(లండన్లో ఉపన్యసించినది)
మాయ అనే మాటను మీలో అనేకులు వినే ఉంటారు. మామూలుగా సరియైన అర్థం తెలుసుకోక, తప్పుగా “మోహం” “భ్రాంతి” వంటి ఏదో అర్థంలో దాన్ని వాడుతారు. కాని వేదాంతవిద్యకు, ఈ మాయావాదం మూలస్తంభం వంటిది కాబట్టి, మనం దీన్ని సరిగా గ్రహించడం ముఖ్యం. తొందరపడక జాగ్రత్తగా వినండి. లేకపోతే అపార్థం చేసికొంటారు. వేద వాఙ్మయంలో కనిపించే అతిపురాతన ప్రయోగాల్లో అది భ్రాంతి అనే అర్థంలోనే వాడబడి ఉంది. కానీ మాయావాదం అప్పటికి సరియైన రూపాన్ని పొందలేదు. “ఇంద్రుడు, తన మాయచేత వివిధ రూపాలను ధరించాడ” న్నది ఒక ప్రయోగం. ఇక్కడ దాని కర్థం గారడీవిద్య లాంటిదేదో అనడానికి సందేహంలేదు. ఇట్టి ప్రయోగాలెన్నో ఉన్నాయి. అన్నిటిలోనూ అదే అర్థం. తర్వాత ‘మాయ’ అనే మాట చాలాకాలం అదృశ్యమైంది. కాని భావంమాత్రం క్రమక్రమంగా పరిపక్వమవుతూ ఉండింది. కాలాంతరంలో, “ఈ జగత్తు మర్మం మనకేల గోచరింపకున్నది?” అనే ప్రశ్న బయలుదేరింది. ఈ ప్రశ్నకు, ఈ క్రింది విశేష భావవ్యంజకమైన సమాధానం ఇవ్వబడింది. “మనం వ్యర్థ ప్రసంగాలతో కాలం గడుపుతున్నాం. ఇంద్రియ విషయాలతోనే తృప్తిపొందుతున్నాం. కోరికల వెంట పరుగిడుతున్నాం. ఇందువల్ల సత్యాన్ని మంచుతెరతో కప్పివేస్తున్నామనవచ్చు.” ఇక్కడ “మాయ” అనే మాట వాడ లేదు కానీ, “మన బుద్ధిపై ఒక విధమైన మంచుతెర క్రమ్మినందువల్ల దానికి సత్యం గోచరించడం లేదు. అదే అజ్ఞతకు కారణం” అనే భావం (ఆశయం) వుంది. ఇంకా చాలాకాలం గడిచిన తర్వాత, చివరి ఉపనిషత్తొక దానిలో “మాయ” అనే మాట, మళ్లీ కనిపిస్తోంది. కానీ అప్పటికి దానిలో క్రొత్త అర్థమెంతో ఇమిడి, దాని రూపమే మారిపోయిందనవచ్చు. ఇలా అవడానికి ముందు, ఎన్నో వాద ప్రతివాదాలు చెలరేగాయి. తత్ఫలంగా, చివరికి సుస్థిరరూపాన్ని పొందిన అర్థమే ఆ ఉపనిషత్తులో కనిపిస్తోంది. “మాయామ్ తు ప్రకృతిం, వాద్వాత్ మాయిన ఞ్చ మహేశ్వరమ్” (ప్రకృతి మాయ అనీ, మహేశ్వరుడు మాయి అనీ తెలిసికోండి – శ్వేతాశ్వతర ఉపనిషత్తు) శంకరాచార్యులకు పూర్వపు వేదాంతులు ఈ మాయాశబ్దాన్ని, తమ తమ మతాలకు అనుకూలించేలాగ ఎన్నో విధాలుగా ప్రయోగిం చుకున్నారు. బౌద్ధులుకూడ, ఈ శబ్దాన్ని కొంచెం ఉపయోగించారు. కాని వారి మతంలో అది “ఆదర్శవాదం” (ఐడియలిజమ్) వంటిదయింది. మాయాశబ్దం ఇప్పు డా అర్థంలోనే వాడుకలో ఉంది. ఈ ప్రపంచం ‘మాయ’ అని హిందువు అంటే, “భ్రాంతి జనితం” అనే అర్థం ఇతరులకు స్ఫురిస్తుంది. ఇందుకు బౌద్ధతత్వజ్ఞులు కొంతవరకు కారణభూతులని చెప్పొచ్చు. వారిలో ఒక శాఖవారు, ఈ బాహ్య ప్రపంచానికి ఉనికే లేదంటున్నారు కదా? కాని, వేదాంతమత పరిపక్వదశలో “మాయ” అనేది, “బాహ్యజగత్తు వాస్తవంకాదు” అనే ఆదర్శవాదానికిగాని, “వాస్తవమే” అనే బాహ్యసత్యావాదా (రియలిజం) నికి గాని, సంబంధించదు. నిజానికి అది ఒక మతమేకాదు. మన స్థితిని, మనముండే ప్రపంచ స్థితిని యథాతథంగా తెలిపే మాటే “మాయ” అనేది. వేదాలను నిర్మించిన రుషులబుద్ధి మూలతత్త్వాలను అనుసరించడంలోను, కనిపెట్టడంలోను నిమగ్నమై ఉండింది. (వ్యగ్రమై ఉండింది.) స్వల్పాంశాల లోనికి దిగడానికిగాని, వానికోసం వేచివుండడానికిగాని, వారికి తీరికలేదు. అగాధ పరిశీలనవల్ల వస్తువుల తత్త్వం తెలుసుకోవడమే వారి సంకల్పం. లోకాతీత క్షేత్రంనుండి, వారికొక పిలుపు వినబడుతూ వుండిందనవచ్చు. అందువల్ల, వారికి వ్యవధి లేదు. భౌతిక శాస్త్రంలో ఆధునికాలనబడే కొన్ని విషయాలు, ఉపనిషత్తులలో అక్కడక్కడ కన్పిస్తాయి. అందలి స్వల్పాంశాలు ప్రాయికంగా తప్పులతో నిండి ఉంటాయి కానీ, మూలతత్త్వ విషయాలన్నీ నిర్దుష్టాలు. ఇందుకొక ఉదాహరణ – ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు మొన్నమొన్ననే కన్గొన్న ఆకాశ పదార్థం (ఈధర్) వారి కప్పటికే పరిచితం. ఈ ఆధునికవాదం కన్న, అది ఎంతో పరిపక్వ రూపాన్ని పొందివుండిందికూడ. కాని అది మూలభావ విషయంలో మాత్రమే. ఈ భావాన్ని విస్తృతపరచి, క్రియారూప వివరణకు దిగినపుడు ఎన్నో తప్పులు ఏర్పడ్డాయి. జీవశక్తి సర్వగతమనీ, లోకంలోకల జీవకోటిలో అంతా, ఆ శక్తే పరిమాణ భేదాలతో ప్రకాశిస్తూన్నదనీ వేదకాలంలోనే కనిపెట్టబడింది. జీవశక్తిని గూర్చి పై ఆశయాలుగల పెద్ద స్తోత్రమొకటవేదసంహితలో వుంది. మరొక విశేషం. మీకది చిత్రంగా అనిపిస్తుందేమో కానీ, ఈ భూలోకంలోని జీవోత్పత్తిని గూర్చి ఆధునిక భౌతికతత్త్వ పరిశోధన ఫలంగా ఇటీవల వెలువడిన వాదాలవంటివే, వేదకాల తత్త్వ వాఙ్మయంలో కూడ ఉన్నాయి. జీవోత్పత్తికి మూలం ఇతర మండలాలు అనే ఆధునిక వాదం మీకు తెలుసు. ఆ మూలం చంద్రమండలమని వేదకాలపు తత్త్వవేత్తల అభిప్రాయం.
