(5.11.1896 నాడు లండన్లో చేసిన ఉపన్యాసం)
మనమింతకు ముందు కఠోపనిషత్తులోని బోధను గ్రహించాలని చూశాం. ఇప్పుడంతకన్న మిక్కిలి ప్రాచీనమైన ఛాందోగ్యోపనిషత్తును పరిశీలిద్దాం. ప్రాచీనోపనిషత్తులలో కనిపించే భాష, వేదమంత్ర భాషలాగా అత్యంత ప్రాచీన రూపమైంది. ఇంతేకాక వానిలో వట్టి పనికిమాలిన విషయాలెన్నెన్నిటో మధ్య అక్కడక్కడ ఒక్కొక్క సారభూతమైన ముఖ్యవిషయం కనిపిస్తూంటుంది. వేద భాగాలు రెంటిలో ఒకటైన కర్మకాండయొక్క ప్రభావంచేత కాబోలు, ఈ ప్రాచీనోపనిషత్తు సగానికి పైగా, కర్మకలాప విషయాలతో నిండిఉంది. కానీ వీనిని చదవడం ఒక రీతిగా మిక్కిలి ఉపయోగకరం. ఎట్లంటే, మనకిందువల్ల ఆధ్యాత్మిక భావాల పరిణామక్రమం బోధపడుతుంది. అంత ప్రాచీనంకాని, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక భావాలు, ఏర్చి కూర్చి ఒక్కటిగా ప్రదర్శింపబడినాయి. ఉపనిషత్తులలో కడపటి దనదగిన భగవద్గీతను ఇందుకు ఉదాహరణగా తీసుకొనవచ్చు. అందులో కర్మకలాపాల ప్రస్తావమే లేదు. ఉపనిషత్తులు అనే పూదోటనంతటిని వెదకి, సేకరించిన సత్యాలనొకటిగా చేర్చి రచించిన, అందమైన పూబంతి వంటిదది. కాని ఆధ్యాత్మిక భావాలు ఎలా ఉత్పత్తియైనవి, ఎలా అభివృద్ధిపొందినవీ, మనం దాని మూలంగా కనుక్కోలేం. వేద పరిశోధన మొక్కటి మాత్రమే అందుకు ఉపకరించేది. అనేకులు ఈ విషయాన్ని ఇప్పటికే తెలిపారు. ఆ గ్రంథాలు ఇంతవరకు, ఏమాత్రం రూపు చెడక, ముందటిలాగే ఉన్నాయి. లోకంలో ఇంతకాలం మార్పులొందక నిలిచివున్న గ్రంథమింకేదీ లేదనవచ్చు. అవి అత్యంత పవిత్రమైనవి అనే భావం, వాని సురక్షిత స్థితికి కారణం. ముఖ్యములు, అముఖ్యములు, అత్యున్నతములు, అతిసామాన్యాలు, అత్యుదాత్తాలు, అతిస్వల్పాలు అయిన భావాలు వీటిలో ప్రక్క ప్రక్కనే కనిపిస్తూ వుంటాయి. వానిలో ఎవ్వరూ వేలుపెట్టి సాహసించలేదు. ఎందరో భాష్యాలు వ్రాశారు. అర్థంకాని ఘట్టాలకు ఎలాగో, అన్వయం కుదర్చడానికి ప్రయత్నించారు. అత్యద్భుతమైన నూత్నభావాలను ఆ ప్రాచీన వాక్కులలోనుంచి వెలికితీయ ప్రయత్నించారు. అతిసామాన్య వాక్యాలనుకూడ ఆధ్యాత్మికార్థాలు కల్పింప చూచారు. కానీ మూలాన్ని ఎవ్వరూ తాకలేదు. కాబట్టి చారిత్రక పరిశోధనకు అవి అత్యద్భుతంగా ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక భావాలు అభివృద్ధిపొందే కొద్దీ, ప్రతి సంఘం వారూ, తమ మత శాస్త్రాలలో కాలనుగుణమైన మార్పులు చేసికొంటారని మనకు తెలుసు. ఇక్కడ ఒకమాటలో కొంచెం మార్పు, అక్కడ ఒక మాటకు బదులు ఇంకో మాట, – ఇట్టి మార్పులు చేయబడ్డాయి. ఇట్టి మార్పులు వేదవాఙ్మయంలో జరిగినట్లు లేదు. జరిగినా, కనుక్కోవడానికి శక్యంకానంత కొంచెంగానే జరిగింది. ఇది మనకు మిక్కిలి అనుకూల విషయం. అందలి భావాలను వాని ప్రాథమికార్థాలలో పరిశోధించగలం. ఆ భావాలు ఎట్టి మార్పులు పొందుతూ అభివృద్ధి పొందాయో, భౌతిక భావాలు ఎలా కాలక్రమంలో సూక్ష్మాలు, సూక్ష్మతరాలు అయిన ఆధ్యాత్మిక భావాలుగా పరిణమించాయో చివరకు అత్యున్నత వేదాంతరూపం పొందాయోమనం గ్రహించే అవకాశం వుంది. పూర్వపు ఆచార మర్యాదలుకూడ వివరింప బడ్డాయి. కాని, ఉపనిషత్తుల్లో అవి అంతగా లేవు. అందులో భాష అపూర్వ. సంక్షేప రూపంలో వుండి జ్ఞాపకం పెట్టుకోడానికి వీలయింది.
