మొదటిరోజు జనసమ్మర్దంవల్ల నా ఉపన్యాసం సాగించలేకపోయాను. కాబట్టి ఈ మద్రాసు ప్రజలైన మీరు నా పట్ల చూపుతున్న అధికమైన ప్రేమకు మీకు నా వందనాలు అర్పించడానికి ఈ అవకాశం తీసుకొంటున్నాను. మీ సన్మాన పత్రాలలోని ప్రియవచనాలకు నా కృతజ్ఞతను తెలుపుతూ నాపై మీరు చూపుతున్న ఆదరణకు నన్ను పాత్రునిగా చేయమని సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. హైందవ మతప్రచారానికి, మాతృదేశ సేవకు నా యావజ్జీవమూ సమర్పించి నిర్విరామంగా కృషి సలపడం కంటె శ్రేష్ఠతరమార్గం నాకు తోచడం లేదు. పరమేశ్వరుడు నన్నందుకు అర్హునిగా చేయుగాక!
నా యందు ఎన్ని దోషాలున్నా, నాకు కొంత సాహసం ఉందని నేననుకొంటాను. మన భారతదేశంనుండి పాశ్చాత్య ప్రపంచానికి నేనొక సందేశాన్ని కొనిపోవలసి వచ్చింది. ధైర్యంతో దాన్ని నేను అమెరికా, ఇంగ్లాండు ప్రజలకు అందజేసాను. ఈ దినం నా ఉపన్యాసాంశానికి దిగక పూర్వం మీ అందరికీ కొన్ని సాహసవాక్యాలు చెప్పబోతున్నాను. నాకు ఆటంకాలు కల్పించడానికి, నా పని సాగనీయకుండా ఎదిరించడానికీ, వీలయినచో నన్ను రూపుమాపడానికికూడ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఈశ్వరకృపవల్ల అవి అన్నీ వ్యర్థమైపోయాయి. అలాంటి ప్రయత్నాలు నిష్ఫలములవుతూనే ఉంటాయి. గడచిన మూడు సంవత్సరాల నుండి కొన్నికొన్ని అపోహలు వ్యాపిస్తూ వచ్చాయి. నేను పరదేశాల్లో ఉన్నంతకాలం ఈ విషయమై ఒక్కమాటైనా పలుకక మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నా మాతృభూమిపై నిలబడి కొన్ని సమాధాన వాక్యాలు చెప్పుకొంటున్నాను. అలా చేయడం నా పలుకుల ఫలితార్థం ఏమవుతుందా అని చూడగోరికాదు; నా మాటలవల్ల మీలో ఎలాంటి అనుభూతి కల్పించగలనో అనే కౌతుకంతోనూ కాదు; నేను ఇలాంటి వాటిని లక్ష్యపెట్టేవాణ్ణి కాదు. ఏలనంటారా? నాలుగు సంవత్సరాల క్రిందట దండక మండలువులను మాత్రం చేతబూని, మీ నగరాన్ని ప్రవేశించిన ఆనాటి సన్యాసినే ఇప్పుడూను! ఆ సువిశాల ప్రపంచమే ఇప్పుడూ నా ఎదుట కనిపిస్తోంది. ఇక ఉపోద్ఘాతం విరమించి ఉపన్యాసం ప్రారంభిస్తాను.
ముందుగా దివ్యజ్ఞాన సమాజం వారిని గూర్చి కొన్నిమాటలు చెప్పవలసి ఉంది. ఆ సమాజంవల్ల భారతదేశానికి కొంతకొంత మేలు సమకూరిందని నేను వేరుగా చెప్పనక్కర లేదు. అందుకు ఆ సమాజంపట్ల ముఖ్యంగా బిసెంట్ దొరసానిగారి పట్ల ప్రతి హిందువు కృతజ్ఞుడై ఉండాలి! ఆమెనుగూర్చి నాకు తెలిసింది స్వల్పమైనా, నేనెరిగినంతవరకు, ఆమె భారతదేశ శ్రేయోభిలాషిణి అనీ, ఆమె తనకు సాధ్యమైనంతవరకు మన దేశాన్ని ఉద్ధరించడానికి చిత్తశుద్ధితో పాటుపడుతున్నదనీ, నాకు దృఢాభిప్రాయం కలిగింది. అందుకు నిజంగా భారతీయుడై పుట్టిన ప్రతి వాడూ ఆమెకు సదా కృతజ్ఞుడై ఉండాలి! ఆమెకు, ఆమె కృషికి, సర్వశుభాలు శాశ్వతంగా సమకూరాలి! కాని ఇది ఒక విషయం. దివ్యజ్ఞాన సమాజంలో చేరడం మరొక విషయం; ఎవరైనా చెప్పేదాన్ని తర్కించకుండా, విమర్శించకుండా, విచక్షణ చేయకుండా, శిరసావహించడం వేరొక విషయం. అమెరికాలోను, ఇంగ్లాండులోను, నేను సాధించగల్గిన స్వల్ప ప్రయోజనంలో దివ్యజ్ఞానసామాజికులు నాకు తోడ్పడ్డారని ఒక వార్త, ఎలాగో, అంతటా ప్రచారమవుతోంది. అందులో ప్రతి పదమూ పొరపాటే; ప్రతి మాటా అసత్యమే అని మీకు స్పష్టంగా చెబుతున్నాను. “విశాలభావాలు”, “అభిప్రాయభేదంపట్ల సానుభూతి” అంటూ, ప్రగల్భాలు పలకడం లోకంలో తరచువింటున్నాం. ఆ సూత్రాలు చాలా మంచివే. కాని, ఒకడు చెప్పేదాన్నంతా, ఇంకొకడు గుడ్డిగా విశ్వసించే వరకే, ఆ సూత్రాలు ఆదరించబడుతున్నాయి. ఎదుటివాడు భేదాభిప్రాయాన్ని తెలిపిన వెంటనే, ఆ ఆదరణ, ప్రేమ, ఎగిరిపోతూండడం మనం కళ్ళారా చూస్తూనే వున్నాం. వీరికంటే ఘనులు కొందరున్నారు. వారు స్వలాభపరులు. వారి స్వలాభ సంపాదనకు ఏదైనా అడ్డు తగిలితే వారి కడుపు మండిపోతుంది. ఎంత ద్వేషాన్నైనా వారప్పుడు వెలిగ్రక్కుతారు. వారు చేయవలసిందేమో వారికే తెలీదు. హిందువులు తమ ఇంటిని తాము చక్కబెట్టుకొంటే, క్రైస్తవ మిషనరీలకు కలిగే నష్టమేమిటి? హిందువులు తమ్ముతాము సంస్కరించు కోవడానికి తీవ్రంగా కృషిచేస్తే, బ్రహ్మసమాజంవారికీ, ఇతర సంస్కరణ సమాజాలవారికీ వచ్చిపడే ఆపద ఏముంది? వీరంతా ప్రతిఘటించి నిలవడమెందుకు? హైందవోద్యమాలకు వీరు పరమశత్రువులుగా నిలబడట మెందుకు? ఎందుకోసం? అని నా ప్రశ్న! వీరి ద్వేషం, వీరి ఉద్రేకం ఎందుకో? కారణం నా మట్టుకు నేను ఊహించలేకున్నాను. ఏమైనా, వారి ప్రతీకారోద్యమం మాత్రం అతితీవ్రంగా విజృంభిస్తోంది.
నాలుగేళ్ళకు పూర్వం పేరు ప్రతిష్ఠలులేక నిరాధారుడనైన సన్న్యాసిగా అమెరికాకు వెళ్ళేటప్పుడు, అమెరికాలో స్నేహితులుగాని, అక్కడ వారికి పరిచయ పత్రాలుగాని లేకుండానే, మహాసముద్రాలుదాటి, పరదేశాలకు పోనున్న సమయంలో దివ్యజ్ఞాన సమాజ నాయకుని దర్శించ వెళ్ళాను. ఆయన అమెరికా దేశస్థుడు కాబట్టి, భారతదేశంపట్ల అభిమానం కలవాడు కాబట్టి అక్కడ ఎవరితోనైనా నాకు పరిచయం కల్పించడానికి ఒక ఉత్తరం వ్రాసిస్తాడని సహజంగా నేననుకున్నాను. ‘నీవు మా సంఘంలో చేరుతావా’ అని ఆయన నన్నడిగాడు. ‘చేరలేను; నాకు మీ సిద్ధాంతాలలో చాలావాటిలో నమ్మకం లేదు. కాబట్టి నేనెలా చేరగలను?’ అని నేనన్నాను. ‘అలాగైతే నేనేమీ నీకు సహాయం చేయజాలనందుకు నాకు విచారంగా వుంది’ అని ఆయన నాకు జవాబు చెప్పాడు. అలా అనడం నాకు మార్గం సరిచేసిపెట్టడం కాదే? నేను మద్రాసులోని కొందరు మిత్రుల సహాయంతోనే, అమెరికా చేరగలిగానని మీ రెరుగుదురు కదా? వారిలో చాలామంది ఇప్పుడిక్కడే ఉన్నారు. న్యాయమూర్తి సుబ్రహ్మణ్య అయ్యర్గారు ఒక్కరుమాత్రం ఇక్కడలేరు. వారికి నేను చాలా కృతజ్ఞుణ్ణి. ధీనిధికి తగిన దూరదృష్టి వారికుంది. నాకీ జన్మలోకల ప్రాణస్నేహితులలో వారొకరు. సమయానికి అక్కరకువచ్చే నిజమైన స్నేహితుడు. యథార్థ భారతపుత్రుడు! మతమహాసభ జరగడానికి చాలా నెలలు ముందుగానే నేను అమెరికా చేరాను. నా దగ్గరున్న డబ్బు చాలాతక్కువ. అది త్వరలోనే ఖర్చయిపోయింది. శీతాకాలం వచ్చింది. నాకున్నవి వేసవికాలానికి ఉపయోగపడే సన్నని బట్టలు. ఆ చలిలో ఏమి చేయడానికీ నాకు తోచలేదు. చలి దుర్భరంగా ఉండింది. నేను వీథుల వెంటపడి యాచించానా! నన్ను జెయిలుకు పంపుతారు. అప్పుడు నా జేబులో కొద్ది డాలర్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మద్రాసులోని నా మిత్రులకు ఒక తంతివార్త పంపాను. ఈ సంగతి దివ్యజ్ఞాన సమాజంవారికి తెలియగా, “ఇప్పుడు ఆ పిశాచం చావనుంది. భగవంతుడు మనల నందరినీ అనుగ్రహించుగాక” అని వారిలో ఒకరు వ్రాశారు. నాకోసం మార్గం సరిచేసి పెట్టడమంటే అదా? నేనిప్పుడా విషయం ఏకరుపు పెట్టేవాడినికాను. కానీ నా దేశీయులకు ఈ విషయాలుకొన్ని తెలిసి ఉండటం మంచిదని దాన్ని ప్రస్తావించాను. మూడు సంవత్సరాల కాలం, ఈ విషయాన్ని గూర్చి నేను నోరెత్తలేదు, మౌనదీక్ష నవలంబించాను. కాని ఈ దినం ప్రసంగవశాత్తూ ఆ విషయం బయటికి వచ్చింది. ఇంతేకాదు, అఖీలమత మహాసభలో, కొందరు దివ్యజ్ఞాన సామాజికులను చూచాను. వారితో మాట్లాడి కలిసిమెలసి వుండాలనుకొన్నాను. అప్పుడు వారేదో దేవతలైనట్లు, నేనొక కీటకమైనట్లు నా వంక