రామనాడులో రాజాగారు శ్రీ వివేకానందస్వాములవారికి ఈ క్రింది స్వాగతపత్రాన్ని సమర్పించారు.
పరమ పవిత్రమూర్తీ! శ్రీ పరమహంసా! యతిరాజా! దిగ్విజయ కోలాహల సర్వమత సంప్రతిపన్నా! పరమయోగీశ్వరా! శ్రీమత్ భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస కరకమల సంజాతా! రాజాధిరాజ సేవితా! శ్రీ వివేకానందస్వామీ! అవధారు.
సేతుబంధ రామేశ్వరం, రామనాధపురం, రామనాడు అని పేరు పొందిన ఈ చారిత్రక ప్రసిద్ధమైన ప్రాచీన సంస్థాన ప్రజలమైన మేము ఈ మన మాతృభూమికి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విదేశయాత్ర ముగించుకొని మీరీ భారతభూమిపై అడుగుపెట్టిన వెంటనే, తమ చరణకమలాలను మనసారా అర్చించగల్గిన మహాభాగ్యం లభించడం, నిజంగా మా అదృష్ట విశేషమే. అందులోనూ పురాణ పురుషుడు, మన ఇష్టదైవం అయిన శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శచే పావనమైన ఈ తీరంలో మీకు మున్ముందుగా పాదార్చన చేయగలగడం మా పురాకృత సుకృత ప్రాప్తంగా భావిస్తున్నాం.
అతిప్రాచీనం, పరమపావనం అయిన మన మతంయొక్క శ్రేష్ఠత్వమును, మహిమను, పాశ్చాత్య పండితవరుల మనస్సులకు నచ్చచెప్పే మీ గొప్ప ప్రయత్నాలకు చేకూరిన అసమాన విజయప్రాప్తిని వినిర్మలాభిమానంతోను, పరమ సంతుష్టితోను గమనించాం. హిందూమతం విశ్వజనీన మతాదర్శమనడానికి తగిన సర్వలక్షణ విరాజమానమై, సమస్త జాతులలోను, సర్వసంప్రదాయాల్లోనుగల స్త్రీ పురుషుల చిత్తవృత్తులకును, అవసరాలకును ఉపకరించగలదై ఉందని యూరప్, అమెరికాలలో పండిత సభలలో సుస్పష్టంగా, సవిమర్శంగా, అసమాన వచఃకౌశలంతో ప్రకటించి, వారికి నచ్చచెప్పారు. నిష్కామమైన ఉత్సాహంతో ప్రేరితులై, పరమపవిత్ర సంకల్పంతో పరవశులై అద్భుత స్వార్థత్యాగంపూని, శాంతి ధర్మ సందేశప్రవక్తవై భారతీయ వేదాంత విజయపతాకాన్ని యూరప్, అమెరికాలలోని ఉత్తమ క్షేత్రాలలో నాటడానికి అంతులేని మహాసముద్రాలను సైతం, యతివర్యులైన తాము దాటిపోయారు. విశ్వ సోదరత్వం ముఖ్యావశ్యకమనీ, అది సుసాధ్యమే అనీ, శ్రీవారు ఆచరణపూర్వకంగా సద్బోధల మూలంగా ప్రచారంచేశారు. అన్నిటికంటె పాశ్చాత్యదేశాల్లోని మీ పరిశ్రమ ఉపేక్షాపరులైన భారతీయులను మేల్కొలిపి, వారి ప్రాచీన మతంయొక్క ఘనతను, మహిమను వారి దృక్పథంలో పెట్టింది; అమూల్యమైన హైందవ మతధర్మాలను తెలుసుకొని, ఆచరించాలనే అకుంఠితాభిమానాన్ని పరోక్షంగా, వారి హృదయాల్లో పురిగొల్పింది.
పూర్వ, పశ్చిమవాసుల పారమార్థిక పునరుజ్జీవనానికై, శ్రీవారు ఔదార్యంతో, పూని నిర్వహిస్తున్న ఈ మహోద్యమానికి శ్రీవారిపట్ల మా హృదయాల్లో నిండిన సంతోషాన్ని కృతజ్ఞతను ప్రకటించడానికి సమర్థమైన శబ్దాలు మాకు స్ఫురించడం లేదు. శ్రీవారి ప్రియశిష్యవర్గంలో ఒకరైన మా రాజాగారిపట్ల పరమపూజ్యులైన మీరు సదాచూపుతున్న వాత్సల్యాన్ని, శ్రీవారు ప్రప్రథమంగా ఈ రాజ్యంలోనే ఓడదిగి, గౌరవించినందుకు రాజాగారు పొందుతున్న సంతోషాన్ని, అభిమానాన్నికూడ వర్ణించడానికి సాధ్యం కావడం లేదని మనవిచేయకుండా ఈ అభినందన పత్రాన్ని ముగింపజాలం.
శ్రీవారు ఎంతో సమర్థతతో ప్రారంభించిన ధర్మప్రచార కార్యాన్ని కొనసాగించడానికి కావలసిన దీర్ఘాయురారోగ్య జవసత్త్వాలను, శ్రీవారికి ప్రసాదించుగాక అని సర్వేశ్వరుని వేడుకొంటూ విరమిస్తున్నాం.
రామనాడు
25–1–1897
ఇట్లు,
భక్తి ప్రపత్తులతో నమస్కృతులర్పించే
శ్రీ పూజ్యపాదులవారి ప్రియశిష్యులు, సేవకులు
శ్రీ స్వాములవారు ఈ క్రింది విధంగా ప్రత్యుత్తరమిచ్చారు.
