(అమెరికాలో ఉపన్యసింపబడింది)
నేటి ఉపన్యాస విషయం, మానవాత్మయొక్క అమృతత్వాన్ని (నిత్యత్వాన్ని) కూర్చినది. ఈ విషయం విచారించబడి నన్నిసార్లు ఇంకే విషయంకూడ లోకంలో విచారించబడలేదు. ఈ సమస్యను పరిష్కరించ డానికైమానవుడు జగత్తును పరిశోధించినన్నిసార్లు, ఇంకే సమస్యకై పరిశోధించలేదు. మానవ హృదయానికి ఇంతకన్న ముఖ్యం, ఇంతకన్న ప్రీతికరం అయిన సమస్య ఇంకొకటి లేదు. మన జీవితంలో ఇంతకన్న అభేద్య సమస్య ఇంకేదీ లేదు. కవులు, సిద్ధపురుషులు, మతాచార్యులు, మత ప్రవక్తలు దీన్ని విచారించారు. సింహాసనాసీనులైన రాజన్యులు దీన్ని చర్చించారు. భిక్షాటనం చేసే యాచకులు దీన్నిగూర్చి కలలుకన్నారు. మహోన్నత మానవులు ఈ విషయంలో ప్రసక్తులయ్యారు. అధమాధములుకూడ దీనిపై ఆశ చూపారు. దీనియందలి ఆసక్తి ఇంతదాకా నశించలేదు. మానవ ప్రకృతి వుండేంతవరకు అది నశించలేదు. ఎంతోమంది ఈ సమస్యను పరిశీలించి ఎన్నో సమాధానాలు లోకానికి అర్పించారు. ప్రతి చారిత్రక యుగంలోను, ఈ చర్చను విరమించుకొన్న వారుకూడ వేనవేలున్నారు. కాని సమస్య మాత్రం యథాప్రకారం పూర్ణబలంతో నిలిచే వుంది. జీవితపు ఆరాటంలో, పోరాటంలో ఇది మరపున పడినట్లు తోస్తోంది. కాని ఇంతలో, హఠాత్తుగా ఎవరో ఒకరు మరణిస్తారు. మనకు ప్రేమప్రదమైనవాడు, మిక్కిలి ఆప్తబాంధవుడు, హృదయాన్ని చూరగొన్నవాడు దూరమౌతాడు. అప్పు డీ ప్రపంచ ఘోష, మన ఆరాటాలు, పోరాటాలు కొంతసేపు ఆగిపోతాయి. “మరణానంతరం ఏముంది” అనే పురాతన ప్రశ్న, మళ్ళీ జీవాత్మకు తోస్తుంది. మానవ జ్ఞానానికి మూలం అనుభవమే. అనుభవానికి రాని విషయాన్ని మనం తెలుసుకోలేం. మన హేతువాదానికంతా మూలం అనుభూత విషయాలనుండి, ఊహించుకో బడిన సామాన్యధర్మాలు. మన జ్ఞానానికంతా మూలం, అనుభూతమైన విషయాలను సమరసపరచి నిర్మించుకోబడిన భావాలు; మన చుట్టూగల వస్తు ప్రపంచాన్ని చూస్తే కనిపించేది నిరంతర పరిణామమే కదా? బీజంలోనుండి, మొలక మొలచి, పెరిగి, వృక్షమై చివరకు మరల బీజమౌతుంది. జంతువు పుడుతుంది. కొన్నాళ్లు బ్రదుకుతుంది. చస్తుంది. మళ్లీ మొదటికి వస్తుంది. మానవుడుకూడ ఇంతే. కొండ, మెల్ల మెల్లగా – కాని అనివార్యంగా – తరిగిపోతుంది. నదులు మెల్ల మెల్లగా – కాని అనివార్యంగా – ఎండిపోవును. వానలు సముద్రం వల్ల కలిగి, మళ్ళీ సముద్రంలోనికే పోతాయి. ప్రతి విషయంలోను ఇట్లే, గమనం వలయాకృతిలో సాగి, చివరకు ప్రారంభ స్థానానికి వస్తూ వుంటుంది. పుట్టడం, పెరగడం, బలవడం, క్షీణించడం – ఇవి క్రమం తప్పక, నిష్కర్షగా ఒకటి వెనుక ఒకటి కలుగుతూ వుంటాయి. ఇదే మన నిరంతరానుభవం. కాని వీని అన్నిటికీ మూలమై, ప్రాణి పేరుతో ఒప్పే, అసంఖ్యాక భూతరాశికి, ఈ లక్షోపలక్షల భిన్నతలకు – అత్యంత సూక్ష్మమైన అణువు మొదలు, ఆధ్యాత్మిక సమున్నతిని పొందిన మానవశ్రేష్ఠుని వరకుగల భిన్నతకు – మూలమై వుండే ఒక ఐక్యం గోచరిస్తుంది. వస్తుకోటిని ఒండొంటినుండి, విభజించే అడ్డుగోడలు, ప్రతి దినం కూలదోయబడుతున్నాయి. భౌతిక పదార్థమంతటికీ, ఒకే వస్తువు మూలమనీ, ఇన్ని భిన్నరూపాలతో, ఇన్ని భిన్నవిధాలుగా, అది ఒకే చైతన్యాన్ని వ్యక్తపరుస్తూ వుంటుందనీ, ఎడతెగని గొలుసులాగా ఈ భూతకోటి అంతటిలో, ఆ చైతన్యమంతర్భూతమై నిలిచి వుంటుందనీ, ఈ వివిధ రూపాలు, ఆ గొలుసుయొక్క కొక్కేల వంటివనీ, ఈ కొక్కేలు