(కలకత్తాలో ఇచ్చిన ఉపన్యాసం)
చాలాపూర్వం, చరిత్ర రచన కానీ, సాంప్రదాయిక కథల మంద కాంతులుకానీ చొరని, పురాణకాలం నుండి ఒక జ్యోతి సుస్థిరంగా వెలుగుతోంది. బాహ్య పరిస్థితులవల్ల, ఒక్కొక్కప్పుడు, దాని కాంతి తగ్గుతున్నట్లున్నా, ఇతర సమయాల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. అది, ఆరిపోక నిశ్చలమై నిలిచి, తనకాంతులను భారతదేశంలో ప్రసరింపచేయటమే కాక, తన మహిమను ప్రపంచంలోని సర్వ జిజ్ఞాసువుల మనఃక్షేత్రాల్లో నింపింది. ఆ జ్యోతి మన ఉపనిషన్మతమే. నిశ్శబ్దంగా, మెల్ల మెల్లగా, ఎవరి కనుల పడక రాలుతూ, నవనవ కోమలమైన గులాబీ పూలను వికసింపజేసే ఉషఃకాలపు మృదుతుషారంలాగా, ఆడంబరంలేక, సుకుమారమైనా సర్వశక్తిమంతమైన ఈ ఉపనిషన్మతం, అంటే వేదాంత తత్త్వం, ప్రశాంతంగా, ప్రకాశిస్తోంది. ఇది భారతభూమిలో మొదలు, ఎప్పుడు అభ్యుదయమందిందో ఎవరికీ తెలీదు. దాన్ని తెలుసుకోవడానికి జరిగిన ఊహలన్నీ ముఖ్యంగా పాశ్చాత్య గ్రంథకర్తలవి వ్యర్థమైనవి. వారు చేసిన కాలనిర్ణయాలు, చాలా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కానీ హిందువులమైన మనం, పారమార్థిక దృష్టితోచూసి, దానికి మొదలే లేదంటాం. ఈ ఉపనిషత్తత్త్వసిద్ధాంతం, ఈ వేదాంతం మనిషికి, ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఇంతవరకు ప్రసాదించబడిన ప్రజ్ఞానరాశిలో, మొట్టమొదటిదీ, చిట్టచివరదీ అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.
ఈ వేదాంత మహాసముద్రం నుండి ప్రకాశతరంగాలు, వెలువడి మాటిమాటికి తూర్పుదిశకు, పడమటి దిశకు వ్యాపిస్తూ వచ్చాయి. ప్రాచీనకాలంలో ఇవి పడమటి దిశగాపోయి, ఏథెన్సు నగరంలోనో, అలగ్జాండ్రియా నగరంలోనో, అంటియోక్ నగరంలోనో, గ్రీకుల మనస్సులని ఎదుర్కొని సంచలనం కల్గించాయి. ప్రాచీన గ్రీకులపై మన సాంఖ్యసిద్ధాంత ప్రభావం దీపించి ఉండటం స్పష్టం. ఈ సాంఖ్యానికీ, భారతదేశంలోని తక్కిన సిద్ధాంతాలన్నిటికీ, ఉపనిషత్తులే, అంటే వేదాంతమే ఏకైక ప్రమాణం! భారతదేశంలో ఈనాడు మనం చూస్తున్న పరస్పర భిన్న సంప్రదాయాలకూ, పూర్వకాలంలో ఉన్న వాటికీ ఉపనిషత్తులే, అంటే, వేదాంతమే మూలాధారమై, ఏకైక ప్రమాణంగా ఉండేది. నీవు ద్వైతివైనా, అద్వైతివైనా, విశిష్టాద్వైతివైనా, శుద్ధాద్వైతివైనా, లేక మరెలాంటి ద్వైతివిగాని, అద్వైతివిగాని, అయినా, లేక మరేపేరు పెట్టుకొన్నా, నీకు ప్రమాణాలు శాస్త్రాలు, వేదాలు, ఈ ఉపనిషత్తులే. భారతదేశంలో ఏ సిద్ధాంతం ఉపనిషత్ప్రమాణాన్ని అంగీకరించదో, అది ఆస్తిక సిద్ధాంతమనిపించుకోజాలదు. బౌద్ధ, జైన, సిద్ధాంతాలు, ఉపనిషత్తుల ప్రమాణాన్ని అంగీకరించకపోవడం చేతనే, భారతదేశం నుండి బహిష్కరించబడ్డాయి. ఈ విధంగా మనకు తెలిసినా, తెలియకున్నా భారతదేశంలోని అన్ని సంప్రదాయాల్లోనూ ఉపనిషత్తుల ప్రమాణం అంతర్లీనమై ఉంది. హిందూ మతమని మనం పేర్కొనే మహావటవృక్షం దాని మహత్తరమైన, అసంఖ్యాకాలైన శాఖోపశాఖలతో సహా వేదాంత ప్రభావంతో సర్వత్ర నిండి ఉంది. బుద్ధిపూర్వకంగానో, అబుద్ధిపూర్వకంగానో, మనం వేదాంతాన్నే భావనచేస్తున్నాం. వేదాంతంలోనే జీవిస్తున్నాం. వేదాంతాన్నే శ్వాసిస్తున్నాం. వేదాంతంలోనే మరణిస్తున్నాం. ప్రతి హైందవుడూ, ఇలాగే చేస్తున్నాడు. కాబట్టి భారతదేశంలో, భారత శ్రోతలకు వేదాంత బోధ చేయడం విపరీత చర్యగా కనిపిస్తుంది. అయినా బోధించవలసింది అదొకటే. ఆ బోధే ఈ కాలంలో అత్యావశ్యకం. ఏలంటే, నేనిప్పటికే చెప్పినట్లు, భారత సంప్రదాయాలన్నీ ఉపనిషత్తులను శిరసావహించవలసిందే. అయినా, ఈ సంప్రదాయాల్లో పరస్పర వైరుధ్యాలెన్నో ఉన్నట్లు పైకి కనిపిస్తుంది. అనేక పర్యాయాలు, ప్రాచీన ఋషులు సైతం, ఈ ఉపనిషత్తులలో అంతర్లీనమై ఉన్న సామరస్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. చాలాసార్లు, ఆ ఋషులే తగవులాడుకొన్నారు. అందువల్లే ‘భిన్నభావంలేని ఋషులు లేరు’ అనడం ఒక సామెతైపోయింది. కానీ, ద్వైతమైనా, అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా, మరెలాంటి భావాలైనా ఉన్నా ఉపనిషద్వాక్యాల్లో అంతర్లీనమైవున్న ఈ సమారస్యాన్ని పూర్వం కన్నా చక్కగా, ధ్రువపరచవలసిన అవసరమిప్పుడేర్పడినది. ఈ సామరస్యాన్ని ఇప్పుడు, బహిరంగంగా అఖీల ప్రపంచానికి వెల్లడిచేయాలి. ఈ పని భారతదేశంలో ఎంత అవసరమో ఇతరదేశాల్లోకూడ అంతే అవసరం. అలాంటి సామరస్యరూప వ్యాఖ్యానమై ఎవరి జీవితమంతా ఒప్పిందో, ఎవరి బోధకంటే, జీవితం వేయిరెట్లు ఉపనిషత్తులకు సజీవ భాష్యంగా ఉండిందో, ఎవరు మానవ రూపం ధరించిన ఉపనిషత్తుల సారాంశమో, అలాంటి ఒక మహాపురుషుని పాదసేవ చేసే మహాభాగ్యం, భగవదనుగ్రహం వల్ల నాకు లభించింది. ఆ సమరస భావం నా కొకింత ప్రాప్తించివుండొచ్చు. దాన్ని ప్రకటించగలనో లేదో, నాకు తెలీదు. కానీ, అదే నా ప్రయత్నం. వేదాంత మతాలు, పరస్పర విరుద్ధం కావనీ, అవన్నీ ఒక దానికొకటి అవసరమనీ, ఒకదాన్నొకటి సార్థకం చేస్తుందనీ, ఒకటి మరొక దానికి సోపానంలాగా అమరివుండి, పరమగమ్యమైన “తత్త్వమసి” లేక అద్వైతభావం చేరే వరకు, నడుపుకొని పోతుందనీ, విశదం చేయడమే నా జీవితోద్దేశం! పూర్వమొకప్పుడు కర్మకాండ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేది. ఆ వేదభాగంలో ఉత్తమాదర్శాలు చాలా కలవనడం నిజమే. మన ఈ నాటి నిత్యపూజావిధానం, ఆ కర్మకాండ సూత్రాలకు అనుగుణంగానే జరుగుతోంది. అలా అయినా, వేదాల కర్మకాండ భారతదేశం నుండి దాదాపుగా అదృశ్యమైంది. మన అనుదిన జీవితంలో ఏ అత్యల్ప భాగమో తప్ప, ఆ కాండయొక్క నియమాలను అనుసరించడమే లేదు. మన సామాన్య జీవితంలో మనం చాలావరకు పౌరాణికులమో, తాంత్రికులమో అనుకోవచ్చు. కొన్ని వేదమంత్రాలను ఉపయోగించేటప్పుడు సైతం మన భారతీయ బ్రాహ్మణులు, వాటిని వేదోక్త విధంగాకాక, చాలావరకు తంత్రాల ప్రకారమో, పురాణాల ప్రకారమో ప్రయోగిస్తున్నారు. అలా కావడంచేత, వేదాల కర్మకాండను అనుకరించే వాళ్ళం అనే అర్థంలో మనం వైదికులం అని చెప్పుకోవడం సమంజసం కాదని నా భావం. కాని, మనమందరం వేదాంతులమనేమాట యథార్థం. హిందువులమని చెప్పుకొనే వారినందరినీ, వేదాంతులని పేర్కొనడం యుక్తం. ఆ వైదాంతిక నామం, ద్వైతాద్వైత సంప్రదాయాల వారందరికీ వర్తిస్తుందని ఇంతకుముందే చెప్పాను.
ఇప్పుడు భారతదేశంలోని సంప్రదాయాలన్నీ సామాన్యంగా ద్వైతం, అద్వైతం అనే రెండు గొప్ప తరగతులుగా విభజించబడుతున్నాయి. ఈ సాంప్రదాయికులలో కొందరు, స్వల్పభేదాలకు ప్రాముఖ్యమిచ్చి, వాటి నాధారం చేసుకొని, శుద్ధ ద్వైతులమనీ, విశిష్టాద్వైతులమనీ, ఏమేమో క్రొత్త పేర్లను పెట్టుకొంటారు. అవి అంత పాటించతగినవి కావు. విశాల విభాగంలో, వారంతా ద్వైతులో, అద్వైతులో అవుతారు. ఈ కాలంలో కనిపిస్తున్న సంప్రదాయాలలో కొన్ని చాలా క్రొత్తవి, తక్కినవి మిక్కిలి పురాతన సంప్రదాయాల రూపాంతరాలుగా కనిపిస్తున్నాయి. మొదటి తరగతికి నిదర్శనగా, శ్రీరామానుజాచార్యులవారి జీవితాన్ని, వారి సిద్ధాంతాన్నీ పేర్కొంటాను. రెండవదానికి, శ్రీ శంకరాచార్యులవారిని పేర్కొంటాను.
రామానుజాచార్యులవారు ఆధునిక భారతదేశ ద్వైత వేదాంతులలో ప్రముఖుడు. తక్కిన ద్వైత సాంప్రదాయకులందరూ తమ తమ సంప్రదాయాల నిర్మాణంలోనూ, ఆ నిర్మాణంలోకల కొన్ని అతిసూక్ష్మ విషయాల్లోనూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, శ్రీరామానుజాచార్యుల వారినే అనుసరిస్తున్నారు. శ్రీరామానుజాచార్యులవారిని, వారి సంప్రదాయాన్ని, భారతదేశంలోవున్న ఇతర ద్వైత వైష్ణవ సంప్రదాయాలతో పోల్చిచూస్తే, నిర్మాణంలోనూ, బోధల్లోనూ, పద్ధతుల్లోనూ, ఎంతగా సమాన లక్షణాలు కనిపిస్తాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దక్షిణ దేశంలో మధ్వముని అనే మహా గురువుండేవాడు. ఆయన్ని అనుసరించి మన వంగదేశంలో చైతన్యులవారు మాధ్వుల తత్త్వశాస్త్రాన్ని చేపట్టి, వంగదేశంలో ప్రచారం చేశారు. దక్షిణదేశంలో విశిష్టాద్వైత శైవులు మొదలైన ఇతర సంప్రదాయాలుకూడ ఉన్నాయి. దక్షిణ భారతదేశపు కొన్ని భాగాల్లోను, సింహళంలోనూ తప్ప భారతదేశపు ఇతర ప్రాంతాల్లో కనిపించే శైవులు చాలావరకు అద్వైతులు. ఈ అద్వైతేతరులైన శైవులు విష్ణువు స్థానంలో శివుని నిలుపుతారన్న మాటే కానీ, జీవాత్మను గూర్చిన సిద్ధాంతంలో తప్ప, ప్రతి విషయంలోనూ, రామానుజానుచరులే అనాలి. రామానుజాచార్యులవారి అనుచరులు, జీవుడు, అణురూపుడనీ నలుసులాగా అతిసూక్ష్మమై ఉండేవాడని చెబుతారు. శంకరాచార్యులవారి అనుచరులు జీవుడు విభువు. అంటే సర్వ వ్యాపకుడంటారు. ఇలాంటి అద్వైత సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ప్రాచీనకాలంలో, అలాంటి సంప్రదాయాలననేకం శంకర సంప్రదాయం మ్రింగేసి తనలో జీర్ణం చేసుకొన్నట్లు కనిపిస్తోంది. కొన్ని భాష్యాల్లో శంకరుని మీద సైతం ఒక్కొక్క బాణం విడువబడటం అప్పుడప్పుడూ కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా విజ్ఞాన భిక్షువు తన భాష్యంలో తాను అద్వైతియై ఉండీ, శంకరాచార్యులవారి మాయావాదాన్ని ఎగురగొట్టి వేయడానికి ప్రయత్నించాడు. ఈ మాయావాదాన్ని విశ్వసించనట్టి కొన్ని అద్వైత సంప్రదాయాలున్నట్లు కన్పిస్తోంది. వారు, శంకరాచార్యులవారిని ప్రచ్ఛన్నబౌద్ధుడని నిందించడానికి కూడ వెనుదీయలేదు. ఈ మాయావాదం, బౌద్ధులనుండి తీసుకొని, వేదాంత సంప్రదాయంలోకి చొప్పించారని వారి అభిప్రాయం. అదెలావున్నా, ఈ కాలంలో అద్వైతులంతా శంకరచార్యులవారి ఆధిపత్యాన్నే అంగీకరిస్తున్నారు. శంకరాచార్యులవారు, వారి శిష్యవర్గము భారతదేశంలోని ఉత్తరప్రాంతాల్లో దక్షిణప్రాంతాల్లో కూడ అద్వైతమతాన్ని బోధిస్తూ గొప్ప ప్రచారం చేశారు. శంకరులవారి ప్రభావం మన వంగదేశంలో, కాశ్మీర్లో, పాంచాలంలో అంతగా వ్యాపించలేదు. కాని, దక్షిణ దేశంలోని స్మార్తులంతా శంకరాచార్యులవారి అనుచరులే! కాశీనగరం కేంద్రంగా ఉత్తర భారతదేశంలో కూడ, అనేక ప్రాంతాల్లో శంకరాచార్యుల వారి ప్రభావం చాలాగాఢంగా వ్యాపించింది.