ఇక తెల్లవారదనుకొన్న రాత్రి మెల్లమెల్లగా గడచిపోతున్నట్లుంది. భరించరాని తీవ్రవేదన ఎలాగో ఉపశమిస్తున్నట్లనిపిస్తోంది. ఇంతకు ముందు శవంలాగా కనిపించిన ఆకృతి, నిద్రనుండి మేల్కొనబోయే విధంగా, సజీవంగా కానిపిస్తోంది. అదిగో వినండి. ఏదో శబ్దం వినిపిస్తోంది. చరిత్రగాని, పురాణగాథలుగాని, గతకాలపు ఆ అంధకారంలోనికి తొంగిచూడటానికైనా సాహసించజాలనంత దూరంనుండి వచ్చే ఆ వాదం ఎక్కడినుండో కాదు. ఇక్కడినుండే. భారతదేశంనుండే, మన మాతృభూమినుండే వెలువడి, అఖండ జ్ఞాన శీతగిరియొక్క, కర్మ, భక్తి, జ్ఞానశిఖరాల్లో మారుమ్రోగుతూ, మన దగ్గరకు వస్తోంది. ప్రశాంతమై, సుదృఢమై, విస్పష్టస్వరంతో కూడుకొన్నదై దినాలు గడిచేకొద్దీ పెరిగి, పెరిగి వినిపిస్తోంది. అదిగో చూడండి; అప్పుడే ఆ నిద్రపోయిన జనయిత్రి మేలుకొంటోంది. మంచుకొండనుండి వెలువడే పిల్లగాలి విధంగా, అది వట్టి పోయిన కండరాలలోనికి ఎండిపోయిన ఎముకలలోనికి జీవం పోస్తోంది. నిద్రమత్తు తేలిపోతోంది. అమ్మ మేలుకొంటోంది; మన దేశమాత దీర్ఘనిద్రనుండి మేల్కొంటోంది. గ్రుడ్డివాళ్ళుమాత్రం చూడజాలరు, కుత్సితబుద్ధులు చూడలేరు. అయితేనేం? ఇంక ఆమె నెవరూ ఆపజాలరు! ఇంక ఆమె నిద్రపోదు. ఇంక ఆమెను ఇతరులెవరు అడ్డుకోజాలరు. అదిగో ఆ అఖండ శక్తిస్వరూపిణి దిగ్గునలేచి నిలబడుతోంది.
రాజా! రామనాడు వాస్తవ్యులారా! మీరు, నన్ను ఇంత ఆదరంతో, ఇంత ప్రేమతో సన్మానించినందుకివే నా వందనాలు. నోటితో పలికే భాషకంటే, హృదయం, హృదయంతో ముచ్చటించడం గొప్ప కాబట్టి, మీకింత ఔదార్యం, ప్రేమ కలిగాయి. ఆత్మ, ఆత్మతో నిశ్శబ్దంగా మాట్లాడగలదు; అయినా, ఆ భాష సుస్పష్టమైందే. నా అంతఃకరణంలో నేను దాన్ని గ్రహిస్తున్నాను. రామనాడు రాజా! నా మాట నమ్మండి. పాశ్చాత్య దేశాలలో, మన మతాన్నిగూర్చిగాని, మన మాతృదేశాన్ని గూర్చిగాని, అల్పప్రజ్ఞుడనైన నా వల్ల ఏదైనా ఉపకారం జరిగితే మన ఇండ్ల దగ్గరగానే, మనకు తెలియకుండా లోతుగా పూడ్చిపెట్టబడి, తరతరాలుగా పడివున్న అమూల్య రత్నరాసులవైపు భారతీయుల దృష్టిని మరల్చడానికి ప్రయత్నించే నా యత్నంలో ఏమాత్రమైనా సఫలమైతే దగ్గరలో నీరున్నదని తెలియక, గ్రుడ్డివారై దప్పికవల్ల చావడంకంటే, ఎక్కడికోపోయి మురికి గోతుల నీరు త్రాగటంకంటె తమ గృహాల ప్రక్కనే నిరంతరం ప్రవహిస్తున్న, స్వచ్ఛ జలధారల దగ్గరికి వెళ్ళి తృప్తిదీరా త్రాగండని వారికి త్రోవచూపగలిగిన వాడినయ్యానంటే భారతదేశంలో ప్రతి విషయంలోను, మతమొక్కటే, ప్రాణాధారమనీ, అది నష్టమైతే, రాజకీయ తంత్రాలెన్ని చేజిక్కినా, సంఘ సంస్కరణలెన్ని సాగినా, ప్రతి భారతీయుని నెత్తిమీద కుబేర సంపదలు వచ్చి ఒరిగిపడినాకూడ, భారతమాతకు మరణం తప్పదని తెలిపి, మన సోదరులను, కార్యోన్ముఖులను చేయడంలో, ఏమైనా ఫలితం కనిపించిందంటే భారతదేశమేకాక ఇలాంటి కృషి జరిగిన ప్రతి ఇతర దేశంకూడ ఓ రామనాడురాజా! మీ పట్ల కృతజ్ఞతను చూపవలసి ఉంటుంది. ఎందుకంటే, ఇట్టి సంకల్పాన్ని మొదట నాకు కలిగించింది మీరే! జరుగనున్న దాన్ని దివ్యదృష్టితో మీరు గ్రహించినట్లుగా, నా చేయిపట్టుకొని, ఎప్పుడూ అండగా నిలిచి, నన్ను నిరంతరమూ ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి నా విజయాన్ని గూర్చిన ఆనందోత్సవం జరపడంలో మీరు మొదటివారు కావడం ఉచితమే. నేను, భారతదేశానికి మొదటగా, మీ సంస్థానపు పొలిమేరలపై అడుగుపెట్టడమూ సమంజసమే.