తిరస్కారంతో చూశారు. ఆ చూపులు ఇప్పటికీ నాకు స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. అఖీలమతమహాసభలో, నాకు పేరు ప్రతిష్ఠలు వచ్చిన తర్వాత, నాకు తీరికలేని ఉపన్యాస కార్యక్రమ మేర్పడింది. కాని ప్రతిచోటా దివ్యజ్ఞాన సామాజికులు నన్ను అపనిందలపాలు చేయసాగారు. వారెవ్వరూ నా ఉపన్యాసాలకు వచ్చి వినకూడదని ఆ సంస్థ అధికారులు శాసించారు. వచ్చి వింటే వారు తమ సంఘంయొక్క సానుభూతిని కోల్పోతారట! ఆ సంఘం అంతరంగిక శాఖలో చేరేవారు ‘కుఠూమి’ ‘మోరియో’ అనే వారి ఆజ్ఞలకు – అంటే ఈ మహాత్ములకు ప్రత్యక్ష ప్రతినిధులైన జడ్జిదొరగారికి, బిసెంటుగారికి – లోబడి ప్రవర్తించుచుండాలని వారి అంతరంగిక శాఖానియమాలు విధిస్తున్నాయట! కాబట్టి వారి అంతరంగిక శాఖలో చేరడమంటే స్వతంత్రతను వారికి అర్పించడమే! నేనలాటి పని ఎన్నడూ చేయజాలను. అలాంటి పనిని చేసేవారిని హిందువనే పిలువజాలను. జడ్జిగారిపట్ల నాకు చాలా గౌరవముంది. ఆయన మహనీయుడు. నిష్కపటి, న్యాయశీలుడు, నిరాడంబరుడు. దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధులలో ఆయన ఉత్తమోత్తముడు. ఆయనయు, ఆనీబిసెంటును, తమతమ మహాత్ముని మాటే సరైనదని పరస్పరం వివాదం పెంచుకుంటారట! కాని ఆ విషయాన్ని విమర్శించే యోగ్యత నాకు లేదు. విచిత్రమేమంటే, ఇద్దరూ, ఒకే మహాత్ముని గూర్చి వివాదపడుతున్నారు! సత్యం దైవానికే ఎరుక! ఆయనే ఈ విషయంలో తీర్పు చెప్పగలడు! ఉభయపక్షాలు సమానంగా ఉన్నప్పుడు, ఇతరులెవరూ న్యాయనిర్ణయం చేయజాలరు. అమెరికాలో అంతటా, వారు నాకు మార్గాన్ని బాగా సిద్ధంచేసి పెట్టిందిలాగే. క్రైస్తవ మిషనరీలతో కలసి వారు, నా శత్రుపక్షాన్ని చేరారు. ఈ క్రైస్తవ మిషనరీలు నన్నుగూర్చి కల్పించిన ఘోరతర అసత్యానిందలను ఊహించనేలేం. పరదేశంలో దీనుడినై, దిక్కులేకవున్న నా ప్రవర్తనను అతిహేయంగా చిత్రించి, నగర నగరంలో ప్రచారం చేశారు. ప్రతి ఇంటినుండి నన్ను వెళ్ళగొట్టించడానికి వారు ప్రయత్నించారు. నా పట్ల, స్నేహభావం చూపిన ప్రతివానిని, నా శత్రువునిగా చేయడానికి ప్రయత్నించారు. తిండిలేక నేను మరణించడాన్ని కళ్ళారా చూడాలని వారి కోరిక. ఈ విధంగా పిశాచాలలాగా నన్ను అడుగడుగునా, వెన్నంటి బాధించిన వారిలో నా స్వదేశీయుడే ఒకడున్నాడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఇండియాలో సంస్కరణ పక్షానికి చెందిన ఒక మహానాయకుడాయన. ఈ మహనీయుడు ‘క్రీస్తు భారతదేశానికి దిగి వచ్చాడని’ ప్రతిదినము చాటిచెప్పుతూ ఉంటాడు. ‘క్రీస్తు భారతదేశానికి రావడం’ ఈ విధంగానేనా? భారతదేశాన్ని సంస్కరించే మార్గం ఇదేనా? ఈ మహాశయుని నేను చిన్నప్పటినుండి ఎరుగుదును. ఇతడు ఒకప్పుడు, నా ప్రియస్నేహితులలో ఒకడు. చాలాకాలం నాకు నా దేశీయులు కనిపించకుండిన తర్వాత, నేనీయనను కలిసికొన్నప్పుడు ఎంతగానో ఆనందించాను. కాని ఆయన నాపట్ల చూపిన ఔదార్యం ఇలా ఉండింది. మహాసభవారు నన్నభినందించిన దినంనుండి షికాగో నగరంలో నేను ప్రజాభిమానం చూరగొన్న దినంనుండి, నా పట్ల ఆయన వైఖరి ఈ విధంగా మారింది. కపటమార్గాన నాకపకారం చేయడానికై, సర్వవిధాలా ఈయన ప్రయత్నించాడు. ‘క్రీస్తు ఇండియాకు వచ్చే మార్గమిదేనా?’ క్రీస్తు పాదాలచెంత ఇరవై సంవత్సరాలపాటు కూర్చుని, ఈయన నేర్చిన గుణపాఠం ఇదా? క్రైస్తవమతం, క్రైస్తవశక్తి, భారతదేశ ప్రజలను ఉద్ధరిస్తుందని మన సంస్కరణ మహాశయులు ప్రకటిస్తూంటారే! అది జరగడం ఇలాగేనా? నేను సూచించిన మహనీయుడే ఇందుకు దృష్టాంతమైతే, అదంత ఆశాజనకంగా లేదు.
ఇంకొకమాట! ఒక సంఘసంస్కరణ పత్రికలో నన్ను శూద్రుడనడం చదివాను. సన్న్యాసి కావడానికి శూద్రుని కేమధికారం ఉందని వారు అధిక్షేపించారు. ‘యమాయ ధర్మరాజాయ చిత్రగుప్తాయ వై నమః’ అనే వాక్యాన్ని ఉచ్ఛరిస్తూ ప్రతిదినము ఎవరి పాదాలచెంత ప్రతి బ్రాహ్మణుడు పూవులనర్పిస్తాడో, ఎవరి సంతతివారు పవిత్ర క్షత్రియులో, అట్టి మహాపురుషుడు నా వంశకర్త అని ప్రకటించడమే వారికి నా ప్రత్యుత్తరం! తమ పురాణ గ్రంథాలలోను, ప్రాచీనగాథలలోను, ఈ సంఘసంస్కర్తలకు విశ్వాసముంటే – నా కులస్థులు, ప్రాచీనకాలంలో చేసిన ఇతర విధాల ఉపకారాలనటుంచినా, వారనేక శతాబ్దాలకాలం, భారతదేశంలో సగం భాగాన్ని పరిపాలించారని ఈ మహనీయులు తెలిసికోవాలి! నా కులస్థుల ప్రసక్తే లేకపోతే భారతీయ నాగరికతలో మిగిలే దేముంటుంది? నా రక్త బంధువులనుండే బెంగాల్ తమ మహాతత్త్వవేత్తను, కవిశిఖామణిని, ఉత్తమ చరిత్రకారుని, ప్రాచీనవస్తుపరిశోధకాగ్రగణ్యుని, ఎందరో మాన్యతమ మత బోధకులను పొందగిలిగింది. నా రక్తమే ఆధునిక శాస్త్రవేత్తలలో ఉత్తమోత్తముని భారతదేశానికి ప్రసాదించింది. ఈ నిందాపరులు, మనదేశ చరిత్రను కొంచెం తెలిసికోవలసి ఉంది. మనలోని పై మూడు కులాలను గురించి నేడు కొంత చదివితే బాగుంటుంది. సన్న్యాసులు కావడానికి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు సమానాధికారం కలవారనీ, వేద పఠనానికి మూడువర్గాలవారు సమానార్హులని పాపం. వీరికి తెలీదు. సరే పోనివ్వండి. ఇది ఏదో మాటవరసకు చెప్పాను. ఊరకే ప్రస్తావించాను. వారు నన్ను శూద్రుడు అన్నారని నాకేమాత్రం బాధలేదు. నా పూర్వులు పేదజనులను హింసించిన పాపానికి అది కొంత పరిహారం కాగలదు! నేనొక మాలవాడినైతే ఇంకా సంతసించే వాడిని. ఏలంటారా? బ్రాహ్మణులలో బ్రాహ్మణుడై, మాలవాని ఇంటిని అలికి శుద్ధిచేయ సమకట్టిన, ఒక మహాపురుషుని శిష్యుణ్ణి నేను! ఆ మాలడు ఆయన్ని అలా చేయనీకపోవడం చిత్రమా? బ్రాహ్మణ సన్న్యాసివచ్చి తన ఇల్లు శుభ్రపరచడానికి అతడెలా అంగీకరిస్తాడు? ఈ మహనీయుడో? అర్ధరాత్రి లేచి, అతిరహస్యంగా, ఆ మాలని ఇంట ప్రవేశించి, వాని మరుగుదొడ్డిని శుద్ధిచేశాడు! తన పొడుగాటి తలవెంట్రుకలతో ఆ స్థలాన్ని తుడిచాడు. జనులందరికి, తాను సేవకుడై ఉండే నిమిత్తం ప్రతిదినమూ ఆయన అలా చేస్తూ వచ్చాడు. ఆ మహాపురుషుని పాదాలను నేను నా తలపై ధరిస్తాను! అతడే నాకు మార్గదర్శి. మార్గదర్శి జీవితాన్నే నేను అనుసరించ ప్రయత్నిస్తున్నాను. అందరికీ సేవకుడు కావడం ద్వారా, హిందువు తన్ను తానుద్దరించుకోవడానికి ప్రయత్నిస్తాడు. హిందువులు జనసామాన్యాన్ని ఉద్ధరించవలసిన మార్గమది. అంతేకాని, ఇతరుల సహాయాన్ని యాచించి కాదు. పాశ్చాత్య నాగరికతతో ఇరవై సంవత్సరాల గాఢపరిచయంగల ఒక పురుషుని ఉదాహరణం నాకు జ్ఞాపకం వస్తోంది. ఆ పురుషుడు పరదేశంలో వున్న తన స్నేహితుడు తిండిలేక చావడం చూడాలని కోరుకుంటూ ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఆ స్నేహితుడు ప్రజల ఆదరాన్ని చూరగొన్నందువల్ల! తన ధనార్జనోపాయానికి, ఆ స్నేహితుడు ఆటంకంగా తోచడంవల్ల! ఇక నేను పైన పేర్కొన్న మహాపురుషుడో? యథార్థంగా పూర్వాచారాలను అనుసరించే హిందువు. మన ఈ దేశంలో ప్రవర్తించే విధానానికి ఉదాహరణం. మన సంస్కర్తలలో ఒక్కనిలోనైనా నిర్మలసేవాభావం కలిగితే, అతడు మాలవానికైనా నిష్కామంగా సేవచేయడానికి సిద్ధపడితే, నేను వాని పాదాలచెంత కూర్చుండి వాని బోధనలను శిరసావహిస్తాను. అంతవరకు నేను ఈ సంస్కర్తలను, గింస్కర్తలను లెక్కచేయను. కడవడుకబుర్లకన్నా గరిటెడు ఆచరణ మేలు!