విశాలభావమయములు, వస్తు సాధారణ ధర్మ ప్రతిపాదకాలు, అయిన మూల తత్త్వాలను నిబంధించడంలో, ఈ వేదకాలపు తత్త్వ విచారపరులు చూపిన ధైర్యసాహసాలు అపారమైనవి. బాహ్య ప్రపంచ విచారమూలంగా, వారు చేసిన విశ్వరహస్య విభేదనం, సాధ్యమైనంత వరకు సంతృప్తికరమే. కాని, మూలతత్త్వమే అసమర్థమై ఉన్నప్పుడు, ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు చేసే, దాని స్వల్పాంశ పరిశీలనం, సమస్యా పరిష్కారానికి ఎలా ఉపకరిస్తాయి? ఆకాశ పదార్థవాదాన్ని మూలాధారంగా చేసికొని పురాతన కాలపు తత్త్వ విచారపరులు విశ్వరహస్యాన్ని భేదింపజాలకపోయారు. ఇప్పుడు అదే మూలతత్త్వాన్ని, సూక్ష్మాంశ విస్తరణం చేసి పరిశీలించడంవల్ల ఆ రహస్యాన్ని భేదింపవచ్చుననడం వెర్రికదా? సర్వవ్యాప్తమగు జీవశక్తిని గూర్చిన విచారణంకూడ ఇలాంటిదే. మూలభావమే సమస్యా పరిష్కారానికి అసమర్థమై ఉన్నప్పుడు, తత్సూక్ష్మాంశ విచారణం, ఎలా సమర్థమవుతుంది? ఇంతకు నేను చెప్పవచ్చిందేమంటే, మూలతత్త్వ విచారణంలో హిందువులు అత్యంత ధీరత చూపారు. ఆధునికుల ధీరతకది తీసిపోదుకదా? కొన్ని సందర్భాల్లో ఎంతో ఎక్కువ (గొప్పది) కూడా! వారు ఏర్పరచిన సర్వసాధారణీకరణ సిద్ధాంతాలు కొన్ని అత్యద్భుతాలు. అత్యంత విపులాన్వయాలు. (మానవుని బుద్ధికి అంతకన్న ఉన్నతమైన ఊహలు అందవు) ఊహౌన్నత్యంలో మానవుని బుద్ధి అంతకన్న పైకెగయలేదు. వారి భావాలు కొన్ని, ఇంకా సిద్ధాంత రూపాన్ని పొందలేదు. కాని అవి ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులకు ఇంకా చర్చనీయాంశాలుగానైనా స్ఫురింపలేదు. ఉదాహరణం – ఆకాశపదార్థాన్ని ప్రతిపాదించిన తర్వాత వారింకా అగాధ పరిశీలనచేసి, మనస్సుకూడా సూక్ష్మతరమైన ఆకాశపదార్థమే అని నిర్ణయించారు. అటు తర్వాత, ఇంకా లోతుకు దిగి, మనస్సుకన్నా సూక్ష్మతరమైన ఆకాశపదార్థంకూడ ఒకటి ఉందని కనిపెట్టిరి. కాని సమస్య ఇంకా పరిష్కృతం కాలేదు. బాహ్య ప్రపంచ పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, మూలసమస్య అట్లే నిలిచి వుంది. భౌతికశాస్త్రజ్ఞుడు ఇందువల్ల నిరుత్సాహపడక ఇలా అంటాడు: “ఇప్పుడిప్పుడే కదా, మనకు కొంచెం కొంచెంగా విషయం తెలిసివస్తోంది? కొన్ని వేల సంవత్సరాలు ఆగండి. పరిష్కారమార్గం లభిస్తుంది.” వేదాంతి ఇందుకేమాత్రమూ ఒప్పుకోడు. మనస్సు పరిమిత వస్తువనీ, దేశకాల నిమిత్తములను దాటి దానికి ప్రచారం లేదనీ, అతనికి నిస్సంశయంగా తెలుసు. మనిషి తనలోనుండి బయటికి దుముకజాలనట్లే, కాలనిమిత్తములు గీచిన పరిధిని దాటి అతడు పోజాలడు. ఇక దేశకాల నిమిత్తములు ఎలా ఉత్పన్నాలైనాయన్న విషయాన్ని అతడెలా పరిశీలింప గలుగుతాడు? ఆ పరిశీలన ప్రయత్నాలన్నీకూడ వాటి విధుల అధీనంలో నుండే కదా అతడు పరిశీలించాలి? అలాంటప్పుడు, “ప్రపంచానికి అస్తిత్వం (ఉనికి) కలదు” అనే మాట కర్థమేమి? “ప్రపంచానికి అస్తిత్వంలేదు” అనే మాటకు అర్థం ఆలోచిద్దాం. “దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. నా మనస్సు, మీ మనస్సులు, ఇతరుల మనస్సులు – వీని సంబంధంలో మాత్రమే దాని అస్తిత్వం” అని అర్థం. ఈ ప్రపంచాన్ని మన పంచేంద్రియాలతో చూస్తున్నాం. ఇంకొక ఇంద్రియముంటే దానిలోను ఇంక కొంత కనిపిస్తుంది. ఇంకా ఒక ఇంద్రియముంటే, ఇంకా వేరే విధంగా కనిపిస్తుంది. అంటే, దానికి వాస్తవమైన అస్తిత్వం లేదు. అవికారం, అచలం, నిత్యం అగు అస్తిత్వం లేదు. అలా అని దానికి అస్తిత్వం లేనేలేదనడానికీ వీలులేదు. అది వుందికదా? దానిలోనే, దానిమూలంగానేకదా మనం కార్యకలాపాలు నెరవేర్చుకొంటున్నాం? అంటే అది అస్తిత్వాల కూడిక.
ఈ సూక్ష్మతత్త్వ విచారంనుండి, మన దైనిక జీవిత వ్యాపారాలకు దిగివచ్చినా, జీవితమంతా పరస్పర విరోధమయమై, అస్తిత్వనాస్తిత్వాల కూడికగానే కనిపిస్తోంది. జ్ఞాన విషయంలో ఈ విరుద్ధభావం ఉంది. మానవుడు కోరితే అతనికి సర్వమూ తెలుస్తుందని మొదట అనిపిస్తుంది. కాని, నాలుగడుగులు వేయకముందే, దాటశక్యంకాని వజ్రకఠినమైన గోడ అడ్డుతగులుతుంది. తన కార్యాచరణమంతా ఒక వలయం లోపలే. ఆ వలయాన్ని అతడు దాటలేడు. సొంత విషయాలూ, ఎంతో ప్రియమైనవీ అయిన సమస్యలు ఎన్నో రాత్రింబగళ్లు అతన్ని వేధిస్తున్నాయి. కాని తన బుద్ధికి అతీతమవడంవల్ల వాని నతడు పరిష్కరింపజాలడు. అయినా ఆ వాసన సుస్థిరమై అతని మనస్సులో నాటుకొనే ఉంది. ఉన్నా దాన్ని నిగ్రహించి, అణచివేయడమే శ్రేయస్కరమని మనకు తెలుసు. ప్రతి క్షణం మన హృదయ ప్రేరణలన్నీ స్వార్థపరత్వం దిశకే లాగుతున్నాయి. కాని అనిర్వాచ్యవాణి ఒకటి స్వార్థరాహిత్యమే శ్రేయస్కరమని ఉద్బోధిస్తూ ఉంటుంది. పసితనంలో ప్రతివాడూ ఆశావాదియే (ఆప్టిమిస్ట్). అప్పుడతనికి, భావిజీవితమంతా స్వర్గభోగమయమే. యౌవనంలో అతడంతకన్నా ఆశావాది. మరణం, అపజయం, పరాభవం – ఇట్టివి లోకంలో ఉన్నాయనే అతడు అప్పుడు నమ్మలేడు. కాని వార్ధక్యం వచ్చేసరికి జీవితమంతా శిథిలసౌధంలాగా కనిపిస్తుంది. ఆశలన్నీ అంతరిస్తాయి. భవిష్యత్తు అంధకారమయమౌతుంది. మనమిలా ప్రకృతి చేత దెబ్బలు తింటూ, ఎక్కడికి పోయేదీకూడ తెలిసికోలేక, అతి సుఖస్థితినుండి, అతి దుఃఖస్థితిని చేరబోతూంటాం. బుద్ధుని జీవితమైన ‘లలితవిస్తార’ లోని సుప్రసిద్ధ గేయమొకటి నా కీ సందర్భంలో జ్ఞప్తికి వస్తోంది. బుద్ధుడు మానవకోటిని ఉద్ధరించడానికి జన్మించాడు. కాని రాజభోగాలలో మునిగి, తన్నుతానే మరచిపోయాడు. ఆయనను మేల్కొల్పడానికై దేవదూతలు వచ్చి ఒక పాటను పాడారు. ఆ పాటలోని సారాంశమిది: “మనం ఈ జీవిత నదీప్రవాహంలో పడి తేలియాడుతూ పోతున్నాం. నది నిరంతర పరిణామం పొందుతోంది. దానికి విరామం లేదు, విశ్రాంతి లేదు.” అట్లే మన జీవితాలుకూడ విరామం, విశ్రాంతి లేకుండా, సాగిపోతూనే ఉంటాయి. మనం ఏమి చేయాలి? అన్నపానీయాలు సమృద్ధిగా కలవాడు, ఆశావాది. అతడు ఆపదల మాటయే ఎత్తడు. ఆ మాట విన్ననే అతనికి భీతి.