విషయం అందరికి తెలిసిందే అనే భావంతో, దాన్ని జ్ఞప్తికి తెచ్చే సాధనాలుగా మాత్రమే, ఆ గ్రంథకర్త లీ సూచనారూప వాక్యాలను సంజ్ఞలుగా వ్రాసి పెట్టారు. ఒక కథను వివరిస్తున్నారనుకొందాం. వినే వాళ్లకందరికీ అది తెలిసిందే అని వారి ఊహ. ఇందువల్ల మనకు చాలా ప్రయాస కలుగుతుంది. అప్పటి జనశ్రుతులు ఇప్పుడు ఇంచుమించుగా నశించాయి. కొంచెం ఏవైనా మిగిలున్నా అవి అతిశయోక్తితో ఎంతో విపరీత రూపంపొందాయి. కాబట్టి ఆ కథల సరైన అర్థాన్ని మనం గ్రహించే మార్గమే లేదు. వానికెన్నెన్నో నూతనార్థాలు కల్పింప బడ్డాయి. పురాణ యుగంనాటికే, అవి కవుల భావాలతో నిండిన పద్య రూపంనందాయి. పాశ్చాత్య దేశాలలో రాజకీయ పరిణామ క్రమంలో చూపట్టే, ముఖ్యవిశేషమే, హిందూదేశపు ఆధ్యాత్మిక పరిణామక్రమంలో చూపట్టుతోంది. మీ పాశ్చాత్యులు, నిరంకుశ పరిపాలనాన్ని ఓర్వజాలరు. తన ఇష్ట ప్రకారం ఎవ్వడేని పరిపాలింపకుండ మీరు చూచుకుంటారు. ప్రజా ప్రభుత్వం దెస, ప్రజా స్వాతంత్ర్యం దెస, మీ భావాలు క్రమోన్నత రూపంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఇదే మార్పు మా హిందూదేశపు ఆధ్యాత్మిక జీవన పరిణామంలో తోస్తోంది. ఎందరో దేవుళ్లుపోయి, ఒకే జగదీశ్వరు డేర్పడ్డాడు. ఉపనిషత్తులలో ఆ ఏకేశ్వరునిపై కూడ తిరుగుబాటు. తమ భవిష్యత్తును శాసింపగల లోక పాలకులనేకులు కలరను భావమే కాదు వారికి దుస్సహమైంది, ఈ జగత్తు ఒక్కరి పరిపాలనలో వున్నదనే భావంకూడ వాళ్లకు సహింపరాని దయింది. మొదట మనకు తట్టే విశేషం ఇది. ఈ స్వేచ్ఛాభావం క్రమాభివృద్ధినొంది, మిక్కిలి ఉచ్ఛస్థితిని పొందింది. ఇంచుమించు అన్ని ఉపనిషత్తుల్లోను చివరి భాగంలో ఈ పరమోచ్ఛస్థితి కనిపిస్తోంది. జగదీశ్వరుడు పదభ్రష్ఠుడు కావడమే ఈ పరమోచ్ఛస్థితి. సగుణ దైవమంతరించి నిర్గుణు డుత్పన్నమవుతాడు. దైవం ఇప్పుడొక వ్యక్తిగత పురుషుడుకాడు. మునుపటిలాగా, లోకాన్నేలే మహోన్నతుడు. మహామహిమాఢ్యుడు అయిన మానవుడు కూడకాడు. ఇప్పుడతడు అన్ని ప్రాణులరూపంలో కనిపిస్తాడు. సర్వజగత్తులో అంతర్గతమై వుండే ఒక తత్త్వమయ్యాడు. సగుణం, వ్యక్త రూపం అయిన దైవాన్ని, నిర్గుణంగా తాత్త్వికంగా భావించే వారు, మానవునొక వ్యక్తిగా భావించడం అసంగతం కదా? అందుచేత వ్యక్తిగత మానవునికూడ మరచిపోవడం, తాత్త్విక మానవు డేర్పడటం జరిగాయి. వ్యక్తిగత మానవుడు నామరూప కల్పితుడు. ఆ వ్యక్తికి వెనుక అధిష్ఠానమైన మానవత్వం ఉంది. అంటే రెండు వైపులనుండి, ఒకేసారిగా వ్యక్తిత్వభావాలు నశిస్తాయి. తత్త్వం దగ్గరవుతుంది. వ్యక్తిగతదైవం తాత్త్వికదైవం దెసకు, వ్యక్తిగత మానవుడు తాత్త్విక మానవుని దెసకు సాగుతున్నారు. తర్వాత ఇంకా ఉన్నత భావా లేర్పడ్డాయి. ఈ తాత్త్విక దైవం ఒక రేఖగాను, తాత్త్విక మానవుడు ఒక రేఖగాను సాగుతూపోయి క్రమక్రమంగా ఈ రెండు రేఖలు కలిసి ఒకటయ్యాయి. ఉపనిషత్తులలో ఈ పరిణామక్రమం వివరించబడింది. “తత్త్వమసి” (అది నీవే) అన్నది, ప్రతి ఉపనిషత్తుయొక్క చివరి మాట. ఒక్క నిత్యానందతత్త్వం తప్ప, ఇంకేదీ లేదు. అదే ఈ నానాత్వంగా వ్యక్తమవుతోంది.
ఉపనిషత్తు లీ సిద్ధాంతంతో, తమ కార్యాన్ని ముగించుకున్నాయి. అటు తర్వాత తత్త్వవిచారపరులు ప్రవేశించారు. పై మూల భావానికి సూక్ష్మాంశ వివరణం చేయడమే వారి పని. వారిని అనేక సమస్యలు ఎదుర్కొన్నాయనడం చిత్రమా? నిర్గుణ పరతత్త్వం ఒక్కటి తప్ప వేరేమీ లేదనీ, అదీ ఈ నానారూపాలలో కనిపిస్తున్నదనీ అంగీకరిస్తే ఏకత్వం బహుత్వంగా ఎలాగైంది ఈ సమస్యే అపరిపక్వ రూపంలో ప్రతి మానవుని హృదయంలో అనాదిగా తలెత్తుతోంది. కీడు మొదలైనవి ఎలా పుట్టాయనేది ఈ సమస్యయొక్క అపరిపక్వరూపం. లోకంలో కీడు అనేది ఎందుకుంది? దానికి మూలకారణమేమి? ఆ పాతప్రశ్నే ఇప్పుడు సంస్కారం పొంది ఈ నిగూఢరూపంతో ఆవిర్భవించింది. మన దుఃఖానికి కారణమేమి? అనే ప్రశ్న ఇంద్రియ వేదికనుండి అడగడానికి బదులు, తత్త్వవిచార వేదికనుండి అడుగుతున్నారు. అఖండ సచ్చిదానంద వస్తువు ఈ భేదమయ ప్రపంచ రూపాన్ని ఎలా పొందింది? ఈ ప్రశ్నకు సమాధానం, మనకు ఇప్పటికే పరిచితమై ఉన్న మయావాదం. హిందూదేశం ఇచ్చిన సమాధానాలలో అత్యుత్తమమైందిదే. ఈ ఏక వస్తువు నిజంగా అనేకం కాలేదు. తనకు స్వాభావికమైన అఖండత్వాన్ని ఏమాత్రమూ కోలుపోలేదు. ఈ అనేకత స్థూల దృష్టికేగాని, నిజానికి కాదు. మనుష్యుడు సాకారుడుగా కనిపించినా, నిజానికతడు నిర్గుణతత్త్వమే. భగవంతుడు పురుషుడుగా కనిపించినా, నిజానికి అతడు నిర్గుణతత్త్వమే.