ఇక మద్రాసు సంస్కరణ సంఘాల వారినిగూర్చి ఆలోచిద్దాం. వారికి నా పట్ల చాలాప్రేమ. వారు నన్నుగూర్చి చాలా దయగా మాట్లాడుతారు. వంగదేశ సంస్కర్తలకు, మద్రాసు సంస్కర్తలకు తారతమ్యం ఉందని వారు నాకు తెలిపారు. ఇది నిజమేనని నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను. మద్రాసు “క్రియా ప్రతిక్రియల” ఆటలోకి దిగలేదు. ఇక్కడ అన్ని రంగాలలోను, సుస్థిరమైన నిరంతర పురోగమనం కనిపిస్తోంది. ఇక్కడ ప్రతి జీవితాంశము ప్రవర్థమానమవుతోంది; ప్రతిక్రియలు అడ్డుకోవడం లేదు. అనేక విషయాలలో వంగదేశంలో కొంతవరకు పునరుద్దరణ కనిపిస్తోంది. మద్రాసులో జరుగుతున్నది పునరుద్దరణకాదు, పెరుగుదల – సహజమైన పెరుగుదల. అందువల్ల సంస్కర్తలు, ఈ రెండు రాష్ట్రాలమధ్య ఉందని చెప్పే భేదం, నిజంగానే ఉందని నేను పూర్తిగా ఒప్పుకొంటున్నాను. కాని వారికే అర్థంకానట్టి విషయం ఒక్కటుంది. ఇక్కడి సంస్కరణ సంఘాలలోని కొందరు, నన్ను భయపెట్టి తమలో చేర్చుకోవాలని, పాపం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలా ప్రయత్నించడం నాకు చిత్రంగా ఉంది. తన జీవితంలో పదునాలుగు సంవత్సరాల పాటు పస్తులు పడివుండటానికి అలవాటుపడి, మరునాడు తనకు ఎక్కడ తిండి దొరుకుతుందో తెలీక, ఎక్కడ నిద్రించవలసి వస్తుందో తెలీక, తిరుగుతున్న మనుష్యుని భయపెట్టి, లోబరచుకోవడం అంత సులభమైన పనికాదు. శరీరం కొంకర్లుపోయి గడ్డకట్టే మంచుభూముల్లో దిగంబర ప్రాయుడై తిరుగుతూ, రేపు ఎలా గడుస్తుందో తెలీనిస్థితిలో అనేక సంవత్సరాలు గడపడానికి సాహసించిన పురుషుని సులభంగా లొంగదీయటం భారతదేశంలో సాధ్యంకాదు. నేను వాళ్ళకు తెలుపదలచిన మొట్టమొదటి విషయమిది – నాకు కొంత స్వకీయమైన ఇచ్ఛాశక్తి ఉంది; కొంచెం లోకానుభవమూ ఉంది; నేను ప్రపంచానికి చాటి తెలుపవలసిన సందేశం కూడ ఒకటుంది. నిర్భయంగా, ముందేమవుతుందో అనే ఆరాటం లేకుండా, నేను దాన్ని ప్రకటిస్తాను. నేను మీ అందరిని మించిన సంస్కర్తనని ఈ సంస్కర్తలకు తెలియజేస్తున్నాను. వారు స్వల్పవిషయాలను మాత్రం సంస్కరించాలను కొంటున్నారు; నేనో – సమూల సంస్కారం చేయాలని చూస్తున్నాను. తర్వాత – మా సంస్కరణ పద్ధతుల్లో భేదముంది. వారిది నిర్మూలన పద్ధతి; నాది నిర్మాణ పద్ధతి. నాకు సంస్కరణంలో నమ్మకంలేదు. పెరుగుదలలో నాకు నమ్మకం. నేను ఈశ్వరుని స్థానంలో కూర్చుని, మన సంఘాన్ని శాసించడానికి సాహసించేవాడిని కాను. “ఈ మార్గంలో నీవు వెళ్ళు; ఆ మార్గంలో వెళ్ళకు” అంటూ ఆధికారికంగా శాసించలేను. తనకు చేతనైనన్ని ఇసుక రేణువులను తెచ్చి, సముద్రంలో దులపడంతో పరితృప్తినంది శ్రీరామచంద్రుని సేతుబంధన మహాకార్యంలో పాల్గొన్న ఉడుతలా ఉండగోరుతాను. నా స్థితి అలాంటిది! ఈ విచిత్రమైన జాతీయ యంత్రం, అనేక యుగాలు పనిచేసింది. ఈ అద్భుత జాతీయ జీవననది మన ఎదుట ప్రవహిస్తోంది. అది మంచిదో కాదో? అది ఎలా ప్రవహించాలో, ఎవనికెరుక? ఎవడు చెప్ప సాహసించగలడు? అనేక పరిస్థితులు దాన్ని చుట్టుముట్టాయి. అవి దానికొక ప్రత్యేకగతిని సూచిస్తున్నాయి. ఒకప్పుడు దాన్ని నెమ్మదిగాను, మరొకప్పుడు వేగంగానూ నడుపుతున్నాయి. దాని గతిని శాసించడానికి ఎవనికి ధైర్యముంది? గీత చెప్పినట్లు, ఫలాపేక్షలేక పనిచేయడం మన వంతు. ఈ జాతీయ జీవనాగ్నికి కావలసిన ఇంధనం సమకూర్చు. దాని వృద్ధిని అదే చూచుకొంటుంది. దాని వృద్ధిని నిర్ణయించి, శాసించే వాడెవడూలేడు. మన సంఘంలో కావలసినన్ని లోపాలున్నాయి నిజమే! కాని, ప్రతి ఇతర సంఘంలోకూడ లోపాలున్నాయి. మనదేశం ఒక్కొక్కప్పుడు వితంతువుల కన్నీటిధారలతో తడిసిపోతోంది; అక్కడ పాశ్చాత్య దేశాల్లో, పెళ్ళికాని యువతుల నిట్టూర్పులతో గాలి సుళ్ళు తిరిగిపోతోంది. ఇక్కడ దారిద్ర్యం జాతి వినాశహేతువుగా వుంది; అక్కడ భోగలాలసత్వంలోని వెక్కసపాటు, జాతి వినాశకారణంగా ఉంది! ఇక్కడ, తినడానికేమీ దొరకని కారణాన ప్రజలు ఆత్మహత్య చేసుకొంటున్నారు; అక్కడ తిండి ఎక్కువై ఆత్మహత్య చేసుకొంటున్నారు. ఇలా, అంతటా కీడుంది. అది జీర్ణించిన కీళ్ళవాతపు నొప్పిలాంటిది. దాన్ని పాదం నుండి తరిమితే తలకు ఎగబ్రాకుతుంది. అక్కడి నుండి తరిమితే మరొక చోట ప్రవేశిస్తుంది. ఒక చోటినుండి మరోచోటికి దాన్ని మార్చడమే మనం చేసే పని, అంతే. పసిబిడ్డల కీడును వారించాలని యత్నించడం సరియైన మార్గంకాదు. మంచిచెడ్డలు, ఒకే నాణెంయొక్క రెండు ప్రక్కలలాగా, పరస్పరానుబద్ధమని, మన వేదాంతం బోధిస్తోంది. నీవు, వానిలో ఒకదాన్ని కోరుకో, రెండవదికూడా వచ్చి తీరుతుంది. సముద్రంలో ఒక అల పైకి లేవడం, మరొక చోట పల్లం ఏర్పడడం వల్లనే కదా? జీవితమంతా అనర్థమే. ఇతర జీవులను చంపకుండా గాలి పీల్చడమే సంభవం కాదు! ఎవరికో ఒకరికి లేకుండ చేస్తే తప్ప, ఒక ముద్దఅన్నం నీనోట పడటంలేదు. ప్రకృతి ధర్మమిలా ఉంది. ఇది జీవితతత్త్వం కాబట్టి మనం కీడును ప్రతిఘటించడానికై చేసే పనంతా బాహ్యక్రియా రూపంకాక మానసిక పరమైనదే అని గ్రహించడమే! మనం ఎన్ని డంబాలు పల్కినా కీడు తొలగించే పని స్థూలక్రియారూపమైనది కాక, బోధన, రూపమైనదిగానే ఉంది. కీడును తొలగించే కార్యాన్ని గూర్చి, మనం, ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించాలి! అది మన రక్తంలో పొంగిపడుతున్న మూర్ఖావేశాన్ని తొలగించాలి! ఎక్కడెక్కడ సంస్కరణలు, దురావేశంతో సాగుతాయో, అక్కడంతా అవి వ్యర్థమై పోయాయని ప్రపంచచరిత్ర మనకు తెలుపుతోంది. అమెరికా ఖండంలో బానిసతనాన్ని రూపుమాపడానికై జరిగిన యుద్ధంకంటె, ధర్మస్వాతంత్ర్య సంస్థాపనకోసం జరిగిన మహాప్రయత్నం వేరొకటిలేదు. దాన్నిగూర్చి మీరంతా ఎరుగుదురు కదా? దానివల్ల సిద్థించిందేమి? పూర్వంకన్నా ఈనాడు ఆ బానిసల కష్టాలు నూరురెట్లు ఘోరంగా ఉన్నాయి. ఈ బానిసతనం పోకపూర్వమే ఈ దీనులైన నీగ్రోలు ఎవరో ఒకరి సొత్తుగా ఉండటంచేత వారిని సంరక్షించవలసిన భారం, యజమాని మీద ఉండేది. అందువల్ల వారి ప్రాణాలు సురక్షితంగా ఉండేవి. ఇప్పుడో, వారెవరిసొత్తూ కారు. వారి ప్రాణాలకు విలువలేదు. ఏమాత్రం మిష దొరికినా, వాళ్ళను నిలువునా కాల్చి చంపుతారు. వాళ్ళను కాల్చి చంపే హంతకులను శిక్షించే చట్టంలేదు! వాళ్ళు నల్లవాళ్ళు కాబట్టి మనుష్యులేకారట! పోనీ వాళ్ళు పశువులైనాకారు. వారి గతి ఇలా ఉంది. చట్టాల సహాయంతోకానీ, మూర్ఖావేశంతోకానీ కీడును బలాత్కారంగా తొలగిస్తే ఫలితం ఇలా ఉంటుంది. లోకోపకారం కొరకైనాసరే, దురావేశంతోసాగించే