ఇంచుమించు అనంతాలైనప్పటికీ, ఆ ఒక్క గొలుసువే అనీ, ఆధునిక భౌతిక శాస్త్రాలు సిద్ధాంతీకరింప మొదలుపెట్టాయి. దీన్నే “పరిణామం” లేక “వ్యాకోచం” (ఎవల్యూషన్) అంటారు. ఇది అత్యంత పురాతన భావం. మానవ సంఘం ఏర్పడిన ఆదిమకాలంలోనే ఇది కలిగింది. కాని మానవ జ్ఞానం, అభివృద్ధి అయ్యేకొద్దీ, ఇది ఇప్పుడు మరల పచ్చబడ మొదలుపెట్టి చిగురిస్తోంది. పూర్వకాలంవారు “సంకోచం” (ఇన్వెల్యూషన్) అనే దాని ఉనికినికూడ కనిపెట్టారు. ఇప్పటి వారు దాన్నింకా పూర్తిగా గ్రహించలేదు. బీజం వృక్షం కాగలదు కాని, ఇసుకకణం ఎన్నటికీ వృక్షం కాజాలదు. తండ్రే బిడ్డ అయ్యేది; మట్టిముద్ద బిడ్డ కానేరదు. ఈ వ్యాకోచానికి మూలమేమి? బీజమంటే మొదట వృక్షమే కదా? భవిష్యత్కాలంలో వృక్షరూపంలో వ్యక్తమైన విశిష్ట లక్షణాలన్నీ ఆ బీజంలో వున్నాయి. అట్లే భవిష్యత్కాల యువకునిలో, వృద్ధునిలో, వ్యక్తమైన విశిష్ట లక్షణాలన్నీ, ఆ బిడ్డలో ఉన్నాయి. తర్వాత కనిపించే జీవ విజృంభణమంతా, స్త్రీ యొక్క రజోబిందువులోనే వుంది. దీనినే పూర్వకాలపు తత్వజ్ఞులు “సంకోచం” అన్నారు. ఒక వస్తువులో లేనిదేదీ దానిలోనుండి వెలువడ జాలదు. ఇక్కడకూడ, ఆధునిక శాస్త్రాలు మనకు సహకరిస్తున్నాయి. జగత్తులో దీపించే, శక్తియొక్క సమష్టి పరిమాణమెప్పుడూ, ఒక్కటిగానే ఉంటుందని గణితశాస్త్రాను ప్రాణిత హేతువాదంవల్ల మనకు తెలుస్తోంది. జగత్తులోని భౌతిక పదార్థమును ఒక్క పరమాణుమాత్రం శక్తిని ఒక స్వల్పాంశమునైనా మనం తగ్గింపజాలం. హెచ్చింపజాలం. కాబట్టి వ్యాకోచానికి మూలం శూన్యంకాజాలదు. అయితే దాని మూలమేమి? పూర్వపు సంకుచిత పదార్థం, వృద్ధుని సంకుచిత స్థితియే శిశువు. వృక్షపు సంకుచిత స్థితియే బీజం. బీజపు వ్యాకోచ స్థితియే వృక్షం. భావి జీవిత పరిణతి అంతా, స్త్రీ రజోబిందువులో అణగివుంది. విషయమిప్పుడు కొంత తేటపడింది. జీవం, అవిరామక్రమం కలది అనే ప్రథమ భావాన్ని దీనితో అనుసంధించండి. జీవ లక్షణం మొదట అంకురించే జీవాణువు (ప్రొటో ప్లాసమ్) నుండి, మహోన్నత మానవుని వరకు ఒకే ఎడతెగని గొలుసు. ఒకే అవిరామ జీవం. ఇదే వ్యాకోచం. కాని ప్రతి వ్యాకోచానికి ముందు ఒక సంకోచం వుండాలి కదా? క్రమక్రమ పరిణామాన్ని పొందే ఈ జీవమంతా – ఆద్యరూపమైన జీవాణువునుండి పరిపూర్ణత నొందిన మానవుని వరకు పూర్ణత్వసిద్ధి నొందిన వాని వరకుగల వివిధ రూపాలన్నీ – ఒకే జీవం. ఆ పరిణత రూప ప్రభావమంతా, ఆ జీవాణువులో సంకుచితమై వుండాలి. ఈ జీవశ్రేణి అంతా, అవతారమూర్తి సహితం, అందు సంకుచితమై ఉండి, క్రమక్రమంగా మిక్కిలి పరిణామ మొందుతోంది. అందు, ఈ పూర్ణపరిణత రూపంకూడ అతిసూక్ష్మాకారంలో అణిగే వుండాలి. కాబట్టి సర్వగతమైన జగన్మయ చైతన్యంయొక్క సంకుచిత రూపమే ఈ ఏకైక జీవం. ఈ గొలుసంతా ఈ ఏకైక విజ్ఞానరాశియే. ఆ జీవాణువునుండి పరిణత మానవుని వరకు, క్రమాధికంగా వ్యక్తమవుతోంది. అది పెరుగు తుందని కాదు దీని అర్థం. “పెరగడం” అనే భావాన్నే మీ మనస్సులలో నుండి పారద్రోలండి. “పెరగడం” లో బాహ్య వస్తువొకటి వుందనీ, వెలుపలనుండి ఏదో వచ్చిందనీ తోస్తుంది. ప్రతి జీవిలో, అంతర్గతుడై ఉండే ఆ పరిపూర్ణుడు, బాహ్య స్థితిగతులపై ఆధారపడిన వాడు అనే సత్యానికి ఈ భావం విరుద్ధం కదా? అది పెరగజాలదు. అది సర్వదా ఒక రీతిలోనే ఉంది. కాని వ్యక్తమవుతోంది.
