరుతుంది. భగవన్నామం స్మరించాలనే భావంతో మన సంతానాన్ని పెంచుదాం గాక! ఈ భావం పేదవారి ఇళ్ళలోనికి, దీనజనుల గుడిసెలలోనికి, శ్రీమంతుల భవనాలలోనికి చొచ్చుకొనిపోవును గాక! నేను మీకు తెలుపదలచిన మూడవ భావమిది: పుడమిలోని ఇతర జాతులలాగా, ఈ ప్రపంచం కొన్నివేల ఏండ్ల క్రిందట సృష్టించబడిందనీ, మళ్ళీ ఒకానొక దినాన, శాశ్వతంగా నాశనం చేయబడుతుందనీ, మనం నమ్మడం లేదు. ఈ జగత్తుతో కూడ, నరుని ఆత్మ, శూన్యంనుండి సృష్టించబడిందని మనం నమ్మం. మనమందరం ఏకీభవించే మరొక అంశం ఇదే అని నేను భావిస్తాను. ప్రకృతి ఆద్యంతాలు లేనిదనీ, ఈ బాహ్యప్రపంచంయొక్క స్థూలద్రవ్యం కొన్ని నియత సమయాల్లో తన అత్యంత సూక్ష్మదశకు మరలుతుందనీ, కొంత నియమితకాలం వరకూ అలా నిలిచి, తిరిగి బహిర్గతమై, మనం “ప్రకృతి” అని పిలిచే ఈ అనంత మనోహరదృశ్యంగా వ్యక్తమవుతుందనీ మనం నమ్ముతాం. ఈ తరంగగతి, కాలం ఆరంభమవడానికి పూర్వంనుండి జరుగుతోంది. ఇంకా అనంతంగా, శాశ్వతంగా జరుగుతూనే ఉంటుంది. మన విశ్వాసమిలా ఉంది. హిందువులంతా నమ్మే విషయం ఇంకొకటి ఉంది. “నరుడు” అంటే ఈ జడమయ స్థూల శరీరం కాదు. ఆంతరమైన మనస్సనే సూక్ష్మశరీరం మాత్రమూ కాదు. ఈ శరీరం మారిపోతోంది. ఇట్లే మనస్సూ మారిపోతోంది. కానీ వీటికంటే శ్రేష్ఠతరమైంది ఒకటుంది. అది వీటికి అతీతంగా ఉండే ఆత్మ, ‘ఆత్మ’ అనే శబ్దాన్ని భాషాంతరంలో తెలపాలని ప్రయత్నించాను. ఏ భాషాంతరీకరణం చేసినా తప్పే అవుతుంది. ‘ఈ సూక్ష్మశరీరానికి ఆవల ఒకటి ఉంది’ అని మనమందరం నమ్ముతున్నాం. అదే నరుని ఆత్మ. దానికి ఆద్యంతాలు లేవు. మరణమంటే ఏమో అదెరుగదు. తక్కిన జాతులందరి భావాలకు, భిన్నమైన ఈ విచిత్రభావం మనకుంది. అదే మన ఆత్మ. అది శరీరం తర్వాత శరీరాన్ని వరుసగా గ్రహించి అందులో నివసిస్తూంటుంది. తనలో కోరికలుండే వరకు అలా చేస్తూంటుంది. చివరకు అది విముక్తి చెందుతుంది. ఆ తర్వాత ఇక దానికి జననం లేదు. ఇక్కడ సంసార సిద్ధాంతాన్ని సూచిస్తున్నాను. మన శాస్త్రాలు బోధించే “జీవులు శాశ్వత” మనే సిద్ధాంతమిదే! మనం ఏ సంప్రదాయంవారమైనా, అందరం ఏకీభవించే విషయమిది ఒకటి. ఆత్మకు, భగవంతునికి ఉన్న సంబంధాన్ని గూర్చి భావభేదాలుండవచ్చు. ఒక సంప్రదాయం ప్రకారం, ఆత్మ భగవంతునినుండి శాశ్వతంగా వేరుపడి ఉండవచ్చు; వేరొక సంప్రదాయం ప్రకారం, ఆ అఖండాగ్నిరాశిలో ఒక రవ్వను పోలివుండవచ్చు; ఇంకొక సంప్రదాయం ప్రకారం ఆ అఖండ వస్తువుతో అభిన్నమై ఉండవచ్చు. మూలసూత్రంలో మనకు విశ్వాసమున్నంతవరకు, మనమెలా భావించినా తొందరలేదు. ఆ మూలసూత్రమిది: జీవాత్మ అనంతమైంది. అది ఎన్నడూ సృష్టి అయింది కాదు. కాబట్టి ఎన్నడూ మరణించదు; అది వేర్వేరు శరీరాలలోనికిపోతూ, మానవశరీరంలో పరిపూర్ణత్వాన్ని పొందేవరకు పరిణామం పొందుతూ ఉంటుంది. ఈ విషయంలో మనకందరికి ఏకీభావం ఉంది. ఇక ఉత్తమోత్తమం, అతివిస్మయకరం, ఆధ్యాత్మిక క్షేత్రంలో కనుగొనబడిన సిద్ధాంతాలలోకంతా శ్రేష్ఠతమం అయిన, విషయం ఇంకోటి ఉంది. పాశ్చాత్య తత్త్వశాస్త్రం, ప్రాచ్య వేదాంతం, ఈ విషయంలోనే ప్రధానంగా విభేదిస్తున్నాయి. పాశ్చాత్య తత్త్వశాస్త్రాన్ని చదువుతూండిన మీలో కొందరు దీన్ని కనిపెట్టి ఉండవచ్చు. అది ఏది? మనం శాక్తేయులమైనా, వైష్ణవులమైనా, సూర్యోపాసకులమైనా, బౌద్ధులమైనా, జైనులమైనా, భారతదేశంలోని మనమంతా జీవాత్మ స్వభావంచేతనే పవిత్రమైందనీ, పూర్ణమైందనీ, అఖండశక్తియుక్తమనీ, దివ్యమైందనీ విశ్వసిస్తున్నాం. ద్వైతుల అభిప్రాయాన్ననుసరించి ఆత్మయొక్క ఈ సహజ దివ్యతేజస్సు పూర్వపు దుష్కర్మవల్ల సంకుచితమైపోయింది. భగవదనుగ్రహంవల్ల అది తిరిగి వికాసాన్ని పొంది తన పూర్ణత్వాన్ని ప్రకటిస్తుంది. ఇక అద్వైత