ఉద్యమాలు ఇలాగే పరిణమిస్తూ ఉంటాయి. ఇది నేను స్వయంగా చూశాను. నా స్వంత అనుభవంవల్ల నాకీ విషయం తెలిసింది. కాబట్టి ఈ ఆక్షేపక సంఘాలలో దేనిలోనూ నేను చేరజాలను. ఖండనకు ఎందుకు పూనుకోవాలి? ప్రతి సంఘంలోనూ, లోపాలుంటాయని అందరికీ తెలుసు. ఈనాడు చిన్న పిల్లవాడుకూడ ఉపన్యాస పీఠమెక్కి హిందూసంఘంలోని దోషాలను గూర్చి పెద్ద ఉపన్యాసం ఇవ్వగలడు. చదువు సంధ్య లెరుగక, లోకసంచారి అయి, పరదేశాలనుండి ఇక్కడికి వచ్చే ప్రతివాడూ, రైల్లో పోతూ, ఒకసారి సింహావలోకనంచేసి భారతదేశంలోని ఘోరదురాచారాలను గూర్చి గొప్పగొప్ప పండితోపన్యాసాలను కురిపించగలడు. మన సంఘంలో దోషాలున్నాయని మనం ఒప్పుకుంటూనే ఉన్నాం. దోషమేదో ప్రతివాడూ చూపగలడు. కాని ఆ దోషాలను పరిహరించే మార్గాన్ని చూపేవాడు ప్రజోపకారి. ఒకప్పుడు నీటిలో మునిగిపోతున్న ఒక పిల్లవాడికి, దారినపోతున్న ఒక వేదాంతి ఉపన్యాస మీయసాగాడట! అందుకు పిల్లవాడు “ముందు నన్ను నీటినుండి బయటకు లాగు” అని అరిచాడట. అట్లే “మేము ఉపన్యాసాలు కావలసినన్ని విన్నాం. సంఘాలు కావలసినన్ని ఉన్నాయి. ప్రతికలూ కావలసినన్ని ఉన్నాయి. మాకు చేయి అందించి, పైకిలాగే పురుషుడే కరువైనాడు. నిజంగా మమ్మల్ని ప్రేమించేవారెక్కడైనా ఉన్నారా? మాపై సానుభూతిని చూపే దయాపరుడెక్కడున్నాడు?” అని మన ప్రజలు ఘోషిస్తున్నారు. అవును, ఇప్పుడటువంటి పురుషుడే కావాలి! ఈ సంస్కరణోద్యమాలతో నాకున్న అభిప్రాయభేదం ఇక్కడనే ఉంది. ఈ దేశంలో నూరు సంవత్సరాలుగా, ఉద్యమాలు పని చేస్తున్నాయి. తిట్టుకోవడం, నిందలతో నిండిన గ్రంథాలను రచించడంతప్ప చేకూరిన మేలేముంది? ఈ రచనలు లేకుంటే ఎంత బాగుండేదో? వారు పూర్వాచారపరులను విమర్శించారు; ఖండించారు, దూషించారు. ఇంతలో పూర్వాచారపరులు కూడ ఆ వైఖరినే అవలంబించి బదులుకు బదులు తీర్చసాగారు. తత్ఫలంగా, ప్రతి దేశభాషలోను, జాతికి తలవంపులు; దేశానికి అవమానం కల్గించే గ్రంథరాశి సృష్టి అయింది. ‘సంస్కరణ’ మంటే ఇదేనా? జాతిని వైభవోన్నతికి తీసుకురావడం ఇలాగేనా? ఆ దోషమంతా ఎవరిది?
సరే, ఇంకో గొప్ప విషయాన్నిగూర్చి విచారించవలసి ఉంది. భారతదేశంలో రాజులే, సదా పరిపాలన చేస్తూవచ్చారు. రాజులే మన చట్టాలన్నిటిని నిర్మించారు. ఇప్పుడా రాజులు గతించారు. ఆ ఉద్యమాన్ని తలపెట్టే వారెవరూ ఇప్పుడు లేరు. ఈ ప్రభుత్వానికి సాహసంలేదు. ప్రజాభిప్రాయ గమనాన్ననుసరించి వీరు ఇప్పుడు తమ మార్గాన్ని సవరించుకోవలసి వచ్చింది. ప్రజలు తమ సమస్యలను, తామే పరిష్కరించు కోవాలంటే, బలసౌష్ఠవాలున్న ప్రజాభిప్రాయాలు ఏర్పడాలి! దానికి చాలా కాలం పడుతుంది. ఈలోపుగా మనం ఓపికపట్టవలసి ఉంది. సంఘ సంస్కార సమస్యలన్నీ ‘సంస్కారంకోరే వారెక్కడ?’ అనే ప్రశ్నలో లీనమవుతున్నాయి. మొదట వారిని తయారుచేయండి. వారిప్పుడెక్కడున్నారు. లోకంలో కనిపించే దౌర్జన్యాలన్నిటిలో అల్పసంఖ్యాకులపై దౌర్జన్యమే చాలా ఘోరమైంది. కొన్నివిషయాలు చెడ్డవి అని భావించే ఏ కొద్దిమంది పురుషులో జాతిని, కార్యోన్ముఖంగా చేయజాలరు. జాతి కార్యోన్ముఖం కాకపోవడానికేమి కారణం? దానికి విద్య లేదు. కాబట్టి మున్ముందు జాతికి విద్యనేర్పి, తర్వాత శాసనసభా నిర్మాణం చేసుకోండి. ఆ తర్వాత శాసనాలు బయలుదేరుతాయి. ఎక్కడనుండి శాసనాలు బయలుదేరాలో, అలాంటి అధికారస్థానాన్ని మొదట సృష్టించుకోండి. మీ రాజులు గతించారు. వారి స్థానంలో క్రొత్తగా అధికారం పూనిన ప్రజాశక్తి ఎక్కడ? ముందు దాన్ని అభివృద్ధి చేయండి. కాబట్టి సంఘసంస్కరణ విషయంలో సైతం, ప్రజలకు ‘ఎరుక’ కలిగించడం మీ మొదటి విధి. ఆ జ్ఞానం కలిగేంతవరకు మీరు వేచివుండ వలసిందే. దాదాపు నూరేళ్ళనుండి మీరు ప్రయత్నించి సాధించిన సంస్కరణలలో చాలాభాగం కేవలం అలంకారప్రాయంగానే ఉండిపోయాయి. ఈ సంస్కరణలలో ప్రతిదీ, మొదటి రెండు వర్గాలకు మాత్రమే సంబంధించి ఉండినదేకానీ, తక్కిన వానిని తాకనే లేదు. భారతదేశ స్త్రీలలో నూటికి డెబ్బయ్యైదుమంది విషయంలో వితంతువివాహ ప్రశ్నతో ప్రసక్తిలేనేలేదు. అట్టి ప్రశ్నలన్నీ భారతదేశ ప్రజలలో ఉత్తమకులాల వారికి మాత్రమే సంబంధించాయి. వీరు ప్రజాసామాన్య ధనంతోనే తాము విద్యలు నేర్చుకొన్నారని గ్రహించండి. వారి స్వంతగృహాలను బాగుచేసుకోవడానికి సర్వప్రయత్నాలను సాగించుకొంటున్నారు. కాని అది సమష్టి సంఘసంస్కరణ మనిపించుకోదు. మీరు ఎప్పుడుగాని, సమస్య పునాదుల దగ్గరికి, వేరుల దగ్గరికి దిగిరావాలి. నేను పూర్ణ సంస్కరణమని చెప్పేది ఇలాంటిదే. నిప్పును అక్కడ ముట్టించండి, అక్కడినుండి దాన్ని పైకి రగిలి రానివ్వండి. అట్లే భారతజాతి నిర్మాణం పూర్తికానీండి. అది విశాలమైన పెద్దసమస్య కావడంచేత, దాని పరిష్కారం అంత తేలిక అయిందికాదు. కాబట్టి మీరు ఆత్రపడకండి. ఈ సమస్యను అనేక శతాబ్దాల క్రిందటనే మన పూర్వులు గుర్తించారు.
ఈ దినాలలో ముఖ్యంగా దక్షిణదేశంలో, బౌద్ధమతాన్ని గూర్చి, బౌద్ధుల అజ్ఞేయ సిద్ధాంతాన్నిగూర్చి, ప్రసంగాలు చేయడం ఆచారమైంది. ఈనాడు మనకు సంక్రమించిన ఈ పతనదశ బౌద్ధమతంవల్లనే కలిగిందని, వాళ్ళు కలలోనైనా గ్రహించడంలేదు. బౌద్ధమతం మనకు ఒప్పగించిపోయిన పిత్రార్జితమే ఇది! బౌద్ధమతం ఎలా ఉదయించిందో, ఎలా పతనమైందో ఎన్నడూ పరిశీలించి ఎరుగని వారనేకులు, బౌద్ధమత చరిత్రను గూర్చి గ్రంథాలు వ్రాశారు. వారిలో బౌద్ధమతం గౌతమబుద్ధుని అద్భుత నీతిధర్మాల వలన, మహత్తర ప్రభావం వలన సర్వత్రా వ్యాప్తిచెందిందని వ్రాయబడింది. ఈ గ్రంథాలనే మీరు చదువుతుంటారు. బుద్ధదేవునిపట్ల నాకు అత్యంత గౌరవం, పూజ్యభావం ఉన్నాయి. కాని, బౌద్ధమత వ్యాప్తి ఆ గురుదేవుని వ్యక్తి విశేషమహిమవల్ల, ధర్మ సిద్ధాంతాలకంటే, ఎక్కువగా, బౌద్ధులు దేవాలయాలు నిర్మించడంవల్ల, విగ్రహాలను ప్రతిష్ఠించడంవల్ల, ఉజ్జ్వల కర్మకలాపాలను అనుసరించడంవల్ల కలిగింది; ఈ మాటలు జ్ఞాపకముంచుకోండి. ఈ రీతిగా బౌద్ధమతం ప్రవర్ధిల్లింది. ఎవరి ఇళ్ళలో వారు ఆహుతులు వ్రేలుస్తూ వచ్చిన చిన్న హోమకుండాలు, ఈ పెద్దపెద్ద దేవాలయాలతో కర్మకలాపాలతో పోటీపడి నిలువలేకపోయాయి. కాని, కాలక్రమాన అదంతా భ్రష్ఠమై దుర్వినీతి మయమయింది. అది ఈ సభ ఎదుట మాటలాడతగని విషయం. దాన్ని గురించి తెలుసుకొనగోరేవాళ్ళు ఈ దక్షిణ భారతదేశంలో శిల్పవిశేషాలతో నిండిన పెద్ద పెద్ద దేవాలయాలను పరిశీలిస్తే, కొంచెం గ్రహించగలుగుతారు. బౌద్దులవల్ల మనకు సంక్రమించిన ఉత్తరాధికారమంతా ఇంతమాత్రమే.
