ప్రకృతిలో ఎక్కడ చూసినా ప్రేమ మనకు కనిపిస్తోంది. సమాజంలో ఏదైతే మంచిదిగాను, గొప్పదిగాను, ఉదాత్తంగాను విరాజిల్లుతుందో అదంతా ప్రేమఫలితమే; సమాజానికి ఏది చెడై, రాక్షసకృత్యమై కనిపిస్తుందో అదీ దుష్పథంలో ప్రవహిస్తున్న ప్రేమోద్రేక ఫలితమే. భార్యాభర్తల మధ్యగల పరస్పర పవిత్ర ప్రేమకు కారణం ఈ మనోభావమే అని మనకు తెలుస్తుంది. నీచమృగ కాంక్షల తీర్చుకునేటట్టు చేసే ప్రేమా ఇదే. మనోభావం ఒక్కటే అయినప్పటికీ వేరు విషయాలలో వేరు రీతులుగా వ్యక్తమవుతుంటుంది. సన్మార్గంలోనో, దుర్మార్గంలోనో వ్యక్తమయ్యే ఈ ప్రేమావేశమే ఒకణ్ణి బీదలకు తన సర్వస్వాన్ని త్యజించి సత్కార్యాలను చేయ ప్రేరేపిస్తోంది; మరొకణ్ణి తన సోదరుల కుత్తుకలను కత్తిరించి వారి సర్వస్వాన్ని హరింపచేస్తోంది. మొదట పేర్కొన్న వ్యక్తి పరులనెంత ప్రేమిస్తాడో రెండవవ్యక్తి తనను తానంత ప్రేమించుకొంటున్నాడు. ఒకరి ప్రేమ దుర్మార్గాన మరొకరి ప్రేమ సన్మార్గాన వ్యక్తీకరింప బడుతున్నది. ఒకరి ప్రేమమార్గం న్యాయమూ, యోగ్యమూ అయివుండగా, మరొకరిది అన్యాయమూ, అయోగ్యమూ అవుతోంది. వంట చేసుకోటానికి మనకు తోడ్పడే అగ్నే బిడ్డ చేతిని కాల్చవచ్చును. అది అగ్నిదోషం కాబోదు; భేదం అంతా వినియోగించుకొనే విధానంలో ఉంది. సృష్టిలో మనకు కనిపించే అన్యోన్యసమాగమంలోని తీవ్రవాంఛ, ఏకీభావం పొందాలనే ప్రబలేచ్ఛ, చివరకు బ్రహ్మైక్యం పొందాలనే దృఢేచ్ఛ సమయానుకూలంగా అన్నిచోట్లా నిమ్నోచ్ఛ స్థితులలో వ్యక్తమవుతూంటుంది. భక్తియోగం ఉత్తమ ప్రేమసరళిని తెలిపే శాస్త్రం. ప్రేమ నెలా సక్రమమార్గంలో కనబరచాలో భక్తియోగం మనకు బోధిస్తుంది. ప్రేమను అదుపులో ఉంచుకొనే విధానం, నిర్వహించే పద్ధతి, వినియోగించుకోవలసిన తీరు, ప్రేమకు కొత్త లక్ష్యాన్ని కల్పించి ఉదాత్తమహోజ్జ్వల ఫలితాన్ని పొందేమార్గం, అంటే పారమార్థిక సిద్ధికి ప్రేమను సాధన చేసుకోవటం ఎలాగో భక్తియోగం మనకు తెలుపుతుంది. “త్యజించ” మని ఎన్నడూ భక్తియోగం శాసించదు; “ప్రేమించు, పరాత్పరుణ్ణి ప్రేమించు” అని మాత్రమే ఉపదేశిస్తుంది. ఎవరి ప్రేమకు పరాత్పరుడు లక్ష్యమవుతాడో అలాటవ్యక్తినుంచి అల్పవిషయాలన్నీ సహజంగానే తొలగిపోతాయి.
