భక్తిసాధన క్రమాన్ని గురించి బ్రహ్మసూత్ర రామానుజభాష్యంలో ఇలా కానవస్తుంది: “తల్లబ్ధి ర్వివేక విమోకాభ్యాస క్రియా కల్యాణానవసా దానుద్ధర్షేభ్యః సంభవాన్నిర్వచనాచ్చ – అది వివేకం, ఇంద్రియనిగ్రహం, అభ్యాసం (యజ్ఞరూపక) కర్మాచరణం, నిష్కాపట్యం, బలం, అమితసంతోషం పొందకుండటం అనేవాటి మూలంగా లభిస్తుంది.” అంతేగాక “జాత్యాశ్రయనిమిత్తా ద్దుష్టాదన్నాత్, కాయశుద్ధి ర్వివేకః – స్వయంగా జాతిచేతా, ఆశ్రయంచేతా, నిమిత్తంచేతా ఏర్పడే అపరిశుద్ధాహారాన్ని శుద్ధాహారంనుంచి వేరుగా గ్రహించటమే వివేకం” అని శ్రీరామానుజాచార్యుల అభిప్రాయం. శ్రీరామానుజుల ప్రకారం 1. స్వయంగా వెల్లుల్లి మొదలైన పదార్థాలలోని జాతిదోషం చేతా 2. అవినీతిపరులనుంచి పొందబడటం చేతా 3. ధూళి, వెండ్రుకలు మొదలైన వాటిచే కలిగే భౌతికమాలిన్యంచేతా మూడు విధాలుగా ఆహారం అపరిశుద్ధమవుతోంది.* “ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః సత్త్వశుద్ధౌ ధ్రువాస్మృతిః – ఆహారం శుద్ధం అయితే సత్త్వం శుద్ధం అవుతుంది, సత్త్వశుద్ధిచేత స్మృతి సుస్థిరమవుతుంది” అని శ్రుతులు చెబుతున్నాయి. ఛాందోగ్యోపనిషత్తునుంచి శ్రీరామానుజాచార్యుడు పై వాక్యాన్ని ఉదహరిస్తాడు.
ఆహార విషయాన్ని భక్తులు ఎప్పుడూ ప్రధాన విషయంగా పరిగణించారు. కొన్ని భక్తిసంప్రదాయాలు ఈ విషయంగా అవలంబించే ఛాందసం – పిచ్చిధోరణి – అలా ఉండగా ఆహారసమస్యలో గొప్ప సత్యం ఇమిడి ఉంది. సాంఖ్యతత్త్వం అనుసరించి, ఏకమైన సామ్యావస్థలో* ప్రకృతిని భిన్నమైన ప్రచలితావస్థలో ప్రపంచాన్ని నిర్మించేటట్టి సత్త్వరజస్థమస్సులు అనేవి ప్రకృతి గుణాలు అనీ, ప్రకృతి మూలపదార్థం అనీ మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి.* కాబట్టి ప్రతివ్యక్తీ ప్రతి రూపమూ ఈ మూలపదార్థాలనుంచే నిర్మాణాలవుతున్నాయి. అంతేగాక సత్త్వాధిక్యం ఆత్మవికాసానికి అత్యావశ్యకమైవుంది. ఆహారమూలాన శరీరకోశాలలోకి మనం గ్రహించే పదార్థాలే మన మనోస్థితిని చాలవరకు నిర్మిస్తూండటంతో ఆహారవిషయంలో మనం ఎంతో జాగ్రత్తపడాలి. అయినా ఇతర విషయాల్లో మాదిరే ఈ విషయంలోను శిష్యులు చూపే మూర్ఖాభినివేశాన్ని గురువర్యులకు అంటగట్టటం తగదు.
ఏమైనా ఆహార విచక్షణే అన్నిటికంటె ప్రధానమని భావించకూడదు. సాధారణంగా ‘అన్నం’ గా అనువదించబడే ఈ ఆహారశబ్దానికి పూర్తిగా వేరువిధమైన అర్థం ఉటంకిస్తూ పై ఉదహరించబడ్డ ఘట్టానికి శ్రీశంకరాచార్యులు తన ఉపనిషద్భాష్యంలో (వేరు విధంలో) వ్యాఖ్యానం గావించివున్నారు. శ్రీశంకరుడు ప్రకారం,* “ఏది లోకానికి ఆహారింప (=గ్రహింప) బడుతుందో అదే ఆహారం. శబ్దాది విషయ విజ్ఞానం భోక్త (అయిన ఆత్మ) యొక్క భోగం కోసమై గ్రహింపబడుతోంది; విషయానుభవాలను గ్రహించటమే లక్షణంగా ఉన్న జ్ఞానాన్ని శుద్ధం ఒనర్చటమే ఆహారశుద్ధి. అంటే రాగద్వేషమోహాలచేత కలుషితంకాని విషయజ్ఞానాన్ని గ్రహించటమని అర్థం. కాబట్టి అలాటి విజ్ఞానం లేక ఆహారం శుద్ధం ఒనర్పబడటంచేత అంతఃకరణలోని సత్త్వం శుద్ధం అవుతోంది; సత్త్వశుద్ధిచేత అవిచ్ఛిన్నమైన స్వస్వరూప పరమాత్మ స్మరణం లభిస్తుంది.”
