(అమెరికాలో ఉపన్యసించబడింది)
జగత్తులో బ్రహ్మమనబడే ఒక్క సద్వస్తువు మాత్రమే వుందని, అద్వైత సిద్ధాంతం. మిగిలిందంతా అసత్తు, ఆభాస మాత్రమే. మాయ మహిమవల్ల ఇదంతా బ్రహ్మంనుండి కల్పితమవుతోంది. బ్రహ్మంలో, ఐక్య భావాన్ని పొందడమే మనకు పరమగమ్యం. మన మందరం, మనలోని ప్రతి వ్యక్తీకూడ, మాయచేత కప్పబడిన బ్రహ్మమే – ఆ ఏకైక సత్పదార్థమే సుమండీ! అజ్ఞాన రూపమైన ఈ మాయను తొలగించుకొంటే, మన సత్య స్వరూపాన్ని మనం తిరిగి పొందగలం. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రతి మనుష్యుడు, మూడు భాగాలతోకూడి ఏర్పడుతున్నాడు. 1) శరీరం 2) మనస్సు (లేక అంతఃకరణం) 3) వీని రెంటికిని వెనుక జీవుడు లేక ఆత్మ అనబడే వస్తువు. మనస్సు (లేక అంతఃకరణం) ద్వారా యీ ఆత్మ శరీరాన్ని నడుపుతూ నిజమైన ద్రష్ట, భోక్తగా వుంది. ఈ ఆత్మకు శరీరమనేది బాహ్య కవచం. మనస్సనేది లోపలి కవచం.
నరుని శరీరంలో భౌతిక పదార్థం కానిది ఆత్మ ఒక్కటే. అది భౌతిక పదార్థం కాదు కాబట్టి, మిశ్రపదార్థమూ కాజాలదు. మిశ్రపదార్థం కాదు కాబట్టి కార్య, కారణ రూపాలైన కట్టడులకు లోబడదు. కాబట్టి అది శాశ్వతమైంది. శాత్వతమైన దానికి ఆది వుండదు. ఎందుకంటే, దేనికి మొదలుంటుందో, దానికంతా అంతమూ వుండి తీరాలి. అది నిరాకారమని తేలుతుంది. భౌతిక పదార్థం కానిదానికి ఆకారం ఏర్పడజాలదు కదా? ఇంకా, సాకారమైన ప్రతి దానికీ ఆద్యంతాలుండాలి. మొదలు చివర లేనట్టి సాకార వస్తువును మనమెవరూ చూడలేదు. ఆకార (రూపం) మనేది జడపదార్థం, శక్తి – ఈ రెంటి కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ పీఠానికి ఒక విశిష్టమైన ఆకారం వుంది. అంటే, కొంత జడపదార్థం మీద కొంత శక్తి ప్రయోగించడం వల్ల యీ విశిష్ట రూపం ఏర్పడుతోంది. కాబట్టి రూపమనేది భౌతిక పదార్థం, శక్తి, వీని సమ్మేళన ఫలితమనాలి. ఈ సమ్మేళనం శాశ్వతమై ఉండజాలదు. ప్రతి సంశ్లేషణానికి (అంటే ప్రతి సమ్మేళనానికి) విశ్లేషం (విడిపోవడం) తటస్థించే సమయం ఎప్పుడో వచ్చితీరుతుంది. కాబట్టి, సాకారములైన అన్నిటికీ ఆద్యంతాలుంటాయి. మన శరీరం నశిస్తుందని మనకు తెలుసు. దానికొక ప్రారంభముంది. అంతమూ వుంది. కాని ఆత్మ నిరాకారం కావడంవల్ల ఆద్యంత సూత్రం దానికి వర్తించదు. అది అనంతమైన కాలంలో నిలిచి వుంది. కాలం శాశ్వతం. అట్లే ఆత్మా శాశ్వతమే. పైగా అది సర్వవ్యాప్తిగా వుండాలి. సాకారమైనదే ఒక స్థలానికి పరిమితమై హద్దు పెట్టబడుతుంది. నిరాకారమైనది స్థలంలో పరిమితం కాదు. కాబట్టి మీలో, నాలో, ప్రతి వానిలో వుండే ఆత్మ సర్వవ్యాప్తిగా వుంటుందని, అద్వైత వేదాంత మత సిద్ధాంతం. మీరిప్పు డీ భూమిపై వున్నట్లే సూర్యునిలోనూ వున్నారు. ఈ దేశంలో వున్నట్లే అమెరికాలోనూ వున్నారు. అయినా ఆత్మ పని చేసేది మనశ్శరీరాల ద్వారానే. అవి రెండూ కూడివున్న చోటనే ఆత్మయొక్క ప్రభావం గోచరించగలదు.