ఈ సమాధానంలోను వివిధ దశలున్నాయి. అంతేకాక తత్త్వజ్ఞులకు ఏకీభావం కుదరలేదు. మాయావాదాన్ని భారతీయ తత్త్వజ్ఞులెందరో అంగీకరించలేదు. “అనేకులు అంగీకరించారు” అనాలేమో! వీరే ద్వైతులు. వీరి ద్వైతం అపరిపక్వ రూపమైంది. వీరు ఈ ఆలోచనను మూలంలోనే ఖండించాలనుకుంటారు. ప్రశ్నకే అవకాశమివ్వరు. వారిలా చెబుతారు: “– ఈ ప్రశ్న వేయడానికి కాని, దానికి సమాధానం కోరడానికి గాని, మీకు అధికారం లేదు. అది ఈశ్వరేచ్ఛ. దానికి మనం లొంగి ఉండాలి. నోరెత్తరాదు. మన ఆత్మలు స్వతంత్రాలు కావు. మనమేమి చేయాలో, ఏమి అనుభవించాలో అన్నీ దైవం ఇప్పటికే నిర్ణయించి ఉన్నాడు. కలిగే ఆపదలను ప్రశాంత బుద్ధితో అనుభవించడమే మన ధర్మం. అలా చేయకపోతే ఇంకా ఘోరమైన కష్టాలు విధింపబడతాయి.” ఇది మీకెలా తెలుసు? అని అడిగితే వేదాలు అలా చెబుతున్నాయంటారు. వారి ప్రమాణాలను అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవడం మనవిధి – అని వీరంటారు.
మాయావాదాన్ని ఒప్పుకోక, మధ్యస్థులై వుండేవారు కొందరున్నారు. “ఈ సృష్టి అంతా, ఈశ్వరుని శరీరంగా భావించదగునని వారి వాదం. ఆత్మలన్నిటికీ, ప్రకృతి కంతటికీ, ఆయనే ఆత్మ. జీవుల ఆత్మలు దుష్కృతంలో సంకుచితములౌతాయి. ఆత్మలు ఇలా ముడుచుకొని పోవుట చేత, వారి ప్రభావం సన్నగిల్లుతూంటుంది. మరల, సత్కార్యాలు చేసినప్పుడు అవి వికసితమవుతాయి.” హిందూ మతాలన్నిటిలో ఒక సామ్యభావం ఉంది. లోకంలో వున్న అన్ని మతాలలోను ఈ భావం వుందనే నా విశ్వాసం. కొన్ని మతాల వారికి ఇది తెలిసి వుంటుంది. కొందరికి తెలియకపోవచ్చు – అంతే భేదం. “మానవుడు దివ్యుడు” అన్నదే యీ భావం. “జీవాత్మ అనేది ఎట్టిది? దానికి భగవంతునికి వున్న సంబంధమేమి?” అనే విషయంలో మతభేదాలు వున్నాయి. కాని, స్వభావసిద్ధంగా అది పరిశుద్ధమనీ, పరిపూర్ణమనీ బోధించని మతం ఈ లోకంలో ఒక్కటికూడ లేదు. పురాణ కథారూపంలో నీతి కథారూపంలో తత్త్వసిద్ధాంత రూపంలోనో, ఈ భావం ప్రతి మతమందు కనిపిస్తుంది. స్వాభావికంగా అది ఆనందమయం, శక్తిమంతం; దౌర్బల్యము నెరుగదు. దుఃఖాన్నెరుగదు. ఈ దుఃఖమనేది ఎలాగో వచ్చింది. ఈ అపరిపక్వ మతాలు, ఇది కీడుయొక్క మూర్తీభావమనో, పిశాచమనో, ఆహ్రిమన్ (పారశీకుల దుష్టదైవం) అనో, సమాధానం చెప్పవచ్చు. కొన్ని మతాలు దేవుడూ, దయ్యమూ కలసిన ఒక భూతాన్ని నిర్మించి, అది నిర్హేతుకంగా కొందరికి సుఖాన్ని, కొందరికి దుః ఖాన్ని కల్పిస్తూ వుంటుందనవచ్చు. ఇంకా బుద్ధి పరిపాకంగల మరికొందరు, మాయావాదాన్ని తేవచ్చు. ఇలా ఎందరెందరో, ఎన్నెన్ని విధాల సమాధానాలో చెప్పవచ్చు. కాని ఒక్క విషయంమాత్రం విస్పష్టంగా తేలుతోంది. అదే మనకు ప్రసక్తం. ఈ తత్త్వభావాలు, మతాలు మనోవ్యాయామ మాత్రమే. మనస్సుతో చేసే దొమ్మర విద్యల వంటివే కాని వేరు కావు. ప్రతి దేశంలోను, ప్రతి మతంలోనుకల మూఢవిశ్వాస భావరాశినుండి విస్పష్టమై, దేదీప్యమానమై కానవచ్చు మహత్తర భావం “మానవుడు దైవమే, దివ్యత్వమే మన స్వభావం” అనేదే.