“నువ్వు నా ప్రేమజ్యోతి వనుకొంటె నిన్ను గురించి నేను ఏమీ చెప్పలేను. ఎంతటి సుందరమూర్తివి! ఆహా! ఎంతటి సుందరమూర్తివి! మూర్తీభవించిన సౌందర్యమే నీ రూపం!” – భగవానుణ్ణి గురించి భక్తుడు ఇలా భావిస్తాడు. మన సౌందర్యపిపాసను భగవంతుడికేసి మరల్చటమే భక్తియోగంలో మన కర్తవ్యం. మానవ వదనంలో, ఆకాశంలో, తారకలలో, చంద్రబింబంలో సౌందర్యమేముంది? ఒకవేళ ఉన్నా భగవానుని లోకాతీత సౌందర్యం వాటిలో కించిత్తు ప్రతిఫలించటమేకాని వేరుకాదు. “తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి – ఆతడు ప్రకాశించటం చేతనే సమస్తం ప్రకాశిస్తోంది. ఆతడి ప్రకాశం మూలంగానే ఈ సమస్తం భాసిస్తోంది.”* భక్తి అనే ఈ పైమెట్టును అధిష్ఠించు. భక్తి మీచేత మీ చిన్న చిన్న వ్యక్తిత్వాలకు అతీతంగా తీసుకువెళుతుంది. లౌకిక అల్ప స్వార్థా సక్తుల నుంచి నువ్వు దూరంగా ఉండు. నీకున్న అక్కరలు, ప్రయోజనాలు పొందడం దృష్ట్యా మానవాళిని తిలకించకు. సాక్షీభూతుడవై, విద్యార్థివై ఈ ప్రకృతి దృశ్యాన్ని తిలకించు. మానవకోటిపట్ల నిస్సంగబుద్ధిని అలవరచుకొన్నవాడవై, ఈ మహాప్రేమభావం ఎన్నెన్ని విధాల లోకంలో తనను వ్యక్తీకరించుకొంటుందో చూడు. ఒక్కోసారి కొంత సంఘర్షణ కలుగుతూంటుంది; ఆ సంఘర్షణ, ఉన్నత పారమార్థిక ప్రేమను పొందటానికై కొట్టుకలాడటం వల్లనే సంభవిస్తుంది. ఒక్కొక్కప్పుడు ఇంచుక పోరాటమో, పతనమో కలుగుతుంది; కాని ఇవన్నీ ఆనుషంగికాలు. ఒత్తిగిలి ఉండి ఈ సంఘర్షణను యథేచ్ఛగా రానివ్వు. విశ్వవాహినిలో ఉన్నంతవరకే నీకీ సంఘర్షణ తగులుతుందిగాని కేవల సాక్షీభూతుడవై, విద్యార్థివై చూసేటప్పుడు అనంతకోటి విధాల భగవానుడు తనను ప్రేమస్వరూపుడుగా వ్యక్తీకరించుకోవటం చూడగలుగుతావు.
“కేవల మన్మథవ్యాపారంలో కానివ్వండి, కించిత్తు ఆనందం ఉన్న అన్ని తావుల్లో నిత్యానందమూర్తి అయిన పరమేశ్వరుడి అంశే విరాజిల్లుతోంది.”* పరమనికృష్టమైన కామాకర్షణలోకూడ పరమేశ్వరాంశే విరాజిల్లుతోంది. భగవన్నామాలలోని ‘హరి’ అనే శబ్దానికి సమస్తాన్ని ఆకర్షించేవాడని అర్థం. మానవ మనోహరి కాదగ్గవాడు హరి ఒక్కడే కదా! నిజానికి జీవాత్మను ఎవడు ఆకర్షించగలడు? పరమాత్మ ఒక్కడే! జడప్రకృతి ఎన్నడైనా ఆత్మను ఆకర్షించగలదా? అలా ఎన్నడూ ఆకర్షించివుండలేదు, ఆకర్షింపజాలదు. సుందర వదనాన్ని చూసి ఒకడు మోహితుడై దాని వెంటపడేటప్పుడు దాన్లోని పిడికెడు భౌతికరేణువులా నిజంగా ఆతణ్ణి అకర్షిస్తున్నవి? ఎన్నటికీ కాదు. ఆ రేణువుల వెనుక దివ్యప్రేమ లీల, దివ్యప్రభావ లీల ప్రకాశిస్తోంది; ప్రకాశిస్తూండాలి. అజ్ఞుడు దీన్ని ఎరుగడు; ఎరిగినా ఎరుగకున్నా వాటిచే మాత్రమే ఆకర్షితుడవుతున్నాడు. కాబట్టి క్షుద్రమైన కామాకర్షణకూడ సాక్షాత్తు భగవంతుడి వలననే శక్తిమంత మవుతోంది. “న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవత్యాత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి* – ప్రేయసీ! భర్తకోసమే ఎవ్వరూ భర్తను ప్రేమించలేదు. ఆత్మకోసం, అంతరాత్మకోసం భర్త ప్రియడవుతున్నాడు.” మనసిచ్చి ప్రేమించే భార్యలు ఈ సంగతి ఎరిగినా ఎరుగకున్నా ఇది యథార్థం. “న