విజ్ఞానం మరే ఇతర దేశాలకైనా పోవడానికి ముందు తన స్వగృహంగా చేసుకొన్నదీ ప్రాచీన భూమినే! ఆధ్యాత్మికజ్ఞాన ఆగమనాన్ని సూచించే స్థూలచిహ్నాలా అన్నట్టు, మహాసముద్రాలను పోలిన గొప్ప నదులు ప్రవహిస్తున్నది ఈ భారతదేశంలోనే! స్వర్గంలోని నిగూఢాంశాలను చూడబోతున్నాయో అన్నట్లు మన అఖండ హిమాలయ పర్వత పంక్తులు సోపాన పరంపరాలుగా స్వచ్ఛమైన శిశిరకిరీటాలను ధరించి, ఆకాశంలోనికి అత్యున్నతంగా వ్యాపిస్తున్నది ఇక్కడే! లోకంలో ఎన్నడైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషిసత్తముల పాదస్పర్శచేత పవిత్రీ భూతమైన క్షేత్రాలూ ఈ భారతదేశంలోనే ఉన్నాయి! మానవుని అభ్యంతర ప్రకృతిని గూర్చి, ఆంతర ప్రపంచాన్ని గూర్చి పరిశోధనలు మొట్టమొదట ప్రారంభమైంది ఇక్కడే! జీవాత్మ అమృతత్వాన్ని గూర్చి, ఈశ్వరుని పరిపాలనాకర్తృత్వాన్ని గూర్చి ప్రకృతిలో, మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుని గూర్చి సిద్ధాంతాలు, మొట్టమొదట బయలుదేరింది ఇక్కడనుండే! మతధర్మం, తత్త్వశాస్త్రంయొక్క అత్యుత్తమాదర్శాలు తమ పరమప్రాప్యస్థానాన్ని పొందగలిగింది ఇక్కడనే! ప్రపంచాన్ని చాలాసార్లు పూర్తిగా ముంచిలేవనెత్తిన ఆధ్యాత్మిక జ్ఞానం, తత్త్వవిద్య అనే మహోత్తుంగ తరంగాలు బయలుదేరిందీ ఈ దేశంనుండే! మానవకోటిలో శుష్కించి నిర్జీవమైపోతున్న జాతులను మరల ఒకసారి ఉజ్జీవింపజేసి, జవసత్త్వాలు చేకూర్చడానికి అలాంటి తరంగజాలం ఇక బయలుదేరవలసి ఉన్నదికూడ ఈ భారతక్షేత్రంనుండే! వందలకొద్దీ విదేశీయుల దాడులను, భిన్నభిన్నమైన ఆచార మర్యాదల సమ్మేళనంవల్ల కల్గిన వందలకొద్దీ విప్లవాలను భరించి నిలిచినట్టి భారతభూమి ఇదే! చెక్కుచెదరని శౌర్యంతోను వినాశమెరుగని చైతన్య ప్రభలతోను, లోకంలోని ఏ శైలరాజాన్నైనా మించగల్గిన సుస్థిరత్వంతోను నిలిచింది ఈ పవిత్ర దేశమే! ఆద్యంతాలులేక, అమృతమై ఒప్పే, నిత్యాత్మ ఎలాంటిదో, ఈ పవిత్రదేశ జీవితంకూడ అలాంటిదే! మనం అటువంటి దేశమాత కన్న సంతానం.
భారత పుత్రులారా! నేనిప్పుడు కొన్ని అనుష్ఠానాంశాలను గూర్చి మీకు తెలుపడానికి ఇక్కడ నిలిచివున్నాను. గతించిపోయిన వైభవోన్నతిని మీ జ్ఞప్తికి తేవడంలో నా ఉద్దేశం తెలుపుతాను. గతాన్నిగూర్చి చింతించడం పతనానికే హేతువనీ, ఎంతమాత్రమూ లాభకారికాదనీ, కాబట్టి మనం సదా భావినిగూర్చే, అంటే ముందు రానున్నదశను గురించే విచారించవలసి ఉంటుందనీ చాలామంది బోధించడం నేను ఎన్నోసార్లు విన్నాను. ఆ మాట నిజం అయినప్పటికీ, గతంపై ఆధారపడే భావినిర్మాణం కాగలదు. కాబట్టి మీకు శక్తి ఉన్నంతవరకు వెనుదిరిగి దృష్టిసారించండి! మీ వెనుకవున్న ఆ అఖండ నిధులనుండి కడుపునిండుగ జ్ఞానజలాలను పానం చేయండి. అటు తర్వాత ముందుకు చూడండి. ముందుకు పరుగులిడుతూ పోండి. భారతదేశాన్ని పూర్వకాలం నాటికంటే తేజోమయంగా, మాననీయంగా, మహిమాఢ్యంగా వెలయించండి. మన పూర్వులు చాలా గొప్పవారు! ముందుగా మన మా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి! మన స్వరూప సత్యాలను మన నాళాల్లో ప్రవహించే రక్తం స్వభావాన్నీ మనం తెలుసుకోవాలి! ఆ రక్తపటుత్వంలో, భూతకాలంలో ఆ రక్తపటిమ సాధించగల్గిన ఘనకార్యాలలో మనం విశ్వాసముంచాలి! అలాంటి విశ్వాసాన్ని, మన ప్రాచీన ఔన్నత్యాన్ని గూర్చిన పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, పూర్వంకంటే, గొప్పమహిమతో ప్రకాశించే విధంగా భారత భూమిని పునరుద్దరించాలి! మనదేశం, క్షీణతను, హీనతను అనుభవించిన కాలాలున్నాయి. నిజమే. అవి అంతముఖ్యంగా నేను భావించను. మనకందరికీ ఆ విషయం తెలుసు. అలాంటి సమయాలు తటస్థించడమూ అవసరమే! ఒక మహావృక్షంలో మనోహరమైన పక్వఫలం ఉంది. ఆ పండు నేలరాలి చితికి క్రుళ్ళి నాశనమవుతుంది. దాని వినాశంనుండే వేరు పాతుకుని, భావికాలపు వృక్షం అంకురిస్తోంది. ఈ వృక్షం బహుశా మొదటిదానికంటే మహోన్నతమైంది కావచ్చు! మనం గడిపిన క్షీణదశ ఎంతో అవసరమైందే! ఆ క్షీణతనుండే ఈ భారతదేశ భావిభాగ్యోదయం రానుంది. అదిగో అంకురం వెలువడింది. ఇప్పుడే దాని బీజదళాలు కానవస్తున్నాయి. బ్రహ్మాండమైన మహావృక్షం రానుంది. “ఊర్థ్వమూలం”* అని వర్ణించబడిన దివ్యవృక్షం అదిగో! అప్పుడే దృగ్గోచరమవడానికి ప్రారంభించింది. దీన్ని గూర్చే నేనిప్పుడు ప్రసంగించనున్నాను.
భారతదేశ సమస్యలు ఇతర దేశాల సమస్యలకంటె చాలా చిక్కైనవి. అంతేకాదు. ప్రముఖమైనవికూడ. సంఘం, మతం, భాష, పరిపాలన ఇవన్నీ కలిసి జాతి అనే పేరుతో ఉంటుంది. మన జాతితో పోల్చిచూస్తే ప్రపంచంలోని ఇతర జాతుల నిర్మాణవైచిత్ర్యం నిజంగా అత్యల్పమనవచ్చు. ఇక్కడ ఆర్యులు, ద్రావిడులు, తార్తారులు, తురుష్కులు, మొగలులు, యూరోపియనులు, ఇంతేల ప్రపంచంలోని అన్ని జాతులవాళ్ళు చేరి తమ రక్తాన్ని ఈ దేశంలోకి ప్రవహింపచేశారనవచ్చు. ఇక్కడి భాషాజాలం అతివిచిత్రమైన కలగూరగంపను పోలుతుంది. ఆచారవ్యవహారాలను విచారిస్తే పాశ్చాత్య జాతులకు, ప్రాచ్యజాతులకు మధ్య ఎంతభేదం ఉందో, అంతకు మించిన భేదం ఈ దేశంలోని ఏ రెండు జాతుల మధ్యనైనా కనిపిస్తుంది.
మనకున్న ఏకైక సమాన లక్షణం మనమతంలో, మన పరంపరాగత సంప్రదాయ రాశిలోనూ కనిపిస్తుంది. దానిమీదనే మనం భవనం నిర్మించుకోవాలి. యూరప్‌లో రాజనీతి జాతీయైక్యాన్ని కలిగిస్తోంది. ఆసియా ఖండంలో మతాదర్శాలు జాతీయైక్యానికి ఆధారాలుగా ఉన్నాయి. కాబట్టి మతంలో ఏకీభావం కుదరడం భారతదేశ భావిభాగ్యోదయానికి ప్రప్రథమ నియమంగా, అత్యవసరమవుతోంది. ఈ దేశమంతటా సంపూర్ణంగా అంగీకారం పొందిన మతమొకటి ఉండాలి! ఒక్క మతమంటే నా అభిప్రాయమేమో తెలుసా? క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు అర్థం చేసుకొన్నట్లు ఒక ప్రత్యేక మతం కాదు. మన శాఖాసంప్రదాయాలన్నీ తమ తమ సిద్ధాంతాల్లో ఎంత భిన్నంగావున్నా, ఎలాంటి అధికారాల కోసం వివాదాలు సాగిస్తున్నా, మన మతానికి సమష్టిగా కొన్ని సామాన్యాధారాలున్నాయి. ఈ సామాన్యాధారాలను అనుసరించి వాటి హద్దుల లోపల ఈ మన మతం, అనంతమైన భావనాస్వాతంత్ర్యాన్ని, జీవన స్వాతంత్ర్యాన్ని అంగీకరిస్తూ అత్యద్భుత విచిత్రవైఖరితో ఒప్పుతోంది. ఈ విషయం మనకందరికీ తెలుసు! కనీసపక్షం మనలో జిజ్ఞాసువులైన వారికైనా తెలుసు. ఇప్పుడు మనకు కావలసింది మన మతానికి ఆయువుపట్టులయిన ఈ సామాన్యధర్మాలను వెదకి తెలుసుకొని, దేశమందంతటా ఒక కొననుండి మరొక కొనవరకు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి శిశువు వీటిని తెలుసుకొని చక్కగా అర్థంచేసుకొని, తమ జీవితాలలో అనువర్తించేలా ప్రయత్నం చేయడంమాత్రమే. ఇదే మొదటి సోపానం. కాబట్టి దాన్ని గూర్చే మనమిప్పుడు శ్రద్ధ పూనాలి!