మనం చేసే ప్రతి పనీ, మనం ఆలోచించే ప్రతి ఆలోచనా, మన మనస్సుల మీద ఒక విధమైన చిహ్నాన్ని, అంటే ఒక విధమైన గుర్తును కలిగిస్తాయి. ఈ చిహ్నాన్ని సంస్కృత భాషలో “సంస్కారం” అంటారు. ఈ సంస్కారాల సమూహమే “శీలం” (కారెక్టర్) అనబడే మహాశక్తిగా ఏర్పడుతోంది. మానవుని శీలం అతడు తనకై తాను నిర్మించుకొన్నదే. అది, అతడు జీవితంలో చేసిన మానసిక శారీరక కర్మల సమష్టి ఫలమై వుంటుంది. ఈ సంస్కారాల సమూహమే మరణానంతరం వానికి కలిగే గతిని నిర్ణయించే మహాశక్తి. ఒకడు మరణిస్తాడనుకోండి. వాని శరీరం విడిపోయి, తిరిగి పంచ భూతాలలో చేరిపోతుంది. అయినా వాని సంస్కారాలు, వాని మనస్సున అంటుకొని నిలిచే వుంటాయి. ఈ మనస్సు బహు సూక్ష్మతర ద్రవ్యాలతో ఏర్పడినది కావడం వల్ల త్వరగా విశ్లేషం కాదు. ద్రవ్యం సూక్ష్మతరమయ్యేకొద్దీ, దాని సుస్థిరత అధికమవుతూ వుంటుంది. కాని, చివరికీ మనస్సు సైతం విచ్చి పోవలసిందే. దానికోసమే, మనమందరం పాటుపడుతున్నాం. ఈ సందర్భంలో సుడిగాలి ఉపమానం చాలా బాగుంటుందని నాకు తోస్తోంది. వేరు వేరు గాలులు వేరు వేరు దిశలనుండి వచ్చి ఒక చోటులో కలుస్తాయి. అలా కలిసిన ప్రదేశంలో, అవి బాగా మిశ్రమైపోయి గిరగిర తిరగడం మొదలు పెడతాయి. ఇలా తిరిగినపుడు, అవి దుమ్ముతో ఒక ఆకారాన్ని కల్పిస్తాయి. అప్పుడు చెత్తను, కాగితపు ముక్కలను ఒక చోటినుండి లాక్కుంటాయి. మళ్లీ కొద్దిసేపటికే వీనిని వదిలేసి, వేరే చోటికి వెళ్లి అక్కడ గిరగిరా తిరుగుతాయి. మళ్లీ అక్కడ దొరికిన పదార్థాలను లాక్కుని వానిలో కొత్త ఆకారాలను కల్పిస్తాయి. సంస్కృతంలో ‘ప్రాణ’ మనే సమష్టి నామంతో పిలువబడే శక్తులు ఇదే విధంగా వర్తిస్తాయి. అవి ఒకచోట కూడుకుంటాయి. అక్కడి ద్రవ్యాలతో ఒక శరీరాన్ని, ఒక మనస్సును కల్పించి, సాగిపోతూండగా కొంత కాలానికి ఆ శరీరం రాలిపోతుంది. ఆ తర్వాత కొత్త ద్రవ్యాలను తీసికొని కొత్త శరీరం కల్పిస్తుంది. ఆ శరీరం పడిపోతే, యింకొక శరీరం కల్పించ బడుతుంది. ఇలా చర్య సాగిపోతూనే వుంటుంది. ద్రవ్యసహాయం లేకపోతే, శక్తికి నడకేసాగదు. కాబట్టి శరీరం పడిపోయినప్పుడు మనస్సు నిలిచి వుంటుంది. సంస్కార రూపమైన ప్రాణం వేరొక తావునకు తీసికొనిపోయి, అక్కడి ద్రవ్యాలలో ఒక కొత్త సుడిని కల్పించుకొని, కొత్త వృత్తమును సాగిస్తుంది. ఈ రకంగా ఒక చోటినుండి మరొక చోటికి పోతూ చివరికి శక్తి అంతా పోయిన తర్వాత అంతమొంది పడిపోతుంది. ఈ విధంగా మనస్సు అంతరించి విచ్ఛిన్నమైపోయి, అందలి సత్కార్యాలన్నీ వ్యయమై పోయినప్పుడు మనకు ముక్తి లభిస్తుంది. ఆ సమయం వచ్చే వరకు మనం బంధనంలోపడి