ప్రేమను ఒక త్రికోణంగా మనం నిరూపించవచ్చు. దాన్లో ఒక్కొక్క కోణమూ ప్రేమకుగల అవిభాజ్య లక్షణాలు మూడింటిలో ఒక్కోదానికి సరిపోతుంది. మూడు కోణాలు లేనిదే త్రికోణం ఉండదు కదా. అలాగే ఈ కింది మూడు లక్షణాలు లేనిదే నిజమైన ప్రేమ ఉండదు. మన ప్రేమ త్రిభుజంలో మొదటి కోణం: ‘నిజమైన ప్రేమకు బేరమాడటం ఉండదు.’ ఎక్కడ ఫలాపేక్ష వుంటుందో అక్కడ నిజమైన ప్రేమ ఉండలేదు; ఫలాపేక్ష ఉంటె అది వట్టి వర్తక మన్నమాట.
మన భక్తిప్రపత్తులకు ప్రతిగా భగవంతుడివల్ల ఏ వరమో పొందాలనే భావం మనలో వున్నంతవరకు నిజమైన ప్రేమ మన హృదయంలో నెలకొనలేదు. తమకు వరాలు ఇస్తాడన్న భావంతో భగవంతుణ్ణి అర్చించేవారు అవి లభించకపోతే భగవంతుణ్ణి అర్చించరనటం ఎంతో నిశ్చయం. భగవంతుడు ప్రేమపాత్రుడనే కారణంగానే భక్తుడు ఆతణ్ణి ప్రేమిస్తాడు; నిజమైన భక్తుడి ఈ దివ్యప్రేమకు వేరే కారణం లేదు; ఉద్దేశంలేదు. వెనుకటి కొక మహారాజు అరణ్యానికి వెళ్ళి ఒక మహర్షిని చూశాడు. మహర్షితో ఆతడు కాస్సేపు సంభాషించి, ఆతడి విశుద్ధతకు జ్ఞానానికి ఎంతో సంతుష్టుడై, “నా వద్దనుంచి ఏదైనా స్వీకరించి నన్ను అనుగ్రహించండి” అని కోరాడు. మహర్షి అందుకు నిరాకరిస్తూ ఇలా అన్నాడు: “ఓ రాజా! వనంలో నా ఆహారానికి కావలసిన పళ్ళు లభిస్తాయి; చక్కని సెలయేళ్ళ నుంచి తాగటానికి కావలసినంత మంచినీరు లభిస్తుంది; చెట్లనుంచి లభించే నారలు నా వస్త్రాలకు సరిపోతాయి; కొండగుహలు నా నివాసానికి అనువుగా ఉన్నాయి; అలాంటప్పుడు నీ వలనగాని, మరెవరివల్లగాని దేనినైనా ప్రతిగ్రహించటం నాకు అవసరం లేదుకదా!”* అది విని రాజు ఇలా అన్నాడు: “స్వామి, నా వద్దనుంచి ఏదైనా స్వీకరించి నన్ను అనుగ్రహించండి! నగరానికి ఏతెంచి నా అంతఃపురానికి దయచేయండి.” రాజు ఇలా చాలసేపు బ్రతిమాలగా చివరకు మహర్షి అంగీకరించి రాజాంతఃపురానికి వెళ్ళాడు. తాను సమర్పించ ఎంచినది మహర్షికి అర్పించటానికి ముందు రాజు ఇలా భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు: “లోకరక్షకా! నాకు అధిక సంతానం ఇవ్వు; ప్రభూ, నాకు అధిక సంపదలనివ్వు, అధిక రాజ్యం ఇవ్వు; పరమేశ్వరా, నాకు అధిక ఆరోగ్యాన్ని ప్రసాదించు.” రాజు తన ప్రార్థనను పూర్తిచేయక మునుపే అంతఃపురంనుంచి మహర్షి లేచి చల్లగా వెళ్ళిపోయాడు. అది