మనం ఇక పర్యాలోచింపదగ్గ విషయం ఇష్టనిష్ఠ. “మతాలు ఎన్నో మార్గాలు అన్నే”* అనే సంగతిని గుర్తుంచుకోవాలి. వివిధ మతాల్లోని వివిధ సంప్రదాయాలన్నీ ఒకే భగవంతుడి వైభవాన్నే శతధా ప్రకటిస్తాయని గ్రహించాలి.
శ్లో ॥ “నామ్నా మకారి బహుధా నిజసర్వశక్తి
స్త త్రార్పితా నియమితః స్మరణే న కాలః
ఏతాదృశీ తవ కృపా భగవన్ మ మాపి
దుర్దైవ మీదృశ మి హాజని నానురాగః”*
[అనేక నామాలతో నిన్ను పేర్కొంటూ అనేక నామాలతో వారు (భక్తులు) నిన్ను విభజిస్తున్నారు; కాని వీటిలో ఒక్కో నామంలోను నీ సర్వశక్తిమత్వమే గోచరిస్తోంది – వీటి అన్నిటి మూలాన నువ్వు ఉపాసకుణ్ణి ప్రాపిస్తున్నావు. మానస్సులో నీమీద గాఢానురక్తి ఉన్నంతవరకు (నిన్ను బొందటానికి) కాలనియమ మనేది లేదు; నువ్వు అంతటి సులభుడవు. అయినా నిన్ను ప్రేమింపజాలకుండటం కేవలం నా దురదృష్టం.]
అంతేకాదు. వివిధ మతసంప్రదాయకర్తలైన మహోజ్జ్వల తేజస్సంభవులను – భక్తుడైనవాడు ఎన్నడూ కించిత్తూ ద్వేషించరాదు; వారి చరిత్రను విమర్శించనూ రాదు; దురాత్ములు వారిని నిందించే సమయంలో అలాటి నిందావాక్యాలను వినటం సైతం కూడదు. జగద్వ్యాప్తమైన సానుభూతీ, పరగుణాభినందనశక్తీ, వీటితోబాటు గాఢమైన ప్రేమా కలిగివుండటం ఎంతో దుర్లభం; అలాటివారు అరుదుగా ఉంటారు. ఉదారభావాలతో, సర్వజన సానుభూతితో కూడిన సంప్రదాయాలలో పారమార్థిక దీక్షా తీవ్రత సర్వసామాన్యంగా కొరవడి ఉండటమే కాక వారి చేతుల్లో మతధర్మం సాధారణంగా ఒకవిధమైన రాజకీయ సాంఘిక సంస్థాజీవితస్థాయికి దిగుతుంటుంది. ఇది ఇలా ఉండగా అత్యంత సంకుచిత అభిప్రాయాలతో కూడిన సంప్రదాయాలు స్వీయాదర్శాలపట్ల ‘సెబాస్’ అనదగ్గ ప్రేమను కనబరుస్తూండీ, ఆ ప్రేమనంతా తమ అభిప్రాయాలతో ఏకీభవించని ప్రతివ్యక్తిని ద్వేషించటం చేతనే సంపాదిస్తూన్నట్లు కానవస్తుంది. దైవమా, ప్రేమ ఎంత గాఢమో, సానుభూతీ అంత విశాలంగాగల మహనీయులు ఈ లోకంలో వెల్లివిరిసి ఉండరాదా! కాని అలాటివారు అరుదుగాగాని లేరు. అయినా గాఢమైన మతభక్తిని సర్వజనసానుభూతితో జతపరచే ఈ ఆదర్శంలో అనేకులను సుశిక్షుతులను చేయవచ్చు; ఇష్టనిష్ఠే దీనికి మార్గం. ప్రతిమతంలోని ప్రతిశాఖా స్వీయమైన ఒక ఆదర్శాన్ని మాత్రమే లోకానికి ప్రకటిస్తుంది. కాని శాశ్వతమైన వేదాంతమతం దివ్యాత్మ మందిర ప్రవేశానికి అనువైన అనంత ద్వారాలను తెరుస్తూ సచ్చిదానంద స్వరూపుణ్ణి ప్రకటించే అనంతాదర్శాలను మానవకోటికి చూపుతోంది. భూతవర్తమానాలలో భగవత్పుత్రులుగానో, భగదవతారమూర్తులుగానో వెలసే మహనీయులు మానవజీవిత తత్త్వమనే శిలనుంచి నిర్మించిన బహువిధ దివ్యమార్గాలను అత్యంత ప్రేమానురాగాలతో సాధకులకు చూపటమేకాక, సత్యలోకానికి, ఎక్కడ మాయాతీతమై జీవాత్మ ఆనందసాగరంలో ఓలలాడుతుందో అక్కడికి, సమస్త జనాన్ని, ఇక జన్మించబోయే వారినికూడ ఆహ్వానించటానికై వేదాంత మతం చేతులు చాచుకొని వేచి ఉంది.
