పంజాబ్లోని శియాల్కోటలో ఇచ్చిన ఉపన్యాసం
పాంచాల, కాశ్మీర ప్రదేశాలనుండి వచ్చిన ఆహ్వానాలను అంగీకరించి, శ్రీ వివేకానందస్వాములవారు ఆ ప్రాంతాలలో సంచారం చేశారు. శ్రీవారు కాశ్మీరంలోనే నెలకు పైగా గడిపారు. మహారాజు, ఆయన సోదరులు, శ్రీవారి ఉద్యమాన్ని చాలా మెచ్చుకొన్నారు. వారు ముర్రే, రావల్పిండి, జమ్మూనగరాల్లో కొన్నికొన్ని దినాలు గడుపుతూ, ఆయాచోట్ల ఉపన్యాసాలిస్తూ వచ్చారు. తర్వాత శ్రీస్వాములవారు శియాల్కోటకు వచ్చి అక్కడ ఒకటి ఆంగ్లంలోను, ఒకటి హిందీలోను, రెండు ఉపన్యాసాలిచ్చారు. శ్రీవారి హిందీ ఉపన్యాస విషయం ‘భక్తి’ దాని సంక్షేపానువాదం ఈ క్రింద ఇవ్వబడింది.
ప్రపంచంలోవున్న విభిన్న మతాలు, అవి అవలంబించే పూజా విధానాలనుబట్టి వేర్వేరుగా తోస్తున్నా, నిజానికి అవన్నీ ఒకటే! కొన్నిచోట్ల ప్రజలు గుళ్ళనుకట్టి వాటిలో పూజలు చేస్తారు. కొన్నిటిలో అగ్నిని పూజిస్తారు. కొన్ని మతాల్లో విగ్రహాలను పెట్టి వాటిముందు సాష్టాంగపడతారు. ఇది ఇలా ఉండగా దేవుడంటే విశ్వాసమేలేని వారనేకులున్నారు. మతాలన్నీ సత్యమే. యథార్థమైన భావాన్ని, ఆంతరమైన మతధర్మాన్ని విచారించితే మతాలన్నీ ఏకరూపంగా ఉంటాయి. కొన్ని మతాల్లో భగవంతుని పూజించడంలేదు. ఇంతేల, భగవంతుడున్నాడనీ నమ్మరు. కాని ధర్మాత్ములు, ఉత్తములు అయిన నరులను దేవతల లాగానే పూజిస్తారు. దీనికి ఉదాహరణంగా బౌద్ధమతాన్ని చెప్పుకోవచ్చు. దేవునిపట్ల చూపినా, లేక మహాపురుషులపట్ల చూపినా, భక్తి అనేది అంతటా ఉంది. భక్తిరూపమైన ఉపాసన సర్వత్ర శ్రేష్ఠమైంది. ఈ భక్తిని జ్ఞానం కన్న ఎక్కువ సులభంగా పొందవచ్చు. జ్ఞానానికి అనుకూల పరిస్థితులు, తీవ్రసాధన అవసరం. దైహికంగా మంచి ఆరోగ్యవంతుడై సమస్త సంసార సంగముల నుండి విడివడితే తప్ప ఎవడూ, ఈ యోగాన్ని సక్రమంగా సాధనచేయజాలడు. కాని భక్తి, ఎలాంటి జీవితావస్థలోవున్నా సులభంగా సాధనచేయవచ్చు. భగవంతునిపట్ల గాఢమైన ప్రేమే భక్తి అని భక్తిసూత్రాలను రచించిన శాండిల్య ఋషి చెబుతున్నాడు. ప్రహ్లాదుడుకూడ ఇదేరీతిగా పల్కుతున్నాడు. ఒక్కనాడు తిండి దొరకని మనుష్యుడు బాధపడతాడు. అతని కొడుకు మరణిస్తే, ఆ విపత్తు అతనికెంత దుఃఖాన్ని కలిగిస్తుంది? భగవంతుని కోసమై పరితపించేటప్పుడు, భక్తుని హృదయంలో అలాంటి దుఃఖమే అనుభవానికి వస్తుంది. భక్తియొక్క గొప్ప సుగుణమేమంటే, అది మనస్సును నిర్మలం చేస్తుంది. పరమేశ్వరుని పట్ల కుదిరిన సుస్థిరభక్తి ఒక్కటే, మనస్సును పవిత్రం చేయగల్గుతుంది. “ఓ భగవంతుడా! నీకు ఎన్నో పేర్లున్నాయి. కాని ప్రతిపేరులో నీ మహిమ సమంగా ప్రకాశిస్తోంది. అందులో నిగూఢం మహనీయం అయిన అర్థం గర్భితమై ఉంటుంది.” దేశకాల విచక్షణలేక నిరంతరం మనం భగవంతుని స్మరిస్తూండాలి.