ఆ తర్వాత మహాసంస్కర్త అయిన, శంకరాచార్యులవారును, వారి అనుచరులును బయలుదేరారు; హిందూ దేశవాసులనందరిని, స్వచ్ఛమైన వేదాంతమతం వైపునకు నెమ్మదిగా మరల్చుకొని రావడానికి, వారు బ్రహ్మప్రయత్నం చేశారు. ఆయనకు, అతని అనుయాయులకు మనలో ఉన్న లోపాలు పూర్తిగా తెలుసు. అయినా వారు దూషణలు చేయడానికి పూనుకోలేదు. “మీ రవలంబించేదంతా తప్పు! దాన్ని దూరంగా నెట్టివేయండి” అని వారు ఆనాటి ఆచారాలను తిరస్కరించలేదు. అలా ఎన్నడూ కార్యసిద్ధి చేకూరదు. మూడు వందల సంవత్సరాలలో, రోమన్ గ్రీకు మతాల పలుకుబడిని క్రైస్తవమతం పూర్తిగా కూలద్రోసిందని, నా మిత్రుడు డాక్టరు బారోస్ చెప్పుతున్నట్లు ఈ దినమే పత్రికలలో చదివాను. అవి యూరప్, గ్రీసు, రోమ్ నగరాలను చూచినవాని పలుకులు కావు. రోమన్, గ్రీకు మతాల పలుకుబడి అంతా అలాగే నిలిచివుంది! ప్రొటస్టెంటు మతవ్యాప్తిగల దేశాలలో సైతం, మారుపేరులతోనో, క్రొత్త వేషాలతోనో, ఆ పాతదేవతలు నిలిచే ఉన్నారు. ఆ స్త్రీ దేవతలే మరియమ్మలయ్యారు; దేవుళ్ళు ప్రవక్తలైరి. ఆ ఆచారాలు క్రొత్తరూపం ధరించాయి. ‘ఫాంటిఫెక్స్ మాక్సిమస్’ అనే పాతబిరుదు సైతం ఇప్పటికీ నిలిచేవుంది. కాబట్టి ఆకస్మికమైన మార్పులు పొసగవు. శ్రీ శంకరాచార్యులవారికీ విషయం తెలుసు. వారికికల మహాశయం, అప్పుడున్న మతాన్ని నెమ్మదిగా, పరమావధిని చేరేలా నడవడమే. దీనికి వ్యతిరేకమైన నిర్మూలనపద్ధతిని, అవలంబించి ఉంటే, వారు కూడ లోకవంచకులైపోయేవారే. వారి మతంలోని ప్రధాన సిద్ధాంతం పరిణామం, మార్పు; ఆవశ్యకము, సహకారము అయిన భిన్నభిన్న అవస్థలను, అవస్థాంతరాలను పొందుతూ, మార్పుచెందుతూ, జీవుడు క్రమంగా పరమావధిని చేరవలసి ఉన్నాడని గదా ఆ సిద్ధాంతం? కాబట్టి వారిపై దోషారోపణ ఎవరు చేస్తారు?
‘విగ్రహారాధన దోషం’ అని చెప్పడం, ఈ రోజులలో అలవాటైపోయింది. ప్రతివాడు, ఆలోచనలేకుండా, ఆ మాటలను ఒప్పుకొంటున్నాడు. నేనూ ఒకప్పుడు అలాగే భావించాను. అందుకు ప్రాయశ్చిత్తంగా, విగ్రహారాధన మూలంగా, సర్వమూ సాధించిన ఒక మహాపురుషుని పాదాలను నేను సేవించవలసి వచ్చింది. వారే శ్రీరామకృష్ణ పరమహంసగారు. విగ్రహారాధన మూలంగా, అలాంటి రామకృష్ణ పరమహంసలు సిద్ధించి ఉండగా, మీకిప్పుడు కావలసింది, ఈ సంస్కర్తల సిద్ధాంతాలా? లేక పవిత్రమైన విగ్రహాలా? మీ సమాధానం తెలియ గోరుతున్నాను. విగ్రహారాధన మూలంగా రామకృష్ణ పరమహంసలను చేయగలిగితే మీరు ఇంకా వేలకొలదీ విగ్రహాలను స్వీకరించండి. భగవంతుడు మీ యత్నాలను సత్వరం సఫలం చేయుగాక! మీకు సాధ్యమైన ఏ విధానం చేతనైనా సరే, అటువంటి మహాపురుషుల్ని సృష్టించండి. అయినా, విగ్రహారాధన దోషమంటున్నారు. ఎందువల్ల? ఎందువల్లో ఎవరికి తెలీదు! కొన్ని శతాబ్దాలకు పూర్వం యూదియా జాతీయుడొకడు, విగ్రహారాధనను ఖండించాడట! అంటే తన ఆరాధ్య విగ్రహాన్ని తప్ప, తక్కిన వారి విగ్రహాలన్నిటినీ దూష్యములన్నాడట! దేవునికి ఒక మనోహర రూపాన్నిగానీ, చక్కని చిహ్నాన్నిగానీ కల్పించటం, మహాదోషమని అతడన్నాడు. ఒక పెట్టె ఆకారంగా తయారుచేసి, దానిపైని రెండు ప్రక్కల ఇద్దరు దేవదూతలు కూర్చున్నట్లో, వానిపై ఒక మబ్బు తేలియాడుతున్నట్లో, చిత్రరూపకల్పన చేసి చూపితే, అది పవిత్రమైన వానిలో పవిత్రం అవుతుందట! దేవుడు పావురం రూపంలో వస్తే పవిత్రం. కాని ఆ దేవుడే గోరూపంలో వస్తే ఊహూ… పనికిరాదు. అది మూర్ఖమతమని దాన్ని ఖండించవలసిందే! ప్రపంచమిలా నడుస్తోంది. కాబట్టే “మర్త్యులమైన మనం ఎలాంటి మూర్ఖులమో?” అని ఒక కవివరుడన్నాడు. ఎదుటివాని కళ్ళతో ఏ విషయాన్నైనా చూడగలగడం మహాదుర్లభం. అదే మానవ జాతికి దాపురించిన అనర్థం. అదే ద్వేషాలకు, అసూయలకు, వాదు లాటలకు, పోరాటాలకు, మూలకారణం! ఎన్నడూ మద్రాసు వదలి బయటికి అడుగు పెట్టని మీరు – మీసాలు వచ్చిన పాపలలాంటి మీరు – నిలబడి ఈ ముప్ఫైకోట్ల జనులకు వేలకొలది పూర్వ సంప్రదాయాలతో వెలసిన ప్రజా సందోహానికి శాసనకర్తలు కాగోరుతున్నారా? మీకు సిగ్గులేదా? మరలండి, అలాంటి పరమపాతక కార్యం నుండి వెనక్కి మరలండి! గుణపాఠాలను మీరు ముందుగా నేర్చుకోండి. వెర్రిపాపలారా? నేను మద్రాసు సంఘసంస్కర్తలకు ఈ మాట చెప్పవలసి ఉంది. వారిపట్ల నాకు చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. వారి విశాల హృదయాలను చూసి, స్వదేశంపై, బీదలపై, దీనులపై వారికిగల సానుభూతిని చూచి, నాకు వారిపట్ల ప్రేమ ఏర్పడింది. కానీ, సోదర ప్రేమతో వారికి ఒక విషయం చెప్పదలచు కొన్నాను. వారి పద్ధతి సరియైందికాదు. నూరేళ్ళపాటు దాన్ని పరీక్షించి, అది వ్యర్థమని తేలింది. ఇంకో క్రొత్త పద్ధతిని ప్రయోగించి చూడాలి!
భారతదేశంలో ఎన్నడైనా సంస్కర్తలకు కరువుందా? భారతదేశ చరిత్రను మీరు చదివారా? రామానుజులవారెవరు? శంకరాచార్యులవారెవరు? చైతన్యదేవుడెవరు? కబీర్ ఎవరు? దాదు ఎవరు? ఒకరి తర్వాత ఒకరుగా ఉదయించిన ఈ బోధకులంతా ఎవరు? ధగద్ధగితంగా ప్రకాశించే ఈ నక్షత్రరాశి ఎలాంటిది? రామానుజులవారు నిమ్నజాతులపై కరుణ చూపలేదా? బ్రతికివున్నంతకాలం, మాలవారినిసైతం తన మతంలో చేర్చుకోవడానికి ఆయన ప్రయత్నించలేదా? మహమ్మదీయులనుకూడ, తనవారిలో చేర్చుకోవడానికి ప్రయత్నించాడే? నానక్ మహాశయుడు హిందువులతోను, మహమ్మదీయులతోను సంప్రదించి, పరిస్థితులు చక్కదిద్దలేదా? వారంతా సంఘసంస్కరణ ప్రయత్నాలు చేసినవారే కదా? వారి కృషి ఇప్పుడూ కొనసాగుతూనే ఉంది. కానీ ఉన్న భేదమిది; ఈనాటి సంస్కర్తలలాగా, వారు ఆర్భాటాలు చేయలేదు; శాపనార్థాలు పెట్టలేదు. ఎప్పుడూ దీవెనలే వారి పెదవులనుండి వెలువడ్డాయి. వారెన్నడూ ఖండనంచేసి ఎరుగరు. ‘జాతి నిరంతరం పెరుగుతూ పోవలసిందే’ అని వారు ప్రజలకు బోధించారు. వారు వెనుదిరిగి చూచి, “సోదరులారా! మీరు చేసింది యోగ్యమైందే, కాని మనం ఇంకా యోగ్యతరంగా ప్రవర్తిద్దాం” అని అన్నారు. “మీరింతకాలం దుష్టులుగా ఉన్నారు. ఇప్పుడు యోగ్యులుకండి” అని వారనలేదు. వీరి మాటలకు, మన సంస్కర్తల మాటలకు, చాలాతేడా ఉంది. మన సహజశక్తి ననుసరించి మనం పెరగాలి! విదేశ సంఘాలు మనకు చూపిన కార్యమార్గాల నవలంబించడంవల్ల ప్రయోజనంలేదు. అది సాగడం అసంభవం. మనల్ని నలిపి, వంకర టింకరగా మెలిత్రిప్పి, విజాతీయ రూపాలు తయారు చేయడం సాధ్యంకాదు. భగవత్కృపవల్ల అది అసాధ్యం. ఇతర జాతుల వ్యవస్థలను నేను నిందించడం లేదు. అవి వారికి శుభప్రదాలేకానీ, మనకు మాత్రం కొరగావు. వారికి పాయసమైనది, మనకు విషం కావచ్చు. మనం మున్ముందుగా నేర్చుకోవలసిన నీతిపాఠ మిదే. వారి శాస్త్రాలు, వారి వ్యవస్థలు, వారి పూర్వగాథలు, మొదలైన వానివల్ల, వారికీ ప్రస్తుత ఆచారపద్ధతి సిద్ధించింది. మనకూ మన పూర్వగాథలతోను, వేలకొద్దీ సంవత్సరాల మన కర్మానుభవంతోను, మన వైఖరినే సహజంగా అవలంబించగలుగుతాము. మనం చేయవలసిందీ అదే!