వుండవలసిందే. అంతవరకు మనస్సు అనే సుడిచేత ఆవరించబడి, ఆత్మ అందులో చిక్కుకుని వుంటుంది. తనను ఒక స్థలం నుండి మరొక చోటుకి ఈడుస్తున్నట్లు అనుకొంటూ వుంటుంది. ఆ సుడి మాయమైతే తాను సర్వవ్యాపి అనీ, ఇష్టమొచ్చిన చోట ప్రకాశింప గలదనీ, తాను నిత్యముక్తమనీ, తన ఇష్టంవచ్చినన్ని మనస్సులను, శరీరాలను కల్పన చేసికోగలదనీ ఆత్మ గ్రహిస్తుంది. కాని అంతవరకు అది సుడితో తిరుగుతూండక తప్పదు. ఈ విముక్తి కోసమే మనమందరం జీవయాత్రలు చేస్తున్నాం.
ఈ గదిలో ఒక బంతి వుందనుకోండి. మన మందరం ఒక్కొక్క కర్రను తీసికొని వందలాదిగా దెబ్బలను కొడుతూ, దాన్ని ఒక చోటినుండి మరోచోటికి తరుముతూ, అది యీ గదిలోనుండి వెలుపలికి వెలువడిపోయే వరకు కొడుతూనే వున్నామనుకోండి. అది ఎంత శక్తితో, ఏ మార్గంలో బయటికి పోతుంది? ఈ గదిలో వున్నంత వరకు, దానిపైన ప్రయోగించ బడిన శక్తు లన్నిటియొక్క సమష్టి ఫలమే కదా ఈ విషయాలను నిర్ణయించింది. దానిపైన పడిన ప్రతి దెబ్బా, దాని ఫలితాన్నిచ్చిందనే చెప్పవలసి వుంటుంది. ఇదే రీతిగా, శారీరకంగాగాని, మానసికంగాగాని, మనం చేసే ప్రతికర్మ, ఒక్కొక్క దెబ్బ లాంటిది. నరుని మనస్సే ఈ దెబ్బలను తినే బంతి. ప్రపంచమనే గదిలో మనం ఎప్పుడూ, ఇటు అటు, ఎగురగొట్ట బడుతున్నాం. ఈ దెబ్బలన్నిటియొక్క సమష్టి ఫలమే మన మీ లోకంనుండి నిష్క్రమించే మార్గాన్ని నిర్ణయిస్తోంది. బంతి వేగాన్ని, దిక్కును, నిర్ణయించేది దానిపై పడే దెబ్బలు సుమండీ! అట్లే రాబోవు మన జన్మను నిర్ణయించేది, ఈ ప్రపంచంలో మనం చేసే కర్మ సంచయమే. కాబట్టి మన ఇప్పట్టి జన్మ, మన పూర్వకర్మల ఫలమే అనాలి. ఇదొక అంశం. తెల్లని కడియమొకటి, తర్వాత నల్లని కడియ మొకటి. మళ్లీ తెల్లని కడియం, ఇలా వరుసగా నిర్మించబడిన ఆద్యంతాలులేని గొలుసొకదాన్ని మీ కిచ్చి “ఈ గొలుసెటువంటిది?” అని మిమ్మల్ని ప్రశ్నిస్తాననుకోండి. గొలుసు ఆద్యంతాలులేక, అనంతమై వుండడంవల్ల మొదట దాని స్వభావాన్ని నిర్ణయించడంతో, మీకు చిక్కుగా అనిపిస్తుంది. కాని నెమ్మదిగా పరిశీలించిన తర్వాత అదొక గొలుసని మీరు గ్రహిస్తారు. తెల్లని, నల్లని కడియాలు క్రమం తప్పక ఒకదాని తర్వాత ఒకటి అనంతంగా తగిలించడంవల్ల అది ఏర్పడిందని మీకు తెలిసిపోతుంది. ఈ కడియాలలో ఒక్కదాని తత్త్వం మీకు తెలిస్తే, అలాంటి కడియాలే ఒకదాని వెంట మరొకటి క్రమం తప్పక వస్తూంటాయి. కాబట్టి ఆ గొలుసు గుట్టంతా మీకు తెలిసినట్లవుతుంది. భూత భవిష్యద్వర్తమానకాలాల్లో మన జన్మలన్నీ అనంతమైన గొలుసుగా ఏర్పడి వున్నాయి. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క కడియ మనవచ్చు. జనన మరణాలనేవి, ప్రతి కడియానికి గల రెండు కొనలు. మన ఇక్కడి ఉనికి, చేతలు మళ్లీ మళ్లీస్వల్ప భేదాలతో, మాటిమాటికీ కలుగుతున్నాయి. కాబట్టి మనం ఈ రెండు కడియాలను గూర్చి గ్రహించగల్గితే, మనం ఈ ప్రపంచంలో నడువ వలసివున్న ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలన్నీ మనకు తెలిసిపోతాయి. ఈ ప్రపంచంలోని మన ఇప్పటి నడత, ఇంతకు పూర్వం మనం నడిచిన నడతల వల్లనే సరిగా నిర్ణయించబడిందని తెలుస్తుంది. అట్లే మన పూర్వకర్మల చేతనే, ప్రపంచానికి మనం రావడం జరిగింది. ఇప్పటి మన కర్మల సమష్టి ఫలాన్ని మీదవేసుకొని ఎలా పోతామో అట్లే, మన పూర్వకర్మలన్నిటియొక్క సమష్టి ఫలాన్ని మీదవేసుకొని ఇప్పుడు వచ్చాం. మనల్ని దీన్నుండి వెలుపలికి తీసికొనిపోయేదే మనల్ని, ఇందులో ప్రవేశ పెట్టింది. మనల్ని యిందులో ప్రవేశపెట్టిందేది? మన పూర్వకర్మలే కదా? మనల్ని వెలుపలికి తీసికొని పోవునవేవి? ఇక్కడ మనం చేసే కర్మలే. ఇట్లే సాగుతూంటుంది. పట్టు పురుగుగా మారే కీటకం, తన నోటిలోనుండి తీసే దారం చేతనే “పిసినికాయ” అల్లుకొని, చివరి కా “పిసినికాయ” లోనే తాను చెరబడునట్లే, మన పూర్వకర్మలచే మన బంధనాన్ని కల్పించుకొన్నాం. మన చుట్టూ కర్మజాలాన్ని అల్లుకొని, దాన్లో ఇరుక్కొనిపోయాం. కార్య, కారణ సూత్రాన్ని ప్రయోగంలోనికి తెచ్చింది మనమే. దాన్నుండి ఇప్పుడు ఎలా తప్పించుకోవడమా? అని తపించేదీ మనమే. చక్రం తిరగడానికి ఆరంభించడానికి మనమే కారణం. దాని కింద ఇప్పుడు పడి నలిగిపోతున్నదీ మనమే. మన సత్కర్మల చేత, దుష్కర్మల చేత మనల్ని మనమే మళ్లీ మళ్లీ బంధించుకొంటున్నామని ఈ సిద్ధాంతం బోధిస్తుంది.
ఆత్మ ఎన్నడూ రాదు. ఎన్నడూ పోదు. ఎన్నడూ పుట్టదు. ఎన్నడూ చావదు. ఆత్మకు ఎదురుగా ప్రకృతి నడుస్తోంది. దీని నీడ ఆత్మ మీద పడుతోంది. అజ్ఞానంవల్ల ఈ ఆత్మ తానే తిరుగుతున్నట్లు ప్రకృతే చలించక నిలిచి ఉన్నట్లూ భ్రమిస్తున్నది. ఈ భ్రమ వున్నంతకాలం ఆత్మ బద్ధమే. తాను కదలేది కాదనీ, తాను సర్వవ్యాపి అనీ తెలిసికొన్నపుడు దానికి మోక్షం సిద్ధిస్తుంది. బంధంతో కూడివున్న ఆత్మకే జీవుడని పేరు. సూర్యుడు భూమి చుట్టు తిరుగడు. అయినా ఖగోళ శాస్త్రాభ్యాసంలో అవగాహన సౌకర్యంకోసం, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని ఊహిస్తారు. అదేవిధంగా ఆత్మ వస్తోంది, పోతోంది అని చెప్పడం భాషాసౌకర్యం కోసమే అని మనం గ్రహించవలసి వుంది. ఇలా జీవుడు నిమ్నోన్నత దశలను పొందుతూంటాడు. సుప్రసిద్ధమైన జన్మాంతర సిద్ధాంతమిదే. సృష్టి అంతా ఈ సూత్రం చేత బంధించబడి నడుస్తోంది.
