(22–10–1896 నాడు లండన్లో ఉపన్యసించింది)
“చనుదెంతు మిటకు వెనువెన్కన రేగెడు, కీర్తి తెరల కైవడి–” “ట్రెయిలింగ్ – క్లౌడ్స్ – ఆ్యప్ – గ్లోరి – డు – వి – కమ్–” వర్డ్స్వర్త్ అని ఒక ఆంగ్ల మహాకవి అన్నాడు. కాని మనమందరం “కీర్తితెరలకైవడి” వస్తున్నామా? ఎందరమో, “నల్ల పొగలలాగా” కదా రావడం? కానీ ఎలా వచ్చినా మన కీ ప్రపంచం యుద్ధభూమి. యుద్ధం చేయడానికే మనమిక్కడకు వచ్చాం. ఏడుస్తూ ఇక్కడికి వచ్చి, శక్తికొద్దీ పోరాడి, జీవిత మహాసముద్రంలో ఒక త్రోవ కల్పించుకొని, ముందువెనకల ఎన్నో యుగాలు వ్యాపించే అనంతకాలంలో సాగిపోతూ వుంటాం. ఇలా వుండగా మరణం వచ్చి, మనల్ని ఇక్కడినుండి తీసికొనిపోతుంది. పోరాటంలో గెలిచిందీ, ఓడిందీ మనకు తెలీదు. ఇది మాయ.
పసితనంలో “ఔనని పనియెంచు, ఔనన భువిమించు” అనుకోవడం చాలా ఎక్కువ. కళ్లు తెరిచిన పసిపాపనికి ఈ ప్రపంచమంతా స్వర్ణమయం. అతని ఇచ్ఛకు అడ్డులేదు. కానీ అతడు ఎదిగేకొద్దీ, ప్రకృతి వజ్రకఠినమైన గోడగా అడుగడుగునా అడ్డుతగిలి స్వేచ్ఛాప్రవర్తనను నిరోధిస్తుంది.
భేదించే ఉద్దేశంతో దాన్ని ఎన్నిసార్లు ఎదుర్కొన్నా నిష్ప్రయోజనం. వయసు ముదిరేకొద్దీ, ఆదర్శంకూడ దూరమవుతుంది. ఇంతలో మరణం సంభవిస్తుంది. విడుదలకూడా లభిస్తుందేమో? ఇది మాయ. ఒక భౌతిక శాస్త్రజ్ఞుడున్నాడు. అతని జ్ఞానతృష్ట అపారం. దాన్ని తీర్చుకోవడానికి, అతడెంత త్యాగాన్నైనా చేస్తాడు. ఎట్టి పాట్లయినా పడతాడు. ప్రకృతి గర్భంలోని, అగాధ భాగాలనుకూడ పరిశోధించి, తద్రహస్యాలను ఎన్నిటినో కన్గొంటాడు. కానీ ఈ శ్రమంతా ఎందుకు పడినట్టు? అందుకతణ్ణి పొగడ్డమెందుకు? ఆ పొగడ్తకు అతడెట్లు తగినవాడు? మానవశక్తికి అతీతములైన కార్యాలనెన్నిటినో మూఢం, అచేతనం అయిన ప్రకృతి చేయడంలేదా? మహాబలిష్ఠమయిన పిడుగును అది ఎంత దూరమైనా విసరగలదు. మానవుడొకడు ఆ పనిలో వేయవవంతు చేసినా, మనమతణ్ణి అపారంగా పొగడుతాం. ఎందుకు? ప్రకృతిని – మృతం, మూఢం, జడం – అయినదాన్ని అనుగమించినందుకా ఆ పొగడ్త?
భూమికి గల ఆకర్షణశక్తి ఎంతటి ఘనపదార్థ రాశినైనా, తునా తునకలుగా భేదించి వేయగలదు. కానీ అది జడం. జడపదార్థాన్ని అనుకరించడం అంత ఘనకార్యమా? కాని మనమందరం పరిశ్రమించడం అందుకోసమే. ఇది మాయ. మానవుని ఆత్మను, అతని ఇంద్రియాలు బలాత్కారంగా బయటికి లాగుతున్నాయి. సుఖానందాలు లేనిచోట, అతడు వానికై వెదకుతున్నాడు. ఇది వెర్రి, ఇది నిరర్థకం, సుఖం ఇక్కడ లేదు అని యుగయుగాలుగా మనం వింటున్నాం. కానీ ఆ పాఠం మన మనస్సుల కెక్కదు. స్వానుభవంచేతకాని మనమది నేర్చుకోజాలం. కాని స్వప్రయత్న మొకటి చేసిన వెంటనే దెబ్బపడింది. అప్పటికైనా తెలిసొచ్చిందా? లేదు. మంటలలోకి దుమికే రెక్కలపురుగులాగా మాటి మాటికి, మన మీ ఇంద్రియభోగాల లోనికి దుముకుతున్నాం. సంతుష్టి లభిస్తుంది అనే ఆశ నశింపదు. నూతనోత్సాహంతో మరల మరల యత్నిస్తాం. మాటిమాటికి ఇలా మోసపోయి జవసత్వాలుడిగి మరణిస్తాం. ఇది మాయ. బుద్ధి కథకూడ ఇదే. జగద్రహస్యాలను తెలిసికోవాలని మన వ్పాంచ. వానిని గూర్చిన విచారం ఎప్పటికీ మానలేం. అవి తెలిసి తీరుతాయి అనుకొంటాం. తెలియక పోతాయని నమ్మలేం. కానీ, కొన్ని అడుగులు సాగడంతోనే కాలం అనే ఆద్యంతరహితమైన గోడ అడ్డుతగులుతుంది. అది దాటశక్యం కానిది. మరికొన్ని అడుగులు సాగితే అనంతాకాశం అనే మరో గోడ ఎదుర్కొంటుంది. అదీ దాటశక్యం కానిదే. ఇదంతా కార్యాకారణాలు అనే గోడల లోపల చిక్కుపడి వుంటుంది. వీనిని దాటి మనం పోజాలం. కానీ ప్రయత్నాలు మానం. మానడం మన తరం కాదు. ఇది మాయ. మనం ఎప్పుడూ – శ్వాసపీల్చినపుడంతా, గుండెకొట్టుకొన్నప్పుడంతా, శరీరంలో ఏమాత్రమైనా కదలిక కలిగినపుడంతా, – స్వేచ్ఛాపరుల మనుకొంటాం. కానీ ఆ క్షణంలోనే అది అసత్యమని తెలుస్తుంది. మనం దాస్యబద్ధులం. మన శరీరాలు, మనస్సులు, తలంపులు, భావాలు అన్నీ ప్రకృతివద్ద వెట్టిచాకిరీ చేయడానికి ఏర్పడిన బానిసలు. ఇది మాయ.