చూసి రాజు ఆందోళనతో మహర్షిని వెంబడిస్తూ ఇలా మొరపెట్టసాగాడు: “స్వామీ, వెళ్ళిపోతున్నారా! నా కానుకలను స్వీకరించకుండా వెళ్ళిపోతున్నారా!” అందుకు మహర్షి ఇలా జవాబిచ్చాడు: “అయ్యా, నేను యాచకులను యాచించేవాణ్ణి కాను! స్వయంగా బిచ్చగాడివైన నువ్వు నాకు ఏం ఇవ్వగలవు? నీలాంటి భిక్షుకుడి నుంచి పరిగ్రహించటానికి నేను మూర్ఖుణ్ణి కాను. వెళ్ళు! నన్ను వెంబడించకు!” భగవంతుణ్ణి ఇదీ అదీ కావాలని దేవిరించే వట్టి భిక్షుకులకూ నిజమైన భగవద్భక్తులకూ గల తారతమ్యం దీన్లో చక్కగా నిరూపించబడింది. ఫలాపేక్షతో పాకులాడటం ప్రేమలక్షణం కాదు. సాక్షాత్తు ముక్తికొరకే అయినా, మరే ఇతరాసక్తి చేతనైనా భగవంతుణ్ణి ఉపాసించటంకూడ నింద్యమే. ఫలాపేక్ష వుంటే అది ప్రేమకాదు. అవ్యాజమైన ప్రేమే ప్రేమ. ప్రేమించక ఉండటం తన స్వభావవిరుద్ధం కాబట్టి భక్తుడు ప్రేమిస్తాడు. రమ్యమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి నువ్వు ముగ్ధుడవైతే ఆ దృశ్యం నిన్నేమైనా కటాక్షించాలని ఆశించవుకదా! అలాగే ఆ దృశ్యమూ నీవల్ల ఏ ప్రతిఫలాన్ని ఆశించటంలేదు. కాని ఆ ప్రకృతి దృశ్యం నిన్ను పరమానందభరితుణ్ణి చేస్తోంది; నీ చిత్త విక్షేపాలను అణచి నీ కది ప్రశాంతిదాయకం అవుతోంది. తాత్కాలికంగానైనా అది నిన్ను మానవస్వభావాతీతుణ్ణి చేసి నీకు ఆత్మసుఖానుభూతిని ఒసగుతోంది. సహజంగా ప్రేమించటమే ప్రేమకు ప్రధాన లక్షణం. నీ ప్రేమకు ప్రతిఫలం ఎన్నడూ ఆశించక సదా ప్రేమిస్తూ ఉండు. నీ ప్రేమను భగవంతుడికి అర్పించు. కాని భగవంతుడినుంచి ఏ ప్రతిఫలాన్నిగాని ఆపేక్షించకు.
ప్రేమ త్రికోణంలో రెండవ కోణం: ప్రేమ భయం ఎరుగదు. భీతిచేత భగవంతుణ్ణి ప్రేమించేవారు అత్యల్పులు, ఇంకా కించిత్తూ వికాసం పొందని మానవమాత్రులు. తమను శిక్షిస్తాడనే భీతిచేత వారు భగవంతుణ్ణి ఉపాసిస్తారు. భగవంతుడు వారి దృష్టిలో ఒకచేత కొరడా, ఒకచేత రాజదండం పూనిన పెనుభూతం. భగవంతుడికి విధేయులుగా ఉండకపోతే తమను దండిస్తాడని వారి భయం. ఇలాటి భయంచేత భగవంతుణ్ణి ఉపాసించటం నీచాతినీచం; అదీ ఒకవేళ ఉపాసనే అని అంగీకరించినా దాన్ని ఎంతో అనాగరికమైన ఉపాసనగా పేర్కోవాలి. మనస్సులో భయం ఉన్నంతవరకు దాన్లో ప్రేమ ఎలా వుంటుంది? ప్రేమ సహజంగా భీతిని జయిస్తుంది. ఒక