సాంఖ్యదర్శనాన్ని బట్టి ప్రకృతిలో మూడు శక్తులున్నాయి. సంస్కృతంలో వాటిని సత్త్వ రజ స్తమస్సు లంటారు. భౌతికప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతిని బట్టి వాటిని సమ (equilibrium), సవ్యాపారత (activity), జడత (inertness) అనవచ్చు. అజ్ఞానం, బద్దకం, సోమరితనం, అలసత్వం తమోలక్షణం; రాగద్వేషరూపంలో వ్యక్తమయ్యే క్రియాపరత, సవ్యాపారస్థితి రజోలక్షణం. సవ్యాపారతా, నిర్వ్యాపారతల సామ్యావస్థ సత్త్వలక్షణం.
ఈ మూడుశక్తులూ ప్రతివ్యక్తిలో ఉంటాయి. ఒకప్పుడు తమస్సు ప్రబలంగా ఉంటుంది. తద్ద్వారా మనం సోమరులమౌతాం, చురుకుదనం లోపిస్తుంది. ఏవో కొన్ని మనోభావాల చేతనో, స్తబ్దత చేతనో బద్ధులమై ఉంటాం. కొన్ని సమయాలలో వ్యాపార పరత, మరికొన్ని సమయాలలో ఈ రెండిటి ప్రశాంత సామ్యావస్థ ప్రాబల్యం వహించి ఉంటాయి. అంతేకాక విభిన్నవ్యక్తులలో, ఈ శక్తులలో ఏదో ఒకటి సాధారణంగా ప్రబలమై ఉంటుంది. నిర్వ్యాపారత, నిరుత్సాహం, సోమరితనం ఒక వ్యక్తి లక్షణంగాను; కార్యపరత, శక్తి మరోవ్యక్తి లక్షణంగాను; కర్మాకర్మలు సామ్యస్థితి పొందివుండటం వల్ల కలిగే సాధుత్వం, ప్రశాంతత, మాధుర్యం మరొకరి స్వభావంగా ఉండవచ్చు. జంతువులు, వృక్షాలు, మానవులు – సమస్త సృష్టిలో ఎవరిలోనైనా వివిధాలైన ఈ శక్తులు దాదాపు ఒక ఆదర్శరీతిలో వ్యక్తమౌతాయి.
కర్మయోగానికి ఈ మూడు ముఖ్యమైనవి. ఈ శక్తులెలాంటివో, వాటిని ఎలా వినియోగించుకోవాలో బోధిస్తే కర్మలను మనం మేలైన రీతిలో నిర్వర్తించడానికి కర్మయోగం మనకు తోడ్పడుతుంది. మానవసంఘం అనేక అంతరువులతోకూడిన వ్యవస్థ. నైతికతగూర్చి మనందరికీ తెలుసు, విధులను గూర్చీ తెలుసు; కాని భిన్నదేశాలలో వాటి ప్రాముఖ్యం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒకదేశంలో ఏది నైతికంగా పరిగణింపబడుతుందో అది మరో దేశంలో అనైతికంగా పరిగణింపబడవచ్చు. వివాహ విషయంలో ఒక దేశంలో మేనరికం అంగీకారమైతే మరొక దేశంలో అది అధర్మంగా గుర్తింప బడుతోంది. ఒక దేశప్రజలు తమ మరదళ్లను పెళ్లిచేసుకోవచ్చు, మరొక దేశంలో అది నీతి బాహ్యం. ఒకదేశంలో జనులు ఒక్కమారే వివాహ మాడవచ్చు, మరోదేశంలో అనేకసార్లు వివాహం చేసుకోవచ్చు – నీతినియమాలు ఈ విధంగా ఉన్నాయి. నైతిక వ్యవహరంలోని ఇతర విషయాలలో కూడా ప్రమాణం ఎంతో వ్యత్యాసంగా ఉంటోంది. అయినప్పటికీ నైతికత విషయంలో సమస్త ప్రపంచానికి ఒక్కటే కొలబద్ద ఉండాలనే భావన మనకు ఉంది.
విహితవిధుల విషయం కూడా ఇలాంటిదే. విధులను గూర్చిన భావన విషయంలో కూడా వివిధ దేశీయులలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒకదేశంలో ఒక వ్యక్తి కొన్ని పనులు చెయ్యకపోతే ప్రజలు అతణ్ణి అధర్మంగా ప్రవర్తించాడంటారు. అదే వ్యక్తి మరొక దేశంలో ఆ పనులను చేస్తే, అప్పుడు కూడా జనులు అతణ్ణి అధర్మంగా ప్రవర్తించాడంటారు. విహితవిధుల విషయంలో కూడా ప్రపంచానికంతటికీ ఒక్కటే కొలబద్ధ ఉండాలనే భావన ఉంది. ఇదే విధంగా సంఘంలో కొందరు కొన్ని కర్మలు తమకు విధ్యుక్తాలని భావిస్తూంటే, మరికొంతమంది దానికి వ్యతిరేకంగా తలుస్తూ, ఆ కర్మలు చేయవలసివస్తే గడగడలాడిపోతారు. మనకీ విషయంలో రెండుమార్గా లున్నాయి – పరమార్థంలో ఒక్కమార్గమే ఉందని, మిగతావన్నీ అక్రమాలని భావించే మూర్ఖుల పద్ధతి ఒకటి; మన మనఃప్రకృతిబట్టి లేక మనంవున్న వివిధ స్థాయిలనుబట్టి విధులు, నీతులు మారుతుండవచ్చని అంగీకరించే ధీమంతుల పద్ధతి మరొకటి. విధులలో, నీతులలో అనేక అంతరువులు వున్నాయని; జీవితంలో ఒక స్థితికిగాని, కొన్ని పరిస్థితులకుగాని అనువర్తించే నీతినియమాలు ఇతర పరిస్థితులకు అనువర్తింపవనీ గ్రహించటమే దీనిలోని ముఖ్యవిషయం.
