కాని ఇప్పుడు మనం అవతారమూర్తులైన మహాపురుషుల సంగతి అలావుంచి సిద్ధ గురువులను గురించి విచారిద్దాం. సర్వసాధారణంగా మంత్రం ద్వారా వీరు శిష్యహృదయంలో తత్త్వజ్ఞాన బీజాలను నాటుతారు. శిష్యులు ఆ మంత్రాన్ని ధ్యానించాలి. మంత్రం అంటె ఏమిటి? హైందవతత్త్వశాస్త్రం ప్రకారం ఈ ప్రపంచం అంతా నామరూపాల మూలంగా వ్యక్తీకృతమవుతోంది. నామరూపబద్ధం కాని ఎలాటి చిత్తవృత్తీ పిండాండంలో ఉదయించలేదు. ఈ పద్ధతి ననుసరించి ప్రకృతి నిర్మితమవటం నిజమైతే అశేషబ్రహ్మాండమూ ఇలాగే నామరూపబద్ధమై నిర్మితం కావాలి.
యథా ఏకేన మృత్పిండేన
సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ ॥”
(ఛాందోగ్య– 6–1–4 )
(ఒక మట్టిముద్ద ఎలాటిదో తెలుసుకొంటె మృణ్మయాలైన సర్వవస్తువులూ ఎలాటివో తెలుస్తుంది.) ఇలాగే పిండాండ జ్ఞానం బ్రహ్మాండజ్ఞానం పొందటానికి మార్గదర్శక మవుతుంది. రూపమనేది చిప్ప ఐతే నామం, (లేకభావం) దాన్లోని గుజ్జు అనవచ్చు. శరీరమే రూపం, మనస్సే (అంతఃకరణమే) నామం. అంతేగాక శబ్దాలు వాక్ఛక్తిగల జీవులందరిలోను నామంతో అవినాభావసంబంధం కలిగివున్నవి. వ్యక్తిలో పరిమితమైన మహత్తులో లేక చిత్తంలో ఉదయించే వృత్తులు మొదట శబ్దాలుగాను తరువాత అంతకంటె విశిష్టాకృతితో ఒప్పారే ప్రత్యేకరూపాలుగాను వ్యక్తమవుతున్నాయి.
విశ్వంలో హిరణ్యగర్భుడు అనబడే బ్రహ్మ లేక మహత్తత్త్వం మొదట నామంగాను, అనంతరం రూపంగాను అంటె ఈ జగద్రూపంలోను వ్యక్తమైవున్నది. ఇలా వ్యక్తమై ఇంద్రియగోచరమైన ఈ విశ్వమే రూపం; అనిర్వచనీయం, నిత్యం అయిన స్ఫోటమే (శబ్దమే) దీనికి ఆధారభూతమైవుంది. సమస్త భావాలకూ నామాలకూ శాశ్వత మూలవస్తువైన ఈ స్ఫోటం పరమేశ్వరుడి జగద్రచనకు ఆధారభూతమైన మూలశక్తి. విశేషం ఏమంటే పరమేశ్వరుడు మొదట స్ఫోటరూపిగాను అనంతరం విశిష్టమైన ఈ ఇంద్రియగోచర విశ్వరూపిగాను పరిణమిస్తాడు. ఈ స్ఫోటానికి ఒక్క సంజ్ఞే ఉంది; అదే ఓంకారం. అంతేగాక వాగర్థాలు ఎలా సదా అవిభాజ్యాలో ఓంకారమూ నిత్యమైన ఈ స్ఫోటమూ అలాగే అవిభాజ్యాలు. కాబట్టి పరమపవిత్రమూ, సమస్త నామరూపాలకు తల్లీ శాశ్వతమూ అయిన ఈ ఓంకారం నుంచే ప్రపంచమంతా నిర్మితమైనదని భావించవచ్చును. వాగర్థాలు అవిభాజ్యాలు అయివుండీ ఒక్క భావాన్నే తెలుపటానికి అనేక శబ్దాలు ఉండొచ్చు. కాబట్టి జగదుత్పాదన హేతువైన భావాన్ని తెలుపటానికి ప్రత్యేకమైన ఈ ఓంకారం ఒక్కటే సంజ్ఞ కానక్కర్లేదని చెప్పవచ్చు. ఓంకారం ఒక్కటే శబ్దజాలానికంతకూ సంజ్ఞ అనీ ఇలాటిది వేరొకటి లేదనీ ఇందుకు మా సమాధానం. సమస్త శబ్దాలూ స్ఫోటంనుంచే రూపొందినవైనా, స్ఫోటం తానొక ప్రత్యేక శబ్దంమాత్రం కాదు. అంటె ఒక శబ్దాన్ని వేరొకదానినుంచి వేరుపరచే విశేషాల నన్నిటిని తొలగించినప్పుడు ఏది మిగులుతుందో అదే స్ఫోటం; అందుచేత ఈ స్ఫోటం నాదబ్రహ్మమని చెప్పబడుతోంది. ఇప్పుడు అనిర్దేశ్యమైన ఈ స్ఫోటాన్ని నిర్దేశింప చూసే ప్రతి శబ్దమూ ఇక అది స్ఫోటం కాకుండేటంత ప్రత్యేకతను కలిగిస్తూండటంతో, ఏ శబ్దం దానిని అత్యంత సూక్ష్మంగా ప్రత్యేకిస్తుందో, అంతేగాక తోడ్తోడనే దాని తత్త్వాన్ని సాధ్యమైనంత వరకు చక్కగా వెల్లడిస్తుందో అదే దాని నిజమైన సంజ్ఞ; అదే ఓంకారం – మరొకటి కాదు – ఎందుకంటె అ, ఉ, మ్ అనే అక్షరాలను చేర్చి ఉచ్చరించేటప్పుడు ఏర్పడే ఓంకారం సమస్త శబ్దాలకూ సామాన్యమైన సంజ్ఞగా ఒప్పుతుంది. అక్షరాలన్నిటిలో అకారం ఎంతో తక్కువైన ప్రత్యేకతగల శబ్దం; అందుచేతనే “అక్షరాణాం అకారోఽస్మి” * అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపి ఉన్నాడు. అంతేగాక ఉచ్చరింప తగిన శబ్దాలు అన్నీ జిహ్వామూలం నుంచి పెదవుల వరకుగల తావుననే జనిస్తున్నాయి. కంఠస్థానంలో జనించే శబ్దమే అకారం, పెదవులవద్ద బయల్వెడలే శబ్దం మకారం; అంతేగాక జిహ్వామూలంలో ఆరంభమై పెదవులవద్ద అంతమయే వరకు ధ్వనించే శబ్దవ్యాప్తిని సరిగా ఉకారం వెల్లడిస్తుంది. తగురీతిన ఉచ్చరిస్తే ఈ ఓంకారం శబ్దోచ్చారణ ప్రక్రియను అంతా తెలుపుతుంది; ఈ కార్యం ఏ ఇతర శబ్దానికీ సాధ్యంకాదు; కాబట్టి ఇది స్ఫోటానికి అత్యంత యోగ్యమైన సంజ్ఞ. స్ఫోటమే ఓంకారానికి నిజమైన అర్థం. అంతేగాక శబ్దం అది తెలిపే వస్తువునుంచి సదా అవిభాజ్యమై వుండటంతో ఓంకారమూ స్ఫోటమూ ఒక్కటే. అంతేగాక స్ఫోటం ఈ దృశ్య ప్రపంచపు సూక్ష్మారూపమే కాబట్టి ఇది భగవంతుడికి అత్యంత సన్నిహితమైనది. అంతేగాక తత్త్వజ్ఞానం మొదట స్ఫోటరూపంలో వ్యక్తమవుతూండటంతో ఈ ఓంకారం నిజానికి పరమేశ్వర చిహ్నమైవుంది. అంతేగాక అద్వితీయం, అఖండ సచ్చిదానందమయమూ అయిన బ్రహ్మాన్ని అపరిపూర్ణులైన మానవులు తమ ప్రత్యేక దృక్పథాలకు అనుగుణంగా మాత్రమే గ్రహించగలిగి ఉండటంచేతా, బ్రహ్మాన్ని ప్రత్యేకగుణ విశిష్టంగా భావిస్తూండటంచేతా, బ్రహ్మశరీరమైన ఈ విశ్వాన్ని గురించి ఇలాగే తమ చిత్రానుగుణంగా భావించవలసి ఉంది.*
భక్తుడి మనస్సు దాని తత్త్వాలు తిప్పిన వంకకు తిరుగుతూంటుంది. ఫలితం ఏమిటంటె, ఒక్క భగవంతుడే వివిధ నామరూపాలతో, వివిధ గుణాలతో ఉపాసకులకు గోచరిస్తాడు. ఇలాగే ఒక్క విశ్వమే మన దృక్పథం మేరకు బహువిధాలుగా కనిపిస్తుంది. ప్రత్యేకత చాల తక్కువగాను, సర్వగతత్వం చాల ఎక్కువగాగల ఓంకారంలో శబ్దం, అర్థం ఎలా అవినాభావసంబంధం కలిగి ఉన్నవో అలాగే విశ్వాన్ని గురించీ, విశ్వేశ్వరుణ్ణి గురించీ తత్త్వార్థులకు గల నానాభావాలు అన్యోన్యసంబంధాలై ఉన్నవి. కాబట్టి వీటిలో ఒక్కొక్క భావాన్ని తెలుపటానికి ఒక్కొక్క శబ్దం ఉండాలి. ఋషీశ్వరుల గాఢసాక్షాత్కారాలనుంచి రూపొందిన ఈ శబ్దాలు (మంత్రాలు) లోకాన్ని గురించీ, లోకేశుణ్ణి గురించీ వారివారి దృక్పథాలను తెలుపుతాయి. కాని ఈ తెలుపటం అనేది సాధ్యమైనంత వరకే అని గుర్తించాలి. అఖండమైన నిర్గుణబ్రహ్మానికి ఓంకారం సంజ్ఞ అయిన తీరులోనే* ఇతర సంజ్ఞలు (మంత్రాలు) బ్రహ్మాన్ని గురించిన వివిధాలైన (ఖండ) సగుణ భావాలకు సూచనలు. ఇవి అన్నీ ధ్యానానికీ తత్త్వజ్ఞానసముపార్జనానికీ మనకు తోడ్పడతాయి.