ఈశ్వరు డంటే ఎవరు? “జన్మాద్యస్య యతః” – ఈ జగత్తుకు సృష్టిస్థితి లయాలు ఎవని మూలంగా కలుగుతున్నాయో – ఆతడే ఈశ్వరుడు. “ఆతడు నిత్యుడు, శుద్ధుడు, ముక్తుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, దయామయుడు, గురువులకు గురువు,”* గా చెప్పవచ్చు. లేదా విశేషంగా “స ఈశ్వరః అనిర్వచనీయ ప్రేమ స్వరూపః” – ఆ ఈశ్వరుడు అనిర్వచనీయ ప్రేమస్వరూపుడు.
ఇవన్నీ సగుణబ్రహ్మ నిర్వచనాలు. అయితే ఇద్దరు భగవంతులున్నారా? “నేతి నేతి” – “ఇది కాదు, ఇది కాదు” అని వేదాంతి చెప్పే సచ్చిదానందమయ బ్రహ్మం ఒకడు, భక్తుడు వచించే అనిర్వచనీయ ప్రేమస్వరూపుడైన భగవంతుడు వేరొకడా? కాదు; ప్రేమస్వరూపుడైన భగవంతుడే సచ్చిదానందమయుడైన బ్రహ్మం. సగుణ నిర్గుణ బ్రహ్మం ఒక్కడే. భక్తులు ఉపాసించే సగుణుడు, సాకారుడు అయిన భగవానుడు బ్రహ్మంకంటె వేరుకాదని సదా మనం గుర్తించాలి. సమస్తం, అద్వితీయమైన బ్రహ్మమే. అయినా ఏకం, నిర్గుణం అయిన బ్రహ్మం అత్యంత సూక్ష్మం, అతీంద్రియం, మనస్సుకు ఎంతమాత్రం అందని దవటంచేత అలాటి బ్రహ్మాన్ని ప్రేమించి ఉపాసించలేం. కాబట్టి భక్తుడు భగవానుని సగుణావస్థను అంటే సాకారుడైన ఈశ్వరుణ్ణి గైకొని ఉపాసిస్తాడు. దృష్టాంతంతో చెప్పేటప్పుడు అనంతమైన వివిధ వస్తువుల నిర్మాణానికి కారణభూతమైన మృత్తిక వంటిది బ్రహ్మం అని చెప్పదగును. మృత్తికారూపంలో అవన్నీ ఒక్కటే అయినా, ఆకృతి లేక వ్యక్తీకరణం వాటిని వేరుపరస్తోంది. వాటిలో ఒక్కొక్కటీ ఆకృతి పొందక ముందు మట్టిలో గర్భితంగా వుంది; మట్టిగా అవన్నీ ఒక్కటే; కాని ఆకృతి పొందాక ఆ ఆకృతి నిలిచి ఉండేటంత వరకు అవి భిన్నాలు; మట్టి ఎలుక ఎన్నడూ మట్టి ఏనుగ కాబోదు. ఎందుకంటె రూపొందటానికి ముందు మృత్తికారూపంలో అవన్నీ ఒక్కటే అయినా, వ్యక్తీకరణచేత భిన్నాలవుతున్నాయి. వ్యక్తీకృతమైన మహోన్నత పారమార్థిక సత్తే ఈశ్వరుడు లేదా బ్రహ్మాన్ని గురించిన ఎరుకలో మానవ మానసం అధిరోహించగల మహోన్నతస్థాయే ఈశ్వరుడని చెప్పతగును. సృష్టి అనాది, నిత్యం; ఈశ్వరుడూ అలాటివాడే.*
“జగద్వ్యాపారవర్జమ్ ప్రకరణాదసన్నిహితత్వాచ్చ” * అనే సూత్రంలో వ్యాసుడు ముక్తుడికి దాదాపుగా అనంతశక్తి, అనంతజ్ఞానం కలుగుతాయని చెప్పిన పిమ్మట సృష్టిస్థితి సంహార శక్తిమాత్రం పరమేశ్వరుడిదే అనీ ఇతరులెవ్వరూ దాన్ని పొందలేరనీ చెప్పాడు. ఈశ్వరాధీనుడైన జీవుడికి అనంత శక్తీ పరిపూర్ణ స్వాతంత్ర్యమూ ఎలా ఎన్నటికీ అసాధ్యాలో తెలుపటం మన ద్వైతవ్యాఖ్యాన కర్తలకు ఎంతో సులభం. ద్వైతవ్యాఖ్యానకర్త అయిన మధ్వాచార్యుడు ‘తన మామూలు టూకీ పద్ధతి’ ననుసరించి వరాహపురాణంనుంచి ఒక శ్లోకాన్ని ఉదహరించి ఈ ఘట్టానికి తాత్పర్యం చెప్పేశాడు.*