దీనికొక ఉదాహరణ: మహాచార్యులందరూ ‘అపకారాన్ని ప్రతిఘటించవద్దని, ప్రతిఘటించకుండా వుండటమే అత్యున్నతమైన నైతికాదర్శ’ మని బోధించారు. మనలో కొందరం ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే, సంఘమనే భవనం బీటిల్లి కూలుననీ, దుర్మార్గులు మన ఆస్తులను, ప్రాణాలనూ హరిస్తారనీ, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారనీ మనం ఎరుగుదుము. ఇటువంటి అప్రతిఘటనను ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు వాటిల్లుతుంది. ఐనా ‘అపకారాన్ని ప్రతిఘటించవద్దు’ అనే బోధనలోని సత్యాన్ని సహజావబోధచే మన అంతరంగంలో మనం ఎరుగుదుము. ఇది మహోన్నతా దర్శంగా మనకు కనిపిస్తుంది. ఐనా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవకోటిలో అత్యధికులను నిరసించిన వారమౌతాం. అంతేకాదు, ఎల్లప్పుడూ వారు చేస్తున్నది అధర్మమని లెక్కగట్టి లోకులకు కార్యాచరణంలో మనోవ్యధ కలిగించటం కూడా సంభవిస్తుంది; దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరమైన ఇలాంటి ఆత్మనిరసనం తక్కిన దౌర్బల్యాలకంటె అధికమైన పాపానికి హేతువగుతుంది. తనను తాను ద్వేషించుకో నారంభించిన వ్యక్తికి పతనద్వారం ఇంతకు మునుపే తెరువబడి ఉంది. దేశం విషయంలో కూడా ఇది నిజం.
మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమధర్మం. ఎందుకంటే, అభివృద్ధి పొందడానికి మొదట మనలోను, తరువాత భగవంతునిలోను విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసంలేని వ్యక్తికి భగవంతునిలో విశ్వాసం కలగటం కలలోని మాట. నీతి, ధర్మం వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయని గుర్తింపక తప్పదు. కావున చెడును ప్రతిఘటించే వ్యక్తి ఎల్లవేళలా తప్పు చేస్తున్నాడనీ, ప్రతిఘటించడం దోషమనీ చెప్పలేము. పరిస్థితులనుబట్టి చెడును ప్రతిఘటించటం మానవుడికి ధర్మంగా కూడా ఏర్పడవచ్చును.
ప్రతిఘటించకుండా వుండటం అత్యున్నత ప్రేమాదర్శమని చెబుతూ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో తన శత్రువులు తనకు బంధువులు, ఆప్తులు అవటంచేత యుద్ధం చెయ్య నిరాకరించినందుకు శ్రీకృష్ణుడు అతణ్ణి కపటి, పిరికివాడని భగవద్గీత రెండవ అధ్యాయంలో పలికాడు* . భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని చదివి పాశ్చాత్యులైన మీలో అనేకమంది ఆశ్చర్యపడవచ్చు. సమస్త విషయాలలో విపరీత పరమావధులు (Extremes) ఒకదాని నొకటి పోలివుంటాయి. అత్యంత అనుకూల పరిస్థితి (Extreme positive), అత్యంత అననుకూల పరిస్థితి (Extreme negative) ఒకేవిధంగా ఉన్నట్లు తోస్తుంది. ఇది మనందరమూ గ్రహింపవలసిన గొప్పగుణపాఠం. ఒక నిర్దిష్ట పౌనఃపున్య పరిధిలో ఉన్న కాంతిని మాత్రమే చూడగలం. ధ్వని విషయం కూడా ఇలాంటిదే, మానవ గ్రాహక పరిధిలో ఉన్న ధ్వనిని మాత్రమే వినగలం. ఆ పరిధులకు ఆవల ఉన్న కాంతిని చూడలేము, ధ్వనిని వినలేము. ప్రతిఘటనకు, అప్రతిఘటనకు మధ్య ఉన్న భేదం కూడా ఇలాంటిదే. బలహీనత, సోమరితనం వల్ల ఒకడు ప్రతిఘటించలేడు. ప్రతిఘటించకుండా ఉండటం అతడికి ఇష్టంలేక కాదు, శక్తిలేక. మరొకడు తను తలిస్తే తిరుగులేని దెబ్బ కొట్టడానికి సమర్థుడనని ఎరుగును. కాని అతడు కొట్టకుండా వుండటమేగాక, తన శత్రువులను ఆశీర్వదిస్తాడు. దౌర్బల్యంతో ప్రతిఘటించనివాడు పాపం చేస్తున్నాడు, కాబట్టి తాను ప్రతిఘటించనందువల్ల ఎలాంటి మేలు పొందజాలడు. ఇక రెండోవాడో ప్రతిఘటిస్తే పాపానికి ఒడిగట్టినవాడౌతాడు.
బుద్ధుడు సింహాసనాన్నీ, చక్రవర్తి పదవినీ పరిత్యజించాడు. అలాంటిదే యథార్థమైన త్యాగమంటే. కాని త్యజించడానికి ఏమీలేని బికారి విషయంలో త్యాగమనే పదానికే ఆస్కారం లేదు. కాబట్టి ఈ అప్రతిఘటనను గురించి, అహేతుక ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు నిజంగా వీటి గురించి మన భావన ఏమిటో, ఎంత వరకు మనకు ఇవి అర్థమయ్యాయన్న విషయమై జాగ్రత్త వహించాలి. ప్రతిఘటించే శక్తి మనలో వున్నదా లేదా అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. శక్తివుండీ దానిని త్యజించి మనం ప్రతిఘటించని ఎడల ప్రేమపూర్ణమైన ఘనకార్యం చేసిన వారమవుతాం. కాని ప్రతిఘటించే శక్తిలేక మహోన్నత ప్రేమోద్దేశాలతో ప్రేరితులమౌతున్నామని ఆత్మవంచన చేసుకోయత్నిస్తే, చెప్పినదానికి వ్యతిరేకంగా ప్రవర్తించినవారమౌతాం. అర్జునుడు యుద్ధరంగంలో తన నెదిరించిన మహాసైన్య సమూహాన్ని చూసి పిరికివాడయ్యాడు. దేశంపట్ల, రాజుపట్ల అతడు నిర్వర్తించవలసిన విధ్యుక్తధర్మాన్ని అతడి ప్రేమ మరపించింది. శ్రీకృష్ణుడు అతణ్ణి కపటి అనడానికి కారణం ఇదే.
“ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావు గాని నీ చేతలు నీ పిరికితనాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి లే, పోరాడు.”*
ఇదే కర్మయోగ హృదయం. అప్రతిఘటనే మహోన్నతాదర్శమని తెలుసుకున్నవాడు, అప్రతిఘటన మహోన్నత సత్యావిష్కారణమని, చెడును ప్రతిఘటించటం అప్రతిఘటనమనే ఆ మహోన్నత సత్యావిష్కృతికి మెట్టు అనీ తెలుసుకున్నవాడు కర్మయోగి. ఈ మహోన్నతాదర్శాన్ని పొందడానికి ప్రారంభ దశలో చెడును ప్రతిఘటించడమే మానవుడి కర్తవ్యం. అందుకై అతణ్ణి పాటుపడనివ్వండి, పోరాడనివ్వండి, భుజాన్నెత్తి సూటిగా కొట్టనివ్వండి. ప్రతిఘటించగల శక్తిని గడించిన తరువాతే అప్రతిఘటనం గుణమౌతుంది.
మా దేశంలో ఒకప్పుడు నేనొక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి జిజ్ఞాస అనేది ఆవగింజంతైనా లేని కేవల పశుప్రాయుడని, మందమతి అని, అవివేకి అని నాకు ముందే తెలుసు. “భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేనేం చెయ్యాలి? ముక్తి నాకెలా లభిస్తుంది?” అని అతడు నన్ను అడిగాడు. “అసత్యం చెప్పగలవా?” అని నేను అడిగాను. “నా వల్ల కాదు” అన్నాడతడు. “అయితే అసత్యం చెప్పడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరైనా కేవలం పశుప్రాయుడుగానో, కాష్ఠప్రాయుడుగానో వుండడానికంటె అసత్యం పలికేవాడుగా వుండటం సబబు. నువ్వు ఒట్టి మందమతివి. నిర్మలం, ప్రశాంతం, నిష్క్రియం ఐన మహోన్నతస్థితిని పొందినవాడవు కానేకావు. ఏదైనా దుష్కార్యాన్ని చేయడానికి కూడా శక్తిలేని మందమతివి నువ్వు.” నే నతడికి చేసిన హితబోధ ఇది. ఇదంతా అసాధారణ సందర్భం అనటం నిజం. నే నతడితో అన్నవి పరిహాసవాక్కులు. కాని రాజసిక స్థితి నుండి ప్రశాంత నిలయమైన పరిపూర్ణ సాత్త్వికస్థితిని పొందడానికి మానవుడు కర్మమార్గంలో పురోగమించాలనేదే నా అభిప్రాయం.
నిష్క్రియాపరతను సర్వశక్తులొడ్డి తొలగించుకోవాలి. ఎప్పుడూ కార్యపరత్వమంటే ప్రతిఘటనే. అన్ని శారీరక, మానసిక బలహీనతలను అధిగమించండి. వీటిని అధిగమించటంలో సఫలీకృతులమైనప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. “ఎవ్వరినీ ద్వేషించవద్దు, చెడుకు ప్రతీకారం చెయ్యకు” అని చెప్పడం సులభమేకాని, అనుష్ఠానాన్ని చూసేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బోధపడుతుంది. లోకుల కళ్లముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు. కాని మన అంతరంగంలో అంతసేపువున్న కుళ్లు మనకు తెలుసు. నిజమైన అప్రతిఘటన జనిత ప్రశాంతత మనలో శూన్యమని మనకు అనుభవమే. ప్రతిఘటించడమే సబబని మనకు తోస్తుంది. మీరు ధనాన్ని వాంఛిస్తూ, ధనాపేక్షగల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి, ఆ కారణంగా ధనార్జనకు దిగని పక్షంలో మీ మనసుమాత్రం రేయింబవళ్లు ధనంవంకే పరుగెత్తుతుంది. కపటత అంటే ఇదే. దీనివల్ల పిసరంత ప్రయోజనం కూడా ఉండదు. సంసారంలో నిమగ్నులవండి. అలా కొంతకాలం అయ్యాక, దానిలోని సుఖదుఃఖాల నన్నింటినీ అనుభవించిన తరువాత మీకు వైరాగ్యం కలుగుతుంది. శాంతి నెలకొంటుంది. కాబట్టి మీ అధికారవాంఛను, తదితరవాంఛలను తీర్చుకోండి. తీర్చుకొన్నాక ఇవన్నీ కేవలం తుచ్ఛ విషయాలని గ్రహించే సమయం వచ్చితీరుతుంది. అంతేగాని ఈ వాంఛలు నెరవేరకుండా, ఈ పాట్లుపడకుండా – ప్రశాంత నిలయమైన ఆత్మసమర్పణ స్థితికి మీరు రావడం అసంభవం. ప్రశాంత వైరాగ్యాలను గురించి వేలకొద్ది సంవత్సరాల నుండీ బోధనలు జరుగుతూనే వున్నాయి. చిన్ననాటినుండీ ప్రతివ్యక్తీ వాటిని గురించి వింటూనే వున్నాడు, కాని నిజంగా ఆ స్థితిని పొందిన వ్యక్తులు అరుదు. నిజంగా శాంత స్వభావులను, ప్రతీకారమంటే ఎలాంటిదో తెలియని వ్యక్తులను నా జీవితంలో బహుశా ఇరవైమందిని కూడా చూసివుండలేదు; నేను సగం ప్రపంచాన్ని పర్యటించాను.
ప్రతివ్యక్తీ స్వంత ఆదర్శాన్నే అవలంబించి దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించుకోలేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడానికంటె పురోభివృద్ధికి ఇదే ఖచ్చితమైన మార్గం. ఉదాహరణకు ఒక బిడ్డను వెంటవెంటనే ఇరవైమైళ్లు నడవమంటే, ఆ బిడ్డ చావనైనా చస్తుంది లేదా వెయ్యి మందిలో ఒకటి ఆ ఇరవైమైళ్లూ పాకి, అలసిపోయి సగంచచ్చి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. లోకంపట్ల మన ప్రవర్తన సాధారణంగా ఇలా ఉంటుంది. ఏ సంఘంలోగాని స్త్రీ పురుషులందరి ధోరణి ఒక్కలా ఉండదు. కార్యాచరణంలో అందరి శక్తిసామర్థ్యాలు ఒక్కరీతిగా ఉండవు. వారికి భిన్నాదర్శాలు వుండితీరాలి. ఏ ఆదర్శాన్నిగాని పరిహసించడానికి మనకు హక్కులేదు. స్వీయాదర్శ సాకారానికి ప్రతివ్యక్తిని యథాశక్తి ప్రయత్నించనివ్వండి. నన్ను నీ ఆదర్శాన్ని బట్టిగాని, నిన్ను నా ఆదర్శాన్ని బట్టిగాని విమర్శించటం తగదు. ఆపిల్చెట్టు గుణాన్ని మర్రిచెట్టు స్థితిననుసరించిగాని, మర్రిచెట్టు గుణాన్ని ఆపిల్చెట్టు స్థితిననుసరించిగాని పరీక్షించటం తగదు. మర్రిచెట్టును పరీక్షించడానికి ఆ చెట్టు పరిస్థితులనే గణనలోకి తీసుకోవాలి; ఆపిల్చెట్టుకు, ఆ చెట్టు పరిస్థితులనే గైకొనాలి.
అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలున్నా వాటికడుగున ఏకత్వం వుంది. సాంఘికంగాను, వ్యక్తిగతంగాను స్త్రీ పురుషులలోని భిన్నవర్గాలు, భిన్న ప్రవృత్తులూ సృష్టిలోని సహజభేదాలు. కాబట్టి ఒక్క కొలతను బట్టే వారి గుణదోషాలను విమర్శించ కూడదు, ఒక్క ఆదర్శాన్నే వారందరికీ విధింపకూడదు. కేవలం అది అస్వాభావికమైన అలజడిని కలిగిస్తుంది. తత్ఫలితంగా మానవుడు తననే ద్వేషించుకోసాగి పారమార్థికపరతకు, సౌజన్యానికి దూరం అవుతాడు. స్వీయోన్నతాదర్శాన్ని అనుసరించి యత్నించటానికి ఆ ఆదర్శం వీలైనంత వరకు సత్యసన్నిహితమై వుండేందుకు ప్రయత్నించడానికి ప్రతివ్యక్తిని ప్రోత్సహించడమే మన కర్తవ్యం.
అతిప్రాచీనకాలం నుండి హైందవ ధర్మశాస్త్రాలలో ఈ తత్త్వం గుర్తింపబడి వుంది. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, సన్న్యాసం అనే ఆశ్రమాలను అవలంబిస్తూ వివిధ వ్యక్తులకు హైందవ ధర్మశాస్త్రాలలోను, వేదాలలోను వివిధ ధర్మాలు విధింపబడినాయి.
హిందువుల సనాతన ధర్మశాస్త్రాల ననుసరించి ప్రతివ్యక్తి జీవితానికి, సార్వజనీన ధర్మాలుండటమే కాక, కొన్ని ప్రత్యేక ధర్మాలు కూడా ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంతో హైందవుని జీవితం ఆరంభమౌతుంది. తరువాత వివాహం చేసుకుని గృహస్థుడౌతాడు. వృద్ధాప్యంలో వానప్రస్థుడౌతాడు. చివరకు సర్వసంగాలు పరిత్యజించి సన్న్యాసి అవుతాడు. ఈ ఆశ్రమాలలో ప్రతిదానికీ ప్రత్యేకధర్మాలు కొన్ని విధింపబడివున్నాయి. ఈ ఆశ్రమాలలో ఏ ఒక్కదానికీ తక్కినవాటికంటె సహజాధిక్యత ఏమీ లేదు. పారమార్థిక కర్మపరాయణుడైన బ్రహ్మచారి జీవితం ఎంతగొప్పదో, గృహస్థుడి జీవితమూ అంతే గొప్పది. సింహాసనంమీది చక్రవర్తి ఎంతగొప్పవాడో, వీధులలోని పాకివాడూ అంతే గొప్పవాడు. సింహాసనంనుండి అతణ్ణి తొలగించి పాకివాడి పని చెయ్యమనండి, దానిలో అతడి సామర్థ్యం చూడండి. పాకివాడిని గద్దెనెక్కించి అతడెలా పరిపాలిస్తాడో చూడండి. సంసారంలో వుండేవాడికంటె సంసారాన్ని త్యజించినవాడు ఘనుడనటం నిష్ప్రయోజనం. సంసారాన్ని త్యజించి, స్వేచ్ఛగా, సుఖంగా జీవించడంకంటె, సంసారంలో వుంటూ భగవంతుణ్ణి కొలువటం ఎంతో కష్టతరం. కాలక్రమాన భారతదేశంలోని చతురాశ్రమాలు గార్హస్థ్య సన్న్యాసాశ్రమాలలో దాగినాయి. గృహస్థుడు వివాహం చేసుకుని తన విధ్యుక్త పౌరధర్మాలను నిర్వర్తిస్తూవుంటే; భగవంతుని ఉపాసనను, ధర్మప్రచారాన్ని చేస్తూ కేవలం పారమార్థిక విషయాలకు తన శక్తిసామర్థ్యాలను వినియోగించటం సన్న్యాసి ధర్మాలు. మహానిర్వాణతంత్రం నుండి ఈ విషయాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలను మీకు చదివి వినిపిస్తాను. దానివలన మానవుడు గృహస్థుడుగా వుంటూ తన ధర్మాలనన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించటం ఎంత కష్టసాధ్యమో మీకు తెలుస్తుంది.