శంకరాచార్యులవారు కానీ, రామానుజాచార్యులవారు కానీ, తాము సిద్ధాంతస్థాపకులమని చెప్పుకోలేదు. శ్రీరామానుజాచార్యువారు తాము, బోధాయనుల వారి వ్యాఖ్యానాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా తెలిపారు. “భగవద్బోధాయనకృతాం, విస్తీర్ణాం, బ్రహ్మసూత్రవృత్తిం, పూర్వాచార్యః, సంచిక్షిపుః, తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే” (భగవాన్ బోధాయనులవారు రచించిన విపులమైన బ్రహ్మసూత్ర వృత్తిని, పూర్వపు ఆచార్యులు సంగ్రహపరచారు. వారి అభిప్రాయానుసారంగా, సూత్ర వాక్యాలను వివరిస్తున్నాను) అని, శ్రీభాష్యమనే తన గ్రంథారంభంలో శ్రీరామానుజాచార్యువారు చెప్పారు. వారు దాన్ని చేపట్టి సంక్షిప్తంగా చేశారు. దాన్నే మన మీనాడు చూస్తున్నాం. బోధాయనులవారి వ్యాఖ్యానాన్ని చూచే అవకాశం నామట్టుకు నాకు ఎన్నడూ లభించలేదు. వ్యాససూత్రాలకు, బోధాయనుల వారు చేసిన వ్యాఖ్యానాన్ని తప్ప, తక్కిన వ్యాఖ్యానాలన్నిటినీ కీ.శే. స్వామి దయానందసరస్వతి త్రోసివేయచూచారు. వీలున్నప్పుడంతా, రామానుజాచార్యులవారిని ఖండిస్తూండిన ఈయనకూడ, ఆ బోధాయన భాష్యాన్ని చూపజాలకపోయారు. నేను భారతదేశమందంతటా, దానికోసం వెదికాను. ఇంతవరకు, అది నా కళ్ళపడలేదు. కానీ, తాను బోధాయన భాష్యంలోని భావాలను తీసుకొంటున్నట్లూ, కొన్ని సందర్భాల్లో అందులోని వాక్యాలనే తాను సంగ్రహిస్తున్నట్లూ, ఆ భావాలను సంగ్రహించే తన భాష్యం సిద్ధంచేసినట్లూ, శ్రీరామానుజులవారు స్పష్టంగా తెలిపారు. శంకరాచార్యులవారూ అలాంటి పనే చేసినట్లు కనిపిస్తోంది. ప్రాచీన వ్యాఖ్యానాలు ఉదాహరించబడిన స్థలాలు కొన్ని శంకర భాష్యంలోనూ ఉన్నాయి. శ్రీ శంకరాచార్యులవారి గురుమా, వారి గురువుయొక్క గురుమా అదే సంప్రదాయానికి చెందిన వేదాంతులు కావడమే కాక, కొన్ని విధాల్లో ఈయనకంటె వారు ఆ మతంలో ఎంతో ఎక్కువ చొరవను, సాహసాన్ని చూపినవారు కావడంచేత, ఆయన బోధించినది ఒక స్వనిర్మిత నూత్నమతం కానేకాదనడం స్పష్టం. శ్రీరామానుజాచార్యులవారు, తమ భాష్యాన్ని బోధాయన భాష్యాన్ని ఆధారం చేసుకొని రచించినట్లే శంకరాచార్యులవారు కూడ ఒక పూర్వభాష్యాన్ని ఆధారం చేసుకొని తమ భాష్యాన్ని రచించి ఉంటారు. కానీ, వారే భాష్యాన్ని అనుసరించినదీ ఇప్పుడు తెలుసుకోవడానికి వీలుకావడం లేదు. మీరెప్పుడైనా కన్న, విన్న, దర్శనాలన్నీ ఉపనిషత్తుల ప్రమాణం మీద ఆధారపడి ఉండేవే. అది శ్రుతి ప్రమాణమని చెప్పినపుడంతా ఉపనిషత్తులనే నా అభిప్రాయం. అవి సదా ఉపనిషత్ప్రమాణాలనే ఉదాహరిస్తూండేవి. ఉపనిషత్తుల తర్వాతనే భారతదేశ ఇతర తత్త్వశాస్త్రాలు వస్తున్నాయి. కాని, వాటిలో ఏదీ భారతదేశంలో వ్యాసులవారి తత్త్వశాస్త్రం పొందినంత ప్రామాణ్యాన్ని పొందలేకపోయింది. ఈ వ్యాసులవారి తత్త్వసిద్ధాంతం సైతం, అంతకుముందున్న కపిలుని సాంఖ్యసిద్ధాంతం పరిణామమే! ఒక్క భారతదేశంలోనివే కాక, ప్రపంచంలోని ప్రతి తత్త్వసిద్ధాంతం, కపిలునికి అపారంగా రుణపడిందే! తత్త్వసిద్ధాంత విషయంలోను, మనశ్శాస్త్ర విషయంలోనూ, భారతదేశ చరిత్రలో కపిలుని పేరే అత్యగ్రగణ్యమని చెప్పవచ్చు. కపిలుని ప్రభావం ప్రపంచంలో అన్నిచోట్ల కనిపిస్తోంది. గణుతికెక్కిన తత్త్వసిద్ధాంతం వెలసిన చోటంతా కపిలుని సిద్ధాంత ప్రభావాన్ని మీరు గుర్తింపజాలుతారు. వేలకొద్దీ సంవత్సరాలు గడచిపోయినా, ఈ మహాత్ముడు కపిలుడు అసదృశ తేజోమూర్తిగా, అద్భుతప్రభావునిగా ఇప్పటికీ నిలిచేవున్నాడు. అతని తత్త్వసిద్ధాంతంలో చాలాభాగాన్ని, అతని మనశ్శాస్త్రాన్ని, భారతదేశంలో చాలా స్వల్ప భేదాభిప్రాయాలతో అన్ని సంప్రదాయాలవారు, అంగీకరిస్తున్నారు. మన (వంగ) దేశంలో, మన నైయ్యాయిక దార్శనికులు, భారతీయ తత్త్వశాస్త్రజ్ఞుల ఆమోదాన్ని ఎక్కువగా పొందజాలకపోయారు. వీరు వర్గోపవర్గాది క్షుద్రవిషయాల్లోనూ, అతిక్లిష్టమైన పారిభాషిక భాషను అభ్యసించడంలోనూ, జీవిత కాలాన్నంతా వ్యర్థపరచుకొంటూ, తర్కంలోనే మునిగిపోయి, తత్త్వసిద్ధాంతాలను వేదాంతులకు విడిచిపెట్టారు. ఈ నవీనకాలంలో భారతీయ తత్త్వజ్ఞులలోని అన్ని సంప్రదాయాలవారు, వంగదేశపు నైయ్యాయికుల తర్క పరిభాషనే అవలంబిస్తున్నారు. గదాధర, జగదీశ, శిరోమణి పేర్లు నదీయా జిల్లాల్లో (నవద్వీపం ఆ జిల్లాలోనిది) ఎంత ప్రఖ్యాతి చెందివున్నాయో, మళయాళదేశంలోని కొన్ని నగరాల్లోనూ అంతటి ప్రఖ్యాతిని పొంది ఉన్నాయి. కానీ, వేదాంత విషయంలో మాత్రం “వ్యాససూత్రాలు” సుస్థిరస్థానాన్ని పొంది, తత్త్వసిద్ధాంతంలోని వేదాంతపక్షం ఏ బ్రహ్మాన్ని గూర్చి మానవులకు బోధిస్తోందో, ఆ బ్రహ్మంలాగానే శాశ్వతంగా వ్యాససూత్రాలుకూడ దేశంలో నాటుకొని పోయాయి. తర్కం అనేది, శ్రుతి ప్రమాణానికి పూర్తిగా తలఒగ్గవలసి వచ్చింది. శ్రీ శంకరాచార్యులవారు ప్రవచించినట్లు వ్యాసుడు తర్కంలో ఏ మాత్రమూ దిగలేదు. సూత్రాలను వ్రాయడంలో వారి ముఖ్యోద్దేశం వేదాంత వాక్య ప్రసూనాలను పోగుచేసి, ఒక్క దారంతో హారం కూర్చడమే. ఉపనిషత్తుల ప్రమాణానికి లోబడి ఉన్నంతవరకు మాత్రమే ఆ సూత్రాలు అంగీకరింపబడుతున్నాయి. అంతకుమించిన ప్రామాణికత వాటికి లేదు.
నేను చెబుతున్నట్లు, భారతదేశంలోని అన్ని సంప్రదాయాలవారూ ఈ వ్యాససూత్రాలను పరమప్రమాణంగా అంగీకరిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి క్రొత్త సంప్రదాయమూ, తన దృక్పథానుకూలంగా ఈ వ్యాససూత్రాలకు ఒక క్రొత్త వ్యాఖ్యానాన్ని కూర్చడానికి యత్నిస్తుంది. ఈ భాష్యకర్తల మధ్య, భేదాలు ఒక్కొక్కప్పుడు చాలా గొప్పవిగా ఉంటాయి. కొన్ని సమయాల్లో వారు శ్రుతి వాక్యాలను తికమకలు చేయడం చూస్తే వెగటుపుడుతూంటుంది. వ్యాససూత్రాలకు పరమప్రమాణ పదవి సిద్ధించింది. ఎవనికిగాని, వేదాంతసూత్రాల మీద ఒక నూతన భాష్యాన్ని రచించేవరకు, భారతదేశంలో క్రొత్త సంప్రదాయాన్ని నిర్మించే అధికారం కలుగదు.
ఆ తర్వాత ప్రామాణికత భగవద్గీతకుంది. సుప్రసిద్ధమైన శంకరాచార్యులవారి ఘనత అంతా, గీతాప్రచారంలోనే ఉంది. గీతను బోధించడం, దాన్ని గూర్చి ఎంతో అందమైన భాష్యాన్ని వ్రాయడం, ఈ మహాపురుషుడు తన దివ్యజీవితంలో చేసిన అనేక ఘనకార్యాలలోకంతా ఉత్తమోత్తమ కార్యం. భారతదేశంలో ఆస్తిక సంప్రదాయ నిర్మాతలంతా ఆ తర్వాత ప్రతివారూ ఒక్కొక్క గీతాభాష్యాన్ని వ్రాశారు.
ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అవి నూట ఎనిమిదని ప్రతీతి. కానీ ఇంకా ఎన్నో ఉన్నాయని కొందరంటున్నారు. వీటిలో కొన్ని తర్వాతి కాలంలో వ్రాసిన వనడం స్పష్టం. ఉదాహరణకు అల్లాను స్తోత్రం చేసేది, మహమ్మదును రజసుల్లా అని పేర్కొనేది అయిన, అల్లోపనిషత్తు ఒకటుంది. ఇది హిందువులకు, మహమ్మదీయులకు సఖ్యం కూర్చడానికై అక్బర్ కాలంలో వ్రాయబడిందట! ఎక్కడో సంహితాల్లో ఒకచోట అల్లా శబ్దమో, ఇల్లా శబ్దమో, దొరకగానే పట్టుకొని దాని ఆధారంతో ఒక ఉపనిషత్తును వ్రాశారు. ఈ విధంగా, అల్లోపనిషత్తులో మహమ్మదు “రజసుల్లా” అయిపోయాడు. దాని అర్థం ఏమైనా కానివ్వండి. ఇతర సాంప్రదాయకమైన ఉపనిషత్తులుకూడ ఇలాంటివే ఉన్నాయి. అవి క్రొత్తవని మనం గ్రహించగలం. వేదాలలో సంహితాభాగమందలి భాష అతిప్రాచీనమైంది. ఆ ప్రాచీన భాషకు వ్యాకరణంలేదు. కాబట్టి, ఉపనిషత్తులను సృష్టించడం చాలా సులభమైన పని. కొన్ని సంవత్సరాల క్రిందట వేద భాషయొక్క వ్యాకరణం నేర్చుకోవాలనే భావం నాకు కలిగింది. తర్వాత పట్టుదలతో పాణినీయ వ్యాకరణాన్ని, మహాభాష్యాన్ని చదవడం ప్రారంభించాను. వైదిక వ్యాకరణం సూత్రాలకు కల వ్యతిక్రమాలతో నిండి ఉండటం చూచి ఆశ్చర్యపడ్డాను. ఒక సూత్రం ఉంటుంది. దాని క్రిందనే ఈ సూత్రం వ్యతిక్రమరూపమైంది అనే వ్యాఖ్యానం కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా, దేనినైనా వ్రాయడానికి ఎంత స్వేచ్ఛను పొందారో చూడండి. ఈ స్వేచ్ఛను కొంత నిరోధించేది యాస్కుని నిఘంటువొక్కటే. కాని చాలావరకు ఇందులో ఉండేవి, అసంఖ్యాకాలైన సమానార్థక పదాలు మాత్రమే. ఈ పరిస్థితుల్లో, మీకిష్టం వచ్చినన్ని ఉపనిషత్తులను వ్రాయడం ఎంత తేలికో చూడండి. ప్రాచీన వైదిక శబ్దాలలాగా ఉండేలా చేయడానికి కావలసిన మాటలను కొంచెం సంస్కృత భాషాజ్ఞానాన్ని సంపాదించుకొంటే చాలు. వ్యాకరణ భయం లేదు! కాబట్టి, మీరు రజసుల్లానో మరే ఇతర సుల్లానో ఆవాహనం చేయవచ్చు. ఈ విధంగా, ఉపనిషత్తులు ఎన్నో సృష్టించబడ్డాయి. ఇప్పుడుకూడ, అలాంటివి సృష్టించబడుతూనే ఉన్నాయని నేను విన్నాను. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు తెగలవారు అలాంటి ఉపనిషత్తులను సృష్టిస్తున్నారని నాకు బాగా తెలుసు. అయినా, కొన్ని ఉపనిషత్తులలో చూసినంత మాత్రంతోనే సత్యసిద్ధమని తెలిపే గుర్తులున్నాయి. ఇలాంటి వాటిని మహాభాష్యకర్తలు, అందులోనూ ముఖ్యంగా శంకరులు, ఆ తర్వాత రామానుజులు మొదలైన ఆచార్య పురుషులు తీసుకొని వాటిపై వ్యాఖ్యానాలను వ్రాశారు.