శంకర రామానుజ వ్యాఖ్యానాలు రెండూ పరస్పరవిరుద్ధాలుగా ఉన్నట్లు కానవస్తున్నా రెండూ యథార్థాలే, ఆవశ్యకాలే. మాంసాస్థిపంజరమైన స్థూలశరీరాన్ని నిగ్రహించటంకంటె సూక్ష్మశరీరమనదగ్గ మనస్సును నిగ్రహించటమూ, వశమొనర్చుకోవటమూ నిశ్చయంగా ఘనతర కార్యం. కాని స్థూలశరీర నిగ్రహం సూక్ష్మశరీరనిగ్రహానికి అత్యంతావశ్యకమని గుర్తించాలి. తాను నమ్మిన తన పూర్వాచార్యులనుంచి పరంపరానుగతాలైన ఆహారనియమాలన్నిటిని సాధకుడు శ్రద్ధతో పాటించాలి; కాని ఉన్నత మతతత్త్వాలను మంటగలిపి, భోజన నియమాలలోనే మత ధర్మాలు ఇమిడి ఉన్నాయనే శుద్ధఛాందసభూయిష్ఠమైన అర్థరహిత స్వమతాభిమానం కేవలం విచిత్రమైన ఒకరకమైన చార్వాకమతం, నాస్తికమతంకాని మరొకటి కాదు. కాని మన సంప్రదాయాలలో అనేకమైన వాటికి ఈ గతే పట్టింది. ఇది జ్ఞానంకాదు, భక్తికాదు, కర్మా కాదు; అది ప్రత్యేకమైన ఒక విధమైన ఉన్మాదం. ఈ ఉన్మాదాన్నే పరమార్థంగా భావించేవారు బ్రహ్మలోకానికంటె పిచ్చి ఆసుపత్రులకు పోవటం ఎక్కువ సులభం. కాబట్టి ఉత్తమ మానసిక స్థితి అయిన సత్త్వాన్ని పొందటానికై ఆహార వివేచనం ఆవశ్యకమనటం ఎంతో సమంజసం. వేరు విధాన సాత్త్వికస్థితిని పొందటం దుర్లభం.
తరువాత మనం ప్రయత్నపూర్వకంగా అలవరచుకోవలసింది ఇంద్రియనిగ్రహం. ఇంద్రియనిగ్రహం అంటే కామక్రోధాదులకు వశం గాకుండటం.* ఇంద్రియాలను విషయాలవైపు పోనివ్వక, నిగ్రహించి, స్వవశం చేసుకోవటమే పారమార్థిక సాధనలోని ప్రధానాశయం, తదుపరి గమనింపదగ్గవి మనోనిగ్రహ స్వార్థరాహిత్యాలు. నిజమైన ప్రయత్నం లేనిదే, తీవ్రసాధన చేయనిదే మనలో అనంతంగావున్న సాక్షాత్కార సదవకాశాలు సఫలం కాబోవు. “సదా తద్భావభావితః* – సదా భగవంతుణ్ణి గురించే చింతింప నియమించటం కష్టతరమనటం నిజం. కాని కొంత ప్రయత్నంతోను అలా చేసేశక్తి మనలో వృద్ధి చెందుతుంది. “అభ్యాసేనతు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే* – ఓ కౌంతేయా! అభ్యాసంచేతా వైరాగ్యంచేతా మనోనిగ్రహం లభిస్తుంది సుమా!” అని శ్రీకృష్ణుడు గీతలో తెలిపి ఉన్నాడు. ఇక యజ్ఞకర్మవిషయమై పంచమహాయజ్ఞాలను యథారీతిని ఆచరించాలని గ్రాహ్యం.*
విశుద్ధతే భక్తికి మూలాధారం, భక్తిసౌధానికి ఇదే పునాది. బాహ్యశౌచం, ఆహారవిచక్షణ – అనే ఈ రెండూ సులభసాధ్యాలైనప్పటికీ అంతశ్శౌచం లేనిదే కేవల బాహ్యాచారం నిష్ప్రయోజనం. రామానుజాచార్యుల ప్రకారం సత్యం, ఆర్జవం (అంటే నిష్కాపట్యం), దయ, (మనోవాక్కాయ కర్మల్లో) అహింస, అనభిధ్య* (అంటే పరధనాదులను ఆశించకుండటం, వ్యర్థమైన ఆలోచనలు చేయకుండటం, పరులవల్ల కలిగిన హానిని తలపోసి విషణ్ణచిత్తుడు కాకుండటం) అనేవి విశుద్ధతకు అనుకూలించే గుణాలు.