గృహస్థుడు భగవంతుని భక్తుడై వుండాలి. భగవంతుని గురించిన జ్ఞానమే అతడి జీవిత పరమావధిగా ఉండాలి. అయినప్పటికీ అతడు సదా కర్మనిరతుడై తన విధ్యుక్తధర్మాలను నిర్వహిస్తూ కర్మఫలాలను ఈశ్వరార్పణ చెయ్యాలి.*
కర్మచేస్తూ కర్మఫలాన్ని ఆశింపకుండటం; ఒకరికి సాయంచేసి ఆతడు మీపట్ల కృతజ్ఞుడై వుండాలని భావింపకుండా వుండటం; ఏదైనా సత్కార్యం చేసి దానివలన మీకు పేరుప్రతిష్ఠలు కలుగుతాయో, కలుగవో అనే విషయమే తలపెట్టకుండటం లోకంలో నిజంగా ఎంతో కష్టసాధ్యం. వట్టి పిరికిపంద కూడా లోకం తనను మెచ్చుకొనేటప్పుడు ధైర్యశాలి అవుతాడు. లోకులు తనను స్తుతించేటప్పుడు మూర్ఖుడూ ధీరపురుషోచిత కార్యాలను చెయ్యగలడు. కాని సహచరుల పొగడ్తను కోరక సర్వదా సత్కార్యాలు చేస్తూండటం నిజంగా మహోన్నత త్యాగం. జీవనోపాధి ఆర్జించుకోవటం గృహస్థుడికి పరమధర్మం. కాని ఆ ఆర్జన అబద్ధాలాడి, ఇతరులను మోసగించి, ఇతరుల ధనాన్ని అపహరించి చెయ్యరాదు. అంతేకాక ఈశ్వర సేవ, దీనజన సేవ తన జీవితధర్మాలని అతడు జ్ఞాపకం వుంచుకోవాలి.*
తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్స్వరూపులుగా ఎరిగి గృహస్థుడు సదా, సర్వవిధాల వారిని సంతుష్టులను చెయ్యాలి.* తలిదండ్రులు సంతుష్టులైతే భగవంతుడు సంతుష్టుడౌతాడు. తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడని కుమారుడే నిజమైన సుపుత్రుడు.*
తల్లిదండ్రుల ముందు ఎగతాళిగా మాట్లాడరాదు. తొందరపాటుకూడదు. కోపంగాని, ఆక్రోశంగాని చూపకూడదు.* తల్లిదండ్రుల ఎదట మొక్కి నిలబడాలి. వాళ్లు కుర్చోమనేదాకా కూర్చోరాదు.*
తల్లి తండ్రులకు, భార్యా బిడ్డలకు, పేదలకు పెట్టకుండా గృహస్థుడు భుజిస్తే అది పాపం అవుతుంది.* ఈ శరీరానికి తలిదండ్రులే కారకులు. కాబట్టి వారికి మేలుచేయడానికి మానవుడు లక్షకష్టాలైనా అనుభవించటం కర్తవ్యం.*
తన భార్యపట్లా ఆతడికి విహితమైన ధర్మం ఇలాంటిదే; భార్యను దూషించకూడదు. కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి. తను ఎలాంటి కష్టాలు, ఇక్కట్లూ అనుభవిస్తున్నా భార్యమీద కోపం చూపకూడదు.*
తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు, కేవలం మానసికంగా పరస్త్రీని స్పృశించినా ఘోరనరకానికి పోతాడు.*
స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. తన శక్తిసామర్థ్యాలను గురించి ప్రగల్భాలు పలుకకూడదు. నేనిది చేశాను, అది చేశాను అని చెప్పుకోకూడదు.*
ధనంతో, వస్త్రాలతో, ప్రేమతో, నమ్మికతో, మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యకు సంతృప్తి కలిగించాలి. ఆమె మనస్సు క్షోభించే పనులు ఎన్నడూ చెయ్యకూడదు. పతివ్రత ఐన ప్రియురాలి ప్రేమను పొందగలిగినవాడు సమస్తధర్మాలలో కృతకృత్యుడైనట్లే; సమస్త సద్గుణాలను ఆర్జించుకొన్నట్లే.*
బిడ్డలపట్ల గృహస్థుడు అవలంబించాల్సిన ధర్మాలివి: నాలుగేళ్ల ప్రాయం వచ్చేవరకు కుమారుణ్ణి ప్రేమానురాగలతో పెంచుతూ పదహారేళ్లవరకు విద్యాబుద్ధులను గరపాలి.* ఇరవై ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింపచెయ్యాలి. అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి.* సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గరపాలి. వివాహసమయంలో తండ్రి ఆమెకు నగలను, ధనాన్ని ఒసగాలి.*
వీటి తరువాత అతడు నిర్వహించాల్సిన ధర్మాలు తన అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెళ్లపట్ల, పేదవారైతే వారి పిల్లలపట్ల, తక్కిన తన బంధువర్గం పట్ల, మిత్రులపట్ల, సేవకులపట్ల* ఆదరాభిమానాలను చూపి వారిని సంతుష్ట పరచాలి. ఆ తరువాత తన గ్రామస్థులపట్ల, పేదలపట్ల, ఎవరైనా కానివ్వండి – తన సాయాన్ని అర్థించిన వారి పట్ల నిర్వర్తించవలసిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి.”* తగినంత స్థితి పరుడై వుండీ గృహస్థుడు తన బంధువులకు, పేదలకు పెట్టని పక్షంలో అలాంటివాడు మానవుడు కాడనీ, వట్టి పశువనీ గ్రహించాలి.”*
ఆహారవస్త్రాదులలో, శరీరపోషణలో, తల దువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి వుండకూడదు.* గృహస్థుడు పవిత్రహృదయుడై, పరిశుద్ధ శరీరుడై వుండటమేగాక కర్మాచరణానికి సంసిద్ధుడుగాను, తత్పరాయణుడుగాను వుండాలి.*
శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై ఒప్పారాలి. శత్రువులను అతడు ప్రతిఘటించాలి. ఇది గృహస్థుడి విధి. అంతేగాని ఒకమూల కూర్చుని ఏడుస్తూ అప్రతిఘటనాన్ని గూర్చి అర్థరహిత ప్రలాపాలు చెయ్యరాదు. గురువుల పట్ల, బంధువుల పట్ల అతడు వినయ విధేయతలతో మెలగాలి.*
దుర్మార్గులను గౌరవించకుండటం గృహస్థుడి విధి. దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యాన్ని ఆదరించిన వారౌతారు. గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించినా తప్పే. స్నేహం చేసుకోవటంలో తొందరపడ కూడదు. తన దారి వదిలి కనబడ్డవాళ్లతో స్నేహం చెయ్యకూడదు. తను స్నేహం చెయ్యాలనుకున్నవారి చర్యలను, ఇతరులతో వారు నెరపే వ్యవహార ధర్మాలను కనిపెట్టి, వాటిని గూర్చి పర్యాలోచించి తరువాత వారితో స్నేహం చెయ్యాలి.*
ఈ మూడు విషయాలను గూర్చి గృహస్థుడు మాట్లాడకూడదు.* తన ప్రఖ్యాతిని గురించి నలుగురిముందు సంభాషించరాదు. తన పేరును తానే మ్రోగించుకొనుటగాని, తన శక్తులను కొనియాడుకోవటంగాని కూడదు. రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను గూర్చిపలుకకూడదు.
తాను దరిద్రుణ్ణనిగాని, భాగ్యవంతుణ్ణనిగాని చెప్పుకోకూడదు. తన సిరిసంపదలను గూర్చి ప్రగల్భాలు పలుకడం మంచిదికాదు. తన అభిప్రాయాలను తనవరకే వుంచుకోవాలి. ఇది అతడి పరమధర్మం. ఇది కేవల లౌకికజ్ఞానం కాదు. ఇలా చెయ్యని పక్షంలో అతణ్ణి అధర్మవర్తనుడు అని అనవచ్చు.