ఈ దేశం ప్రజలు మనిషి పశువునుండి పరిణమించి, మానవ జన్మకు వస్తాడను మాట ఘోరంగా భావిస్తారు. ఎందువల్లనో? కోటాను కోట్లుగావున్న పశువులన్నీ చివరికేమి కావాలి? అవన్నీ లెక్కలోనివి కావా? మనకు ఆత్మ అనేది వుంటే, వానికీ వుంది. వానికి ఆత్మ లేదంటారా? మనకూ లేదు. మానవునికి మాత్రమే ఆత్మ వుందనీ, తదితర జంతువులకు ఆత్మ లేదని చెప్పడం వెర్రిమాట! పశువులకంటే అధములైన మనుషులను నేను చూశాను.
నరుని జీవాత్మ తన సంస్కారము ననుసరించి ఉత్తమ జన్మలను, అధమ జన్మలను పొందుతూంటుంది. పైకి క్రిందికి, క్రిందికి పైకి తిరుగుతూంటుంది. కాని అత్యుత్తమ జన్మ అయిన మానవజన్మలోనే అది ముక్తిని సాధించగల్గుతుంది. మానవజన్మ దేవతల జన్మకంటే శ్రేష్ఠతరమైంది. అన్ని జన్మలకన్నా అది అత్యుత్తమమైనది. నరుడే మోక్షాన్ని సాధించగలడు. కాబట్టి సృష్టిలోని సమస్త జీవులలో అతడే మహోన్నతుడు.
ఈ విశ్వమంతా బ్రహ్మమందే వుండి వానినుండి ఆవిష్కృత మవుతోందనవచ్చు. విద్యుచ్ఛక్తి యంత్రంనుండి వెలువడు విద్యుచ్ఛక్తి తన ప్రసార చక్రాన్ని పూర్తిచేసి చివరికి ఆ యంత్రాన్నే ప్రవేశించే విధంగా, ఈ జగత్తుకూడ తన యాత్రను ముగించి, తనకు మూలకారణమైన బ్రహ్మంలో ఐక్యం చెందడానికై నడుస్తోంది. ఆత్మ విషయమూ ఇట్టిదే. అది బ్రహ్మంనుండి ఆవిష్కృతమై వెలువడి వరుసగా ఓషధుల రూపాన్ని జంతువుల రూపాన్ని పొంది పొంది, చివరికి మనుష్యాకారాన్ని ధరిస్తుంది. ఈ మనుష్యజన్మ బ్రహ్మ స్వరూపానికి చాలా దగ్గరిది. మనం ఎందులోనుండి వచ్చామో, ఆ బ్రహ్మమును తిరిగి పొందడానికే మన ప్రయత్నం సాగుతోంది. జనులకది తెలిసినా తెలియకున్నా విచారంలేదు. ఈ మహావిశ్వంలో ఖనిజాల్లోగాని, ఓషధుల్లోగాని, జంతువుల్లోగాని, ఎక్కడెక్కడ ఏ చలనం, ఏ పోరాటం వుందో అదంతా ఆ ప్రాప్యస్థానాన్ని చేరి నిశ్చలతను అనుభవించడానికోసం చేసే ప్రయత్నమే సుమండీ! ఒకప్పుడు పరిపూర్ణమైన సమత వుండేది. ఆ సమత చెడింది. అన్ని భాగాలు, అన్ని జీవకణాలు, అన్ని పరమాణువులు, తాము కోల్పోయిన ఆ సమతను మళ్ళీ పొందాలని పెనుగులాడుతున్నాయి. ఈ తీవ్రయత్నంలో అవి కలుస్తూ, వేరే విధంగా కూడుతూ, అద్భుతాలైన ప్రకృతి వికారాల నన్నిటిని కల్పిస్తున్నాయి. జంతుజాలంలోకాని, వృక్ష జాతిలోకాని, మరెక్కడ గాని, చూపట్టే పోరాటాలు, పోటీలు, సాంఘిక సంచలనాలు, యుద్ధాలు ఇవన్నీ ఆ సమత్వాన్ని మళ్లీ లభింప జేసుకోవాలనే నిరంతర ప్రయత్నంయొక్క దృశ్యరూపాలే.