ఈ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ రామానుజాచార్యులు ఇలా అంటున్నారు:* – “అసాధారణమైన పరమేశ్వరుడి జగత్ సృజనాదిశక్తీ, సర్వేశ్వరత్వమూ ముక్తుని ఐశ్వర్య సంపదలో చేరుతుందా లేక పరమేశ్వర సాక్షాత్కార మొక్కటే అతడి ఐశ్వర్యమా? అనే అనుమానం బయలుదేరినప్పుడు ఈ కింది వాదాన్ని వింటున్నాం: ‘నిరంజనః పరమం సామ్య ముపైతి’ అనే శ్రుతివాక్యాన్ని అనుసరించి ముక్తుడికి జగదీశ్వరత్వం అబ్బుతుందనటం సబబే. అసాధారణమైన సర్వేశ్వరుని జగన్నియమనశక్తిని పొందకుండానే వానితో సర్వతోముఖత్వాన్నీ, సత్యసంకల్పత్వమూ సిద్ధించవు. కాబట్టి వీటిని పొందటానికై ముక్తుడు జగన్నియమనశక్తిని పొందుతాడని మనం ఒప్పుకోవాలి. ఇందుకు మా జవాబు ఇది: జగన్నియమనశక్తి తప్ప మిగిలినవన్నీ ముక్తుడికి లభిస్తాయి. జగన్నియమన మంటే, సమస్త చేతనాచేతనాల స్వరూపస్థితి ప్రవృత్తిభేదాలను నియమించటం. పరమేశ్వరుడి యథార్థ స్వభావానికున్న రహస్యాలు ఎవరి దృక్పథంనుండి తొలగింపబడినదో ఆ ముక్తులు నిర్వ్యాజమైన బ్రహ్మాత్మానుభవం పొందుతారేగాని జగన్నియమనశక్తిని పొందలేరు. ఈ విషయంలో ‘యతోవా ఇమాని భూతాని జాయన్తే । యేన జాతాని జీవన్తి । యత్స్వయం త్యభిసంవిశన్తి । తద్విజిజ్ఞానస్వ । తద్బ్రహ్మ – ఎవనిలోనుండి ఈ భూతాలన్నీ పుడుతున్నవో, ఎవనిచేత సృష్టిజాతమంతా జీవిస్తోందో, లయానంతరం తిరిగి ఎవరిలో ప్రవేశిస్తూందో – దాన్ని గురించి జిజ్ఞాసచెయ్యి, అదే బ్రహ్మం’ – అని శ్రుతి చెబుతోంది. జగన్నియమన లక్షణం ముక్తులకు కూడ సామాన్యమైతే జగదీశ్వరత్వాన్ని బ్రహ్మలక్షణంగా చెప్పే ఈ శ్రుతి వాక్యం అసంగతం అనవలసి వస్తుంది. అసాధారణ లక్షణాలే వస్తువును నిర్దేశించేవి. అందుచేత ‘స దేవ సామ్యేదమగ్ర ఆసీ దేక మేవాద్వితీయం తదైక్షత బహుస్యాం ప్రజాయే యేతి తత్తేజో-సృజత’ – ‘వత్సా, ఏకం, అద్వితీయం అయిన వస్తువు ఒక్కటే ఆదిలో వుండినది. అది అనేకం సృజించాలనుకొంది. అప్పుడది తేజాన్ని సృజించింది.’ బ్రహ్మవా ఇదమేక మేవాగ్ర ఆసీత్ తదేకం సన్నవ్యభవత్, తచ్ఛ్రేయోరూప మత్య సృజత క్షత్రం! యాన్యేతాని దేవక్షత్రాణి ఇన్ద్రోవరుణః సోమోరుద్రః పర్జన్యో యమో మృత్యు రీశాన ఇతి– (నిజంగా) బ్రహ్మం ఒక్కటే ఆదిలో ఉండినది. అది అనేకమైంది. అది శ్రేయమైన క్షత్రరూపాన్ని సృజించింది. వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు– ఈ దేవత లందరు క్షత్రులే.’ – ‘ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, నాన్యత్కించన మిషత్ । స ఈక్షత లోకాన్ను సృజా ఇతి । స ఇమాన్ లోకానసృజత’ – ‘ఆత్మ ఒక్కటే ఆదిలో ఉండినది; మరేదీ (స్పందింప) లేదు; ఆతడు లోకాన్ని స్పజింప సంకల్పించాడు, అటు తర్వాత ఆతడు లోకాన్ని సృజించాడు. – ‘ఏకో హవై నారాయణ ఆసీన్న బ్రహ్మానేషోనో నసూర్యః స ఏకాకీ నరమేత । తస్య ధ్యానావస్తస్యైకా కన్యాదశ్రేన్ద్రియాణి’ – ‘నారాయణుడు ఒక్కడే ఉన్నాడు; బ్రహ్మలేడు, ఈశానుడు లేడు, దివి లేదు, భువి లేదు, చుక్కలు