కారణంయొక్క వ్యక్తరూపమే కార్యం. రెంటికి వాస్తవ భేదం ఏమీలేదు. ఈ గ్లాసును నిదర్శనంగా తీసికోండి. గ్లాసు పదార్థముండింది. అదీ, శిల్పియొక్క సంకల్పమూ కలిసి, ఈ పాత్ర అయింది. ఈ రెండూ దానికి (ఉపాదాన నిమిత్త) కారణాలు. ఇవి దానిలో ఉన్నాయి. సంకల్పం ఏ రూపంలో వుందంటారా? సంశ్లేషశక్తి (ఎడిసన్) రూపంలో వుంది. అందీ శక్తి లేకపోతే, ప్రతి అణువు వేరు వేరుగా రాలిపోతుంది. కాబట్టి కార్యమంటే, రూపంలోను, కూర్పులోను భేదంకల కారణమే అనడం స్పష్టం. కొంతసేపు కారణాన్ని మార్చి, పరిమితం చేస్తే, అది కార్యమవుతుంది. మన జీవన భావనకి ఇది అనుసంధానిస్తే, జీవాణువునుండి పరిపూర్ణ మానవుని వరకుగల పరిణామ పరంపర అంతా, విశ్వవ్యాప్తి జీవనమే కావాలి! మొదట అది సంకుచితమై, సూక్ష్మరూపం పొందింది. ఆ సూక్ష్మ పదార్థం, కారణ రూపాన్ని పొంది, క్రమాధికంగా పరిణమిస్తూ, వ్యక్తమవుతూ స్థూల మవుతోంది.
అమృతత్వ (నిత్యత్వ) సమస్యను మనమింకా పరిష్కరించలేదు. జగత్తులో దేన్నికాని, నాశనం చేయడం సాధ్యంకాదని మనం తెలుసుకున్నాం. క్రొత్తదేదీ ఇప్పటికి లేదు. ముందెన్నటికీ ఉండబోదు. చక్రం తిరుగుతు న్నప్పుడు, దాని క్రిందు మీదులు ఒకటి తర్వాత మరొకటి కనిపిస్తూన్నట్లే, ఒకే వ్యక్తరూప పరంపర మనకు కనిపిస్తోంది. జగత్తుయొక్క గమనమంతా తరంగ రూపంలో పైకెగసిపోతూ, క్రిందికి పడుతూ, మళ్లీ ఎగసిపోతూ, మళ్లీ పడుతూ, ఎప్పుడూ ఇట్లే సాగుతూంటుంది. ఎన్నో జ్యోతిర్మండలాలు, సూక్ష్మ రూపాలనుండి, వ్యాకోచతచే క్రమాధికములుగా, స్థూలమై, మళ్లీ లయమై, మొదటి సూక్ష్మ రూపాలని పొందుతూంటాయి. మళ్లీ దానిలో నుండి లేచి, కొంతకాలం స్థూల దశను పొంది, పిదప మెల్లమెల్లగా, మూలస్థితికి వస్తూ వుంటాయి. జీవనమంతా ఇట్లే. కనిపించే స్థితిలోవున్న జీవనమంతా, మళ్లీ పూర్వస్థితిలో లీనమైపోతుంది. పోయేదేది? రూపం మాత్రమే. అది జీర్ణమైపోతుంది. మళ్లీ ఉద్భవిస్తుంది. ఒక అర్థంలో, ఈ శరీరాలు, ఆకారాలు కూడ నిత్యాలే. అదెలా అంటారా? చాలా పాచికలను తీసికొని, క్రిందపడవేస్తే, అవి ఒకసారి 6, 5, 4, 3 అనే సంబంధంలో పడతాయి అనుకోండి. వానిని చేర్చి తీసికొని, మళ్లీ మళ్లీ క్రింద వేస్తూ వుంటే, ఎప్పుడో ఒకప్పుడవి మళ్లీ అదే రీతిగా పడి తీరుతాయి కదా? లోకంలో ఉండే ప్రతి నలుసును, ప్రతి అణువును, ఒక పాచికగా భావించు కోండి. అవి మాటిమాటికి పారవేయబడుతూ, కూర్పబడుతూ వుంటాయి. ఇప్పుడు మీకు కనిపించేది వాని సంయోగక్రమాలలో ఒకటి. ఇప్పుడు ఇక్కడ వుండేది ఒక గాజుపాత్రయొక్క, ఒక బల్లయొక్క, ఒక నీటికుండ యొక్క మరికొన్ని వస్తువులయొక్క ఆకారాలు. ఇది ఒక సంయోగం. కాలక్రమంలో ఇవన్నీ లయమౌతాయి. కాని అనంతకాలాన, సరిగా ఇదే కలయిక ఎప్పుడో మళ్లీ రాకతప్పుతుందా? అప్పుడు మీరిక్కడుంటారు. ఈ మూర్తీ ఉంటుంది. ఈ ప్రసంగం వుంటుంది. ఈ నీటికుండా ఉంటుంది. పూర్వం ఇలా లెక్కలేనన్నిసార్లు జరిగింది. భావికాలంలో మళ్లీ, ఇది లెక్కలేనన్నిసార్లు జరుగుతుంది. ఇంతదాకా మనం ప్రసంగించింది, భౌతిక రూపాలను గూర్చి – ఏమి తేలింది? భౌతిక రూప సంయోగ క్రమాలుకూడ అనంతంగా పునరావృత్తిని పొందుతుంటాయని తేలింది.
