మన జాతిని పేర్కొనడానికి, మన మతాన్ని తెలపడానికి, సర్వసామాన్యంగా ప్రయోగించబడే శబ్దమొకటి ఉంది. అది “హిందువు”. ఆ “హిందూ” శబ్దానికి వేదాంతాన్ని గూర్చిన నా భావాన్ని వివరించే సందర్భంలో కొంత వివరణ చెప్పాలి! “హిందూ” అనే మాట, సింధూనదిని పేర్కొనడానికి గాను, ప్రాచీన పారశీకులు వాడుతూ వచ్చారు. సంస్కృతంలోని “స” అనే అక్షరం, అప్పటి పారశీక భాషలో “హ” గా మారింది. కాబట్టి “సింధు” అనే పదం “హిందు” అయింది. సరే, “హ” కారాన్ని ఉచ్ఛరించడం కష్టంగా ఉండడంవల్ల గ్రీకులు దాన్ని అసలే వదలేశారని మీకు తెలిసే ఉంటుంది. అందువల్లే మనకు “ఇండియనులు” అనే పేరొచ్చింది. “సింధూ నదికి ఆవలి ఒడ్డులో నివసించేవారు” అని తెలపడానికి ప్రయోగించబడిన “హిందూ” పదం, పూర్వకాలంలో, ఒకవేళ సార్థకమైవున్నా, ఈ ఆధునికకాలంలో దాని సార్థకత అంతాపోయింది. ఎందుకంటే, సింధూనది ఈవలి ఒడ్డులో నివసించే జనులంతా ఈ కాలంలో ఒకే మతానికి చెందిన వారు కారు. ఇప్పుడు ఇక్కడ, హిందువులుకాక, మహమ్మదీయులు, పార్సీవారు, క్రైస్తవులు, బౌద్దులు, జైనులు ఉన్నారు. “హిందూ” అనే మాట వ్యుత్పత్యర్థం ప్రకారం దానిలో వీరంతా ఇమిడిపోవాలి. కాని మతవిషయకంగా వీళ్ళనందరినీ హిందువులని పిలవడం సరికాదు. మన మతానికి సామాన్యమైన పేరు కల్పించడం చాలా కష్టమైన పని. ఈ మతం అనేక మతాల, భావాల వివిధకర్మకలాపాల, ఆచారాల సమ్మేళనం. వీని కన్నిటికి ఒకే పేరుగాని, ఒకే అర్చనావిధానంకాని, ఒకే వ్యవస్థకాని, లేక అన్ని రకాలూ పోగైనాయి. మన ఈ సంప్రదాయాలన్నీ వేదప్రామాణ్యాన్ని మాత్రం అంగీకరిస్తున్నాయి. వేదాలు పరమప్రమాణాలని ఒప్పుకోని ఏ వ్యక్తీ “హిందువు” అని పిలవడానికి అర్హుడుకాడని నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ వేదాలన్నీ కర్మకాండ, జ్ఞానకాండ అనే రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయని మీకు తెలుసు. కర్మకాండలో యజ్ఞాలు, క్రతువులు మొదలగు వానినిగూర్చి చెప్పబడి ఉంటాయి. వానిలో చాలాభాగం ఈ కాలంలో ఆచరణలో లేవు. “ఉపనిషత్తులు” లేక “వేదాంతం” అని పిలిచే ఆధ్యాత్మికబోధ భాగాన్నే జ్ఞానకాండ అంటారు. మన ఆచార్యులు, మన తత్త్వవేత్తలు, మన గ్రంథకర్తలు – ద్వైతులుగాని, అద్వైతులుగాని, విశిష్టాద్వైతులుగాని – అందరూ, ఈ వేదాంతాన్నే పరమప్రమాణంగా చూపుతారు. భారతదేశంలోని ప్రతి తత్త్వసిద్ధాంతానికీ, ప్రతి సంప్రదాయానికీ, ఉపనిషత్తులలోనే ప్రమాణం చూపవలసి వుంది. అలాటి ప్రమాణం చూపజాలని, సంప్రదాయం వేదబాహ్యమై అసమ్మతమవుతుంది. కాబట్టి, ఈ కాలంలో ఈ దేశమంతటావున్న హిందువులందరికీ వర్తించే పేరు కావాలంటే వారిని “వేదాంతు” లని కానీ, “వైదికు” లనిగానీ పేర్కొనాలి! ఈ అర్థంలోనే ‘వేదాంతమతం’ ‘వేదాంతం’ అనే పదాలను నేను సదా వాడుతుంటాను. దీన్ని మరికొంచెం వివరిస్తాను. ఎందుకంటే, ‘వేదాంత’ మనే పదాన్ని వేదాంత దర్శనంలోని అద్వైతమతం అనే అర్థంలోనే చాలమంది వాడటం ఇటీవల ఆచారమై పోయింది. ఉపనిషత్తులను ఆధారంగా పెట్టుకొన్న ఆయా వేదాంత మతాలలో, ‘అద్వైత’ మనేది ఒక శాఖమాత్రమే అని మీకందరికీ తెలుసు అనుకొంటాను. విశిష్టాద్వైత సాంప్రదాయులుకూడ, అద్వైతులతో సమానంగా ఉపనిషత్తులను గౌరవిస్తారు. అద్వైతులలాగానే, విశిష్టాద్వైతులు కూడ వేదాంతం ప్రమాణమని వాదిస్తారు. ద్వైతులుకూడ అదే అంటారు. భారతదేశంలోని ప్రతి ఇతర సాంప్రదాయికుడు కూడ అలాగే చెబుతాడు. కాని, ప్రజాసామాన్యంలో ‘వేదాంతి’ అంటే ‘అద్వైతి’ అని సాధారణంగా ఒక అభిప్రాయం. అందుకు కొంతకారణంకూడ ఉంది. వేదాలే మన శాస్త్రాలైనా, ఆ వైదిక సిద్దాంతాలకు, వ్యాఖ్యానోదాహరణంగా, అటు తర్వాత వ్రాసిన స్మృతులు, పురాణాలుకూడ ఏర్పడ్డాయి. వీనికి వేదాలకున్నంత ప్రామాణికతలేదు, నిజమే! ఈ పురాణాలు, స్మృతులు, శ్రుతికి విరుద్ధంగా ఉన్నచోటంతా, శ్రుతినే అనుసరించి, స్మృతి, పురాణాలను తోసివేయాలని, శాస్త్రవిధి! అద్వైత వేదాంతి అయిన శ్రీ శంకరాచార్యులవారి వ్యాఖ్యానంలోను, ఆయనచే స్థాపించిన సంప్రదాయం వారి రచనలలోను, ఉదాహరించబడిన ప్రమాణాలు, చాలావరకు ఉపనిషత్తులనుండి తీసికొన్నవే. శ్రుతులలో సాధారణంగా కనబడని అంశాన్ని దేన్నైనా, వివరించవలసినప్పుడు తప్ప, స్మృతులనుండి ప్రమాణాలు తీసికోలేదు. ఇతర సంప్రదాయాలంటేనో – వారు ఎక్కువగా స్మృతులను, కొంత శ్రుతులను ఆధారం చేసుకొన్నారు. ద్వైత సంప్రదాయాలు ఎక్కువగా స్మృతులనుండి ప్రమాణాలు స్వీకరించాయి. వేదాంతులమని చెప్పుకొనేవారు ఇంతగా, స్మృతి ప్రమాణాలపై ఆధారపడతారని మనం భావించం; కాని వారలా చేశారు. వారింతగా, పురాణాలనుండి ప్రమాణాలను ఎత్తి చూపడంచేతనే “అద్వైతి” మాత్రమే స్వచ్ఛమైన “వేదాంతి” అనే అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు.