యువతి వీథిలో వెళ్తూంటే ఒక కుక్క ఆమెను చూసి మొరిగిందంటే; ఆమె భయపడి పక్కనున్న ఇంట్లోకి పరుగెత్తుతుంది. కాని మర్నాడు ఆమె తన బిడ్డతో వీథిలో వస్తూంటే ఒక సింహం ఆ బిడ్డమీద ఉరికిందంటే. అప్పుడామె ఎక్కడ ఉంటుంది? తన బిడ్డను రక్షించటానికై నోరు తెరచి ఉన్న సింహం ముందుకు దూకుతుంది కదా. ప్రేమ సమస్త భీతిని జయిస్తుంది. ఎంతసేపు మాకు “ఆయుర్దాయం, మాకు ఆరోగ్యం” అనే స్వార్థపరత్వమే భీతికి పుట్టినిల్లు. అల్పులం, స్వార్థపరులం అయినకొద్దీ మన భయం అధికమవుతూంటుంది. మానవుడు తాను వట్టి పనికిమాలినవాడననీ, అనామకుడననీ భావించేటప్పుడు భయం ఆతణ్ణి ఆవేశిస్తుంది. అల్పుడని భావించటం అల్పమైనకొద్దీ భీతీ అల్పమవుతూంటుంది. కించిత్తు భయం ఉన్నంతవరకు నీ హృదయంలో ప్రేమకు స్థానం ఉండదు. ప్రేమా భయమూ పరస్పర విరుద్ధాలు; భగవంతుణ్ణి ప్రేమించేవ్యక్తి భగవంతుడంటె ఎన్నడూ భయపడడు. “వ్యర్థంగా భగవన్నామాన్ని గ్రహించకు”* అనే క్రైస్తవోపదేశాన్ని చూసి నిజమైన భక్తుడు నవ్వుతాడు. ప్రేమ తత్త్వావలంబనంలో అపచారం ఎలా వాటిల్లుతుంది? భగవన్నామం ఎలా స్మరించినాసరే, ఎంత స్మరిస్తే మనకు అంత శ్రేయస్కరం.* భగవత్ప్రేమచేతనే నువ్వు ఆతడి నామాన్ని స్మరిస్తావు, జపిస్తావు.
ప్రేమ త్రికోణంలో మూడవకోణం “ఏకాంతికత”. ఎందుకంటే ప్రేమించే వ్యక్తి మహోన్నతాదర్శం ప్రేమించబడిన దాన్లో సదా మూర్తీభవించి ఉంటుంది. మన ప్రేమకు లక్ష్యభూతమైనది మన మహోత్తమాదర్శం కానిదే మనకు నిజమైన ప్రేమ కలుగజాలదు. అనేక సమయాలలో మానవప్రేమ పెడత్రోవ పట్టినా, అనర్హులపై ప్రసరించినా, ప్రేమకి తాను ప్రేమించినదే మహోత్తమాదర్శం. ఒకడు పరమదుర్మార్గుడిలో తన ఆదర్శాన్ని గాంచనీ, మరొకడు పరమోదాత్తుడిలో చూడనీ; ఎక్కడైనా ఆదర్శం మాత్రమే గాఢప్రేమకు నిజమైన పాత్రమవుతోంది. ప్రతి మానవుడి అత్యున్నతాదర్శానికే భగవంతుడని పేరు. అజ్ఞుడికీ ప్రాజ్ఞుడికీ, పాపాత్ముడికీ పుణ్యాత్ముడికీ, స్త్రీకీ, పురుషుడికీ, విద్వాంసుడికీ విద్యావిహీనుడికీ, సంస్కారయుక్తుడికీ కుసంస్కారికీ – ప్రతి మానవుడికీ భగవంతుడే మహోన్నతాదర్శం. ఆదర్శసౌందర్యం, ఆదర్శోదాత్తత, ఆదర్శశక్తి – వీటి సమన్వయం చేతనే ప్రేమార్హుడూ ప్రేమించేవాడూ అయిన భగవంతుణ్ణి గురించిన మన భావన