పుట్టినది మొదలు, మరణించే వరకూ సాగే యాత్రకు సంస్కృత భాషలో “సంసారం” అని పేరు. జనన మరణ చక్రమని దీని భావం. సృష్టి అంతా, ఈ సంసారచక్రంలో పడి తిరుగుతూ, త్వరగానో ఆలస్యంగానో మోక్షాన్ని పొందుతుంది. మనమందరం తప్పక మోక్షాన్ని పొందేలాగైతే, దాన్ని సాధించడానికి ఈ పెనగులాటేల? అని ప్రశ్నించవచ్చు. ప్రతి వానికి మోక్షం వచ్చి తీరేట్లయితే “కదలక మెదలక కూర్చుని, దానికై శాంతంగా వేచి వుండు” అనవచ్చు. శీఘ్రంగానో, నెమ్మదిగానో ప్రతివాడూ మోక్షాన్ని పొందడం సత్యమే. ఎవనికీ ఆంక్ష లేదు. ఏదీ సర్వనాశనం పొందదు. ప్రతిదీ తరించ వలసిందే. అలా అయితే మన తీవ్రప్రయత్నానికి ప్రయోజనమేమి? అనవచ్చు. “మన ప్రయత్నం మాత్రమే మనల్ని ఆ గమ్య స్థానాన్ని చేర్చగల సాధనం” అన్నది మొదటి సమాధానం. “మనం ఇలా ఎందుకు పెనగులాడుతున్నామో మనకు తెలీదు. అది మనకు విధిగా ఏర్పడి వుం” దనడం రెండవ సమాధానం. సరే! “వేలకొద్దీ మానవులలో ఏ కొందరికి మాత్రమో మోక్షం పొందాలనే ఉద్దేశం కలుగుతుంది.” మానవకోటిలో అత్యధిక సంఖ్యాకులు, ప్రాపంచిక సంపదలతోనే తృప్తులై వుంటారు. అయినా, మెలుకువ నొంది “ఈ నాటక మింతటితో సరిపెడదాం. ఇది చాలు. ఇక ఇందుండి మరలిపోదాం” అనేవారు మరికొందరుంటారు. వీరు బుద్ధిపూర్వకంగా తీవ్ర ప్రయత్నాలను సాగిస్తారు. తదితరులుకూడ బుద్ధిపూర్వకంగా కాకున్నా, పెనగులాడుతూనే వున్నారు సుమండీ!
“వైరాగ్యం” అంటే అసత్తును విడిచి, సత్తును చేపట్టడం అని అర్థం. ఈ వైరాగ్యమే వేదాంత మతబోధయొక్క ఆద్యంతం. ఇది సాధిస్తే గెలుపునొందినట్లే. ఐహిక ప్రియులగువారు “దీనినుండి వెలువడాలని కాని, పరమ గమ్యాన్ని (బ్రహ్మమును) మళ్లీ చేరాలనిగాని, మన మేల ప్రయత్నం చేయాలి? అందరం బ్రహ్మంనుండే వచ్చామనుకొందాం! కాని యిక్కడ సుఖకరంగా, హృద్యంగా వుందే? కాబట్టి ఈ ప్రపంచంలో వుండే సాధ్యమైనంత సుఖాన్నెందుకు పొందరాదు? దీన్ని వదిలి పోవాలనెందుకు అనుకోవాలి?” అని ప్రశ్నిస్తారు! “అనుదినం ఈ లోకంలో ఎటువంటి అభివృద్ధులు అత్యద్భుతంగా జరుగుతున్నాయో చూడండి. ఎన్నెన్ని భోగ్యములు కల్పితము లవుతున్నాయో? ఈ లోకం విశేష సౌఖ్యప్రదంగా వుంది. మనమెక్కడికో వెళ్లిపోయి, ఇది కాదని దేనికోసమో పాటుపడట మెందుకు?” అంటారు. దీనికి మొదటి సమాధానమిది. ఈ ప్రపంచం నాశంకాక తప్పదు. అది ఛిన్నాభిన్నమై పోవలసిందే. అనుభవించిన వానినే చర్వితచర్వణంగా, ఇక్కడ మన మనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం చూసే విషయాలన్నీ అనేకసార్లు పూర్వం మరల మరల జరుగుతున్నవే. మనం నివసించే ఈ భూలోకం అనేక పర్యాయాలు సృష్టించబడిందే. పెక్కుసార్లు నేనిలా, కాన్పించి మీతో ప్రసంగించే వున్నాను. అలా జరిగే వుండాలని, మీకు తెలుసు. ఇప్పుడు మీరు వింటున్న ఈ పలుకులనే, పూర్వం ఎన్నోసార్లు మీరు విని వున్నారు. ఇంకా ఎన్నోమార్లు ఇలా విననున్నారు. ఆత్మలెన్నడూ మారలేదు. శరీరాలు మాత్రం నిరంతరం విచ్ఛిన్నములవుతూ, పునరావృత్తిని పొందుతున్నాయి. ఇక రెండో సమాధానం. ఇవన్నీ కాల నియమానుసారం మాటిమాటికి జరుగుతూన్నవే. మూడో నాలుగో పాచికలు మన చేతిలో వున్నాయనుకోండి. వానిని క్రింద వేస్తే ఒకదానిపై అయిదు చుక్కలు, ఇంకొక దాని పైన నాలుగు, మరొక దానిపైన మూడు, వేరొక దానిపైన రెండు చుక్కలు తిరుగబడిన వనుకోండి. వానిని మళ్లీ మళ్లీ క్రింద వేస్తూ పోగా పోగా, దీర్ఘకాలానంతరమైనా, అప్పుడప్పుడు మళ్లీ ఆ సంఖ్యలే తిరగబడుతూండడం తప్పదు. ఇది అవాంతర ధర్మం. ఆత్మలకు, వాని శరీరాలకు ఇలాంటి స్థితే కలుగుతూంటుంది. ఇంత కాలానికి ఇది తటస్థిస్తుంది అనే నిర్ణయం లేకున్నా ఒకే రీతి కలయికలు, ఎడబాటులుకూడ సంభవిస్తూనే వుంటాయి. ఒకేరీతి పుట్టుకలు, తిండ్లు, త్రాగుడులు, చివరికి మరణాలు జరుగుతూనే వుంటాయి. ఇవే అనేక ఆవృత్తులుగా, మళ్లీ మళ్లీ జరుగుతూంటాయి. ఈ భూలోక సౌఖ్యాలను మించిన దేదీ కొందరికి గోచరించనే గోచరించదు. కాని కొందరు మాత్రం అత్యున్నతులై, ఈ ఐహిక సుఖాలే ప్రధానం కావనీ, ఇవి కేవలం ఆనుషంగికా (అంటే, ఇతరముల ననుసరించి వచ్చేవి) లనీ, గ్రహింపగల్గుతారు.
చిన్నపురుగు మొదలు పురుష శ్రేష్ఠుని వరకు కల స్వరూపాలన్నీ షికాగో నగరమందలి ఫెఱ్ఱిస్ వ్హీల్ అనే బ్రహ్మాండమైన రంగులరాట్నంలో కల ఉయ్యాలల వంటివి. ఈ రాటము నిరంతరం తిరుగుతూంటుంది. కాని దానిలో కూర్చునే వారు మారుతూంటారు. ఒకడు ఏదో ఆసనంలో కూచుంటాడు. ఆ చక్రంలో చుట్టంతా తిరుగుతాడు. ఆ తరువాత దాన్ని విడిచిపోతాడు. కాని ఆ చక్రమేమో తిరుగుతూనే వుంటుంది. జీవుడు ఒకానొక శరీరంలో ప్రవేశించి అందులో కొంతకాలం నివసిస్తాడు. తర్వాత దాన్ని విడిచి, మరొక దానిలోకి వెళ్తాడు. దాన్నికూడ వదిలి వేరొక దానిలో ప్రవేశిస్తాడు. ఈ భవ చక్రాన్ని (అంటే ఐహిక జన్మ పరంపరను) పూర్తిగా వదలి, వెడలి వచ్చి, దాన్నుండి ముక్తుడయ్యే వరకు జీవుడు అలా తిరుగుతూ వుండవలసిందే.