ఉపనిషత్తులను గూర్చి మీకు నేను తెలుపదలచిన ఒకటి రెండు భావాలున్నాయి. అవి ఒక జ్ఞానమహాసముద్రం కాబట్టి, వాటినిగూర్చి మాట్లాడటానికి, నా వంటి అల్పజ్ఞునకు ఏండ్లు పూండ్లు పడతాయి. ఎన్నో ఉపన్యాసాలీయవలసి ఉంటుంది. అందుచేత, వాటిని చదివేవాళ్ళు తెలుసుకోవలసిన ఒకటి రెండు విషయాలుమాత్రం మీకు చెబుతాను. మొట్టమొదటిది: ప్రపంచంలోకంతా, అవి అత్యద్భుతమైన కావ్యాలు. మీరు వేదాలలోని సంహితాభాగాన్ని చదివితే అప్పుడప్పుడు అత్యద్భుతమైన రమణీయవాక్యాలు మీకు గోచరిస్తాయి. ఉదాహరణకు “తమ ఆసీత్తమసాగూఢ మగ్రే”, “చీకటి చీకటిలో మాటువడినప్పుడు” మొదలైన ‘అవ్యక్త’ వర్ణనగల సుప్రసిద్ధ శ్లోకమొకటి ఉంది. ఆ కవిత్వాన్ని చదివితే, అందలి ఉదాత్తత అనుభవానికి వస్తుంది. భారతదేశంలోను, ఇతర దేశాల్లోను కూడ సుందరమైన దానిని వర్ణించే ప్రయత్నాలు జరిగాయని మీరు గుర్తుంచుకోండి. కాని ఆ అన్యదేశీయులెప్పుడూ కండరాల్లోను, దృశ్యప్రపంచంలోను, జడపదార్థంలోను, ఆకాశంలోను, అఖండత్వాన్ని కనుగొనడానికే యత్నించారు. మిల్టన్గాని, డాంటేగాని, లేక ఏ పాశ్చాత్య కవిశ్రేష్ఠుడుగాని, ప్రాచీనుడైనా, ఆధునికుడైనా, అఖండతత్త్వం స్వరూపాన్ని చిత్రించకోరుతున్నప్పుడు వెలుపలికి ఎగిరి పోజూస్తాడు. ఉపాధిమూలంగా, అఖండతత్త్వాన్ని నీ అనుభవానికి తీసుకొనిరా ప్రయత్నిస్తాడు. అలాంటి ప్రయత్నం ఇక్కడకూడ జరిగింది. సంహితలలో అఖండవ్యాప్తి కళ్లకు కట్టినట్లు, అద్బుతంగా ప్రదర్శించబడింది. ఇంకెక్కడా, అంత అద్భుత చిత్రణ కనిపించదు. “తమ ఆసీత్తమసా గూఢమ్” అనే పై వాక్యాన్ని గుర్తుంచుకొని చీకటినిగూర్చి ముగ్గురు కవులు చేసిన వర్ణనలను పరిశీలించండి. మన కాళిదాసు “సూచీభేద్వైస్తమోభిః” (సూది మొనతో గ్రుచ్చగల తమస్సు) అని వర్ణించాడు. ఇక మిల్టనో “కాంతికాదు, రూపం దాల్చిన అంధకారం” అని వర్ణించాడు. ఇక ఉపనిషత్తులోని వర్ణన చూడండి. “చీకటి, చీకటిని ఆవరించింది” లేక “చీకటి, చీకటిలో దాగింది”. ఉష్ణదేశాల్లో నివసించే మనకిది అర్థం కాగలదు. ఆకస్మికంగా, వర్షాగమనమవుతుంది. కారుమబ్బులు ఆకసమంతటా అలముకొంటాయి. ఇంకా, ఎక్కడినుండో దొర్లుకొనివచ్చే నల్లని మేఘాలచే ఆవరించబడి, ఒక్క క్షణంలో దిఙ్మండలంలో చీకట్లు క్రమ్ముకుంటాయి. సంహితాభాగంలోని ఈ వర్ణనలన్నీ దృశ్యప్రపంచానికి సంబంధించినవే. ఇతర దేశాల్లో లాగే, ఇక్కడా ఈ జీవిత మహాసమస్య పరిష్కార ప్రయత్నాలు బాహ్యప్రపంచం ద్వారా జరిగాయి. జిజ్ఞాసువులగు గ్రీకులు, ఇప్పటి యూరోపియనులు, “జీవం”, “పురుషుడు” మొదలైన అనేక పవిత్ర సమస్యలన్నిటికీ, బాహ్యప్రపంచంలోనే పరిష్కారాన్ని అన్వేషించాలని యత్నించారు. మన పూర్వులు అలాగే చేశారు. వారు కూడ యూరోపియన్లలాగే విఫలులయ్యారు. కాని, పాశ్చాత్యులు ఇంకే ప్రయత్నమూ చేయక, అక్కడే నిలిచిపోయారు. ఈ జనన మరణ మహాసమస్యల పరిష్కారం కోసం, బాహ్యప్రపంచంలోనే వెదకసాగారు. బురదలో దిగబడినట్లు అక్కడే ఆగిపోయారు. మన పూర్వులుకూడ, అది అసాధ్యమని తెలుసుకొన్నారు. కానీ ఆ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలు ఎంతమాత్రమూ సమర్థం కావని, ధైర్యంతో ప్రకటించారు. ఈ నిర్ణయం ఉపనిషత్తులోకంటే మిన్నగా మరెక్కడా ప్రకటించబడలేదు. “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” (దేన్ని చేరజాలక మనస్సుతో సహా వాక్కు వెనక్కి మరలివస్తుందో) “న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి” (ఈ నేత్రాలు అక్కడికి పోజాలవు. వాక్కు కూడ చేరజాలదు) ఈ విధంగా ఇంద్రియాలు బొత్తిగా అసమర్థమని ప్రకటించే వాక్యాలనేకమున్నాయి. కానీ, వారంతటితో ఆగక, మనిషి లోపలి ప్రకృతి మీదికి దృష్టిని మరల్చి, తమ ఆత్మవల్ల సమస్యాపరిష్కారం సాధించడానికి యత్నించారు. అంటే, బాహ్యప్రకృతిలో ఏమి చేయడానికి వీల్లేకపోవడంచేత, ప్రత్యుత్తరంగాని, ఆశగాని, దొరక్క పోవడంచేత వారు దృశ్యప్రకృతిని పూర్తిగా వదలివేశారు. ఈ మూఢమైన నిర్జీవపదార్థం సత్యాన్ని తెలుపజాలదని వారు గ్రహించారు. అంతట, నరునిలోని దివ్యాత్మ దగ్గరికి మరలిపోయి, అక్కడ సమస్యాపరిష్కారాన్ని కనుగొన్నారు.
‘తమేవైకం జానథ, ఆత్మానం, అన్యా వాచో విముంచథ” – (ఈ ఆత్మను మాత్రమే తెలుసుకోండి. ఇతరమంతా వ్యర్థప్రసంగం. అది చేయకండి, వినకండి) అని వారు ఘోషిస్తున్నారు. ఆత్మలో వారికి సంశయ పరిష్కారం చిక్కింది. అందులోనే అన్ని ఆత్మలకు పరమాత్మ, దేవుడు, జగదీశ్వరుడు; నరుని ఆత్మతో వానికిగల సంబంధం; మనం వానిపట్ల నిర్వర్తించవలసిన ధర్మం; తద్వారా పరస్పరం మనలో మనకు ఏర్పడే సంబంధం; ఇవన్నీ వారికి విశదమయ్యాయి. ఈ సందర్భంలోనే ప్రపంచంలోకల కవిత్వంలో మనోహరతమమైంది ఉంది. జడప్రపంచపు భాషలో ఈ ఆత్మను వర్ణించే ప్రయత్నం ఇంక వారు చేయలేదు. ఇంతేల వారు, ఆ వర్ణనలో ప్రత్యక్షరూపమైన భాషనే విసర్జించివేశారు. ఇంద్రియాలకు అఖండబ్రహ్మమును గురించిన భావాన్ని కలిగించడానికై ఆ ఇంద్రియాల దగ్గరికి వారిక దిగిరాలేదు. దృశ్యమానం, జడం, నిర్జీవం, పంచభూతమయం, ఇంద్రియగమ్యం, విశాలం అయిన అనంతలోకం మళ్ళీ అందులో కనిపించదు. దానికి మారుగా, మరొకటి వస్తుంది. ఈ క్రింది మనోహరవర్ణనను అందు కుదాహరణగా తీసుకోండి.
“న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాన్తికుతోయమగ్నిః
తమేవ భాంతమనుభాతి సర్వం తస్య
భాసా సర్వమిదం విభాతి.”
ఆహా! ప్రపంచంలో దీన్ని మించిన ఉదాత్త కవిత్వం ఏది? (అక్కడ సూర్యుడు ప్రకాశింపజాలడు. చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశింపజాలవు. మెరుపు సైతం ప్రకాశింపజాలదు. ఇక అగ్నిమాట చెప్పనేల?) ఆహా! లోకంలో ఇంతకంటె, మహోదాత్తమైన కవిత్వం ఉండగలదా? ఉపనిషత్తులలోకెల్లా అత్యద్భుతమైన కఠోపనిషత్తును తీసుకోండి. ఎటువంటి అద్భుత నైపుణ్యం, ఎటువంటి విచిత్ర కళాసంపత్తి ఆ కావ్యంలో గోచరిస్తోంది? దాని ప్రారంభమే ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రద్ధ చేత ఆవహించబడిన లేబ్రాయపు కుర్రవాడు యముని చూడగోరుతాడు. గురువుల్లోకెల్లా చాలా చిత్రమూర్తి అయిన మృత్యుదేవతే జననమరణాలను గూర్చిన మహారహస్యాలను ఆ పిల్లవానికి బోధించడం జరిగింది. ఆ పిల్లవాని అన్వేషణలోని లక్ష్యమేది? మృత్యురహస్యాన్ని కనుగొనడం!