భగవంతుని పూజించడంలో ఉపయోగించే భిన్న భిన్న నామాలు, చూపులకు మాత్రమే అలా భిన్నములై కన్పిస్తాయి. ఒకడు, తాను భగవంతుని పూజించే విధానమే మహామహిమాఢ్యమని భావిస్తాడు. ఇంకొకడు, తన మార్గమే మోక్షాన్ని సంపాదించగల మహిమాన్విత విధానమని భావిస్తాడు. కాని అన్ని విధానాలయొక్క యథార్థమైన మూలాధారాన్ని కనుగొనడు; అది ఒక్కటిగానే ఉంటుంది. శైవులు, శివుని మహామహిమాఢ్యుడంటారు. వైష్ణవులు విష్ణుని సర్వశక్తిమంతుడని సేవిస్తారు.
దేవ్యారాధకులు తమ దేవి విశ్వంలో సర్వశక్తిమతి అని ఎవ్వరికీ తీసిపోక వాదిస్తారు. నీకు సుస్థిరభక్తి కావాలంటే వైరభావాన్ని విడనాడాలి. ద్వేషం, భక్తిమార్గంలో చాలా ప్రతిబంధకంగా నిలుస్తుంది. ఎవరిపట్లా ద్వేషంలేని నరుడే, భగవంతుని చేరగల్గుతాడు. అప్పుడు సైతం, తన ఇష్టదైవతంపట్ల భక్తిచూపడం అవసరమే.
“’ విష్ణువును, రాముడును ఒక్కటే అని నాకు తెలుసు. అయినా కమలనేత్రుడైన రాముడే నా పరమ నిధానము” అని హనుమ చెబుతున్నాడు. నరునికి పుట్టుకతో వచ్చే విశిష్టమైన వాసనలు, వానితో ఉండిపోతాయి. ప్రపంచమంతా ఒకే మతాన్ని అవలంబించకుండ ఉండటానికిదే ముఖ్యహేతువు. ఒక్క మతం మాత్రమే ఉండడాన్ని భగవంతుడు కూడ నిరాకరించుగాక! ఏలంటే అప్పుడు ప్రపంచం గజిబిజిగా ఉంటుంది. క్రమవిధానంకల విశ్వంగా ఉండజాలదు. ప్రతి నరుడూ తనకు విశిష్టములైన సంస్కారాలను అనువర్తింపవలసివుంది. తన మార్గాన్ని అనుసరించి సాగిపోవడానికి సాయపడే గురువు లభిస్తే అతడు పురోభివుద్ధిని పొందుతాడు. ప్రతి మనిషిని, వాని ఇచ్ఛానుసారం పోనీయాలి. అలాకాక, వానిని బలవంతంగా వేరొకమార్గంలో ప్రవేశపెడితే, అతడు తనకున్న దానినికూడ కోల్పోయి, ఎందుకు కొరగానివాడవుతాడు. ఒకని ముఖం వేరొకని ముఖాన్ని పోలి ఉండనట్లుగా ఒకని స్వభావం వేరొకని స్వభావాన్ని పోలి ఉండదు. కాబట్టి వానిని వానికి అనుకూలమైన విధంలో వర్తించకుండ మనమేల అడ్డుపెట్టాలి? ఒకనది ఒకానొక దిశగా పారుతోంది. నీవు దాని ప్రవాహాన్ని మార్చి, వేరొక సరళమార్గంలో ప్రవేశపెడితే అది ఎక్కువ వేగంగా ప్రవహిస్తుంది. దాని శక్తి ఎక్కువవుతుంది. కాని, దాని సరళమార్గంనుండి బొత్తిగా మార్చేయాలని ప్రయత్నిస్తే దాని ఫలితం ఏమవుతుందో చూడు. నీరు తగ్గిపోతుంది. దాని బలం క్షీణిస్తుంది. ఈ జీవితం చాలా ముఖ్యమైంది. కాబట్టి ఎవని సంస్కారం ఎలా ప్రేరణచేస్తే అలా ఆ మార్గంలో వానిని నడపాలి. భారతదేశంలో మతవైరం లేదు. ప్రతిమతానికి సర్వస్వాతంత్ర్య మీయబడింది. కాబట్టే మతం సజీవమై నిలిచింది. ఒక్క మతమే సత్యమనీ, తన మతాన్ని విశ్వసించని వాడు మూర్ఖుడనీ, ఇతరుడు కపటి అనీ, కపటికాకపోతే తన మతాన్నే అవలంబించే వాడనీ, భావించడం వల్లనే, మత విషయకంగా పోరాటాలు కలుగుతున్నాయని, జ్ఞప్తియందుంచుకోవాలి.
ప్రజలందరూ ఒకే మతాన్ని అవలంబించాలనేది భగవదిచ్ఛ అయితే, ఇన్ని మతాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ప్రతివానిని ఒకే మతం అనుసరించమని బలాత్కరించడానికి అనేకులిదివరకు వ్యర్థప్రయత్నాలు చేశారు. కత్తి ఎత్తి ప్రజలనందరినీ ఒకే మతంలోనికి చేర్చాలని ప్రయత్నించినప్పుడు సైతం దాని స్థానంలో పదిమతాలు పుట్టుకొని వచ్చాయని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఒకే మతం, అందరికీ సరిపడదు. నరుడు క్రియా ప్రతిక్రియలనే రెండు శక్తుల సమ్మేళనతో ఏర్పడుతున్నాడు. ఈ శక్తులతనిని జిజ్ఞాసువుగా చేస్తున్నాయి. అలాంటి శక్తులు, నరుని మనస్సుకు వ్యాయామం కల్పించకపోతే, అతడు జిజ్ఞాస చేయడానికి, అంటే ఊహించడానికి, అశక్తుడైపోతాడు. ‘మానవుడు’ అంటే మననం చేసే వాడని అర్థం. మనుష్యః అనగా మనస్సు కలవాడని అర్థం. అట్టి మనుష్యుని మననశక్తి, లేక జిజ్ఞాసశక్తి లేక ఊహాశక్తి నష్టమైపోయిన తక్షణమే అతడు పశుసమానుడై పోతాడు. అలా కావాలని ఎవరు కోరుకొంటారు? అలాంటి దుర్దశ భారతదేశప్రజలకు వాటిల్లకుండ భగవంతుడు రక్షించుగాక! మనుష్యునిగా నిలపడానికి ఏకత్వంలో భిన్నత్వం ఉండటం అవసరం. ప్రతి విషయంలోను, భిన్నత్వాన్ని అంటే, వైవిధ్యాన్ని పోషించాలి. భిన్నత్వ ముండేంతవరకే ఈ ప్రపంచం నిలువగలదు. ఒకటి చిన్నదిగా ఇంకొకటి పెద్దదిగా ఉండటం మాత్రమే భిన్నత్వమని భావించరాదు. ఈ జీవితంలో అన్నీ తమ తమ స్థితిలో సమంగా, స్వధర్మాన్ని నిర్వహిస్తే భిన్నత్వం సురక్షితంగానే ఉంటుంది. ప్రతిమతంలోను, యోగ్యులు, సమర్థులువుండి, తాము పూనిన మతాన్ని గౌరవభాజనంగా చేస్తున్నారు. ప్రతి మతంలోనూ, అలాంటి వారుంటారు. కాబట్టి ఏ సంప్రదాయం పట్ల ద్వేషమనేది ఉండరాదు.
అలా అయితే కళంకాన్ని ప్రోత్సహించే మతాన్ని మనం గౌరవించాలా? అని మీరు ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు వ్యతిరేకంగా ఉంటుందనడం నిజం. అటువంటి మతాన్ని తక్షణం బహిష్కరించి వేయవలసిందే! అది అనర్థమూలం; అరిష్టదాయకం. మతాలన్నీ తప్పక నీతి మీద ఆధారపడివుండాలి. ధర్మంకంటె పవిత్రశీలం గొప్పదిగా భావించాలి. ఈ సందర్భంలో ఆచారమంటే బాహ్య అభ్యంతరాలలో శుచిగా ఉండటం అని అర్థం. శరీరాన్ని శాస్త్రంలో చెప్పినట్లు, నీళ్ళు మొదలైన వస్తువులతో కడుక్కోవడంవల్ల బాహ్యశౌచం సంపాదించుకోవచ్చు. అభ్యంతరంలో అబద్ధమాడకుండటంవల్ల కల్లు సారాయిలను సేవించకుండటం వల్ల అవినీతి కార్యాలను చేయకుండటంవల్ల పరోపకారం చేయడంవల్ల మానవుడు పవిత్రుడవుతున్నాడు. ఏ పాపమూ చేయక, అబద్ధం పలుకక, త్రాగక, జూదమాడక, దొంగతనం చేయక, కాలం గడిపితే నీకు మంచిదే. కాని, అది నీ ధర్మంమాత్రమే అవుతుంది. అందువల్ల నిన్ను మెచ్చుకోవలసిన పనిలేదు. నీవు కొంత పరోపకారం కూడ చేయవలసివుంది. నీవు, నీకు ఉపకారం చేసుకొంటావు. కాబట్టే, ఇతరులకుకూడ ఉపకారం చేయవలసి ఉంది.