అదెలావున్నా, వేదాంతమనే శబ్దం భారతీయుల ఆధ్యాత్మిక జీవన క్షేత్రానికంతటికీ అనువర్తింపచేయాలి! అది వేదాల అంశం కావడంవల్ల, మనకున్న అత్యంత ప్రాచీన వాఙ్మయమని అందరూ అంగీకరిస్తున్నారు. ఆధునిక పండితుల అభిప్రాయమెలా ఉన్నా, వేదాలలోని కొన్నిభాగాలు ఒకప్పుడు, మరికొన్ని భాగాలు మరొకప్పుడు వ్రాయబడ్డాయని హిందువులు అంగీకరించరు. వేదాలన్నీ ఒకేకాలంలో రాశారని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇవి ఎన్నడూ రచించబడినవేకావనీ, బ్రహ్మదేవుని హృదయంలో అనాదిగా ఉండినవే అనీకూడ వారి నమ్మకం. వేదాంతం, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైత క్షేత్రాలనంతా ఆవర్తిస్తుందనే భావంతోనే నేను వేదాంత శబ్దాన్ని వాడుతాను. ఈ ఆవరణంలోనికి రావడాని కిష్టపడితే, బౌద్ధ, జైనమతాలలోని కొన్నికొన్ని భాగాలను సైతం, మనం స్వీకరించవచ్చు. మన హృదయాలు అందుకు తగినంత విశాలంగానే ఉన్నాయి. కానీ, మనలోకి రావడానికి ఇష్టపడకుండావున్నది వారే. మనం సిద్ధంగానే ఉన్నాం. తీవ్రదృష్టితో పరిశోధిస్తే బౌద్ధమతసారమంతా ఉపనిషత్తుల నుండి తీసుకోబడిందే అని స్పష్టమవుతుంది. బౌద్ధమతంలోని మహోదార నీతిసూత్రాలన్నీ మన ఉపనిషత్తులలో, ‘తు.చ’ తప్పకుండ, మాటలు మాటలుగా, అట్లే కనిపిస్తున్నాయి. అదేవిధంగా జైనుల సిద్ధాంతాలు సైతం వారి స్వకీయ భ్రాంతి కల్పనలను వదలితే, మన ఉపనిషత్తులలో గోచరిస్తున్నాయి. తర్వాతి కాలంలో భారతదేశంలో ప్రబలిన ఆధ్యాత్మిక, మతభావాంకురాలన్నీ కూడ ఉపనిషత్తులలో ఉన్నాయి. ఉపనిషత్తులలో భక్తిభావనాదర్శం లేదని కొందరు వాదిస్తారు. ఈ వాదాలు కేవలం నిరాధారాలు. ఉపనిషత్తులు చక్కగా చదివితే ఈ వాదాలు ఎంతమాత్రమూ సత్యంకాదని స్పష్టమవుతుంది. ప్రతి ఉపనిషత్తులోను కావలసినంత భక్తి ఉంది. మీరు కొంచెం కళ్ళుతెరచి దాన్ని చూడవలసి ఉంటుంది. అంతే; తర్వాతికాలంలో పురాణాలలోను, ఇతర స్మృతులలోను పూర్తిగా వికసించివున్న అనేక భక్తిభావాలు ఉపనిషత్తులలో బీజప్రాయంగా ఉన్నాయి. వాని ఆకృతిరేఖలు స్థూలంగా అందేవున్నాయి. కొన్ని పురాణాలు, ఆ స్థూలరేఖలను విశదంగా తీర్చిదిద్దాయి. అంతేకానీ, ఉపనిషత్తులలో అంకురంగానైనా కనిపించని ఒక్క భారతీయాదర్శమైనా, క్రొత్తగా వికసించినది కన్పించదు. ఉపనిషత్తులు బాగా చదివిన కొందరు పెద్దలు భక్తికి ఏదో ఇతర ఆధారం చూపాలని వెర్రి ప్రయత్నాలు చేశారు. కాని వారి ప్రయత్నాలన్నీ వ్యర్థములని రుజువైంది. భక్తిపరంగా, మీకు కావలసినదంతా ఉపనిషత్తులలో – సంహితలలోకూడా ఉంది. భక్తి, పూజ, మొదలైనవంతా అందులో ఉన్నాయి. కాని అవి వికసించడంమాత్రం ఆ తరువాతి కాలంలోనే క్రమక్రమంగా జరుగుతూ వచ్చింది. సంహితాభాగాలలో కొన్ని చోట్ల భయసంకటాలతో కూడిన మతం జాడలు మనకు కనిపిస్తాయి. ఏ వరుణదేవుని ఎదుటనో, మరొక దేవుని ఎదుటనో గజగజలాడుతున్న అర్చకుడు మనకు కనిపిస్తాడు. పాపభావం వారి నొక్కక్కసారి అపారంగా సంక్షోభింపచేయడంకూడ కనిపిస్తుంది. కాని ఉపనిషత్తులలో, ఇలాంటి విషయాల ప్రస్తావనే కానరాదు. ఉపనిషత్తులలో కనిపించే మతభావంలో, భయానికి స్థానమేలేదు. అందలి మతం ప్రేమమయం, భక్తిమయం, జ్ఞానమయం.
ఈ ఉపనిషత్తులే మనకు శాస్త్ర గ్రంథాలు. వాటికి వేర్వేరు విధంగా అర్థం చెబుతారు. అర్వాచీనములైన పురాణాలకు, ప్రాచీనమైన వేదాలకు వైరుధ్యం కలిగినపుడంతా, నేనిదివరకే చెప్పినట్లు, పురాణాలే తలవంచవలసి ఉంటుంది. అయినప్పటికీ, యథార్థానికి మనం నూటికి తొంభై పాళ్ళు పౌరాణికులం. పదిపాళ్ళు మాత్రమే వైదికులం. ఈ పదిపాళ్ళయినా, పూర్తిగా వైదికులమో, కాదో? హిందూశాస్త్రాధారం బొత్తిగాలేని అనేక విరుద్ధాచారాలు మనలో కనిపిస్తున్నాయి. అలాటి విరుద్ధ మతభావాలు సైతం, మన సంఘంలో పరిపాటై పాతుకొనిపోయాయి. వేదాలలోకానీ, స్మృతులలోకానీ, పురాణాలలోకానీ, ఎలాటి ప్రమాణాలూలేక కేవలం స్థానికమై వచ్చే దేశాచారాలను చూస్తే, మనకు అత్యాశ్చర్యం కలుగుతుంది. పామరుడైన ప్రతి పల్లెటూరివాడు, ఏ చిన్న గ్రామాచారమో నశించిపోతే, తానిక హిందువై నిలువజాలక, భ్రష్ఠుడైపోవలసిందే అని భావిస్తున్నాడు. వాని మనస్సులో వేదాంతమతం, ఈ స్థానిక క్షుద్రాచారాలూ, పెనవేసుకొని ఏకరూపమైపోయాయి! అలాటివాడు ధర్మశాస్త్రాలను చదివినాకూడ తానుచేసే వాదనకు యథార్థంగా శాస్త్రాధారంలేదనీ, ఈ ఆచారాలను వదిలితే, తనకు ఏమాత్రం హానిలేకపోగా తాను ఉత్తమ మానవుడుగాకూడ పరిగణించబడగలడనీ గ్రహించడం చాలాకష్టం. రెండోది ఇంకో కష్టముంది. ఈ మన శాస్త్రగ్రంథాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఉత్తమ వేదాంతగ్రంథాలలో ఒకటైన పతంజలి మహాభాష్యంలో, సామవేదానికి వేయి శాఖలున్నాయని చెప్పబడింది! ప్రతి వేదం సంగతీ ఇలాగే అయింది. ఈ గ్రంథాలలో, చాలాభాగాలు అదృశ్యమైపోయాయి; కొద్దిభాగాలు మాత్రమే మనకు మిగిలాయి. అవీ కొన్నికొన్ని ప్రత్యేక కుటుంబాలవారి అధీనంలోనే ఉండేవి. ఆ కుటుంబాలవారిప్పుడు అంతరించి ఉంటారు. లేదా పరదేశీయులు వారిని క్రూరంగా వధించి ఉంటారు; మొత్తంమీద ఏదో ఒక విధంగా వాళ్ళంతా రూపుమాసిపోయారు. వారితోపాటు, వారు తమ అధీనంలో ఉంచుకొన్న వేదశాఖాపాండిత్యంకూడ నాశనమైపోయింది. ఏదైనా కొత్తవిషయాన్ని బోధించడానికో, ఏదైనా వేదవిరుద్ధమైన ధర్మాన్ని ప్రచారం చేయడానికో పూనుకొన్నవారంతా దీన్ని ఒక మిషగా పెట్టుకొంటారని మనం జ్ఞప్తి పెట్టుకోవాలి! స్థానికాచారానికి, శ్రుతికి వివాదం సంభవించినపుడంతా ఈ వాదనను వారు బయటికి తీస్తారు. ఆ స్థానికాచారం శ్రుతివిరుద్ధంకాదనీ అది అంతరించిపోయిన ఒక శ్రుతిశాఖలోని ఆచారమే అనీ, కాబట్టి దానికి వేదం అంగీకారం ఉందనీ చెబుతారు. భిన్న భిన్నములైన పాఠాంతరాలమధ్య శాస్త్రాలకు అర్థాలు చెప్పేటప్పుడు, అవలంబించే భిన్నభిన్న మార్గాలమధ్య అన్నిటికీ సామరస్యం కల్గించే సూత్రాన్ని కనుగొనడం చాలాకష్టం. ఏలంటారా? వేర్వేరుగా కనిపించే ఈ శాఖాంతరాల కన్నిటికీ అడుగున మూలాధారం ఒకటి ఉండి తీరాలనీ, ఈ చిన్నచిన్న భవనాలన్నిటికీ పరస్పరానురూప్యాన్ని కలిగించి, సామాన్యమైన పరికల్పనమేదో ఒకటి ఉండి తీరాలనీ ‘మన మత’ మని మనం చెప్పుకొనే ఈ కలగూరగంపకంతటికీ ఒక మొదలుండి తీరాలనీ మనం నమ్ముతున్నాం. అలా లేకపోతే మన మతం ఇన్ని దినాలు నిలిచి ఉండేదే కాదు. ఇంతకాలం సజీవమై ఉండగలిగెడిదే కాదు.
మరల మన భాష్యకర్తల విషయమెత్తుకొంటే, ఇంకొక చిక్కు కనిపిస్తోంది. అద్వైతి అయిన భాష్యకారుడు తనకు, అద్వైతపరమైన శాస్త్రవాక్యం దొరికినప్పుడు, దాన్ని ఉన్నది ఉన్నట్లు కాపాడుతాడు. కానీ ఆ భాష్యకారునికే ద్వైతపరమైన వాక్యం కళ్ళపడగానే తనకు చేతనైనంతవరకు దానికి ఏదో ఒక వికృతార్థాన్ని కల్పిస్తాడు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మదేవుడు “ఆడమేక” అయిపోతాడు! ఆ భాష్యకర్తలు, తమకు అనుకూలించేందుకై ‘అజుడు’ అంటే, పుట్టుక లేనివాడు (బ్రహ్మదేవుడు) అనే అర్థమున్నచోట, ‘అజా’ అంటే ఆడమేక అని అర్థం చెప్పేస్తారు. ఇదే విధంగా ఇంతకంటే అధ్వాన్నంగాకూడ – ద్వైతభాష్యకారులుసైతం శాస్త్రవాక్యాల అర్థాన్ని కొన్నిచోట్ల తారుమారు చేశారు. ద్వైతపరమైన ప్రతివాక్యం సురక్షితంగా ఉంచుతారు. అద్వైత సిద్ధాంతాన్ని తెలిపే ప్రతివాక్యమూ తమ ఇష్టం వచ్చినట్లు మెలికలు తిప్పి హింసించవలసిందే! ఈ సంస్కృతభాష మిక్కిలి క్లిష్టమైనది కావడంవల్లా, వేదాల్లోని సంస్కృత భాష చాలా పురాతనమైన దయినందువల్లా, “భాషోత్పత్తి శాస్త్రము” అతి సమగ్రమై ఉండడంచేతా ఒక్కమాట అర్థాన్ని గూర్చి యుగయుగాలుగా ఎంతెంత వివాదాన్నైనా సాగించవచ్చు. ఒక పండితుని పుర్రెలో బుద్ధిపుట్టిందా ఏ పిచ్చిప్రలాపాన్నైనా తన వాదబలంచేత, శాస్త్రప్రమాణాలను, సూత్రాలను క్రోడీకరించడం చేత, శుద్ధమైన సంస్కృతంగా నిరూపించగల్గుతాడు. ఉపనిషత్తులను అర్థంచేసుకోవడంలో మనకున్న చిక్కులిలాంటివి. నాకొక అవతారపురుషుని పాదాల దగ్గర జీవించే అదృష్టం కలిగింది. ఆయన ఎంతటి అద్వైతో అంతటి ద్వైతికూడ! ఎంత జ్ఞానో, అంత భక్తుడు! మున్ముందుగా ఈ పురుషుని సాహచర్యం లభించడంవల్ల భాష్యకర్తలను గుడ్డిగా అనుసరించడంకంటె, స్వతంత్రంగా, ఉపనిషత్తులకు, శాస్త్ర గ్రంథాలకు, అకృత్రిమమైన ఆధారం కలిగిన అర్థం చెప్పుకోవాలనే సంకల్పం నాకు కలిగింది. నా పరిశోధనలవల్ల, నాకు కలిగిన అభిప్రాయమిది; ఈ శాస్త్రగ్రంథాలు ఎంతమాత్రం పరస్పర విరుద్ధాలుకావు. కాబట్టి మూలగ్రంథాలను పెడత్రిప్పవలసిన భయం మనకు లేదు. ఈ శాస్త్రగ్రంథాలు రమ్యమైనవి; మహాద్భుతమైనవి. అవి పరస్పర విరుద్ధాలు కానేకావు. ఒక భావంనుండి మరో భావానికి తిన్నని దారి చూపుతూ, అన్ని భావాలకు అద్భుత సామరస్యాన్ని సాధించాయి. నేనొక సత్యాన్ని కనిపెట్టాను. అన్ని ఉపనిషత్తులు, ద్వైత భావాలతోను, పూజాపునస్కారాలతోను ప్రారంభమై, చివరికి భావాలతో ముగుస్తున్నాయి.
