ఈ మహోన్నత భక్త్యాదర్శాన్ని పొందేటప్పుడు వేదాంతం త్రోసిరాజవుతుంది; అప్పుడు నీ వేదాంతం ఎవరికి కావాలి? స్వాతంత్ర్యం, మోక్షం, నిర్వాణం – సమస్తం నెట్టివేయబడతాయి. భగవత్ప్రేమానందంలో తేలియాడేటప్పుడు ముక్తిని కాంక్షించే వారెవరు?
శ్లో. “న ధనం న జనం న సున్దరీం
కవితాం వా జగదీశ కామయే,
మమ జన్మని జన్మ నీశ్వరో
భవతా ద్భక్తి రహైతుకీ త్వయ.”*
కాంక్షసేయను కామినీకాంచనముల
వలదు వలదయ్య కవితయుఁ బరిజనులును
జన్మజన్మంబుల న్నాకు జగదధీశ
సహజ భక్తిని నిమ్ము నీ చరణయుగళి.*
“జగదీశ్వరా! నాకు ధనం వద్దు, జనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాలలో నీ పట్ల అహేతుక భక్తే నాకు కావలసింది.” భక్తుడు ఇలా పలుకుతాడు: “తాను చక్కెర కావాలని ఎవ్వడు వాంఛిస్తాడు? చక్కెరను నేను రుచిచూడ దలుస్తాను.”* అలా అయినప్పుడు ముక్తుడై భగవంతుడితో ఐక్యం పొందగోరే భక్తుడెవ్వడు? “ఆ పరమాత్మే నేనని గ్రహించి వుంటాను గాక, అయినా నా ప్రియతముడైన పరమేశ్వరుడి సంసర్గం అనుభవించటానికై ఆ పరమాత్మనుంచి విడివడతాను.” ఇదే భక్తుడు చెప్పేమాట. అహేతుక భగవత్ప్రేమే భక్తుడికి మహోన్నతానుభూతి. ఇస్తుంది తన ప్రియతముడి సాన్నిధ్యం అనుభవించటానికై వేయిసార్లయినా బద్ధుడై ఉండనివాడెవ్వడు? భక్తుడికి వలసినవి భగవత్ప్రేమా, భగవంతుణ్ణి వలచి వలపించుకోవటమూ. వేరొక లక్ష్యంలేదు. భక్తుడి అలౌకికప్రేమ, సముద్రగామి అయిన నదిలోని పోటువంటిది. భక్తుడు ప్రేమ ప్రవాహానికి ఎదురీదుతాడు. లోకం అతణ్ణి పిచ్చివాడంటుంది. లోకులు పిచ్చివాడన్న ఒక మహనీయుణ్ణి నే నెరుగుదును. దానికి ఆతడి సమాధానం: “మిత్రులారా, ఈ ప్రపంచమంతా ఒక ఉన్మత్త శరణాలయం. దీన్లో దారాపుత్రులకోసం కొందరికి, పేరుప్రతిష్ఠలకోసం కొందరికి, స్వర్గానికై ఇక కొందరికి పిచ్చి ఎత్తింది. ఈ పెద్ద ఉన్మత్త శరణాలయంలో నేనూ ఒక పిచ్చివాణ్ణే, భగవంతుణ్ణి పొందాలని నా పిచ్చి; ధనంకోసం మీకు మతిపోతే భగవంతుడికోసం నాకు మతిపోయింది. మీరూ పిచ్చివారే నేనూ పిచ్చివాణ్ణే. అయినా నా పిచ్చిని అన్నిట్లో ఉత్తమంగా ఎంచుతాను.”* ఇలాటి దివ్యోన్మత్తతే భక్తుడి ప్రేమ. విశ్వం అతడికి ప్రేమ నిలయమై, ప్రేమ స్వరూపమై తోచుతుంది. మానవుడు ఇలాటి దివ్యప్రేమను పొందితే ధన్యుడై శాశ్వతానందమూర్తి అవుతాడు. ఈ దివ్యప్రేమోన్మాదం ఒక్కటే మనలోని భవరోగాన్ని శాశ్వతంగా మాన్పుతుంది. స్వార్థపరత్వంతోకూడ భక్తుడి కామం అంతరిస్తుంది. భగవత్సన్నిహితుడై భక్తుడు ఇంతకు మునుపు తనకుండిన వ్యర్థవాంఛల నన్నిటిని ఒక్కుమ్మడి త్యజించివేస్తాడు.
భక్తిసాధనను మనం ఎల్లరం ద్వైతభావంతో ఆరంభింపవలసి ఉంది. అట్టియెడ భగవంతుడు వేరనీ మనమందరం ప్రత్యేక వ్యక్తులమనీ తోచుతుంది. అంతట మానవుడికి భగవానునిపై ప్రేమ ఉత్పన్నమవుతుంది; అంత నాతడు భగవానుని సమీపింప మొదలిడుతాడు. భగవానుడు మానవుడికి అత్యంతసన్నిహితుడు కాసాగుతాడు. అప్పుడు పితృమాతృసుతహితాది జీవితసంబంధాలను అన్నిటిని గైకొని భక్తుడు తన ప్రేమ లక్ష్యమైన భగవానునిలో వ్యక్తమొనరుస్తాడు. భక్తుడు ఈ రూపాలన్నిట్లో భగవానుడు వెలసి ఉండటం గాంచుతాడు. సాధకుడు తన ఉపాస్యంలో తా నెప్పుడు సంపూర్ణంగా లీనమై భగవదనుభవం పొందుతాడో అప్పుడు భక్తిసాధనక్రమంలోని పరిపక్వతను పొందుతాడు. క్షుద్రమైన మన అహంకార మమకారాలు అన్యాయంగా మన ప్రేమను స్వార్థపరుస్తూ ఉంటాయి. తుదకు ఎలాగో ఉజ్జ్వలప్రేమప్రకాశాన్ని కాంచుతాం; ఆ తేజంలో మన అల్పజీవాత్మ అఖండసచ్చిదానంద స్వరూపమై అలరారే పరమాత్మతో ఐక్యమొందుతుంది. ఈ ప్రేమజ్యోతి వెలుగులో మానవుడు పరిపూర్ణ పరిణామం పొంది తుదకు భక్తుడు, భగవానుడు, భక్తి అనే తత్త్వత్రయం ఒక్కటే అనే దివ్యసుందర సత్యాన్ని గ్రహిస్తూన్నాడు.