ఇక్కడ ఆహార నియమాలను గూర్చి కొంతచెబుతాను. పూర్వాచారాలన్నీ మాసిపోయాయి. వీనితో కూర్చుండి తినకూడదు, వానితో కూర్చుండి తినకూడదు, అనే పిచ్చి నమ్మకాలు తప్ప మరేమీ మన దేశీయులలో మిగులలేదు. వందలకొద్దీ సంవత్సరాలకు పూర్వం విధించిన ధర్మసూత్రాలలో స్పర్శసంబంధమైన శుచిమాత్రం, శిధిలంకాక నిలిచివుంది. శాస్త్రం, మూడు విధాలైన ఆహారాన్ని తినకూడదని చెబుతోంది. మొదటిది ఉల్లి, వెల్లుల్లిలాంటి పదార్థాలు; ఇవి స్వభావంచేతనే దోషం కలవి. వీనిని ఎక్కువగా మెక్కితే కామం పుడుతుంది. అటు తర్వాత నరునికి, నారాయణునికి కూడ అసహ్యం పుట్టించే అవినీతి కార్యాలు జరుగుతాయి. రెండవది: అన్యపదార్థాలవల్ల అపవిత్రమైన ఆహారం భోజనం చేయడానికి, పూర్తిగా శుభ్రమైన పవిత్రమైన ఏదైనా స్థలాన్ని ఏర్పరుచుకోవాలి. మూడోది: దుష్టులు తాకిన ఆహారాన్ని భుజించరాదు. ఎందుకంటే అలాంటి వస్తువుల సంపర్కంవల్ల మనలో చెడుసంకల్పాలు పుడతాయి. బ్రాహ్మణుని కుమారుడైనా, పోకిరివాడై, దురభ్యాసాలు కలవాడైతే, అతడు తాకిన ఆహారాన్ని తినకూడదు.
ఇలాంటి నియమాల భావమేమో అంతరించింది. ఉత్తమకులంలో పుట్టని నరుడు ఎంతటి మహాజ్ఞాని అయినా, పవిత్ర పురుషుడైనా, అతని చేతి ఆహారాన్ని తినరాదు అనడంమాత్రం నిలిచివుంది. ఈ ప్రాచీన విధులను నిర్లక్ష్యం చేయడం మిఠాయి దుకాణాల్లోమాత్రం కనిపిస్తుంది. అక్కడికిపోయి చూస్తే, ఆ మిఠాయి అంగడి అంతటా ఎగురుతున్న ఈగలను, రోడ్లమీదినుండి గాలికి కొట్టుకొనివచ్చి మిఠాయిని కప్పేసే దుమ్మును, శుభ్రత, ఒబ్బిడిలేని వస్త్రాలు ధరించిన అంగడివాడు, ప్రత్యక్షమౌతారు. హల్వాషాపులో అద్దాలపెట్టెలో ఉండే మిఠాయిని తప్ప కొనబోమని ఏకకంఠంతో కొనేవారంతా చెప్పాలి. అందువల్ల ఈగలు ముసిరి, కలరా ప్లేగు పుట్టించే క్రిములను మిఠాయికి అంటించకుండ ఆపినట్టి పుణ్యం లభిస్తుంది. మనం సర్వతోముఖంగా అభివృద్ధి పొందవలసివుంది. కాని, అలా అభివృద్ధి పొందడానికి మారుగా, వెనుకబడిపోతున్నాం. నీటిలో ఉమ్మివేయడం తగదని మనువు చెప్పి ఉండగా, మనం నానావిధాలైన అశుద్ధాలను పావన నదులలో పడవేస్తున్నాం. ఈ విషయాలన్నీ చూడగా మన బాహ్యశరీర శుచికూడ చాలా అవసరంగానే కనిపిస్తోంది. మన శాస్త్రకారులీ సంగతిని బాగా ఎరుగుదురు. ఆహారశౌచాన్ని గూర్చిన ఈ ఆచారంయొక్క యథార్థమైన భావం నాశనమైపోయింది. కేవల బాహ్యరీతులు మాత్రం నిలిచివున్నాయి. దొంగలు, తాగుబోతులు, నేరగాండ్రు స్వకులం వారైనంత మాత్రాన, మనతో ఉండటానికి ఒప్పుకొంటున్నాం. కాని, యోగ్యుడు, ఉత్తముడు అయినవాడు తనతో సమానంగా, గౌరవనీయుడైన ఒక తక్కువ జాతివానితో భోజనంచేస్తే, అతన్ని వెలివేస్తున్నాం. అలాంటి శీలవంతుని నిరసిస్తున్నాం. తృణీకరిస్తున్నాం. ఈ ఆచారం మన దేశానికెంతో వినాశకరం. పాపుల సంపర్కంవల్ల పాపమే మూడుననీ, పుణ్యపురుషుల సహవాసంవల్ల పుణ్యం వస్తుందనీ, దుర్మార్గులకు దూరంగా ఉండటమే బాహ్యశౌచమనీ, మనం స్పష్టంగా గ్రహించవలసివుంది.