ఇప్పుడు గొప్పగొప్ప కార్యాలు జరుగవలసి ఉన్నాయి. అద్భుత శక్తులు పనిచేయవలసి ఉన్నాయి. మీరు ఇదివరకే తెలిపినట్లు, ఇతర దేశీయులకు మనం చాలా విషయాలను నేర్పవలసి ఉన్నాం. పారమార్థికతకు, వేదాంతానికి, సంఘనీతికి, సాధుత్వానికి, ప్రియవర్తనకు, ప్రేమకు ఇదే మాతృభూమి. అవి నేడుకూడా సజీవమై ఉన్నాయి. ఈ విషయాలలో ప్రపంచంలోని అన్ని దేశాలలోను, భారతదేశం ప్రధానమనీ, మొదట నిలువదగిందనీ, ధీరుడినై నిలిచి సాహసంతో పలకడానికి నా ప్రపంచానుభవం అర్హతనిస్తోంది. ఈ చిన్నసంఘటనను గమనించండి. గడిచిన, నాలుగైదు సంవత్సరాలలో గొప్పరాజకీయ సంస్కరణలు జరిగాయి. ఆయా దేశాలలో ఇప్పుడున్న వ్యవస్థలను పూర్తిగా తలక్రిందులు చేయడానికి పూనుకొని, కొంతకొంత ఫలాన్ని సాధిస్తూ, పాశ్చాత్య ప్రపంచమందంతటా, మహోద్యమాలు పనిచేస్తున్నాయి. వాటిని గురించి ఏమైనా విని ఉన్నారేమో, మన సోదరులను అడగండి; వాటినిగూర్చి, ఒక్కమాటైనా, వీరు విని ఉండరు. అయినా షికాగో నగరంలో, ఒక మహాసభ జరిగిందనీ, ఆ మహాసభకు భారతదేశంనుండి ఒక సన్యాసి వెళ్ళాడనీ, అక్కడ చాలా ఆదరించబడ్డాడనీ, అప్పటినుండి, పాశ్చాత్య దేశాలలో ప్రచారం సాగుతోందనీ, ఇక్కడ నిరుపేదకుకూడా తెలుసు. మన సామాన్యప్రజలు మూఢులనీ, వారికి చదువుపట్ల ఇష్టంలేదనీ, ఏ విషయమైనా తెలిసికోవడానికి ఇష్టపడరనీ, చెప్పగా వింటూవచ్చాను. ఒకానొకప్పుడు ఈ అభిప్రాయం నాకూ ఉండేది. గొప్పగొప్ప ఊహాకల్పనలకన్నా, ప్రపంచ సంచారులు కువిమర్శకులు వ్రాసిన ఏ పుస్తక రాసులకన్నా, స్వానుభవం మహోత్తమ గురువని గ్రహించాను. భారతీయులు మూఢులు కారనీ, మందబుద్ధులు కారనీ, ఏ ఇతర జాతికీ తీసిపోని జ్ఞానసముపార్జనాశక్తి కలవారే అనీ, నా అనుభవం నాకు తెలుపుతోంది. కానీ, ప్రతిజాతికీ నిర్వహించవలసిన కర్తవ్యమొకటుంది. ప్రతిజాతికీ స్వభావసిద్ధంగా, పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వమూ, ప్రత్యేక లక్షణాలూ ఉంటాయి. ఈ నానాజాతి రాగసమ్మేళనంలో ప్రతిజాతీ ఒక్కొక్క విశిష్టస్వరం. ఆ విశిష్టతే దాని ప్రాణం; దానికి ఆయువుపట్టు. అది ఆ జాతికి వెన్నెముకలాంటిది. ఆ జాతి జీవసారానికి అదే మూలాధారం, ఉత్పత్తి స్థానం. ఇతరులు రాజకీయాలను గూర్చి ప్రసంగింతురుగాక! వర్తకంవల్ల తమకు వచ్చిపడే ధనరాసుల్ని లెక్కించుకొని మురియుదురుగాక! వ్యాపారమూలంగా తమకు చేకూరిన అధికార వ్యాప్తినిగూర్చి గర్వింతురుగాక! వ్యాపారమూలంగా తమకు చేకూరిన అధికార వ్యాప్తినిగూర్చి గర్వింతురుగాక! ఐహిక స్వాతంత్ర్య సంపదనుగూర్చి ప్రగల్భాలు పలుకుదురుగాక! కానీ, ఇవి భారతీయునికి అర్థంకావు. అర్థం చేసుకోవడానికి అతడు ప్రయత్నించడు. వేదాంతం, మతం, భగవంతుడు, జీవుడు, బ్రహ్మం, మోక్షం మొదలైన వానినిగూర్చి పరీక్షిస్తే ఇతర దేశాల్లో తత్త్వవిదులని పేరుగాంచిన చాలామందికంటే, మనదేశంలోని మామూలు సేద్యగానికికూడ ఎక్కువ తెలిసివుంటుంది. ఇది యథార్థం. ఆర్యులారా! మనం ప్రపంచానికి కొంత బోధింపవలసి ఉన్నామని చెప్పాను. ఈ కారణం చేతనే ఈ ఈశ్వరేచ్ఛవల్లనే, మన జాతికి శతాబ్దాలకొద్దీ మహోపద్రవాలు తటస్థించినా, దాదాపు వెయ్యి సంవత్సరాలుగా విదేశీయుల పాలన క్రింద పడివున్నా, పరదేశీయులు మనల్ని ఎంతగా అణగద్రొక్కుతున్నా, ఈ మన జాతి, ఇంకా సజీవంగా నిలిచివుంది. దీనికి చావులేదు. ఇది అమరం. ఇది భగవంతునిపట్ల ప్రపత్తిగల్గి, మత ధర్మానికీ, ఆధ్యాత్మిక జ్ఞానానికీ పుట్టినిల్లుగా ఉండటమే ఇందుకు కారణం.