సిద్ధాంతాన్ననుసరించి సంకోచమనే ఈ భావం సైతం, కొంతవరకు పొరపాటే. “మాయ” ఆత్మను ఆవరించి ఉండటం చూచి, ఆత్మ, తన మహిమను కోల్పోయిందని మనం భ్రమిస్తున్నాం. ఇంతేకానీ, దాని మహిమలు సంపూర్ణంగా ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఈ భేదం ఎటువంటిదైనా, మన ప్రధాన సారాంశాన్ని విచారించేటప్పుడు, ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాలమధ్య పరస్పర సమాధానం కుదరని గొప్పభేదమొకటుందని స్పష్టమవుతోంది. ఉత్తమం, శుభంకరం అయిన అన్నిటినీ ప్రాచ్యఖండవాసులు అభ్యంతరంలో వెదకుతారు. పూజలు చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని భగవంతుని అభ్యంతరంలో (లోపల) కనుగొనాలని చూస్తాం. పాశ్చాత్యులలో, భగవంతునికోసం బాహ్యంలో పైకి చూస్తారు. పాశ్చాత్యులకు, వారి మత గ్రంథాలు బాహ్యం నుండి పుట్టాయి. మన గ్రంథాల్లో శ్వాసలాగా అభ్యంతరం నుండి వెలువడ్డాయి. మంత్రద్రష్టలైన ఋషుల హృదయాలనుండి భగవంతుని శ్వాసగా అవి వెలువడ్డాయి.
నా మిత్రులారా! నా సోదరులారా! మనం బాగా గ్రహించవలసిన ముఖ్యాంశమిది ఒకటి. భవిష్యత్కాలంలో మనం పట్టుదలతో అనుసరించవలసింది ఈ ఒక్క విషయమే అని మీకు తెలుపుతున్నాను. ఈ ఒక్క విషయాన్నిగూర్చి నాకు దృఢవిశ్వాసం అమరింది. మీరు దీన్ని చక్కగా గ్రహించాలని నా ప్రార్థన. దివారాత్రాలు తాను వ్యర్థుడనని మననం చేస్తూవుండే మనిషివల్ల ఎలాంటి శుభమూ కలుగబోదు. మనుష్యుడు రేయింబగళ్ళు తాను దుఃఖీతుడననీ, అధముడననీ, పనికిమాలిన వాడినని భావిస్తూవుంటే అతడు పనికిమాలినవాడే అయిపోతాడు. నీవు “నేను ప్రయోజకుణ్ణి” అని అనుకుంటే అలాగే అవుతావు. నీవు “నాహం” అంటూ “నేనుకా” నని తలచి, రాత్రింబవళ్ళు వ్యర్థుడనని మనం చేయసాగితే, నీవు నిజంగా వ్యర్థుడవే అయిపోతావు. ఈ మహాసత్యాన్ని జ్ఞప్తిపెట్టుకోవాలి. మనం, ఆ సర్వశక్తిమయుని బిడ్డలం; మన మా అఖండదివ్యాగ్నిలోని రవ్వలం. మనం పనికిమాలిన వారం కావడం ఎలా? మనం సర్వమయులం. మనం సర్వమును చేయసిద్ధంగా ఉన్నాం. మనం దేన్నైనా చేయగలం. మనం ప్రతిదాన్నీ చేసితీరాలి. ఈ ఆత్మ విశ్వాసం మన పూర్వుల హృదయాల్లో ప్రకాశించింది. నాగరికతాభివృద్ధిలో వారిని ముందుకు తీసుకొని వచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే! మనకు భ్రష్ఠత్వం వాటిల్లితే, దోషం చేకూరితే నా మాటను గుర్తుపెట్టుకోండి. ఆ భ్రష్ఠత్వం మన ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాడే ప్రారంభమైంది. తనలో తాను విశ్వాసం పోగొట్టుకోవడమంటే భగవంతునిపట్ల విశ్వాసం పోగొట్టుకోవడమే! నీలోన, నీ ద్వారా, కర్మచేస్తున్న ఆ అఖండ శుభంకర దైవంలో నీకు విశ్వాసం ఉందా? ఈ అంతర్యామి ప్రతి పరమాణువులో వెలసి, నీ శరీరమంతటా, నీ మనస్సులో, నీ ఆత్మలో ఓతప్రోతంగా, (పడుగుపేకగా) వ్యాపించి ఉన్నట్లు నీవు విశ్వసించితే ఇక అధైర్యపడడం ఎలా? నేను, ఒక చిన్న నీటిబుడగను కావచ్చు; నీవు పర్వతోత్తుంగ తరంగమవు కావచ్చు. విచారమెందుకు? ఆ అనంతసాగరం నీకు, నాకు కూడ ఆధారక్షేత్రమై ఉంది. ఆ అఖండ చైతన్యసముద్రం, ఆ అఖండ శక్తిజలరాశి, ఆ అఖండాత్మ జలనిధి, నీదైనట్లే, నాదికూడ. నా జన్మాదిగా, నా చైతన్యం సాక్షిగా, ఆ అనంతచైతన్యరాశితో ఇదివరకే కలసివున్నాను. దానితో యోగం పొందుతున్నాను. పర్వతమంత ఎత్తు కలిగి నీవు ఉన్నా, నీలాగా ఆ అనంతక్షేమనిధితో, ఆ అఖండ శక్తిరాశితో, నేనూ కలసే ఉన్నాను. కాబట్టి నా సోదరులారా! ఈ జీవప్రదమైన, మాన్యమైన, ప్రభావవంతమైన, మహాసిద్ధాంతాన్ని, మీ బిడ్డలకు, వారు పుట్టిన నాటినుండే బోధించండి. మీరు వారికి అద్వైతం నేర్పనక్కర్లేదు; ద్వైతమే బోధించండి; లేక మీకిష్టమైన