ప్రతిజీవీ పరిపూర్ణత గాంచటం విధాయకం, తుదకు ప్రతిప్రాణీ పరిపూర్ణత పొందుతుంది. మన వర్తమానస్థితి, మన పూర్వకర్మల, మన పూర్వాలోచనల ఫలితం; ఇలాగే మన భావిస్థితి ప్రస్తుత కర్మలకూ భావాలకూ ఫలితం. కాని ఇలా మన భావిస్థితిని నిర్మించుకోవటం మనలను పరుల సాయం పొందనివ్వక అడ్డదు; అంతేకాదు, అనేకులకు అలాటి సాయం అవశ్యం కావలసివుంది. అది లభించినప్పుడు ఆత్మశక్తి సామర్థ్యాలు ఉద్దీప్తాలవుతాయి. పారమార్థిక జీవితం ప్రబోధ మందుతుంది, అభివృద్ధి చురుకుగా సాగుతుంది. చివరకు మానవుడు పావనుడై పరిపూర్ణత నొందుతాడు.
ఈ ఉద్దీపనశక్తిని పుస్తకాలనుంచి పొందలేం. ఆత్మ మరొక ఆత్మ వలననే ప్రేరణ పొందుతుంది; వేరేమార్గం అసాధ్యం. యావజ్జీవం గ్రంథపఠనం చేసినా, మహామేధావులమైనా, చివరకు మనం ఆవగింజంతకూడ ఆత్మవికాసం పొందలేదని మనకే తెలుస్తుంది. ధీవికాసం వెంబడే దానికి అనురూపమైన ఆధ్యాత్మికోన్నతి లభిస్తుందనుకోటం సత్యదూరం. గ్రంథపఠనంలో మనం పారమార్థిక సహాయం పొందుతున్నామని ఒక్కొక్కప్పుడు భ్రమిస్తూంటాం; కాని గ్రంథపఠనంవల్ల మనకు కలిగే ప్రతిఫలాన్ని పరికిస్తే చివరకు దానివల్ల కొంచమో గొప్పో లాభం పొందటం కేవలం మన ధీశక్తికి కలుగుతోంది. కాని అంతరాత్మకు కలుగటం లేదని మనకు వెల్లడి అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలను గురించి దాదాపుగా ప్రతివ్యక్తీ అత్యద్భుతంగా మాట్లాడగలుగుతాడు అనుష్ఠానానికి కానీ, నిజమైన పారమార్థికాచరణకు వచ్చేసరికి, ఎంత శోచనీయంగా వెనుకబడి వుంటామో మనం ఎరుగనిది కాదు. ఈ వ్యత్యాసానికి కారణం గ్రంథపఠనం ఆత్మవికాసాన్ని పెంపొందింప చేయకపోవటమే అని చెబుతాను. ఆత్మజ్యోతిని ఉద్దీప్తం చేయాలంటే, తగిన ప్రేరణశక్తి మరొక ఆత్మనుంచి ప్రసరించి తీరాలి.
ఇలాటి ప్రేరణశక్తి ఎవరిలోనుంచి ప్రసరిస్తుందో ఆతడే గురువు, దాన్ని గ్రహించేవాడే శిష్యుడు. ఇలా ఎవరినైనా ప్రేరేపించటానికి గురువు శక్తిని సంక్రమింపచేయగలవాడుగా ఉండాలనటం మొదటవిషయం. రెండవది దాన్ని గ్రహించే వ్యక్తి అందుకు అర్హుడై వుండాలి. బీజం సజీవమై ఉండాలి; క్షేత్రం సాగుచేయబడి సిద్ధంగా వుండాలి. ఇవి రెండూ చేకూరితే పారమార్థిక చింత అనే సస్యం అత్యద్భుతంగా ఫలిస్తుంది. “ఆశ్చర్యోవక్తా కుశలోఽస్యలబ్ధా” * – నిజమైన ధర్మప్రబోధకుడు ఆశ్చర్యకరశక్తులు కలిగి ఉండాలి, శ్రోతకూడ కుశలుడు లభించాలి; ఇలా ఇద్దరూ అద్భుతవ్యక్తులై, అసాధారణులైనప్పుడు మాత్రమే దివ్యమైన ఆత్మప్రబోధం సహకరిస్తుంది. ఇలాటివారే నిజమైన ఆచార్యులు, నిజమైన శిష్యులు, నిజమైన జిజ్ఞాసువులు. ఇతరులందరికీ ఆధ్యాత్మికత అనేది వట్టి వినోదం, ఆట. వారిలో ప్రబోధం పొందేది రవ్వంత కుతూహలం, ప్రజ్వలించేది రవ్వంత వైజ్ఞానికి పిపాస. వారిని ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రధమస్థాయీ అంచున నిలబడినట్లుగా చెప్పాలి. అయినా ఇదీ కొంత ప్రయోజనకరమే; ఎందుకంటె కాలక్రమాన ఇది నిజమైన పారమార్థిక జిజ్ఞాస అనే దాహాన్ని జనింప చేయవచ్చు; అంతేగాక క్షేత్రం సంసిద్ధమవగానే బీజం వచ్చిపడుతుంది, పడితీరుతుంది; ఇది మనకు అగోచరమైన ప్రకృతి శాసనం. అంతరంగంలో నిజమైన జిజ్ఞాస జనించగానే అలాటి వ్యక్తికి తోడ్పడటానికై జ్ఞానప్రదాత అయిన గురువు కనిపిస్తాడు, కనిపించి తీరుతాడు. తాత్వికతేజాన్ని ఆకర్షించుకొనేశక్తి శిష్యుడిలో దృఢమై పరిపూర్ణత నొందగానే దాన్ని సఫలీకృతం చేసేశక్తి క్రమంగా లభించి తీరుతుంది.