ఆ మహనీయుని జీవితాన్నిబట్టి విచారించగా, ద్వైతి, అద్వైతి – ఒకరితో ఒకరు పోట్లాడనవసరంలేదని నేను గ్రహించాను. జాతీయ జీవితంలో ఇరువురికి స్థానము – గొప్ప స్థానమే ఉంది. ద్వైతి ఉండవలసినవాడే! ఎందుకంటే ద్వైతికూడ అద్వైతిలాగానే ఒక జాతి ఆధ్యాత్మిక జీవితంలో ప్రాధాన్యం వహించే ఉన్నాడు. ఒకడు లేక మరొకడు బ్రతకజాలడు. ఒకడు రెండవవాని ప్రయోజనాన్ని సఫలం చేస్తాడు. ఒకడు దేవాలయం వంటివాడు. రెండవ అతడు దాని శిఖరంలాంటివాడు. ఒకడు వేరువంటివాడు. రెండవవాడు పండులాంటివాడు. ఇలాగే పోల్చుకోవచ్చు. కాబట్టి ఉపనిషత్తుల వాక్యాలను విరిచి, తికమకలు చేయబూనడం అసహ్యంగా కనిపిస్తుంది. ఉపనిషత్తుల భాష, నాకు మహాద్భుతంగా కనిపిస్తోంది. గొప్ప తత్త్వశాస్త్రంగా దానికున్న యోగ్యతకన్నా మానవజాతికి తరుణోపాయాన్ని చూపే భాగవతసిద్ధాంతంగా దానికున్న అద్భుత మహత్త్వంకంటె, ఈ ఉపనిషద్భాషలోని గంభీరతావర్ణన చిత్రణం ప్రపంచంలో అసమానమై చిత్రాతిచిత్రమై ఉంది. మానవ హృదయంయొక్క విశిష్టమహిమ, సూక్ష్మదృష్టి, అంతరంగిక ప్రబోధంకల భారతీయుని బుద్ధి కుశలత చాలా స్పష్టంగా ఇందులో ప్రకటితమవుతున్నాయి. ఇతర జాతి భాషలలో గంభీరమైన చిత్రరచనలు ఇతర సందర్భాలలో కనబడుతుంటాయి. కాని ఒక్క మినహాయింపులేకుండ వాని అన్నిటిలో, బాహుబలమహత్వం ప్రకటించడమే పరమావధిగా కనిపిస్తోంది. ఉదాహరణకు మిల్టన్, డాంటే, హోమర్ లేక యే ఇతర పాశ్చాత్యకవుల రచనలనైనా చూడండి. వాటిలోకూడ అద్భుతమైన గంభీరవాక్యాలున్నాయి. కాని పంచేంద్రియాలు, కండబలము, అఖండవికాసం పొందడంవల్లనే అఖండతత్త్వం పట్టుబడుతుందనే సిద్ధాంతం అందు సర్వత్రా కనిపిస్తూంటుంది. ఇలాటి భావాలే సంహితల్లోకూడా కొన్నిచోట్ల ఉన్నాయి. సృష్టివివరణం తెలిపేకొన్ని అత్యద్భుత ఋక్కులు మీలో కొందరికి తెలిసివుండొచ్చు. విస్తృతిలో సూక్ష్మతత్త్వాన్ని ఆకాశంలో అఖండతత్త్వాన్ని వివరించడంలో మహోన్నతభాషా చిత్రణం అందులో కూర్పబడింది. కానీ ఆ విధంగా అఖండబ్రహ్మమును తాము చేరలేమని వారు త్వరలోనే తెలుసుకున్నారు. అనంతాకాశము, విశాలావకాశము అంతులేని బాహ్య ప్రకృతి కూడ వారి హృదయాలనుండి వ్యక్తమై వెలువడటానికి, తహతహలాడుతున్న భావరాజములను తగురీతిని ప్రకటించజాలవని వారు తెలుసుకున్నారు. కాబట్టి, ఇతర విధాలైన సమాధానాలకోసం వారు తమ దృష్టిని మరల్చారు. ఉపనిషత్తులలో వారి భాష మార్పు చెందింది. ఆ భాష నిషేధరూపం తాల్చింది. ఒక్కొక్కప్పుడది మిమ్మల్ని ఇంద్రియాలకు అతీతంగా తీసుకొనిపోయి, సగంలో వదలి, అక్కడి నుండి మీరు గ్రహించనలవికాని స్పష్టాస్పష్టమైన ఏదో ఒక తత్త్వాన్ని చూపుతుంది. ఏదో ఒకటి ఉన్నట్లు మాత్రం మీకు తెలుసు. కానీ అది ఏదో స్పష్టంగా తెలీదు. “న తత్ర సూర్యోభాతి, న చంద్రతారకం నేమా విద్యుతోభాన్తికుతోయమగ్నిః” – అనే వాక్యంతో సరితూగే వాక్యం ప్రపంచంలో ఇంకోటివుందా? “అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించవు; మెరుపులు కూడ అక్కడ ప్రకాశించవు; ఇక అగ్నిమాట చెప్పవలసిందేముంటుంది?” అని దీని అర్థం.
“ద్వా సువర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే ।
తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్య
నశ్న న్నన్యో అభిచాకశీతి ॥
సమానే వృక్షే పురుషోనిమగ్నోఽ
నీ శయాశోచతి ముహ్యమానః ।
జుష్టం యదా పశ్యత్యన్య మీశమస్య
మహిమానమితి వీతశోకః ॥”
ఈ శ్లోకంలోని దానికంటె, చాలా మనోహరమైన భాషలోగానీ, ప్రపంచంలో ఉన్న పారమార్థిక జ్ఞానరాశిని, హిందువుల వేదాంతతత్త్వ సారాన్ని, మానవజాతియొక్క అఖండమోక్షాదర్శాన్ని, రమ్యతరమైన అలంకారరూపంలో విశదం చేయజాలిన వాక్యాలు మీకెక్కడ లభిస్తాయి? ఒకే చెట్టు మీద రెండు అందమైన పక్షులున్నాయట! అవి రెండూ స్నేహితులు. ఒకటి పళ్ళు తింటూ ఉండగా, రెండవది ఏమీ తినక, శాంతంగా నిశ్చలంగా కూర్చున్నది. క్రింద కొమ్మమీద ఉన్న పక్షి తియ్యని పళ్ళను, చేదు పళ్ళను తింటూ, సుఖాన్నీ, కష్టాన్నీ పొందుతుండగా, రెండవ పక్షిశాంతంగా, గంభీరంగా చెట్టుకొనలో కూర్చున్నదట! అది తియ్యని పళ్ళనుగానీ, చేదుపళ్ళనుగానీ తినదు. సుఖాన్నిగానీ, దుఃఖాన్నిగానీ అనుభవించదు. తన స్వస్వరూపమహిమలో లీనమై ఉంటుంది. ఇది మానవుని ఆత్మరూప పటం! మనిషి ఐహిక జీవిత మధురఫలాలను, విషఫలాలను తింటున్నాడు; ద్రవ్యంకోసం పరుగులు పెట్టుతున్నాడు. ఇంద్రియాల వెంటపడి పరుగెత్తుతున్నాడు. నిరాశోపహతుడై వెర్రిగా, ఇలా జీవితాన్ని గడుపుతున్నాడు. వేరే స్థలాల్లో, ఉపనిషత్తులు నరుని జీవాత్మను రథికునికీ, ఇంద్రియాలను మదించి పట్టవశంకాక పరుగులుపెట్టే గుర్రాలకూ పోల్చాయి. లౌకికాడంబరాలవెంట పరుగులుపెట్టే నరుని జీవనగతి ఇలాగున్నది. బంగారు కలలుకనే యువత అవి అన్నీ చివరికి బూటకాలే అని కనుగొనగా, వృద్ధులు, తమ పూర్వచర్యలను గురించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నారు. అయినా ఈ వలలోనుండి తప్పించుకొని బయటపడే మార్గం కనిపించడంలేదు. ప్రపంచమంటే ఇలాంటిది! కానీ ప్రతివాని జీవితంలోను ఉత్తమాశాజనకమైన క్షణాలు కొన్ని వస్తూవుంటాయి. ఘోరమైన దుఃఖాల మధ్య – అంతేకాదు, మహానందాలమధ్య సైతం సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే ఈ నల్లనిమబ్బులు కొన్నైనా తొలగిపోయే నిమిషాలు రాగలవు. అప్పుడు ఇంద్రియానుభవాలను దాటి, చాలదూరంగా ఎక్కడో, అతీతంగా ఉండే తత్త్వంయొక్క ఒక్క తళుకు హఠాత్తుగా, అప్రయత్నంగా, మనకళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. ఈ జీవితాడంబరాలకు అతీతంగా, ఈ సుఖాలకు, ఈ కష్టాలకు దూరంగా ఈ ప్రకృతిని అంటే ఇహపరాలలోని మన ఆనందభ్రాంతులను దాటి ఐశ్వర్యంకోసం, పేరుకోసం ప్రతిష్ఠకోసం, వంశాభివృద్ధికోసం, మనం పొందే ఆరాటానికి చాలాదూరంగా అది మెరుస్తుంది. దాని తళుకును చూచి, నరుడు ఒక నిమిషంపాటు చకితుడైపోతాడు. శాంతంగా, గంభీరంగా కూర్చుండి, తీపిపళ్ళనుగాని, చేదుపళ్ళనుగానీ తినక ఆత్మతృప్తి కలిగి, ఆత్మానందంతో స్వకీయ తేజస్సుతో ప్రకాశించే, ఆ రెండవ పక్షిని చూస్తాడు.
“యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవచ సంతుష్ట స్తస్యకార్యం నవిద్యతే ॥”
– అని గీతావచనం. “ఆత్మలో అనురక్తుడై, ఆత్మనుతప్ప మరిదేన్నీ కోరక, ఆత్మలోనే సంతృప్తుడై ఉన్నవానికి, తాను నిర్వహించుకోవలసిన కార్యమేముంటుంది?” బానిసలాగా అతడేల పాటుపడాలి? మనిషి తళుక్కుమనే దాని జాడను చూస్తాడు. కాని మళ్ళీ దాన్ని మరచిపోతాడు. ఈ సంసారపు తియ్యని పళ్ళను, చేదుపళ్ళను అతడు తింటూనే ఉంటాడు. ఒకవేళ కొంతకాలానికి తళుక్కుమనే వెలుగుజాడ, ఇంకొకసారి కనిపించవచ్చు. ఇలా క్రిందవున్న పక్షి దెబ్బలు తినితిని పైనున్న పక్షికి దగ్గర దగ్గరగా పోతూవుంటుంది. గట్టిమొట్టికాయలను తినే అదృష్టం ఎంత బాగాపడితే అంత త్వరగా తన సహవాసీ, ప్రాణము, మిత్రము అయిన రెండవ పక్షి దగ్గరికి పోయి చేరుతుంది. దాన్ని సమీపించిన కొద్దీ, దాని రెక్కల కాంతులు దీన్ని చుట్టుకొని దీని రెక్కలుకూడా ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ పక్షి ఇంకా దగ్గరికి పోయేటప్పుడు దానికొక విచిత్ర రూపాంతరం చేకూరుతుంది. అది దగ్గరికి వెళ్ళేకొద్దీ తన స్వరూపం కరిగిపోతోందా అన్నట్లు దాని కనిపిస్తుంది. చివరికది పూర్తిగా అదృశ్యమైపోతుంది. నిజానికీ పక్షి అసలు లేనేలేదు. ఇటు, అటు కదలుతున్న ఆకులమధ్య నిశ్చలంగా గంభీరంగా కూర్చున్న ఆ రెండవపక్షి ప్రతిబింబమే ఇది! అంతా పైదాని ప్రకాశమే! పైనున్న పక్షియొక్క ప్రభయే! దాన్ని కలిసికొన్నంతనే దీని భయం అణిగిపోతుంది. పూర్ణతృప్తి లభిస్తుంది. నిశ్చలశాంతి దొరుకుతుంది. ఇలాంటి అలంకారికభాషతో, ఉపనిషత్తులు మనలను ద్వైతభావంనుండి అద్వైత భావానికి తోడ్కొని పోతున్నాయి.
ఇలాంటి ఉదాహరణలను అనంతంగా చూపవచ్చు. కానీ ఈ ఉపన్యాసంలో అలా చేయడానికి వ్యవధి చాలదు. ఉపనిషత్తులలోని ఉదాత్త కవితా వైభవాన్ని, ఉత్కృష్టభావసంపదను చూపడానికి ఇది అదనుకాదు. అయినా ఇంకొక్క విషయాన్నిమాత్రం తెలుపవలసి ఉంది. ఉపనిషత్తులలోని భాష, భావం, అతినిశితంగా, నిరర్గళవేగంతో సాగివొస్తుంది. విసిరిన కత్తిలాగా మీద పడుతుంది. పెద్ద సమ్మెటపోటులాగా పైన పడుతుంది. వాని అర్థాన్నిగూర్చి పొరపడటానికి వీల్లేదు. ఆ గానంలోని స్వరాలంతా స్పష్టమధురమై సంపూర్ణంగా రక్తికడతాయి. అందులో తిరుగుళ్ళు లేవు; పిచ్చిపిచ్చి ప్రసంగాలు లేవు. పతనపు జాడలు అందులో కనిపించవు. మితిమీరిన ఉపమాలంకారాలుకానీ, విశేషణ పరంపరలుకానీ, క్లిష్టాన్వయాలు కానీ అందులో లేవు. మెడలు తిరుగుళ్ళుపడి, చెదరి అందులోనుండి బయటపడే మార్గం తోచక గిజగిజలాడవలసిన అవసరంలేదు. అలాంటి చిక్కు ఎంత మాత్రమూలేదు. అది మానవ రచితమైన వాఙ్మయమే అయితే, మేధాసంపద ఎంత మాత్రమూ వ్యర్ధముకాని ఒక మహాజాతి దాన్ని రచించి ఉంటుందని చెప్పాలి!
‘బలము’, ‘బలము’ అని ప్రతి పుటనుండీ ఉపనిషత్తులు ఉద్భోధిస్తున్నాయి! మనం జ్ఞాపకముంచుకోవలసిన గొప్ప విషయాలలో ఇదొకటి. నా జన్మలో నేను నేర్చుకొన్న గొప్ప గుణపాఠం ఇదొక్కటే! “బలము, బలము” అని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. “ఓయి మానవుడా! దుర్బలుడుగా ఉండటం తగదు, తగదు!” అని హెచ్చరిస్తున్నాయి. మానవునిలో లోపాలుండకుండా ఉంటాయా? అని మనిషి శంకిస్తున్నాడు. “సరే, ఉన్నాయి; ఇంకా ఎక్కువ లోపాలు వచ్చి వాటిని సవరిస్తాయా? మురికితో మురికిని కడిగివేయడానికి ప్రయత్నిస్తావా?” అని ఉపనిషత్తులు అడుగుతున్నాయి. పాపాన్ని పాపం హరిస్తుందా? దోషాన్ని దోషం తొలగిస్తుందా? “బలాన్ని, ఓ మానవుడా! బలాన్నే సంపాదించు! లేచి నిలబడు. బలవంతుడవై దృఢంగా నిలబడు” అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఓహో! ప్రపంచ వాఙ్మయాలలోకంతా, ఈ వాఙ్మయంలో మాత్రమే ‘అభీః’ అంటే జంకులేకుండడం అనే శబ్దం మరలా మరలా ప్రయోగించబడింది. ప్రపంచంలో మరే మత గ్రంథంలోనూ దేవునికిగానీ మానవునికిగానీ, ఈ ‘అభీః’ విశేషణం ప్రయోగించబడలేదు. “అభీః” అనే పదం వినగానే అలెగ్జాండరనే గొప్ప పాశ్చాత్య చక్రవర్తి స్వరూపం నాకిప్పుడు మనోగోచరమవుతుంది. ఆ మహాచక్రవర్తి అడవిలో మన సన్న్యాసులలో ఒకనితో మాట్లాడుతూ సింధూనది ఒడ్డులో నిలిచివున్నట్లు ఒక రూపపటం నా కళ్ళ ఎదుట గోచరిస్తోంది. అతనితో మాట్లాడుతూ ఉండిన వృద్ధుడు దిగంబరియై ఒక రాతిబండమీద కాబోలు కూర్చుని ఉన్నాడు. భాగ్యగౌరవాలపై ఆశలు కలిగించి, తన గ్రీసుదేశానికి రమ్మని ఆ చక్రవర్తి ఆయనను అడుగుతున్నాడు. అతని అఖండజ్ఞానానికి ఆశ్చర్యపడి అలాగే నిలుచుండి ఉన్నాడు. ఈ సన్న్యాసి వాని ఐశ్వర్యాన్ని చూచి నవ్వుతున్నాడు; అతడు పురిగొల్పుతున్న భ్రమలను చూచి మందహాసం చేస్తున్నాడు. అన్నిటినీ నిరాకరిస్తున్నాడు. అప్పుడు రాజ్యాధికార మదాంధుడైన చక్రవర్తి “నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను” అని భయపెట్టగా, ఆ పురుషశ్రేష్ఠుడు పకపకనవ్వి “నీవిప్పుడు పలికినంత అసత్యం, నీ జన్మలో మరెన్నడూ పలికి ఉండవు. నన్నెవరు చంపగలరు? జడమయ ప్రపంచానికి నీవు చక్రవర్తివే, అయిననేమి? నీవా? నన్ను చంపడమా? ఎన్నడూ పొసగదు. ఏలంటావా? నేను జనన మరణాలులేని ఆత్మస్వరూపిని. నేనెన్నడూ పుట్టలేదు; ఎన్నడూ చనిపోయేవాడిని కాను. నేను శాశ్వతుడను; సర్వవ్యాపిని; సర్వజ్ఞుడను; నీవా? నన్ను చంపడమా? నీవు ఏమీ తెలీని పసిపాపలాగా ఉన్నావే” అని అంటున్నాడు. బలమనగా అలాంటిది. నేను ఉపనిషత్తులను చదివినకొద్దీ, ఓ నా స్నేహితులారా! నా దేశీయులారా! మిమ్మల్ని చూస్తే నాకు విచారం కలుగుతోంది. ఆచరణయోగ్యమైన మహాసాధన ఉపనిషత్తులలో గోచరిస్తోంది. ఓహో! బలము! బలము మనకు కావలసివుంది! బలము, బలమే మనకు కొరవడి ఉంది. మనకు బలాన్ని ప్రసాదించువాళ్ళేరీ? దుర్బలులను చేసేవారు వేలకొద్దీ కనిపిస్తున్నారు. తల, తోకలేని వెర్రికథలు మనకు కావలసినన్ని ఉన్నాయి. ఎక్కడ ఉన్నవని మీరు ప్రశ్నిస్తారేమో? మన పురాణాలలో ప్రతిదానిలోను, – ప్రపంచ గ్రంథాలయాలలో, ముప్పాతికభాగం నింపగలిగినన్ని కథలున్నాయి. జాతిపరంగా మనలను దుర్బలులను చేసే విషయాలెన్నో గడిచిన వేయి సంవత్సరాలనుండి మనల్ని వెంటాడుతున్నాయి. మన జాతీయ జీవితంలో ఈ వేయి సంవత్సరాలుగా, నానాటికీ మనం దుర్బలులమై నిర్వీర్యులమైపోయాం. మనపై పాదం పెట్టడానికి సాహసించే ప్రతివాని కాలిక్రింద, వానపాములలాగా గిలగిల తన్నుకొంటూ, ప్రాకులాడే దుర్గతి మనకు పట్టింది. కాబట్టి సోదరులారా! మీ రక్త బాంధవులలో ఒక్కడినైన నేను, మీతో జీవించి, మీతో మరణించనున్న నేను, “మనకు బలం కావలసివుంది; సదా బలమే మనకు కావలసి ఉంది” అని ఘోషిస్తున్నాను. మన ఉపనిషత్తులు బలానికి అపారనిధులై ఉన్నాయి. ఈ ప్రపంచమంతటికీ ఉజ్జీవం ఇచ్చేంత బలం వాటిలో ఉంది. ఆ ఉపనిషత్తులద్వారా లోకమంతా సజీవం కాగలదు; బలసత్త్వాలను పొందగలుగుతుంది. అన్ని జాతుల్లోను, అన్ని మతాల్లోను, అన్ని సంప్రదాయాల్లోను, ఉన్న దుర్బలులను, దుఃఖీతులను, పీడితులను శంఖధ్వనిలాంటి ముక్తకంఠంతో ఆహ్వానించి “మీ పాదాలపై మీరు నిలబడండి; స్వతంత్రులై నడవండి” అని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి. స్వాతంత్ర్యం! శారీరక స్వాతంత్ర్యం, మానసిక స్వాతంత్ర్యం, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అనేవే ఉపనిషత్తులలోని ప్రధాన సూత్రాలు.