లేవు, నీరు లేదు, నిప్పు లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ఏకాకి అయిన ఆతడు రమింపకున్నాడు. ఆతడు తన ధ్యానానంతరం ఒక్క కూతురును, దశేంద్రియాలను పొందాడు! అంతేగాక ‘యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అన్తరః’ ఇత్యారభ్య ‘య ఆత్మనితిష్ఠన్’ – పృథివిలో సంస్థితుడైనా ఎవడు పృథివికంటె భిన్నుడో, ఆత్మలో సంస్థితుడైనా’ – మొదలైన వాక్యాలచేత పరమపురుషుడు జగన్నియమన కర్త అని శ్రుతులు వక్కాణిస్తున్నాయి… “ఈ వర్ణన లన్నిటిలో ముక్తుని విషయమై అలాటప్రసక్తి ఏదీ కానరాదు కాబట్టి జగన్నియమనం ముక్తుడి లక్షణం కాదు.” తరువాతి సూత్రానికి* వ్యాఖ్యానం చేస్తూ రామానుజులిలా వచిస్తున్నారు.* “ఇందుకు వ్యతిరిక్తంగా వేదాల్లో ప్రమాణ వచనాలు ఉండటంచేత ఇది కాదంటారా, ఆ వచనాలు అస్వతంత్ర దేవతా లోకాల్లో ముక్తులకు కలిగే ఐశ్వర్యాన్ని తెలుపుతాయి.” మన చిక్కుకు ఇదీ ఒక సులభ పరిష్కారమే. రామానుజ సిద్ధాంతం ఏకత్వాన్ని అంగీకరిస్తోంది. అయినా అలాటి సాముదాయకస్థితిలో అంతర్గతాలైన నిత్యభేదాలున్నాయని ఆతడి సిద్ధాంతం. ప్రాయికంగా ఇదీ ద్వైతసిద్ధాంతమే అవటంచేత జీవేశ్వరుల మధ్యవున్న భేదాన్ని స్పష్టంగా నిరూపించటం రామానుజులకు సులభసాధ్యమైంది.
ఇక ఈ విషయంగా అద్వైతసిద్ధాంత మహాప్రవక్త ఏం చెబుతాడో గ్రహించటానికి ప్రయత్నిద్దాం. ద్వైతమతస్థుడి ఆశయాలన్నిటిని అద్వైతమతం యథారూపంలో సమర్థిస్తూనే మానవ దివ్యత్వ పరమావధికి అనుగుణంగా సమస్యకు తన పరిష్కారాన్ని ఎలా ప్రతిపాదిస్తూందో చూద్దాం. ముక్తి పొందిన తరువాత కూడా తమ ప్రత్యేక మానసాన్ని తమ వ్యక్తిత్వాన్ని నిలిపి ఉంచుకోవాలని ఆశించేవారు తమ ఆశయాలను ఈడేర్చుకోటానికి సగుణబ్రహ్మ ప్రసాదాన్ని పొందటానికి అద్వైత మతంలో ఎంతైనా అవకాశం వుంది. వీరిని గూర్చే భాగవత పురాణంలో ఇలా చెప్పబడింది: “ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథా అప్యురుక్రమే । కుర్వంత్యహైతుకీమ్ భక్తిమిత్థం భూతగుణో హరిః ॥ –* ఆత్మారాములూ, భవబంధ విముక్తులూ, నిరపేక్షులూ అయిన మునులు అవ్యాజంగా హరిభజన చేస్తూంటారు; హరి ఇలాంటి అనంతకల్యాణ గుణాన్వితుడు.” ఈ కల్పంలో ప్రకృతిలో లయమొంది, పరిపూర్ణత నొందాక తరువాతి కల్పంలో లోకపాలకులై వెలువడుతారని సాంఖ్యులచేత చెప్పబడేవారూ వీరే. కాని వీరిలో ఎవ్వరూ ఈశ్వరుడితో సమానులు కారు. ఎక్కడ సృష్ట్యాదికాలు లేవో, ఎక్కడ జ్ఞాతృజ్ఞానజ్ఞేయాలు లేవో, ఎక్కడ నువ్వు నేను వాడు అది అనే వ్యత్యాసాలు లేవో, ఎక్కడ కర్తృత్వ భోక్తృత్వాదికాలు కానరావో, అక్కడ ఎవడు ఎవరిని చూస్తాడు?