జనులకు శారీరావశ్యకాలను తీరుస్తూ భౌతికంగా తోడ్పడటం నిజంగా గొప్ప పనే. కాని మనం చేసే సహాయం ఎంతగా మనిషి యొక్క అధిక తరమైన అవసరాలను, దీర్ఘకాలికావసరాలను (ఉదా : విద్య ద్వారా మేధోపరమైన వికాసాన్ని కలిగించటం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి జన్మ మరణ సంసార చక్రం నుంచి బయటపడటానికి తోడ్పడటం) తీర్చగలిగితే అంత గొప్పగా పరిగణించ బడుతుంది. ఒక ఘడియ పాటైనా ఒక వ్యక్తి అక్కరలను తీర్చగలిగితే నిజంగా అది అతడికి సాయపడటమే. ఒక ఏడాది పాటు అతడి అవసరాలను తీర్చగలిగితే అది అంతకంటే విశేషమైన సాయమౌతుంది. కాని అతడి కొరతలను శాశ్వతంగా తీర్చగలిగితే నిశ్చయంగా అది అతడికి చేయగల మహోత్తమమైన సాయం గదా. మన బాధలను శాశ్వతంగా తొలగింపగలిగినది తత్త్వజ్ఞానం మాత్రమే. తద్విరుద్ధమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. తత్త్వజ్ఞానం ఒక్కటే మానవుడి కోరికలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి మానవుడికి చేసే పారమార్థిక సహాయమే లోకంలో మహోన్నతసాయం. తత్త్వజ్ఞానాన్ని దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి. కాబట్టి మానవుడి ఆధ్యాత్మిక ఆవశ్యకతలను తీర్చినవారే అఖండ ప్రతిభావంతులుగా కన్పిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో మన సమస్త వ్యాపారాలకూ పారమార్థికపరతే మూలాధారం. ఆధ్యాత్మికశక్తి సంపన్నుడు సంకల్పిస్తే సమస్త విషయాలలోను శక్తిమంతుడు కాగలడు. ఆత్మబలం లోపించిన వ్యక్తి భౌతిక అవసరాలను కూడా సరిగా సమకూర్చుకోలేడు. ఆధ్యాత్మిక సహాయం తరువాత వచ్చేది విద్యావిషయక సహాయం. విద్యాదానం అన్నదాన వస్త్రదానాలకంటె ఉత్తమ దానం. విద్యాదానం ప్రాణదానం కంటే కూడ ఉత్తమమైనది. ఎందుకంటె జ్ఞానమే మానవుడి యథార్థజీవితం. అజ్ఞానమే మృత్యువు. దైన్యంలో, అజ్ఞానంలో తడువులాడే అంధకారబంధురమైన జీవితానికి విలువేలేదు. విద్యాదానానికి తరువాత వచ్చేది భౌతిక సహాయం. కాబట్టి పరోపకార విషయమంటే భౌతిక సహాయ మొక్కటే అనే భ్రమ వుండకూడదు. ఇది శాశ్వతసంతృప్తి నొసగదు. కాబట్టి ఇది దానాలలో చివరిది అవటమేగాక అధమమైనది కూడా. భుజించటంచేత ఆకలిబాధ తీరుతుంది; కాని తిరిగి ఆకలి పుడుతుంది; నా అక్కర పూర్తిగా తీరినప్పుడేకదా నా బాధ తొలగుతుంది. అప్పుడిక ఆకలి నన్ను బాధింపదు; ఎట్టి దుఃఖమూ, దుస్థితీ ఇక నన్ను కదల్పలేవు. కాబట్టి మనలను ఆధ్యాత్మికంగా బలిష్ఠులను చేయగలదేదో అదే మహోత్తమమైన సహాయం. తరువాతది విద్యావిషయకమైన సహాయం, దానికి తరువాతిది భౌతిక సహాయం.
సంసార బాధలను ఉపశమింపచేయడానికి శారీరక సహాయం ఒక్కటే చాలదు; వ్యక్తి స్వభావం మారేవరకు ఈ శారీరావశ్యకాలు, దుః ఖాలు సదా కలుగుతూనే వుంటాయి; ఎలాంటి భౌతిక సహాయమూ దానిని పూర్తిగా తొలగించలేదు. మానవుణ్ణి పవిత్రుణ్ణి గావించటం ఒక్కటే ఈ సమస్యాపరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞాన జనితమే. మానవుడు జ్ఞానిగా, విశుద్ధుడుగా, ఆత్మ బలాఢ్యుడుగా, విద్యావంతుడుగా అవ్వాలి. అప్పుడే లోకంలోని దుఃఖం ఉపశమించుతుంది. అంతకుముందు కాదు. ప్రతి ఇంటినీ మనం ధర్మసత్రంగా మార్చివేసినా, దేశాన్నంతా వైద్యశాలలతో నింపినా, మానవుడి వ్యక్తిత్వం మార్పుచెందనంత వరకూ అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది.