ఆ దివ్యత్వం కాక మరేమి కనిపించినా అది వేదాంత పరిభాషలో “అధ్యాస” అనబడేదే. ఏదో అధ్యస్తమైనది; కాని ఆ దివ్యస్వభావం ఎన్నటికీ నశించదు. మహాపాపిలోను, మహా సిద్ధపురుషునిలోను అది సర్వదా నిలిచే వుంటుంది. దానిని ఉద్ధరించాలి (మీది కెత్తాలి). తర్వాత అది స్వయం సిద్ధంగానే దీపిస్తుంది. మనం కోరితే తప్ప, అది వ్యక్తంకాజాలదు. చెకుముకి రాతిలోను, ఎండుకట్టెలోను అగ్ని వుందనీ ఒరిపిడి చేతగాని అది బైటికి రాదనీ మన పూర్వీకులకు తెలుసు. అట్లే ముక్తత్వరూపం, పరిశుద్ధత్వరూపం అయిన ఈ అగ్ని ప్రతి ఆత్మకు స్వభావసిద్ధం. అది ఆత్మయొక్క గుణం కాదు. గుణాలు సంపాదించుకోవడం సాధ్యమైనట్లే కోల్పోవడమూ సాధ్యమవుతుంది. ఆత్మ ముక్తత్వం అభిన్నములు. ఆత్మ, సత్త – (అస్తిత్వం) అభిన్నములు; ఆత్మ, చిత్తు (జ్ఞానం) అభిన్నములు. సచ్చిదానందం. ఆత్మకు స్వాభావికం. దాని “జన్మహక్కు.” ఇంద్రియగోచర వస్తువులన్నీ దాని వ్యక్తరూపాలు. కొన్ని వస్తువులలో అది మందంగాను, కొన్నిటిలో దీప్తిమంతంగాను వ్యక్తమవుతుంది. మరణంకూడ, ఈ నిత్యసత్తయొక్క వ్యక్త రూపమే. జనన మరణాలు, స్థితి క్షయాలు, హాని వృద్ధులు, ఆ ఏకత్వంయొక్క (సత్తయొక్క) వ్యక్త రూపాలే. జ్ఞాన విషయంకూడ ఇలాంటిదే. పామరత్వరూపంలో గోచరించేదీ, పాండిత్య రూపంలో గోచరించేదీ ఆ ‘చిత్తు’ యొక్క, ఆ జ్ఞాన సత్త్వంయొక్క వ్యక్తరూపాలే. ఈ ద్వంద్వాలమధ్య వున్నది ప్రకార (జాతి) భేదం కాదు; పరిమాణ (తరతమత్వ) భేదమే. మన కాళ్ల క్రింద ప్రాకే క్షుద్ర కీటకాలకు, లోకంలో ఉద్భవించగల మహోన్నత మేధా సంపన్నునికి వున్నదికూడ జాతి భేదం కాదు. తరతమత్వ భేదమే. ఈ జీవితంలోని భోగాలన్నీ – అత్యంత హేయమైనవి కూడ – ఆత్మ సత్త్వమైన ఆ బ్రహ్మానందంయొక్క ఆ ఏకత్వంయొక్క వ్యక్త రూపాలే అని వేదాంత తత్త్వవిచారపరుడు ధీరతతో అంటాడు. వేదాంత భావాలన్నిటిలో అది అత్యంత ముఖ్యమైనది. మతాలన్నీ ఈ భావాన్ని ఆంగ్లీకరిస్తున్నాయని నా విశ్వాసం. ఇలాగని ఇదివరకే చెప్పాను. అలా అంగీకరించని మతాన్ని ఒక్క దానినైనా నే నెరుగను. సర్వమతాలలోను భాసించే సార్వలౌకిక భావం ఇది ఒక్కటే. బైబిల్ని ఉదాహరణగా తీసికొందాం. దాని ప్రకారం ప్రథమ మానవుడు (ఆదాం) పరిశుద్ధుడుగా ఉండి, చెడు స్వభావంవల్ల ఆ పరిశుద్ధతను కోలుపోయాడు. దీని అర్థమేమి? ఆదిమ మానవస్వభావం నిర్దుష్టమనే కదా వారి అభిప్రాయం? ఇప్పుడు మనలో కనిపించే కల్మషమంతా, దుర్బలత్వమంతా ఆ స్వభావంపై ఆరోపింపబడిన అధ్యాసనములు. ఆ పూర్వపు నిష్కల్మష స్థితి మరల రావచ్చు ననీ – తప్పక రాగలదనీ – క్రైస్తవులు నమ్ముతున్నారు. వారి అనంతర చరిత్రంవల్ల ఇది స్పష్టమవుతోంది. బైబిల్ ప్రాత, క్రొత్త నిబంధనల చరిత్ర అంతా ఇదే. మహమ్మదీయులుకూడ ఇట్లే ఆదామును, అతని పారిశుద్ధ్యాన్ని నమ్ముతారు. మహమ్మదు ద్వారా, ఆ పారిశుద్ధ్యం మరల లభించే మార్గం ఏర్పడిందని వారి నమ్మకం. బౌద్ధులుకూడ ఇట్లే. ‘నిర్వాణము’ అనే స్థితిని వారు నమ్ముతారు. అది ఈ భేదమయ ప్రపంచానికి అతీతమైన స్థితి. వేదాంతులు, బ్రహ్మమనేది దీన్నే. మనం కోల్పోయిన ఆ నిర్వాణాన్ని మళ్లీ దొరికేలా (పునర్లభ్యం) చేసుకోవడమే బౌద్ధ మతంయొక్క మూలభావం. “మన సొత్తు కాని దేదీ మనకు లభించదు” అనే బోధ ప్రతి మతంలోను ఉంది. ఈ జగత్తులో మనం ఎవ్వరికీ ఋణపడి ఉండం. మన “జన్మహక్కు” కోసమే మనం చేసే పోరాటం. ఈ భావాన్ని ఒక గొప్ప వేదాంతి “స్వారాజ్య సిద్ధి” అనే తన గ్రంథపు పేరులోనే అద్భుతంగా వ్యక్తపరచాడు. ఆ రాజ్యం మనది. దాన్ని కోల్పోయాం. మళ్ళీ గెలుచుకోవాలి. ఇది కేవల భ్రాంతిజనిత భావమనీ మన రాజ్యాన్ని కోల్పోలేదనీ మాయావాది అంటాడు. ఇతనికీ, ఇతరులకు ఇంతే తేడా.
“ఈ రాజ్యం మొదట మనదే. తర్వాత దాన్ని కోల్పోయాం” – అనే వరకు మతాలన్నిటిలో ఏకీభావముంది కానీ, దాన్ని మరల సాధించుకొనే మార్గాన్ని గూర్చిన బోధలు మాత్రం భిన్నాలు. కొన్ని కర్మలు చేసి, కొన్ని విగ్రహాలకు కొంత ద్రవ్యం సమర్పించి, కొంత ఆహార నియమం పాటించి, జీవిత వైఖరిని ఒక విధంగా దిద్దుకుంటే, ఆ రాజ్యం మళ్ళీ లభిస్తుందని ఒక బోధ. ప్రకృతికి అతీతుడైన ఒక పురుషునికి సాష్టాంగప్రణామం చేసి, విలపిస్తూ క్షమాపణ వేడుకుంటే, లభిస్తుందని మరొక బోధ. మనస్ఫూర్తిగా ఆ మహాపురుషుని ప్రేమిస్తే లభిస్తుందని ఇంకో బోధ. ఈ వివిధ బోధలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఈ ఉపన్యాసం సాగేకొలదీ మీ కీ విషయం తెలుస్తుంది. కాని చివరిది అన్నిటిలో మహనీయమైనది అయిన బోధ, రోదనం కేవలం అనావశ్యకమని. “ఈ కర్మాచరణ శ్రమమేల? రాజ్యపునః ప్రాప్తి విషయాన్ని గూర్చిన చింతన ఏల? రాజ్యాన్ని మీరు కోల్పోలేదు? కోల్పోని దానికై అన్వేషిస్తారా? మీరిప్పటికే పరిశుద్ధులు. ఇప్పటికే ముక్తులు. ముక్తులమని భావించుకొంటే, మీ రీక్షణంలోనే ముక్తులు; బద్ధులమని భావిస్తే మీరు బద్ధులే.” అది మిక్కిలి సాహసికవాక్యం. నేను జంకుగొంకు లేకుండా మాట్లాడవలసి వుంటుందని ఈ ఉపన్యాసారంభంలోనే చెప్పాను. మీ కిప్పుడు పై వాక్యం వెరపు కలిగిస్తుందేమో కాని, దాన్ని గూర్చి మననం చేసికొని, దాన్ని అనుభూతం చేసుకుంటే నా మాట సత్యమే అని మీకు తెలుస్తుంది. ముక్తి మీకు స్వాభావికం కాకపోతే మీరేమి చేసినా ముక్తులు కాలేరు. మొదట ముక్తులుగా ఉండి, ఆ ముక్తిని ఎట్లో కోల్పోయారనుకోండి. దాని అర్థం మీరు మొదటకూడ ముక్తులు కారనే. ముక్తులుగా ఉండివుంటే, ఆ ముక్తి ఎలా నశించగలదు? ముక్త వస్తువు బద్ధంగా ఎలా మారగలదు? నిజంగా ఇప్పుడు బద్ధమే అయితే మొదటకూడ అది ముక్తమై ఉండిందనడం భ్రాంతి.
