తరువాత శ్రీ స్వాములవారు, శ్రీ రామేశ్వరాలయాన్ని సందర్శించారు. అక్కడ సమావేశమైన ప్రజలు, కొన్ని మాటలు చెప్పవలసిందిగా శ్రీ వివేకానందస్వాములవారిని ప్రార్థించారు. వారి వేడుకోలును మన్నించి శ్రీవారిలా ప్రసంగించారు:
మతమనేది ప్రేమలోను, భక్తిలోను ఉంటుందిగాని, బాహ్యార్చనలలో కాదు. అది హృదయంలోని నిర్మలం, నిష్కపటం అయిన ప్రేమలో ఉంటుంది. నరుడు శరీరంలో, మనస్సులో పరిశుద్ధుడైతే తప్ప దేవాలయానికి రావడంవల్ల, శివుని పూజించడం వల్ల ఫలితం కలుగదు. మనస్సులో, శరీరంలో పరిశుద్ధులైన వారి ప్రార్థనలకు శివుడు ప్రతిఫలమిస్తాడు. తాము అపవిత్రులుగా ఉండీ, ఇతరులకు ధర్మబోధ చేయజూడటం చివరికి వ్యర్థమవుతుంది. బాహ్యపూజ ఆంతరంగిక పూజకు సంకేతం. అంతరంగిక పూజ, చిత్తశుద్ది, వాస్తవంగా కావలసినవి. అవి లేకపోతే బాహ్యపూజ నిరర్థకం. కాబట్టి మీరందరూ దీన్ని జ్ఞప్తిలో ఉంచుకోండి.
ఈ కలియుగంలో జనులు తాము ఏమిచేసినా సరే, ఒక పుణ్యక్షేత్రానికి పోయినమాత్రాన, తమ పాపాలన్నీ క్షమించబడతాయని నమ్మేంత అధోగతిలో పడిపోయారు. కల్మష హృదయంతో, దేవాలయంలో అడుగుపెట్టినవాడి పాపాలు ఇంకా పెరిగి మరింత పాపి అవుతాడు. తీర్థమంటే, పవిత్ర విషయాలతో, పవిత్ర పురుషులతో నిండివున్న స్థలమని అర్థం. కాని పవిత్ర జనులున్న స్థలంలో దేవాలయం లేకున్నా తీర్థమే అవుతుంది. నూరు దేవాలయాలున్న స్థలాన్ని దుష్టజనులు చేరితే అక్కడి పవిత్రత అదృశ్యమవుతుంది. తీర్థక్షేత్రంలో కాపురముండటం చాలాకష్టం. ఎందుకంటే, సామాన్య స్థలాల్లో చేసిన పాపాన్ని సులభంగా పొగొట్టుకొనవచ్చు. కాని తీర్థక్షేత్రంలో చేసిన పాపాన్ని తొలగించుకోలేం. పాపం చేయకుండా ఉండి, పరోపకారం చేయడమే పూజలన్నిటి సారం. దరిద్రునిలో, దీనునిలో, రోగిలో, శివుని చూడగలిగినవాడు నిజమైన శివారాధకుడు. విగ్రహంలో మాత్రమే శివుని చూసేవాని పూజ ప్రారంభదశలోనిదే. ఒక దరిద్రునిలో వాని జాతిని, మతాన్ని, కులాన్ని మరిదేన్నిగాని పాటించక శివుని చూచి, వానికి సాయపడి, ఉపచారాలు చేసిన వానిపై శివుని కెక్కువ ప్రీతి; తనను దేవళాల్లో మాత్రమే చూడగలిగే మనుజునిపై దేవునికంత ప్రీతి ఉండదు.