మనమందరం ఎడతెగని కర్మను నిర్వర్తిస్తుండాలని భగవద్గీతలో పదేపదే చెప్పబడివుంది.* ప్రతి కర్మలోను సహజంగా మంచిచెడులు సమ్మిశ్రితాలై వున్నాయి. ఎక్కడైనా కాస్తంత మేలు కల్గింపని కర్మను మనం చేయనేచేయలేం; ఎక్కడో ఒక్కపిసరు కీడు కల్గింపని కర్మ వుండటం అసంభవం. ప్రతిపనిలోను మంచిచెడుల కలయిక వుండక తప్పదు. అయినప్పటికీ నిర్విరామంగా కర్మను నిర్వర్తించాలని శాస్త్రం చెబుతోంది. మంచిచెడులకు రెండింటికి వాటివాటి ఫలితాలు వున్నాయి. అటువంటి కర్మలను అవి ఉద్భవింపజేస్తుంటాయి. సత్కర్మవలన మనకు సత్ఫలం, దుష్కర్మవలన దుష్ఫలం కలుగుతాయి. కాని మంచిచెడులు రెండూ ఆత్మకు సంకెళ్ళే. కర్మఫలాలలో మనం ఆసక్తులం కాని ఎడల కర్మలు మనను బంధింపలేవనేదే భగవద్గీతలో తెలుపబడిన తరుణోపాయం.* నిష్కామ కర్మాచరణ మంటే ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిద్దాం.
“తస్మా దసక్తస్సతతం కార్యం కర్మ సమాచర”* నిరంతరంగా కర్మలు ఆచరించు; కాని, వాటిలో ఆసక్తుడవు కావద్దు – అనేదే భగవద్గీతలోని ముఖ్యాశయం. సంస్కారం అంటే అంతరప్రవృత్తి అని చెప్పవచ్చును. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులోని ప్రతివృత్తివీచికా అందులో ఉదయించి మరల అణిగేటప్పుడు పూర్తిగా నశింపక, ఒక రకమైన జాడను, ఆ (చిత్త) వృత్తివీచిక తిరిగి ఉదయించే అవకాశాన్ని కలుగ చేస్తూంది. అలాంటి అవకాశంతో కూడిన ఈ జాడే సంస్కారమని చెప్పబడుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఇలాంటి సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా వుండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై వుంటాయి. మనస్సులోని సంస్కారసమామ్నాయంచేత మన స్థితిగతులు అనుక్షణం నిర్ణీతాలౌతున్నాయి. ఇప్పుడీ క్షణంలో నా స్థితి ఇంత క్రితం నా జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సముదాయ ఫలితం. నిజంగా శీలమంటే ఇదే; ప్రతిమానవుడి శీలమూ ఈ సంస్కారాల మొత్తంచే నిర్ణయింపబడుతోంది. మంచి సంస్కారాలు ప్రబలంగా వుంటే శీలం మంచిదౌతుంది; చెడు సంస్కారాలు ప్రబలంగావుంటే స్వభావం చెడ్డదౌతుంది. ఒకవ్యక్తి సదా చెడు మాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులను చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండివుంటుంది; అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, కర్మలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పనిచేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. ఈ చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి ప్రబలప్రేరక మవుతున్నది. దుష్ట సంస్కారాల చేతులలో అతడొక యంత్రంగా వుండగా, అవి అతడిని పాపం చెయ్యడానికి పురి గొల్పుతున్నాయి. అదే విధంగా ఒకడు సదాలోచనలు చేస్తూ మంచిపనులు చేస్తున్నప్పుడు, వాటివలన కలిగే సంస్కారమొత్తం మంచి దవటంచే అతడు సంకల్పించకున్నా సత్కార్యాలను చేయమని అది అతణ్ణి నిర్భంధిస్తుంది. ఎన్నో సత్కార్యాలను చేసి సదాలోచనలు చేసిన వ్యక్తికి ఇక ముందుకూడ సత్కార్యాలను చెయ్యాలని అనివార్యమైన బుద్ధిపుడుతుంది. ఒకవేళ చెడుచేయాలని అతడు కోరినా, అతడి సంస్కారాలన్నిటి ఫలితంగా అతడి మనస్సు అలా చెయ్యనివ్వదు. మంచిసంస్కారాలు అతడి బుద్ధిని మరలుస్తాయి. వాటికా వ్యక్తి పూర్తిగా అధీనుడై వున్నాడు. అలాటి వ్యక్తిలో సచ్ఛీలం సుప్రతిష్ఠితమై వున్నదని చెప్పవచ్చును.