మనకిప్పుడు అవగాహనకాని కొన్ని విషయాలు ఇందువల్ల తేటపడతాయి. ఇతరుల పూర్వచరిత్రను, భవిష్యత్ చరిత్రను, చెప్పగలవారిని, మీలో కొందరు చూసి వుంటారు. భవితవ్యం ఇప్పటికే నిర్ణయింపబడి వుండకపోతే దాన్ని, ఎవరైనా ఎలా వివరించగలరు? పూర్వ కర్మలు, భవిష్యత్కాలంలో ఫలరూపాలై, మళ్ళీ కనబడతాయి. ఇది మనంకూడ చూస్తున్నాం. షికాగోపురిలోని “ఫెర్రిస్ వ్హీల్” అనే మహాచక్రాన్ని మీరెరుగుదురు. (ఇది, మన తిరునాళ్లలోని ‘రంగుల రాట్నం’ వంటిది. కాని ఇది పైకి క్రిందికి తిరుగుతుందనిపిస్తోంది.) ఆ చక్రం తిరుగుతూ వుంటుంది. అప్పుడు దానిలోని అరలన్నీ ఒక్కొక్కటే యథాక్రమంగా, దృష్టి గోచరమవుతూంటాయి. ఒక జట్టువారు ఆ అరలలో ఎక్కుతారు. వాళ్లు చుట్టు తిరిగిన వెంటనే, మరొక జట్టువాళ్లు ఎక్కుతారు. ఈ జట్టు, ఒక్కొక్కటి, ఒక్కొక్క ‘వ్యాకోచావృత్తం’ వంటిది. అతి క్షుద్రజీవం మొదలు, అత్యున్నత మానవుని వరకుగల అన్ని వర్గాలు, అందు కనిపిస్తాయి. ఈ చక్రానికి ఆధారభూతమైన గొలుసువంటిది ప్రకృతి. అది అనంతం, సనాతనం. చక్రంలోని అరలు, క్రొత్త క్రొత్త ఆత్మల జట్టులు ధరించే దేహాలు లేక ఆకృతులు అనవచ్చు. అవి పరిపూర్ణత పొందే వరకు, పైకి పైకి పోయి పోయి, ఆ తర్వాత చక్రంనుండి వెలికి వస్తాయి. కాని చక్రం తిరుగుతూనే వుంటుంది. దేహాలు చక్రంలో వుండేంత వరకు అవి ఎక్కడికి వెళ్లేది, రేఖామాత్ర భేదం లేకుండా, నిర్దుష్టంగా ముందుగానే కనుగొని చెప్పవచ్చు. కాని ఆత్మలను గూర్చి, ఇలా కనుగొని చెప్పజాలం. అంటే ప్రకృతియొక్క పూర్వోత్తరాలను, నిష్కర్షగా చెప్పవచ్చు. భౌతిక సంఘటనలు నియమిత కాలాంతరక్రమంలో మాటిమాటికి కలుగుతూంటాయనీ ఒకే సంఘటనలు, అలా మళ్లీ మళ్లీ ప్రదర్శితాలవుతూంటాయనీ, మనకిప్పుడు తెలియవచ్చింది. కాని ఆత్మయొక్క అమృతత్వం కాదిది. శక్తి ఏదీ నాశమొందదు. భౌతిక పదార్థమేదీ నిర్మూలం కాదు. అలా అయితే అది ఏమవుతుంది? మార్పులు చెందుతూ ముందుకు వస్తూ, వెనక్కిపోతూ చివరకు తన మూలాన్ని మళ్లీ చేరుతుంది. గమనమెప్పుడు, సరళరేఖారూపంలో సాగదు. వలయ రూపంలో సాగుతుంది. సరళ రేఖను అనంతంగా దీర్ఘంగా చేస్తే వలయ రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఏ ఆత్మకూ శాశ్వతమైన అధోగమనం ఉండనేరదు. అది అసంభవం. ప్రతి వస్తువు వలయ గమనాన్ని (ఒక సర్కిల్ పూర్తి చేసి) పూర్తి చేసి, మూలానికి రావాలి. “మీరు, నేను ఈ ఆత్మలన్నీ” అంటే ఏమి? మనమందరం సంకుచిత దశను పొందిన విశ్వచైతన్యం, విశ్వజీవం, విశ్వమానసంయొక్క అంశలమై వుండాలనీ, ఈ ప్రదక్షిణమంతా పూర్తి చేసికొని, ఆ విశ్వ ప్రజ్ఞానాన్ని అంటే దైవాన్ని మళ్ళీ చేరాలనీ, సంకోచ, వ్యాకోచ విచారణ సందర్భంలో మనం కనుగొన్నాం. ఈ విశ్వ ప్రజ్ఞానాన్నే ఈశ్వరుడనీ, భగవంతుడనీ, క్రీస్తు అనీ, బుద్ధుడనీ, బ్రహ్మమనీ అంటారు. జడవాది (మెటీరియలిస్ట్) దీన్నే భౌతిక శక్తి అంటాడు. అజ్ఞేయవాదులు దీన్ని అనంత అనిర్వాచ్య, సర్వాతీత పదార్థం అంటారు. మనమందరం దాని అంశలం.
