సాధనభక్తి విచారాన్ని ముగించి ప్రస్తుతం పరభక్తి తత్త్వాన్ని పరికించబోతున్నాం. పరభక్తిని పొందటానికిగల సాధనను గురించి చెప్పవలసి ఉంది. ఇలాటి సాధనలన్నీ చిత్తశుద్ధికోసమే. నామజపం, కర్మకలాపాలు, ప్రతీకోపాసన, శాస్త్రవిధులు మొదలైనవన్నీ చిత్తశుద్ధి నిమిత్తమే. వీటన్నిటిలో ఉత్తమమైనది – ఏది లేకుంటే పరభక్తిసౌధంలో ఎవడూ ప్రవేశించలేడో అదే వైరాగ్యం. వైరాగ్యమనగానే అనేకులకు భయం కలుగుతుంది! కాని వైరాగ్యం లేనిదే ఏపాటి ఆత్మవిశ్వాసమూ కలుగబోదు. సమస్త యోగాలకు వైరాగ్యం ఆవశ్యం. సకలాధ్యాత్మిక విజ్ఞానానికి ప్రథమ సోపానం, ఆ విజ్ఞానానికి నిజంగా కేంద్రం, హృదయం, ఇదే – వైరాగ్యమే. ఆస్తికధర్మం ఇదే – వైరాగ్యమే. జీవుడు ప్రాపంచిక విషయ విముఖుడై నిగూఢ విషయాలను ఎప్పుడు గ్రహించ యత్నిస్తాడో, అనృతజడదుఃఖాత్మకమైన లోకంలో ఎలాగో బద్ధమైన జీవాత్మ తన దుస్థితిని గ్రహించి ప్రకృతికి ఎప్పుడు విముఖమవుతుందో, అప్పుడే నిజమైన ఆత్మవికాసం కలుగ ఆరంభిస్తుంది.* కర్మయోగి వైరాగ్యం సమస్తకర్మఫల త్యాగరూపమైవుంది; కర్మఫలాలలో ఆతడు అనాసక్తుడు; ఇహపరాలలో ఆతడికి ఎలాటి ఫలభోగవాంఛా లేదు; వాటిని ఆతడు సరకుచేయడు. సమస్త ప్రకృతీ పురుషానుభవానికై ఉద్దిష్టమై ఉన్నదనీ, ప్రకృతి పురుషులు భిన్నతత్త్వాలని గ్రహించటమే సమస్తానుభవ ఫలితమనీ రాజయోగి తెలుసుకొంటాడు. జీవాత్మ తనకు ప్రకృతితోవుండే సంబంధం కేవల తాత్కాలికమనీ, శాశ్వతంగా తాను ఆత్మననీ, ప్రకృతిని కాననీ స్వానుభవపూర్వకంగా గ్రహించవలసివుంది. స్వీయమైన ప్రకృతి గుణానుభవంవలననే రాజయోగి త్యాగతత్త్వాన్ని తెలుసుకొంటాడు. జ్ఞానయోగి వైరాగ్యం కఠినాతికఠినం. ఎందుకంటే సుస్థిరమైతోచే ఈ ప్రకృతి అంతా వట్టి మాయ అని* ఆతడు ఆదినుంచీ గ్రహించవలసివుంది. ప్రకృతిలో ఏశక్తులు ద్యోతకమవుతున్నా అవన్నీ ఆత్మవి కాని ప్రకృతివి కావని తెలుసుకోవటమే ఆతడి కర్తవ్యం. సమస్త జ్ఞానానికీ సమస్తానుభావానికీ నిలయం ఆత్మేకాని ప్రకృతి కాదని ఆదినుంచీ గ్రహించాలి. కాబట్టి ఆతడు కేవలం వివేకబలంతో ప్రకృతి బంధాన్ని త్రోసిరాజనాలి. ఇలా ప్రకృతిని, ప్రకృతి సర్వస్వాన్ని విడిచిపుచ్చి వాటిని క్రీగంట అయినా చూడక జ్ఞానయోగి అద్వితీయుడై నిలువ యత్నిస్తాడు!