తాబేలు తన అవయవాలను బొరుసులోనికి లాగుకొన్నప్పుడు నువ్వు దానిని చంపినా, ముక్కలు ముక్కలుగా కోసినా అవి అందులో నుండి బైటికిరాని రీతిగా, తన అవయవాలనే చిత్తవృత్తులను ఎవడు వశమొనర్చుకొంటాడో అటువంటి వ్యక్తిశీలం మార్చ శక్యం కాక, స్థిరపడుతుంది. తన ఆంతరంగిక శక్తులను అతడు వశపరచుకొని వున్నప్పుడు ఆతడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏదీ అతడిని బాహ్యంగా కొనిపోదు. నిరంతర సద్భావాలచేత మనస్సులో మొలకెత్తే మంచి సంస్కారాలచే సత్కార్యాచరణ ప్రవృత్తి బలీయమైనప్పుడు ఇంద్రియాలను వశమొనర్చుకోగలుగుతాము.ఈ విధంగానే శీలం స్థిరపడుతుంది; ఆ తరువాతే మానవుడు సత్యాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు. అలాటి మానవుడికి సదా క్షేమమే.అతడెలాంటి పాపం చెయ్యలేడు. అతణ్ణి నువ్వు ఏ సంఘంలో నైనా పెట్టవచ్చును. అతడి కెలాంటి ఆపదరాదు. ఇలాటి సత్ప్రవృత్తి కలిగి వుండటంకంటే ఉత్తమమైన స్థితి వుంది. అదే ముముక్షుత్వం, ఆత్మ స్వాతంత్ర్యేచ్ఛ. సమస్త యోగాలకు ఆత్మవిముక్తే పరమావధి. లక్ష్యప్రాప్యతలో అన్ని యోగాలు సమానాలే. బుద్ధుడు విశేషంగా ధ్యానం చేతా, క్రీస్తు ప్రార్థన చేతా పొందిన పరమపదాన్ని ఇతర యోగాపేక్షలేక కేవలం కర్మచేతనే పొందవచ్చును. బుద్ధుడు కర్మపరాయణుడైన జ్ఞాని; క్రీస్తు భక్తుడు. ఐనా వీరిద్దరూ ఒక్క గమ్యాన్నే పొందారు. ఉన్న చిక్కంతా ఇదే. మోక్షమంటే సంపూర్ణ విమోచనం – దుష్కర్మజనిత బంధంనుండే గాక సత్కర్మ జనితబంధం నుండి కూడా విమోచనం. ఇనుప సంకెళ్ళలాగానే బంగారు సంకెళ్ళూ సంకెళ్ళే! నా వేలికి ముల్లుగుచ్చుకుంటే దాన్ని తియ్యడానికి మరొక ముల్లును ఉపయోగిస్తాను, పని తీరగానే రెండిటినీ అవతల పారేస్తాను; రెండూ ముళ్లే అవటంచేత రెండవముల్లును భద్రపరచుకొనే అవసరం లేదు కదా* . కాబట్టి దుష్టసంస్కారాలకు సత్సంస్కారాలచేత ప్రతిక్రియ చెయ్యాలి* , మనస్సులోని మాలిన్యమంతా అదృశ్యమయ్యేంత వరకు, లేదా నిగ్రహింపబడి, మనస్సులో ఓ మూల వుండి మనవశమై వుండేంతవరకు, దుష్టసంస్కారాలను, సత్సంస్కారాలనే నూతన తరంగాల చేత తొలగించుకోవాలి. కాని ఆ తరువాత సత్సంస్కారాలను సైతం నిర్జించాలి; అలా ‘ఆసక్తుడు’ ‘అనాసక్తుడు’ అవుతాడు. కర్మ ఒనర్చు, కాని నువ్వు చేసే కార్యంచేతగాని, తలంపుచేతగాని నీ మనస్సులో ప్రగాఢ సంస్కారం కలగకుండు గాక; చిన్న కెరటాలు రానీ పోనీ, ఘనకార్యాలు నీ కండరాల నుండి బుద్ధినుండి వెలువడవచ్చును, కాని మనస్సు మీద అవి ఎలాంటి ప్రగాఢ సంస్కారాన్ని కలిగింపకుండా వుండాలి.