మతం సమ్మేళనాశక్తిని ఎదిరించి నిలువలేక, ఆసియాఖండంలో, అందునా ముఖ్యంగా భారతదేశంలో జాతి సంబంధమైన చిక్కులు, భాషా సంబంధమైన కష్టాలు, సంఘసంబంధమైన ఇక్కట్లు, ఉపజాతులకు సంబంధించిన బాధలు అన్నీ నీరైపోగలవు. ఆధ్యాత్మికాదర్శాలకు మించినదేదీ భారతీయుని మనస్సుకు గోచరించదనీ, భారతీయ జీవనానికి మతమే కీలకమనీ మనకు తెలుసు. అంతేకాక అవరోధాలు తక్కువగా ఉండే మార్గంలో మాత్రమే మనం పని చేయగలుగుతాం ఆధ్యాత్మికాదర్శం, అత్యుత్తమాదర్శమనడం సత్యంకావడమేకాక ముఖ్యంగా భారతదేశ విషయంలో కార్యనిర్వహణకు అది ఒకటే మార్గం! దీన్ని మొట్టమొదట బలపరచకుండ, మరే ఇతర మార్గంలోనైనా, పనిసాగిస్తే అది మహానర్థక మవుతుంది. కాబట్టి భవిష్యత్కాలపు భారతజాతిని నిర్మించడానికై మొట్టమొదట చేయవలసిన శంకుస్థాపన ఈ మతసమ్మేళనమే! యుగయుగాలుగా పెరిగిన ఆ మహాశైలంలో చెక్కవలసిన ప్రథమసోపానం, ఈ మత సమ్మేళనమే! ద్వైతులమనో, విశిష్టాద్వైతులమనో, అద్వైతులమనో, శైవులమనో, వైష్ణవులమనో, లేక పాశుపత సంప్రదాయులమనో, మన మే పేరు పెట్టుకొన్నా, హిందువులమైన మనకందరికీ ఆధారాలైన కొన్ని సామాన్యాదర్శాలు ఉన్నాయనీ, మన శ్రేయస్సుకోసం, మన జాతి క్షేమంకోసం, అల్పమైన మన విభేదాలను, మన వివాదాలను, విడిచిపెట్టవలసిన కాలం వచ్చిందనీ నచ్చచెప్పడమే మనకు కావలసింది. ఈ వివాదాలన్నీ పూర్తిగా దోషాలే అని నమ్మండి. మన శాస్త్రాలు అలాంటి వానిని ఖండించాయి. మన పూర్వులు అలాంటివి కూడవని మందలించారు. మనం ఎవరి సంతతి వాళ్ళమని చెప్పుకొంటున్నామో, అలాంటి మహాఋషులు ఈ స్వల్పభేదాలను గూర్చి వాదులాడుకొంటున్న తమ సంతానాన్ని చూచి ఏవగించుకొంటున్నారు.
వివాదాలను వదిలేస్తే ఇతరమైన అభివృద్ధి కార్యాలన్నీ తమంతటతామే చేకూరుతాయి. జీవరక్తం నిర్మలంగా, పుష్టిగా ఉంటే, ఏ రోగ జీవాణువులూ శరీరంలో ప్రవేశించలేవు. మన జీవరక్తం ఆధ్యాత్మిక ధర్మమే! అది స్వేచ్ఛగా ప్రవహించేంతకాలం, అది బలంగా శుద్ధంగా పుష్టిగా ఉన్నంతకాలం అంతా సక్రమంగానే నడుస్తుంది. ఆ రక్తం నిర్మలంగా ఉంటే, రాజకీయ బాధలు, సాంఘిక దోషాలు ఇంకా ఇతరమైన కొరతలు, దేశదారిద్ర్యం సైతం నివారణకాగలవు! రోగ జీవాణువును ఒక్కసారి తొలగించివేస్తే ఏ దోషంకూడ మన రక్తంలోనికి చొరబడలేదు. ఆధునిక వైద్యశాస్త్రంనుండి ఒక ఉదాహరణ తీసుకొందాం. రోగాన్ని పొందడానికి రెండు కారణాలుండాలని తెలుస్తోంది. వెలుపలనుండి వచ్చి ప్రవేశించే విషజీవాణువు ఒకటి, రెండోది శరీరంయొక్క దుర్బలస్థితి. శరీరం విషజీవాణువులకు ప్రవేశమిచ్చే స్థితికి వచ్చేంత వరకూ ఆ జీవాణువులు లోపల ప్రవేశించి, బలపడి వృద్ధిగాంచడానికి వీలయ్యేంతగా శరీరపటుత్వం తగ్గి శక్తి ఉడిగేంతవరకు ప్రపంచంలోని ఏ రోగ జీవాణువునకుకూడ, మన శరీరంలో రోగం కల్పించే సామర్థ్యం ఉండదు. నిజానికి సూక్ష్మజీవుల రూపంలో లక్షలకొద్దీ జీవాణువులు ప్రతివాని శరీరంలోను నిరంతరం వస్తూపోతూ ఉంటాయి. కాని శరీరం పుష్టిగా ఉండేంతకాలం అవి ఏమీ చేయజాలవు. శరీరం నిస్సారమైనపుడు మాత్రమే ఈ సూక్ష్మజీవులు దాని నావహించి రోగాన్ని కల్పిస్తాయి. జాతీయ జీవనం ఇలాగే జరుగుతుంది. జాతీయ శరీరం దుర్బలమైనపుడే నానావిధమైన రోగజీవాణువులు జాతి రాజకీయ పరిస్థితిలోనో, సాంఘికావస్థలోనో, విద్యావిధానంలోనో, చిత్త వైఖరిలోనో గుంపులుగుంపులుగా శరీరంలో ప్రవేశించి రోగకల్పన చేస్తాయి. దీన్ని నివారించడానికి ఆ రోగానికి మూల మెక్కడనో మనం కనుగొని రక్తంలోని మలినాలన్నింటిని తొలగించాలి. వెలుపలినుండి వచ్చే విషాలనన్నిటినీ ఎదుర్కొని నెట్టివేయగల సమర్థత కలిగేలా రక్తాన్ని నిర్మలంగా శరీరాన్ని బలిష్టంగాచేసి, మానవుని పుష్టిమంతునిగా చేయడం కోసమే మన ప్రయత్నమంతా సాగించాలి!
మన జవం, సత్వం ఇంతేల మన జాతీయజీవనమే మన మతంలో ఉందని తెలుసుకొన్నాం కదా! అలా మన చైతన్యం మతంలో నెలకొనడం సరియైందో కాదో, నిర్దుష్టమైందో కాదో, చివరికి లాభకరమైందో కాదో అనే విషయాన్ని నేను తర్కించబోవడంలేదు. మంచికో చెడుకో అది అలావుంది. దాన్ని మీరు తప్పించుకోలేరు. ఇప్పుడూ ఇకముందూ అది అలా ఉండవలసిందే! మతంలో నాకున్నంత విశ్వాసం మీకున్నా లేకున్నా దాన్ని మీరు పోషించవలసి ఉంది. దానిచేత మీరు బంధించబడి ఉన్నారు. దాన్ని వదలి వేసుకొన్నారా, మీరు ముక్కలుముక్కలయిపోతారు. మన జాతీయజీవన రహస్యమిది. మీరు దాన్ని బలపరచవలసి ఉంది. పూర్వం మీరు దాన్నిగూర్చి చాలాశ్రద్ధ వహించారు. కనుకనే, దాన్నిగూర్చి తక్కిన వాటినంతా త్యాగం చేశారు. కాబట్టే శతాబ్దాల తరబడిగా, మీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదిరించి నిలువగల్గారు. మీ పూర్వులు అన్నిటినీ భరించారు. మరణానికి సైతం తలవొగ్గారు. కాని వారు తమ మతాన్ని మాత్రం సంరక్షించుకొన్నారు. విదేశీదండయాత్రీకులు దేవాలయాలను, ఒకటి తర్వాత ఒకటిగా పగులగొట్టారు. ఆ ఆఘాతం గడచిపోగానే దేవాలయ శిఖరాలు మళ్ళీ పైకిలేస్తూనే వచ్చాయి. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాచీన దేవాలయాలు, గుజరాతీలోని సోమనాథం వంటి దేవాలయాలు విజ్ఞానసంపుటాలను మీకు ఇవ్వగలవు. అనేక పుస్తకరాసులకంటే ఇవి మీ జాతీయచరిత్ర రహస్యాలను ఎక్కువ స్పష్టంగా మీకు తెలుపగలవు. నిరంతరం వందలకొద్దీ దాడులకు లోనై నేలకూలినప్పటికీ, ఆ శిథిలాలనుండే ఎప్పటిలాగా వందలకొద్దీసార్లు జవసత్వాలతో పునర్జీవితమై పైకిలేస్తూ వచ్చిన గుర్తులు ఆ దేవళాల మీద ఎలా కన్పిస్తున్నాయో చూడండి! మన జాతీయ హృదయం ఆ విధంగా ఉంది. మన జాతీయ జీవనస్రవంతి ఆ తీరుగా ప్రవహిస్తోంది. దాన్ని అనుసరించిపొండి! అది మిమ్మల్ని మహాతేజోవంతులుగా చేయగలదు. దాన్ని వదలుకొన్నారా, మీరు మరణిస్తారు. ఆ జీవన స్రవంతిని వదలి ఒక అడుగు నడచిన తక్షణమే తత్ఫలితంగా మరణం చేకూరుతుంది. సర్వనాశనమే దాని ఫలితార్థం. ఇతర విషయాలు అవసరంకావని చెప్పడం నా అభిప్రాయం కాదు. రాజకీయాభివృద్ధికానీ, సాంఘికాభివృద్ధికానీ అవసరంకాదని నేను చెప్పబూనడం లేదు. కాని మన దేశంలో మతం ప్రధానమనీ, తక్కినవన్నీ అనుషంగికమనీ, అనగా అప్రధానమనీ నా అభిప్రాయం. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకోండని మిమ్మల్ని కోరుతున్నాను. భారతీయుని హృదయం మొట్టమొదట పారమార్థికమై ఆ తర్వాత ఏదైనా కాగలదు. కాబట్టి మనం మతాన్ని బలపరచాలి. ఆ పనిని ఎలా చేయడమో నా ఉద్దేశ్యాలను మీకు చెప్పబోతున్నాను. నేను అమెరికా పోవడానికై మద్రాసు సముద్రతీరాన్ని వదలడానికి అనేక సంవత్సరాలకు ముందే అవి నా మనస్సులో ఉన్నాయి. అసలు నేను అమెరికా ఇంగ్లాండులకు పోవడం, కేవలం ఈ భావాలను ప్రచారం చేయడంకోసమే! అఖీలమత మహాసభను, ఇతర విషయాలను నేను లక్ష్యపెట్టలేదు. అందువల్ల నాకొక అవకాశం మాత్రం దొరికింది. నిజంగా నాకుగల ఈ భావాలే నన్ను లోకమంతటా తిరిగేలా చేశాయి.