ఇక, నా ఉద్యమ ప్రణాళికనుగూర్చి చెబుతాను. పూర్వమహర్షుల అభిప్రాయాల్ని అనుసరించడమే, నా ప్రణాళిక! నేను వారు చేసిన కార్యాన్ని పరిశోధించాను. వారు అవలంబించిన క్రియావిధానాల రహస్యాన్ని కనుగొనే అదృష్టం నాకు లభించింది. వారు మహనీయ సంఘ నిర్మాతలు. శక్తిని, పవిత్రతను, చైతన్యాన్ని ప్రసాదింపజాలిన మహామహులు. వారు మహాద్భుతకార్యాలను సాధించారు. అలాంటి కార్యాలను మనంకూడ సాధించవలసివుంది. పరిస్థితులు ఇప్పుడు కొంచెం మారాయి. ఆ కారణంచేత మన కర్మవిధానంకూడ, కొంచెం మారవలసి ఉంది. కావలసింది అంతే. ఒక్కొక్క జాతీ ఒక్కొక్క వ్యక్తిలాగానే, తన జీవితంలో ఒక ప్రత్యేక జీవనపద్ధతి – ఒక విశిష్టమైన ‘రాగం’ కలిగి వర్థిల్లుతూంటుంది. ఈ ప్రధాన రాగాన్ని అనుసరించి, తక్కిన స్వరాలన్నీ వచ్చి చుట్టూచేరి, ‘లయ’ కలుపుకోవలసి ఉంటుంది. ఆంగ్లజాతికి రాజకీయశక్తి ప్రాణాధార విషయంగా ఉంది. ఇలాగే ఇంకొకదానికి లలిత కళామయ జీవనం, మరొక దేశానికి ఇంకొకటీ, ప్రాణప్రదవిషయాలుగా ఉంటాయి. భారతదేశంలో ఆధ్యాత్మిక జీవనం కేంద్రవిషయంగా ఉంటుంది. ఈ ప్రధాన రాగాన్ననుసరించే ఈ జాతి జీవనగానమంతా సాగాలి. ఏ జాతైనా, అనేక శతాబ్దాలనుండి పరంపరగా వచ్చిన తన విశిష్ట జీవనమార్గంనుండి తొలగి నడిచిందా, అది సర్వనాశనమైపోతుంది. కాబట్టి మీ మతాన్ని త్రోసేసి, రాజకీయాలనో, సాంఘికవాదాన్నో మరే ఇతర విషయాన్నో మీ జాతీయజీవనానికి ప్రధానధర్మంగా గ్రహించారంటే మీకూ వినాశం తప్పదు. ఈ ఆపదను తప్పించుకోవాలంటే, మతమనే జీవస్థానాన్ని ఆధారంచేసుకొని, మీరంతా నడువవలసి ఉంటుంది. మీ మతమనే ‘బ్రహ్మదండము’ ననుసరించి మీ నాడులన్నీ స్పందించవలసి ఉన్నాయి. అమెరికా దేశీయులకు ‘సాంఘిక జీవనం’ అనేది జాతిధర్మం. అందువల్ల వారి సాంఘిక జీవితంలో, ‘మతం’ ఎట్టి ప్రత్యక్ష ఫలితాన్ని కల్పిస్తుందో తెలుపకుండ నేనా దేశంలో మతబోధ చేయజాలనని గ్రహించాను. వేదాంతంవల్ల ఎట్టి విచిత్రరాజకీయ పరివర్తనలు కలుగగలవో తెలుపకుండ నేను ఇంగ్లాండులో మతబోధ చేయలేకపోయాను. అదే విధంగా భారతదేశంలో నూతన సంఘనిర్మాణంవల్ల ఎలాంటి ఆధ్యాత్మిక జీవనాభి వృద్ధి లభించగలదో చూపుతూనే సంఘసంస్కార ప్రబోధాన్ని సాగించవలసి ఉంటుంది. ఈ జాతికి ఏకైక వాంఛితార్థమైన ఆధ్యాత్మిక జీవనం ఎంతచక్కగా వృద్ధికాగలదో, చూపిస్తూనే రాజకీయాలను సైతం బోధించవలసి ఉంటుంది. ప్రతి మనిషీ తన ఈప్సితార్థాన్ని తానే నిర్ణయించుకోవాలి. అట్లే ప్రతి జాతీ; యుగాంతరాల క్రిందటే మన ఆదర్శాన్ని మనం నిర్ణయించుకొన్నాం. కాబట్టి మనం దానికి తప్పక కట్టుబడాలి. ఆ నిర్ణయంలో అంత తప్పేమీ లేదులెండి! అనాత్మపదార్థాన్ని విడిచి, ఆత్మపదార్థాన్ని, నరుని విడిచి నారాయణుని ధ్యానం చేయబూనడం అంత చెడ్డ నిర్ణయమా? పరలోకాన్నిగూర్చి స్థిరమైన విశ్వాసం, ఇహలోకంపై తీవ్ర నిరసనభావం, గాఢవైరాగ్యబలం, భగవంతునిపట్ల అచంచలభక్తి, జీవుడు నిత్యుడు – అనే దృఢనిశ్చయం మీలో ఉన్నాయి. వీటిని మీలో ఎవరైనా పూర్తిగా వదలుకోగలరా? అని నిలదీసి అడుగుతున్నా; చెప్పండి. ఆ పని మీ వల్లకాదు. మీరు అనాత్మవాదాన్ని పూని, ఏ కొద్ది నెలలపాటో, ఆ వాదానికి అనుకూలంగా ప్రసంగించినంత మాత్రాన, నేను మోసపోను. మీ ఆంతర్యం నాకు తెలుసు. నేను, మీ చెయ్యిపట్టుకొన్నంత మాత్రంతోనే ఎవరికీ తీసిపోని ఆస్తికాగ్రేసరులై మీరు మరలి వస్తారు. మీ స్వభావాన్ని మీరెలా మార్చుకోగలుగుతారు?
కాబట్టి, భారతదేశంలో అభ్యుదయకరమైన ప్రతి ఉద్యమానికీ వెనుక మతోత్సాహం పనిచేస్తూండాలి. మన దేశంలో సాంఘికవాదాన్నిగానీ, రాజకీయభావాలనుగాని, ప్రవేశపెట్టడానికి పూర్వం ఆధ్యాత్మిక భావాలతో దేశాన్ని నింపేయాలి. మన ఉపనిషత్తులలోను, శాస్త్రాలలోను, పురాణాల లోను దాగిన మహాద్భుత సత్యాలను వెలికిలాగాలి! మఠాలనుండి వానిని బయటికి తీయాలి; వనాలనుండి తరలించుకురావాలి; ప్రత్యేక వర్గాల అధీనంనుండి గుంజుకొని తేవాలి! అవి దేశమంతటా–ఆసేతు హిమాలయ పర్యంతం – దావానలంలాగా వ్యాపించాలని మనం పూనిక వహిస్తే, కార్యం సాధించామన్నమాటే. ఆ సత్యాలను మనలో ప్రతివాడూ తెలుసుకొని ఉండాలి! ఏలనంటారా? “దీన్ని మొదటవినాలి; తర్వాత మననం చేయాలి; చివర, ధ్యానంలో నిలపాలి” అని పెద్దలు ప్రవచించారు; వానిని ప్రజలకు మొట్టమొదట వినిపించారు; ప్రజలకు తమ శాస్త్రాలలో ఉన్న ఈ మహా సత్యాలను వినిపించే పుణ్యశాలులెవరో? వారి అదృష్టమే అదృష్టం. నేడు దీనికి మించిన సత్కర్మ మరొకటి లేదు. కలియుగంలో ఒక కర్మ మాత్రమే మిగిలి ఉంది. యజ్ఞాలు, ఘోరతపస్సులు, ఇప్పుడు ఫలప్రదంకావు. కర్మలలో కూడ ఒక్కటి మాత్రమే మిగిలివుంది; అది దానకర్మ! “దానాలలోకెల్ల ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైంది! దాని తర్వాతిది లౌకిక జ్ఞాన దానం; దాని తర్వాతిది ప్రాణదానం; నాల్గవది అన్నదానం” అని మన వ్యాసుల వారు చెప్పారు. ఆహా! మనది ఎలాంటి విశిష్టదాతలతోకూడిన జాతో చూడండి! శుష్కదరిద్రదశలో ఉండే ఈ దేశంలో ఎన్నెన్ని దానధర్మాలు చేయబడుతున్నాయో చూడండి! చేతిలో చిల్లిగవ్వైనాలేని నిరుపేద సైతం, ఆసేతు హిమాచలం హాయిగా, సుఖంగా, తీర్థయాత్ర చేయగలడు; ప్రియమిత్రుని లాగా, అందరినుండి ఆదరణ పొందగలడు! ఎక్కడైనా ఒక పిడచ అన్నముండేంతవరకు, ఈ దేశంలో ఏ బిచ్ఛగాడూ ఆకలితో మరణించడు. ఓహో! ఎలాంటి ఔదార్యమో చూడండి!