మీరు జ్ఞాపకముంచుకోవాలని నేను కోరే రెండవ విషయమది. ఉపనిషత్తుల ప్రామాణికత మానవులపై ఆధారపడనే పడదు. వాటిలో అనేక పురుషులు, అనేక వక్తలు, అనేక గురువులు ఉదాహరించబడి ఉండటం నిజమే కాని, వారిలో ఒక్కడైనా, ఈ ఉపనిషత్తులకు ఆధారభూతుడు కాడు. ఒక్క శ్లోకమైనా వారిలో ఒకని జీవితంపై ఆధారపడి ఉండలేదు. వీరందరూ ఎక్కడో వెనుక మెదలుతూంటారు; వారి నీడలు మాత్రం, తెరమీద కనిపిస్తూందా అన్నట్లుంటాయి. వాళ్ళు పట్టుకోవడానికి చిక్కరు. చూపులకు దొరకరు. ఇలాంటి వారని విస్పష్టంగా గోచరించరు. ఉపనిషత్తులు ఎవరిమీదా ఆధారపడినవి కానే కావు. వాటి బలమంతా, అందులోని అత్యద్భుతాలు, దేదీప్యమానాలు, జ్ఞాన తేజోమయాలు అయిన వాక్యాల్లోనే ఉంది; రచయితల మీద కాదు. యాజ్ఞవల్క్యులు ఇరవైమంది పుట్టనీ, జీవించనీ, మరణించనీ, లెక్కలేదు. లెక్కకు వచ్చేవి శ్రుతివాక్యాలే. శ్రుతివాక్యాలు వ్యక్తులపై ఆధారపడనివి; కాని, అవి ఏ వ్యక్తులను ఖండించవుకూడ. ప్రపంచంలో ఇదివరకు ఉద్భవించినట్టి, ఇంక ఉద్భవించనున్నటి వ్యక్తులనందరినీ, తన కౌగిట చేర్చుకోనంతటి విశాలత, ఆదరణ, అందులో ఉంది. నరులను, అవతారులను, ఋషిశ్రేష్ఠులను పూజించడానికి అది అడ్డు చెప్పదు. పైగా అట్టి దాన్ని సదా సమర్థిస్తుంది. కాని దానికి మానవులతో సంబంధం లేదు. ఉపనిషత్తులు ప్రతిపాదించే ఈశ్వరునికి, అంటే, నిర్గుణునికి పురుషభావం ఎలా లేదో, అలాగే అందులోని వాక్యాలకు పురుషాధారం, పురుషసంబంధం లేకుండటం అద్భుతమైన విషయం. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుడు సత్యమెంత అనన్యాధారమై ఉండగోరుతుందో, అంత స్వయం ప్రామాణికతతో ఈ ఉపనిషత్సత్యాలు, జ్ఞానసిద్ధులకు, జిజ్ఞాసువులకు, తత్త్వజ్ఞులకు, తార్కికులకు గోచరిస్తాయి. ఇవే మన ప్రమాణ గ్రంథాలు. క్రైస్తవులకు బైబిల్ ఎలాంటిదో, మహమ్మదీయులకు ఖురాన్ ఎలాంటిదో, బౌద్ధులకు త్రిపిటకం ఎలాటిదో, పారశీకులకు జండవెస్టా ఎలాటిదో, మనకు ఉపనిషత్తులు అలాటివని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పురాణాలు, తంత్రాలు, మొదలైన గ్రంథాలన్నీ చివరకు వ్యాససూత్రాలు సైతం, ద్వితీయ, తృతీయశ్రేణికి చెందిన ప్రమాణాలే. మొట్టమొదటి శ్రేణికి చెందిన ప్రమాణాలు వేదాలు. మనుధర్మ శాస్త్రంకానీ, పురాణాలు కానీ, మరి ఏ ఇతర గ్రంథాలుకానీ, ఉపనిషత్తులకు అనుకూలంగా ఉండేంతవరకే పరిగ్రాహ్యాలు. ప్రతికూలమైనప్పుడు నిర్దాక్షిణ్యంగా వాటిని త్రోసివేయవలసిందే. ఈ విషయం ఎప్పుడూ మన జ్ఞప్తిలో ఉంచుకోతగింది. కానీ, దురదృష్టంవల్ల భారతదేశం ఈ కాలంలో ఆ మాట మరిచిపోయింది. ఏ అల్ప గ్రామాచారమో, మనకిప్పుడు యథార్థమైన ప్రమాణంగా కనిపిస్తోంది. ఉపనిషత్తుల బోధ అలా కనిపించడం లేదు. వంగదేశంలో ఏ మారుమూల గ్రామంలోనో వాడుకలో ఉండే స్వల్పాభిప్రాయం వేదవాక్యమంతటి అధికారం కలదిగా, అంతకంటె అధికమైందిగా కూడ పరిగణించబడుతోంది. ‘పూర్వాచార’ మనే శబ్దానికి ఎంత విచిత్రమహిమ ఉందో చూడండి. గ్రామవాసికి కర్మకాండలోని అత్యల్పాంశ మొక్కటి అత్యధిక గౌరవాస్పదమైన సదాచారంగా కనిపిస్తోంది. దాన్ని అనుసరించని వానిని “పో, నీవింక హిందువుడవు కావు” అని నెట్టేస్తారు. అట్లే, ఏదో ఒక తంత్రాన్ని చేపట్టి, “ఈ తాంత్రికాచారాన్ని అనుసరించి తీరాలి” అనేవారు దురదృష్టవశాత్తు నా మాతృభూమిలో అసంఖ్యాకంగా ఉన్నారు. వారి అభిప్రాయంలో అలా చేయనివాడు సదాచారి కాడు. కాబట్టి ఉపనిషత్తులలోనే ప్రధాన ప్రామాణ్యం ఉందనీ, గృహ్యసూత్రాలకు, శ్రౌతసూత్రాలకు సైతం, వేదాలకంటే తక్కువ ప్రామాణ్యమే ఉందనీ, జ్ఞప్తిలో ఉంచుకోవడం మనకు ముఖ్యం. అవి మన పూర్వులైన మహాఋషుల వాక్కులు. నీవు హిందువు కాగోరితే వాటిని విశ్వసించాలి. భగవంతునిగూర్చి నీకు ఏవేవో స్వతంత్రభావాలుండవచ్చు. కానీ వేదాలు ప్రమాణం కావంటే నీవు నాస్తికుడివే. క్రైస్తవుల, బౌద్ధుల మతగ్రంథాలకు, మన మత గ్రంథాలకు భేదం ఇక్కడే ఉంది. వారి శాస్త్రాలన్నీ పురాణాలేకానీ, శాస్త్ర గ్రంథాలు కావు. ఎందుకంటే వాటిలో జలప్రళయ కథనం, రాజవంశ చరిత్రలు, రాజ జీవితాలు, మహాపురుషుల జీవితాలు, ఇలాంటివెన్నో వర్ణించబడ్డాయి. ఇది పురాణ లక్షణం. అవి వేదాలకు అనుగుణంగా ఉన్నంతవరకు మంచివే; బైబిలు, ఇతర జాతుల ధర్మగ్రంథాలుకూడ, వేదాలను అనుసరించినంతవరకు పూర్తిగా యోగ్యమైనవే; వ్యతిరేకంగా ఉన్నప్పుడు గ్రాహ్యం కాజాలవు. ఖురాన్ విషయం కూడ అంతే. దానిలో నీతిబోధలెన్నో ఉన్నాయి. అవి వేదాలకు అనుగుణంగా ఉండేంతవరకు వాటికి పురాణాలతో సమానమైన ప్రామాణికత సిద్ధిస్తుంది. అంతకుమించిన గౌరవం లేదు. మన వేదాలు అపౌరుషేయాలనీ, వాటికి ఆదిలేదనీ హిందూమతభావం. ఒక క్రైస్తవ మతప్రచారకుడు, తమ మత గ్రంథాలు చారిత్రక లక్షణాలు కలవి కాబట్టి, అవి సత్యాలని ఒకప్పుడు నాతో చెప్పాడు. అందుకు నేనిలా ప్రత్యుత్తరమిచ్చాను. “మా శాస్త్రాలకు చారిత్రక లక్షణాలు లేవు. అందువల్లే అవి సత్యం. మీవి చారిత్రాత్మకాలు కాబట్టి, ఎవడో ఒకడు ఇటీవల వాటిని వ్రాసివుంటాడు. మీవి మానవనిర్మితాలు, మావో అట్టివి కావు. మా వాటి చారిత్రక లక్షణం లేకపోవడమే వానికి వన్నె తెస్తోంది.” ఇదే వేదాలకు, ఈనాడు ప్రపంచంలోవున్న ఇతర మతగ్రంథాలకన్నిటికీకల తారతమ్యం!
ఇక ఉపనిషత్తుల బోధనలను విచారిద్దాం. భిన్నభిన్నమైన వాక్యాలు వాటిలో ఉన్నాయి. అందులో కొన్ని పూర్తిగా ద్వైతపరమైనవి. మరికొన్ని అద్వైతపరం. అయినా, భారతదేశంలో ఉన్న వివిధ శాఖా సంప్రదాయాల వారందరిచేత, అంగీకరించబడిన సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఒకటి సంసారాన్ని గూర్చిన, అంటే జీవుని జన్మాంతరాన్ని గూర్చిన సిద్ధాంతం. రెండోది మానసికశాస్త్ర విషయంలో ఏకీభావం. మొదట భౌతిక శరీర మొకటి ఉంటుంది. దానిలోపల సూక్ష్మశరీరమనబడే మనస్సుంది. దానికి లోపల జీవుడుంటాడు. పాశ్చాత్యుల మానసిక శాస్త్రానికీ, భారతీయుల మానసిక శాస్త్రానికీ, ఇదే ముఖ్యభేదం. పాశ్చాత్య మనస్తత్వశాస్త్రం దృష్టిలో మనస్సే ఆత్మ. ఇక్కడో అలా కాదు. అంతఃకరణం (లోపల ఉండే ఉపకరణం) అనబడే మనస్సు జీవుని స్వాధీనంలో ఉండే ఒక పనిముట్టు మాత్రమే. దీని సహాయంతో జీవుడు శరీరం మీద, బాహ్య ప్రపంచం మీద, పనిచేస్తాడు. ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయముంది. “ఈ జీవుడు లేక ఆత్మ (లేక జీవాత్మ అని కొన్ని సంప్రదాయాలవారు పిలుస్తున్నది) అది లేనిదనీ, నిత్యమనీ అది, చివరికి మోక్షాన్ని పొందేవరకు జన్మ పరంపరలను పొందుతూ, సాగిపోతుంది” అని అందరూ అంగీకరిస్తున్నారు. ఇంకొక విషయంలో కూడ వీరంతా ఏకీభవిస్తున్నారు. పాశ్చాత్య సిద్ధాంతాలకు, భారతీయ సిద్ధాంతానికీ మధ్యవున్న ప్రాణప్రాయమైన భేదాన్ని అత్యంత స్పష్టంగా, అత్యంత ప్రధానంగా ఇదే గుర్తింపజేస్తుంది. సర్వమూ, ఆత్మలోనే ఉందనే సిద్ధాంతమే ఇది. ఎక్కడో వెలుపలినుండి వచ్చేదేదీ లేదు. నిజానికి అంతా లోపలినుండి వెలికి వచ్చేదే. సకల శక్తులూ, సర్వపవిత్రత, సమస్త మహనీయత ఆత్మలోనే ఉన్నాయి. యోగి పొందగోరే అణిమ, లఘిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులు, నిజానికీ “సంపాదించబడేవి” కావనీ, అవి ఇదివరకే ఆత్మలో ఉన్నవి కాబట్టి వాటిని వ్యక్తరూపానికి తేవడానికే తాను ప్రయత్నిస్తున్నాననీ యోగి చెబుతాడు. మీ పాదాల క్రింద ప్రాకులాడే అత్యల్ప క్రిమిలోకూడ ఈ ఎనిమిది విధాలైన యోగసిద్ధులు ఇదివరకే ఉన్నాయని పతంజలి చెబుతున్నాడు. భేదమంతా, శరీరం వల్ల, అంటే ఉపాధివల్ల కల్పితమవుతోంది. ఆ క్రిమి ఉత్తమతర శరీరాన్ని పొందిన వెంటనే ఈ మహిమలు వ్యక్తమవుతాయి. అంతే అవి అక్కడ ఉన్నవే. “నిమిత్త మప్రయోజకం ప్రకృతీనాం వరణ భేదస్తు తతః క్షేత్రికవత్” (సత్కార్యాలుగానీ, దుష్కార్యాలుకానీ, స్వభావ పరివర్తనకు ప్రత్యక్ష కారణాలు కావు. కానీ, అవి ప్రకృతి పరిణామానికి అడ్డుపడే ఆటంకాలను ఛేదించడానికి మాత్రమే పనికొస్తాయి. సేద్యగాడు ప్రవాహమార్గంలోని అడ్డాలను తీసివేయగానే, నీరు తన స్వభావంచేతనే ప్రవహించే విధంగా) ఎక్కడోవున్న మహాతటాకంనుండి, తన పొలంలోకి నీరు పారించుకొనే సేద్యగాని సుప్రసిద్ధ ఉదాహరణాన్ని ఈ సందర్భంలో పతంజలి ఇస్తున్నాడు. తటాకం ఇది వరకే నీటితో నిండివుంది. ఒక్క క్షణంలో అది అతని పొలాన్ని నింపేసేదే. కానీ పొలానికీ, తటాకానికీ, ఒక పెద్దకట్ట అడ్డముంది. ఈ అడ్డాన్ని తొలగించగానే ఆ నీరు స్వశక్తిచేత, స్వబలంచేత పరుగెత్తి వస్తుంది. ఈ ప్రబల శక్తి, పవిత్రత, పూర్ణత, ఇదివరకే ఆత్మలో ఉన్నాయి. ఉన్న అవరోధమంతా దానిపై కప్పివున్న ముసుగును పోలిన ఈ ఆవరణమే. ఎప్పుడు, ఈ ముసుగు తొలగిపోతుందో, అప్పుడే ఆత్మ పవిత్రతను పొందుతుంది. దాని మహిమలన్నీ వ్యక్తరూపం పొందుతాయి. పాశ్చాత్య భావానికీ, ప్రాచ్య భావానికీవున్న గొప్పభేదమిదే అని మీరు జ్ఞప్తిపెట్టుకోవాలి. ఈ భావభేదం వల్లనే “మానవులు ఆజన్మ పాపులు” మొదలైన విపరీత సిద్ధాంతాలను బోధించటం, అలాటి విపరీత సిద్ధాంతాలను నమ్మని మనలాంటి వాళ్ళను దుర్మార్గులనడం జరుగుతోంది. మనం స్వాభావికంగానే దుర్మార్గులమైతే మన మింకెప్పుడూ యోగ్యులం కాజాలమని వారు నిదానించి ఆలోచించరు. స్వభావం మారజాలదు కదా? మారితే దాన్ని స్వభావమనడంలో భావవైరుధ్యం ఉంటుంది. మారేది స్వభావం కాజాలదు. మనం దీన్ని జ్ఞాపకముంచుకోవాలి. ఈ విషయంలో ద్వైతులు, అద్వైతులు, భారతదేశంలోని తక్కిన వారంతా ఏకాభిప్రాయులుగా ఉన్నారు.