అభ్యంతర శౌచం ఇంతకంటే ఎక్కువ కఠినమైన ధర్మం! అందులో సత్యం పల్కడం, బీదలకు ఉపకారం చేయడం, నిస్సహాయులకు తోడ్పడటం, మొదలైనవి ఇమిడివున్నాయి. మనం ఎప్పుడూ నిజమే చెబుతున్నామా! తరచుగా జరుగుతున్నదిది. ఏదో తమ అవసరం తీర్చుకోవడానికి ప్రజలు డబ్బుగల వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారిని పేదల పెన్నిధానమనీ, దీనులపాలిటి కల్పవృక్షమనీ, ముఖస్తుతులు చేయడం మొదలుపెడ్తారు; ఆ ధనికులు, తమ ఇంటికి వచ్చే పేదల గొంతులుకోసేవారైనా సరే! ఇదంతా ఏమి? అబద్ధమాడటం తప్ప మరేమీ కాదు. మనస్సును మైలపడచేసేదిదే! కాబట్టే, ఏ మానవుడైనా తన అంతఃకరణను పవిత్రం చేసుకొని పండ్రెండు సంవత్సరాలకాలం, ఒక్క దుష్టసంకల్పమైనా తన హృదయంలోనికి రానీయకపోతే, అలాంటివాడు ఏది పల్కితే అది జరిగి తీరుతుందని చెప్పినమాట ఎంతో సత్యం. సత్యసంధత శక్తి ఇలాంటిది. బాహ్యంలోను, ఆంతర్యంలోను, శుచియైన వానికి మాత్రమే భక్తి కుదురుతుంది. చిత్రమేమంటే భక్తే, చాలావరకు మనస్సును పవిత్రం చేస్తుంది. హిందువులాగా, బాహ్యశౌచానికి అధికమైన ప్రాముఖ్యాన్ని, యూదులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఇవ్వకున్నా ఏదో ఒక రూపంలో కొంతవరకు దాన్ని వారుకూడ పాటిస్తూనే ఉన్నారు. అది కొంతవరకు సదా అవసరమవుతూ ఉంటుందని వారూ తెలుసుకొన్నారు. యూదులు విగ్రహపూజను ఖండిస్తారు. కానీ వారికీ ఒక దేవాలయం ఉండేది. అందులో, వారొక పెట్టెనుంచేవారు. దానికి ఆర్క్ అని పేరు. దానిలోపల దైవాజ్ఞాఫలకం భద్రపరచబడి ఉంటుంది. ఆ పెట్టెపైన రెక్కలు విప్పుకొని నిలుచుండిన ఇద్దరు దేవదూతల విగ్రహాలుంటాయి. వాటిమధ్య మేఘ రూపంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడని వారి భావన. ఆ దేవాలయం చాలాకాలం క్రిందటే ధ్వంసమైంది. కానీ, అదే నమూనాతో క్రొత్త దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో మందసాలుపెట్టి మతగ్రంథాలను అందులో ఉంచుతున్నారు. రోమన్ కాథలిక్కులు, గ్రీకు క్రైస్తవులు, ఒక విధమైన విగ్రహారాధన చేసేవారే. ఏసు విగ్రహాన్ని, అతని తల్లి విగ్రహాన్ని వీరు పూజిస్తారు. ప్రొటెస్టెంటులలో విగ్రహార్చనం లేదు. కానీ, వాళ్ళు సగుణరూపంలో భగవంతుని పూజిస్తూనే ఉన్నారు. అది మరొక రూపమైన విగ్రహారాధనే అనవచ్చు. పార్శీలు, ఇరానియన్లు