ఇది రెండవ భావం. కాని ఇది చాలదు. ఇంకా సంశయాలకు చోటుంది. ఏ శక్తికీ, నాశనం లేదని చెప్పడం మంచిదే. కాని మనకు గోచరించే సర్వశక్తులు, సర్వరూపాలు, సమ్మేళన ఫలాలు (కొన్నిటి కలయిక వల్ల ఏర్పడినవి). మన ఎదుట వుండే ఈ మూర్తి, అనేక భాగాల కూడికతో ఏర్పడింది. అట్లే మనకు తెలిసిన శక్తులన్నీ, సమ్మేళన ఫలాలే. శక్తి అనేది, అనేక శక్తుల సమ్మేళన ఫలం లేక అనేక శక్తుల సమష్టి ఫలం – అని భౌతిక శాస్త్రజ్ఞులంటారు. అయితే మీ వ్యక్తిత్వమేమవుతుంది? మిశ్ర ద్రవ్యాలన్నీకూడ నేడో, రేపో విచ్ఛిన్నమై వానిలోగల వివిధ మూలద్రవ్య (కాంపోనెంట్ పార్ట్స్) రూపాలను పొందాలి. జగత్తులోని మిశ్ర వస్తువులన్నీ – భౌతిక పదార్థ మిశ్రితాలు కానీ, భౌతిక శక్తి మిశ్రితాలు కాని – నేడో రేపో విచ్ఛినం కావలసిందే. కారణ ఫలంగా కలిగిందంతా నశించడం తప్పదు. అది విచ్ఛిన్నమై చెదరి, తనలో చేరిన వివిధాంగాలుగా అవుతుంది. ‘ఆత్మ’ అనేది ఒక శక్తి కాదు. భావంకూడ కాదు. అది భావాలయొక్క నిర్మాత, భావం కాదు. శరీరాల యొక్క నిర్మాత, శరీరం కాదు. ఇదెలా? శరీరం, ఆత్మ కాదని మనకు తెలుసు. ఏలకాదు? దానికి తెలివి (ఎరుక) లేదు కనుక. శవానికి తెలివి లేదు. కసాయి అంగడిలోని మాంసానికి తెలివి లేదు. ‘తెలివి’ అంటే ఏమి? ప్రతిక్రియ చేసే శక్తి (రియాక్షన్). దీన్ని ఇంకా కొంత లోతుకు దిగి విచారిద్దాం. ఇక్కడ ఒక కుండ వుంది. దాన్ని నేను చూస్తున్నాను. ఎలా? కుండనుండి వెలుతురు కిరణాలు వచ్చి నా కళ్లలో ప్రవేశించి, కంటిపాప పొర (రెటీనా)పై ఒక ఆకారాన్ని కల్పిస్తాయి. ఈ ఆకృతి మెదడుకు కొనిపోబడుతుంది. అప్పటికీ కుండ కంటికి కనిపించదు. ఆ కొనిపోవు వానిని, శరీర శాస్త్రజ్ఞులు స్పర్శనాడు (సెన్సరీ నర్వ్స్) లంటారు. మెదడులోని ఇంద్రియ కేంద్రం ఆ ఆకారాన్ని మనస్సుకు నివేదిస్తుంది. మనస్సులో ప్రతిక్రియ కలుగుతుంది. వెంటనే కుండ తళుక్కున కనబడుతుంది. ఇంతకంటే సాధారణమైన, మరొక ఉదాహరణ తీసికొందాం. నా మాటలు మీరు అతిశ్రద్ధతో వింటున్నారనుకోండి. మీ ముక్కుపై ఒక దోమ వ్రాలి, దోమలు కల్పించే, మనోజ్ఞానభూతిని కల్పిస్తుంది. కాని మనస్సు నా మాటలలో వ్యగ్రమై (బిజీ) వుండడంవల్ల ఆ దోమ సంగతే మీకు తెలియలేదు. ఇప్పు డేం జరిగింది? మీ శరీరంలో ఒకచోట దోమ కుట్టింది. అక్కడ కొన్ని స్పర్శనాడులున్నాయి. ఆ అనుభూతిని అవి మెదడుకు చేర్చాయి. కాని అది మెదడులోనే నిలిచిపోయింది. మీ మనస్సు మరోచోట వుండడంతో, అది ప్రతిక్రియ చేయలేదు. కాబట్టి దోమ ఉనికి మీకు తెలియలేదు. ఒక క్రొత్త అనుభూతి కలిగినప్పుడు, మనస్సు ప్రతిక్రియ చేయకపోతే, ఆ అనుభూతి మన ఎరుకకు రాదు. ప్రతిక్రియ జరిగిన తర్వాతనే మనం అనుభవిస్తాం, చూస్తాం, వింటాం. ఈ ప్రతిక్రియతోనే ‘ప్రకాశం’ (సాంఖ్య పరిభాషలోని మాట) కలుగుతుంది. శరీరం ఆ ప్రకాశాన్ని (ఎరుకను) కల్పింపజాలదు. అంటే అనుభూతి కలగడానికి శ్రద్ధ (“గమనం”) ఉండటం ముఖ్యం. తానెన్నడూ నేర్చివుండని భాషను, ఒక్కొక్కడు కొన్ని విశేష సందర్భాలలో మాట్లాడగలిగి వుండెనట! చిన్నప్పుడు అతడు, ఆ భాష మాట్లాడువారితో నివసించి వున్నాడని తర్వాత తెలిసింది. చిన్నప్పటి