స్వార్థత్యాగీ, ఫలాపేక్షారహితుడూ, నిర్భయుడూ అయిన భక్తుడి ఆదర్శం ఏమిటి? సాక్షాత్తు భగవంతుడితో కూడ ఆత డిలా అంటాడు: “ప్రభూ! నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తాను, నీ నుంచి నేను ఏమీ ఆశించను. నిజానికి నాది అనేది నా కేదీ లేనేలేదు.” ఈ నిశ్చితాభిప్రాయానికి రాగానే భక్తుడి ఆదర్శం భయరహితమై, పరిపూర్ణప్రేమరూపమై ఒప్పుతుంది. ఇలాటి మహనీయుడి మహోన్నతాదర్శంలో సంకుచితబుద్ధిగాని, ప్రత్యేక దృష్టిగాని కించిత్తూ ఉండటానికి అవకాశంలేదు. ఇదే విశ్వప్రేమ, నిరవధిక, నిర్నిరోధప్రేమ, ఏకైక ప్రేమ, అసంకీర్ణప్రేమ. ఇదే ప్రేమస్వరూపం. ప్రతీకాపేక్షగాని, ప్రతిమావశ్యకతగాని లేకుండానే ఇలాటి దివ్యాదర్శ ప్రేమతత్త్వం ఉపాస్యమై ప్రేమనిలయమై ప్రకాశిస్తుంది. సర్వాదర్శ నిలయమైన ఇలాటి దివ్యాదర్శాన్ని ఆదర్శంగా స్వీకరించి ఉపాసించటమే పరభక్తి అని పేర్కోబడుతుంది; ఇతర భక్తిరూపాలన్నీ దీనికి కేవలం సోపానాలు. ఇలాటి దివ్యప్రేమ తత్త్వావలంబనంలో మనకు కలిగే జయాపజాలన్నీ పరభక్తిప్రాప్తి పరమావధిని చేరే మార్గంలోని మజిలీలు. సాధకుడు ఒకదాని వెనుక ఒకటిగా అనేక ఆలంబనాలను గైకొంటూ, అంతరాదర్శాన్ని వాటిలో క్రమంగా అభివ్యక్తం గావిస్తూంటాడు; కాని అవి నిరంతర వికాసాన్ని చెందే ఆతడి అంతరాదర్శాన్ని వ్యక్తం చేయజాలక క్రమంగా వాటిని విడనాడు తూంటాడు. సాధకుడు చిట్టచివరకు బాహ్యవిషయాలలో తన ఆదర్శాన్ని కనుగొన యత్నించటం నిరర్థకమని, ఆదర్శంతో పోల్చిచూస్తే, బాహ్యవిషయాలన్నీ కేవల హేయాలని గ్రహించ నారంభిస్తాడు. అంతేగాక సకాలంలో ఆతడు మహోత్తమం, సమీకృతనిర్విశేషమూ అయిన ఆదర్శాన్ని ఆదర్శస్వరూపంలోనే కనుగొనే సమర్థుడవుతాడు. అలాటి వ్యక్తికే ఆదర్శం ప్రాణవంతమూ యథార్థమూ అవుతుంది. భక్తుడు ఈ ఉత్తమస్థితికి రాగానే భగవంతుడి అస్తిత్వం నిరూపించదగినదవుతుందా కాదా అని విచారించటం ఆతడికి అనావశ్యం; భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అవటం నిజమా కాదా అనే విచారం ఆతడిలో అంతరిస్తుంది; భగవంతుడు ఆతడికి కేవలం ప్రేమమూర్తి, మహోన్నతప్రేమాదర్శం. భక్తుడికి ఇది చాలు. ప్రేమరూపంలో వెలుగొందే భగవంతుడు స్వయంప్రకాశమానుడు. ప్రేమకు తన ప్రేమను నిరూపించడం అనావశ్యం కదా. ఇతర మతవిధానాలలోని దైవాలు న్యాయమూర్తుల వంటివారు. వారిని నిరూపించటానికి అనేక ప్రమాణాలు కావలసి వస్తాయేమోకాని, భక్తుడు అలాటి దైవాలను గురించి