చాలావరకు అగ్నిపూజ చేస్తున్నారు. మహమ్మదీయులు ప్రవక్తలను, మహాపురుషులను పూజిస్తారు. ప్రార్థన సమయాల్లో “కాబా” వైపునకు ముఖాలు త్రిప్పుతారు. మత సాధనలో, ప్రథమదశలో, బాహ్యమైన దేనినైనా ఆధారం చేసుకోవడం, మానవులకు అవసరమని ఈ విషయాలు రుజువు చేస్తున్నాయి. అంతః కరణ నిర్మలమైనకొద్దీ వారు సూక్ష్మభావాలవైపు దృష్టిని మరలిస్తారు. “జీవుడు బ్రహ్మంతో ఐక్యానుసంధానం పొందగోరడం ఉత్తమం. ధ్యానసాధన మధ్యమం. నామజపం అధమం. బాహ్యపూజ అధమాధమం.” అయినా, ఈ తుదిసాధన చేయడంలో పాపంమాత్రం లేదని స్పష్టంగా గ్రహించాలి. ప్రతివాడు తాను దేన్ని చేయడానికి సమర్థుడో దాన్నే చేయాలి. అలా చేయకుండా అతన్ని నిరుత్సాహపరిస్తే తన గమ్యాన్ని సాధించడంకోసం మరొక రూపంలో దాన్నే అతడు చేస్తాడు. కాబట్టి, విగ్రహారాధన చేసేవాళ్ళను దూషించరాదు. వారు అలాంటి పరిణామదశలో వున్నారు. కాబట్టి అలాగే చేసితీరాలి. అలాంటివారు ఉత్తమ దశను పొందడానికై ముందుకు సాగిపోయేలా, బుద్ధిమంతులైనవారు సాయపడాలి. అంతేగానీ, ఆయా పూజావిధానాలను గూర్చి పోరాడడం వల్ల ప్రయోజనంలేదు.
కొందరు ధనాన్నికోరి భగవంతుని పూజిస్తారు. మరికొందరు పుత్ర సంతానంకోరి పూజలు చేస్తారు. వీరు భాగవతులమని చెప్పుకొంటారు. కానీ వారిది భక్తి కాదు. వారు నిజమైన భాగవతులు కారు. బంగారం చేయగలనని ఏ దొంగ సాధువైనా వస్తే, వీరంతా వానిచుట్టూ మూగుతారు. అయినా తాము భాగవతులమనే భావిస్తారు. పుత్ర సంతానంకోసం భగవంతుని పూజిస్తే, అది భక్తి అనిపించుకోదు. ధనవంతులు కాగోరి పూజలుచేస్తే, అది భక్తి కాదు. స్వర్గాన్ని కోరినాకూడ భక్తి కాదు. నరక బాధలనుండి రక్షణకోరి దేవపూజలు చేసినా, అది భక్తి అనిపించుకోదు. భయం, ఆశ ఉన్నంతవరకు, భక్తి ఫలించదు. “ఓ దేవా! నాకు సౌందర్యవతి అయిన భార్య అక్కర్లేదు. జ్ఞానమక్కర్లేదు. మోక్షంకూడ వద్దు. నన్ను నూరుసార్లు చావనివ్వు. పుట్టనివ్వు; నేను కోరుకొనేది సదా నీ పాదసేవ మాత్రమే.”
“ధనమును కోర, మరియు నర్థమ్ము కోర;
కాంక్షతో నేను కామభోగముల కోర;
సరకు సేయను సుంతయు సరకుసేయ;
కర్మమును బట్టి ఏదైన కలుగనిమ్ము;
ఎన్ని జన్మము లెత్తిన నెత్త నిమ్ము;
నీ పదాంభోజ యుగమందు నిశ్చలమగు,
భక్తి యుండిన చాలు; మత్ప్రార్థనమ్ము
స్వీకరింపుము శ్రీకృష్ణ, స్వీకరింపు.”