కాని దీనిని ఎలా సాధించాలి? దేనిపట్ల మనం ఆసక్తులమో అలాంటి కార్యంవలన కలిగే సంస్కారం నిలిచివుంటుంది. పగలు నేను వందల మంది జనులను కలుసుకోవచ్నును. వారిలో నాకు ప్రియమైన వ్యక్తి ఒకణ్ణి కూడా కలిసి వుండవచ్చును; రాత్రి నేను నిద్రబోయేటప్పుడు పగలు చూసిన ముఖాలు నన్నింటిని గురించీ ఆలోచింప ప్రయత్నింప వచ్చును; అప్పుడు నాకు ప్రియమైన వ్యక్తి వదనం మాత్రమే నా మనస్సులో నిలుస్తుంది; మిగిలినవన్నీ మాయమౌతాయి. మిగిలిన వ్యక్తులందరి కంటే ఈ ప్రత్యేక వ్యక్తిలో నాకు కలిగిన ఆసక్తి నా మనస్సులో గాఢమైన సంస్కారాన్ని కలిగించింది. శారీరకంగా చూస్తే ఇందులోని నా సంస్కారాలన్నీ ఒక్క విధమైనవే, నేను చూసిన ప్రతి వదనమూ నా నేత్రాంతఃపటలం (రెటీనా) లో ప్రతిబింబించినప్పుడు మెదడు వాటిని లోనికి తీసుకుని పోయినా, మనస్సులో వాటిచే ఏ విధమైన ప్రతిక్రియా కలుగలేదు. ఆ ముఖాలలో అనేకం పూర్వం నాకు పరిచితమైనవి కాక పూర్తిగా కొత్తవై వుండవచ్చును. కాని క్షణకాలం పాటు నాకు కనబడ్డ ఆ వదనానికి సంబంధించిన భావాలు ముందే నా మనస్సులో వుండివుండాలి. అతడి రూపం నా మనోఫలకం మీద అనేక సంవత్సరాలనుండీ ముద్రితమై వుండి వుంటుంది. అతణ్ణిగూర్చి అనేక విషయాలు నాకు తెలిసి వుండాలి. అతడి ఈ నూతన దర్శనం నా మనస్సులో నిద్రాణమై ఉన్న వందలాది స్మృతులను మేల్కొలిపింది. ఇతర ముఖాలు నా మదిలో ముద్రితాలైనదానికంటె నూరు రెట్లు ఎక్కువగా ఇది ముద్రితమైనందువల్ల మనస్సు మీద విశేషప్రాబల్యాన్ని చూపుతుంది.
కాబట్టి ‘అసంగుడవై’, వాంఛారహితుడవై వుండు; కార్యాలను జరుగనివ్వు. ఇంద్రియాలను తమ వ్యాపారాలను చెయ్యనివ్వు; సదా కర్మలను ఆచరించు. కాని ఏ కెరటానికీ నీ మనస్సును లొంగనివ్వవద్దు. కొత్తవాడివలె, ప్రయాణీకుడివలె, యాత్రికుడివలె ఈ లోకంలో కార్యాలను నిర్వర్తించు. నిరంతర కర్మనిరతుడవై వున్నప్పటికీ, బద్ధుడవు కావద్దు.బంధం భయంకరం. ఈ ప్రపంచం మన నివాసం కాదు. మనం చేసే యాత్రలో గమించవలసిన అనేక మజిలీలలో ఇది ఒకటి. “ఆత్మార్థ త్వాత్ సృష్టేః”* ప్రకృతి సమస్తం ఆత్మ కోసమే, ఆత్మ ప్రకృతికోసం కాదనే సాంఖ్యసూత్రాన్ని స్మరించు. పురుషుడి శిక్షణకోసం మాత్రమే ప్రకృతి ఏర్పడివుంది; దాని ఉనికికి ఇంత కంటే వేరే అర్థంలేదు. పురుషుడు జ్ఞానవంతుడై కైవల్యాన్ని పొందాలి, అందుకే ప్రకృతి సంస్థితమైవుంది.* మనం ఈ తత్త్వాన్ని సదా గుర్తుంచు కుంటే ప్రకృతితో (మనస్సు) ఎప్పుడూ సంగం పొందనేరం. ప్రకృతి మనం చదవాల్సిన గ్రంథమనీ, ఆర్జించవలసిన జ్ఞానం సంపాదించగానే ఇంక ఈ పుస్తకం మనకు పనికిరాదనీ మనం తెలుసుకొంటాము.ఏమైనా దీనికి బదులుగా మనం ప్రకృతితో తాదాత్మ్యం పొందుతూ ‘ప్రకృతి కోసం పురుషుడు ఏర్పడివున్నా’ డని – ‘శరీరం కోసమే శరీరి’ అని తలుస్తూ, సామాన్య లోకోక్తి ప్రకారం శరీరం నిలవడానికి తినటంగాక, తినడానికే శరీరం నిలుపుకొంటున్నాం; సదా ప్రకృతే మనమని భ్రమిస్తూ ప్రకృతి మోహితులమౌతున్నాం: ఇలాంటి మోహం (సంగం) పుట్టగానే మనస్సులో ప్రగాఢ సంస్కారం ఏర్పడుతుంది. అది మనలను బద్ధులనుచేసి స్వేచ్ఛతో కాకుండా బానిసల వలె పనులను చేయిస్తున్నది.