ఏ మతాన్నైనా బోధించండి. ఏది బోధించినా, ఈ భారతదేశమంతటా ఆత్మయొక్క పూర్ణత్వం గూర్చిన ఈ సిద్ధాంతమే శాశ్వతమై నిలువగలదు. దీన్నే సకల సంప్రదాయాలూ, విశ్వసిస్తున్నాయి. ఆ మహాతత్త్వవేత్త కపిలాచార్యులు చెప్పినట్లు, జీవాత్మ స్వభావం చేతనే పవిత్రమైంది. కాకపోతే, అది ఎన్నడూ పవిత్రతను పొందజాలదు. స్వభావంచేత ఏదైనా పరిపూర్ణం కాకపోతే, ఒకప్పుడది పరిపూర్ణత్త్వాన్ని పొందినా, ఆ పూర్ణత్వం మరల జారిపోతుంది. నరుడు స్వభావంచేతనే అపవిత్రుడైతే మధ్యలో, ఒక ఐదు నిమిషాలపాటు పవిత్రుడైనప్పటికీ, అతడు సదా అపవిత్రుడుగా ఉండిపోవలసినవాడే! ఆ పవిత్రత పోయేకాలం వచ్చి తీరుతుంది. ఆ తర్వాత పూర్వపు సహజమైన అపవిత్రత మళ్ళీ తలచూపవలసిందే! కాబట్టి, మన తత్త్వవేత్తలందరు పుణ్యమే మన స్వభావమంటారు. పూర్ణత్వమే మన సహజగుణం. అంతేకానీ, అపూర్ణత, మాలిన్యం, మన స్వభావంలోనివి కావు. మనం ఈ విషయం జ్ఞప్తిపెట్టుకోవాలి. ఒక మహర్షి ప్రాణావసానకాలంలో తన మహాకార్యాలనన్నిటినీ తన మహోత్తమ సంకల్పాలనన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకోమని తన మనస్సును హెచ్చరించాడట! తన దోషాలను, లోపాలను జ్ఞప్తికి తెచ్చుకోమని మనస్సుకు చెప్పలేదు! చూచారా? మనోహరమైన ఈ ఉదాహరణాన్ని ఎన్నడూ మరువకండి. లోపాలా? ఉంటాయి! దుర్బలత్వమా? ఉండి తీరుతుంది. అయినా, మీ యథార్థస్వభావాన్ని నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోండి. మన దౌర్బల్యాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒకటే మార్గం, మన దోషాలను నివారించుకోవడానికి ఇది ఒకటే త్రోవ!
భారతదేశంలో వివిధ మత సంప్రదాయాలమధ్య సమానంగా కొన్ని అంశాలు ఇవిగా కనిపిస్తున్నాయి. భవిష్యత్కాలంలో, ఈ సమానాంశాలను పురస్కరించుకొని, పూర్వాచారపరాయణులు, మత స్వాతంత్ర్యవాదులు, పాత పద్ధతులవారు, క్రొత్త పద్ధతులవారు, ఒకర్ని ఒకరు ఆలింగనం చేసుకోవచ్చు. అన్నిటినీ మించి, జ్ఞప్తిలో ఉంచుకోవలసిన ఇంకొక విషయముంది. దాన్ని అప్పుడప్పుడు, మనం మరిచిపోతూండటం చూస్తే నాకు విచారం కలుగుతోంది. భారతదేశంలో మతమంటే అపరోక్షానుభూతే! ఈ ప్రత్యక్షానుభవానికి తగ్గినదేదీ మతమేకాదు. “ఈ ధర్మాన్ని నమ్ముకో! నీకు క్షేమమవుతుంది” అనే ఇలాంటి బోధలు మన చెవికెక్కవు. మనకు వాటిలో నమ్మకంలేదు. నిన్ను నీవు ఎలాంటి వానినిగా చేసుకొంటావో, అలాంటి వాడవుగా ఉంటావు. ఈశ్వరకృప వలన, నీ సాధన వలన, నీ విప్పుడిలాంటి వాడవయ్యావు. కొన్ని సిద్ధాంతాలను, కొన్ని ధర్మాలను, ‘నమ్మడం’ మాత్రం కాదు. భారతదేశంలో ఆధ్యాత్మికాకాశం నుండి వినవచ్చిన గంభీరశబ్దం అనుభూతి; అంటే ప్రత్యక్షానుభవం. “బ్రహ్మమును సాక్షాత్కారం చేసుకోవాలి” అనే బోధ మన గ్రంథాల్లో మాత్రమే పలుమార్లు వినవస్తోంది. ధైర్యవంతం, సాహసోపేతం అయిన పలుకులివి! కానీ, అవి సంపూర్ణంగా సత్యాలే! ప్రతిశబ్దమూ, ప్రతి స్వరమూ, సత్యమే! మతాన్ని అనుభూతిచేయాలి. వింటే చాలదు. చిలుకలాగా, ఏదో శాస్త్రాన్ని నేర్చుకోడం చాలదు. దేన్నిగానీ, మానసికంగా అంగీకరించినంతమాత్రాన, మతం కాబోదు. అందులో ఏమీ ప్రయోజనం లేదు. అవి మనలోపలికి ప్రవేశించాలి. చూడండి, భగవంతుడున్నాడనే విషయంలో మనకున్న గొప్ప నిదర్శనం, మన తర్కం అలా చెబుతోందనడం కాదు. ప్రాచీనులు, నవీనులుకూడ భగవంతుని సాక్షాత్కారం పొందారు. కాబట్టే, మనం రుజువైందంటున్నాం. ఆత్మ ఉందని రుజువు చేయడానికి బలవత్తర కారణాలున్నాయి. కానీ, మనము దాని ఉనికిని విశ్వసించడం అందువల్లనే కాదు. ముఖ్యంగా భారతదేశంలో పూర్వకాలంలో, ఎన్నో వేలమంది, ఆత్మసాక్షాత్కారం పొందారు. ఈ కాలంలోకూడ చాలామంది పొందుతున్నారు. భవిష్యత్కాలంలోనూ, అలాంటి