కాబట్టి మోక్షసౌధానికి కొనిపోయే బహువిధ మార్గాలలో దేన్నిగాని “కాదు అనరాదు” అని, ద్వేషించరాదని, భక్తిమార్గం చాటుతోంది. అయినా ఎదుగుతున్న మొక్క, చెట్టు అయ్యేవరకు దాని సంరక్షణార్థం చుట్టూ కంచె వెయ్యాలి. పారమార్థికచింత అనే లేతమొక్క ప్రారంభదశలోనే ఆశయాలను ఆదర్శాలను సదా మార్చుకోటం అనే ప్రబలవాయువులకూ వర్షపాతానికి వెంటనే మార్పులకు గురైతే నశిస్తుంది.* మతౌదార్యం పేర అనేకులు ఉబుసుపోక, కేవల వినోదానికై వివిధాదర్శాలలో ఒకదాని వెంట ఒకదానికి మారుతూంటారు. ‘కొత్తవింత, పాత రోత’ అన్నట్లు కొత్త సంగతులను వినాలనే పిచ్చి వారిలో ఒక విధమైన జాడ్యంగా, మతమద్యవ్యామోహంగా వర్ధిల్లుతుంటుంది. కేవల తాత్కాలికోద్రేకం పొందటానికై వారు కొత్త విషయాలను వినగోరుతారు. ఒకదాన్ని గురించిన పొంగు చల్లారగానే వేరొకదానికి వారు తయారవుతుంటారు. అందుకోసం ఎక్కడలేని ఆందోళన, ఆర్తి, ఆవేదన! కేవలం కుతూహలాన్ని తీర్చుకోటానికి, తత్త్వజ్ఞానం వీరికి ఒకరకమైన ‘నల్లమందు అలవాటు’ వంటిది, వీరి పారమార్థిక చింతకు పరమావధి. మరో విధమైన మనుషులున్నారని శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “వీరు ముత్తెపుచిప్పలవంటివారు. స్వాతీ నక్షత్రం ఉచ్చస్థితిలో వున్నప్పుడు ముత్తెపుచిప్ప సముద్రం అడుగుభాగం నుంచి బయలుదేరి స్వాతీవర్షపు చినుకును సంగ్రహించటానికి సముద్ర ఉపరితలానికి వస్తుంది. అది తన చిప్పలను విశాలంగా తెరచుకొని, చినుకొకటి లభించేవరకు నీటిమీద తేలియాడుతుంటుంది. తన చిప్పలో వర్షబిందువు పడగానే సముద్రం అడుగుకు, తన నివాసానికి పోతుంది. అప్పుడు ఆ వర్షబిందువునుంచి ఆణిముత్యాన్ని రూపొందించేవరకు స్థిమితంగా అక్కడే వుంటుంది.
ఇది ఇష్టనిష్ఠా సిద్ధాంతాన్ని అత్యంత కావ్యచాతురితో ప్రకటించే విధానం అనటం నిజం. ఆదర్శంలో ఇలాటి నిష్ఠ ప్రారంభంలో సాధకుడికి అత్యావశ్యకంగావుంది.
“శ్రీనాథే జానకీనాథే అభేదః పరమాత్మని,
తథాపి మమ సర్వస్వం రామః కమలలోచనః.”
[జశ్రీనాథుడూ జానకీనాథుడూ ఒకే పరమాత్మయొక్క అవతారాలే అయినప్పుటికీ కమలలోచనుడైన రాముడే నా సర్వస్వం)* అని శ్రీమద్రామాయణంలో హనుమంతుడు అన్నవిధంగా వచించాలి. లేదా, ]
“సబసే బసియే సబసే రసియే సబకా లీజియే నామ,
హాజీ హాజీ కరతే రహియే బైఠీయే అపనా రామ.”
[అన్నిట్లోవున్న మాధుర్యాన్ని గైకొని, అందరితో కూర్చో, సమస్త నామాలను గ్రహించు, ‘ఔనౌను’ అని పలుకు, కాని నీ ఆసనంలో (అంటే నిష్ఠలో) సుస్థిరుడవవు అని తులసీదాసు వచించిన తీరులో భక్తుడు భావించాలి. మనస్ఫూర్తిగా భక్తిసాధకుడు ఇలా భావిస్తే ఈ చిన్నబీజంనుంచి పరభక్తి అనే భారతదేశపు మర్రిచెట్టువంటి బ్రహ్మాండమైన వృక్షం బయల్వెడలి సమస్త ధర్మవ్యాప్తమగు పర్యంతం శాఖోపశాఖలను వేళ్ళను దశదిశల వ్యాపింపచేస్తూ బ్రహ్మానందఫలదాయకమై విరాజిల్లుతుంది. ఏ పరాత్పరుడు తన ఇష్టదైవమో, సర్వమత సంప్రదాయాలచేతను, సమస్త నామరూపాలచేతను, సర్వాదర్శాలలోను ఉపాస్యుడైనవ్యక్తి ఆ పరాత్పరుడే అని నిజమైన భక్తుడు గ్రహిస్తాడు.