కర్మయోగ సారమంతా ఇది: బానిసలా కాకుండా యజమానిలా కార్యాలను నిర్వర్తించు; నిరంతరం కర్మ చెయ్యి, కాని బానిసలా కాదు. ప్రతివ్యక్తీ ఎలా కర్మ చేస్తున్నాడో చూస్తూన్నారు కదా. ఎవరికీ పూర్తి విరామం లేదు; నూటికి తొంభైతొమ్మిది మంది బానిసలలా పనులు చేస్తుంటారు, దుఃఖమే దానికి ఫలితం; అది అంతా స్వార్థపరమైన కర్మ. కర్మఫలాసక్తి లేకుండా స్వేచ్ఛగా కర్మచేయి. ప్రేమతో పనిచేయి. ‘ప్రేమ’ శబ్దార్థాన్ని గ్రహించటం చాలకష్టం; స్వేచ్ఛ ఉంటేగాని ప్రేమ ఎన్నడూ రాదు. బానిసలో నిజమైన ప్రేమ ఉండదు. నువ్వొక బానిసను సంకెళ్లచేత బంధించి నీ పనులు చెయ్యమని నియమిస్తే, గులాములా అతడు పని చేస్తాడేగాని అతడికి ప్రేమ వుండజాలదు. కాబట్టి మనంకూడా బానిసల విధంగా లౌకిక విషయాలకోసం కర్మమొనరిస్తే మనలో ప్రేమ వుండదు, మన కర్మ నిజమైన కర్మకాబోదు. మిత్రులకోసం, బంధువులకోసం చేసే కర్మ మాత్రమే కాదు, మనకోసం మనం చేసే కర్మ సంగతికూడా ఇలాంటిదే. స్వార్థపరమైన కర్మాచరణ బానిస చేసే పనిలాంటిది. కర్మకు నిజమైన ప్రమాణం ఇది; ప్రేమ సంజనితమైన ప్రతికార్యమూ ఆనందాన్ని కలిగిస్తుంది; అన్ని ప్రేమజనిత కార్యాలు మనకు శాంతిని, పవిత్రతను ఒసగుతాయి. నిజమైన అస్తిత్వం, నిజమైన జ్ఞానం, నిజమైన ప్రేమ ఒకదానితో ఒకటి శాశ్వతంగా సంబద్ధాలై వున్నాయి. ఇవి మూడూ ఒక్కటే: ఇందులో ఒకటి వుంటే మిగిలిన రెండూ వుండితీరాలి; సచ్చిదానందస్వరూపమైన అద్వితీయ బ్రహ్మానికి ఇవి మూడూ మూడు రూపాలు. ద్వంద్వదశకు దిగినప్పుడు ఆ బ్రహ్మం ఈ ద్వైతప్రపంచ రూపంలో మనకు కనిపిస్తుంది; ఆ జ్ఞానమే ప్రాపంచిక జ్ఞానంగా పరిణమిస్తుంది; ఆ ఆనందమే మానవహృదయ వేద్యమైన నిజమైన ప్రేమకంతకూ మూలాధారం. కాబట్టి నిజమైన ప్రేమ వలన ప్రేమించే వ్యక్తికిగాని, ప్రేమింపబడేదానికిగాని ఎప్పటికీ బాధ కలుగదు. ఒకడొక స్త్రీని ప్రేమించాడనుకొందాం; ఆమె పూర్తిగా తనకే దక్కాలి అని అతడుకోరుకుంటాడు; ఆమె ప్రతి కదలికను గూర్చీ ఎక్కువగా అనుమానిస్తాడు; ఆమె తనవద్ద కూర్చోవాలని, నిలుచుండాలని, భుజించాలని వెయ్యెందుకు తన ఆజ్ఞాబద్ధయై ఆమె ప్రవర్తించాలని కోరతాడు. తానామెకు దాసుడు కాబట్టి ఆమెకూడా తనకు దాసురాలై వుండాలని అతడు ఆకాంక్షిస్తాడు; అది ప్రేమాంబరాన్ని కప్పుకొన్న బానిస మోహం అవుతుంది. దాని వల్ల బాధ కలుగుతోంది, కాబట్టి అది ప్రేమకాదు. అతడు కోరుకొన్న దానిని ఆమె చేయకపోతే అతడు బాధపడుతున్నాడు. ప్రేమకు ఫలంగా ఎప్పుడూ బాధ కలుగదు. ఆనందమే ప్రేమకు ఫలం. ఆనందప్రదం కాకపోతే అది ప్రేమకాదు; ప్రేమ కానిదానిని ప్రేమ అని భ్రమించటమే. అది ఎలాంటి బాధ, అసూయ, స్వార్థపరమైన భావం కలుగని విధంగా నీవు నీ భర్తను, భార్యను, బిడ్డలను, లోకాన్ని, విశ్వాన్ని ప్రేమింపగలిగినప్పుడు నీవు అసంగుడవు కాదగ్గ స్థితిని పొందినట్టు.