సాక్షాత్కారాన్ని పొంది, తమ ఆత్మలను చూడగల్గువారు, వేలకొద్దీ ఉంటారు. అందువల్ల ఆత్మ ఉందనే విశ్వాసం, మనలో దృఢంగా నిలిచింది. నరుడు స్వయంగా దేవుని చూచేంతవరకు, తన ఆత్మను ప్రత్యక్షం చేసుకొనేవరకు, వానికి మోక్షంలేదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకొందంగాక! మనం దీన్ని గ్రహించినకొద్దీ, భారతదేశంలోని సాంప్రదాయక దురభిమానం తగ్గిపోతూంటుంది. ఎందుకంటే, భగవంతుని అనుభూతికి తెచ్చుకొని వానిని చూపినవాడే, మతధర్మ పరాయణుడు. దగ్గరవానిలో దగ్గరగా, దూరపు వానిలో దూరంగా ఉండే దైవాన్ని ఎవరు చూస్తారో, వారి హృదయగ్రంథులు తెగిపోతాయి. అతని సంశయాలు తీరిపోతాయి. అతడు మాత్రమే కర్మఫలం నుండి ముక్తుడవుతాడు. ఓహో! వ్యర్థప్రలాపాలనే మతధర్మాలుగాను, కేవల బుద్ధిసాధ్య ప్రసంగాలనే ఆత్మసాక్షాత్కారంగాను, భావించి, మనం తరుచుగా పొరబడుతుంటాం. ఆ తర్వాత సాంప్రదాయక దురభిమానాలు బయలుదేరి పోట్లాటలు సాగుతాయి. అపరోక్షానుభూతే నిజమైన మతమని, మనం ఒకసారి గ్రహిస్తే, మన హృదయాలను పరిశోధించుకొని, మత ధర్మాలను ఎంతవరకు అనుభూతి చేసుకోగల్గామో తెలిసికొంటాం. అప్పుడు మాత్రమే మనం చీకటిలో దేవులాడుకొంటూ, ఇతరులనుకూడ, ఆ చీకటిలోకే తీసుకొని పోతున్నామని గ్రహిస్తాం. అప్పుడు మనం పాక్షిక దురభిమానాలను, వివాదాలను, దెబ్బలాటల్ని మానుకొంటాం. ఎవరైనా, శాఖాసాంప్రదాయకమైన పోరాటాన్ని మొదలిడ ప్రయత్నిస్తే, వానిని ఇలా ప్రశ్నించండి. “నీవు భగవదనుభూతిని పొందావా? నీవాత్మను కనుగొన్నావా? లేకపోతే, భగవంతుని పేరిట ప్రచారం చేయడానికి నీకేం అధికారంవుంది? నీ మట్టుకు నీవే, చీకటిలో దేవులాడుతూ నన్నుకూడ ఆ చీకటిలోకి లాగడానికి ప్రయత్నించడం* గ్రుడ్డివాడు, గ్రుడ్డివానికి త్రోవచూపుతూ, ఇద్దరూ గోతిలోపడేలా అవుతుంది కదా?”
కాబట్టి, మీరుపోయి ఇతరుల దోషాలను వెదకడానికి ముందు, జాగ్రత్తగా ఆలోచించండి. వారు తమ హృదయంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నంతవరకు, భగవత్సాక్షాత్కారం పొందడానికి, వారి మార్గాన వారిని పోనివ్వండి. విశాలం, నిష్కళంకం అయిన సత్యమే గోచరిస్తే, వారు పరమానందాన్నే పొందుతారు. భారతదేశంలోని ప్రతి ఋషీ సత్యసాక్షాత్కారం పొందిన ప్రతి సిద్ధపురుషుడూ, ఈ పరమానందం గూర్చి రుజువు పలుకుతున్నారు. అప్పుడు వారి హృదయాలనుండి ప్రేమపూరితమైన మాటలు మాత్రమే వెలువడతాయి. ఎందుకంటే అకళంక ప్రేమస్వరూపి అయిన భగవంతుని వారి హృదయాలు స్పృశించి ఉంటాయి. అప్పుడు మాత్రమే, అన్ని శాఖాదురభిమానపు పోరులు అణగిపోతాయి. అప్పుడు మాత్రమే మనం హిందువనే శబ్దాన్ని, ఆ పేరు పెట్టుకొన్న ప్రతివానినీ అర్థం చేసుకోగలం. అప్పుడు మాత్రమే అలాంటి హిందువును మన హృదయంలోనికి ఆకర్షించుకోవడానికి, కౌగిట చేర్చుకొని గాఢంగా ప్రేమించడానికి, తగిన స్థితి మనకు సంప్రాప్తిస్తుంది. నా మాటలు గుర్తుంచుకోండి; అప్పుడు మాత్రమే మీరు నిజమైన హిందువులు. హిందువనే పేరు ఉచ్ఛరించగానే, బలవర్థకమైన విద్యుత్ప్రవాహం మీ శరీరాలను పులకరింపచేస్తుంది. హిందువని పేరు పెట్టుకొని, ఏ దేశంలో ఉన్నా, మన భాషను మాటాడేవాడైనా కాకపోయినా, అతడు నీకు సన్నిహిత ప్రియబంధువై తోచేటప్పుడు మాత్రమే నీవొక హిందువనిపించుకోవడానికి తగినవాడవవుతావు. హిందువనే పేరుగల ఏవడైనా, ఆపదలో ఉన్నప్పుడు, నీ హృదయం కరిగి, నీ పుత్రుడే ఆపదలో ఉన్నట్లు నీవు అనుభూతి పొందినప్పుడు మాత్రమే నీవు హిందువనిపించుకోవడానికి అర్హుడవవుతావు. ఈ ఉపన్యాసారంభంలో నేను పేర్కొన్న అసదృశ మహామూర్తి అయిన మీ గురుగోవిందసింగు మహాశయునిలాగా, సోదర హిందువులకోసం సర్వం భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మీరు హిందువులనిపించుకోవడానికి తగిన వారవుతారు. ఎవరు హిందూమత రక్షణకోసం తన రక్తాన్ని బలి ఇచ్చాడో, ఎవరు యుద్ధభూమిలో తన కొడుకుల హత్యను కనులారచూచినా, హృదయాన్ని చిక్కబట్టి, తన దేశాన్ని పీడించే శత్రువుల్ని ఎదిరించి పోరాడ సాహసించాడో, – అయ్యో! ఎవరికోసం తన రక్తాన్ని తన సన్నిహిత ప్రియబంధువుల రక్తాన్ని బలిగా అర్పించి, అట్టివారి చేతనే తన మాతృదేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడో, ఆ అప్రతిమ మహామూర్తి, గాయపడిన సింహంలాగా, యుద్ధభూమినుండి మరలి, దక్షిణదేశంలో ప్రశాంతంగా ప్రాణాలు విడవడానికై ప్రవాసం వెళ్ళినా, కృతఘ్నులై తన్ను పరత్యజించిన వారిని గూర్చి, ఒక్క కఠినమైన మాటైనా తన పెదవులనుండి వెలువడనీయలేదు! మీ దేశానికి మీరుపకారం చేయగోరితే, మీలోని ప్రతివాడు, అలాంటి గురుగోవిందసింగు కావలసి ఉంటుంది. మీ స్వదేశీయులలో వేలకొద్దీ లోపాలు మీకు కన్పించవచ్చు; అయినా, వారిలోని హిందూరక్తాన్నే గుర్తించి పాటించండి! వారు మీకు అపాయం కల్గించడానికే సర్వవిధాలా ప్రయత్నించి ఉండినా, మీరు పూజలర్పించవలసిన ప్రధాన దేవతలు వారే! వారిలో ప్రతి ఒక్కడు, మీపై శాపనార్థాలు విసురుతున్నా, మీరు మాత్రం వారిపై దీవనలనే కురిపించండి. వారు మిమ్మల్ని తరిమివేసిన, ఆ మహాసింహాలలాగా మౌనంవహించి చాటుకు వెళ్ళి, శాంతంతో మరణించండి. అలాంటి వాడే హిందువనే పేరు ధరించడానికర్హుడు. అలాంటి ఆదర్శాన్ని నిరంతరం మన ఎదుట ఉంచుకోవాలి. మన కత్తుల నన్నింటినీ పూడ్చిపెడదాం. అన్ని దిశల్లో, ఇట్టి మహాప్రేమవాహినులను ప్రవహింపచేద్దాం!
తమ ఇష్టం వచ్చినట్లు భారతదేశ పునరుద్దరణను గూర్చి ప్రసంగాలు చేసేవారిని అలానే చేయనివ్వండి. ఈ విషయమై యావజ్జీవం పాటు పడుతున్నట్టి, కనీసం పాటుపడ ప్రయత్నిస్తున్నట్టి నేను, మీకు చెప్పేదేమంటే మీరు దైవపరాయణులయ్యేంతవరకు, భారతదేశానికి పురుద్ధరణం లేదు. అంతేకాదు, సర్వ ప్రపంచకళ్యాణం సైతం దానిమీదనే ఆధారపడివుంది. ఏలంటే నేడు పాశ్చాత్య నాగరికత పునాదులు సైతం, అట్టడుగువరకు కదలివున్నాయని నేను మీకు దాపరికంలేక చెబుతున్నాను. జడవాదమనే పొడి ఇసుక పునాదుల మీద కట్టబడిన మహాభవనాలు ఏదో ఒకరోజున భగ్నములై నేలకూలి నాశంకాక తీరదు. ప్రపంచచరిత్ర ఇందుకు సాక్షి, జాతి తర్వాత జాతిగా లేచి, నరుడనగా, జడమయరాశే అని ప్రకటిస్తూ, తమ ప్రభావాన్నంతా జడవాదం మీద నిలుపుతూ వచ్చాయి. చూడండి పాశ్చాత్య భాషలో నరుడు ఆత్మను విడిచాడంటారు. మరి మనమో మనుష్యుడు దేహాన్ని విడిచాడంటాం. పాశ్చాత్యుడు మొదటగా తానొక శరీరమై తర్వాత ఆత్మను పొందుతున్నాడు. మనలో నరుడు ఒక జీవుడు లేక ఆత్మ అయి తానొక శరీరం పొందుతున్నాడు. ఇక్కడనే ప్రపంచమంత విభేదం కనిపిస్తోంది. కాబట్టి ప్రాపంచిక సుఖమనే ఇసుక పునాదుల ఆధారంపై నిర్మించబడిన నాగరికతలన్నీ స్వల్పకాలం జీవించి, ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచరంగంనుండి అదృశ్యమైపోయాయి. కానీ భారతమాతృ పాదాలచెంత నిలిచి భారతీయ నాగరికతను అభ్యసించిన జపాను, చైనాలాంటి ఇతర జాతులు ఈనాటివరకు సజీవమై ఉన్నాయి. ఇంకా వారిలో పునరుద్ధరణ సూచనలు సైతం గోచరిస్తున్నాయి. వారి జీవాలు “ఫీనిక్సు” పక్షి జీవంలాగా, వేయిసార్లు నాశం చేయబడినప్పటికీ మళ్ళీ మళ్ళీ అతిశయవైభవంతో పునర్భవం కావడానికి సంసిద్ధంగా ఉంటాయి. కానీ, జడమయ నాగరికత ఒకసారి నేలకూల్చబడిన తర్వాత, మళ్ళీ ఎన్నడూ తలెత్తజాలదు. ఆ భవనం ఒక్కసారి కూలిందా, ఇక ఎన్నటికీ పనికిరాకుండా ముక్కలు ముక్కలై పోతుంది. కాబట్టి ఓపికతో వేచివుండండి. మనకు భావిభాగ్యోదయం కానుంది.