వా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవత్యాత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి* – ప్రేయసీ! భార్యకోసమే భార్యను ఎవరూ ప్రేమించలేదు. కాని తదంతర్యామి నిమిత్తం భార్య ప్రియురాలవుతోంది.” జగత్తులో సమస్త జగదంతరాత్మ మూలాన కాకుంటే బిడ్డలనుగాని మరి వేటినిగాని ఎవ్వరూ ప్రేమించేవారు కారు. పరమేశ్వరుడు మహాయస్కాంతం, మన మందరం ఇనుప రేణువులం; సదా మనం ఆతడిచే ఆకర్షితుల మవుతున్నాం;* ఆతణ్ణి పొందటానికే మనం అందరమూ పాటుపడుతున్నాం. లోకంలో నిజానికి మన ఈ ఆరాటాలన్నీ కేవల స్వార్థపరతకు ఉద్దేశింపబడినవి కావు. అజ్ఞులు తాము ఏంచేస్తూన్నారో ఎరుగరు; కాని వారి జీవిత కర్తవ్యం ఈ మహాయస్కాంతాన్ని సమీపించటమే. జీవిత రంగంలో మన మహాసంరంభమంతా – ప్రయత్నమంతా – చివరకు ఆ భగవంతుడిలో మనలను ఐక్యమొందచేయటానికే ఉద్దిష్టమైవుంది.*
భక్తియోగి జీవిత సంరంభంలోని అర్థాన్ని ఎరుగును, దాన్ని ఆతడు గ్రహిస్తాడు. ఈ మహాసంరంభపరంపర నాతడు అనుభవించి ఉండటంతో దాన్లోని రాపిడినుంచి విముక్తుడు కాగోరుతాడు; ఈ సంఘర్షణనుంచి తొలగి ఆతడు సర్వజన మనోహరి అయిన హరిని చేర తల్లడిల్లుతాడు. ఇదే భక్తుడి వైరాగ్యం. భగవదున్ముఖులను చేసే ఈ దివ్యానురాగం సమస్త రాగాలను అదృశ్యం చేసివేస్తుంది. అనంత భక్తిపూరితుడైన ఆతడి హృదయంలో లౌకిక ప్రేమకు స్థానంలేదు, స్థానం ఎలా ఉంటుంది? భగవద్భక్తి సాగరామృతం ఆతడి హృదయాన్ని నింపివేసింది; ఇక క్షుద్రప్రేమలకు దాన్లో స్థానంలేదు. ఇలా అఖండమైన భగవదనురాగంచేత భగవదితర విషయాలపట్ల భక్తుడికి జనించే విముఖతే ఆతడి వైరాగ్యం.
పరభక్తిని పొందటానికి ఇదే మహోత్తమోపాయం. ఈ వైరాగ్యం జనించగానే హృదయ కవాటం విడివడి, ఆత్మ పరభక్తి సామ్రాజ్యంలో ప్రవేశిస్తుంది. పరభక్తి అంటే ఏమిటో అప్పుడు మనం గ్రహించ నారంభిస్తాం; పరభక్తి గర్భాలయంలో ప్రవేశించిన వ్యక్తి మాత్రమే సమస్త శాస్త్రవిధులూ ప్రతీకాలూ సాక్షాత్కారానికి తనకు అనావశ్యకాలని వచింప అర్హుడు, ఆతడే అందుకు అధికారి. విశ్వమానవ సౌభ్రాత్రమనే దివ్యప్రేమను ఆతడే పొందివున్నాడు; ఇతరులు వట్టి వాచాలురు. ఆతడికి ఎలాటి వ్యత్యాసాలు కనబడవు; దివ్యప్రేమ సాగరామృతం ఆతడి హృదయ ప్రవేశం చేసింది. మనిషిని ఇక ఆతడు మనిషిగా ఎంచడు కాని ప్రేమపాత్రుడైన భగవంతుడే, అన్నిచోట్లా ఆతడికి గోచరిస్తాడు; సమస్త వదనాలలోను తన శ్రీహరే వెలుగొందుతూన్నట్లు ఆతడికి కానవస్తుంది. సూర్యకాంతి – చంద్రకాంతి – సమస్తం అతడికి భగవత్స్వరూపమే. ఎక్కడ సౌందర్యం ఉంటే, ఎక్కడ ఔన్నత్యం గోచరించినా అంతా ఆతడికి ఆ పరమేశ్వర సౌందర్యమే, ఆ పరమేశ్వర ఔన్నత్యమే.* అలాటి భక్తులు ఇంకా సజీవులై ఉన్నారు; లోకంలో వారు లేనిసమయం ఎన్నడూ లేదు. అలాటి వారిని పాము కాటువేసినా తమ పరమాత్మ నుండి వార్తావహుడు అరుదెంచాడని పలుకుతారు.* ఇలాటి వారే విశ్వమానవ సౌభ్రాత్రాన్ని గురించి మాట్లాడ అధికారులు. వారి కెన్నడూ కోపంరాదు. ఈర్ష్యాద్వేషాలకు ఎన్నడూ వారి హృదయం చోటివ్వదు. బాహ్యప్రపంచం, విషయ ప్రపంచం వారి మానసం నుంచి శాశ్వతంగా అదృశ్యమైపోతాయి. ఈ దృశ్యప్రపంచానికి ఆధారభూతమైన సత్యాన్ని నిత్యమూ వారు చూస్తూండటంతో ఇక వారికి కోపం ఎలా వస్తుంది?