సమగ్రతమమవుతోంది. ఈ ఆదర్శాలు సహజంగా ప్రతి వ్యక్తి మనస్సులోను ఏదో రూపంలో ఉంటాయి; మన అందరి మనస్సులలోను అవి అంగభూతాలై ఉన్నాయి. ఈ ఆదర్శాలు దైనందిన జీవితానుభూతిలోకి రావటానికై తహతహలాడుతుంటాయి. మానవప్రకృతిలో చాల చురుకుగా రూపొందేది ఈ తహతహ లాడటమే. వివిధ మానసాలలోను వివిధ ఆదర్శాలు రూపొంద యత్నిస్తుంటాయి. ఇదే సంఘంలో కనిపించే వివిధ ఉద్యమాలన్నిటికీ కారణం. అంతర్గతమైవున్నది బహిర్గతమవటానికై తోసికొని వస్తూంటుంది. అపారం, నిరంతరం అయినా ఈ ఆదర్శం యొక్క ప్రభావమే మానవకోటిలో కార్యరూపం పొందే అద్వితీయ ప్రేరణశక్తి. వందలాది జన్మల పిమ్మట, వేలాది సంవత్సరాలు శ్రమించాక, మానవుడు తనలో ఉన్న ఆదర్శం బాహ్యపరిస్థితులను పూర్తిగా రూపొందించలేదని, వాటితో సర్దుకోలేదని గ్రహిస్తాడు. కాని ఈ సత్యాన్ని మాత్రం ఇక ఆతడు బాహ్యప్రపంచంమీద తన ఆదర్శంగా ప్రసరింపచేయ యత్నించడు. ప్రేమ అనే మహోన్నత దృక్పథంతో ఆదర్శం ఆదర్శరూపంగానే ఉపాసిస్తుంది. ఆదర్శపరిపూర్తిగల ఈ ఆదర్శంలో చిన్న ఆదర్శాలన్నీ ఇమిడి ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి కంటికి నీగ్రో వనిత మొహంలో రంభాసౌందర్యం కనిపిస్తుందనే సూక్తి నిజమని అంతా అంగీకరిస్తారు. ప్రక్కనుంచి పరికించే వ్యక్తికి మాత్రం ఆ కాముకుడి ప్రేమకు ఔచిత్యం కనిపించకపోవచ్చు; కాని కాముకుడి కంటికి మాత్రం రంభే కనిపిస్తూందే కాని నీగ్రో వనిత కనిపించటంలేదు. మన ఆదర్శాలన్నీ నిజానికి మన ప్రేమపాత్రల చుట్టూ పేరుకొని వుంటాయి. వారు రంభలుకాని, నీగ్రో వనితలుకాని. లోకం సాధారణంగా పూజించేది ఏమిటి? ఆదర్శపరిపూర్తి కలిగి అన్నిటిని తనలో ఇముడ్చుకొనేదైన పరభక్తుడి భగవత్కాముకుడి లక్ష్యం కాదనటం నిజం. పురుషులందరూ సర్వసాధారణంగా ఉపాసించే ఆదర్శం తమలో ఉన్న ఆదర్శమే. ప్రతివ్యక్తీ స్వీయాదర్శాన్ని బాహ్యప్రపంచాన ప్రసరింపచేసుకొని దానికే మోకరిల్లుతూంటాడు. క్రూరులూ, రక్తపిపాసులూ అయినవారు భగవంతుణ్ణికూడ రక్తపిపాసువుగానే ఎంచి ఉపాసిస్తూండటానికి ఇదే కారణం. ఎవ్వరైనా స్వీయోన్నతాదర్శమే కదా ప్రేమించగలిగేది! సజ్జనులకు భగవంతుణ్ణి గురించి సమున్నతాదర్శం ఉండటానికికూడ ఇదే కారణం. ఇతరుల ఆదర్శానికీ సజ్జనుల ఆదర్శానికీ ఎంతో వ్యత్యాసం ఉంటుంది.