ఏ కొద్దిమందికో వశమై ఏ మఠాల్లోనో, ఏ అడవులలోనో రహస్యంగా దాచబడి, మూలబడివున్నట్టి మన గ్రంథాల్లోని అమూల్యనిధులనదగినట్టి ఆధ్యాత్మిక జ్ఞానరత్నాలను వెలికి తీసుకొనిరావడమే నా ఉద్దేశ్యాలలో మొట్టమొదటిది. ఆ జ్ఞానాన్ని దాచిపెట్టుకొని ఉన్నవారి చేతులనుండేకాక ఇంకా దుర్గమమైన సంస్కృత భాషనుండి కూడా దాన్ని పెకలించి లాక్కొని రావాలి. శతాబ్దాలనుండి కరుడుకట్టుకొని పోయిన సంస్కృత శబ్దజాలంలో అది భద్రపరచబడి ఉంది. దాన్నంతా ప్రజాసామాన్యానికి అందుబాటులోనికి తీసుకొనిరావాలి! ఈ ఉత్కృష్ట భావరాశిని బయటకి లాక్కొనివచ్చి, సంస్కృతభాష తెలిసినా, తెలియకున్నా భారతదేశంలోని ప్రతిఒక్కరికీ అది కొంగుబంగారమై ఒప్పేలా చేసేయాలని నా కోరిక. అలా చేయడంలో మన సంస్కృతభాష, మన ఈ దివ్యభాషే ఒక గొప్పవిఘ్నంగా ఉంది. మన జాతి అంతా మంచి సంస్కృత పండితులయితేనేతప్ప ఈ కష్టం తొలిగేలాలేదు. నా జీవితకాలమంతా ఈ భాషను పరిశోధిస్తూనే ఉన్నాను. అయినా ప్రతి నూతన గ్రంథమూ నాకు తెలియందిగానే కనిపిస్తుందంటే ఈ కష్టమెలాంటిదో మీరు గ్రహించగలరు. ఈ భాషను పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశంలేని సామాన్య ప్రజలకు ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి. కాబట్టి భావాలను ప్రజల భాషలోనే నేర్పాలి. అయినా దాంతోపాటు సంస్కృత విద్యనుకూడ నేర్వాలి. ఎందుకంటే, సంస్కృత శబ్దాల స్వరానికే గొప్ప గౌరవం, మహిమ ఉన్నాయి. అది జాతికి బలాన్నిస్తుంది. భారతదేశపు నిమ్నజాతులను ఉద్దరించడానికై రామానుజులు, చైతన్యులు, కబీరు లాంటి మహనీయులు చేసిన ప్రయత్నాలు ఆ ప్రవక్తల జీవితకాలంలోనే ఎలాంటి సత్ఫలితాన్ని కల్పించగలిగిందో తెలిసికోండి. అయినా వారి తర్వాతివారు ఎందుకు విఫలులయ్యారో విశదపరచాల్సి ఉంది. ఈ మహాచార్యులు గతించిపోయిన తర్వాత దాదాపు ఒక శతాబ్ధంలోపలే వారి బోధన సత్ఫలాలు అడుగంటిపోవడానికి గల కారణం తెలుసుకోవలసి ఉంది. దానిగుట్టు ఇది: వారు నిమ్నజాతులను పైకి తీసుకొని రావాలని మాత్రమే అనుకున్నారు. అలాగే తెచ్చారు. కాని ప్రజాసామాన్యంలో సంస్కృత భాషను వ్యాపింపచేయటానికి ఈ మహాపురుషులు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించలేదు. సామాన్య జనులు సంస్కృత భాషను చదవకుండా ఆపి వేయడంలో బుద్ధభగవానుడు సైతం పొరపాటు చేశాడు. ఆయన సత్వరం లభించే తాత్కాలిక ఫలితాలను కోరి ఆనాడు ప్రజాసామాన్య భాష అయిన పాళీ భాషలో తన బోధనలను సాగించాడు. అది మహాఘనకార్యమే. ఆయన ప్రజల భాషలో మాట్లాడాడు. ప్రజలు ఆయన భావాలను గ్రహించారు. అది గొప్పవిషయమే. అలా చేయడం చేత ఆయన భావాలు త్వరగా వ్యాపించి చాలా దూరంగావున్న వారికి సైతం చేరగలిగాయి. అయినా వాటితోపాటు సంస్కృత భాషకూడ వ్యాపించి ఉండవలసింది. జ్ఞానం లభించింది. కాని దానికి గణ్యత కొరవడింది. సభ్యతకూడ కొరవడింది. సభ్యతే, అంటే నాగరికతే ఒడుదుడుకులకు నిలిచి ఆగగలదు. కేవల విజ్ఞానరాశికి ఆసక్తిలేదు. ప్రపంచంలో జ్ఞాన రాశిని మీరు వ్యాపింపచేయవచ్చు. కాని అందువల్ల ప్రపంచానికి ఎక్కువ మేలు కలుగదు. రక్తంలోనికి సంస్కృతిని ప్రవేశపెట్టవలసి ఉంది. మహత్తరమైన జ్ఞానరాసులు కల జాతుల నెన్నింటినో ఈ కాలంలో మన మెరుగుదుం. వాని గతి ఎలావుంది? సంస్కృతి వారిలో కొరవడటం చేత వారు పులులలాగా, క్రూరమూర్ఖ జాతులలాగా ఉన్నారు. జ్ఞానమనేది పైపైని మెరుగులాంటిదే! ఈనాటి నాగరికత కూడ అలాగే ఉంది. కొంచెం లోతుగా చూస్తే వారి క్రూరబుద్ధి బయలుపడుతుంది. అలాంటి విషయాలు ఇప్పుడు తటస్థిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన అపాయమిదే. సామాన్య ప్రజలకు వారి మాతృభాషలో బోధలు చేయండి. వారికి ఉన్నత భావాలు నేర్పండి. వారికి విషయం అర్థమవుతుంది. కాని ఇంకొకటికూడ అత్యావశ్యకమవుతోంది. వారికి సంస్కృతి నందించాలి! అది వారిలో కొరవడి ఉండేంతవరకు ప్రజాసామాన్యాన్ని పైకితీసుకొని వచ్చిన లాభం సుస్థిరం కాజాలదు. సంస్కృత భాషాప్రభావంతో ఒప్పే వేరొక వర్గమేర్పడి త్వరలో తక్కినవారందరికంటే ఆధిక్యాన్ని సంపాదించి వారి పైని రాజ్యం చేయసాగుతుంది. నిమ్నజాతుల వారికి రక్షణ ఒక్కటే మార్గం, వారికి ఉన్నతదశ లభించే ఉపాయం సంస్కృత భాష నభ్యసించడంలో ఉంది. పోరాటాలవల్ల, విమర్శ రచనలవల్ల, ఉత్తమ జాతులవారిని నిందించడంవల్ల లాభంలేదు. అందువల్ల మేలు చేకూరదు. పైగా వాగ్వాదాలు, పోరాటాలు పెచ్చుపెరుగుతాయి. ఇదివరకే భిన్నభిన్నంగా చీలిపోయిన జాతి ఇంకా ముక్కలు ముక్కలైపోతుంది. కులాలను సమస్థితిలోనికి తీసుకొని రావడానికి సంస్కృతిని అలవరచుకోవడమొకటే ఉపాయం. ఉన్నత కులాలవారిని బలవంతులుగా చేసిన ఆ విద్యను వీరు కూడ సంపాదించాలి. అది చేశారా, మీ కోరిక సిద్ధిస్తుంది.
ప్రత్యేకంగా ఈ చెన్నపట్టణానికి సంబంధించిన ఒక విషయాన్ని గూర్చి ఈ సందర్భంలో వివరించగోరుతాను. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆర్యులనే జాతికాక వారికి భిన్నమైన ద్రావిడులనే వేరొక జాతి దక్షిణ భారతదేశంలో ఉందనీ, ఈ దక్షిణభారతదేశంలో బ్రాహ్మణులు మాత్రమే ఉత్తరంనుండి వచ్చిన ఆర్యులనీ, ఇతర జనులంతా ఈ బ్రాహ్మణులకంటే భిన్నమైన కులాలకు, జాతికి చెందినవారనీ ఒక సిద్ధాంతముంది. ఈ సిద్ధాంతం పూర్తిగా నిరాధారమని నేనంటే భాషాతత్త్వవేత్తలు నన్ను క్షమించాలి!
ఉత్తరానికి, దక్షిణానికి భాషాభేదం ఉండడం మాత్రమే ఈ సిద్ధాంతానికి ఆధారం! మరి ఏ భేదమూ నాకు కన్పించడం లేదు. ఉత్తరదేశ ప్రజలు ఇక్కడ చాలామంది ఉన్నాంకదా? ఈ సభలోని ఉత్తరదేశం వాళ్ళను, దక్షిణదేశంవాళ్ళను వేరుచేసి చూపండని నా యూరోపియన్ మిత్రులను కోరుతున్నాను. ఆ భేద మెక్కడుంది? కొంచెం భాషాభేదమే కదా? కాని ఈ బ్రాహ్మణులు ఉత్తరంనుండి ఇక్కడికివచ్చి చేరారట! వీళ్ళు సంస్కృత భాషను మాట్లాడే జాతివాళ్ళట! సరే, వారిప్పుడు ద్రావిడ భాషను చేపట్టారు; సంస్కృత భాషను మరచారు. తక్కిన కులాలవారు కూడ, ఎందువల్ల అదే విధంగా చేసివుండకూడదు? తక్కిన కులాల వాళ్ళుకూడ, ఒకరి తర్వాత ఒకరుగా ఉత్తరభారతదేశంనుండి వచ్చి, ద్రావిడభాషను చేపట్టి తమ సొంతభాషను ఎందుకు మరచి ఉండకూడదు? ఈ భాషావాదం రెండు పక్షాలకూ అనుకూలించగలదు. అలాంటి పిచ్చివిషయాలను మీరు నమ్మకండి! ద్రావిడజాతి ప్రజలు కొందరిక్కడినుండి అదృశ్యులైపోయి ఉండవచ్చు. అలా నశించగా మిగిలిన ఏ కొద్దిమందో అడవులలోను, అలాంటి ఇతర స్థలాలలోను నివసించివుంటారు. వారి భాష ఈ ఆర్యులచేత చేకొనబడిందనడం సంభవమే! కానీ వీరంతా ఉత్తరంనుండి వచ్చిన ఆర్యులే! భారతదేశమంతటా ఉన్నది ఆర్యజాతే తప్ప వేరుకాదు.