* అహింస అనేది ఈ గుణగణాలలో ముఖ్యంగా గమనించవలసిన సుగుణం. సమస్త ప్రాణులపట్లా అహింస మనకు విధ్యుక్తధర్మం; కొందరు మానవులను హింసించకుండా, జంతువులను పరమక్రూరంగా హింసించటం అనిగాని మరికొందరి మాదిరి చీమలకు చక్కెర పెడుతూ, కుక్కలను పిల్లులను సంరక్షిస్తూ, తోటి మానవులను మాత్రం స్వేచ్ఛగా, నిరాటంకంగా, సర్వవిధాల హింసించటం అనిగాని అహింసాతాత్పర్యం కాబోదు. (“అతి సర్వత్ర వర్జయేత్” అనే సత్యాన్ని పాటించక) ఈ లోకంలో ఏ సద్భావాన్ని అయినా ఏవగించే పర్యంతం అవలంబించటానికి అవకాశం వుందని గమనించదగ్గ విషయం. ఏ సదాచారాన్నైనా శాస్త్రాన్ని మక్కికి మక్కిగా గ్రహించి, అతిగా అవలంబిస్తే చివరకు దానివల్ల నిజానికి మనకు చెడు కలుగుతుంది. తమ శరీరంలోని క్రిములు చనిపోతాయనే భయంతో స్నానమే చేయక దుర్వాసన నింపే సన్న్యాసులు కొన్ని సంప్రదాయాలలో వున్నారు. వాళ్ళు తమ సోదర మానవులకు ఎలాటి బాధను, రోగాలను కలిగిస్తున్నారో ఆలోచించరు, పాపం! ఏమైనా వాళ్లు వైదిక సంప్రదాయంలోని వారుమాత్రం కారు.
అసూయ లేకుండటమే అహింసకు నిదర్శనం. తాత్కాలిక ఆవేశంలోనో, మూఢవిశ్వాసం వలననో, మరే పురోహిత నిర్బంధం చేతనో ఎవరైనా ఒక సత్కార్యంకాని మంచిదానం కాని చేయవచ్చును. కాని నిజానికి ఎవరిపట్లా అసూయలేనివాడు ఎవడో అతడే మానవకోటిని ప్రేమిస్తాడు. లోకంలో పెద్దమనుషులం అనుకొంటూనే కొందరు అల్పమైన పేరుప్రతిష్ఠలకో నాలుగు కాసులకో ఒకరిపట్ల ఒకరు అసూయాద్వేషపూరితులవటం మనం చూస్తున్నాం. హృదయంలో ఈ అసూయాపిశాచం ఉన్నంతవరకు పరిపూర్ణ అహింసకు అది చాలదూరంలో ఉన్నట్లే. గోవులూ గొర్రెలూ మాంసం తినవు; కాని అంతమాత్రాన అవి మహాయోగులా! అహింసకులా? ఈ వస్తువును ఆ వస్తువును తినకుండా ఏ మూర్ఖుడైనా ఉండొచ్చు; కాని దానివల్ల అతగాడికి శాఖహారులైన జంతువులకంటె ఆధిక్యం కించిత్తూ లేదు. గతిలేని బాలబాలికలను, వితంతువులను నిర్దాక్షిణ్యంగా వంచిస్తూ, డబ్బుకోసం ఎలాటి నీచకృత్యాన్నైనా చేసేవాడు, కేవలం గడ్డితిని జీవించనీ, పశువుకంటె అతగాడు అధముడు. ఎవడి హృదయంలో ఏ జీవజంతువుకూ హానిచేయాలనే తలపు కలుగదో, ఎవడు తన పరమ శత్రువుకైనా కలిగిన శ్రేయాన్నిచూసి ఆనందిస్తాడో, ప్రతిరోజు ఆతడు పందిమాంసం ఆరగించి జీవించనీ, ఆతడే నిజానికి భక్తుడు, ఆతడే యోగి, ఆతడే జగద్గురువు. అంతఃకరణశుద్ధి వర్ధిల్ల తోడ్పడటమే బాహ్యాచారాల విలువ అని సదా మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. బాహ్యశౌచం అంతగా పాటించటం మనకు సాధ్యం కాకపోతే, అంతశ్శౌచాన్ని మాత్రమే లక్షించటం శ్రేయస్కరం. మతధర్మంలోని అంతరాధ్యాత్మిక పారమార్థిక సారాంశాలను మరచి, ఏ మానవుడు, ఏ దేశస్థుడు బాహ్యాచారాలను మాత్రం భల్లూకపుపట్టుపట్టి విడువకుంటాడో ఆ మానవుడికి ఆ దేశప్రజకు చేటే కలుగుతుంది. అంతర్గతమైన చైతన్యాన్ని వ్యక్తీకరించే వరకే రూపాలకు విలువ. ఎప్పుడు ఈ చైతన్యాన్ని ప్రకటించటం మానుతావో అప్పుడు అలాటి రూపాలను నిర్దాక్షిణ్యంగా నెట్టివేయి.