తన బిడ్డ అత్యద్భుత ప్రతిభాసంపన్నుడై జన్మించాడనీ, అంత లోకోత్తర శిశువు, ఎన్నడూ పుట్టలేదని ప్రతి తల్లీ భావిస్తుంది. ఆమె మనసంతా ఆ బిడ్డలోనే నిమగ్నమై వుంటుంది. వాడు పెరిగి పెద్దవాడై త్రాగుడు మరగి, మృగప్రాయుడై ఆమెను హింసింపవచ్చు. కానీ వాడు హింసించేకొద్దీ, ఆమె ప్రేమ అధికమవుతూ ఉంటుంది. అది నిస్వార్థమైన మాతృప్రేమ అని లోకం ప్రశంసిస్తుంది. కాని నిజానికి ఆమె, ఆజన్మ దాసి. ఆ దాస్యంనుండి తప్పించుకోవడం ఆమెకు అసాధ్యం. వేయిమార్లు ఆ భారాన్ని ఆమె వదల్చుకో గోరుతుంది. కానీ అది అసాధ్యం. తన అశక్యతను, పుష్పరాశితో కప్పివేసి దాన్ని అద్భుత ప్రేమరాశి అంటుంది. ఇది మాయ.
మన మందరం ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. తనకు మాయను చూపమని నారదుడొకసారి, శ్రీకృష్ణుని ప్రార్థించాడట! కొన్నాళ్ల తర్వాత శ్రీకృష్ణుడొక ఎడారికి పోతూ, నారదుని తన వెంట రమ్మన్నాడట! కొన్ని మైళ్లు నడచిన తర్వాత “నాకు దాహంగా ఉంది. కొంచెం నీళ్లు తీసుకురా!” అని నారదుణ్ణి అడిగాడు. తేవడాని కతడు బయలుదేరాడు. దగ్గరున్న ఒక పల్లెకుపోయి, నీటికోసం ఒక ఇంటి తలుపు తట్టాడు. జగన్మోహనాంగి అయిన ఒక యువతి తలుపు తెరచింది. ఆమెను చూడ్డంతోనే తన ప్రభువు దప్పిగొని నీటికోసం కాచుకొని వున్నాడన్న మాటనే మరచి, దాహంతో అతడొకవేళ మరణిస్తాడేమో అనే మాటకూడ మరచి, నారదుడు ఆ యువతితో సల్లాపాలాడుతూ కూర్చున్నాడు.