భారతదేశంలో అన్ని సంప్రదాయాలవాళ్ళు విశ్వసించే మరో విషయం దేవుడున్నాడనడం. దేవునిగూర్చి వారి భావాలు భిన్నమనడం నిజమే. ద్వైతులు సగుణబ్రహ్మమును సగుణబ్రహ్మాన్నే విశ్వసిస్తారు. సగుణుడు అనే మాట అర్థాన్ని మీరింకా కొంచెం వివరంగా తెలుసుకోవాలి. భగవంతునికి ఒక శరీరం ఉందనీ, అతడు ఎక్కడో, ఒక సింహాసనం మీద కూర్చుని, ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉంటాడనీ, ఆ మాటకు అర్థం కాదు. సగుణుడు అంటే గుణాలతో కూడుకొన్నవాడనే అర్థం. సగుణ దైవతం వర్ణనలు అనేకం ఉన్నాయి. ఈ జగత్తు పరిపాలకుడుగా, సృష్టికర్తగా, రక్షకుడుగా, లయకర్తగా ఉండే ఈ సగుణ దైవతాన్ని అన్ని సంప్రదాయాలవారూ నమ్ముతారు. కానీ అద్వైతులు మరికొంతకూడ నమ్ముతారు. గుణ నిరూపణం పొసగని చోట, ఏ విశేషణమూ పనికిరాదు. ఈ సగుణదైవతానికి ఒక ఉన్నతదశ ఉన్నదనీ, అందది సగుణ నిర్గుణమై భాసిస్తుందనీ వారి నమ్మకం. విశేషాలులేని వానిని వర్ణించే విశేషణాలు ఎలా ఉంటాయి? కాబట్టి అద్వైతి భగవంతునికి సత్తు, చిత్తు, ఆనందం అనే మూటిని తప్ప ఏ గుణాలను ఆరోపించడు. అఖండ సచ్చిదానందమనే అద్వైతి భగవంతుని వర్ణిస్తాడు. శంకరాచార్యులవారు చేసిందిదే. కానీ ఉపనిషత్తులింకా లోతునకు దిగి, ఆ బ్రహ్మమును గూర్చి “నేతి, నేతి” అంటే “ఇది కాదు, ఇది కాదు” అనడం తప్ప ఇంకేమీ వివరించడానికి వీలుకాదని చెబుతున్నాయి.
భారతదేశంలోని భిన్న సంప్రదాయాలన్నీ ఈ అంశంలో ఏకీభవిస్తున్నాయి. కానీ, ద్వైతపక్షాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు, ద్వైత సిద్ధాంతాలకు, ఆధునిక ముఖ్య ప్రతినిధి అయిన శ్రీరామానుజాచార్యులవారిని భారతదేశంలోని ద్వైతులకు ఆదర్శమూర్తిగా భావించి మాట్లాడుతాను. ఈ భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో పుట్టిన మహామతకర్తలను గూర్చి వంగదేశంలోని మన ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. ఇది మిక్కిలి శోచనీయం. మహమ్మదీయయుగంలో ఒక్క మన చైతన్యులవారు తప్ప, తక్కిన గొప్ప మతకర్తలంతా దక్షిణభారతదేశంలోనే జన్మించారు. దక్షిణ భారతదేశపు మేధాబలమే ఇప్పుడు నిజంగా భారతదేశాన్ని పరిపాలిస్తోంది. ఏలంటారా? చైతన్యులవారు సైతం అక్కడి సంప్రదాయాలలో ఒకటైన, మధ్వ సంప్రదాయంలోని ఒక శాఖకు చెందినవారే! రామానుజాచార్యులవారి సిద్ధాంతాన్ననుసరించి, దేవుడు, జీవుడు, ప్రకృతి అనే మూడూ శాశ్వతమైనవి. జీవులు నిత్యులు; సర్వకాలము వ్యక్తిస్వరూపులై శాశ్వతంగా ఉంటారు. వారి వ్యక్తిత్వమెప్పటికీ అట్లే నిలిచివుంటుంది. మీ ఆత్మ శాశ్వతకాలం నా ఆత్మనుండి వేరుగానే ఉంటుందని, రామానుజాచార్యుల వారంటున్నారు. ఆత్మ ఉందనటం, భగవంతుడున్నాడనటం, ఎలా యథార్థమో ఈ ప్రకృతి శాశ్వతమై ఉంటుందనడం అలా యథార్థమే. ప్రకృతికూడ శాశ్వతంగా, వేరుపడే నిలిచివుంటుంది. భగవంతుడు సర్వాంతర్గతుడు, జీవాత్మకు సారభూతుడైనవాడు; అతడు అంతర్యామి. ఈ అర్థంలో భగవంతుడు ఆత్మతో ఐక్యమై ఉంటాడనీ, ఆత్మకు మూలసత్త్వమనీ, ఒక్కొక్కప్పుడు రామానుజులవారు భావిస్తున్నారు. ప్రళయ కాలంలో ప్రకృతి అంతా “సంకుచిత” మైనప్పుడు ఈ ఆత్మలన్నీ సంకోచంపొంది అంటే ముడుచుకొని నలుసులలాగా ఏర్పడి, అలాగే కొంతకాలం నిలిచివుంటాయని అతని అభిప్రాయం. తర్వాత కల్పారంభంలో ఈ ఆత్మలన్నీ తమ తమ పూర్వకర్మానుసారంగా వెలువడివచ్చి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూంటాయి. ఆత్మయొక్క సహజమైన అమలత్వాన్ని, పూర్ణత్వాన్ని, సంకోచపరచే ప్రతికార్యమూ పాపకార్యమనీ, ఆ ఆత్మను వెలికి తీసి, వికసింపజేసే ప్రతికర్మ, పుణ్యకార్యమనీ, శ్రీ రామానుజాచార్యులవారు చెబుతున్నారు. అత్మవికాసానికి తోడ్పడే ప్రతి కార్యం ధర్మం. దాన్ని సంకోచింపజేసేదంతా అధర్మం. ఇలా, ఆత్మ తన కర్మలచేత వికాసాన్ని, సంకోచాన్ని పొందుతూ, పోయిపోయి, భగవదనుగ్రహం వల్ల చివరికి మోక్షాన్ని పొందును. ఇటువంటి అనుగ్రహం కోసం నిష్కకళంకంగా తీవ్రప్రయత్నం చేసే అన్ని ఆత్మలకూ, ఆ భగవదనుగ్రహం లభిస్తుందని శ్రీరామానుజాచార్యులవారు చెబుతున్నారు.
“ఆహారశుద్ధౌ, సత్త్వశుద్ధిః సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిః” అనే ప్రసిద్ధవాక్యం శ్రుతిలో ఉంది. ఆహారం శుద్ధంగా ఉన్నప్పుడు, సత్త్వం శుద్ధమవుతుంది. సత్త్వం శుద్ధమైనప్పుడు స్మృతి శుద్ధమవుతుంది. స్మృతి అంటే “ఈశ్వర జ్ఞప్తి”, నీవు అద్వైతివయితే “మన పరిపూర్ణతయొక్క జ్ఞప్తి” అని అర్థం చెప్పుకోవచ్చు. సత్త్వం శుద్ధంగా ఉన్నప్పుడు, ఈ స్మృతి సత్యతరం, స్థిరతరం, అవ్యయం అవుతుంది. ఇది ఒక మహావివాద ఘట్టం. మొట్టమొదట ప్రశ్న “సత్త్వం” అంటే ఏమి? శరీరం మూడు విధాలైన పదార్థాల కలయికవల్ల ఏర్పడుతోంది. గుణాలచేత కాదు. ఇది సాంఖ్యసిద్ధాంతం; దీన్ని మన తత్త్వసాంప్రదాయికులంతా అంగీకరిస్తున్నారు. సత్త్వం, రజస్సు, తమస్సు అనేవి గుణాలని, సామాన్యంగా అభిప్రాయపడుతున్నారు. అలా కాదు. అవి ఎంతమాత్రమూ గుణాలు కావు. అవి, ఈ జగత్తుగా ఏర్పడిన ద్రవ్యాలే! ఆహారశుద్ధితో, అంటే, ఆహారం పరిశుభ్రంగా ఉంటే, సత్త్వమనే ద్రవ్యం శుద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సత్త్వాన్ని సంపాదించడమే వేదాంతం యొక్క ప్రధానాశయం. నేనిదివరకే చెప్పినట్లు ఆత్మ స్వతస్సిద్ధంగా శుద్ధం, పూర్ణం అయినది. కాని, అది రజస్సు, తమస్సుల అణువులతో ఆవరించబడిందని వేదాంత సిద్ధాంతం. ఈ మూటిలో, సత్త్వాణువులు మిక్కిలి ప్రకాశవంతంగా ఉంటాయి. వెలుతురుకూడ, అడ్డంగుండా చొచ్చుకొని పోజాలేంత సులభంగా ఆత్మయొక్క ప్రకాశం ఈ సత్త్వాణువులగుండా చొచ్చుకొని పోగలదు. కాబట్టి, రజస్తమస్సుల అణువులు పోయి సత్త్వాణువులు మిగిలితే, ఆ దశలో ఆత్మయొక్క మహిమ, అమలత్వం వ్యక్తమై ఆత్మ స్వరూపాన్ని ఎక్కువగా ప్రకటిస్తుంది.
కాబట్టి ఈ సత్త్వాన్ని సంపాదించుకోవడం అవసరం. “ఆహారం శుద్ధంగా ఉన్నప్పుడు” అని శాస్త్రోక్తి. ఈ ఆహారమనే మాటకు ‘భోజనం’ అని అర్థం చెప్పి రామానుజులవారు తమ సిద్ధాంతంలో దీనికొక ముఖ్యస్థానమిచ్చారు. అంతటితోపోక అది భారతదేశమంతకూ, అన్ని సంప్రదాయాలకూ వ్యాపించింది. కాబట్టి దీని అర్థమేమో బాగా ఆలోచించడం అవసరం. ఎందుకంటే రామానుజులవారి అభిప్రాయాన్ననుసరించి, ఈ ఆహారశుద్ధి మన జీవితంలో ప్రధాన విషయాలలో ఒకటి. ఆహారాన్ని అపరిశుద్ధం చేసేది ఏదని శ్రీరామానుజాచార్యులవారు ఆలోచిస్తున్నారు. మూడు విధాలైన దోషాలు అన్నాన్ని అపరిశుద్ధపరుస్తాయి. ఒకటి జాతి దోషం. అది ఆ పదార్థంయొక్క జాతికే స్వతస్సిద్ధమైంది. ఉదాహరణ: నీరుల్లి, వెల్లుల్లి మొదలైన వానిలో వాసన. రెండోది, ఆశ్రయ దోషం. ఇది ఆహారం ఎవరినుండి వస్తుందో, ఆ వ్యక్తి వల్ల కలిగేది. దుష్టుల ఆహారం అపరిశుద్ధత కల్పిస్తుంది. భారతదేశంలో మహాపురుషులెందరో తమ జీవితమంతటా, ఈ విషయాన్ని నిష్కర్షగా పాటించడం నేను స్వయంగా ఎరుగుదును. ఆ ఆహారం తీసుకొని వచ్చిన వారెవరో, దాన్ని తాకిన వారెవరో తెలుసుకొనేశక్తి వారికుండేది. అనేక పర్యాయాలు నా జీవితంలో ఈ విషయాన్ని నేను చూశాను. మూడవది నిమిత్తదోషం. అంటే అపరిశుద్ధ వస్తువులయొక్కగాని, విషయాల యొక్కగాని, దోషం ఆహారానికి తగలడం. దీన్ని గురించి మనమింక కొంత జాగ్రత్తగా విచారించడం మంచిది. మురికి, దుమ్ము, వెంట్రుకలు కలిసిన ఆహారాన్ని తినడం ఈ దేశంలో అలవాటైపోయింది. ఈ మూడు దోషాలు తొలగించబడిన ఆహారం సత్త్వశుద్ధిని కలుగుజేస్తుంది. అంటే సత్త్వాన్ని శుద్ధిచేస్తుంది. ఆస్తిక ధర్మజీవనమప్పుడు మిక్కిలి తేలికగా ఆచరించే వీలుకల్గుతుంది. పరిశుద్ధమైన ఆహారాన్ని తినడమే ఆస్తికత అయితే ప్రతివాడూ ధర్మజీవనాన్ని ఆచరించగలడు. నాకు తెలిసినంతలో, ఈ మూడు దోషాలను తొలగించుకోజాలనంత అప్రయోజకుడు, అశక్తుడు, ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. ఇక శంకరాచార్యులవారు ఈ ఆహారశబ్దానికి మనస్సులో చేరిన సంకల్పరాశి అని అర్థంచేసి, ఆ సంకల్పరాశి శుద్ధమైనప్పుడు సత్త్వం శుద్ధమవుతుందే కాని, అంతవరకు కాజాలదని అంటున్నారు. నీ ఇష్టమైన దాన్ని నీవు తినవచ్చు. ఆహారం మాత్రమే సత్త్వాన్ని శుద్ధిచేస్తే ఇంకేమి? ఒక కోతిని తెచ్చి, అది బ్రతికి ఉన్నంతకాలం పాలతోను, అన్నంతోను పెంచినంత మాత్రాన అది మహాయోగి అవుతుందా? అలా అయితే ఆవులు, లేళ్ళు, యోగిసత్తములే కదా? కొందరు భావించేటట్లు చాలాసార్లు స్నానం చేయడంతోనే స్వర్గం లభించేటట్లయితే, మొట్టమొదట చేపలు స్వర్గాన్ని చేరుతాయి. శాకాహారం చేతనే మనిషి స్వర్గానికి పోగలిగితే ఆవులు, లేళ్ళు, వానికంటె ముందుగా స్వర్గం చేరుకొంటాయి.
సరే, ఇక పరిష్కార మార్గమేమి? రెండూ అవసరమే. ఆహారాన్ని గురించి శంకరాచార్యులవారు తెలిపే అభిప్రాయమే నిస్సంశయంగా ముఖ్యమైంది. శుద్దాహారం శుద్ధ సంకల్పాన్ని బలపరుస్తుందనడానికి సందేహం లేదు; ఈ రెంటికి దగ్గరి సంబంధముంది. కాబట్టి రెండూ అవసరమైనవే. కానీ, ఆధునిక భారతదేశంలో శంకరాచార్యులవారి బోధను మరచిపోయి, “పరిశుద్ధమైన ఆహారం” అనే అర్థాన్నే పాటిస్తున్నాం. అందువల్లే, ఆస్తిక ధర్మం వంటింటిలో దూరిందని నేను చెప్పాను. అందుకు ప్రజలు నా మీద కోపావేశులయ్యారు. మీరు నాతో చెన్నపురి వచ్చివుంటే నా మాటలోని సత్యాన్ని మీరు గ్రహించగల్గేవారు. వంగదేశీయులు వారికంటే మేలు. ఇతరులు అన్నంవంక చూచినంత మాత్రంతోనే దాన్ని పారేసేవాళ్ళు మద్రాసులో ఉన్నారు. ఇంతచేసినా, అక్కడి ప్రజలు ఇక్కడి వారికన్నా ఉత్తములని చెప్పజాలను. ఆహారనియమంవల్ల, భోజనకాలంలో దృష్టి దోషాన్ని పాటించడంవల్ల, పరిపూర్ణత వచ్చేలాగైతే, వారంతా సమగ్రులై ఉండాలి. కానీ వారలా లేరు.