తలపోయనే తలపోయడు, తలపోయలేడు. భగవంతుడు ఆతడికి కేవలం ప్రేమమయుడు. “న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవత్యాత్మన స్తు కామాయ పతిః ప్రియో భవతి; న వా అరె జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి* – ప్రేయసీ, పతికోసమే ఎవ్వరూ పతిని ప్రేమించటం లేదు, అతడిలోని ఆత్మకోసమే పతి ప్రియుడవుతున్నాడు; సఖీ, భార్యకోసమే ఎవ్వరూ భార్యను ప్రేమించటంలేదు; ఆమెలోని ఆత్మకోసమే భార్య ప్రియురాలవుతోంది.” స్వార్థపరత్వమే మానవ యత్నాలన్నిటికీ ప్రేరణశక్తి అయిన మూలకారణమని కొందరి అభిప్రాయం. విమర్శించి చూస్తే ఇదీ ప్రేమే, కాని వ్యక్తిగతం కావించటంతో ప్రేమ ఇక్కడ కిందిమెట్టుకు దింపబడింది. విశ్వరూపి నాలో ఉన్నట్లు భావించేటప్పుడు నాలో స్వార్థపరత్వం ఉండటానికి నిజానికి అవకాశంలేదు; కాని నే నొక అల్పుడనని భ్రమించేటప్పుడు నా ప్రేమ సంకుచితమై వ్యక్తిగతమవుతోంది. ప్రేమమండలాన్ని సంకుచితం చేయటమే మనకు ప్రమాదం. చరాచర ప్రపంచమంతా సర్వేశ్వరసంజనితమే కాబట్టి మనకు ప్రేమపాత్రంగా ఉండవలసిందే. అయినా అంగిని ప్రేమించటంలో అంగాలు ప్రేమించటమూ ఇమిడి ఉందని మాత్రం మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. భక్తుల భగవంతుడే ‘అంగి’. ఇతరాలైన సమస్త దైవాలు, స్వర్గంలో ఉన్న తండ్రులు, లోకపాలకులు, సృష్టికర్తలు, వాదాలు, సిద్ధాంతాలు, గ్రంథాలు అలాటి భక్తులకు అర్థరహితాలు, అనావశ్యకాలు. ఎందుకంటే మహోన్నతమమైన తమ ప్రేమతో – పరభక్తితో – వీటి నన్నిటిని వారు అతిక్రమించి ఉన్నారు. హృదయం క్షాళితమై అకళంకమై దివ్యప్రేమామృతపూరిత మయ్యేటప్పుడు భగవంతుణ్ణి గురించిన ఇతర భావాలన్నీ కేవల బాల్యోచితాలవుతాయి, అపర్యాప్తాలని అనర్హాలని నిరాకరించబడుతాయి. నిజానికి పరభక్తి ప్రభావం అలాటిది. పరిపూర్ణుడైన భక్తుడు ఇక ప్రార్థనాలయాలకు, ఆలయాలకు భగవద్దర్శనార్థమై వెళ్ళడు. “ఇందు గలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు…” అన్నట్లు భగవంతుడు అతనికి సర్వాంతర్యామియై సాక్షాత్కరిస్తాడు. అలాటి భక్తుడికి భగవంతుడులేని తావే ఉండదు. దేవాలయంలోను దేవాలయం వెలుపలకూడ ఆతడు భగవంతుణ్ణి కాంచుతాడు. సజ్జనుడి పవిత్రతలోను దుర్జనుడి దౌర్జన్యంలోనుకూడ ఆతడు భగవంతుణ్ణి చూస్తాడు; సర్వశక్తిమంతమూ, నిరామయ ప్రేమప్రదీపమూ అయిన పరంజ్యోతి ఆతడి హృత్పీఠంలో కదా సదా దేదీప్యమానుడై నెలకొని ఉంటుంది!