ప్రపంచంలోని ధర్మగ్రంథాలన్నిటిలో ఇవి మాత్రమే మోక్షాన్ని గూర్చిగాక, స్వాతంత్ర్యాన్నిగూర్చి ఉద్బోధిస్తున్నాయి. “ప్రకృతి బంధాల నుండి స్వతంత్రులుకండి! దౌర్బల్య బంధాలను త్రెంచివేయండి!” అని హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు; ఈ స్వాతంత్ర్యం మీలో ఇదివరకే ఉందని కూడ అవి మీకు తెలుపుతున్నాయి. ఉపనిషత్తుల బోధలకు ఇది మరొక విశిష్టమైన లక్షణం. నీవు ద్వైతివే అనుకో! అయితే ఏమి? జీవాత్మ స్వాభావికంగానే పరిపూర్ణమైందని నీవు అంగీకరించాలి కదా? కానీ, ఆ జీవాత్మ కొన్నికర్మల మూలంగా ‘సంకోచం’ పొందింది. శ్రీరామానుజాచార్యుల వారి ‘సంకోచవికాస’ సిద్ధాంతాన్నే ఇప్పటి ఆధునిక శాస్త్రజ్ఞులు “ఎవల్యూషన్” అని ‘ఆటవిజం’ అనీ పేర్కొంటున్నారు. జీవాత్మ క్రిందికి దిగి, దిగి సంకోచాన్ని పొందుతుంది. దాని శక్తులు అవ్యక్తములవుతాయి. సత్కర్మలమూలంగా, సత్సంకల్పాలమూలంగా, అది తిరిగి వికాసాన్ని పొంది, తనకు స్వభావసిద్ధమైన పరిపూర్ణతను పొందుతుంది. అద్వైతి అభిప్రాయం దీనికి కొంతభిన్నం. అతడు, ప్రకృతి పరిణామాన్ని అంగీకరిస్తాడు కానీ, ఆత్మపరిణామాన్ని అంగీకరించడు! ఒక తెర ఉన్నదనుకోండి! ఆ తెరలో ఒక చిన్న బెజ్జముంది. ఆ తెర వెనుక నిలబడి, నేనీ మహాసభవంక చూస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏ కొద్దిమంది ముఖాలు మాత్రమే నాకు కనబడతాయి. ఇప్పుడు, ఈ బెజ్జం పెద్దదవుతున్నదనుకోండి. అది పెద్దదైనకొద్దీ ఎక్కువెక్కువగా ఈ సభ నాకు సువ్యక్తమవుతూ వస్తుంది. ఇక, ఆ బెజ్జం తెర అంతటిదై, దాంతో ఏకీభవించినపుడు, నాకీ సభంతా పూర్తిగా కనిపిస్తుంది. అప్పుడు మీకు నాకు మధ్య అడ్డమేమీ ఉండదు. మీరూ మారలేదు. నేనూ మారలేదు. మార్పంతా ఈ తెరలోనే సంభవించింది.
మొదటినుండి చివరి వరకు, మీరు ఒకే విధంగానే ఉన్నారు. తెర మాత్రం మారింది. పరిణామసిద్ధాంతాన్ని గూర్చి అద్వైతి భావమిలా ఉంది. ప్రకృతిలో పరిణామం జరిగేకొద్దీ లోనున్న ఆత్మ వ్యక్తమవుతూ ఉంటుంది. అంతేకానీ, ఆత్మ ఏ విధంగానైనా ‘సంకోచం’ పొందుతుందని అద్వైతి ఒప్పుకోడు. ఆత్మ నిర్వికారం, అఖండం. అది మాయ అనే ముసుగుచేత కప్పబడిందనవచ్చు. ఈ మాయ అనే ముసుగు పలచనయ్యే కొద్దీ, ఆత్మయొక్క స్వభావసిద్ధమైన సహజతేజస్సు వెలువడి సువ్యక్తమవుతూ ఉంటుంది. ఈ మహాసిద్ధాంతాన్నొకదాన్ని భారతదేశంనుండి నేర్చుకోవడానికి లోకం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. ఏమేమి మాట్లాడినా, ఎంతగా డంబాలు పల్కినా, ఈ సిద్దాంతాన్ని ఒప్పుకోక ఏ సంఘమూ నిలువజాలదని కాలం జరిగేకొద్దీ వారు తెలుసుకొంటారు. ప్రతిదీ క్షణక్షణం మారుతోంది. మీకీ మార్పు కనబడటంలేదా? ప్రతి విషయమూ మంచిదని రుజువయ్యే వరకు, దాన్ని చెడ్డదిగానే భావించడం ఎలా ఆచారంగా వస్తోందో మీరు చూడటంలేదా? విద్యా విషయంలోను, దోషులను దండించే విషయంలోను, వెర్రివారికి చికిత్సచేసే విషయంలోను, సామాన్య రోగాలకు మందులిచ్చే విషయంలో సైతం, ఇది ఒకటే తాతలనాటి పద్ధతి. ఇక క్రొత్తపద్ధతెలావుంది? “శరీరం స్వభావంచేత ఆరోగ్యవంతమైందే; అది తన స్వశక్తిచేతనే తన రోగాలను మాన్పుకోగలదు” అని నూతన సిద్ధాంతం చెబుతోంది. మందు చేసేదేమిటంటే శరీరంలో ఉన్న అనుకూల పదార్థాన్నంతా పోగు చేసిపెట్టడం – అంతే అని చెబుతుంది. అది అపరాధుల్నిగూర్చి ఏం చెబుతుందో తెలుసా? ఒక అపరాధి ఎంతపతితుడైనా, వానిలో దైవాంశముంది. ఆ దైవాంశం మారేది కాదు. ఈ సిద్ధాంతాన్ననుసరించే అపరాధులను శిక్షించాలి! ఈ మార్పులన్నీ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. సంస్కరణశాలలు, పశ్చాత్తాప భవనాలు ఏర్పాటవుతున్నాయి. ఇట్లే ప్రతి విషయంలోను పరివర్తన జరుగుతోంది. ప్రతివానిలో దైవాంశ ఉన్నదనే భారతీయుల సిద్ధాంతం – తెలిసినా తెలియకున్నా ఇతర దేశాల్లో సైతం మెల్లమెల్లగా తలచూపుతోంది. దీనికి వివరణ మన గ్రంథాల్లో మాత్రమే ఉంది. దాన్నే ఇతర జాతులవారుకూడ అంగీకరించవలసి వస్తోంది. ఒకడు తన తోటివానితో ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో అభిప్రాయ పరిణామాలు కలుగుతున్నాయి. మానవ జాతి దుర్బలతనే చాటుతున్న తాతలనాటి పాతభావాలన్నీ తొలగిపోవలసి ఉంది. ఈ శతాబ్దంలోనే అవి నాశనం కాగలవు. ఇప్పుడు ప్రజలు చెలరేగి, మనల్ని ఆక్షేపించవచ్చు. పాపమే లేదు, అనే రాక్షసతత్త్వాన్ని బోధిస్తున్నావని ప్రపంచంలో ఈ కొన నుండి, ఆ కొనవరకు నన్నాక్షేపిస్తున్నారు. నేను పాపబోధచేయక, పుణ్యబోధ చేశానని, ఈ ప్రజల సంతానమే నాకు ధన్యవాదాలు చెప్పేకాలం వస్తుంది. నేను పుణ్యబోధ చేస్తాను కానీ, పాపబోధ చేసేవాడిని కాను. చీకటినికాక, లోకానికి నేను వెలుగునే ప్రకటిస్తున్నానని సగర్వంగా చెప్పుకొంటున్నాను.