మొదటి విధమైన దానంయొక్క శక్తిని చేపట్టి ఈ ధర్మభూమిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారంచేద్దాం! ఆ ప్రచారం భారతదేశం హద్దులలో నిలిచిపోకూడదు; లోకమంతటినీ ఆవరించాలి! ఇలా లోకవ్యాప్తమైన ధర్మప్రచారాన్ని మన పూర్వులు చేశారు. హైందవ వేదాంతం ఎన్నడూ, ఈ దేశందాటి పోలేదని చెప్పేవారూ, మత ప్రచారార్థం తొలిసారిగా, పరదేశాలకు వెళ్ళిన సన్న్యాసిని నేనే అని చెప్పేవారూ, తమ జాతిచరిత్ర నెరుగని వారే! ఇలాటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అవసరం అయినప్పుడంతా, భారతీయాధ్యాత్మిక జ్ఞానప్రవాహం వెల్లువలై ప్రవహించి, లోకాన్ని ముంచెత్తుతూవచ్చింది. రాజకీయ ప్రచారం, రణధ్వనులతోను, యోధులతోను, సాగించవచ్చు. అగ్నిని కురిపించి, కత్తిని ఝళిపించి, లౌకికజ్ఞానాన్ని, సంఘనిర్మాణ విజ్ఞానాన్ని విరివిగా ప్రచారం చేయొచ్చు. కాని ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా, చెవులకు వినిపించకుండా, కురుస్తూ రోజూపువ్వుల రాసుల్ని వికసింపజేసే మంచు లాగా నిశ్శబ్దంగా జరుగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, లోకానికి, మరల మరల చేస్తూ వచ్చిన దానమిదే! ఏదో ఒకజాతి విజృంభించి విజయయాత్రలు సాగించి, ప్రపంచంలోని ఆయా జాతులను సమ్మేళనంచేస్తూ, వచ్చినపుడంతా, రాచబాటలను సిద్ధంచేసి, రాకపోకలకు సౌకర్యాలను కల్పించినపుడంతా, భారతదేశం వెంటనే మేల్కొని, ప్రపంచం సమిష్టి పురోభివృద్ధికి ఆధ్యాత్మిక బలమనే తనవంతు దానాన్ని ఇస్తూనే వచ్చింది. బుద్ధదేవుడు పుట్టడానికి చాలా యుగాలకుముందే ఇలాటిది జరిగింది. చైనాలోను, ఆసియా మైనరులోను, మలయా ద్వీపంలోనూ దాని గుర్తులు ఇప్పటికీ మిగిలివున్నాయి. పూర్వం గ్రీసుదేశపు సమ్రాట్టు దిగ్విజయంచేసి, అప్పటికి తెలిసివున్న ప్రపంచం నలుమూలలను కలిపి నప్పుడుకూడ ఇదే జరిగింది. అప్పుడు భారతదేశపు వేదాంతం వెల్లువలై ప్రవహించింది. పాశ్చాత్యులు గర్వంతో చూపుకొనే నేటి నాగరికత, ఆనాటవెల్లువలలో మిగిలిన భాగమే. ఇప్పుడు అట్టి అవకాశం మళ్ళీ వచ్చింది. ఇంగ్లాండు బలప్రభావంవల్ల ప్రపంచజాతులకు ముందెన్నడూలేని పరస్పర సంబంధం నేడు కలిగింది. ఇంగ్లీషువారి వ్యాపారం కోసమై ఏర్పడిన రోడ్లు, కాలువలు, ప్రపంచమంతటా దట్టంగా అల్లుకుపోయాయి. ఇంగ్లీషువారి తెలివితేటలవల్ల, ముందెన్నడూ జరగని రీతిగా, ప్రపంచ జాతులు, ఈనాడు ఒకదానికొకటి కలిసి ముడివేయబడి ఉన్నాయి. మానవ చరిత్రలో పూర్వమెన్నడూ జరగని విధంగా, కేంద్ర, వాణిజ్యస్థానాలు నెలకొల్పబడ్డాయి. వెంటనే భారతదేశం, ఎలాగో మేల్కొని తన ఆధ్యాత్మిక దానవర్షాలను, ప్రపంచంపై కురిపిస్తోంది. ఆ ధారలు, ఈ రోడ్లు, ఈ కాలువలు ఆధారంగా దశదిశాంతాలకు పరుగులు పెడతాయి. నేను అమెరికా వెళ్ళడం నా ప్రయోజకత్వంగానీ, మీ ప్రయోజకత్వంగానీకాదు. భారత భాగ్య విధాత అయిన హైందవాధిష్ఠాన దైవతమే నన్ను పంపాడు. ప్రపంచంలోని అన్నిజాతులవారి దగ్గరకి, నావంటివారిని వందలకొద్దీ మందిని ఇంకా పంపమన్నాడు. ఈ కార్యానికి అడ్డుపెట్టగల శక్తి లోకంలో లేదు. మీ మతాన్ని ప్రచారం చేయడానికి మీరు విదేశాలకు వెళ్ళవలసి ఉంది. లోకంలో ప్రతిజాతికీ, మీరు మీ మత ధర్మాలను బోధించండి. ప్రతివారికీ, నీతి సంశోభితమైన ఉపదేశం చేయండి. మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఇదే. ఇలా ఆధ్యాత్మిక బోధ చేసిన తర్వాత మీకు కావలసిన లౌకికజ్ఞానం, ఇతర జ్ఞానాలు, దానితోపాటు తమంతతామే రాగలవు. కానీ మతాన్ని వదలి మీరు లౌకిక జ్ఞానం కోసం ప్రయత్నం చేశారో – నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను, “ఈ భారతదేశంలో అలాంటమీ ప్రయత్నం వ్యర్థంకాక తప్పదు! దానిలో మీ ప్రజలకు ఎన్నడూ అభిమానం పుట్టదు. కొంతవరకు, ఆ కారణంచేతనే బౌద్ధమత మహోద్యమం సైతం వ్యర్థమైంది.”
మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలుపుతాను వినండి. భారతదేశంలోను, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారుచేయడానికై భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు కావలసింది పురుషులు మాత్రమే అని ముమ్మాటికీ గ్రహించండి. తక్కినదంతా సిద్ధంగా దొరకగలదు. కాని బలిష్ఠులు, జవసంపన్నులు, ఋజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన యువకులు కావలసి ఉన్నారు. అలాటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా పరివర్తనం పొందగలుగుతుంది! ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నిటికంటె బలవత్తరమైంది. అది సాక్షాత్తు భగవంతుని దగ్గరినుండి వచ్చేదే కాబట్టి దానిముందు తక్కిందంతా లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్ఠం అయిన “ఇచ్ఛ” (సంకల్పం) సర్వశక్తివంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. ప్రపంచం ఆ ధర్మాలకోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్రసిద్ధాంతాలు నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని, నరజీవులేకారనీ, ప్రపంచంలో అంతటా బోధలు జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి, వారీ బోధనలవల్ల భయభ్రాంతులై, పశుప్రాయులైపోతున్నారు. తాము, ఆత్మస్వరూపులనే మాటను వినడానికైనా వారెన్నడూ నోచుకోలేదు. వారికి ఆత్మనుగూర్చి చెప్పండి. “మీలో నీచాతినీచుడిలోకూడ ఆత్మవుంది. అది ఎన్నడూ పుట్టేదికాదు, చచ్చేదికాదు. దాన్ని కత్తి నరుకజాలదు; నిప్పు కాల్పలేదు. గాలి ఎండించలేదు; అది మొదలు, చివర (ఆద్యంతాలు) లేనిది; అమృతమైంది, పరమపవిత్రము, సర్వశక్తిమంతము, సర్వవ్యాపకమూ అయినది” అని వారికి వినిపించండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. ఇంగ్లీషువారికి, మీకు భేదమెక్కడున్నదో తెలుసా? తమ మతాన్నిగూర్చి, తమ స్వధర్మాన్నిగూర్చి, ఎన్ని ప్రసంగాలైనా చేయుదురుగాక! మీకు వారికీ ఉన్న తారతమ్యం నాకు తెలుసు. ఆంగ్లేయునికి తనలో తనకు విశ్వాసం ఉంది; మీకదిలేదు. తానొక ఆంగ్లేయుడనని, తానేదైనా చేయగలడని, అతనికి దృఢమైన విశ్వాసం ఉంది! ఈ ఆత్మవిశ్వాసంవల్లే వాని ఆంతర్యంలో ఉన్న భగవంతుడు వానికి ప్రత్యక్షమవుతాడు. అతడంతట, తన ఇష్టంవచ్చినదాన్ని దేన్నైనా సులభంగా చేయగలడు. మీరు, మీరేమీ చేయలేరనీ, దద్దమ్మలనీ మీవారే మీకు బోధించారు. దాన్ని మీరు బాగానమ్మి దినదినం, నిరర్థకులైపోతున్నారు. మీకు కావలసింది బలం. కాబట్టి మీకు ఆత్మవిశ్వాసం అవసరం. మనం బలహీనులమైపోయాం. ఆ కారణంచేతనే “అతిప్రాకృతవాదాలు” “అతీంద్రియవాదాలు” మొదలైన మతధర్మాలెన్నో వచ్చి మనపై పడుతున్నాయి. వానిలో గొప్పసత్యాలే ఇమిడివుండొచ్చు. అయితే ఏం? అవి మనల్ని దాదాపుగా నాశనంచేశాయి. మీ నాడులను దృఢమైనవానిగా చేసికోండి. ఇనుపనాడులు, ఉక్కుకండరాలు, మనకు కావాలి! మనం చాలాకాలం ఏడ్పులు సాగించాం. చాలు. ఇంక ఏడవడం వద్దు. లేచి మీ పాదాలపై మీరు నిలబడండి! పురుషులుకండి! ఇప్పుడు మనకు కావలసింది, పురుషులను సృష్టించే మతమే! మనలను పురుషులుగా చేసే సిద్ధాంతాలే ఇప్పుడు కావాలి! మనల్ని పురుషులుగా చేసే విద్య మనకు అవసరం. సత్యాన్ని గుర్తించడం ఎలా? అంటారా? దైహికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, మిమ్మల్ని బలహీనులుగా చేసేదేదైనాసరే, దాన్ని విషప్రాయంగా పారేయండి. దానిలో జీవశక్తిలేదు; అది సత్యం కాజాలదు. సత్యం బలవర్థకమైంది; సత్యం పవిత్రమైంది; సత్యం సర్వజ్ఞం. సత్యం బలదాయకంగా ఉండాలి! జ్ఞానదాయకంగా ఉండాలి! జవసత్త్వదాయకమై ఉండాలి! రహస్య ఉపదేశాల్లో కొన్ని సత్యరేణువులున్నా అవి సాధారణంగా మానవులను నిర్వీర్యులను చేసేవే! నా మాట నమ్మండి. నాకీ విషయంలో యావజ్జీవానుభవముంది. అందువల్ల అది నిర్వీర్యులను చేసే స్వభావం కలదని నేను నిర్ణయించగలిగాను. నేను భారతదేశమంతటా పర్యటించాను; దాదాపు ప్రతిగుహలోను దూరి చూచాను. హిమాలయాల్లో నివసించాను. తమ జీవితమంతా అందే గడిపిన మహనీయులను ఎరుగుదును. నా జాతి అంటే నాకు అభిమానం ఎక్కువ! మీరు ఇప్పటికంటె, ఇంకా క్షీణించిపోయి నిర్వీర్యులు కావడం నేను చూచి సహించలేను. కాబట్టి, మీ కోసం సత్యంకోసంకూడ “ఇక ఆగండి! నిలవండి!” అని నా జాతి క్షీణగతిని ఆపడానికి ఎలుగెత్తి పలుకుతున్నాను. నిర్వీర్యులను చేసే ఈ రహస్యమతాలను త్యజించండి. బలాన్ని కూర్చుకోండి. మీ ఉపనిషత్తులపై, దివ్యమై సత్త్వప్రదమై తేజోవంతమై వెలసే మీ వేదాంతశాస్త్రంపై, మళ్ళీ దృష్టి ప్రసరింపచేయండి. ఈ రహస్య విషయాలనుండి, మిమ్మల్ని దుర్బలులను చేసే, ఈ రహస్య బోధలనుండి దూరంగా వెళ్ళండి! వేదాంత ధర్మాన్ని స్వీకరించండి. ప్రపంచంలోని మహోత్కృష్ట ధర్మాలు సదా సరళంగానే ఉంటాయి. మీ జీవితాలలాగా, నిరాడంబరాలై ఉంటాయి. ఉపనిషత్తులు బోధించే ధర్మాలు మీ ఎదుటనే ఉన్నాయి. వాటిని చేపట్టండి! వాటి ననుసరించి జీవించండి! అప్పుడు భారతదేశం మోక్షం పొందేకాలం రాగలదు.