పాశ్చాత్య జాతులూ, ఇతర జాతులుకూడ, ఇప్పుడు మితిమీరిన రాజ్యాధికార వాంఛలతోను, సాంఘిక కుతంత్రాలతోను, విసిగివేసారి, సగంచచ్చి అధోగతిలో పడివున్నారు. వారికి ప్రాణంపోసి, నూతనోజ్జీవం కల్పించగల మహాశక్తి ప్రపంచమంతటా వెల్లువలై ప్రవహించాల్సిన మతధర్మాల, సత్యాత్మతత్త్వాల మూలశక్తి ఇక్కడే ఉంది. భారతదేశ వాతావరణమంతా నిండి హోరున పైకెగుస్తున్న ఈ అనురూప, నిరూప నానా విధ శబ్ద ఘోషలనుండి, ఒక్క పలుకు పరమోత్కృష్టం, ప్రస్ఫుటం, పరిపూర్ణం అయి వినిపిస్తోంది. అది ‘త్యాగం’ అనే శబ్దం. త్యాగం చేయండి. భారతదేశ మత ధర్మాలన్నిటికీ ఇది మూలమంత్రం. ఈ ప్రపంచం మూడునాళ్ళ ముచ్చట. ఈ ప్రస్తుత జన్మ క్షణభంగురం. ఆవల ఈ బూటకపు ప్రపంచాన్నిదాటి దూరంగా అఖండ బ్రహ్మం వెలుగుతోంది. దాన్ని వెదుకుతాము గాక! ఈ విశాల జగత్తును సైతం, చిన్న బురదగుంటగా భావించే సాహసులైన వీరులు, మేధావంతులగు ఋషిశ్రేష్ఠులు, ఈ ఖండంలో తేజరిల్లారు. వీరు, ఈ విశ్వాన్నిదాటి ఆవల చాలాదూరం వెళ్ళారు. అనంతమైన కాలంసైతం వారికి లెక్కలేదు. కాలాన్ని దాటి, కాల పరిమితుల్ని అతిక్రమించి, వారు చాలా దూరం పోయారు. ఆకాశం వారికి లెక్కలేనిదైంది. దానినికూడ వారు దాటిపోజూచారు. ఈ వికారమయ ప్రపంచాన్ని దాటి ఇలా పోవడమే మతధర్మసూక్ష్మం. ఈ అతీతభావనే సర్వం అతిక్రమించిపోయే ఈ ప్రయత్నమే ప్రకృతి ముఖాన్ని కప్పిపెట్టిన ముసుగును చిందరవందరగా చించివేసి, ఏమైనాసరే, ఏమి కలిగినాసరే, ఆ పరమందున్న దాని జాడను కనుగొని తీరాలనే దీక్షే ఈ జాతి విశిష్ట లక్షణం. ఇది మన పరమధర్మం. కాని, ఒక దేశంలోని ప్రజలందరూ, నిండుత్యాగం పూనజాలరనడం కూడ సత్యమే. అయినా, త్యాగం పూనేవారికి ఉత్సాహం కలుగజేయదలిచితే అలా చేయడానికి మార్గముంది. రాజకీయాలగూర్చి, సంఘ పునరుద్ధరణ గూర్చి, మీరు చేసే ప్రసంగాలు, ధనార్జనకు, వాణిజ్యానికి ఉపకరించే మీ బోధలు ఇట్టివన్నీ, బాతు వీపుమీద పోసే నీటిలాగా, అప్పుడప్పుడే జారిపోతాయి. కాబట్టి, మీరు ప్రపంచానికి బోధించవలసింది ఈ త్యాగతత్త్వమే! ఇక మనంకూడ నేర్చుకోవలసిందేమైనా ఉందా? ఈ ప్రపంచం నుండి, మనం ఏమైనా గ్రహించవలసివుందా? బహుశ ఒకింత భౌతిక శాస్త్రజ్ఞానం, సంఘనిర్మాణ కౌశలం, ప్రకృతిశక్తులను వశంచేసికొని ప్రయోగాలనుచేసే విధానం, స్వల్పాధారం నుండి ఘనతరఫలం పొందగలయుక్తిని మనం కొంచెం నేర్చుకోవలసి ఉంటుంది. సరే, దీన్ని కొంతవరకు పాశ్చాత్యులనుండి నేర్చుకొందాం. అంతేకానీ, ఈ భారతదేశానికి వచ్చి “తినడం, త్రాగడం, వినోదాలతో కాలక్షేపం చేయడం మాత్రమే” పురుషార్థంగా బోధించాలనుకున్నవాడు, ఈ జడప్రపంచాన్నే పరమదైవతంగా రూపించాలని చూపేవాడు అట్టివాడెవడైనా మోసగాడే. అలాంటి వారికీ పుణ్యభూమిలో చోటులేదు. వానినుండి, అటువంటిదానిని నేర్చుకోవడానికి భారతీయుని మనస్సొప్పదు. పాశ్చాత్య నాగరికతలోని మెరుపులు, తళుకులు కన్నులను ఎంతగా మిరుమిట్లు గొలుపుతూన్నా, దాని అధికార ప్రాబల్యం ఎంత విశాలమైనా, అదంతా నిష్ఫలమే అని ఈ వేదికపై నిలిచి మొగమాటంలేక వారికి తెలుపుతున్నాను. అదంతా వ్యర్థం, బూటకం. భగవంతుడొక్కడే సత్యం, ఆత్మ ఒక్కటే నిత్యం, ఆధ్యాత్మమే శాశ్వతం; దాన్ని వదలక పట్టుకొని ఉండండి.