ఉపనిషత్తులనుండి ప్రపంచం గ్రహించవలసిన రెండవ గొప్ప సిద్ధాంతం ఈ “విశ్వమంతా ఏకం” అనేది. హద్దులను, భేదాలను చూపుతూ ఉండిన పూర్వకాలపు భావాలన్నీ త్వరత్వరగా అంతరించిపోతున్నాయి. విద్యుచ్ఛక్తి, ఆవిరియంత్రాలు ప్రపంచం నలుమూలలకు రాకపోకల ద్వారా పరస్పరసంబంధాన్ని కలుగుజేశాయి. ఇకమీదట మనం మన దేశానికి ఆవలవున్న ప్రదేశాలన్నీ రాక్షసులతో, దయ్యాలతో నిండివుంటాయని కాకమ్మకబుర్లు చెప్పుకోవడానికి వీలులేదు. క్రైస్తవదేశ ప్రజలుకూడ “భారతదేశంలో అడవి జాతివారు, మనుష్యులను చంపుకొని తినే ప్రజలు నివసిస్తూంటారని ఇప్పుడు చెప్పడానికి వీలులేదు. మనం పరదేశాలకు వెళ్ళినా, అక్కడకూడ మనకు చేతినందించి ఆదుకొనేవారు, సాయపడి ప్రోత్సహించి ఆశీర్వదించేవారు, వేలకొలది సోదర మానవోత్తములున్నారు. మన జన్మభూమిలో ఉన్నవారికంటె, కొన్ని సందర్భాలలో వారే చాలా యోగ్యులుగా కనిపిస్తారు. వారు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడ అదేవిధంగా సోదరభావాన్ని ప్రోత్సాహాన్ని, దీవెనలను మనమూ ఇస్తున్నాం. దుఃఖానికంతకు అజ్ఞానమే మూలమని, మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. సాంఘికమైనా, ఆధ్యాత్మికమైనా, ప్రతిజీవన దశలోను, ఆ విషయం పూర్తిగా నిజమే అని ఉపనిషత్తులు తెల్పుతున్నాయి. మనలో ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగేలా చేసేది అజ్ఞానం. ఈ అజ్ఞానంవల్లనే మనం ఒకరినొకరం తెలిసికోలేక, ఒకరినొకరం ప్రేమించుకోలేక, దూరమైపోతున్నాం. మనం ఒకరి నొకరం తెలిసికొన్న వెంటనే ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టితీరాలి! ఎందుకంటే, మనమందరం నిజానికి ఒక్కటే కదా? ఈ విధంగా, మనకు ఇష్టంలేకున్నా, ఏకీభావం అమరుతుంది. రాజకీయ సాంఘికాది విషయాల్లో, ఇరవై సంవత్సరాల క్రిందట ప్రత్యేక జాతీయులుగా ఉండిన సమస్యలు, ఇకమీదట అలా ప్రత్యేక జాతీయభావాలనే ఆధారంచేసికొని పరిష్కారం కాజాలవు. అవి ఎక్కువగా పెరిగిపోయి బ్రహ్మాండం నిండుతున్నాయి. అవి ఇక మీదట అంతర్జాతీయ విశాలదృష్టితో పరిష్కారం కావలసి ఉంటుంది. “అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ సమ్మేళనాలు, అంతర్జాతీయ శాసనాలు” అనే ఘోష నేడు అంతటా వినవస్తూంది. ఇదంతా ఏకత్వాన్ని ప్రకటించేదే! ఇట్లే ప్రకృతి శాస్త్రంలో భౌతిక ద్రవ్యరాశినిగూర్చి ఆలోచించేటప్పుడు ఈ జగమంతటిని ఏకరాశిగా, ఒకే ద్రవ్యమహాసముద్రంగా భావిస్తే, అందులో మీరు, నేనూ, సూర్యచంద్రులూ, సమస్తమూ వేరువేరు చిన్నసుడులో బుడగలో, అని తేలుతుంది. మనః పరంగా మాట్లాడుకొన్నా ఇదంతా సంకల్పమయమైన ఒక్క భావమహా సముద్రంగా ఉంది. దీనిలో నీవు, నేను అదేవిధంగా చిన్నసుడులుగా ఉన్నాం. ఆత్మపరంగా చూస్తే అది కదలదు, మారదు. అదంతా నిర్వికారం, అఖండం, నిరవయవం అయిన ఒకే ఆత్మ! నీతిధర్మావశ్యకతను గూర్చి కూడ, మన గ్రంథాల్లోనే చూడవచ్చు. నీతి, ధర్మాల వివరణం, నీతిసూత్రాల ఆధారాన్నికూడ ప్రపంచం తెలియగోరుతుంది. అదికూడ ఇక్కడే లభించగలదు.
భారతదేశంలో మనకు కావలసిందేమి? ఈ విషయాలు విదేశీయులకు కావలసి ఉంటే, మనకు అవి, ఇరవైరెట్లు ఎక్కువగా అవసరం. ఎందువల్లో తెలుసా? ఉపనిషత్తులు ఎంత గొప్పవైనా, మన పూర్వఋషులను గూర్చి మనమెంతగా డంబాలు కొట్టుకొంటున్నా, ఇతర జాతులతో పోల్చి చూచినప్పుడు, మనం దుర్బలులమై జీవచ్ఛవాలలాగా ఉన్నామని చెప్పక తప్పదు! మన శరీరక దౌర్బాల్యమే మన దుఃఖాలలో కనీసం మూడింట ఒక భాగానికి కారణమవుతోంది. పైగా మనం సోమరులం. మనం పనిచేయజాలం. కలిసికట్టుగా ఒక సంఘంగాకూడ ఉండజాలం. ఒకరినొకరు ప్రేమించుకొనడంలేదు. మిక్కిలి స్వార్థపరులమై పోయాం. ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరిని గురించి ఒకరు అసూయ చెందకుండా ముగ్గురమైనా కలిసి జీవించజాలం. మన స్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది. గాలిలో చెల్లాచెదరైపోయిన దూదిపింజలలాగా ఉన్నాయి మన బ్రతుకులు! దీనికితోడు కరడుగట్టిన స్వార్థపరత! మన ముఖంమీద బొట్టును ఈ తీరుగా పెట్టుకోవాలా? ఆ తీరుగా పెట్టుకోవాలా అంటూ శతాబ్దాలకొద్దీ ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నాం. ఒక మనుష్యుని దృష్టి, నా అన్నాన్ని మైలపరుస్తుందా, లేదా? అనే ఇట్టి మహా సమస్యలను గూర్చి సంపుటాలమీద సంపుటాలుగా గ్రంథాలను వ్రాస్తున్నాం. కొన్ని శతాబ్దాలనుండి మనం చేస్తున్న పని ఇదే! ఇంత చక్కని సమస్యలతోను, పరిశోధనలతోను, మెదడుయొక్క బలాన్నంతటినీ వినియోగిస్తున్నా జాతి ఇంక ఏ ఘనకార్యం చేయగలదని మనం విశ్వసించ గలం? పోనీ ఇప్పుడైనా మనలనుగూర్చి మనం సిగ్గుపడటంలేదే? అవును. కొన్ని సమయాల్లో సిగ్గుపడుతూనే ఉన్నాం. కానీ ఆ విషయాలు తుచ్ఛమైనవని తెలిసి మనం వానిని వదలి వేయజాలకున్నాం. మనం అనేక విషయాలను గూర్చి చిలకపలుకులు పలుకుతుంటాం. కానీ వానిని ఆచరణలో పెట్టం. ప్రేలాపించడం, పనిచేయకుండటం మనకు అలవాటైపోయింది. దీనికి కారణమేమి? శారీరక దౌర్బల్యమే! దుర్బలమైన మెదడుకు ఏమి చేయడానికి శక్తి ఉండదు. మనం దానిని బలిష్ఠం చేయాలి. మొదట, మన యువకులు బలిష్ఠులు కావాలి! మత నిష్ఠ ఆ తర్వాత తనంతట తానే వస్తుంది. ముఖ్యంగా నా యువసోదరులకు నేను చేసే విజ్ఞప్తి ఇది! ముందు బలిష్ఠులుకండి! భగవద్గీతాపారాయణంకన్నా “ఫుట్బాల్” ఆటే మిమ్మల్ని త్వరగా మోక్షమార్గానికి తీసుకొని వెడుతుంది. ఇవి మహాసాహస వచనాలు! అయినా నేను వానిని చెప్పవలసిందే, ఎందుకంటే నాకు మీ పట్ల గాఢాభిమానముంది. నా చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు. నేను కొంచెం అనుభవాన్ని సంపాదించాను. మీ జబ్బలు, మీ కండరాలు, ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరింకా బాగా గీతను అర్థం చేసుకో గలుగుతారు. మీలో ఇంకా కొంచెం బలముంటే, రక్తం ప్రవహిస్తే, శ్రీకృష్ణుని మహాబలాన్ని, ప్రతిభావిశేషాన్ని చక్కగా అర్థం చేసికోగలుగుతారు. మీ పాదాలమీద మీ శరీరం దృఢంగా, సుస్థిరంగా నిలువజాలినపుడు మీరు నిజమైన పురుషులమని భావించగల్గినపుడు ఉపనిషత్తులను, ఆత్మమహిమను, సమగ్రంగా గ్రహించగలరు. ఈ విధంగా మన అవసరాల కోసమై వీటిని ఉపయోగించుకోవాలి!