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: “అర్జునా! ఇలా చూడు. క్షణమైనా నేను కర్మను విరమిస్తే సర్వప్రపంచం నశిస్తుంది. కర్మను చెయ్యటం వల్ల నేను పొందే లాభం రవ్వంత కూడా లేదు. నేను ఏకేశ్వరుణ్ణి మరి నేనెందుకు కర్మ మొనర్చాలి? జగత్తును ప్రేమిస్తాను కాబట్టి.”* భగవంతుడు విశ్వాన్ని ప్రేమించటంచేత అసంగుడై వున్నాడు; అలాటి నిజమైన ప్రేమ మనలను కూడా అసంగులను చేస్తుంది. ఎక్కడ సంగమున్నా, ప్రాపంచిక విషయాలపట్ల మమకారమున్నా, అది అంతా ఒక రకమైన ప్రాకృత రేణువులకు కలిగే భౌతికాకర్షణమని, అది రెండు శరీరాలను సదా ఒకదానితో ఒకటి ఆకర్షిస్తూ, అవి సన్నిహితాలు కాజాలనప్పుడు బాధ కలిగిస్తుందని మీరు తెలుసుకోవాలి. కాని నిజమైన ప్రేమ భౌతికసంబంధంపై ఆధారపడింది కాదు. అలాంటి ప్రియులు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ల దూరంలో వుండవచ్చును. కాని వారి అన్యోన్యప్రేమ ఎప్పుడూ ఒకే విధంగా వుంటుంది; అది నశించదు. ఎన్నటికీ అది బాధాకరం కాబోదు.
ఇలా అనాసక్తి అలవాటు చేసుకొనడానికి జీవితకాలమంతా పట్టవచ్చును; కాని ఈ స్థితిని పొందగానే ప్రేమపరమావధిని పొంది విముక్తులమౌతాం; ప్రకృతి బంధాలనుండి విడువడి ప్రకృతిని దాని యథార్థ స్వరూపంలో దర్శిస్తాం. ఇక ప్రకృతి మనలను బంధించలేదు; పూర్తి స్వతంత్రులమై అప్పుడు కర్మఫలాలను ఇసుమంత కూడా లక్షించం; కర్మఫలాలు ఎలాంటివైనా కానివ్వు, ఎవరు లక్ష్యపెడతారు?
మీ పిల్లలకు, మీరు ఇచ్చేవాటికి వారినుంచి మీరేమైనా ప్రతిఫలం ఆశిస్తారా? వారికోసం పాటుపడటం మీ విధి, అంతే. మీ పిల్లలపట్ల మీరెలాంటి మనోభావం వహిస్తారో అలాంటి మనోభావాన్నే మీ ఉపకారాన్ని అందుకునే వ్యక్తిపట్ల, నగరం పట్ల, రాష్ట్రం పట్ల వహించండి. ఎన్నడూ ప్రతిఫలం అపేక్షించకండి. దాతలై ప్రతి వస్తువును ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పింపగలిగితే మీ కర్మలు మీకు బంధాన్ని కలిగింపవు. ఫలాపేక్ష వుంటేనే బంధం కలుగుతుంది.