అయినా ఈ శ్రేష్ఠ సత్యాలను అవలంబించడానికింకా పక్వదశకు రానివారు మనలో అనేకులున్నారు. కాబట్టి మన అవసరాలకు తగినంత ఒకింత ప్రాపంచిక భోగాలు అలాంటివారికి కొంచెం ఉపయోగపడుతాయేమో? ప్రతిదేశంలోను, ప్రతి సంఘంలోను, ఒక్క పొరపాటు కనపడుతోంది. ఆ విషయం బాగా తెలిసిన భారతదేశంలో సైతం ఆ పొరపాటే జరుగుతూండటం మిక్కిలి శోచనీయం. ప్రస్తుతం అర్హతలేని ప్రజలకు బలాత్కారంగా అత్యుత్తమ పారమార్థిక ధర్మాలను ఉపదేశించడం ఇటీవల ఆచారమైపోయింది. నా మార్గం మీ మార్గం కాకపోవచ్చు. సన్యాసం భారతీయ జీవితానికి పరమాదర్శమని మీకందరికి తెలుసు. ప్రతివానికీ, మనశాస్త్రాలు ‘త్యాగాన్ని’ విధిస్తున్నాయి. ఈ ప్రాపంచిక భోగాలను అనుభవించిన ప్రతిహిందుమా తన జీవితంలో వైరాగ్యాన్ని పూని తీరాలి. అలా చేయనివాడు హిందువేకాడు. తాను హిందువునని చెప్పుకోడానికి వానికి అర్హతలేదు. ఈ ప్రపంచ భోగాల బూటకాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తర్వాత, వానిని త్యాగం చేయడం పరమాదర్శమని మనకు తెలుసు. ఈ జడప్రపంచం లోపలడొల్ల అనీ, దాని లోపలుండేది బూడిదే అనీ, గ్రహించి, విడిచివేసి వెనక్కి మరలాలి! మనస్సు ఇంద్రియాల వెంబడి సుడులు తిరుగుతూ, వెలుపలికి పోతున్నది. ఆ మనస్సు అంతర్ముఖం కావాలి! ప్రవృత్తి ఆగిపోవాలి; నివృత్తి ఆరంభం కావాలి; అదే ధర్మం. కానీ ఈ ఆదర్శంలో కొంత అనుభవం కలిగిన తర్వాత మాత్రమే గ్రాహ్యంకాగల వైరాగ్య ధర్మాన్ని పసివానికి నేర్పలేము. పసివాడు ఆవేశపరవశుడై జన్మిస్తున్నాడు. వాని జీవితమంతా, వాని ఇంద్రియాలలో ఉంటుంది. వాని జీవితమంతా ఒక ఇంద్రియభోగరాశి. అట్లే ప్రతి సంఘంలోను పసివాళ్ళను పోలిన పురుషులుంటారు. వారికి కొంత అనుభవం కావలసి ఉంటుంది. కొంత భోగాన్ని అనుభవించిన తర్వాతనే, వారు దాన్ని బూటకమని గ్రహించగలరు. అప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది. అటువంటివారికి తగినంత అవకాశాన్నివ్వాలని, మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఇటీవల, దురదృష్టవశాత్తు సన్యాసి ఏ ధర్మాలచే కట్టుబడి ఉంటాడో, ఆ ధర్మాలతోనే ప్రతివాడూ కట్టుబడి ఉండేతీరు బయలుదేరింది. అది పెద్దపొరపాటు. ఈ పొరపాటే లేకపోతే, మన దేశంలో అంతటా కనిపించే దరిద్రం, దైన్యం చాలావరకు తగ్గివుండేవి. అత్యున్నతమైన ఈ ఆధ్యాత్మిక, నైతిక ధర్మాలు, పేదవాని జీవితాన్ని అన్నివైపులా ఆవరించి ఉన్నాయి. వీటివల్ల ఈ దరిద్రునికి ప్రయోజనం లేదు. అలాంటి బంధాల్ని తొలగించి వేయండి. పాపమా దరిద్రుని ఒకింత సుఖాన్ని అనుభవించనివ్వండి. అప్పుడతను తనంతట తానే, ఉత్తీర్ణుడౌతాడు. ఆ తర్వాత వైరాగ్యం దానంతటదే వస్తుంది. ఈ విషయంలో పాశ్చాత్యులనుండి, మనం కొంతవరకు నేర్చుకోవాలి. కాని ఇలాంటి విషయాలు నేర్చుకోవడంలో జాగ్రత్త చాలా అవసరం. ఈ పాశ్చాత్య భావాలను అలవరచుకొన్న వారందరిలోను, దాదాపు భ్రష్టులను చూస్తున్నామని తెలుపడానికి విచారపడుతున్నాను.