ఇక శూద్రులు ఆదిమవాసులనే అభిప్రాయ మొకటుంది. ఆ ఆదిమవాసులు ఎలాటివారు? బానిసలట! చరిత్రలో ఒకసారి జరిగిన సంఘటనలే పునరావృతమౌతాయని చెబుతారు. అమెరికనులు, ఇంగ్లీషువాళ్ళు, డచ్చివాళ్ళు, పోర్చుగీసువారు, పాపం ఆఫ్రికావారిని పట్టుకొని ప్రాణాలున్నంత వరకు కష్టపెట్టి వారిచేత పనులు చేయించుకొనేవారు. ఆ బానిసతనంలో వారి బిడ్డలు సంకరజాతివారై పుడుతూ వచ్చారు. ఇలా చాలాకాలం జరిగింది. విచిత్రమైన ఈ నిదర్శనాన్ని పట్టుకొని మనస్సు ఎన్నో వేల ఏళ్ళ వెనక్కి పరుగెత్తి, అదే విషయం ఇక్కడకూడ జరిగి ఉంటుందని ఊహలుసాగిస్తోంది. ఇక మన పురావస్తు పరిశోధకుడు, కాటుకకళ్ళుగల ఆదిమవాసులతో నిండివున్న ఇండియా దేశాన్ని గూర్చి కలలు కనడం మొదలుపెట్టాడు. సరే, ఆర్యులనే ఈ దివ్యపురుషులు ఎక్కడినుండి వచ్చారు? భగవంతునికే ఎరుక! కొందరి అభిప్రాయంలో వీరు టిబెట్టునుండి వచ్చారు! మధ్య ఆసియాఖండంనుండి వచ్చినవారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆర్యులంతా ఎర్రని వెంట్రుకలు కలవారని, అభిప్రాయపడే స్వాభిమానులైన ఆంగ్లేయులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ననుసరించి ఇతరులంతా, అంటే అనార్యులు నల్లని వెంట్రుకలుకలవారు. ఆ గ్రంథకర్త నల్లని వెంట్రుకలుకల పురుషుడైతే ఆర్యులంతా, నల్లని వెంట్రుకలు కలవారే అయిపోతారు. ఇటీవల ‘ఆర్యులు’ అనేవారు ‘స్విస్సు’ సరస్సుల తీరంలో నివసించేవారని రుజువు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ సిద్ధాంతాలన్నీ, ఆ సరస్సులలో మునిగిపోయినా నాకు విచారముండదు. ఇక మానవులంతా ఉత్తర ధ్రువం నుండి వచ్చిన వారే అని మరికొందరు చెబుతున్నారు. ఈ ఆర్యులనే వారి సంతానం గొడవ ఈశ్వరుడే చూచుకోనీ! ఈ సిద్ధాంతాల సత్యాన్ని నిరూపించడానికి తగిన ఒక్కమాటైనా మన గ్రంథాల్లో లేదు. ఆర్యులు, భారతదేశం వెలుపలనుండి వచ్చినవారని రుజువు చేయడానికి తగిన మాట ఒక్కటైనా లేదు. ఆఫ్ఘనిస్థాన్ కూడ ప్రాచీన భారతదేశంలోనిదే! అంతటితో ఆ విషయం పోనీండి! ఇక శూద్రకులం వారంతా అనార్యులనీ, వారు అధిక సంఖ్యలుగా ఉన్నారని చెప్పే సిద్ధాంతం సైతం తర్కానికి నిలువజాలదు. అది అసంగతమైన వాదన! కొద్దిమంది ఆర్యులు ఇక్కడ నివాసాల నేర్పరచుకొని, లక్షలకొద్దీ బానిసలను తమ స్వాధీనంలో పెట్టుకొని ఉండటం, ఆ దినాలలో సాధ్యమయ్యే విషయంకాదు. ఈ బానిసలు వాళ్ళను మింగేసి ఉంటారు. ఐదునిమిషాలలో, ఈ పదిమంది ఆర్యులను పచ్చడిగా నంజుకొని ఉండరా? సత్యయుగంలో మొట్టమొదట ఒక్క బ్రాహ్మణకులమే ఉందనీ, కాలక్రమాన వృత్తిభేదాన్నిబట్టి వేర్వేరు వర్గాల వారుగా చీలిపోయారనీ చెప్పే సిద్ధాంతంమాత్రం మహాభారతంలో కనిపిస్తోంది. ఇంతవరకు లభించిన సిద్ధాంతాలలో అది ఒకటే సత్యం, సమంజసమూ అయి కనిపిస్తోంది. మళ్ళీ రానున్న సత్యయుగంలో, తక్కిన కులాలన్నీ ఆ మొదటిస్థితికే మరలిపోగలవు.
కాబట్టి భారతదేశంలోని కులసమస్యా పరిష్కారం ఈ విధంగా జరగవలసిందే! ఉన్నత కులాలవారిని క్రిందికిలాగి భ్రష్టులను చేయడం, బ్రాహ్మణులను నలిపి నాశనం చేయడమూ పొసగదు.
శ్రీ శంకరాచార్యులవారు తన గీతావ్యాఖ్యాన ప్రారంభంలో బ్రాహ్మణత్వాన్ని గూర్చి, బ్రాహ్మణత్వ రక్షణగూర్చీ బోధించడానికై శ్రీకృష్ణుడు అవతరించినట్లు కారణాలను విశదం చేసే సందర్భంలో భారతదేశంలో బ్రాహ్మణత్వమే ఆదర్శమని తెలిపారు. అదే గొప్ప పరమావధి. ఈ బ్రాహ్మణుడు, ఈ భగవద్భక్తుడు, ఈ బ్రహ్మవిదుడు, ఈ ఆదర్శమూర్తి, ఈ సిద్ధపురుషుడు స్థిరంగా నిలిచి ఉండవలసివాడే! అతడు రూపుమాసిపోకూడదు. ఆ కులంవారిలో ఇప్పుడు ఎన్ని లోపాలు కన్పిస్తున్నా, తక్కిన అన్ని కులాలవారినుండి బయలుదేరిన బ్రహ్మవేత్తలకంటె ఈ బ్రాహ్మణ కులంనుండే ఎక్కువమంది నిజంగా బయలుదేరారు. ఈ ప్రఖ్యాతిని ఆ బ్రాహ్మణ కులంవారికివ్వడానికి మనమనందరం సిద్ధంగా ఉండితీరాలి! ఆ మాట నిజం! వారిలో ఈ ఘనత ఉందని తక్కిన కులాలవారంతా అంగీకరించాలి! మనం వారి లోపాలను గూర్చి మాట్లాడటానికి ధైర్యం తెచ్చుకోవాలి! పూర్తిగా ధైర్యం పూనవలసిందే! అలాగయినప్పటికీ వారికి అర్హమైన గౌరవాన్ని వారికి ఇచ్చితీరాలి. “ఎవరికివ్వదగినదానిని వారి కివ్వండి” అన్న ప్రాచీన ఇంగ్లీషు సామెతను జ్ఞాపకం తెచ్చుకోండి! కాబట్టి, మిత్రులారా! వివిధ కులాలవారు పోట్లాడుకోవడంవల్ల ప్రయోజనం లేదు. దానివల్ల మేలేమీ కలుగదు. అది మనలో ఇంకా విభేదాలను కల్పిస్తుంది; మనల్ని ఇంకా దుర్బలులను చేస్తుంది; మనల్ని ఇంకా అధోగతిపాలు చేస్తుంది. ప్రత్యేకార్హతలు గల దినాలు, ప్రత్యేక మర్యాదలు గల దినాలు గడిచిపోయాయి. మన భారత దేశంలో ఇంకెన్నడూ ఆ రోజలు మరలిరావు. భారతదేశానికి బ్రిటీషు పరిపాలనవల్ల కలిగిన మేళ్ళలో అదొకటి. ప్రత్యేకార్హతలను రూపుమాపడం అనే మహాప్రసాదాన్ని మహమ్మదీయ పరిపాలనకూడ మనకిచ్చింది. ఆ పరిపాలన అంతగా దుష్టమైందికాదు. ఏదీ పూర్తిగా అనర్థమని చెప్పడానికి వీలులేదు; ఏదీ పూర్తిగా శుభప్రదమూ కాజాలదు. మహమ్మదీయ విజయం భారతదేశంలో అణగద్రొక్కబడి ఉన్నవారికి, బీదవారికీ, మోక్షప్రదాయిగా పరిణమించింది. అందువల్లనే మన ప్రజలలో ఐదవవంతు జనం మహమ్మదీయులయ్యారు. అదంతా కత్తివల్ల సాధించిన కార్యం కాజాలదు. కత్తీ, అగ్గీ ఇంత కార్యం సాధించాయని భావించడం చాలా వెర్రితనం. ఐదవ వంతు అనడమెందుకు? మీ మద్రాసువాసులలో సగం మంది, మీరు జాగ్రత్తపడకపోతే క్రైస్తవులు కాగలరు. మలబారుదేశంలో నాకు కనిపించిన దానికన్నా వెర్రివిషయం పూర్వం ఎన్నడైనా ప్రపంచంలో ఉండిందా? పాపం మాలవాళ్ళు ఉన్నత కులాలవారు వెళ్ళే వీథులగుండా నడవనేకూడదట! కాని వాళ్ళు ఏవేవో ఇంగ్లీషు పేర్లను గడబిడగ చెప్పే లాగయితే, అంతా సరిపోతుంది. మహమ్మదీయ పేర్లను పెట్టుకొన్నా సరిపోతున్నది. ఈ మలబారు ప్రజలంతా వెర్రివాళ్ళనీ, వారి ఇళ్ళు ఉన్మత్త శరణాలయాలనీ నిర్ణయించడంకంటే మీరేం చేయగలరు? వీరు, తమ చేష్టలను మరల్చుకొని తిన్నని త్రోవకు వస్తేతప్ప, భారతదేశంలోని ప్రతి జాతివారూ, వీరిని చూచి అసహ్యపడవలసిందే! ఇటువంటి దౌర్జన్యాన్ని, రాక్షసాచారాన్ని అంగీకరించడం ఎంత సిగ్గుచేటు? ఈ మాలవారి బిడ్డలు, తిండిలేక చస్తున్నారు. కాని వాళ్ళు వేరొక మతాన్ని స్వీకరించగానే వారికి చక్కగా భోజనం దొరుకుతోంది. కాబట్టి వివిధ కులాలవారి మధ్య పోరాటాలుండటం, ఎంతమాత్రం తగదు.