* అలాటివారు సర్వాతీతులై అవాఙ్మానసగోచరమైన తావుకు* శ్రుతులు, “అథాత ఆదేశోనేతి నేతి” – “ఇది కాదు, ఇది కాదు,”* అని (దేన్నిగూర్చి) వక్కాణిస్తుందో ఆ తావుకు వెళ్తారు; కాని ఈ మహోన్నతస్థితిని పొందజాలనివారికి, లేక పొందనివారికి ఏకం, అవ్యాకృతం అయిన బ్రహ్మంయొక్క సాక్షాత్కారం జీవజగదీశుల రూపంలో త్రిగుణాత్మకమై గోచరించటం విధాయకం. ఈ కారణంగా ప్రహ్లాదుడు తనను తాను మరచిపోయినప్పుడు జగత్తుగాని జగత్కర్తగాని ఆతడికి కానరాలేదు; సమస్తం నామరూప భేదరహితమైన ఒకే అనంత వస్తువుగా గోచరించింది. కాని ఆతడికి తాను ప్రహ్లాదుడననే స్ఫురణ కలగగానే ఎదుట జగత్తు, జగత్తుతో అనంతకల్యాణగుణకరుడైన* జగదీశుడు సాక్షాత్కరించాడు. ధన్యాత్ములైన గోపికల విషయంకూడ ఇలాంటిదే. తమ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకత్వాన్ని మరచి ఉన్నంతదాకా వారందరూ కృష్ణులే;* మరి తాము గోపికలమనీ ఆరాధ్యుడనీ* భావింప మొదలుపెట్టగానే, “తాసామావి ర్భూ చ్ఛౌరిః స్మయమాన ముఖాం బుజః! పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్మన్మథ మన్మథః ॥ * – స్మయమాన ముఖాంబుజుడు, పీతాంబరధారీ, వనమాలీ, సాక్షాత్తు మన్మథమన్మథుడు అయిన కృష్ణుడు వారికి సాక్షాత్కరించాడు.”
ఇక శంకరాచార్యుని వ్యాఖ్యానానికి* మరలుదాం: “మనోయుక్తులై ఎవ్వరు సగుణబ్రహ్మోపాసన మొనరించి, ఈశ్వర సాయుజ్యం నొందుతారో వారి ఐశ్వర్యానికి అవధివుందా లేదా అని శంకిస్తే మనకు ఈ కింది విషయాలు వెల్లడవుతాయి: ‘ఆప్నోతి స్వారాజ్యం’ – వారు స్వరాజ్యాన్ని పొందుతారు, ‘సర్వేస్మైదేవా బలిమావహన్తి’ – దేవతలందరు ఆతణ్ణి పూజిస్తారు; ‘తేషాం సర్వేషు లోకేషు కామాచారో భవతి’ – సమస్త లోకాల్లోను వారికి కామచారం (స్వేచ్ఛావిహారం) కలుగుతుంది. ఇలాటి శ్రుతివాక్యాలనుబట్టి చూస్తే వారి ఐశ్వర్యం నిరవధికమని చెప్పాలి. ఇందుకు వ్యాసుడు ‘జగన్నియమనశక్తి తప్ప’ అని సమాధాన మిస్తాడు. జగత్సృజనాదిశక్తులు తప్ప తక్కిన అణిమాది సిద్ధులన్నీ ముక్తులకు కలుగుతాయి. జగన్నియమనశక్తి, నిత్యపరిపూర్ణుడైన ఈశ్వరుడిదే. ఎందుకంటె సృజనాది శక్తులను గురించిన శ్రుతివాక్యాలు ఆతడికే అనువర్తిస్తాయి, అంతేగాక ఈ సందర్భంలోని శ్రుతుల్లో ముక్తుడి ప్రశక్తే లేదు. నిజానికి పరమేశ్వరు డొక్కడే జగన్నియామకుడు. సృష్ట్యాది విషయకాలైన శ్రుతులన్నీ ఆయన్నే తెలుపుతాయి. అంతేగాక (ఈశ్వరవిషయమై) ‘నిత్యపరిపూర్ణు’ డనే విశేషణంకూడ ప్రయోగింపబడివుంది. దీనికి తోడు అణిమాది సిద్ధులు ఈశ్వరాన్వేషణచేతా, ఈశ్వరారాధనచేతా కలిగేవని శ్రుతులు చెబుతున్నాయి. కాబట్టి జగన్నియమనంలో ముక్తులకు అధికారం లేదు. అంతేగాక వారు తమతమ మానసాలతో కూడివుండటంచేత వారివారి సంకల్పాలు భేదింపవచ్చును. ఒకడు సృష్టిద్దామనుకొంటే వేరొకడు సంహారం చెయ్య ఇచ్చగించవచ్చు. ఈ దోషాన్ని పరిహరించటానికి అందరి సంకల్పాలను ఎవరిదో ఒకరి సంకల్పానికి కట్టుబడివుండేట్లు చెయ్యటం ఒక్కటే మార్గం. కాబట్టి ముక్తుల సంకల్పాలు పరమేశ్వర సంకల్పం మీద ఆధారపడి ఉంటాయనటం సిద్ధాంతం.”