తొందరపడకండి ఇతరుల నెవ్వరినిగానీ, అనుకరింప తలపకండి. మనం నేర్చుకోవలసిన గొప్పనీతిపాఠమిది. అనుకరణం నాగరికత కాదు. నేను, ఒక రాజువేషం వేసుకోవచ్చు, అంతమాత్రాన నేను రాజునా? సింహపుచర్మం కప్పుకొన్న గాడిద సింహం కాగలదా? అనుకరణం, పిరికితనంతో కూడిన అనుకరణం, ఎన్నడూ వృద్ధి అనిపించుకోజాలదు. అది నరునిలో చూపట్టే దౌర్భాగ్యపతన సూచనే! మానవుడు, తన్నుతాను ద్వేషించుకోవడం ప్రారంభించాడంటే, వానికి చివరి దెబ్బ తగిలినట్లే! తన పూర్వులను గూర్చి సిగ్గుపడటం ఆరంభిస్తే అంత్యకాలం మూడినట్లే! ఇదిగో, హిందూజాతిలో, ఆఖరిమెట్టుమీది వారిలో ఒకడినై నేనున్నాను. అయినా నా జాతిని గూర్చి నేను గర్విస్తున్నాను. నా పూర్వులనుగూర్చి నేను గర్వపడుతున్నాను. హిందువునని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. మీ సామాన్యసేవకులలో ఒకడిని కావడంకూడ నాకు గర్వకారణం. నేను మీతోడి దేశయుడనని, మీరు సాధు సంతానమనీ, మనం ఈ ప్రపంచంలో తేజరిల్లిన మహామహిమాఢ్యులైన ఋషుల వంశం వారమని, నేనెంతో గర్వపడుతున్నాను. కాబట్టి మీరూ ఆత్మవిశ్వాసం పూనండి. మీ పూర్వులనుగూర్చి గర్వపడండి. వారినిగూర్చి ఎన్నడూ సిగ్గుపడకండి. ఇతరులను అనుకరించకండి. నా మాట వినండి. ఎన్నడుగానీ, ఇతరులను అనుకరించకండి. మీరు ఇతరులను అనుకరించి వారి చేతి క్రిందికి పోవునప్పుడంతా, మీ స్వాతంత్ర్యాన్ని కోల్పోతూవుంటారు. పారమార్థిక విషయాల్లో సైతం, ఇతరుల చెప్పుచేతలలో పడి, పనిచేయసాగితే, క్రమేణ, మీ సంకల్పశక్తిని సైతం పోగొట్టుకుంటారు. మీ సొంత అనుభవాలద్వారా మీకు కలదాన్ని ప్రకాశింపజేయండి. ఇతరులను అనుకరించకండి. అయినా, ఇతరులనుండి మంచి అయినదాన్ని తప్పక స్వీకరించండి. మనం ఇతరులనుండి కూడ నేర్చుకోవలసివుంది. విత్తనం భూమిలో నాటండి. దాని పోషణకు కావలసిన ఎరువును, గాలిని, నీటిని దానికివ్వండి. ఆ విత్తనం పెరిగి, మొక్కై, మహావృక్షమై ప్రకాశించేటప్పుడు, అది మన్నా! గాలా! లేక నీరా? అది తనకిచ్చిన సర్వం జీర్ణం చేసుకొని తన స్వభావాన్ననుసరించే మొక్కై మహావృక్షమవుతోంది. మీ స్థితికూడ అలాగే ఉండాలి. ఇతరులనుండి మీరు నేర్వవలసిన విషయాలు నిజంగా చాలావున్నాయి. కొత్తదాన్ని నేర్చుకోవడానికి నిరాకరించేవాడు, ఇదివరకే ప్రాణంపోయిన శవంతో సమానం.