రామానుజ శంకరుల భావాలను రెంటిని సమన్వయించి పూర్ణ రూపాన్ని కల్పించవచ్చు. కానీ, అప్రధాన విషయానికిచ్చినంత ప్రాముఖ్య మీయతగదు. అలా ఇవ్వడం గుర్రానికి ముందు బండిని కట్టడం లాంటిది. తినదగినది ఈ ఆహారమా, ఆ ఆహారమా, అనే విషయాన్ని గూర్చి, వర్ణాశ్రమాచారాలను గూర్చి నేడు గందరగోళాలు చెలరేగుతున్నాయి. ఈ అరుపులలో వంగదేశీయులు దిట్టలుగా ఉన్నారు. “ఈ వర్ణాశ్రమాలను గూర్చి మీకేమి తెలుసు?” అని మీలో ప్రతివానినీ నేను అడుగుతున్నాను. ఈ దేశంలో ఈనాడు, ఆ చతుర్వర్ణాలు ఎక్కడున్నాయి? నాకు జవాబు చెప్పండి. నాకవి కన్పించడం లేదు. మన వంగదేశపు “తలయే లేని తలనొప్పి” అనే సామెతలాగా, మీరీ వర్ణాశ్రమాలనిక్కడ సృష్టింప జూస్తున్నారు. ఇక్కడ నాలుగు వర్ణాలు ఇప్పుడు లేవు. బ్రాహ్మణ, శూద్ర వర్ణాలు రెండే నాకు కనిపిస్తున్నాయి. క్షత్రియులు, వైశ్యులు ఉంటే వారేరీ? ఓ బ్రాహ్మణులారా! హిందూమతానుసారంగా వారిని ప్రతి క్షత్రియుని, ప్రతి వైశ్యుని యజ్ఞోపవీతాలు ధరించి, వేదాలను చదువుకోండని ఏల బోధించడం లేదు? ఒకవేళ వైశ్యులు, క్షత్రియులు వంగదేశంలో లేరనుకొందాం. బ్రాహ్మణులు, శూద్రులు మాత్రమే ఉన్నదేశంలో బ్రాహ్మణులు నివసించరాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా! కాబట్టి మూట ముల్లె సర్దుకొని వెళ్ళిపోండి! మీరు వేయి సంవత్సరాలుగా మ్లేచ్ఛుల తిండి తిని, మ్లేచ్ఛుల సేవ చేస్తున్నారు. అట్టివారిని గూర్చి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో మీకు తెలుసా? అందుకు ప్రాయశ్చిత్తమేమో ఎరుగుదురా? చేతులారా, తన్నుతాను కాల్చుకోవడం! మీరు గురువులమని పేరు పెట్టుకొని కపటవేషధారులై తిరుగదలచారా? మీకు, మీ శాస్త్రాల్లో విశ్వాసం ఉంటే అలెగ్జాండరు చక్రవర్తితో వెళ్ళి ఉండిన కారణంగా, తాను మ్లేచ్ఛుని ఆహారం తిన్నట్లు భావించి, తన్ను తాను దహనం చేసుకొన్న బ్రాహ్మణశ్రేష్ఠుని లాగా మిమ్మల్ని మీరు వెంటనే దహనం చేసుకోండి! ఆ విధంగా చేస్తే ఈ జాతి అంతా మీకు పాదాక్రాంతం కాగలదు. మీరు మీ శాస్త్రాలను విశ్వసించరు. అయినా, ఇతరులు విశ్వసించాలని కోరుతున్నారు. పూర్వరీతిగా మీరు ఈ కాలంలో చేయజాలకపోతే మీ దుర్బలతను ఒప్పుకోండి; ఇతరుల దుర్బలతను క్షమించండి. వారికి చేయూతనివ్వండి. వారిని వేదాలు చదువుకోనివ్వండి; ప్రపంచంలోని ఇతర ఆర్యజాతులతో సరితూగే ఆర్యులు కానివ్వండి. మీరూ అలాగే ఆర్యులుకండి.
మీ దేశాన్ని మారణం చేస్తున్న హేయమైన వామాచారాన్ని వదలండి. మీరు భారతదేశంలోని ఇతర ప్రాంతాలను చూడలేదు. మన సంఘంలో ఎంతగా ఈ వామాచారం వ్యాపించిందో చూచినప్పుడు, మన నాగరికతను గూర్చి ఎంతగా గర్వపడుతున్నా, మన సంఘానికి చాలా లజ్జాకరమైన దశ వాటిల్లినట్లే భావిస్తున్నాను. వంగదేశంలో మన సంఘం వామాచార సాంప్రదాయికులనే తేనెటీగలకు తెట్టియలాగ ఉంది. పగలు బయటికివచ్చి ఆచారాన్నిగూర్చి పెద్దపెద్ద ఉపన్యాసాలు చేసే వాళ్ళే, రాత్రుల్లో ఈ భయంకర వ్యభిచారాన్ని సాగిస్తూ, అతిఘోరమైన గ్రంథాలను ప్రమాణం చేసుకొంటున్నారు. ఆ గ్రంథాలు ఇలాంటి నీచకార్యాలను చేయండని వారిని ఆజ్ఞాపిస్తున్నాయట! వంగదేశీయులగు మీకు ఆ సంగతి తెలుసు. వంగదేశ శాస్త్రాలన్నీ వామాచార తంత్రాలే. శ్రుతులను బోధించడానికి మారుగా బండ్లకొద్దీ ఆ తంత్రాలను ప్రకటించి మీ బిడ్డల మనస్సులలో విషాన్ని నింపుతున్నారు. కలకత్తా నగర జనకులారా! ఈ వామాచార తంత్రాలవంటి ఘోరగ్రంథాలు, వాటి అనువాదాలతో సహా మీ బాలబాలికల చేతుల్లోకి వచ్చి వారి హృదయాలను విషపూరితంగా చేసేయగా, ఈ బిడ్డలు అవే హిందువుల శాస్త్రాలనే విశ్వాసంతో పెరిగి పెద్దవారు కావడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీకు సిగ్గుంటే మీ బిడ్డల చేతులనుండి వాటిని పెరికి పారేసి, సత్యమైన శాస్త్ర గ్రంథాలను, వేదాలను, గీతను, ఉపనిషత్తులను వారిచే చదివించండి.
భారతదేశమందలి ద్వైత సాంప్రదాయకుల సిద్ధాంతాన్ననుసరించి వేర్వేరు జీవాత్మలు శాశ్వతంగా వేరుగానే ఉంటాయి. భగవంతుడు నిమిత్త కారణమాత్రుడై అదివరకే ఉన్న ద్రవ్యరాశినుండి జగత్తును సృష్టి చేస్తాడు. అద్వైతుల సిద్ధాంతం ప్రకారం భగవంతుడు జగత్తుకు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడ అవుతున్నాడు. అంటే ఆయన ఈ జగత్తుకు సృష్టికర్త కావడమే కాక, దీన్ని తనలోనుండి సృష్టి చేస్తున్నాడు. ఇది, అద్వైతుల సిద్దాంతం. జగత్తును, భగవంతుడు తనలోనుండే సృష్టించీ, ఆ జగత్తునుండి, తాను సదా, భిన్నుడుగానే ఉంటాడనీ, సర్వమూ, ఆ జగదీశ్వరునికి సదా లోబడి ఉంటుందనీ, నమ్మే అసంస్కృత ద్వైతసంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. భగవంతుడు, తనలోనుండే జగత్తును పరిణమింపచేసెననీ, జీవాత్మలు, చివరికి నిర్వాణాన్నిపొంది, ఖండత్వాన్ని బాసి, అఖండ బ్రహ్మమే అవుతాయనీ, విశ్వసించే సంప్రదాయాలుకూడ ఉన్నాయి. కానీ, ఈ సంప్రదాయాలు అదృశ్యమై పోయాయి. ఈనాడు భారతదేశంలో కనిపించే అద్వైత సంప్రదాయమంతా, శంకరాచార్యుల వారిని అనుసరించే వారిదే. శంకరమతానుసారం, భగవంతుడే జగత్తుకు నిమిత్త కారణం, ఉపాదాన కారణంకూడ. మాయవల్ల ఇలా గోచరిస్తుందే కానీ, యథార్థంగా అలా కావడం లేదు. నిజానికి ఈ జగత్తు లేనేలేదు; ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అద్వైత వేదాంతంలో గ్రహించవలసిన అత్యంత మహనీయ విషయం ఈ మాయావాదమే. మన తత్త్వశాస్త్రంలోని ఈ అత్యంత క్లిష్టవిషయాన్ని విమర్శించి చెప్పడానికి ఇప్పుడు, నాకు సమయం చాలదని నా భయం. మీలో పాశ్చాత్య తత్త్వశాస్త్రంతో పరిచయం కలవారికి ఇలాంటి అంశ మొకటి క్యాంటు మహాశయుని సిద్ధాంతంలో గోచరించగలదు. కానీ, మీలో క్యాంటునుగూర్చి ప్రొఫెసరు మాక్స్ముల్లర్గారి వ్రాతలను చదివినట్టి వారికి ముందుగా ఒక హెచ్చరిక చేస్తున్నాను. గొప్ప విపరీతార్థానికి దారితీసే భావమొకటి ఆ వ్రాతలలో ఉంది. దేశకాల నిమిత్తం, మాయ, అభిన్నం అనే భావం మొట్టమొదట కనుగొన్నది శ్రీ శంకరాచార్యులవారే! శంకరభాష్యంలో ఇందుకు నిదర్శనాలైన వాక్యాలను ఒకటి రెండు కనుగొని, నా మిత్రుడైన ప్రొఫెసర్ మాక్స్ముల్లర్గారికి పంపగల అదృష్టం నాకు కలిగింది. కాబట్టి ఆ సిద్ధాంతంకూడ భారతదేశంలోనిదే. అద్వైత వేదాంతుల ఈ మాయాసిద్ధాంతం చాలా చిత్రమైంది. నిజానికి ఉన్నదంతా బ్రహ్మమొక్కటే. కాని, ఈ మాయవల్ల భిన్నత్వం ఏర్పడింది. ఏకత్వమే అంటే అద్వితీయ బ్రహ్మమే పరమప్రాప్యం. ఈ అంశంలో భారతీయ సిద్ధాంతానికి పాశ్చాత్య సిద్ధాంతానికి మధ్య అనంతమైన విభేదం ఉంది. వేలకొద్దీ సంవత్సరాలకు ముందే ఈ సిద్ధాంతాన్ని ప్రతిజ్ఞాపూర్వకంగా భారతజాతి ప్రపంచంలో నెలకొల్పింది. వేర్వేరు జాతులవారు దీని ఖండనకు పూనుకొన్నారు. చివరికి వారంతా సమసిపోయారు. ఈ భారతజాతి మాత్రం అమరమై నిలిచివుంది. ఆ ప్రతిజ్ఞ ఇదే; ఈ జగత్తు భ్రాంతిమయం, ఇదంతా మాయ. నీవు నేలమీద విస్తరి వేసుకొని వ్రేళ్ళతో ముద్దలు చేసుకొని తినేవాడివైనా, బంగారు పళ్ళెంలో స్పూనుతో తినేవాడివైనా, మహాసౌధాల్లో నివసించే సమ్రాట్టువైనా, శుష్కదరిద్రుడివైనా, మరణం ఒక్కటే చివరికి నీ గతి. అంతా సమమే. అంతా మాయే. ఇది ప్రాచీన భారతీయ సిద్ధాంతం. ఎన్నో జాతులు దీన్ని ఖండించడానికి, ఇది కల్ల అని రుజువు చేయడానికి పరంపరగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వారు గొప్పవారై, భోగం గమ్యార్థంగా పెట్టుకొని, చేతిలో పూనిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించి, అత్యంత వైభవాలతో తులతూగుతున్నారు. కాని, మరుక్షణంలోనే మరణం పాలబడిపోతున్నారు. మనం అంతా మాయగా చూస్తూ శాశ్వతంగా నిలిచివున్నాం. మాయయొక్క సంతానం శాశ్వతమై జీవిస్తూండగా, భోగం యొక్క సంతానం విలయమందుతోంది!
మరొక గొప్ప భేదం కూడా ఉంది. జర్మన్ తత్త్వశాస్త్రంలో హెగెలు, స్కోఫెన్హార్ మహాశయులు చేసిన ప్రయత్నాలవంటివే, సరిగ్గా అటువంటభావాలే ప్రాచీన భారతదేశంలో ప్రకటించబడ్డాయి. అదృష్టవశాత్తు ఈ హెగెలు మతం, జడ్డిగంలోనే మిడతపోటు తిన్నది. అంటే ప్రారంభంలోనే నశించింది. కాబట్టి అది మొలకెత్తి వృక్షం కాలేదు. దాని శాఖలు పెరిగి వినాశకరమైన దాని ఊడలు, మన మాతృదేశంలో నాటుకోకుండా పోయాయి. అద్వితీయమైన అఖండతత్త్వం అల్లకల్లోలమైందనీ, వ్యక్తిత్వం పొంది, విడివడిన స్వరూపమే ఆ అఖండతత్త్వంకంటె ఉత్తమమనీ హెగెలు అభిప్రాయం. లోకమే అలోకంకన్నా గొప్పదనీ, సంసారమే నిర్వాణంకంటె శ్రేష్ఠతరమనీ, అతడు తేల్చిచెప్పాడు. ఇదే అతని ప్రధాన భావం. మీరు, ఈ సంసారంలో దిగబడిన కొలదీ, జీవన వ్యావృత్తులచే మీ ఆత్మ ఆవరించబడినకొలదీ, మీరు గొప్పవారవుతూంటారట! ఆ సిద్ధాంతవాదులు ఇలా అంటారు: “మేమెలా భవనాన్ని నిర్మిస్తున్నామో, రాజవీథుల్ని ఎలా శుభ్రపరుస్తున్నామో, ఇంద్రియభోగాలను ఎలా అనుభవిస్తున్నామో, గమనించండి.” ఈ ప్రతి అల్ప భోగానికి వెనుక ద్వేషం, దుఃఖం, భయం, దాగివుండవచ్చు.