బానిస కర్మలు బంధాన్ని, స్వార్థపరత్వాన్ని కల్పిస్తే, ఆత్మ స్వాతంత్ర్యంతో కర్మను నిర్వర్తిస్తే సంగరాహిత్యజనితానందం కలుగుతుంది. న్యాయాన్ని గూర్చి, ధర్మాన్ని గూర్చి తరచు మనం ఏమేమో చెబుతుంటాం. కాని న్యాయధర్మాలనేవి లోకంలో కేవలం శిశువులు పలికే అర్థంలేనిమాటలని మనం తెలుసుకొంటాం. బలం, కారుణ్యం అనేవి రెండే మానవ వర్తనాన్ని నిర్ణయిస్తాయి. బలాన్ని చూపటం నిజంగా స్వార్థపరత్వాన్ని చూపటమే అవుతుంది. తనకున్న అధికారంచేత, అనుకూలతచేత వీలైనంత వరకు తాను లాభపడడానికే ప్రతివ్యక్తీ ప్రయత్నిస్తాడు. కారుణ్యమే ప్రత్యక్ష దైవం. మంచివారుగా వుండాలంటే మనమంతా కరుణ కలిగి వుండాలి. న్యాయం, హక్కులూ కూడా కారుణ్యంమీదే ఆధారపడి వుండాలి. కర్మఫలాపేక్ష అంతా మన ఆత్మాభివృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాదు అంతిమంగా దైన్యాన్ని కొనితెస్తుంది. కారుణ్యాన్ని, స్వార్థరహిత దాతృత్వాన్ని మనం ఆచరణలో పెట్టడానికి మరొక విధానంవుంది. మనం సాకారదైవాన్ని నమ్మితే, మన కర్మను ఆ దైవానికి ‘ఆరాధన’ గా భావించడమే ఈ విధానం. ఇందు మన కర్మఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. భగవంతుణ్ణి ఇలా ఆరాధిస్తే మనం చేసే కర్మలకు మానవకోటినుండి ప్రతిఫలం కోరడానికి మనకు అధికారం లేదు. సాక్షాత్తు భగవంతుడే సదా కర్మనిరతుడై అసంగుడై వున్నాడు. నీరు తామరాకును తడుపనట్లు, స్వార్థరహితుడైన వ్యక్తికి ఫలసంగాన్ని కల్పించి కర్మ అతణ్ణి బంధించలేదు. నిస్సంగుడు, స్వార్థరహితుడు అయినవాడు పాపపంకిలమూ, జన సమ్మర్థమూ అయిన నగరం మధ్యలో నివసిస్తున్నా అతణ్ణి పాపం అంటదు.
పూర్తి స్వార్థరాహిత్య మంటే ఏమిటో ఈ కింది కథ నిరూపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం పంచపాండవులు అశ్వమేధ యాగం జరిపి బీదలకు అపారమైన దానధర్మాలు చేశారు. జనులంతా ఆ యాగవైభవాన్ని, గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో అలాటి యాగం లోకం ఇంత వరకూ కనీవినీ ఎరుగదన్నారు. యాగం ముగిసినాక ఒక ముంగిస అక్కడికి వచ్చింది; దాని శరీర సగభాగం బంగారు వన్నెతో, సగభాగం గోధుమ వన్నెతో నిండి ఉంది. అది యజ్ఞమంటపంలో అటూ ఇటూ పొర్లసాగింది: తన చుట్టూవున్న పరిజనంతో అది “మీరంతా అసత్యవాదులు. ఇది ఒక యజ్ఞమే కాదు” అంది. ఆ మాటలకు జనులు ఇలా అన్నారు: “ఏమిటీ? ఇది యజ్ఞమే కాదా? ధనం, నగలు బీదలపై ఎలా ధారాపాతంగా కురిపింప బడ్డాయో, అందరూ ఎలా భాగ్యవంతులై, సుఖవంతులై వున్నారో నీకు తెలియదా? మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది మహాద్భుతమైనది.” దానికి ఆ ముంగిస ఇలా చెప్పింది: “ఒకప్పుడొక గ్రామముండేది. అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో, కొడుకుతో, కోడలితో నివసించేవాడు. వారు నిరుపేదలు. అతడి బోధనలకు, ఉపదేశాలకు గ్రామస్థులు సమర్పించే స్వల్ప దక్షిణలే వారి జీవనాధారం. ఇలావుండగా ఆ దేశంలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు ఏర్పడింది. అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు. రోజుల తరబడి కుటుంబం పస్తుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి, దానిని నాలుగు భాగాలు చేసి నలుగురికీ పంచాడు. వాళ్లు దానిని ఉడికించి తినబోయేంతలో ఎవరో తలుపు తట్టారు. తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి వున్నాడు. భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి – అతడిని దైవంగా భావించి పూజించాలి.