ఆ దినమంతా తన ప్రభువు వద్దకుపోలేదు. మరునాడుకూడ మళ్లీ వచ్చి సరససల్లాపాలలోనే కాలంగడిపాడు. ఈ ఇష్టాగోష్ఠులు సాగేకొద్దీ, వారు ఒండొరుల యెడ మరులుగొని, తండ్రి అనుమతితో పెళ్లాడి, బిడ్డలను కన్నారు. పండ్రెండేళ్లు గడిచాయి. మామ మరణించాడు. ఆస్తి అంతా వాళ్లకు సంక్రమించింది. భార్య, బిడ్డలు, భూములు, పశువులు, మొదలుగాగల సంపదంతా అనుభవిస్తూ నారదుడు మిక్కిలి సుఖజీవనం చేస్తున్నానను కున్నాడు. ఇలా ఉండగా దగ్గరేవున్న ఏరు ఒకటి పొంగి, మహాప్రవాహమై, గ్రామాన్ని ముంచేసింది. ఇళ్లు కూలిపోయాయి. ప్రవాహం మానవులను, పశువుల్ని ముంచేసింది. అన్నీ కొట్టుకుపోయాయి. అంతా ప్రళయజలరాశిలో చిక్కి తెప్పలు తేలుతున్నాయి. నారదుడు ప్రాణాలు దక్కించుకోవడానికై పారిపోవలసి వచ్చింది. భార్యను ఒక చేత్తో, ఇద్దరు బిడ్డల్ని ఒక చేత్తో పట్టుకొని, భుజంపై ఒక బిడ్డను ఎక్కించుకొని అతడు ఆ మహాప్రవాహాన్ని దాటుతూ వున్నాడు. కాని ఆ ప్రవాహ ఉరవడికి ఆగలేక, పట్టుతప్పి భుజం మీదినుండి బిడ్డ జారిపడి కొట్టుకొనిపోయాడు. నిరాశాగ్రస్తుడై నారదుడు విలపించాడు. ఆ బిడ్డను కాపాడుకొనేయత్నంలో ఉండగా, చేతిలోవున్న బిడ్డలు జారిపోయిరి. చివరికి భార్యకూడ, యావచ్ఛక్తితో పట్టుకొని ఉన్నా, ఆగక ప్రవాహం వాతపడిపోయింది. నారదుడు గట్టుపై పడి ఘోరశోకావేశ పరవశుడై ఏడుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడు. వెనుకనుండి మృదుస్వరంతో “కుమారా! ఏవీ నీళ్లు? నీళ్లు తెస్తానని వెళ్లావు. నీ రాకకై నిరీక్షిస్తున్నాను. అరగంట దాటింది” అనే మాటలు వినబడ్డాయి. “అరగంటేనా?” అని నారదుడు ఆశ్చర్యంతో అడిగాడు. అతని మానసంలో పండ్రెండేళ్లు గడిచాయి. కానీ ఆ చరిత్ర అంతా జరిగింది అరగంటలోనే. ఇది మాయ. ఈ మాయ ఏదో ఒకరూపంలో, మనల్ని అందరినీ ఆవరించుకొని వుంది. ఇది గ్రహించడానికి సాధ్యంకాని ఘోరస్థితి. ఎంత బోధించినా దీన్ని నమ్మే వాళ్లు అరుదు. అన్ని దేశాల్లోనూ ఇంతే. స్వానుభవంచేత కనుగొంటే తప్ప మానవులిది నమ్మజాలరు. దీనికి అర్థమేమి? ఇదంతా నిరర్థకం, కాబట్టి ఘోరం అని.
అన్నిటికీ కాలం తీరుతుంది. కాలమన్నిటినీ శిక్షిస్తుంది. ఏదీ దాన్నిప్రతిఘటింపజాలదు. పుణ్యాత్ములను, పాపాత్ములను, భూపులను, కాపులను, సురూపులను, కురూపులను, – అందరినీ అది మింగివేస్తుంది. ఎవ్వరినీ విడువదు. దానిదెసకే, సర్వమూ పరువులిడుతోంది. మన జ్ఞానం, మన కళలు, మన శాస్త్రాలు, – సర్వమూ; ఆ ప్రవాహాన్ని ఎవ్వరూ అరికట్ట జాలరు. ఒక క్షణమాత్రంకూడ ఆపలేరు. కలరా మొదలైన భయంకర వ్యాధులు గ్రామంపైపడి, నరబలులు కోరేటప్పుడు ఆ ఘోరదృశ్యాలను చూడజాలని వారు త్రాగడం, ఆవేశంతో చిందులు తొక్కడం మొదలైన వానివల్ల స్మృతితప్పి, మొద్దుబారిపోయేలా, మనమూ సర్వవిధాలైన ఇంద్రియ భోగాలలోపడి, ఈ అనివార్య వినాశకారి అయిన కాలాన్ని మరువజూస్తాం. ఇది మాయ.
ఈ విపత్తు నెదుర్కోవడానికి రెండు మార్గాలు చూపబడ్డాయి. అందొకటి అందరికీ తెలిసిందే. అందరూ అవలంబించేదే. “కాలం తప్పనిదే కావచ్చు. కానీ దాన్ని లక్ష్యపెట్టకు. మన లోకోక్తి ననుసరించి దీపమున్నపుడే, లభించే సుఖాల నన్నిటినీ చూరగొనాలి. చేయగలదంతాచేయి. దృష్టిని ఎప్పుడూ జీవిత సుఖాలవైపుననే, ఆసగొలుపు విషయాల మీదనే, అభివృద్ధి దెసలవైపునే మరల్చు. ఎన్నడూ జీవిత దుఃఖాలనుగూర్చి తలంచకు.” ఈ బోధలో కొంత సత్యం వుంది. కాని అపాయంకూడ ఉంది. దీనికి కార్యోత్సాహాన్నిచ్చే ప్రభావంకూడ ఉంది. జయించుతానన్న నమ్మకం, స్పష్టమైన లక్ష్యం కలిగి వుండడం జీవితంలో ఎంతో ఉపయుక్తం. కానీ వానిలోకూడ కొంత అపాయం వుంది. జీవితానికి అతిముఖ్యమైన పోరాటాన్ని – అసలు దక్కి, మనచేతకాదని – మానుకొందుమేమో అన్నదియే ఆ అపాయం. “ప్రపంచ మెలా నడిచినాసరే, దాన్ని అంగీకరిస్తూ ఉండండి. మీ చేతనైనంత ప్రశాంతంగా, సుఖంగా కూర్చుని ఈ క్లేశాలనన్నిటినీ సంతృప్తితో భరించండి. మీపై పడే దెబ్బలను పువ్వులుగా భావించండి. మిమ్మల్ని బానిసల మందగా ఇటూ అటూ తరిమినా, మేము స్వేచ్ఛాపరులమే అనుకోండి. రాత్రింబగళ్లు ఇట్టి బొంకులతో మిమ్ము మీరే మోసపుచ్చు కుంటూ, ఇతరుల్ని మోసపుచ్చుతూ ఉండండి. సుఖంగా జీవించడానికిది ఒకటే మార్గం” అనే బోధలో ఈ అపాయమే ఉంది. ఇలా కాలం గడిపే వారినే, “బ్రతుక నేర్చినవారు” అంటారు. లోకంలో ఈ మార్గం ఈ 19 వ శతాబ్దంలో వర్థిల్లినట్లు, మరెన్నడూ వర్థిల్లలేదు. లోకం ఇప్పటంత ఘోర విపత్తులను ఎన్నడూ ఎరుగదు. ఇప్పుడున్నంత పోటాపోటీ ఎన్నడూ లేదు. తోటి మానవుల పట్ల మానవులు ఇంత క్రూరతను ఎన్నడూ చూపలేదు. కాబట్టే ఈ “బదుకనేర్చు విధం” ఇంత వ్యాప్తిలోనికి వచ్చింది. ఇంత ప్రబలంగా బోధించబడింది. కానీ ఈ మార్గం జయం పొందదు. అపజయమే దీనిగతి. క్రుళ్లువాసనగొట్టు మృగకళేబరాన్ని పూలతో కప్పిపెట్టడం నిరుపయోగంకదా? అది ఎన్నాళ్లు జరుగుతుంది? పూవులు త్వరగానే వాడిపోతాయి. అప్పటికి ఆ కళేబరం మొదటికన్నా చెడిపోయి వుంటుంది. మన జీవితాల విషయంకూడ ఇంతే. చీముకారుతూండే మన పాత గాయాలను బంగారురేకుతో కప్పిపెట్టవచ్చు. కాని కొన్నాళ్లకు ఆ రేకు తీసివేయవలసి వస్తుందికదా? అప్పుడా గాయం, చూడటానికే సాధ్యం కానంత అసహ్య రూపంతో బయటపడుతుంది.
అట్లయిన ఇక మార్గమేలేదా? మనం మాయకు దాసులం. మాయ లోనే పుట్టి, మాయలోనే జీవిస్తున్నామనడం నిజమే అయినా, విముక్తి మార్గము, ఆశపాటు కాధారము లేనేలేదా? ఈ లోకం, మన ‘కీర్తితెర’ లనబడే వాని అందం, మన మనోబుద్ధులు ఇవన్నీ చెరసాలలే అనడం, యుగయుగాలుగా తెలిసిన సత్యమే. ఎప్పుడో ఒకప్పుడు తన అంతరాత్మలో ఈ సత్యాన్ని పొడగాంచని మానవుడే లేడు. వృద్ధుల కిది ముఖ్యంగా తెలిసి ఉంటుంది. వారికొక జీవితకాలపు పూర్ణానుభవం వుంటుంది కదా? అందువల్ల ప్రకృతి చేసే వంచనలకు వారు సులభంగా మోసపోరు. స్థితిగతు లన్నీ ఇట్లున్నా ఈ భయంకర సత్యం అందరికీ తెలిసిందే అయినా, ఈ వ్యధల, ఈ కష్టాల బాధ తప్పించుకోజాలనిదే అయినా, బ్రదుకు చావులకు భేదమే లేదని చెప్పదగిన ఈ లోకంలోనే, అన్ని యుగాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, ప్రతి హృదయంలో, నిగూఢవాణి ఒకటి నెమ్మదిగా – అయినా, సుస్పష్టంగా – ఇలా పలుకుతూ ఉంటుంది. “ఈ నా మాయ అలౌకికం అత్యద్భుతం. అది సత్త్వరజస్తమో గుణాలతో కూడినది. దాన్ని దాటడం అత్యంత కష్టం. కానీ నన్ను శరణుజొచ్చువారు ఈ సంసార సాగరాన్ని దాటుతారు;” “కష్ట జీవితాలు గడుపుతూ, తమ భారాలను మోయజాలక క్రుంగిపోతున్నవారంతా నావద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను” – ఆ వాణియే మనలను ముందుకు నడిపిస్తోంది. యుగయుగాలుగా, అది మనకందరికీ వినిపిస్తోంది. అంతా కోల్పోయినట్లనిపించి, ఆశలన్నీ అడుగంటి, స్వశక్తిపై గల విశ్వాసమంతా అంతరించి ఎటుచూచినా అపజయమే కానవచ్చేటప్పుడు, జీవితమంతా శిథిలరూపాన్ని పొందినప్పుడు – ఆ మహాక్లిష్ట సమయంలో – ఈ వాణి వినిపిస్తుంది. దీన్నే ఆస్తిక ధర్మవాణి అంటారు.