సంఘాని కంతటికి గృహస్థుడే ఆధారభూతమైనవాడు, అతడే ప్రాపు; ఆర్జించేవారిలో ముఖ్యుడు. దరిద్రులు, దుర్బలులు, పనిచెయ్యనిబిడ్డలు, స్త్రీలు – అందరూ గృహస్థుడిమీదే ఆధారపడివుంటారు; కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని వుండాలి. ఈ ధర్మాలు అతడికి ఆచరించడానికి కావలసిన మనోదారుఢ్యాన్ని కలిగించేవిగా వుండాలి కాని, ఆదర్శానికంటే జఘన్యాలైన కార్యాలను చేస్తున్నట్లు అతడికి అనిపించేవిగా వుండకూడదు. కాబట్టి అతడేదన్నా పొరపాటు చేసినప్పుడు గాని, దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడుగాని నలుగురి ముందు ఆ గుట్టు వెల్లడించుకోకూడదు; అంతేకాక ఏదైనా ఉద్యమం ప్రారంభించి అందులో తనకు జయం లభింపదని నిశ్చయంగా తెలిసినప్పుడు దానిని వెల్లడించ కూడదు.* తన లోపాన్ని తానలా వెల్లడిచేయటం హితం కాకపోవడమే గాక మనో దౌర్బల్యహేతువై జీవితంలో విధ్యుక్త కర్మాచరణానికి అతణ్ణి అసమర్థుణ్ణి చేస్తుంది. ముందుగా విద్యను ఆ తరువాత ధనాన్ని ఆర్జించుకోవడానికి తప్పక శ్రమపడి ప్రయత్నించాలి. అది అతడి విధి. తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాడు. ధనాన్ని గడించడానికి శ్రమపడని గృహస్థుడు ధర్మం తప్పినవాడు.* అలసుడై పనికిమాలిన జీవితంతో తృప్తి పడేవాడు అవినీతిపరుడు. ఎందుకంటే అతడి మీద అనేకమంది ఆధారపడి వుంటారు. అతడు ధనవంతుడైతే ఆ కారణంగా వందలమంది సంరక్షింపబడతారు కదా.
కష్టపడి ధనవంతులైనవారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరకత, ఈ ధర్మసూత్రాలు, ఈ మహామందిరాలు – ఇవి అన్నీ ఎక్కడివి?
ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించటం తప్పుకాదు. ఎందుకంటే, అది పదిమందికీ ఉపయోగపడుతుంది. సంఘానికి గృహస్థుడే కేంద్రీభూతుడు. ధర్మమార్గంలో ధనం సంపాదించి, ధర్మకార్యాలకై దానిని వినియోగించటం ఒక సేవ. ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించటం, దానిని సత్కార్యాలకై వినియోగించడానికి ప్రయత్నించేవాడు, గుహలో ధ్యానమొనర్చే తపస్వి ఎలాంటి మోక్షసాధన చేస్తున్నాడో అలాంటి మోక్షసాధననే ప్రాయికంగా చేస్తున్నాడు; ఎలాగంటే భగవద్భక్తిచే, భగవంతుడిదే ఐన సమస్తసృష్టిజాతంలోని భక్తిచే ప్రేరితమైన ఆత్మార్పణ, స్వార్థత్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోను భిన్నవిధాలుగా వ్యక్తమౌతాయి.
మంచిపేరు సంపాదించడానికి గృహస్థుడు అన్నివిధాల ప్రయత్నించాలి. అతడు జూదమాడకూడదు, దుర్మార్గుల సాంగత్యం చెయ్యకూడదు, అసత్యం పలుకరాదు, ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు.
లోకులు తరుచు తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభంకొద్దీ ఇతరులను వంచిస్తారు. అంతేగాక అన్నిటికీ కాలమనేది ఒకటి వుంది కదా; ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చును.*
గృహస్థుడు సత్యాన్ని పలుకాలి, మృదువుగా, ప్రియంగా హితకరంగా పలుకాలి, ఇతరుల పనులను గురించి తానేమీ పలుకకూడదు.*
చెరువులను తవ్విస్తూ, బాటల కిరువైపుల చెట్లను నాటిస్తూ, మనుష్యులకు జంతువులకు విశ్రాంతి మందిరాలను నిర్మిస్తూ, బాటలను వేస్తూ, వంతెనలను నిర్మిస్తూ గృహస్థుడు యోగీంద్ర లభ్యమైన పదాన్ని పొందుచున్నాడు.*
గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒకభాగం. మహానిర్వాణతంత్రంలోనే తర్వాత ఒకచోట ఇలా చెప్పబడింది: “స్వదేశం కోసంగాని, స్వధర్మం కోసంగాని యుద్ధరంగంలో ప్రాణాలను కోల్పోయే గృహస్థుడు ధ్యానంచే యోగిపొందే పరమపదాన్నే పొందుతున్నాడు.”* దీనివలన ఒకరికి కర్తవ్యమైనది మరొకరికి కర్తవ్యం కాదని ఏర్పడుతోంది. ఐనా ఇందులో ఒకటి ఉత్తమగతిని కలిగించేది, మరొకటి అధోగతిని కలిగించేది కాదనీ ఆ శాస్త్రమే చెబుతోంది. ధర్మాలలో దేని స్థానం దానికి వుంది. మన పరిస్థితులను బట్టి ధర్మాలను నిర్వర్తించాలి.
దౌర్బల్య నిరసనమే ఈ వివేచన మంతటికీ ముఖ్యవిషయం. ధర్మంలోగాని, కర్మలోగాని, వేదాంతంలోగాని కనబడే సమస్తబోధనలలోను ఇదే నాకు అభిమతమైన తత్త్వం. మీరు వేదాలను చూస్తే మళ్లీ మళ్లీ మీకు కనిపించే మాట ‘అభీః’ – అభయం. దేనికీ భయపడవద్దు. భయం దౌర్బల్య లక్షణం. లోకుల వేళాకోళాలను, హేళనలను పట్టించుకోక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి.