భక్తి సముపార్జనకు తదుపరి సాధనం అనవసాదం.* “నాయమాత్మా బలహీనేన లభ్యః.”* ఈ ఆత్మ బలహీనులకు లభ్యంకాదు అని శ్రుతి వక్కాణిస్తోంది. బలహీనత అంటే శారీరక, మానసిక బలహీనులని ఇక్కడ తాత్పర్యం. “యువా స్యాత్సాధు యువా-ధ్యాయకః, ఆశిష్టో దృఢిష్ఠో బలిష్ఠః” * యువకులు, సత్త్వగుణోపేతులు, కార్యదక్షులు, దృఢగాత్రులు, బలవంతులు – ఇలాటివారే ఆత్మవిద్యను అవలంబించ దగినవారు. ముదిమిచే బలం ఉదిగిన దుర్బలులు, అల్పులు ఏం చేయగలరు? అత్యద్భుతము, అగోచరమూ అయిన మనశ్శరీర శక్తులు ఏ యోగానుష్ఠానంచేగాని రవ్వంత మేల్కోగానే వారు ముక్కముక్కలై పోతారు. కార్యదక్షులు, తరుణవయస్కులు, ఆరోగ్యవంతులు, బలోపేతులు అయినవారినే విజయలక్ష్మి వరిస్తుంది. కాబట్టి శరీరబలం అత్యంతావశ్యకం. సుదృఢశరీరం మాత్రమే ఇంద్రియనిగ్రహంతో కలిగే తాకుడును భరిస్తుంది. భక్తుడు కాగోరేవ్యక్తి బలోపేతుడుగా, ఆరోగ్యవంతుడుగా ఉండాలి. కేవలం దుర్బలులు ఏ యోగాన్ని అవలంబించ యత్నించినా, ఇక నయంకాని ఏ వ్యాధో, ఏ మనోదౌర్బల్యమో సంభవిస్తుంది. ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని బలహీనం చేసుకోవటం ఆత్మవికాసానికి మార్గంకాదు.
మానసిక దుర్బలులు ఆత్మలాభం పొందలేరు. భక్తుడు కాగోరేవ్యక్తి ఉత్సాహపూరితుడై వుండాలి. పారమార్థిక చింతాసక్తుణ్ణి గురించి పాశ్చాత్యులకున్న అభిప్రాయం: ‘ఆతడెన్నడూ నవ్వకూడదు; ముఖం సదా చాగినల్లబారి దౌడలు చప్పబడి వుండాలి.’ భేష్! భేష్! కృశించిన శరీరంతో, దేవిరింపు ముఖంతో కూలబడేవారు వైద్యుడి చికిత్సకు అర్హులు కాని, యోగానికి అర్హులు కారు. ఉత్సాహపూరితమైన మనస్సే నిలకడకు పుట్టినిల్లు. బలసంపన్నమైన మానసమే కంటకభూయిష్ఠ మార్గంలో దారిచేసుకొని ముందుకు వెళ్ళగలదు. మాయాజాలాన్ని భేదించుకొంటూ దారిచేసుకొనే ఈ అత్యంత కష్టకార్యం, నిరుపమాన సంకల్ప బలాన్వితులకు మాత్రమే నియమితమైవుంది.
అయినా మితిమీరిన సంతోషంతో పొంగిపోరాదు.* మితిమీరిన సంతోషం మనలను అసమర్థులను చేస్తుంది; మనశ్శక్తులను దుర్వినియోగపరుస్తుంది. సంకల్పశక్తి ఎంత అధికంగా ఉంటే, కామక్రోధాదులకు వశుల మవటం అంత తక్కువగా ఉంటుంది. విచారకరమైన తీవ్రచింతన ఎంత నిరాదరణీయమో అతిసంతోషమూ అంత నిరాదరణీయం; అంతేగాక సమతచే దీపించే ప్రశాంతస్థితిలో మనస్సు నిలకడ కలిగివున్నప్పుడే సమస్త తత్త్వానుభూతీ సుసాధ్యమవుతుంది.
ఇలా భగవంతుణ్ణి ప్రేమించే విధానాన్ని నేర్వవచ్చును.