ఈ రెండు పక్షాలలో, దేన్ని అవలంబిస్తావు? ఆత్మ స్వతస్సిద్ధంగా శుద్ధం, ముక్తం అయితే, లోకంలో ఏదీ దాన్ని బద్ధంగా, పరిమితంగా, చేయజాలదని స్పష్టమయి తీరుతుంది. లేక ప్రకృతిలో ఏదైనా దాన్ని బంధింపగలిగితే, అది ముక్తంకాదనీ, ముక్తమనే మాట భ్రాంతి జనితమనీ తేలుతుంది. కాబట్టి, మనకు ముక్తి సాధ్యమైతే, ఆత్మ స్వాభావికంగానే ముక్తమని స్పష్టమవుతోంది. ఇది నిస్సంశయం. ఇలా కాకపోవడం అసంభవం. ముక్తమంటే ఇతర వస్తువులపై ఆధారపడనిది అని కదా అర్థం? ఇతర వస్తువేదీ దానిలో మార్పులు కలిగింపజాలదని కదా? ఆత్మ స్వయంభవం. మనకుగల మహత్తర భావాలన్నిటికీ ఈ విషయం మూలకారణం. స్వభావసిద్ధంగానే ఆత్మ ముక్తమనీ, అంటే ఇతర వస్తువేదీ దానిపై అధికారం నెరపజాలదని అంగీకరిస్తే తప్ప అది మరణం లేనిదని (అనశ్వరమని) చెప్పజాలం. ఏదో ఒక బాహ్యకారణం యొక్క ఫలమేకదా మరణం? విషం త్రాగాను. మరణించాను. అంటే బాహ్యకారణమైన విషానికి, నా శరీరం లోబడుతుందన్నమాట! కాబట్టి ఆత్మ ముక్తమనడం నిజమైతే, అది బాహ్యకారణమైన దేనికీ లోబడదనీ, కాబట్టి మరణింపజాలదనీ తేలుతుంది. ఆత్మ ఈ మాయకు (నిమిత్తత్వ న్యాయానికి) అతీతమైతే తప్ప, అది ముక్తం, అనశ్వరం, ఆనందమయం కానేరదు. ఈ రెండు పక్షాలలో దేన్ని అవలంబిస్తావు? మొదటిది భ్రాంతి అంటావా? రెండవదీ భ్రాంతి అని నా నిశ్చితాభిప్రాయం. నా చిత్తవృత్తులకు, నా లక్ష్యాలకు, అదే ఎక్కువ తగినది. నేను స్వతస్సిద్ధంగా ముక్తుడనని, నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఈ దాస్యం సత్యమనీ, ముక్తత భ్రాంతి అనీ నే నెట్లంగీకరింపగలను?
ఈ చర్చ ఏదో ఒక రూపంలో, తత్త్వశాస్త్రాలన్నిటిలో కనిపిస్తుంది. మిక్కిలి ఆధునిక మయిన వానిలోకూడ ఇది కనిపిస్తోంది. రెండు పక్షాలున్నాయి. “ఆత్మ అన్నదే లేదు. ఆ భావమే భ్రమ. భౌతిక పదార్థ పరమాణువులు ఇటునటు తరచు చరిస్తూ, శరీరం, మెదడు అనే సంయోగాలను కలిగిస్తుంది. తత్ఫలమే ఈ ఆత్మభ్రాంతి. ఈ పరమాణువులు కంపిస్తూ, చలిస్తూ, నిరంతర సంచారాలు చేస్తూండటంతో ముక్తి భ్రాంతి కలుగుతుంది” అని ఒక పక్షంవారి వాదం. బౌద్ధులలో కొన్ని తెగల వారి దీ భావమే. దీన్ని విశదీకరించడానికి ఉదాహరణలు ఇచ్చేవారు. ఒక దివిటీని గిర గిర, అతివేగంగా త్రిప్పితే ఒక తేజశ్చక్రం కనిపిస్తుంది. ఆ చక్రం నిజంగా ఉందా? దివిటీ ప్రతిక్షణం తిరుగుతుంది కదా? మనం పరమాణు సముదాయ మాత్రులం. ఆ పరమాణువులు అతివేగంగా తిరుగుతూండటం చేత నిత్యమైన ఒక ఆత్మ ఉందనే భ్రమ కలుగుతోంది. “భౌతిక పదార్థమనేది నిజంగా లేనే లేదు. భావపరంపరాగమనం, అటువంటిదొకటి వున్నదనే భ్రాంతిని కలిగిస్తుంది” అని రెండవ పక్షం వారంటారు. నీవే పక్షాన్ని అవలంబిస్తావు? “ఆత్మ వుంది. భౌతిక పదార్థమే లేదు” – అనే పక్షమే కదా? రెండు పక్షాల వాదాలు ఒకే రీతివి. కాని ఆత్మ పక్షపు వాదాలు ఒకింత ప్రబలం. ఎందుకంటే భౌతిక పదార్థం అనబడేదేమో, ఎవరికీ తెలీదు. మనకు అనుభవజ్ఞానం కలిగేది, మనలను గూర్చే. తన వెలుపలి భౌతిక పదార్థాన్ని అలా, అనుభూతం చేసికొన్న వానిని నేనెన్నడూ చూడలేదు. తనలోనుండి, బైటకి దుమికే శక్తి ఎవ్వరికీ, ఎన్నడూ, కలుగలేదు. కాబట్టి ఆత్మపక్షవాదానికి, భౌతిక పదార్థపక్ష వాదానికన్న కొంచెం బలం ఎక్కువ. ఇంకొక కారణం. ఆత్మవాదం ప్రపంచంయొక్క ఉనికిని విశదీకరిస్తుంది. అనాత్మవాదం అలా చేయజాలదు. కాబట్టి భౌతిక పదార్థ పక్షపువాదం యుక్తియుక్తం కాదు. తత్త్వశాస్త్రము లన్నిటియొక్క సారాంశాన్ని పరిశీలిస్తే, అవన్నీ పైరెంటిలో ఒక పక్షాన్ని అవలంబిస్తాయని తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడకూడ ఎక్కువ నిగూఢరూపంలో, ఎక్కువ ఆధ్యాత్మిక రూపంలో ఆ పాత సమస్యే – ఆత్మయొక్క, సహజ పరిశుద్ధతను, సహజ యుక్తిని గూర్చిన సమస్యే – కనిపిస్తోంది. ఒక పక్షం వా రీ ఆత్మను, రెండవ పక్షంవారు, మన దాస్యాన్ని భ్రమ అంటారు. మేము నిస్సంశయంగా రెండవ పక్షంలో చేరి దాస్యమే భ్రమ అని అంటాం.