సర్వేశ్వరుణ్ణి కొలువడానికి సంసారవర్తనులై లోకకళ్యాణార్థం కృషిచేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించటంలేదని సన్న్యాసులు భావింపకూడదు. ఇలాగే భార్యాపుత్రులకోసం సంసారాన్ని చేసేవారూ సంసార త్యాగులైన సన్యాసులను నీచులైన తిరుగుబోతులుగా పరిగణించ రాదు. ఎవరిస్థానంలో వారు అధికులు. ఈ ఆశయానికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను:
“ఎవరు గొప్ప? సంసారాన్ని త్యజించి సన్న్యాసియైనవాడా? లేక స్వధర్మానురక్తుడైన గృహస్థుడా?” అని ఒకరాజు తన రాజ్యానికి వచ్చిన సన్న్యాసుల నందరినీ అడిగేవాడు. ధీమంతులు కొందరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్న్యాసులే అధికులని చెప్పినప్పుడు రాజు వారిని “మీ ప్రతిపాదనను నిరూపించ” మన్నాడు. అది వారికి అసాధ్యమవటంచే రాజు వారిని “వివాహం చేసుకుని గృహస్థులుకండి” అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి “స్వధర్మాను వర్తనుడైన గృహస్థుడే గొప్పవాడు” అన్నారు. వాళ్లతో కూడా రాజు “అది ఎలాగో నిరూపించండి” అన్నాడు. వారికి అది సాధ్యపడలేదు. వారిని కూడ రాజు గృహస్థు లవమన్నాడు.
చివరికి ఒక యువసన్న్యాసి తన రాజ్యానికి రాగా, రాజు అతడిని కూడా అలాగే అడిగాడు. దానికి ఆ యువసన్న్యాసి ఇలా బదులు చెప్పాడు: “రాజా! ఎవరిస్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు.” అది ఎలాగో ఋజువుపరచమన్నాడు రాజు. “ఋజువు చేస్తానుగాని నేను చెప్పే విషయాన్ని మీకు నిరూపించడానికి ముందుగా మీరు వచ్చి కొన్నిరోజులు నాలాగా జీవించాలి” అన్నాడు సన్యాసి. దానికి రాజు సమ్మతించి ఆ యువసన్న్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్లు ఒక పెద్దరాజ్యంయొక్క ముఖ్యపట్టణానికి వచ్చారు. అప్పుడొక మహోత్సవం అక్కడ జరుగుతోంది. రాజు, సన్న్యాసి ఆ మహోత్సవంలో భేరీఘోషను, సంగీతాన్ని విన్నారు.ధగధగ మెరుస్తున్న వస్త్రాలను ధరించి జనులు వీథులలో గుమిగూడివున్నారు.ఉత్సవంలో ఒక పెద్దచాటింపు వేయబడుతోంది. జరుగుతున్నది చూడడానికి రాజు, సన్న్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమావిష్టులైన వారి నుండి ఒకరిని భర్తగా వరిస్తుందని ఒకడు బిగ్గరగా ప్రకటిస్తున్నాడు.
రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో సనాతనాచారం. ప్రతి రాజకుమారైకు తన కాబోయే భర్త ‘ఇలా వుండాలి’ అనే కొన్ని నిర్దుష్ట అభిప్రాయాలుండేవి. కొందరు అపారసౌందర్యం, మరికొందరు అసదృశ పాండిత్యం, ఇంకొందరు అధిక సంపద కోరుకుంటారు. ఇరుగు పొరుగు రాజులంతా అందమైన వస్త్రాలు ధరించి, రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకొంటారు. ఒకొక్కప్పుడు వీరు రాజకుమారి తమనే వరిస్తుందనే తమ నమ్మకానికి గల కారణాలను, తమ గొప్పలను స్వంత స్తుతిపాఠాలచే ఘోషించుకోవటం కద్దు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి, సింహాసనంలో ఆశీనయైన చెలికత్తెలు రాజకుమారిని ప్రతిరాజు వద్దకు తీసుకునివెళతారు. ఆ రాజకుమారులను చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే ‘ముందుకు పదండి’ అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారిని క్రీగంటైనా లక్ష్యపెట్టదు. కాని రాజకుమారులలో ఎవ్వరైనా తనకు నచ్చితే అతడి మెడలో పూలమాలను వేస్తుంది; అతడే ఆమె భర్త అవుతాడు.
మనరాజు, సన్న్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి ముచ్చటైన అలాంటి స్వయంవరోత్సవం జరుగుతోంది. ఆమె అసమాన్య సౌందర్యవతి. ఆమెకు భర్త కాబోయేవాడు ఆమె తండ్రి తదనంతరం ఆ దేశానికి రాజు అవుతాడు. అందమైనవాడిని వివాహమాడాలని ఆమె అభిలాష. కాని ఆమె మనస్సుకు నచ్చిన వరుడు దొరకలేదు. చాలాసార్లు ఇలాంటి స్వయంవర సమావేశాలు జరిగాయి. కాని ఆ రాజకుమారి వరుణ్ణి ఎన్నుకోలేకపోయింది. ప్రస్తుత సమావేశం మునుపటివాటి కంటె మహోజ్వలంగా జరుగుతోంది. అధిక సంఖ్యాకులు వచ్చివున్నారు. రాజకుమారిని చెలికత్తెలు ఒకచోటు నుండి మరొక చోటుకు తీసుకునిపోతున్నారు. సమావేశులైన వారిలో ఎవ్వరినీ ఆమె లక్ష్యపెట్టకపోవటంతో జనులు ‘ఈ సమావేశం కూడా నిష్ఫలం కాబోలు’ అనుకున్నారు. ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుండి దిగివచ్చాడా అన్నట్లు దివ్యసుందరమూర్తి ఐన ఒక యువసన్న్యాసి సమావేశంలో ఒక మూల నిలబడి జరుగుతున్నది చూస్తున్నాడు. చెలికత్తెలు రాజకుమారైను అక్కడకు తీసుకురాగానే ఆమె జగన్మోహనాకారుడైన ఆ సన్న్యాసిని చూడగానే పూలమాలను అతడి మెడలో వేసింది. వెయ్యగానే “ఇదేం అవివేకం? నేను సన్న్యాసిని. నా కేమిటి పెళ్లి” అంటూ ఆ సన్న్యాసి పూలమాలను మెడనుండి తీసిపారేశాడు. అప్పుడు ఆ దేశపురాజు ‘ఇతడు పేదవాడు కాబట్టి రాకుమారిని పెళ్లిచేసుకోడానికి జంకుతున్నాడు కాబోలు’ అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు: “నా కుమార్తెతోబాటు అర్ధరాజ్యం మీదవుతుంది. నా తరువాత రాజ్యమంతా మీదే!” ఇలా అని రాజు పూలమాలను మళ్లీ సన్న్యాసి మెడలో వేశాడు. “చాలు చాలు ! నాకు పెళ్లి వద్దు” అంటూ సన్న్యాసి రివ్వున అక్కణ్ణుండి వెళ్లిపోయాడు.