ఇప్పుడు తేలిన విషయమిది. ఒక పక్షంవారు, “ఇదంతా అర్థరహితం, మాయ” అంటారు. కాని ఆ వెంటనే, “ఈ మాయకు ఆవల విముక్తి మార్గముంది” అనే మిక్కిలి ధైర్యోత్సాహమూలమైన సందేశం ఇస్తారు. రెండవ పక్షంవారు “బ్రదుకనేర్చిన బుద్ధిమంతులు” “ఆస్తిక ధర్మం (రిలిజన్), ఆధ్యాత్మిక చింతనం, ఇట్టివన్నీ అసంబద్ధ ప్రలాపాలు. వానితో మీ తలలు బ్రద్దలుకొట్టుకోకండి. ఈ ప్రపంచంలో ఎన్నో లోపాలున్నాయి నిజమే. కాని అందే నివసించి, దానివల్ల లభించే సుఖమంతా అనుభవిస్తూ వుండండి” అని వీరు బోధిస్తారు. దీనికి అర్థమేమంటే “కపటంగా మోసంగా బొంకులతో జీవించండి. బాధనంతా ఎలాగో కప్పివేయండి. అంతా నశించి, అంతా అతుకులమయమే అయ్యేవరకు మీ జీవితానికి అతుకులు వేసికొంటూ పొండి. ఇదే బ్రదుకనేర్చిన విధం.” ఈ మార్గంతో తృప్తిపొందేవారు ఆస్తిక ధర్మం వంక ఎప్పటికిని కన్నెత్తి చూడరు. ఈ ప్రపంచ స్థితిపట్ల, మన జీవితాల పట్ల, గాఢమగు అసంతృప్తి; ఈ అతుకుల బ్రతుకుపట్ల మిక్కుటమైన ద్వేషం. మోసంపట్ల, బొంకులపట్ల అధికమైన అసహ్యం; ఇవి కలిగినప్పుడే ఆస్తికధర్మ జీవనం ఆరంభమవుతుంది. బోధివృక్షం క్రింద తపస్సు చేసినపుడు, బుద్ధభగవానునికి ఒకసారి మనోనిశ్చయం సడలి, పూర్వజీవితం వంకకు బుద్ధితిరిగింది. సత్యాన్వేషణం చాలించి ప్రపంచవృత్తి నవలంబించి, కపటజీవనం చేస్తూ, వస్తువులను అసత్య నామాలతో పేర్కొంటూ, కల్లలతో యితరులను మోసం చేస్తూ, తాను మోసపోతూ వుండడమేకదా సామాన్య ప్రపంచ జీవన వైఖరి. అట్టి బ్రతుకు తుచ్ఛమని ఆయనకు తోచింది. కాని గత్యంతరం స్ఫురించలేదు. అప్పు డా పురుషసింహం తన మనోదౌర్బల్యాన్ని జయించి, “అజ్ఞానకూపంలో కూలి, వ్యర్థంగా జీవించడంకంటే మరణించడం మేలు; ఓటమి నొంది బ్రదుకుటకన్న యుద్ధభూమిలో చావడం మేలు” అని అన్నాడు. ఇలా చెప్పగల్గిన ధీరుడే ఆస్తికధర్మ జీవనం అవలంబింపగలడు. ఇట్టి బుద్ధే, ఆస్తికధర్మ జీవనానికి ఆధారం. ఈ నిశ్చయం పూనినవాడు, సత్యమార్గాన్ని – భగవత్ సాక్షాత్కార మార్గాన్ని పట్టినట్లే. ఈ మార్గాన్ని అవలంబించడానికి ప్రథమప్రేరణ, ఈ దృఢనిశ్చయం నుండే బయలువెడలుతుంది. “ఆటంకాల నన్నిటిని పడగొట్టి, గమ్యానికి తోవ కల్పించుకొంటాను. సత్యాన్ని తెలుసుకొంటాను. ఆ యత్నంలో ప్రాణాల నైనా కోల్పోతాను.” ఈ ప్రపంచ జీవనం నిస్సారం. ఇప్పటికే ఇది కొంత నశించింది. దిన దిన నాశమొందుతోంది. నేడు ఆశావాదియై ముద్దులొలుకుతున్న యువకుడు, రేపటికప్పటికే ముదిమివల్ల క్రుంగి పోయాడు. నేడు చక్కగా వికసించివున్న పువ్వులు, రేపటి మంచుకు వాడిపోయినట్లు, మన ఆశలు, సుఖాలు, ఆనందాలు అన్నీ నశించిపోయేవే. ఇదే ప్రపంచ జీవన విషయం. ఇది ఒక వైపు. ఇక రెండోవైపున, సంసార తాపత్రయాన్ని, ప్రపంచాన్ని అన్నిటినీ జయించిన ఆనందం. ఈ రెండవ వైపు చేరడం మానవులకు సాధ్యమే. అంటే విజయాన్ని, సత్యాన్ని, ఆస్తికధర్మాన్ని సాధించడానికి యత్నించ సాహసించేవారు, సరియైన త్రోవనే పట్టారు. “నిరాశ చెందకండి. త్రోవ మిక్కిలి కష్టమైనదే. పదునైన కత్తిమీద నడచుట వంటిదే. కానీ అధైర్యపడకండి. లెండి! మేలుకోండి!! ఆదర్శాన్ని, గమ్యాన్ని సాధించండి” అని వేదాలు బోధిస్తున్నాయి.