ఇక మన తత్త్వవేత్తలు ఇలా కాక, ప్రప్రథమం నుండి, పరిణామమనే పేరుతోవున్న వ్యక్తీకరణమంతా, ఆ అవ్యక్తతత్త్వం వ్యక్తంకావడానికి చేసే వృధాప్రయత్నాలే అని పల్కుతున్నారు. ఈ విశ్వానికంతటికీ ప్రధాన కారణరూపమైన నీవు క్షుద్రమైన బురదగుంటల్లో ప్రతిబింపచూస్తున్నావు. కానీ, కొంతకాలం అలా ప్రయత్నించిన తర్వాత, అలాంటి ప్రయత్నమంతా వ్యర్థమని తెలుసుకొని వెనుదిరిగి నీవెక్కడి నుండి వచ్చావో అక్కడికే మరలిపోతావు. ఇదే వైరాగ్యం. లేక సర్వసంగ పరిత్యాగం. ఇదే మతధర్మానికి ప్రారంభం. మతంకానీ, నీతిధర్మంకానీ, ఆత్మార్పణ బుద్ధి లేక ఎలా ప్రారంభం కాగలవు? సంగత్యాగమే దీనికి “ఓ, నా, మా,” లు. “త్యాగం చేయి”, “త్యాగం చేయి” అని వేదాలు ఘోషిస్తున్నాయి. పరిత్యాగం చేయి. అదొక్కటే మార్గం. “నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్త్వ మానశుః” (సంతానం వల్ల కానీ, సంపదవల్ల కానీ, అమృతత్త్వాన్ని పొందజాలవు. త్యాగం చేత మాత్రమే అది సాధ్యమవుతుంది.) భారతీయ గ్రంథాలలోని శాసనం ఇదే. సింహాసనాల్ని అలంకరిస్తూ కూడ సంసార త్యాగం చేసిన వారున్నారు! జనకమహారాజు కూడ సర్వపరిత్యాగం చేశాడు. జనకుని మించిన గొప్ప త్యాగి ఎవరు? ఈ రోజుల్లో అందరం జనకుల మనిపించుకోవాలని ఉబలాటపడుతున్నాం. ఔను కూటికి, గుడ్డకు దిక్కులేక అల్లాడుతున్న దీనసంతానానికి వీరు జనకులే.* వీరికి జనకనామం, ఈ విధంగా వర్తిస్తుంది. పూరాణ ప్రసిద్ధుడైన ఆ జనకునికిగల భవ్య దివ్య భావాలు, వీరిలో పూజ్యం! వీరే మన అభినవ జనకులు! ఇప్పుడు ఇలాంటజనకత్వాన్ని కొంచెం త్యాగంచేసి, లక్ష్యాన్ని గుర్తించి నడవండి. మీరు త్యాగం చేయగలిగారా, మీకు ఆత్మధర్మం చేజిక్కుతుంది. అలా చేయలేరా, తూర్పునుండి పడమర వరకు ప్రపంచంలోవున్న పుస్తకాలనన్నిటినీ మీరు పూర్తిగా చదువుదురు గాక! గ్రంథాలయాలన్నిటినీ గుటకవేసి మ్రింగుదురుగాక! గొప్ప పండితులవుదురు గాక, కర్మకాండను మాత్రమే పట్టుకొని వ్రేలాడితే, మీరు వ్యర్థులే! మీకు ఆత్మసిద్ధి కలుగదు. త్యాగం వల్లనే, ఈ అమృతత్త్వాన్ని పొందడం సాధ్యం. వైరాగ్యమొక గొప్పశక్తి. విశ్వాన్నంతను ధిక్కరించి నిలువగల మహాశక్తి. తత్ప్రభావంతో మాత్రమే “బ్రహ్మాండమ్ గోష్పదాయతే” (ఈ బ్రహ్మాండమంతా ఆవు అడుగులాగా చిన్నిగుంట లాంటిదవుతుంది.)
ఈ వైరాగ్యమే మన భారతదేశ మహాధ్వజం! లోకమంతటిపైనా అది ఎగురుతోంది. మృత్యువు వాతబడిపోతున్న జాతుల్ని హెచ్చరించడం కోసం, నిరంకుశ ప్రభువులను మందలించడంకోసం, లోకంలోని దుష్టులను అదలించడంకోసం, పదేపదే భారతదేశం ప్రకటిస్తున్న అనశ్వర భావమిదే! హిందూ ప్రజలారా! ఈ ధ్వజాన్ని మీ చేతులనుండి జారిపోనీయకండి! ఆకాశంలో ఎగిరేలా దాన్ని మీరు పట్టుకొని ఉండండి! మీరు దుర్బలులై త్యాగం చేయలేకున్నా, ఆదర్శాన్నిమాత్రం క్రిందికి లాగకండి. “నేను దుర్బలుడను. సంసారత్యాగం చేయజాలను” అని ప్రకటించండి. కానీ శాస్త్రాలను తికమకచేస్తూ, మోసపు వాదనలకు దిగి, కపట వేషధారులు కావాలని చూడకండి! అజ్ఞానులైన ప్రజల కళ్ళలో దుమ్ముకొట్టాలని ప్రయత్నించకండి. ఆ పనిమాత్రం చేయొద్దు. మీ లోపాన్నిమాత్రం ఒప్పుకోండి. ఆ త్యాగసిద్ధాంతం మహామహిమాఢ్యమైంది. ఆ ప్రయత్నంలో లక్షలకొద్దీ కార్యసిద్ధిని పొందజాలకున్నా మునిగిపోయిందేముంది? పదిమంది – ఇద్దరైనా – శూరాగ్రేసరులు విజయశీలురై తిరిగివస్తే చాలదా? అందులో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది యోధులు ధన్యులు. వారోడ్చిన నెత్తురే ఈ విజయాన్ని సంపాదించేది! బొంబాయి రాష్ట్రంలోని వల్లభాచార్య సంప్రదాయమొక్కటి తప్ప, ఆయా వైదిక సంప్రదాయాలన్నిటిలో, వైరాగ్యమే అద్వితీయంగా ఉంది. వైరాగ్యం లోపిస్తే ఏమి తటస్థిస్తుందో, మీలో చాలామందికి తెలుసుకదా! మనకు పూర్వాచారం కావాలి! అందులో బీభత్సమైన పూర్వాచారాన్ని పాటించేవారు సైతం, ఊపిరాడకుండ ఒళ్ళంతా బూడిదతో కప్పుకొనేవారు సైతం, చేతులు పైకి ఎత్తుకొని నిలుచునేవారు సైతం మనకు అవసరమైన వారే! వారి చర్య అస్వాభావికంగా ఉన్నా వారు మనకు త్యాగభావాన్ని బోధిస్తున్నారు. భారతదేశంలోకి చొరబడి వచ్చి, మన ఆయువుపట్టులనే తినివేస్తూ మన జాతినంతను నిర్వీర్యులనుగా, బేలలనుగా, కపటవేషగాండ్రుగా చేస్తున్న విలాస పరాయణత్వానికి లోబడిపోవద్దని, మన జాతిని వారు హెచ్చరిస్తున్నారు. మనకు వైరాగ్యం కొంచెం అవసరం. ప్రాచీన కాలంలో వైరాగ్యం భారతదేశాన్ని జయించింది. అది, మళ్ళీ భారతదేశాన్ని జయించాలి. ఇప్పుడు సైతం, ఈ వైరాగ్యమే భారతీయాదర్శాలన్నిటిలో మిక్కిలి ఉదాత్తం, ఉన్నతం అయి ప్రకాశిస్తోంది. బుద్ధదేవుని దేశం, రామానుజుని దేశం, శ్రీరామకృష్ణుని దేశం, వైరాగ్యానికి పుట్టినిల్లయిన దేశం, ఎక్కడ పూర్వకాలంనుండి కర్మకాండను ఖండించే బోధలు వెలశాయో, అలాంటి దేశం ఎక్కడ ఈనాడు సైతం సర్వసంగ పరిత్యాగం చేసి జీవన్ముక్తులైన మహాత్ములు వందలకొద్దీ ఉన్నారో, ఆ దేశం అలాంటి దేశమేనా తన పరమాదర్శాలను విడనాడేది? ఎన్నటికీ కాదు. భోగపరములైన పాశ్చాత్య ఆదర్శాలతో తలలు తిరిగిపోయినవారు, కొందరుండవచ్చు వెక్కసమయ్యేలా, పశ్చిమదేశాలను పాడుచేసి లోకాన్ని శాపగ్రస్తం చేసిన ఇంద్రియభోగాలను పూర్తిగా అనుభవించే మనుషులు వేలకొద్దీ లక్షలకొద్దీ ఉందురుగాక! అయినా ఈ నా మాతృభూమిలో ఆ మత ధర్మాన్నే సత్యమని నమ్మి, ఎంతటి కష్టాలొచ్చినా లెక్కచేయక, అవసరమైతే సమస్తమూ బలి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేవాళ్ళు వేలకొద్దీ మహనీయులు నిలిచేవుంటారు!
మన సంప్రదాయాలన్నీ సర్వసామాన్యంగా పాటించే మరొక ఆదర్శాన్ని మీకిప్పుడు నివేదించాలనుకొంటున్నాను. అదికూడ మహా విస్తృత రూపమైందే! “మత మనేది ప్రత్యక్షానుభవానికి తెచ్చుకోవలసిన విషయం” అనే అనన్య సామాన్యసిద్ధాంతం ఈ భారతదేశంలో మాత్రమే కనిపిస్తోంది. “నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునాశ్రుతేన” – ఈ ఆత్మ ప్రసంగాలచేత లభ్యమయ్యేదికాదు; బుద్ధి బలంచేతకూడ లభ్యమయ్యేది కాదు, విశేషమైన వేదాధ్యయనం చేతకూడ లభ్యమయ్యేది కాదు.” వేదపఠనం వల్ల సైతం ఆత్మ లభ్యం కాదు అని ప్రకటించేది ప్రపంచంలో మన వేదమొక్కటే. ఏ ఇతర ధర్మగ్రంథంలోను, ఇలాంటి ప్రకటన కానరాదు. ప్రగల్భాలు పనికిరావు; ఉపన్యాసాలు వ్యర్థం. ఇలాంటి వేవీ ఉపకరింపజాలవు; అయినా, ఆత్మను ప్రత్యక్షానుభూతికి తెచ్చుకోవాలి. అది గురువువల్ల శిష్యునికి లభిస్తుంది. శిష్యునికి ఈ అంతర్దృష్టి లభించినప్పుడు అంతా తేటతెల్లమౌతుంది. అంతట ఆత్మసాక్షాత్కారం అనుభవంలోకి వస్తుంది.