లోకంలోని కష్టసుఖాలను గూర్చి అతనికి చెప్పకండి. “లోకమంతా సుఖమయమే” అనండి. “నిజమే. నేను క్షేమంగా ఉన్నాను. నన్ను చూడండి. నాకు సుఖ నివాసం వుంది. కూడు, గుడ్డలకు లోటేమీ లేదు. కాబట్టి, ఆ ఘోరవిషయాలు నా ఎదుట ఎత్తకండి.” కానీ ఇతరు లెందరో కూడుగుడ్డలకు కరువై చస్తున్నారు. లోకం సుఖమయమని వారితో చెబితే, వారు వినిపించుకోరు. తాము దుఃఖాలతో కృశిస్తూండగా, ఇతరుల సుఖాలు వారికెందుకు నచ్చుతాయి? మనమిలా ఆశా, నిరాశల మధ్య ఊగులాడుతున్నాం.
ఇక మరణమనే మిక్కిలి భయంకరమైన విషయం ఒకటి ఉంది. ప్రపంచమంతా మరణం వైపునకే సాగుతోంది. ప్రతి వస్తుమా మరణించేదే. మన అభివృద్ధి, మన అహంకారం, మన సంస్కరణలు, మన భోగాలు, మన సంపద, మన జ్ఞానం అన్నిటికీ గమ్యమొక్కటే – మరణం. ఏది తప్పినా, అది తప్పదు. నగరాలు పొడచూపుతాయి, అడుగంటుతాయి. సామ్రాజ్యాలు మింటికెగసిపోతాయి, మంటకూలుతాయి. గ్రహమండలాలు విచ్ఛిన్నాలై, ధూళిపాలై, ఇతర మండల వాతావరణంలో తేలియాడుతాయి. ఆదిమకాలంనుండీ కథ ఇట్లేనడుస్తోంది. మరణమే అన్నిటికీ అంతం. జీవితానికి, సౌందర్యానికి, సంపదకు, అధికారపదవికి, అన్నిటికి – సౌశీల్యానికికూడ, – మరణమే అంతం. పుణ్యపురుషులు, పాపపురుషులు, ప్రభువులు, బిచ్చగాండ్రు అందరూ మరణించవలసినవారే. సర్వమూ పయనించేది మరణం వైపునకే. కానీ, ప్రాణాలపై ఇంత తీపి!!! ఎట్లో, జీవాన్ని అంటిపట్టుకొని వుంటాం. ఎందుకో మనకే తెలీదు. ఆ పట్టువదలడం మనకు అసాధ్యం. ఇది మాయ.
తల్లి తన బిడ్డను ఎంతో ప్రేమతో పాలిచ్చి పెంచుతోంది. ఆ బిడ్డడామె ప్రాణానికి ప్రాణం. వాడు పెరిగి, పెద్దవాడైన తర్వాత చెడుత్రోవల్లోపడి, పశుప్రాయుడై, ఆమెను ప్రతిదినమూ కొట్టి, తన్ని, హింసిస్తున్నాడు. కానీ ఆమె వానిని విడిచి వెళ్లజాలదు. ఇందుకు కారణమేమి? అని ఎప్పుడైనా ఆలోచిస్తే, ప్రేమ అనే ఆశయం కల్పించుకొని, ఆమె తృప్తిపొందుతుంది. కానీ, నిజానికి అది ప్రేమకాదు. ఆమె బుద్ధిని ఏదో ఆవరించి లొంగదీసుకొన్నది. ఎంత ప్రయత్నించినా దానినామె విదిలించి వేయజాలదు. ఇది మాయ.
“బంగారు ఉన్ని* ” ని సాధించి తేవడానికి మన మందరం ప్రయత్నిస్తున్నాం. అది తనకు లభిస్తుందని ప్రతివాడి ఆశ. ఆ ఆశ్ ఈడేరడం, ఏ రెండు కోట్లకో ఒక్కవంతు మాత్రమే అని బుద్ధిమంతుడగు ప్రతివాడికీ తెలుసు. కానీ ప్రతివాడూ, దానికోసం ప్రయత్నిస్తాడు. ఇది మాయ.
మృత్యుదేవత మన భూలోకంలో రాత్రింబగళ్లు, వికటతాండవం ఆడుతోంది. కాని ఎప్పటికీ బ్రతికి ఉంటామనే మనం నమ్ముకొని వుంటాం. “లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది?” అని ధర్మరాజును ప్రశ్నిస్తే “ప్రతి దినమూ జనులు మన చుట్టూ మరణిస్తున్నారు. కాని తాము మరణించ మని, మిగిలినవాళ్లు అనుకుంటారు” అని ఆయన బదులుచెప్పాడు. ఇది మాయ.