ప్రతి దేశంలో, ప్రతి యుగంలో నర జీవితంయొక్క భూత భవిష్యద్వర్తమానాలను తెలిసికొనగలిగే గొప్పశక్తులు కలవారుంటారు. దాని రహస్యమిది. ఆత్మ ఈ కార్య కారణ చక్రంలో తగుల్కొని వుండేంత వరకు, తన సహజమైన స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా కోల్పోకపోయినా – ముక్త పురుషులైన కొందరిలాగా, ఈ కర్మచక్రంనుండి జీవాత్మను వెలికితీయు శక్తి వున్నా – దాని కర్మలు చాలావరకు ఈ కార్య కారణ పరంపరాధర్మాన్ని అనువర్తిస్తూనే వుంటుంది. కాబట్టి ఈ కార్య కారణ పరంపరను విమర్శించగల బుద్ధిశాలికి భూత భవిష్యద్వర్తమాన గతులను గ్రహించే అవకాశముంది.
కామం (అంటే కోరిక) ఉన్నంత వరకు, కొరత వుందనే అనుకోవాలి. ప్రపూర్ణుడైన ముక్త పురుషునికి కోరికలుండ జాలవు. బ్రహ్మం దేన్నిగాని కోరడం జరగదు. కోరికలుంటే అతడు బ్రహ్మంకాడు; పూర్ణుడూకాడు; కాబట్టి “భగవంతుడు దీన్ని వాంఛిస్తాడు. దాన్ని వాంఛిస్తాడు. అప్పుడు కోపిస్తాడు, ఇప్పుడు ఆనందిస్తాడు” అనే మాటలు చిన్నపిల్లల మాటలు. అర్థం లేనివి. కాబట్టి మహనీయులంతా “దేనినిగాని కోరకండి; సకల వాంఛలను వదలండి. పరిపూర్ణంగా తృప్తులై మెలగండి” అనే ఉపదేశాన్ని చేశారు.
పసివాడు బోసినోటితో ప్రాకులాడుతూ, ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడు. వృద్ధుడు బోసినోటితో ప్రాకులాడుతూ, ఈ లోకంనుండి వెళ్లిపోతున్నాడు. ఇలా ఆద్యంతాలు ఒక్క తీరుగానే కన్పిస్తాయి. కాని ఒకనికి ప్రపంచానుభవం అలవడనే లేదు; రెండోవాడు దాన్ని పూర్తిగా పొందాడు. ఆకాశంలో (ఈథర్) స్పందనం (చలనం) చాలా మందంగా వుండేటప్పుడు, మనం దేన్నీ చూడలేం. అంతా చీకటిగా వుంటుంది. ఆ స్పందనం అతితీవ్రంగా వున్నప్పుడూ చీకటే; ఈ ఆద్యంతాల మధ్యగల భేదం, ధ్రువాలమధ్య వున్న భేదంలాగా (భూమి ఉత్తర దక్షిణపుకొనల మధ్య వుండే భేదమంత) అపారమైంది. అయినా, సామాన్యంగా ఆ ఆద్యంత దశలు రెండూ, సమములుగానే కన్పిస్తాయి. గోడకు వాంఛితార్థాలు లేవు. సిద్ధపురుషునికీ లేవు. కాని గోడకు వాంఛలను సంకల్పించే శక్తి లేదు; సిద్ధపురుషునికో కోరదగిన విషయాలుండవు. మెదడు చెడిపోవడంచేత దేన్నిగాని కోరని పిచ్చివాళ్లుండవచ్చు. మరొకడు కోరికలకు అతీతుడై ఉత్తమ దశలో వుండొచ్చు. ఈ రెండు దశలకు మధ్య ధ్రువముల మధ్య ఉన్నంత అంతరం వుంటుంది. ఒకడు పశుదశకు చాలా దగ్గరగా వుండగా, రెండోవాడు బ్రహ్మమునకు సన్నిహితుడై ఉన్నాడు. ఒకడు బద్ధుడు!! రెండవ వ్యక్తి ముక్తుడు!!!