ఇంకొక మాటచెప్పి ముగిస్తాను. పాశ్చాత్యులు దేశాభిమానాన్ని గూర్చి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. దేశాభిమానంలో నాకూ విశ్వాసం ఉంది. దేశాభిమానాన్ని గూర్చిన భావాలు నాకూ ఉన్నాయి. ఘనకార్యాలు సాధించడానికి మూడు విషయాలు అవసరం. మొట్టమొదటిది హృదయపూర్వకమైన సానుభూతి. బుద్ధిలోగాని, తర్కంలోగాని, ఏముంది? అది నాలుగడుగులు మాత్రంపోయి, అక్కడ ఆగిపోతుంది. కాని హృదయ ద్వారంలో దైవప్రేరణ కలుగుతుంది. ప్రేమ దుస్సాధ్యమైన ద్వారాలను కూడ తెరవ గలుగుతుంది. జగద్రహస్యాలన్నిటికీ ప్రేమ సింహద్వారం. కాబట్టి సంస్కర్తలుకాగోరే మహాశయులారా! దేశాభిమానులు కాగోరే మహాత్ములారా! ముందు, సానుభూతిని అలవరచుకోండి. మీకు సానుభూతి వుందా? దేవతల, మహాపురుషుల సంతానంలో లక్షలకొద్దీజనం నేడు పశుప్రాయులైపోయారే అని మీరు నిజంగా దుఃఖీస్తున్నారా? లక్షలాది జనం తిండిలేక ఈనాడు మలమల మాడుతున్నారే అనిగానీ, తిండిలేక కోట్లకొద్దీ జనం అనేక యుగాలనుండి చచ్చిపోతున్నారనిగానీ, మీరు దుఃఖీస్తున్నారా? అజ్ఞానం, నల్లని మబ్బులాగా, దేశాన్ని కప్పివేసిందని మీరు ఆరాటపడుతున్నారా? అది మీ హృదయాలను కలచివేస్తోందా? మీకు నిద్రపట్టకుండా చేస్తోందా? అది మీ రక్తంలో ప్రవేశించిందా? మీ గుండె దానితో స్పందిస్తోందా? ఆ విచారంతో మీరు పిచ్చివారైపోతున్నారా? ఈ విధంగా అయ్యో సర్వం నాశనమైపోయిందిగదా అనే చింత మిమ్మావహించిందా? మీ పేరుప్రతిష్ఠలను మీ ఆలుబిడ్డలను, ఆస్తిపాస్తులను, శరీరసౌఖ్యాలను అన్నిటినీ మీరు మరచిపోయారా? నిజం చెప్పండి. అలా చేయగలిగారో, దేశాభిమానులు కావడానికి మీరు, మొదటి మెట్టును ఎక్కారన్న మాట! అసలు నేను అమెరికాకు పోవడం మత మహాసభకోసం కాదని మీలో చాలామందికి తెలుసు. నా దేశానికి నేను ఏ సేవా చేయలేకున్నాననే దుఃఖం నన్ను దయ్యంలాగా పట్టుకొంది. ఆ భావం నాలో చేరింది; నా ఆత్మలో దూరింది; నా దేశీయులకోసమై పని చేసేమార్గం కనబడక పండ్రెండు సంవత్సరాలపాటు భారతదేశమంతా కలయదిరిగాను. ఈ కోరికతోనే ఏమీతోచక నేను అమెరికా వెళ్ళాను. ఆ మతమహాసభ ఎవరికి కావాలి? నా రక్తమాంసాలు పంచుకొనిపుట్టిన నా సోదరులు ఇక్కడ క్షీణించిపోతుండగా, ఆ సభ గొడవ ఎవరికి పట్టింది? అదే నా మొట్టమొదటి భావం.
మీకు ఆ దుఃఖం ఉందనుకుందాం. సరే నురుగునుపోలి, బుసబుసలాడే వ్యర్థప్రసంగాలతో మీ శక్తినంతా ఖర్చుపెట్టుకోవడానికి బదులు ఈ దుఃస్థితినుండి వెలువడే మార్గాన్ని దేన్నైనా ఆచరణయోగ్యమైన ఏ పరిష్కారాన్నైనా మీరు తెలుసుకున్నారా? శాపనార్థాలకు బదులుగా, కొంచెమైనా సహాయంచేసే మార్గమేదైనా కనిపెట్టారా? వారి దుఃఖాలను ఉపశమింపజేయడానికై బ్రతికి ఉండగానే వారి ప్రాణాలను తీసే ఘోరహింసల నుండి వారిని తప్పించడానికై ఏ ఉపాయాన్నైనా మీరు కనుక్కోవడానికి ప్రయత్నించారా?
ఇంతకూడ చాలదు! పర్వతాలలాగాలేచి, అడ్డమై నిలిచే ఆటంకాలను దాటడానికి తగిన సంకల్పశక్తి మీకుందా? కత్తి చేతబట్టి ప్రపంచమంతా మిమ్మల్ని ఎదిరించి నిలిచినా, ధర్మమని తోచినదాన్ని ఆచరించడానికి మీరు సాహసిస్తారా? మీ భార్యలు, బిడ్డలు, మీకు విరోధులై నిలిచినప్పటికీ, మీ ఐశ్వర్యాలు నాశనమైపోయినప్పటికీ, మీ పేరు రూపుమాసినప్పటికీ, మీ సర్వమూ అదృశ్యమైపోయినప్పటికీ, మీరు ధర్మాన్నే అంటిపట్టుకొని నిలబడతారా? దాన్నే అనుసరిస్తూ మీ గమ్యాన్ని చేరే వరకు స్థిర సంకల్పంతో పురోగమిస్తారా? “ఋషులు నిందించనీ, స్తుతించనీ; భాగ్యదేవతరానీ, లేదా తన తోవన తానుపోనీ, ఈనాడే మరణం వచ్చిపడనీ లేదా నూరేళ్ళ తర్వాత రానీ, సత్యమార్గంనుండి ఒక అంగుళమైనా తొలగని వాడే నిజంగా స్థిరచిత్తుడైన పురుషుడు” అని భర్తృహరి చెబుతున్నాడు. అలాటి సుస్థిరత్వం మీలో ఉందా? ఈ మూడూ మీలో ఉంటే మీలోని ప్రతివాడూ అద్భుతకార్యాలు చేయగలడు. మీరు వార్తా పత్రికలలో వ్యాసాలు వ్రాయనక్కర్లేదు, ఉపన్యాసాలిస్తూ అక్కడక్కడా తిరుగవలసిన అవసరంలేదు. మీ ముఖమే దేదీప్యమానంగా తేజరిల్లుతుంది. మీరు గుహలలో నివసిస్తున్నప్పటికీ మీ సంకల్పాలు రాతిగోడలను ఛేదించుకొని పోయి, శతాబ్దాలకొద్దీ లోకంలో అంతటా స్పందిస్తూ ఉంటాయి. అవి ఎవని మేధస్సులోనో నాటుకొని, అక్కడినుండి మరలా పనిచేస్తూ ఉంటాయి. సంకల్పశక్తి అలాంటిది. ఋజుత్వం మహిమ అలా ఉంటుంది. నిష్కల్మష దీక్షకు అలాటి సమర్థత ఉంటుంది.
బహుశా మీకు వేళదాటి పోతోందేమో! ఇంకొక మాటమాత్రం వినండి! నా దేశీయులారా! నా మిత్రులారా! నా బిడ్డలారా! ఈ జాతీయ నౌక కోట్లకొద్దీ జీవులను ఈ జీవన స్రవంతిమీద దాటిస్తూ వచ్చింది. అనేక శతాబ్దాలనుండి, ఇది ఈ నది మీద ఇటూ, అటూ తిరుగుతోంది. దాని సహాయంతో కోట్లకొద్దీ జీవులు ఆవలి ఒడ్డున చేరి నిత్యానందాన్ని పొందగలిగారు. కానీ నేడు మీ దోషంవల్లేకావచ్చు, ఈ పడవ కొంచెం ఓటిదైంది. దానికొక చిల్లుపడింది. అలా అని, దాన్ని మీరు నిందిస్తారా? ప్రపంచంలో ఏ ఇతర వస్తుమా ఇంత ఎక్కువగా పనిచేయలేదని మీకు తెలుసుకదా? అలాటి ఈ నౌకపై కోప్పడి, చెలరేగి దాన్నిగూర్చి అమంగళ వాక్యాలు పలకడం మీకు తగునా? ఈ జాతీయనౌకలో – ఈ మన సంఘంలో – రంధ్రాలున్నప్పటికీ మనం దాని బిడ్డలమేకదా? రండి, మనం వెళ్ళి ఆ రంధ్రాలను బాగుచేద్దాం! మన హృదయరక్తాన్ని ధారపోసి, ఆనందంతో ఆ కార్యాన్ని నిర్వర్తించుదాం! సాధ్యంకాకపోతే, ఆ పవిత్ర కృషిలోనే మనం మరణిద్దాం! మన మెదడులో బిరడాలను చేసి, ఆ పడవ రంధ్రాలను పూడ్చాలి. అంతేకానీ నిందారోపణ చేయడమా? వద్దు. వద్దు. ఎన్నటికీవద్దు. ఈ సంఘాన్నిగూర్చి నిర్దాక్షిణ్యంగా ఒక్కమాటైనా పలకొద్దు. దాని పూర్వఔన్నత్యాన్ని స్మరించి అయినా నేను దాన్ని ప్రేమిస్తాను. మీరంతా దేవతలబిడ్డలు కాబట్టి, గొప్ప మహిమకల పితరుల సంతానం కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను మిమ్మల్ని ఎలా దూషించగలను? ఎన్నడూ అలా చేయను. సమస్త ఆశీర్వాదాలు, సమస్త మంగళాలూ మీకు కలగాలి! నా బిడ్డలారా! నా కలలన్నీ మీకు చెప్పడానికై మీ దగ్గరికి వచ్చాను. మీరు వింటే, మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. మీరు నా మాటలను చెవినిపెట్టకపోతే, మీరు నన్ను తన్ని భారతదేశంనుండి వెళ్ళగొట్టినా, నేను తిరిగి తిరిగి వచ్చి, “అయ్యో! మనమందరం మునిగిపోతున్నాం. లేవండి లేవండి” అని మిమ్మల్ని ప్రబోధిస్తూనే ఉంటాను. నేనిప్పుడు మీతో, మీ మధ్య కూర్చొనడానికి వచ్చాను. మనం మునుగవలసి ఉంటే, అందరం కలిసే మునుగుదాం. అంతేగాని, ఎన్నడూ మన పెదవులనుంచి నిందావాక్కులు వెలువడకూడదు!