వైరాగ్యాలన్నిటిలోను భక్తియోగి వైరాగ్యమే అత్యంత స్వాభావికమైనదని చెప్పటం సబబు. దీన్లో బలాత్కారం ఏమీలేదు. త్రోసిరాదన వలసినదీ లేదు, ప్రబలయత్నంచే తొలగించుకోవలసినదీ లేదు. భక్తుడి వైరాగ్యం సులభమై, సరళమై, సహజమై, నిరాటంకమై ప్రవహిస్తుంది. మన చుట్టూవున్న విషయాలు ఎంత స్వాభావికాలో భక్తుడి వైరాగ్యం అంతటి స్వాభావికం. కాస్త వికృతరూపంలో అయినప్పటికీ ఈ విధమైన వైరాగ్యం (త్యాగం) అనుదినం లోకంలో మనకు గోచరిస్తూనే ఉంది. ఒకడొక యువతిని ప్రేమించ ఆరంభిస్తాడు; కొంతకాలమైనాక మరొకతెను ప్రేమిస్తాడు, వెంటనే మొదటి ‘స్త్రీని విడిచి పెడతాడు. కించిత్తూ ఆమె లేదనే చింత లేకుండానే ఆతడి మనస్సులోనుంచి ఆమె చల్లగా, నిమ్మళంగా, తొలగిపోతుంది. ఒక స్త్రీ ‘ఒకణ్ణి ప్రేమిస్తుంది. అంతలో మరొకణ్ణి ప్రేమించ నారంభిస్తుంది, తక్షణమే మొదటి వాడు ఆమె హృదయంనుంచి స్వాభావికంగానే తొలగిపోతాడు. ఒకడు తన పట్టణాన్ని ప్రేమిస్తాడు. అంతట తన దేశాన్ని ప్రేమించ మొదలుపెడతాడు; అప్పుడు తన పట్టణంపట్ల ఆతడికి ఉండిన అగాధప్రేమ స్వాభావికంగానే తొలగిపోతుంది. అంతేగాక ఒకడు లోకాన్నంతా ప్రేమించ నేరుస్తాడు. అప్పుడాతడి దేశభక్తి – పరాయిదేశం పేరు సహించని ఆతడి తీవ్రదేశాభిమానం ఆతడి కేమీ బాధ కలిగించకుండా, బలాత్కారమనేది లేకుండా, చల్లగా సమసిపోతుంది. అప్రాజ్ఞుడు విషయసుఖాలను అత్యంతంగా ప్రేమిస్తాడు; ప్రాజ్ఞుడైనకొద్దీ విద్యావిషయక ఆనందంలో రమిస్తాడు; అప్పుడాతడి విషయసుఖాలు క్రమంగా ఒత్తిగిలుతవి. కుక్కమాదిరి, తోడేలు మాదిరి ఏ మనిషీ ఆహారాన్ని అంతరుచితో అంతప్రీతితో తిని ఆనందించలేడు; కాని ధీవైభవంతో, ప్రతిభాతిశయంతో మానవుడు పొందే ఆనందాన్ని కుక్కలు ఎన్నటికీ పొందలేవు. ప్రారంభంలో సుఖమనేది కామసంతృప్తితోను ఉదరతృప్తితోను కూడినదై ఉంటుంది; కాని జంతువు ఉన్నతస్థితిని పొందేకొద్దీ నిమ్నసుఖాలపట్ల తీవ్రకాంక్ష క్షీణిస్తూంటుంది. జంతు స్వభావానికి చేరువై ఉన్నకొద్దీ మానవుడికి విషయసుఖాల్లో అధికానందం కనిపిస్తూంటుంది. అతడు విద్యావంతుడైనకొద్దీ వైజ్ఞానిక విషయాలపట్లా కళలపట్లా ఆతడి ఆనందం అధికరిస్తూంటుంది. కాబట్టి మానవుడు ఎప్పుడు ధీశక్తినిసైతం అతిక్రమిస్తాడో, కేవల వైజ్ఞానికస్థితిని దాటి, తత్త్వానుభవతేజాన్ని, ఆత్మానందజ్యోతిని దర్శిస్తాడో అప్పుడు తన ఆనందం నిరుపమానమని గ్రహిస్తాడు; విషయసుఖాలుగాని, వైజ్ఞానికానందంగాని అలాటి బ్రహ్మానందంతో అణుమాత్రమూ పోల్చతగవని ఎరుగుతాడు.* చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశించేటప్పుడు తారకలన్నీ నిస్తేజమవుతాయి. సూర్యుడు ప్రకాశించేటప్పుడో, చంద్రుడు వెలవెలబోతాడు. భక్తిని పొందటానికి వలసిన వైరాగ్యానికి దేనిని పరిమార్పనక్కరలేదు. కాని జాజ్వల్యమానమైన దివ్యజ్యోతిముందు చిన్నచిన్న దీపాలు ఎలా సహజంగా వెలవెలబోతాయో, చివరకు కనిపించకుండా పోతాయో, అలాగే భక్తితేజం సహజంగా విషయసుఖాలను అణచి వెలుగొందుతుంది. ఇలా దేదీప్యమానమైన భగవత్ప్రేమ ముందు, విషయాసక్తీ, ధీవైభవంతో కలిగే ఆనందం సైతం కాంతిహీనాలై కనబడతాయి. ఇలాటి భగవద్భక్తే పరభక్తి అని చెప్పనొప్పుతుంది. పరభక్తిని పొందిన మానవుడినుంచి కర్మకలాపాలు పలాయనమవుతాయి; శాస్త్రవిధులు అదృశ్యమవుతాయి; గ్రంథాలు నివర్తిల్లుతాయి; ఆలయాలు, విగ్రహాలు, మతాలు, సంప్రదాయాలు, దేశాలు, జాతులు మొదలైన క్షుద్ర నిబంధనలన్నీ తమంత తామే తొలగిపోతాయి. ఆతడి స్వాతంత్ర్యాన్ని ఏదీ నిరోధించలేదు. ఆకస్మికంగా ఒక ఓడ అయస్కాంత పర్వతాన్ని సమీపిస్తుందనుకోండి. అప్పుడు ఓడలోని మేకులను, ఇనుపరేకులను – అన్నిటిని పర్వతం ఆకర్షించి లాగివేస్తుంది. ఓడ బల్లచెక్కలన్నీ అప్పుడు విడిపోయి స్వేచ్ఛగా నీటిమీద తేలుతాయి. ఈశ్వరానుగ్రహం ఇలాగే హృదయగ్రంథులను విడగొట్టి ఆత్మవిమోచన గావిస్తుంది.* కాబట్టి భక్తికి కావలసిన ఇలాటి వైరాగ్యంలో ఏ కాఠిన్యమూ, రసహీనతా, ప్రయత్నమూ, నిగ్రహమూ, నిరోధమూ లేదు. తన కామాదులలో వేటిని భక్తుడు నిరోధించ నక్కర్లేదు; వాటిని తీవ్రతరంచేసి భగవదున్ముఖం గావించటమే ఆతడి కర్తవ్యం.*