మనం బద్ధులం కామనీ, ఇప్పటికే ముక్తులమనీ వేదాంత సిద్ధాంతం. ఇది అటుండ, బద్ధులమని చెప్పడం, అనుకోవడం అపాయకరం. నేను బద్ధుడను, నేను బలహీనుడను, నేను అసహాయుడను అన్నతోడనే నీ గతి మూడింది. నీకు మరొక క్రొత్త సంకెలను తగిలించుకొంటున్నావు. అలా పలకొద్దు. అలా ఆలోచింపవద్దు. ఒక మనిషి అడవిలో నివసిస్తూ, రేయింబవళ్లు ‘శివోఽహం, శివోఽహం’ (నేను శివుడను) అనే వాడట. ఒకనాడొక పులి వానిపైబడి లాక్కుని పోయిందట. ఏటికి ఆవలిగట్టువారు ఇది చూస్తూ వున్నారు. పులి నోటిలో చిక్కివున్నా, నోరాడుతున్నంతదనుకా, అతడు “శివో-హం” అని అంటూనే వున్నాడట! అట్టి వారనేకులున్నారు. తమ శరీరాలను కోసి, ముక్కలు చేస్తున్న శత్రువులను ఆశీర్వదించిన వారున్నారు. “నేనతడిని, నేనతడిని. నీమా అతడివే, నేను శుద్ధుడని, పరిపూర్ణుడిని, నా శత్రువులంతా అట్టి వారే. నీ వతడివే. నేనును అతడినే.” ఇది ధీరత. కాని ద్వైత మతాలలో మహనీయాలు, అద్భుతాలు అయిన విషయాలున్నాయి. ప్రకృతికి భిన్నుడైన, సగుణ దైవపు భావం ఇందులో ఒకటి. మనం అతణ్ణి భక్తి ప్రేమలతో పూజిస్తాం. ఈ భావం ఒక్కోసారి మిక్కిలి అపాయకరంగా ఉంటుంది. కాని ఆ ఆప్యాయత, స్వాభావికం కాదనీ, మత్తుమందులు కల్పించే ఆప్యాయత వంటిదనీ వేదాంతం చెబుతుంది. ఈ లోకంలో నేడు – మునుపు ఎప్పటికన్న – ముఖ్యంగా కావలసింది, బలమై ఉండగా, ఇందువల్ల కాలక్రమాన బలహీనత కలుగుతుంది. లోకంలోగల తాపత్రయమంతటికీ బలహీనతే కారణమని వేదాంతమంటుంది. సర్వ వ్యధలకు అదే ఏకైక కారణం. బలహీనులం కనుకనే కడగండ్ల పాలౌతున్నాం. బలహీనులం కాబట్టే మనం బొంకడం, చంపడం, ఇతర అపరాధాలు చేయడం. బలహీనులం కాబట్టే మన దుః ఖాలు, మరణాలు. మనకు బలహీనత కల్పించేదేదీ లేకపోతే మరణాలు, దుఃఖాలు ఉండవు. భ్రాంతియే మన వ్యధలకు కారణం. ఈ భ్రాంతిని త్యజించండి. ఈ సర్వం అదృశ్యమవుతుంది. ఇందుకు సందేహమేమీ లేదు. ఈ ఆధ్యాత్మిక చర్యలను, ఆశ్చర్యం కల్గించే ఈ మానసిక వ్యాయామ, విద్యావినోదాలను దాటి చివరకు, మనం అత్యంత స్పష్టమైన ఈ అద్వైత మత భావాల్ని చేరుతాం.
అద్వైత వేదాంతం సత్యాన్ని మిక్కిలి స్పష్టంగా తెలుపుతుంది. సత్యాన్ని అంతకన్నా స్పష్టంగా తెలపడం సాధ్యంకాదు. హిందూదేశంలోను, ఇతర దేశాల్లోను, ద్వైత బోధ చేయబడి వుండటం, మహాప్రమాద కార్యం. తత్ఫలితంగా, జనుల బుద్ధి మూలతత్త్వాల మీదికి పోవడానికి మారు మిక్కిలి కష్టంగా వుండే దాన్ని (ఆ తత్త్వాన్ని) సాధించే మార్గాల మీద నిలిచింది. చాలామందికి వేదాంతంలోని నిగూఢ పత్రిపాదనలు – వేదాంత సంబంధమైనవి, తార్కికాలు – భయంకరములై ఉండేవి. అట్టి సిద్ధాంతాలను జనసామాన్యం అనుసరింపలేదని, సామాన్య దైవిక జీవితానికి అది అనర్హములనీ, అట్టి వేదాంతం పేర నియమబద్ధ జీవితపు బిగి సడలి, స్వేచ్ఛా ప్రవర్తనం చెలరేగుననీ వారు భావించారు.