మన బుద్ధి ప్రచారంలోను, మన జ్ఞానంలోను, మన జీవిత సంఘటనల్లోను, అన్నింట్లోకూడ, ఇట్టి విరుద్ధాశయాలు, అతిదారుణ రూపంలో మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. సంస్కర్త ఒకడు పుట్టి, ఒక జాతిలోని లోపాలను సవరింపజూస్తాడు. కానీ అవి సరిపోవడానికి ముందే, మరొకచోట ఒక వేయి ఇతర లోపాలు తలచూపుతాయి. పడిపోతున్న పాతయింటిని బాగుచేసి, నిలువబెట్టినప్పటికీ, ఇంకో భాగం పడిపోతుంది. నిర్బంధ వైధవ్యంవల్ల కలిగే హానిని గూర్చి మా హిందూ దేశ సంఘ సంస్కర్తలు ఘోషిస్తున్నారు. అవివాహిత స్త్రీ సమస్యను గూర్చి పాశ్చాత్య దేశాల్లో ఘోష. ఒకచోట అవివాహిత స్త్రీల నుద్ధరించాలి. వారు కష్టాల పాలౌతున్నారు. విధవలను ఇంకోచోట ఉద్ధరించాలి. వారూ కష్టాల పాలవుతున్నారు. జీర్ణించిన కీళ్లనొప్పివంటి సమస్య యిది. దాన్ని తలనుండి తరిమితే శరీరానికి చేరుతుంది. అక్కడినుండి తరిమితే పాదాలను బాధిస్తుంది. చదువు, సంపద, సంస్కృతి – ఇవి ఏ కొద్దిమందికో మాత్రమే అందుబాటులో ఉండరాదని సంస్కర్తలు బోధిస్తారు. అందరికవి లభించేలా చేయజూస్తారు. దీనివల్ల కొందరికి సుఖం కలుగవచ్చు. కానీ, సంస్కృతి పెరిగే కొలదీ శరీర సుఖం తరిగే అవకాశం వుంది. సుఖజ్ఞానంతోపాటు, అసుఖజ్ఞానంకూడ పెరుగుతుంది. అయితే మనకేది మార్గం? ఒకని కేపాటసంపద లభిస్తుందో, అంత ఆపద ఇంకొకనికి ఆపాదిల్లి తీరుతుంది. ఇది లోకధర్మం. అనుభవంలేని యువకులకు ఇది అంతస్పష్టంగా తోచకపోవచ్చు. కానీ చాలాకాలం జీవించినవారూ, లోకంలోని కష్టనిష్ఠూరాలను తెలిసిన వారూ ఇది గ్రహిస్తారు. ఇది మాయ. ఇవన్నీ నిరంతర సంఘటనలు. ఇది అనివార్యస్థితి. “ఏల” అనే ప్రశ్నకు సమాధానం లేదు సరికదా, ఆ ప్రశ్న వేయడానికి అవకాశంకూడ లేదు. ఎలా? ఎందుకు? అని ప్రశ్నించడం నిరుపయోగం. ప్రపంచరీతి ఇట్టిదనీ, ఇది మార్పశక్యం కానిదనీ మాత్రం మనకు తెలుసు. దాన్ని మనం పూర్తిగా గ్రహించడం అసాధ్యం. మనస్సులో స్పష్టంగా చిత్రించుకోవడంకూడ అసాధ్యం. ఇక దాన్ని పరిష్కరించడమెలా? ఈ ప్రపంచం నడచే క్రమాన్ని యథాతథంగా తెలిపే మాటే మాయ. ఇదంతా తెలిపితే జనులు భయపడతారు. కానీ మనం భీతిల్లరాదు. వాస్తవ స్థితిని దాచుకొంటే దాన్ని బాగుపరిచే మార్గం కనుక్కోవడమెలా? కుక్కలు తరిమేటప్పుడు, తలను దాచుకొని, కుందేలు అపాయ విముక్తిని పొందాననుకుంటుంది. కాని అందువల్ల ఏం ప్రయోజనం? ఈ వాదానికి, ఆక్షేపాలున్నాయికాని, అవి సంపన్నులైనవారు చేసేవని కొందరనుకోవచ్చు. ఈ ఇంగ్లాండు దేశీయులు నిరాశావాదులు (పెసిమిస్ట్స్) కాలేరు. ఇక్కడ ప్రతివాడూ “లోకమెంత అద్భుతంగా, ఎంత పురోభివృద్ధి సూచకంగా నడుస్తోంది?” అంటాడు. కానీ తామున్న స్థితినే వాళ్లు లోకానికి అంటగడుతున్నారు. పురాతనసమస్యలు చర్చిస్తున్నాం. క్రైస్తవజాతులు అభ్యుదయ సంపన్నులై వున్నారు. కాబట్టి క్రైస్తవమత మొక్కటే సత్యమైంది. కాని క్రైస్తవజాతుల అభ్యుదయానికి కారణం, ఇతర మతస్థులు దీనదశనొంది, కడగండ్లపాలవడమే. కనుక ఈ ప్రతిపాదన తన్నుతానే ఖండించుకొంటోంది. వారికి బలికాదగువారు లభిస్తున్నప్పుడే వారి అభ్యుదయం. ప్రపంచమంతా క్రైస్తవమత మవలంబిస్తే, క్రైస్తవ జాతులకు దారిద్ర్యం చేకూరుతుంది. ఇతర మతస్థులుంటేకదా వీరికి ఆహుతి అవడానికి? కాబట్టి, ఈ వాదంనందే, దానికి విరుపుకూడ వుంది. ఆకులను తిని, మృగాలు, మృగాలను తిని మానవులు జీవిస్తారు. కానీ బలవంతులగు మానవులు, బలహీన మానవుల్ని ఆహుతిగొనే ఘోరాచారంకూడ ఉంది. ఇది అంతటా కనిపిస్తుంది. ఇది మాయ. ఈ స్థితిని సంస్కరించడమెలా? ఈ ప్రశ్నకు ఎన్నెన్నో సమాధానాలు చెప్పబడుతున్నాయి.
కాలాంతరంలో అదంతా చక్కబడుతుందని కొందరి సమాధానం. అది ఒకవేళ నిజమే కావచ్చునని ఒప్పుకున్నా, ఆ ఉపకారం చేయడానికి ఇట్టి ఘోరాతిఘోర మార్గమెందుకు? మంచి చేయడానికి మంచిమార్గాలే ఏల అవలంబించరాదు? రాబోవు తరంవారు సుఖపడవచ్చు. కానీ ఇప్పటివారి కీ క్రూరవ్యధ లెందుకు? ఈ ప్రశ్నకు సమాధానంమేమీ లేదు. ఇది మాయ.
మరొక వాదంకూడ వుంది. కొందరంటారూ, లోపాల నన్నిటినీ, క్రమక్రమంగా రూపుమాపుచుండడం పరిణామ కార్య విశేష లక్షణాలలో ఒకటట!!! ఇలా లోపాలన్నీ నశించిన తర్వాత, మంచి మాత్రమే నిలుస్తుందట??!! ఎంత శుభవార్త!!! కావలసినన్ని ఐహిక సంపదలు కలిగి, పూటగడుచుటెలాగా అనే సంక్షోభం లేక, పరిణామం పేరిట, ఈ క్రూరచక్రం క్రిందపడి నలిగిపోకుండు, భాగ్యజీవుల అహంభావానికి ఇది ఎంత ఆహ్లాదకరం? ఆ మూకలు ఎంత అగచాట్లుపడ్డా తమకేం? వాళ్లు మరణిస్తే మాత్రం లోకానికి ఏమి లోటు? భళీ! ఎంత చక్కని వాదం? కానీ, ఇదంతా తప్పుల కుప్ప. లోకంలో అభివ్యక్తములైన, శుభాశుభముల పరిణామాలు నిర్దిష్టములైనవి అనుట, నిరాధారమగు వెర్రి ఊహ! శుభం క్రమక్రమంగా హెచ్చుతూంటుంది. అశుభం క్రమక్రమంగా తగ్గుతూ వుంటుంది అనేది అంతకన్నా వెర్రి ఊహ. వీరి పరిణామ కార్యం, కొంతకాలం ఇలా సాగిన తర్వాత, అశుభమంతా నశించి, శుభం మాత్రమే లోకంలో మిగులుతుందట!! ఇలా చెప్పడం సులభమేకానీ, అశుభం తిరిగి పోతోందని, నిరూపింపగలరా? ఒక అడవిజాతివాణ్ణి తీసికోండి. వాడు చదువు రానివాడు. వ్రాత అనే మాటే వినలేదు. బుద్ధిని వికసింపజేసుకునే మార్గాలు తెలీదు. వానికి తీవ్రమయిన గాయం తగిలితే, అది త్వరగానే నయమవుతుంది. మనం కొంచెం ఎక్కడైనా గీరుకొనిపోతేనే మరణిస్తాం. యంత్ర నిర్మాణం వల్ల వస్తువులు చౌక అయినాయి. మనిషి అభివృద్ధి పొందడానికి, బాగుపడటానికి అవకాశాలేర్పడ్డాయి. కానీ తన్మూలంగా, ఒకడు లక్షాధికారి అవడానికి, వేలవేల జనులు క్రమక్రమంగా, అణచివేయబడి దాస్యవృత్తికి పాల్పడి, కృశించిపోతున్నారు. పశుప్రాయదశలో వున్న మానవుడు, ఇంద్రియాల్లోనే జీవిస్తాడు. కడుపు నిండకపోవడంచేత, శరీరానికి ఏదైనా హానికలగడంచేత, వాడు గోడు చెందుతాడు. వాని కష్టసుఖాలకు, ఇంద్రియాలలోనే మొదలు, ఇంద్రియాల్లోనే తుది. వాడు అంతకన్నా ఉన్నత దశకు వచ్చి, వాని సుఖోత్పత్తి క్షేత్రం విశాలతనందుకొలది, దుఃఖోత్పత్తి క్షేత్రంకూడ విశాలమవుతూ వుంటుంది. అసూయ పడటం, న్యాయస్థానాలకు ఎక్కడం, పన్నులు చెల్లించడం, సంఘనిందలు మోయడం, హృదయ రహస్యాలలోకూడ ప్రవేశించే ఘోరరాక్షస పరిపాలనకు లోబడి, రాత్రింబగళ్లు రాపిడి నొందుతూండడం, – ఇవన్నీ అడవిజాతివానికి తెలీదు. నాలుగు ముక్కలు చదువు నేర్చుకొని, పొగరెక్కిన మానవుడు, దుష్ట మృగాలకన్నా, వేయిరెట్లు క్రూరుడు కాగలడని అతనికి తెలీదు. కాబట్టి ఇంద్రియజీవితాన్ని దాటి పైకి ఎదిగిన పిదప మన సుఖానుభవశక్తి అధికం కావడం నిజమేకానీ, దాంతోపాటు కష్టానుభవశక్తికూడ అధికం కావడం తప్పదు. నరాలు ఎక్కువ సూక్ష్మాలయితే, ఎక్కువ వ్యధను భరించగలుగుతాయి. ఏజాతిలోనైనా చదువురాని సామాన్యమానవుడు, తిట్లకు అంతగా బాధపడడు. ఒళ్లు విరగ్గొట్టినప్పుడే వానికి కష్టమనిపిస్తుంది. కానీ మర్యాదస్థుడు, ఒక్క తిట్టునుకూడ ఓర్వజాలడు. వాని నరాలు అంత సూక్ష్మాలు. నరాలు సుఖస్పర్శకు సున్నితం కావడంతోపాటు, వాని వ్యధకూడ అధికమైంది. పాపం, పరిణామవాదికి ఈ సత్యమెంత ప్రతికూలం?