ఈ కారణాన సగుణబ్రహ్మ భావననే భక్తిని ప్రసరింప చేయవచ్చును. ‘క్లేశో-ధికతరస్తేషామవ్యక్తాసక్త చేతసామ్’* – నిర్గుణబ్రహ్మంలో ఆసక్తమైన మనస్సున్నవారి మార్గం కష్టతరం. మన స్వభావానికి అనుగుణంగా ఉంటే భక్తివాహిని నిరాటంకంగా ప్రవహిస్తుంది. బ్రహ్మాన్ని గురించి భావించేటప్పుడు మానవ రూపంతో, మానవస్వభావంతో కూడినవాడని భావిస్తాం; వేరేవిధంగా భావింపలేమనటం నిశ్చయం. కాని మనం గ్రహించే ఇతర విషయాలన్నిటిపట్లా ఈ సత్యం అనువర్తించటం లేదా? ఇంతవరకు లోకానికి తెలిసిన మహోన్నత మనశ్శాస్త్రజ్ఞుడైన కపిల భగవానుడు బాహ్యాంతరాల్లో మనం ఊహ చేతగాని ప్రత్యక్షదర్శనంచేత గాని గ్రహించే సమస్తవస్తుజాతం యొక్క నిర్మాణానికే మానవుడి ఎరుక అనేది ప్రధానతత్త్వమని అనేక శతాబ్దాలకు ముందే నిరూపించాడు. మన శరీరాలు మొదలుకొని ఈశ్వరుని పర్యంతం మనకు గోచరించే ప్రతీ వస్తువులోను, మన ఎరుకా, ఎరుకతో కూడిన మరేదో ఒకటి (అదేదైనా అవనీ) ఉందని గ్రహింపవచ్చును. ఆ ఇతర మేదైనా అవనీ, అనివార్యమైన ఈ మిశ్రమమే సామాన్యంగా మనం సత్యమని భావించేది. నిజంగా సత్యంలో మానవ మనస్సు ఎరుగగల భాగం ఇప్పటికీ ఎప్పటికీ ఇంతే. మానవాకృతితో, మానవస్వభావంతో కూడినవాడని భావింపబడటంచేత ఈశ్వరుడు మిథ్య అనటం ప్రలాపం. ఇది ఆదర్శవాద బాహ్యసత్తావాదా (ష్ట్రలిబిజిరిరీళీ) లను గురించి పాశ్చాత్యుల్లో భీకరంగా కనిపించే వాగ్వాదాల మాదిరి వుంది. వీటిని గురించి ఏం కోలాహలం, ఏం గందరగోళం! దీనికంతటికి మూలం సత్తా అనే మాటను గురించి కేవల వాక్చమత్కారం! సత్తా అనే మాటచేత తెలిసే అభిప్రాయమంతా ఈశ్వరుడనే భావంలో ఇమిడి ఉంది. అంతేగాక లోకంలో మరే ఇతర వస్తువైనా ఎంతసత్యమో ఈశ్వరుడూ అంతే సత్యం.* పర్యవసానంలో ప్రస్తుతం సూచితమైన దానికంటె విశేషార్థాన్ని దేన్ని సత్తా అనే శబ్దం తెలుపదు. ఈశ్వరుణ్ణి గురించి మన తత్త్వశాస్త్ర అభిప్రాయం ఇది.