* కాబట్టి ఆ బీదబ్రాహ్మణుడు ‘స్వాగతం, లోపలికి రండి’ అంటూ అతిథిని ఆహ్వానించి తనవంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు. అతడు దాన్ని ఆవురావురున తినేసి “చంపారండీ బాబూ! పది రోజులనుండి పస్తున్న నాకు ఈ రవ్వంత పిండి ఆకలిని వృద్ధిపరిచింది” అన్నాడు. ఆ మాటలు విని భార్య, భర్తతో తన వంతు ఆహారాన్నికూడా అతడికి సమర్పించమనగా, భర్త అంగీకరింపకపోయేసరికి ఆమె ఇలా అంది: ‘ఇతడు పాపం ఇక్కడకు వచ్చాడు. ఇతడి ఆకలి తీర్చటం గృహస్థులమైన మన కర్తవ్యం కదా! ఇతడికి ఇవ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించటం భార్యగా నా విధి.’ ఇలా అంటూ ఆమె తన వంతును అతిథికి సమర్పించింది. అతడు దాన్నీ తినేసి “ఆకలితో మాడిపోతున్నాను” అన్నాడు బాధగా. బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు “నా వంతునూ స్వీకరించండి; తండ్రి బాధ్యతలను నిర్వర్తించటం కుమారుడి విధికదా” అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చివేశాడు. అతిథి దాన్ని తినీ తృప్తిపడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని నిస్సంకోచంగా సమర్పించింది. అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్లిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని నలుగురూ ఆకలిబాధతో మరణించారు. ఆ బియ్యపుపిండి కణాలు కొన్ని నేలమీదపడ్డాయి. వాటి మీద నేను దొర్లగానే నా శరీరంలో సగ భాగం సువర్ణమయమైంది. అలాంటి ఇంకో యజ్ఞాన్ని చూడటానికి ఆనాటినుండీ నేను లోకమంతా తిరుగుతున్నాను. కాని ఇంతదాకా నాకు కనబడలేదు. నా శరీరం రెండవ పక్క మరెక్కడా సువర్ణమయం కాలేదు. నేను దీన్ని యజ్ఞమే కాదనటానికి ఇదే కారణం!”
భారతదేశం నుండి దాతృత్వం నిష్క్రమిస్తుంది. మహాత్ముల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. నేను ఆంగ్లభాషను నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు ఒక ఆంగ్లపుస్తకంలో విధేయుడైన బాలుణ్ణి గూర్చిన కథ ఒకటి చదివాను. అతడు ఇల్లువిడిచి పనిచెయ్యడానికి పోయేముందు తన ముసలి తల్లికి తాను సంపాదించిన ధనంలో కొంతభాగం ఇచ్చాడట. ఇది మూడు నాలుగు పుటలలో శ్లాఘింపబడింది. దీనిలో ఏముంది? హైందవ బాలురెవరికీ ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ అంతు చిక్కదు. కాని ‘ఎవరికి వారే’ అనే పాశ్చాత్య ధర్మతత్త్వాన్ని విన్న నాకిప్పుడు ఆ కథలోని నీతి తెలుస్తూంది. ‘నా చిన్ని పొట్టకు శ్రీరామరక్ష’ అని కొందరన్నింటినీ తమకోసమే దాచుకొంటుంటే; తల్లులు, తండ్రులు, భార్యలు, బిడ్డలు దిక్కు లేని వారౌతున్నారు. ఇది ఏ దేశంలోగాని, ఏ కాలంలోగాని గృహస్థులకు ఆదర్శం కాకూడదు.
కర్మయోగమంటే ఎలాంటిదో మీకిప్పుడు తెలిసింది. ప్రాణాలను కూడా లక్ష్యపెట్టక, ప్రశ్నలేవీ అడగకుండా పరులకు తోడ్పడటమే కర్మయోగం. అనేక వేలసార్లు వంచించబడ్డా ఏమీ అడుగవద్దు. ఇంత ఘనకార్యం చేస్తున్నామని కలలోకూడా తలచవద్దు. బీదలకు మీరు చేసే దానధర్మాలను గురించి ఎన్నడూ ప్రగల్భాలు పలుకవద్దు. వారి కృతజ్ఞతను ఎదురుచూడవద్దు. పైగా దానం చెయ్యడానికి మీకవకాశమిచ్చినందుకు వారిపట్ల మీరే కృతజ్ఞులై వుండండి. ఆదర్శసన్న్యాసిగా జీవించడం కంటే ఆదర్శగృహస్థుడై జీవించడం కష్టమని; నిజమైన కర్మయోగి జీవనం నిజమైన సన్న్యాస జీవనంతో సమానంగా కష్టతరమనీ మనకు సుస్పష్టమైనది.