పైవారిని క్రిందికిపడలాగడం వల్లకాక, క్రిందవారిని పైకి లేవదీయడం వల్లనే ఈ సమస్య పరిష్కారం కాగలదు. ఎవరికి శాస్త్రజ్ఞానం శూన్యమో, ప్రాచీనుల అభిప్రాయాన్ని తెలుసుకొనే శక్తి ఎవరిలో ‘పూజ్యమో’ అలాంటి వాళ్ళు మీకేం చెప్పినా వారి వల్ల మీరేమి గ్రహించినా వ్యర్థమే! కాని మన గ్రంథాల్లో అంతటా కన్పించే సాధనోపాయం నేను చెప్పిందే! ఇది వాళ్ళు గ్రహించడంలేదు. బుద్ధిమంతులకు ఈ విషయం చక్కగానే గ్రాహ్యమవుతుంది. ఎంతో పని చేయవచ్చు. ఆలోచన కలవారికంతా స్పష్టమే! అలాంటి వాళ్ళు ప్రక్కకు తొలగి నిలిచి, యుగయుగాంతరాలనుండి మన జాతీయ జీవనం ఎలా అద్భుతంగా నడుస్తోందో కనిపెట్టిచూస్తే, ప్రాచీనం, నూతనం అయిన గ్రంథాలన్నిట్లో ఈ సంగతిని వాళ్ళు గుర్తించ గలుగుతారు. కార్యోపాయం ఏది? ఒకవైపు బ్రాహ్మణాదర్శముంది! రెండోవైపు చండాల స్వరూపముంది. మనం చేయవలసిన పనంతా ఈ చండాలుడు బ్రాహ్మణాదర్శాన్ని చేరేలా చేయడమే! మెట్టుమెట్టుగా మెల్లమెల్లగా వానికి యోగ్యతలను కల్పిస్తూండాలి! “శూద్రుడు వేదాలను వినడం తటస్థిస్తే, వాని చెవులలో కరగించిన సీసం పోయాలి. ఒక్క వేదవాక్యాన్ని వాడు మనసులో నిలిపితే, అంటే జ్ఞాపకముంచుకొంటే వాడి తలను చితక్కొట్టండి.” “ఓ బ్రాహ్మణుడా!” అని వాడొక బ్రాహ్మణుడిని పిలవడానికి సాహసిస్తే, వాని నాలుకను తెగ్గోయండి అనే ఇలాంటి భయంకర వాక్యాలున్న పుస్తకాలూ ఉన్నాయి. ఇది ఎంతో రాక్షసకృత్యం! ప్రాచీన మూర్ఖత! సందేహంలేదు. ఆ మాట చెప్పకుండానే వెల్లడవుతోంది. అయినా స్మృతికర్తలను నిందించకండి! వాళ్ళు కొన్ని శాఖాసంప్రదాయాల్లో చూపట్టిన ఆచారాలను ఉదాహరణ మాత్రంగా తెలిపారు. ప్రాచీనుల్లో అప్పుడప్పుడు ఇలాంటి ఘోరరాక్షసులు తలచూపుతూ వచ్చారు. అన్ని యుగాల్లోనూ కొంచెం హెచ్చుతగ్గుగా, అలాంటి ఘోరపాతకులు, అన్ని చోట్లా కనిపిస్తారు. కాలక్రమేణా ఈ కాఠిన్యం కొంచెం తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ‘శూద్రులను బాధించకండి. అయినా వాళ్ళకు ఉత్తమ ధర్మాలను బోధించకండి’ అనే ఇలాంటి వాక్యాలూ ఉన్నాయి. కాలక్రమాన ఇతర స్మృతులలో, ముఖ్యంగా ఇప్పుడు ప్రామాణికాలుగావున్న స్మృతులలో “శూద్రులు బ్రాహ్మణులను అనుకరిస్తే, వాళ్ళ ఆచారమర్యాదలను చేపడితే, మంచిదే. వారిని ప్రోత్సహించండి” అని ఉంది. ఆ పనే ఇప్పుడు జరుగుతోంది. ఆ ఉదంతాల వివరాలను మీకు తెలుపడానికి నాకు వ్యవధిలేదు. వాటి వివరాన్ని మీరెలా గుర్తించగలరో తెలపడానికిక్కూడ అవకాశం చాలదు. యథార్థంగా జరిగే విషయాలనుబట్టి అన్ని కులాల వాళ్ళు, మెల్లమెల్లగా ఉత్తీర్ణులు కావలసివుంది. ఎన్నివేల కులాలున్నా, కొందరు బ్రాహ్మణులలోకి చేరిపోతూనే ఉన్నారు. వాళ్ళు అలా బ్రాహ్మణులమని చెప్పుకోకుండా ఏది ఆపుతుంది? కఠినమైన కులపద్ధతి ఇలా నిర్మితమై ఉంది. అయితే ఏం? ఇక్కడ పదేసి వేల జనులున్న కులాలు కొన్ని ఉన్నాయని అనుకుందాం. వారంతా కలసి మేము బ్రాహ్మణులమని ప్రకటించుకొంటే వాళ్ళనెవరూ అడ్డుపెట్టజాలరు. నా జీవితకాలంలో నేను స్వయంగా ఇలాంటి సంఘటనలను చూశాను. ఏ కులంవారైనా బలవంతులై ఏకాభిప్రాయులైన వెంటనే ‘వద్దు’ అని అడ్డుచెప్పగలవాడుండడు. ఏమైనా కానివ్వండి. ప్రతికులమూ ఇతరులనుండి వేరుపడుతూ వచ్చింది. అది ఇతరుల వ్యవహారాలలో జోక్యం పెట్టుకోవడంలేదు. ఒక్క కులంలోని అంతశ్శాఖలవారే, మరొక శాఖవాళ్ళతో జోక్యం కల్పించుకోవడం లేదు. శ్రీ శంకరాచార్యులు మొదలైన మహాయుగ పురుషులు గొప్ప కులనిర్మాతలైరి. వారు కల్పన చేసిన విచిత్ర విషయాలన్నీ నేనిప్పుడు మీకు చెప్పజాలను. నేను చెప్పేదాన్ని విని, మీలో కొందరు ఆగ్రహవేశపరులుకావచ్చు. నా సంచారాల్లో, నా అనుభావాలనుబట్టి, కొన్ని విచిత్రాలను పరిశీలించాను. విస్మయంగొలిపే నిర్ణయాలు తెలిశాయి. ఒక్కొక్కప్పుడు, మనవారు బెలూచీలను* గుంపులు గుంపులుగా తెచ్చి, అందరినీ ఒక్కుమ్మడిగా క్షత్రియుల్ని చేసేవారు. బెస్తవాళ్ళను గుంపులు గుంపులుగా తెచ్చి బ్రాహ్మణులుగా చేసేసేవారు. అలాంటి వారంతా ఋషులు, మహా ఋషులు అయ్యారు. వాళ్ళను సంస్మరించి, నేడు మనం సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాం. అదేవిధంగా మీరంతా ఋషులు, మహాఋషులు కావాలి. అదే రహస్యం. కొంచెం హెచ్చుతగ్గుగా, మనమంతా ఋషులం కానున్నాం! ‘ఋషి’ అంటే ఏమి? ‘పవిత్రుడు’ అన్నమాట! ముందు మీరు పవిత్రులుకండి! అధికారం అప్పుడే వస్తుంది. ఊర్కే ‘నేను ఋషిని, నేను ఋషిని’ అని చెప్పుకోవడంవల్ల ప్రయోజనం లేదు. నీవు నిజంగా ఒక ఋషివయినప్పుడు ఇతరులు సహజంగానే వచ్చి నీవు చెప్పినట్లు నడుచుకొంటారు. ఏదో ఒక విచిత్రశక్తి నీలోనుండి బయలుదేరి, వాళ్ళు, నీ వెంటపడేలా చేస్తుంది. వాళ్ళు నీ మాట వినేలా చేస్తుంది. తమకు ఇష్టంలేకపోయినా తమకు తెలియకుండానే వాళ్ళు, నీ సంకల్పాలను నెరవేరుస్తూంటారు. “ఋషిత్వం” అంటే అలాంటిది!