ఒక ధనికునికి ఇద్దరు తోటమాలీలుండెవారట. వారిలో ఒకడు చాలా సోమరి; పనిచేసేవాడు కాడు. కాని యజమాని తోటలోకి వచ్చినపుడంతా లేచి చేతులు జోడించుకొని – ‘ఆహా! మా దొరగారి ముఖం ఎంత సుందరంగా ఉంది!’ అని పొగుడుతూ, వాని ఎదుట తన్మయత్వం నటించేవాడు. రెండవ తోటమాలి ఎక్కువగా మాటలాడేవాడు కాడు; కష్టపడి పనిచేసి, అన్నిరకాల పళ్ళను, కూరగాయలను పండించేవాడు. వాటిని నెత్తిన మోసుకొనిపోయి, దూరంగా ఉన్న యజమాని ఇంటికి చేర్చేవాడు. ఈ ఇద్దరు తోటమాలీలలో ఎవరిని యజమాని ఎక్కువగా మెచ్చుకుంటాడో ఆలోచించండి. శివుడే అట్టి యజమాని ఈ ప్రపంచమే వాని తోట; ఇక్కడ రెండు రకాల తోటమాలీలున్నారు. ఒకడు సోమరి, మాయలమారి, మోసగాడు, ఏమీ పనిచేయడు. కాని శివుని కన్నుల అందాన్ని, ముక్కు చక్కదనాన్ని, ఇతరావయవాల సౌందర్యాన్ని ఊరక అభివర్ణిస్తూ స్తోత్రాలు చేస్తూఉంటాడు. రెండోవాడు శివుని సంతానమైన దరిద్రులను, దీనులను, సమస్త జంతుజాలాన్ని, అది ఇది అనడమెందుకు? సమస్త సృష్టిని కనిపెట్టుతూ సేవిస్తూంటాడు. వీరిద్దరిలో శివునికి ఎక్కువ ప్రియుడెవడు? అతని బిడ్డలకు సేవచేసేవాడే అనడానికి సందేహంలేదు. తండ్రికి సేవచేయకోరేవాడు, మున్ముందు వాని బిడ్డలకు సేవచేయాలి. అట్లే శివుని సేవించగోరేవాడు మున్ముందు వాని బిడ్డలకు, సమస్త జంతుజాలానికి సేవచేయాలి. శాస్త్రాలలో, భగవద్భక్తుని సేవించేవారు భగవంతుని సేవకులలో పరమోత్తములని చెప్పబడింది. కాబట్టి దీన్ని సదా జ్ఞప్తినుంచుకోండి.
మీరు పరమ పవిత్రులుగా ఉండి, సహాయం కోరివచ్చే ఎవ్వనికైనా మీ శక్తికొద్దీ ఉపకారం చేస్తూండాలని మీకు మళ్ళీ చెబుతున్నాను. ఇదే సత్కర్మ. దీని మహిమవల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. అప్పుడు ప్రతివానిలో వసిస్తున్న శివుడు ప్రత్యక్షం కాగలడు. ఆయన ప్రతివాని హృదయంలోను సదా నివసిస్తూనే ఉన్నాడు. అద్దంమీద మురికిగాని, దుమ్ముకాని ఉంటే మన స్వరూపం అందు ప్రతిఫలించదు. అట్లే మన మనస్సు అనే అద్దాలమీద అజ్ఞానమనే మురికి, దుర్మార్గమనే దుమ్ము పడుతూంటుంది. ముందుగా, తమ మేలునే చూసుకొనే స్వార్థపరత, పాపాలన్నిట్లో మహాపాపం. ఎవడు, తాను ముందు తినాలనీ, ఇతరులకంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనీ, లోకంలోని సమస్త సంపదలను పొందాలనీ ఆశపడతాడో, ఎవడు తాను ఇతరులకంటే ముందుగా స్వర్గానికి పోవాలని, ఇతరులకంటే ముందుగా మోక్షాన్ని పొందాలనీ అపేక్షిస్తాడో, వాడే కటిక స్వార్థపరుడు. నిష్కామి అయిన నరుడు “నేను తుదివరకు ఆగివుంటాను గాక! స్వర్గానికి పోవాలని నేను ఆరాటపడను. నా సోదరులకు ఉపకారం కలిగితే అందుకై నేను నరకానికి పోవడానికైనా సంసిద్ధుడిగా ఉంటాను” అని అంటాడు. ఇటువంటి స్వార్థరహితవృత్తే మతానికి గీటురాయి. ఇలాంటి నిష్కామబుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో, అతడు అంత ఆధ్యాత్మపరుడు, శివసాన్నిధ్యం పొందినవాడూ అవుతాడు. అతడు విద్యావంతుడైనా లేక నిరక్షరకుక్షి అయినా, శివునికి ఇతరులకంటే దగ్గరైనవాడే! అతనికి ఆ సంగతి తెలియవచ్చు, తెలీకపోవచ్చు. కాని స్వార్థపరుడైన నరుడు, సమస్త దేవాలయాలను దర్శిస్తూ అన్ని తీర్థాలను సేవిస్తూ, చిరుతపులిలాగా శరీరమంతా బొట్లు ధరించినప్పటికీ శివునికి చాలా దూరంగానే ఉంటాడు.