భావాలు, మెదడులో ముద్రింపబడి వున్నాయి. ఏదో ఒక కారణంతో మానసిక విక్రియ కలిగింది. వెంటనే జ్ఞానం (ఎరుక) ఏర్పడింది. అతడా భాషను మాట్లాడగలిగాడు. మనస్సు మాత్రమే చాలదనీ, మనస్సొకరి చేతిలోని ఉపకరణం మాత్రమే అనీ ఇందువల్ల తెలిసింది. ఆ బాలుడి మనస్సులో ఆ భాష ఉంది. కానీ అతని కా విషయం తెలీదు. హఠాత్తుగా ఒకప్పు డా జ్ఞానం కలిగింది. మనస్సు కాక, మరొక్క పురుషుడున్నాడనీ, బాలుని పసితనంలో ఆ పురుషు డా శక్తిని వినియోగించుకోలేదనీ, బాలుడు పెద్దైన తర్వాత ఆ పురుషు డా శక్తిని ఉపయోగించుకొనెననీ తెలుస్తోంది. కాబట్టి శరీరం మొదటిది. మనస్సు (ఆలోచనా సాధనం) రెండవది. తర్వాత ఆ మనస్సుకు వెనుక వుండే జీవాత్మ మూడవది. మెదడు నందలి పరమాణువులలో కలిగే ఒక మార్పే “ఆలోచన” అనబడుతుందని ఆధునిక తత్త్వజ్ఞుల వాదం. కాబట్టి వారిలాంటి సంఘటనలను యుక్తియుక్తంగా, సమర్థింపజాలక అవి జరుగనే లేదనడంకూడ కద్దు. శరీరం మారినపుడంతా మెదడు నశిస్తూ వుంటుంది. మనస్సుకూ మెదడుకూ సన్నిహిత సంబంధం వుంది. ప్రకాశింపజేసేది ఆత్మ. ఆత్మ చేతి సాధనం మనస్సు. ఈ సాధనం (ఉపకరణం) ద్వారా, అది బాహ్యోపకరణాన్ని అందుకొంటుంది. ఇదే విషయం తెలిసే విధం. బాహ్యేంద్రియాలు విషయానుభూతులను స్వీకరించి, అంతరింద్రియాలకు తీసికొని వెడతాయి. కళ్లు, చెవులు, మొదలైన బాహ్యేంద్రియాలకున్నది ఈ స్వీకరణ శక్తే అనీ, అంతరింద్రియాలకు (మెదడులోని ఇంద్రియ కేంద్రాలకు) మాత్రమే కార్యాచరణ శక్తి వుందనీ, జ్ఞాపకముంచుకోవాలి. ఈ అంతరింద్రియాలు, ఆ అనుభూతులను మనస్సుకు నివేదిస్తాయి. మనస్సు వానిని, తన స్థితులలో ఒకటైన చిత్తానికి చేరుస్తుంది. అక్కడ అవి ఇచ్ఛారూపంలో వ్యవస్థిత మవుతాయి. ఇవన్నీ కలిపి ఆ అనుభూతులను లోపల వుండే రాజాధిరాజుకు, సింహాసనాధీశునికి జీవాత్మకు సమర్పిస్తాయి. ఆయన పరికించి, ఆజ్ఞలిస్తాడు. వెంటనే మనస్సు ఇంద్రియాలకూ, ఇంద్రియాలు శరీరానికి వర్తమానాన్ని అందజేస్తుంది. నిజమైన జ్ఞాత (తెలిసికొన్న వాడు) పరిపాలకుడు, నియామకుడు, సూత్రధారుడు జీవాత్మే.
మానవుని ఆత్మ శరీరం కాదు, ఆలోచనాశక్తి కాదు అని దేన్ని బట్టి తేలుతోంది. ఆత్మ సంయుక్త పదార్థం కాజాలదు. ఎందుకు? మిశ్రిత పదార్థాలన్నీ ఇంద్రియగోచరాలుగానో, మనోగోచరాలుగానో ఉండాలి కాబట్టి, చూడటానికి ఊహించడానికి సాధ్యం కానిది, కట్టకట్టి ఉంచడానికి సాధ్యం కానిది; శక్తికానిది; భౌతిక వస్తువు కానిది; కారణం కానిది; కార్యం కానిది సంయుక్త పదార్థంగా వుండజాలదు. మన మానసిక ప్రపంచపు అవధులలోనే, మన భావ ప్రపంచపు సరిహద్దులలోనే, సంయుక్త పదార్థాల ఏలుబడి చెల్లుతుంది. ఆ హద్దులు దాటి వానికి ఉనికి లేదు. వాని ఉనికి నియమాలు చెల్లే చోటనే. నియమాతీత వస్తువేదైనా ఉంటే, అది సంయుక్త పదార్థం కానేరదు. మానవాత్మ నిమిత్తత్వానికి అతీతమైంది కాబట్టి అది సంయుక్త వస్తువు కాదు. అది నిత్య ముక్తం. నియమబద్ధమైనదంతా దాని ఏలుబడిలోనిది. అది మృతినొందజాలదు. విచ్ఛినమై, మూలవస్తువు రూపాన్ని పొందడమే కదా మృతి? కాబట్టి సంయుక్త వస్తువు కానిదానికి మరణం ఎలా కలుగుతుంది? అది మృతి నొందుతుందనడం అసంబద్ధమైన మాట.