సరే, వివరాలను విశదం చేయడానికి కొన్నితరాలు గడపవలసి ఉంటుంది. అయినా, ఈ వివాదాలు ఎలా తీరుతాయో మీకు సూచనగా చెప్పాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆయా కులాలమధ్య వివాదాలు జరగడం నాకు విచారంగా ఉంది. ఇలాటివి అంతరించాలి! ఉభయపక్షాలకూ ఇందువల్ల కలిగే లాభంలేదు. ముఖ్యంగా ఉన్నతకులజులైన బ్రాహ్మణులకేమాత్రం లాభంలేదు. ప్రత్యేకార్హతలకు, ప్రత్యేకాధికారులకు, రోజులు గడిచిపోయాయి. అభిజాతవర్గాలలోనివారు, ప్రతివారూ విధిగా తమ సమాధిని తామే తవ్వుకోవలసి ఉంది. ఎంత త్వరగా, వారు అలా తవ్వుకొంటే, అంతమంచిది. వాళ్ళు ఆలస్యం చేసినకొద్దీ, రోగం పెరిగి దేహం కుళ్ళిపోతుంది. దుర్భరమైన మరణంపాలు కావలసి వస్తుంది. కాబట్టి తక్కిన మానవకోటి మోక్షంకోసమై పాటుపడటం భారతదేశ బ్రాహ్మణుని విధి. దాన్ని నిర్వహించేంతకాలం అతడు బ్రాహ్మణుడే! కాని, ధనార్జనకై తిరిగితే అతడు బ్రాహ్మణుడు కాడు. తర్వాత దాన విషయంలో అర్హుడైన నిజమైన బ్రాహ్మణునికే మీరు దానాలివ్వాలి! అది స్వర్గానికి దారి. కాని, అనర్హుడైన వానికిచ్చే దానం ఒక్కొక్కప్పుడు నరకానికే త్రోవచూపుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దాన్నిగూర్చి మీరు జాగరూకతతో ఉండాలి! ఎవనికి లౌకిక వ్యాపారముండదో, అతడు మాత్రమే బ్రాహ్మణుడు. లౌకిక వ్యాపారం బ్రాహ్మణుని కోసం ఏర్పడిందికాదు. అది ఇతర కులాలవాళ్ళ పని. తాము తెలుసుకొన్న దాన్ని ఇతరులకు బోధిస్తూ, అనేక శతాబ్దాలనుండి, తాము కూర్చిపెట్టుకొన్న సభ్యతను పంచియిస్తూ, భారత ప్రజను ఉద్ధరించడానికి పూర్తిగా శ్రమపడి పని చేయండని నేను బ్రాహ్మణులను ప్రార్థిస్తున్నాను. నిజమైన బ్రాహ్మణత్వమేదో, జ్ఞాపకం పెట్టుకోవడం భారతదేశ బ్రాహ్మణుని ధర్మం. మనువు చెప్పినట్లు ధర్మకోశాగారం తన స్వాధీనమందుండటంవల్లే బ్రాహ్మణునికి ఈ అర్హతలు, ఈ గౌరవాలూ అన్నీ ఇవ్వబడుతున్నాయి. అతడు కోశాగారాన్ని తెరచి అందులోని ధనరాసుల్ని ప్రపంచానికి పంచి ఇవ్వాలి. భారతీయ జాతులకు బోధలు చేసిన ప్రథమగురుడు బ్రాహ్మణుడనడం సత్యం. జీవిత పరమ గమ్యార్థాన్ని సాధించడంకోసం, సమస్తమూ త్యాగం చేయాలనే భావం, ఇతరులకు స్ఫురించడానికి పూర్వమే బ్రాహ్మణుడు సర్వపరిత్యాగం చేయడంలో ప్రప్రథముడైనాడనడం నిజం. అతడు ఇతర కులాలవారికంటే ముందు నడిచివుండటం అతని తప్పుకాదు. ఇతర కులాలవారుకూడా అలాగే తెలివికలవారై, బ్రాహ్మణులు చేసినట్లు తాము కూడ ఎందుకు చేయలేదు? తాము తీరికగా కూర్చుని, సోమరులై బ్రాహ్మణులను ఎందుకు పరుగెత్తనిచ్చారు? కాని ముందుగా లాభాలు సంపాదించడం ఒక విషయం, దుర్వినియోగం చేయడం కోసమై వానిని పేర్చి పెట్టుకోవడం మరో విషయం. దుర్వినియోగం చేసే అధికారం రాక్షస లక్షణం. అధికారమనేది సద్వినియోగం కోసమే ఏర్పడింది. యుగాంతరాలనుండి సంపాదితమై, ధర్మకర్తగా బ్రాహ్మణుడు తన దగ్గర ఉంచుకొన్న ఈ విజ్ఞానాన్ని అతడు, మన సామాన్యజనానికి నాడు దానం చేయవలసి ఉంది. అతడలా ఇదివరకే దాన్ని ప్రజలకు దానం చేయని కారణంగానే మహమ్మదీయుల దండయాత్ర సంభవించడానికి అవకాశం కల్గింది. ఈ మహానిధిని ప్రజలకై అతడు మొదటినుండీ తెరవని కారణంగానే వేయి సంవత్సరాలనుండి భారతదేశం మీదికి రాదలచిన ప్రతివాని పాదం క్రింద పడి మనం నలుగుతున్నాం. ఆ కారణంవల్లనే, మనం భ్రష్టులమై పోయాం. కాబట్టి, మనందరికీ పెద్దలైన మహాఋషులు పోగుచేసి ఉంచిన ఈ అద్భుత ధనరాసులు దాచబడివున్న కోశాలను బాగా తెరవడం మన ప్రప్రథమ విధివిహితకృత్యంగా ఉంది. ఆ ధనరాసుల్ని వెలికి తీసుకొని రండి. వాటిని ప్రతివానికీ ప్రసాదించండి. అలా చేసేవాళ్ళలో బ్రాహ్మణుడు ప్రప్రథముడుగా ఉండాలి. త్రాచుపాము, తాను కరిచిన మనిషి గాయం నుండి విషాన్ని తాను తిరిగి పీల్చుకొంటే, ఆ రోగి మరణించడని ఒక మూఢవిశ్వాసం వంగదేశంలో ఉంది. మంచిది. అలాగే, బ్రాహ్మణుడు తన విషాన్ని తానే పీల్చేయాలి! బ్రాహ్మణేతర కులాలవారికి నేను చెప్పేదేమంటే, ‘ఓపికపట్టండి! తొందరపడకండి; అవకాశం దొరికినప్పుడంతా బ్రాహ్మణునితో పోరుకు దిగకండి. ఏలంటారా? నేను చెప్పినట్లు, మీ లోపం వల్లనే మీరు బాధలనుభవిస్తున్నారు. మొదట్లో ఆధ్యాత్మిక జీవనాన్ని, సంస్కృత పాండిత్యాన్ని అశ్రద్ధ చేయండని మీకెవరు చెప్పారు? ఇంతకాలమూ మీరేం చేస్తున్నారు. మీరు శ్రద్ధావిహీనులై ఉండడమెందుకు? మీకంటె, ఎక్కువ మెదడు, బలం, సత్యం, జవం ఇంకొకరికి ఉండటం చూచి ఇప్పుడు కోపించి, చిందులు త్రొక్కడమెందుకు? వార్తా పత్రికల్లో వ్యర్థమైన వివాదాలను, విమర్శనలను సాగించి మీ శక్తులను వ్యర్థం చేసుకోవడానికి మారుగా, పాపానికి పాల్పడి స్వగృహంలో పోరును తెచ్చిపెట్టి, కొట్లాటలు సాగించడానికి మారుగా బ్రాహ్మణుడు సంపాదించిన సభ్యతను మీరు సాధించడంలో మీ సామర్థ్యాన్నంతా వినియోగించండి. మీకు కార్యసిద్ధి అవుతుంది. మీరేల సంస్కృత పండితులు కారాదు? సంస్కృత విద్యను భారతదేశంలోని సకల వర్గాలవారికీ చెప్పించడానికై, లక్షలకొద్దీ ధనాన్ని మీరేల ఖర్చుపెట్టరు? ఇదే సమస్య. ఈ పని చేసిన తక్షణమే మీరు బ్రాహ్మణులతో సమానులు కాగలరు. భారతదేశంలోని అధికార రహస్యమిందులోనే ఉంది.
సంస్కృత విద్య, ఉత్తమార్హత భారతదేశంలో పెనవేసుకొని నడుస్తున్నాయి. మీరు వాటిని సంపాదిస్తే మిమ్మల్ని ఎదిరించి మాట్లాడటానికి ఎవ్వరూ సాహసించరు. అది ఒకటే కీలకం. దాన్ని చేజిక్కించుకోండి. ప్రాచీన అద్వైతులు వర్ణించినట్లు ఈ విశ్వమంతా, స్వకల్పిత సమ్మోహనస్థితిలో పడివుంది. ఇచ్ఛ, శక్తిస్వరూపం. సమర్థమైన ఇచ్ఛాశక్తిగల పురుషుడు తన చుట్టూ ఒక జ్యోతిర్మండలాన్ని సృష్టిచేసుకొంటున్నాడనవచ్చు. అలాంటివాడు ఇతర జనుల్ని తన మనస్సునందున్న స్పందన దశకు తెచ్చి, ఊగులాడించ గలుగుతాడు. అలాంటి మహనీయపురుషులు పుట్టుకొస్తారు. ఆహా! ఈ భావంలో ఎంత మహత్త్వముంది? ఒక్కొక్క మహాత్ముడు పుట్టేటప్పుడు వాని మహత్త్వాన్ని, వాని సంకల్పాలను మనలోనికి చొప్పిస్తాడు. మన అందరిలోకూడ ఆ సంకల్పాలే ప్రసరిస్తాయి. అప్పుడు మనం శక్తిమంతులమవుతాం. సంఘాలు బలవంతంకావడానికి సాధనమేమి? సంఘీకరణం! కేవల సంఘీకరణం జడమయమని అంటారేమో? ఉదాహరణ చూస్తే నాలుగుకోట్ల ఆంగ్లేయులు, ఈ దేశంలోని ముప్పయికోట్ల జనాన్ని పరిపాలించగల్గటం సాధ్యమైంది కదా? ఎందువల్ల? మనస్తత్వశాస్త్రం తెలుపగల వివరణమేమి? ఈ నాలుగు కోట్లమంది తమ ఇచ్ఛలను సమీకరిస్తారు. అంటే ఏకం చేస్తారు. ఆ శక్తి అనంతమవుతుంది. ముప్ఫయికోట్ల మందిగా ఉన్న మీలో ప్రతివానికీ గల ఒక్కొక్క ఇచ్ఛా వేర్వేరై ఉంటుంది. కాబట్టి భవిష్యత్కాలంలో మహత్తర భారతదేశాన్ని నిర్మించడంలోకల రహస్యమంతా సంఘీభావంలో ఉంది; శక్తిసమీకరణంలో ఉంది; ఇచ్ఛ ఉంటే మన సంకల్పాల పరస్పర సహకారంలో ఉంది.
ఇదిగో, అధర్వవేద సంహితలోని శ్లోకాలలో ఒకటి నా స్ఫురణకు వస్తోంది. దాని భావమిది: “మీరంతా ఒక్క మనస్సు కలిగివుండండి; మీరంతా ఒకే సంకల్పం కల్గివుండండి. ఎందుకంటే, ప్రాచీన కాలంలో దేవతలు ఏకమనస్కులై హవిస్సులను పొందగల్గారు. దేవతలు ఏకమనస్కులు కావడంవల్లనే మానవులచేత పూజింపబడుతున్నారు.” ఏకమనస్కతే సంఘానికి కీలకం. ద్రావిడులని, ఆర్యులని అల్పభేదాలను పాటించి, వివాదాలు, పోరాటాలు సాగించినకొద్దీ, బ్రాహ్మణులని, బ్రాహ్మణేతరులని, ఇలాంటి భేదాలతో కీచులాడేకొద్దీ, భావిభారత భాగ్యాన్ని నిర్మించగల శక్తిసామర్థ్యాల సమీకరణం మీకు దూరమైపోతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. భావిభారత భాగ్యోదయం పూర్తిగా ఐకమత్యంపై ఆధారపడి ఉంది. ఇచ్ఛాశక్తి సమీకరణమే, అంటే సమ్మేళనమే – సంకల్పాలన్నిటినీ ఒక్క కేంద్రానికి తేవడమే – ఆ కీలకమనవచ్చు. ప్రతి చీనావాడు, తన త్రోవను తాను సంకల్పిస్తాడు. కొద్దిమందైనా, జపానువారంతా, ఒకే మార్గంలో సంకల్పిస్తారు. ఫలితార్థం మీకు తెలిసిందే! ప్రపంచచరిత్రలో అంతటా జరుగుతున్నదిదే! సంఘీభవించి జీవించే స్వల్పజాతులు ప్రతివిషయంలో, అధిక సంఖ్యాకాలై, విడిగావున్న జాతులను, సదా జయించి పాలిస్తూ ఉండటం మనం చూస్తున్నాం. అది స్వభావసిద్ధమైన విషయమే! ఎందుకంటే సంఘీభావంతో మెలగే అల్పజాతులవారు, తమ భావాలను కేంద్రికరించడం – అంటే సమీకరణం చేయడం, లేదా ఒకటిగా చేయడం, చాలా తేలికైన పని. అందువల్ల వారు త్వరలో వికాసాన్ని పొందుతున్నారు. ఒకజాతి పెద్దదైనకొద్దీ, ఈ సమీకరణం దుస్సాధ్యమవుతూ ఉంటుంది. చెల్లాచెదరైన గుంపులాగా, వీళ్ళు సులభంగా సంఘీభవించజాలరు. ఇలాంటి వైషమ్యాలన్నీ తుదముట్టి తీరాలి!