భారతదేశంలో మన ముందంజను నిరోధించే భయంకరమైన రెండు ఆపదలున్నాయి. ఒకటి పూర్వాచారపరాయణత; ఇది ఆరుతలల భయానక జీవిలాంటిది. రెండోది ఆధునిక యూరప్ నాగరికత. ఇది లోతైన సుడిగుండాన్ని పోలింది. ఈ రెండిటిలో ఈ పూర్వాచార పరాయణతే మేలని ఒప్పుకొంటాను. యూరప్ వారి పద్ధతినిమాత్రం ఒప్పుకోజాలను. ఏలనంటారా? పూర్వాచారాన్ని అనుసరించేవాడు, తెలివి తక్కువవాడు కావచ్చు; మోటువాడు కావచ్చు; కాని వానిలో పురుష లక్షణముంది. వానిలో భక్తి ఉంది. బలముంది అతడు స్వతంత్రుడు. ఇక యూరపియన్ పద్ధతిని అవలంబించేవాడో? చంచలుడు, అస్వతంత్రుడు, గాఢపరిజ్ఞాన శూన్యుడు. అతడు ఎక్కడ దొరికితే అక్కడ తన చేతికందిన భావాలను పోగుచేసుకొని, వికటస్వరూపి అయివుంటాడు. ఈ భావాలను అతడు జీర్ణం చేసుకోడు. అవి వానిలో ఇమడవు. వానికి సరిపడవు. అతడు తన కాళ్ళపై తాను నిలబడలేడు. వాని తల గిరగిర తిరిగిపోతుంటుంది. వాని కర్మలకు సంకల్పశక్తి ఎక్కడిది? ఆంగ్లదేశీయులు, దయచూచి వీపు తడితే వానికి చాలు. యూరపియన్ల మెప్పుకోసం ఏవో కొన్ని సాంఘికదురాచారాలను నోటికి వచ్చినట్లంతా తిట్టి, తన సంఘ సంస్కరణాభిమానాన్ని ప్రదర్శించుకొంటాడు. అతడు మన ఆచారాలలో కొన్నింటిని చెడ్డవనడం కేవలం యూరపియన్లు అలా చెబుతున్నారు కనుకే అతడిచ్చే సమాధానమూ ఇంతే; నా కిట్టివి గిట్టవు. నీ స్వశక్తిపైనే ఆధారపడి నిలిచి చచ్చినా మేలే. ప్రపంచంలో పాపమేదైనా ఉంటే, అది దౌర్బల్యమే. అన్ని విధాలైన దౌర్బల్యాలను తొలగించుకోండి; దుర్బలత పాపం. దుర్బలతే మృత్యువు. ఈ దుర్బల చంచలాత్ములను మానవులనడమే తప్పు. సరే వీరిని పురుషులని, స్త్రీలని, పశువులని ఏమని పిలవాలి? కాని ఈ పూర్వాచార పరాయణులో, వీరు పట్టుదల కలవారు; పురుషులు. అటువంటవారింకా ఉన్నారు. అట్టి ఒకరిని మీకిప్పుడు చూపుతాను. ఇదుగో, వారు మీ రామనాథపుర రాజాగారే. వీరిని మించిన శ్రద్ధావంతులైన హిందువును మరొకరిని ఈ దేశంలో అంతటా వెదకినా మీరు చూడబోరు. పూర్వ, పశ్చిమ దేశాల రెండు రీతుల విశేషాలను సంపూర్ణంగా తెలిసికోవడంలోగాని, ప్రతి జాతినుండి శ్రేష్ఠమైన విషయాలను అవకాశమున్నంత వరకు స్వీకరించడంలోగాని, ఈ దేశంలో ఇంకే రాజైనా మీ రాజును మించజాలడు. అలాంటి రాజు మీకు లభించాడు. ‘ఉత్కృష్ట జ్ఞానాన్ని పూర్ణశ్రద్ధతో తక్కువ జాతినుండి అయినా స్వీకరించు – మోక్షమార్గాన్ని పంచమునివల్ల లభించనున్నా, వానికి సేవలుచేసి తెలుసుకో! రత్నంతో సమానమైన కన్య అంత్యజాతిలోని హీనకుటుంబంలో ఉన్నా ఆమెను పెళ్ళి చేసుకో!’ అసమాన మహనీయమూర్తి, ఉత్తమ ధర్మ స్మృతికర్త అయిన మనువు శాసన మీ విధంగా ఉంది. ఇది సత్యం. మీ కాళ్ళపై మీరు నిలవండి. మీకు అలవి అయిన దాన్ని జీర్ణించుకోండి. ప్రతి జాతినుండి జ్ఞానాన్ని స్వీకరించండి. మీకు మేలు కలిగించేదాన్ని పరిగ్రహించండి. అయినా మనం హిందువులం. కాబట్టి సర్వమూ, మన జాతీయ ధర్మాలకు లోబడే జరుగవలసి ఉంటుంది. ప్రతి నరునికి ఒక జీవిత పరమార్థం ఉంది. అది వాని, అనంతపూర్వ కర్మ ఫలితార్థం. మీలో ప్రతివాడు అత్యద్భుతమైన పిత్రార్జిత సంపదతో పుట్టివున్నాడు. అది మీ భవ్య జాతీయజీవనపు అఖండ పూర్వార్జిత కర్మఫలమే. లక్షలకొద్దీ మీ పితరులు మీ ప్రతికార్యాన్ని కనిపెట్టి చూస్తున్నారని గ్రహించి జాగరూకులై మెలగండి. ప్రతి హిందూబాలుడు పుట్టునపుడు తనతో తెచ్చుకొనే నిర్ణీత కర్తవ్యమేది? బ్రాహ్మణ జన్మనుగూర్చి మనువు ఏమని ధీరంగా ప్రతిజ్ఞ చేశాడో మీరు చదవలేదా? బ్రాహ్మణజన్మ “ధర్మమనే ధనాగారం రక్షణకోసం” అని ఆయన రాశాడు. ఈమాట, ఈ పుణ్యభూమిలో జన్మించే బ్రాహ్మణునికేకాక ప్రతివానికీ జీవిత పురుషార్థమని నేను చెబుతున్నాను. “ధర్మమనే ధనాగారం రక్షణకోసం” అనే మాటలను గుర్తుపెట్టుకోండి. మన జీవితమందలి ఇతర సమస్యలన్నీ, ఈ ఏకైక సూత్రానికి లోబడి ఉండవలసిందే; సంగీతంలో లయ సామరస్య సూత్రంకూడ ఇటువంటిదే. రాజకీయాధికారం ప్రధాన జీవితధర్మంగా కల ఒకజాతి ఉండవచ్చు. ఆ ముఖ్య జీవిత ధర్మానికి వారి మతం, వారి సర్వమూ లోబడి నడువ వలసినవే. ఆధ్యాత్మజ్ఞానం, వైరాగ్యం ప్రధాన జీవనధర్మంగా కలిగి ‘ఈ ప్రపంచమంతా బూటకం; మూణ్ణాళ్ళ ముచ్చట’ అనే ధర్మసూత్రంపై నడుస్తున్న మరోజాతి, మన జాతి ఉంది. సర్వమూ ప్రకృతి శాస్త్రాలుగాని, కళలుగాని, భోగాలుకానీ, అధికారాలుకాని, సంపదలుగాని, పేరుగాని, ప్రతిష్ఠలుగాని – ఆ ఒక్క ధర్మానికి లోబడిపోవలసినవే. భారతీయుని శీలంలోని రహస్యమిది. ప్రతి హిందూశిశువుకు సహజమైన ఈ ఒక్క ప్రధాన ధర్మానికి అంటే పారమార్థికతకు, జాతి పవిత్రతకు అతని సర్వస్వం లోబడవలసిందే. అదే, వాని జాతీయ జీవనానికి కీలకం! ఆధ్యాత్మికత అనే జాతీయ జీవనస్రవంతిని తన సర్వస్వంగా పెట్టుకొన్న పూర్వాచారపరాయణుడు ఒక పక్షంలో, ఆధ్యాత్మిక సూత్రాన్ని విడిచి, పాశ్చాత్యులనుండి బిచ్చంగా కొనిన కృత్రిమ భావాలను అమూల్యంగా ఎంచేవారు ఇంకో పక్షంలో ఉన్నారు. వీరిద్దరిలో పూర్వాచారపరుడైన మొదటివానినే ఇక్కడున్న ప్రతివాడూ అభిమానిస్తాడనడంలో నాకు సంశయంలేదు. ఎందుకంటే వానిలో మనం విశ్వాసముంచవచ్చు. జాతిధర్మం అనే పట్టుకొమ్మ వానికుంది. కాబట్టి అతడు సజీవుడై నిలువగలడు. కాని, ఆ రెండవ పురుషునకో? మరణమేగతి. ఎవనిదైనా ఆయువుపట్టు చలించనంతవరకు, వాని జీవక్రియ సురక్షితంగా ఉన్నంతవరకు, ఇతరములైన ఇంద్రియక్రియలకు హాని కలిగినా, ప్రమాదంలేక ఆ వ్యక్తి బ్రతక గలుగుతాడు. వ్యక్తి జీవన విధానంలోనే, మన జాతీయ జీవనధర్మం సురక్షితంగా ఉండేవరకు, మన జాతిని ఏదీ నాశనం చేయలేదు. కానీ నా మాటలను గుర్తుపెట్టుకోండి; ఆధ్యాత్మికతను జారవిడిచారంటే, దానిని ఆవల త్రోసివేసి పాశ్చాత్యుల ప్రాపంచిక నాగరికత వెంటబడ్డారంటే, దాని ఫలితార్థంగా మూడుతరాలలో మీ జాతి వినాశనం చెందుతుంది. మీ జాతీయ భవంతి పునాదులు సడలిపోయి మీ జాతి సర్వనాశనమవుతుంది.