మనం సుఖానుభూతి శక్తిని ఎక్కువ చేసుకొనేకొద్దీ, దుఃఖానుభూతి శక్తికూడ ఎక్కువవుతుంది. సుఖానుభూతి శక్తికన్నా, దుఃఖానుభూతి శక్తి ఎన్నో రెట్లు అధికంగా పెరుగుతూంటుందనికూడ నా అభిప్రాయం.
పురోగమనం చెందేకొద్దీ, సుఖదుఃఖాలకు రెంటికీ నూత్నావకాశాలు కలుగుతూంటాయని స్వానుభవమే మనకు తెలుపుతోంది. ఇది మాయ.
కాబట్టి ‘మాయ’ అనేది దృశ్యలోక స్థితిని యథాతథంగా తెలిపే మాటే కానీ, విశ్వరహస్యాన్ని భేదించే వాదం కాదనడం స్పష్టం. మన జీవిత మూలంలోనే పరస్పర విరుద్ధమైన ద్వంద్వత వుంది. మనం ఏమిచేసినా, దాటశక్యంకాని, ద్వంద్వమయ వాతావరణంలోనే చేయాలి. మంచి ఉండేచోటంతా కొంత చెడు, చెడు ఉండేచోటంతా కొంత మంచి ఉండే తీరుతుంది. జీవమున్న చోటంతా మరణం నీడలాగా నిలిచియే వుంటుంది. నవ్వేవాడు ఏడ్వాలి, ఏడ్చేవాడు నవ్వాలి. ఈ ద్వంద్వస్థితి మార్చ శక్యంకానిది. చెడు అనే మాటే లేక, అంతా మంచే ఉండేటువంటిది, ఏడుపను మాటేలేక ఎప్పుడూ నవ్వులే కలిగినట్టిదీ అయిన ప్రదేశమొకటి ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ అది వస్తుతత్త్వానికే విరుద్ధం. కాబట్టి అసంభవం. ప్రపంచపు మూలధర్మాన్ని మార్చడం సాధ్యమా? నవ్వు కల్గించే శక్తి ఉన్నచోటనంతా ఏడ్పు కలిగించే శక్తికూడ ఎక్కడో దాగి వుంటుంది.
ఇలా వేదాంతమతం ఆశాశీలంకానీ, నిరాశాశీలంకానీ కాదు. అందులో ఆశా, నిరాశలు రెంటికీ స్థానం వుంది. ఏది వచ్చినప్పుడు అది లోకంలో, శుభాశుభాలూ (మంచి చెడ్డలు), సుఖదుఃఖాలూ కలిసే ఉంటాయనీ, ఈ ద్వంద్వాలలో దేన్ని పెంచినా, రెండోదికూడ పెరిగియే తీరుతుందనీ దాని బోధ. లోకమంతా కేవలం మంచిదిగనో, కేవలం చెడ్డదిగనో ఉండడం అసంభవం. ఆ భావమే అసంగతమైనది. మంచి చెడ్డలు పూర్తిగా వేర్వేరయిన, రెండు భిన్నవస్తువులు కావు అనే తత్త్వరహస్యం ఈ పరిశీలనవల్ల తేలుతోంది. “ఇది మంచిది. కేవలం మంచిది. ఇది చెడ్డది, కేవలం చెడ్డది, –” అని రూఢిగా చెప్పదగిన వస్తువు లోకంలో, ఒక్కటికూడ లేదు. నేడు మంచిదిగా తోచు విషయమే, రేపు చెడ్డదిగా తోచవచ్చు. ఒకరికి దుఃఖకారణమగు వస్తువే, మరొకరికి సుఖకారణం కావచ్చు. ఒక బిడ్డ దేహాన్ని కాల్చి, ఘోరాపదను కలిగించిన అగ్నియే, అన్నం వండి పస్తులు పడివున్న వాని ఆకలి తీరుస్తుంది.