నరుడు అన్నిట్లో నారాయణుని, నారాయణునిలో అన్నిటినీ చూడగల్గినప్పుడు మాత్రమే, పూర్ణభక్తి లభిస్తుంది. అప్పుడు మాత్రమే, పిపీలికాది బ్రహ్మపర్యంతం, ప్రతిదానిలోను విష్ణువు అవతారం ధరించి, వానికి గోచరించగలడు. అప్పుడు మాత్రమే, అన్నిట్లోను భగవంతుడు ప్రత్యక్షమై ఉన్నట్లు తెలుసుకోగలడు. అప్పుడు మాత్రమే భగవంతుని విడిచి మరేది ఇసుమంతకూడ ఉండజాలదనే అనుభవం అతనికి కలుగుతుంది. అప్పుడు, ఆ దశలో మాత్రమే, తాను సమస్త ప్రాణులకంటే, అల్పుడనే భావం కలుగుతుంది; సత్యమైన భక్తి తాత్పర్యంతో భగవంతుని పూజించగలుగుతాడు. అప్పుడు ఆ నరుడు, తీర్థాలను, బాహ్యపూజా విగ్రహాలను వదలి ముందుకు సాగిపోతాడు. ప్రతి జీవిని, పరమపవిత్రమైన దేవాలయంగా చూడగల్గుతాడు.
శాస్త్రాలలో భక్తి అనేక విధాలుగా వర్ణించబడింది. భగవంతుడు, మన తండ్రి అనీ, తల్లి అనీ అనేక విధాలుగా చెప్పుకొంటున్నాం. మనలోని భక్తిని గాఢం చేసుకోవడానికి, భగవంతునికి దగ్గరై, ప్రేమాస్పదులమై ఉండటంకోసం, ఈ బంధుత్వాలను కల్పించుకొంటాం. కాబట్టి ఈ పేరులన్నీ ఒక విధంగా సమంజసమే! అంటే, ఈ శబ్దాలు కేవలం ప్రేమసూచకాలైన శబ్దాలే! అవి నిజమైన భక్తుడు, భగవంతునిగూర్చి అనుభవించే అనురాగపూర్వకమైన ప్రేమ ఫలితార్థమే! రాసలీలలలోని, రాధాకృష్ణుల గాథను పరిశీలించండి. ఆ కథ యథార్థమైన భక్తుని, ప్రపత్తి భావానికి నిదర్శనంగా ఉంది. ఎందుకంటే స్త్రీ పురుష ప్రేమనుమించిన ప్రేమ ప్రపంచంలో లేదు. అలాంటి గాఢమైనప్రేమ ఉంటే భయంకానీ, ఇతర అనుబంధాలుకానీ ఉండవు. ఆ జంటను ఏకంచేసి అవ్యయమైన అనురాగబంధంతో కట్టివేసే, సర్వోత్కృష్ట భావమొకటి నిలిచి ఉంటుంది. తల్లిదండ్రులపట్ల గౌరవం చూపవలసి ఉండడంచేత వారి మీద ప్రేమలో, కొంచెం భయంకూడ కలిసివుంటుంది. కానీ ప్రేయసీ ప్రియుల ప్రేమ అలాంటిది కాదు. భగవంతుడు దేనినైనా సృష్టిచేశాడో లేదో, మనకా విచారమెందుకు? అతడు మన రక్షకుడనే విషయంకూడ మనకెందుకు? అతడు మన ప్రియుడు. కాబట్టి అన్ని భయసంకల్పాలను వదలి మనం అతనిని ప్రేమింతుము గాక! నరుడు తనకే కోరికా లేనప్పుడే తనకు ఇతర సంకల్పం పొడకట్టనప్పుడే, భగవంతునిగూర్చి, వెర్రివాడై పోయినప్పుడే, నిజంగా భగవంతుని ప్రేమించగలుగుతాడు. ప్రియునికి, తన ప్రియురాలిపట్ల ఉండే ప్రేమ ఎలాటిదో, మనకు భగవంతుని పట్ల ఉండవలసిన ప్రేమ అలాంటిది. కృష్ణుడు భగవంతుడు. రాధ అతనిని ప్రేమిస్తోంది. ఆ ప్రణయ కథను వర్ణించే కావ్యాలను మీరు చదవండి. అప్పుడు భగవంతుని ఎలా ప్రేమించాలో ఊహించగలరు. కాని ఎంతమంది దీని భావాన్ని గ్రహిస్తారు? పూర్తిగా దుష్టచిత్తులై పోయి, నీతి అంటే ఏమో తెలీని జనులు దీన్నంతా ఎలా అర్థం చేసుకోగలరు? ప్రజలు