మన ఆలోచన ఇప్పుడు క్రమంగా మెల్లిగా సూక్ష్మతరమౌతోంది. మీలో కొందరికి ఇది భయాన్ని కల్గిస్తుందేమో? భౌతిక పదార్థాలు, శక్తులు, భావాలతో కూడిన ఈ క్షుద్ర జగత్తుకు అతీతం కావడంవల్ల, ఆత్మ అసంయుక్త వస్తువనీ, అసంయుక్తం కావడంవల్ల మృతి నొందజాలదనీ తెలుసుకున్నాం. మృతిలేని జీవం ఎలా ఉంటుంది? చావు బ్రదుకులు ఒకే నాణేనికి రెండు వైపులు. చావుకు పర్యాయ పదమే బ్రదుకు, బ్రదుకుకు పర్యాయ పదమే చావు. ఒక విధంగా గోచరించినప్పుడు దేన్ని ‘బ్రదుకు’ అంటామో, దాన్నే మరొక విధంగా కనిపించినపుడు ‘చావు’ అంటాం. అలా పైకి లేచినపుడు జీవం, క్రింద పడినపుడు మరణం. కాబట్టి మరణాతీత వస్తువు జీవాతీతంకూడ అనడం స్పష్టం. మన మొదటి నిశ్చితాభిప్రాయాన్ని (కంక్లూషన్) ఇప్పుడు మళ్లీ గుర్తుకు తెచ్చుకోండి. మానవుని ఆత్మ, భగవంతుని (జగన్మయ శక్తి) అంశమే. అది చావు బ్రదుకులకు అతీతమని ఇప్పుడు తేలింది. మీరు పుట్టలేదు. మరణించలేదు. అయితే మనం ఎప్పుడూ చూస్తున్న జనన మరణాలకు అర్థమేమి? అవి శరీరానికి మాత్రమే సంబంధించినవి. ఆత్మ అంతటా ఉంటుంది కదా? అదెలా? “ఇక్కడ ఇందరు కూర్చుని వుండగా, ఆత్మ సర్వగతం ఎలా కాగలదు?” అని అడుగుతారా? నేనొక ప్రశ్న వేస్తాను. నియమాతీతం నిమిత్త ధర్మానికి అతీతం అయిన దానిని, హద్దుల్లో ఇమిడేలాగ చేసేది ఏది? ఈ గాజుపాత్ర కొన్ని హద్దులకు పరిమితం. అంతటా వ్యాపించింది కాదు. పరిసర పదార్థరాశి వొత్తిడివల్ల అది విరివి కాజాలక, ఆ రూపంలో ఉంది. పరిసర వస్తువులు దానిని నియమిస్తున్నవి కాన అది పరిచ్ఛినం (హద్దులలో ఇమిడినది). తనను నియమించేది ఏదీ లేనిది, నియమాతీత మైనది, పరిచ్ఛిన్నమెలా కాగలదు? అటువంటిది సర్వగతమే కావాలి (అంతటా వుండాలి). మీ రీ లోకమందంతటా వున్నారు. అలా అయితే ఆ జనన మరణాది సంఘటనల మాటేమి? అది అజ్ఞాన ప్రసంగం. చిత్త విభ్రమం. నీవు పుట్ట లేదు. మరణించవు. నీవిప్పటికి పుట్టలేదు, ఇక మీదట పునర్జన్మం కాని, జీవం కాని, శరీర ధారణం కాని, మరేదికాని నీకు వుండబోదు. రావడం పోవడం అంటే ఏమి? ఆ మాటలన్నీ అనాలోచితాలు. అర్థరహితాలు. మీరు సర్వగతులు (అంతటా వున్నారు) అలాంటప్పుడు, ఈ వస్తున్నట్లు, పోతున్నట్లు ఎలా అనిపిస్తుంది? మనస్సనబడే ఈ సూక్ష్మశరీరం మారడంవల్ల కలిగే చిత్త విభ్రాంతి అది. ఆ మార్పు కలుగు తూనే వుంటుంది. ఆకసం ముందొక చిన్న మబ్బుతునక కదులుతోంది. అది కదలుతూ పోగా పోగా, ఆకాశం కదులుతూందనే భ్రాంతి కలుగవచ్చు. చంద్రునికి అడ్డంగా మబ్బు పోతున్నప్పుడు చంద్రుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా? రైల్లో ప్రయాణించేటప్పుడు, భూమి పరుగిడుతూందను కుంటాం. పడవలో ప్రయాణించేటప్పుడు, నీళ్లు కదలుతూందనుకుంటాం. నిజానికి, మీరు రావడం లేదు. పోవడం లేదు. మీకు జన్మలు లేవు. పునర్జన్మలు లేవు. మీరు పరిపూర్ణులు. సర్వగతులు. నిమిత్తత్వానికి అతీతులు. నిత్యముక్తులు. ఆ ప్రశ్నే అనవసరం. అర్థరహిత దుష్ప్రసంగం. జన్మం లేనప్పుడు మరణమెలా సంభవించగలదు?