కాని నిజానికి, అద్వైత మత బోధనలో ఇట్టి అపాయ మేమాత్రమూ లేదని నా భావం. అది అవినీతినిగాని, దౌర్బల్యాన్నికాని కలిగించదు. అంతేకాక వానిని పోగొట్టడానికి దాంతో సమానమైన అమోఘ ప్రతిక్రియ ఇంకేదీ లేదు. ఈమాట నిజమైతే, దగ్గరే ప్రవహిస్తున్న జీవనదిలోని దివ్యజలాన్ని వదలి, జనులు మురికి నీటిని త్రాగుతున్నారు. దీన్ని చూచి మనం ఊరికే ఉండవచ్చా? అద్వైత బోధలు నిర్మలములు అనే మాట నిజమైతే, ఈ క్షణంలోనే వానిని లోకానికి ఏల బోధింపరాదు? లోకులందరికీ – జన్మించిన ప్రతి మానవునికీ, పుణ్యమూర్తులకు, పాపాత్ములకు, స్త్రీలకు, పురుషులకు, శిశువులకు, ఊళ్ళు ఏలేవాళ్ళకు, వీథులూడ్చే వారికి – ప్రతి వారికి, ఈ క్షణంలోనే సింహగర్జనతో దాన్నేల బోధింపరాదు?
ఇది మిక్కిలి కష్టతరమైన మహోద్యమమని మీకిప్పు డనిపించవచ్చు. మీలో చాలమంది, ఇది విని బెదరిపోవచ్చు. ఇందుకు కారణం మనకున్న మూఢవిశ్వాసమే కానీ, వేరే కాదు. రకరకాల చెడు పదార్థాలను, జీర్ణంకాని ఆహారాన్ని తినడంవల్ల, పస్తులుపడి మాడటంవల్ల, మంచి ఆహారం భుజించేశక్తి నశిస్తుంది. మనం చిన్ననాటినుండి బలహీనతను కల్గించే మాటలను వింటున్నాం. దయ్యాలంటే తమకు నమ్మకం లేదని వాదించే వారనేకులున్నారు. కాని చీకటిలో కొంచెం ఒళ్ళు జలదరించని వారు అనేకులు లేరు. ఇందుకు మూఢవిశ్వాసమే కారణం. సైతాను లేడంటే మతమే నశిస్తుందనుకునేవారు ఈ దేశంలో వున్నారు. సైతానులేని మతం ఎలా వుండగలదని నన్ననేకులు అడిగారు. మనకు త్రోవ చూపువాడు లేని మతం ఉండగలుగుతుందా? పరిపాలకుడు ఒకడు లేకపోతే మనం ఎలా జీవిస్తాం? పరిపాలింపబడుచుండే భావం మనకు అలవాటైపోయింది. కాబట్టి మనం పరిపాలనను కోరుతాం. ఒకడి చేత ప్రతిదినం చీవాట్లు తింటున్నట్లు తోచితే తప్ప, మనకు హాయిగా ఉండదు. ఇదంతా మూఢవిశ్వాసమే. కాని ఈ స్థితి మారి తీరుతుంది. మీకిప్పుడది భయంకరంగా తోచినా, కాలం మారిపోతుందనడం నిజం. అప్పుడు మనలో ప్రతి వారు ఇప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకొని, పరిశుద్ధం, నిత్యం అయిన మన ఆత్మను ఆవరించివున్న మూఢవిశ్వాసా లన్నిటినీ తలచి, మనలో మనమే నవ్వుకొంటాం. “నేను ముక్తుడను. ఇప్పుడు, ఎప్పుడూ, ముక్తుడుగానే వుంటాను” అని మన మప్పుడు సంతోషంతో, ధీరతతో, త్రికరణ శుద్ధితో, మాటిమాటికి పల్కుతాం. ఈ అద్వైతభావం, వేదాంతం వల్ల కలుగుతుంది. ఈ భావమొక్కటే శాశ్వతంగా నిలిచివుండ తగింది. శాస్త్రాలు రేపు నశించవచ్చు. ఈ అద్వైత భావం, మొదట హీబ్రూ జాతికి స్ఫురించిందో, ఉత్తర ధ్రువ వాసులకు స్ఫురించిందో – అది ఎవరికి కావాలి? ఇది సత్యమవడం ఒకటే ముఖ్యం. సత్యం సనాతనం (ఎప్పుడూ ఉండేది). తాను, ఒకరి సొమ్ము కాదని సత్యమే చెబుతోంది. ఈ ఏకైక సత్యాన్ని తెలిసికోవడానికి మానవులకు, మృగాలకు, దేవతలకు, సమానమైన అధికారం వుంది. వారంతా దాన్ని గ్రహింతురు గాక! జీవితాన్ని దుఃఖమయం చేసికోవడం ఎందుకు? సర్వవిధ మూఢవిశ్వాసాలకు, జనులేల ఆహుతి కావాలి? వారిలో ఇరవై మందైనా, తమ మూఢవిశ్వాసాల్ని త్యజిస్తే, నేను పదివేల జన్మాలైనా ఎత్తుతాను. అద్వైత సత్యాన్ని తెలిపితే జనులు భయపడతారు. అది మీ దేశంలో మాత్రమే కాదు. ఆ మతానికి పుట్టినిల్లైన మా దేశంలోకూడ అంతే. “లోకాన్ని త్యజించి, అడవులలో నివసించే సన్యాసులకు ఈ భావం తగినది. వారికే ఇది అనుకూలం. కాని మా బోటి సామాన్య గృహస్థులకు కొంచెం దైవఛీతి, కొంచెం కర్మకలాపం అవసరం” అని ఈ విధంగా, మాట్లాడుతారు వాళ్లు.
ద్వైత భావాలు, లోకాన్ని చాలాకాలం పరిపాలించాయి. తత్ఫలమే ఇది. మరో మార్గమేల త్రొక్కి చూడరాదు? అద్వైత భావం, అన్ని మనస్సుల కెక్కడం అంటే – అది కొన్ని యుగాలు పట్టుతుందనడం నిజమే. కాని వెంటనే ఎందుకు మొదలు పెట్టరాదు? మన జీవితకాలంలో, ఇరవై మందికిది బోధిస్తే, మనం ఘనకార్యం చేసినట్లే.
“నేను పరిశుద్ధుడిని, ఆనందమయుడిని” అని చెప్పుకోవడం సులభమే. కాని ఆ మాటకనుగుణంగా నడుచుకోవడం చాలా కష్టం. ఇది నిజమే. అద్వైత భావప్రచారానికి ఇది ప్రతిబంధకంగా వర్తిస్తుంది కూడ. కాని ఆదర్శ సిద్ధి సుసాధ్యమా? ప్రతి పసిబిడ్డకు ఆకాశం కనిపిస్తూంటుంది. కాని ఎంతో దూరంలో. దూరమనే కారణంవల్ల, ఆకాశాన్ని చూడరాదా? మూఢవిశ్వాసాల దెస వెళ్లడం మంచిదా? అమృతం లభించకపోతే విషమును త్రాగవచ్చా? సత్యానుభూతి వెంటనే లభించదను కారణాన అంధకారంలో అల్లాడి, దౌర్బల్య మూఢవిశ్వాసాలకు లొంగపోవడం మంచిదా?