మనలో ఇంకొక లోపంకూడా ఉంది. నారీరత్నములారా! నన్ను క్షమింతురు గాక! శతాబ్దాలకొద్దీ బానిసతనంలో పడివుండటంచేత అందరం స్త్రీలలాగా మారిపోయాం. ఈ దేశంలోగానీ, మరి ఏ దేశంలో కానీ ముగ్గురు స్త్రీలను ఒకచోట చేర్చి వారు పోట్లాడకుండా ఉంచగలగటం చాలా అరుదు. యూరప్దేశంలో స్త్రీలు, పెద్దపెద్ద సంఘాలను స్థాపించి, స్త్రీల సామర్థ్యాన్ని గూర్చి గొప్ప ఆడంబర ప్రకటనలు చేస్తారు. కానీ త్వరలోనే వాళ్ళు తమలో తాము కీచులాడుకొంటారు. ఇంతలో ఎవడో పురుషుడువచ్చి వారి అందరిమీద అధికారం చేస్తాడు. ప్రపంచమంతటా ఇలా ఒక పురుషుడు తమల్ని పాలించాలని స్త్రీలే కోరుతూంటారు. మనం వారిలాగా వున్నాం. మనం స్త్రీలమైపోయాం. ఒక స్త్రీ వచ్చి స్త్రీలమీద నాయకత్వం వహిస్తే తక్షణమే వారంతా ఆమెను విమర్శించ నారంభిస్తారు. ఆమెను ముక్కలుముక్కలుగా చీల్చి చెండాడజూస్తారు. చివరికామె నొక మూల కూర్చోబెడతారు. ఒక మగవాడు వచ్చి కొంచెం కాఠిన్యం చూపి అప్పుడప్పుడు నాలుగు తిట్లు తిడుతూంటే అంతా చక్కబడుతుంది. వాళ్ళిలాంటి ఇంద్రజాలానికి అలవాటుపడివున్నారు. ఈ ప్రపంచమంతా అటువంటి ఇంద్రజాలికులతో, మంత్రగాళ్ళతో నిండివుంది. మన దేశీయులలో ఒకడు నిలబడి ఏదో విధంగా ప్రముఖుడు కావడానికి ప్రయత్నిస్తే మనమందరం కలిసి వాణ్ణి అణగదొక్కాలని చూస్తాం. కాని, ఒక్క విదేశీయుడు వచ్చి మనల్ని తన్నజూస్తే అంతా చక్కబడుతుంది. మనం అలాంటి దానికి అలవాటుపడివున్నాం. మనకలాంటిది అలవాటయిందా లేదా? మరి, బానిసలు గొప్పనాయకులు కాగలరా? కాబట్టి బానిసలు కావడం మానుకోండి. రానున్న యాభై సంవత్సరాలవరకు, ఈ మన దివ్య భారతమాతే, మన అధిష్ఠానదేవతగా ఉండుగాక! అంతవరకు, ఇతర వ్యర్థదేవతలు, మన మనస్సులనుండి అదృశ్యమైపోదురుగాక! ఈమె ఒక్కతే జాగ్రదవస్థలో ఉండవలసిన ప్రధాన దేవత! మూర్తీభవించిన మన జాతి స్వరూపం. సర్వత్ర ఆమె చేతులే, సర్వత్ర ఆమె పాదాలే, సర్వత్ర ఆమె కర్ణాలే. ఆమే అన్నిటిని ఆవేశించి ఉండుగాక! తక్కిన దేవతలనందర్నీ నిద్రపోనివ్వండి! వ్యర్థపు దేవతల వెంటబడి, మనచుట్టూ ఆవరించి వెలిగే దేవతను, ఈ విరాణ్మూర్తిని పూజించజాలకున్నామే? ఈ దేవతను మనం పూజిస్తే, తక్కిన దేవతలనందరినీ పూజించడానికి అర్హులమవుతాం. ఒక అరమైలు ప్రాకులాడుతూ పోవడానికి శక్తిని సంపాదించడానికి ముందే, హనుమంతునిలా, మహాసముద్రాన్ని లంఘించాలని చూడటమా? అది సాధ్యమయ్యేది కాదు. ప్రతివాడూ యోగికావాలట! ప్రతివాడూ తపస్సుకు పూనుకోవడమా? అది పొసగదు. దినమంతా కర్మకాండతో సంసారంలో మునిగివుండి, సాయంకాలం కాగానే ఒకచోట కూర్చుని రేచకపూరకాలను చేయబూనడమా? అది అంతటి సులభకార్యమా? నీవు ముక్కుతో మూడుసార్లు బుర్రుమని గాలిని పీల్చి వదలిన మాత్రాన ఋషులు ఆకాశంనుండి దిగి వస్తారనుకుంటావా? ఇదేమి పిల్లల ఆటలా? ఇదంతా వెర్రిపని. మనకు కావలసింది చిత్తశుద్ధి! హృదయపవిత్రత! అది ఎలా లభిస్తుంది? పూజలలోనికంతా ప్రప్రథమ పూజ విరాట్పూజ! అంటే, మనచుట్టూ ఉన్న సర్వప్రాణుల అర్చనమే! ఆ పూజను చేయండి! వీరంతా, నరులు, పశువులు సహా మనకు దేవతలు! మనం పూజించవలసిన ప్రధాన దేవతలు మన దేశప్రజలే! మనం అసూయాగ్రస్తులమై ఒకరితో ఒకరం పోరాడుకోవడానికి బదులు, వీరిని పూజించవలసివుంది. మహాఘోరకర్మంపాలై మనం కష్టాలు పడవలసివచ్చింది. అలా అయినా, మనం కళ్ళు తెరవడం లేదే!
సరే, ఈ విషయం చాలా పెద్దది. ఎక్కడ ఆగటమో, నాకు తెలియడం లేదు. కాని, మద్రాసులో నిర్వహింపతలచిన కార్యాలను గూర్చి, కొద్ది వాక్యాలు మీకు తెలిపి, నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఈ జాతి యొక్క పారమార్థిక, వ్యావహారిక విద్యలను మన వశంలో ఉంచుకోవాలి! అంటే మీకు అర్థమైందా? కలలోకూడ మీరు దాన్నిగూర్చే ఆలోచిస్తూ ఉండాలి! దాన్నిగూర్చే ముచ్చట్లాడుకొంటుండాలి! దాన్నిగూర్చే జిజ్ఞాస చేయాలి! దాన్నిగూర్చే పాటుపడాలి! అంతవరకు ఈ జాతికి మోక్షం లేదు. ఇప్పుడు మీరు నేర్చుకొన్న విద్యలో కొన్ని మంచి లక్షణాలున్నాయి. కానీ మహానర్థాలు కూడా చాలావున్నాయి. అవి, దానివల్ల కలిగే మేళ్ళను నశింపచేసేంత తీవ్రంగా ఉన్నాయి. మొదటి సంగతి, ఇది పురుషత్వాన్ని నిర్మించే విద్యేకాదు. ఇది పూర్తిగా నిషేధరూపమైన విద్యగా మాత్రమే ఉంది. నిషేధరూప విద్య, లేక దోషనిరూపణచేసే శిక్షణ, మరణంకన్నా నికృష్టమైంది! బిడ్డ బడికి వెళ్తాడు. అక్కడ అతడు నేర్చుకొనే మొదటి విషయం తన తండ్రి బుద్ధిహీనుడని! రెండో విషయం తన తాత వెర్రివాడని! మూడో విషయం తన గురువులందరూ మోసగాళ్ళని! నాల్గవ విషయం తన పవిత్ర గ్రంథాలన్నీ అబద్ధాలని, ఇంతే. ఆ బిడ్డకు పదహారేళ్ళ వయసొచ్చేసరికి అతడు ఎముకలులేని, త్రాణలేని, పెద్దనిషేధాలమూర్తిగా తయారవుతున్నాడు. తత్ఫలితార్థమేమంటే – ఇలాంటి విద్య యాభై సంవత్సరాలనుండి నేర్పబడుతున్నా, ఈ మూడు రాజధానులలో సహజశక్తికల పురుషుడిని ఒక్కడినైనా అది సృష్టింపజాలకపోవడమే! స్వకల్పనా శక్తిగల పురుషులు ఎక్కడనైనా కనబడితే, అలాంటి వాళ్ళు ఇతరదేశాల్లో విద్య నేర్చుకొని వచ్చినవారే కానీ, ఈ దేశంలో తయారైనవాళ్ళు కారు. లేదా, వాళ్ళు ప్రాచీన విశ్వవిద్యాలయాల దగ్గరికి వెళ్ళి మరొకసారి తమ మూఢవిశ్వాసాలను కడిగివేసుకొన్న వారై ఉంటారు. విద్య అంటే మీ మెదడులోకి చొప్పించబడిన సమాచారరాసి కాదు. అది, అక్కడపడి మురిగి పోతుంది కానీ, జీవితకాలమంతా వేచివున్నా జీర్ణం కాదు. మనకు కావలసింది చైతన్యప్రదం, పురుషనిర్మాణ కుశలం, శీలనిర్మాణ సమర్థం అయిన భావాలను జీర్ణం చేసుకోగల ప్రబోధమే! మీరు ఐదు భావాలను జీర్ణం చేసుకొని వానిని, మీ జీవనంలో మీ శీలంలో సారూప్యాన్ని పొందించుకొంటే, ఒక గ్రంథాన్నంతా కంఠపాఠంగా వల్లెవేసిన వానికంటే, మీకు ఎక్కువ విద్య వచ్చినట్లే సుమీ! “యథా ఖరశ్చన్దన భారవాహీ భారస్య వేత్తా నతు చందనస్య – మంచిగంధం చెక్కలను మోసే గాడిదకు, ఆ మంచిగంధపు చెక్కల బరువే తెలుసుగానీ విలువ తెలీదు.” అలాగే విద్య – అంటే సమాచార రాసిగా భావిస్తే గ్రంథాలయాలే ప్రపంచంలోకంతా ఉత్తమసిద్ధమూర్తులు, విషయ సర్వస్వ గ్రంథాలే మహాఋషులు అవుతాయి కదా? కాబట్టి, మన దేశ పారమార్థిక వ్యావహారిక విద్య యావత్తూ మన చేతుల్లో పెట్టుకొని, జాతీయ పద్దతుల్ని అనుసరించి, జాతీయాలైన సదుపాయాలతో, సాధ్యమైనంతవరకు నడపవలసి ఉంది.