మనస్సుకు దుఃఖాన్ని తెలిపే నరాలే సుఖాన్నీ తెలియజేస్తాయి. కాబట్టి చెడును నిర్మూలించాలంటే, మంచినికూడ నిర్మూలించాలి. వేరే మార్గం లేదు. చావును రూపుమాపాలంటే, బ్రతుకునుకూడ రూపుమాపాలి. చావులేని బ్రతుకు, దుఃఖంలేని సుఖం అనడం అసంగత ప్రసంగం. ఈ ద్వంద్వాలలో ఏదీ ప్రత్యేకంగా లభించదు. అవి ఒక్కదాని రెండు రూపాలే. నిన్న నాకు మంచిదిగా తోచిన వస్తువు, నేడు మంచిదిగా అనిపించదు. నా జీవితమే ఇందుకొక నిదర్శనం. చిన్ననాటినుండీ నా లక్ష్యాలు ఎన్నోమార్లు మారాయి. బలిష్ఠమైన జోడుగుర్రాలను పూన్చిన బండి తోలుట ఒకప్పటి లక్ష్యం. ఒక దినుసు మధురభక్ష్యం చేయగలగడం ఇంకొకనాటి లక్ష్యం. భార్య, బిడ్డలు, అధిక సంతానం ఆ తర్వాతి లక్ష్యం. ఆయా కాలాల్లో నేను ఆనందపరమావధి నొందడానికి ఆ లక్ష్యాలు నెరవేరివుంటే సరిపోయేది. నేడు అవన్నీ నా దృష్టికి పరిహసనీయాలైన వెర్రి కోర్కెలు. వ్యక్తిత్వం, ఎక్కడ నశిస్తుందో అని భీతిల్లుతున్న దశ, మనకిట్లే పరిహసనీయంగా తోచేకాలం వచ్చితీరుతుందని వేదాంతమతం బోధిస్తోంది. ఈ దేహాన్ని ఎప్పటికీ నిలుపుకొని వుండడమే సుఖం – అనేఆశయంకూడ మనకిట్లే వెర్రిగా, పరిహసింపదగిందిగా తోచే కాలం వచ్చి తీరుతుంది. కానీ ఇదే నిజమైతే మనం అనివార్యమైన, పరస్పర వ్యతిరేక వాతావరణంలో అస్తిత్వమూ కాక, నాస్తిత్వమూ కాక, దుఃఖమూకాక, సుఖమూకాక, ఈ విరుద్ధభావాలు కూడిన వాతావరణంలో – కదా చిక్కుకుని వున్నాం? అట్లయితే వేదాంతంకానీ, ఇతర తత్త్వశాస్త్రాలుకానీ, మతాలుకానీ ఎలా ఉపకరిస్తాయి? “సత్కార్యాలు ఎందుకు చేయాలి?” అనే గాఢ సంశయంకూడా కలుగుతుంది. అపకారం కలిగించని ఉపకారం కానీ, దుఃఖం కలిగించని సుఖంకానీ అసంభవమైతే, ఉపకారం చేయడం ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానమేమంటే “ఇతరుల దుఃఖాన్ని తగ్గించడానికి పాటుపడడమే, మన సుఖాన్ని పెంపొందించుకొనే మార్గం–” ప్రతివారికీ ఇది అనుభవంవల్లే తెలియవస్తుంది. బుద్ధిమంతులిది త్వరగానే గ్రహిస్తారు. మందబుద్ధులకు కొంత ఆలస్యమవుతుంది. కానీ, ఈ ఆలస్యంవల్ల వీళ్లకు అపారనష్టం కలుగుతుంది. శీఘ్రంగా గ్రహించినవాళ్లకు అంత నష్టం వుండదు. ఇది మొదటి సమాధానం. ఇక రెండవది – ఈ ద్వంద్వమయ ప్రపంచ జీవనంనుండీ, మనం ఎప్పటికైనా, విముక్తి పొందగోరితే, మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి. మనం ఈ స్వప్నంనుండి మేలుకొని, మట్టి పిడతలతో ఆడుకోవడం మానేవరకు, ఈ ఉపకారకశక్తులు, అపకారకశక్తులూ కలిసి మనకోసం ఈ ప్రపంచాన్ని నిలిపి వుంచుతాయి. మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. కానీ అది ఒకంతట నేర్చుకోలేం. దీర్ఘకాలం – ఎంతో దీర్ఘకాలం పడుతుంది. పరిపూర్ణుడే పరిమితుడయ్యాడనే భావంపై ఆధారపడిన, తత్త్వసిద్ధాంతమొకటి నిర్మించే ప్రయత్నాలు జర్మనీ, ఇంగ్లాండు దేశాల్లో జరిగాయి. అఖండ పరమాత్మయే, ఈ ప్రపంచ రూపంలో సాక్షాత్కరింప ప్రయత్నిస్తున్నాడనీ, కాల పరిపాకంలో ఆ యత్నం సిద్ధింపగలదనీ ఈ వాదంలోని మూలాశయం. “ఇది మంచిపనేకానీ, ‘పరిమిత వస్తువు, అఖండుని పూర్తిగా వ్యక్తపరుపగల్గును’ అనడానికి హేతుబద్ధమైన ఆధారమేమైనా ఉందా?” అని తత్త్వవేత్తలు ప్రశ్నిస్తారు. నిత్యుడు, అఖండుడు అగు వాడు, పరిమితుడైతే కదా ఈ ప్రపంచంగా కాగలడు? ఇంద్రియాల ద్వారాకానీ, మనస్సు ద్వారాకానీ, బుద్ధి ద్వారాకానీ, గోచరించేదంతా పరిమితం. పరిమితమే, అపరిమితంగా ఉంటుంది అనడం, యుక్తియుక్తమైన మాటకాదు. అలా ఉండడం అసంభవం.
నిత్యుడు (అఖండుడు) ఖండ వస్తురూపంలో కనిపించడానికి యత్నిస్తాడని, వేదాంతంకూడ అంగీకరిస్తుంది కాని, కొంతకాలానికి ఇది అసాధ్యమని గ్రహించి ఈ యత్నాన్ని విరమిస్తుందని దాని వాదం. ఆ విరమించడమే వైరాగ్యం. త్యాగం. అదే ఆస్తికధర్మ జీవనానికి నిజమైన ప్రారంభం. ఈ కాలంలో ‘వైరాగ్య’ మనే మాట ఎత్తడమే చాలా కష్టం. నన్ను గూర్చి అమెరికా దేశస్థులు ఏమన్నారో తెలుసా? అయిదువేల సంవత్సరాల క్రిందట మరణించి, పూడ్చివేయబడిన దేశంనుండి వచ్చి, వైరాగ్యాన్ని ప్రశంసించేవాడనట నేను!! ఆంగ్ల తత్త్వవేత్తలు కూడ అట్లే అంటారు కాబోలు?? కానీ ఎవ్వరేమన్నా భగవదన్వేషణ జీవనానికి వైరాగ్యమొక్కటే మార్గం. “జీవమును, నాకోసం ఎవడు పరిత్యజిస్తాడో వానికే అది లభ్యమవుతుంది” అని కదా క్రీస్తుబోధ? మానవుడు పరిపూర్ణత్వాన్ని సాధింపకోరితే, వైరాగ్యమొక్కటే మార్గమని ఆయన ఎన్నోసార్లు బోధించాడు. మనస్సుకు ఈ సత్యం, కాలపరిపాకంలో గోచరింపగలదు. తన దీర్ఘభయానక స్వప్నంనుండి మనస్సు మేల్కొంటుంది. పాప ఆట వస్తువులను పారేసి, తల్లి చెంతకు మరల పోగోరుతుంది. “ఉపభోగంవల్ల కామం ఎన్నటికీ శమింపదు. నేతిచే అగ్ని ప్రజ్వరిల్లినట్లు, అది ఇంకా