తమ మనస్సులనుండి సమస్త సాంసారిక భావాలను తొలగించుకొని, స్వచ్ఛమైన నీతితో, ఆధ్యాత్మిక భావాలతో జీవించేటప్పుడు మాత్రమే, వారికి చదువులు రాకపోయినా అతిసూక్ష్మాలైన భావాలను గ్రహించగలుగుతారు. అయ్యో! అలాంటి వినిర్మల భావంకలవారు ఎంత అరుదో కదా! తలచుకొంటే మానవుడు దుర్వ్యాఖ్యానాలు చేసి భ్రష్టం చేయజాలని మతం ఒకటైనా లేదు. ఉదాహరణకు చూడండి – ఆత్మ శరీరంనుండి పూర్తిగా భిన్నమై ఉంటుందని, ఒకని భావన. అతడు శరీరంతో నీచములైన పాపకార్యాలు చేస్తూ, తన ఆత్మ, అసంగమై, నిర్మలంగా ఉంటుందంటాడు. మతాలను, యథార్థంగా అనువర్తిస్తే, సంపూర్ణంగా పవిత్రుడు కాజాలని హిందువుకానీ, మహమ్మదీయుడుకానీ, క్రైస్తవుడు కానీ, ఒక్కడైనా ఉండడు. కానీ మంచిదో, చెడ్డదో తమ సహజ గుణాలవల్లనే మానవులు నడుపబడుతున్నారు. దీన్ని కాదనడానికి వీలులేదు. అయినా, భగవన్నామం చెవిని పడగానే, పరవశం చెందేవాళ్ళూ, భగవత్కథలను చదువుతున్నప్పుడు, ఆనందబాష్పాలు రాల్చేవాళ్ళూ కొందరు ఎప్పుడూ లోకంలో ఉండి తీరుతారు. అలాంటి మానవోత్తములే యథార్థంగా భక్తులు.
మతసాధన ప్రథమ దశలో, నరుడు భగవంతుని తన స్వామిగా, తాను వాని సేవకునిగా, భావిస్తాడు. తనకు నిత్యావసర వస్తువులు మొదలైన వాటిని ప్రసాదించినందుకు, భగవంతునిపట్ల కృతజ్ఞతను చూపుతాడు. మీరిలాంటి సంకల్పాలను ఆవలకు నెట్టివేయండి. ఆకర్షవంతమైన శక్తి ఒకటుంది. అదే దేవుడు. ఆ శక్తికి లోబడే సూర్యుడు, చంద్రుడు, అన్నీ కదలుతున్నాయి. ఈ లోకంలోని సమస్తమూ, మంచిదికానీ, చెడ్డదికానీ, భగవంతునిదే. మన జీవితంలో, శుభంకానీ, అశుభంకానీ, ఏమి జరిగినా అదంతా మనల్ని భగవంతునికి దగ్గరగా తీసుకొనిపోతూనే ఉంటుంది. ఒకడు ఏదో స్వార్థకారణంగా వేరొకణ్ణి చంపుతాడనుకోండి. తన్నుగూర్చి కానీ, ఇంకొకని గూర్చికానీ ఉన్నప్రేమే, ఆ పనికి కారణంగా ఉంటుంది. మనం పుణ్యంచేసినా, పాపంచేసినా, మనల్ని ప్రేరేపించేది ప్రేమే! పులి, తానో, తన కూనో, ఆకలిగా వుండటంచేతనే పశువును చంపుతోంది.
భగవంతుడు ప్రేమ స్వరూపి. ఆయన అన్నిట్లో ప్రత్యక్షమై ఉంటాడు. తనకు తెలిసినా, తెలియకున్నా ప్రతివాడూ, భగవంతునిచేత ఆకర్షించ బడుతున్నాడు. ఒక స్త్రీ, తన భర్తను ప్రేమించేటప్పుడు, తన్నాకర్షించే మహాశక్తి, తన భర్తలో ఉన్న భగవంతుడే అని గ్రహించడంలేదు. ప్రేమమయుడైన భగవంతుడే, పూజార్హుడైన ఏకైకవ్యక్తి. భగవంతుని సృష్టి కర్తగాను, రక్షకునిగాను మాత్రమే భావించేంతకాలం, మనం బాహ్యపూజలు మాత్రమేచేస్తాం. కానీ, ఆ హద్దులను దాటిపోయి, అన్నిట్లోను, భగవంతుని, భగవంతునిలో అన్నిటినీ చూస్తూ, భగవంతుని ప్రేమావతారంగా భావించగల్గినప్పుడే మనకు పరాభక్తి సిద్ధించగలదు.