శ్రీ స్వాములవారు ఇక్కడ అతిథిగా ఉండే కాలం, ముగిసే సమయంలో ఆల్మోరాలోని శ్రీవారి స్నేహితులు హిందీభాషలో ఒక ఉపన్యాస మిమ్మని కోరారు. శ్రీవారు అలాంటి ప్రయత్నం చేయడం ఇది మొట్టమొదటసారైనా, అందుకు ఒప్పుకొన్నారు. వారు నెమ్మదిగా ప్రారంభించారు. కాని, త్వరలోనే ఉపన్యాస విషయంవల్ల ఉత్సాహప్రేరితులయ్యారు. వారు ఉపన్యసించే కొద్దీ, వాక్యనిర్మాణం, శబ్దగతి, అప్రయత్నంగా వాటంతట అవే అమరుతున్నట్లు తోచింది. ఉపన్యాస ధోరణికి అనుకూలపడటంలో హిందీభాషలో ఉన్న పరిమితులను, చిక్కులను ఎరిగిన శ్రీవారి ప్రయత్నం జయప్రదమైందనీ, బహుశ అది అసదృశ విజయమనీ కూడ అభిప్రాయపడ్డారు. ఆ భాషలో తమకున్న ప్రయోగపటిమను, వక్తృత్వానికి అనుకూలంగా ఆ భాషను అభివృద్ధిచేయడానికి, ఇదివరకు కలలోనైనా అనుకొని ఉండని అవకాశాలు ఆ భాషలో ఉన్నాయన్న విషయాన్ని శ్రీ స్వామివారు రుజువు చేశారు.
ఇంగ్లీషు క్లబ్బులో మరొక ఉపన్యాసం ఇంగ్లీషులో చేశారు. వైదిక ధర్మ సిద్ధాంత సాధనలు అనేది ఉపన్యాస విషయం. ఆ ఉపన్యాస సారాంశాలివి: శాఖా దేవతల పూజారంభం, ఇతర ఉపజాతులను జయించడం మూలంగా దాని విజృంభణం; వీటి చరిత్రనుగూర్చి కొంచెం వివరించిన తర్వాత వేదాలంటే ఎలాటివో తెలిపారు. వాటి స్వభావం, స్వరూపం, బోధలను, సూక్ష్మంగా విశదీకరించారు. తర్వాత జీవాత్మనుగూర్చి మాట్లాడుతూ, ప్రాణప్రదం, ఆధ్యాత్మికం అయిన తత్త్వరహస్యాలను బాహ్యప్రపంచపు సాయంతో పరిష్కారం చేయాలనుకొంటున్న పాశ్చాత్యుల పద్ధతిని, బాహ్యప్రకృతిలో అలాంటి పరిష్కారం తేజాలవని కనుగొని, అన్వేషణను అంతర్యామికి త్రిప్పిన ప్రాచ్యపద్ధతితో పోల్చి, చూపి వివరాలను తెల్పారు. తమకు విశిష్టమైన అంతర్లక్ష్య సాధనాన్ని కనుగొన్న గౌరవాన్ని, ఆ పద్ధతియొక్క ఫలితార్థంగా వెలలేని పారమార్థిక విద్యారత్నాలను మానవకోటికి పంచిపెట్టిన కీర్తి, తన జాతికి చెల్లుతుందని సహేతుకంగా తెల్పారు. హిందువుకు సహజంగా ప్రియమైన ఈ ప్రస్తావన అంతటితో నిలిపి, జీవునికి బ్రహ్మమునకు ఉన్న సంబంధాన్ని జీవుడు బ్రహ్మమును భక్తిపూర్వకంగా వెదకి, వానిలో ఐక్యమయ్యే సాధనను వర్ణించినప్పుడు, ఆధ్యాత్మిక విద్యాగురువుగా, తన బోధనాశక్తిని శ్రీవారు అత్యున్నత దశకు ఉద్ధరించగల్గారు. కొంతసేపటివరకు, శ్రీవారు, వారి మాటలు, వారి శ్రోతలు అందరిలోనూ, వ్యాపించివున్న ఆధ్యాత్మిక భావం అన్నీ ఏకమైపోయినట్లనిపించింది. నేను, నీవు ఇది అది అనే భావాలే స్మరణకు రాలేదు. అక్కడ చేరిన వ్యక్తులంతా పరవశులయ్యారు. ఆ మహాగురువునుండి దేదీప్యమానమై వెలువడే పారమాత్మిక తేజంలో అందరూ లీనమయ్యారు. శ్రీవారి పలుకులు అందరినీ ఊర్ధ్వదశకు తీసుకొనిపోయాయి.
శ్రీవారి ఉపన్యాసాలను తరచువింటున్నవారికి ఇలాంటి అనుభవాలు, అప్పుడప్పుడు కలుగుతూంటాయి. శ్రద్ధగా విచక్షణాపరులై వినే శ్రోతల ఎదుట ఉపన్యసించేటప్పుడు వివేకానందస్వామి వ్యక్తిత్వం అదృశ్యమౌతుంది. అప్పుడు అల్పవివరాలు, వ్యక్తిభావాలు సమసిపోతాయి. నామరూపాలు దూరమైపోతాయి. ఆత్మమాత్రమే నిలిచి, వక్త, శ్రోత, వక్తృ వచనం, ఏకమై అందులో లయించిపోతాయి.