నేను అద్వైతమతాన్ని బోధించడం చూసి, అనేకసార్లు ప్రజలు విసుగు చెందుతుంటారు. అద్వైతమతాన్నో, ద్వైతమతాన్నో లేక ప్రపంచంలోని ఏ ఒక్కమతాన్నో బోధించడం నా అభిప్రాయమేకాదు. మనకు ఇప్పుడు కావలసి ఉన్న ఏకైకమతం అద్భుతమైన ఆత్మభావనే. ఆత్మ యొక్క అఖండశక్తిని, దాని అఖండ దార్డ్యాన్ని దాని అఖండ పవిత్రతను, దాని శాశ్వతపరిపూర్ణతను, మనం అనుభూతం చేసికోవాలి! నాకొక బిడ్డ ఉంటే, అది పుట్టింది మొదలు ‘నీవు శుద్ధ బ్రహ్మము’ అని నూరిపోస్తాను. పురాణాలలో ఒకదానిలో రాణిమదాలసను గురించిన చక్కని కథను మీరు చదివే ఉంటారు. తనకు శిశువు పుట్టగానే ఆమె స్వయంగా తనచేతులతో ఆ శిశువును తొట్టెలలో ఉంచి, ఆ తొట్టెలను ఊపుతూ, “నీవు శుద్ధ బ్రహ్మమవు! నిష్కళంకుడవు! పాపరహితుడవు! మహాత్ముడవు! మహాపురుషుడవు!” అని జోల పాడేదట! ఓహో! అందులో అద్భుత మహాత్మ్యముంది! వెంటనే మీరుకూడ మహాపురుషులవుతారు. ఈ ప్రపంచమంతా తిరిగి తిరిగి నేను కొంత అనుభవాన్ని సంపాదించాను. ఆంగ్లేయులు ఎప్పుడూ పాపులనుగూర్చి చెబుతూంటారు. వారంతా తాము పాపులమనే నిజంగా నమ్మితే, ఈ ఆంగ్ల ప్రజలు మధ్య ఆఫ్రికాలోని నీగ్రోల దుఃఖస్థితికి దిగుతారు! భగవదనుగ్రహంవల్ల వారలా విశ్వసించడం లేదు. పైగా ఆంగ్లేయుడు, తాను లోకానికి ప్రభువై పుట్టానని నమ్ముతున్నాడు. తాను గొప్పవాడననీ, ప్రపంచంలో తానేమైనా చేయగలననీ అతని విశ్వాసం. తాను అనుకొంటే చంద్రుని దగ్గరికిగానీ, సూర్యుని దగ్గరికిగానీ పోగలడనే అతని నమ్మకం! అదే వానిని అంత గొప్పవానిగా చేస్తోంది. తాను దీనుడైన మహాపాపి అనీ, శాశ్వతనరకంలో వేదనపాలు కావలసిన వాడనీ బోధించే మతగురువులనే నమ్మితే, అతడేనాడు ఇంతటివాడు కాకనేపోను. ఈ విధంగా ప్రతి జాతిలో మతాచార్యులు, మూఢ విశ్వాసాలు అడుగడుగునా అడ్డుపడుతున్నా, ఆంతరమైన దైవాంశ సజీవమై నిలిచి స్వయంగా వ్యక్తంకావడం నాకు గోచరిస్తోంది. మనం ‘శ్రద్ధ’ ను పూర్తిగా కోలుపోయాం. ఆంగ్లేయులకున్న శ్రద్ధలో సహస్రాంశంకూడ మనకు లేదు. నేను ఉన్నది ఉన్నట్లు నిష్కపటంగా చెబుతున్నాను. చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడటంచేత చెబుతున్నాను. ఆంగ్లేయులకు మన ఆదర్శాలు నచ్చి, వానిలో గాఢవిశ్వాసం కుదిరితే, ఇక ఉన్మత్తులలాగా తదేక దీక్షతో తమ దేశీయులు అపహాస్యం చేస్తూ గేలిచేసినా, లక్ష్యపెట్టక తాము ప్రభుజాతికి చెందిన వారమనిన విషయాన్నే మరచి, భారతదేశానికి వచ్చి, మన మతాదర్శాలను మనకే ఎలా బోధిస్తున్నారో మీరు చూడటంలేదా? మీలో ఎంతమంది ఆ విధంగా చేయగలరో చెప్పండి? ఆ విధంగా మీరెందుకు చేయలేరు? ఆ విషయాలు మీకు తెలీవా? వాళ్ళకంటే ఎక్కువగా మీకే తెలుసుకదా? మీకు తెలివి మితిమీరి ‘అతితెలివి’ గా మారింది. వచ్చిన చిక్కంతా అక్కడే ఉంది. మీ రక్తం నీరైపోయింది. మీ మెదడుకు చవుడు పట్టింది; మీ శరీరంలో సత్తువ సున్న! మీరిక శరీరాలు మార్చుకోవాలి! అన్నిటికీ శారీరక దుర్బలతే కారణం. మరేమీకాదు. నూరు సంవత్సరాలనుండి సంస్కరణలు, ఆదర్శాలు మొదలైన విషయాలనెన్నిటిని గురించో మీరు ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. ఆచరణకు దిగవలసి వచ్చినప్పుడుమాత్రం మీరెక్కడా కనిపించరు! ప్రపంచమంతా ఈ కబుర్లతో విసుగు చెందిపోయింది. సంస్కరణమనే పేరే అపహాస్యం పాలైంది. దీనికి కారణమేమి? మీకు తెలీదా? అబ్బో! మీకు బాగానే తెలుసు! కారణమంతా మీ దౌర్బల్యమే! ముమ్మాటికీ మీ దౌర్బల్యమే! మీ శరీరం దుర్బలమైనది; మీ బుద్ధి దుర్బలమైనది! మీలో మీకు విశ్వాసంలేదు. శతాబ్దాలకు శతాబ్దాలుగా పీల్చిపిప్పిచేసే కులద్వేషాల పీడ, రాజుల హింస, విదేశీయుల నిర్బంధాలు, మీ స్వజనులను మీరు పెట్టే ఇక్కట్లు, నా సోదరులారా! మీ బలాన్నంతా బలిగొన్నాయి. మీ వెన్నెముక విరిగిపోయింది; మీరు కాలిక్రింద నలిగే పురుగులైపోయారు! మీకు బలాన్ని ప్రసాదించేది ఎవరు? మనకు కావలసింది బలం – బలమే అని మీకు నేను స్పష్టంగా చెబుతున్నాను. అలాటి బలాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటి సాధనం ఉపనిషత్తులను సత్యమని గౌరవించి ‘నేను ఆత్మను’ అని విశ్వసించడమే! “నన్ను కత్తులు ఛేదించజాలవు. తుపాకి గుళ్ళు నాలో గ్రుచ్చుకోజాలవు. నన్ను అగ్ని కాల్చలేదు. గాలి ఎండింపజేయదు. నేను సర్వశక్తిమంతుడిని. నేను సర్వజ్ఞుడను” అనే ధన్యవాక్కులను ఉచ్ఛరించండి! “మేము దుర్బలులం” అని ఎన్నడూ అనకండి. మనం అన్నీ చేయగలం. మనం చేయజాలందేముంది? మనం అంతా చేయగలం. మన అందరిలో ఆ దివ్యాత్మ ఉంది. దానితో మనం విశ్వాసాన్ని వహించాలి! నచికేతునిలాగా ‘శ్రద్ధ’ వహించండి. నచికేతునకు, వాని తండ్రి యాగంచేసే సమయంలో ‘శ్రద్ధ’ కలిగిందట! అట్లే మీలో ప్రతివానికీ ‘శ్రద్ధ’ కలగాలి! మీలో ప్రతివాడూ మహావీరుడై నిలవాలి! అద్భుత ధీశక్తికలిగి, అఖండ దివ్యాంశతో లోకాన్ని వ్రేలిపై త్రిప్పగలగాలి! నేను కోరేది, మీరు అలాటివారు కావాలనే; ఉపనిషత్తులవల్ల మీరు పొందగల బలం అలాంటిది. అందులోనుండి మీకు లభించగల ‘శ్రద్ధ’ అలాంటిది!