లోకంలోని వివిధ మతాలన్నిటిలో ఒక్క మూలాశయమే వుంది. సంసారంనుండి తప్పించుకొని, విముక్తి పొందడమే ఆ మూలాశయం. ప్రాపంచిక జీవితానికి, ఆస్తికధర్మ జీవితానికి పొత్తు కుదిర్చే ఉద్దేశం వానికిలేదు. ఈ రెంటి నంటగట్టిన బంధాన్ని ఛేదించివేసి, ఆస్తికధర్మాన్ని స్వతంత్రంగా, తన ఆదర్శాలమీదనే ఆధారపడి నిలిచేలా చేయడమే వాని ఉద్దేశం. మతాలన్నీ బోధించే లక్ష్యమిదే. ఈ వివిధ మత లక్ష్యాలను, – పరిపక్వ దశలో వున్నవిగాని, ప్రాథమిక దశలో వున్నవిగాని – సమరసపరచి, వాని అన్నిటికీ ఉమ్మిడియైన ఆధారాన్ని బహిరంగపరచడమే వేదాంతోద్దేశం. కేవలం వెర్రిగాతోచే మూఢవిశ్వాసానికి, అత్యున్నత తాత్త్విక సిద్ధాంతానికి గమ్యమొక్కటే. రెండూ తొలగించాలనుకునే చిక్కు ఒక్కటే. ప్రకృతి నియమ బద్ధుడుకానట్టి ముక్తపురుషుని తోడ్పాటు గ్రహించడంలో ప్రాయికంగా, అన్నీ ఏకీభవిస్తాయి. ఈ ముక్తపురుషుడు సగుణదైవమా, మనవంటి మానవుడా, పురుషుడా? స్త్రీయా? రెండూ కానట్టి తృతీయ ప్రకృతా? అనే విషయాన్ని గూర్చి వాదాలు అనంతంగా చెలరేగాయి. భావభేదాలు అపారంగా కలిగాయి. కానీ మూలాధారమొక్కటే. ఈ మతాలలో ప్రత్యక్షంగా పరస్పర విరుద్ధాలైన వెన్నోవున్నాయి. కానీ వాని అన్నింటిలో ఒక ఐక్య బంధం స్వర్ణసూత్రంలా కన్పిస్తూంటుంది. వేదాంతమతం ఈ స్వర్ణసూత్రాన్ని కనిపెట్టి దాన్ని క్రమక్రమంగా, మనకు దృష్టిగోచరం చేస్తోంది. అన్ని మతాలు మోక్షలక్ష్యం వైపునకే సాగుతున్నాయి అన్నదే ఈ సామాన్య ధర్మాలలో మొదటిది.
మన సుఖాలు, మన దుఃఖాలు, మన కష్టాలు, మన పోరాటాలు వీని అన్నిటిమధ్య మనం మోక్షమార్గానే పయనిస్తున్నామనడం ఒక వింత విషయం. “ఈ ప్రపంచమెట్టిది? ఇది దేనిలోనుండి పుట్టింది? దేనిలోకి పోతోంది?” అనే సమస్య బయలుదేరింది. దానికీ సమాధానమీయబడింది. “ముక్తత్వంలో పుట్టింది, ముక్తత్వంలో విశ్రమించి ఉంది. ముక్తత్వంలో లయిస్తుంది” – ఈ ముక్తతను మనం విడనాడజాలం. అది లేకపోతే కర్మాచరణం అసాధ్యమవుతుంది. జీవించడంకూడ అసాధ్యమవుతుంది. మనం దాస్యబద్ధులమనీ, మనకు స్వేచ్ఛాప్రవృత్తి లేదనీ ప్రకృతి ప్రతిక్షణమూ మనకు తెలుపుతోంది. కాని స్వతంత్రులం అన్న తలంపుకూడ మనకు అప్పుడే కలుగుతూ ఉంటుంది.
ప్రతిక్షణం మాయ దెబ్బలుకొట్టి, మనం బద్ధులమని నిరూపిస్తూ ఉంటుంది. కాని ఆ దెబ్బతోనే, ఆ బద్ధులమనే తలంపుతోనే, మనం స్వతంత్రులం అనే తలపుకూడ కలుగుతోంది. ఆ స్వతంత్రతను, ప్రత్యక్ష పరుచుకొని, కార్యరూపంలో చూపజాలం కానీ, ఆ ఆలోచన మనలో తారట్లాడుతూనే ఉంటుంది.
ప్రపంచంలో గల సర్వమతాలు దీన్ని ప్రకటించాయి. మతములలో మాత్రమే కాదు – మతమనే మాటకు, సంకుచితార్థం కల్పించుకోకండి – సాంఘిక జీవనమంతటిలోను ఈ స్వాతంత్ర్యం ప్రకటిత మవుతూ ఉంటుంది. లోకంలో బయలుదేరే ఉద్యమాలన్నిటికి ఆధారభూతమైన మూలమిదే. “కష్ట జీవితాలు గడుపుతూ, తమ భారాలను మోయజాలక, క్రుంగిపోతున్న వారంతా నా దగ్గరకి రండి” – అన్న వాక్కు ప్రతి వానికీ వాడికది తెలిసినా, తెలియకపోయినా – వినిపించింది. ఏ భాషలోనో, ఏ రూపంలోనో ఈ మోక్ష ప్రదాన వాక్కు మన కందరికీ అందింది. ఆ వాక్కువల్ల మనం ఈ లోకంలో జన్మించాం. మన జీవిత వ్యాపారాలన్నీ, ఉద్యమాలన్నీ అందుకోసమే. అందరం మోక్షోన్ముఖులమై పరుగిడుతున్నాం. తెలిసో, తెలియకో అందరం ఆ వాక్కును అనుసరిస్తున్నాం. గ్రామంలోని పసిబిడ్డలు, వేణుగోపాలుని గానంతో ఆకర్షింపబడినట్లు, మన మందరం ఆ వాక్కులోని మాధుర్యంతో ఆకర్షింపబడి కారణం తెలీకనే దాన్ని అనుసరిస్తున్నాం.