“ఆదదీత పరాం విద్యాం ప్రయత్నా దపరాదపి ।
అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులాదపి ॥
“నీచకులంలో పుట్టినా కన్యారత్నాన్ని భార్యగా స్వీకరించు. నీచజాతి పురుషునికైనా సేవచేసి, పరావిద్యను నేర్చుకో. చండాలునికైనా సేవచేసి ముక్తికై త్రోవను తెలుసుకో” అని మనువు బోధిస్తున్నాడు. ఇతరుల నుండి మంచినంతా నేర్చుకో! నీ లోనికి తీసుకో! నీకు స్వాభావికమైన మార్గంలో దాన్ని జీర్ణం చేసుకో! అంతేకానీ పరుల వేషంమాత్రం వేయకు. ఈ భారతీయ జీవితమార్గంనుండి తొలగిపోవద్దు. భారతీయులంతా పరదేశీయుల వస్త్రధారణ, తిండి తినడం, ప్రవర్తించడం మొదలైనవి ఆరంభించటంవల్ల భారతదేశానికి మేలుకలుగుతుందని ఒక్క త్రుటికాలమైనా అపోహపడకు. కొన్ని సంవత్సరాలపాటు అలవాటైన ఒక అభ్యాసాన్ని వదలివేయడంలోనే ఎన్ని ఇబ్బందులున్నాయో నీకు తెలుసు. ఈ భారతీయతనీ రక్తంలో ఎన్నివేల సంవత్సరాలు జీర్ణమై ఉండిందో దేవునికే ఎరుక! ఈ జాతీయ విశిష్ట జీవన ప్రవాహం ఒక తీరుగా ప్రవహిస్తోంది. అది అలా ఎన్నివేల సంవత్సరాలుగా ప్రవహిస్తోందో, భగవంతునికే తెలుసు! దాదాపుగా మహాసముద్రంలో కలియనున్న ఈ మహాప్రవాహం ఆ హిమవత్పర్వతాల మీది మంచుగడ్డలలోకి మరలిపోగలదనే నమ్మకం నిజంగా నీకుందా? అది అసంభవం. అలాంటి ప్రయత్నం దాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి ఈ జాతి జీవన స్రవంతి త్రోవ సరిచేయి. ఈ మహానది గమనాన్ని అడ్డగించే గుట్టలను తొలగించు; మార్గాన్ని శుభ్రపరచు; కాలువను వాటం చేయి. అప్పుడది సహజ బలంతోనే వేగంగా వెల్లువై ప్రవహిస్తుంది. అప్పుడు ఈ జాతి పరుగులిడుతూ, పురోగమనాన్ని సాగిస్తుంది.
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రచారానికి మార్గాలు ఇవి అని సూచిస్తూ మనవి చేస్తున్నాను. ఇంకా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. వ్యవధి లేకపోవడంచేత ఈ సందర్భంలో వానినన్నిటినీ మీకు తెలుపజాలను. ఉదాహరణకు చిత్రమైన మన వర్ణవిభేద సమస్యను చూడండి. ఈ సమస్యను గూర్చి దీని సాధకబాధకాల గూర్చి, నా యావజ్జీవితం పరిశీలిస్తున్నాను. భారతదేశంలో దాదాపుగా అన్నిప్రాంతాల్లో దాని స్థితిని విచారించాను. ఈ దేశంలో దాదాపుగా ప్రతిభాగంలోను, అన్ని కులాలవారితోను నేను కలిసి తిరిగాను. దీని ప్రాధాన్యం ఎక్కడుందో తెలిసికోవడానికై, నా మనస్సులో చాలా తికమకలుపడ్డాను. దీన్నిగూర్చి పరిశీలించినకొద్దీ, నా అబ్బురపాటు ఎక్కువవుతూ వచ్చింది. చివరికిప్పుడు దాని తేజంయొక్క ఒక చిన్న తళుకునుమాత్రం చూడగల్గాను. ఇప్పుడిప్పుడే దాని అర్థాన్ని అనుభవం చేసుకోనారంభించాను. దీని తర్వాత కలిసి తినడం, త్రాగడం గూర్చిన ఇంకొక మహాసమస్య ఉంది. ఆ సమస్య మనం సామాన్యంగా అనుకొనేలా, అంత వ్యర్థవిషయం కాదు. అన్నపానాలను గూర్చి, మనమిప్పుడు పెట్టుకొన్న పట్టుదలలు బహువిచిత్రంగానూ, మన శాస్త్రవిధులకు కేవలం వ్యతిరేకంగానూ ఉన్నాయి. మనం తినే ఆహారం, త్రాగే నీటి పారిశుధ్యంలో, అశ్రద్ధ చేయడంవల్ల అనర్థాల పాలౌతాం. ఈ ఆచారపు యథార్థభావాన్ని మనం పోగొట్టుకున్నాం.
నేను మీకు తెలుపదలచిన ఇతర ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించట మెలాగో, వాటి రహస్యాలను కనుగొనడమెలాగో, తెలుపాలని ఉంది; కాని ఈ సభ సక్రమ స్థితికి రావడానికి చాలాసమయం పట్టింది. ఇప్పుడింకా మిమ్మల్ని చాలాసేపు ఇక్కడ ఆపడం నా అభిమతం కాదు. కాబట్టి వర్ణవ్యవస్థ మొదలైన విషయాల గూర్చి ప్రసంగించడానికి ఇంకొక అవకాశం కలిగేవరకు, నా భావాలను అలాగే ఉంచుతాను.