ఎక్కువవుతుంది” అనే సూక్తిలోని సత్యం దానికి గోచరిస్తుంటుంది. కామోపభోగాలకు మాత్రమే కాదు. ఇంద్రియభోగాలన్నిటికీ, వైజ్ఞానిక భోగాలన్నిటికీ, మానసిక భోగా లన్నిటికీ కూడా, ఇది అన్వయిస్తుంది. అవన్నీ తుచ్ఛములు. మాయావరణం లోనివి. అంటే మనకు అభేద్యమైన ఈ మాయాజాలం లోనివి. అనంతకాల పర్యంతం, మనం దానిలో ఇటు, నటు పరుగులిడుతున్నా, దానికి ముగింపు ఉండదు. ఒకింత సుఖం సంపాదించుకోకోరితే, దుఃఖరాశి మీదపడుతుంది. ఎంత ఘోరం? పర్యాలోచించిచూస్తే “ఇదంతా మాయ” అనే మాయావాద మొక్కటే, ఈ స్థితిగతులకు సరైన సమాధాన మనిపిస్తుంది. ఈ ప్రపంచ మెంత దుఃఖపూరితం? లోకమంతా తిరిగిచూస్తే, తమతమ లోపాలను ఒక జాతి ఒక విధంగా, మరొక జాతి మరొకవిధంగా నివారణ చేసుకో చూస్తాయి. అనేక జాతులు, ఒక్క కీడునే, వేర్వేరు విధాలుగా పోగొట్టా లనుకున్నాయి. కానీ ఏ జాతి ప్రయత్నమూ సిద్ధించలేదు. ఆ కీడు, ఒకచోట తరిగితే, మరొకచోట అపారంగా పెరుగుతోంది. ఇటువంటి స్థితి దానిది. పాతివ్రత్యాదర్శానికి ప్రాధాన్యమిచ్చి, హిందువులు అతిబాల్య వివాహాచారాన్ని ఏర్పరచారు. కాలక్రమంలో దానివల్ల జాతి దుర్బలమైపోయింది. నిజమే, సౌశీల్యం కాపాడబడింది. కానీ, ఈ హానికూడ కలిగింది. ఈ రెంటిలో ఏది కోరుకుంటారు? సౌశీల్యం కావలసిందే, స్త్రీపురుషుల్లో దౌర్బల్యం ప్రబలుతుంది. కాని, ఇక్కడ మీ ఇంగ్లాండులో మాత్రం? మీ స్థితి చక్కగా ఉందా? లేదు. ఎందుకంటే సౌశీల్యమేకదా జాతికి ప్రాణం? చారిత్రక దృష్టితో విచారిస్తే, శీలభ్రంశమే జాతి నాశనాన్ని సూచించే ప్రథమ చిహ్నమని తెలుస్తోంది. ఆ చిహ్నం కనిపించినప్పుడు జాతి నాశనం కూడ కన్పించినట్లే. మరయితే, ఈ ఆపదనుండి విముక్తి ఎలా?తలిదండ్రులు తమ బిడ్డలకు వధూవరులను ఏర్పాటుచేస్తే కొంత తగ్గగలదు. హిందూ బాలికలు, హృదయోద్వేగాలకు లొంగిపోయి, పెద్దల హితోపదేశాన్ని తిరస్కరించేవారు కారు. కాని వారి జీవితాలు కవి భావకల్పితములైన, అలౌకిక మార్గాలలో విహరించక, గతానుగతికాలై ఉంటాయి. ఇలాకాక జనులు, తమ తమ భార్యాభర్తలను తామే నిర్ణయించుకొంటే, ఆ వివాహాలు అంత సుఖప్రదం కావడంలేదు. హైందవ స్త్రీ, సామాన్యంగా, మిక్కిలి సుఖప్రదంగా జీవిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు అంతగా కలహాలుండవు. అమెరికాలో వివాహ నిర్ణయ విషయంలో అపారమైన స్వాతంత్ర్యం ఉంది. అక్కడ ఎన్నో గృహాలు, ఎన్నో వివాహాలు వ్యథామయములు. ఈ వ్యథ, ఈ అసంతృప్తి “ఇందు కలదు, అందులేదు” అనక– సర్వత్రా నిరంకుశ విహారం చేస్తోంది. దీని అర్థమేమి? ఏ లక్ష్యాన్ని అనుసరించినా, సుఖం అంతగా లభించడంలేదు. అందరం సుఖం కోసమే పరిశ్రమిస్తున్నాం. కానీ, సుఖమొక మార్గంలో ప్రవేశిస్తే, కష్టం మరొక మార్గంలో ప్రవేశిస్తోంది.
అలా అని, ఉపకార కార్యాలు చేయనఖ్కర్లేదా? చేయాలి. వానిపట్ల మునుపటికన్నా ఎక్కువ అభిరుచికూడ చూపాలి. అట్లైన పై జ్ఞానంవల్ల ప్రయోజనమేమి? అని అడుగుతారు. దానిచే మన మత దురభిమాన తీవ్రతలు నశిస్తాయి. అవి నశిస్తే ఆంగ్లేయుడు, హైందవుణ్ణి గూర్చి నిందా వాక్యాలు పలుకడు. ఇతర జాతుల ఆచారాలను గౌరవిస్తాడు. స్వమతదురభిమానోన్మాదం (ఫెనటిసిజం) తగ్గుతుంది. క్రమంగా, నిజమైన కార్యాచరణం అధికమవుతూంటుంది. స్వమత దురభిమానోన్మత్తుల జవసత్త్వాలలో చాలవంతు నిరర్థకంగా వ్యయమవుతూ వుంటుంది. కాబట్టి, వారికి కార్యాచరణశక్తి అంతగా ఉండదు. భావోద్రేకాలు లేక, ప్రశాంత నిష్పాక్షికబుద్ధి కలిగి, అసాధ్య మార్గాల పొంతపోని వానికే కార్యాచరణ సామర్థ్యముంటుంది. కాబట్టి, పై జ్ఞానంవల్ల కార్యసామర్థ్య మధికమవుతుంది. యథార్థస్థితిని తెలిసికోవడం వల్ల, సహజబుద్ధి అభివృద్ధి పొందుతుంది. దుర్మార్గుల్ని, నిర్భాగ్యుల్ని చూస్తే మతిచెడి, వెర్రిపోకలు పోకుండా వుంటాం. ప్రపంచ గతిని మార్చలేమనీ దాని త్రోవనే అది నడుస్తుందనీ, తెలియడంవల్ల మనం తొందరపాటు మాని, ఓర్పు వహిస్తాం.
ఇందుకొక దృష్టాంతం. మనుష్యులంతా, ఒక్కుమ్మడిగా యోగ్యులైతే, మృగాలన్నీ ఆలోగా, మనుష్యులుగా పరిణమించి, అవికూడా యోగ్యస్థితిని పొందవలసి వుంటాయి. కాని ఒక విషయం మాత్రం సత్యం. ఈ నిర్నిరోధ నదీ ప్రవాహం, సముద్రాభిముఖమై, అత్యంత వేగంతో పరుగులిడుతోంది. ఈ నదిలోని ప్రతి జలబిందుమా కాలక్రమంలో, ఈ అపార పారావారంతో ఐక్యమొందగలుగుతుంది. అట్లే ఈ జీవితంలో – ఆపదలు, వ్యధలు, సుఖాలు, నవ్వులు, ఏడ్పులు అన్నీ కూడివుండే ఈ జీవితంలో – ఒక్క విషయం మాత్రం నిస్సంశయం. సర్వవస్తువులు గమ్యం దెసకు దుముకుతున్నాయి. ఎంతకాలం పట్టునో చెప్పజాలంకానీ మీరు, నేను, వృక్షజాతులు, మృగజాతులు, జీవలేశం గల ప్రతి నలుసుసహా, పరిపూర్ణం అను అనంతసాగరంలో కూడియే తీరాలి. ముక్తిని పొందాలి. భగవంతుని చేరాలి.