ఇంకొక విషయంకూడ విచారించితే తప్ప మనం సహేతుకమైన నిశ్చయానికి రాజాలం. తత్త్వవిచారం చేసే వారు, మధ్యేమార్గంలో నిలిచిపోరాదు. భయపడి శరణు వేడరాదు. మనం అన్ని నియమాలకు అతీతులమే అయితే, అన్నీ తెలిసిన వాళ్లుగా, ఎప్పుడూ ఆనందంతో వుండేలాగ వుండాలి. జ్ఞానం, శక్తి, ఆనందం – అన్నీ మనలోనే వుండాలి. ఔను. నిజమే. జగత్తులో నీవు సర్వగతుడుగా, సర్వజ్ఞుడుగా వున్నావు. కాని అట్టి వాళ్లు చాలామంది వుంటారా? కోటానుకోట్లు సర్వగతులుండటం సాధ్యమా? అసంభవం. ఉండజాలరు. అయితే మనమందరం ఏమౌతాం? మీరంతా ఒక్కరే. ఒకే ఆత్మ వుంది. ఆ ఒక్క ఆత్మ మీరే. ఆత్మ అనేది, ఈ స్వల్పపరిమిత ప్రకృతి వెనుక నిలిచి వుంది. ఒక్క వస్తువు మాత్రమే ఉంది. ఒకే సత్త. అది నిత్యానందం, సర్వగతం, సర్వజ్ఞం, పుట్టుక, మరణం లేనిది. “అతని శాసనం వల్లనే ఆకాశం విశాలవ్యాప్తమై వుంది. గాలి వీస్తోంది. ఎండ కాస్తోంది. అందరు జీవిస్తున్నారు. ప్రకృతిలోని సత్య మతడే. అతడు నీ ఆత్మకు ఆత్మ. అంతేకాదు, నీ వతడివే. నీవు అతడు అభిన్నులు –” ఇద్దరున్న చోటంతా భయం వుంటుంది. అపాయం వుంటుంది. సంఘర్షణ, కలహం వుంటాయి. అంతా ఆ ఒక్కడే అయినప్పుడు ద్వేషించడం ఎవర్ని? కలహించడం ఎవరితో? అంతా అతడే అయినప్పుడు, ఎవరితో మీరు పోరాడగలరు? ఇది జీవంయొక్క యథార్థ స్వరూపాన్ని, ఉనికి (అస్తిత్వం) యొక్క యథార్థ స్వరూపాన్ని వివరిస్తోంది. ఇదే పరిపూర్ణత. ఇదే దైవం. నానాత్వం కనిపిస్తూన్నంత వరకు మీరు భ్రాంతిలో వున్నారు. “ఈ నానాత్వమయమైన జగత్తులో ఆ కేవలుని, ఈ వికారమయ జగత్తులో ఆ నిర్వికారుని, తన ఆత్మలో వుండేవానిగా, తన ఆత్మగానే, ఎవడు చూస్తాడో, వాడు మనకు ముక్తుడు, వాడు అదృష్టశాలి. వాడు గమ్యాన్ని చేరినాడు–” కాబట్టి నీవు అతడే అని తెలుసుకో. నీవే జగదీశ్వరుడివి. “తత్త్వమసి.” నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఆరోగ్యవంతుణ్ణి, రోగిని, బలవంతుడిని, బలహీనుడిని; ద్వేషిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నాకు కొంచెం శక్తి వుంది… ఇట్టి భావాలు కేవలం భ్రాంతినుండి పుట్టినవి. వానిని పారద్రోలు. నీ బలహీనతకు కారణమేమి? నీ భయానికి కారణమేమి? జగత్తులో వుండేవాడు నీవొక్కడివే. నిన్ను భయపెట్టేదేముంది? కావున లేచి నిలబడు. విముక్తుడివికా! బలహీనత కల్పించే ఆలోచనలు, మాటలు తప్ప లోకంలో వేరే కీడేదీ లేదని తెలుసుకో!బలహీనతను, భీతిని, కల్పించే దాన్నే కీడుగా భావించి, అటువంటి దానిని చేరనీయకుండా ఉండు. నిన్నేమి భయ పెట్టగలదు? సూర్య, చంద్ర బింబాలు నేలపైబడినా, గ్రహమండలాలన్నీ ధ్వంసమైనా, నీకేమి? మహాశిలలాగ నిశ్చలుడవై నిలుచుకో! నీవు నాశనం లేని వాడివి. ఆత్మవు. జగదీశ్వరుడవు. “నేను అఖండ సత్తను. అఖండ చిత్తును. అఖండానందమును. నేనే అతడను” అని పలుకు. బోనులో తుత్తునియలు చేసి యీవలకు లంఘించే సింహంలాగా, నీ బంధం త్రెంచు కొని శాశ్వతముక్తిని పొందు. నీవేల భయపడుతున్నావు? వెనుకంజవేస్తున్నా వెందుకు? అజ్ఞానం, భ్రాంతి తప్ప మరేది నిన్ను బంధింపజాలదు. నీవు శుద్ధుడవు. నిత్యానందమూర్తివి.
మీరు పాపాత్ములని చెప్పేవాళ్లు మూర్ఖులు. అవివేకులు. వాళ్ల మాట నమ్మి మీరొక మూలలో కూర్చుని విలపిస్తారు. మిమ్మల్ని పాపాత్ములనడం అవివేకం, దుర్మార్గం, కేవలం మోసం. మీరంతా భగవత్స్వరూపులే. భగవంతుని చూచి మానవుడని పలుకకండి. ధీరులైతే ఆ ఆధారంలో నిలవండి. మీ జీవితమంతా దానికనుకూలంగా నిర్మించుకోండి. ఎవ్వరైనా మీ గొంతుకోస్తే వద్దనకండి. మీరే కదా దాన్ని కోసుకుంటున్నది? నిరుపేద కొకనికి తోడ్పడితే అందుకు గర్వించకండి. మీకది ఆరాధనం. గర్వకారణం కాదు. జగత్తంతా మీరే కదా? మీరు కానివాడు ఎక్కడైనా ఒకడున్నాడా? నీవు జగత్తుకాత్మవు. నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి. నీవే నక్షత్రకోటివి. అంతటా ప్రకాశించేది నీవే. జగత్తంతా నీవే. ఎవరిని ద్వేషిస్తావు? ఎవరితో కలహిస్తావు? కాబట్టి నీవే అతడివని తెలిసికొని, నీ జీవితమంతా దానికి తగినట్లుగా ఏర్పరుచుకో! ఇది తెలిసి జీవితాన్ని ఇలా ఏర్పరచుకొన్నవాడు, అంధకారంలో ఎన్నడూ అల్లాడడు.