ఇంకొకమాట చెప్పి ఈ ఆధ్యాత్మిక భావాలను గూర్చి మాట్లాడ్డం విరమిస్తాను. చాలా కాలంనుండి, భారతదేశంలో మతం స్తబ్ధంగా ఉంది. దాన్నిప్పుడు క్రియాశక్తితో పూరించాలి. ప్రతివాని జీవితంలోనికి దాన్ని చొప్పించటం నా అభిమతం. పూర్వపు రీతినే మతము రాజుల మహా సౌధాల్లో, దరిద్ర కృషీవలుల గుడిసెల్లోకూడ ప్రవేశించవలసివుంది. ఈ జాతి సామాన్య పిత్రార్జిత సంపద, సార్వజనీన జన్మస్వామ్యం అయిన మతాన్ని ప్రతివాని గడప దగ్గరికి, ధారాళంగా తీసుకొని రావలసివుంది. దేవుడిచ్చిన గాలిలాగా, అంతధారాళంగా, అంత సులభసాధ్యంగా, మన దేశంలో మతం సర్వత్ర నిండివుండాలి. భారతదేశంలో మనం నిర్వహించాల్సినది ఇటువంటి పనే; కాని, చిన్ని చిన్ని శాఖాసంప్రదాయాలను బయలుదేరదీసి, విభేదాలు కల్పించే విషయాలను పట్టుకొని ప్రాకులాడుతూ పోట్లాడటంవల్ల ఎన్నడూ, ఏ లాభమూ కలుగదు. మనమందరం ఏకీభవించే విషయాలనే ప్రచారం చేయాలి! అప్పుడు విభేదాలు వాటంతట అవే నివారణ కాగలవు. నేను భారతప్రజలకు మళ్ళీ మళ్ళీ ఇదే చెబుతూంటాను. ఒక గది శతాబ్దాలనుండి చీకటిగా ఉందనుకోండి. ఆ గదిలోనికి పోయి, అబ్బా ఇక్కడ చీకటిగా వుంది, చీకటిగా ఉంది, అని అరుస్తూంటామనుకోండి. ఆ చీకటి పోతుందా? దీపం తీసుకొనిరండి. తక్షణం ఆ చీకటి పటాపంచలైపోతుంది. ప్రజలను సంస్కరించటానికి కూడ తగిన కీలకమిదే! వారికి శ్రేష్ఠతర విషయాలను తెలుపండి. మనిషి యోగ్యతలో విశ్వాసం పూనండి. మనిషి పతితుడై, భ్రష్ఠుడైపోయాడనే నమ్మకం ఆధారం చేసుకొని, మన కృషిని ప్రారంభించడమెందుకు? ఏ సందర్భంలోను, ఎంత నికృష్టుడుగావున్నా, మానవునిలో విశ్వాసాన్నుంచి నేనెన్నడూ భంగపడలేదు. నేను మనిషిలో నమ్మకం ఉంచినప్పుడంతా, ఫలితం మొదట ప్రోత్సాహకరంగా కనబడకున్నా, చివరికి జయప్రదంగానే ఉండేది. గొప్ప విద్వాంసుడుగా కనపడినా, ఎంతో పామరుడిగా కనపడినా, దేవదూతగా కన్పించినా, లేక రాక్షసాధముడుగా కన్పించినా మనిషిలో అచంచలమైన విశ్వాసం ఉంచు. మొట్టమొదట మానవునిలో నమ్మకం ఉంచు. అలా విశ్వాసముంచిన తర్వాత, అతనిలో దోషాలు కన్పిస్తే, అతడు నేరాలు చేస్తే, అతడు ఎంతో దుర్మార్గం, మూఢం అయిన ధర్మాలను అవలంబించినా, అవి అలా తటస్థించటం, నిజంగా అతని స్వభావాన్నిబట్టి కాదనీ, శ్రేష్ఠతరాదర్శాలు కొరవడి ఉండటాన్నిబట్టే అనీ నమ్ము. ఎవడైనా, అసత్యమార్గంలోపోతే దానికి కారణం అతడు సత్యాన్ని తెలుసుకో లేకపోవడమే! కాబట్టి చెడు అయినదాన్ని సవరించే మార్గం సత్యమైనదాన్ని వానికి తెలపడమే! అలా చేసి వానిని విచక్షణ చేసుకోనీ; నీవు వానికి సత్యం తెలుపు. దానితో నీ పని తీరినట్లే. అతడు దీన్ని అదివరకు తనలో ఉన్నదానితో తన మనస్సులోనే సరిపోల్చి చూచుకోనీ. నా మాట నమ్ము. నీవు వానికి యథార్థంగా సత్యాన్నే అందిస్తే, అసత్యం పారిపోయి తీరుతుంది. వెలుగు, చీకటిని తరిమివేసినట్లు సత్యం, అసత్యాన్ని పారద్రోలి, ధర్మాన్ని వెలికి తీసుకొని వస్తుంది. దేశాన్ని ఆధ్యాత్మికంగా నీవు సంస్కరించతలచితే ఇదే మార్గం. పోట్లాట కాదు. ప్రజలతో, వారు చేసేది తప్పని చెప్పడమూ కాదు. ఇది ఒకటే మార్గం. వారి ఎదుట ధర్మముంచు. ఎంత ఆతృతతో వారు దాన్ని స్వీకరిస్తారో చూడండి. ఎన్నడూ నాశం చెందక మనిషిలో, సదా వసిస్తున్న దివ్యాత్మ మేల్కొని, పైకి వచ్చి, ధర్మమైన అన్నిటినీ, తేజోవంతమైన సమస్తాన్నీ స్వీకరించడానికి ఎలా చేతులు చాస్తుందో మీరు స్పష్టంగా కనుగొన గల్గుతారు.
సృష్టికర్త, రక్షకుడు, మన జాతి పోషకుడు, మన పూర్వుల దైవం అయినవాడు, విష్ణువో, శివుడో, శక్తో, లేక గణపతో అతన్ని ఏ పేరుతో పిలిచినా అతనిని సగుణరూపంలో పూజించినా, లేక నిర్గుణరూపంగా ఉపాసించినా, సాకారునిగా అర్పించినా లేక నిరాకారునిగా భావించినా, మన పూర్వులు ఎవనిని ప్రత్యక్షం చేసుకొని, “ఏకం సత్ విప్రా బహుధావదంతి” (ఉన్న సత్యం ఒక్కడే. విప్రులు దాన్ని పెక్కుపేరులు పెట్టి పిలిచారు) అంటూ అభివర్ణించారో, ఆ భగవంతుడు తన దివ్యప్రేమతో మనల్ని ఆవహించుగాక! ఆయన తన ఆశీర్వాదాలను మనపైని వర్షించుగాక! మనం పరస్పరం ఒకరి భావాన్ని ఒకరు గ్రహించేలా చేయునుగాక! మనం ఒకరి యెడల ఒకరు నిజమైన ప్రేమతో, గాఢతరాభిమానంతో పని చేసేలా చేయును గాక! స్వఖ్యాతికోసంగాని, స్వప్రతిష్ఠకోసంగానీ, స్వలాభం కోసంగానీ, అత్యల్పపు కోరికైనా, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక పునరుద్ధరణ మహోద్యమంలో చొరబడకుండుగాక!