ఆ వాక్కును అనుసరిస్తున్నపుడు మనం నీతిపరుల మవుతున్నాం. మనుష్యాత్మలు మాత్రమే కాదు దాన్ని ఆలకించింది. సర్వజీవులు – అతి క్షుద్రమైనవికూడ – దాన్ని విని, దాని దిశగా పరుగులిడుతున్నాయి. ఆ సందడిలో కొన్ని ఒకటిగా కూడి; కొన్ని తమ త్రోవకు అడ్డంగావున్న ఇతరములను నెట్టివేసి పరుగెత్తుతాయి. ఆ వాక్కును చేరబోవు ఉన్మత్తావేశ ఫలమే ఈ ప్రపంచమంతా. ఈ పోటీలు, ఈ సుఖాలు, ఈ మరణాలు; ప్రకృతి ధర్మం వ్యక్తమయ్యే రూపం ఇదే.
వెంటనే ఏమవుతుంది? దృశ్యమంతా మారిపోతుంది. మాయతోడి పోరాటంవల్ల బీభత్స యుద్ధరంగంగా కాన్పించిన ఈ లోకమే సుఖంగా, అందంగా కనిపిస్తుంది. ప్రకృతిని ఇక దూషించవద్దు. అది ఘోరమైందనీ, నిరర్థకమైందనీ పలకకు. ఇక ఏడువనవసరం లేదు. మొత్తుకొనే అవసరం లేదు. ఆ వాక్కును గ్రహించడంతోనే, ఈ అల్లకల్లోలానికి కారణం తెలిసి పోతుంది. ఈ పోరాటం, ఈ పోటీలు, ఈ ఆరాటం, ఈ క్రూరత, ఈ క్షుద్రభోగాలు, ఈ క్షుద్ర సుఖాలు, ఇవన్నీ ఈ ప్రపంచ ధర్మంలో సహజమే అని, అది అలా వుండడం సహజమే అనీ గ్రహిస్తాం. ఈ ఉపద్రవం లేకపోతే ఆ వాక్కును ఎవరు వింటారు?మనకు తెలిసినా, తెలియకపోయినా అదేకదా మన జీవిత లక్ష్యం? మానవ జాతి అంతా, ప్రకృతంతా, స్వాతంత్ర్యం కోసమే పోరాడుతోంది. సూర్యబింబం ఆ గమ్యం వైపుకే సాగుతోంది. దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న భూమికి, భూమి చుట్టూ తిరిగే చంద్రమండలానికి అదే గమ్యం. గ్రహసంతతి అక్కడికే సాగుతున్నది. గాలి అక్కడికే వీస్తోంది. సర్వమూ ఆ లక్ష్యం చేరడానికే పోరాడుతోంది. సిద్ధపురుషుడు, ఆ వాక్కునకభిముఖుడై పోతున్నాడు. అతనికి గత్యంతరం లేదు. కాబట్టి అతడు స్తోత్రార్హుడు కాదు. పాపి విషయమూ అంతే. దయాపరుడు సూటిగా అక్కడికి వెళ్తున్నాడు. అతన్ని ఆపడం అసాధ్యం. లోభికూడ అక్కడికే పోతున్నాడు. లోకోపకార దీక్షాపరుని హృదయంలోకూడ ఆ వాక్కే ధ్వనిస్తోంది. దాన్ని అతడు నిరోధింపజాలడు. దానివైపు కతడు వెళ్లే తీరాలి. కేవలం సోమరిపోతైన వాని విషయంకూడ అదే. ఈ పయనంలో ఒక్కొక్కని తొట్రుపాటు ఎక్కువగాను, ఒక్కొక్కనిది తక్కువగాను ఉంటుంది. తక్కువైతే సజ్జనుడనీ, ఎక్కువైతే దుర్జనుడనీ అంటాం. మంచీ చెడులు ప్రత్యేక వస్తువులు కానే కావు. రెండూ ఒక్క వస్తువే. ఆ వస్తువు కనిపించడంలో గల ఎక్కువ తక్కువలకే ఆ పేర్లు.
కాబట్టి ఈ ప్రపంచాన్నంతా పరిపాలించేది వ్యక్తమైన మోక్షశక్తే కదా? మనకు ప్రస్తుతం, విచారణీయాంశమైన ఆస్తిక ధర్మ విషయంలో, ఈ సత్యం అనాదినుండే ప్రకటించబడుతోంది. కేవల ప్రాథమిక దశలో ఉండే మతాన్ని తీసికొందాం. అందులో చనిపోయిన పితరులనో, బలిష్ఠులు, క్రూరులు అయిన దేవతలనో ఆరాధించే వారు. ఆ పితరులలో, దేవతలలో వున్న ముఖ్య విశేషమేమి? వాళ్లు ప్రకృతికన్నా అధికులనే, దాని ఆజ్ఞకు బద్ధులు కారనే కదా? ప్రకృతిని గూర్చి, వారి జ్ఞానం అతిస్వల్పం. నిజమేకాని, తాము గోడలగుండా దూకి పోజాలరు. ఆకసాని కెగురజాలరు. వారాపనుల్ని చేయగలరు. తాత్త్వికంగా దీనికి ఏమర్థం? వాళ్లకి స్వాతంత్ర్యం ఉంది. తమకు తెలిసిన ప్రకృతికన్నా వాళ్లు శక్తిమంతులనే కదా? ఇంకా ఉన్నతులైన వారిని ఆరాధించే వాళ్ల విషయంలోకూడ ఇదే వర్తిస్తుంది. ప్రకృతిని గూర్చిన భావన విశాలమయ్యే కొద్దీ, దానికన్న అధికమైన ఆత్మను గూర్చిన భావనకూడ, విశాలమవుతూ, పోయి పోయి, చివరకు దేవుడొక్కడే అనే ఏకేశ్వర మతంగా పరిణమిస్తుంది. ఆ మతం ప్రకారం మాయ (ప్రకృతి) ఉంది. ఆ మాయను ఏలేవా డొకడుంటాడు.