ఇది చాలా పెద్ద ప్రణాళికే! చాలా పెద్ద ఉద్యమమే! సందేహం లేదు. ఇది ఎన్నడైనా ఆచరణలోనికి వస్తుందో, రాదో నాకు తెలీదు. కానీ, మనం పనిని ప్రారంభించి తీరాలి. ఎలా? ఉదాహరణకు, మద్రాసు తీసుకోండి. హిందువులకు మతం ప్రప్రథమ విషయం కాబట్టి, మనకొక దేవాలయం కావలసి ఉంటుంది. అప్పుడు అన్ని సంప్రదాయాలవారు, దాన్ని గురించి తగవులాడుతారు కదా? అని మీరు అడుగవచ్చు. కాని, మన మా దేవాలయాన్ని సంప్రదాయ పక్షపాతంలేని దాన్నిగా చేద్దాం. ‘ఓం’ అనే విగ్రహాన్ని మాత్రం అందులో ఉంచుదాం. ఇది, ఏ సంప్రదాయం వారైనా ఉత్కృష్ట ప్రతీకగా అంగీకరించేదే కదా? ‘ఓంకారం’ అనే ప్రతీక పనికి రాదనే సంప్రదాయం ఏదైనా ఇక్కడుంటే, దానికి హిందూసంప్రదాయమని చెప్పుకొనే అర్హతే లేదు. తమ సంప్రదాయానికి అనుకూలించే విధంగా, హిందూమతానికి వ్యాఖ్యానంచేసే అధికారం అందరికీ ఉంది. కానీ, మనకందరికి, సామాన్యాలయం ఒకటి ఉండి తీరాలి! నీ ఇష్టం వచ్చిన విగ్రహాలను, ప్రతీకలను నీవు ఇతర స్థలాల్లో పెట్టుకోవచ్చు. కాని, ఇక్కడమాత్రం, నీ అభిప్రాయాలను అంగీకరించని వారితో నీవు వాదు లాడ తగదు. ఇక్కడ, మనలోవున్న వేర్వేరు సాంప్రదాయిక శాఖలన్నిటికీ సమానంగా ప్రామాణిక విషయాలను బోధించాలి. ఇంక, ఆయా సంప్రదాయాలవారికి, ఇతర సంప్రదాయాల వారితో తగవులకు దిగరాదనే నియమానికి లోబడి, తమ తమ సిద్ధాంతాలను బోధించడానికి స్వేచ్ఛ ఉండాలి! మీరు చెప్పగోరేది చెప్పండి. ప్రపంచం దాన్ని వినగోరుతోంది. కాని ఇతరులను గూర్చి మీ అభిప్రాయమేమో వినడానికి ప్రపంచానికి వ్యవధి లేదు. దాన్ని మీలోనే ఉంచుకోవచ్చు.
రెండో విషయమేమంటే – ఈ దేవాలయానికి అనుబంధంగా, బోధకులను సిద్ధంచేసే విద్యాలయం ఒకటి ఉండాలి! ఆ బోధకులు వెళ్ళి, మన ప్రజలకు, పారమార్థిక ధర్మాన్ని, లౌకిక ధర్మాన్నికూడ బోధిస్తూ ఉండాలి. వారు, ఈ రెండు పనులను చేయాలి. మనం ఇదివరకే ఇంటింటికిపోయి మతధర్మ వ్యాపనం చేస్తున్నాం. దానితోపాటు లౌకిక ధర్మప్రచారంకూడ చేయాలి! ఈ పని తేలికగా జరుగుతుంది. ఆ తర్వాత ఈ బోధకుల వలన, ఈ గురువుల వలన, మన పని వ్యాప్తి చెందగలదు. భారత దేశమందంతటా వ్యాపించేలా, ఇలాంటి దేవాలయాల్ని నిర్మించగలుగుతాం. ఇదే, నా కార్యవిధానం. ఇది బ్రహ్మాండ మంతటిదిగా కనిపించవచ్చు. కాని ఇది చాలా అవసరం. డబ్బు ఎక్కడినుండి వస్తుంది? అని మీరడగవచ్చు. డబ్బు అవసరమే లేదు. డబ్బు లెక్కలోనిది కాదు. నా జీవితంలో గడచిన పండ్రెండు సంవత్సరాలనుండి, ఎప్పటికప్పుడు, నాకు తిండి ఎక్కడినుండి రాగలదో, నాకు తెలీనే తెలీదు, అయినా నా కవసరమైన డబ్బు, సమస్తమూ వచ్చి తీరుతాయి. ఎందుకంటే అవి నా బానిసలు! నేను, వానికి బానిసను కాను. డబ్బు కానీ, మరి ఏది కానీ రావలసిందే! వచ్చి తీరుతుంది. అది నిజం. తగిన పురుషులెక్కడ అన్నదే ప్రశ్న! చెన్నపురి యువకులారా! నా ఆశలు మీ యందున్నాయి. మీరు, మీ జాతి పిలుపును ఆలకిస్తారా? మీరు, నా మాటలను నమ్మడానికి సాహసిస్తే, మీలో ప్రతివానికీ భావికాలంలో మహాదశ ప్రాప్తించి తీరుతుంది. నాకు చిన్నప్పుడెలాంటి విశ్వాసముండేదో, అలాంటి విశ్వాసం, నేనిప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని అనుష్ఠిస్తున్నానో అలాంటి విశ్వాసం, మహత్తర విశ్వాసం మీలో ఉందా? మీలో ప్రతివానిలో అలాంటి విశ్వాసం ప్రకాశించాలి! ఆ సనాతన మహాశక్తి, ప్రతిజీవిలో నెలకొని ఉంది. మీరు, ఈ భారతదేశాన్నంతటినీ సంపూర్ణంగా ఉద్ధరించగలరు. ఓహో! ప్రపంచంలో ఉన్న ప్రతిదేశానికీ, మనం వెళ్ళనున్నాం. ప్రపంచంలోని ప్రతిజాతిని ఉద్ధరించడానికి ఉపకరించే అనేక శక్తులతో కలిసి మన బోధలు అచిరకాలంలో పనిచేయనున్నాయి. భారతదేశంలో, పరదేశంలోనూ కూడ ప్రతి జాతి జీవనంలో, మన ప్రభావం ప్రవేశించవలసి ఉంది. ఈ కార్యసిద్ధిని సాధించడంకోసమై మనం పనిచేయాలి! సరే, అందుకోసం, యువకులు నాకు కావాలి! “తరుణవయస్కులు, బలయుతులు, ఆరోగ్యవంతులు, సూక్ష్మబుద్ధిశాలులు మాత్రమే బ్రహ్మమును పొందగల్గుతా” రని వేదాలు ఘోషిస్తున్నాయి. మీ భావిభాగ్యోదయాన్ని నిశ్చయించుకోవడానికి ఇదే తరుణం. యౌవనంయొక్క జవసత్త్వాలు మీకుండగానే మీరు నిశ్చయించుకోవాలి! మీరు వృద్ధులై విసిగి వేసారినప్పుడు అలా చేయలేరు. యౌవనజవం, నవోజ్వలతేజం ఉండగానే మీ నిర్ణయాన్ని తేల్చుకోవాలి! కార్యభారాన్ని వహించండి! ఇదే సమయం! ఎవరూ తాకని, ఎవరూ వాసన చూడని నవకోమల పుష్పాలనే పరమేశ్వరుని పాదాలచెంత అర్పించాలి! అలాంటి వాటినే ఆ పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడే మేల్కొనండి! జీవితం అత్యల్పం. న్యాయవాదులు కావడంకంటె, తగవులాడుకోవడంకంటె, అట్టి వానికోసమై ఆరాటపడటంకంటె, సాధించగల ఘనతర కార్యాలున్నాయి. మీ జాతి శ్రేయస్సుకోసం, మానవకోటిని ఉద్ధరించడానికి చేసే ఈ త్యాగం మహోత్తమమైంది. ఈ జీవితంలో ఏముంది? మీరు హిందువులు కదా! జీవుడు సనాతనుడు అనే సహజ విశ్వాసం మీలో ఉంది. ఒక్కొక్కప్పుడు యువకులు నా దగ్గరికి వచ్చి, నాస్తికవాదాన్ని గురించి మాట్లాడటం మొదలుపెడతారు. హైందవుడు ఎన్నడైనా నాస్తికుడు కాగలడని నేను నమ్మజాలను. అతడు యూరోపియనులు వ్రాసిన పుస్తకాలను ఎన్నిటినైనా చదవనీ, తాను జడవాదినని అనుకోనీ, అది తాత్కాలిక వికారమే! ఆ రీతి భావన మీ రక్తంలో లేదు. మీ తత్త్వంలో లేనిదాన్ని మీరు నమ్మజాలరు. అలాంటి మీ ప్రయత్నం వ్యర్థప్రయాసే! అలాంటి విషయాన్ని గూర్చి ప్రయత్నం చేయకండి! నా చిన్న తనంలో ఒకప్పుడు అలాంటి ప్రయత్నం చేశాను. కాని అది జరిగేది కాదు. ఆయుస్సు కొంచెం. కాని, ఆత్మ అవినాశి, నిత్యమైనది. మరణమో! తప్పదు. కాబట్టి, పరమోత్తమాదర్శానికి పూనుకొని, మన యావజ్జీవాన్ని అర్పిద్దాం! ఇదే మన నిశ్చితభావం కావాలి! “పరిత్రాణాయ సాధూనాం… సంభవామి యుగే యుగే – నా భక్తులను, సాధువులను రక్షించడంకోసం ప్రతియుగంలో అవతరిస్తూ ఉంటాను” అని చెప్పినట్లు, మన శాస్త్రాలు ఎవరినిగూర్చి చెబుతున్నాయో, అలాంటి శ్రీకృష్ణభగవానుడు మనల్ని ఆశీర్వదించి మనకు ఆశయ సిద్ధి కలిగేలా చేయనీ!