వేదాంత మత ప్రకారం ప్రపంచం కేవలం శుభమూకాదు, కేవలం అశుభమూకాదు. ఈ విషయం ఇదివరకే చెప్పాను. మనకు కలిగే శుభాశుభాల విలువ సమానమైందని ఆ మతపు బోధ. మేలు విలువ ఎక్కువకాదు. కీడు విలువ తక్కువ కాదు. ప్రపంచధర్మం అలాంటిదని తెలుసుకొని మనం ఓర్పుతో పనులు చేయాలి. ఎందుకోసం? ఏల? ఈ స్థితిగతులలో గత్యంతరమేమి? అజ్ఞేయవాదులలో ఏల చేరరాదు? ఈ కాలపు అజ్ఞేయవాదులుకూడ, ఈ సమస్య పరిష్కరింప సాధ్యంకానిది – లేక మా పరిభాషలో, ఈ మాయాజాలాన్ని భేదించడం అసాధ్యం – అని తెలిసికొని తృప్తి తెచ్చుకొని, జీవితంలో సుఖీస్తున్నామంటారు. ఈ బోధలో ఒకప్రమాదం – బొత్తిగా అసంగతమగు మహాప్రమాదం వుంది. ‘జీవితం’ అంటే ఏమి? ఇంద్రియ జీవితమేనా? ఆ విషయంలో మనకు, మృగాలకు అంతగా భేదంలేదు. కేవలం, ఇంద్రియాల్లోనే జీవించేవాళ్లు ఇక్కడెవ్వరూ లేరని నా నమ్మకం. అంటే – ‘జీవిత’ మన్నది అంతకన్నా ఉన్నత క్షేత్రానికి సంబంధించింది. మన హృదయభావాలు, మనోభావాలు, ఆదర్శాలు, ఇవన్నీ మన జీవితంలోని భాగాలే. పరిపూర్ణత్వం – అనే మహోన్నతాదర్శాన్ని సాధించడంకోసం చేసే పోరాటం జీవితంలో ఒక అత్యంత ప్రధానభాగం కాదా? “దృశ్య ప్రపంచ జీవితంలోనే సుఖీంచండి” అని అజ్ఞేయవాదుల బోధ. కాని, జీవిత శబ్దానికి ముఖ్యార్థం ఆదర్శ సాధనమే. పరిపూర్ణత్వం దిశకు సాగడమే జీవితసారం. కాబట్టి మనం అజ్ఞేయవాదులమై, దృశ్యప్రపంచంతోనే తృప్తినందజాలం. అజ్ఞేయవాదికి, జీవితం అంటే – ఉన్నదాంతోనే తృప్తిపడటం. “ఆదర్శాన్ని చేరడం అసాధ్యం కాబట్టి, దానికై చేసే అన్వేషణం పరిత్యజించాలి” అని అతని సుస్థిరాభిప్రాయం. ఈ ప్రకృతికే, ఈ ప్రపంచానికే ‘మాయ’ అని పేరు. మతాలన్నీ మాయను దాటే ప్రయత్నాలనే చెప్పొచ్చు. ప్రాథమిక దశలోనివి, పరిపక్వ దశలోనివి, నిగూఢ తాత్త్వికవాదమయం అయినవి, పురాణరూపాలైనవి, ప్రతిమల ప్రతీకల మూలానకానీ, – దేవతల – రాక్షసుల – దేవదూతల – జ్ఞానసిద్ధుల – ఋషుల – మహాపురుషుల – మతప్రవక్తల కథల మూలానకాని, బోధలు చేసేటటువంటివి – ఈ అన్ని మతాలకూ లక్ష్యమొక్కటే, ఈ ప్రకృతి కల్పించే పరిమితుల్ని దాటడమే. ముక్తిని సాధించడమే. తాను బద్ధుడై ఉన్నాడని, ఆ స్థితిని దాటితేకానీ, తన అభీష్టం తీరదని, ప్రతి మనిషికి ఎట్లో తెలిసిపోతుంది. అలా ఎందుకు తెలిసేదీ అతనికి తెలియవచ్చు, తెలియకనూపోవచ్చు. కానీ ప్రపంచ జ్ఞానం కలిగేటప్పుడే, వానియందీ జ్ఞానం ఉదయిస్తుంది. “తాను బంధంలో వున్నాడు. ఈ బంధంనుండి విడివడి యెచ్చటికో, – ఈ శరీరానికి అందని చోటికి ఎగిరిపోవాలని తనలోవున్న ఏదోశక్తి కల్పిస్తోంది. ఈ బంధంచేత అది ఆగి ఉంది” అనే తలంపు, అతనికి ఆ క్షణంలోనే ఉదయిస్తుంది. అత్యంత ప్రాథమిక దశలోకూడ తమ మిత్రుల ఇళ్ల దగ్గర తిరుగుతూ, మద్యాన్ని, జంతుబలుల్ని అపేక్షిస్తూన్న క్రూర, ఘాతుక, ప్రేత, పిశాచాదుల నారాధించు మతాలలో కూడ ఈ బంధవిమోచనేచ్ఛ కనిపిస్తోంది. దేవతల నారాధించువారికి, వారిలో కనిపించే ముఖ్య విశేషం, వారికి గల స్వేచ్ఛాధిక్యమే. వారి గమనానికి గోడలు, మూసిన తలుపులు, అడ్డురాజాలవని వాని నమ్మకం. ఈ స్వేచ్ఛాధిక్యం క్రమక్రమంగా అతిశయించి, చివరకు ప్రకృతి (మాయా) బద్ధుడు కాని, సగుణేశ్వరాదర్శంగా పరిణమిస్తుంది. నా మనోనేత్రం ఎదుట, పూర్వ దృశ్యమొకటి, ఇప్పుడు జరిగినట్లు కనిపిస్తోంది. అరణ్య మధ్యములలో ఉండిన, పూర్వకాలపు ఋష్యాశ్రమాలలో ఈ సమస్యయే చర్చింపబడుతోంది. వయోవృద్ధులైన మహనీయులు సైతం, దీనిని పరిష్కరింపజాలక సతమత మవుతున్నారు. అప్పుడొక ఆశ్రమంలో ఒక యువకుడు ఆ వృద్ధ తాపసుల మధ్య నిలిచి ఇలా అన్నాడు: “అమృత పుత్రులారా! వినండి! దివ్యధామ వాసులారా! వినండి! నేను మార్గాన్ని కనుగొన్నాను. తమస్సునకు ఆవలనుండు ఆ మహాపురుషుణ్ణి తెలిసికొంటే మనం మరణాన్ని దాట గలం.” ఈ మాయ అంతటా ఉంది. ఇది భయంకరం. కానీ మనకు గత్యంతరం లేదు. దాని మధ్య నిలిచే మన ప్రయత్నాలు సాగించాలి. ప్రపంచమంతా మంచిదైన తర్వాత కార్యారంభుడనై ఆనందానుభూతిని పొందుతానన్నవాడు, అప్రయోజకుడు. గంగాతీరంలో కూర్చుని, ఈ నీరంతా సముద్రంలో చేరిన తర్వాత, నదిని దాటుతాననేవాని వంటివాడు. మన కర్తవ్యం మాయకు ఎదురీదడంకాని, దానికనుకూలంగా ప్రవర్తించడం కాదు. మనం గ్రహించవలసిన ముఖ్య విషయమిది. ప్రకృతికి తోడ్పడడానికి కాదు మనం జన్మించింది. దానితో పోటీచేసి, ఎదురొడ్డి, పోరాడటానికి. ప్రకృతిపై అధికారం చెలాయించడం మన ధర్మమై వుండగా, దానికి లొంగి పోతున్నాం. ఈ ఇల్లు ఎలావచ్చింది? ప్రకృతి కాదు దీన్ని నిర్మించింది; అడవిలో నివసించు అని ప్రకృతి బోధ. కాని మనిషి ఆ బోధను తిరస్కరించి ఇల్లు కట్టుకున్నాడు. ఆదికాలంనుండీ మానవుడు ప్రకృతి నియమాలను ప్రతిఘటిస్తూనే ఉన్నాడు. చివరకు మానవునిదే విజయం. ఆంతరంగిక లోకంలో కూడ, ఈ పోరాటమే జరుగుతోంది. మానవుని ఉత్తమ ప్రకృతికీ, (ఆధ్యాత్మిక ప్రకృతికి), వాని అధమ (పశు) ప్రకృతికీ; జ్యోతిస్సు (జ్ఞానము) నకూ, తమస్సు (అజ్ఞానము)నకూ; ఇక్కడకూడ మానవునిదే గెలుపు. అతడు ప్రకృతిని ఖండించి, త్రోవచేసికొని, ముక్తిపదాన్ని చేరుతాడనవచ్చు. దీన్ని బట్టి, వేదాంతమత సిద్ధాంతమొకటి మనకు తెలుస్తోంది. ఈ మాయను దాటిన తర్వాత మాయాతీతస్థితి ఒకటుంది. ఆ స్థితి నొందగలిగితే, మాయ మనల్ని బంధింపజాలదు. ఇంచుమించుగా, అన్ని మతముల్లోనూ, ఈ ఆశయమేదో ఒక రూపంలో గోచరిస్తూనే వుంది. కానీ వేదాంతమత ప్రకారం ఇది మతప్రవేశం మాత్రమే. దాని పరిపూర్ణత కాదు. సాకారబ్రహ్మం, సృష్టికర్త, జగదీశ్వరుడు, ప్రకృతి (=మాయా) నియమకుడు అనే ఆశయం, ఈ వేదాంతమత పరమావధికి సంబంధించి కాదు. అది మొదటి మెట్లు వంటిది. ఇది క్రమక్రమంగా పరిపాకమంది, తన వెలుపల నిలిచివుండిందని మొదట తోచినవాడు తానే అనీ, వాస్తవంగా తన లోపలనే వున్నాడనీ, వేదాంతి చివరికి గ్రహిస్తాడు. అతడు నిత్యముక్తుడు. కాని, ఉపాధినిపొంది బద్ధుడనని భావిస్తున్నాడు.