ఈ (శుష్క) విధులన్నీ (భక్తుని సంకల్పాన్ని) దృఢపరచటానికి మాత్రమే ఆవశ్యకాలు; అంతకంటె వాటివల్ల అతడికి మరొక ప్రయోజనంలేదు. ఎందుకంటె అజ్ఞానవృతమై చిత్తభ్రమణహేతువైన హేతువాదాన్నుండి సంతరింప చెయ్య, శీఘ్రంగా సాక్షాత్కారసౌధానికి గొనిపోవ సమర్థమైన దివ్యమార్గాన్ని ఆతడు అవలంబిస్తున్నాడు. భగవదనుగ్రహంవల్ల త్వరలోనే ఆతడు డాంబికం, నిస్సారం అయిన హేతువాదాన్ని అతిక్రమించి, అజ్ఞానమనే చీకట్లో తడవులాడే కేవల ధీశక్తినిదాటి, సాక్షాత్కారతేజోనిలయమైన మహోన్నతస్థితిని పొందుతాడు. అతడు ఇక ఎంతమాత్రం హేతువాదానికి దిగడు, హేతువాదాన్ని విశ్వసించడు, స్వయంగా తత్త్వాన్ని దర్శిస్తాడు. ఇక అతడెంతమాత్రం తర్కించడు. కాని స్వయంగా సత్యాన్ని గ్రహిస్తాడు. అంతేగాక ఈ బ్రహ్మదర్శనం – బ్రహ్మానుభవం – బ్రహ్మానందానికి మించినది ఏముంది? ఎందుకు? సాక్షాత్తు ముక్తికంటె భక్తే అధికతరమని వక్కాణించే భక్తులు లేకపోలేదు. అంతేగాక ఇది మహోత్తమ ప్రయోజనం కాదా? ఏది శరీర సౌఖ్యానికి అనుకూలిస్తుందో అదే ఉపయోగకరం, ప్రయోజనకరమని నమ్మేవారు, విశేషంగా అధిక సంఖ్యాకులు లోకంలో వున్నారు. పారమార్థిక చింత, భగవంతుడు, నిత్యత్వం అనే వాటిలో ఏదీ వారికి లేశమాత్రమూ ప్రయోజనకారి కాదు; ఎందుకంటె ఇవి వారికి ధనాన్ని, శరీరసౌఖ్యాన్ని ఇవ్వవు. ఇంద్రియాలను తృప్తిపరచి భోగవాంఛలను అనునయింపని వన్నీ అలాటివారికి నిరుపయోగాలు. ఏమైనా, ప్రయోజనకర మనేది ప్రతీ వ్యక్తి ననుసరించీ ప్రత్యేకమైన కొన్ని వాంఛలతో నిబద్ధమై వుంది. తినటం, తాగటం, సంతానాన్ని కనటం, చివరికి మరణించటం – వీటికంటె ఎన్నడూ ఉన్నతి చెందనివారికి, విషయోపభోగాల్లోనే లాభం కనిపిస్తూంటుంది. మరి వారు అంతకంటె ఉన్నత విషయాల ఆవశ్యకతను లేశమైనా గుర్తించటానికి – గుర్తించ నేర్వటానికి – జన్మజన్మాంతరాలను ఎత్తుతూ వేచివుండాలి. కాని శాశ్వతాత్మాభిరుచులు ఎవరికి క్షణిక ప్రాపంచిక విషయవాంఛలకంటె ఉత్తమ ప్రయోజనకరాలో, ఇంద్రియభోగాలు ఎవరికి అనాలోచితాలైన బాల్యక్రీడలో వారికి భగవంతుడూ భగవద్భక్తీ మానవజీవితంలోని మహోత్తమం, అద్వితీయం అయిన గమ్యంగా కానవస్తుంది. లౌకిక వాంఛల్లో మునిగి తేలే ఈ లోకంలో, భగవదనుగ్రహంచేత కొందరైనా అలాటివారు ఇంకా సజీవులైవున్నారు.