ఓహో! ఆ ఉపనిషత్తులు సన్న్యాసుల సొత్తట! రహస్యమైనవట! అవి సన్న్యాసి చేతులలోపడ్డాయి; అతడు వానిని అడవులకు తీసుకొని వెళ్ళాడు. శంకరాచార్యులు దయచూపి, గృహస్థులు సైతం ఉపనిషత్తులను చదవవచ్చుననీ, అవి వారికి మేలు చేస్తాయనీ, అందువల్ల వారికి అపాయంలేదనీ తెలిపారు. అయినా ఏకాంతవాసి అయి అడవుల్లో ఉండే వానినిగూర్చి మాత్రమే ఉపనిషత్తులు పలుకుతాయనే అభిప్రాయ మొకటుంది. నేను మొన్న మీకు తెలిపినట్లు వేదాలను గురించిన ప్రామాణికమైన వ్యాఖ్యానం, ఏకైక వ్యాఖ్యానం – ఆ వేదాలను ప్రసాదించిన దివ్య పురుషునివలననే… ఆ శ్రీకృష్ణభగవానునివల్లనే గీతలో ప్రకటించబడింది. ఏ జీవనవృత్తిలో ఉన్నా, ప్రతివానికీ ఉపకరించే విధంగా, ఆ వ్యాఖ్యానముంది. వేదాంత భావాలు విశ్వమంతటా ప్రచారంపొందాలి! అవి అడవుల్లోనే పడి ఉండకూడదు. అడువులనుండి, గుహలనుండి వెలువడి వచ్చి న్యాయాధిపతికి, న్యాయవాదికి, గురువులకు, విద్యార్థులకు, సంపన్నుడికీ, దరిద్రుడికీ, చివరికి చేపలుపట్టే బెస్తవానికి సైతం, అందుబాటులోకి వచ్చి ఉపకరించాలి. ఉపనిషత్తుల ప్రబోధం, ప్రతి పురుషునికీ, స్త్రీకి, బిడ్డకు వారెలాంటి పనిచేసేవారైనా అందరికీ వర్తిస్తుంది. భయపడ్డానికేముంది? ఉపనిషత్తుల ఆదర్శాలను అందరూ – బెస్తవాళ్ళు సైతం ఎలా అనుసరించడానికి వీలవుతుందో, ఆ మార్గం చెప్పబడింది. ఆ మార్గం అనంతం. మతం అనంతం. ఎవరూ దాన్ని దాటిపోజాలరు. నీవు నిష్కపటచిత్తంతో ఏమి చేసినా, నీకది మేలే. చాలా చిన్నపనైనా, సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలాన్నిస్తుంది. కాబట్టి ప్రతివాడూ తాను చేయగల చిన్నపనైనా, శ్రద్ధతో నిర్వహించాలి! బెస్తవాడు సైతం, తాను ఆత్మస్వరూపినని భావిస్తే, తన బెత్తవృత్తిలో ఉత్తముడవుతాడు. విద్యార్థి తాను ఆత్మరూపినని భావిస్తే చాలా శ్రేష్ఠుడైన విద్యార్థి అవుతాడు. న్యాయవాది, తాను ఆత్మయే అని భావిస్తే శ్రేష్ఠతరుడైన న్యాయవాది అవుతాడు. ఇలాగే ఇతరులుకూడ, దీని ఫలితంగా కులాలు శాశ్వతంగా నిలిచివుంటాయి – వర్గాలుగా ఏర్పడటం సంఘ స్వభావంలోనే ఉంది. అందులో ఉన్న ప్రత్యేకాధికారాలు మాత్రమే నశించాలి! కులమనేది సహజమైన వ్యవస్థ. సాంఘిక జీవితంలో నేనొక ధర్మాన్ని నిర్వహించగలను. నీవు దేశాన్ని పరిపాలించగలవు. నేను పాతచెప్పులజోడును బాగుచేయగలను. అంతమాత్రంచేత నీవు నాకంటె గొప్పవాడి వనడానికి కారణంలేదు. ఎందుకంటె, నీవు నాలాగా, చెప్పులను మరమ్మత్తు చేయగలవా? నేను దేశాన్ని ఏలగలనా? నేను చెప్పులను బాగుచేయడంలో నేర్పరిని; నీవు వేదాలు చదవటంలో నేర్పరివి. కానీ అంతమాత్రంచేత నీవు, నా నెత్తిమీదకెక్కి త్రొక్కడానికి కారణం లేదే? ఒకడు నరహత్యచేస్తే వానిని స్తోత్రం చేయడం, మరొకడు ఒక రేగుపండును దొంగిలించిన మాత్రాన, వానిని ఉరిదీయడమూ ఎందుకు? ఇలాంటిది అంతరించాలి. కులవిభజన మంచిదే. జీవన సమస్యను పరిష్కరించడానికి ఇదొక్కటే సహజమైన మార్గం. మానవులు సంఘాలుగా ఏర్పడవలసిందే; దాన్ని మీరు ఆపలేరు. మీరెక్కడికి వెళ్ళినా అక్కడ కులం ఉండి తీరుతుంది. కాని అలా అనడంవల్ల ఈ ఎక్కువ తక్కువలు, ఈ ప్రత్యేకాధికారాలు, ఉండాలని అర్థం కాదు. వాటిని తప్పక నిర్మూలించాలి. మీరు చేపలుపట్టే బెస్తవానికి, వేదాంతం నేర్పితే అతడిలా అంటాడు: ‘నేను నీలాగే మానవుణ్ణి. నీవు తత్త్వజ్ఞుడవు; నేను చేపలు పట్టేవాడిని. అయితే ఏం? నీలో ఉన్న ఆ బ్రహ్మమే నాలోనూ ఉంది.’ మనకు కావలసిందిదే. ప్రత్యేకాధికారాలు ఎవరికీ ఉండరాదు; అందరికీ సమానావకాశాలే. ప్రతివానికీ తనలో భగవంతుడున్నాడని బోధించండి. అప్పుడు ప్రతివాడూ, తన ముక్తికై తానే పాటుపడతాడు.
స్వాతంత్ర్యమే అభివృద్ధికి ముఖ్యమైన మూలం. ‘ఈ స్త్రీకిగాని, బిడ్డకుగాని నేను ముక్తిని సాధించిపెడతాను’ అని ఎవడైనా చెప్పసాహసిస్తే, అది అపచారం ఘోరాపచారం! వితంతు సమస్యను గూర్చి, నా అభిప్రాయమేమనీ, స్త్రీ సమస్యనుగూర్చి నా అభిప్రాయమేమనీ నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు. ఇందుకు ఒకేసారిగా ప్రత్యుత్తరమిస్తాను. “ఆ పిచ్చి మాటలు నన్నడగడానికి నేను వితంతువునా? నన్నా ప్రశ్న పదే పదే అడగటానికి నేను ఆడదాన్నా? ఆడవాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి మీరెవరు? ప్రతి వితంతువును, ప్రతి స్త్రీని, మీ అధికారంలోకి తెచ్చుకొని పరిపాలించడానికి మీరు దిగి వచ్చిన దేవుళ్ళా? దూరంగా నిలవండి! వాళ్ళు తమ సమస్యలను తామే పరిష్కరించుకొంటారు. లోకకంటకులారా! మీ రొకరికొక సహాయం చేసిపెట్టగలమని తలప సాహసిస్తారా? చాలు. ఊరికే ఉండండి. భగవంతుడే అంతా చూచుకొంటాడు. మీకంతా తెలుసని అహంకరించడానికి మీరెవరు? ఓ దైవదూషకులారా! భగవంతుని పైనకూడ మీకు అధికారముందని భావించడానికి మీరెలా సాహసిస్తున్నారు? ప్రతి జీవాత్మ, పరమాత్మే అని మీకు తెలీదా? మీ కర్మవిషయం మీరు చూచుకోండి! మీరు అనుభవించవలసిన కర్మభారం మీకుంది! మీ జాతి వారు మిమ్మల్ని ఒక గద్దెనెక్కించవచ్చు. మీ సంఘం మీ చర్యలకు ఆమోదసూచకంగా, తమ కరతాళధ్వనులు ఆకాశాన్నంటవచ్చు. బుద్ధిహీనులు మిమ్మల్నిగూర్చి స్తోత్రపాఠాలు చేయవచ్చు. కానీ భగవంతుడు నిద్రపోయేవాడు కాడు. మీకు ముట్టవలసిన ప్రతిఫలము నేడో లేక రేపో మిమ్మల్ని అనుసరించి రావడం తథ్యం!
ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతివారిని బ్రహ్మముగా చూడండి. మీరు చేయగలది సేవయే; సహాయంకాదు. భగవంతుని బిడ్డలకు సేవ చేయండి. ఆ భాగ్యం కలిగిందంటే భగవంతునికే సేవచేయండి. తన బిడ్డలలో ఎవరికైనా మీరు తోడ్పడే అదృష్టాన్ని పరమేశ్వరుడు మీకు ప్రసాదిస్తే మీరు ధన్యులే! మిమ్మల్ని గూర్చి మీరు అతిశయంగా భావించుకోకండి! ఇతరులకు లభించని అదృష్టం మీకు లభించడంవల్ల మీరు ధన్యులు! అర్చన రూపంగా మీరా సేవాకార్యాన్ని నిర్వహించండి. దరిద్రులలో మనం భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలి! మనం వెళ్ళి వాళ్ళను పూజించడం మన ముక్తికోసమే. వ్యాధిగ్రస్తుని రూపంలో, పిచ్చివాని రూపంలో, కుష్ఠురోగి రూపంలో, పాపాత్ముని రూపంలో కనిపిస్తున్న భగవంతుని మనం సేవించడం కోసమే దరిద్రులు, దుఃఖీతులు ఉద్దేశించబడి ఉన్నారు. ఈ సాహసోక్తులను – ఈ స్వరూపములన్నిటిలోను భగవంతుని సేవించే అవకాశం మనకు లభించడం మహాప్రసాదం, పురాకృత సుకృత ప్రాప్తం అనే మాటలను – నేను మళ్ళీ చెబుతాను. ఇతరులను పాలించడంవల్ల మీరు వారికి ఏమాత్రంగానైనా మేలు చేయగలుగుతామనే అభిప్రాయం విడిచిపెట్టండి. మొక్క విషయంలో మీరెంత చేయగలరో అంతమాత్రమే ఇక్కడకూడ చేయగలరు. వికాసమొందుతున్న విత్తనం శరీరనిర్మాణానికి అవసరమైన మట్టిని, నీళ్ళను, గాలిని సమకూర్చడం మాత్రమే మీరు చేయగలపని. తనకు కావలసిన దాన్నంతా అది, తన సహజశక్తిచేతనే తీసుకొని, జీర్ణించుకొని తన సహజశక్తిచేతనే పెరుగుతుంది.
ప్రపంచంలోకి తేజోరాశిని తీసుకొనిరండి! తేజస్సు! తేజస్సు! తేజస్సు ప్రతివారికీ లభించేలాగ చేయండి! ప్రతివాడూ, బ్రహ్మమును చేరే వరకు, ఈ కర్తవ్యం ముగియదు. పేదవారికి కూడ తేజస్సును చేకూర్చండి! ధనవంతులకు ఇంకా ఎక్కువగా దాన్ని చేకూర్చండి! ఎందుకంటే పేద వారికంటే, వీరికే ఎక్కువగా వెలుగుకావలసి ఉంది! చదువురానివారికి వెలుగును సమకూర్చండి! చదువుకున్నవారికి ఇంకా ఎక్కువ వెలుగును సమకూర్చండి! ఎందుకంటే మనకాలపు ఈ చదువులవల్ల కలిగే దురభిమానాలు అపారం. కాబట్టి అందరికీ తేజస్సును సమకూర్చి, మిగిలిన పనిని భగవంతునికి వదిలేయండి!
“కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతు ర్భూర్మాతే సంగో స్త్వకర్మణి”
“కర్మ చేయడానికే నీకధికారముంది కానీ, ఆ కర్మఫలంలో నీకధికారం లేదు. ఆ కర్మలు నీకు ఫలితమిస్తాయని ఆశపెట్టుకోతగదు. అయినా, నీవు కర్మను వదలకూడదు” అని భగవానుడే స్వయంగా సెలవిచ్చాడు కదా?
ఇలాటి మహోన్నత భావాలను యుగాలకుముందే, మన పూర్వులకు బోధించిన ఆ పరమేశ్వరుడు, తన ఆజ్ఞలను ఆచరణలో పెట్టడానికి తగిన బలాన్ని సంపాదించుకొనేలా మనకు సహాయంచేసి అనుగ్రహించునుగాక!