ఈ ఏకేశ్వరభావం ఉదయించడం తోడనే వేదాంత విచారం ప్రారంభమవుతుంది.
కానీ వేదాంతానికి మరికొంత వివరణం కావాలి. “ఈ మాయా రూపాలకు అవతల ఒక పురుషుడున్నాడు. అతడు మాయకంటే అధికుడు. దానికి ఆధీనుడు కాడు. మనం అతన్ని చేరబోతున్నాం.” – అనేదంతా బాగానే ఉంది. ఇది యుక్తికి విరుద్ధంకూడ కాదు. కాని ఆ పురుషుని గూర్చిన భావమింకా విస్పష్టంగా ఏర్పడలేదు. బూజర బూజరగా ఉంది. ఇట్టి భావమే “ఈశ్వరా, నీకు మరింత దాపు” అనే, మీ స్తోత్ర గీతికలో ఉంది. వేదాంతికూడ ఆ గీతికను ఆమోదిస్తాడు కాని, “నీకు” అనే మాటను “నాకు” అని అతడు మారుస్తాడు. “గమ్యం దూరంగా ఉంది. అది ప్రకృతికి ఆవల ఉంది. అక్కడినుండి మనల్ని ఆకర్షిస్తోంది” అని భావించడం అతనికి సమ్మతం కాదు. గమ్య మహత్వం ఏమీ తగ్గించకనే, దాన్ని మరి మరి చేరువకు తీసికొని రావాలి. ప్రకృతిలోనికి వచ్చిన దేవుడు, ప్రకృతే కావాలి. ప్రకృతి రూపుడైన దేవుడు, మానవశరీర గర్భగృహం లోనికి రావాలి! గర్భ గృహంలోని దేవుడు చివరకు గర్భగృహమే అయి, ఆత్మ, మానవుడు కావాలి! ఇంతటితో వేదాంతబోధ అంతమవుతోంది. ఇంతకుమించి అది బోధించేది ఏమీ లేదు. తత్త్వజిజ్ఞాసువులు, ఈ పేర్కొనబడిన చోటులన్నిటిలో అన్వేషిస్తున్న దేవుడు మన హృదయాల్లోనే ఉన్నాడు. మీ రా ‘వాణి’ ని సరిగానే విన్నారు కానీ, అది ఎక్కడినుండి వచ్చిందీ సరిగా తెలిసికోజాలక పోయారు. ఆ మోక్షాదర్శం సత్యమైనదే కానీ, ఆ వాణి మీలోనిదై వుండగా, అది బయటదని భావించి పొరపడ్డారు. దాన్ని దగ్గరకు తెచ్చుకోండి. అప్పుడది మొదటినుండీ మీలోనే – మీ ఆత్మకు ఆత్మయై – ఉండిందని మీకు తెలిసొస్తుంది. మీకు ముక్తి స్వభావసిద్ధం. అంటే మీరు నిత్యముక్తులు. మాయ మిమ్మల్ని ఎప్పుడూ బంధించలేదు. ప్రకృతికి మీపై ఎప్పుడూ అధికారం లేదు. భయపడిన పసిబిడ్డలాగ అది, మీ గొంతు పిసుకుతున్నదని కలగన్నారు. ఈ భయంలోనుండి విముక్తిని పొందడమే పరమార్థం. ఈ పరమార్థాన్ని బుద్ధిగతం చేసికొంటే చాలదు. అనుభవసిద్ధం చేసికోవాలి. ప్రత్యక్ష పరచు కోవాలి. ఈ ప్రపంచం, ఎంత స్పష్టంగా కనిపిస్తోందో, అంత కన్న స్పష్టంగా అది కనిపించాలి. ముక్తులమని అప్పటికి స్పష్టమవుతుంది. అప్పటికి గాని కష్టాలన్నీ తీరవు. హృదయ సంశయాలన్నీ నశింపవు. వంకరలన్నీ చక్కబడవు. అనేకత్వం, ప్రకృతి అనే భ్రాంతులు పోవు. అప్పుడు మాయ, భయంకర స్వప్నరూపమై ఉండడంమాని, మనోహరరూపం ధరిస్తుంది. ఈ భూలోకం చెరసాలగా కనిపించడానికి బదులు క్రీడారంగంగా కనిపిస్తుంది. అపాయాలు, కష్టాలు, వ్యధలు వాని సత్యరూపమైన భగవంతుడుగానే కనిపిస్తాయి. అన్నిటికీ యథార్థ మూలమై అతడే నిలిచి వుంటాడనీ, అతడు ఏకం, సత్యం అయిన ఆత్మ అనీ, మనకర్థమవుతుంది.