ఇదివరకే చెప్పినరీతిని సాధనదశలోనిదైన గౌణభక్తి, సిద్ధావస్థలోని పరభక్తీ అని భక్తియోగం రెండు విధాలుగా విభజింపబడింది. అభివృద్ధి పొందగలగటానికి సాధన దశలో మనకు అనేక ప్రత్యక్ష సహాయాలు ఎలా అత్యంతం ఆవశ్యకాలో ముందు మనకు విశదం కాగలదు. అంతేగాక పౌరాణికాలు, సాంకేతికాలు అయిన భాగాలు అన్ని మతాల్లోను సహజమైన వికాసం పొంది, ఆత్మాభివృద్ధి పొంది సాధకుడికి ప్రారంభంలో సహాయభూతాలై ఆతడి జీవితాన్ని పరివేష్టించి ఉంటాయి. ఏ మత సంప్రదాయాలలో విపులంగా పురాణాలూ కర్మకలాపాలూ చక్కని వికాసం పొందివున్నవో ఆ మత సంప్రదాయాల్లోనే పారమార్థిక మహిమాన్వితులు – ఆధ్యాత్మిక సింహాలు – వెలువడుతూండటం గమనించాల్సిన విషయం. కావ్య మాధుర్యం ఉన్న పట్టులన్నిటిని, సుందరములూ, ఉదాత్తములుగా భావించే ఘట్టాలన్నిటిని, ఆత్మమార్గంలో ఊగులాడే బాల మానసానికి గట్టిప్రాపు లభింపచేసే పట్టులన్నిటిని నిర్మూలించ యత్నించే శుష్కమూర్ఖాభినివేశపూరితాలైన మతవిధానాలు – ఆధ్యాత్మిక సౌధంలోని మూలస్తంభాలనే పెకలింప యత్నించే మతవిధానాలు – తత్త్వాన్ని గురించి తమకున్న అజ్ఞానంచే, మూఢవిశ్వాసాలచే, ఉజ్జీవనకరాలైన ఘట్టాలన్నిటిని నిర్మూలింప యత్నించే మతవిధానాలు – మానవహృదయంలో వికసించే జ్ఞానలతను రూపొందించే వాటి నన్నిటిని ధ్వంసమొనర్ప యత్నించే మతవిధానాలు – చివరకు తమకు మిగిలేది అంతా సారహీనమైనట్టి ఒట్టి శబ్దజాలమని, నిస్సారమైన ఒట్టి డొలక అని, గుజ్జులేని ఉత్తచిప్ప అని, అధవా ఏదైనా మిగిలినా, సంఘసంస్కరణమని చెప్పబడే ఒకరకమైన ‘పాకీపని’ అని గ్రహించటానికి ఎంతోకాలం పట్టదు. ఇలాటి మతంవారు ఒక పెద్దగుంపు. వారందరూ బుద్ధిపూర్వకంగానైనా కాకున్నా భౌతికవాదుల వర్గంలో చేరతారు. ఇప్పుడు ఇకముందు కూడ వారి జీవిత లక్ష్యం వారి జీవిత పరమోద్దేశం విషయలాలస. వారి అభిప్రాయంలో మానవ జీవితమనే వర్ణసమామ్నాయంలో అకారమూ, క్షకారమూకూడ విషయోపభోగమే. విషయోపభోగమే వారి ఇష్టాపూర్తం. మానవుడి ఐహిక సుఖానికై చేసే వీథులు ఊడ్చటం, పాకీపని మొదలైనవే వారికి జీవిత సర్వస్వం; స్వమతదురభిమాన సమ్మిశ్రితమైన ఈ విచిత్ర పంథాన్ని అవలంబించేవారు లేనిపోని వేషాలు వేయక నిజరూపంలో బాహాటంగా వచ్చి భౌతికవాదుల వర్గంలో – నాస్తికవర్గంలో – ఎంత శీఘ్రంగా చేరితే లోకానికి అంతలాభదాయకం. వారికీ సముచితమైన కార్యం. రవ్వంత ధర్మానుష్ఠానం లేశమైన ఆత్మానుభూతి, కోట్లాది మిట్టపంచాంగాలకంటె, మిథ్యావేదాంతాలకంటె, కోటిరెట్లు ఘనతరమైనది. అజ్ఞానజనితమైన ఈ స్వమతదురభిమానం నుంచి – శుష్కధర్మోపన్యాస ధూళినుంచి – బయల్వెడలే ఒక్క మహోజ్వల పారమార్థిక ప్రతిభాశాలిని చూపండి; చూపజాలని పక్షంలో మౌనంగా హృదయకవాటాలను తెరచి దేదీప్యమానమైన సత్యజ్యోతిని అవలోకించండి; సత్యాన్ని దర్శించి చెప్పే భారతీయ ఋషుల పాదసన్నిధిని బాలకులై కూర్చోండి. ఇక వారేమి, చెబుతారో శ్రద్ధగా విందాం గాక.