రాజకుమారి ఆ యువకుణ్ణి మోహించి “ఇతడినే పెళ్లిచేసుకోవాలి, లేదా మరణమే శరణం” అంటూ అతణ్ణి పిలుచుకురావడానికి అతడిని వెంబడించింది. తనతో కూడా రాజును వెంటబెట్టుకొని వచ్చిన మన పూర్వసన్న్యాసి “వీరి వెంట వెళదాం” అని రాజుతో కూడా వారి వెనుక కాస్తదూరంలో నడువసాగాడు. రాజకుమారిని పెళ్లిచేసుకో నిరాకరించిన యువసన్న్యాసి ఆ దేశాన్ని విడిచి చాలాదూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. రాజకుమారీ అతడిని వెంబడిస్తూంది. మన రాజు, సన్న్యాసీ వాళ్ల వెనుకే వున్నారు. యువసన్న్యాసికి ఆ అరణ్యం చిరపరిచితమై వుండటంతో హఠాత్తుగా అతడొక మార్గంలో పోతూ అదృశ్యుడయ్యాడు. అతడిని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించి చివరకు ఒక చెట్టుకింద కూలబడి విలపించసాగింది. పాపం ఆమెకు ఆ అరణ్యం నుండి బైటపడే మార్గం కూడా తెలియదు. అప్పుడు మన రాజు, సన్న్యాసి ఆమె వద్దకెళ్లి ఇలా అన్నారు: “అమ్మ” ! విచారించవద్దు, ఈ అరణ్యం నుండి బైటపడే మార్గం మేము చూపిస్తాం. కాని ఇప్పుడు చీకటి పడటంచేత అది సాధ్యం కాదు. ఇక్కడున్న పెద్ద చెట్టు క్రింద ఈ రాత్రి విశ్రమించి, ఉదయం కాగానే బయలుదేరుదాం.”
ఆ చెట్టుమీద ఒక కపోతాల జంట గూడు కట్టుకుని పిల్లలు మూడిటితో నివసిస్తూంది. మగకపోతం కిందవున్న ముగ్గురిని చూసి తన భార్యతో యిలా అంది: “ప్రేయసీ! ఇప్పుడేం చేస్తాం. వీళ్లు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా! శీతాకాలంకూడా, చలికాచుకోడానికి మనవద్ద నిప్పులేదు.” ఇలా అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి ముక్కున ఒక చండ్రనిప్పు కరచుకునివచ్చి అతిథులముందు పడేసింది. వాళ్లు దానికి ఎండుటాకులు కట్టెలు చేర్చి మంట చేసుకొన్నారు. కాని ఆ పిట్ట అంతటితో తృప్తిచెందక తన భార్యతో ఇలా అంది: “ప్రియా! ఇప్పుడేం చేద్దాం? వీరికి ఆకలిగా వుంది, మనవద్ద పెట్టడానికి ఏమీలేదు. మనమా గృహస్థులం; ఇంటికి వచ్చినవారి ఆకలి తీర్చటం గృహస్థధర్మం కదా. నాకు చేతనైన పని నేను చెయ్యాలి, కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను.” ఇలా అంటూ ఆ పిట్ట అగ్నిజ్వాలలో పడిపోయింది. ఆ పిట్ట అగ్నిలో పడిపోవటం అతిథులు చూసి, రక్షించడానికి ప్రయత్నించారుగాని లాభం లేకపోయింది.
ఆడ కపోతం తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది: ‘ఇక్కడున్నవారు ముగ్గురు. వీళ్లు తినడానికి ఒక చిన్నపక్షి మాత్రమే వున్నది. వీరికిది చాలదు. భర్త యత్నాన్ని వృధాకానీయకుండటమే గదా సతిధర్మం. కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను.’ ఇలా అనుకుని ఆ పక్షి తనూ అగ్నిలో పడిపోయింది.
తమ తల్లిదండ్రులు ఒనరించిన ఆత్మార్పణను చూసి, ముగ్గురు అతిథులకు సరిపడే ఆహారం లేనందున ఆ కపోతాల పిల్లలు ఇలా అనుకున్నాయి: ‘మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించినా, అతిథులకు తగినంత ఆహారం సమకూరలేదు. తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చటం పిల్లల ధర్మం కదా; కాబట్టి మన శరీరాలను కూడా అర్పిద్దాం.’ ఇలా తలపోసి ఆ పక్షిపిల్లలు కూడా అగ్నిలోపడ్డాయి.
కళ్లముందు జరిగినదంతా చూసి వారు ఆశ్చర్యచకితులై ఆ పక్షులను తినలేకపోయారు; నిరాహారులై ఆ రాత్రి గడిపారు. ఉదయం కాగానే రాజు, సన్న్యాసి రాజకుమారికి దారి చూపించగా, ఆమె తన తండ్రి వద్దకు వెళ్లిపోయింది.
తరువాత సన్న్యాసి రాజుతో ఇలా అన్నాడు: “రాజా! ఎవరి స్థానంలో వారు అధికులనే విషయం నీకిప్పుడు స్పష్టమైనది కదా. సంసారివై వుండాలనుకుంటె ఏ క్షణంలోనైనా పరహితార్థం ఆత్మార్పణ చేయడానికి సంసిద్ధుడివై ఆ పక్షులలాగా జీవించు. సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్యరాశియైన ఆ రాజకుమారిని, రాజ్యాన్ని తృణప్రాయంగా గణించిన ఆ యువ సన్న్యాసిలా బతుకు. గృహస్థుడవై వుండాలనుకుంటే, పరుల శ్రేయస్సుకై నీ జీవితాన్ని ఆహుతి చెయ్యడానికి సదా సంసిద్ధుడవై వుండు. సన్న్యాసివి కావాలనుకుంటే సంపదలను, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తి చూడవద్దు. ఎవరిస్థానంలో వారు అధికులు కాని ఒకరి ధర్మం, మరొకరి ధర్మం కాబోదు.”