ద్వైతమత రూపాలు పెక్కింటికి నా కాక్షేపం లేదు. వానిలో చాలా నా కిష్టంకూడ. కాని దౌర్బల్య భావాలు ఉపదేశించే బోధలన్నిటిని నేను ఆక్షేపిస్తాను. భౌతిక శిక్షకాని, వైజ్ఞానిక శిక్షకాని, ఆధ్యాత్మిక శిక్షకాని, పొందే ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి శిశువును ఒక ప్రశ్న అడుగుతాను. ఒకే ప్రశ్న; “నీకు బలముందా? బలం నీ బుద్ధికి గోచరిస్తోందా?” బలము నీయగలిగింది సత్యమొక్కటే అని నాకు తెలుసు. కాబట్టే ఈ ప్రశ్న. సత్యమొక్కటే జీవాన్నీయగలదు. సత్యం దెస పయనిస్తూ వుండడంచే తప్ప మరే విధంగానూ బలంచేకూరదు. బలం చేకూరిన తర్వాత గాని, సత్యం అందుబాటు లోనికి రాదు. మనస్సును దుర్బలం చేసి మూఢవిశ్వాస పూరితంగా చేసి, నిరుత్సాహపరచి, దాన్ని అన్ని విధాల అసాధ్య విషయముల వైపు, మర్మపు కిటుకుల వైపు, వెర్రి భావాలవైపు తిప్పే మతాలన్నీ నాకు అసమ్మతాలు. అవి అపాయకరాలని నా నమ్మకం. ఆ మతాలు శుభప్రదాలు కావు. అవి మనోవ్యాధిని, మనోదౌర్బల్యాన్ని కలిగిస్తాయి. ఆ దౌర్బల్య కారణంగా, మనస్సు కాలక్రమాన సత్యాన్ని గ్రహించి, సత్యమార్గాన జీవించే శక్తిని చాలావరకు కోల్పోతుంది. కాబట్టి మనకు అతిముఖ్యంగా కావలసింది బలమొక్కటే. భవ రోగానికి బలమే ఔషధం. ధనికులు పీడించేటప్పుడు బీదలకు కావలసిన ఔషధం బలం. విద్యావంతుడు పీడించేటప్పుడు పామరులకు కావలసిన ఔషధం బలం. ఇతర పాపులు పీడించేటప్పుడు పాపులకు కావలసిన ఔషధం బలం. ఈ అద్వైత భావంలాగా, మనకు బలమిచ్చేది ఇంకేదీ లేదు. బాధ్యతంతా, మన నెత్తి మీదనే పడిందనే భావం కలిగినప్పుడు గాని, మనం పరిపూర్ణ శక్తితోను, పరిపూర్ణ బుద్ధితోను, కార్యాన్ని నిర్వహించం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక పసిబిడ్డను మీ చేతులలో ఉంచితే మీరెలా ప్రవర్తిస్తారు? “తాత్కాలికంగా, మీ జీవితమంతా మారిపోతుంది” అని పందెమొడ్డి చెప్పగలను. మీరెట్టివారైనా, ఆ సమయంలో స్వార్థరహితులౌతారు. భారమంతా మీపై పడిన వెంటనే మీ దుర్మార్గ స్వభావాన్ని వదిలిపెడతారు. తాత్కాలికంగా మీ స్వభావమే మారిపోతుంది. కాబట్టి భారమంతా మనపై పడినప్పుడు, మన అత్యున్నత శక్తీ, మన అత్యున్నత సౌశీల్యం ప్రదర్శిత మవుతాయి. దేవులాడుతూపోయి సమీపించడానికి ఎవ్వరూ లేనప్పడు, నిందలు మోపడానికి దయ్యం, భూతం ఏదీ లేనప్పుడు మన భారాలు మోసే సగుణదైవం ఎవ్వరూ లేనప్పుడు, బాధ్యతంతా మన మీదనే పడినప్పుడు మనలోవున్న ఔన్నత్యమంతా బయటికి వస్తుంది – “నా అదృష్టానికి నేనే కర్తను. నాకు కలిగే శుభం నేను తెచ్చుకున్నదే. నాకు కలిగే అశుభంకూడ నేను తెచ్చుకున్నదే. పరిశుద్ధుడిని నేనే. ఆనందాత్మను నేనే.” ఇందుకు విరుద్ధములైన భావాలన్నీ మనం త్యజించాలి. “నాకు మృత్యువు లేదు. భయం లేదు. నాకు జాతి భేదం లేదు. నాకు మాతా పితలు లేరు. సోదరులు లేరు. మిత్రులు లేరు. శత్రువులు లేరు. నేను సచ్చిదానందరూపుడిని. నేను శివుడను, నేను శివుడను. పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు నన్ను బంధించవు. తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నన్ను బంధించజాలవు. నాకు ఆకలి దప్పులు లేవు. ఈ దేహం నాది కాదు. ఈ శరీరానికి కలిగే వ్యాధి జీర్ణతలు నన్ను బంధించవు. నేను సచ్చిదానంద రూపుడను. నేను శివుడను. నేను శివుడను–”
మనం చేయవలసిన ప్రార్థన ఇదొక్కటే అని వేదాంతం చెబుతోంది. “నేను శివుడను” అని మనం భావించుకోవాలి. ఇతరులకు చెప్పాలి. గమ్యస్థానాన్ని చేరేమార్గం ఇదొక్కటే. నిరంతరం ఇలా చేస్తూంటే బలం లభిస్తుంది. మొదట మొదట తడబడేవాడుకూడ క్రమంగా బలాన్ని పొందుతాడు. “నేను శివుడను” అనే వాణికూడ క్రమాధిక బలాన్ని పొందుతుంది. చివరి కీ సత్యం మన హృదయాలకెక్కి, మన రక్తనాళాల్లో ప్రవహిస్తూ, మన శరీరమంతటా వ్యాపిస్తుంది. జ్యోతి దేదీప్యమానమయ్యే కొద్దీ, భ్రాంతి మోహాలు అదృశ్యాలవుతాయి. ఇలా సాగుతూ కాలక్రమేణ సర్వం అదృశ్యమై, సత్య సూర్యుడొక్కడే ప్రకాశించే కాలం వస్తుంది.