కాని భక్తిమార్గాన కొన్ని గొప్ప ప్రమాదాలు ఉన్నాయి. ఆచార్యుడివల్ల తత్త్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని – భావావేశాన్ని – నిజమైన జిజ్ఞాసగా భ్రమించవచ్చు. మన జీవితాల్లోనే దాన్ని మనం గమనించవచ్చు. మనం ప్రేమించిన వ్యక్తి ఒకడు మరణించటం ఎన్నోసార్లు తటస్థిస్తుంది, మన గుండె పగులుతుంది, సమస్తం నశించిపోతూందని మనకు తోస్తుంది; అంతకంటె నిత్యమూ ఉన్నతమూ అయినదేదైనా కావాలనిపిస్తుంది. ఇక మనం పారమార్థికాసక్తులం కావాలని భావిస్తాం. కొన్ని రోజులు గడవగానే ఆ శ్మశానవైరాగ్య తరంగం సమసిపోతుంది; ‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు మళ్ళా పూర్వస్థితి సంప్రాప్తమవుతుంది. ఇలాటి క్షణిక భావావేశమే పారమార్థిక జిజ్ఞాసగా మనమంతా తరచు భ్రమపడుతూంటాం. కాని ఇలా భ్రమపడుతున్నంత వరకు యథార్థం, నిరంతరం అయిన పారమార్థిక పిపాస కలుగదు; అలాటి ప్రబోధ మొనరించే నిజమైన ఆచార్యుడు లభించడు. కాబట్టి మన సత్యాన్వేషణమంతా నిష్ప్రయోజనమైనదని వాపోవటం, బుద్ధి మారినప్పుడల్లా, అలా వాపోవటానికి మారు, ఆత్మపరీక్షచేసుకొని మనకు నిజమైన జిజ్ఞాస ఉందా లేదా అని విచారించటం మన ప్రథమ కర్తవ్యం. అలా చేసినట్లయితే నూటికి తొంభైపాళ్లు తత్త్వజ్ఞానానికి మనకు ఇంకా అర్హత కలుగలేదనీ మన జిజ్ఞాస నిజమైనది కాదనీ వెల్లడవుతుంది.
తత్త్వోపదేశం చేసే గురువు విషయంలో ఇంతకంటె గొప్ప ప్రమాదాలున్నాయి. స్వయంగా అజ్ఞానపంక నిమగ్నులమైవుండీ గర్వాతిరేకంతో సర్వజ్ఞులమని విర్రవీగుతూ, అంతటితో ఆగక, పరులను తరింపచేయటానికై తమ భుజాలను అందివ్వటానికి వెనుతియ్యక, కానన్నవారు కానన్నవారికి నాయకులై చివరకు వారూ వీరూ కలిసి గోతిలో పడుతూంటారు.
“అవిద్యాయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పణ్డితం మన్యమానాః
జంఘన్యమానాః పరియన్తి మూఢా
అన్ధేనైవ నీయమానా యఽథాన్ధాః”*
“మూఢులు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ, మా కంటె ధీరులు లేరని విర్రవీగుతూ, పండితులుగా భావిస్తూ గుడ్డివారిచేత నడపబడే గుడ్డివారి మాదిరి తొట్రుపాటు చెందుతూ పరిభ్రమిస్తూంటారు.” ప్రపంచం ఇలాటి డాంబికులతో నిండి ఉంది. ప్రతి వ్యక్తికీ తాను ఆచార్యుణ్ణి కావాలనే తహతహ! ప్రతి యాచకుడికీ తాను పదిలక్షలు దానం చేయాలనే ఆవేదన! ఈ యాచకుల మాదిరే ఈ ఆచార్యులూ నిజానికి హాస్యాస్పదులే.