కాబట్టి స్నేహితులారా! దీన్ని తప్పించుకొనే మార్గం ఒక్కటే ఉంది. ఈ ఆధ్యాత్మికతను మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. మన ప్రాచీనులు మనల్ని అనుగ్రహించి ఇచ్చిన అమూల్య వరప్రసాదమిదే. ఏ దేశమందైనా మహాచక్రవర్తులు సైతం తమకు గోత్రపురుషులుగా రాజులనుగాని, కొండకోనలలో నివసించే నిస్సహాయులైన మార్గస్థులను దోచుకొంటూ వచ్చిన గజదొంగలనుకాని పేర్కొనక, సగం దిగంబరులై అడవులలో వాసంచేస్తూ వచ్చిన, సాధువులను పేర్కొనడాన్ని మీరెక్కడైనా విన్నారా? అటువంటి భూమి పేరును మీరెన్నడైనా విన్నారా? ఆ దివ్యభూమి ఇదే సుమండీ! ఇతర దేశాలలో గొప్ప మతగురువులు, ఎవడో ఒక రాజు తమ గోత్రపురుషుడని ఋజువుచేయ ప్రయత్నిస్తారు. కాని ఇక్కడో? మహారాజులు సైతం ఎవడో ఒక పురాణఋషిని తమ గోత్రపురుషునిగా చెప్పుకొంటారు. కాబట్టి మీకు ఆధ్యాత్మిక ధర్మంలో నమ్మకమున్నా లేకపోయినా, జాతీయజీవనం కోసమైనా మీరా ధర్మాన్ని చేపట్టి దాన్ననుసరించాల్సివుంది. ఆ తర్వాత రెండవ చేతిని చాచి, ఇతర జాతుల నుండి, మీకు లభ్యమైనదంతా సంపాదించుకోండి. కాని, ఆ సర్వమూ మీ ఏకైక జాతీయ ధర్మానికి లోబడేలా చేయవలసే ఉంటుంది. ఆ మార్గంలోనే అద్భుతంగా మహిమాఢ్యంగా, భావిభారతభూమి ప్రకాశించనుంది. ఆ దివ్యప్రకాశ చిహ్నాలు ఇప్పుడే కన్పిస్తున్నాయని నా నమ్మకం. అది ప్రాచీన భారతంకంటే ఉజ్జ్వలమై ప్రకాశిస్తుంది. పూర్వపు ఋషులందరికంటె, గొప్పవారైన ఋషులు పుట్టనున్నారు. మీ పితృదేవతలు సంతృప్తులు కావడమేకాకుండా, తమ తమ లోకాలనుండి క్రిందికి చూస్తూ, తమ సంతానం మహాతేజోవంతులు, మహాపురుషులు కావడాన్ని చూచి వారెంతో సగర్వంగా ఆనందిస్తారని నా నిశ్చయం.
కాబట్టి మనమందరం శ్రమపడి పనిచేద్దాం. ఇది నిద్రపోవడానికి సమయంకాదు. భావి భారతోదయం మన చేతలపై ఆధారపడి ఉంటుంది. ఆ తల్లి సంసిద్ధంగా వేచివుంది. ఆమె కొంచెంగా కునుకుతూంటే ఏమి? లెండి! మేలుకోండి!! అదిగో సనాతన ధర్మసింహాసనంపై, నవయౌవనంతో పూర్వంకంటె దేదీప్యమానంగా వెలుగుతూ, మన దేశమాత ఆసీనురాలై ఉంది. కళ్ళు తెరచిచూడండి! ఆ భగవత్ స్వరూపం, మన మాతృదేశంలోలాగా ఇంత ప్రస్ఫుటంగా మరి ఎక్కడా ప్రకాశించలేదు. మరెక్కడకూడ ప్రజలు భగవంతుని ఇలాంటి రూపంలో భావించి ఎరుగరు. ఒకవేళ నా ధీరోక్తులను విని, మీరు ఆశ్చర్యపడవచ్చు. మనకు గల భగవద్భావనకు సమానమైన భావనను ఇతరుల మత గ్రంథాలలో ఎక్కడైనా చూపండి! వారికున్నవి గోత్ర దేవతలు మాత్రమే. యూదుల దేవుడు, అరబ్బుల దేవుడు, ఈ కులదేవతగానో, ఆ కులదేవతగానో ఉన్నారు. పైగా ఒకరి కులదేవత తక్కినవారి కులదేవతలతో సదా పోరు సలుపుతూంటుంది. కాని మన తల్లియై, మన మిత్రుడై, మన సుఖాలకు సఖుడై, మన ఆత్మలకు పరమాత్మయై ఒప్పే, మన దేవుడు సర్వ శుభం కరమూర్తి! అపార కరుణాస్వరూపి! ఇలాంటి భగవద్భావన ఇక్కడే. ఈ భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. శైవులకు శివుడు, వైష్ణవులకు విష్ణువు, కర్మపరాయణులకు కర్మదేవత, బౌద్ధులకు బుద్ధుడు, జైనులకు జినుడు, క్రైస్తవులకు, యూదులకు యోహోవా, ప్రతి సంప్రదాయానికి ఆ సాంప్రదాయక దేవత, వేదాంతులకు బ్రహ్మంగా ఉండే ఆ సర్వేశ్వరుడు ఈ దేశంలో మాత్రమే పూర్ణతేజస్సుతో ప్రకాశిస్తాడు. ఆ సర్వవ్యాపి మనల్ని ఆశీర్వదించనీ! మనకు అండగా నిలువనీ! మనకు బలాన్ని ప్రసాదించనీ! ఈ దివ్యభావాన్ని ఆచరణలో పెట్టగల సాహసాన్ని మనకివ్వాలి! మనం విన్నవీ, మనం చదివిందీ, మనలో సంస్కార రూపంలో ఉండాలి! అది మనకు సత్యమై నిలవాలి! మనం పరస్పర సహాయం చేసుకోవడానికి అది శక్తిరూపిణి అయి చెలరేగనీ! మనం ఒకరిని గురించి ఒకరం అసూయాపరులం కాకుండాలి! శాంతి, శాంతి, శాంతి హరినామంలో శాంతి ప్రకాశించనీ!!