ఇంకొక భావం కులగురువు, లేక వంశపారంపర్య గురువు అనే ఒక వింత ఆచారం వంగదేశంలో ఉంది. “నా తండ్రి నీకు గురువు. కాబట్టి ఇప్పుడు నేను నీ గురువును. నా తండ్రి నీ తండ్రికి గురువు. కాబట్టి నేను నీకు గురువుగా ఉంటాను.” గురువు అంటే ఏమి? వెనక్కి తిరిగి శ్రుతులలో ఏముందో చూద్దాం. “వేదరహస్యం తెలిసినవాడు గురువు.” కాని గ్రంథావలోకన వ్యగ్రులుకానీ, వైయాకరణులుగానీ, పండితులుకానీ, అంతమాత్రం చేతనే గురువులు కాజాలరు. పరమార్థం తెలిసినవారే గురువులు. “యథా ఖర శ్చందన భారవాహీ భారస్యవేత్తా నతు చందనస్య” – (గంధపు చెక్కలు మోసే గాడిదకు ఆ చెక్కల బరువు తెలుస్తుందే తప్ప వాటి సుగంధం తెలీదు.) అలాంటి వారీ పండితులు. అలాంటివాళ్ళు మనకు అవసరం లేదు. వాళ్ళకీ అపరోక్షానుభూతి లేకుంటే, వారేమి బోధించగలరు? ఇక్కడ ఈ కలకత్తా నగరంలో నేను బాలుడిగా ఉన్నప్పుడు, మతధర్మాన్ని తెలుసుకోగోరి ఎన్నోచోట్లకు వెళ్ళేవాడిని. ప్రతిచోట, పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తూండేవారు. చెప్పిందంతా విని, “మీరు దేవుణ్ణి చూశారా” అని అడిగేవాడిని. ఆ ఉపన్యాసకుడు “భగవంతుని చూడటం” అనే మాట వినగానే తికమకపడేవాడు. “నేను చూశాను” అని నాతో చెప్పిన మహాత్ముడు, శ్రీరామకృష్ణ పరమహంస ఒక్కరే. అంతేకాక, “భగవంతుని చూసేమార్గం, నీకు కూడ చూపుతాను” అని అన్నారు. గురువు అంటే శాస్త్రవాక్యాలను పీడించి తికమకలు చేసేవాడు కాడు. “వాగ్వైఖరీ శబ్దఝరీ, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్త యే నదు ముక్తయే” (శబ్ద ప్రయోగవైచిత్రి, అనర్గళమైన ఉపన్యాసశక్తి, శాస్త్ర వాక్యాలను వివరించే నేర్పు, పండితుల భుక్తికోసమే కానీ, ముక్తికోసం కాదు.) ‘శ్రోత్రియః’ అంటే శ్రుతుల రహస్యం తెలిసినవాడు. “అవృజినః” అంటే పాపరహితుడు. ‘అకామహతః” కామహతుడు కానివాడు, బోధించడం చేత డబ్బు సంపాదించడానికి కోరికలేనివాడు, శాంతుడు, సాధువు అయినవాడు గురువు. అతడు వసంతఋతువు లాంటివాడు. అది, ఆయా వృక్షాలకు ఆకులను పూలను కల్పించినా, ఉపకారం చేయడం తన స్వభావం కాబట్టి ఆ చెట్ల నుండి ఏమీ కోరుకోదు. గురువు అంటే అలాంటివాడు. “తీర్ణాఃస్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతు నాన్యానపి తార యంతః” (ఈ ఘోర సంసార సాగరం తాను దాటి, ఏమాత్రం లాభాపేక్షలేక, ఆ సముద్రాన్ని ఇతరులు దాటడానికి సాయపడేవాడే గురువు.) ఇతరులు గురువు కాలేరని తెలుసుకోండి. “అవిద్యాయా మంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితమ్మన్యమానాః జంఘన్యమానాః పరియంతి మూఢాః అందే నైవ నీయమానా యథాంధాః” (స్వయం అజ్ఞానాంధకారంలో మునిగి ఉండీ, గర్వంతో, తమకంతా తెలుసుననుకొనే మూఢులు ఇతరులకు సాయపడగోరి, తూలుతూ, తూలుతూ, నానావక్రగతులపడి గిరగిర తిరుగుతారు. గ్రుడ్డివారు గ్రుడ్డివారికి త్రోవచూపబూనితే ఉభయులు గోతిలో పడతారు కదా!) ఇది వేదవాక్యం. దీనితో మీ ప్రస్తుతాచారాన్ని పోల్చి చూచుకోండి. మీరు వేదాంతులు, విధ్యుక్త మార్గవర్తులు అవునా? మీరు ఉత్తమ హిందువులు, శిష్టాచారపరులు. సరే, నేను కోరేది, మీరు మరింత శిష్టాచారపరులు కావాలని. మీరు అధికాధికంగా పూర్వాచారపరులైనకొద్దీ, అధికాధిక వివేకవంతులవుతారు. అధికాధికంగా నవీనాచారపరాయణులైనకొద్దీ, అధికాధిక మతిహీనులైపోతారు. మళ్ళీ, మీ పూర్వపు సదాచారాన్ని అవలంబించండి. ఏలంటారా? ఆ దినాలలో ఈ పుస్తకాలనుండి వెలువడిన ప్రతి శబ్దం, దృఢం, సుస్థిరం, నిష్కపటం అయిన హృదయం నుండి వెలువడిందే! ప్రతి స్వరమూ నిష్కళంకమే. అటు తర్వాత, పతనం వచ్చింది. కళల్లో, శాస్త్రాలలో, మతంలో, ప్రతి దానిలో జాతికంతటికీ భ్రష్టత్వమే కల్గింది. కారణాలను గూర్చి విమర్శించడానికి మనకు కాలం చాలదు. ఆ కాలంలో (ఆ భ్రంశకాలంలో) వ్రాయబడిన పుస్తకాలన్నీ విషజాడ్యపూరితాలు, జాతీయతాపతన సూచకాలు; జవసత్త్వాలకు మారుగా ఏడ్పులను, పెడబొబ్బలను మాత్రం వెలువరించాయి. బలమహితం, చైతన్య మహితం అయిన, ఆ పూర్వదినాలకై మరలండి. వెనక్కి పోండి! ఆ ప్రాచీన నిర్ఘరిణులనుండి, కడుపార సుధారసం గ్రోలండి. మళ్ళీ శక్తివంతులుకండి. భారతదేశం సజీవం కావడానికి అదొక్కటే మార్గం.
అద్వైత సిద్ధాంతం ప్రకారం నేడు మనకున్న వ్యక్తిత్వం భ్రాంతి మూలకమైంది. ప్రపంచమందంతటా, ఇది దురవగాహ విషయంగానే ఉంది. ఎవనితోనైనా, నీకొక ప్రత్యేక వ్యక్తిత్వం లేదని చెప్పు. తన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలీకపోయినా, అది పోతుందేమో అని అతడు చాలా భయపడతాడు. కానీ ఎన్నడూ వ్యక్తిత్వమనేదే లేదనీ, నీ జీవితంలో ప్రతిక్షణం నీవు మారుతూనే ఉన్నావనీ, అద్వైతమతం బోధిస్తోంది. నీవు బాలుడివిగా వున్నావు. అప్పుడు ఒక విధంగా భావించేవాడివి. ఇప్పుడు యువకుడివి. ఇప్పుడు వేరొక విధంగా భావిస్తున్నావు. ఇక ముసలివాడివవుతావు. అప్పుడు ఇంకొక విధంగా భావిస్తావు. ప్రతివాడూ ఎప్పుడూ మారిపోతూ ఉంటాడు. అలా ఉండగా, ఇంక నీ వ్యక్తిత్వమెక్కడ? అది నీ శరీరంలోగానీ, నీ సంకల్పంలోగానీ, లేదనడం స్పష్టం. వీటి అన్నిటికీ లోపల నీ ఆత్మ ఉంది. ఆ ఆత్మ బ్రహ్మమే అని అద్వైతి చెబుతున్నాడు. రెండు అఖండ పదార్థాలుండజాలవు. ఉన్నది ఒక వ్యక్తే; అది అఖండం. మనం తార్కిక జీవులంకదా? హేతుబద్ధ విచారమేకదా మనకు తృప్తికరం? సరే! ఆ తర్కవిచార మెలాంటిది? అది వర్గీకరణ రూపమైంది. ఆ వర్గీకరణం చేసుకొంటూ పోయిపోయి, ఇక ముందుకు పోజాలక, ఆగిపోతావు. ఖండవస్తువు అఖండంగా వర్గీకరించబడినప్పుడు కానీ, అంటే అఖండంలో చేర్చబడినప్పుడు కానీ, దానికి విశ్రాంతి దొరకదు. ఏదైనా ఒక ఖండవస్తువును తీసుకొని దానిని వేర్వేరుగా విభజిస్తూ పో. చివరికి అఖండ పదార్థాన్ని, లేక ఆ పరంధామాన్ని చేరే వరకు నీకెక్కడా విశ్రాంతి చిక్కదు. ఉండేది ఆ అఖండ వస్తువు మాత్రమే అని వేదాంతి అంటున్నాడు. తక్కినదంతా మాయ. తక్కిందేదీ, సత్యత్వం కలది కాదు, ఏ భౌతిక వస్తువులోనైనా సత్యమై ఉండేది ఈ బ్రహ్మమే. మనమూ ఈ బ్రహ్మమే. ఈ ఆకారం మొదలైనవన్నీ మాయ. ఈ ఆకారాన్ని, ఈ రూపాన్ని తొలగించావా? నీవు, నేను అందరమూ ఒకటే. కానీ, నేను అనే శబ్దాన్ని గురించి మనం జాగ్రత్తపడాలి! సామాన్యంగా, “నేను బ్రహ్మము అయితే, అది ఎందుకు చేయలేను? అది ఎందుకు చేయలేను?” అని జనులు శంకిస్తారు. కాని, ఇక్కడ “నేను” అనే శబ్దాన్ని వేరే అర్థంలో ప్రయోగిస్తున్నాం. నీవు బద్దుడివని అనుకొంటే, ఇక బ్రహ్మం కావు. ఏ కొరతాలేక కాంతి అంతా తన లోపలనే కల ఆ పరమాత్మవు కాజాలవు. అతని ఆనందమంతా, అతని సుఖాలన్నీ అతని లోపలనే ఉంటాయి. అతడు సర్వసమగ్రుడు, స్వయంతృప్తుడు. అతనికే కొరతా లేదు. అతడు దేన్నిగానీ ఆపేక్షించడు. పూర్తిగా నిర్భయుడు. సంపూర్ణ ముక్తుడు. బ్రహ్మమంటే ఇదే. దీనిలో మనమందరం ఒక్కరమే!
కాబట్టి ద్వైతులకు, అద్వైతులకువున్న ముఖ్యభేదం ఇదే అనవచ్చు. శ్రీ శంకరాచార్యులవారివంటి గొప్ప భాష్యకర్త సైతం, కొన్ని వాక్యాలకు, నాకు అసమంజసములని తోచే అర్థాలను కొన్నిసందర్భాల్లో చెప్పాడు. ఒక్కొక్క చోట, రామానుజాచార్యులవారు వాక్యాలకు అర్థాలు చెప్పే పద్ధతికూడ అంత విస్పష్టంగా ఉండదు. “ఏకం సత్ విప్రా బహుధావదంతి” – ‘ఉండే వస్తువు ఒకటే ప్రాజ్ఞులు దానికి అనేకపేర్లు పెట్టారు’ అనే మహాద్బుతభావాన్ని ఎన్నడో, భారతదేశం కన్గొని, ఇకమీదట ప్రపంచానికి ప్రసాదించవలసివున్నా, ఈ శ్రుతియొక్క అభిప్రాయానికి విరుద్ధంగా, ఒక్క సంప్రదాయమే సత్యం కాగలదనీ, తక్కినవన్నీ అసత్యాలనీ, ఒక దుర్భావం, మన పండితులలో సైతం ఉంది. ఈ “ఏకం సత్ విప్రా బహుధావదంతి” అనే సిద్ధాంతమే ఈ జాతి బ్రతుకు తెరువును ఇంతవరకు తీర్చిదిద్దింది. కానీ కొద్దిమంది ప్రాజ్ఞులుతప్ప, అంటే కొద్దిమంది పారమార్థిక సాధకులు తప్ప, ఈ సూత్రాన్ని అందరు తరుచుగా మరచి పోతూనే ఉన్నారు. అవును, ఈ మహాసూత్రాన్ని మనం ఎప్పటికప్పుడు మరచిపోతూనే ఉన్నాం. అద్వైతమో ద్వైతమో, విశిష్టాద్వైతమో, ఏదో ఒక్కటి మాత్రమే సత్యమై ఉండాలి అని అభిప్రాయపడేవారు పండితులలో నూటికి తొంభై ఎనిమిది మంది ఉంటారనుకుంటాను. మీరు కాశీకి వెళ్ళి అక్కడి ఘట్టాలలో ఒకదాని దగ్గర కొంచెంసేపు కూర్చుంటే నా మాటల సత్యం మీకే తెలిసిపోగలదు. ఈ వివిధ సంప్రదాయాల గూర్చి, భిన్నభిన్న విషయాలగూర్చి, ఎడతెరిపిలేని ఆబోతు కుమ్ములాటలు అక్కడ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.
అది అలా జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో భారతదేశంలో, మహాపురుషుడైన శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు. భారతదేశంలోని భిన్నభిన్న సంప్రదాయాల్లో అంతర్లీనమైవున్న సామరస్యానికి ఆయన జీవితం ఆచరణరూపమైన వ్యాఖ్యానం. జ్యోతిశ్శాస్త్రంలోని “భూమధ్య సిద్ధాంతం”, “సూర్యమధ్య సిద్ధాంతం” లాగా ఈ రెండు సిద్ధాంతాలు కూడ అవసరమే అని ఆయన జీవితమే స్పష్టం చేస్తోంది. జ్యోతిశ్శాస్త్రంలో భూమే కేంద్రం అనే సిద్ధాంతం మొదట నేర్పబడుతుంది. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని విద్యార్థి ఇలాంటి భావాలతోనే ఖగోళశాస్త్రాన్నంతా గ్రహిస్తాడు. కానీ ఖగోళశాస్త్రంలోని సూక్ష్మాంశాలను నేర్వ ప్రారంభించినప్పుడు వాటి నడుమ ఉండేది సూర్యుడనే సిద్ధాంతం అవసరమవుతుంది. అప్పుడది వానికి చాలాబాగా కూడ తెలుస్తుంది. సహజంగా ఇంద్రియ సంబంధమైన సిద్ధాంతం ద్వైతం. ఇంద్రియాలు మనకు పరిమితులు పెట్టేంతవరకు సగుణబ్రహ్మమును మాత్రమే మనం చూడగల్గుతాం; సగుణమును తప్ప ఇతరమును తెలుసుకోజాలం. ఈ ప్రపంచంలో ఉన్నది ఉన్నట్లు మనం గ్రహించి తీరాలి. “నీవొక శరీరమని భావించుకొంటూ ఉన్నంతకాలం, నీవు ఒక జీవుడవని భావించుకొంటూ ఉన్నంతకాలం, నీవొక మనస్సువని భావించుకొంటూన్నంతకాలం, ఆత్మ, ప్రకృతి, వాటి సృష్టికర్త అనే మూటినీ ప్రతి అనుభవంలో నీవు పొందక తప్పదు” అని శ్రీరామానుజాచార్యులవారు చెబుతున్నారు. అయినప్పటికీ మనస్సు సూక్ష్మతరమవుతూ పోయిపోయి చివరికి ఇంచుమించుగా లయం చెందినప్పుడు, మనకు భయం కలిగించేవి, దుర్భలుల చేసేవీ, మనల్ని ఈ స్థూలదైహిక జీవితంలో బంధించి ఉంచేవీ అయిన ఆయా విషయాలన్నీ అదృశ్యములై పోయినప్పుడు, ఈ శరీరభావం సైతం అదృశ్యమవుతుంది. అలాంటి స్థితి లభించినప్పుడు కానీ ఈ ప్రాచీన దివ్యసిద్ధాంతంయొక్క సత్యం బోధపడజాలదు. “ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం, మనః । నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తేస్థితాః” (సమస్తమును సమంగా చూడటంలో ఎవరి మనస్సులు సుస్థిరమైనవో, వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రాన్ని దాటుతున్నారు. ఏలంటే బ్రహ్మం నిర్మలం, సర్వసమమూ అయినట్టిది. కాబట్టి, అలాంటివాళ్ళు బ్రహ్మంలోనే జీవిస్తున్నట్లు చెబుతారు.)
“సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం ।
న హిన స్త్యాత్మ నాత్మానం తతో యాతి పరాంగతిం ॥”
ఇలా ఈశ్వరుని సర్వత్ర సమంగా చూచే యోగి, ఆత్మను ఆత్మచే హింసించుకోడు. అతడు పరమగతినే పొందుతాడు.